కాశీమజిలీకథలు/ఏడవ భాగము/136వ మజిలీ

రాజు - అప్పుడందెవరైన నుండిరా?

సురస - ఎవ్వరునులేరు‌. ఒంటరిగాఁ జూచియే వాఁడువచ్చెను.

రాజు -- నీభర్తకు నీయందిష్టమేనా?

సుర - ఇష్టమే.

రాజు -- నీకతనియందో?

అగ్ని --- మహారాజా ! గ్రామాధికారి యేదో వ్రాసినట్లున్నవాఁడు వారిమాటయే మన్నించుచున్నారుకాని మా గౌరవ మించుకయుఁ దలంచరైతిరి. బాల్యచాపల్య౦బున మఁగడనినఁ బెదరుచున్నది. కాని యిష్టము లేకేమి?

రాజు -- ఓహో? పండితుఁడవని గౌరవింపుచుండ సయుక్తముగా మాట్లాడు చుంటివే సైరింపను జుడీ! ఆమెయే చెప్పవలయును. మీరు మాటాడఁగూడదు.

అగ్ని - నాకుఁ దెలియదు క్షమింపుఁడు.

ఆమాటకు సురసఏమియుఁ బ్రత్యుత్తరమిచ్చినదికాదు. అప్పుడారాజు ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. దీనింజూచి ఆతండు మోహింపవచ్చు వీఁడుచక్కని వాఁడు వీనింజూచి సురసయు మోహింపవచ్చు. సురసమాటల యందుఁ చాల వ్యత్యా సమున్నది పరస్పర విరుద్ధవిషయములు జాల గలవు అల్పుఁడు నిశ్చయము తెలియకుండ అన్నిటికిఁ నొడంబడుచున్నాడు. వీనిమది వెరపున్నట్లే తోచదు. అతండు జాల విద్వాంసుఁడు. విరక్తుఁడువలెఁ గనంబడుచున్నాఁడు ఏదినిశ్చయించుటకు మనసు పోవకున్నది వీరిద్దరిలో అపరాధి యెవ్వరో తెలియదు. నిక్కముగాఁ దెలిసి నంగాని శిక్షింపరాదు. అని పెక్కుగతుల నాలోచించి వెండియు ఱేపువిచారింతు మనియు అప్పటికి వారందరని రప్పింపుమనియు నియమించి దేవవర్మ నాఁడుసభ చాలించి అంతఃపురమున కఱిగెను.

అని యెఱింగించి

136 వ మజిలీ.

యమునకథ

యమున - సఖీ! వినతా! నవ్వుచున్నావు. వింతలేమైన జూచితివాయేమి ఆచేతనున్న పత్రిక యేమి?

వినత - ఇది మీతండ్రిగారు ప్రకటించినది ఒక వింతయగు అభియోగంబున నిజము తెలిసికొనఁజాలక అందలి సత్యము ప్రత్యక్షముగాఁజూసి జెప్పినవారికి వేయి దీనారములు కానుకగా నిత్తునని ప్రకటించిరి.

యమున - అంత తెలియఁబడని అభియోగ మెక్కడనుండి వచ్చినది.ఆందలి విషయము నాకుఁ గొంచెము చెప్పెదవా? వినత - నేను జెప్పనక్కరలేదు. అంతయు సంక్షేపముగా నిందే వ్రాయఁబడి నది చూచికొనుము. అని పత్రిక చేతికిచ్చుచున్నది.

యమున - (చదివి) విమర్శించి ఇందలి నిజము నేను జెప్పఁ గలనుసుమా.

వినత - అట్లైన నాకానుక నీకే రాగలదు.

యమున -- అల్పుడేపాటి చక్కనివాఁడో సురస యెంతయందగత్తెయో చూచి వచ్చి నాకుఁ జెప్పగలవా?

