కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/154వ మజిలీ

    యందు నరనాథనందనుం డబ్బుచుండ
    నొడఁబడమి కేను సన్యాసినో మహేశ !

అని యంగీకారము సూచించుటయు నారాజనందనుం డమందానందకందళితహృదయారవిందుండై యయ్యిందువదన నక్కునఁ జేర్చి చెక్కులు ముద్దుపెట్టుకొనుచు మేనం బులకాంకురములు బొడమ బండి యెక్కించి యంతఃపురమునకుఁ దీసికొనిపోయెను.

అని యెఱింగించి.

151 వ మజిలీ.

-♦ కుచుమారునికథ. ♦--

కుచుమారుండు దత్తకాదిపండితు లేడ్వురలో నొకఁడు. దత్తునికంటె రెండేండ్లు చిన్నవాఁడు. మిక్కిలి చక్కనివాఁడు. విద్యలలో దత్తునితో సమానుఁడు. అతనికి మహారణ్యసంచారము గావించి యోషధీ విశేషముల సంగ్రహింపవలయునని చిన్నతనమునుండియు నభిలాష గలిగియున్నది. ఈమిత్రులలో నొకఁడగు సుపర్ణ నాభునికి నట్టియభిలాషయే కలదు. వారిరువురు శుభముహూర్తంబునఁ గాశీపురంబు బయలువెడలి యుత్తరదేశారణ్యమార్గంబులంబడి పోయిరి.

కుచుమారుండు మారుఁడువోలె సుకుమారుం డగుట దుస్తర ప్రస్తర హిమానీ కంటక దుర్గమంబగు కాంతారమాగన్ంబున నడువ నోపక యొకనాఁడు నేలం జదికిలంబడి వయస్యా ! నీ బలవంతమున నింతదూరము వచ్చితిని. మంచుగాక మన కేవిశేషము గనంబడలేదు. ఇఁక మనము మఱలి పురవిశేషంబులం జూచుచు నియమితకాలమునకు ధారానగరంబునకుఁ బోయి మిత్రులం గలిసికొందము. ఇక నే నడుగు నడువజాలను. ముందుఁజూడ మహారణ్యభీకరములై హిమచ్ఛన్నములగు పర్వతశిఖరములు గనంబడుచున్నవి. పోవఁజూలమని పలికిన విని సువర్ణ నాభుండు నవ్వుచు నిట్లనియె.

మిత్రమా ! నిన్ను రావలదని మొదటనే చెప్పితిని. నే నీయరణ్యాంతము చూడక మఱలువాఁడనుకాను. ఈయరణ్యము నాయంతమే చూచెనేని చింతయేలేదు. ఇంక వ్యవధి చాల యున్నది. బ్రతికియుండిన నియమితకాలమునకు నేను ధారానగరమునకు వచ్చువాఁడ. నీవిందుండి క్రమ్మఱ దేశములమీఁదుగాఁ బొమ్మని చెప్పినవిని కుచుమారుం డనేకవిధముల నతని వెనుకకు రమ్మని బ్రతిమాలికొనియెను కాని యతండంగీకరింపలేదు. సౌహార్ద్రవిశేషంబున సువర్ణనాభుని బలుమా రాలింగనములు చేసికొని విడువలేక విడువలేక విడిచి దక్షిణాభిముఖుండై యరుగుచు నొకనాఁడొక కోయపల్లె సేరి యందున్నవారిలోఁ బెద్దవానింజీరి యోరీ ! ఇక్కడికిఁ గాశీపురం బేదెసగానున్నదియో చెప్పఁగలవా ? ధారానగరమునకు మాగన్‌ము దెలియునా ? పాటలీపుత్రనగరముపేరు వింటివా ? అని యడిగినవాఁడు స్వామీ! ఆపేరులేవియు నేనెఱుఁగను. కాశీయని మాపెద్దలు సెప్పుచుందురు. చచ్చినతరువాతఁ బుణ్యము సేసినవా రందువోవుదురని చెప్పికొనియెదరు. ఆదారులేమియు నాకుఁ దెలియవని చెప్పెను.

