కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/209వ మజిలీ

అని యెఱింగించి యతిపతి కాలాతీతమగుటయు నవ్వలికథ పై మజిలీయం దిట్లు చెప్పం దొడంగెను.

209 వ మజిలీ

దేవకన్యావివాహముకథ

మదనమంజరి విక్రమార్క నృపసార్వభౌముం డలకాపురంబునకు వచ్చి త్రిపురసుందరి వివాహ మాడుననియు నప్పుడొక గొప్ప సభ జరుగుననియు నప్పుడు వేల్పు లందరు రావలయుననియు దేవలోకములన్నియుఁ జాటింపం జేసినది.

దానం జేసి యమ్మహారాజుం జూడ వేడుకపడుచు నా సుముహూర్తమునకు ముందుగనే గరుడ గంధర్వకిన్నర కింపురుష సిద్ధవిద్యాధర యక్ష రాక్షస ప్రభృతులు దేవతా విశేషులు స్త్రీ బాలవృద్ధముగా వచ్చి యలకాపుర మలంకరించిరి. కుబేరుండును వారి కందఱకుం దగిన విడిదెల నియమించి యాచరించెను.

మఱియు -

క. రంభోర్వశీ ముఖామర
   రంభోరుజనంబు నారీష్య రమణీయ కళా
   రంభోత్సాహాంచిత సం
   రంభంబున వచ్చెనమర రాజనుపంగన్,

ఉ. వీణెలఁమూని వచ్చిరరవింద భవప్రభవుండు గానవి
    ద్వాక నిపుణుండు తుంబురుఁ డుదారయశోనిధి విక్రమార్కభూ
    జాని వివాహ లగ్న దివసంబునఁ దన్మహనీయ సాహసో
    పానమిత ప్రతాప సుగణాదుల గానముసేయు వేడ్కతోన్.

వివాహలగ్నం బాసన్నం బగుడు కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుఁడు మదనమంజరీ ప్రబోధితుఁడై నాకంబునకరిగి దేవేంద్రు నడిగి మాతలి సారథికంబగు రథంబు దీసికొని భూలోకంబునకుంబోయి విక్రమార్కమహారాజుం గాంచి లగ్న పత్రిక నిచ్చి విచ్చేయుమని ప్రార్థించుటయు నమ్మహారాజు ఆహా ! వేల్పులెల్ల నన్నుఁ బెద్దఁజేసి యాహ్వానించుచున్నారు. నేనబ్బుండనైనను దద్దయాపాత్రుండనగుటఁ బవిత్రుండనని తలంచుచుంటి నెట్లయిన నమ్మహాత్ములంగాంచి కృతార్థుఁడ నగుటయే లెస్స యని యాలోచించుచు నవ్విమానమునకుఁ బ్రదక్షిణముజేసి మాతలి దత్తంబులగు దివ్యమాల్యానులేప నాంబరాదులు ధరించి సమధికతేజోవిరాజమానుండై యక్కాంచనరథ మెక్కి యొక్క గడియలో నలకాపురంబున కరిగెను.

శంఖారావ భేరీమృదంగాది మంగళ నినాదముతో నతనికి సీమాప్రవేశమున నిదారు సన్నాహము గావించి వేల్పులెల్ల నతండు వలదనుచుండఁ బలవంతమున రతనంపు కెంపుల పల్లకీలోఁ గూర్చుండఁబెట్టి తాము పాదచారులై ముందె నడచుచు రంభోర్వశులు నృత్యము సేయ దుంబురుండు వీణ మేలగింపఁ గిన్నరులను వదింప ననేక మహోత్సవములతో విక్రమార్క చక్రవర్తి నలకాపురవీథుల నూరేగింపుచున్న సమయంబున యక్షకాంతలు సౌధాంతరముల వసించి సంభ్రమముతో నతనిం గాంచుచు,

సీ. వీఁడఁటే మనయక్షువెలఁది కాపాలికా
               ధము బాధఁ బాపిన ధన్యతముఁడు
    వీఁడఁటే నిఖిల పృథ్వీనాథుల జయించి
               కరములందిన పరాక్రమ వినోది
    వీఁడఁటే కిటివెన్క వెసరసాతలమేగి
              బలిచేతఁ బూజింపఁ బడినఱేఁడు
    వీఁడఁటే రవిదత్త పృథుకుండలముల భూ
             సురుల కిచ్చిన సువితరణశాలి
గీ. వీఁడఁటే విక్రమార్క పృథ్వీధవుండు
    అహహ ! ఈతని సౌందర్య మక్కజంబు
    వీనిఁగోరుట సురసతుల్ వింతగాదు
    మూఁడులోకంబులేలంగ వీఁడె దాలు.

