కాశీమజిలీకథలు/ఏడవ భాగము/117వ మజిలీ
మరిగెను. అంతలో వారదృశ్యులగుట విభ్రాంతుఁడై దిగ్భ్రమజెంది యందొక దారింబడి పోవఁదొడంగెను.
అని యెఱింగించువరకు వేళ యతిక్రమించుటయు దదనంతరోదంత మవ్వలి మజిలీయం డిట్లని చెప్పందొడంగెను.
117 వ మజిలీ
విభీషణుని కథ
అయ్యో? సుడిగుండమునఁ బడినయీతగానివలెఁ బదిదినముల నుండి యీ పట్టణమునఁ దిఱుగుచుంటిని. అగమ్యగోచరముగానున్నది. విభీషణుని గేహమేదియో తెలిసికొనవలయునని యెఱింగినను గనంబడకున్నది. చంపకనుజూచు భాగ్యము నాకిఁక బట్టదుకాఁబోలు ఈపాటికి రాక్షససేనలు పాతాళమున కేగియుండును. ఇప్పుడు నాకుఁగర్తవ్యమేమి? ఎన్ని దినములిట్లు తిఱుగుచుందును? అన్ని మేడలు జూచినట్లె కనఁబడును. క్రొత్తవివలెఁ దోచుచుండు కాళ్ళు నొప్పి పెట్టుచున్నవి. ఇకఁ నడువఁజాలను. సాయంకాలమగుచున్నది. ఈ కనంబడుచున్న మేడ ప్రవహస్తుని దని వ్రాయఁబడియున్నది. ఈరాత్రి నిందు వశించి విశేషంబులం దెలిసికొనియెద నని తలంచి వీరసింహుఁడు ప్రహస్తుని మేడలోనికిఁ బోయెను.
అందొక శయనగృహంబున భార్యభర్తలిట్లు సంభాషించుకొనిరి.
భార్య - ప్రాణేశ్వరా! నగరవిశేషములేమి ? నేఁడు ప్రొద్దుపోయి వచ్చితిరేల?
భర్త - అబ్బా ? యీ విభీషణుని కొల్వుచేయుట కడుగష్టముగానున్నది. సృష్ట్యాదినుండియు దమోగుణ ప్రధానులగు యాతుధానుల మునులవలె నుండుమనిన నుందురా ? సహజగుణము మానుప నెవ్వరి తరము. ఈ నడుమ శూర్పనకా పౌత్రుడఁగు విదుజ్జీహ్వుఁడు మాయాబలంబున జంపక యంతఃపురమున కఱిగి యామె చెలికత్తె నెచ్చటికో తీసికొనిపోయెనఁట. అది నాయపరాదముగా నెంచి యా మాయావిం బరిభవింపకున్న నిన్ను మన్నింపనని చిన్న విభీషణుఁడు నాపై నలిగెను. విద్యుజ్జిహ్వుని నిమిత్తము పెక్కండ్రు దూతల నంపితిని. వాఁడెక్కడికో పారిపోయెనఁట. వారియింటనున్న మాయాకథప్తుస్తకములెల్ల లాగికొని రాజవశము గావించితిని. నేడాలస్యమైనదని యెరింగించెను
ఆమాటవిని భార్య అర్యా ! పూర్వము లంకలోఁ గల రక్కసుల మాయాశక్తి యంతయునేమైనది. యిప్పుడు వ్యాపకముగాలేదేమి అని యడిగిన భర్త సతీ మణీ ! విభీషణ శాసనంబున నా విద్యలన్నియు గుప్తము జేయఁబడినవి. ఆ పుస్తకములన్నియు లాగికొని యొక గృహంబున ముద్రలు వేయఁబడినవి. వానిం జదివిన వాని శిక్షింతుము అని యెరింగించెను.
భార్య వెండియు నేదియో యడుగఁబోయిన అతండు కొమ్మా ! నన్ను నిద్రబోనిమ్ము. రేపు పెద్ద విభీషణుఁడు సభకు వచ్చును. పెందలకడ సభకు లేచి పోవలయునని పలుకుచు నిద్రించెను.
