కాశీమజిలీకథలు/పదవ భాగము/210వ మజిలీ
పదియవభాగము
210 మజిలీ
నారదమహర్షికథ
క. శ్రీనారదవరవీణా
గానారవ నిరత మౌళి కలితార్థమృగాం
కా! నీరథి తూణీరా
క్షోణీరధ ఘనరధాది సురగణవరదా.
వ. దేవా! అవథరింపుము. అపూర్వ మణిప్రాభావ సమధిగత విచిత్రకథాప్రబోధన విదగ్ధుండగు మణిసిద్ధయతిసార్వభౌముండు. అభినవోదంతశ్రవణప్రవణ హృదయాశ్రయుం డగుగోపార్భకునితోఁ గూడ దశోత్తర ద్విశతతమ నివాసప్రదేశంబుఁ జేరి యందు విధికృత్యంబులం దీర్చికొని స్థానవిశేషంబులఁ జూడనరిగిన శిష్యునిరాకనరయుచున్నంత,
క. ముసిముసినగవుల మొగము
ల్లసితంబై యొప్పఁ దన తలంపెఱిఁగింపన్
వెన వచ్చి మ్రొక్కె నగ్గో
పనుతుండా సిద్ధుపాదపద్మంబులకున్.
క. దీవించి యతఁడు వత్సా!
నీవదనముఁజాడఁజూడ నేఁడిచ్చట నే
దో వీంతఁ జూచివచ్చిన
భావంబది దోచెఁ దేటపడఁ దెల్పుమనన్,
సీ. ఇది చిన్నకొట్టిక యిం దేవిశేషంబు
గానంగఁబడలేదు గానిసామి!
సీమాంతమున నొక్కగ్రామదేవత యాల
యము గ్రాలు దానికుడ్యములయందుఁ
దమకుఁదోచిన విగ్రహములను వ్రాసి పో
వుదురు పాంథులు వాని పొంత నరయ
వల్లకీకరుఁడు భాస్వజ్జటాధరుఁడు నా
రదమహామౌనివిగ్రహము నాకుఁ
గీ. గానఁబడె నేత్రపర్వంబుగా మహాత్మ
విస్మయప్రదమగు తత్ప్రవృత్తులెల్ల
వినఁగ వేడుక జనియింప వేగ నిటకు
వచ్చినాడ నియ్యదియ మద్వాంఛితంబు.
గురువర్యా! అమ్మహాత్మునిచరిత్ర మెన్నియోసారులుమిమ్మడుగఁదలంచుచుండియు నేదియో ప్రసంగవశమున నామాట మఱచి పోవువాడను. నేఁడ వ్విగ్రహదర్శనమూలముగా నేతత్ప్రశ్నావకాశము గలిగినది. నారదమహర్షి యెవ్వనికుమారుఁడు? ఎప్పుడు పుట్టెను. నివాసదేశ మెయ్యది? మహర్షియయ్యు నొండొరులకుఁ గలహములు పెట్టు టేమి? విరాగియయ్యు సంగీతప్రియుండెట్లయ్యె? దేవమునియయ్యు మూఁడులోకములు దిఱుగుచుండనేల? ఈసందియము లన్నియుఁ దీర నారదమహామునిచరిత్ర మంతయు సవిశేషంబుగా నెఱింగింపు మని ప్రార్థించుటయు మణిసిద్ధుండు నిజమణిప్రభా వంబున నశేషపురాణస్థంబులైన నారదకథావిశేషంబులెల్లఁ గరతలామలకంబుగాఁ దెలిసికొని మేను పులకరింప వాని కిట్లనియె-
వత్సా! సంసారలతాలవిత్రమగు నారదముని చరిత్రము విచిత్రకథాభూయిష్ఠమై యొప్పుచున్నది. నారదకథావిశేషములేని పురాణములులేవు. భారత భాగవత రామాయణములు తదుపోద్ఘాత ఖ్యాతములైయొప్పుచున్నవి. పెక్కేల! సమస్త పురాణములందు నేభాగము పరికించినను నేఘట్టము జదివినను నారదోక్తములగు కథలే కనబడుచుండును. నారదమహర్షికథాప్రశంస లేని గ్రంథమేలేదు. అక్కథలన్నియుం జెప్పుటకుఁ బెద్దకాలము పట్టును. సర్వజనసాధారణములైన తత్కథావిశేషంబులఁ గొన్ని యెఱింగించెద. నవహితుండవై యాలకింపుము. కల్పాదినివివరించిపద్మనాభు నాభికమలంబున జనించి పెద్దకాలము తపంబుగావించి పరమేశ్వరు నానతి సృష్టి సేయఁదలంచి తత్పరికరముల నరయుచున్నంతఁ బంచభూతము లావిర్భవించినవి. తదనంతరమున,
శ్లో. మరీచి రంగిరా అత్రిః పురస్త్య: పులహఃక్రతు!