వినత --- సరి, సరి ఇదివరకే చూచితిని అల్పునిరూపముసామాన్యమని చెప్ప? జాలను. రాచబిడ్డలకైన నాసౌకుమార్యము ఆతేజము ఆచక్కఁదనము గలిగియుండదు. మన్మధునికైన లోపమున్నది కాని వానికిలేదు. వాని ముఖవిలాసము జూఁడ జక్రవర్తి బిడ్డఁడని తోచక మానదు. భర్తృదారికా! కులశీలాదులు తెలియమి ననఁగూడదు కాని వానింజూచిన నీవుగూడ మోహమందెదవు సుమీ?

యమున --- సురసయో?

వినత -- చక్కనిదే కాని వాని అందమునకు సరిపడదు.

యమున - అట్లైన సురసయే మోసకత్తెవలెఁ దోచుచున్నది నిజము తెలిసి కొని పారితోషిక మందనా!

వివత - అబ్బో ! ఈలాటిమాట అందరుఁ జెప్ప గలరు. రాజుగారికిఁ బ్రత్యక్షము జూపవలయునఁట.

యమున - చూపకున్న నాబుద్దిబలమును గొనియాడకుము.

వినత - అటైన నయ్యగారితోఁజెప్పి తీసికొనిరానా?

యమున - పోయి చెప్పుము.

అనుటయు నది అతిరయంబునం బోయి పుడమిఱేని కత్తెఱఁగెఱింగించినది. నరపతి అపరిమితానందముతో గొమార్తె అంతఃపురమునకువచ్చి పట్టీ ! వినతతో నీవేమో చెప్పితివఁట సత్యమే? అందెవ్వరిది అసత్యమో యదార్దము చూపగలవా అని యడిగిన యమున నవ్వుచు దండ్రీ! ఆఁడుదానిదేతప్పు మగవాని యందేదోషము లేదు. వాంగ్మూలము లన్నియుఁ జదివితినని పలికెను.

అప్పుడు ఱేఁడు అట్లనుట కవకాశము లేదు. సురస స్వభావమును గురించి అయ్యగ్రహారమందే కాక ప్రాంత గ్రామములందను బరిశీలింపఁ జేసితిని ఇంచుకయైన దోషారోపణ మెవ్వరును జేసియుండలేదు. పత్రికలం జదివి దోషురాలనిన నాకుఁ దృప్తిగా నుండునా? ప్రత్యక్షము జూపవలయు అదియుంగాక అల్పుఁడు కులశీలా దులు తలిదండ్రులనుఁజెప్పఁడు తప్పుజేసినట్లొప్పుకొనుచున్నాఁడు. వాఁడేయపరాధియని మనమేల ధ్రువపరచరాదు. అని యడిగినఁ గుమార్తెదండ్రీ అంతదనుక సురస నియమవంతురాలే వానింజూచినతోడనే తత్కాలమున దాని మనసు తిరిగియుండ వచ్చును. కావలసిన నీకు బ్రత్యక్షమ జూపెద నేజెప్పినట్లు చేయింపుమని చెవులో నేదియో జెప్పినది. రాజు మిగుల సంతోషించుచు అప్పుడ కొల్వుకూటమునకుఁ బోయి మంత్రులతో నాలోచించి వాది ప్రతివాదుల రప్పించి అందరు వినుచుండ రాజ శాసన ప్రకారము ప్రధానమంతి అగ్నివర్మకిట్ల నియె.

విప్రోత్తమా! మీరు తెచ్చిన తగవులో నిదమిద్దమని నిరూపించుటకు నాలో చింపవలసియున్నది. కావునఁ బదిదినములు మీరందఱునిందే యుండవలయును. మఱియు సురసయు అల్పుఁడును నీపది దినములు నొరులుతో మాట్లాడఁగూడదు. పగలెల్ల వారింజెరియొక గదిలోనుడిచి యొరులతో మాట్లాడకకుండఁ జేసెదము. రాత్రులు వారియిష్టమువచ్చినట్లు పోవవచ్చును. అది బందీగృహము కాదు. దివ్యభవనము ఆప్రాంతమందై నను నితరులుండ గూడదు. ఈ పది దినములు గడచిన పిమ్మటఁ తీరుపు జెప్పుదురు అంతదనుక గడు వేరుపఁబడినది అని యుపన్యసించిన విని అగ్నివర్మ కొపోద్దీపితమానసుండై యిట్లనియె.