మా కాపురము కాశీపురమే. అది యీభూమిమీఁదనే యున్నది. చచ్చినతరువాతఁ బోవునది స్వగన్‌ము. అది మీఁదుగానున్నదని వానితో ముచ్చటించుచు నోరీ ! మీయడవిలో నాశ్చర్యకరములైన విశేషము లేమైనంగలవా? మహర్షులుగాని యోగులుగాని సిద్ధులుగాని యెందైనఁ దపముచేసికొనుచున్న వారింజూచితివా ? జ్ఞాపకముచేసికొని చెప్పుమని యడిగిన వాఁడు బాబూ ! లేకేమి ? ఇక్కడికిఁ బదిదినముల పయనములోఁ బడమరగా నొకరుసి గలఁడు. ఆయన కెన్నియేండ్లున్నవియో యెఱిఁగినవారులేరు. పెద్దపులులు సింగములు మొదలగు మెకము లాయనచెప్పిన పనులు చేయుచుండును. ఆయనయున్న యడవి నలువదియామడయున్నది. ఆనడుమనున్న యేమెకమైన మనుష్యులజోలికిరావు. బాబో ! ఆయన ప్రభావము సెప్ప నాతరముకాదు. ఎప్పుడు పర్ణశాలలో ముక్కు మూసికొని శపముజేసికొనుచుండునని గొప్పగా వర్ణించుచుఁ జెప్పెను.

కుచుమారుఁ డత్యుత్సాహముతో నాకథవిని యోరీ ! ఆయన పేరేమియో యెఱుంగుదువా? ఇప్పుడున్న వాఁడా అని యడిగిన వాఁడు సామీ! పేరు నాకుఁదెలియదు. మాబోఁటులతో మాటలాడునా ? మే మేదేని యాపదవచ్చినప్పుడు ఆయనఁ దలఁచికొని మీదులు గట్టుదుము. మాకోరికిలు తీరుచుండును. అందుఁబోయి మ్రొక్కులు చెల్లించుకొందుము. మే మేది తీసికొనిపోయినను వారి గుడిమ్రోల నిడవలసినదే. దాని నాయన చూడనేచూడఁడు. నిరుడు మాపల్లెనుండి మ్రొక్కులు తీసికొనిపోయిరి. అప్పటికి బ్రతికియున్నవాఁ డని యెఱింగించెను.

కుచుమారుని కతనిఁ జూడవలయునని మిక్కిలి యుత్సాహము గలిగినది. ఆతనిగుఱించి పలుమా రడిగినమాటయే యడుగుచు వాఁడు సెప్పినమాటలఁబట్టి యాసిద్ధుండు మహానుభావుండని నిశ్చయించెను. మాగన్‌మడిగి తెలిసికొని మఱునాఁ డుదయకాలంబున బయలుదేరి యాదారిఁ బోవుచుండెను. తేనె ఫలములు దుంపలు లోనగు పదార్థములుదిని యాకలి యడంచుకొనుచుఁ బదియేనుదినములు నడిచి గురుతుగా సిద్ధాశ్రమమున కరిగెను.

వృక్షలతాగుల్మాదులు వాడియున్నవి. ఫలములు రసహీనములై యెండిపోవుచున్నవి. కుసుమములు వాసనాశూన్యములై రాలి పోవుచున్నవి. పూర్వము మిక్కిలి శోభాస్పదముగా నున్నదని చూచిన వారికిఁ దోఁచకమానదు. కుచుమారుం డాగురుతులు పరికించి కోయవాఁడెఱింగించిన సిద్ధవన మదియేయని నిశ్చయించి విశేషములు చూచుచు దానువినిన యానవాళ్ళ ననుసరించి పోయి పోయి యొక తటాకముచెంత కరిగెను.

