కాశీమజిలీకథలు/ఏడవ భాగము/135వ మజిలీ

కేవలము విరక్తురాలనిన నేనొప్పుకొనను. మగఁడుతక్క నన్నిటియందు నాసక్తురాలే. దానికిఁ తెలియనిపనిలేదు గ్రంధములన్నియు నన్వయించును. పురాణ గాధలు జక్కగా బోధించును. ఒరులకుఁ బతివ్రతాధర్మములు జెప్పును. ఈపురుష ద్వేషత్వము మనప్రారబ్దము గాఁబోలునని చింతించిన నాబ్రాహ్మణుఁడు పోనిమ్ము దానినేమియుననవలదు. నాకది యారవప్రాణము. అని యుగ్గడించెను. ఆప్రథ గ్రామమ౦తయు వ్యాపించినది. సురసకుఁ బురుషవాంఛ లేదని యాఁడు వాండ్రం దఱు నిశ్చయపరచిరి.

ప్రవరుఁడు అత్తమామల యాదరము తలంచియు సురససౌందర్యము దలం చియు నాయూరు విడువనేరక యెప్పటికై నను దానికి బుద్ధి తిరుగునేమోయను నాసతో సురస వెనువెనుక దిఱుగుచుఁగాలక్షేపము చేయుచుండె.

అని యెఱింగించి.

135‌ వ మజిలీ

అల్పునికథ

అగ్నివర్మయొకనాఁడు తన వీధిచావడిలోఁ గూర్చుండి కొందరుశోత్రులు చుట్టు నుం బరివేష్టింప భారతము శాంతిపర్వము చదువుచు నర్థము చెప్పుచుండెను. అట్టి తరి బదియారేఁడుల ప్రాయముగలిగి సర్వావయవసుందరుండగు నొక యువకుండు ప్రచ్ఛన్నముగా భూసంచారము చేయుచున్న మదనుండో అన నొప్పుచు ధూళిదూ సరిత శరీరుండై నను నులినాంబరధరుడై నను దేజము తొలంగక అచ్చటికివచ్చి అం దొకచోటం గూర్చుండి శ్రద్ధాభక్తులతోఁ బురాణము వినుచుండెను. అందు,


శ్లో॥ గార్హస్థస్యచ థర్మస్య యోగథర్మస్యచోభయో?
     అదూరసంప్రస్థితయోః కింస్విచ్చేయః పితామహః॥

గృహస్థుని ధర్మమునకును యోగిధర్మమునకుఁ జాల వ్యత్యాసము గలిగి యున్నది. ఒండొంటికిఁ జాలదూరము. వానిలో మోక్షమునకు ముఖ్యమైన మార్గ మేది. పురుషుఁడు దేనినాచరించి శ్రేయస్సునుబొందునో చెప్పుమని ధర్మరాజు భీష్ము నడుగుటయు నతండిట్టు చెప్పెను.


శ్లో॥ ఉభౌ ధర్మౌ మహాభాగా వుభౌపరమ దుశ్చరౌ
     ఉభౌ మహాఫలౌతౌతు సద్భిరాచరితావుభౌః॥
     అత్రతేవర్తయిష్యామి ప్రామాణ్య ముభయోస్తయోః

ధర్మరాజా! గార్హస్థ్యము యోగధర్మముగూడఁ బరమోత్తమములైన ధర్మములు ఆరెండును మోక్షమునకు ముఖ్యమార్గములు రెండును గష్టపడి యాచరింప దగినవి. రెండును మహాఫలముల నిచ్చునవి. సత్పురుషులు రెంటిని నాచరించి ముక్తినిఁ బడసి యున్నారు ఒకదాని కొకటి తీసిపోవదు. అని వానిగుఱించిన యుపాఖ్యానముల నెరిం గించి భీష్ముఁడు థర్మరాజు మనస్సంశయమును బోగొట్టెను.

ఆకథ అంతయు విని యాచిన్నవాడు లేచి అగ్నివర్మకు నమస్కరించుచు మహానుభావా! నేఁడు నామనంబునంగల సందియమంతయుం దీర్చితివి. నేను గృహస్త థర్మముకన్న యోగథర్మ మధికమని తలంచువాఁడ. అమృతప్రాయమైన పురాణ వాక్యము వినిపించి నా సందియముదీర్చితివి. సంతోషమైనదని స్థుతియించుచున్న వానింజూచి అగ్నివర్మ బాలుఁడా? నీదేయూరు! నీపేరేమి? కులమెయ్యది? ఎందుబోవు చున్నాడవని అడిగిన వాఁడిట్ల నియె.