దేవా! అపరాధుల శిక్షించుట న్యాయముగాని అనపరాధులనుగూడ నిర్భంధ ముంచుట న్యాయవిరుద్ధముగాదా? అల్పుని నిర్భంధవాసములో నుంచుఁడు సురస నుంచఁగూడదని చెప్పుచుండగనే రాజభటు లితని గెంటుకొనిపోయిరి. యేమిచేయుటకు శక్యముగాక తుదకట్లుచేయుట కంగీకరించి పూడకాపుగా సురస నప్పటి కింటికిం దీసి కొనిపోయెను.

మరునాఁడు రాజపురుషులు సురసను సగౌరవముగా బండిపై నెక్కించి యొక భవనంబునకుఁ దీసికొనిపోయి లోపలఁ బ్రవేశ పెట్టి తలుపులువైచి పోయిరి. ఆయిల్లు మిక్కిలి అలంకార శోభితమై యున్నది. చదుపుకొనుటకుఁ గావలసినన్ని పుస్తకము లున్నవి తినుటకు నాహారపదార్థములు గలవు గాన సాధనములు గలవు. రత్న పీఠ ములు, డోలికలు పుష్పమాలికలు నెన్నేని బరిమిళద్రవ్యములు గలవు. ఆగదిలోఁ గూర్చుండి సురస గొంతసేపు సంగీతము పాడుచుఁ గొంతసేపు పుస్తకములు చదు వుచు గొంతసేపు డోలికలనూగుచుఁ గొంతసేపందుగల వింతలం జూచుచు వినోద ముగాఁ గాలక్షేపము జేయుచుండెను.

సాయంకాలముకాగానే రాజపురుషులవెంట అగ్నివర్మ బండిమీఁద అక్క డికి వచ్చి పుత్రికం దీసికొనిపోవుచుండును. సురస సంతోషముతో అందుఁగల వినోదములఁ దండ్రి కెఱింగించుచుండును. ఈరీతి రెండుమూఁడు దినములు గడచిన తరువాత నొకనాఁడు సురస యాగదిగోడలన్నియు విమర్శించుచు నొకదెస నొకగవాక్షము తలుపుండుటఁ జూచి దానితాళముపట్టి లాగినది. అది యూడివచ్చుటచే దాని యరదీయుటకు శక్యమైనది. పిమ్మటఁ దలుపు తెరచినంత అవ్వలి నిట్టిదే మఱి యొకగది గనంబడినది. ఆగదిలోను దనగదిలోనున్న వింతవస్తువులన్నియు నొప్పు చున్నవి.

ఓహో! రాజభటులు దీని బీగమువైచుట మరచిరి. దానంజేసి నాకిది తెరచు టకు శక్యమైనది. ఇందేమి విశేషము లున్నవియో చూచెదంగాక యని దాని తలుపు పూర్తిగాఁ దెరచి తలయెత్తి లోపలికిఁ దొంగిచూచినది. ఆగదిలో అల్పుఁడు ఒక పీఠముపైఁ గూర్చుండి కన్నులు మూసికొని ధ్యానించుచుండెను.

వానింజూచినంత సురసకు మేనుఝల్లుమన్నది. రోమాంఛముదయమైనది. చెమ్మటలుక్రమ్మి కంపమావిర్భవించినది. ఒక్కింత తడవు ధ్యానించి కన్నులు మూసికొని తలయూచుచు నలుమూలలు పరికించి యితరుల కందుండుట సాధ్యము కాదని నిశ్చయించి యావరణ దాపున నిలువంబడి వానికి వినిపించునంతట మందస్వ రముతో అల్లన నిట్లనియె.

