కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/302వ మజిలీ


గీ. యెన్నఁడే నుండుగాలంబు మిన్న చిక్కు
    భూతములుగ్రాలు నెన్నఁడే బుట్టినిండ్ల
    నపుడు వారణసీక్షేత్రమైదు క్రోసు
    లంతమేర యుపద్రవం బందకుండు.

అట్టి కాశీక్షేత్రంబును విడచి, భాగీరథీపుణ్యస్రవంతికా నిర్మల వారిశీకర ప్రసారశీతలవాతపోతంబుల సుఖంబుమరచి యనవరతమోక్షదిదృక్షాగత భక్తసందోహ సమర్పితస్తుతిపూర్వక వందన చందనానులేపనోపహార సమయాగతానందంబెల్ల బోఁద్రోచిఁ సర్వభోగంబులఁద్యజించి, యెచ్చటనో తలఁగాచుకొనవలెనన్న గష్టము గాకుండునా ? కాని లోకసంరక్షణార్థము నీవు నిర్ణయించిన దానిని మేమును మన్నింపవలయుఁ గావున నీయిచ్చవచ్చినమచ్చున నొనరింపుము. దివోదాసుని భూరాజ్యపట్టభద్రునిగాఁ జేయుము. వానికోరికవడుపున నేను సపరివారంబుగ నెందేనిఁ బోయెదంగాకయని యమ్మహాదేవుండానతిచ్చుటయు మనంబున సంతసించి యవ్వి రించి దివోదాసుని సర్వవసుంధరా చక్రంబున కేలికఁగా నియమించి నిజనివాసంబున కఱిగె.

302వ మజిలీ

దివోదాసుని కథ

అంత దివోదాసుండు మహావైభవంబున ధరారాజ్యాభిషిక్తుండై కాశీపురంబు నిజరాజధానిగాఁ జేసికొని ప్రజాసంరక్షణైక దక్షుండై యుండెను మఱియును --


శా. చాటించెన్‌ మనువంశవర్దనుఁడు విశ్వక్షోణి నందంద ఘం
    టాటంకారము దుందుభిధ్వనియుఁగూడన్‌ వేగమై దేవతా
    కోటుల్మేదిని నన్నుఁదప్పగుఁజుఁడో! కోపంబుపాపం బుపా
    త్తాటోపంబుమెయిం గుటుంబ సహితంబై చేరుఁడోనాకమున్‌.

క. పాతాళమునకు జనరో
   వాతాళను లెచటికేని వలసిన యెడకున్‌
   భూతము లేగరొయని య
   త్యాతతగతిఁ జాటిరవని నధిపతి దూతల్‌.

ఇవ్విధంబున భూతలంబునంగల సకలపుణ్యక్షేత్రంబులయందుఁ జాటింపు చేయించినతోడనే బ్రహ్మదత్తవర ప్రభావంబునఁ కాశీగయా ప్రయాగ, జగన్నాథ, సింహాచల, పట్టసాచల, భద్రాచల, వేంకటాచల శ్రీశైల శ్రీకూర్మ శ్రీరంగ కుంభకోణ కంచి కాళహస్తి‌ రామేశ్వరాది దివ్యస్థలంబుల నధివసించియున్న సకలదేవతా సమూ హంబును కుటుంబ పరివార సమేతంబుగా వెడలివచ్చి విశ్వేశ్వరాదేశంబున నెందేనిఁ బోవువారై యమ్మహాదేవునిఁ గాశియందుఁ దర్శించిరి. ఆ దేవోత్తముండునుఁ దనకింక వారణాశీ నివాసయోగ్యత లేదనియెంచి తన్గూర్చి తొల్లి తద్దయుం బెద్దతపంబుజేసిన మందరాచల శిఖరప్రదేశంబున నుండుటకు‌ నిశ్చయించి వచ్చిన వేలుపుల మూకల కెఱింగించి నందీశ్వర ఛండీశ్వర భృంగీశ్వరాదులు దన్నుఁ బరివేష్టించియుండఁ బ్రథమగణంబులతో నంబికాసహితుఁడై యందుఁ గదలెను. ఇట్లు సమూహంబుతో విశ్వ నాధుం డయ్యవిముక్త క్షేత్రంబువిడిచి.


సీ. లవణ పాథోధివేలా వేష్టితంబైన
           యల్లొ నేరెడుదీవి యతికరించి
    యిక్షురసాబ్ది పరీతాంచలంబైన
           ప్లంక్షాంఘ్రివద్వీప పరిధిఁగడచి
    హాలారసోదన్వదభి ముద్రితంబైన
           శాల్మల ద్వీప భూస్థలముఁదాటి
    ఘృతపయోరాశి సంక్లిప్తావధికమైన
           చంచత్కుశద్వీప జగతిఁ జేరి.