అయ్యా! నాపేరల్పుఁడందురు. నాతలిదండ్రులెవ్వరో యెఱుంగను. కులగోత్ర ములు మునుపే తెలియవు. ఏకాకినై తీర్థయాత్రలు సేవింపుచున్నఁవాడ. నేఁడు మంచి వాక్యము లుపదేశించి శ్రోత్రానందము గావించితిరి. కృతార్ధుండనై తినని పొగడుటయు నాభూసురుండు వానిసుగుణసంపత్తికి సంతసించుచు బాలుఁడా. నీమాటలు విన విర క్తుండవువలెఁ గనంబడుచుంటివి. నీకుత్సాహమేని కొన్నిదినంబులిందుండి పురాణము వినుచుండుము మఱియు నీమనస్సందియములన్నియుఁ దీరఁగలవు. మాయింటఁ గుడు చుచు నీయిచ్చవచ్చినన్ని దినములుండుమని పలికిన విని సంతసించుచు నాఅల్పుఁడు వారింటనుండి పురాణమువినుచు శ్రీశుకుఁడోయనఁ జూచువారలకుఁ దోచుచు గొన్నిదిన ములు గడిపెను.

ఒకనాఁ డగ్నివర్మ కూఁతురు సురస కుతనకాలంబున నెండలో నూరున కించుకయెడముగానున్న నూతికి నీరుదేరనరిగి కొంతసేపటికిఁ దలవిరియఁబోసికొని యొడలు జీరికలతో భీభత్సవేషముగ్రాల గోలున నేడ్చుచు నింటికివచ్చి తండ్రి పాదం బులంబడి గద్గద స్వరముతో నిట్లనియె.

తండ్రీ! నీవుపండితుఁడవే కాని లోక జ్ఞానము లేనివాఁడవు. అల్పుని కులశీల నామంబులు దెలిసికొనక యింటం బెట్టికొందువా ! అల్పుఁడల్పుఁ డేయయ్యెను. వాఁడు వట్టిటక్కరి ఆనీచుఁడు నన్నుఁ గామించి తిరుగుచున్న వార్త నాకుఁ దెలియదు. నేను బిందె తీసికొని మంచినీటిబావికిఁ బోయితిని నావెనువెంటవచ్చి నేను నీరుతోడుచుండ జవ్వనీ నీవుమృదువైనదానవు. నీరుతోడిన నీచేతులు కందఁగలవు నేను దోడెదఁ జేద నిమ్మని అడిగెను. నేనామాటవిని విశ్వాసమున కట్లనుచున్నాడని తమ్ముఁడా వలదు. నాకు దీనశ్రమలేదు ఎండలోవచ్చితివేల? ఇంటికిబొమ్మని చెప్పితిని;. వాఁడు కదలక ఇటునటు చూచుచు నెండలో నితరులం దెవ్వరు లేకపోవుట నవసమెఱింగి తరుణీ ! నీమగడిందున్న వాఁడుగదా. నీకతనియం దిష్టములేదని విన్నాను. శుష్కోపవాసములచే నీ యౌవనమిట్లు పాడుచేసికొనుచుంటివేల? నిన్నుఁ జూడఁజూడ నాయెడద జాలిగలుగుచున్నది. గతించినయౌవనము తిరిగి రానేరదు. ఈపరువ మంతయు రిత్తవో నిటెవిరక్తిఁ దిరుగుట లెస్సగాదు. అని యేమేమో యసందర్భ ప్రలాపములాడి తుదకుఁ దన్నుఁ గూడుమని పలుకుచు దాపునకువచ్చి చేదఁబట్టికొని గౌఁగలింపబోయెను.

తండ్రీ! పైవార్త నీతో నేమనిచెప్పుదును కొప్పుపట్టుకొని నడుముదిగిచి చేతుల లాగుచుఁబెక్కుచిక్కులంబెట్టెను. కేకలువైచితిని. దాపుననెవ్వరునులేరు. పెద్దతడవు నకుఁ జేతిపట్టుతప్పించుకొని యెట్లో పారిపోయివచ్చితిని. నాయొడలంతయు నెట్లు చీరెనో చూడుము నాప్రారబ్ధము, పరపురుషునిచే నిట్టియలయిక బొందింపఁబడితిని. ఇఁక నాదేహము కాల్పనా అని పలుకుచు నేడువఁదొడంగినది.

