కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/145వ మజిలీ
143 వ మజిలీ.
గోణికాపుత్రునికథ.
గోపా ! విను మాదత్త కాదిమిత్రులలో నొకండగు గోణికాపుత్రుండు నియమించికొనినప్రకారము శుభముహూర్తంబునఁ గాశీపురంబునుండి బయలుదేరి దక్షిణాభిముఖుండై యరుగుచుఁ గ్రమంబున ననేక జనపదంబుల తిక్రమించి యందలివిశేషములు పరికించుచు నొకనాఁడొక చెట్టునీడంగూర్చుండి యాతపసంజాతక్లేశంబు బోకార్పు కొనుచున్న సమయంబున నొకబ్రహ్మచారి యాదారింబోవుచు నా మ్రానునీడంజేరియందున్న గోణికాపుత్రుంగాంచి నమస్కరించుటయు నతండు నీవెవ్వండ, వెందలివాఁడ, వెందుబోవుచున్నవాఁడవని యడిగిన నావటుం డిట్లనియె.
అయ్యా ! నాదొక పల్లెటూరు కాపురము. నాపేరు గోమకుం డందురు బ్రాహ్మణుఁడ, దరిద్రుఁడనై ముష్టియెత్తుకొనుటకై యీ ప్రాంతగ్రామముల కరుగుచున్నాఁడ నని చెప్పిన నతండు నవ్వుచు నీకుఁ బెండ్లియైనదా? విద్యాభ్యాస మేమైన జేసితివా? అని యడిగెను.
చిన్నతనమునందే తలిదండ్రులు గతించిరి. సంసారము మీఁదబడినది. ముష్టియెత్తుకొని సంసారము నడుపుచుంటిని. చదుచుకొనుట కవకాశము గలిగినదికాదు. విద్యాధన శూన్యుండ నగునాకుఁ బిల్ల నెవ్వరిత్తురు? శుద్ధబ్రహ్మచారిని బాబూ! అని చెప్పిన గోణికాపుత్రుండు అయ్యయ్యో విద్యాభ్యాస సమంజసమగు కాలంబంతయు నీచపు బిచ్చమునకై వెచ్చబెట్టుచుంటివే! ఒక్క పొట్టకై యీముష్టియేమిటికి? ఇప్పుడైనఁ గాలము మిగులలేదు. బిచ్చముమాని చదువుకొనుమని పలికిన వటుం డిట్లనియె. అయ్యా ! నావంటివాండ్రందఱు విద్వాంసులైనచో లోకము నిలువనే నిలువదు. ఇప్పుడు నాకుఁ జదువువచ్చునా? పెండ్లినిమిత్తమై యీబిచ్చమెత్తియే నాలుగు డబ్బులు ప్రోగుచేసితిని. అందుల కేప్రయత్నము జేయుచుంటిని బాబూ! మీవైపునఁ బిల్లలెవ్వరైన నుండిరా? అని యడిగిన గోణికాపుత్రుండు జిఱునగవుతోఁ బిల్లల కేమికొదవ? కావలసినంతమంది కలరు. కాని, పెండ్లియాడినచో నీకష్టము వాయు నా? అనుటయు వటుఁడు సందేహమేల?
గీ॥ భార్యయుండిన వనమైనఁ బట్టణంబు
కాంతలేకున్న గృహమైనఁ గాననంబు
ఆలులేకున్న విధినైన నధముడండ్రు
భార్యమూలము గృహమని పలుక వినరొ !
గీ॥ ఎంతకష్టపడిన నింటికివచ్చి యి
ల్లాలి మొగము జూచినపుడె తొలఁగు
నిది యెఱింగికాదె ఋషులు వసిష్టాదు
లును సభార్యులగుచు వినుతిగనిరి.
క॥ ఒడలంటఁ గాళ్ళు పిసుకఁగ
గడివెడువేనీళ్ళ నీయఁ గంచము వెట్టన్
బడకయమర్పఁగఁ జేతికి
విడె మీయఁగ భార్యగాక వేరొకతగునే.