ఆ సంవాదము విని వీరసింహుఁడు సంతసించుచు నేనిందురా నొక విశేషము దెలిసినది. ఈ ప్రహస్తుడు అమాత్య ప్రహస్తుని వంశములోనివాఁడు కాఁబోలు. ఈఁతడే యిప్పుడు మంత్రిగానుండెను. రేపు విభీషణమహారాజు సింహాసన మలంకరించునఁట. వీనివెంట నాయోలగంబున కరిగి యాపుణ్యాత్ముని దర్శనముజేసి కృతార్థుండనయ్యెదనని తలంచి యందే యొకచోఁ బండుకొనియెను.
అరుణోదయ సమయమునకే ప్రహస్తుండు లేచి కాలకృత్యంబులు నిర్వర్తించి ద్వారమున వేచియున్న వీరభటులతోఁ గూడ రాజు సభకు బోయెను.
వీరసింహుండును బ్రహస్తుని విడువక యతని వెంట నరగి యా సభలో నొకచో నిలువంబడియెను. అంతకుఁ బూర్వమే పౌరులెల్లరు వచ్చి సభ నలంకరించిరి. మిక్కిలి విశాలమగు నా సభాభవన మంతయు మంత్రిసామంతరహిత పురోహిత స్త్రీబాల వృద్ధరాక్షస వీరులచే నిండింపంబడి యెంతేని దర్శనీయమై యొప్పినది. వీరసింహుఁడా సమ్మర్థములోఁ దప్పించుకొనచుఁ దనకుఁ నిలువఁ జోటెందునను లేమింజేసి క్రమంబున రాజసింహాసనము దాపునకుఁ బోయి యందు సింహాసన మంటప మణిస్తంభమునకాని నిలువంబడి యావింతలం జూచుచుండెను.
సింహాసనమునకు దక్షిణమున అడ్డముగా వేయఁబడిన పీఠంబునఁ బ్రహస్తుండును నుత్తరమున వేయబడిన పీఠంబున జిన్న విభీషణుండును గూర్చుండి వారు మహారాజునకు విన్నవింపఁదగిన విషయంబులన్నియుఁ జర్చింపుచుండిరి.
ఇంతలో భేరీనినాదము సభ్యులకు శ్రవణానందము గావించుటయుఁ జూడ్కులు సభాభవన ద్వారమునకు వ్యాపింపఁ జేసిరి. విభీషణమహారాజు పెక్కండ్రు రాక్షస వృద్ధులు పరివేష్టించి శ్రీరామమంత్ర పారాయణము జేయుచుండ శినికారూఢుండై చను చెంది ద్వారదేశమున దిగి రాక్షసుల నమస్కారము లందుకొనుచు సమున్నతంబగు రత్నవితర్థికపై దూరపు ముఖముగా వేయఁబడియున్న సింహాసన మలంకరించెను. అప్పుడు సభాసదులెల్ల విజయద్వానములతోఁ గరతాళముల వెలయించిరి. ఆపీఠము దావుననున్న వీరసింహుఁడు విభీషణునికి నమస్కరించుచు నిట్లు తలంచెను. ఆహా ! పరమభాగవతాగ్రేసరుండైన యీ మహాత్ముంజూచుటను నేను గృతార్థుండనైతిని. నాజన్మ సాద్గుణ్యము నొందినది. నాకన్నుల కలిమి సఫలమైనది. ఇతండు శ్రీరామభక్తులలో ముఖ్యుడు. యుగాంతరములు గతించిన వృద్దుడైనను నీతని తేజము దృష్టులకు మిరిమిట్లు గొల్చుచున్నది. తనువెల్ల నూర్ద్వపుండరములుధరించి తులసీ దామభూషితవ్రతీకుండై యొప్పు నీతని యాకార మెంతమనోహరముగ నున్నదియో? యీ భక్తుని నోటినుండి వెళ్వవడిన వాక్యామృతము గ్రోలి శ్రవణంబులఁ బవిత్రము జేసికొనియెదనని తలంచుచు నతనిఁ జూచుచుండెను.
సభాభవనంబంతయు నిశ్శబ్దంబై యున్నంత విభీషణుఁడు శ్రీరామ మంత్రంబు జపించుచుఁ దత్ప్రభావము సభాసదులకు వివరింపుఁచు
గీ. రామనామంబు జన్మతారకము సకల
కలుషకానన భూరిపావకము మౌని
కల్పకము దాని జపియించు ఘనులె మునులు
సాటిలేనిది సకలార్థసాధకంబు.
