కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/208వ మజిలీ

నేను - మహారాజా ! మీరు గుఱ్ఱముపై హుటాహుటీ పయనంబున బోయినను నాఱుమాసములు పట్టును. మా యక్షిణీ ప్రభావంబున గుఱ్ఱముతోఁగూడ మిమ్ము రెండు గడియలలో నుజ్జయనీ పురంబు జేర్చెద నంగీకరరింతురే ?

అనుటయు నమ్మహాత్ముం డౌను. నీ ప్రజ్ఞ మున్ను నే నేఱింగి నదియే. నన్ను గడియలో మలయవతి నగరముజేర్చి తెల్లవారకుండ వెండియు నింటికిం దీసికొని వచ్చిన నేర్పరివి. అట్లెకావింపుమని కన్నులు మూసికొనియెను. అశ్వసహితముగా రెండుగడియలలో నా నరేంద్రు నుజ్జయినీనగరము జేర్చితిని. వెండియుఁ బది దినములలో రమ్మని నాకాజ్ఞ యిచ్చుటయుఁ తనానతివడసి యిందు వచ్చితినని మదనమంజరి భర్తకు దనపోయివచ్చిన వృత్తాంత మంతయు నెఱింగించినది.

అని తెలిసి మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరావసథంబున నిట్లు చెప్పు చుండెను.

208 వ మజిలీ

ఐంద్రజాలికుని కథ

విక్రమార్కుండు కొల్వుకూట మలంకరించి హితపురోహిత మంత్రి సామంతాదులతోఁ దాను జూచివచ్చిన విశేషముల గురించి ముచ్చటింపుచున్న సమయంబున నొక యైంద్రజాలికుఁ డరుదెంచి నమస్కరింపుచు మహారాజా! తమ దివాణమున కైంద్రజాలికుఁ లనేకులు వచ్చియుందురు. వారి వారి విద్యాపాటవము మీరు జూచి యుందురు. మదీయవిద్యానైపుణ్యము గూడ దేవర పరీక్షింతురుగాక. అందులకై యరుదెంచితినని చెప్పిన నప్పుడమిఱేఁ డప్పుడు మాకుస్నాన సమయమైనది. ఱేపువచ్చి నీవిద్యాలాఘవము జూపింపుమని యజ్ఞాపించెను.

విక్రమార్కుండును మఱునాడు యథాకాలమునకు సకల సామంత మంత్రి పురోహిత పార వార సేవితుండై సభ నలంకరించి నిన్న వచ్చిన యైంద్రజాలికునిఁ బిలువుమని ప్రతీహారి కాజ్ఞాపించెను. అతండు ద్వారదేశ మంతయుఁ బరీక్షించి వాని నెందునుం గానక వచ్చి యాజాలికుఁ డెందును గనంబడలేదని చెప్పెను.

అంతలో నొకవీరుండు ఖడ్గహస్తుండై యతి మనోహర ప్రేక్షణీయలావణ్య భూయిష్టయగు వాల్గంటిని వెంటఁబెట్టుకొని యాసభా ప్రాంగణమున కరుదెంచుటయు వారిం జూచి సభ్యులు తెల్ల పోయి చూచుచుండిరి. అప్పుడు విక్రమార్కుడు నీ వెవ్వఁడవు. ఈ కాంత నీకేమి కావలయు నిందేమిటికై వచ్చితివని యడిగిన నవ్వీరుం డిట్లనియె.

రాజా! నేను మహేంద్రుని సేవకుండ నా పేరు వీరాస్వామి యండ్రు. సురపతి యొకనాఁడు నాపైఁ గోపముజేసి భూలోకమున గొన్ని దినములు వసింపుమని శపించెను. ఈ చిన్నది నా భార్య. ఇప్పుడు స్వర్గమున దేవతలకును రాక్షసులకును గొప్ప యుద్ధము జరుగుచున్నది. నన్ను రమ్మని వార్త వచ్చినది నేనుబోయి దేవతలకు సహాయము జేయవలసి యున్నది. ఈ నా భార్య నెందుంచుటకుం దోచక నీవు పరనారీ సహోదరుఁవని విని నీకడ నుంచుటకై తీసికొని వచ్చితిని నాకీ యువతి ప్రాణములకన్న నెక్కువ ప్రీతిదాయిని యైనది. దీని నీవు భద్రముగాఁ గాపాడెద నంటివేని నీకడ నుంచెద నే మనియెద వని యడిగిన నా భూపాలుం డిట్లనియె.