మహాత్మా! నాకుఁ జక్కనిభార్యతోఁ గాపురము సేయవలయునని చాలముచ్చటగా నున్నది. నీతేజముజూడ మహావిద్వాంసుఁడవు వలెఁ గనంబడుచుంటివి. నీకు శుశ్రూషగావింపుచు నీవెంటవత్తు. నాకుఁ బెండ్లి గావింపఁగలవా? అని యడిగిన గోణికాపుత్రుఁడు అట్లే రమ్ము. మంచికన్యక నరసి వివాహముసేసెద నింతియేకద! అని యంగీకరించెను. గోమఠుం డింటికిఁబోక యక్కడనుండియే యుతనివెంటఁ బోఁదొడంగెను. ఇరువురుంగలిసి పోవుచు నొకనాఁడు విపులయను నగ్రహారమున కరిగిరి,
జారకథ.
అందు సోమవర్మయను దైవజ్ఞుఁడు గలఁడు. అతనికిమడిమాన్యములు చాలకలవు. జ్యోతిషములో నట్టిపండితుఁడు లేడని వాడుక వడసెను. అతండు తనజాతకమునుజూచికొని యంతర్దశలు సూక్ష్మదశలుప్రాణదశలు గట్టిగుణింపుచుండఁ జిరకాలమున కతనికొక యాఁడు పిల్లపుట్టినది. ఆజన్నిగట్టాపట్టికి జాతకర్మాదివిధులు నిర్వర్తించి సంతోషముతోఁ బంచాంగముజూచి పుట్టినవేళగుణించి లగ్నముగట్టి గ్రహబలముజూచి యేమియుంజెప్పక చిన్నవోయియున్న భర్తంజూచి వెఱపుతో భార్యయిట్లనియె.
ప్రాణేశ్వరా! మనపట్టి పుట్టినవేళ మంచిదేనా? ఆయుర్భాగ్యము లెట్లున్నవి? పంచాంగముజూచి వెలవెలబోవుచుంటిరేల? అనియడిగిన పత్నికిఁబతి యిట్లనియె. సాధ్వీ! నీకూఁతున కాయువు భాగ్యమును బాగుగనే యున్నది. అందులోపములేదు. కాని, స్త్రీలకు నుండఁదగని దోషమేదికలదో, దేనివలనఁ నన్నిగుణములు దూషితములగునో దేనివలన గులముచెడునో దేనివలన బంధువులలోఁ దలవంపుగలుగునో యట్టిజారత్వగుణముల నీబిడ్డ చెడ్డదైపోవును. ఇట్టిది పుట్టకపోటునం దీరిపోవునుగదా! నిష్కలంకమగు మాకులము కలంకిత మగునని చింతించుచుంటి. అనవుఁడు పకాలుననవ్వి యవ్విద్రుమోష్ఠి యిట్లనియె.
సరిసరి. ఇదియా మీవిచారము. చాలుచాలు. జ్యోతిషము జదివినందులకు మంచిలాభమేకలిగినది. పోనిండు పరీక్షించిచూడ స్త్రీలలో జారిణి కానిదెవ్వతె? వీలుకుదరమి నందఱునుందొడ్డవారే మీరుచదివికొంటిరేకాని లోకానుభవము లేనివారు. ఏదియో యని వెఱచితిని. కానిండు ఇది బ్రతికి బట్టగట్టినప్పుడు చూచుకొందములెండు. అని పలికి భర్తనూరడించినది. పిమ్మటఁ దనతలిదండ్రులతో నామాట పరిహాసముగా ముచ్చటించినది. వారునవ్వుచు నాబాలికనెత్తుకొనినప్పుడెల్ల జారజారయని ముద్దులాడఁదొడంగిరి.