షడేతెమానసా: పుత్రా బ్రహ్మణస్సుమహాబలా: !!
మరీచి, అంగిరస్సు, అత్రి, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు అను మహర్షు లాఱ్వురుద్భవించిరి. బ్రహ్మ మనంబునం దలంచినంతనే జనించుటచే వారికి బ్రహ్మమానసపుత్రులని పేరువచ్చినది. తరువాత నతని కుడికాలి పెనువ్రేలినుండి దక్షుండు నెడమకాలి వ్రేలి నుండి యసిక్నియను కన్యకయు హృదయమునుండి ధర్ముఁడు స్తనమునుండి భృగుఁడుతొడనుండి సారదుఁడును జనించిరి.
అరవిందభవుండు వారినందఱ నాదరించుచు బిడ్డలారా! మీరెల్ల ననుగుణ సతీయుతులై మత్సంకల్ప ప్రకారంబు ప్రజాసర్గము గావింపవలయును. ఇదియ మదీప్సితంబని యానతిచ్చుటయు, సీ. అలరి మీయాజ్ఞనే నాచరించెదనంచు
సూచించె లేచి మరీచి యప్పుడు
మీయానతి నతిక్రమింప నేర్తునెయంచు
ననుమతి దెల్పె నయ్యంగిరస్సు
తప్పక మీరన్నచొప్పున సత్కన్య
నరసి కైకొందు నేననియె నత్రి
యంజలిపట్టి దేవా! వరించెద మంచి
వనిత నంచుఁ బులస్త్యముని వచించె
గీ. పులహుఁ డనుమోదమని ప్రీతిఁదెలిపిఁగ్రతువు
కుతుకపడె ధర్ముఁడొప్పె భృగుండు లెస్స
యనియె దక్షుఁడ సిక్ని పాణిని గ్రహించె
నపుడె నారదుఁడేమి మాటాడడయ్యె.
గీ. నారదా! దారసంగ్రహ ణముగుఱించి
మౌనము వహించితేల? సమ్మతములేదొ
సోదరులరీతి నీవు గే స్తుండవగుట
కభిమత మదేమియో తెల్పు మనిన నతఁడు.
ఉ. ఇంతికరఁబు నెవ్వఁడు గ్రహించునొ యాతఁడు భోగసంగత
స్వాంతుఁడు గాదగు న్విగతభార్యునకుం జనిలేవు భోగముల్
కాంతనొకర్తుక న్విడువగా జగమంతయు వీడినట్లె వి
శ్రాంతి జగంబువీడిన ప్రశాంతునిదేగద సౌఖ్య మెన్నఁగన్.
సీ. చపలలాలారస స్రావియై తగుమోవి
సేవింప నమృతంపుబావియనుచు
శ్లో|| ఉత్సంగా న్నారదొజజ్ఞె అనిభారతము కంఠదేశాచ్చనారదః నరదమన బ్రహ్మకంఠము దానివలన జనించినవాఁడు కావున నారదుఁ డనఁబడు చుండెను అని బ్రహ్మవైవర్తము.
నూహింప వక్షస్థలోద్భూత దుర్మాంస
పిండముల్ బంగారుకుండలనుచు
నస్తిసందర్శన వ్యాపారము రుభావ
భాసురాంచిత మందహాస మనుచు
దూషిత రుధిర మేదోమాంస చర్మాస్థి
నిచయంబు ఘనతటిత్ప్రచయ మనుచు
గీ. మానినీగాత్రముల కల లేనిపోని
వర్ణనలు సేయుచుంద్రు నీ ! వనితఁ దలఁప
నేవపుట్టెడుఁ బడఁతి గ్రహించుటెల్ల
జనక ! మెడఁ బెద్దగుదె గట్టికొనుట గాదె.