ఆమాటలువిని అగ్నివర్మ ఆ? ఏమీ? అల్పుఁడే నిన్నట్లుచేసినది? ఔరా? ఎంత టక్కరివాఁడు. భారతమువినుచు వేదాంతగోష్టి వచ్చినప్పుడు కన్నులు నానందభాష్ప ములఁ గార్చుచుండునే. సెబాసు అల్పుఁడా! గురుపుత్రినినే పట్టనెంచితివిరా? కృతఘ్నా! అని తిట్టుచు దల్లీ! ఈఎండలో నొంటిగా దూరమందున్న నీటికేమిటికిఁబోయితివి? నీవఱిగినవి మీయమ్మయెఱుఁగదఁటే. కానిమ్ము ఆతుచ్చుఁ డెందున్న వాఁడో చెప్పుము. వానినిప్పుడే కట్టి అధికారి కప్పగించెదనని అడిగిన నాపడఁతి యిట్లనియె.

తండ్రి! వాఁడు నన్నుఁ బరిభవించి నాచేఁ దిరస్కరింపఁబడి యా తోటదెసకుఁ బారిపోయెను ఆప్రాంతమందే యుండునని యెఱింగించిన విని ఆతండట్టెలేచి దుడ్డు కఱ్ఱ చేతంబూని విద్యార్థుల వెంటఁబెట్టుకొని యాతోటల వైపునకఱిగి నాలుగుదెసలు పరికించెను.

ఒక పొలములో నొకచెట్టుక్రిందఁ గూర్చుండి యేదియో ధ్యానించుచున్న అల్పునింజూచి యగ్నివర్మ కోపావేశముతో కృతఘ్నా! ఇన్నిదినములు మాయింటఁ గుడిచి నాపుత్రికబట్ట నుద్యోగించితివిరా. ఛీ! ఛీ! నీమొగము జూచిన మహాపాతకము రాఁగలదు. మన్మధునివంటి పెనిమిటిమొగమే చూచినదికాదు. ఆజన్మబ్రహ్మచారిణి నాకూఁతు నియమము నీవేమెఱుంగుదువు నిన్నువలచు ననుకొంటివిరా మూఢా! నీనక్క వినయముజూచి నిన్ను విరక్తుఁడవనుకొంటి ద్రోహుఁడా! అని యెన్నియో నిందావాక్యములాడిన విని యల్పుఁడేమియు మాటాడక తలవంచుకొని కన్నీరు విడువఁ జొచ్చెను. బెల్లము గొట్టినరాయివలె మాట్లాడక యేడ్చుచుంటివా? అని అగ్నివర్మ దుడ్డు కఱ్ఱతో వానినెత్తిమీదగొట్టిన గాయమై రక్తముగారఁజొచ్చినది. విద్యార్దులు భయపడుచు నారక్తమద్దియద్ది పట్టులువైచి యెట్లో యాగంటుస మాటుపెట్టిరి. అల్పుఁడు గంటు బాధ యెక్కుడుగానున్నను లెక్కసేయక వారిమాటలకేమియు సమాధానము జెప్పక మౌనముద్ర వహించి యుండుటంజూచి అగ్నివర్మ యానతిపై విద్యార్థులతని ఱెక్క లుగట్టి గ్రామాధికారియొద్దకుఁ దీసికొనిపోయి వాఁడు చేసిన యపరాధమంతయుం జెప్పి వానికి దగిన శిక్షవిధింపుమని కోరిరి.

ఆగ్రామణియుఁ దనబుద్దిబలమంతయు వినియోగించి యాయభియోగము విచా రించి డోలాయితహృదయుండై యేమిచేయుటకుం దోచక యేదియో తీరుపువ్రాసి తనపై అధికారియగు మండలాధిపతి యొద్దకనిపెను. ఆమండలాధిపతియు నాయభి యోగమంతయు నిమర్శించి కర్తవ్యాంశము గ్రహింపనేరక అప్పుడు రాజుగానున్న దేవవర్మ అను నృపతియొద్ద కనిపెను.

ఆదేవవర్మ యొకసామంతరాజు మణిచక్రమను నగరంబున కధినాయకుండై న్యాయంబునఁ ప్రజల బాలింపుచుండెను.