అని పౌరనారీజనంబు తద్గుణంబు లగ్గింపుచుఁ బుష్పములు జల్లుచుండ నలకా నగర వీథులన్నియు నూరేగించి వివాహమంటప వేదిం ప్రవేశ పెట్టిరి. ఆ శుభలగ్నమున దేవతావివాహ విధానంబున మాణిభద్రుండును మదనమంజరియుఁ ద్రిపురసుందరిని విక్రమార్క చక్రవర్తికి సాలంకృత కన్యాదానము గావించిరి. అప్పుడు-

క. ఆడిరి సురకాంతలు కొని
   యాడిరి తత్కీర్తిపతను లనురాగముతోఁ
   బాడిరి గంధర్వులు గుమి
   గూడి సురల్ పుష్పవృష్టిఁ గురిపించి రటన్.

భూలోక కోకస్తనీ విలక్షణ నిరుపమ సౌందర్యచాతుర్యాతి శయంబులం బొలుపొందు త్రిపురసుందరిం గాంచి విక్రమార్కుండు ప్రహర్ష సాగరంబున మునుంగుచుండెను. మఱియు నవ్వివాహదీక్షావసాన దివసంబున నలకాపురంబున నమ్మహారాజును గురించి గొప్ప సభ గావించిరి. అందు ముందుగా మాణిభద్రుడు లేచి యమ్మహారాజు తమకుఁ గావించిన యుపకార ముగ్గడించుచుఁ దరువాత నతండు జేసిన సాహసవితరణాది గుణగణంబులఁ దెలియఁజేసెను.

అప్పుడు గరుడ గంధర్వాది దేవతలు ఆ నృపాలునిమీదఁ రచించుకొని వచ్చిన పద్యముల నీరీతిఁ గీర్తించిరి.

గంధర్వులు — శ్లో. చిరేణహుత్వాప్యనవాప్త కామితం
                       ద్విజంగి రౌకుత్రచి దార్తచేత నం
                       కృతార్థయామానహే విక్రమోచిరా
                       దితీవా గంధర్వగణాస్తువంతి

ఒకానొక పర్వతమందొక బ్రాహ్మణుఁడొక దేవతను గురించి యొక కోరిక మీఁద జిరకాలమునుండి హోమము జేయుచున్నను నా దేవత ప్రత్యక్షమైనదికాదు. విక్రమార్కుఁడా వార్తవిని యందుజోయి యతని కామితము దీర్పకున్న నాదేవతకుఁ దన శిరము నఱికి బలియిచ్చుటకుఁ బ్రయత్నింపఁగా దేవత ప్రసన్నయై యావిప్రుని కోరికఁ దీర్చినది. వింటిరా ? ఈ మహాత్ముని సాహసమని గంధర్వులు పొగడినంతఁ గిన్నరు లిట్లనిరి.

కిన్నరులు – శ్లో. దత్తాని చత్వారి మహార్ణ వేన
                   రత్నానసౌ విక్రమ భూమిపాలః
                   మహీసుతాయ ప్రదదావితీమాం
                   కథాంవదంతిస్మహికిన్న రాస్తదా.

విక్రమార్కుండొక యాగమును దలపెట్టి చేయుచు సముద్రుని బిలుచుకొని రమ్మని యొక విప్రు నంపెను. అతండు వోయి సముద్రములోఁ బుష్పాంజలిఁ జల్లి విక్రమార్క సందేశ మెఱింగించినంత సముద్రుఁడు నాలుగు రత్నములు దెచ్చి వానికిచ్చుచు వీటిలో నొకటి ధనమిచ్చును. ఒకటి చోశ్యభోజ్యాది సకల పదార్థముల నిచ్చును. ఒకటి చతురంగ బలములు నిచ్చును. ఒకటి వస్త్రాద్యలంకారము లిచ్చునని యంపెను. విక్రమార్కుం డా రత్నములఁ జూచి వీనిలో నీ కిష్టమైన దానిం దీసికొనుమని చెప్పగా నా విప్రుం డింటికిఁ బోయివచ్చి మహారాజా ! నా కొడుకు చతురంగ బలము లిచ్చు దాని కోడలునగ లిచ్చుదాని భార్య భోజ్యపదార్థము లిచ్చుదానిం గోరిరి అవి మూడుఁను నాకు సమ్మతములుకావు. ధనమిచ్చుదానినే నా కిమ్మని కోరిన నవ్వుచు నాలుగు రత్నములు వానికే యిచ్చి సంతుష్టుం జేసెను. విక్రమార్కుని వంటి వదాన్య చక్రవర్తి యెవడున్నాఁడని కిన్నరులు నుతింపగా సిద్ధు లిట్లనిరి.

