కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/147వ మజిలీ
వాని సౌందర్య మక్కజమైనదగుట
నపుడె తలఁచితి నతనిఁ బెండ్లాడ మతిని.
బడియందేమే మొండొరుల వరించుకొంటిమి. అతండిప్పుడు కాశీపురంబునఁ జదువుచున్నాడని వింటి నేనందుఁబోయి బాల్య స్నేహం బెఱింగించి యుతనిఁబతిగా వరించెద నీయైశ్వర్యము నాకక్కర లేదని పలికినది.
రతిమంజరియుఁ జిత్రసేనచెవిలో నేదియో చెప్పి యట్టివాఁడే నాభర్త యిది గురూపదిష్టము. అట్లుకావించెదనని యుపన్యసించినది. రతినూపుర వారిమాటలాలించి చిన్నవారలు మీకేమియుం దెలియదు పో. పొండు అని మందలించి యవ్వలికిఁ బోయినది.
అని యెఱింగించి మణిసిధ్ధుండు వేళయతిక్రమించుటయు నవ్వలికథ దరువాతమజిలీయందు జెప్పందొడంగెను.
145 వ మజిలీ.
చిత్రసేనా రతిమంజరులకథ.
గురుఁ డెఱిగించిన శుభదివసంబున వేకువజామునలేచి రతిమంజరి జలకమాడి ధవళమణిభూషాంబరంబులు ధరించి మాల్యను లేపనాదివాసన నలుదెసల నావరింపఁ గై సేసికొని యక్కా! నాభాగ్య మెట్లున్నదియో తెలియదు భర్తనునిరూపించు సమయమగుచున్నది. ఇప్పుడపోయి వీధితలుపుతీసినతోడనే మనయఱుగుపైఁ దొలుత నెవ్వడు గనంబడునో వానినే ప్రాణేశ్వరునిగాఁదలంచి యీపుష్పదామంబు వానిమెడలో వైచెదను. అట్లే దేశికుం డుపదేశించెను.
మఱి నందెవ్వరునులేనిచో నేమిసేయఁదగినది.అనిపలికిన చిత్రసేన చెల్లీ! మహాత్ములవచనముల కన్యధాత్వముండదు శుభోదర్కములగు వారిమాటలననుసరించిపోయిన మంగళములు సేకురకమానవు. వేళయగుచున్నది? పదపద అనిచెప్పినది. అత్యుత్సుకత్వముతో రతి మంజరి మధుపఝంకార ముఖరితంబగు మంజరీదామంబు హస్తంబునం బూని యడుగులుతడఁబడ వీధిద్వారము దాపునకుంబోయి రెండు చేతులు జోడించుచు భగవంతుని ధ్యానించుచుఁ దటాలునఁగవాటములదెరచినది. అప్పటికిఁజీకటు లంతరించినవి. దెసలు దెల్లబడుచుండెను.
క. మేలిజలతారు రతనపు
శాలువ మై గప్పికొని లసన్ముఖతేజ
శ్శాలి యొకభూసురాత్మజుఁ
డాలోకోత్సవము జేసె నయ్యంగనకున్.
మనోహరరూపలక్షణంబులఁ ప్రకాశించు నవ్విప్రకుమారుం జూచి యపారసంతోష పారావారవీచికలం దేలియాడుచుఁ జంచల దృగంచలంబులతనిపైఁ బ్రసరింపఁజేసినది. ద్వారదేశంబున నిలువంబడి రెప్పవాల్పక తన్నీక్షించుచున్న యాచంచలాక్షింజూచి జగన్మోహనంబగు తద్రూపవైభవంబున కచ్చెరువందుచు నతండు
క. తరుణీరత్నమ ! యీమం
దిర మెవ్వరిదో వచింపు నేనప్పుణ్యా
కరుల యభిదానమును విని
మురిపంబందెదనటన్న ముసిముసినగవుల్ .
వెలయింపుచు నవ్వెలయాలిపట్టి పురుషోత్తమా ! యీయింటి వారు మీకేమియుపకారము జేసిరని పొగడుచుంటిరి? మీరెవ్వరు? ఇందెప్పుడువచ్చితిరి? మీకులశీలనామంబులు వినిపింపుఁడు. పిమ్మట వీరివృత్తాంతము సెప్పెదనని పలికిన నప్పలుకుల కలరుచు నతండు.