సీ. జపియించుచుందురే సద్భక్తి శ్రీరామ
మంత్రంబు దానవుల్ మౌనులట్లు
పఠియించునే నిత్యపారాయణముగ శ్రీ
రామాయణం బసుర వ్రజంబు
కావింతురే రామకళ్యాణములు మహో
త్సవములం దరసి దానవులు వేడ్క
భజింతురే యొడ ల్పర వశత్వమునొంద
దైత్యులారాము నృత్యములు సేసి
గీ. బలిమిఁ గ్రవ్యాదులైన దైత్యులను గండ
మూలశాల్యన్న ఫలశాక భోజనులుగ
జేసి సద్వృత్తి గలుగ శిక్షింతురే స
దా విమర్శింపుచును సమత్వమున మీరు.
శా. దేవా! దేవరశాసనంబున సురద్వేషుల్ దురాచార దు
ర్భావంబు ల్విడనాడి సంతతము శ్రీరామప్రభావంబులం
గైవారంబులు సేయుచుం గథల నాకర్ణింపుచున్ భక్తిఁ ద
త్సేవాతత్పరులై తపోధనుల రీతింబొల్తు రెల్లప్పుడున్.
మహారాజా ! యువరాజుగా రాజ్ఞాపించుచుండ మనలంకఁగల రక్కసులెల్లఁ దారకమంత్రము జపించుచు నేమంబున మహామునులం బరిహసింపుచుండిరి. దేవతల నాప్తభావంబునం బూజింపుచుండిరి. పుడమియందుంగలదనుజులు మన యాజ్ఞకులోనై వర్తింపుచుండిరి. బ్రహ్మపదంబున సముద్రమధ్యగృహంబునవసించి జీవహింసఁగావించెడి జ్వాలాముఖియనుదానవి విక్రమాదిత్యుని మనుమఁడు విజయ భాస్కరునిచేఁ జంపఁబడినది. ఆగృహము మన వశము జేసికొంటిమని చెప్పిన విని విభీషణుండు ఏమీ? అమ్మహాపాతకురాలు మడసినదియా? అది వరగర్వంబున మనలఁ దిరస్కరించు చుండునది. దానిం జంపినవాఁడు విక్రమార్కుని మనుమఁడా? ఆహా ! ఆ మహారాజు సుగుణ గుణంబులు గంధర్వులు పాడు చుండఁ బెక్కుసారులు వినియుంటిని. మంచిమాట చెప్పితిరి. ఆరహస్యగృహంబున మరెవ్వరేని క్రూరులు చేరలేదుగదా? అని అడిగినఁ బ్రహస్తుం డిట్లనియె
దేవా ! ఆసదనము మనభటులు కాచుచునేయుండిరి. మఱియు జ్వాలాముఖి సోదరుఁడు రక్తాక్షుం డనువాఁడు గర్భభరాలసయైన యొక యువతిఁబతితోఁ దీసుకొనివచ్చి యందు దాచెనఁట. ఆ వార్త గింకరులు మాకెఱింగించిరి. యువరాజుగా రారక్కసునిఁ దోడ్కొని రండని యాజ్ఞాపించిరి. రాజభటులు బోయి యా శాసనము వానికెఱిం గించినవాఁడు బెదురుచు నెదిరించి దొరకక నాపురుషనెత్తుకొని యెచ్చటికో పారి పోయెను. అంతలో నాకాంతకు నెలలు నిండుటయుఁ బ్రసవవేదన యావిర్భవించి మగ శిశువుం గనినదట. ఆకథమేము విని యుపచారములకై కొందర పరిచారకులనంపి నెల దాటినతోడనే యాచేడియను శిశువుతోఁ గూడ నిందుఁ దీసికొని రమ్మని నియమించితిమి. వారునుం బోయి మాతాశిశువులం గడు జాగరూకులై కాపాడుచుండ నానెల లోపల నాపలలాశనుండు వెండి యుజ్జనుదెంచి పరిచారకులుమొరవెట్టుచుండ శిశువుతోఁ గూడ నాచేడియ నెత్తుకొని పారిపోయెను. రక్షకభటు లెరిగి వెంటఁబడి తరముకొని పోయిరఁట. వాఁడు పాతాళములోనికిం బోవుడు భోగవతి నగరోపరిభాగంబున మన భటులు వానిం బట్టుకొనిరి. కాని వాఁడు బాలునితోఁగూడ నాచేడియను గ్రిందికిఁ బడ వైచెను
అప్పుడు వానిం బట్టుకొని మనభటులు పెడికేలు గట్టి యివ్వీటికిఁదీసికొనివచ్చు చుండ నడుమ వాఁడెట్లో తప్పించుకొని పారిపోయెనఁట పాపమా మాతాశిశువులు క్రిందఁబడుటచే సమసిరని దూతలు వచ్చి యాకథయంతయుఁ దెలిపిరి.
