కాశీమజిలీకథలు/ఏడవ భాగము/138వ మజిలీ

యెరుఁగనని చెప్పితివి ఇది కడు విపరీతము ఇటు పిలువుము అనుటయు విరతి సిగ్గభిన యించుచు దేవీ! ఇదివరకు నేను బలుకరించి యెరుఁగను. నన్నతఁడును బలుకరింప లేదు. ఇప్పుడేమని పిలుతును, అని సంశయకలితమతియై పలికిన అక్కలికింజూచి భూతపత్ని నవ్వుచు పద పద సిగ్గేల నేనుగూడ వత్తుననుటయు అతఁడు పండుకొని యున్న చెట్టుక్రిందకి నామె నామెందీసికొని పోయినది.

అంతకుమున్నె ఆతండులేచి ప్రక్కను విరతింగానక నలుమూలలు సూచుచు నింతలో వీరిద్దరు వచ్చుటజూచి దద్దరిల్లి అట్టేలేచి యోసరిల్లి యేమియుమాటాడక వింతగా భూతకాంతంజూచుచుండెను.

అప్పుడు విరతి దేవీ ! యితండే నేజెస్పిన యతండు చూడు మనవుఁడు భూత పత్ని దాపునకుఁబోయి చూచుచు నీవెవ్వఁడవు? నీవృత్తాంత మెయ్యది? నీదేకులము నిజము జెప్పుము చెప్పకున్న నిన్నుదండింతుము నిజముచెప్పిన గౌరవింతుము. ఇందు లకే నిన్నీ చిన్నది మాయొద్దకు దీసికొనివచ్చినది. అతండే భూతరాజు నేనతనిపత్నిని మేమిద్దరము ఆపర్వతశిఖరమున వసింతుము. ధర్మపత్నియగు విరతి మూలమున నీతో నింత మెల్ల గా మాట్లాడుచున్నదానను. లేకున్న నాభర్త నిన్నీపాటికి జీల్చి విడుచును నిజము చెప్పము. అని యడిగిన అతండు విస్మయ సాధ్వవిద్యస్తచిత్తుండై చీకాకు పడి నిజము చెప్పక తీరదని యిట్లు చెప్పదొడంగెను.

అని యెఱింగించి ... ఇట్లని చెప్పదొడంగెను.

138 వ మజిలీ.

సుగతునికథ

అమ్మా! నీవు నన్నడిగినంతనే నావృత్తాంతమంతయు స్ఫురించుచున్నది. వినుము శ్రీకంఠనగరంబున వజ్రదత్తుఁడను. రాజు గలఁడు. అతండు సంతాన శూన్యుండై పెద్దకాలము పరితపించుచుండెను. సామ్రాజ్యవై భవసంతోషంబు నణఁగ ద్రొక్కి సంతానరాహిత్య పరితాపంబభివృద్ధి నొందుచుండెను.

ఇట్లుండ నొకనాఁడవ్వీటికి అపరశివావతార మనందగు జంగమదేవర యొకం డరుదెంచి శివాలయములో వసించెను. భూతిరుద్రాక్ష మాలికా విరాజితగాత్రుండు శంఖ ఘంటికాధారుండునై యొప్పుచున్న అతవివేషము జూచినవారికి మహానుభావుండని తోచక మానదు. అతఁడు త్రికాలవేదియనియు రసమూలికా సిద్ధుండనియుఁ బౌరు లద్భుతముగాఁ జెప్పుకొనఁ దొడంగిరి.

ఆవాడుకవిని వజ్రదత్తుఁడొకనాఁ డయ్యోగికడకుఁబోయి స్తుతి పూర్వకముగాఁ దన యభిలాష నెరింగించెను. అయ్యోగి యానృపతి గృపావిలోకనములఁజూచుచు జయశంకర! మృత్యుంజయ! యనియుచ్చరింపుచు రక్షరేకుతో మంత్రభస్మంబిచ్చి మహారాజా! నీవీ భస్మంబు దాల్చుము. నీభార్యకీ రక్షరేకిమ్ము. నీకుఁ దప్పక కొడుకు గలుగును. వానికి జంగమదాసని బేరుపెట్టి పదియారవయేట జంగము వేషము వేయించి శ్రీశైలమునకుఁ దీసికొనిపోయి మల్లి కార్జునస్వామివారికిఁ బేరప్పగింపవలయును. అట్లు జేయవేని ముప్పువాటిల్లఁగలదని చెప్పిన విని యానృపాలుండు స్వామి! మీరిట్టి వర మిచ్చియుండగాఁ జెప్పినట్లు చేయుట యబ్బురమా? తప్పక తమ యానతి వడువునఁ గావించెదను.

