కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/156వ మజిలీ
నోయున్న మిత్రులకు రాజ్యము పంచునఁట. నాకును నాతలిదండ్రులకును భోజనముసేయుటకై పెండ్లిపెత్తన మిచ్చునఁట. వీనిం బరిభవించిన తప్పులేదు. అని తలంచుచుఁ బ్రకాశముగా నార్యా ! నేఁడు నాకు దేహములో నస్వస్థతగానున్నది. అందుల కిట్లుంటినని సమాధానము చెప్పెను.
అట్లైనఁ బెందలకడఁ బండికొనుము. అని వానితో ముచ్చటించి కుచుమారుండు గాఢముగా నిద్రబోయెను. ఆయన గుఱ్ఱువినంబడినతోడనే లేచి శంబరుం డంతకుముందు సంగ్రహించియుంచిన పాషాణము మెల్లగ నెత్తి గుభాలున యతని నెత్తిపై వైచి చేతనమును బాయఁ జేసి యప్పుడే యాశవము నెత్తికొనిపోయి యాకోటకందకములోఁ బాఱవైచి తానే కుచుమారుండనని ప్రకటింపుచుండెను.
శ్లో॥ వాంఛాసజ్జనసంగతౌ పరగుణే ప్రీతిగున్‌రౌ కౌ నమ్రతా
విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిలోన్‌కాపవాదాద్భయం
భక్తిశ్ళూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తిఃఖలై
రే తెయేషువసంతినిమన్‌లగుణాస్తెభ్యోమహద్భ్యోనమః॥
దుర్జనుల సంసర్గ గలిగినంత నెప్పటికైన ముప్పు వాటిల్లునని శాస్త్రములు చాటింపుచున్నవిగదా ?
అని చెప్పునప్పటికిఁ గాలాతీతమగుటయు నంతటితో విరమించి యవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.
156 వ మజిలి
−♦ శంబరునికథ . ♦−
గీ. ప్రాణ మర్పించుటకు నొడంబడునుగాని
బలిమి యజమానుని రహస్యవాచకంబు
నెఱుఁగఁజెప్పఁడు పరులకు నెంతయైన
నాత్మవిస్రంభపాత్రుఁ డైనట్టిదూత.
అయ్యా ! మీదయయుండిన నేరేఁడుపండ్లకుఁ గొదవలేదు. పరిహాసము విడిచి వారెందుండిరో చెప్పుఁడు.
మిమ్ము నేనెఱుంగనిదానను గాను. మీ రాయనమిత్రులు మొదటినుండియు మిమ్ము నే నిందుఁ జూచుచుంటి. రాజపుత్రిక సందేశ మొండు జెప్పవలసియున్నది. వేగ మాయన యెందుండిరో చెప్పుఁడని యడిగిన వాఁడు మది దిగులుపడ శుకమా ! రాజపుత్రికాసందేశ మేదియో నాకుఁ జెప్పుము. నీకు మంచి పండ్లుపెట్లెద ననవుడు నది అయ్యో ! భార్యాభర్తలనడుమ నొడువు లొరుల కెఱింగింపవచ్చునా ? మీయెఱుంగని ధర్మము లున్నవియా ? అది తప్పుపనియని పలుకుచుండఁ దటాలున దానిం బట్టికొని ఓసీ ! పులుగా ! నీరాజపుత్రిక చెప్పినమాట లేవియో చెప్పుము. లేకున్న నీగొంతువు పిసికి చంపెదఁ జూడుమని కాళ్లొకచేతఁ గంఠ మొకచేతం బట్టికొని చెప్పెదవా? చంపనా? చెప్పెదవా? చంపనా ? అని యెన్నిసారులడిగినను గిలగిలఁ గొట్టికొనినదికాని నిజము చెప్పినదికాదు.
ఆచిలుకయుండినఁ దనగుట్టు బయలగునని తలఁచి యాదుష్టుండు జాలిలేక యాశుకముకంఠము నులిమి చంపి పారవేసెను. పిట్టప్రాణ మన సెంత, ఆహా ! గుడిమ్రింగినవానికి గుడిలోని లింగ మేమూలకు లెక్క, అనినట్లు కుచుమారుఁజంపిన క్రూరునకుఁ జిలుకనుజంపు టొక యబ్బురమా ?
