కాశీమజిలీకథలు/ఏడవ భాగము/118వ మజిలీ

కౌరవ్యుఁడు శత్రువులచేఁ బట్టువడెనని తరువాత వార్తలు వచ్చినవి. నాగకాంతల నెల్ల నిప్పుడే దేవరవారి యంతిపురమునకనిపి వచ్చితినని‌ యయ్యుదంతమంతయు నెఱి గించెను. ఆకథవిని విభీషణుడు శోకసంభ్రమాశ్చర్య వివశుండై ప్రహస్తా ? శత్రు హస్త గతుండై కౌరవ్యుం డెంతచింతించునో మనకాప్తుండై యిట్టి యిక్కట్టు జెంద దగునా? యితర వీరసహాయంబునం గాక యేలాపుత్రునకును నందుగల రాత్రించరులకును మనల నెదిరించు పరాక్రమ మెక్కడిది ? వారి శౌర్యదైర్యాదులు మనమెఱుంగనివియా? అవీరుఁడెవ్వడో తెలిసికొనవలసియున్నది. కానిండు నాగకాంతల జెఱఁబడ కుండఁ దీసికొని వచ్చితిరి గదా? మనము తగుప్రయత్నమునఁ బోలు కౌరవ్యుని మఱవ రాజ్యపదస్థునిఁ జేయవలసియున్నది. మన వీఁటంగల సేనలనెల్ల సిద్ధ పఱచి యుంచుము. ఈఱేయి మదభీష్టదేవతం బ్రార్థించి శుభాశుభ ఫలంబులం దెలిసికొనియెదనని ప్రహస్తునకు నియమించి విభీషణుండంతటితో సభచాలించి నాగకాంతల నూరడింప నంతఃపురమున కఱిగెను. అని యెఱింగించి మణిసిద్దుఁ డంతలో వేళ యతిక్రమించుటయు కథఁ జాలించి యవ్వలి మజిలీయందు తదనంతరోదంతం బిట్లని చెప్ప దొడంగెను.

118 వ మజిలీ.

తేజోవతి కథ

అమ్మా ! ఊరడిల్లుము. కౌరవ్యున కేమియుఁ గొదవరానీయరు. మాతాతగారు రెండుమూఁడు దినములలోఁ బోయి యేలాపుత్రుని బుత్రమిత్రకళత్రాదులతోఁ జెరసాలం బెట్టించెదనని శపధము జేసిరఁట వింటివా? మాతాత యెదుట నిలువఁబడు వీరు డెందును లేడు. గొప్పవారికే యాపదలు. తొల్లి మాపెద తాతవలన సీతామహాదేవి యెట్టి యిడుమలం బడినది. నీవు కంటఁ దడి పెట్టిన మాగుండెలు పగిలి పోవుచున్నవి. నీకేలోపమును లేదు. ఈ రాజ్యము నీదిగా భావింపుము మేము జిన్నవారము నీకుఁ జెప్పువారమా? మొదట వారికిని మీకును నీతగవేమిటికి వచ్చినది. యావృత్తాంతము జెప్పుము. అని యంతఃపురమునఁ జంపక తేజోవతి తల్లియగు పద్మావతి నూరడించుచు నడిగిన గన్నీరు దుడిచికొని యామె యిట్లనియె.

పుత్రీ ! మీయిల్లు నాకుఁ గొత్తదికాదు. నీతల్లికి నీ సుగుణంబులు చూచు భాగ్యము లేకపోయినది. నీతల్లియు నేనును దగ్గరచుట్టములము. వెనుక నామెతో నొక తేప నీలంకాపురికి వచ్చితిని. నన్ను బ్రాణపదముగాఁ జూచినది నీవు చిన్నదానవైనను నంతకంటె నెక్కువగా నాదరించుచుంటివి మా వృత్తాంతము జెప్పెద నాకర్ణింపుము పాతాళలోకము నీవెప్పుడును చూచియుండలేదు. భూలోకమున కడుగున నున్నది. ఈ భూమియే దాని కాకసము. సూర్యసంచారములేమిం జేసి యంధకారమైయుండును. అత్తిమిర నివారణమునకై బ్రహ్మ ప్రతిసర్పమునకు శిరంబున రత్నము‌ బ్రకాశించు నట్లుఁజేసెను. పర్వతములయందు నున్నత ప్రదేశములయందును గొప్పరత్నములు వెలుఁగు చుండును. వానికాంతులు సూర్యప్రభను మించియుండును. అందు రాత్రిం బగళ్ళ వివక్షతలేదు. నాగకాంతలు మిక్కిలి‌ చక్కనివారు నందనవనమును మించిన యుపవనంబు లనేకములు గలవు. స్వర్గవాసులకు బలెఁ బాతాళవాసులకు గూడ జరా రోగములు లేవు. భోగమునకు నాకము తరువాతఁ బాతాళమునే చెప్పదగినది. దానం జేసియే యిందు గలవారికి భోగులని పేరువచ్చినది.

రసాతలమంతయు నాలుగు రాజ్యములుగా విభజింపఁబడి యున్నది. వానిలో మారాజ్యమే పెద్దది. తక్షకవంశస్థుల కెప్పుడు మాయందు విరోధము గలిగియున్నది నాగులలో వాసుకి వంశస్థులే సాత్వికగుణముగలవారు తక్కిన వారందఱు రాక్షసకృత్యములు గల వారు విషపూరితముఖులై లోకులకు వెరపుగలుగఁ జేయుచుందురు. వారిం బాటింపక నాభర్త కౌరవ్యుఁడు న్యాయంబున రాజ్యము పాలించుచుండెను.