మహావీరా ! దేవకార్య మందఱకు విధాయక కృత్యమే. నీ భార్యను బుత్రికఁగా జూచి రక్షించెద నేకొదవయు రానీయను. నీవు శ్రీఘ్రముగాఁ బోయి వేల్పులకు విజయము కలుగునట్లు చేయుమని పలికిన సంతసించుచు నా వీరుండు తన భార్యను విక్రమార్కుని చేతఁ బెట్టి యెల్లరు చూచుచుండ నాకలమునకు నిర్గమించి యంతర్దానము నొందెను.

అతం డఱిగిన ముహూర్తకాలములో నాకాశమున అరే నిలు నిలు పోకుము పోకుము కొట్టుము పొడువుము జంపుము అని యోధభటుల కోలాహలధ్వనులు వినంబడినవి. ఆ ఘోషకులు విని సభ్యులందరు నీ వలకు వచ్చి తలలెత్తి నింగిదెసఁ జూచుచుండిరి. ఆకాశమున మహాయుద్ధము జరుగుచున్నట్లు చప్పుడు వినంబడినది.

అంతలో నా విక్రమార్కుని ముందర నెత్తురు గారుచు దృఢ ముష్టీ నిష్ఠీడిత కృపాణమగు హస్త మొకఁటి జారిపడనది. నరేంద్రుండు దానిం జూచి యోహో? ఈ చేయియు నీ కత్తియు మన వీరునిదే యని తోచుచున్నది. ఇతని హస్తము శత్రువులు ఖండించిరిఁ కాఁబోలు. అయ్యో! పాపము అని పలుకుచుండఁగనే రెండవచేయియు గాళ్ళను మొండెము తలము ఖండితములైన వేఱు వేఱ నానృపాలుని మ్రోలం బడినవి.

వానిం జూచి యాచిన్నది గోలు గోలున నేడ్చుచు నురము బాదుకొనుచు మహారాజా! నా భర్త శత్రువులచేఁ జంపబడియెను. దేహ మతనిదే. ఇక నాకు గతి యేమున్నది? మృతినొంది నాపతిం గలసికొనియద. వేగము చితి నేర్పరిపించుము. గడియ బ్రతుకజాలనని దుఃఖించుచుండ వారించుచు నొడియండు పడతీ? నీవు విచారింపకుము. నిన్నుఁ బుత్రికవలెఁ జూచి కాపాడెద నగ్నిం బడినేల నని పలికిన నక్కలికి యిట్లనియె మహారాజా? సర్వజ్ఞుండవు. నీకు నేను జెప్పవలయునా ? భర్తృవిహీనమైన యీ శరీర మెందులకై పోషింతును. వినుండు -

శ్లో. శశినాసహయాతి గౌముదీ
    సహమేఘన తడిత్ప్రలీయతే
    ప్రమదాఃతతి భర్తృగా ఇతి
    ప్రతిపన్నంహి విచేతనైరపి.

మఱియు

    మృతే భర్తరియానారీ సమారోహిద్దుతాసనం
    సారుంధతీ సమాభూత్వా స్వర్గ లోకే మహియతే.

చంద్రునితో వెన్నెలయు మేఘముతో మెఱుపును భర్తతో భార్యయుఁ బోవునని చేసిన యచేతనములకుఁ గూడ తెలియును. భర్త మృతుండైనంత భార్య యగ్నినిఁ బ్రవేశింపజేసి యరుంధతి సమానురాలై స్వర్గలోకములోఁ బెద్దకాలము సుఖించును. భర్త దుర్మార్గుడైనను భార్య సహగమనము జేసెనేని తానేకాక భర్తను గూడఁ దరింపఁ జేయును. విధవ బ్రతుకుకన్న వ్యర్ధమైనది మఱియొకటి లేదుగదా మహాత్మా ! నాకు వేగ చితి రచింపఁజేయుము అగ్నిం బడియెదనని దీనయై వేడికొనియెను.

అప్పుడు విక్రమార్కుండేమి చేయుటకుం దోచక కన్నీరు గార్చుచుఁ దల్లీ ! నిన్ను నీ వల్లభున కర్పింపలేక పోయితిని. నీ మరణము చూడవలసి వచ్చినది. కఠినాత్ముడనై యెట్టు చూతునో తెలియదు. నీవు మహాపతివ్రతవు. నీమాట కడ్డు చెప్ప జాలము. శాస్త్రవిధికిఁ బ్రతికూలము సేయ నెవ్వరితరంబు, యని పలుకుచు మంచి గంధపు దారువులు దెప్పించి యా సభాప్రాంగణభాగంబుననే చితి రచింపఁజేసెను.

