కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/169వ మజిలీ

వినక తనతోఁ గలియమని మమ్ముఁ బెక్కు బాములం బెట్టెను వెలయాండ్రకు నీతియెక్కడవని యాక్షేపించెను. మమ్ముఁ గారాగార ప్రాయమైన నికాయంబున నుంచి నిర్బంథించెను. మే మొప్పుకొనలేదు. తరువాత నేమిటికో మీ రిక్కడికిఁ దీసికొనివచ్చితిరి. ఇదియే మాకధయని యాజవరా లెఱింగించుచుండఁగనే నేను మేనుఝల్లుమన నోహో! వీరు నామిత్రులకళత్రములని మనవృత్తాంత మంతయు నతని కెఱింగించితిని.

నాపేరు ఘోటకముఖుండని విని యావనితారత్నములు మేను లుప్పొంగ నేమీ! నేఁ డెంతసుదినము. మీపేరు గోణికాపుత్రుండు చెప్పుచుండఁ బలుమారు వింటిమి. మహాత్మా! మీ రిక్కడి కెట్లువచ్చితిరి? మీయుదంత మెఱింగింపుఁ డనవుఁడు నాకథ వారికి వెండియుం జెప్పితిని. రాజపత్ని వారివృత్తాంతము విని జాలిపడుచు మిమ్ము మీభర్తల యొద్ద కనిపెద విచారింపవలదని యోదార్చినది. నాఁడు ఇష్టగోష్ఠీవినోదములతోఁ గాలక్షేపము గావించితిమి.

అని చెప్పెనని చెప్పువఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరనివాస ప్రదేశంబున నిట్లు చెప్పుచుండెను.

________

169 వ మజిలీ.

మదాలసకథ.

చక్రధరనరనాయకునిపత్ని మిత్రవింద చాల గుణసంపత్తిగలది. నే నమ్మఱునాఁడే యిందువచ్చుటకుఁ బయనమైతిని. తనతల్లి కుపకారము గావించితినని నన్ను మిక్కిలి పొగడుచు నారాజపత్ని నన్నట నుండి కదలనిచ్చినదికాదు. దినమున కొకరకము పిండివంటలు సేయుచు నా కత్యంతగౌరవము గావించినది. ఒకనాఁ డవ్వతో నీకూఁతురు మదాలసవంటి గుణసంపత్తిగలిగి యున్నదని పలికిన విని యారాజపత్ని మదాలసవృత్తాంత మెట్టిదో చెప్పుమని కోరుటయు నే నక్కథ వారి కిట్లు చెప్పితిని.

వినుండు పూర్వకాలంబున శత్రుజిత్తను రాజు పరాక్రమశాలి యై పుడమిం బాలించుచుండెను. నృపతికి ఋతుధ్వజుండను మహావీరుండు కుమారుఁడుగా నుదయించెను. ఆరాజపుత్రుఁడు బుద్ధిచే బృహస్పతిని రూపంబున మన్మధుని జ్ఞానంబునఁ గపిలుని విక్రమంబున శుక్రునిం దిరస్కరించుచు సమానవయోబుద్ధివిక్రమసారులగు నృపకుమారులతోఁ గూడికొని -

సీ. వితతస్వరంబు లుప్పతిలంగ వీణగై
                     కొని పాడు హాయిగాఁ గొంతసేపు
    మధుర ప్రబంధనిర్మాణ క్రియారత
                     స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
    దర్శనాగతతపోధనజనారాధనా
                     కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
    సకలశాస్త్రార్థప్రసంగసక్తిదలిర్పఁ
                     గోవిదావళిఁ గూడుఁ గొంతసేపు

గీ. నాగరథసైంధవారోహణప్రచార
   గురువిహారము లొనరించుఁ గొంతసేపు
   క్రూరమృగముల వేటాడుఁ గొంతసేపు
   మానినీభోగవిముఖుఁడై ఱేనిసుతుఁడు

తదీయక్రీడాభిరతి నెఱింగి బ్రహ్మక్షత్రియవైశ్యపుత్రులు దూర దేశములనుండి వచ్చి యతని నాశ్రయించి తిరుగుచుందురు. వచ్చినవారినెల్ల నాదరించుచు నారాజకుమారుండు వారికి క్రీడావిశేషంబులఁ గల్పించి యాడించుచుండును. అశ్వతరుండను నాగేంద్రునికుమారు లిరువురు మిక్కిలి చక్కనివారు తరుణవయస్కు లతనివాడుక విని బ్రాహ్మణపుత్రవేషధారులై యరుదెంచి యతని నాశ్రయించిరి.

ప్రియదర్శనులైన నాగకుమారుల నాదరించుచు రాజకుమారుండు తనకు విస్రంభపాత్రులగు మిత్రులలోఁ జేర్చికొని క్రీడించుచుండెను. ప్రతిదినము నాగకుమారులు రాత్రులఁ బాతాళలోకమున కేగుచుఁ బ్రొద్దుపొడువఁగ నే వచ్చి యతని నాశ్రయించి యుత్సవములలోఁ బాల్గొనుచుందురు. వారికి రాజపుత్రునందు ప్రీతి దినదినాభివృద్ధి వడయుచున్నది.

రాజపుత్రుఁడు నాగకుమారులు లేక భుజంపఁడు. స్నానము సేయఁడు. మంచిపుట్టంబులఁ గట్టడు. మాల్యాను లేపనాదుల ధరింపడు. అట్లు వా రన్యోన్య ప్రేమానుబంధపూర్వకమగు సౌహార్దముతో మెలఁగుచుండిరి.

ఒకనాఁ డశ్వతరుండు మర్త్యలోకమునుండి వచ్చిన కుమారులం గాంచి పుత్రులారా ! నిత్యము మీ రెక్కడికి పోవుచుంటిరి ? రాత్రులు దప్ప పగలు మీరిందుఁ గనంబడ రేమి ? అని యడిగినఁ దండ్రికి నమస్కరించుచు నాగకుమారు లిట్లనిరి. జనకా ! పుడమి ఋతుధ్వజుండను రాజపుత్రుండు మాకు మిత్రుండయ్యె. నతనిసుగుణంబులు శేషుండు వర్ణింపఁజాలఁడు. అతండు మామనసు లాకర్షించెను. వినయసంపన్నుండు. తద్వియోగంబు సైరింపఁజాలమని యతనివృత్తాంతము చెప్పిరి.

ఆకథ విని యశ్వతరుం డాహా ! అట్టిసుగుణసంపన్నునిఁ గుమారునిగాఁ బడసినతండ్రి యదృష్టమేమి ? పరోక్షమున నెవ్వరిగుణంబులు స్తుతియింతురో యతండే ధన్యుఁడు. అట్టిసుగుణఖని కేదేని యుపకారము సేయుతలంపు గలిగినది. మీనిమిత్తమై తదభీష్టము తీర్తు. మఱియు, మనయింటనున్న ధనకనకవస్తువాహనాదులలో నేదికోరినను నిత్తునని పలికిన నవ్వుచుఁ గుమారు లిట్లనిరి.

వానికి మనము చేయవలసిన యుపకార మొక్కటియును లేదు. సర్గమర్తపాతాళములనున్న రత్నము లతనియింటఁ గలవు. వాని యింటికి వచ్చి నిత్యము అర్థు లభీష్టకామంబుల వడసి పోవుచుందురు. అతనికి గావలసిన వస్తు వేమియును లేదు కాని మనఃప్రియంబగు కార్య మొండు గలదు. అది త్రిమూర్తులకుదక్క నితరులకు శక్యము గాదు అని చెప్పిన విని నాగేంద్రు డిట్లనియె.

పుత్రులారా! అతని కిష్టమైనపని యేదియో చెప్పుడు. అసాధ్యమో సాధ్యమో పిమ్మట విచారించెదంగాక! విద్వాంసులకు సాధ్యముకానిది కలదా? దృఢవ్యవసాయములు దేవత్వముగూడ సంపదింపగలరు. చీమైనను నిత్యము నడచినచో శతయోజనదూరమం దున్నను గమ్యస్థానమును బొందగలదు. నే నతనియభిలాష దీర్చెద వివరింపుడని పలికిన గుమారు లిట్లనిరి.

తండ్రీ! అతం డొకనాడు మాకు దనకౌమారచరితము జెప్పుచు నీవృత్తాంత మెరింగించె నాకర్ణింపుము. ఋతుధ్వజునితండ్రి శత్రుజిత్తు రాజ్యము సేయుచుండ దనచిన్నతనమునం దొకనాడు గాలవుండను మహర్షి యొకతురగముతో వచ్చి నృపతిచే నర్చితుండై యిట్లు వాక్రుచ్చెను. మహారాజా! నేను దపంబు సేసికొనుచుండ నొకరక్కసుడు నాయాశ్రమమునకు వచ్చి మాయాప్రభావంబున ననేకరూపములు వహించి నన్ను భయపెట్టుచున్నాడు. తపంబునకై కన్నులు మూసికొనునప్పటికి యేదో యల్లరి చేసి మనస్సు చలింపజేయును. కోపాగ్నిచో వాని భస్మము సేయగలిగియు దపోవ్యయంబునకు వెరచుచున్నాను. ఒకనా డాకసమువంక చూచుచు వాడుచేయు దుర్నయముల దలంచుచు వేడినిట్టూర్పు నిగుడించితిని. తన్నిశ్వాసమారుతాంతమునుండి యీతురంగము జనించి నేలం బడినది. తోడనే యాకాశవాణి యిట్లు పలికినది. మునీంద్రా! ఈసైంధవము పాతాళాంబరతోయాదులయందు నిరాటంకముగా బోవగలదు. భూవలయమంతయు నిరాయాసముగా దిరుగును. కావున దీనికి కువలయమను పేరు గలదు. దీనిం దీసికొనిపోయి శత్రుజిత్తుకుమారుని కర్పింపుము. అతం డారాక్షసుని సంహరింపగలడని యుపదేశించిన సంతసించుచు దీని గొని మీకడకు వచ్చితిని. దీనిపై నీకొడుకు నెక్కించి మాయాశ్రమమున కనుపుము. శత్రుసంహారము గావించునని పలికిన సంతసించుచు నతం డప్పుడే యందు బోవుటకు గుమారున కాజ్ఞాపించెను. ఋతుధ్వజుం డాయశ్వ మెక్కి గాలవునివెంట దదాశ్రమమున కరిగి దనుజురాక వేచియుండెను.

కువలయమను పేరుగల హయం బెక్కి తిరుగుటచే నతనికిఁ గువలయాశ్వుఁ డనునామాంతరము వచ్చినది. కువలయాశ్వుం డందున్నవిధం బెరుంగక యారాక్షసుండు సంధ్యాసమయంబున నగ్ని నారాధించుచున్న గాలవునొద్దకు వరాహరూపంబున నరుదెంచి యగ్నిగృహములోఁ జొరబడి భయపెట్టుచుండెను. అప్పుడు మునిబాలకులు పరుగెత్తికొనిపోయి ఋతుధ్వజుని కాతెఱం గెరింగించిరి.