అని యెఱింగించిన విని విభీషణుండు కటకటంబడి మనుమనితో నిట్లనియె? వత్సా ! రక్తాక్షుం డట్టియక్రమ కృత్యంబులం గావించుచుండ నుపేక్షింతివేల? ఇదియా నీరాజ్యపాలనము అయ్యయ్యో? నిష్కారణము దిక్కులేక యక్కాంతయును బాలుండును బలవంతమున మడిసిరే? వాఁడట్టివారి మరియెందఱఁ బరిమార్చుచుండెనో? స్వయముగాఁ బోయి నీవా దానవుని వెదకియేమిటికి శిక్షింతివికావు? పాతాళంబునందలి రక్కసులు మనయాజ్ఞనుల్లంఘించుచుండిరాయేమి? బాగు బాగు. అని యాక్షేపించిన విని బాలవిభీషణుం డెద్దియో చెప్పంబొవుడు నడ్డంబై ప్రహస్తుండిట్లనియె.
దేవా ! దేవరవారు వృద్దులై తాపసవృత్తి వహించుటయు లంకంగల రాక్షసులు మాయాబల శూన్యులగుటయు నరసి రసాతలంబునం గల దానవులు మన యాజ్ఞ మన్నించుటలేదు. తలాతలము కవచమువలె వారిం గాపాడుచున్నది.
అందున్నవారి మనమేమియుం జేయఁజాలము. ఇపుడు మఱియొక యుపద్రవము తటస్థించినది వినుండు.
రసాతలాధిచితులగు కౌరవ్యునకు నేలాపుత్రునకుఁ గన్యకా మూలమునఁ దగవువచ్చి యిపుడు పెద్దయుద్ధము జరుగుచున్నది. తక్షకవంశన్థులకు నందుగల రక్కసులు మిత్రులగుటఁ దద్వంశ సంజాతుండగు నేలాపుత్రుఁడు వాసుకి వంశజుండైన కౌరవ్యుని కూఁతురు తేజోవతికిఁ దనకుమారుఁడు పారిజాతున కిమ్మని అడిగిన నతండొడం బడమినలిగి రాక్షససహాయ బలంబునం గ్రొవ్వి చివరకు రాయభారము బంపెనఁట. కౌరవ్యుండు భయార్తుండై యావార్త మనకుం దెలియంజేసి సహాయము రమ్మనుటయు మీమనుమఁడు వారి కీసందేశమంపెను.
గీ. వలదు యుద్ధము వాసుకి వంగడంబు
మాకుఁ బ్రాణమువంటిది మదిఁదలంపు
కడఁగి యన్యాయమునకు విక్రమముజూపఁ
దగునె కనవె విభీషణు ధర్మబుద్ది.
గీ. అన్న యైనను విడిచెఁ బాపాత్ముఁ డగుట
శాత్రవుండైన ధర్మవిశ్వాస గరిమ
నాశ్రయించెను శ్రీరాము నది యెఱింగి
సంధి గావించుకొనుఁడు రక్షకము గాఁగ.
గీ. కానిచో నింక నాగలోకమున కరయ
రాజులందఱు లేరు ధర్మప్రసక్తిఁ
బాలనముసేయు నేకాత పత్రముగను
బలిమి గౌరవ్యుఁ డొక్కఁడే తెలిసికొనుడు.