సిద్ధులు — శ్లో. ఇతఃపరం విక్రమభూమిపాల
                  స్తపశ్చరంతకిల వర్ణినం సః
                  పురేభిషిచ్య ప్రదదౌధనానీ
                  త్యెతాంకథాంతాం ప్రవదలతి సిద్ధాః ॥

ఒకనొక బ్రహ్మచారి తపము జేయుచుఁ దన చెంత కరుదెంచిన విక్రమార్కుని జూచి యాశీర్వదించి నీ కేమి కోరికయున్నదని యడుగఁగా బెండ్లియాడి రాజ్యము చేయవలయునని యభిలాష యున్నది, ఎట్లు తీరును అని కోరఁగా నందొక పట్టణము నిర్మింపఁజేసి చతురంగ బలములిచ్చి ధన ధాన్యములిచ్చి యా దేశమునకా బ్రహ్మచారిని రాజుగాఁజేసె నీ మహారాజ ఉదారత వింటిరా అని సిద్ధులు చెప్పగా సాధ్యు లిట్లనిరి.

సాధ్యులు - శ్లో. మధ్యేసముద్రం క్వచిదద్రిశృంగే
                    దుర్గాలయే ప్రేతకబంధ యుగ్మం
                    చక్రేసజీవం పృథుసాహసేన
                    రాజేసి సార్థం ప్రవదంతి సాధ్యాః

సముద్రమధ్యంబున నొక పర్వత కూటమున నొప్పుచున్న దుర్గాలయమున మృతినొందిన రెండు మొండెములున్నవి. తలలు వేఱుగా నున్నవి. ఈ సాహసాంకుడా గుడివార్తవిని యక్కడికిఁబోయి శిలాశాసనము జదివి తన శిరఃకర్తనము జేసికొనఁబోవనంతలో నమ్మవారు ప్రత్యక్షమై యతని కంఠము కోసికొననీయక కత్తిపట్టుకొని యతని కోరిక ప్రకారము ఆ మొండెముల తలలతోఁ గలపి బ్రతికించి యంపినది.

అని యమ్మహాత్మునిపై తమదమ రచించిన గీతములన్నియు గంధర్వాదులు పాడినపిమ్మట సిగ్గభినయించుచు విక్రమార్కుండు లేచి వారికెల్ల మ్రొక్కుచు మహాత్ములారా ! నాయందు సుగుణ లేశమైన లేకపోయినను బుత్రవాత్సల్యమునఁ బెద్దగా నగ్గించుచున్నారు. ఇది నాకు సిగ్గగుచున్నది. మీ కనేక వందనము లర్పించుచున్నాను స్తుతి పాఠములు విరమింపుఁడని ప్రార్థించుటయు వారందఱు కరతాళములు మ్రోగించిరి.

అప్పుడు మదనమంజరి మెల్లన నతని ప్రక్కకుఁ బోయి మహారాజా ! నా ముద్దు చెల్లించి మాయక్క కూఁతురు త్రిపురసుందరిం బెండ్లి యాడితి నానందించితిమి. మఱియు దేవతా కన్యకలు పెక్కండ్రు భవదీయ గుణ ప్రఖ్యాపకములగు నుపాక్ష్యనములు విని నిన్ను వరించి విరహపరితాపంబు జెందుచున్నారు. వారందరు నీ సభకువచ్చి నీతోఁ జెప్పుమని నన్నాశ్రయించుచున్నారు. నీ వార్త జనశరణ్యుఁడవు గదా ! వారి నాపద పాల్సేసి యెట్లుపేక్షింతువు ? కరుణించి వారినందఱ భార్యలగా స్వీకరింపఁ బ్రార్థించుచున్నానని విన్నవించుటయు స్మేరాదకుర మనోహర వదనుండై దేవీ ? నీయాజ్ఞ యెట్లో యట్లు కావించెం నవహితుండ నైతినని పలుకుటయు నా యక్షకాంత తక్షణము యందున్న కన్యకల రప్పించిరి.