రాజపుత్రుఁడు తురగ మెక్కి శరాసన మెక్కుపెట్టి యతిరయంబును బోయి యవ్వరాహము నర్ధచంద్రస్త్రముతోఁ గొట్టెను. ఆదెబ్బ నిది మొర్రోయని బొబ్బ పెట్టుచుఁ బారిపోవుటయు విడువక వెన్నంటి కువలయాశ్వుఁడు తరిమికొనిపోయెను. వాఁ డారూపమున బరుగెత్తుకొనిపోయి యొకర్తమునం బడి పాతాళమున కేగెను.

రాజపుత్రుఁడు నాగోతివెంబడి గుఱ్ఱమును నడిపించుచు నాదారి అంధకారమయంబైనను భయపడక చనుచుండఁ గొంతసేపటికి యాచీఁకటి అంతయుఁ బోయి గొప్పతేజముతోఁ బ్రకాశింపుచున్న యొకనగరము గనంబడినది. అందుఁ బ్రవేశించెను. ఆవరాహము కాని మరియెవ్వరుగాని కనంబడలేదు. మరియుం బరిశీలించి తిరుగుచుండ నొకసౌధముచెంత నిలువంబడియుండఁ జూచి అచ్చెరువుతోఁ దరుణీ

నీ వెవ్వతెవు ? ఈపుర మెవ్వరిది ? నీపేరేమి ? అని యడిగిన నప్పడఁతి యేమియు మాటాడక యామేడలోనికిఁ బోయినది.

అతం డాగుఱ్ఱమునుదిగి దాని నొకచోటఁ గట్టిపెట్టి తానుగూడ నాచేడియవెంట నామేడ యెక్కెను. ఆసౌధాంతరమున రత్న పర్యంకమునఁ బండుకొనియున్న యొకచిన్నది యతనికన్నులం బడినది రసాతల దేవతయోయనఁ బ్రకాశించుచున్న యాసుందరింజూచి రాజనందనుఁడు డెందము కందర్పభల్లముల కెల్లయై పొరటిల్లఁ బరవశుండయ్యెను.

అభినవమన్మధుండనందగు నృపనందనుని యందముజూచి యట్టె లేచి యాచిగురుఁబోఁడి చిత్తవిభ్రమము నొందినది. లజ్జావిస్మయలోలములగు చూపులచే నతనిఁ జూచుచు నాహా! ఈ సుకుమారుఁడు మరుఁడా ? పురందరకుమారుఁడా'! విద్యాధరుఁడా ? గంధర్వుఁడా? కిన్నరుఁడా? కృతపుణ్యరతియగు నరుఁడా? అని యాలోచించుచు నిట్టూర్పు నిగుడించుచు కామశరాహతచిత్తయై మూర్ఛవోయినది.

బాలా ! వెఱవకుము వెఱవకుము. అనిపలుకుచుఁ దొలుత నతని చేతఁ జూడఁబడినపడఁతుక తాళవృంతముబూని విసరుచుండెను. రాజపుత్రుఁడు మీరెవ్వరు ? ఈనగర మెవ్వరిది ? ఒంటిగా నిందుంటిరేల ? అనియడిగిన సఖురా లిట్లనియె.

మహాభాగ ! ఈగజయాన విశ్వావసుండను గంధర్వరాజు కూఁతురు. దీనిపేరు మదాలస. ఈయలసగమన యుద్యానవనములో విహరింపుచుండఁ బాతాళ కేతుండను దానవుఁ డీమానిని నెత్తుకొనివచ్చి యిందు దాచెను. రాఁబోవు త్రయోదశినాఁడు వాఁడు ఈచేడియం బెండ్లియాడ మహూర్త ముంచుకొనియెను. ఆవార్తవిని యీకార్తస్వరగాత్రి యాత్రము నొందుచు మరణప్రయత్నము గావింపుచుండ సురభి యరుదెంచి యాయుద్యమము వారించుచుఁ గొన్నిరహస్యము లెఱింగించినది. నే నీమెసఖురాలను. నాపేరు కుండలయండ్రు. ఈమె నిన్నుఁజూచి మోహవివశయైనది. నీ వెవ్వఁడవు ? నీవృత్తాంతము చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

కాంచనగాత్రీ ! నేను శత్రుజిత్తను ధాత్రీపతి పుత్రుండ. నాపేరు కువలయాశ్వుఁ డందురు. వరాహరూపము ధరించి గాలవమహర్షిని భయపెట్టుచున్న రాక్షసుం దరిమికొనివచ్చితిని. వాఁడు గోతిలోఁబడి యదృశ్యుఁడయ్యెను. విడువక వానివెంట వచ్చుటచే నా కీలోకము మీరునుఁ గనంబడితిరని తనవృత్తాంత మెఱింగించెను.

ఆకథవిని కుండల ఓహో ! నీవు భూమండలాఖండలుఁడవగు కువలయాశ్వుఁడవా ? అందులకే నిర్దుష్టమగు మదాలసహృదయము నిన్నుఁ జూచి చెదరినది. నిన్నే పెండ్లియాడుమని సురభి యెఱింగించినది. తద్వచనమున కన్యథాత్వము గలుగునా ? నీవు దీనిం బరిగ్రహింపుము. ఇది దేవప్రోక్తము. అని పలుకుచుఁ గులుకుచున్న యావధూవరులకు గాంధర్వవిధానంబునఁ బాణిగ్రహణ మహోత్సవము జరపినది.

మఱియుఁ గుండల తపోవనంబున కరుగుచు మదాలసహస్తం బతనిహస్తంబునం బెట్టి యిట్లుపన్యసించినది. రాజపుత్రా ! అమితప్రజ్ఞ గల పురుషులుగూడ నీకుఁ జెప్ప నేరరనుచో నాఁడుదాన నామాటల యం దేమిసార ముండెడిని? అయినను నాకు నీకోకస్తనియందుఁగల ప్రీతియే యిట్లు చెప్పుటకు నన్నుఁ బ్రోత్సాహపఱచుచున్నది. పతిచేత సర్వదా భరింపఁబడుచుండుటచే భార్య యనంబడుచున్నది. ధర్మార్థ కామసిద్ధికి భార్య భర్తకు సహాయురాలగును. భార్యావిహీనుఁడు . పురుషార్థములఁ బొందనేరఁడు. భార్యాభర్తలు పరస్పరానురాగయుక్తులై రేని అదియే ధర్మార్థకామముల సంఘటనము. దేవతాతిథిభృత్యవర్గంబుల మన్నించుటకు భార్యయే ముఖ్యము. ఈమె కడుముద్దరాలు. పెద్దలకడ మసలి యెఱుంగదు. ఈముద్దియం దిద్దుకొని యెల్లప్రొద్దుల విడువక తద్దయుంబ్రీతిఁ జూచుచుండుము. అని యుపదేశించి కుండల యేగినది. పిమ్మట నాకొమ్మను హయమ్ముపై నెక్కించుకొని రయమ్మున నతండు భూలోకంబున కరుగుచుండం దెలిసికొని చతురంగబలములతోఁ బాతాళ కేతుఁ డడ్డగించెను నిలు నిలుమని పలుకుచుఁ దదనుచరులు శరవర్షము గురిపించిరి. గాజపుత్రుఁడు నవ్వుచు నారిసంధించి త్వష్టాస్త్రము వారిపైఁ బ్రయోగించుటయుఁ గాపిలతేజంబు సగరపుత్రులవలె నయ్యస్త్రంబు పాతాళ కేతునితోఁ గూడ రక్కసుల నెల్ల భస్మముగావించినది.

తరువాతఁ గువలయాశ్వుండు నిర్భయముగాఁ దనపురంబున కరిగి జరిగినకథయంతయుఁ జెప్పి మదాలసం జూపెను శత్రుజిత్తు పుత్రుం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణము గావించుచు మిక్కిలి సంతోషించెను.

కువలయాశ్వుండు ఉద్యానవనపర్వతసానువులయందు భార్యతో విహరించుచు గొంతకాలము సుఖముగా వెళ్లించెను.

కొన్నిదినము లరిగినతరువాత నొకనాఁడు శత్రుజిత్తు పుత్రుఁ గాంచి వత్సా! నీవు ప్రతిదినము నీయశ్వమెక్కి యరుగుచు బ్రాహ్మణుల రక్షింపవలయును. తపోధనబాధకుల వెదకి పరిభవింప వలయును. దుర్బుద్ధులగురక్కసు లక్కడక్కడ డాగియుందురు. వారిబాధ లేకుండఁ గాపాడుమని యుపదేశించిన సంతసించుచుఁ గువలయాశ్వుం డాయశ్వ మెక్కి యనుదినము పూర్వాహ్ణమున భూమిదిరిగివచ్చి తండ్రికి నమస్కరించుచు మిగిలినవేళలయందు మదాలసతోఁ గ్రీడింపుచుండెను.

పాతాళకేతునితమ్ముఁడు తాళకేతుఁడనువాఁడు కడుమాయావి. యమునాతీరంబున నొకయాశ్రమము గల్పించుకొని యందు ముని వేషము వైచికొని తపము సేయుచున్నట్లభినయించుచుండెను. ఒక నాఁడు రాజపుత్రుఁడు ఋష్యాశ్రమములఁ దిరుగుచు నతనియొద్దకుఁ బోయి మహర్షి యనుకొని నమస్కరించుచు మహాత్మా ! మీకు రాక్షసబాధ యేమియును లేదుగదా ! నిర్విఘ్నముగాఁ దపంబు సాగుచున్నదియా ? అని యడిగిన నక్కపటాత్ముండు మౌనముద్ర విడిచి యిట్లనియె. రాజపుత్రా ! నీవంటిశూరుండు మాకు రక్షకుఁడైయుండఁ దపోవిఘ్న మెట్లగును? లెస్సగా జరగుచున్నది. మఱియు నిన్నొక్కటి యాచించుచున్నవాఁడ లేదనక యిత్తువనియే తలంచెదను. వినుము. నే నొక యజ్ఞము సేయఁదలఁచుకొంటిని. అందులకు ధనము కావలయు. దక్షిణాప్రధానములగు వారుణేష్టులు పెక్కు లాతంత్రమునఁ జేయవలసి యున్నవి. కావున నీమెడనున్న కంఠాభరణము నాకిమ్ము. దాన జన్నము పూర్తియగును. మఱియు నేను జలంబున మునింగి వారుణేష్టులఁ గావించుచుండెద నప్పుడు నీవు తీరమున వసించి దనుజబాధ బొరయకుండఁ గాపాడవలయు నిదియే నాకోరికయని పలికిన సంతసించుచు నారాజ సూనుఁ డోహో ! యిందుల కింతవినయమేల? ఇదిగో కంఠభూషణము గైకొనుఁడని పలుకుచుఁ దీసి వానిచేతంబెట్టి మహాత్మా ! నేను ధనుర్ధరుఁడనై నీయాశ్రమసమీపమున నుండెద. నీవు నిర్భయముగా వరుణు నారాధింపుము. అంతరాయము రాకుండఁ గాపాడెదనని చెప్పెను.