ఆ యువతియు సభ్యుల కెల్ల మ్రొక్కి భర్తయవయవములతో నగ్నికిఁ బ్రదక్షణముజేసి యాహుతాశనమునఁ బ్రవేశించి యెల్లరు జూచుచుండగనే భస్మమై పోయినది. విక్రమార్కుండు నాఁ డింటికింబోక భుజింపక యా దంపతుల గుఱించి విచారింపుచు సాయంకాలమువఱకు నా సభలోనే కూర్చుండెను. ఆరాత్రి నిద్రయుం బట్టినది కాదు. మఱునాఁడు సభలోఁ గూర్చుండి యతండా మాటలే చెప్పుచుండ -

గీ. అమ్మనేఁజెల్ల యెట్టిమాయాబలాఢ్యు
   లమరవైరులు వారిపీచము నడంప
   నాకకాకన్యులకు శక్యమా కడింది.
   నరులఁబరిమార్చి విజయమే నందుకొంటి.

అని పలుకుచు నమ్మహావీరుండు యథాపూర్వ వేషముతో ఖడ్గమొకచేతను మందారదామ మొకచేతను బూని నింగినుండి క్రిందికిదిగి విక్రమార్కుని నికటంబున నిలిచి నమస్కరింపుచు నిట్లనియె.

మహారాజా ! నే నిటనుండి నాకంబున కరుగువఱకు దేవదానవులకు మహా యుద్దము జరుగుచున్నది. అందు రక్కసు లుక్కు మిగిలి మాయాబలపాటవంబున నాకులఁ గాందిశీకులఁ గావించుటయు వేల్పులు వెన్నిచ్చి పారుట కుద్యమింపఁ బెంపుమై నే నందుకొని దేవతల నిలువరించి శత్రువుల కడ్డ కట్టనై యసిధారాపాతంబునఁగొందఱ నలుకియుఁ గొందఱం గొట్టియుఁ గొందఱ నేసియు రెండుగడియలతో దానవబ్బందంబులం జిందర వందర గావించి పారదోలితిని.

మత్కత్తృకంబగు విజయంబు విని మహేంద్రుఁడు సంతసించుచు మహావీరా బెద్దకాలమునకు గనంబడితివి. ఇంతదనుక నెందుంటివని యడిగిన నే నిట్లంటిని. దేవర శాపంబుననే నేను భూలోకమున వసించితిని. ఇప్పుడు దేవతలకు దానవులకు యుద్ధము పొసంగినదని విని యరుదెంచితిని. ఈ విజయమునకు దేవర కటాక్షమే కారణమని చెప్పుటయు నా మహేంద్రుఁడు ప్రసన్నవదనుండై వీరుఁడా ! నీవిక భూలోకమున కరుగవలసిన పనిలేదు. ఇందే యుండుము. అని పలుకుచు నీ మణివలయము స్వయముగా నాకరంబునఁ దొడిగెను.

అప్పుడు నేను పరమానంద భరితుండనై స్వామీ ! నేనందు వచ్చుచు నా భార్యను భూలోకములో విక్రమార్క మహారాజునొద్ద నునిచి వచ్చితిని. ఆ యువతిని వెంటఁబెట్టికొని యతివేగముగా రాఁగలను. సెలవీయుఁడని పలుకుచుఁ దదానతిఁ గైకొని వచ్చితిని. దేవరనిమిత్తమై మధుపఝంకారము భరితంబగు నీ కల్పతరుప్రసూన మాలికం దెచ్చితి. దరింపుఁడని పలుకుచు నాదామంబు విక్రమార్కుని మెడలో వైచి నా భార్య యెందున్నదని యడిగెను.

విక్రమార్కుం డేమియు మాటాడలేకపోయెను. సభ్యులందఱు తెల్ల పోయి యొకరిమొగ మొకరు చూచికొనఁ దొడంగిరి.

వీరుఁ – ఓ మహారాజా ! మాటాడలేవేమి ? నా ప్రియరాలెందున్నది ? చూడవలయునని నాకు మిగుల వేడుకగా నున్నది. వేగ రప్పింపవా ?

విక్రమార్కుండు — ఏమియు మాటాడక కన్నుల నీరునించుచు దెల తెల్లపోయి చూచుచుండెను.

వీరుఁడు - ఏమి స్వామీ ! మాటాడవు ?

సభ్యుఁడు - నీభార్య యగ్నిలోఁబడి మృతినొందినది.