సీ. సకల కాకోదర సార్వభౌముండైన
                 వాసుకి మనుమురా లీసువదన
    గంధర్వవంశ ప్రకాశకుండగు చిత్ర
                రథు పుత్ర పుత్రి యీ రాజవదన
    ఈ కాంత విద్యాధరేంద్రు కూరిమి పట్టి
               కిన్నరకన్నె యీ సన్నుతాంగి

    అప్సర ప్రవరకన్యారత్న మీయోష
                 దానవకన్య యీ తరళనయన
గీ. బ్రహ్మచే వీరు సృష్టింపఁబడిరి తరుణు
   లిరువు రసురుల వంచించు కొఱకు మున్ను
   ధనదుఁ డిందాక తనచెంత నునిచికొనియె
   వారు నిన్గోరుచున్నారు ధారుణీంద్ర.

అని మదనమంజరి యా యాసుందరులం జూపుచు వీరి పెండ్లి యాడుమని కోరిన శిరఃకంపమున నంగీకారము సూచింప నానందింపుడు దేవ యువతులెల్ల నతని మెడలోఁ బుష్పదామంబు వైచి వరించుచు నతని యెడమప్రక్క నిలువంబడుచుండిరి.

అట్లా మహారాజు నూర్వుర దివిజకాంతల గాంధర్వవిధానంబున భార్యలగా స్వీకరించి ప్రమోద మేదుర హృదయుండైయున్న సమయంబునఁ గుబేరుఁడు లేచి యిట్లనియె.

మహారాజా! నీ సద్గుణంబులు వినియుఁ బురుహూతఁ డిందు రానందులకు మిక్కిలి పరితపించుచు నిన్నీ వైభవముతో విమాన మెక్కించి యందుఁ దీసికొని రమ్మని మాతలి నంపియున్నాఁడు. మనమందఱ మీ విభవముతో నందుఁ బోవుదమే యని యడిగిన విక్రమార్కుండు ఆహా! ఇంతకన్న నా కాచరణీయ మేమియున్నది? నేను ధన్యుఁడనేకదా ! ఆశతక్రతుదర్శనము జేసి కృతకృత్యుండ నగుదునని పలికెను.

అప్పు డతని భార్యలతోఁ గూడ నా విమానముమీఁద గూర్చుండఁబెట్టి యందు వచ్చిన వేల్పులతోఁ గూడికొని కుబేరుం డతని నాకమునకుఁ దీసికొనిపోయెను. అమరావతీపురవీథులం దమ్మహారాజు నూరేగింపుచు దేవకాంతలు పూవులు జల్లుచుండ దేవసభాభవనప్రాంగణమునకుఁ దీసికొనిపోయిరి.

అం దతండు విమానంబు దిగి చేతులు జోడించుచుఁ గుబేరాది దిక్పతులు ముందు నడువ సభాంతరాళంబున కరుగుచుండ మహేంద్రుడు కొంతదూర మెదురు వచ్చి యతని నమస్కారము లందికొనుచుఁ జేయిం బట్టుకొని తీసికొనిపోయి తన యర్థసింహాసనమునఁ గూర్చుండఁ బెట్టుకొనియెను.

అప్పుడు దిక్పతులెల్ల తమ తమ పీఠము లలంకరించిరి. గరుడ గంధర్వాదు లొకవంకను దేవతాయతు లొకవంకను సిద్ధ సాధ్యాది సామాజకు లొకవంకను సభ నలంకరించిరి బృహస్పతి లేచి ప్రారంభోపన్యాసమున విక్రమార్కుని గుణముల నభినుతించెను. పిమ్మట దేవేంద్రుం డతని నుపలాలింపుచు వత్సా ! విక్రమార్కా ? ప్రతి నిత్యము నీపు గావించు సాహసాది కృత్యంబు లాదిత్యు లెప్పటి కప్పుడు మా చెవిం బడవేయుచున్నారు. నీ చర్య లొకదాని కన్న నొక టద్భుతముగా నున్నవి. తృణముగానైనఁ బ్రాణమును గణింపవుగదా? నీ చరిత్రమున స్వార్థపరత్వ మించుకయు గానిపింపదే ? నీ సాహసకృత్యములకు మెచ్చుకొని వారు వారిచ్చిన వస్తువు లొక్కొక్కటియే భూలోకమునకు సరిపడియున్న వట్టి వాని గవ్వగానైన గణింపక యర్దులకిచ్చివేసితివే? నీ యౌదార్య మెన్నినాళ్ళు పొగడినను దుదముట్టునా? నీ సుకృతమునకు నా స్వర్గాధిపత్య యొసంగినను సరిపడదు. పెక్కేల వినుము.