ఆకపటయతి యతఁడు సూచుచుండ జలంబున మునింగి క్రమంబున నవ్వలకుఁజేరి పోయి పోయి తిన్నగా శత్రుజిత్తునొద్దకుఁ బోయి స్త్రీ సమక్షమున నిట్లు తెలియఁజేసెను. నీవు కువలయాశ్వుని తండ్రివేనా ? పాప మతఁడు గుఱ్ఱమెక్కి ఋష్యాశ్రమముల సంచరించుచుండ నొక దానవుం డతనితోఁ బ్రచండభండనము గావించి పలాయితుంజేసి వెనువెంటఁ దఱిమికొనివచ్చి నాయాశ్రమము నెదుట నేను సూచుచుండ శూలముపుచ్చుకొని కడుపులో గ్రుచ్చి గతాసుం గావించెను. హరిహరీ ! మీ కెట్టిదారుణపువార్త చెప్పుచుంటిని !

ప్రాణోత్క్రమణసమయంబున నీకుమారుఁడు నా కీకంఠాభరణ మిచ్చెను. అతనిహయము నాదానవుఁడు తీసికొనిపోయెను. అందున్న తాపసు లతని దేహసంస్కారమును గావించిరి. సమలోష్టకాంచనులమగు మా కీయాభరణముతోఁ బనియేమిటికి ? నీవు గైకొనుము. అని పలుకుచు నామండన మందుఁ బారవిడిచి యతఁ డరిగెను.

ఆమాటలు విని యందున్న వారెల్ల హాహాకారము గావింపుచు మూర్ఛవాయిరి. మదాలస భర్త మృతినొందెననువార్త వినుచుండఁగ నే కరవాలఖండితరంభాతరుకాండంబువోలె నేలంబడి యసువులం బాసినది. కువలయాశ్వునితలిదండ్రులు కొంతసేపటికి తెప్పిరిల్లిరి. మదాలస చావువిని మఱియును దుఃఖించుచున్న భార్య నోదార్చుచు శత్రుజిత్తు ఇట్లనియె.

సాధ్వీ ! భూతములయొక్క యనిత్యత దెలిసికొనినఁ గుమారుని నిమిత్తము కోడలినిమిత్తము మనము విచారింపవలసినపనిలేదు. కుమారుఁడు బ్రాహ్మణార్థమై ప్రాణములు వదలెను. కోడలు భర్తనిమిత్తము మేను బాసినది. ఈయిద్దఱిమరణములు స్తోత్రపాత్రములై యున్నవి. క్షత్రియుఁడు సంగరంబునఁ జచ్చుటయు స్త్రీ సహగమనము సేయుటయుఁ గోటియాగములు చేసినకన్న నధికపుణ్యప్రదమని యార్యులు సెప్పుదురు. వారికొఱకు విచారింపఁదగదని ధైర్యము గఱపుచు వారి కూర్ధ్వదైహికక్రియలు నిర్వర్తించి సద్గోష్టితోఁ గాలక్షేపము గావింపుచుండెను,

తాళకేతుండు యమునాజలంబువెడలి యొడ్డున కోదండధారియై, యోరిమితోఁ గాచుచున్న కువలయాశ్వుంజూచి తలయూచుచు నిట్లనియె. రాజపుత్రా ! చిరకాలమునుండి యభిలషించుచున్న కార్యము నెఱవేఱినది. కృతార్ధుండనైతిని నాపని నాకైనది. నీ విఁక నింటికిం బోవచ్చునని పలికిన మహాప్రసాదమని వినయమభినయించుచుఁ గువలయాశ్వుం డశ్వమెక్కి నిజపురంబున కరిగెను. నగరరాజమార్గమునఁ జనుచున్న యతనిం జూచి జనులుకొందఱు మనంబున దుఃఖించుచు మోమున విన్నదనంబు దోఁపఁ దలవంచుకొనిరి. కొందఱు మోలుము వికసింప నొండొరులఁ గౌఁగిలించుకొనుచు సంతోషమును వెలిబుచ్చిరి మఱికొందఱు విస్మయముగాఁ జూచుచుండిరి. కొంద ఱతని మూగికొని వెనువెంట నడుచు చుండిరి. పౌరులలీలలు జూచి యతండు డోలాయితహృదయుండై యెవ్వరి నేమియు నడుగక తిన్నగాఁ దండ్రిగారియింటికిఁ జుని జనకుని పాదంబులంబడి నమస్కరించెను.

తండ్రి యతనిం గౌఁగిలించుకొని కన్నీటిచే శిరంబుదడుపుచు గద్గదకఠముతోఁ జిరంజీవ ! అని యాశీర్వదించెను. తల్లియు బంధువులు శోకమును వెలిపుచ్చుచు నాతని నాశీర్వదించిరి. అందున్న వారెల్లఁ దన్ను వింతగాఁ జూచుచుండ రాజకుమారుండు వెఱఁగుపడుచుఁ దండ్రీ! నేఁడు నన్ను మీరందఱు క్రొత్తగాఁ జూచుచున్నా రేమి ? విశేషము లేమైనం జరగినవియా ? నాప్రాణనాయకి మదాలస సేమముగా నున్నదా ? అని యడిగిన దుఃఖించుచు రాజు పుత్రున కా తెఱంగంతయు నెఱింగించెను.

రెండుగడియ లేమియు మాటాడక స్థబ్ధుడై కన్నులుమూసికొని పిమ్మట నిట్లుతలంచెను. ఆహా ! ఆమహాసాధ్వి నామరణము వినినతోడనే ప్రాణములు విడిచినది. నాకతంబున మృతినొందిన యాసతీమణి వార్తవిని నే నిట్లే బ్రతికియుంటి. నాకంటెఁ గృతఘ్నుం డెందైనం గలఁడా ? నేను గ్రూరుఁడ ననార్యుఁడఁ బాపాత్ముండ దయాశూన్యుఁడ నని పెద్దగా నిందించుకొని యాసుందరిం దలంచుకొని దుఃఖించుచు మనంబును దృఢపఱచుకొని మోహమును విడిచి వేడినిట్టూర్పు నిగుడింపుచు నిట్లుతలంచెను. నానిమిత్తమై యమ్మత్తకాశిని దేహమును బాసినదని తలంచి నేనును సమసెదంగాక, దాన నామెకు వచ్చెడు లాభ మేమి యున్న ది ? అది స్త్రీలకు యశస్కరము కాని పురుషులకుఁ గాదు. అట్లు చేసితినేని లోకులు నిందింతురు. హా ! ప్రియా ! హా ! ప్రియా ! అని దెసలు ప్రతిధ్వను లిచ్చునట్లు ప్రతిదినము రోదనము చేసేదంగాక. అదియు నపకీర్తిహేతువే. సజ్జనులు నన్నుఁజూచి నవ్వకమానరు. పోనీ శోకజడుండనై దీనుండనై సిగ్గువిడిచి మలినాంగుఁడనై వెఱ్ఱివాఁడుంబోలెఁ దిరుగుదమన్న శత్రువులు లోకువసేసి పరిభవింతురు. శత్రువధ యుఁ బితృశుశ్రూషణము నాకు ముఖ్యవిధులు, కావున నే నింతటినుండియు స్త్రీభోగము విడిచెదను. ఇందువలన నాలలనకువచ్చిన లాభము లేదుకాని నాకొఱకుఁ బ్రాణములు విడిచిన యప్పడఁతివిషయమై యీమాత్రమైన కృతజ్ఞత చూపవలదా ? ఇఁక నేపనికిఁ బోక యుదాసీనుండనై యుండెదనని తలంచి భార్యకుఁ దిలోదకములిచ్చి యిట్లు ప్రతిజ్ఞ గావించెను.

“నాప్రియురాలగు మదాలస నానిమిత్తమై ప్రాణములు విడిచినది కావున నే నిఁక నీజన్మమున మఱియొకస్త్రీని వివాహమాడను. సత్యముగాఁ జెప్పుచున్నాను.” అని ప్రతిజ్ఞ జేసి కువలయాశ్వుం డది మొదలు స్త్రీభోగవిముఖములగు పనులు గావింపుచున్నాఁడు. వయస్యులతోఁ గూడికొని శృంగార రహితములగు కృత్యములనే జేయుచున్నాడు. తండ్రీ! అతనికి మన మేమిచ్చినను సంతోషము గలుగదు. అతనిప్రియురాలు మదాలసను దీసికొని యర్పింతుమేని పూర్తిగా సంతోషించును. ఆపని మనకు శక్యముగాదని చెప్పిన విని నవ్వుచు నశ్వతరుం డిట్లనియె.

పుత్రులారా ! ఆశక్యమని యేకార్యమును బ్రయత్నింపక విడువరాదు. శక్యమనియే తలఁచి ప్రయత్నింపవలయును. కర్మఫలము దైవ మందున్నది. దున్నక భూమి ఫలింపదుగదా! నే నందులకుఁ బ్రయత్నించి యమ్మహాత్మున కోపినయుపకారము గావించెదఁ, దపంబునకు సాధ్యముకానిది లేదు, తపంబున విశ్వామిత్రుఁడు సృష్టికిఁ బ్రతిసృష్టి గావించెనని పలుకుచు నప్పుడ బయలుదేరి హిమవద్గిరిపరిసరంబునఁ బ్లక్షావతరణంబను తీర్థంబున సరస్వతీదేవింగూర్చి తపంబు గావించెను.