సీ. పరమేశ్వరుని యాస్యపం కేరుహంబు సం
భవకారణంబు మావంగడంబు
హిమశైల కన్యకాధీశ వాసంబు కా
శీపురంబనని మాకాపురంబు
దత్తకాదులు బుధోత్తము లార్వురును సహా
ధ్యాయులు మిత్తసత్తములు నాకు
నఖిలరాజాధిరాజా స్థానకవిశిఖా
మణులెల్లఁ బ్రతివాదిగణముమాకు
గీ. బోవుచుంటిని నేనిప్డు భోజరాజ
రాజధానికిఁ గవిరాజ రంగభూమి
కంబుజాయతనేత్ర! నెయ్యముననన్ను
గోణికాపుత్రుఁడండ్రు మత్కులజులెల్ల.
క. మాదత్త కునకు నీపుట
భేదన ముదయస్థలంబు ప్రియమనిచూడన్
బైదలి ! వచ్చితి రాతిరి
మోదించితి నిందు నిద్రబొంది సుఖముగాన్ .
తెఱవా ! తెఱవరుల కొరులనడుగకయే ప్రవేశించి సుఖింప నిరవేరుపరిచన యీభవనకర్తలు పుణ్యమూర్తులుగారే. వారిం గైవారంబుసేయరాదే నిన్నరాతిరి యదభ్రాభ్రఘోషభీషణంబై దుర్వార ధారాపాతసంజాతవాత ప్రభూతంబై యొప్పు శీతోపద్రవంబు బోకార్బనీశరణంబు నాకుశరణంబయ్యె నీయుదంత మెఱింగింపుము దీవించి యేగెదననిపలికినంత నాకాంతావతంసం బంసంబుల నెగరవైచుచునందువచ్చుచున్న చిత్రసేనునకుఁ బదియడుగులెదురువోయి చిఱునగవుతో
ఉ. దత్తునిమిత్రుఁడంట విభుధప్రవర ప్రవిగీతభూరి వి
ద్వత్తముఁడంట పూతవసుధావిబుధాన్వయ జూతుఁడంట లో
కోత్తరరూపభాసురవయో రుచిరుండొకపండితోత్తముం
డుత్తరదేశవాసి యదియుండె గృహంగణమందు చూడుమా.
వానిపేరు గోణికాపుత్రుఁడంట గురుకృపాపాత్రురాల నగుట ననుకూలవాల్లభ్యంబు లభించినది నీవువచ్చి చూచి మాటాడుమని చెప్పిన విని దత్తకనామాకర్ణనంబునం బెచ్చు పెరిగిన సంతోషముతో వచ్చి యచ్చెల్వుఁ జూచినది. అతండప్పుడు నగుమొగముతో బోఁటీ! నా మాట కుత్తరంబిచ్చితివికావు? ఈయిల్లెవ్వరిదని యడిగిన జిత్రసేన మందహాసము సేయుచు
క. అతను శరజూలధారా
హతులం బరితృప్తులైన యధ్వగుల మనో
రతుల వెతమాన్పు నియత
వ్రతులీసదనాధిపతుల పత్రపులనఘా.
ఈపైదలి మదీయసోదరీరత్నంబు అభీష్టవరలాభంబపేక్షించి యిందువచ్చినది. ఈయుదయంబునఁ దొలుత సుముఖులగు మీముఖంబు జూచినది కామసిద్ధి తప్పక పడయగలదు. దీనిఁబరిగ్రహింపుఁడు. అనిపలుకుచుఁ జెల్లెలికిఁ గనుసన్నజేయుటయు నగ్గజయాన సిగ్గువిడిచి దిగ్గునఁ దదంతికంబునకుం బోయి తుంటవిల్కాని తూపులననోపు క్రేఁగంటి చూపుల నతనింసూచుచుఁ జేతనున్న పుష్పమాలిక సవరించుచు
క. మాలిక యిది నాహృదయము
పోలిక మీడెంద మందుఁబొలు పొందెడు నా
కేలిక గైకొనిరతి నా
కేలికవగుమింక నాశ్రయింతుఁ గవీంద్రా.