శా. లంకాపట్టణ వీరులాస్థవిరబాల స్త్రీసమేతంబు సా
హండారంబుగ నాఫణీంద్రునకుఁ దోడైవచ్చి యాజిన్నిరా
టంకం బొప్పఁగ నీబలంబులను జుట్టంబెట్టి వారాశిని
శ్శంకన్ ముంచెదరింతవట్టు నిజమ స్మద్వీర్యముల్ గ్రొత్తలే.
క. ఏలా? పుత్రుకతంబున
నేలాపుత్రా! యకార్య మీవొనరింపన్
మేలాపుత్రుని దుర్నయ
శీలాపత్రవునిఁబట్టి శిక్షింపంగన్.
అని మఱియు ననేక నీత్యుపదేశములతో నేలాపుత్రునకు రాయభారము బంపితమి. అదుర్వినీతుఁడెట్టి ప్రత్యుత్తరము వ్రాయించెనో చూచితిరా? వినుండు.
గీ. దనుజసత్తమ ! మేమెఱుఁగనివి కావు
నీచరిత్రలు శాత్రవునిం భజించి
రాజ్యలోభంబునను జేసి భాతృసుత హి
తాళిఁజంపించి తఘ మింతకన్నఁ గలదె
గీ. విడువఁదగునె వెతలఁబడి కుందుతఱి నన్న
నెట్టివాడైన వీరుఁడెఱిఁగి యెఱిఁగి
రిపుపదంబుకట్టి నృపతియై మనుకంటె
బోరఁ జచ్చి యశముఁబొందు టరిది.
గీ. అన్న జంపించి కొన్న రాజ్యమున నిలిచి
తేనెఁబూసిన కత్తి చందాన లోని
దుర్నయంబుల నెల్ల బైఁబోవనీక
పరమధర్మంబు లెఱిఁగింతువొరులకీవు.
ఉ. నీతివిదుండువోలె రజనీచరసత్తమ: మాకుఁదెల్పె దీ
చాతురి మెచ్చవచ్చు బలిపద్మమునంగల నాగులెల్ల నీ
చేతఁ బ్రభుత్వమీయఁబడి చేరినయ ట్లదలించుచుంటి
వౌఁరా? తలకెక్కెఁ బాడుకలు రక్కసులెంతటి సాధులైరటన్.
మ. విను లంకాపురివారుగారు మఱి బోర్వీర్యంబునం బేరుపొం
దిన నానాభువనంబులం గల సురద్వేషుల్ మహేంద్రాదులే
పున నేకంబుగఁ గూడివచ్చి బవరంబుంజేసినం బోక నొ
క్కనిమేషంబున మిమ్ముఁ గెల్చిజయముంగై కొందుమోదానవా?
క. నీవొక వివేకవంతుఁడ
వే? వీరుఁడవే? తృణప్రవృత కూపగతిన్
బై వెలయింతువు నీతుల
కోవిదుఁడవుగావు చెప్పకుము ధర్మంబుల్.
సీ. శేషుఁడెంతటివాఁడు చెప్పంగనగునె వా
సుకి ప్రభావంబు తక్షకునిమహిమ
కొనియాడవశమె కర్కోటకు సామర్థ్య
మలఁతియే ధృతరాష్ట్రు నతియంబు
ప్రణుతింపఁదరమె కౌరవ్యు నాధిక్యము
సన్నుతింపఁగ బ్రహ్మశక్యమగునె
తరమె యెలాపుత్రు గరిమవర్ణింపంగ
నైరావతుఁడు నుతి కంతువాఁడె
గీ. జగము లన్నింటి బ్రోవంగ జాలువారు
మాదు పెద్దలు బుద్దులు మాకు మేము
చెప్పుకొననవలెగాక శాసించి యిట్టు
లవుర। తెలుపంగ నీ వెవ్వఁడవుర మూఢ.