ఒకనాడు రేవతియను నాదాది యత్యాశ్చర్యముతో నాయొద్దకువచ్చి అమ్మా! మన యుప్పరిగపైనున్న హంసతూలికా తల్పంబున ననల్పతేజంబున బ్రకాశించు శిశువుతోఁ గూడ నొక చేడియ బండుకొనియున్నది. ఎవ్వతెవు. అని యెంత పిలిచినను పలికినది కాదు. నిద్రజెందియున్నది కాఁబోలు నీవు వచ్చి చూడుము. అని పలికిన విని నేను సత్వరముగా నామేడమీఁదికి బోయితిని. పందిరలేని యా శయ్యపైఁ బవళించియున్న యాయన్నులమిన్నం జూచి తదీయరూపలావణ్యాదులకు వెరగు‌పడుచుఁ గొంతసేపు ధ్యానించి పరిచారికచే లేపించితిని. ఎంతపిలిచినను బలికినదికాదు. ఆముద్దుల బాలుండామె యురముపై బండుకొని పాలుద్రాగుచుండెను. ఆమె వేషము జూడ బాలింతరాలువలెఁ దోచినది.

ఆబాలునెత్తుకొని ముద్దాడుచు రేవతీ అమ్మా ! వీఁడు మిక్కిలి చక్కనివాఁడు. నీకుఁగూడ నిట్టికొమరుండు గలుగవలయును వానిం జూడ నాగశిశువువలె దోపఁడు. మనుష్యబాలుండని తోచుచున్నడి. వీరెట్లిక్కడికి వచ్చిరో తెలిసికొనవలయునని పలుకుచుఁ జేతితోఁ దట్టుచు నానాతిం బిగ్గరగాఁ బిలిచినది పలుకలేదు. మఱియు నూర్పుల వలన నాయాసము జెందుచున్నట్లు కనంబడినది

అప్పుడు నేను దొందరపడి యొడలు గాపించియు విసరించియుఁ బట్టించియు నుపచారములు బెక్కు జేయించితిని. మూడు దినముల దనుక మాటాడలేదు. నాలుగవనాఁడు కన్నులం దెరచి చూచినది. అప్పుడు నోటిలో నాహారము పోయించితిని. కొంచెము సేపునకు లేచి కూర్చుండి బాలునిదెసజూచి కన్నీరు గార్చినది. బాలునకు మే ముపచారములు చేయుచునే యుంటిమి. పిమ్మట బాలునకుఁ బాలిచ్చినది. కొంత విశ్రాంతి వహించిన పిమ్మట నేనల్లన యప్పల్లవపాణిని సమీపించి యిట్లంటిని. అమ్మా! నీవెవ్వతెవు? నీపేరేమి? ఈమంచముపై కెట్లువచ్చితివి? నీయుదంత మెఱింగింపుము. నీపతి యెవ్వఁడని అడిగిన నమ్మగువ యిట్లనియె.

దేవీ! నేనొక నిర్భాగ్యురాలను నాకులశీలనామంబులు నడుగకుము. నాపేరు కళావతి అని జ్ఞాపకము. ఇక్కడికెట్లు వచ్చితినో నేనెఱుంగను. నీమొగముజూడ, బుణ్యాత్మురాలువలె గనంబడుచుంటివి నేను పరవశనై యుండ నాపుత్రుం గాపాడితివి. నీయుపకారమెన్నటికిని మఱువను. నేను బ్రతికినను లాభములేదు. వీని మీవా నిగా నెంచి పెంచుకొనుఁడు. నేనెందేని బోయెదనని‌ శోకగద్గదయై పలికిన నాలించి నేను ఓహో? ఈయువతి పెద్దయాపద జెంది వచ్చినది ఇప్పుడడిగి యాయాసపరుపఁ దగదు. కొన్నిదినములు గడిచినవెనుకఁ దెలిసికొనియెదగాక అని తలచి మఱేమియు నడుగక తల్లీ! నీవు వగవకుము. నీవును నీపుత్రుఁడును యధేచ్ఛముగా నిందు వసియింప వచ్చును. నీకిది పుట్లి నిల్లనుకొనుము ఏలోపమురాదు. నాకును సంతతిలేదు. నీబాలుని ముద్దుముచ్చటలు జూచుచుఁ గాలక్షేపము జేసికొనియెదవని చెప్పి యామె నూరడించితిని.

నాయోర్పులకు సంతసించుచు నమ్మించుఁబోణి పుత్రునితోఁ గూడ మాయింట వసించినది. ఒకహాయనము గడవకుండఁగనే నేను గర్భవతినై యీతేజోవతిం గంటి. చిరకాలము సంతానము లేక యీ కళావతి వచ్చెడి కొలఁదికాలమునకే పుత్రిక జనించుటచే నాభర్తకు నామెయందును బుత్రునందును ననురాగము గలిగినది. మిక్కిలి యక్కజమగు రూపమునం ప్రకాశించు నీతేజోవతింజూచి యెల్లరు వెరగుపడ జొచ్చిరి. నాగలోకమంతయు నీకాంత చక్కఁదనము గురించి స్తోత్రముబు వ్యాపించినవి. గారవముగాఁ బెంచుచుంటిమి. అయిదేఁడులు ప్రాయము వచ్చినంత కళావతి కుమారునితోఁ జతపరచి జదివింపుచుంటిమి. సింహమువలె గర్జించుచు సమంచిన లక్షణవంతుడగు నాబాలునకు జయసింహుఁడని మేమే పేరు పెట్టితిమి.

జయసింహుఁడు తేజోవతియు నాటపాటలయందును నాహార విహారముల యందును విడువక సంతతము కలిసియుండువారు. క్రమంబున వారిమైత్రి దిట్టమైనది. కలిసియే బడికిఁబోయి చదువుకొని వచ్చుచుందురు.

జయసింహునకుఁ బదియేడుల ప్రాయముగలిగినప్పుడు బడిలో నున్న నాగ బాలురందఱు వానియందీసుగలిగి వీఁడుమానిసి. మానిసి, భర్తృదారికి పుస్తకములు మోయు కూలివాఁడని యాక్షేపించుచుండిరఁట. ఆబాలుండా మాటలు సైరింపక యొకనాఁ డుపాధ్యాయునితో నార్యా? నేనెవ్వరిజోలికిం బోక చదువుకొనుచుండ నీనాగకుమారులు నన్ను నిత్యము వీఁడు మానిసి. కూలివాఁడు వీనితల్లి పనికత్తియు అని వెక్కిరించుచున్నారు మందలింపుఁడని చెప్పిన జాతిగుణం బెట్లు పోవును. అతండు ఔను. నీవు మానిసివే నీతల్లి రాజపత్నికిఁ పనికత్తి అగుట నిన్ను పుస్తకములు మోయునిమిత్తము దేజోవతితోఁ గూడ బడికి బంపుచున్నారు. లేకున్న నిన్నీ బడిలోఁ జదువనిత్తుమా? నీవు కూలివాఁడవుకాక మఱియెవ్వఁడవు? అభిమానపడిన లాభములేదని యొజ్జలుగూడ నధిక్షేపించిరి.

