కాశీమజిలీకథలు/ఏడవ భాగము/139వ మజిలీ

ఆకథ విని విరతి యబ్బురపాటుతో అతనిమొగము చూడఁ దొడ౦గినది. భూత పత్నియు విస్మయమభినయించుచు సాధ్వీ! నీవుగాజు యనుకొనునది రత్నమైనది. నీవు విచారింపవలదు. నీవు మంచి సౌఖ్యమనుభవింతువని పలుకుచు వారిద్దరిని దన భర్త యొద్దకుఁ దీసికొనిపోయి యావృత్తాంతమంతయు నాభూతనాధునితోఁ జెప్పినది.

అనియెఱింగించి....యిట్లని చెప్పందొడంగెను.

139 వ మజిలీ కథ

యుద్ధముకథ

చక్రవర్తియగు సూర్యవర్మ దేవవర్మపై యుద్దముప్రకటించి తన అల్లుడగుఁ సురూపునిఁ గుమారు కుశునిఁ గొంత సైన్యముతోఁ దోడునంపుమని చంద్రగుప్తునకు యాజ్ఞాపత్రిక పంపినపిమ్మట జంద్రగుప్తుండును విధిలేక వారిద్దరిని జతురంగబలముతోఁ బంపి అనుదినము యుద్ధవార్తల దెలుపుటకు వేగులవారిని బెక్కండ్ర నియమించెను. వాండ్రు పోయివచ్చి రెండవదివసపు సంగరవిశేషము లిట్లు జెప్పందొడంగిరి.

మహారాజా! సూర్యవర్మ బలంబులు నాలుగక్షౌహిణీలు చేరినవి. అతిరధులు మహా రధలు మహావీరులు రణాంగణమంతయు నిండియుండిరి. విచిత్రవ్యూహంబులు బన్ని నొడలెఱుంగక యోధులా యోధన మెప్పుడెప్పుడని తొందరపడుచుండిరి.

దేవవర్మబలము అక్షౌహిణియైనలేదు. యోధులు సందడి యించుకయుఁ గాన రాదు. అట్లైనను వెనుదీయక స్వల్పబలముతోనే సూర్యవర్మతోఁ బోర సన్నద్ధుఁడైన దేవవర్మ ధైర్యసాహసాదులు నరనాధులు కొనియాడఁ దొడంగిరి. ఉభయ సేనలలోని రణభేరుల మహాద్వానంబులు భూనభోంతరాళంబులు బీటలుగావింపుచుండెను. శంఖ కాహళధ్వనులు యోధుల సింహనాదములతో మిళితములై బలములకేఁ జెవుడు గలి గించినవి.

సూర్యవర్మ యిప్పుడైన నీయల్లునిబట్టి యపరాధిగా నాయొద్దకుఁ బంపితివేని యుద్ధ మాపుజేయుదునని దేవవర్మయొద్దకు రాయబారము బంపెను అతండు తిర స్కరించి రాయబారి నవమానించి పంపెను.

దానం గోపించి చక్రవర్తి యుద్ధమునకు నాజ్ఞ యిచ్చినతోడనే వీరులార్చుచుఁ బేర్చిన క్రోధంబున నొక్కుమ్మడి శత్రుబలంబులపైఁ గలిసిరి. శత్రుబలంబును బురి కొనునలుకమెయిం గలియబడి మనసేనలపై వాడిశరంబులఁ బ్రయోగింపఁ దొడం గిరి ఉభయబలంబులకుఁ బెద్దయుద్ధము జరిగినది సముద్రమువోలె విజృంభించి క్రమంబునఁ బరబలంబుల వెనుకకు నెట్టుచుండెను. అందు దేవవర్మ యల్లుఁడఁట. తురగారూఢుండై కరంబున గరవాలంబు బూని మెఱపుతీగెయంబోలె ఖడ్గకాంతులు కన్నులకు మిరిమిట్లు గొలుప విచిత్ర గతులఁ బరిభ్రమించుచుఁ దమబలంబుల నిలిపి శత్రుబలంబులఁ జెల్లెలికట్టవోలె నాపుజేసెను. మన యువరాజుగారు తత్తురగవల్లువిశేషంబు లరసి యందలిమర్మంబు దెలిసికొని నినతురగమును వానిపైకుఁ దోలి కలియఁబడి యుద్ధము చేయుచుండెను. ఇరువురు పెద్దతడవు పోరిరి. తక్కినయోధులెల్లఁ బోరుమాని తద్విశేషములఁ జూచు చుండిరి. జయాజయంబులు తేలలేదు ఇంతలో సాయంకాలసమయమగుటఁ బోరు చాలించి యిరువాగువారును నాయుధంబుల విడి కాల్యకరణీయంబులు దీర్చుకొనిరి. దేవా! యింతటివట్టుచూచి వచ్చితిమి. నేటిఁవిశేషములివి. రేపు వేగులవాండ్రువచ్చి చెప్పగలరు ఈపాటికిశత్రువులు లొంగియుందురు ఆవీరుని కతంబునంగాని కానిచో నిన్ననే కోట వశమైపోవును. రాత్రి గూడ మరల యుద్ధముచేయఁ బ్రయత్నించు చున్నారని యక్కడి కథలెల్ల జెప్పినవిని చంద్రగుప్తుఁడు తదనంతర వృత్తాంతము విన మిక్కిలి తొందరపడుచుండె