అని మనకు మరల రాయబారముఁ బంపెనని చెప్పిన విని విభీషణుఁడు భీషణభ్రుకుటీముఖుండై యేమేమీ? ఏలాపుత్రునికే యింతక్రొవ్వు. మనకు దాసుఁడై క్రుమ్మరు నా నీచున కింత ప్రౌఢిమ యెట్లు వచ్చినది. యెవని యూతఁజూచి యిట్లు ప్రల్లదము లాడెను. కానిమ్ము పిమ్మట నేమిగావించితిరని అడిగినఁ బ్రహస్తుండు దేవా! మన లంకంగఁల వీరభటులనెల్లఁ గౌరవ్యునికి సహాయముగాఁ బంపితిమి. పోరు ఘోరంబుగ జరుగుచున్నఁదట మఱియు మనవారి బలమలఁతియగుచున్నదని ఈనడుమ గాలివార్త దెలిసిన శాఁబరీ గ్రంధాలయము దెరపించి మాయావిద్యాల నేర్పించి పెక్కండ్ర రక్కసుల మొన్ననే యుద్ధమునఁ బంపితిమని యావృత్తాంత మంతయుం జెప్పెను. ఆకథ యంతయును విని విభీషణుం డొక్కింతసేపు శ్రీరామ నామమంత్ర పారాయణపరాయణత్వమున వివశుండై అంతలోఁ దెలిసి ప్రహస్తా! యేలా పుత్రుఁడు దుర్వారబల సహాయబల గర్వితుండై పోరుచున్న వాఁడు మనము తగు ప్రయత్నము చేయవలయును లంకలోఁగల మూలబలంబులునెల్ల నాయితము గావింపుము ఇప్పుడు యుద్ధమెట్లున్నదో వార్తాహరులనంపి తెలిసికొనుమని పలుకచుండఁగనే రాక్షసవీరుల హాహా కారధ్వనులు వినంబడినవి.
అందఱు నాదెస చెవియొగ్గి వినిరి. ఘోరముగా నాధ్వని వినంబడుచుండెను. కొందఱాదెసకుఁ పరుగిడిపోయిరి అంతలోఁ బాతాళములుండి పరాజితులై రక్కసులు పారిపోయి వచ్చుచున్నారను వార్తయొకటి వ్యాపించినది. ఆమాట విని విభీషణుం డదరిపడి ప్రహస్తుం జూచి నేననలేదా?. మన కపజయము గలుగునని సూచనలు దోఁచినవి. నిజమేమియో తెలిసికొనుము తరువాత సన్నాహము గావింతమని పలికెను.
అట్లువారు సంభాషించుకొనుచుండగనే పాతాళమునుండి వచ్చిన రాక్షసబలములా ప్రదేశము నిండించినవి అప్పుడు సేనాధిపతియగు దుర్దముండు దీనవదనుండై రాజునొద్దకు వచ్చి నమస్కరించి నిలువంబడుటయుఁ బ్రహస్తుండు వాని నమస్కారము లందుకొని యిట్లనియె దుర్దమా ! యరిమర్దన సమర్థములగు మనబలంబు లిట్లు యుద్దవిముఖంబులై వచ్చుటకుఁ గారణంబేమి? అందు శౌర్యధుర్యులగు మహావీరు లెవ్వరు గలరు? సంగరంబెట్లు జరిగినది? మీరేమి చేసితిరి? సవిస్తరంబుగఁ దెలుపుఁడని యడిగిన నావాహినీపతి యిట్లనియె.
దేవా! దేవరవారి యానతీ వడువునఁ జతురంగబలంబులంగూడికొని నేనును గుప్తబిలమార్గంబున రసాతలంబున కరిగి కౌరవ్యునింగాంచి తమ సందేశం బెఱింగించితిని. అయ్యురగాధిపతి మమ్ముఁజూచి అపరిమితానందంబుఁ జెందుచు దమ బలంబులతోఁ గలిసివ్యూహంబులుగా నిలువ నాజ్ఞాపించెను. అప్పటికి భోగవతీనగరంబునకు దక్షిణముగా రెండుక్రోశముల దూరములో శత్రుబలములు వ్యూహముగా నిలువంబడి యున్నట్లు తెలియవచ్చినది.
తలాతల రసాతలంబులంగల రాక్షసబలంబులు తక్షక కర్కోటక బలంబులుం గలసి రోదసీకుహరంబునిండ గర్జిల్లుచుఁ బెల్లుకొని వచ్చు కల్లోలమాలింబోలె నాబీల రౌద్రవేశంబున అరుదెంచి యొక్క పెట్టున నప్పట్టణంబు ముట్టడింప దలపెట్టి యట్టి సన్నాహము గావింపు చుండిరఁట.
