కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/149వ మజిలీ

లేదా? అని నొడివిన నప్పడఁతి యక్కథమేమెఱుఁగ మెట్టిదో చెప్పుఁడని కోరిన నతండిట్లుచెప్పెను.

అని యెఱింగించి

147 వ మజిలీ.

చింతామణికథ.

గీ. కలదు చింతామణీ నామకలిత లలిత
    రూపయౌవన శీల విద్యాపరీత
    యనవగతపాప గణికాన్వయ ప్రదీప
    యపహసితభోగ సువిరాగ యాప్రయాగ.

గీ. చదివినది చాలశృంగార శతకములను
    తెలిసినది కామతంత్ర ప్రదీపికలను
    అరసినది సత్కళారహస్యములఁ బెక్కు
    కాంత పరువమొకింతమై గ్రమ్మినపుడ.

వైశికప్రయోగ ప్రకారమంతయుం బఠించినదైనను చింతామణి పూర్వజన్మవాసనా విశేషంబునం జేసి దుష్ట విటజాలంబులఁ దజ్జాలంబునఁ దృప్తిఁబొంది యౌవనోదయంబున నేకచారిణీవ్రతంబనుష్ఠిం పందలంచి యనుకూల ప్రియాన్వేషణ తత్ఫరయై యున్నంత.

గీ. సకలవేదపురాణశాస్త్ర ప్రవీణ
    ధీవినిజిన్‌తగురుఁడు వర్ధితయశుండు
    శ్రోత్రియుఁడు కృష్ణమిశ్రుఁడన్ సోమయాజి
    కాపురముసేయు నాప్రయాగమున మున్ను.

ఆపాఱునకు నడివయసున నొక కుమారుండుదయించె మారసదృశుండగు వాని యాకారలక్షణంబు లుపలక్షించి సంతసించుచు నతండు శ్రీశుకుండు విలాసార్ధమై జన్మించెనను నర్ధంబు సూచింప నాశిశువునకు లీలాశుకుండను నామకరణము గావించెను. అయ్యభిఖ్య విహారకీరార్ధ ప్రబోధకంబునునై యొప్పుటంజేసి తదాశయంబున కన్య ధాత్వంబు సంఘటిల్లినది.

కృష్ణమిశ్రుఁడు చిరకాల జనితుండగు నాకుమారు నపారప్రీతి పూర్వకముగాఁ బెనుచుచు మహావిద్వాంసునిజేయు తలంపుతో యుక్త కాలంబున వానిఁజదువ నేసి యొజ్జలనింటికి రప్పించి విద్యజెప్పించు చుండెను. ఆబాలున కాటలయందుఁగల యాసక్తి చదువునందుఁ గుదిరినదికాదు.

లీలాశుకుండు మిక్కిలి చక్కనివాఁడు బ్రహ్మతేజము వాని మొగమునందొలుకుచుండును. ఎట్లైన వానికి విద్యాగంధమంటింప నుత్సహించి తండ్రి వాఁడాడుకొనుచుండఁ బుస్తకంబులఁగైకొని వెను వెంట దిరుగుచు గురువులచే విద్యగఱపించుచుండెను. యముఁడు కృతా కృతంబుల విచారింపఁడుగదా! ఆబాలునకుఁ బండ్రెండేఁడులు నిండక మున్నె కృష్ణమిశ్రు నాత్మీయనగరాశ్రయుం గావించుకొనియెను.

తండ్రి కాలధర్మంబు నొందినపిదప లీలాశుకు నదలించువారు లేమిం జేసి యప్పటికి చదివిన చదువెంతయో యంతటితోనే సమాప్తమైనది. అతండు శృంగారలీలల నెఱుంగుటకై కావ్య నాటకాలంకార గ్రంథముల విమర్శింపుచుండును. మఱియు

సీ. సొగటాలపాళి హెచ్చుగనాడునే ప్రొద్దు
                 చదరంగమాడ రచ్చలకుఁబోవు
    పెండేసి పెద్దయె పెనఁగెడుఁ జెడుగుడి
                 కోడిపందెముల నెక్కుడు ప్రచారి
    బంతులాటకు మేలుబంతియై తగుఁబన్ని
                 దములఁ గాకితము లెత్తడుములాడు
    గోతికొమ్మచ్చులఁ గొమ్మదాసరి మొన
                 గాఁడు జూదరులకు వాఁడనంగఁ

గీ. గొర్కె వేడుకకాండ్రతోఁ గూడికొనుచు
    నిల్లువాకిలి విడిచి తానెపుడు వేడు
    కలకుఁ గ్రీడకు వాడవాడలఁ జరించు
    శైశవానంతరమున లీలాశుకుండు.

కులాచారంబు మట్టుపెట్టి దురాచారంబులకు లోనై లీలాశుకుండు విటనటగాయకాదులు మిత్రులై వర్తింప నాయూరిలో నంత యాకతాయలేడని పేరుపొంది తిరుగుచుండ మఱిరెండేఁడులు గతించి నంత వాని మాతయు మృత్యుదేవత వాఁతంబడినది. ఎప్పటికేని యిల్లు చేరిన మందలించు తల్లియుం గడతేరిన నడ్డుచెప్పువారులేక నతండు మఱియుఁ గోడెకాండ్రంగూడి సంచరింపుచుండ ననినయనిధానమగు యౌవన మతనిమేనఁ బూర్ణముగా నావేశించినది.

గీ. అద్దమున నాత్మముఖబింబ మరసివేడ్క
    తోడ నూనూగు మీసాల దువ్వికొనుచు
    మొగము చిట్లించి కనుబొమ్మ లెగరవైచు
    మరుఁడు తనకీడుగాడని మదిఁదలంచు.

పెద్దల ప్రసిద్ధివిని పిల్లనిత్తుమని యెవ్వరైన వచ్చినచో విరక్తుండువోలె వారికిట్లు సమాధానము జెప్పును.

సీ. దుష్టసంసార పాథోధిముంపఁగఁ బద
                   స్థగితమౌ పెద్దప్రస్దరము పత్ని
    భవకూపమునఁ గూలఁబడఁ ద్రోయదిగియంగఁ
                  గట్టిన కన్నులగంత కాంత
    సంసృతిగహన సంచారంబునకు దారి
                  గాననీయని యంథకార మింతి
    భవ బంధనాగార పాతంబునకుఁ గాళ్ళ
                  ఘటియించు మేటిశృంఖల నెలంత

గీ. ఆలు లేకున్న లేదపత్యం బపత్య
    రహితుఁడే సంగరహితుండు మహి నసక్త
    చిత్తుని సుఖంబె సుఖము చచిన్‌ంపఁ గానఁ
    జానఁ బెండ్లాడి పొరటిల్లఁజాల నేను.