గీ. అమ్మహాద్వీపమునకు రత్నాఢ్యమైన
   మకుటమునుబోలె నొప్పారు మందరమునఁ
   గనక కలధౌత మాణిక్య కందరమునఁ
   గాపురముసేసె శివుఁడంబికయునుఁ దాను.

దివోదాసుని శాసనభయంబున సరినృపకులంబెల్ల భూభాగంబున నుండఁ జాలక యధోలోకంబున కేగవలసివచ్చినది పుట్టలలో, గుట్టలలో, దొరువులలో, డొంక లలో పురవనతరుశైలంబుల మూలమూలలనున్న కాద్రవేయసమవాయంబు సమధిక వేగంబున నొండొరుల బిలిచికొనుచు, పడగల మొగిడ్చుచు, పుచ్చంబులప్పళించుచుఁ జుట్టలు జుట్టుకొని తండోపతండంబులుగా భూవివరంబుల మూలంబున రసాతలంబునం బడీ తమపాటు వాసుకిప్రముఖనిఖిలవాతాళన శ్రేష్టులకెఱింగించుకొనునవి. ధరణీతలం బున నురగులజాతులు శూన్యంబగుటచే జంతుజాలంబు నందపమృత్యుభయంబు గొంత వఱకుఁ దగ్గినది.

దివోదాసుండును నాత్మీయబలప్రభావంబులఁ బర్థిన్యునివర్షించునటుల శాసించుటయుఁ నతండుక్రమంబున సర్వసన్యానుకూలముగా భూలోకంబున వర్షించు చుండెను. దానంజేసి నదనదీకేదారవాపీకూప తటాకంబులు జలసమృద్ధికలిగి యొప్పి నవి. కర్షకుల కనంతయనంత ఫలంబొసఁగుచుండెను. పశువులకు స్వేచ్చగా కసవు లభించుటంజేసి ప్రజల కమృతముగురియుచుండెను. సంతృప్తి సంతోషసౌఖ్యములు బ్రతియింటను దాండవమాడుచుండెను ఇట్లు తృణకాష్టజలసమృద్ధిఁగలిగి గ్రాసవాసో వైభవంబుల కింతయుఁ గొరంతలేకుండ భూప్రజలు దివోదాసుని రాజ్యంబునఁ జెలంగి యుండిరి.


క. చాతుర్వర్ణ్యములోనరఁగ
   ఖ్యాతింజతురాశ్రమార్హ, ఘనధర్యోద్య
   ద్రీతులఁ దప్పక తమతమ
   నీతంబుల మెలఁగుచుండె నిత్యము బ్రీతిన్‌.

మరియును జారచోర క్షామనృపాగ్ని రుకావగ్రహాపమృత్యుభయంబులు దివోదాసుని రాజ్యమునం దెందునులేక ప్రజలకు శ్రీరామ రాజ్యంబువోలె నొప్పి యుండెను. భూసురులు భాసురవేదాధ్యయన సంపన్నులై రాజు నా నతిన దేవతా కంబులుగ నధ్వరంబు లనేకంబు లొనర్చుచు రాజునకు రాష్ట్రమునకు. ననవరతశుభో దర్కం బొదవునట్లు మెలఁగుచుండిరి. రాజులు, రాజులై నిజబలప్రతాపజ్యోత్స్నా సముదయంబులు దుర్జనహృదయనాళీకవిద్వేషణంబులుగా సజ్జనచకోర హృదయాహ్లాద కరంబుగాఁ జరించుచుండిరి. బేరులు కుబేరుని బేరుతోనే ధిక్కరించుచు ధనకనక వస్తు వాహనసంపన్నులై యర్ధిజనకల్పకంబులై డుంబుమీనియుండిరి. కృషికు లార్య సేవా తృషితులై పుడమి ముక్కారుపంటలం బండించుచు సర్వజీవ ప్రమోదకారణులై చెలఁగియుండిరి.

ఇట్లు ప్రజారంజకుండై ధర్మంబు నాలుగుపాదంబుల వర్తించుచుండ ధరణీ చక్రంబవక్రవిక్రమంబున దివోదాసుండు పరిపాలించుచు నొక్కనాఁడు పేరోల గ౦బున నున్న సమయంబునఁ గొందరు వనాటులరుదెంచి తాము తెచ్చిన వన్యవస్తు సందోహంబులఁ గానుకలుగా నా పరివృడుని మ్రోలంబెట్టి జోహారు లొనరించుచు నిట్లు విన్నవించుకొనిరి.