వీరుఁడు – అయ్యో : ఇది యేమి పాపము అగ్నిఁబడనేల ?

సభ్యుఁడు- ఖండితములై పడిన భవదీయ కరచరణ శిరఃకబంధాదులఁ జూచి నీవు శత్రువులచేఁజంపఁ బడితివని నీ శరీరముతోఁ గూడ నీభార్య యగ్నిం బడినది. వలదని యెంత చెప్పినను వినినదికాదు.

వీరుఁడు - అక్కటా? అవియన్నియు రాక్షస మాయలుగదా ?

సభ్యు – ఏ మాయలో మాకేమి తెలియును ?

వీరు - మహారాజా ! నీవు పరనారీ సహోదరుండవనియు నర్దిజన కల్ప వృక్షుండవనియు నెల్లరుఁ జెప్పికొనెడు గొప్పదగు నీకీర్తి విని ప్రాణసమానయగు నా భార్యను నీకడనునిచి పోయితిని. ఇట్టి నీవు నాభార్య నంతఃపురమున దాచి యగ్నిఁ బడినదని బొంకుట ధర్మమా ? వేగఁ దీసికొని వచ్చి నాభార్య నర్పింపుము.

రాజు - (చెవులు మూసికొని) రామరామ. నే నట్టి పనిఁ గావింతునా ? దైవముతోడు. నీ భార్య యగ్నింబడినది. ఎల్లరుఁ జూచుచునే యుండిరి.

వీరు -- మహారాజా ! ఏల బొంకెదవు ? నా భార్య నీ యంత:పురమున నున్నదని రూఢిగాఁ జెప్పఁగలను. వేగ రప్పింపుము.

రాజు - (అంతఃపుర చారిణుల రప్పించి) ఈతని భార్య మన యంతఃపురమున నున్నదని చెప్పుచున్నాఁడు. ఉన్నదా ?

సౌవిదల్లులు — దేవిగారు గాక మఱియెవ్వరును లేరు మహారాజా!

వీరు — యథారాజా తథాప్రజా అనినట్లు రాజుగారే బొంకుచుండఁ బరిజనులు బొంకకుందురా.

సౌవిద --- శుద్ధాంతమున మీకాంతారత్నము లేదు. మహావీరా ? లేదు. అగ్నింబడుచుండ మేము గూడఁ జూచితిమి.

వీరు - మీ రిప్పుడు పోయి చూచి వచ్చి మఱల జెప్పుడు.

సౌవిద — (అంతఃపురమున కరిగివచ్చి సిగ్గభినయించుచు) మహారాజా ! ఈయన భార్య దేవిగారితో ముచ్చటింపుచు నంతఃపురమున నున్నది. ఎట్లు వచ్చినదో తెలియదు. ఇదేమి చిత్రము ?

రాజు — ఏమీ ? ఆమె యందున్నదా ? వేగఁబోయి తీసికొని రండు.

సౌవిద - అంతఃపురనకుఁ బోయి యాయింతిం దీసికొనివచ్చి యెదురఁ బెట్టిరి. సభ్యులతోఁ గూడ విక్రమార్కుం డాశ్చర్యమందుచు నిదేమి చిత్రమనిమాటాడ లేక యట్టే చూచుచుండెను.

అప్పుడా వీరుండు చేతులు జోడించి జయ విక్రమార్క మహారాజా ! జయ సకలమహీపాల కోటీర ఘటిత మణిగణ కిరణ నీరాజిత చరణయుగళ ! జయ అర్దిజన కల్పభూరుహ ! నేను నిన్నవచ్చిన యెంద్రజాలికుఁడ నిది మదీయేంద్రజాల విద్యా లాఘవము. ఇందులకై మీరు పరితపింప వలదని పలికినంత నమ్మహికాంతుం డత్యంతవిస్మయతరంగితాంతరంగుఁడై వాని మెచ్చుకొనుచు భాండారికుని రప్పించి నిన్న పాండ్యభూపాలుండు పంపిన సుంక మెంత యని యడిగిన వాడిట్లు చదివెను.

శ్లో. అష్టాహాటకకోటయ స్త్రీనవతిర్ముక్తాఫలానాంతులాః
    పంచాశన్మదగంధలుబ్ధమధుపా ధౌరంధరా స్సిందురాః
    అశ్వానాం త్రిశతం చతుర్ధశరథాః పణ్యాంగనానాంశలా
    న్యేతద్విక్రమ భూమిపాల భవతస్తత్పాండ్యరాట్ప్రే షితం.