నాఁడు రామచిలుక తిరుగాఁ దనయొద్దకు రామింజేసి పరితపించుచు సరస్వతి సారసికయను సఖురాలిం జేరి యోసీ ! యాశుకము నాసందేశము దీసికొనిపోయి మఱల వచ్చినదికాదు. కారణము తెలియదు. ఆపండితకంఠీరవుఁడు తనయొద్దనే యుంచుకొనెనా ? ఏది యెట్లైన నీవొకసారి వారియొద్దకుఁ బోయి చిలుకమాట తెలిసికొని తదాకారంబు చిత్రఫలకమున వ్రాసికొనిరమ్ము ఇదివఱకు వారి రూప మెట్లున్నదియో విచారింపలేదు. చిలుక నడుగవలయుననుకొని మఱచి పోయితిని. నీవు వోయివచ్చిన నన్నియుం దెలియఁగలవని నియోగించుటయు నది యతఁడున్న నెలవునకు గురుతులడిగి తెలిసికొని తిన్నగాఁ బోయి వాకిట నిలువంబడి కుచుమారుండున్న నెల విదియేనా ? అని యెవ్వరినో యడుగుచుండ విని శంబరుఁడు తలుపుతీసికొనివచ్చి అవును. ఇదియే యాతఁడున్న నెలవు. నేనే కుచుమారుండ నీవెవ్వతెవని యడిగెను.
సారసిక నమస్కరించినది. లోపలికిఁ దీసికొనిపోయి కూర్చుండుమని నియమించి దానిం బెద్దగా గౌరవించి నీవు వచ్చినపని యేమని మఱల నడిగెను. అయ్యా ! నేను సరస్వతి సఖురాలను సారసికయను దాన. మీ రామెతో నిదివఱ కుత్తరప్రత్యుత్తరములను జరపుచున్న కుచుమారులు మారేనా వారు లోపలనున్నారా? అని యడిగిన నతండు నవ్వుచు జవ్వనీ' ! నీతో నేను బరిహాసమాడుదునా? మీరాజపుత్రికను విద్యలలో జయించి పెండ్లియాడఁ దలఁచికొన్నవాఁడ నేనే యని మఱల నుత్తరము చెప్పెను.
సారసిక స్వామీ ! మారాజపుత్రిక మీయొద్దకు నిన్న రామ చిలుక నంపినది. అది తిరుగవచ్చినది కాదేమి ? మీయొద్దనే యుంచు కొనిరా? అని యడిగిన నతండు పాప మాచిలుక నిన్నవచ్చి మచ్చికతో నాతో ముచ్చటించుచుండెను. నేను వేఱొకపనిమీఁద లోపలికిఁ బోయి వచ్చునంతలోఁ బొంచియున్న యొకపిల్లి తటాలున దానిగొంతువు పట్టుకొని యీడ్చికొనిపోయి చంపినది. అందులకే విచారించుచున్నవాఁడ. దానికి విద్యలన్నియు నుపదేశించితిని. మాకు దూతికయై వార్తలం దెలుపుచున్నది. దాని కాయువు సరిపడిన మన మేమిచేయఁ గలము అని చెప్పెను.
అమ్మయ్యో ! యెట్టిమాటవింటిని? పలుకులు కళలు తెలిసికొనినపిదప మాభర్తృదారికకు దానియెందెంతయో ప్రేమకుదిరినది. ఈమాట వినిన మిక్కిలి పరితపింపఁగలదు. మహోత్సవ సమయమున నీవిచార మామెను బాధింపకమానదు. అని పలుకుచుండ నామాట మఱుగుపడునట్లు మఱియొకప్రస్తాపము దెచ్చుచు సారసికా ! ఇదిగో మీరాజపుత్రిక పంపిన ముత్యాలహారము చూచితివా ? కుచుమారులు మీరేనా? మీరేనా? అని పలుమారడిగితివి. ఈహార మది కానిచో నేను మఱియొకఁడ నగుదును. అని పలికెను.