మఱునాఁడు యధాకాలమునకు వార్తాహరులు వచ్చుటయు సంభ్రమముతో నాఱేఁడు మనపక్షమునకు జయము గలిగినదియా! యని యడిగిన వాండ్రు దైన్యము దోప మహారాజా! అంతయు వ్యర్థమైనది భూమండలమున నిట్టివిపరీత మెప్పుడును జూచి యెరుంగము. వినుండు. పగలెల్ల పోరి యంతటితో విరమింపక క్రమ్మర రాత్రి యుద్దము ప్రారంభించిరి. మనకు సేనలు చాలగలవుగదా యనుగర్వమే యింత ముప్పుదెచ్చినది.

రాత్రి యుద్ధము ప్రారంభించిన రెండుగడియలకు నొకమహాభూతంబు శత్రుసేనలోఁ జేరి సింహనాదంబు జేసినది. మనబలంబులన్నియు మూర్ఛవోయి కొంతవడికిఁ దెప్పిరిల్లి చూచినంత నాభూతంబు గొండగుహవలె భయంకరమైన నోరు దెరచుకొని యగ్నిజ్వాలవలె నాలుకవ్రేలాడ జీమలవలె మనబలంబుల బాదంబుల రాచుచు దోమలవలె జేతులం జరచి నోటవైచుకొనుచుండెను.

మహారాజా! కుంభకర్ణుని జూచిన వానరులవలె సామంతరాజులు వీరయోధులు కాలుబ౦టులు పికాపికలై యాయుధములు విడిచి వాహనంబుల నుఱికి కిరీటములుజార బట్టలువీడ జుట్టులుగొట్టుకొనఁ ఒకరికొకరుజెప్పక పలకరింపక గాలికొలఁదిపారఁ దొడంగిరి. శత్రుసేనలో నొక్క౦డును జెక్కుచెదరక యుక్కు మిగిలి మనయోధుల వెక్కిరించుచుండిరి. పెక్కేల అర్ధరాత్రమగునప్పటికా రణాంగణము శూన్యమై పోయినది కొందఱు మడిసిరి. కొందరు పారిపోయిరి. కొందరు వాని నోటిలోఁబడి కబళములైరి. చక్రవర్తిం బట్టుకొని కాలిక్రిందవైచి నలిపి చంపెనను వార్త వ్యాపించి నది

ఎవ్వరు మడిసిరో ఎవ్వరు పారిరో లెక్కతెలియదు. వాఁడు బ్రహ్మరాక్ష సుడో భూతమో దయ్యమో తెలియదు. అది మహాప్రళయమువలెఁ దోచినది. రుద్రుండొ భైరవుండొ మృత్యువో యట్టి కార్యము గావించెనని చెప్పుకొనుచున్నారు. అర్దరాత్రముదనుక నట్టిసంహారముగావించి యాభూతమెందేని బోయెను ఇంతవట్టు చూచి పారిపోయివచ్చితిమని చెప్పిరి.

ఆకథవిని పృదివీపతి యురస్తాడనముగావింపుచు కుశుఁడేమయ్యె సుకుమా రుఁడు సేమమా ? అని అడిగిన వాండ్రు దేవా! మాకెవ్వరును గనంబడలేదు. ఎవ్వరి నడుగుదుము మాటాడిన వాఁడువచ్చిమీదఁబడునేమో అని కిక్కురుమనక మెల్ల మెల్లన దప్పించుకొని పారిపోయి వచ్చితిమి. శత్రుసేనదెస వసియించిచూచుటచే మేము బ్రతికితిమిగాని లేకున్న మేమును నీపాటికి శమన లోకాతిధులమై యుందు మనిచెప్పిరి.

పోపొండు మనవారి సేమము తెలిసికొనక వచ్చితిరేల? వారేమైరో తెలిసికొని వేగమరండు అని నియోగించి రాజు ఆ వృత్తాంతము రతితోను ధర్మవతితోను జెప్పి పరితపించుచు దూతలరాకకు నాతురపడు చుండెను.