ఆయూతజూచి బడింగల పిల్లలెల్ల జదువుటమాని వాని నేకరీతిగా నాక్షేపించు చుండిరఁట సహజపరాక్రమశాలియగు నాబాలుం డామాటలు సహింపక యొకనాఁడు బడింగల బాలకులనెల్లఁ బదములతోఁ దన్నియు జేతులతోఁ గొట్టియు గ్రుద్దియుఁ బొడిచియుఁ జిందరవందర గావించెను. ఒక్కడును వాని నెదురుకొనలేక తల యొక దెసకుఁ బారిపోయిరి.

ఆమరునాఁడు బడిగట్టి పెట్టి పిల్లలతోఁ గూడినాయుపాధ్యాయుండు కౌరవ్యు నొద్దకుబోయి దేవా ! మీయింటనున్న దాసీపుత్రుఁడు బడికివచ్చిన నేను జదువు జెప్పఁజాలను. నిన్నను బడిలోనున్న పిల్లలనందఱ జావగొట్టైను. మీయింట దిని పిడుగులాగున నుండుటచే వానితో నెవ్వరును పోట్లాడజాలరు. అని వానిమీఁద లేని పోని నేరములు జెప్పి పిల్లల దెబ్బలం జూపించి రాజునకు గోపము గలుగఁజేసెను.

భూభర్త యాక్షణము జయసింహుని రప్పించి యేమిరా? నీవు కావరించి బడి పిల్లలనెల్లఁ వావమోదితివఁట. ఇది యేమి యాగడము పద్మావతి నీవు మంచివాఁడవని చెప్పినదే నిన్ను శిక్షింతుము. నిజము జెప్పుమని అడిగిన నాబాలుండు భయపడుచు నిట్లనియె

దేవా ! ఇందు నాయపరాధమేమియును లేదు. నిజము తేజోవతికిఁ దెలియును. ఆ చిన్నది నాతప్పని చెప్పినచో మీరు చేసినదండనకు బాత్రుడనయ్యెద. నామె నడుగుఁడని పలుకుటయు నాభర్త తేజోవతిం దీసికొనిరమ్మని అంతఃపురమునకుఁ బరిచారికల నంపెను

ఆసమయమునఁ తేజోవతి యావృత్తాంతము నాతోఁ జెప్పుచున్నది. పరిచారికల వెంట తండ్రి యొద్ద కరిగినది. రాజు తేజోవతి నెత్తికొని పుత్రీ! నిన్న బడిలో నీ జయసింహుఁ డేమిచేసెనో చెప్పుము. పిల్లల నందఱఁ గొట్టెనఁట. నీవు జూచితివా? యని అడిగిన నది యిట్లనియె. తండ్రీ ! అందు జయసింహు నపరాధమేమియును లేదు. ఎంత శాంతమైనది యైనను సింహము తన కేసరముల లాగిన నూరకొనునా. నిత్యము మాయొజ్జలు పిల్లల చేత వీనిమానిసియనియుఁ గూలివాఁడనియు దాసీపుత్రుడనియుఁ బలికించుచు దనతోఁ జెప్పినను వినిపించుకొనక వారిని పురికొల్పెను. ప్రతిదినము దన్నాక్షేపించుచుండ సైపక నిన్న వీరినెల్ల దన్నినమాట వాస్తవమేయని యావృత్తాంతమంతయుం జెప్పినది.

అప్పుడు రాజపుత్రికను ముద్దుపెట్టుకొనుచు తల్లీ ! సహవాస పరిచయ మూరకబోవదుగదా. నీకు జతఁకాడని యిట్లనుచున్నావా యేమి? నిజము చెప్పుమని పలుసారులడిగి యదార్థము తెలిసికొని యాబాలురతోఁగూడ నుపాధ్యాయుని మందలించి వారికి వేరొక గురువును నియమించి చదువు చెప్పించుచుండెను.

జయసింహుఁడును తేజోవతియు గురువులనొద్ద సంగీతము సాహిత్యము శాస్త్రములు లోనగువిద్యలు మూడు సంవత్సరములలో సాంతముగా గ్రహించిరి. తేజోవతికి యౌవనము పొడసూపినతోడనే బడికిఁ బంపుట మానిపించి కొదవవిద్యలు శుద్ధాంతమునందే నేర్పించితిమి.

జయసింహునకుఁ బాతాళమునంగల ధనుర్వేదము తగినయొజ్జలయొద్ద నేర్పించితిమి కొలదికాలమున అతండు శస్త్రాస్త్ర విద్యానిపుణుండై యెల్లరచేతను పొగడ్తల జెందుచుండెను.

ఒకనాడు తేజోవతి సఖులతోఁగూడా నుద్యానవనములో విహరింపుచు సంగీతము పాడుకొనుచుండఁగా నేలాపుత్రుని కుమారుఁడు పారిజాతఁ డనువాఁడు మిత్రులతోఁ గూడికొని యెక్కడికో పోవుచు నా గానము విని మోహపరవశుండై యందునిలువంబడి పరిజనులచేఁ దీని వృత్తాంతము దెలిసికొని యింటికిం బోయి హంసికయను చేటికను దేజోవతియొద్ద కనిపెను.