దానంజేసి యాబాలిక కాపేరేరూఢియైనది. అందఱును జార జారయని పిలుచుచుందురు. క్రమంబున నాబాలికారత్నము దినదిన ప్రవర్ధమానయై పదియేఁడులు ప్రాయము వచ్చునప్పటికి మనోహర రూపంబునఁ బ్రకాశింపుచుండెను. అప్పుడాబాలికకు వివాహముచేయవలయునని తలిదండ్రులకు తలంపుగలిగినది. తదీయకులరూప విద్యావిశేషముల విని యెవ్వరేని యయ్యిందువదన నడుగవచ్చి జారయను పేరు విని కారణమేమని యడిగిన సోమవర్మ నిజము మఱుఁగుపెట్టక యదార్ధము చెప్పుచుండును. ఆమాటవిని అక్కటా! కోడలు వ్యభిచరించినఁ గులముచెడును. అపకీర్తివచ్చును. సొమ్ముమాట దేవుఁడెఱుంగును. నీపిల్ల మాకక్కరలేదని వచ్చినవారెల్ల నిదిగో మఱలవత్తుమనిచెప్పి యేగుచుందురు కాని, యొక్కరైన నంగీకరించినవారు లేరు. మఱి రెండేడులు గతించినవి. అప్పుడు --
శ్లో॥ దృష్టి స్సాలసతాం బిభర్తి నశిశుక్రీడాసుబద్ధాదరా।
శ్రోత్రేప్రేషయతి ప్రవర్తిత సఖీసంభోగవార్తాస్వపి।
పుంసామంకమపేతశంక మధునా నారోహతిప్రాగ్యథా।
బాలా నూతనయౌవనవ్యతిక రానష్టభ్యమానా శనైః॥
మ॥ అలసత్వంబుజనింపఁ జూపులను బాల్యక్రీడలందాదరం
బెలమింబూనదు వీనులొగ్గి విను నిర్వృత్తప్రియాభోగవా
ర్తలు కాంతల్ దమలోనఁ జేప్పుకొనఁ బూర్వంబున్వలెన్‌బూరుషా
వళిమేనంటదు జంకి బాలిక నవప్రాయంబుమైఁబ్రాకగా?
ఆకన్యవార్త దేశమంతయు వ్యాపించుటచే నెవ్వరు నాకన్య నడుగరైరి. ఒకనాఁడు సోమవర్మభార్య భర్తతో వైదికోత్తమా మనకు భాగ్యభోగ్యములు చాలగలిగియున్నవి. ఒక్కరితయు కూతురు అదియు విద్యారూపములచే హృద్యయైయున్నది. అట్టిపుత్రికకు వివాహము గావింపలేకుంటిమి ఇది స్వయంకృతాపరాధము. దాని మీరు జారిణియని వెల్లడింపకపోయినచో నీముప్పువచ్చునా? లోకములో నెందఱుకన్యకలు గలరు. అందఱు పతివ్రతలేయగుదురా? కన్యకతండ్రి యెవ్వఁడైన నిట్లుచెప్పుకొనునా? అయ్యయ్యో! మీరు వట్టియమాయకులైపోయితిరి. పిల్లకు యౌవనము పొడసూపుచున్నది. వరుఁడెవ్వఁడు దొరకకున్న వాఁడు. రజస్వలయైనచో గొంపనట్టేటిలోఁ గట్టికొనవలసినదేకదా? ఇప్పుఁడైన నడుగవచ్చినవారి కాగుట్టు చెప్పనని యొట్టు పెట్టుకొనుఁడు. ఇందులకు మాయన్న మిమ్ముఁ బెద్దగా నిందించు చున్నాఁడని మందలించిన నాలించి యావిరించికుల వతంసమిట్లనియె.
ఓసీ! దోసమెఱింగి చేసికొనిసపిమ్మటఁ బుత్రికను నిందింపరని చెప్పుచుంటిని. పోనిమ్ము బ్రహ్మసూత్రముతోడు ఇక నెవ్వరికిం జెప్పనని శపధముచేసెను. అడుగవచ్చినవారికెల్ల నాగ్రామస్థులు వారింటికి వెళ్ళకమున్నె యీవృత్తాంతము చెప్పుచుందురు.