మరునాఁడు రెండుగడియల ప్రొద్దెక్కునప్పటికి సందేశహరులు వచ్చుటజూచి పౌరులు హాహాకారములు గావించిరి. వాండ్రు రాజనగరకిం బోయి ఱేనింజూచి యేమాటయుం జెప్పునేరక గోలుననేడువఁ దొడంగిరి.

రాజు హృదయము భేదిల్ల ఆ? ఏమీ! దైవమా తలఁచినట్లె జరిగినదియా యని యేడ్చుచుఁ జెప్పఁడు చెప్పుఁడు నా కుమారుఁడును అల్లుఁడును ఆదుష్టరాక్షసునికిఁ గబళములైరా అని అడిగిన వాండ్రు దేవా! మానోటితో దేవరకు దుష్టవార్త జెప్ప వలసివచ్చినది. ఆపాడు భూతము కిరీటములు ధరించిన యోధుల నందఱనుఁనేరిచదియ గొట్టి యిద్దరిద్దరిఁగలిపి కాళ్ళకులంకెలుగట్టి గుదిగా మెడమీఁద వేసికొని తీసికొని పోయినఁదట మనవారినిద్దరింజంపి యొకేలంకెవైచి మెడమీఁదవైచి తీసికొని పోయినట్లు చెప్పినారు మహాప్రభూ! అని గద్గదస్వరములతోఁ జెప్పి యేడువఁదొడంగిరి. నృపా లుండు నేలంబడి యొడలెఱుంగక కొట్టుకొనుచుండెను. మంత్రులు సేదదేర్చి యోదార్చుచు నంతఃపురంబుకుఁ బంపిరి.

అతండు భార్యపైఁబడి వాపోవ ధర్మరతి నిరతిశయ ధైర్యావలంబిమతియై మనోహరా! నీవిట్లేల పరితపించెదవు? సంసారము బూటకనాటకమని నేను మొదటనే చెప్ప లేదా? విషయజరసంబులు అంత విరసంబులు కావా! సంబంధులు రుణసంబంధులు కారా! రతియుఁగుశుఁడు సుకుమారుఁడును గపటముజేసి లవుని విరతింబురంబుబాయఁ జేయలేదా? ఆపాతకమూరకపోవునా? విరక్తులగువారి వియోగమున మీకిట్టి చింతయేల గలుగలేదు. ఈరతియుఁ గుశుఁడు యౌవన మదంబున విర్రవీగుచు నామాటలు పాటింపక ప్రపంచకమేనిత్యమనియు, గామక్రోధాదులు జీవికిఁ దప్పక భరింపఁ దగినవనియు వాదించిరి. ఇప్పుడేమైనది? యేదినిత్యము ఇప్పుడు మీకుఁ బ్రపంచక మెట్లున్నది. అసహ్యముగాఁ గనంబడుచుండలేదా? నాఁడేమంటిరి సర్వదా అట్లే తలంచిన పరితాపము గలుగదుగా! ఇప్పుడైన వేదాంతావబోధము గావించుకొని వన౦బునకుఁ బోవుదము రండు. రాజ్యభోగంబుల విడువుడు. ఇదిమనకు దైవము పకారముగానే కావించెనని యుపదేశించిన విని యజ్జనపతి యప్పలుకులు సరకుగొనక నేలంబడి పొరలుచున్న కూఁతునకిట్ల నియె.

పుత్రీ ! నీభర్త సుకుమారుఁ డసమానపరాక్రమశాలి అనియే విజయముగైకొని పేరుపొంది వచ్చుననియుం గుమారు జతజేసి పంపితిని. ఇట్టి అవస్థ పట్టునని యెఱుఁ గముగదా? వట్టి సేనలంబంపిన గాదనువారెవ్వరు? చక్రవర్తి మెచ్చుకొని మాకే కానుకలిచ్చునని మురిసితిని. అయ్యో? యే భాగ్యము పట్టినదికాదు. ఇప్పుడేమి జేయు దును నిన్నెట్లు భరింతును. ఎవ్వరిఁజూచికొని కాలము గడుపుదును మీ అమ్మ వట్టి వెఱ్ఱిది. మాట్లాడిన సర్వము మిధ్య అడవికిఁ బోవుదములెమ్మని పలుకుచుండును. హా ! పరమేశ్వరా? అని విలపించెను.

అప్పుడు రతియు భర్తృసోదరుల గురించి పరితపించుచుఁ జెల్లలిని, భర్తను నిష్కారణముగా అడవులపాలు సేసినందులకుఁ దనకిట్టి కష్టము గలిగినదన నిశ్చ యించి పశ్చాత్తాపము జెందుచుఁ దల్లి కి నమస్కరించి తనకు వేదాంతోపదేశము జేయుమని కోరికొనినది. అభావే విరక్తి యనేమాట నిక్కువముగదా!