క. ఇదివఱకు పుడమి నేలిన
   పృథివీపతులందు నీ ప్రవృత్తిఁగల నృపుం
   డుదయింప లేదె యిఁక ముం
   డుదయింపఁడు నీకు నీవయుద్ది మహాత్మా!

అని పలికినంత దిక్పతులందఱు సత్యము సత్యము అని యతని మాట లనువదించిరి. సభ్యులెల్లరు సురపతి యదార్థము వాక్రుచ్చెనని యుచ్చస్వరంబుల నుచ్చరించిరి. దుందుభులు మ్రోగె. గంధర్వులు పాడిరి. అప్పుడు వినోదముగా రంభోర్వసులు నృత్యముచేసిరి. అప్పుడు తుంబురుం డతని సంగీత విద్యాపాటవంబు దెలియఁదలంచి మహారాజా! ఈ నాట్యము సేయువారలలో నిది రంభ యిది యూర్వశి వీరిద్దరకు నృత్యకళా కౌశల్యములోఁ దగవు గలిగియున్నది. అందలి తారతమ్యము నిరూపింప మావశమైనదికాదు. మీరు సకలకళాపరిపూర్ణులని విని యుంటిమి. వీరి నాట్యము చూచుచుండిరిగదా ? వీరిలో నెవ్వతె నిపుణయో యెఱింగింపుమని యడిగిన నమ్మహారాజు చేతులుజోడించి యిట్లనియె.

గాంధర్వవిద్యాస్వరూపులై యొప్పుచున్న తుంబురు నారద ప్రభృతులచే నలంకరింపఁబడియున్న యీ మహాసభలోఁ గించిజ్ఞుఁడునగు నన్నిట్లడిగిన నేమి చెప్పగలను. అయినను నాకుఁ దోచినంత నుడివి తప్పులు దిద్దించుకొనియెదం గాక. రంభకంటె నూర్వశియే నృత్యవిద్యానైపుణ్యము గలది. అని యందలి కారణంబు లన్నియుం జెప్పి దేవగాయకులనెల్ల నాశ్చర్య సముద్రంబున ముంచివేసెను.

అప్పుడు దేవేంద్రుండు మహారాజా! నీవు సకలవిద్యాపారంగతుండవు. ముప్పదిరెండు సుగుణంబులు నీయందు సంపూర్ణముగా నున్నవి. నీవు పెద్దకాలము భూమిం బాలింపఁగలవు. నీవు గూర్చుండఁదగిన సింహాసనము పుడమియందు లేదు. ముప్పదిరెండు బొమ్మలతో నొప్పుచున్న రత్నసింహాసనము నీ కర్పించుచున్నాను. దానిపైఁ గూర్చుండి ప్రజల బాలింపుము. మఱియుఁ గల్పవృక్షంబు మోక యొకటి నీకిచ్చుచున్నాను. దాని మీ పెరటిలో నాటింపుము. దాని నర్దుల కీయరాదు. మూడు సహస్రవర్షములు నీ యింటనుండును. తజ్జనితంబగు ధనంబు నీ యిష్టము వచ్చినట్లు పంచిపెట్టుకొనవచ్చును. దానంజేసి నీకే కొదువయు నుండదని యుపదేశించి మాతలిని రప్పించి తొంటివిమానముపై భార్యలతో నతని నెక్కించి తానిచ్చిన వస్తువాహనము లతోఁ గూడ నా పట్టణమంతయు వెండియు నూరేగింపఁజేసి పొలిమేరవఱకు వేలుపులతోఁ గూడ సాగనంపి యంపించెను.