గోణికాపుత్రుండును గోమఠుండును నయ్యగ్రహారము ప్రవేశించినతోడనే జారనడుగవచ్చినవారని నిశ్చయించి గ్రామస్థులు కొందఱు వారిం జేరి మీరు సోమవర్మకూఁతు నడుగవచ్చితిరికాఁబోలు. ఆపిల్ల మంచిదికాదుసుఁడీ యనియాకథ యంతయుఁజెప్పిరి. గోణికాపుత్రుఁడు నవ్వుచు గోమఠునిమొగము జూచెను. ఆర్యా! నేను బెండ్లికిమొగము వాచి యుంటిని. విధ్యాధనమనీషాశూన్యుండ నగు నాకు గన్యక నెవ్వరిత్తురు? సోమవర్మకూఁతురు జారయైన నగుంగాక. కులరూప విద్యావిభవంబుల నొప్పుచున్నదిగదా? స్త్రీసంపర్క రాహిత్య దుఃఖిత స్వాంతుండనగు నాకాపిల్ల నిప్పింపుఁడు పెండ్లియాడెదనని యడిగిన గోణికాపుత్రుం డిట్లనియె. గోమఠా! పెండ్లియాడు సంతోషమేకాని రాబోఁవు ననర్థ మేమియుఁ దెలిసికొనకున్నావు. వినుము.
సీ. భార్య జారిణియైన బంధువుల్ నవ్వుదు
రెగతాళి సేయుఁదా నింటిదాసి
యెక్క సక్కెములాడు నెదురింటివాల్గంటి
యక్కయు జెల్లెలు వెక్కిరింత్రు
జనకుండు నప్రయోజకుఁడంచు నిందించుఁ
దల్లి వెంగలియంచుఁ దల్లడించు
నన్నదమ్ములు వట్టి యధముఁడంచు గణింతు
రెఱిఁగినవారెల్ల నెత్తిపొడుతు
గీ. రహహ మఱియంతకన్న జూడ్యంబుగలదె
కులట బెండ్లాడి యిడుమలఁ గుడుచుకంటె
బ్రహ్మచారిగనుంటయే పరమసుఖము
లేదు వానికి నేతంట మీఁద నింట.
ఈనిందలన్నియు సహించి కాపురము చేయుదునంటివేని,
సీ. మనసిచ్చి మగనితో మాటాడనేరదు
చెప్పినపని శృద్ధఁ జేయదెపుడు
భర్తకోపింప దర్పముసూపీ మెటికలు
విరచు దుఃఖించి కాపురముదిట్టు
బ్రతికూలముగనె సంభాషించు నేప్రొద్దు
పతిగుణంబులఁ బ్రతిహతి వచించు
వినుతించు ధవుఁడు కాదనువారలను భర్త
నిందించువారి మన్నించి పలుకు
గీ. నకట! పుంశ్చలియైన యిల్లాలితోడఁ
గాపురము సేతకంటెను గనులుమూసి
యేటిలోఁబడి చచ్చుటయే సుఖంబు
గోమఠా ! గేస్తునకుఁ బ్రతికూలమగుట.
అని చెప్పినవిని గోమఠుండు మహాత్మా! మగవాఁడుసమర్ధుఁడై పరికింపుచుండ నాఁడుదియెట్లు వ్యభిచరింపఁగలదు.
క. భూవిబుధవతంసమ ! చెడు
త్రోవల బోకుండ మదవతుల నెప్పటికిం
గావఁగ రాదో పతులకు
నీవనెదవొ యెల్లవారనిరొ యిబ్భంగిన్ .
క. మిన్నులపైఁ బోవదుగద
యిన్నేలనెకద మృగాక్షి యెటకేగిన నా
సన్నయెఱిఁగి వల్లభుఁడా
సన్నస్థితిగదలనీక సకిఁగావఁడొకో.