ఆ హంసిక తేజోవతితోఁ బారిజాతుని గుణగణంబులు సౌందర్య శౌర్య దైర్యాదులం బొగడి పొగడి యతఁడు నిన్ను వరించి యున్నవాఁడు పెండ్లి యాడుమని బోధించిన అవి పెడచెవినిబెట్టి ఏమియు సమాధానము చెప్పక వేరొక ప్రస్తావన దెచ్చినదఁట. ఆ మాటయే పలుమారు వర్ణింపుచుండెను. మఱియు,

గీ. సకల కాకోదరాన్వయ చక్రవర్తి
    పారిజాతుండు కామినీ పారిజాతుఁ
    డాత్మ నినుఁగోరి గురు విరహమునఁ గుందు
    చున్నవాఁడు త్వదీయ భాగ్యోదయమున ॥

ఉ. అతనిఁ గూడినప్పుడెగదా? భవదీయ మనోజ్ఞ సుందర
    త్వాతిశయంబు స్తుత్యమగునం బుజపత్ర విశాలనేత్ర? త
    చ్చాతురి శ్రీతనూభవ వసంత జయంతులకైన లేదు ప్ర
    ఖ్యాతకళావిదుం డతని కాతఁడె సాటిసుమీ? వధూమణీ

అని మఱియు అనేక ప్రకారంబులఁ బారిజాతుని స్తుతియించుచుండ వినిపించు కొనక తన సఖి రేవతి కెద్దియో సంజ్ఞచేసినది. అప్పుడా రేవతి తేజోవతి యభిప్రాయము గ్రహించి హంసికతో నిట్లనియె.

హంసికా ? మీ పారిజాతుఁ డంతవాఁడగుట వాస్తవమే కాని తేజోవతిని గురించి విరహాతురుండగుట సమంజసముకాదు. తేజోవతియొక సుందరునిం బెండ్లి యాడ నిశ్చయించుకొన్నది. కావున మీపారిజాతుని చిత్తము మరలించుకొనుమని చెప్పుము. పోపొమ్మని పలుకుటయు హంసిక చిన్నవోయి మరుమాట పలుకక యధాగతముగా పోయి యావార్త వాని కెఱింగించినది.

అతండు విరహముకన్న అవమాన పరితాప మెక్కుడుగా భావించి యేమియుఁదోచక దుఃఖించుచుండెను. ఎట్లో తండ్రి తెలిసికొని వాని రప్పించి యేకపుత్రుఁ డగుట నూరడింపుచు నిట్లనియె.

పుత్రా ! నీవు పాతాళలోక చక్రవర్తి కుమారుఁడవు నీకే లోపమును లేదు. ఎందులకై నీవిట్లు కృశించి దుఃఖించుచున్నావు? నీకు మూడు లోకములలో దుర్లభమైన వస్తువులేదు. నిన్నెవ్వరేని అవమాన‌పరచిన వారిం బేర్కొనుము. ఇప్పుడు కోటముంగల వారి యంగములు తున్కలుగాఁ గోయించెదనని లాలింపుచు అడిగిన వాఁడు కన్నీరు దుడిచికొనుచు నిట్లనియె.

తండ్రీ ! నాయవమానమును వక్కాణింతును వినుండు. కౌరవ్యుని కూఁతురు తేజోవతి మిక్కిలి చక్కనిదఁట నాయొద్ద హంసిక యొకనాఁడు దానిరూపము పొగడుచు నీకాచిన్నది సరిపడియున్నది. పెండ్లి యాడెదవాయని అడిగినది. అర్ధాంగీకారము సూచించితిని. అదివోయి తేజోవతి సఖులతోఁ గ్రీడించుచుండ నా రూపము, నా వైభవము, నా సౌందర్యము పొగడుచు నన్నుఁ బెండ్లి యాడుమని యడిగినదఁట. తనకిష్టములేకున్న నామాట జెప్పిన లోక పరిపాటిగానుండును.

ఇస్సిరో పారిజాతుని సిరి మేమెఱుగనిదియా? వానిసౌందర్యాది గుణంబులు మాయొద్దఁ బొగడనక్కరలేదు. ఏలాపుత్రుని రాజ్యమెట్టిదో మేమెరుంగనివారము కాము. పారిజాతుండు గుణహీనుఁడు. విద్యాశూన్యుడు దరిద్రుఁడు కులముతక్కువ వాఁడు. మాఱేనిపుత్రికను వరింపదగినవాఁడు కాఁడు. ఇట్టి యసమానసంబంధమున కాసపడవలదని చెప్పుము. అని తేజోవతి తన పరిదారికచే నోటికిరాని దుర్భాషలు పలికించినదఁట. వాని కెద్దియో హంసిక సమాధానము జెప్పబోవుచుండఁ బరిచారికలచేఁ గొట్టింపఁ బ్రయత్నించిన నది పారిపోయి వచ్చినఁదట హంసిక నడుగుఁడు అని వెక్కి వెక్కి యేడువఁదొడంగెను.

అప్పుడేలాపుత్రుఁడు రోషానలంబు గన్నులఁగ్రక్కు చు హంసికను రప్పించి ఏమే రండా? పెద్దవారికిఁ జెప్పకుండ నీ వక్కడికిఁబోయి పిల్లనేమిటి కడిగితివి. కానిమ్ము. ఆనీచురాలేమన్నదో చెప్పుమనుటయు అది స్వామీ ! పోవుట నాది తప్పే? అబ్బాయిగారేమియు నెరుగనే యెరుఁగరు. జోడు సరిపడును గదాయని తలంచితిని. ఇంత గర్వమని యేరికి తెలియును ? పోనీ? ఆ అమ్మాయిగారన్నను బాగుండును. గవ్వజేయని దాసీపుత్రికచే నిందించినందులకు జింతగానున్నది. వారిపరువునకు మనము సరిపడమఁట అబ్బాయిగారు విద్యలేనివారఁట తండ్రీ ! ఆమాటలన్నియు మీకడఁ జెప్పజాలను. అని లేనిపోని మాట లెన్నేని జెప్పి అతని కోపాగ్ని ప్రజ్వరిల్లఁ జేసినది.

అప్పు డయ్యురగపతి మంత్రుల రప్పించి అయ్యుదంత మెఱింగించి కౌరవ్యుని వంచించు నుపాయ మెరింగింపుడని అడిగిన వానికి వేణీస్కందుఁ డను మంత్రి యిట్లనియె.