శ్లో॥ యేర్ధానిత్యాయేచ నశ్యంతిచాన్యె యేర్ధాస్థూలాయేచ సూక్ష్మాతి సూక్ష్మః ।
     యెవాభూమౌ యెంతరిక్షెన్యతోవా తెషాందేవీ! త్వత్త ఏవోపలబ్ధిః ॥

భూమియందు నాకాశమందు నితరస్థలములయందున్న స్థూల సూక్ష్మవస్తుజాలమునకెల్ల నీవే ప్రధానురాలవు. నీవలననే సృష్టిస్థితి లయములు జరుగుచున్నవని పలుకుచు సరస్వతి నారాధించుటయుఁ దద్భక్తివిశ్వాసములకు సంతోషించి భాషాదేవి ప్రసన్నురాలై నీ కేమి కావలయునని యడిగిన నాపన్నగేంద్రుఁడు దేవీ ! నాకుఁ గంబళుఁడను మిత్రుఁడు గలఁడు. మాయిరువురకు స్వరసంబంధముగల సంగీతవిద్య యంతయు వచ్చున ట్లనుగ్రహింపుము. అని కోరిన మెచ్చుకొని భాషా దేవి భుజగేంద్రా ! మీ కట్టివిద్య ప్రసాదించితిని. గానకళలో మిమ్ము మించినవారుండరు. మీగానము శ్రోత్రానందముగానుండునని వరంబిచ్చి వాణీదేవి యంతర్ధానము నొందినది. తదనుగ్రహసంప్రాప్త సంగీతవిద్యావిశేషులై శేషకులావతంసుఁడగు కంబళుఁడు నశ్వతరుఁడును మనోహరముగాఁ బాడుచు నొకనాఁడు కైలాసమున కరిగి భవానీ శంకరులు వనవిహారము చేయుచున్నసమయంబున నీగాయకు లిరువురు కంఠములు మేళగించి హాయిగాఁ బాడి యాదంపతుల కత్యంతసంతోషము గలుగఁజేసిరి.

శంకరుఁడు వారిసంగీతము విని మెచ్చికొని దాపునకుఁ బిలిచి మీ కేమికావలయునో కోరికొనుఁడని యడిగిన నశ్వతరుండు మ్రొక్కుచు మహాత్మా ! మదాలసయను గంధర్వపుత్రిక అసత్యభర్తృమరణవార్త విని మృతినొందినది. ఆసుందరిని నాకుఁ బుత్రికగా నుదయించునట్లు చేయవలయును. ఆమె మృతినొందునప్పటి కేప్రాయమం దేరూపున నెట్లుండెనో యట్లే యొప్పుచు జాతిస్మరణ గలిగియుండవలయును. ఇది యే నాకోరికయని తెలిపిన మహేశ్వరుండు నాగేంద్రా ! అట్లే జరగును. వినుము. నీవు పితృపూజ గావించునప్పుడు శుచివై మధ్యపిండమును భక్షింపుము. నీనడుమ పడగనుండి యప్పడఁతి యథారూప ప్రాయముగా నుదయింపఁగలదు. అనిచెప్పినఁ బరమానంద భరితహృదయుఁడై మహేశ్వరునకు నమస్కరించుచు వారిరువురు రసాతలంబున కరిగిరి.

అశ్వతరుండు యథావిధిం బితరుల నారాధించి మదాలసం దలంచుకొని మధ్యమపిండమును భక్షించెను. అంతలోనే తన్ని శ్వాసము నుండి మదాలస యుదయించినది. ఆరహస్య మెవ్వరికిం జెప్పక యశ్వతరుం డామె సంతర్గృహంబునంబెట్టి కాపాడుచుఁ గుమారుల కిట్లనియె.

వత్సలారా ! లోకోపకారియగు నారాజపుత్రు నొకసారి మన నగరమునకుఁ దీసికొనిరండు. తదభీష్టము నెఱవేర్తునని పలికిన సంతసించుచు వారిరువురు వాడుకప్రకారము మఱునాఁ డా రాజధాని కరిగి కువలయాశ్వునితో నాటలాడి యాడి కథాంతరమందు మిత్రమా ! చిరకాలమునుండి మేము మీయింటికి వచ్చుచుంటిమి. నీతో నాడుచుంటిమి. నీ వొక్కసారియు మాయింటికి రావైతివి. తప్పక నేఁడు రమ్మని కోరుచున్నాము. అని ప్రార్థించిన నారాజనందనుం డిట్లనియె.

మిత్రులారా ! నాగేహము మీగేహముగాదా ? ఇందు నాకున్న ధనవాహనవస్త్రాదికములన్నియు మీవే. నన్ను మీయింటికిఁ దీసికొనిపోయి యేమియ్యఁదలఁచికొంటిరో యిందే యీయుఁడు మీవలనఁ గై కొనియెదంగాక. విప్రనందనులారా ! మీకు నాయెడ భేదబుద్ది దలుపవలదు. నాగృహమందు మమత్వము బూనుఁడు. ఎన్నఁడు నిట్టి భేదబుద్ధిలో మాటాడవలదని నాపై నొట్టుపెట్టుచున్నాను. మీకు నాపైఁ గల ప్రేమ యెఱుంగుదును. మఱియు,

శ్లో॥ ఉపచారఃకర్తవ్యోయావద నుత్పన్న సౌహృదా? పురుషాః
     ఉత్పన్నసౌహృదానాముపచారః కైతవం భవతి. ॥

ఎంతవఱకు స్నేహము కలియదో యంతవఱకే యుపచారము. కలిసినపిమ్మటఁ జేయునుపచారము కైతవమగునని యార్యులు సెప్పుదురు. అనిపలికిన విని యించుక ప్రణయకోపము చెందుచు నాగకు మారు లిట్లనిరి.

రాజపుత్రా ! నీవనినట్లుకాక మాకు నీయెడవేఱొక బుద్ధి లేదు. నీ చారిత్రము మేమెఱింగింప మాతండ్రి కువలయాశ్వుఁ జూడవలయు నిందుఁ దీసికొనిరండని పలుమారు చెప్పియున్నాఁడు. అందులకై రమ్మంటిమని పలికినంతఁ గువలయాశ్వుం డాసనమునుండి లేచి తండ్రిగా రేమనిరి? ఓ హెూ ! నే నెంతధన్యుండను. అని యభివాదనము గావించుచు నమ్మహాత్ముండు నన్నుఁ జూడఁగోరెనా ? ఆమాట చెప్పితిరికా రేమి ? తదానతి మనము శిరసావహింపవలసినదే పోదము లెండు వారి యానతి నించుక యువ్యతికరముచేయుట నాతలంపుగాదు. అని పలుకుచు నానాగ కుమాలవెంట నగరాంతిక మందున్న గోమతీనదితీరమున కరిగి వయస్యులారా ! మీయిల్లెందున్నదని యడిగెను.

ఇందేయున్నది రమ్ము అని వా రతనిచేయి పట్టుకొని గోమతిలో మునింగి పాతాళలోకమునకుఁ దీసికొనిపోయిరి. నాగలోకమందు వారివేషములు మాఱినవి. పడగలయందుఁగల మణులచేఁ బ్రకాశింపుచున్న యక్కుమారులఁగాంచి కువలయాశ్వుం డయ్యారే ! మీరూపము లిట్లు మాఱినవేమి ? మీరు నాగకుమారులా ? బ్రాహ్మణులుకారా? అని విస్మయముచెందుచు నడిగిన వారు వయస్యా ! మేము విప్రకుమారులము కాము. అశ్వతరుండను నాగేంద్రుని పుత్రులము. మా తండ్రి దేవతలకుఁగూడ వందనీయుఁడు. చాలప్రజ్ఞ గలవాఁడని యాత్మీయవృత్తాంత మెఱింగించిరి.

రాజపుత్రుఁడు సంతసించుచుఁ బాతాళలోకవిశేషములన్నియుం జూచుచుఁ బోవుచుండెను. బాల్యయౌవనకౌమారప్రాయములతో నొప్పుచున్న నాగకన్యకలు క్రీడించుచుండిరి. వీణావేణుస్వనమనోజ్ఞ మగు గానము వినంబడుచుండెను. వారుమువ్వురు క్రమంబున వీధుల నతిక్రమించి సౌధంబుల దాటి కక్ష్యాంతరంబులు గడిచి యశ్వత రుండున్న సదనంబున కరిగిరి.

అందు హారకుండలకేయూరాదివిభూషణభూషితుండై దివ్యమాల్యాంబరధరుండై రత్న పర్యంకమున వసించియున్న యశ్వతరుం జూపుచు మిత్రమా ! యీతఁడే మాజనకుఁడని యెఱింగించిరి. ఆయైశ్వర్యవిశేషములన్నియుం జూచుచు రాజపుత్రుండు విస్మయసముద్రములో మునిగి విభ్రాంతి జెందుచుఁ దా నెవ్వఁడో యెందుల కందువచ్చెనో మఱచి కొంతసేపునకుఁ దెరపితెచ్చుకొని యానాగేంద్రునిపాదంబులకు సాష్టాంగనమస్కారము గావించెను.

ఆశ్వతరుం డతని గ్రుచ్చియెత్తి శిరస్సాఘ్రాణించుచు నాశీర్వదించి వత్సా! రాజపుత్ర ! నాపుత్రులు నీచారిత్ర మెఱింగింప నాలించితిని. నీసుగుణంబుల నీపరోక్షమందు వారు పొగడుచుందురు. గుణవంతుని దేవతలు పితరులు మిత్రులు అర్థులు వికలులు బంధువులు చిరకాలము జీవించునట్లు కోరుచుందురు. ఆహా! గుణవంతునిదేజన్మ. శత్రువులనైనను మిత్రులగాఁ జూచుచుందురని యతనిఁ బెద్దగాఁ బొగడి పుత్రులతో నతని కిష్టమగు సత్కారమును గావింపుఁడని నియోగించెను.

రాజపుత్రుఁడు వలదనుచుండ మనుష్యలోకదుర్లభములగు వస్తువులుదెచ్చి యతనికి విందులుగావించిరి. కువలయాశ్వుఁడు మనసున నిష్టములేకున్నను బన్నగులప్రీతికొఱకై వారిచ్చిన యాతిథ్యమును సంతోషముతో నంగీకరించెను. మఱియొకనాఁడు ఇష్టగోష్టివినోదములచేఁ గాలక్షేపము చేయుచుండ,

అశ్వతరుఁడు -- రాజపుత్రా ! నీకు నేను దండ్రివంటివాఁడ. చిరకాలమునకు మాయింటికి వచ్చితివి. మాయింటనున్న ధనకనకవస్తువాహనవిశేషములలో నేదేని గోరికొనుము నీ కర్పించుచున్నాను.

రాజపుత్రుఁడు — మహాత్మా! నేను తండ్రిచాటువాఁడను, మీరీపాతాళలోకమువలె మాతండ్రి వేయేండ్లనుండి భూమండలము పాలించు చున్నాఁడు. మాయింట నన్నివస్తువు లున్నవి. ద్రవ్యములేనప్పుడు యాచించుట యుచితముగాని సంపూర్ణముగానున్నప్పుడు ఇమ్మనియడుగుటకు నో రేట్లువచ్చును. మీయనుగ్రహమువలన నా కన్నియుం గలవు నీ పాదదర్శనమైనది. అంతకన్న నాకుఁ గావలసిన దేమియు లేదు.

