కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/303వ మజిలీ

మీ కిచ్చెదంగాక. మా రాజ్యంబున నిట్టి యక్రమంబు జరుగ నే సహింపఁజాలను అని నుడువుచు మరియు నిట్లనియె.

ఓరీ ! ఆ పాపపు చిలువ బాలునింగరచి యెందేగెనో చూచితిరా యని యడుగుటయు వారు చేతులు మోడ్చుచు నదుగో యెదురం గనంబడు పుట్టకలుగు లోనికిఁ బోవుచుండ మేము గన్నులారం జూచితిమని చెప్పిరి. అప్పుడే రాజు తద్వల్మీ కంబును ద్రవ్వించిచూడ నందొక మహాతపస్వి యత్యద్భుతతేజోదుర్నిరీక్షుండై నిమీలితాక్షుండై సిద్ధాసనంబున నిర్వికల్పక సమాధి నిష్టాగరిష్టుఁడై చూపట్టెను. వానింజూచి యెల్లరు విస్మయసాధ్వసములం బొందిరి. ఆ పుడమిఱేఁడు వేడుకగా నా జడదారింజూచుచు చిడిముడి పాటించుకయును లేక వాని యడుగులంబడి నమస్కరించు వాఁడువలె క్రిందకువంగి చేతులు సాచి తత్పదద్వయంబు గ్రహించి మించిన తమ కంబున బిఱబిఱముందునకీడ్చుచు మ్రుచ్చా ! నీ మాయావేషంబు లిఁకజాలింపుమని పలుకుచు మహాక్రోధంబునఁ దచ్చిరంబునేలంబెట్టికొట్టెను. తోడనే యా జటిలుని రూపంబంతర్ధానమై కన్నులకు మిరుమిట్లు గొలుపు నత్యద్భుత తేజంబొండు వెల్వడి నిమిసములో నదృశ్యమయ్యెను.

అమ్మహారాజు వెఱపించుకయుం బొందక నలుమూలలం బరికింపుచుండ నంబరంబున నొకవింతళకుంతంబు గోచరమయ్యెను. దానినుపలక్షించి యాక్షితీశ్వ రుండు పోకుపోకుమని యదలించుచుఁ జంద్రహాసంబు గైకొని యోగమార్గంబునఁ బై కెగసి దానిం దరుముకొనిపోయెను. క్రిందనున్నవారు వానికొఱ కాదివసాంతము వఱకు నిరీక్షించి యుండిరిగాని వానిజాడ యేమియుఁ బొడకట్టనందునఁ బ్రక్కనున్న తమపల్లెకుంబోయిరి. రాజ సేవకులును మరకొన్నిదినంబులందుండి యొడయని వర్త మాన మేమియుం దెలియనందున నిరువుర మాత్రమందుగాపుంచి తక్కినవారెల్ల వారణాసికింబోయి ప్రధానుల కావృత్తాంతమంతయు‌ నివేదించిరి. రాజుగారిక్షేమ మరయఁ బెక్కండ్ర దూతల వివిధప్రాంతములకుఁ బంపించి మంత్రులు రాచకార్యము లన్నియును దివోదాసునిపేరున నిర్వర్తించుచుండిరి.

303వ మజిలీ

అనంగమోహిని కథ

నాగలోకంబున నొకభాగమునకు నాయకుండై వాసుకియను సర్పశ్రేష్ఠుండు పరిపాలించుచుండెను. అతనికి అనంగమోహిని యను పుత్రికారత్నంబుగలదు. అబ్బాలిక చూళికాభరణ రూపలావణ్యాతి శయంబుల ముల్లోకములఁగల సీమంతినీ రత్నంబులఁ దిరస్కరించుచుండెను. చక్కదనంబునకెల్ల నానాగకన్యకారూపము పరమావధియని, చెప్పిన నామెయవయవసౌష్ఠవంబిట్టిదని వర్ణింప నగత్యముండదు. ఆమె యసామాన్యసౌందర్యవైభవంబు నాగలోకంబుననేగాక చతుర్దశభువనముల యందలి యౌవనపురుషులకు హృదయాకర్షకంబై యుండెను.