ఆతనిదేశము చిన్నదైనను దాను సామంతరాజై నను ప్రజాపాలన కౌశల్యం బునంజేసి అతనికీర్తి దిగంతవ్యాప్తమైనది. ఆతండు దండ్యులవిడువకుండ నదం డ్యుల శిక్షింపకుండ నపరాధముల విమర్శింపుచుండెను. స్వల్పాపరాధములనై నను బెద్దగా విచారించి నిజముదెలిసికొని శిక్షలు విధింపుచుండును.

ప్రభువు ననుసరించియే క్రిందియధికారులు జాగరూకతతో నభియోగముల విచారించి యపరాథులనేకాక యసత్యసాక్షులఁ గూడ శిక్షింపుచుందురు. దానంజేసి అసత్యాభియోగములు సాధారణముగా న్యాయస్థానములకుఁ దేనేతేరు తెచ్చినచో దాని మూలకందకముత్రవ్వక యధికారులు విడువరు.

ఒకనాఁడు దేవవర్మ పేరోలగంబునుండి అభియోగము విచారింపుచుండెను. మంత్రి అగ్నివర్మదెచ్చిన అభియోగపత్రికలఁ జేతంబూని చిరునగవుతో రాజుంజూచి దేవా! ఇదియొక వింతయగుతగవు గ్రామాధికారియు మండలాధిపతియు, నిందలి నిజంబు దెలిసికొనలేక వారు తీరుపుజెప్పక మనయొద్ద కనిపిరి. దేవర చక్కగా విచా రించి నిజము దెలిసికొనవలయునని పలికిన విని రాజు వి‌స్మయ మభినయించుచు న్యాయ వేత్తలిరువురకును దెలిసినదికాదా. దాని ప్రచారమెట్టిదో చదువుమని అడిగిన నతండిట్లు చదువుచున్నాడు

దేవయజనాగ్రహారము కాపురము ప్రవరునిభార్య సురస (వాది) అగ్నివర్మ (అనువాది) అల్పుఁడనువాడు (అపరాధి) అగ్నివర్మ తనయింట భారతము జదువుచుండగాఁ నల్పుఁడను వాఁడువచ్చి వారింటనుండుటయు సురసను వరించి బావియొద్ద బలవంతము జేయుట నల్పుని బలవంతమునగట్టి గ్రామాధికారి యొద్దకు దీసికొనివచ్చి వానియపరాధ మెఱింగిం చుటయు లోనగు విషయంబులన్నియుఁ జదివి వినిపించెను.

గ్రామాధికారి తీరుపు.

వాదిప్రతివాదులిద్దురు చక్కనివారు. యౌవనవంతులు ఇరువురు శృంగారలీలా భిరతులగుట కేమియు సందియములేదు. వాడిమాట లటుండనిండు. అనువాదియగు నగ్నివర్మ శ్రోత్రియుఁడు. అసత్యమాడువాఁడుకాడు. అతని మాటలన్నియు నమ్మఁదగినవియే. మఱియు సురస ఆజన్మశుద్దురాలని గట్టి ప్రతీతి గలదు. ఇన్ని యుం దలంచి యాచిన్నవాని మొగముజూచినంత నాస్వాంతమున వాఁడు నిరపరాధి యని గట్టిగాఁ దోచుటంజేసి పుత్రియపక్షపాతియగుట నగ్నివర్మ అందుకు స్త్రీస్వభా వమగుట సురసయందును దోషమాపాదించుకొని వాని శిక్షించుటకు నిర్ధారణ చేసికొన లేకపోయితిని. అపరాధియగు నల్పునిదెస సాక్ష్యమేమియు లేకపోవుటచేత వాని విడిచి సురసను శిక్షించుటకు వీలుపడినదికాదు. కావున నీయభియోగమున సత్యాసత్యముల నిశ్చయించు సామర్థ్యము నాకు లేకపోయినది. దేవర విచారించి చిత్తానుసారము గావింప బ్రార్దించుచున్న వాఁడ అని వ్రాసి యాగ్రామాధికారి మండలాధిపతియొద్దకా అభియోగమును బంపివేసెను.