అప్పు డది యతఁడు కుచుమారుండు కాడని నిశ్చయించుకొని మొగంబున విన్నదనంబుదోఁప సరస్వతియొద్ద కరిగెను.
ఆచిన్నది కొన్నియడుగు లెదురువచ్చి మచ్చెకంటీ ! అచ్చటివిశేషము లేమి? ఆవిద్వచ్ఛిఖామణిం గంటివా? మాట్లాడితివా? రూపము వ్రాసికొనివచ్చితివా ? ఎట్లున్నది? చిలుక యేదీ? అని యడిగినఁ గన్నుల నీరుగ్రమ్మ తొలుతఁ జిలుకవార్త దెలిపినది. అందులకై పెద్దతడ వమ్ముద్దు గుమ్మ విచారించినది.
వారించుచు సారసిక సఖీ ! నీ వాతఁడు గొప్పవిద్వాంసుడని ముఱయుచుంటివికాని నామది కంత నచ్చలేదు. అదియేమియోకాని వానినూపము చిత్రఫలకమున వ్రాయ బుద్ధిపుట్టినదికాదు. ఊరక తిరిగి వచ్చితిని. అనుటయు సరస్వతి ఏమీ ! వానిరూప మసహ్యముగానున్నదియా ? ఆనియడిగిన సారసిక వాని మొగంబున నా కేమియుఁ దేజము గనంబడలేదు. దరిద్రదేవత నాట్యమాడుచున్నది. అని చెప్పిన సరస్వతి యిట్లనియె. “విద్వత్సు దారిద్ర్యతా" అనియుండలేదా ? ఎట్లైనను జదివికొనినవానిమొగము తేజోవంతముగా నుండవలయు నది నీవు గనిపెట్టలేకపోయితివి. పోనిమ్ము. “విద్యారూపం కురూపాణాం” రూపహీనులకు విద్యయేరూపము. వెండియు నీ వీచిలుక నాయనయొద్దకుఁ దీసికొని పోయి దానికివలెనే దీనికిఁ గూడ విద్యోపదేశము గావింపుమని కోరుము. అని యొకచిలుకను బత్రికతోఁగూడ సారసికచేతి కిచ్చి యంపినది.
సారసిక యాతనియొద్ద కరిగి నమస్కరించిన ముసిముసినగవులు వెలయింపుచు శంబరుఁడు యోషామణీ ! విశేషము లేమి ? ఈచిలుక యెక్కడిది ? అనియడిగిన నది రాజపుత్రిక యిచ్చినపత్రిక యతని కిచ్చి ఆర్యా ! ఈచిలుకను సకలకళాభూషితం జేయుమని యామె కోరుచున్నది. వెనుకటి చిలుకనుగుఱించి చాల విచారించినది. దీనిం బ్రజ్ఞాన్వితం గావించినచో నావిచార మామెను బాయఁగలదు. అంతయు నీపత్రికలో నున్నది. చదివికొనుఁడు. అని పలికిన విని యతండు మతిదిగులుదోప నా పత్రిక నిటునటు త్రిప్పి విదేశలిపితోనుండుటచేఁ జదువలేకపోయెను.
47 కళ దేశభాషలిపిజ్ఞానము.
అది వాని కేమి తెలియును? చదివినట్లు చివరంటఁజూచి పత్రిక మడిచి మొగంబునఁ గోప మభినయించుచుఁ జాలుఁజాలు సారసికా! ఇదియా ? రసికత. అస్తమానము మా కిదియేపనియా? మావిద్యల వృథగా వినియోగించుట నా కిష్టములేదు. ఒకమాటు పరీక్షించినది తగు సమాధాన మిచ్చితిమి పలుమా రడుగుటకు నామెకుఁ దీరికయున్న దేమో? మాకుఁ దీరికలేదు. ఈ చిలుకకు నేను విద్య లీయనని చెప్పుము. ఇదిగో యామె ముత్యాలహారము తీసికొనిపొమ్ము. ప్రకటనఁజూచి విద్యావిషయముగానఁ బ్రసంగించితిని. గెలుపుగొంటి నంతియచాలు. నన్నుఁ బెండ్లియాడుట కామె కిష్టములేకున్న మానివేయమనుము. జయింపఁబడితి నని పత్రిక వ్రాసియిమ్మనుము. పొమ్ము అని పలుకుచు నాహారము దానిముందరఁ బారవైచెను.