ఏలికా ! మేము వింధ్యారణ్యవాసులము. ఏలినవారి దాసులము. దేవర పరిపాలనంబున నెందును బన్నగ బాధలేకుండ నా జాతినంతయును బాతాళంబునకుఁ ద్రోయుటంజేసి యరణ్యజీవనులమైన మేము కటికి చీశకటియందైనన పురుగు బాధ నెరుంగక నిర్భయముగా దిరుగుచుంటిమి. కాని మొన్న మా పిన్నిగారి కన్నగాఁ డొకఁడు కట్టెలకై మిత్రులతో దూరముగానున్న మెట్టదరకేగి యందొక మూల నున్న పెద్దపుట్టలో నొక నాగుబాముం జూచెనఁట. వాఁఢూరకొనక యా పుట్ట నతి క్రమంబునం ద్రవ్వి యందు జుట్టఁ జుట్టుకొని యున్న యా పన్నగమును గ్రన్నన తనయొద్దనున్న గొడ్డలితోఁ జావఁగొట్టెను. పిమ్మటనది చచ్చినదని నిశ్చయించి యా కొండిక వింతగాఁ దానితోక పట్టుకొని పైకెత్తి యాడింపసాగెనఁట. ఇట్లాడించు చుండఁగనే యా పాపరేఁడు ఫైకి తిరిగి వాని చేతీమీఁదఁ బెద్ద కాటువేసెను దానితో వాఁడమ్మోయని యరచుచు నేలంబడి విలవిలం దన్నుకొనుచు జీవనములఁ బాసెను. పట్టు వదలిన నాగము మెల్లఁగా గొండొక కలుగులో దూరి మాయమాయెను. చేరువ నున్న బాలకు లాక్రోశించుచు నిండ్ల కేతంచి యా వృత్తాంతమంతయు మా కెరిం గించిరి. మేమును బడితెలు బల్లెములు మొదలగు సాథనములతో నాప్రాంతముల కరిగి యాపుర్వుం బట్టుకొనవలెనని‌ యెంత ప్రయత్నించినను నది కనంబడినది కాదు. బాబూ ! మా పిన్నవాని పాలిటికది మృత్యువువలె వచ్చి మాయమైనది. నీ యేల్బడి యందిట్టి యన్యాయమెందును గనివిని యెరుంగము. మేమెన్ని మంత్రతంత్రంబు లుపయోగించినను గార్యము లేకపోయినది. మా పిల్లవానిని బ్రతికించి మాకిచ్చుటకు న్యాయపరిపాలకుఁడవగు నీదియే భారము. నీ యాజ్ఞయగువరకు నా బాలకుని శవమందే యొకచోఁ బెట్టి పలువురఁ గాపుంచి వచ్చితిమి.

అని వారు చెప్పినతోడనే దివోదాసుండు క్రోధ తామ్రాక్షుఁడై యౌడు గరచుచు నేనేమి ! నా యాజ్ఞల దిరస్కరించి వంచనమై మేదినినుండుటయే గాక యా పాపపుఁబురుగు మానిదిబుడుతం గూడఁ గరువ సాహసించెగా ! పదుఁడు, పదుఁడు, నేనిదే మీ వెంటవచ్చి యా చిలువ నెందున్నఁ బట్టి చిదుగఁగొట్టి మీ పట్టికిఁ దగిన ప్రతీకార మొనరించి యిచ్చెదంగాక. అని యా ఱేఁడు మిగుల వేగముగలతత్తడి నా యత్తపరపించి దానినెక్కి కతిపయసేవక సమూహము వెంటరా నమ్మన్నె కాండ్రతో నటఁగదలి క్రమంబున నమ్మహారణ్యంబు జేరెను.

పిమ్మట నందా మృతబాలక కళేబర మెందున్నదో చూపుఁడని యబ్బో యల నా రాజేంద్రుండడుగుటయు నచ్చోట కాపున్నవాండ్రు చేతులు నలుపుకొనుచు దేవరా ! ఏమని చెప్పుదుము. ఇ9త వింత మే మెందును వినలేదు. మాచే సంరక్షింప బడుచున్న యాశవమేమైనదో మాకుఁ దెలియుటలేదు. దాని చుట్టును మేమతి జాగ రూకతతోఁ గాపుంటిమి. ఉన్నట్లెయుండి యది మాయమైనది. అది యీ విధముగా బోయినదని చెప్పఁజాలకున్నాము. ఘాతుకమృగమేదియైనఁ గొనిపోయినదనుట కట్టి గుర్తు లేమియును గానరావు. పైవారెవరును వచ్చిన జాడ గనంబడదు. ఇది యింద్ర జాలమువలె నున్నది. అని దీనాసనులై విన్నవించు నా యాటవికుల ననునయించుచు రాజేంద్రుఁ డిట్లనియె.