అనుటయు గోణికాపుత్రుఁడు నవ్వుచుఁ గానిమ్ము. ఇప్పు డింత యేల? ముందు విచారించుకొందమని పలికి తిన్నగా సోమవర్మగారింటికింబోయి. సోమవర్మభార్య వారింజూచి బ్రహ్మచారులని తెలిసికొని పడుచు నడుగవచ్చిరని నిశ్చయించి పుత్రిక నలంకరింపఁ బరిచారికల నియమించినది. వారికిఁ బాదములు గడిగికొనరజతకలశముతో నుదకములు తానే తీసికొనిపోయి యిచ్చినది. కాళ్ళుగడిగికొని గోణికాపుత్రుండు సోమవర్మగా రూరనున్నారా ? అనియడుగుటయు నామె యూరనున్నారు. స్నానార్ధమై తటాటకమున కరిగిరి. ఇప్పుడే వత్తురు. పెరటిలో నుష్ణోదక మున్నది. స్నానము చేయుఁడు అనిబలవంతముగా వారి నుష్ణోదక స్నానము జేయించినది. ఇంతలో సోమవర్మ యింటికి వచ్చెను. భార్య వారిరాక పతి కెఱిఁగించినది.
సోమవర్మ వారితో నార్యులారా ! మీ రాకచే మేము కృతార్ధులమైతిమి. మాయిల్లు పవిత్రమైనదని స్తుతియించుచుఁ బైడిపువ్వుల పీటలపై మడిపుట్టములిచ్చి కూర్చుండఁబెట్టెను. అతనిభార్య పీతాంబర ధారిణియై యలంకరించుకొని మంచిపదార్ధములుజేసివడ్డించినది. వారు తృప్తిగాభుజించిరి భోజనానంతరము తాంబూలములు వైచికొనుచు గోణికాపుత్రుడు సోమవర్మతో నార్యా ! మీకుఁ బిల్లలెందరని కుశలప్రశ్న చేసెను. అప్పుడు సోమవర్మ పట్టీ ! యిటురాయని కేక పెట్టెను. దివ్యాలంకారభూషితయై యా బాలికవచ్చి తండ్రిమ్రోల నిలువంబడినది. తద్రూపలావణ్యాది విశేషంబులుచూచి గోమఠుండు “మోహావేశముతో నీచిన్నది మిక్కిలి చక్కనిది. స్థితిగలది. నగలేమియును పెట్టనక్కరలేదు. గోణికాపుత్రుఁడు తానే పెండ్లియాడఁడు గదా ! అయ్యో ! నన్నేవలదని తానెట్లు స్వీకరించును. ఏమో! నన్ను మోసపెట్టుట కట్లనెనేమో ! ఆహా ! ఇది జారిణియైన నగుఁగాక ! యొక్క రేయి దీనితోఁగూడినం జాలదా నాకంతయోగము పట్టునా? అని పలువిధములఁ దలపోయుచుండెను.”
అప్పుడు సోమవర్మ కూఁతునొడిలోఁ గూర్చుండబెట్టుకొని అయ్యా! యిదియొక్కరితయే నాకుఁగూతురు. లేకలేక కలిగినది. ఇదియే పెండ్లికూఁతురు. అని పలికిన విని గోణికాపుత్రుఁడు బాలా ! నీపేరేమి? చదివితివా ? అని యడిగెను. సిగ్గుచే నాకన్నె యేమియు సమాధానము చెప్పినదికాదు. పిమ్మట నతండు మీపుత్రికకు జాతకమున్నదా? అని యడుగుటయు బ్రక్కనుండి భార్య వలదు వలదు అని సంజ్ఞచేయుచుండ వినిపించుకొనక సోమవర్మ మందస్వరముతో నున్నదని చెప్పెను. ఏదీ చూతము తెప్పింపుఁడని యడిగిన నతండు లేచి లోపలికిఁబోయి జాతకముతీయుచుండ భార్య యడ్డమువచ్చి మగనిందిట్టి మీ మూలమున నా బిడ్డకికఁ బెండ్లి కానేరదు. జాతకము లేదని చెప్పరాదా? అప్పుడే యీ యూరిలో నెవ్వరో యీ మాట వారి చెవిఁ బడవేసియుందురు. కానిచో దొలుతనే జాతక మడుగనేల? చీ! చీ! యీపాడుగ్రామమున వసించుటకంటె హైన్యములేదు. ఈ సంబంధముదాటిన నిఁక పెండ్లికాదు జాతకములేదని చెప్పుడు. అవ్వలికిఁ బొండని కసరిపంపినది. సోమవర్మ మఱలవచ్చి అయ్యా జూతకమిప్పుడు కనంబడలేదు. అందలి విషయంబులు పిమ్మట మీకు విన్నవించెదను. మీరుత్తమకులజులని మీయాకారములేచెప్పుచున్నవి. మిమ్ముఁ జూచినదిమొదలు మావాండ్రకు మీతో సంబంధముచేయ వలయునని యున్నది. మీ యభిప్రాయమేమి? అని వలికెను.