గీ. కామముడిపికొనఁగ గణికలు లేరొకో
    కడుపుచిచ్చు మాన్పఁగా ధరిత్రి
    వంటపూటి యింటివారుండఁ బెండిలి
    యాడి పెద్దగొడవ గూడనేల ?

అని పలుకుచు విసజిన్‌తదార పరిగ్రహుండై లీలాశుకుండు చిత్తానువర్తులగు మిత్రులం గూడికొని యప్పురంబునంగల వారాంగనల గుణదోష తారతమ్యంబులు నిరూపించుచు

సీ. తారావళి సురూపతా రాజితయె కాని
                తాటక బాబురో దానితల్లి
    నాగరత్నము చూపునకు రూపసియె కాని
               సరసకళా విలాసములు లేవు
    కనకాచలంబు యౌవనముబింకమె కాని
               లలితసౌందర్య పేలవములేదు
    పూబోఁడి చాతుర్యపుం బొమ్మయేకాని
               కపటవర్తనల టక్కరిపిసాళి

గీ. పేరుపొందిన వార శృంగారవతుల
    కేదియో లోటుగలదెన్న నిప్పురమున
    నల్ల చింతామణీవారిజాస్య వేశ్య
    షిద్గ చింతామణి యటంచుఁ జెప్పనొప్పు.

ఉ. దానికి దల్లిలేదు విటతండముఁబీలిచి పిప్పి జేయ వి
    జ్ఞాన కళాప్రపూర్ణ విలసద్ఘనచిత్త స్వతంత్రురాలు ప్ర

    జ్ఞానయ భాసమాన బుధసన్నుత సంపదమానదేవతా
    ధీనమనోనిధాన సురధేను సమానసుదాన చూడఁగన్.

క. గుణవంతురాలు చింతా
   మణి జాతికివేశ్యగాని మహితజ్ఞాన
   ప్రణుతమతి యనుచు నెల్లరు
   గుణుతింతురు ద్రవిణసక్తగాదది మఱియున్

దానియందు వేశ్యాధర్మంబొక్కండును లేదు. విస్రంభపాత్రురాలు. దానిఁగళత్రంబుగా స్వీకరింపవలయునని హితులతో నాలోచించి లీలాశుకుండొకనాఁడు సాయంకాలంబున లలితాంబ మాల్యగంథాలంకారంబులం బట్టించుకొని దానియింటికింజని ముందుఁ దన కులశీలమర్యాదలం దెలుప మిత్రులనియోగించుటయు వారు లోపలికింజని చింతామణింజూచి యిట్లనిరి.

క. లీలాశుకుఁడను బాహ్మణ
   బాలుఁడు నినుఁగోరి వచ్చె బహుధనవిద్యా
   శీలవయో రుచిరుండతఁ
   డేలికొనుము వాని గృహసమేతముగ సఖీ.

గీ. తల్లిదండ్రులు లేరన్న దమ్ములితర
   బంధువులులేరు లేదర్ధభాగభార్య
   యందఱును నీవయైవాని నాదరింప
   వలయుఁ దద్ధన మెల్ల నీవశముజేయు.

తద్రూపాతిశయంబు సూచి నీవేమెచ్చుకొందువు. నీవాకిటనిలిచియున్న వాఁడని యెఱిఁగించిన నాలించి యగ్గణికామణి యంతకుమున్న యాచిన్నవాని యుదంతంబు వినియున్నదగుట నంగీకారము సూచించినది. వారుపోయి యాతనిందీసికొనివచ్చుటయు వాని యందంబు డెందంబున మెచ్చికొనుచు లేచి కొన్నియడుగు లెదురవోయి నమస్క రించి సగౌరవంబుగా దోడైచ్చి పర్యంకోపవిష్టుం గావించి యుపచారంబులఁ జేయుచుండె. అందుల కతండానందించుచు తానుదెచ్చిన కనకమణి భూషాంబరాదు లొసంగి తన యాశయం బెఱింగించుటయు నమ్మించుఁబోఁడి గొన్ని నిబంధనలం గోరికొనినది. అతండియ్యకొని శుభముహూర్తంబున కన్నెఱికము గావించెను.

క. ఇదిపగ లిది రాతిరియని
   మదిఁదెలియక యెల్లపనులు మఱచి సదాయ
   మ్మదవతి సదనము నదలక
   మదనక్రీడలనె బ్రహ్మమయముగ నెంచున్ .

శ్లో॥ సంసారే పటలాంతతోయ తరళె సారం యదేకం పరం
     యస్యాయంచ సమగ్ర ఏషవిషయగ్రామప్రపంచో మతః
     తత్సౌఖ్యం పరతత్వ వేదనమహానందోపమం మందధీః
     కో వావిందతి సూక్ష్మమన్మధకళా వైచిత్ర్యమూఢొ జనః

లీలాశుకుండు చింతామణితోఁగూడఁ దత్వజ్ఞానానందముతో సమమగు మన్మధకలావై దగ్ధ్యసౌఖ్యం బనుభవింపుచు స్నానసంధ్యాది కర్మముల విసజిన్‌ంచి తదధ్యాసన ధ్యానములవలనఁ దృప్తి బొందక సంతతము తనమనంబందే లగ్నంబైయుండ నొండుదెలియక చింతామణి నారాధింపుచుండెను. చింతామణియు వెలయాలైనను జ్ఞానవతి యగుట లీలాశుకుఁడు తనయెడఁ బ్రకటించు మోహాతి రేకంబున కచ్చెరువందుచు స్నేహమునకుం దగిన ప్రీతింజూపుచుఁ ద్రికరణంబుల నతనినే ప్రధానపురుషునిగా నెంచుకొనుచు నతని యాస్తియంతయుఁ దనవశము చేసికొనియు బాహ్మణ ద్రవ్యంబని తాననుభవింపక దాచి విహితముగా నేకచారిణీ వృత్తమునఁ దదీయచిత్తంబు సంతోషాయత్తంబు గావింపుచుండెను.

ఒక యేకాదశినాఁడు చింతామణి ప్రాంతమందలి విష్ణ్వాలయ మునఁ బురాణము సెప్పుచుండ నరిగి శ్రద్ధాభక్తి పూర్వకముగా నాలింపుచుండె నందు.