ఓసుందరపురుషా! నాఁడు నామాట వినకపోవుటచేత గదా! నీకీ అవస్థ వచ్చి నది. నీవంగీకరించిన నిన్ను నా ప్రాణమునం బెట్టుకొని కాపాడక పోవుదునా? నాకుఁ బదివేల దీనారములు వెలగలనగలున్నవి. అవి యన్నియు నీకు తక్కిపోవును. నామన సింతదనుక నెవ్వరియందును వ్యభిచరింపలేదు. నీయందు సక్తమైనది. కారణమేమియో చెప్పఁజాలను. నిన్ను శిక్షింపవచ్చునాయని రాజు నన్నడిగినప్పుడు మీచిత్తమంటినికాని శిక్షింపమనుటకు నోరువచ్చినదికాదు అనన్యపూర్వనై నిన్ను వరించి గౌఁగిలి యాసించిన ద్రోసివై చితివి. నీకంటెఁ గఠినాత్ముడుండునా? నీవు బురాణము వినుచుండ నిన్నుఁజూచి విరాళి గుందికుంది యాగలేక నీళ్ళుదెచ్చు నెపం బున నీవెనువెంట వచ్చితినికా:దా నామాటకెదురుజెప్పినందులకుఁ గోపమువచ్చి యింత జేసితిని. నీవు నిజము చెప్పక నేరముజేసి నట్లొప్పుకొనుట నాయందుఁగల మక్కువ చేతనేయని గ్రహించితిని. కోపమంతయుఁ బోయినది. నీమదియుఁ దిఱిగియుండును ఏమిజేయుదును? అంటించిన తరువాత నార్పుట గష్టముగదా? కానిమ్ము గతము విచారింపరాదు. ఇప్పుడైనను నీవంగీకరించినచో నీయభియోగము దప్పిందెద. మనము దేశాంతరముపోయి సుఖింతము ఇటు చూడుము నేను నీయందమునకు సరిపడి యుండలేదా యేమి? ఈగవాక్షము దాపునకువచ్చి యొక్క సారి ముద్దువెట్టి వెళ్ళుము అని యేమేమో విరహాతురతయై సంభాషించిన విని అల్పుడు కొంత సేపామెదెసఁ జూడక సారెసారెకు జీరుచుండ విసిగి తలయెత్తి యిట్లనియె. తల్లీ! నీవు బ్రాహ్మణివి. గురుపుత్రికవు. పరకాంతవు తుచ్చ భోగములకాశించి శీలమేమిట బాడుజేసికొనియెదవు ఇంతవరకు శుద్దురాలవని యెల్లరు జెప్పుకొన నొప్పి యిప్పుడీ తొందరయేమిటికి? మలమూత్ర పూరితమై మేదో మాంసరుధిరాస్తి నికాయంబగు నీకాయంబునఁ జక్కఁదనంబున నేమియున్నది. వస్తుతత్వం బింత విచారించిన నీమదియిట్టి చంచలము నొందదుగదా! నీభర్త విద్వాం సుఁడు రూపవంతుఁడు కులీనుఁడు యౌవనవంతుఁడు నీశృంగారలీలలన్నియు నతని యందుజూపక నిరయహేతువులైన చెయ్వులకుఁ బూనితివేమిటికి? చాలుఁజాలు చిత్తము మరలించుకొనుము మరణమైనను నంగీకరింతునుగాని దుష్కార్యమునకు నొడంబడనని పలికిన నక్కలికి పండ్లు పటపట గొరుకుచునిట్లనియె.

అల్పుఁడా? నీవు నీబుద్ధికి సరిసడిన పేరు పెట్టుకొంటివి. నీవు చదివితివిగాని అనుభవము లేదు. వినుము.


శ్లో. అభికామాం స్త్రీయంయచ్చగమ్యాం రహీసి యాచితః
    నోపైతి నచ ధర్మేషుభ్రూణహత్యుచ్య దేబుధైః

అత్యంతాసక్తితోఁరహ్యస్యమందు దన్ను వరించి యాసించివచ్చిన స్త్రీని బొందక నిరసించిన పురుషుఁడు భ్రూణహత్యను బొందునని ధర్మ శాస్త్రములలోఁ జెప్ప బడియున్నది నీవు నాచిత్తము నుత్సాహాయత్తముగావింపుము. దానంగలుగు దోషము నిన్నుఁ బొందకుండ నేనుభరించెదను. విరక్తుల మాటలాడకుము. రసా భావము చేయకుము నన్ను రక్షింపుము. అని మిక్కిలి దీనత్వమున ప్రార్థించిన నతండిట్లనియె.