ఆ మోహనాంగిఁ జేపట్ట దేవతలుఁ గూడ నుత్సుకతం బొందుచుండిరి. కాని మధ్యనున్న భూలోకమునుదాటి నాగలోకమునకేగుటకు దివోదాసుని శాసన మనతి క్రమణీయమై యడ్డువచ్చెను. దానంజేసి యార్ద్వలోకలములవారికి‌ నధోలోకములవారికిని రాకపోకలు లేకపోయినవి. పాతాళంబున నున్న పురుషుల నందఱఁ ద్రోసిరాజని యారాజాస్యలోకాంతరస్థానురూప ప్రియసమాగమాకాంక్షఁ బ్రొద్దుపుచ్చుచున్నది.

ఒకనాఁడబ్బిట్చోకవతి యుచితసఖీజనంబుతోఁ బ్రాంతకేళికోద్యానమునందు విలాసవిహారమొనరించునప్పుడు తరినెరింగి యొక రక్కసుం డెక్కడనుండియో రయంబున నక్క డకువచ్చి యచ్చపలాక్షి నెత్తుకొని పారిపోయెను. ఆవార్త చెలికత్తియల వలనవిని వాసుకి శోకమూర్చితుండై యాప్తుల యనునయవాక్యంబుల దెప్పిరిలి తనూ జాతాన్వేషణంబునకై యపరి మిత సేవక సమూహంబును నతల వితల రసాతల తలా తల పాతాళాది వివిధాధోలోకంబులకుఁ బంపెను. కారి యాకోక స్తని యునికి యెచ్చటను గనుపింపదయ్యెను. ఊర్థ్వలోకంబులకేగి యందన్వేషించుటకు దివోదాసుని శాసనము బెనుగొండవలె నడ్డుదవులుచున్నది. మనుజలోకంబునకు నాగలోకవాసులు బోరాదు గదా? అది దాటినఁగాని దివిజలోకంబుల కరుగుటకెట్లు వీలగును. ఒకవంక పుత్రికా వియోగశోకం బొకవైపు మర్త్యలోక ప్రవేశాభ్యంతర‌ ప్రకటితావిలంఘ్యశాసనభయం బొకమూల దారుణావమానజనితచింతాసముజ్యల జ్వాలాభీల కీలావిలోల హృదయ తాపం బిట్లు వాసుకి శోకభయవిహ్వలవేదనా దోదూయమాన మానసుండై కర్తవ్య వక్తవ్యంబు లెఱుంగక కులము పెద్దయగు నాదిశేషునియొద్దకరిగి యక్కథనెరింగించి తనతనూజాతను రక్షించుటకుపాయము జెప్పుమని మిక్కిలి దీనుఁడై ప్రార్దించెను.