ఆజలాకరము మనోహరములగు సోపానములచే వెలసియున్నది. జలము పసరెక్కి నాచుగట్టినది. మెట్లన్నియుఁ బాడుపడినవి. జలకుసుమము లేమియును లేవు. సారవిహీనమగు నక్కాసారంబు శోభ విమర్శించి కుచుమారుం డీయరణ్యమంతయుఁ దేజశ్శూన్యమై యున్నది. కోయవాఁడెఱింగించిన సరస్సిదియే కావచ్చును. అదిగో తూరుపుగాఁ గనంబడుచున్న మఱ్ఱిచెట్టు సిద్ధుని యునికిపట్టుకావచ్చును. అందెవ్వరును లేనట్లు తోఁచుచున్నది ఇది తప్పక సిద్ధుని వనమే. అందుపోయి చూచెదంగాక యని తలంచుచు నావటవిటపినికటమునకుఁ బోయెను.

దానిక్రింద నొక పర్ణశాల పాడువడి యున్నది. కృష్ణాజిన కమండలువులశకలము లక్కడక్కడ పడియున్నవి. సిద్ధుండు పరమపదించె ననియు దానంజేసి శోభాశూన్యంబైయున్నదనియు నిశ్చయించి యతండాప్రాంత భాగములు సంచరించుచు నేవిశేషమును గానక కొంతసేపా చెట్టుక్రిందఁ గూర్చుండి ధ్యానించుచు మోమెత్తి యత్తరూచ్ఛాయంబుఁ బరికించెను.

ఆవృక్షాగ్రమునుండి యవ్వనప్రమాణంబు చూడ సంకల్పము పుట్టినంత నతం డట్టెలేచి యతికష్టమున నా చెట్టెక్కి మధ్యశాఖావసానమున నిలువంబడి నలుమూలలు పరికించిచూచెను. ఆ వనమంతయు నతనికిఁ గనంబడినది. శోభావిహీనమైయున్నది. సిద్ధుని మరణమునకు వగచుచు నతండు క్రమ్మఱ వృక్షావరోహణము గావింపుచు గోటకముల శాఖాంతరములఁబరిశీలించుచుండెను. స్కంధోపరిభాగంబున నొక కోటరమునకు బిరడాయున్నట్లు తోచుటయు నతం డాబిరడా పట్టుకొని లాగెను సులభముగా నూడివచ్చినది. లోపల మందసమువలె నున్నందునఁ జేయిపెట్టి తడవిచూచెను. ఒక తాటియాకుల పుస్తక మతని చేతికి దొరకినది

సంతోషముతో నా పుస్తకమునువిప్పి యందుండియే చదివెను. దేవనాగరలిపి పురాతనమైయున్నది. స్పష్టముగా నక్షరములు తెలియమింజేసి చెట్టుదిగి పసరువ్రాసి చూచెను. చదువుటకు వీలుగానుండెను. అందనేకవిషయములు వ్రాయఁబడియున్నవి. అందు ముందుగా సిద్ధుని స్వీయచరిత్రము అనుశీర్షికచూచి యిట్లుచదివెను.

−♦ సిద్ధుని స్వీయచరిత్రము. ♦−

గోదావరీతీరమునఁ బర్ణశాలయను నగ్రహారము గలదు. అందు శ్రీధరభట్టను బ్రాహ్మణుఁడు గలఁడు. అతనికిం బ్రాయముమీఱిన తరువాత మహిధరభట్టను కుమారుఁ డుదయించెను. తండ్రి పుత్రు నుచితకాలమునఁ జదువవేసెను. ఆబాలుం డెనిమిదేఁడుల ప్రాయము వాఁడై బడిలో నుపాధ్యాయుల యొద్ద నామలింగానుశాసనమను నిఘంటువును జదువుచు నందు,

శ్లో॥ అణిమా మహిమాచైవ గరిమా లఘిమాతథా
      ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వంచేతి సిద్ధయః ॥