అమ్మా! నీవు జదివిన శ్లోకమునకుఁ నర్థమదికాదు గమ్యాం అని యున్న పదమున కర్దమేమి? పొందదగిన‌ యువతి అని అర్థము నీవు నాకు గమ్యవెట్ల గుదువు కావున నీబుద్ది మరలింపుకొనుమని యుత్తరమిచ్చిన నచ్చిన్నది నవ్వుచు నిట్లనియె.

సౌమ్యా ! నేను జదువురాని దాననుగాను గమ్యాం అనగా ముసలిది. రోగము గలది. అందములేనిది. ఈలాటి దుర్లక్షణములు గలస్త్రీ గమ్యగాదు గనుక గమ్యాం అని వ్రాసినాఁడు. గమ్యాం అనగా అందమైనది యౌవనవంతురాలు తనకంటె జిన్నది. తనకునన్నిటకు సరిపడినది. అని అర్ధము అట్టి దానను నేనుగానా? నావిద్య పాటవము నీకుఁ తెలియదు నన్నుఁ దిన్నగాఁజూడనే చూడవు. నాసౌందర్యము నీకెట్లు

తెలియు మఱియును.


శ్లో. రాజ్యే సారం వసుధా వసుధాయా మపిపురం పురె సౌధం
    సౌధె తల్పం తల్పె పరాంగనాంగ సర్వస్వం
    సంసారె సురతం సారం సర్వలోక సుఖప్రదం
    తన్న కుర్వంతి యెమూఢా సైనరాః పళవః స్మృతాః.

రాజ్యమందు సారమైనది భూమి. భూమియందు సారమైనది పట్టణము. పట్టణమందు సారమైనది మేడ. మేడయందు సారమైనది తల్పము తల్పమందు సార మైనది నిండుజవ్వనమందుండి సర్వావయవ సుందరిఅగు పూవుబోణి అంగసర్వస్వ మని చెప్పఁబడియున్నది. సంసారమునకు సారము సురతము. అనుకూలమగు దాంపత్యము కుదిరిపంగాని అదిసురస మనిపించుకొనఁదు. ఇప్పుడైనం దెలిసినదా? అని అడిగిన విని ఆతండు చెవులు మూసికొని నీవింతచదివితివే నిన్ను శృంగా రసలాలసవు కావని యెల్లరు జెప్పుకొనుచున్నారు నీభర్త చక్కనివాఁడు. గదా! అతనియం దేమిటకివిరక్త వైతివి సన్యాసిని నన్నేలగామించితివి అనుటయు నయ్యువతి అతనిని మెచ్చుకొని లెస్సగా నడిగితివి. ఇందులకు సమాధానము చెప్పవలసినదే విను౦డు.


శ్లో. హరణీశశయోర్యోగె బడబావృష యోస్త ధా
    హస్తినీ హయయౌశ్చైవ రతం సమరతంత్రయం.

అని వాత్స్యాయన మహర్షి వ్రాసిన విషయము మీరెఱింగియే యుందురు. అందు మాకు జాతిస్వభావ కాలాదులవలన వైషమ్యము గలిగినది దానంజేసి నాభర్త యెంతచక్కనివాఁడైనను నాకనుమతింపఁడు. నీవనుమతించితివి. కావున నన్నుఁ బరిగ్రహింపుము. అని కోరిన నతం డిట్లనియె.


శ్లో. నిరయమున వైచికాల్చినఁ
    జెరసాలం బెట్టికొట్టి చీల్చినగానీ
    పరకాంతఁ గూడనొల్లను
    తెరవా! యిది మంచిసతుల తెరవా? చెపుమూ?

నీవునాకుఁ తల్లివి. నీకుఁ బదివేల నమస్కారములు గావించుచున్నాడ నన్నిఁక బల్కరింపకుము నీ నేరమేమియు నెఱింగింపక రాజుగావించు శిక్షకుఁ బాత్రుండ నయ్యెద నవ్వల బొమ్ము అని పలికి పెడమోహము పెట్టి మాటునకుం బోయెను.