ఎనిమిదికోట్ల బంగారము తొంబదిమూఁడు తులముల ముక్తాఫలములు నేబది మదపుటేనుఁగులు మూఁడువందల గుఱ్ఱములు పదునాలుగు రథములు రెండువందల మంది వారాంగనలు పాండ్యరాజు నిన్ననే పంపియున్నాఁడని చెప్పగా నా వస్తువు లన్నియుం దెప్పించి యా మహారాజు ఐంద్రజాలికునకుఁ గానుకగా నిచ్చివేసెను. అతండు మిక్కిలి సంతసించుచు నా ధనము గైకొని మహారాజువలె నిజపురంబున కరిగెను.

శ్లో. ఇంద్రజాల విదుభః ప్రవీణతాం
    భూమిజానిరవలోక్య విస్మితః
   పాండ్యభూపతి సమర్పితం ధనం
   దత్తవానితిహివక్తి సాంప్రతం.

అని యెఱింగించి యతిపతి కాలాతీతమగుటయు నవ్వలికథ పై మజిలీయం దిట్లు చెప్పం దొడంగెను.

209 వ మజిలీ

దేవకన్యావివాహముకథ

మదనమంజరి విక్రమార్క నృపసార్వభౌముం డలకాపురంబునకు వచ్చి త్రిపురసుందరి వివాహ మాడుననియు నప్పుడొక గొప్ప సభ జరుగుననియు నప్పుడు వేల్పు లందరు రావలయుననియు దేవలోకములన్నియుఁ జాటింపం జేసినది.

దానం జేసి యమ్మహారాజుం జూడ వేడుకపడుచు నా సుముహూర్తమునకు ముందుగనే గరుడ గంధర్వకిన్నర కింపురుష సిద్ధవిద్యాధర యక్ష రాక్షస ప్రభృతులు దేవతా విశేషులు స్త్రీ బాలవృద్ధముగా వచ్చి యలకాపుర మలంకరించిరి. కుబేరుండును వారి కందఱకుం దగిన విడిదెల నియమించి యాచరించెను.

మఱియు -

క. రంభోర్వశీ ముఖామర
   రంభోరుజనంబు నారీష్య రమణీయ కళా
   రంభోత్సాహాంచిత సం
   రంభంబున వచ్చెనమర రాజనుపంగన్,

ఉ. వీణెలఁమూని వచ్చిరరవింద భవప్రభవుండు గానవి
    ద్వాక నిపుణుండు తుంబురుఁ డుదారయశోనిధి విక్రమార్కభూ
    జాని వివాహ లగ్న దివసంబునఁ దన్మహనీయ సాహసో
    పానమిత ప్రతాప సుగణాదుల గానముసేయు వేడ్కతోన్.

వివాహలగ్నం బాసన్నం బగుడు కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుఁడు మదనమంజరీ ప్రబోధితుఁడై నాకంబునకరిగి దేవేంద్రు నడిగి మాతలి సారథికంబగు రథంబు దీసికొని భూలోకంబునకుంబోయి విక్రమార్కమహారాజుం గాంచి లగ్న పత్రిక నిచ్చి విచ్చేయుమని ప్రార్థించుటయు నమ్మహారాజు ఆహా ! వేల్పులెల్ల నన్నుఁ బెద్దఁజేసి యాహ్వానించుచున్నారు. నేనబ్బుండనైనను దద్దయాపాత్రుండనగుటఁ బవిత్రుండనని తలంచుచుంటి నెట్లయిన నమ్మహాత్ములంగాంచి కృతార్థుఁడ నగుటయే లెస్స యని యాలోచించుచు నవ్విమానమునకుఁ బ్రదక్షిణముజేసి మాతలి దత్తంబులగు దివ్యమాల్యానులేప నాంబరాదులు ధరించి సమధికతేజోవిరాజమానుండై యక్కాంచనరథ మెక్కి యొక్క గడియలో నలకాపురంబున కరిగెను.

శంఖారావ భేరీమృదంగాది మంగళ నినాదముతో నతనికి సీమాప్రవేశమున నిదారు సన్నాహము గావించి వేల్పులెల్ల నతండు వలదనుచుండఁ బలవంతమున రతనంపు కెంపుల పల్లకీలోఁ గూర్చుండఁబెట్టి తాము పాదచారులై ముందె నడచుచు రంభోర్వశులు నృత్యము సేయ దుంబురుండు వీణ మేలగింపఁ గిన్నరులను వదింప