దేవా ! చిన్నతనముచేత నాతనిఁ కూతురేమో యాక్షేపించినదని మనము పెద్ద సన్నాహము చేయఁదగదు. కౌరవ్యుఁ డుత్తమగుణ సంపన్నుఁడు. మనల నిందించువాఁడు కాఁడు. వీరి మాటలలో నెంత నిజమున్నదియో యరయవలయును. తొందరపడరాదు. అదియునుంగాక కౌరవ్యుఁడు లంకాధిపతియగు విభీషణునికిఁ బ్రాణ బంధువుఁడు వాని మనము వంచింపఁబూనితిమయేని విభీషణుఁడు సహాయము రాక‌ మానఁడు. మూడులోకము లొక్కటియైనను నా రాక్షసవీరులతో బోరవశమా? కావున సామముననే యీ మాటల నాయనకుఁ దెలియజేసి యాక్షేపింపవచ్చునని పలుకగా వారించుచు శిశ్రుమారుండను మఱియొక మంత్రి యిట్లనియె.

చాలుఁ జాలు. నీమాటలు మెచ్చదగినవే. రాజపుత్రుడు స్వయముగాఁ జెప్పుచుండ నసత్యముండునా ? కౌరవ్యునికి విభీషణ నహాయమున్నదని మనము వెరవఁ బనిలేదు. అదియే మన కుపకారమైనది. విభీషణుఁడు రాక్షసజాతికెల్ల శత్రువు. రక్కసిపురుగున కతనిపేరు జెప్పిన రోనమెక్కకమానదు. మాంశాశనులగు వారినెల్ల శాకాశనులగన్ముని నిర్భంధశాసనము జేసియున్నాఁడు. అందఱును రామ భక్తుల గమ్మని యాజ్ఞాపించుచున్నాఁడు. దానంజేసి యాపాతాళంబున గల దానవు లెల్ల విభీషణుని వంచించుకాలమెప్పుడైన వచ్చునాయని నిరీక్షించుచున్నారు. ఇప్పుడు మనము కోరినవారందరు మనకు సహాయము రాఁగలరు. మరియు లంకలోని రక్కసులలో నొక్కనికి మాయాపాటవము లేదు. అదియు విభీషణుఁడు జేసిన శాసనమే. మాయాచ్ఛన్నులై దనుజులు మనుజుల, వేల్పుల బాధింతురని యా రావణానుజుండు శాంబరీ గ్రంధాలయము మూయించెనఁట. కావున విభీషణుఁడు సహాయము వచ్చినను మనము సులభముగా జయింపవచ్చును. దేవర సెలవైనచో రక్కసులనెల్ల నిందు రప్పించెదనని యేమేమో బీరములు పలుకుటయు వేణీస్కందుఁ డిట్లనియె.

ఓహోహో? నీ నీతి వైదుష్యము స్తోత్రపాత్రమై యున్నది. మాటాడనేరని అబలయొకతె యేమో యన్నదని అలిగి దండు వెడలఁ బ్రయత్నించుచుంటివా ? మరియు విభీషణ పరాక్రమ మెట్టిదో నీ వెఱుంగుదువా ? ఆతం డేనాఁటివాఁడు. దేవాసుర సంగరంబుల నారి తీరినవాఁడు శస్త్రాస్త్ర బలసంపన్నుండు రసాతలదనుజులుగారు పదునాలుగు లోకములఁగల మహావీరులు గూడి వచ్చినను విభీషణు నెదురింపఁజాలరు. పోరువలదు సామంబునఁ బిల్లనీయమని కౌరవ్యునికి వార్త నంపుఁడు. అతం డీయకున్నఁ దరువాతఁ విచారించుకొందమని ధారాళముగా బలుకుటయు నేలాపుత్రుఁడు శింశుమారుని నప్పని కావింపుమని నియమించి వేణీస్కందుఁడు చెప్పిన వడువున మాకిట్లు జాబు వ్రాయించెను.

కౌరవ్యా ! నీవు పన్నగ కులావతంసుఁడగు వాసుకి వంగడంబున జనించితివి. కావున నీ వంశము కడు పవిత్రమైనది యురగలోకములోఁ గొంత దేశమున కధికారము గలుగుటచే ధనధాన్యముల విషయమై తెలియనవసరములేదు. విద్యాశీలంబులు నీకడ లేవనరాదు. కావున మాతో సంబంధము చేయుటకు నర్హుండవై యుంటివి. నీ కూఁతురు తేజోవతి వివాహవిధి కర్హురాలై యున్నదని వింటిమి. నా కుమారుడు పారిజాతునికరము గ్రహింపఁదగినదని తెలిసినది. కావున మే మంగీకరించి యీ శుభపత్రిక వ్రాయించితిమి. తదనుకూలముగఁ బ్రత్యుత్తరము వ్రాయుదువని నమ్ముచుంటినని వ్రాసి వార్తాహరునిచే మా యొద్దకనిపెను.

ఆ జాబు చూచుకొని నా భర్త వెరగుపడుచు నా యొద్దకు వచ్చి పొలతీ ? యేలాపుత్రుండెట్లు వ్రాసెనో చూచితివా? యెంత స్వాతిశయము ప్రకటించెనో గనుఁగొంటివా ? ఔరా? ఎంతకావరము ? పిల్లనడుగక నీ గర్వోక్తు లేమిటికో యని అసహ్యించుకొని జాబు నేలఁ బారవైచి అంతకుమున్ను జరిగిన చర్య లేమియు నెఱుంగఁడు కావున నిట్లు ప్రత్యుత్తరము వ్రాయించెను. నీ శుభలేఖను జూచి మిగుల నానందించితిమి. నీతో సంబంధము చేయుటకు నాకర్హత గలదని నీకుఁ దోచినందులకు సంతోషమే కాని అందలి యదార్థము పండితులవలన దెలిసికొనవలసియున్నది. వారితో నాలోచించి ముందు దగినట్లు ప్రత్యుత్తరము వ్రాసెద నంతదనుక నిదియే సమాధానము. అని వ్రాసియంపిరి. దానికి వికటముగా నేలాపుత్రుఁడు ప్రత్యుత్తరము వ్రాసి యంపెను. అంతకన్న వికటముగా వ్రాసి మరల వీరు పంపిరి. ఈ రీతి నుత్తర ప్రత్యుత్తరములతో నారు మాసములు గతించినవి.