అప్పుడప్పఁడతి లజ్జాక్రోధవిషాదమేదురహృదయయై యేమియుం జేయఁజాలక భుజంగియుంబోలె రోజుచు నవ్వలబోయి వాని నెట్లైన కఠినశిక్షకుఁ బాత్రునిగా జేయఁదలంచి అ౦దులకుఁదగిన కల్పనలనాలోచించినది. ఇంతలో సాయంకాల మగుటయు నగ్నివర్మ రాజపురుషులతో బండియెక్కి యాయిక్క కరుదెంచి తలుపులు తీయించినంత వెక్కివెక్కి. యేడ్చుచుఁ గూరుచుండెను.

అప్పుడగ్నివర్మ అమ్మా! ఒంటరిగానుండ జుడిసితివా? ఊరడిల్లుము, ఈఱేడు మనపై వైరముగట్టి యున్నట్టు పొడగట్టు చున్నది. కానిచో నిరపరాధినివగు నిన్నేల నిర్భంధవాసంబున నుంచెడిని అపరాధులతోఁగూడ వాదుల బాధించు నృపతులుందురా? ఇతండు గావించిన యన్యాయము సామంత చక్రవర్తియగు సూర్యవర్మతో జెప్పు కొనుఁడని కొందరు ప్రోత్సాహపరచుచున్నారు. ఆవిషయ మాలోచింతము పోవుదము రమ్ము. అని యూరడించిన విని యవ్వనిత కన్నీరు దుడిచికొనుచు నిట్ల నియె.

తండ్రీ! నాకు రాజుగావించిన నిర్బంధమువలన మరియొకముప్పు వాటిల్లి నది. అయ్యల్పుని నాగదిలో నుంచినది యెరుగక యీ గవాక్షము తలుపెద్దియోయని తెరచి చూచితిని వాఁడు నన్నుఁజూచి ప్రొద్దుటనుండియు విరహార్తిగుందుచుఁ గొంతదనక స్వయముగఁ బ్రార్థించి యంగీకరింపమి నోటికిరాని దుర్భాషలాడి రాళ్ళరువ్వఁబోయిన తలుపు వేసికొంటిని గడియ పడకపోవుటచే మరియు మరియు ద్రోయుచు రట్టు గావించెను. వానికిఁ దగిన శిక్షవిధించినంగాని నేగుడవజాలనని పలికి యాగురుతులు జూపించినది.

అగ్నివర్మ తలుపు తెరచి యవ్వలిగదియం దల్పుని జూచిపండ్లు పటపట కొరుకుచుఁ గానిమ్ము నిన్నింతటితో విడువను. తుచ్చా? ఇప్పుడైన సిగ్గురాలేదా? ఇంకను దుర్భాషలాడుచుంటివిగా! ఇలాటి భూభర్తలు పాలించుచుండుటచే నీయాట లిన్ని నాళ్ళుసాగినవి. అని నిందించుచు రాజపురుషుల కివ్విషయము బోధించి సాక్ష్య ముగా నుండుఁడనికోరి యప్పుడే సురసను నింటికిం దీసికొనిపోయెను.

అని యెటింగించి చెప్పందొడగెను.

137 వ మజిలీ

దేవవర్మకథ

అమ్మా! నీ బుద్దిబలము మిక్కిలి కొనియాఁడదగియున్నది. సందిగ్ధాభియోగ మున యధార్దము జూపి హృదయగ్రంధియగు సందియము. పోగొట్టితివి. నాకీర్తినిలిపి తివి సురస కౌటిల్యము అల్పుని సౌజన్యము మాటుననుండి కన్నులారాజూచితిని. చెవులారావింటిని. ఇప్పుడు సురసకుఁగావించుదండనము నల్పునికిఁగావించు గౌర వము నీవేనిరూపింపుము నీవెట్లు చెప్పిననట్లు కావించెద. మరియు నీకేదియేని మనః ప్రియమగు కార్యంబు గలిగిన నొడువుము అకార్యమైనను గావింతునని యత్యుత్సా హముతోఁ బలికిన దేవవర్మకు యమున యిట్లనియె.