అశ్వతరుఁడు — వత్సా ! నావలన రత్నాదికము స్వీకరించుట కిష్టము లేకున్నఁ బోనిమ్ము. నీకుఁ బ్రియమైనదేదేని కలిగినచో నడుగుము. ఒసంగెదను.

రాజపుత్రుఁడు - పన్నగేంద్రా ! నా కేకోరికయు లేదు. నీపాదధూళిచే మదీయశిరంబు పవిత్రముచేసితివి. పరిష్వంగసుఖంబు గూర్చితివి. ఇంతకన్న నధిక మేదిగలదు. అయినను గోరమంటివికావున నడిగెద వినుండు. పుణ్యకర్మసంస్కారము నాహృదయము నెడఁబాయకుండునట్లనుగ్రహింపుము. సువర్ణమణివస్తువాహనాద్యైశ్యర్య మంతయు సుకృతసుకృతవృక్షముయొక్క ఫలంబని యెఱుంగనగు.

అశ్వతరుఁడు — వత్సా! నీవనినట్లు సంపదలు పుణ్యఫలములే. నీబుద్ధి యెప్పుడును ధర్మము నాశ్రయించియుండున ట్లనుగ్రహించితి నైనను నీవు మాయింటికివచ్చి మనుష్యలోక దుర్లభమైనవస్తు వేదేని తీసికొనిపోకుండ నరుగుట లెస్సగాద. నీకును బొందశక్యముగాని దేదేని కలిగిన నడుగుము. ఇచ్చెదను.

రాజపుత్రుఁడు - వినమ్రుండై సాభిలాషముగాఁ బన్నగపుత్రుల మొగము జూచుచున్నాఁడు.

నాగకుమారులు - తండ్రీ ! యితనికామ్యము మీరు దీర్పఁదలంచికొంటిరేని మే మెఱింగింతుము వినుండు. ఇతనిప్రియురాలు మహాసాధ్వి మదాలస యితనియసత్యమరణవార్త విని ప్రాణములు వదలినది. అమ్మదవతిం దీసికొనివచ్చినచో నితనికి సంతోషము. మఱియొకవస్తువు వలన నితండు తృప్తిఁబొందఁడు. అశ్వతరుఁడు – బిడ్డలారా ! భూతములతో వియోగమును బొందినవారి నెవ్వరైనఁ దీసికొనిరాఁగలరా? స్వప్నములోఁ గనంబడునట్లుచేయమనినఁ జేయుదు లేక మాయామదాలసం జూపమనినఁ జూపెదను. ఇట్టిప్రజ్ఞ నాకుఁ గలదు.

రాజపుత్రుఁడు — (ఇంచుక సిగ్గుతో) మహాత్మా! నాప్రియురాలిని మాయామయినైనఁ జూపిన మిగుల సంతోషింతునుగదా ? అట్లను గ్రహింపుము.

అశ్వతరుఁడు — వత్సా! మాయామదాలసం జూడ నీకు వేడుక గలదేని యట్లేచూపెదను. అభ్యాగతుండు బాలుండైనను గురువుగాఁ దలంచి పూజింపఁదగినది. అనిపలుకుచు నేవియోమంత్రములు జదివి పుత్రులారా ! లోపలికిఁబోయి మదాలసం దీసికొనిరండు. పొండని పలికి యామె నందు రప్పించి రాజపుత్రునకుం జూపుచు నిది నీభార్యయగు మదాలస యగునా కాదా? యని యడిగెను.

అతం డామెంజూచి మోహ మాపఁజాలక సిగ్గువిడిచి హా ! ప్రేయసీ ! హా ! ప్రేయసీ ! అని దుఃఖించుచు మీఁదఁబడఁబోయెను. నాగేంద్రుండు ఆఁ! ఆఁ! రాజపుత్రా! ముట్టకుము. ముట్టకుము. ఇది మాయామదాలసయని చెప్పలేదా ? ముట్టినచో నంతర్థానము నొందఁగలదు. అని వారించినఁ గువలయాశ్వుండు తత్పాదమూలంబునంబడి గోలుగోలున నేడువఁదొడంగెను.

అప్పు డామదాలస యిట్లుతలంచెను. ఆహా ! ఈరాజపుత్రునకు నాయందే మోహ మున్నది. ఈపన్న గేంద్రుండు నన్ను మాయామదాలసయని యీయనకుఁ జూపెను. లోకమంతయు మాయగాక సత్య మేమియున్నది. పంచభూతసమ్మేళనమే దేహము. ఆని యాయువతి తలంచుచుండెను.

నాగేంద్రుం డతని లేవనెత్తి రాజపుత్రా ! యీపద్మనేత్ర మా యాగాత్రియని యెఱింగియు నింతమోహ మందుచుంటివేమిటికి ? సత్యమైన మదాలస వచ్చినచో నెట్టిముదమందెదవో అనియడిగిన నతం డక్కటా ! నా కట్టిభాగ్యము పట్టునా ? ఇఁక నీజన్మమునకు లేదు. అని యామెవంక యూరక జూచుచుండెను. ఇఁక మాయ నుపసంహరింపనా? అని పలికిన నతండు మహాత్మా ! నామోహము తీరకున్నది. మఱికొంచెముసేపు నిలుపుటకు నీకు శక్తిలేదా? అనిబ్రతిమాలికొనియెను. చూడు చూడుము. ఇఁక రెండుగడియ లాపఁగలను. అనుటయు రాజపుత్రుఁడు మహాత్మా! నీయాతిథ్యమునకు మిక్కిలి సంతసించితిని. ఈబోటి నొక్కమాట నాతో మాటాడింపలేవా? బ్రహ్మకూకటి ముట్టెదనని ప్రార్థించెను.

నాగేంద్రుఁడు నవ్వుచు ముట్టకుండ మాటాడుము. అనుజ్ఞ యిచ్చితినని పలికిన నతండు దాపునకుఁ బోయి కలికీ ! ఒక్క ముద్దుపలుకు పలుకుము. నాదెసజూడక కన్నులు మూసికొనియెదవేమి? తెలిసినది. తెలిసినది. నన్నుఁ గృతఘ్నునిగాఁ దలంచి చూడకుంటివా? అగు నామాట సత్యమే ! నాయసత్యమరణము విని నీవు మృతినొందితివి. నీ సత్యమరణము విని నేను దేహము విడువనైతి. కృతఘ్నుండగానా? అని యూరక యున్మత్తాలాపము లాడుచు మహాత్మా! పన్నగేంద్ర ! నా ప్రియురాలు నాతో మాటాడినదికాదు. నే నేమిచేయుదును. ఇఁక మాయనుపసంహరింతువుకాఁబోలు. అయ్యో ! ఈవిరహ మెట్లుభరించు వాఁడ, శాంబరీమదాలసం జూచినంత నావంత మఱింత పెరిఁగినది. కాని తఱుగలేదు. అని దుఃఖించుచుండెను.

నాగేంద్రుండు మెల్లన నతనిలేవనెత్తి యూఱడించుచు రాజ పుత్రా ! నీవు ప్రాజ్ఞుండవయ్యు నిట్లు పరితపించెద వేమిటికి? వినుము. నీ పరితాపము నాపుత్రు లెఱింగింపఁ దపంబుగావించి మహేశ్వరునివరము వలన నీలలనం బుత్రికగాఁ బడసితి నీ విఁక చింతింపకుము. ఇది మాయా మదాలస కాదు. నీభార్యయే యని యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆవార్తవిని యతం డమృతహ్రదంబున మునిఁగినట్లు పరితుష్టి నొందుచుఁ దటాలునఁబోయి యా యిందువదన చేయిపట్టికొని అన్న న్నా! ప్రాణేశ్వరీ ! నే నింతపరితాపము చెందుచుండ నిజము తెలియఁజేయ కూరకుందువా ? అనిపలుకుచు నక్కునం జేర్చికొని యుపలాలించెను.

తరువాత నాగకాంతలు వచ్చి యచ్చిగురుఁబోఁడిసోయగము జూచి సిగ్గుపడఁజొచ్చిరి. కువలయాశ్వుండు నాగేంద్రుఁడు తననిమిత్తమై పడినయిడుము లుగ్గడించుచు మహాత్మా! పరోపకారపరుఁడవన నిన్నే యనవలయును. నా మొగ మెట్టిదో యెఱుఁగక కుమాళ్లు చెప్పినంతమాత్రముననే పెద్దప్రయత్నము సేసి నాదుఃఖమంతయుఁ బోఁగొట్టితివి. ఎన్ని జన్మములెత్తినను నీఋణము దీర్చికొనఁజాలను. భవదీయపాద సేవకుడనని చెప్పికొనుచుందునని పెద్దగా స్తుతియించి తదనుమతి వడసి భార్యతోఁగూడ భూలోకమునకువచ్చి నిజపురంబు ప్రవేశించి తలిదండ్రులకు మ్రొక్కి మదాలసం జూపుచు జరగినయుదంత మంతయు నెఱింగించెను.

అతనిజననీజనకు లాకథవిని ప్రహర్షవివశమానసులై కోడలిం గౌఁగిలించుకొని వినుతించుచుఁ గుమారు నభినందించుచుఁ బెక్కులుత్సవములు గావించిరి. కువలయాశ్వుండు మదాలసను విడువక క్రీడాశైలములయందు నుద్యానవనములందును సైకతప్రదేశములయందును నామెతో విహరింపుచు మన్మథసామ్రాజ్యపట్టభద్రుఁడై క్రీడింపు చుండెను.

కొంతకాలమునకు శత్రుజిత్తు స్వర్గలోక మలంకరించుటయుఁ బ్రధానులు గువలయాశ్వుని రాజుగాఁజేసిరి. కువలయాశ్వుండు ధర్మంబున రాజ్యంబుగావింపుచుండఁ గొండొక కాలంబునకుఁ దత్పత్ని యంతర్వత్నియై తొలుత మగశిశువుం గనినది.

కువలయాశ్వుఁ డా బాలునకు జాతకర్మానంతరము విక్రాంసి యను నామకరణము వ్రాసెను. ఆపేరునకు భృత్యులెల్లఁ బరమానంద భరితులైరి. మదాలస నవ్వుచుఁ బరిహాసముసేసినది. మఱియొకనాఁడు మదాలస బంగరుడోలికలో వెల్లకితలం బండుకొని రోదనము చేయుచున్న బాలకుని జోకొట్టుచు నిట్లు బోధించినది.