గూఢచారు లొకనాఁడు వచ్చి యేలా పుత్రుని సభలో జరిగిన చర్చయంతయు మాకుఁ దెలియఁజేసిరి. నేనాకథ విని రేవతింజీరి ఓసి? పారిజాతుం డెప్పుడో తేజోవతినిఁ దన్ను బెండ్లి యాడుమని అడిగిన నతని నెక్కుడుగా నవమానపరచితిరఁట. ఏమిటికని‌ యడిగిన నది యిట్లనియె.

దేవీ ? వినుము మే మొకనాఁ డుద్యానవనములోఁ గ్రీడించు చుండఁగా హంసికయనునది వచ్చి పారిజాతుని సౌందర్యాదులు పొగడుచు నతనిం బెండ్లి యాడుమని భర్తృదారికతోఁ జెప్పినది. ఆమాట లాబోటికిష్టములేక నాకుఁ గన్నుసన్న జేసినది. మీరాజపుత్రుఁ డట్టి వాఁడే కావచ్చును. మారాజపుత్రిక వేరొక సుందరుని వరించియున్నది. ఈమెపైగల అతని విరహము మరలించుకొనుమని చెప్పితిని. ఇంతకన్న మఱేమియు ననలేదు. ఈమాటయుఁ తేజోవతి యానతివడువున నుడివితినని జెప్పిన నే నివ్వెరపడి యిట్లం టి.

అమ్మాయి యెవ్వరిని వరించియున్నది. మేమెఱుగమే? నిజము చెప్పమనుటయు నది భయపడుచుఁ గొంత సిపేమియుఁ జెప్పినదికాదు. నేనెక్కు డుగా నిర్భంధించుటచే నాపతి తల్లీ ? మనయింటఁ బెరుగుచున్న జయసింహూనిఁ ద్రికరణములచేత వరించియున్నది మఱియొకనిఁ బెండ్లియాడదు. మీకడ సిగ్గుచేఁ జెప్పుటలేదు. మాతో నట్లే నిశ్చయించినది. అని యామె అభిప్రాయము యెఱింగించినది. మాకును లోలోపల నట్టి అభిప్రాయమే కలిగియున్నది. కాని వెల్లడించలేదు. అమాటలు విని నేను సంతసి౦చుచు నా భర్త కెఱింగించితిని.

ఆయనఁ జిఱునగవుతో నాతీ ! తేజోవతి యభిలాషయుక్తముగానున్నది. నీ కిష్టమైనట్లు కావింపవచ్చును అతడు రూపవంతుఁడు విద్యావంతుఁడు పరాక్రమవంతుఁడును. కాని వాని కులశీలము లెట్టివో తెలియవు. ఈసారి గట్టిగా నిర్భంధించి తల్లి నడిగి తెలుసుకొనుము వాఁడెక్కడ నున్నాడు? ఈ నడుమ కనంబడుటలేదు. అని పలికిన నేను నాధా ! అమ్మాయికి నీడువచ్చినది మొదలు వాని వేరొక పాఠశాలఁ జదివింప నియోగించితిమి. అవును. కొన్నినెలలనుండి వాని జాడ తెలియదు. తెలిసికొనుడు అని పలికితిని.

అప్పుడే పరిజనులం బంపి బాఠశాల వెదకిఁ తీసికొనిరండని నియోగించితిని. వారు తిరిగి తిరిగి వచ్చి యెందునుఁ గానక దేవా! నాలుగునెలలనుండి జయసింహుఁడు పాఠశాలకు వచ్చుటలేదని యపాధ్యాయు లందఱు జెప్పిరి. యెక్కడికిఁబోయెనో తెలియదు గ్రామ మంతయు వెదకితిమి. వానిజాడ గనంబడలేదు. ఈ నడుమజూచితిమని చెప్పినవారు లేరని చెప్పిరి.

అప్పుడు మేము భయపడి కొన్నిదినములు మాదేశమంతయు వెదకించితిమి. కనంబడలేదు. తల్లికిఁ జెప్పిన శోకించునని యామెకుఁ దెలియకుండగనే వెదకించు చుంటిమి. ఇంతలో పిడుగులాగున నేలాపుత్రుని సందేశము హృదయభేదకరమై వినవచ్చినది.

తేజోవతిని దీసుకువచ్చి పారిజాతుని పాదంబులఁ బడవైచి రక్షింపుమని శరణు గోరవలెను. ఇందులకుఁ బదిదినములు గడువిచ్చితిమి. లేనిచోఁ బదునొకండవనాడు చతురంగబలములతో మీపురంబుపైఁబడి మిమ్ముఁ బరిభవించి నీపుత్రికం దీసికొని పోవుదుము. ఆయితముగండు. అని‌ మాపై యుద్ధమును బ్రకటించి యుత్తరము బంపిరి.

అందులకు శత్రులకేమియు బ్రత్యుత్తరమీయక పోరుటకు నిశ్చయించి నాభర్త నీతండ్రికా తెరంగెఱింగించి సహాయముగోరెను. రాక్షసబలంబులు పెక్కులు వచ్చిమాపురంబుజేరినవి. రెండు బలంబులకును ఘోరసంగరము జరిగినది. మొదట మనవారే వారింద్రోసికొనిపోయిరి. ఎవ్వఁడో మహావీరుఁడు వారికిఁ దోడువచ్చెనని తెలిసినది. వాని సహాయమునఁ గోట ముట్టడించి శత్రువులు కొటలోఁ జొరఁబడిరి. అప్పుడు రాక్షససేనాధిపతి వారియుద్యమము దెలిసికొని నాగకాంతలనెల్ల శత్రువుల బారి బడకుండ గుప్తమార్గంబున నిక్కడికిఁ దీసికొనివచ్చిరి. నా భర్తను దప్పించుకొని రమ్మనిన నొప్పుకొనక నందే పోరుచుండిరి. ఇదియే జరిగినకథ యుద్దకారణ మిదియే యని యావృత్తాంత మంతయు బద్మావతి చంపకకుఁ జెప్పినది.