అయ్యుదంతంబువిని శేషాహి నిజసహస్రఫణామండితమణీఘృణులు దెసలవ్యాపింప శిరఃకంపమొనర్చుచు నేమేమీ ! మ్రుక్కడి రక్కసుండొక్కరుండుక్కు మిగిలి నాగకన్యాలలామను బలవంతముగా నెత్తుకొనిపోయెనా ? ఔరా ! ఎంతనిర్భయ ప్రవర్తనము ! వాఁడత్తలోదరినిఁదప్పక మనుజలోకంబునకే కొనిపోయియుండును. శాసనభయంబున నందురుగవాసులు చేరరాదుగదాయని యట్లొనరించియుండును. ఇందులకు తగిన ప్రతీకార మతిశీఘ్రముగాఁ జేయకున్న వానివలన నాకన్యక కేమికీడు మూడునోగదా? ఈ వృత్తాంత మంతయును నిచ్చట నివసించియున్న బలిచక్రవర్తికిని వాని తలవాకిలిఁ గాచియుండు గరుడవాహనునకు నెరింగించి వారియాదేశమువడువున ప్రవర్తింతము రమ్మని చెప్పుచు వానిని వెంటఁబెట్టుకొని బలిదైత్యేంద్రు నివాసంబున కరిగెను. శేషవాసుకులట్లు పోయి బలిదైత్యేంద్రు నగరి మొగసాలఁగాపున్న దైత్యాంతకునింగాంచి వానిపాదంబులంబడి తమ యిక్కట్టు విన్నవించి రక్షింపవే యని ప్రార్థించుటయు నప్పార్థసారథి యేమియు నుత్తరంబొసగక హస్తవిన్యాసంబున బలి కెరింగించు కొనుఁడని సూచించెను. తదాదేశంబున వారు లోనికిం బోయి యా దాన వేశ్వరుని యెదురసాగిలిమ్రొక్కుచుఁ దమ యుదంతంబంతయు నెరింగించి యాపన్నులఁ గాపాడుమని వేడుకొనిరి

వారి దీనాలాపముల నాలకించి యాదానవ సార్వభౌముండు రోషవిషా దంబులు మొగంబునందోప నౌరా ! ఈ మ్రుక్కడిరక్కసుల దుందుడుకు చేష్టల కంతములేకున్నదిగదా? నే నెన్నివిధముల వారిని మంచి మార్గమునఁ బెట్టఁబ్రయత్నించు చున్నను వారు సహజంబగు దుష్టస్వభావమును విడువఁజాలకున్నారు. ఇట్టిదుండగీండ్ర కతంబుననే మత్కులంబును కంతకును నపఖ్యాతి గలుగుచున్నది. వీండ్ర నుపేక్షింప రాదు. వాసుకి పుత్రికారత్నమును బలిమిమై నపహరించిన యాపాపాత్ము నెరింగి తగినరీతి శిక్షించెదఁగాక. అని పలుకు చండఁగనే కొందఱు సేవకు లరుదెంచి బలిచక్రవర్తికి నమస్కరించుచు నిట్లని విన్నవించిరి.

రాక్షసేశ్వరా ! నేఁడు ప్రభువారి కేళీసౌధంబున మీది యంతస్థునందు పైనుండి గుభేలుమను శబ్దముతో నొకరాకాసిశవంబు బడినది తత్పతసధ్వనివలన నందున్న మేమెల్లరము నిర్ఘాంతపడితమి. పిమ్మట విమర్శింప నది కుంభుఁడను దైత్యునిశరీరమని తెలిసికొంటిమి వాఁడెట్లుచచ్చి యచ్చటపడెనో మాకు వింతఁగొలుపు చుండెను. వాని శరీరంబు గత్తినరకులు వేనవేలుగఁగలిగి రక్తసిక్తమైయుండెను. దీనిని విమర్శింప దే రయే కర్తలని పలికి యూరకుండిరి.

ఆ మాటలువిని యాదనుజవల్లభుండు మిక్కి.లి యక్కజంపడుచు శేష వాసుకులతో నారక్కసి పడినచోటికి సేవకులు మార్గముచూపుచుండ బోయివాని యవయవంబులఁబరీక్షించెను. వాని యపకారమును జూచి యెల్లరును భయవిస్మయావేశ హృదయులైరి.