అని పలికి అయ్యోగి కేదియో కానుక యీయఁ బోయిన అందుకొనక నిర సించెను. మహాత్ములకు ద్రవ్యాభిలాష యుండదుగదా! వజ్రదత్తుఁడయ్యోగికి నమస్క రించుచు నింటికింబోయి తత్ప్రసాదము భార్యకిచ్చెను.

అయ్యోగి జెప్పినప్రకారము వెంటనే యామె గర్భము ధరించి శుభముహూ ర్తంబున నొకపుత్రుంగాంచినది. అబాలుండు రూపంబున మిక్కిలి కొనియాడఁ దగి యున్నందులకు సంతసించుచు జాతకర్మాది విధుల నిర్వర్తించి వానికి జంగమదాసు అని పేరు పెట్టెను.

అజంగమదాసు దినదినాభివృద్ధి వహించి సర్వజన దర్శనీయుడై యొప్పు చుండెను. వాని నుచితకాలమునఁ జదువనేసి పెక్కండ్ర గురువులనియమించెను. వాని విద్యాగ్రహణశక్తి మెచ్చుకొనఁ దగినదియేకాని యెల్లవారిం దిరస్కరించుస్వభా వము వాని బుద్ధికిఁ గళంకము గలుగఁజేయుచున్నది. విద్యల గ్రహించుచు నొజ్జల వెక్కిరించుచుండును. పురాణములం జదువుచుఁ బూర్వుల నాక్షేపించుచుండును. శివకేశవుల యాలయంబులకుఁ బోవుచు శిలలని విగ్రహములఁ దిరస్కరించు చుండును. పెద్దల నవమానించును. ఈరీతి నారాజపుత్రుండు సర్వజనకంటకుండై సంచరించుచున్న రాజపట్టియగుట నెదుట నెవ్వరు నేమియుననలేక చాటున దిట్టు చుందురు.

రాజును వానిదుండగములు దెలిసియు లేకలేక కలిగిన సుతుండగుట నేమియు మందలింపనేరకవాఁడు కోరినట్లు చేసినట్లు యంగీకరింపుచుండెను. వాఁడు దుండగమునఁదిరుగుచు పెక్కువిద్యలయందుఁ బండితుండయ్యెను. పదియారేడుల ప్రాయమువచ్చినది. అప్పుడు రాజు యోగిమాటదలంచి యొకనాఁడు పుత్రుని లాలిం పుచు నిట్లనియె.

రాజు - వత్సా! నీవు ఒకయోగి వరంబున బుట్టితివి. నీకీప్రాయంబున జంగమవేషమువేయించి శ్రీశైలమునకుఁ దీసికొనిపొమ్మని చెప్పెను. పైడిగంటయు కాంచనశంఖమును పట్టుజోలియుం గట్టించితిని నీవు వానిం దాల్పవలయును. పుత్రుండు - నీవెవరివరంబునం బుట్టితివో చెప్పుము.

రాజు - పరిహాసమాడకుము నేనెవ్వరివరంబునం బుట్టిననేమి ? నాకుఁ గాలము గడిచినదిగదా.

పుత్రుడు - నాకునుగొంత గడచినది. ఈలాటి వెర్రిమాటల నా యొద్దజెప్ప కుము. ఆయోగి యెవరిమూలమునఁబుట్టెను. జన్మమునకుఁ తల్లిదండ్రులేమూలము. వేరెవ్వరునుగారు.

రాజు - అయ్యో ? ఆయోగి అట్టివాఁడుకాడు మహానుభావుఁడు. ద్రవ్యాశలేని వాఁడు.

పుత్రుఁడు - ద్రవ్యాశలేనయట్లే అభినయించుచు బైరాగులు మీవంటివారిని మోసము చేయుచుందురు. మీరు వట్టి అమాయకులుగదా ?