అని చదువుటయు దేవవర్మమొగము జేవురించి గ్రామాధికారి యింత బుద్ది సూన్యుఁడయ్యెనేమి? అగ్నివర్మ సత్యసంధుఁడనియు సురస ఆజన్మశుద్ధురాలనియు వ్రాయుచు నల్పుని మొగము జూచినంతనే వాఁడు నిరపరాధియని తోచినట్లు వ్రాసి యున్నవాఁడు వానిదెస సాక్ష్యమేమియు లేదఁట నిరపరాధత్వము మొగమున వ్రాయఁ బడి యుండునా యేమి? ఛీ, ఛీ, గ్రామాధికారి శుద్దబుద్దివిహీనుఁడు శోత్రియపుత్రికం గవయదలంచిన పాపాత్ముని చేతులు తఱిగింపక కాలయాపనముగాఁ బై అధికారి యొద్ద కనిపెనా! చాలుజాలు ఏదీ అల్పుని వాంగ్మూల మెట్లున్నదో తీసి చదువుము. అని చెప్పిన విని బాంత్రి చిత్తము చిత్తమని యాపత్రికనెత్తి యిట్లుచదువుచున్నాడు.

నాకులగోత్రములు నాకుఁ దెలియవు. నాతలిదండ్రు లెవ్వరో నేనెరుఁగను నాజన్మభూమి తెలియదు. నేనొక సన్యాసివంటివాఁడ నాకు నల్పుఁడను పేరు తలిదం డ్రులు పెట్టినదికాదు. నరమృగ పశుపక్షిక్రిమికీటకాదుల కంటె నల్పుండనని తలంచి యల్పుఁడని నేనేపేరు పెట్టుకొంటిని. భారతమువినుచు నీవిప్రునింటఁబదిదినములు నివ సించితిని. ఆ బ్రాహ్మణుని తండ్రి యని పిలుచుచుంటిని. తరువాత వృత్తాంతము నే జెప్పఁజాలను. యౌవన మన్నివికారములం గలిగించును. వావులు దెలియనీయదు. ఇంద్రియగుణ౦బులు విద్వాంసునైన మోసముజేయును. నేనీయపరాధము జేయటకుఁ జేయకపోవుటకు నావశమా? దై వమేయట్టి బుద్ది పుట్టించును. నన్నుఁ దప్పక శిక్షింప వలసినదే సురసయందించుక దోషములేదని నేనొప్పుకొనుచున్నా ను. అని చదువునంత నమ్మహికాంతుఁడు నిలు నిలు పిమ్మటఁ జదువనవసరములేదు. అన్నిటికి వాఁడొప్పు కొనుచుండ గ్రామాధికారికీ సందియమేలఁ గలుగవలయును. అని యాక్షేపించిన నృప తికి మంత్రి యిట్ల నియె.

దేవా! గ్రామాధికారియొక్కఁడే పొరపడలేదు మండలాధిపతియు వానిబుద్ధితో నేకీభవించెనే? అని చెప్పిన నయ్యెకిమీఁడు ఔను ఆమాట మరచితిని. వాని వ్రాఁతఁ కూడఁ జదువుము. ఆజాల్ముల కధికారమిచ్చినవాఁ డెవ్వఁడు? అని వారి౦ దిట్టుటయు నణచివైచి మంత్రి మఱల నిట్లు చదువుచున్నాడు.

అగ్నివర్మ శ్రోత్రియుఁడగుగాక సురస మహాపతివ్రత యగుఁగాక అల్పునిదెస సాక్ష్యము లేకపోవుఁగాక నాకును గ్రామాధికారికిం బోలెఁ చిత్తము డోలాయితమగు చున్నది జవరాండ్ర చిత్తములు క్షణక్షణమునకు మారుచుండునని శాస్త్రములు చెప్పు చున్నవి. మగనియందు ద్వేషముగలవారే పరపురుషులయం దనురాగము గలిగి యుందురు. వ్రాయవలసి వ్రాసితినిగాని ఆమాటయు నేను ధ్రువపరచను. దేవర చిత్తానుసారముగావింపఁ బ్రార్దించుచున్నవాఁడ. అని మంత్రి మండలాధిపతి వ్రాసిన తీరుపుచదివి వినిపించెను.