కుంభుని శరీరమునందలి గాయములనుండి స్రవించురక్తధారలంగాంచి వాఁడు మృతిఁజెంది యుండలేదని తలంచుచు బలిచక్రవర్తి సరీనృప కులనాయకులతో నావిషయమే ముచ్చటించుచుండఁ గొంతసేపటికి కుంభునకుఁ జైతన్యము గలుగునట్లు కసిపించినది. ఇంక గొంతసేపటికి వాని మూల్గువినంబడినది. మరికొంతసేపటికి నేమేమో గొణుగుకొనుచున్నట్లు తోచినది. అటుపిమ్మటఁ గొంతసేపటికి వాఁడు భీకర ముగా నిలునిలు దురాత్మా ! ఈ దెబ్బతో నీ శిరంబు పగులఁగలదని యరచుచు లేవం బోయి క్రిందబడి తిరుగ గాఢమగు మూర్చలోమునిగెను. వెంటనే దైత్యేంద్రుఁడు పలువుర పరిచారకుల రప్పించి వానిని చికిత్సాలయమునకుం బంపి యందుఁ గొందర నుపచారము లొనర్ప నియమించెను. ఆ దానవుం డెవ్వనిచేతనో తీవ్రమగు గాయముల నంది మూర్చబడియుండెననియును, వానికి స్వస్థత గలిగిన పిదప వాని వృత్తాంతము వినవచ్చుననియు, గుతూహలపడుచు, శేష వాసుకులతో మరియు నిట్లనియె.

మిత్రులారా ! వీడు సౌధాగ్రమునఁ బడుటచే నీలోకమునకు మీదుగా నున్న భూతలమునుండియే యిందు పడినట్లు తెల్లమగుచున్నది. పాతాళవాసులు మర్త్య లోకమున కేగ బహిష్కరింపఁబడినప్పుడు వీఁడచ్చటి కేగుట కెద్దియో చెడ్డపనియే మూలమని తోచుచున్నది. వాసుకి తనయను రక్కసుఁడే గదా యపహరించుకొని పోయెను. అయ్యబలను దుష్టబుద్ధియై వీఁడు మనుజలోకమునకుఁ గొనిపోయి యందు పరాభవింపఁబడి యుండిన నుండవచ్చును. వీనికించుక స్పృహగలిగినతోడనే వీనివలన విశేషము లెరుంగవచ్చును. అంతదనుక మీరిందేయుండుడని చెప్పి శేషవాసుకులఁ దన యింట నాపుజేసెను. కుంభుని వర్తమాన మెప్పటికప్పుడు వచ్చి తనకుఁ జెప్పుచుండు టకుఁ దగినవారిని నియోగించి యా దైత్యేంద్రుండు మిత్రులతో నిష్టగోష్టీ వినో దంబులఁ గాలముఁ గడపుచు వారికించుక మనశ్శాంతిని గలుగఁజేయుచుండెను.

304 వ మజిలీ

మణిగ్రీవజలంధరులకథ

అలకాపురంబునఁ గుబేరుని సన్నిహితుఁడైన చిత్రకేతునకు మణిగ్రీవుండను గమారుండును గుణవతియను బుత్రికయును గలరు. మణిగ్రీవుఁడు బిన్ననాటగోలె యవినయాహంకార గర్వభూయిష్టుండై తల్లిదండ్రులమాట వినక విలాసంబుగాఁ గాలంబు గడుపుచుండెను. వానికి జల౦ధరుండను నాంతరంగిక సచివుండుగలఁడు. వారిరువురు నాహార శయ్యా విహారములయందు నేకదేహ మెట్లట్ల వర్తించుచు నత్యంత మైత్రితో జెలంగియుండిరి. ఇర్వురకు హేమావతియను నొక్కయచ్చరలేమ భోగ భామి‌నియై యుండెను. ఆసచివద్వయం బాయచ్చర మచ్చకంటితో ముచ్చటగా సంతత క్రీడావినోదంబుల బ్రొద్దుపుచ్చుచు దరుచు విమానయానంబున లోకాంతరంబుల కరిగి యందందుగల సుందరశైల శిఖరంబుల విలాసవిహారంబు లొనరించుచుందురు.

వారొకనాఁడు దివోదాసుని శాసనమును మన్నింపక భూలోకంబునకరిగి యందు శీతశైలశిఖరంబునఁ గ్రీడింపసాగిరి.


సీ. ఒక కేలు నొకఁడు మరొక్కఁడింకొక కేలు
           బట్టి ప్రేయసిదోడఁ బరిఢవించి