శ్లో॥ శ్రాద్ధాత్పరతరం నాస్తి శ్రేయస్కర ముదాహృతం।
      నసంతి పితరశ్చేతి కృత్వా మనశి యో నరః॥
      శ్రాద్ధం నకురుతె తత్ర తస్యరక్తం పిబంతితె॥
      సూ॥ పితౄన్ యజేత పితృభ్యోదద్యాత్॥

క. పితరులఁ గొలువంగాఁదగు
   బితరుల కీయంగవలయుఁ బిండోదకముల్
   పితృసేవ కన్నఁబరమ
   వ్రతమిల లేదొకటి శుభకరంబు తలంపన్ .

క. పితరులు లేనేలేరని
   మతిఁదలఁచుచు నాబ్దికంబు మానునొయెవఁడా
   కితవుని రక్తము పితృదే
   వతలా ర్తింబీల్తు రతి పిపాస దలిర్పన్ .

గీ. తల్లిదండ్రుల మృత తిధిన్ధర్మబుద్ధి
    బ్రాహ్మణార్చనసేయని బాలిశుండు
    వర్ణితుండగు జీవచ్ఛ వంబటంచు
    కల్మషములంటు వాని మొగంబు గనిన.

అని పౌరాణికుండు జెప్పిన విని చింతామణి డెందంబున నేదియో విచారం బుదయింప నల్లన యింటికింబోయి తననిమిత్తమై వాకిటఁ గాచికొనియున్న లీలాశుకుంగాంచి హస్తగ్రహణము సేసి లోనికిం దీసికొనిపోయి పర్యంకోపవిష్టుం గావించి యతని మొగంబున వేడిచూపులు వ్యాపింపఁజేయుచు నిట్లనియె.

చిం - లీలాశుకా! నీవుతలిదండ్రుల యాబ్దికములు బెట్టుచుంటివా?

లీలా - ఇప్పుడామాట నడుగుటకుఁ గారణమేమి? చిం — కారణముగలిగియే యడిగితిని. పెట్టుచుంటివా? లేదా?

లీలా — నాలుగైదు వత్సరములనుండి పెట్టుట లేదు.

చింతా - ఎందువలన?

లీలా - తీరిక లేక

చింతా - అయ్యయ్యో! నీకుఁ దద్దినము పెట్టుటకే తీరుబడి లేకపోయినదా?

లీలా -- నీవు చూచుచుండలేదా భోజనముచేయు సమయముఁ దక్క తక్కిన కాలమెల్ల నీయొద్దనేకాదా వసియించుచుంటిని? .

చింతా - నాయొద్దకువచ్చినదిమొదలు మానివేసితివికాఁబోలు

లీలా - అవును.

చింతా - హరి హరీ! యెంత పాపాత్మురాలనైతిని. నీవును నేనుంగూడ రౌరవములో వసియింపదగినదే!

లీలా - నేఁడు పురాణములో విన్నమాట లివియాయేమి?

చింతా - అవును. ఈమాటలేవింటిని. తద్దినముమానినవాఁడు మహాపాపాత్ముఁడంట జీవచ్చవమంట వాని మొగముజూచిన పాపము వచ్చునంట.

లీలా - ఇదియా నీకుఁగలిగిన భయము. చాలుఁజూలు. ఇవి మా బాపనయ్యలు విత్తములాగటకై వ్రాసిన వ్రాఁతలు.

చింతా — నీ వంటి మహానుభావములు పుట్టుటచేఁ గులగౌరవముగూడ చెడిపోవఁగలదు. ఏటిమాటలాడెదవు?

లీలా - ఆరిన దీపమునకుఁ జమురువోసిన నెంతలాభమో మృతునకుఁ దద్దినము పెట్టుటయు నట్టిదే.

చింతా — నాస్తికవాదములు నా కంగీకారములుకావు నీ కా తిధులేప్పుడో తెలియునా?

లీలా - ఇప్పుడు జ్ఞాపకము లేదు. చింతా -- నీకుఁగాక మఱియెవ్వరికైనం దెలియునా ?

లీలా - కొన్నిదినములు పెట్టించెఁగావున మా పురోహితునకు జ్ఞాపకముండవచ్చును.

చింతా – ఆయనను రేపు సూర్యోదయము కాకపూర్వ మిక్కడికి దీసికొనిరావలయును. అంతవఱకు నీతో మాటాడను. అని పెడమోము పెట్టుకొని పోయి వేరొకగదిలోఁ బండుకొనినది. లీలాశుకుండను

క. ఎక్కడి హరివాసరమిది
    యెక్కడి పౌరాణికోక్తియిది నాకయయో?
    యెక్కడ వచ్చెను విఘ్నము
    చక్కెర విలుకాని కేళిసలుపక యుండన్.

గీ. తద్దినము బెట్టమంచు నీముద్దుగుమ్మ
    నన్ను వేపునుగాఁబోలు నిన్నదీని
    గుడికిఁ బోనిచ్చుటయెతప్పు విడువదింక
    చేసినందాక తన్నిష్ఠ మాసిపోను.

అని విచారించుచు నెట్టకే తెల్లవారినంత నతండతిరయంబునఁ బురోహితు నింటికింబోయి బ్రతిమాలికొని వెంటనే యతని నావాల్గంటి యింటికిం దీసికొనివచ్చెను. చింతామణి పురోహితునికి నమస్కరించుచుఁ గూర్చుండఁ జేసి అయ్యా! మీలోఁదద్దినము పెట్టనివానికేమిశిక్ష విధింతురని యడిగిన నతండు వానిం గులములో వెలివేయుదురు వాని సహపంక్తి బాహ్మణుండెవ్వఁడు భుజింపఁడని చెప్పిన నా వేశ్య మీశిష్యుండట్టి పనిచేయుచుండ నేమిటికి మందలించితిరికారు? శిష్యుని పాపము గురునంటునని యెఱుంగరా? అని యడిగినఁ బురోహితుండు తరుణీ! అతండు నాకుఁ గనంబడి మూడేండ్లైనది. తద్దినము పెట్టుచున్నాడో లేదో యెవ్వరికిఁ దెలియును? వాఁడు నీయధీనములో నుం డెం గావున నాపాపము నీకుఁ జెందునని పరిహాసమాడెను.