రాజుముక్కుపై వ్రేలిడుకొని ఔరా? నిస్సంశయమైన విషయమందు వీరికీ సందియమేల గలుగవలయును? స్త్రీలకంటె మగవాండ్రే చంచలులు కులగోత్రాదులు దాచి మారుపేరు పెట్టికొని దుర్జనులు గూఢముగా సంచరించుచుందురు. నాకుఁ జూడ వాడట్టివాఁడుగాఁ దోచుచున్నవాఁడు. కానిమ్ము ఇద్దఱిబుద్దియు నొక్కత్రోవం బోయి నదిగదా! అందేదియో విశేషముండకమానదు. పత్రికలంజూచి తీరుపుఁ జెప్పగూడదు. మొదటినుండియు నీయభియోగము విచారించవలసియున్నది. అందఱిని రప్పింపుము. జాగు సేయఁగూడదు. మనదేశమున బ్రాహ్మణులు విచారింపఁగూడదు. ఇందులకు మూఁడుదినములు గడువిచ్చితినని చెప్పి యారాజుకొలువు చాలించి యంతఃపురమున కరిగెను.

మంత్రియామూఁడవనాఁటి యుదయమునకే వారి నందఱిధర్మస్థానమునకు వచ్చు నట్లాజ్ఞానపత్రికలఁ బంపుటయు నందరు నట్లెవచ్చి హజారమున వేచియు౦డిరి. ఆవిచిత్రాభియోగ వృత్తాంతము విని ప్రజలు పెక్కండ్రువచ్చి సభ నలంకరించిరి. నాఁడు దేవవర్మ కొల్వుకూటమునకు వచ్చినతోడనే ప్రధాని మొగముజూచి యాబ్రాహ్మణులు వచ్చిరా? వారియభియోగము విచారింపవలయు. సర్వము సిద్ధముగా నున్నదియా? యని యడిగిన నతండు దేవా! అందరువచ్చియున్నారు. విచారింపవచ్చు ననియుత్తరముచెప్పెను.

అప్పుడా మహారాజు తొలుతనేయల్పునిఁ బిలిపించెను. అల్పుడు రాజునెదుటకు వచ్చి నమస్కరించెను.

రాజు - నీ వెవ్వడఁవు?


అల్పుడు.శ్లో. నాహందేహో నేంద్రియాణ్యంతరంగః
                నాహంకార ప్రాణవర్గో న బుద్ధిః
                దారపుత్రక్షేత్ర విత్తాదిదూరః
                సాక్షినిత్యః ప్రత్యగాత్మా శివోహం.

రాజు - స్వగతము. ఆహా! వీని సౌందర్య మా సేచనకమై యున్నది. మాటలు మిక్కిలి ప్రగల్భముగా నున్నవి. మనోహరమైన వీనిమొగము జూడ నాకును బుద్ది మారిపోవుచున్న దేమి? కానిమ్ము ప్ర॥ మాయెదుట వేదాంతములు పనికిరావు యదా ర్దము చెప్పవలయును.

అల్పుఁడు - నేజెప్పినదే యదార్థము

రాజు - సరే అటుండు (అని చెప్పి సురసను అగ్నివర్మను పిలిపించి) సురసంజూచి స్వ॥ అబ్బా! ఇబ్బిబ్బోకవతియు వింతరూపున నొప్పుచున్నదిగదా! వీరిరువురుఁ జూఁడదగినవారే ఒండొరులువరింప దగియుండిరి ప్ర॥ ఈచిన్నదాని తండ్రియెవ్వరు?

అగ్ని - మహాప్రభూ ! నేను. నాపేరు అగ్నివర్మయందురు. అగ్నిహోత్రములు సేయుచు సత్కాలక్షేపము సేయుచుండు నాకీ ముప్పు వాటిల్లినది దేవా! యెన్నఁడు రచ్చకెక్కి యెరుఁగను. నాకు లేక లేక యీబిడ్డపుట్టినది మీరు తండ్రులుగనుక చెప్పు చున్నాను. దీనికి మగవాళ్ళనిన నసహ్యము సిగ్గువిడిచి చెప్పుచున్నాను. పురుష వాంఛ యేలేదు. ఆజన్మశుద్ధురాలు. మాగ్రామాధికారికి మాయందు విరోధము. ఆతుచ్చుడు మంచివాఁడనియు నాబిడ్డ చెడ్డదనియు వ్రాసి పంపినాఁడట. మండలాధిపతి యతఁడే మనిన నట్లే వ్రాయుట వాడుకయఁట స్వామీ ! మమ్ము వృధాచిక్కులు పెట్టి త్రిప్పి త్రిప్పి చంపుచున్నారు? ధర్మస్వరూపులైన యేలినవారు మాకు న్యాయము దయచేయఁ బ్రార్దించుచున్నాను.