అనుశ్లోకమును జదివి దాని కర్ణమేమని గురువుగారి నడిగెను. అతండవి యష్టసిద్ధులు తపస్సాధ్యములు మహాయోగులకుఁగాని పొంద శక్యములుగావు. వానియర్థబోధావసరము నీకిప్పుడు లేదు. అని యొజ్జలు సెప్పుటయు మహిధరభట్టునకు వానివిశేషములెట్టివో తెలిసికొన వలయునని యభిలాషగలిగినది. పలుమారాశ్లోకమునే చదువుచుండును. మఱికొంతకాలమునకే వానితలిదండ్రులు పరమపదించిరి. పిమ్మట మహీధరభట్టు గ్రామమునువదలి దేశములు తిరుగుచు నొకనాఁడొక పండితు నాశ్రయించి మున్ను తానువర్లించిన శ్లోకమునుజదివి దాని యర్థమును వివరముగాఁ జెప్పుమని వినయముగాఁ బ్రార్థించెను.

ఆపండితుఁ డాతనింజూచి నవ్వుచు నీకీసిద్ధు సంపాదింపవలయునని యభిలాషయున్నదా? అట్లైనఁ జెప్పెదనాలింపుము. అణిమ = పరమాణు ప్రమాణుఁడై వసించుట, మహిమ = బ్రహ్మవిష్ణ్వాదులకంటెఁ బెద్దవాఁడై యొప్పుట, గరిమ = బ్రహ్మాండమువలె భారముగానుండుట, లఘిమ = మేరువంతయుండియు దూదివలెఁ దేలికగానుండుట, ప్రాప్తి = తలఁచినంత నే వలసినపదార్థములు తనయొద్దకు వచ్చునట్లు చేయుట, ప్రాకామ్యము = ఎక్కడికిఁబోవలెనన్న నక్కడికిఁబోవుట, ఈశత్వము = దేవతలకు సైత మధిపతిగానుండుట, వశిత్వము = దేవతలు మనుష్యలేకాక పశుపక్షి మృగాదులు తనకువశమై పరిజనులవలె నుపచారములు సేయుట.

అష్టసిద్ధులనఁగా నివియని యర్థము సెప్పినవిని మహీధరభట్టు స్వామీ ! యీసిద్ధు లెట్లు సాధ్యమగునని యడిగిన నతండు,

శ్లో॥ యద్దుష్కరం యద్దురాపం యద్దుర్లభ్యంచ దుస్తరం।
     తత్సర్వం తపసాప్రాప్యం తపోహి దురతిక్రమం॥

చేయుటకుఁ బొందుటకు దాటుటకు నేదిశక్యముకాదో అది తపంబున శక్యమగును. తపముచేయుట మాత్రము కడుకష్టము. అనియెఱింగించి తపంబుసేసి వీనిం బడయుమని పరిహాసముగాఁ బలికెను. వాని కాసాధనముల సాధింపవలయునని సంకల్పము జనించినది.

అతం డదేపయనముగా నుత్తరదేశారణ్యములు కొండలు గుహలు లోనగు దర్గమప్రదేశంబులు దిరుగుఁ గనంబడినబైరాగికెల్లఁ దనసంకల్ప మెఱిఁగించుచు నీవా? తపంబుగావించువాఁడవని పరిహసింపఁబడుచుఁ దిరిగితిరిగి యొకనాఁ డొకకొండగుహలోఁ దపంబుచేసికొనుచున్న యవధూతంజూచి యాయనతోఁ దనసంకల్పము సెప్పక యూరక శుశ్రూష గావింపుచుండెను.

ఉపచారపరిగ్రహ మూరకపోవదు. ఒకనాఁ డాయవధూత మహీధరభట్టుంజూచి యోరీ ! నీ వెవ్వఁడ వేమిటికి నన్నిట్లాశ్రయించు చుంటివి ? నీయభీష్ట మేమని యడిగిన నతండు సంతసించుచు నమస్కార పూర్వకముగాఁ దనసంకల్ప మెఱింగించి యయ్యభిలాష తీర్పుఁడని వేఁడుకొనియెను.