గీ. భూరిసంసార సాగరాంబువుల నన్ను
ముంపఁదలఁచితె కాంతాభిముఖునిఁ జేసి
కలదె నిష్కృతి యెన్ని యుగములకైన
భవజలధి మున్గినట్టిజంతువున కభవ !
చ. సుతునకుఁ దండ్రియే సుగతిదొప్పెఱిఁగింపక సక్తుఁడై యథో
గతిఁ బడఁజేయఁగా నతని గాచెడు వా రెవరింక తండ్రి ! శ్రీ
పతిచరణారవింద యుగ భక్తి ఘటిల్లగఁ జేయుమయ్య ! బల్
నెతబడ దారసంగ్రహణ వృత్తికి నామది యొప్పదెన్నడున్ "
అనుటయుఁ జతురాననండు వత్సా! సమస్తాశ్రమములలో గృహస్థాశ్రమ ముత్తమమని మహాత్ములు సెప్పియున్నారు. దేవతా తిధి పితృ తృప్తి గృహస్థులవలనం గలుగుచున్నది. గోవులు పానశాల సేరునట్లు గేస్తు నెల్లరు నాశ్రయింతురు. నీ వుత్తమకన్యం బెండ్లియాడుము. భార్యాస్వీకరణమున కంగీకరించిన మరీచ్యాది మహర్షుల కంటె నీ వెక్కు డెఱుఁగుదువా! బాబూ ! పెండ్లియాడుము నేనానందింతు, నని పలికిస విని నారదుండు తాలువులెండ భీతుఁడై యిట్లనియె. తండ్రీ ! నన్ను స్త్రీనిఁ బరిగ్రహింపుమని బోధించుచుంటివి. ఆమాట వినిన నాహృదయము దద్దరిల్లుచున్నది. స్త్రీస్వభావము నీ యెఱుంగనిదా. వినుము.
సీ. వేదశాస్త్రములందు వెలఁదులచరితముల్
గడుదుష్టముగఁ జెప్పఁబడవె తండ్రి ?
అశ్రుత శ్రుత్యర్థుఁడగు దుష్కులుఁడు గాక
ప్రాజ్ఞుండు నమ్ము నే పడఁతుకలను
మనసులో సుభగుఁ గన్గొని పొందఁ గోరుఁ బైఁ
బ్రకటించు ఘనపతివ్రత యనంగ
ముదిమిదప్పినవాని మది శత్రువుగఁ జూచు
యౌవనవంతు సంస్తవము జేయు
గీ. సకలదోషంబులకు ఠావు జలరుహాక్షి
మది ముముక్షువులు మఱచియు ముదితఁ జూడ
గూడ దాసింపఁగూడ దెక్కొలఁదినైన
విషమువంటిది వాల్గంటి వివిధగతుల.
ఆమాటలు విని హాటకగర్భుండు నవ్వుచు నిట్లనియె. పుత్రా! నీవు స్త్రీజాతియంతయు దోషయుక్తమని నిందించుచుంటివి. అది తెలిసిన మాట కానేరదు. స్త్రీ లేనిచో సృష్టియే లేకపోవును. దుష్కులజ తలిదండ్రుల దోసంబున స్వతంత్రురాలై భర్తయాజ్ఞ నుల్లంఘించుఁగాక స్త్రీలందఱు నట్టివారలే యగుదురా ? సత్కులంబునం బుట్టిన యువతి పతివ్రతయై పతిసేవఁ జేయుచున్నది. పతివ్రతాప్రభావము నీ వెఱుంగనిదియా ! సాధ్వీతిలకము కన్నెఱ్ఱఁజేసిన మూడులోకములు గడగడలాడవా ! సాధ్వియందుఁ బుత్రులంగని వృద్ధుండై తపోవనమున కరుగవలయు. గృహస్థుఁడు బాహ్యాభ్యంతర ముల విష్ణునారాధించిన మహర్షితుల్యుండగును. నామాట విని పెండ్లియాడుమని బోధించిన నారదుం డంజలివట్టి యిట్లనియె.