రాజు - భూసురో త్తమా! మీరు పండితులుగదా! సాక్షియనఁగానేమి? అగ్ని -- సాక్షాద్రష్టాసాక్షి. కన్నులారా చూచినవాఁడు సాక్షియనియర్ధము, వ

రాజు --- సరిగానే చెప్పితిరి. మీకూఁతు నల్పుఁడు గోరుచుండఁగా జూచినవా రెవ్వరు?

అగ్ని --- సరి. సరి అది అబద్దమాడునా! సత్యసంధురాలు స్వామీ! దానిమాట శిలాశాసనమువంటిది తప్పక నమ్మదగినదే అదియునుంగాక నే నెన్నఁడైనను బొంకి యెరుఁగుదునా నామాటయెందైన దమకు విశ్వాస ముండనక్కరలేదా?

రాజు - మీరు చూసితిరా!

అగ్ని - ఆ. చూచినట్లె.

రాజు - 'నట్లు' పనికిరావు. చూడవలయు.

అగ్ని - అగ్నిహోత్రసాక్షిగా నిజమని చెప్పఁగలను

రాజు - ఇప్పుడు వీని నేమిచేయమందురు?

అగ్ని --- శిక్షాస్మృతిలోఁ జెప్పినట్లు చేతులు తరుగవలయు బ్రాహ్మణపుత్రికను అధమకులుఁడు కామించిన నేమివ్రాయఁబడినదో చూఁడుడు. వీడు మహాపాపాత్ముఁడు పది దినములు మాయింటఁగుడిచి పురాణము వినువాఁడుంబోలె నభినయించిన నిజమను కొంటిని రాజా!

రాజు - అల్పుఁడా! నీవేమనియెదవు?

అల్పుఁడు -- న్యాయశాస్త్రప్రకారము తప్పుజేసిన వానినిశిక్షింపఁమనుచున్నాను.

రాజు --- నీవు తప్పుజేసితివా?

అల్పుఁడు - సందేహమేలా?

రాజు - నిన్నుఁ దండింపవలసినదేనా?

అల్పుడు --- సందేహమేమిటికి?

రాజు -- ఏమిటి కట్టితప్పు జేసితివి.

అల్పుఁడు - ప్రారబ్ధ శేషంబునంబట్టి.

రాజు - దేవీ! నిన్నీ యల్పుఁడు గామించినమాట వాస్తవమే?

సురస - (తలవంచుకాని) వాస్తవమే?

రాజు -- -వీనిని శిక్షింపవచ్చునా?

సురస - దేవర చిత్తము.

రాజు --- సురసా! నిన్నితఁడెట్లు కామించెనో చెప్పుము.

అగ్ని - తరచితరచి మీరట్లడిగిన సిగ్గువిడిచి యేమిచెప్పెడిని ఆడువాండ్రు సభలలో మాటాడగలరా? నావంటి వానికే వణఁకు వచ్చుచున్నదిగదా! రాజు -- జరిగిన యదార్థము చెప్పక తీరదు.

అగ్ని - అమ్మా భయమేల నిజము చెప్పము.

సురస - (తలవంచుకొని నేల బొటనవ్రేల వ్రాయుచుఁ నేను నూతికిబోవు చుండగా వెనుకనేవచ్చి నోటితో నీలవైచిన నేదియో కూయుచున్నదని వెనుకతిరిగి చూచితిని వీఁడు నావెనుక వచ్చుచుండఁ జూచితిని.

రాజు --- తరువాత.

సురస - మరల అటుతిరిగి అఱుగుచుండ బాలా! నిలు నిలు మను ధ్వని వినఁబడినది అప్పుడు భయపడి వడిగా నూతి యొద్దకు బోయి నీరుతోడుచుండ వీఁడు నా దాపునకు వచ్చి ముద్దియా ముద్దియ్యవా! అని యడిగిన అర్థము జేసికొన లేక ముద్ద యనగా నేమియని అడిగితిని.

రాజు - అంతకు ముందుఁ బురాణము వినుచుండ మీయింట నెప్పుడైన వీనిం జూచితివా?

సురస - చూచిన జ్ఞాపకములేదు.

రాజు --- వీఁడు నిన్నెరుఁగునా!

సురస - ఎరుగబట్టియే వెంటవచ్చెను.

రాజు -- నీవీ యగ్నివర్మ కూతుఁరవని యెరుంగునా!

సురస - ఎరుఁగునో యెరుఁగడో నాకు దెలియదు.

రాజు --- నీమాట విని వీఁడేమి జేసెను.