శ్లో. ఏతాశ్చల ద్వలయ సంహతిమేఖలోద్ధ
ఝంకార నూపుర రవాహృత రాజహంస్యః।
కుర్వంతి కస్యచ మనోవివశం తరుణ్యో
విత్రస్తముగ్ధహరిణీ సదృశైః కటాక్షైః॥
దివ్యాలంకారశోభితలై మనోహర రూపలక్షణలక్షితలగు నంబుజాక్షులు ముగ్ధహరిణీసదృక్షములగు కటాక్షములచే నీక్షించిన నెవ్వని మనము వివశముగాకుండెడిని? అని పండితులు సెప్పియున్నారు కాదా ! అని యాలోచించుచుఁ జలించినహృదయమును గుదురుపరచుకొని అగునగు దెలిసినది. ఇది వేశ్యాగృహమని శ్లేషోక్తులచే నా యోషామణి సూచించినదికాదా. వీరిరువురు వేశ్యాపుత్రికలు నాపటాటోపంబుజూచి కపటవిటోపచారములం జేయుచున్నారు ? వీరి మాటలువినఁ జదివికొన్నవారివలె నున్నారు. కానిమ్ము అనితలంచి
శ్లో॥ ఛన్న కామ సుధా ర్ధ్ఞాజ స్వతం త్రా హంయు పండితాన్
సక్తేవ రంజయే దాఢ్యా న్నిస్వా న్మాత్రా వివాసయేత్ .
ఛన్న కాముఁడు సుఖార్ధుఁడు. అజ్ఞుఁడు. స్వతంత్రుఁడు. అభిమాని నపుంసకుఁడు. ధనవంతులగు వీరిని, సక్తలవలెరంజింపఁజేసి ద్రవ్యమంతయు లాగివేసి దరిద్రులైనంత దల్లిచే లేవఁగొట్టింపవలయును. విదుషీమణీ! ఇదిగదా? మీకులధర్మము నేను వారిలో నొక్కండనుంగాను మీకపటకృత్యములు నాకడ నుపయోగింపవు. మఱియొకసక్తు నాశ్రయించుకొనుఁడు మీకావించిన యపూర్వ సత్కారమున కానందించితి దీవించి యేగెదనని పలికిన విని రతిమంజరి లజ్జావిలోలనయనాంచలయై యాలోచింపుచుండఁ చిత్రసేన యిట్లనియె.
ఆర్యవర్యా ! మేము వేశ్యాపుత్రికలమగుట వాస్తవమే? కులవృత్తి విసర్జించితిమి కులపాలికావృత్తి ననుష్ఠింపఁదలంచికొంటిమి. వినుం డిది నాచెల్లెలు దీనికిరతిమంజరియని మాతల్లి పేరుపెట్టినది. నేఁటియుద యమున నీవేదికపైనున్నవానిఁ బతిగాఁజేసికొమ్మని దీనికొకదేశికుండుపదేశించెను. తదీయపురాకృత సుకృతవిశేషంబునం జేసి మిమ్మిందుఁ జూడఁగాంచినది. యభీష్టము ఫలించినది. మాకు మొదటనుండియుఁ బండితులఁ బతులగాఁ జేసికొనఁదలంపుగలిగియున్నది. మీరానతిచ్చిన మీమిత్రుఁడు దత్తకుఁడు నేను నొకబడిలోఁజదివికొంటిమి. ఆయనకుఁ జిన్నతనమునందే తల్లిచనిపోయినది. తండ్రియగు మాధురుండు దాను బెనుపలేక యొకయిల్లాలికిఁ బెంచుకొననిచ్చి యెందేని పోయెనట. అందులకే యాయనకాపేరువచ్చినదని యొకప్పుడు బడిలోఁ జెప్పికొనుచుండ వింటిని. పెంపుడుతల్లి వారినిఁజాల గారాముగాఁ బెనుచుచుఁ జదువులో మిగుల శ్రద్ధచేసినది.