సారసిక రసికాగ్రేసరా ! కోపపడియెద రేమిటికి ? పత్రికలోఁ జిత్రములైనవిషయములు వ్రాసినదిగదా ? చిలుకకు విద్యలు చెప్పక పోవుదురుగాక. ఆమెకుఁ బ్రత్యుత్తర మేమిటి కియ్యరు ? అది మిమ్ములఁ బరీక్షించుటకాదు. అభిలాష దెలుపుట. నా కాలిపి తెలియదు. ఏమని వ్రాసినదో చదువుఁడు. అని యడిగిన వాఁడు ఓహో ! నే నామాత్రము దెలియనివాఁడను గాను. నాకు దేశభాషలిపిజ్ఞాన మున్నచో లేదో యని విదేశలిపితో వ్రాసినది. ఇంతకన్నఁ బరీక్ష యేమున్నది? అని పలికెను.
పోనిండు. మీ కఱువదినాలుగువిద్యలు వచ్చుంగదా? మీరు మఱియొకలిపితో మఱియొకభాషతోఁ బ్రత్యుత్తరము వ్రాసి యామెనే పరీక్షింపుఁడు. అందులకుఁ గోప మేమిటికి? అదియునుంగాక మీరహస్యము లితరులకుఁ దెలియకుండ నీలిపితో వ్రాసిన దనుకొనరాదా? అని సమాధానముజెప్పిన నమ్మూఢుఁ డిట్లనియె.
సారసికా ! ఆమాట లేమియు నాకడఁ జెప్పకుము. పరీక్షకే యడిగినది. అందులకే నాకుఁ గోపమువచ్చినది. వేయిజెప్పుము. నేను బ్రత్యుత్తర మీయను. హారము దీసికొనిపొమ్ము. అని మొండివాదము సేయఁబూనెను. సారసిక యాలిపి వానికిఁ దెలియలేదని గ్రహించినది. వానిమాట లసందర్భములుగా నుండుట కుచుమారుం డతఁ డగునో కాడోయని సందియము హృదయమునఁ బొడమినది.
సంశయడోలాయితహృదయసారసయై సారసిక యిపుడే వత్తు ననిచెప్పి యప్పుడే సరస్వతియొద్దకుఁ బోయి మోమున విన్నఁదనము దోఁప నిట్లనియె. సఖీ ! ఆతండు నీవువ్రాసినలిపి యెఱిఁగినవాఁడుగాఁ దోఁపలేదు. పై పెచ్చు మాటడిగినందులకుఁ బెద్దకోపముఁజెందెను. నీవు పెద్దలతో నాలోచింపకుండఁ దొందరపడి నీవే భర్తవని హారము నంపుదువా ? ఆతండు వట్టిమూర్ఖుఁడువలె గనఁబడుచుండెను. మాటాడుటయే తెలియదు. శాస్త్రపరిశ్రమ చేసినట్లే తోఁచదు. అని యక్కడజరిగిన సంవాదమంతయు నెఱిగించినది.
సరస్వతి సీ! అసహ్యపుమాటలాడకుము. మొగమునఁ గళలేదనియు వక్తృత్వమే యెఱుఁగఁడనియు మూర్ఖుఁ డనియుఁ బలుకుట నీయపరిజ్ఞతలోపముగాక మఱియొకటికాదు. సర్వదేశభాషాలిపిజ్ఞానునకు నాలిపి తెలియదనుట సమంజసము గాదు. పలుమా రడిగితినని కోపము వచ్చి యట్లనిరి. పోనిమ్ము మఱేమియు నడుగవలదు. ఈశ్లోకముచూచి ప్రత్యుత్తరము వ్రాసి యిమ్మనుము. స్వదేశలిపితోనే వ్రాయుచుంటినని పలికి యొకశ్లోకము వ్రాసియిచ్చి యంపినది.