మేమును సర్పబలంబులును, దర్పంబున వ్యూహంబులుగా బురి చుట్టునుం గాచికొని శస్త్రాస్త్రప్రయోగంబులం గావించుచుంటిమి. మా రాకవిని మూడుదినంబుల దాక నెదరి మూకలు వ్యూహంబునందలి కదలి మీఁదికి రాలేకపోయినవి. అప్పుడు మేమే విజృంభించి పలు సన్నాహములతోఁ బోయి శత్రువ్యూహముపైఁబడి ఘోరంబుగాఁ బోరుఁ గావించితిమి. దేవా ! ఇఁక జెప్పనేల. అప్పుడు మన బలంబులు ముప్పిరిగొను కోపంబున రౌద్రంబు రూపంబు దాల్చినయట్లు శస్త్రాస్త్రంబులఁ బ్రయోగించియు ఖడ్గంబుల నరికియు గదల మోదియు పరిశువుల నేసియు శూలంబుల గ్రుచ్చియు ప్రాసంబుల ద్రోసియు పట్టంబుల ఘట్టించియు నర్థదివసములో శత్రుపైన్యములనెల్లఁ బీనుఁగు పెంటలం గావించినవి.
మారాయిడికి నిలువలేక కాకోదరబలంబులు దనజానీకముతోఁ గూడఁ దోకద్రెంపిన పిట్టవలె వెన్నిచ్చి తమపట్టణము దెసకుఁ బారిపోవఁ దొడంగినవి. మేమును గొంతదూరము వారిందరిమి విజయ నాదములతో మరల బురిఁజేరి కౌరవ్యునకు సంతోషము గలుగజేసితిమి. నాఁటిదివసంబెల్ల విజయోత్సాహంబునఁ దృష్టిగా వెళ్ళించితిమి మరునాఁడు తెల్లవారినదో లేదో శత్రువీరుల సింహనాదములు భీషణముగా మాచెవులం బడినవి. అపుడు మాబలంబులెల్ల రిపుల నెదిరించినవి. వెండియు నుభయ బలంబులకుఁ బ్రచండభండనంబు జరిగినది.
దేవా ! వినుండు అందొక మహావీరపురుషుండు తురగారూఢుండై యెక్కడఁ జూచినను దాన కనంబడుచు గొఱవిద్రిప్పినట్లు వ్యూహంబులఁ దిఱిగివచ్చుచు మెఱపు మెఱసినట్లు క్షణమొకచోట నిలువక శస్త్రాస్త్రవర్షంబున మన సేనలనెల్ల ముంచిముంచి అందఱకు నందరై యర్దయామములో మమునెల్లఁ గాందిసీకుల గావించెను.
పెక్కేల మనలో నొక్కవీరుండైన వాని నెదిరించినవాఁడు లేఁడు. అప్పుడు వానియాకారము జూడఁ బ్రళయాంతంబున జగంబుల సంహరించురుద్రుండువలె వెఱపుగలుగఁజేసినది. ఇది యతిశయోక్తిగాదు. యదార్దము మేముకాదు ముప్పది మూడుకోట్లు వేల్పులు వచ్చినను వానితోఁ బోరజాలరని రూఢిగాఁ జెప్పగలను.