తాతా ! నీవు కేవలము పరమాత్మవు. నీకుఁ గల్పనగా నీపేరు పెట్టఁబడినది. పంచభూతాత్మకమైన యీదేహము నీవుకావు. ఎందుల కేడ్చెదవు. నీగుణములన్నియు వికల్ప్యములు. నీయింద్రియము లందు భూతము లావరించియున్నవి. అన్నాంబుపానాదులచే భూతము లెదుగును గాని నీకు వృద్ధిక్షయములు లేవు నీవు కంచుకప్రాయమై నశింపఁబోవుచున్న యీదేహమునందు మమత్వము వహింపకుము. మదమాత్సర్యాది దుర్గుణజనితములగు శుభాశుభరూపములైన కర్మలచే నీకంచుకము నీపైఁ గట్టఁబడినది. తండ్రియనియుఁ దనయుఁడనియు నీవనియు నేననియు భూతసంఘమును మన్నించుచుంటిమి. మూర్ఖుఁడు దుఃఖములఁ బోఁగొట్టుకొనుచు భోగములు సుఖముగలుగఁజేయునని తలంచును. పరమమూర్ఖుఁ డాదుఃఖములనే సుఖములని తలంచును. ఎముకలుగనపఱచుట నవ్వుఅని వర్ణింతురు. కల్మషయుక్తమగువపను బ్రకాశించు కన్నులని పొగడుదురు. దుర్మాస పిండంబులఁ గుచంబులని నుపమానములు గల్పించి స్తుతియింతురు. రతి కాస్పదయగు స్త్రీ నిరయము కాదా ?

శ్లో॥ హాసోస్థిసందర్శనమక్షియుగ్మ మత్యుజ్వలం తత్కలుషం వపాయాః
     కుచాదిపీనం పిశితం ఘనంచ స్థానంర తెః కింనరకోనయోషిత్ ॥

అని యిట్లు మదాలస నిత్యము నబ్బాలకునికి బోధింపుచుండ నతండు పెద్దవాఁడై తదుపదేశ ప్రభావంబున గార్హస్థ్యధర్మ మనుష్టింపక విరక్తుండె తపోవనంబున కరిగెను. మఱికొంతకాలమునకు మదాలస మఱియొక కొమరునిం గనినది. కువలయాశ్వుం డతనికి సుబాహుండని పేరుపెట్టెను. అప్పుడుగూడ నాచేడియ నవ్వినది. పిమ్మట నాబాలుండు దినదినాభివృద్ధి వహింపుచుండఁ బెద్దవానికివలె వీనికిని దత్వోపదేశము గావించి ప్రాయమురాఁగానే తపోవనంబున కరుగఁజేసినది. తరువాత మూఁడవసంతానమున కతఁడు అరిమర్దనుడని పేరుపెట్టుచుండ నవ్వుచు నాపూవుంబోఁడి వానికిని దత్వంబెఱిఁగించి విరక్తుంగావించినది. పిమ్మట నాలుగవకుమారుం డుదయించెను. వానికి నేదో పేరుపెట్టఁబోవుచుఁ గువలయాశ్వుం డించుక నవ్వువెలయింపుచున్నమదాలసంజూచి ప్రేయసీ! నేను బేరుపెట్టినప్పుడెల్ల నవ్వుచుంటివి. విక్రాంతుఁడనియు సుబాహుఁడనియు నరిమర్దనుఁడనియు శోభస్కరములైన నామములు పెట్టితినని తలంచుచుంటిని. క్షత్రబంధువుల కీపేరులు యోగ్యములైయున్నవి. పరాక్రమమును సూచించుచున్నవి. వీనిగుఱించి యెందులకు నవ్వితివో చెప్పుము. మఱియు నీనాలుగవబాలున కేమిపేరుపెట్టెదవో నీవే నిరూపింపుము. నేనుగూడ నవ్వి పరిహాసము సేయలేనేమో చూతము. అనిపలికినవిని మదాలస మహారాజా ! నీయాజ్ఞ వడువునఁ గావించెదను. వీని కలర్కుఁడని పేరుపెట్టితి నట్లె లోకమున వాడుకబొందఁగలఁడని పలికినఁ గువలయాశ్వుండు పకపకనవ్వుచు మదాలసా ! ఇట్టిపేరు పెట్టితి వేమి ? అలర్కుఁడన నర్థమేమియో చెప్పుమని పరిహాసముసేసెను. అప్పుడు మదాలస రాజా ! నేనుబెట్టినపేరు సార్థమైనదికాదు. వ్యవహారికనామమున కర్థమేమియుండును ? మీరుపెట్టినపేరు లపార్థములు. వినుండు. నేనేచెప్పెద. క్రాంతి యనఁగా నొకదేశమునుండి మఱియొక దేశమున కరుగుట. అంతటను నిండియున్న దేహేశ్వరుఁ డొకచోటనుండి మఱియొకచోటున కెట్లుపోవును. కావున నీపేరు నిరర్థకమని నాయభిప్రాయము. .సుబాహునామము అమూర్తుఁడైన పురుషున కెట్లుచెల్లును? మూఁడవపుత్రునకు నరిమర్దనుఁడని పేరుపెట్టితిరి. అదియు నిరర్థకమే. వినుండు. మణులనుగ్రుచ్చిన సూత్రమువలె సర్వశరీరములయందు నున్నవాఁ డొక్క పురుషుఁడే. అట్టివానికి శత్రులెవ్వరు? మిత్రులెవ్వరు ? భూతములు భూతములనే మర్దించును. అమూర్తు నెట్లు మర్ధింపఁగలరు. కావున మీరుపెట్టిన మూఁడుపేరులు నర్థశూన్యములైనవికావా ? నేను బెట్టిన వ్యవహారిక నామమున కర్థమేమిటికి ? అలర్కుఁడని సంజ్ఞార్థమే యుంచఁబడినది. అని యుక్తియుక్తముగా ననువదించిన విని యాభూపాలుండు సంతసించుచు మదాలస వైదుష్యమును బెద్దగా మెచ్చుకొనియెను.

మదాలసయు నాబాలునకుఁగూడ వెనుకటిబాలురకువలె జోలపాడుట జూచి కువలయాశ్వుండు తరుణీమణీ ! ఇదియేమికర్మము? నాకు సంతతిలేకుండఁ జేసెదవాయేమి ? ముగ్గురపిల్లలను సన్యాసులఁ జేసి యడవుల కనిపితివి. ఒక్కనినైన నుండనీయవా ?

నీకు నామాట వినుతలంపు గలదేని నా కిష్టముగా నీబిడ్డకు రాజనీతి యుపదేశింపుము. కర్మమార్గప్రవర్తకునిగాఁ జేయుము పితృదేవతలు తిలోదకములంది వంశాభివృద్ధి గోరుచుందురు. గృహస్థుండు సర్వజనోపకారి కాడే. కావున నాకుఁ బ్రీతిగా వీనికి రాజధద్మముల నెఱింగించి ప్రవృత్తిమార్గనిరతుం జేయుమని కోరినఁ బతివచనమును ద్రోయఁజాలక యంగీకరించి యమ్మించుఁబోఁడి యలగ్కున కిట్లుజోలపాడినది,

పుత్రా ! నీతండ్రికి సంతోషముగానఁ గర్మల నాచరింపుము. మిత్రుల కుపకారముచేయుము. శత్రువుల పీచమడంచుము. శత్రుశూన్యుఁడవై యేకాతపత్రముగా భూమి పాలింపుము. న్యాయముగాఁ బ్రజలఁ బాలింతువేని సుఖోపభోగ్యంబగు ధర్మఫల మందఁగలవు పర్వములయందు బ్రాహ్మణుల నర్చించి ధనప్రదానమునఁ దృప్తి బొందింపుము, బంధువుల కోరికలు తీర్పుము. సర్వదా పరహితమును గోరుచుండుము. పరస్త్రీలదెసకు మనసు పోనీయకుము. జన్నములు గావించి దేవతలను భూమిదేవతలను నాశ్రితులను దృప్తినొందింపుము. వీరుఁడా ! యుద్ధములచే శత్రువులను కామములచే స్త్రీలను సంతోషపెట్టఁగలవు. బాలుఁడవై బంధువులకును కుమారుఁడవై గురువులకును యౌవనవంతుఁడవై కులస్త్రీలకును వృద్ధుఁడవై వనచరులకును సంతోషము గలుగఁజేయుదువుగాత. రాజ్యముచేయుచు మిత్రుల మురియఁజేయుము. సాధువుల రక్షింపుచు దుష్టులగు వైరుల నిర్జింపుము. గోబ్రాహ్మణరక్షకై మృత్యువును బొందుము. అని యుపదేశించినది.

అయ్యలర్కుం డట్లు నిత్యము తల్లిచే బోధింపఁబడుచు వయసుచేతను బుద్ధిచేత నభివృద్ధి నొందుచుఁ గౌమారప్రాయంబున నుపవీతుండై యొకనాఁడు మదాలసకు నమస్కరించి యిట్లనియె. అంబా ! ఆముష్మికసుఖంబుకొఱకు నేనిప్పు డేమిచేయఁదగినదో యుపదేశింపు మని యడిగిన జనని యిట్లనియె వత్సా! నీవు పట్టాభిషిక్తుండవైనది మొదలు ప్రజల రంజింపఁ జేయవలయును. నృపుల కదియే ముఖ్యధర్మము. మూలచ్ఛేదకములగు సప్తవ్యసనముల విసర్జించి మంత్రముల వెల్లడిగా నీయక శత్రువులవలనఁ దన్ను రక్షించుకొనవలయును మంత్రుల దుష్టా దుష్టచర్యల నరయుచుండవలయును. చారులవలన శత్రుమర్మములఁ దెలిసికొనుచుండుము. రాజు మిత్రుల నాప్తుల బంధువులనైన నమ్మియుండఁగూడదు. కార్యావసరమునుబట్టి శత్రువునైన నమ్మినట్లభినయింపవలయును. రాష్ట్రకోశవృద్ధిక్షయముల విమర్శింపుచుండవలయును. తొలుత హృదయశత్రువులగు కామక్రోధాదుల జయించి పిమ్మట బాహ్యశత్రులపై దాడివెడలవలయును.

కామమువలనఁ బాండురాజును క్రోధమువలన ననుహ్రాదుఁడును లోభమువలనఁ బురూరవుఁడును మదమువలన వేనుఁడును మానమువలన ననాయువును అమర్షవలన బురంజనుండును జెడిపోయిరి. రాజు పురుగు దారువునుదొలిచినట్లు తెలియకుండ శత్రువును వంచింప వలయును. పిపీలికవలె సంపాదించి అగ్నివలె వెలుఁగుచు శాల్మలీబీజమువలె నడఁగి వృద్ధిబొందవలయును. నరపాలుఁడు ఇంద్రసూ ర్యచంద్రయమవాయువులచిహ్నముల. ధరించి ప్రజలఁ బాలింపవలయును. లోభమువలనఁగాని కామమువలనఁగాని యర్థమువలనఁగాని యెవనిమనసు ధర్మమును వీడకుండునో యారాజు స్వర్గమును బొందఁ గలఁడు. ఉత్పధమును బొంది ధర్మచ్యుతులైన ప్రజల స్వధర్మనిరతులం జేసిన నరపతి యిహపరసుఖంబుల నొందఁగలఁడు న్యాయముగాఁ బ్రజలఁ బాలించినరాజు తత్సుకృతమును బంచుకొనుచు అని తల్లి పుత్రునకు రాజనీతియంతయు నెఱింగించినది మఱియు నతండడుగ వర్ణాశ్రమ ధర్మంబులును సదాచారప్రకారంబులోనగు విశేషంబు లెన్ని యో యెఱింగించినది.