శబరులారా ! వెరువకుఁడు. ఇది యంతయును నురగుల తరటితనమున వచ్చినది. మీ బాలక కశేబరంబును గుప్తపరచినది. గూడ నాగకులంబే కావచ్చును. తమ యవినయకృత్యంబును గప్పిపుచ్చుట కట్లు చేసియుందురు. ఏది యెట్లయిననేమి ? ఆ బాలఘాతకు నెందున్నను బట్టి మట్టుబెట్టి మీ పట్టిని బ్రతికించి మీ కిచ్చెదంగాక. మా రాజ్యంబున నిట్టి యక్రమంబు జరుగ నే సహింపఁజాలను అని నుడువుచు మరియు నిట్లనియె.

ఓరీ ! ఆ పాపపు చిలువ బాలునింగరచి యెందేగెనో చూచితిరా యని యడుగుటయు వారు చేతులు మోడ్చుచు నదుగో యెదురం గనంబడు పుట్టకలుగు లోనికిఁ బోవుచుండ మేము గన్నులారం జూచితిమని చెప్పిరి. అప్పుడే రాజు తద్వల్మీ కంబును ద్రవ్వించిచూడ నందొక మహాతపస్వి యత్యద్భుతతేజోదుర్నిరీక్షుండై నిమీలితాక్షుండై సిద్ధాసనంబున నిర్వికల్పక సమాధి నిష్టాగరిష్టుఁడై చూపట్టెను. వానింజూచి యెల్లరు విస్మయసాధ్వసములం బొందిరి. ఆ పుడమిఱేఁడు వేడుకగా నా జడదారింజూచుచు చిడిముడి పాటించుకయును లేక వాని యడుగులంబడి నమస్కరించు వాఁడువలె క్రిందకువంగి చేతులు సాచి తత్పదద్వయంబు గ్రహించి మించిన తమ కంబున బిఱబిఱముందునకీడ్చుచు మ్రుచ్చా ! నీ మాయావేషంబు లిఁకజాలింపుమని పలుకుచు మహాక్రోధంబునఁ దచ్చిరంబునేలంబెట్టికొట్టెను. తోడనే యా జటిలుని రూపంబంతర్ధానమై కన్నులకు మిరుమిట్లు గొలుపు నత్యద్భుత తేజంబొండు వెల్వడి నిమిసములో నదృశ్యమయ్యెను.

అమ్మహారాజు వెఱపించుకయుం బొందక నలుమూలలం బరికింపుచుండ నంబరంబున నొకవింతళకుంతంబు గోచరమయ్యెను. దానినుపలక్షించి యాక్షితీశ్వ రుండు పోకుపోకుమని యదలించుచుఁ జంద్రహాసంబు గైకొని యోగమార్గంబునఁ బై కెగసి దానిం దరుముకొనిపోయెను. క్రిందనున్నవారు వానికొఱ కాదివసాంతము వఱకు నిరీక్షించి యుండిరిగాని వానిజాడ యేమియుఁ బొడకట్టనందునఁ బ్రక్కనున్న తమపల్లెకుంబోయిరి. రాజ సేవకులును మరకొన్నిదినంబులందుండి యొడయని వర్త మాన మేమియుం దెలియనందున నిరువుర మాత్రమందుగాపుంచి తక్కినవారెల్ల వారణాసికింబోయి ప్రధానుల కావృత్తాంతమంతయు‌ నివేదించిరి. రాజుగారిక్షేమ మరయఁ బెక్కండ్ర దూతల వివిధప్రాంతములకుఁ బంపించి మంత్రులు రాచకార్యము లన్నియును దివోదాసునిపేరున నిర్వర్తించుచుండిరి.

303వ మజిలీ

అనంగమోహిని కథ

నాగలోకంబున నొకభాగమునకు నాయకుండై వాసుకియను సర్పశ్రేష్ఠుండు పరిపాలించుచుండెను. అతనికి అనంగమోహిని యను పుత్రికారత్నంబుగలదు. అబ్బాలిక చూళికాభరణ రూపలావణ్యాతి శయంబుల ముల్లోకములఁగల సీమంతినీ