రాజు -- నాయనా! నీవు చిన్నవాఁడవు పెద్దల నధిక్షేపింపకుము అట్లుచేయ నిచో మోసమువచ్చునని కూడ చెప్పియున్నాఁడు సుమీ? తప్పక నీవా వేషము వహింపకతీరదు.

పుత్రుఁడు - చాలు. చాలు. ఇప్పుడు జంగమ వేషము వేయమనెదరు. రేపు మాదిగవేషము వేయమనగలడు. వానిమాట వడువున నడువవలసినదా యేమి ?

రాజు -- బాబూ ! మొదటనే యాయనచెప్పెను. నడువనిచో ముప్పువాటిల్లును సుమీ.

పుత్రుఁడు - అదియేమియో చూతునుగదా ?

ఇఁకజెప్పవలసినదేమియున్నది. తండ్రితో వాఁడు పెద్దతడవు వికటవాదము గావించి అట్టివేషము వేసికొనుటకు అంగీకరింపడయ్యెను. రాజు చేయునదిలేక విచా రింపుచుండెను. కొన్నిదినములు జరిగిన వెనుక దేశాటనము జేయుచుచేయుచు నాజంగమదేవర దైవికముగా నాయూరువచ్చి దేవాలయములో వసించెను.

ఆవార్తవిని భూభర్త అత్యంతభయభక్తి విశ్వాసపూర్వకముగా నతనియొద్ద కుంబోయి అడుగులఁబడి మహాత్మా! నన్ను గృఁతఘ్నుఁగాదలంతురేమో అట్టి వాఁడనుగానుఁ మీరునాకు దుడుకుకొడుకుందయజేసితిరేల ! వాఁడు నాచెప్పినట్లు వినుటలేదు. ఏమికతంబుననోవికటవాదియయ్యె. మీయొద్దకు రప్పింతు మందలింపుఁ డని వేడుకొనియెను.

అజంగమదేవర మందహాసముగావింపుచు నందులకు మీదంపతులు హేతు భూతులు చిత్తచాంచల్యంబునంజేసి వాఁడట్టి వాఁడయ్యెనని పలికి వాఁడు దనయొద్ధకు వచ్చుట కెట్టకే నంగీకరించెను. రాజు పుత్రు బ్రతిమాలికొని అతికష్టమున నయ్యోగియొద్దకుఁ దీసికొని పోయెను.

రాజపుత్రుఁడు రాజసభాభవనంబున నతనికి నమస్కరింపక తిరస్కార భావమున నందుఁ గూర్చుండెను.

జంగమదేవర - నీ పేరెవ్వరు ?

రాజపుత్రుడు - గడ్డముపెంచినతోడనే సర్వజ్ఞత్వము బలియును ఎల్లవారిని నీవు నీవు అని పిలుచుచుందురు గదా.

రాజు - బాబూ నీవు వీరివరంబుననే పుట్టితివి వారు నిన్ను మీరనరాదు పేరు చెప్పుము.

రాజపుత్రుఁడు - పేరా ? జంగమవాసి

రాజు -- అయ్యో ? అట్లుకాదురా జ౦గమదాసురా

రాజపుత్రుఁడు - మీరుపెట్టినపేరది నేనుబెట్టుకొన్న పేరిది

రాజు -- వీరికి నమస్కరింపుము

పుత్రుఁడు - మీరు నమస్కరించితిరి చాలదా. దానికతనమీకు వచ్చినలాభము మీరేకుడువుఁడు నాకు బంచి పెట్టనక్కరలేదు

జంగమదేవర - నీకుఁ దిగినఫలము నీకును బంచిపెట్టెదము కావలమయునా !

పుత్రుడు - (పరిహాసముగా) ఏదోకొంచెము దయచేయుఁడు.

జంగమదేవర - చంకనుజోలియు నొకచేత గంటయు నొకచేత శంఖమును బూని జంగమవేషమునీచేతవేయించి బిచ్చమెత్తింతును చూడుము.

పుత్రుఁడు - అట్టి వేషము నాచేత వేయింతువేని నీవు నిజమైన జంగమ దేవరవే.

జ౦గమ - సరే. యింటికిఁబొమ్ము.