ఆకథవిని చంపక మిక్కిలి యక్కజమందుచుఁ దేజోవతిని జూచి చెల్లీ ? నీవుల్లంబున బెదరకుము నీవల్లభుండైన జయసింహుని వెదకి తెప్పించి నీకుఁ బెండ్లి జేసెదను. అంతయు మాతాతగావించునని యోదార్చినది. అప్పుడు తేజోవతికన్నీరు గార్చుచు అక్కా ! ఈముప్పునకుఁ గారకురాలను నేనే నేగలుగకపోయిన మావారు సుఖింతురు. మాకులము పెద్దయగు వాసుకి శిరోమణి మాతల్లి చిన్నతనమున నాకలం కరించినది. సముద్రమునం దీదుచు నది పారవైచితిని. ఆ మణి యుండిన మాతండ్రి కవమానము గలుగకపోవును. దానిఁదాల్చినవారికి క్షుత్పిపాసలుండవు. అంతయుఁ దనకుఁ గనంబడును. తానెవ్వరికిఁ గనంబడఁడు. అట్టి దివ్యమణింగోల్పోయిన మా తండ్రికీ యవమానము తట స్తించినది. నాపెండ్లి మాట పిమ్మటఁజాచికొనవచ్చును. మాతండ్రి చెరవిడిపింపయత్నింపుమని ప్రార్థించినది. దివ్యమణి వృత్తాంతమంతయు బద్మావతి వలనం దెలిసికొని‌ చంపక దానిపోకకు విచారించుచు జయసింహుని కులశీలాదులఁ దెలిసికొంటివా యని అడిగినఁ బద్మావతి అడుగలేదు. ఆమెకూడ మాతోనేవచ్చినది. యిక్కడనే యున్నది. పిమ్మటఁ దెలిసికొనవచ్చును. ఈముప్పు దాటవలయుఁగదాయని పలికినది వారట్లు ముచ్చటించుకొనుచుండ వీరసింహుఁడ ల్లంత దవ్వున నివసించి వారిమాటలన్నియు వినెను. ఏవో కొన్నిమాటలు మాత్రము వినం బడలేదు.

తేజోవతియుఁ జంపకయు నొకచోటఁ గూర్చుండఁగ జూచి యిరువురసౌందర్య తారతమ్యంబుల నిరూపింపఁజాలక యిట్లుతలంచెను.

ఆహా ! సరస్వతీ ప్రాణనాధుని నిర్మాణకౌశల్యమునకు మేరలేదుగదా ? తేజోవతీ చంపకల నిరువుర నొకద్రవ్యంబు గరిగి యొక యచ్చున ముద్రించెనా ? సవిమర్శనముగా నెవ్వతెంజూచిన నాచిగురుఁ బోణియే యెక్కుడు చక్కనిదిగా దోచుచున్నది. ప్రాయంబుననించుక తేజోవతియే పెద్దదివలెఁ గనంబడుచున్నది. ఈ యిద్దరు ముద్దుగుమ్మలు సౌందర్యమునఁ బరమేష్టి సృష్టికిఁ గడపటివారని తలంచెదను. పారిజాతుండీ తేజోవతి కొరకు విరహాతురుండగుట నబ్బురముగాదు. జయసింహుఁ డెవ్వఁడో తెలియదు. తేజోవతిచే వరింపబడుటచే నదృష్టవంతుడనియే చెప్పదగినది. ఒకని వరించిన తేజోవతి చక్కదనముతో నాకు నిమిత్తములేదు. చంపకయే వరింపఁ దగియున్నది. చంపక నన్ను వరించిన నాకీగమనము సార్దకమగును. పాతాళలోకమంతయుఁ గౌరవ్యునికిఁ బట్టము గట్టుదును. అదృశ్యుండనై యిట్లు క్రుమ్మరుచుండ నేమిలాభము? ఇక్కడ తేజోవతియు, రేవతియు, జంపకయుఁ జామరికయుఁ దప్ప నితరులులేరు. పద్మావతి లోనికిఁబోయినది. వీరికిఁ గనంబడెదనని తలంచి యామణి గురుతుగా నొక గోడకొయ్యకుఁ దగిలించి ఖడ్గహస్తుండై యట్టె నిలువంబడియెను. తొలుత తేజోవతి అతనింజూచి అదిగొ జయసింహుడనిఁ కేకవై చినది. తోడనే చంపక చూచినది. పరిచారికలు చూచిరి. అప్పుడు రేవతి యాతనియొద్దకుఁబోయి జయసింహా! యిక్కడి కెట్లు వచ్చితివి? నాలుగునెలలనుండి కనంబడుటలేదేమి ? ఎందుబోయితివి ? యుద్ధములో నెట్లు తప్పించుకొనివచ్చితివి? ఇటురమ్ము మీతల్లియు నిక్కడనేయున్నది. పరితపించుచున్నది. రాజ్యమంతయు నెట్లయినదో చూచితివా? యని పలుకుటయు నతండు వెరగుపడి యేమియు మాటాడక చూచుచుండెను.

చంపక వాని నెగా దిగఁ జూచి తలయూచుచుఁ జెల్లీ! నీ పురాకృతము పండినది. మంచివాని వరించితివి. రాజ్యముపోయినఁ బోవుఁగాక‌ వీనితో నెందై నం బోయి సుఖింపవచ్చును. ఇతఁడు మాయలంగూడ నెఱుంగునా యేమి? యీ శుద్దాంతమున కెట్లు వచ్చెను. కావలివాండ్రు రానిత్తురా? చామరికా ! నీవుపోయి వాని‌ కాతిధ్య మిమ్ము. అతిధిపూజ్యుఁడుగదా ! అని ప్రేరేపించుటయుఁ జామరికయం దొక పీఠమువైచి బలవంతమునఁ దోడితెచ్చి కూర్చుండ బెట్టినది.