నిత్యము బడివేళకు మాయింటికిఁ దీసికొనివచ్చుచుండునది. మే మిరువురము నాచిన్న త్రోపుడుబండిలో నెక్కి పాఠశాలకుఁ బోవుచుందుము మమ్ముఁజూచి రాచబిడ్డలవలెనుంటిమని చూపరులు మెచ్చుకొనుచుండిరి. దత్తుఁడు మిక్కిలి చక్కనివాఁడు నాకంటె రెండేండ్లు పెద్దవాఁడు. ఆయనను బావబావయనిపిలుచు దానను, నన్నుఁ బెండ్లామనిపిలుచుచు హాస్యములాడువాఁడు ఎప్పుడు కలిసి మెలిసి తిరుగువారము నేను వారింటికో యాయన మాయింటికో వచ్చుచుందుము. ఒకరి నొకరు చూడక క్షణమోర్వలేక పోవువారము.
ఆయన చిన్నబడివిడిచి పండితులయొద్ద శాస్త్రములు చదువుట కారంభించిన తరువాత మాస్నేహమున కంతరాయము రాఁజొచ్చినది. అప్పుడు మా చెల్లెలు పినతల్లియొద్ద నుండుట వారిస్నేహము దానికిఁ గలిగినదికాదు. ఆయనఁ గాశికిబోవునప్పుడు నేను గ్రామములోలేను. తరువాతవచ్చి చాల విచారించితిని స్నేహమునకు దూరములేదుగద నా స్వాంతమెప్పుడు వారిమీదనే యున్నది. నేనాయన పెండ్లియాడ నిశ్చయించుకొంటిని. మీరు దీనింబరిగ్రహించి మమ్ము వెంటఁబెట్టికొని పొండు. మీయిద్దరికీ మేము బరిచర్యసేయుచుందుము మాతల్లి మమ్ముఁ గులవృత్తిలోఁ బ్రవేశపెట్టఁ దలంచుచున్నది. మా కంగీకారములేదు.
శ్లో॥ జయంతితే సుకృతినో రససిద్ధాఃకవీశ్వరాః।
నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం.॥
కవీంద్రులకు మహారాజులు సాటిరారు. అట్టివారికి భార్యలగుట కంటె భాగ్యమేది? మా యభిమతము సెల్లింపుఁడని కోరినవిని గోణికాపుత్రుండు ముసిముసి నగవులు నగుచు నిట్లనియె.
చిత్రసేనా ! నీవు మా దత్తునికి మిత్రురాలవగుట నాకును విస్రంభపాత్రురాలవైతివి. నీయుదంతమువిని సంతోషించితిని మఱియు దివ్యోపభోగయోగ్యంబులగు భాగ్యంబులువిడచి యాచ్నాలబ్ధ విభవులమగు మమ్మేల పరిగ్రహింపఁదలచుకొంటిరి? యీ సంకల్పము విరమింపుఁడు గుణాధికునివరించి యేకచారిణీ వృత్తంబునుబూని సుఖింపుఁడు మావెంటవచ్చి యిడుమలంబడలేరని యించుక వైమనస్యంబు సూచించుటయు రతిమంజరి యతని పాదంబులంబడి.
చ. కపటపు వైశికోక్త విధికైవడి దుష్టలమంచు మమ్ము ని
ష్కృప విడనాడకయ్య పరికింపుము మాదగుచిత్తబుద్ధి మి
మ్మపరితానురాగరతనై వరియించితి భర్తగాఁగ ధీ
నిపుణ! పరిగ్రహింపుము వినీతగతిం బరిచర్య జేసెదన్.
అని ప్రార్ధించి తల్లికినిఁ దమకుంజరిగిన సంవాదప్రకార మంతయు నెఱింగించిన నాలించి యతండు తద్వాక్యంబులు సత్యంబులుగా నిశ్చయించి యంగీకారము సూచించె మఱియు
మ. సకలాలం కరణాభిరామ విలసత్సౌందర్య తేజోవిలా
సకళా శోభితమూర్తికన్య యభిలాషస్ఫూర్తి మోహించి కో
రికదెల్ప న్వలదంచు నాతఁడు నివారింపగ గాంధేయుఁ డా
శుకుఁడా? వాయుతనూజు డా స్మరవిపక్షుండా? వితర్కింపఁగాన్.
ఉ. పుత్రికలార ! యేలయిటుపూనితి రక్కట? వంశధర్మ చా
రిత్రములెల్ల మీకు విపరీతములయ్యెనె? మేలుమేలు లో
కత్రయసన్నుతాకృతిఁ బ్రకాశిలు మీరిటు బోడిబాపలన్
బాత్రులటంచుఁ గైకొనిన బక్కున నవ్వరె విన్నవారిలన్.