మహాత్మా! నీవు సర్వజ్ఞుండవయ్యు నా కి ట్లసత్పథము బోధించుచుంటివేమి ? ఇది నాకర్మముగాక మఱియేమి ? స్త్రీలలో మంచివా రుందురుగాక సంసారము జలబుద్బుదమువంటిది కాదా ! జులరేఖయెట్లు మిథ్యయో సంసారమునట్టిదే. యెండమావులయందు దప్పిదీర్చికొనఁదలంచినట్లు పునర్భవంబున సౌఖ్యంబుగోరుట నిష్ఫలంబుసుమీ! తండ్రీ హరిదాస్యము విడచి విషయభోగములకుఁ బొమ్మందు వేమిపాపము. మూఢమానవులను విషయేచ్ఛ పురుగులకు మనోహరముగాఁ గనంబడు దీపశిఖవంటిదియై యంటిన నశింపఁజేయును. మత్స్యబంధనమువలె ముట్టినందగిలికొనును. జనకా ! ఈ సంసారమున నెవ్వని కెవ్వతె ప్రియురాలు. ఎవ్వని కెవ్వడు మిత్రుఁడు. బంధువుఁ డెవ్వడు? ఏటికట్టియలవలెఁ గర్మోర్ములచేఁ గూడికొని విడిపోవుచుందురు. గహనమువంటి సంసారమునఁ బ్రవేశింప నా కిష్టములేదు. కృష్ణాశ్రయ మంత్ర ముపదేశింపుమని ప్రార్థించుటయుఁ బరమేష్ఠి సంతుష్టినొందక యంతటితో నాప్రస్తావము విరమించెను.
దక్షుండును దండ్రియాజ్ఞ నసిక్నియందుఁ బదివేలమంది పుత్రులంగనియె. వారందఱు బెండ్లియాడఁ బ్రయత్నించుచుండ నారదుం డేదియో యువదేశించి వారినెల్ల దిక్కులపాలు గావించెను. అందులకు వగచుచు దక్షుండు మఱియు బెక్కండ్రబుత్రులం బడసి ప్రజాసర్గంబు గావింపుఁడని యుపదేశించుటయు నతని మాటలు పాటింపక వారు గూడ నారదోపదేశంబున దేశములపాలై పోయిరి.
ఆవ్వార్తవిని దక్షుండ క్షీణకో పాటోపంబున నారదుకడకు వచ్చి నీవేకాక నాబిడ్డల నందఱ సన్యాసులఁ గావించితివే అసూయా పరుండవై మత్కులతంతువులఁ దొంపితివి నిన్నుపేక్షింపరాదు. వినుము. నీవు నాకుఁ బుత్రుఁడవై పుట్టుటయేకాక.
క. కొండెములు సెప్పి నేర్పుగ
నొండొరులకుఁ దగవుపెట్టు టుచితక్రియగా
నుండగఁ జగములఁగలహ భు
జుండని పేర్పొందుదవుర సురమునికోటిన్.
క. నీచెవిఁ బడినరహస్యం
బేచందంబైన నొరుల కెఱిఁగింపక లో
దాచినచో నీయుదరము
వాచు న్వెలిబుచ్చుదనుకఁ బరులెఱుఁగంగన్.
అని శపించి దక్షుం డాక్షణమ బ్రహ్మయొద్దకుంబోయి నారదుండు తనకుఁ గావించిన యపకారప్రకారం బంతయు నెఱింగించిన విని విరించి పరితపించుచు నారదుని రప్పించి యత్యంతకోపముతో,
ఉ. ఏమిరమూఢ ! నాపలుకులెల్ల గణింపక వీటిఁబుచ్చితౌ గా
మఱి దక్షవుత్త్రులను గన్యకల న్వరియింపకుండ
దిగ్గాములఁ జేసినాడవఁట కాపురముల్ చెడఁగొట్టవచ్చునే
నీమది పాపమం చిది గణింపవొ పెద్దలధిక్కరింతువో.