అంతలో సోమవర్మభార్య యోరగానిలువంబడి అయ్యా ! యీయూరిలోనివారెల్ల మాకు విరోధులు. వారిమాట లేమియుమీరు నమ్మవలదు. మాపిల్ల చాల గుణవంతురాలు. రూపముచూచితిరిగదా. పదివేల వెలగల నగలున్నవి. ఇంతకన్నఁ జెప్పునదిలేదు. కొన్ని యిబ్బందులచేఁ బెండ్లికిఁ గాలము మీరినది. దీనికిఁ బదియేఁడులు మొన్ననే వెళ్ళినవి. గోవగానెదుగుటచే నట్లున్నది. మీకీయవలయునని యున్నది. తప్పక పెండ్లియాడి సుఖింపుఁడని పలికిన విని నవ్వుచు గోణికాపుత్రుఁడిట్లనియె.
అమ్మా! నేనిప్పుడు వివాహమాడను. ఈతఁడు నా శిష్యుఁడు వీని నిమిత్తమైమీపిల్ల నడుగవచ్చితిని మీరనినట్లీయూర నేవియో కొన్నిమాటలు జెప్పిరి. కాని, యవి పరిగణించువారముకాము. వీఁడు పాత్రుఁడు మీపిల్లను వీనికిచ్చి పెండ్లిచేయుఁడు. ఇతండనుమోదించు చున్నాఁడు. మీ యింట నిల్లరికముండఁగలఁ డని చెప్పెనో లేదో యా యిల్లాలు బాబూ ! ఎవ్వరైనమంచిదే. మాయింట నుండుమనియే మేము గోరుచుంటిమి. మీరు కోరిక తీర్చితిరి. సంతోషించితిమి. కాని లగ్నము వ్యవధిలేదు. రేపే మంచిముహూర్త మున్నదని చెప్పరి. తరువాత బంధువులందరు వత్తురుగాక. తప్పక రేపు వివాహముగావించుట కంగీకరింపవలయు నటునిటు మీరే పెండ్లిపెద్దలని చెప్పిన సంతసముతో నతం డంగీకరించెను. సోమవర్మ యూరిలో నెవ్వరిం బిలువక బంధువులరప్పింపక మఱునాఁడు గుడిలో గోమఠునకు జారనిచ్చి వివాహము గావించెను. అప్పటికి వారిప్రాణములు గూటంబడినవి. అప్పుడు గోమఠునికిఁ గల యానంద ఈపాటిదని చెప్పుటకు శేషునకు శక్యముగాదు. వివాహ మైన నాలుగుదినముల కొకనాఁడు సోమవర్మ గోణికాపుత్రునితోఁ బుత్రికావృత్తాంత మెఱిగించుటయు నతఁడు నవ్వుచు నిట్లనియె.
అయ్యా! మీరు వైదికోత్తములు. లోకవ్యవహారములంతగాఁ దెలిసినవారుకారని తోచుచున్నది. మీ రహస్యములన్నియు మేము వింటిమి. వినియే చేసికొంటిమి వినుండు.