చంపక యేదియో యనఁబోయియు సిగ్గునమాటరాక తేజోవతితో చెల్లీ! నీకేమి భయము? సహాధ్యాయుఁడు కాడా? పెండ్లియైన తరువాత సిగ్గుపడవచ్చునులే యెట్లు వచ్చెనో అడుగుము. మేమును వినియెదముగాక యని ప్రోత్సహించిన నమ్మించుబోణియుఁ గొంచెముసేపు వితర్కించి తెగువమై జయసింహా! మమ్మువిడిచి యెందుఁ బోయితివి? మేమాపదలఁ జెందియుండ జూడవచ్చితివా? చిన్నతనమునందే పదుగురఁ గొట్టిన నీపరాక్రమ మెందుదాచితివి? అయ్యో? యింత దయాశూన్యుండవై తివేమని పలుకుచుఁ గన్నీరు ధారగా గార దుఃఖింపఁ దొడంగినది. ఆఁబోటిమాటల కాతండు జాలిపడి కనుల బాష్పములు గ్రమ్ముదుడిచికొనుచు రమణీ ! నేను జయసింహుఁడనో వీరసింహుఁడినో యెవఁడినో యొకఁడను. ఎవఁడైననేమి?‌ మీయాపదఁదొలగింప శపధము చేయుచుంటి వినుము. పదిదినములలో శత్రువులనెల్లఁ బారఁదోలి పాతాళలోకమంతయు నేకచ్ఛత్రముగా నీతండ్రిచేత నేలింపకపోయితినేని నాపేరునంగల సింహశబ్దము తీసి మార్జాలశబ్దము ప్రయోగించి పిలువుము. అభయహస్తమిచ్చితిని. వెరవకుము అని శపథము చేయుటయు నాలించి తేజోవతి యాత్మగతంబున నిట్లు తలంచెను.

అయ్యో ? వీని కంఠధ్వని మఱియొకరీతిగా నున్నదేమి? వీఁడు జయసింహుఁడా? మఱియొకఁడా? మఱియొకఁ డిట్టి ప్రతిజ్ఞ పట్టునా? ఇన్నినాళ్ళెక్కడనుండెనో యడుగవలయును. ప్రాయోదయంబుఁ గ౦ఠస్వరము మారునందు రని తలంచుచు నెద్దియో చెప్పఁబోవు సమయంబునఁ గొందరు కింకరులు తొందరగావచ్చి విభీషణ మహారాజుగారు వచ్చుచున్నారు. పీఠములు సవరింపుఁడని పలికిరి.

అప్పుడు సంభ్రమముతో అందఱు లేచి యుక్తప్రదేశంబుల నిలువంబడిరి. ఆ యలజడిలో వీరసి౦హుడు లేచి తనహారము వెదకికొని మెడలో వైచికొని విభీషణుని రాక కెదురుచూచుచుండెను. అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు అప్పుడు చాలించి యవ్వలి కథ తదనంత రావసధంబున నిట్లని చెప్పదొడంగెను.

119 వ మజిలీ కథ

హరిదాసుకథ

చామరికా? యేమనియెదవు? వానితోఁ గొంతసేపు మాట్లాడుట సంభవించినది కాదేమి? అయ్యో? మాతాతయున్నప్పుడే రావలయునా? తేజోవతి యాసుందరుని వరించినమాట వాస్తవమేనా? వానిజూచినది మొదలు నాహృదయము తరళముమైనదేమి? వీఁడు జయసింహుడేనా? స్వరభేదమున్నదని తేజోవతి చెప్పినమాట సత్యము కారాదా? నేనుగూడ వీని వరింపవచ్చునా? తేజోవతి యొప్పుకొనదు కాఁబోలు ఆహా ! దానియదృప్టము అని వెఱ్ఱిదానివలె మాట్లాడుచున్న చంపకం జూచి నవ్వుచుఁ జామరిక నిట్లనియె.

సఖీ ! నేనప్పుడే నీ మొగము జూచి అనుమానము జెందితిని. మాధవీలత రసాలముపైఁ బ్రాకుట వింతగాదు. రూపంబునఁ గాక పరాక్రమమునఁ గూడ అనన్య సామాన్యుఁడని అతండు పట్టిన ప్రతిజ్ఞ వలనఁ దెలియఁబడుచున్నది.

మీతాతవచ్చి పద్మావతితో ముచ్చటించిన విషయములు నీవు వినియుండలేదు. వానిం జూచినది మొదలు నీమనసు మనసులో లేదు శత్రువుకు సహాయమువచ్చిన వీరుఁ డెవ్వఁడో యెఱుంగుదువా యని పద్మావతినిఁ తర్కించి యడిగిరి. ఆమె నా కేమియుం దెలియదని చెప్పినది. వాని వృత్తాంతము దెలిసికొని వచ్చుటకు గూఢ చారులఁబం పెనఁట శత్రుమర్మములం దెలిసికొని పోరుట విజయసూచకము గదా ? వాని కులశీలాదుల దెలిసికొని పిమ్మట స్వయముగా మీతాత యుద్ధమునకుఁ బోవునఁట. జయసింహుని మాట ఆయనకుఁ జెప్పలేదు. శత్రువుల జయించిన పిమ్మట నీయభిలాష వెల్లడింపవచ్చును. అంత దనుక దెలియనీయకుము. మఱియు నాయుద్ద విషయమై మీ తాత నేఁడొక సభ జేయునఁట. అందు జయసింహునిమాట యేమైన వచ్చునేమా తెలిసికొనివచ్చెద, నీవూరక పిచ్చిమాటలాడకుము వేళయైనది. చోటు దొరకదు. పోయివచ్చెదనని చామరిక రాజపుత్రికనోదార్చి రాజసభకు బోయి స్రీలు వసించు తావున నిలువంబడి యా విషయముల‌ వినుచుండెను.

రాజసభలో, బ్రహస్తచోదితుండై మర్మజ్ఞుండను వేగులవాఁడు లేచి నమస్కరించి యిట్లనియె.

విభీషణమవారాజా ! మేము దేవరవారి యానతి శత్రుదేశముల కరిగి మారు భూముల నందందు సంచరించితిమి. పాతాళంబు నా విషయము నవసవగాఁదెలిసి