గీ. తిరుగుఁ డిటుమీఁద నిల్లిల్లు తిఱిపమెత్త
నరుగఁ గలరిఁక మూసివాయనములందఁ
దినుఁడు తృప్తిగ శ్రాద్ధభోజనము లెపుడు
బోడిబాపనవారిఁ బెండ్లాడి మీరు.
అక్కటా! చక్రవర్తులకుఁ బ్రియురాండ్రఁగాఁజేసి యింద్రభోగము లనుభవింపఁ జేయవలయునని తలంచికొంటి. మీనొసట బాపన దాసరులంబెండ్లియాడి ముష్టియెత్తికొనునట్లు సృష్టికర్త వ్రాసియుండ నేనెట్లుతప్పింతు? అయ్యయ్యో ! కులస్త్రీలు మనలంజూచి ముచ్చట పడుచుండ మీరు పెండ్లి పెండ్లీయని పలవరించుచుంటిరేల ? ఇప్పు డెవ్వనినో మేడయెక్కించితిరట. వాని నిప్పుడే గెంటింతును జూడుఁడు ఆ గోచిపాతరాయనితో నందు గూర్చుండి కులుకుదుమను కొనుచుంటిరి కాఁబోలు నిదియంతయు నాస్వార్జితము గడియ నిలువనీయను మీ నగలన్నియు నిందుఁ బెట్టిపొండు నాయాజ్ఞోల్లంఘనమునకు సైరించు దానగానని మందలించినవిని యాసుందరు లలుక మొగంబునందొలక తల్లీ! నీ వెందఱియిండ్లో కూలిచి సంపాదించిన ద్రవ్య మనుభవించుట మహాపాతకము. మేమద్దాని కాసింపము. ఇవిగో నీ నగలు, ఇవిగో నీదుస్తులు. అనిపలుకుచు నాక్షణమ దానిముందఱవైచి జల్తారుచీరలు విడిచి సామాన్యపు పుట్టములు ధరించి తల్లితో మఱేమియుంజెప్పక మేడమీఁదికింబోయి గోణికాపుత్రున కత్తెరంగంతయు నెఱింగించిరి.
అతండు వారి సాహసమునకు వెఱగుపడుచుసక్తుండై యంగడికింబోయి వస్త్రమాల్యాను లేపనాదులం గొనివచ్చి వారికిచ్చెను. నూత్నకుసుమమాలాలంకృతలై యక్కాంతలు వింతసోయగంబునం బ్రకాశించిరి. నాఁటిరాత్రియే యాగణికాపుత్రికలు గోణికాపుత్రునితోఁగూడ నొరులకుఁ దెలియకుండ బయలుదేరి ధారానగరాభిముఖముగా నఱిగిరి.
అని యెఱింగించి యయ్యతిపంచాస్యుండు కాలాతీతమగుటయు నవ్వలికధ తదనంతరావసధంబున విట్లు చెప్పందొడంగెను.
146 వ మజిలీ.
-♦ మతంగయోగినికథ. ♦-
గీ. అఱుతఁ గరములఁజెవుల రుద్రాక్షమాలి
కలు వెలయ భూతమై పూతగానలంది
దండకుండ్యజనంబులఁ దాల్చి సిద్ధు
రాలొకర్తుక కాషాయచేల కలిత
పాటలీపుత్రనగర రాజమార్గంబున బోవుచుండ నయ్యోగినిం జూచి సాష్టాంగమెరగువారును జేతులుజోడించువారును దాసోహమనువారును నోరసిల్లిపోవువారునై బ్రజలు తద్రూపాటోపంబుజూచి తపస్సిద్ధురాలని తలంచి వెనువెంటఁ బోవుచుండిరి.
ఆమె వారివారి నమస్కారములుమాత్రమందికొ నియెవ్వరివంక జూడక యెవరితోమాటాడక తిన్నగా రతినూపురయింటికిఁ బోయినది సంతతము వీణగాన ముఖరితంబై యొప్పుచుండెడి యాయిల్లు నిశ్శబ్దంబై యుండుటకు వెఱగుపడుచు నాసిధ్ధురాలు ఢాకినీ నామస్మరణము గావింపుచు లోపలికిబోయినది.