అలర్కుం డట్లు తల్లిచే శిక్షితుండై క్రమంబున సంప్రాప్త యౌవనుండై దారపరిగ్రహంబు గావించి పుత్రులంగని యాగములుచేసి పితృ శుశ్రూష గావింపుచుండె. ఋతుధ్వజుండును బెద్దకాలము రాజ్యము జేసి వార్ధకంబున నలర్కుం బట్టాభిషిక్తుం గావించె. మదాలసయు భర్తతోఁగూడఁ దపోవనంబున కరుగుచు నలర్కుం జీరి చివరమాట యిట్లు చెప్పినది.

వత్సా! ఈయుంగరము నీవ్రేల నుంచుకొని యుద్ధమువలనఁగాని బంధువియోగమువలనంగాని సమస్తవిత్తనాశనకరమగు విపత్తు సంభవించినప్పు డీయుంగరమును జిదియఁగొట్టి దీనిలో నిమిడ్చియున్న పత్రికలోని సన్ననిలిపితో నొప్పుశాసనమును జదివికొని తదుక్తరీతిఁ గావింపుము. అని యుపదేశించి యంగుళీయకమిచ్చి పుత్రుం దీవించి యాకాంచనగాత్రి భర్తతో దపోవనంబున కరిగినది.

అలర్కుండును బట్టభద్రుండై ప్రజలఁ బ్రజలపోలికం జూచుచుఁ బెద్దకాలము రాజ్యముగావించెను. ధర్మార్థకామాసక్తుండగు నయ్యలర్కున కనేకవత్సరంబు లొకదినమువలె వెళ్లినవి. విషయసుఖంబుల ననుభవింపుచున్న యతనికి వైరాగ్యోదయమైనదికాదు. ధర్మార్థోపార్జ నమందుఁ దృప్తియుఁ దీరినదికాదు.

వనంబునఁ దపోవృత్తి వర్తించు సుబాహుండు సోదరుని రాజ్యపాలనవిధానంబు దెలిసికొని యతండు విషయాసక్తుండగుటకుఁ జింతించుచు నించుక యాలోచించి తిన్నగాఁ గాశీరాజునొద్దకుఁ బోయి యిట్లనియె.

దేవా ! నేను గువలయాశ్వుని పెద్దకుమారుండ. నేను జిన్నతనమునందు మతిచెడి దేశాంతర మరిగితిని. నాకు రావలసినరాజ్యంబు నా తమ్ముఁడు అలర్కుం డనుభవించుచున్నాఁడు. జ్యేష్ఠానుక్రమంబున ననుభవించుట న్యాయము. నీవు వాని మందలించి నారాజ్యము నాకిప్పింపు మని ప్రార్థించిన నయ్యెకిమీఁడు అలర్కు నొద్ద కప్పుడే యొకదూతం బంపించెను. అతండు రాజవాచకం బిట్లు చెప్పేను.

ఉ. చిన్నతనంబునందు భ్రమజెంది వనంబుల సంచరించి నీ
     యన్న సుబాహుఁ డిప్డు శరణాగతుఁడై భజియించె నన్ను సం
     పన్నుఁడ వౌట రాజ్య మది వానిది వానికి నిచ్చు టొప్పుఁ గా
     కున్న నిను న్మహాస్త్రముల నొంచి సుబాహు మహీశుఁ జేసెదన్ .

అని చెప్పుటయు నావార్తవిని యలర్కుండు మందహాసము గావించుచు నేమీ? కాశి రాజునకు నేనంత దేలికగాఁ గనంబడుచుంటినా? నాయన్న వచ్చి సౌహార్దంబున నన్ను రాజ్యమడిగిన నీయకుందునా? ఆతనినేల శరణునొందవలయుఁ గాశీరాజునకు నేను వెఱచి రాజ్య మిచ్చువాఁడను కానని చెప్పుము. నాయన్న వచ్చి యాచించిన నిత్తునని ప్రత్యుత్తరము బంపెను.

ఆమాటవిని సుబాహుం డోహో ! యభిమానముగల క్షత్రియుం డొరుల దేహి యని యాచించునా? అందులకు నే నొల్లనని పలికెను. అప్పుడు కాశిరాజు చతురంగబలపరివృతుండై యలర్కు పురమును ముట్టడించి సామదానభేదోపాయంబులఁ దత్సైన్యసమూహ ముల వశపఱచుకొని దుర్గముల నావరించెను.

అలర్కుం డప్పుడు తనబలంబు క్షీణించుట తెలిసికొని విషాదమే దురహృదయుండై చీకాకుపడుచు నేమిచేయుటకుం దోఁచక తటాలునఁ దల్లిమాట జ్ఞాపకము వచ్చుటయు శుచియై తనవ్రేలినున్న యుంగరము జిదియఁగొట్టి సూక్ష్మాక్షరములతో నందున్నశ్లోకముల నిట్లు చదివెను.

శ్లో॥ సంగస్సర్వాత్మనాత్యాజ్య స్సచేత్త్యక్తుం నశక్యతే
      స సద్భిస్సహకర్తవ్య తస్సంగస్య భేషజం
      కామస్సర్వాత్మనా హే యో హాతుంచే చ్ఛక్యతె న సః
      మముక్షాం ప్రతికర్తవ్య స్పవై తస్యాపి భేషజం॥

సర్వవిధములచేతను సంగము (జనులతోఁ గలిసియుండుట) విడువఁదగినది. అది విడుచుటకు శక్యముకానిచో సత్పురుషులతోఁ జేయుము; అదియే దానికిమందు. అన్నివిధములఁ గామము (కోరిక) విడువఁదగినది. అది విడుచుటకుశక్యముకానిచో ముక్తినిగుఱించి చేయుము; అదియే దానికివైద్యము. అనియున్న రెండుశ్లోకములు పలుమారు జదివి తదర్థముగ్రహించి సంగమువిడువలేకున్న సత్సంగము సేయుమని చెప్పినది. అదియే యిప్పుడు కర్తవ్యము. అని నిశ్చయించికొని యలర్కుండు తిన్నఁగా దత్తాత్రేయాశ్రమమున కరిగి యతనిచరణంబులఁబడి మహాత్మా! రక్షింపుము, రక్షింపుము. దుఃఖసముద్రములో మునిఁగియుంటి నా దుఃఖము బోఁగొట్టి రక్షింపుమని ప్రార్థించెను.

దత్తాత్రేయమహర్షి నవ్వుచు నరేంద్రా ! నీదుఃఖము తృటిలోఁ బోఁగొట్టెదను. ఆదుఃఖ మెందులకు వచ్చినదో లెస్సగా విచారించిచెప్పుము. నీవెవ్వఁడవు? దుఃఖ మెవ్వరికి? అంగాంగిభావ మెఱిఁగి పలుకుమని చెప్పిన నలర్కుం డాలోచించి యాలోచించి విమర్శించి తనలోఁదానే నవ్వుకొని యిట్లుపలికెను. మహాత్మా! నే నాకాశమును భూమియు నుదకము వాయువు తేజమునుం గాను. తత్సంఘమందుఁ బ్రవేశించి సుఖ మనుభవింపుచుంటిని. ఈభూతపంచకమునకు సుఖాసుఖంబులన నెట్టివి? శరీరమే నేనుకానిచో తజ్జన్యములగు సుఖదుఃఖములు నా కెట్లుకలిగెడిని? తెలియకయే యిట్లుపలికితిని. నేను శరీరముకంటె భిన్నుండననిన నీ రాజ్యముతో నా కేమిసంబంధమున్నది. కావున నాకు శత్రుఁడును మిత్రుఁడును లేఁడు. సుఖము దుఃఖము లేదు. పురము కోశము దుర్గము లేదు. ఘటీకుంభక మండలుగతంబగు నాకాశ మొక్క టేయై పెక్కురీతులఁ గాన్పించునట్లు సుబాహుఁడు కాశీపతియు నేనునుంగూడ శరీరములచే భిన్నులముగాని యాత్మచే నొక్కరమే. మునీంద్రా! నీకరుణావిశేషంబునం జేసి నాయజ్ఞానంబు బాసినది. సంసారంబు మమత్వమూలంబని తెలిసికొంటినని పలికిన విని దత్తాత్రేయుం డిట్లనియె.

వత్సా ! నాప్రశ్నవలననే నీకు జ్ఞాన ముదయించినది. నీవనినట్లు సంసారమునకు మమత్వమే మూలమైయున్నది. ఈసంసారవృక్షమునకు నేను అనుమాటయే విత్తనము. నాదియనుట మొదలు. గృహ క్షేత్రాదులు శాఖలు. దారపుత్రాదులు పల్లవములు. ధనధాన్యాదిక మాకులు. పుణ్యపాపములు పూవులు. దఃఖములు ఫలంబులు. విధిత్సయే భృంగపంక్తి. మూఢసంపర్కము నీరుపోత. ఈతరువు హృదయంబున మొలిచియున్నది. దీనిం బ్రాజ్ఞులు జ్ఞానకుఠారంబున నఱుకుదురు. అని దత్తాత్రేయుం డతనికి విజ్ఞానప్రకారంబంతయు నెఱింగించెను. మఱియు యోగప్రవృత్తి ప్రాణాయామలక్షణము అణిమాదిసిద్ధులు యోగధర్మములు ప్రణవలక్షణము లోనగు విశేషములన్నియు నా మహాత్ము నడిగి తెలిసికొని యలర్కుండు తదామంత్రణంబువడసి సుబాహుండు గాశీరాజు నున్న చోటికింబోయి నవ్వుచు సోదరుండు వినఁ గాశీపతి కిట్లనియెను.

కాశీంద్రా ! రాజ్యకాముకుఁడవై వచ్చితివి. నీయిచ్చవచ్చిన ట్లనుభవింపుము. లేదా సుబాహునకిమ్ము. అద్దాని నేను విడిచితినని పలికిన విని కాశీరా జిట్లనియె. అలర్కా! యుద్ధముచేయకయే రాజ్యము విడిచితి వేమి ? ఇది క్షత్రధర్మమే. క్షత్రియుఁడు మరణభయమును విడిచి శత్రువులపై శరవర్షము గురిపింపవలయుఁగాని పారిపోవనగునా? అని యాక్షేపించిన విని యలర్కుం డిట్లనియె.