వారట్లు దుఃఖసాగరమున మునింగి పరితపించుచుండ మరిరెండు దినములు గడిచిన పిమ్మట మఱికొందఱు వేగులవారు వచ్చి యిట్లు విన్నవించిరి

మహారాజా! ఆభూతమంతటితో విడువక అమ్మరునాఁ డొక యౌవనపురుషుని తీసికొనివచ్చి చక్రవర్తిసింహాసనమున గూర్చుండ బెట్టినది.

కొత్తచక్రవర్తి మిక్కిలి తేజశ్శాలియై యున్నవాఁడట. హతశేషులైనసామంత రాజులు మంత్రులును ఆతనియానతి శిరసావహించి కార్యకార్యములు చేయుచున్నారు. అతని యాజ్ఞానుసారముగా సహాయము వచ్చి యుద్ధములోఁ జనిపోయిస నృపకుమా రుల పేరులు వ్రాయబడిన పత్రిక యొకటి కోటగోడకు నంటింపఁబడియున్నది. ఆయా సామంతరాజులకుఁ తెలియజేయుడని చక్రవర్తియాజ్ఞ యిచ్చియున్నాడఁట. (డగుత్తికతో) నాపత్రికలో మనవారి యిద్దరి పేరులు వ్రాయఁబడియున్నవి స్వామీ! మేమనాధలమైపోతిమి మహారాజా! అని చెప్పి దుఃఖించిరి.

ఆవృత్తాంతము విని వారి మరణమునకు వగచుచు అపర సంస్కారములు గావించెను.

అని యెఱింగించి....ఇట్లని చెప్పఁదొడఁగెను.

140 వ మజిలీ.

కుశసుకుమారులకథ

అయ్యో? కాలమా ! నాకెంత చెడ్డదానవైతివి. మదీయ చరణసఖపసారిత కిరీటుం డగు విశోకునిచేత గాందిశీకునిఁగావించి భార్యాపుత్రికలతో నన్నిట్లువనములపాలుగావి౦ తువా? హావిశోకా! బాహు బలవిజిత సకల నృపకుమారుండగు సుకుమారుండును నిర్వ క్రమ పరాక్రమ వివశుండగు కుశుండును బ్రహ్మరాక్షషసునిచేఁ జంపఁ బడుటంబట్టిగదా? నన్నిట్లు రాజ్యభ్రష్టుని గావించి పురినుండి వెడలఁగొట్టితివి. అక్కటా కుసుమసుకు మారవతియగు రతియు అత్యంతమృదుగాత్రియైయొప్పు ధర్మరతియుఁ గాళులు పొక్కులెక్క నూర్పుల నిగుడింపుచు నడుగామడ పడపునశ్రమయడర నడుచుచుండు నిడుము జూచి నాయెడదకడు చిదుములై పోవుచున్నదిగదా: సీ! నావంటి అభాగ్యుఁ డెందును లేఁడు కొడుకు లిరువురుం బోయిరి. అల్లుళ్ళు గంతుగొనిరి. రాజ్యంబు శత్రు నృపా క్రాంతమైనది. నగరసుఖంబు లాకాశకుసుమంబులై నవి. పరిజనులు వదలిరి. ఆశ్రితులు విడిచిరి జరతలకెక్కినది. ఇట్టివేళగూడ నేనెట్టి సుఖం బనుభవించుటకుఁ బోవుచుంటినో తెలియదు. ఇఁక మరణము కన్న నాకొండు శరణములేదు. థర్మ రతి చెప్పినమాట లానాఁడు తలకెక్కినవి కావు. ఇప్పుడు స్మరణ వచ్చుచున్నవి. ప్రేయసీ! నాకిప్పుడు మంచిమాటలం జెప్పి యుల్లము నిలువబెట్టుము పుత్రీ! రతీ! నీయవస్థ జూచుచుండియుఁ బ్రాణములుదాల్చియు౦టి నావంటి కఠినహృదయుండెం దైనంగలఁడా యని దుఖించుచు నొక్క చెట్టు క్రిందఁ జతికిలఁబడిన చంద్రగుప్తుని నూరడింపుచు ధర్మరతి యిట్లనియె.

ప్రాణేశ్వరా! కొడుకులును గోడండ్రును గూతుండ్రును మీరు బుట్టినప్పటి కుండిరా ? నడుమవచ్చిరి. నడుమవోయిరి. వారికొరకు విచారమమిటికి ? మొదట నుండియు నేను వారి నస్థిరులుగానే తలంచుచుంటిని. నాకు మునుపుసంతోషమును