రాజు - మహాత్మా! వీనిమాటలు పాటింపవలదు. మీకు బుత్రుఁడీతడు. నయ శిక్షవిధింపవలయునుగాని భ్రష్టుఁజేయఁదగదుసుఁడీ

అని అతని నుతించుచుండెను. కుమారుఁడంతకుముందేయచ్చోటువాసి నిజనివా సంబునకుఁబోయెను. ఉత్తములఁ దిరస్కరించినపాతక మూరకపోవునా? రాజపుత్రుఁ డింటికిఁ బోయెనో లేదో అంతలో దుర్భరమగు శూలనొప్పి యావిర్భవించి గిలగిల కొట్టుకొనఁ దొడంగెను. పెక్కండ్రు వైద్యులువచ్చి చికిత్సలు గావించిరి. ఇ౦చుకయుఁ బ్రయోజనములేకపోయినది. అప్పటికి వానిచిత్తము పశ్చాత్తాపముజెందినది. జంగమ దేవరమహిమవలనఁ దనకాబాధగలిగినదని నిశ్చయించి రాజపుత్రుఁడు తండ్రిని వేడి కొనియెను. యౌవన విద్యాధసగర్వములు బ్రతుకరాని యంతయాపద గలిగినప్పు డుఁడు గునని పెద్దలు చెప్పుదురుగదా అప్పుడు రాజు వానిమతి రాజసభావంబు విడచి సాత్వి కంబువహించెదనని సంతసించుచు నాందోళిక మెక్కించి వాని నయ్యోగియొద్దకుఁ దీసి కొనిపోయెను.

యోగి జంగమవేషమువేయించికాని నాయొడకుఁ దీసికొనిరావలదని చెప్పెను. అప్పుడు రాజువెనుక జేయించిన కనకఘంటికయు గాంచన శంఖము పట్టుబొంత జోలియు ధరియింపఁజేసి దీసికొనిపోయి మ్రొక్కించిన ఛీ, ఛీ ఈరాజసవేషము పనికి రాదు బిచ్చమెత్తుజ౦గము వేషము వేయింపవలయునని చెప్పటయు రాజు జేగురుగుడ్డతో గుట్టిన బొంతజోలియుఁ గంచుగంట, శంఖము రుద్రాక్షమాలికలు విభూతిరేఖలు ధరి యింపఁజేసి తీసికొనిపోయి అతని పాదంబులఁబడవేసెను.

అప్పుడయ్యోగి - ఓరీ! నీవెవ్వఁడవురా.

రాజపుత్రుఁడు - స్వామీ! నేను జంగమదాసును.

యోగి - ఈజంగమదేవర జంగమదేవరయేనా.

రాజపుత్రుఁడు - స్వామి! బుద్ధివచ్చినది. అపరాధిని రక్షింపుము. ఐశ్వర్య మదమత్తుండనై దుర్వ ర్తనముల మెలంగితిని. తమ శక్తిచే నాబుద్ధిజక్కజేసితిరి. సాధు వర్తనముల మెలంగువాఁడ మీదాసుండను గనికరించి పాలింపుమని మ్రొక్కుచున్నాను.

యోగి - ఇప్పుడు నీకు శూలనొప్పియున్నదా.

పుత్రుఁడు - లేదు మహానుభావా! మీపాదరేణువు సోకినంతనే యటమట మైనది.

యోగి -- నీవీవేషముతోఁ గొంతకాలము బిచ్చమెత్తుచుఁదీర్దాటనము గావింపుము. అప్పుడు నిష్కృతిగలుగును. సాధువర్తనుండవై మెలంగఁగలవు పిమ్మట సౌఖ్యము లందగలవు. అంతదనుక నీమతి వివశమైయుండును. పోపొమ్ము.

అని యానతిచ్చి యాయోగి జపవ్యాసక్తుండయ్యెను. రాజు ఎద్దియో ప్రార్దింపఁ బోయెను కాని వినిపించుకొనలేదు. ఆరాత్రియే జంగమదాసు పురమువిడిచి బిచ్చ మెత్తుచుఁ దీర్థాటనముగావింపుచుండెను.