సురస - ముద్దగాదు ముద్దు అదియిమ్మని అడిగితిని. ఇత్తువా? యని యుత్తరము జెప్పెను.

రాజు --- తరువాత నీవేమంటివి?

సురస - నీచా! నిన్నేమి జేయింతునో చూడుము. నాశీలము దెలియక యిట్లు పలికెదవా? అని పలికి అందు నిలువక పారిపోయి వచ్చి మాతండ్రితోఁ జెప్పితిని.

అగ్ని -- అమ్మా! గౌఁగిలిమాట జెప్పుము.

రాజు - ఆ. ఆ మీరేమియు మాటాడఁగూడదు.

అగ్ని -- నాతోఁ జెప్పినది లెండి అందుమూలమున జ్ఞాపకము చేయు చున్నాను గ్రామాధికారి దగ్గిర కూడ జెప్పినది వ్రాసినాఁడు చూడుఁడు.

రాజు --- మీరు ఛాందసులు, ఏమాటనవలయునో తెలియదు ఊరుకొనుఁడు పుత్రీ! పిమ్మట నేమిజేసితివి.

సురస -- జ్ఞాపకమువచ్చినది. నేనింటికిఁ బోవుచుండగా నడ్డము వచ్చి గౌఁగ లింపఁబోయెను. తప్పించుకొని పారిపోయితిని. రాజు - అప్పుడందెవరైన నుండిరా?

సురస - ఎవ్వరునులేరు‌. ఒంటరిగాఁ జూచియే వాఁడువచ్చెను.

రాజు -- నీభర్తకు నీయందిష్టమేనా?

సుర - ఇష్టమే.

రాజు -- నీకతనియందో?

అగ్ని --- మహారాజా ! గ్రామాధికారి యేదో వ్రాసినట్లున్నవాఁడు వారిమాటయే మన్నించుచున్నారుకాని మా గౌరవ మించుకయుఁ దలంచరైతిరి. బాల్యచాపల్య౦బున మఁగడనినఁ బెదరుచున్నది. కాని యిష్టము లేకేమి?

రాజు -- ఓహో? పండితుఁడవని గౌరవింపుచుండ సయుక్తముగా మాట్లాడు చుంటివే సైరింపను జుడీ! ఆమెయే చెప్పవలయును. మీరు మాటాడఁగూడదు.

అగ్ని - నాకుఁ దెలియదు క్షమింపుఁడు.

ఆమాటకు సురసఏమియుఁ బ్రత్యుత్తరమిచ్చినదికాదు. అప్పుడారాజు ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. దీనింజూచి ఆతండు మోహింపవచ్చు వీఁడుచక్కని వాఁడు వీనింజూచి సురసయు మోహింపవచ్చు. సురసమాటల యందుఁ చాల వ్యత్యా సమున్నది పరస్పర విరుద్ధవిషయములు జాల గలవు అల్పుఁడు నిశ్చయము తెలియకుండ అన్నిటికిఁ నొడంబడుచున్నాడు. వీనిమది వెరపున్నట్లే తోచదు. అతండు జాల విద్వాంసుఁడు. విరక్తుఁడువలెఁ గనంబడుచున్నాఁడు ఏదినిశ్చయించుటకు మనసు పోవకున్నది వీరిద్దరిలో అపరాధి యెవ్వరో తెలియదు. నిక్కముగాఁ దెలిసి నంగాని శిక్షింపరాదు. అని పెక్కుగతుల నాలోచించి వెండియు ఱేపువిచారింతు మనియు అప్పటికి వారందరని రప్పింపుమనియు నియమించి దేవవర్మ నాఁడుసభ చాలించి అంతఃపురమున కఱిగెను.

అని యెఱింగించి

136 వ మజిలీ.

యమునకథ

యమున - సఖీ! వినతా! నవ్వుచున్నావు. వింతలేమైన జూచితివాయేమి ఆచేతనున్న పత్రిక యేమి?

వినత - ఇది మీతండ్రిగారు ప్రకటించినది ఒక వింతయగు అభియోగంబున నిజము తెలిసికొనఁజాలక అందలి సత్యము ప్రత్యక్షముగాఁజూసి జెప్పినవారికి వేయి దీనారములు కానుకగా నిత్తునని ప్రకటించిరి.

యమున - అంత తెలియఁబడని అభియోగ మెక్కడనుండి వచ్చినది.ఆందలి విషయము నాకుఁ గొంచెము చెప్పెదవా?