మహేంద్రుఁడైన నేమి హరిహరాదులైన నేమి? యతఁడు చేసిన సుకృతంబునకు దాసులై వెనువెంటఁ దిరుగవలసిదేకదా? మదనమంజరియు మాణిభద్రుండు నవ్విమాన మెక్కి యుజ్జయినీపురమువరకు వచ్చి యతని నింటఁ బ్రవేశపెట్టి తదనుజ్ఞ గైకొని నిజనివాసంబున కరిగిరి.

విక్రమార్కుండు తాను దేవలోకంబున కరిగి వచ్చిన వృత్తాంత మంతయు మంత్రుల కెఱింగించి వారి నానందింపఁ జేయుచు నా దేవతాయువతులతోఁ గొన్నిదినంబులు క్రీడాశైలముల యందుఁ గేళికోద్యానవనములందు నదీసైకతప్రదేశములయందు విహరింపుచు శ్రీకృష్ణుండవోలె దక్షిణనాయకుండై యందఱ గందర్పక్రీడల నానందపరవశలం గావింపుచు మఱియు దన్నువరించిన కళింగసేనాది రాజకన్యలఁ గొందఱం బెండ్లియాడి స్వర్గలోకంబు పాకశాసనుండువోలె ధరణీరాజ్యంబు పాలింపుచుండెను. అని యెఱింగించి మణిసిద్ధుండు,

సీ. స్తంభన మోహనోచ్చాట నాకర్షణ
               మారణోద్వేజ నో న్మాననములు
    వాదవయస్థంభ వశ్యపురక్షోభ
               గజకరణాదృశ్య కరణములు
    పశుపక్షి మృగ ముఖ్య బహురూపధారణా
               విధి పరకాయ ప్రవేశములు
    సర్వాంజన మహేంద్రజాల మాయోపాయ
              మణిమంత్ర తంత్ర సామర్థ్యములును
గీ. ద్వీప దుర్గాది మర్గ ప్రదీపనములు
   నమృతకర భాస్కరోదయ వ్యత్యయములు
   సకల జంతు భాషా పరిజ్ఞానములును
   నాదిగాఁగల విద్యల నాతఁ డెఱుఁగు.

తత్ప్రతిపాదకంబులగు కథలు కొన్ని గలిగియున్నవి. వానిలో నీకిప్పు డొక్కటియుం జెప్పలేదు. వేరొకప్పుడు వక్కాణించెదం గాక యని మఱియు,

క. ఈ విక్రమార్కచరితము
   బావనమతి వినిన వ్రాయఁ బఠియించిన ను
   శ్రీ వెలయుఁ బెరుగు నాయువు
   నేవేళన్ శుభము నొప్ప నింటం జంటన్ .

అని యెఱింగించిన విని యగ్గోపాలుండు మూపు లెగర వైచుచు మహాత్మా ఇంతటితో నతని చరిత్రము ముగిసినదని పరితపించుంటిని. ఇంకనుం బెక్కు కథలు గలవని చెప్పుటచే మురియుచుంటి. సావధానముగా వానినెల్ల ముందు జెప్పుదురుగాక యని యయ్యతి చరణంబుల మ్రొక్కుచుఁ గావడి యెత్తుకొని యా కథావిశేషములనే ధ్యానించుచు గురువుగారివెంట నరుగుచుండెను.

క. మంగళము శైలజామిళి
   తాంగునకుం దారహీరహారోపమ శు
   భ్రాంగునకున్ గోరాట్సు తు
   రంగునకున్ సత్కృపాంతరంగున కెలమిన్.

క. కోరిక దీరఁగ రుధిరో
   ద్గారి సమాంతరమునందుఁ దగనీభాగం
   బారూఢిఁజేసి యిచ్చితిఁ
   గారుణ్యముతోడఁ దీని గైకొనుమభవా!

గద్య. ఇది శ్రీమద్విశ్వనాథసదనుకంపాసంపాదితకవితావిచి
త్రాత్రేయమునిసుత్రామగోత్రపవిత్ర మధిరకులకలశజల
నిధిరాకారుముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండ
యార్యపుత్ర సోమిదేవిగర్భముక్తిముక్తాఫల
విబుధజనాభిరక్షిత సుబ్బన్నదీక్షితకవి
విరచితంబగు కాశీయాత్రాచరిత్ర
మనుమహాప్రబంధంబున
నవమి భాగము
సమాప్తము.
శ్రీ శ్రీ శ్రీ
శ్రీ విశ్వనాధార్పణమస్తు.