అప్పుడుచింతామణి పశ్చాత్తాపముగాంచుచు నతనితలిదండ్రుల తిధులెప్పుడని యడుగుటయు నతండు పది దినములలోఁ తండ్రితిథియు మూఁడుమాసములలోఁ దల్లితిధియు వచ్చునని నిరూపించి చెప్పెను. ఆతిధులువ్రాసికొని చింతామణి పురోహితునితో అయ్యా! గతమునకు నేమియుంజేయఁజూలము. మాలీలాశుకునిచేతఁ దప్పక తద్దినముపెట్టింపవలయును. సరిపడినద్రవ్యమిప్పుడే యిచ్చుచున్నాను. యధావిధిగా జరిగింపుఁడు లోపమేమియు రానీయవలదని ప్రార్ధించినఁబురోహితుండు సంతసించుచు నాఁడుచేయవలసిన నియమములన్ని యుం దెలిపి వలసినంత ద్రవ్యము దీసికొని దానిందీవించుచు నింటికింబోయెను.

పిమ్మటఁ జింతామణి లీలాశుకుంజూచి చిఱునగవుతోఁ బురోహితునిమాటలు వింటిరిగదా? ఆబ్దికంబునకుఁ బూర్వాపరదివసంబులు నాబ్దికమునాఁడును మూఁడునాళ్ళు మీరు మాయింటికి రాఁగూడదు. కడు నియమముగా నుండవలయు జ్ఞాపకముంచుకొనవలయుననిపలికిన నతం డిట్లనియె.

అమ్మయ్యో? మూఁడుదినములు నిన్నుఁజూడక తాళఁగలనా? నాతండ్రితద్దినము నేనుబెట్టెదనోలేనో చెప్పలేనుకాని వెంటనేనీవు నా తద్దినము పెట్టింతువని చెప్పఁగలను. ఆబ్దికముమానినదోసము నిన్నంటుటసంశయముకాని బ్రహ్మహత్యాదోషము తప్పకనిన్నంటఁగలదు. అని వికటముగాఁబలికెను. ఆవిషయమిరువురకుఁ బెద్దసంవాదము జరగినది.

చివర కతనిచేఁ దద్దినమునాఁడుమాత్రము రానని యొప్పించునప్పటికియొక యుపవాసము చేయవలసివచ్చినది. గండమునకు వెరచి నట్లాబ్దికము సమీపించినకొలఁది యతండు దిగులు పడుచుండెను. పూర్వదివస నియమ మాచార్యుని కప్పగించెను. పరదివస నియమము భోక్తల కర్పింపఁదలంచెను. నాఁడు కోడి కూసినది మొదలు చింతామణి లీలాశుకుని లేపుటకుఁ బ్రారంభించినది. ఊ. ఉ. అని మూల్గుటయేకాని యతండు సూర్యోదయమైన గడియవఱకు లేవనేలేదు. అదిపొడువగాలేచి దంతధావనాది నిత్యకృత్యములు దీర్చికొనునప్పటికి జాముప్రొద్దెక్కినది. అప్పుడు చింతామణి కోపదృష్టితో నీవు తండ్రికడుపు చెడఁబుట్టితివి? నీతండ్రి యుత్తమశ్రోత్రియుఁడఁట. ఎంత జెస్పినను వివేకము గలుగదేమి ? ఉదయముననే స్నానము సేయవలయునఁట పదిగంటలైనది. దంతధావనమేలేదు. కడుపులోఁ బుట్టవలయంగాని చెప్పినబుద్ధి యేమాత్రమునిలుచును. అదిగో పురోహితుఁడు బాలునంపినాడు. వంటయైనదఁట పదపద. అని నిర్బంధించిపలుకగా నెట్టకేయువస్త్రము వైచుకొని చేతం గఱ్ఱబూని పాదరక్షలలోఁ గాళ్ళుపెట్టి చింతామణీ యిదిగో పోవుచున్నాను కోపము సేయుకుము అనిపలుకుచు బయలుదేరినంత నాకాంత వానిచెంతకువచ్చి విప్రకుమారా ! నేను జెప్పినమాటలు జ్ఞాపకమున్నవియా ! నేఁడు మాయింటికి రావలదుసుమీ? వత్తువేని నీ మొగమెన్నఁడును జూడను. జ్ఞాపకముంచుకొమ్మనిపలికి సాగనంపినది. అతండు కొంతదూరముపోయి యేదియోమఱచితినని మరలవచ్చి యచ్చిగురాకుఁబోడింజూచి పల్కరించుటయు నిలువనీయక పదపద ప్రొద్దెక్కినదని గెంటి తలుపువైచినది.

వెనుక వెనుక తిరిగిచూచుచు బలవంతమున మెరకకుఁబోవు ప్రవాహమువలెఁ బురోహితునింటికరిగెను. అతం డతనినిమిత్తమై యెదురుచూచుచుండెను. అయ్యో ! నీతండ్రి యాహితాగ్నిహోమము లెక్కువగాఁ జేయవలసియున్నది. ఇంత ప్రొద్దెక్కించితివేమి? భోక్తలు వచ్చి రెండుగడియలైనది ఎప్పటికిఁదేలును? అని పలికినవిని లీలాశుకుండు గురువరా? మంత్రములో నేమియును లేదు. తంత్రమాచార్యకల్పితము బ్రాహ్మణులుభుజించినంజాలు నీవులెస్సగాఁబెట్టించితివని చింతా మణితోఁ జెప్పెదనులే ? వేగము. నెర వేర్పుమని బ్రతిమాలికొనుచు నూతిఁయొద్దనే స్నానముజేసి యమంత్రకముగానర్చించి భోక్తలచేతిలో నాపోశనమువడ్డించెను. చింతామణిచే దక్షిణ యధికముగా నీయఁబడుటచే భోక్తలు మిక్కిలి యానందముతో భుజించిరి. భోజనానంతరము భోక్తలకు దక్షిణ తాంబూలాదులు పురోహితుఁడే యిచ్చి సత్కరించెను.

తరువాత లీలాశుకుండు పదినిమిషములలో భోజనముచేసి పురోహితుని వీథియరగుమీఁదఁ గూర్చుండి యిట్లు ధ్యానించెను. అయ్యో నేడెట్లు ప్రొద్దుగ్రుంకును ? ఎట్లుతెల్లవారును? చింతామణి మొగము చూడక యింతకాలమెట్లు సహింతును. దానింజూచి యుగాంతరము లైనట్లున్నది. అక్కటా? నాపాలిటి కీతద్దిన మెక్కడ వచ్చినది? ఆనాఁడు పాడుపురాణము వినకపోయినను దానికీసంకల్పము పుట్టక పోవును. అని యనేకప్రకారములఁ జింతించుచుఁ గొంతసేపందువసించి యట్టెలేచి దాని యింటిదెసఁకుబోయి దూరముగా నిలువంబడి యా వంక జూచుచుండెను.