ఏను వాసుదేవునానతింగాదె ప్రజాసర్గంబునకుఁ బూనికొంటి నిష్పని కంతరాయంబు గల్పించుచుంటి విఁక నిన్నుపేక్షింపరాదు. వినుము, నీవు స్థిరయౌవనులగు నేబదుగుర సుందరులకు వల్లభుండవై శృంగారప్రబంధముల రచించుచు శృంగారరసాసక్తిం బ్రవర్తిల్లుచుఁ బూర్వజ్ఞాన మించుకయులేక గాయకులలో నుత్తముఁడవని ప్రఖ్యాతి వడసి చరింతువుగాక. నామాటలు పాటింపనందులకు నీకీపాటిశిక్ష విధింపవలసివచ్చిన"దని శపించిన విని నారదమహర్షి దుఃఖించుచుఁ దండ్రి కిట్లనియె. “తాతా! నేనేమితప్పుఁజేసితినని నాకిట్టి దారుణ శాపమిచ్చితివి? సంసారమునకు వగచి విరక్తుండనై తపంబునకుఁ బోయెద ననుజ్ఞయిమ్మని కోరితి నిదియపరాధమా? నాపైనీకీకోపమేలగలుగవలయు. అయ్యో! నేనీపునర్భవక్లేశ మెట్లనుభవించువాఁడ. కటకటా! తండ్రీ! యింతకఠిన శాపమిత్తువే. కానిమ్ము. నే నేజన్మమైన నెత్తుదును. సంతతము హరి పదారవింద ధ్యానమేమరకుండ నాకు వరంబిమ్ము. నీశాపము నన్నేమియుం జేయజాలదు.
క. హరిభక్తి శూన్యడైనన్
ధరణీసురునైనఁ జెప్పఁదగు నధమునిగా
హరిభక్తి యుక్తమైనన్
బురుగైన స్సర్వలోక పూజ్యత వడయున్ .
అని కోరికొనుటయు హాటకగర్భుం డభినందించుచు నారదా! నీవు కోరిన వరమిచ్చితి. నీవు గంధర్వ చక్రవర్తివై హరీభక్తాగ్రేసరుండవై మహాపతివ్రతలగు నేబదుగురు భార్యలతోఁ బెద్దకాలము సుఖించి క్రమ్మర నన్ను జేరుదువు గాక. నీకిది శాపము గాదు వరంబనుకొనుము. శృంగార లీలావిలాసము లనుభవించిన పిమ్మట నంతయు నీకే తెలియఁగలదని పలికి పలుకు కలికి యెకిమీఁడతనిననున యించెను:
అని యెఱింగించిన విని గోపాలుండు ముకుళిత కరుండై మణిసిద్ధున కిట్లనియె. మహాత్మా! నారదమహర్షిని దక్షుండు తనకు బుత్రుండై పుట్టుమని శపించెను కదా! ఆమాటయేమియుం జెప్పితిరి కారేమి? మఱియు బంచభూతములు సృష్టికిఁ బూర్వము లేనట్లు మీమాటలం దేటపడుచున్నది. అప్పుడీ ప్రపంచకస్థానమం దేమి యున్నది? అది యెట్లుండును? చెప్పుమని యడిగిన నవ్వుచు మణిసిద్ధుండు గోపా! నీవు లోతు ప్రశ్నములు వైచుచుంటివే! బాగు బాగు. సృష్టికి బూర్వమీ పంచభూతములు లేనియప్పుడీప్రపంచక స్థాన మెట్లుండునో చెప్పుటకేకాదు. ఇట్లుండునని యూహించుటకు గూడ వీలులేదు. అది పరమేశ్వరునికే తెలియును. నారదమహర్షి రెండవజన్మము, అసిక్నియందు గలిగినది. వినుమని యన్వలికథపై మజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.
- _________
211 మజిలీ
నారదుని గంధర్వ జన్మము.
క. తరమే విధిగతి దాటఁగ
నొరులకు నారదమహర్షి యును గంధర్వాం
బురుహాక్షుల నేబదుగురఁ
బరిణయమై క్రీడ సలిపెఁ బరజన్మమునన్.
విద్యాధరాది దేవతావిశేషులలో గంధర్వు లొకతెగవారు. వారికి సంగీతమే కులవిధ్య. స్త్రీపురుషులు సంతతము గానపరిశ్రమ చేయుచుందురు. వారికి దేవలోకములోనేకాక భూలోకములోఁగూడ సంచారము గలిగియున్నది. గంధర్వులు స్త్రీపురుషులు మిక్కిలి చక్కనివారు. గంధర్వకన్యకలు అచ్చరలవలె స్వేచ్ఛావిహారములు సేయరు. భర్తలవరించి పాతివ్రత్యశీలంబుల నొప్పుచుందురు.
గంధర్వలోకములో నొకభాగము రత్న కేతుఁడను గంధర్వ రాజు పాలించుచుండెను. అతండు సకలైశ్వర్యసంపన్నుండయ్యు, సంతతిం బడయఁజాలక చింతించుచు వసిష్ఠోపదిష్టంబగు శివమంత్రంబు