ఆదయాళునకు వానియం దక్కటికము గలిగినది. ఒకమంత్ర యుపదేశముగావించి జపింపుమని విధానమంతయు నెఱిఁగించెను. అతండాకొండగుహయందే వేఱొకచోట వసించి యామంత్రము జపించు చుండెను. దృఢనిశ్చయునకుఁ గార్యసాఫల్యము గాకుండునా ?

నిద్రాహారములుమాని తదేకదృష్టిగా నామంత్రము జపించుచుండఁ బదిసంవత్సరములు గతించినవి. అప్పటి కొకదేవత ప్రత్యక్షమై నీ కేమి కావలయునని యడిగిన నతండు ఎనిమిదవసిద్ధియగు వశిత్వ మిమ్మని కోరికొనియెను.

అబ్బో ! ఎక్కడివశిత్వము ? ఈతపంబు దానికిఁ జూలదని పలికి యాదేవత యంతర్థానము నొందినది. వెండియు నతండు తపంబు సేయ మొదలుపెట్టెను.

మఱియైదుసంవత్సరములకు మఱల నాదేవత ప్రత్యక్షమై నీ కేమి కావలయునని యడిగి వెనుకటిరీతినే వశిత్వమును గోరుటయు నావేల్పీయఁజాలనని చెప్పిపోయినది. ఈరీతి నైదుసంవత్సరముల కొకసారి వచ్చి యడుగుచు నతండుకోరినది యీయఁజాలనని చెప్పిపోవుచుఁ జివరకు నలువదియేం డ్లత్యంతదీక్షతోఁ దపముసేసిన యామహీధరభట్టున కాదేవత కాకోరిక తీరుపక తప్పినదికాదు.

వశిత్వసిద్ధి లభించినపిమ్మట మహీధరభట్టునకు వైవాహికాభిలాషయంతయు నుడిగినది. అస్థిరములని తెలిసినపిమ్మట మహాత్ములు తుచ్ఛభోగముల నభిలషింతురా ? అతిప్రయత్నమునఁ గాశికింజని గంగఁ దెచ్చి తోటకూరమడిలోఁ జల్లువెంగలి యుండు నా ? అతండు భక్తిజ్ఞాన వైరాగ్యములతో నాత్మవేత్తయై గిరిశిఖరంబున నీయుపవనంబు గల్పించుకొని మృగము లూడిగములుసేయ నీవటవృక్షముక్రిందనున్న పర్ణశా లలోఁ దపంబు గావించుకొనుచున్నాఁడు. అతఁడే నేను.

అనియున్న యాచరిత్రమును జదివి కుచుమారుండు కనుల నానందబాష్పములుగ్రమ్మ నోహో ! యామహానుభావునిఁ జూచుభాగ్యము నాకుఁ బట్టినదికాదు. అతం డీనడుమనే పరమపదించినట్లున్నది. ఆహా ! ఎట్టివారికి నెంతకాలముబ్రతికినను మరణము తప్పదుగదా ? అని తలంచుచు .మఱియుఁ బసరువ్రాసి యాపుస్తకములోనున్న విశేషముల మఱికొన్నిటిని బరిశీలింపఁగలిగెను.

అం దోషధీవిశేముల తెఱఁగును మూలికాప్రయోగమువలన మనుష్యుల మృగములఁ బక్షులఁ జేయువిధానము కవిత్వప్రశంస లోనగువిషయములు వ్రాయఁబడియున్నవి. అవి తపస్సాధ్యములైనను దన యస్తిమాలనుధరించినవారికిఁ బ్రసన్నములగుని యాపుస్తకమునందే వ్రాయఁబడియున్నది. అప్పు డతం డతనియస్తు లందెందైన నున్నవియేమోయని యాతటాకముచుట్టును దిరిగిచూచెను.