అంతలో సాయంకాలమైనది. చీఁకటిబలిసినకొలఁది వానికి పరితాపమధికమగుచుండెను. ఆయావీధుల నంగడులవెంటఁ దిరుగుచు నారాత్రి పదిగడియలెట్లో వేగించెను. క్రమంబున వానికివిరహవేదన దుర్భరమైనది. మనంబున ననేక సంకల్పములుదయించినవి. ఏదో తెంపుచేసికొని తటాలునలేచి పురోహితునింటికిం బోయి వంటకంబుల గొన్నియడిగి మూటగట్టుకొని తిన్నగాఁ జింతామణియింటికిం బోయెను.

ఆయింటితలుపులన్నియు మూయఁబడి యున్నవి. పరిజనుల దాదుల సఖురాండ్రఁ బేరుబెట్టి పెద్దయెలుంగునంబిలిచెను. ఎవ్వరును మాటాడిరికారు. అప్పుడతండు మిక్కిలి యుద్రేకముతో నాయింటి చుట్టును ముమ్మారుతిరిగి పెరటిలో బశువులసాల కెలిసియుండుట దెలిసికొని యదిపరీక్షించిచూచెను. అప్పుడొక తెల్లత్రాచు చూరెలుకల భక్షించుటకై గోడనంటి చూరుపెండెకై యెగఁబ్రాకుచుండెను. అది యతనికందు వ్రేలాడఁగట్టిన తెల్లనిజనపనారత్రాడువలెఁ గనుపట్టెను రజ్జుసర్పభ్రాంతికిమారుగా నిక్కడసర్పరజ్జుభ్రాంతి గలిగినది. తత్వవేత్త చిత్తమాత్మయందే లగ్నమై తదితరమెఱుంగ సట్లాలీలాశుకుని హృదయంబు చింతామణియందే వ్యాపించియున్నది. అతనికి సర్వము చింతామణివలెనే కనంబడుచున్నది.

తనకొఱకుభగవంతుఁ డాత్రాడు వ్రేలాడఁగట్టించెనని సంతసించుచు నతండు వంటకములమూట నడమునకుబిగించి యాసర్పోత్తరకాయంబు రెండుచేతులంబట్టుకొని కాళ్ళు గోడకుబిగియఁదన్ని రివ్వున పై కెగిరి యెలిసి యెక్కి లోపలధుమికెను.

ఆనిడుపని యొడలునలిగి సగము తెగి యతనిచేతికివచ్చినది. అతండది విమర్శింపక యందుఁబార వైచెను. ఉత్తరకాయము తెగిపోయినను నాభుజగము పెండెనంటిపట్టికొని బొటబొట రక్తముగారుచుండ నట్లె వ్రేలాడుచుండెను. తోకతెగినను పెండెపట్టువదలినదికా దాపామెంతగట్టిదియో చూడుఁడు.

తనకట్టినగుడ్డలు మఱకలగుటయుఁ గనుపెట్టక యాజన్నికట్టు కామాంధుఁడై లోపలియావరణము లన్నియు నతిక్రమించి తిన్నగాఁ జింతామణిబండుకొనియున్న లీలామందిరమున కరిగెను.

అప్పుడావారకాంత తల్పాంతరమునఁ బండుకొని నిద్రబోక లీలాశుకుని మోహాతిశయమును గుఱించి వితర్కింపుచుండెను.

లీలాశుకుండు మెల్లగాఁబోయి దానిమంచముదాపున నిలువంబడియెను. ఆచిగురుఁబోఁడి హటాత్తుగాఁజూచి యట్టెలేచి చీ ! చీ ! నీచా ! నీచెడుగుబుద్ధి వదలితివికావు ? నీకుఁ దలుపులెవ్వరుతీసిరి ? లోపల కెట్లువచ్చితివి? నీకుఁ జెప్పినబుద్ధులన్నియు నేగంగ గలిపితివి? యొక్క రాత్రియేతాళలేవా ? రేపెక్కెడికిఁ బోవుదును కుట్టులబొం తకై యింత నలవంతయేమిటికి ? ఇదిమోహముగాదు. పాతకవ్యూహము. నీకతంబున నేనుగూడ నిరయంబు బొరయవలసివచ్చును. అని యూరక నిందించుచుండ దానిపాదంబులకు శిరంబుసోక మ్రొక్కుచు నిట్లనియె.

చింతామణీ! నీవన్నమాటలన్నియు జ్ఞాపకమున్నవి. నాస్వాంత మెంతబలవంతమున మరలించుకొందమన్నను మరలినదికాదు. నేనేమి చేయుదును. నీపాదములతోడు. వేయుచెప్పుము. నీమొగము చూడక యఱనిమిషము తాళజాల. చంపినంజంపుమని పలికిన యాకలికి వెడగు నవ్వడర వెఱ్ఱిపాఱుఁడా! నీకింతమోహమేల కలుగవలయు. వస్తుతత్వము విచారింపకున్నావు. పో. అవ్వలిగదిలోఁ బండికొనుమని మందలించుటయు నతండు.

చింతామణీ ! నీకొఱకిదిగో పిండివంటకములు దీసికొనివచ్చితిని. ఇందాక నానోఁటికొక్కటియు రుచించినది కాదు. నీవుతినిన నా మనసు చల్లఁబడును. భక్షింపుమని పలుకుచు నామూటవిప్పి దానిముందరబెట్టి దీపము వెలుగుఁన దానికిఁ జూపించెను.

చింతామణి యా వెల్తురున మూటయందును బుట్టమునందును రక్తపుమఱకలుచూచి అబ్బురపాటుతో అయ్యో ! యీరక్త మెట్లువచ్చినది ? ఇందుఁబాముకూసపు శకలములున్న వేమి ? అని యడలుచుండ నతండు విమర్శించి చూచి అగునగు తెలిసినది గోడప్రక్కను వ్రేలాడుచున్నది త్రాడనుకొంటిని. త్రాచుపాము కాఁబోలు మెత్తగా నుండుటచే సంకోచమందితిని యాతొందరలోఁ బరిశీలింపలేదు. అని చెప్పుటయుఁ జింతామణి యురముపైఁ జేయివైచుకొని అక్కటా? అది పగపట్టి కఱచినదేమో? యెక్కడనో చూపుమని దీపముదీసికొని బయలుదేరినది.