పిమ్మట మమ్ముఁ దఱిమికొనివచ్చి శత్రుబలంబులు భోగవతీపురంబు ముట్టడించినవి. పౌరులెల్లఁ దల్ల డపడి స్త్రీ బాలవృద్ద సహితముగ నగరంబువిడిచి అడవుల పాలైన పిమ్మట మేమా కోటలోనికిఁ బ్రవేశింపకుండఁ దలుపులు మూసి బురజులపై నెక్కి యోపిన గతిఁబోరితిమి. యామహావీరుని పరాక్రమమునకుఁ గోటలు నగరడ్తలును నాటంకములగునా? ఏలాపుత్రుఁడు కౌరవ్యపుత్రికయగు తేజోవతిని బలవంతముగాఁ దీసికొనిపోయి తనపుత్రుఁడగు పారిజాతునకుఁ బెండ్లి సేయుటకు నిశ్చయించి యావీరుని సహాయమునఁ దలుపులు విదళించి బలంబులనో లోపలఁ బ్రవేశించెను. అప్పుడు మేమేమిజేయుటకుం దోచక వాని దుర్వృత్తినెఱిఁగి తేజోవతితోఁగూడ నంతఃపుర కాంతల నెల్ల నందలంబుల నెక్కించి గుప్తద్వారంబున నిచ్చటికిఁ దీసికొని వచ్చితిమి. కౌరవ్యుఁడు శత్రువులచేఁ బట్టువడెనని తరువాత వార్తలు వచ్చినవి. నాగకాంతల నెల్ల నిప్పుడే దేవరవారి యంతిపురమునకనిపి వచ్చితినని యయ్యుదంతమంతయు నెఱి గించెను. ఆకథవిని విభీషణుడు శోకసంభ్రమాశ్చర్య వివశుండై ప్రహస్తా ? శత్రు హస్త గతుండై కౌరవ్యుం డెంతచింతించునో మనకాప్తుండై యిట్టి యిక్కట్టు జెంద దగునా? యితర వీరసహాయంబునం గాక యేలాపుత్రునకును నందుగల రాత్రించరులకును మనల నెదిరించు పరాక్రమ మెక్కడిది ? వారి శౌర్యదైర్యాదులు మనమెఱుంగనివియా? అవీరుఁడెవ్వడో తెలిసికొనవలసియున్నది. కానిండు నాగకాంతల జెఱఁబడ కుండఁ దీసికొని వచ్చితిరి గదా? మనము తగుప్రయత్నమునఁ బోలు కౌరవ్యుని మఱవ రాజ్యపదస్థునిఁ జేయవలసియున్నది. మన వీఁటంగల సేనలనెల్ల సిద్ధ పఱచి యుంచుము. ఈఱేయి మదభీష్టదేవతం బ్రార్థించి శుభాశుభ ఫలంబులం దెలిసికొనియెదనని ప్రహస్తునకు నియమించి విభీషణుండంతటితో సభచాలించి నాగకాంతల నూరడింప నంతఃపురమున కఱిగెను. అని యెఱింగించి మణిసిద్దుఁ డంతలో వేళ యతిక్రమించుటయు కథఁ జాలించి యవ్వలి మజిలీయందు తదనంతరోదంతం బిట్లని చెప్ప దొడంగెను.
118 వ మజిలీ.
తేజోవతి కథ
అమ్మా ! ఊరడిల్లుము. కౌరవ్యున కేమియుఁ గొదవరానీయరు. మాతాతగారు రెండుమూఁడు దినములలోఁ బోయి యేలాపుత్రుని బుత్రమిత్రకళత్రాదులతోఁ జెరసాలం బెట్టించెదనని శపధము జేసిరఁట వింటివా? మాతాత యెదుట నిలువఁబడు వీరు డెందును లేడు. గొప్పవారికే యాపదలు. తొల్లి మాపెద తాతవలన సీతామహాదేవి యెట్టి యిడుమలం బడినది. నీవు కంటఁ దడి పెట్టిన మాగుండెలు పగిలి పోవుచున్నవి. నీకేలోపమును లేదు. ఈ రాజ్యము నీదిగా భావింపుము మేము జిన్నవారము నీకుఁ జెప్పువారమా? మొదట వారికిని మీకును నీతగవేమిటికి వచ్చినది. యావృత్తాంతము జెప్పుము. అని యంతఃపురమునఁ జంపక తేజోవతి తల్లియగు పద్మావతి నూరడించుచు నడిగిన గన్నీరు దుడిచికొని యామె యిట్లనియె.
పుత్రీ ! మీయిల్లు నాకుఁ గొత్తదికాదు. నీతల్లికి నీ సుగుణంబులు చూచు భాగ్యము లేకపోయినది. నీతల్లియు నేనును దగ్గరచుట్టములము. వెనుక నామెతో నొక తేప నీలంకాపురికి వచ్చితిని. నన్ను బ్రాణపదముగాఁ జూచినది నీవు చిన్నదానవైనను నంతకంటె నెక్కువగా నాదరించుచుంటివి మా వృత్తాంతము జెప్పెద నాకర్ణింపుము పాతాళలోకము నీవెప్పుడును చూచియుండలేదు. భూలోకమున కడుగున నున్నది. ఈ