శ్లో॥ భో ! రూపనిజిన్‌త మహేంద్రకుమార మార
శ్రీరాట్కుమార కుచుమార ! దురుక్తిజాలైః
యత్త్వామనాయికధితో త్తరరూపభేదం
తత్ క్షంతు మహన్‌సి, జితాస్మి భవత్కలాభిః॥
ఆశ్లోకము తీసికొనిపోయి సారసిక శంబరున కిచ్చినది. ఆతం డా శ్లోకము జదివియుఁ దదర్థావబోధనము చేసికొనలేక తల కంపించుచుఁ బ్రత్యుత్తర మిమ్మని కోరుచున్నసారసికతో నేను దీని కిప్పుడు ప్రత్యుత్తర మీయను. వెనుకనుండి పంపించెద నీవు పొమ్ము, అని కచ్చితముగాఁ బలికి లోపలికిఁ బోయెను.
సారసికయుఁ జిన్నబుచ్చుకొని సరస్వతియొద్దకుఁ బోయి సఖీ ! నీవు నన్నుఁ దిట్టినను దిట్టెదవుగాక; వానిం భర్తగాఁగోరుట యవివేకము . వాఁడు వట్టిమందుఁడు. బాగుగా నాలోచించుకొనుమని పలికినది, అదియే మందమతియని సరస్వతి తలంచినది.
సారసిక యరిగిన వెనుక శంబరుడు అయ్యో! నేను దెలివితక్కువ పని గావించితిని తిరుగాఁ బరీక్షింపరనియు సరస్వతినిఁ బెండ్లియాడ వచ్చుననియుఁ దలంచితిని. నాప్రయత్న మంతయు వ్యర్థమైనది. వీరికిఁ దెలియకుండఁ బారిపోవుటయే లెస్స. ఇందుండిన నాగుట్టు బయలుకాక మానదు. అని యాలోచించుచుండ మంగళవాద్యములు వినంబడినవి. ఆధ్వని విని శంబరుండు వాకిటకు వచ్చెను.
మంత్రిసామంతపురోహితాదులు ముందు నడువ మనోహరాలంకారభూషితమగు భద్రగజం బొండు వచ్చుచుండెను అది యెవ్వరి నిమిత్తమో యని యాలోచించుచుండ నందు నిలువంబెట్టి కుచుమారుం డిందేయున్నవాఁడు. వారిబస యిదియే యని కొందఱు పలికిరి. కుచుమారుం డెందుండెనని యడిగిన నేనే కుచుమారుండనని శంబరుఁడు తెలియఁజేసెను.
అప్పుడు మంత్రు లతని సకలాలంకారభూషితుం జేసి యా యేనుఁగుపై నెక్కించి య రేగింపుచుం దీసికొనిపోయి యొక దివ్య సౌధంబునం బ్రవేశపెట్టిరి. ఆసంతోషములో నతండు పారిపోవు మాటయే మఱచిపోయెను. పరిజను లతనికి రాజోపచారములు సేయుచుండిరి కాని వానికి సంతోషముమాత్రము లేదు. ఎవ రేమన్నను బెదరుతో మాట్లాడుచుండును. అని యెఱింగించునంత వేళ యతిక్రమించినది.
157 వ మజిలీ.
−♦ పల్లెవాండ్ర కథ. ♦−
పురందరపురమునకుఁ గ్రోశముదూరములో నొకపల్లె గలదు. అం దున్నవాండ్రందఱు పల్లెవాండ్రే. వాండ్రు వలలు వైచి చేఁపలఁ బట్టియు నోడలఁ ద్రోసియుఁ దమకు జీవనమే జీవనాధారముగాఁ గాలక్షేపము చేయుచుండిరి. ఆపల్లెలోనివారికెల్ల నొకపురోహితుఁడు