ఆతండాకలికి నెలిసి యొద్దకుఁ దీసికోనిపోయే. బొటబొట రక్తము గారుచుండ నాసర్పము పూర్వకాయమట్లే వ్రేలాడుచుండెను. దానిం ద్రాడనుకొని యూతగాఁబూని యెలిసి దిగివచ్చితినని యతం డెఱిఁగించెను. అప్పుడా మోహనాంగి కనేకోహలు జనించినవి. మ్రాన్పడి యాహా ? కామాంధుల కేమియుఁ గనంబడ దన్నమాట సత్యము నాయుపచారములచే వీని తగులము బలమగుచున్నది. వీనికీజన్మమున వివేకము గలుగదు. ఆజ్యమువోసిన నగ్నిచల్లారునా? వీని మూలమున నేనుగూడఁ జెడిపోవుచుంటినని ధ్యానించుచుండ నతండు

గీ. చచ్చినది పాము గాత్రంబు సగముతెగుట
    నందులకుఁ జింతపడెదేల ? యంబుజాస్య
    రమ్ము లోపలికెద విచారమ్ము మాని
    పుష్పశరకేలి నాకు సమ్మోదమిమ్ము.

ఆమాటవిని యాబోఁటి యేమియుమాటాడక తటాలున మరలి లోపలకిఁ బోవుచుండ నతండు వెంట నడుచుచు వాల్గంటీ ! కోపము వచ్చినదా? నేనేమిచేయుదును. నాసంతాపమట్లున్నది. నీవుపేక్షించితి వేని యీరాత్రిశరీరము నిలువదు. అని యడ్డమువచ్చి పాదంబులంబడి బ్రతిమాలికొనుటయు నది పదపద తల్పంబునం గూర్చుండుము. స్నానముచేసి వచ్చెదననిబలికి యయ్యువతి యవ్వలికి బోయినది.

లీలాశుకుండును సంతసముతోఁ గేళీమందిరమున కఱిగి పర్యంకమునఁ గూరుచుండి యాతురతతో నిమిషము యుగమువలెఁ దలఁచుచు దానిరాక నీరీక్షించుచుండె నప్పుడు.

ఉ. వాసనలుప్పతిల్లఁ జెలువుబగు తళ్కు జనింప మేనునం
    బూసిన యంగరాగమది వోవఁగ బూడిదరాచికొంచు సం
    త్రాసమువుట్ట వెండ్రుకలురంబున వ్రేలఁగ నెల్లవస్తువుల్
    దీసి దిగంబరత్న వికృతిం బ్రకటింపుచుఁ గాత్రమయ్యెడన్ .

వికృతరూపముతో వచ్చి యతనియెదుట నిలువంబడి

క. లీలాశుక ! ఇటుచూడుము
    హేలా లీలావిలస లెట్లున్నవొకో

    తోలుం బొమ్మకు నవరం
    ధ్రాలుంగల దానికింత తహతహ యేలా ?

గీ. మది విచారింపుమయ్య మర్మములనెఱిఁగి
    వస్తుతత్వంబు దెలిసినవానికిట్టి
    మోహమేటికిఁ గల్గెడు పొలఁతులకును
    లో లొటారంబు బయటఁ దళ్కులునుగావె

క. మలమూత్ర పూరితంబై
    తలఁపనరోచకము జేయుఁ తనువిదిమాయా
    బలమున విడువని మోహము
    గలిగించుం తెలియ దోలుకట్టియకాదే.

కరుణించి విరించి మేదో మాంస రుధిరాస్తిపుంజమునకు బైన మృదువగు నీచర్మముగప్పెను కాని, కానిచో నీ మేనసంతతము స్రవించెడు నెత్తురుంబీల్ప మూఁగికొను కాకగృధ్రంబులఁ దోలికొన లేక దేహధారులు క్లేశబాహుళ్యంబు చెందకుందురా! నీవిట్టియపవిత్ర గాత్రంబు చరిత్రంబు దెలియక మూఢుండవై ధాత్రీసురకర్మముల వీటి బుచ్చి యిహాముత్రఫలంబుల తెరువెఱుంగక భ్రష్టుండవై పోవుచుంటివి ఇప్పటికైనం బుద్ధిదెచ్చుకొని దేహతత్వం బెఱింగి కామంబుడిపికొని భగవంతు నారాధింపుమని పలుకుటయు బురాకృత సుకృత వాసనా విశేషంబునంజేసి యప్పలుకులతనిచెవుల కమృతబిందువులవలె సోకి మనోగతంబగు కామసంకటంబును గ్రసియించుటయు నతండయ్యంగన యంగకంబులు సవితర్కంబుగాఁ బరిశీలించి యసహ్యంబు జనియింప నుమియుచు గన్నులు మూసికొని తటాలునలేచి దల్పంబుడిగ్గ నురికి యగ్గణికారత్నంబు పాదంబులంబడి

శా. తల్లీ ! నీకు నమస్కరింతు నిదిగో తధ్యంబు నీసూక్తు లం
     జల్లా రెన్ స్మరతాపమెల్లఁ గడు నాశ్చర్యంబుగా బుద్ధి భా

    సిల్ల న్మైమలినంబు చూపితివి సీ. సీ. తుచ్ఛభోగమ్ము లే
    నొల్లన్ నీదయసంఘటిల్లెను సుబోధోత్సాహవై రాగ్యముల్.

సీ. అతివరో ! మోహతోయధి మునింగెడునన్ను
                 తెప్పవై తెప్పునఁ దేల్చినావు
    కాంతరో ! నిరయ లోకద్వారమును జేరు
                 నను మరల్చితి స్వర్భువనము దెసకుఁ
    గామాంధకార భీకరమగు నామది
                 వెలిగించితివి జ్ఞాన వితతదీప్తి
    గ్రుడ్డినై చెడుత్రోవ గూడిపోఁ గనులిచ్చి
                లేపిచక్కని త్రోవఁజూపినావు.

గీ. అహహ? నీవంటియాప్తుఁ డెందైనఁగలఁ డె
    తల్లివై నను గురువైన దైవమైన
    నీవె నాకిఁక నేఁటితో నీకునాకు
    వదలెఁగాముక సంబంధవిధివఘాట !

క. నిను జ్ఞానవంతురాలని
   వినుతించెడు జనులమాట విననైతిఁ దమిన్
   గనుగొంటి నేఁడునీమే
   ధను జూపుము నాకునొక్కదారిఁ గృపాక్మన్ .