నరేంద్రా ! నాకును బూర్వ మిట్టిబుద్ధియే యుండునది. ఇప్పుడు నాచిత్తవృత్తి పూర్తిగా మాఱిపోయినది. నీదాడికి వెఱచి దత్తాత్రేయ మహర్షి చరణంబులు శరణుజొచ్చితిని. ఆమహాత్ముడు నాకుఁ దత్వోపదేశము గావించి నిజం బెఱింగించెను. నాకు శత్రువులు మిత్రులును లేరు. ఇంద్రియముల జయించితి, సంగముల విడిచితిని,

శ్లో॥ సోహం న తెరి ర్నమమాసిశత్రుః సుబాహురప్యేషనమేపకారీ
     దృష్టంమయా సర్వమిదంయధాత్మా హ్యన్విష్యతాంభూపరిపు స్త్స్వయాన్యః॥

భూపా ! నీకు నేనును నాకు నీవును శత్రువులముకాము. సుబాహుఁడు నా కేమియు నపకారము సేయలేదు. నేను నాయాత్మవలెనే బాహ్యప్రపంచకమంతయుం జూచుకొనుచున్నాను. నీవు మఱియొక శత్రువును వెదకికొనుము. అని పలికిన విని విస్మయముచెందుచుఁ గాశీరాజు సుబాహుంజూచి రాజపుత్రా ! మీతమ్ముఁడు రాజ్యము విడిచెను. మనప్రయత్నము కొనసాగినది. పట్టభద్రుండవై ప్రజలం బాలింపుమని పలికిన సుబాహుం డిట్లనియె.

నరేంద్రా ! నే నేపనికై నిన్ను శరణునొందితినో యాపని తీరినది. నాకు రాజ్యమేల? ఇఁక నాకు సెలవిమ్ము పోయివచ్చెద ననిపలికినఁ గాశీపతి నవ్వుచు నిట్లనియె. నీ వేపనికై వచ్చితివి? ఆపని యెట్లుతీరినది? నాకేమియు విడిపోకున్నది. ఎఱిఁగింపు మనవుఁడు సుబాహుం డిట్లనియె. మాతమ్ముఁడు అలర్కుండు మాతల్లిపాలుత్రాగియు విషయసక్తుండై రాజ్యభోగంబుల ననుభవింపుచు నివృత్తిమార్గము దెలియకున్నాఁడని విచారించి దుఃఖము గలుగఁజేసితినేని వైరాగ్యము జెందఁగలఁడని నిశ్చయించి నిన్నిట్లాశ్రయించితిని. నీవును నాయభీష్టముపడువునఁ గావించితివి. మాతమ్ముఁడు ప్రవృత్తిమార్గము విడిచి విరక్తుండై యుత్తమ మార్గ మవలంబించె నిదియె నాయభీష్టము. తలఁచినకార్య మైనదని చెప్పిన నతండు తదీయవిజ్ఞానప్రవృత్తినిగఱించి పెద్దగా స్తుతిజేసెను.

అలర్కుండును జ్యేష్ఠపుత్రు ధాత్రీరాజ్యపట్టభద్రుం గావించి యన్నతో తపోవనంబునకుఁ బోయెనని యావృత్తాంతమంతయు నెఱింగించి మిత్రవింద యామదాలసవంటిదని స్తుతియించితిని. ఆకథవిని మిత్రవిందయు నవ్వయు వెఱఁగుపడి మదుపన్యాసము పెద్దగా మెచ్చుకొనిరి.

మిత్రవింద మదాలసగుణములోఁ దనకు సహస్రాంశమైనలేదని పలికినది. నేను వారితోఁ గలిసిమెలిసి యిష్టాలాపములాడుచుఁ గొన్నిదినంబు లందుండి యిచ్చటికిఁ బయనమైతిని. ఒకనాఁడు అవ్వ నాకడకు వచ్చి ముచ్చటింపుచు నిట్లనియె. ఘోటకముఖా ! నీముఖము జూచినప్పుడే దైవికముగా నామనుమరాలిని నీ కిప్పింపవలయునని బుద్ధిపుట్టినది. అందులకే నీకు నాగుట్టు జూపితిని. అందుల కే ని న్నిచ్చటికిఁ దీసికొని వచ్చితిని. నాకూఁతురు కూఁతు నీకిచ్చుట కంగీకరించినది. అల్లునకు నచ్చఁజెప్పితిని. అందఱకు నిష్టముగానున్నది. పెండ్లికూఁతురు నీవిద్యా వైభవము చూచి యుఱ్ఱూటలూగుచున్నది. కావున జాంబవతి నీవు ధర్మపత్నిగాఁ బరిగ్రహింపుము. ఈదీవి కధిపతి కాఁగలవు. నాయల్లుఁడు నీయభిప్రాయము దెలిసికొనిరమ్మనియెనని చెప్పినది.

జాంబవతిం జూచినదిమొదలు నాహృదయము దానియందు లగ్నమైయున్నది. వారు నాకుఁజేయు నుపచారములంబట్టి యించుక యాసదీపింప సంశయడోలిక యెక్కి యూఁగుచుంటిని. అవ్వ నాసందియము తీర్చినది. మనంబునంబొడమిన సంతసము దెలియనీయక మందహాసముతో నవ్వా ! నీవు పెద్దదానవు. నాశ్రేయము కోరుచుంటివి. నీమాట కాదనఁగలనా ? నీయిష్టమెట్లో యట్లే కావింపుమని తెలిపితిని.

ఆమెవోయి యల్లున కవ్విధం బెఱింగింప నతండు నాసవిధమున కరుగుదెంచి యార్యా ! యాచ్నా భంగదోషంబు గలుగునని యింత దనుక నాయభిలాష వెల్లడించితినికాను. ఇప్పుడు కులజులతోఁగూడ నేను గృతార్థుఁడనైతి. నాకూఁతుం బరిగ్రహింపఁ బాత్రుండవని స్తుతియింపుచు శుభముహూర్తంబున జాంబవతి నాకిచ్చి వివాహము గావించెను. తగినకన్యకదొరకినప్పు డొండొరుల ననుమతిబడయకయే వివాహమాడవచ్చునని మనము మొదట నిశ్చయించుకొంటిమి. కనుక మీ రెవ్వరును లేకున్నను మీయనుమతి పడయక జాంబవతిం బరిగ్రహించితిని. దివ్యోపభోగంబు లనుభవింపుచుఁ గొన్నిదినంబు లందుంటిని. అప్పుడప్పుడు పోయి గణికాపుత్రికలతో మాట్లాడి వచ్చుచుంటిని. వాండ్రు తమ్ము మీయొద్దకుఁ దీసికొనిపొమ్మని బ్రతిమాలికొనుచుండిరి. జాంబవతికి నందున్న సమయము సంగీతవి శేషంబులనెల్ల నెఱిఁగించిరి.

నే నొకనాఁ డానృపతితోఁ జెప్పి యొప్పించి చిత్రసేనారతిమంజరుల వెంటఁబెట్టికొని బయలుదేరితిని. సముద్రముదాటువఱకుఁ బెక్కండ్రుపరిజనులు తోడవచ్చిరి. దేశవిశేషములం జూచికొనుచు నీ నగరంబు నిన్న రాత్రికిఁ జేరితిమి. రాత్రి సత్రములో బసజేసితిమి. మీ పేరులు రాత్రి యాసత్రములోనే వినంబడినవి. నేఁటియుదయమున లేచి వీరిని బండియెక్కించి మీయునికిఁ దెలిసికొనుచు నిందువచ్చితిమి. ఇదియే నావృత్తాంతమని ఘోటకముఖుం డెఱింగించెను.

ఆవృత్తాంతమును విని మిత్రులందఱు సంతసించుచు ఘోటకముఖుండుగూడఁ బ్రభుస్థాన మలంకరింపఁగలఁడని ప్రశంసించిరి. అప్పుడు కుచుమారుఁడు నాఁడు నీతో వచ్చిన పురుషుఁడెవ్వఁడో నీ వెఱుఁగ వైతివి. అతఁడే భోజమహారాజు. అతుండు భైరవునితంత్రములోఁ జిక్కికొనియె నని చెప్పితివి. ఎట్లు బయల్పడియెనో తెలియదు. మాతో నావిషయ మేమియుఁ జెప్పలేదుకాని వానివలన నిడుములం గుడిచితిననిమాత్ర మెఱింగించెను. ఆభైరవుఁ డిప్పు డీయూర నున్నాఁడు. వానిమృగముల యాట రేపు సాగింతురు. వాని నప్పుడు పరిభవింపఁ దలంచికొంటిమి. వాఁడు మనచారాయణునిఁగూడ మృగమును జేసెనని యాకథయంతయు నెఱింగించెను.

అతండు భోజుండని విని ఘోటకముఖుండు విస్మయసాగరమునం దేలియాడెను. అతనిభార్య లీలావతి యిందేయున్నదని చెప్పినంతఁ గలిగినసంతోష మిట్టిదని చెప్పఁజాలను. వెండియు వార లొండొరులకథల నొండొరుల కెఱింగించికొనుచు వారు వారు పడినయిడుములు దలంచుకొని యడలుచు నాదివసము పర్వసమయముగా వెళ్లించిరి.

అని యెఱింగించి యతిపంచాననుం డవ్వలికథ మఱల నిట్లు చెప్ప మొదలుపెట్టెను.

170 వ మజిలీ.

−♦ మిత్రసమ్మేళనము. ♦−

నాఁడు భైరవుని మృగములయాటఁ జూచుటకు నియమించిన దివసము. అయ్యాటకుఁ దగిననెలవు పురమందిరము అది మిక్కిలి విశాలముగానున్నది. స్త్రీలనిమిత్తమై ప్రత్యేకముగా గదులు గట్టఁబడి యున్నవి. అయ్యాటఁజూచుటకు మల్లికయు రత్న పదిక సువర్న పదిక మొదలగు మగువలుకూడ నభిలషించి కోరుటయుఁ గుచుమారుఁ డంగీకరించి స్త్రీలనందఱను దీసికొనిపోవుటకు నేర్పాటు గావించెను.

రాజుభార్యలు రుక్మిణి మొదలగు నంతఃపురకాంతలుగూడ నావేడుకచూచుటకుఁ బోవుదురని విని చారుమతి దానుగూడ వత్తునని చిత్రసేనుం గోరికొనినది. ఆమెయందలి ప్రేమచే నతం డనుమోదించి స్త్రీవేషముతో వచ్చినచోఁ దండ్రికిఁ దెలియుసని వెఱచి చారుమతికిఁ