ఒకవంకఁ దటాకమునీటిప్రాంతమున మేదోమాంసరుధిరశూన్యంబైన సిద్ధుని యస్తిపుంజము గనంబడినది. అప్పు డతండు పరమసంతోషముతో నాకళేబరము చెంతకుఁబోయి విమర్శించి కపాలము భిన్నమై యుండుట తిలకించి యతండు యోగమార్గంబున శరీరము విడిచెనని నిశ్చయించి వెండికడ్డియలవలె మెఱయుచున్న యాయస్తుల నీటిలోఁ గడిగి ముఖ్యమైనవాని నేరి త్రాఁటితో మాలికగాఁగట్టుకొని మెడలో వైచికొనియెను. అప్పు డతనిహృదయమున ననేకవిషయములు స్ఫురించుచుండెను. చిరకాలము తపంబుసేసినంగాని లభింపని వశిత్వవిద్య కుచుమారుని కరనిమిషములో లభించినది.

పశుపక్షిమృగాదులలో నేదిగనంబడినను బిలిచినంతనే వచ్చి శిష్యుండువోలె నుపచారములు సేయుచుండును. అయ్యడవిలో నేయోషధిపేరుపెట్టిపిలిచిన నాయోషధి కదలుచుఁ దనస్వరూపము తెలియఁ జేయును. అట్టిపరీక్షలు చూచి కుచుమారుఁ డటఁగదలి దక్షిణాభిముఖుండై యరుగుచుండెను.

అని యెఱింగించి వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి కథ పై మజిలీయందుఁ జెప్ప మొదలుపెట్టెను.

155 వ మజిలీ.

−♦ సరస్వతికథ. ♦−

కుచుమారుం డొకనాఁ డొకయగ్రహారమున నొకబ్రాహ్మణుని యింటి కతిథిగాఁ బోయెను. ఆగృహస్థు భుజించునప్పుడు కుచుమారునితో అయ్యా ! మీరూపము దర్శనీయము. మీతేజము విద్యాధిక్యము సూచించుచున్నది. ఎందుఁబోవుచున్నారు ? ఈజన్మభూమి యేది ? అని ప్రస్తావోచితముగా నడిగిన నతండు తనకాఁపురము కాశీపురమనియు మిత్రులతోఁ దాను సమస్తవిద్యలం జదివితిననియుఁ బండితకల్పభూజుండగు భోజభూభుజుని యాస్థానవిద్వాంసుల జయింప ధారానగరంబున కరుగుచున్నామనియుఁ దనయుదంత మాద్యంత మెఱిఁగించెను.

అప్పు డాబ్రాహ్మణుఁడు వెఱఁగుపాటుతో అయ్యా ! మీరంతవారైనచో నంతశ్రమపడి ధారానగరమున కరుగ నేల ? అరిగి యందలి పండితులఁ బరాజితులఁ గావించితిరేని యాఱేఁడు వేలిచ్చును లక్ష లిచ్చునుగాని తనరాజ్య మీయఁడుగదా ? మీకంతవిద్యలలో గట్టితనము గలిగియున్నచో సులభముగా రాజ్యలక్ష్మిం జేపట్టుతెఱఁ గెఱింగించెద నాకేమి పారితోషికమిత్తురు? అనుటయుఁ గుచుమారుండు నవ్వుచు నార్యా ! మీ యుపదేశంబున నాకు రాజ్యమే వచ్చినచో మీరును గొంత ఫలభాక్కులు కాకపోరు. వాక్కులతో నేమిప్రయోజనము ? అని యుత్తరమిచ్చెను.

అప్పు డాగేస్తు వినుండు. హిరణ్యగర్భుండను నృపాలుండు పురందరపురమును రాజధానిగాఁ జేసికొని యీదేశమును బాలించుచున్నాడు. ఆనగర మిక్కడ కిరువదియామడ దూరములో నున్నది. ఆరాజు