అని ప్రార్ధించిన విని చింతామణి యత్యంత సంతోషభూషిత స్వాంతయై యోహో ? మత్సంకల్పాను గుణ్యముగానేఁడు వీనికి విరక్తిగలిగినది. యుపదేశించుటకిదియ సమయమని తలంచి.

అ. కలఁడునాకు గురువు గంగాతటంబున
    జపము జేసికొనెడు సంతతంబు
    ఆతనికడకుఁబోయి యడుగుము ముక్తికిఁ
    దెరువెఱుంగఁ జెప్పుఁ దెల్లముగను.

సోమగిరియనుపేర నొప్పారు నయ్యతీశ్వరుం డాపన్నరక్షకుండగుట నీకుయ్యాలించెడు నతనిచరణంబులు శరణంబులుగా వేడికొనుము ఇప్పుడపొమ్మని యుపదేశించి గురుతులెఱింగించుటయు లీలాశుకుండు

మఱుమాటపలుకక చింతామణిపాదంబులు కన్నులకద్దికొనుచు నాక్షణమునందే త్రివేణికరిగి యయ్యతిపతిని వెదకిపట్టుకొని పాదంబులంబడి ప్రణమిల్లుచు నిట్లనియె.

సీ. ప్రభవించితిని భూసుపర్వాన్వయంబున
                 విశ్రుతుండగుకృష్ణమిశ్రునకును
    చదివితి వేదశాస్త్రపురాణముల బాల్య
                 ముననుత్తమాచార్యముఖముగాఁగ
    నిరసించితి విరక్తిఁబరిణయం బాడంగ
                 గాహన్‌స్థ్యధర్మ మక్రమమటంచుఁ
    జేపట్టితిని పుష్పచాప చాపలమున
                 జింతామణీ వారకాంత సతిగ

గీ. తదుపదేశప్రభావ జాతప్రబోధఁ
    దుచ్ఛభోగేచ్ఛ హేయమై తోప నిప్పు
    డాశ్రయింపఁగవచ్చితినయ్య ! తావ
    కాంఘ్రిపద్మద్వయంబు దయానిధాన.

అని తనయుదంతమంతయు నెఱింగించినవిని యమ్మహాయోగి తద్వివేకోదయంబునకుఁ బురాకృతంబ కారణంబని నిశ్చయించిసువ్యక్త భక్తిప్రసక్తంబగు మహామంత్రబొండుపదేశించి శ్రద్ధాలుండవై దీనిం

జపింపుము కృతార్ధుండవయ్యెదవని యానతిచ్చుటయు లీలాశుకుండా మంత్రమునకుఁ జింతామణి యనుపేరుపెట్టి గట్టిపట్టున గంగాతీరంబునం గూర్చుండి నిద్రాహారములుమాని తదేకదీక్షగా నామంత్రంబుజపించు చుండె మఱియు

క. పది దినములలో లోకా
   స్పదుఁడాపరమాత్మ నా కుఁబ్రత్యక్షంబై
   ముదమొదవింపకయున్నన్
   వదలెదబ్రాణముల దేహవాసనవోవన్ .

అనికృతనిశ్చయుండై జపించుచుండ దశదివసావసానంబునభక్త సులభుండగు నాజగదీశ్వరుండు

గీ. శిఖినెమలిపింఛ మొప్పంగఁజిన్నిబొజ్జ
    బసిఁడిగజ్జెలమొలత్రాడు మిసిమిజూప
    మురళిబాడుచు నల్లనిముద్దుబాలుఁ
    డొకఁడు జనుదెంచి యాతనినికటమునకు.

పదకటంబులు ఘల్లుమనిమ్రోయ నృత్యంబుగావించుచువచ్చి లీలాశుకునిచెవులో మరళీనాదామృతము జొనుపుటయు నతండదరిపడి కన్నులట్టెదెరచి కురంగట నెవ్వరింగానక మరలఁగన్నుల మూయుటయు నాలీలాబాలకశిఖామణి యతనిచెంత బలువింతలఁ జూపుచుండెను.

అప్పుడాలీలాశుకునకు, బ్రాక్తనజన్మాభ్యస్తములగు విద్యలన్నియుఁ గంఠస్థమ్ములగుటయు భక్తివివశుండై నిరంకుశకవితాధోరణిచేఁ దనమ్రోలనిలచి యనేకలీలలగనుపరచుచున్న ముద్దుకృష్ణుని యాకారంబు కనంబడిన విధంబువర్ణించుచు నాలుగువందలశ్లోకములురచించి స్తుతియించెను. వానికే శ్రీకృష్ణకర్ణామృతములనిపేరు.

తనకుఁదొలుత నాలీలాకిశోరంబు దర్శనమిచ్చినతోడనే యీ క్రిందశ్లోకమును రచించెను.

శ్లో॥ చింతామణి జన్‌యతు సోమగిరిర్గురు ర్మే
     శిక్షాగురుశ్చభగవాన్ శిఖిపింఛమౌళిః
     యత్పాదకల్పతరు వల్లవ శేఖ రేషు
     లీలాస్వయంవర రసం లభ తెజయశ్రీః.

చింతామణి యుదేశంబునఁదనకు భగవంతుని దర్శనమైనదని సంతసించుచు మొట్టమొదటఁ జింతామణినే స్మరించి యామహానుభావురాలు సర్వోత్కృష్టురాలై యుండుగావుత అని కొనియాడాను.

తరువాత మంత్రోపదేశము గావించిన సోమగిరి యతీశ్వరునిఁ దలచెను. అటుపిమ్మటఁ దనకుఁగనంబడిన శిఖిపింఛమౌళిని శ్రీకృష్ణు నభినందించె తనకు దర్శనమిచ్చి కన్నులందెరచి చూచినంత నదృశ్యుఁడైన శ్రీకృష్ణుని గుఱించి యీశ్లోకమురచించె.

శ్లో. పునః ప్రసన్నేన ముఖేందుతేజసా
    పురోవతీర్ణస్య కృపామహాంబుధేః!
    తదేవ లీలా మురళీరవామృతం
    సమాధి విఘ్నాయ కదాను మే భవేత్.

ముఖచంద్రచంద్రికలు ప్రసన్నములైయొప్ప నాముంగల నిలిచిన దయాసముద్రుండగు నాలీలాడింభకుఁడు వెండియు మురళీరవామృతముచే నాతపోవిఘ్న మెప్పుడు గావించునోయని పొగడెను. మఱియు లీలాశుకుండు శైవుండై విష్ణుభక్తి నిరతుండై నట్లీక్రిందిశ్లోకము వలనఁ దెలియఁబడుచున్నది.