అని యెఱింగించి యాతఁడో శ్రోతలారా! ఆజంగమదాసేయీ వ్యక్తి యని తెలిసికొనుఁడు మీరడుగుటచే నిప్పుడయ్యుదంత మంతయు స్వాంతమున స్ఫురించి నది. నాఁటిసుత నేఁటిదనుక మనసు వివశయై యున్నకతంబున వెఱ్ఱివానివలె బొలంగి తిని. ఒకనాఁడొకపట్టణంబునకుం బోవుచుండ నన్నందలంబులపై నెక్కించుకొని తీసి కొనిపోయియొకరాజు నాకీచిన్నదానినిచ్చి పెండ్లిజేసెను. అదియంతయు నాకుస్వప్న ప్రాయమై యున్నది. అని ఆతండాత్మీయవృత్తాంతమంతయు నెఱింగించెను. ఆకథ విని విరతి యబ్బురపాటుతో అతనిమొగము చూడఁ దొడ౦గినది. భూత పత్నియు విస్మయమభినయించుచు సాధ్వీ! నీవుగాజు యనుకొనునది రత్నమైనది. నీవు విచారింపవలదు. నీవు మంచి సౌఖ్యమనుభవింతువని పలుకుచు వారిద్దరిని దన భర్త యొద్దకుఁ దీసికొనిపోయి యావృత్తాంతమంతయు నాభూతనాధునితోఁ జెప్పినది.

అనియెఱింగించి....యిట్లని చెప్పందొడంగెను.

139 వ మజిలీ కథ

యుద్ధముకథ

చక్రవర్తియగు సూర్యవర్మ దేవవర్మపై యుద్దముప్రకటించి తన అల్లుడగుఁ సురూపునిఁ గుమారు కుశునిఁ గొంత సైన్యముతోఁ దోడునంపుమని చంద్రగుప్తునకు యాజ్ఞాపత్రిక పంపినపిమ్మట జంద్రగుప్తుండును విధిలేక వారిద్దరిని జతురంగబలముతోఁ బంపి అనుదినము యుద్ధవార్తల దెలుపుటకు వేగులవారిని బెక్కండ్ర నియమించెను. వాండ్రు పోయివచ్చి రెండవదివసపు సంగరవిశేషము లిట్లు జెప్పందొడంగిరి.

మహారాజా! సూర్యవర్మ బలంబులు నాలుగక్షౌహిణీలు చేరినవి. అతిరధులు మహా రధలు మహావీరులు రణాంగణమంతయు నిండియుండిరి. విచిత్రవ్యూహంబులు బన్ని నొడలెఱుంగక యోధులా యోధన మెప్పుడెప్పుడని తొందరపడుచుండిరి.

దేవవర్మబలము అక్షౌహిణియైనలేదు. యోధులు సందడి యించుకయుఁ గాన రాదు. అట్లైనను వెనుదీయక స్వల్పబలముతోనే సూర్యవర్మతోఁ బోర సన్నద్ధుఁడైన దేవవర్మ ధైర్యసాహసాదులు నరనాధులు కొనియాడఁ దొడంగిరి. ఉభయ సేనలలోని రణభేరుల మహాద్వానంబులు భూనభోంతరాళంబులు బీటలుగావింపుచుండెను. శంఖ కాహళధ్వనులు యోధుల సింహనాదములతో మిళితములై బలములకేఁ జెవుడు గలి గించినవి.

సూర్యవర్మ యిప్పుడైన నీయల్లునిబట్టి యపరాధిగా నాయొద్దకుఁ బంపితివేని యుద్ధ మాపుజేయుదునని దేవవర్మయొద్దకు రాయబారము బంపెను అతండు తిర స్కరించి రాయబారి నవమానించి పంపెను.

దానం గోపించి చక్రవర్తి యుద్ధమునకు నాజ్ఞ యిచ్చినతోడనే వీరులార్చుచుఁ బేర్చిన క్రోధంబున నొక్కుమ్మడి శత్రుబలంబులపైఁ గలిసిరి. శత్రుబలంబును బురి కొనునలుకమెయిం గలియబడి మనసేనలపై వాడిశరంబులఁ బ్రయోగింపఁ దొడం గిరి ఉభయబలంబులకుఁ బెద్దయుద్ధము జరిగినది సముద్రమువోలె విజృంభించి క్రమంబునఁ బరబలంబుల వెనుకకు నెట్టుచుండెను.