శ్లో. శైవా వయంనఖులు తత్ర విచారణీయం
    పంచాక్షరీ జపపరా నితరాం తథాపి।
    చేతో మదీయ మతసీ కుసుమావభాస
    స్మేరాననం స్మరతి గోపవధూకిశోరం.॥

మేము పంచాక్షరీజపపరులైన శైవులమైనను నాచిత్తము గోప కుమారునియందే వ్యాపించుచున్నదిగదా అని చెప్పుకొనెను.

శ్లో. శంభో ! స్వాగత మాస్యతా మిత ఇతోవామేన పద్మాసన
    క్రౌంచారె కుశలం సుఖం సురపతె విత్తేశ నోదృశ్యతె
    ఇద్ధం స్వప్నగతన్య కైటభజితః శ్రుత్వా యశోదా గిరః
    కిం కిం బాలక జల్పసీతి రచితం ధూధూకృతం పాతునః.

శంకరా ! నీకుస్వాగతమా విరించీ ! నీవీ యెడమప్రక్కను గూర్చుండుము కుమారస్వామి ! కుశలమా ఇంద్రా! సుఖముగానుంటివా ? కుబేరా ! కనిపించుటలేదేమి ? అని శ్రీకృష్ణుండు నిద్రలోఁ బలుకుచుండుఁ బలవరింతలను కొని యశోద ధు. ధు. అని బలికినది.

శ్లో. కాళిందీ పులినోదరేషు ముసలీ యావ ద్గతఃఖేలితుం
    తాన త్కార్పరికం పయః పిబ హరెనర్ధిష్యతే తేశిఖా।
    ఇద్దంబాలతయా ప్రతారణపరాః శ్రుత్వా యశోదాగిరః
    పాయాన్నస్వశిఖాం స్పృశన్ ప్రమదితః క్షీ రేర్ధపీతెహరిః.

వత్సా! మనబలరాముఁడు ఆడుటకై కాళిందీతటమున కెంతలో బోవునో ఆలోపల నీవీగిన్నెలోని పాలన్నియుఁ ద్రాగితివేని నీజుట్టు రెండుబార లెదుగునని తల్లిపలుకగా గిన్నిలో పాలు సగముత్రాగి జుట్టెదిగినదేమోఅని చూచుకొను శ్రీకృష్ణుఁడు నన్నురక్షించుగాక.

శ్లో. పీఠె | పీఠనిషణ్ణబాలకగళె తిష్టన్ సగోపాలకః
    యత్రాంతస్థితదుగ్ధ భాండ మవకృష్యాఛాద్యసుంటారవం।
    వక్త్రోపాంతకృతాంజలిః కృతశిరః కంపంపిబన్యఃపయః
    పాయాదాగతగోపికానయన యోగన్ండూషపూతాలంకృత్.

ఒకపీటపై మఱియొక ముక్కాలుపీటవైచి యందొక బాలకుని నిలువఁబెట్టి వానిమెడమీఁద నిలువంబడి యుట్టికిఁగట్టిన గంటమ్రోగ కుండ నానిపట్టి దుగ్ధభాండమువంచి తలద్రిప్పుచుఁ బాలుగ్రోలుచుండ నింతలో గోపికవచ్చి యదలింపబోవుటయు దానిగన్నులు గనంబడకుండ నోఁటిలోనిపాలు దానికన్నులలోఁ గండూషముజేసి పారిపోయినబాలుఁడు నన్ను రక్షించుఁగాక..

శ్లో. రామోనామ బభూవ హుం తదబలా సీతెతి హుం తౌ పితు
    ర్వాచా పంచవటీ తటె విచరత స్తస్యాహరద్రావణః ।
    నిద్రార్ధం జననీ కథా మితిహరే హున్ంకారతశ్శుృణ్వతః
    సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధను రితివ్య గ్రాగిరః పాతుసః॥

శ్లో. ఫాలేన ముగ్ధ చపలేనవిలోకనేన
    మన్మాన సె కిమపిచాపలముద్వహంతం
    లోలేన లోచన రసాయన మీక్షణేన
    లీలాకిశోర ముపగూహితు మత్శుకోస్మి.

అని యెఱింగించి తదనంతరచరిత్రము పై మజిలీయందుఁ జెప్పుచుండెను.

147 వ మజిలీ.

−♦ అగ్నిశిఖునికధ. ♦−

చిత్రసేనా! చింతామణీ సదుపదేశంబునంగాదే లీలాశుకుండు పరమభక్తాగ్రేసరుండై శ్రీకృష్ణదయాపాత్రుం డయ్యె నక్కాంత కులకాంతాతిశయనయస్ఫూర్తిఁ బేర్పొందినది సౌశీల్యంబు సహజంబుగాని కులానుగతంబుగాదని యెఱింగించినవిని చిత్రసేన పరమానంద భరితహృదయయై మహాత్మా! చింతామణి యుదంతము మిక్కిలి సంతసము గలుగఁజేసినది. మఱియు లీలాశుకుండు విరక్తుండై యరిగిన తరువాతఁ జింతామణి యెట్లు ప్రవర్తించినది ? వారిరువురు మఱల నెన్నఁడైనఁ గలిసికొనిరా? తదనంతర వృత్తాంత మాలింప వేడుకయగుచున్నది. వివరింతురే? యని యడిగిన నప్పుడమి వేల్పిట్లనియె.

బాలా ! లీలాశుకుండు. మహాభక్తుండైన పిమ్మటఁ దిరుగాఁ జింతామణి యింటికిరాలేదు. చింతామణియు నతండుత్తమవ్రతుండైం భగవంతు నారాధించుచుండెనని విని సంతసించుచుఁ దన్నుఁజూచి యతండు చాంచల్యమును నేమోయని యెన్నడు నతని దాపునకుఁ బోయినదికాదు. మఱియులీలాశుకునకు విరక్తి గలుగఁ జేయతలంపుతో నాటిఁరాత్రి వేసిన వేసమే వేషముగా తిరుగా దివ్యమణిభూషాంబరాదుల ధరింపలేదు. మేనికి నాఁడుబూసినబూడిదయే బలపరచి కాషాయాంబర ధారిణియై ప్రాగ్భవప్రభోధోద్భావంబునఁ దనయాస్తి యం