శ్లో॥ భృశమనురాగః పత్యావపత్యవాత్సల్య మతివయస్త్వంచ।
వ్యతికరనిర్వేదిత్వం ధర్మాపేక్షానకస్యాశ్చిత్॥
పతియం దనురాగము సంతానప్రీతి, వయసుమీరుట దుఃఖప్రాబల్యము, ఈమొదలగు కారణములచే స్త్రీ వ్యభిచరించదు. కాని, కేవలము ధర్మాపేక్షచేతగాదు. అని కొక్కోకుండే చెప్పియున్నాఁడు. మీరు నోటివట్టముచే నీముప్పు తెచ్చిపెట్టుకొంటిరి. పోనిండు మీయల్లుఁడు గట్టివాఁడు. భార్యం గాపాడుకొనఁగలడు. అని యుపన్యసించిన విని సోమవర్మ యతనిం గౌఁగిలించుకొని యప్పుడు తనమదిఁగల దుఃఖముపోయినదని స్తోత్రము గావించెను.
గోణికాపుత్రుండు గొన్నిదినములుమాత్ర మందుండి భార్యను గాపాడుకొనువిధానము గోమఠునకు బోధించి తదామంత్రణంబువడసి ధారానగరాభిముఖుండై యరిగెను. గోమఠుండత్త వారింట రాజోప భోగము లనుభవించుచు సుఖంబుండెను. జారయును,
సీ. వీధిబోవుచు వింతవిటుఁ డెవ్వఁడేని ది
య్యనిపాటబాడఁ దా నాలకించు
సొగసైన పొరుగింటిమగవాని గోడసం
దులనుండి యల్లన తొంగిచూచు
నాయివారమునకై యరుదెంచువారల
నూరిలో వింతలఁ గోరియడుగు
జనకుతో మాటాడఁ జనుదెంచు యువకుల
కడ నొయారంబు లేర్పడ నటించు
గీ. తనదుచెంతకువచ్చు కామినుల వారి
మగల వేపాటివనుచు సోయగములడుగు
యౌవనోదయమందె యా పూవుఁబోఁడి
రతులెఱుంగకమున్నె యా రాజనదన.
ఆచిహ్నంబులన్నియుఁ బరిశీలించి గోమఠుడు మామగారికిం జెప్పి వలసినంతద్రవ్యము దీసికొని భార్యను వెంటబెట్టుకొని తనదేశమునకుంబోయి యొక మహారణ్యమధ్యంబున సమున్నత ప్రాకారాంతరమున గొప్పమేడ గట్టించి భార్యతో నందుఁ బ్రవేసించి యినుపపంజరములోని చిలుకనువలెఁ గదలనీయక యాయళికుంతలకుఁ దానే విద్యాబుద్ధులు గఱపుచు నుపలాలించుచుండ నాయండజయానకు నిండుజవ్వనము పొడసూపినది. అప్పుడు.
క. తలయంటి దువ్వి జడ బూ
వులుముడుచున్ జలువవలువ బొలుపుగఁ గట్టున్
దిలకము దిద్దును తా న
య్యలివేణి నలంకరించు నతఁ డెవ్వేళన్.
మఱియొకసుముహూర్తముజూచి యతండు తరుణీ! నీకుఁజెప్పెడువారలెవ్వరునులేరు. నేఁడు కేళీమందిర విలాసంబులన్నియుఁ దెలిపెదంగాక, చక్కగా గ్రహించి యనుదినమట్లు కావింపుచుండవలయు.
సీ. మొగమున మసిబూసి మొలను జింపిరిగుడ్డ
నెరిజుట్టుకొని తల విరియఁబోసి
మండెడుకుంపటి మస్తకంబునదాల్చి
యొకచేత బెత్త మింకొకకరమున
వేపకొమ్మధరించి వికటాస్యమొప్పంగ
హుంకార మొనరించు చుగ్రఫణితి
కరతు మ్రింగుదు నిలుకదలకుమని పల్కు
చును నాధుశయ్య దాపునకుఁ బోయి
గీ. మూడుసారులు వలగొనిమూఢ ! యిందు
బండుకొనియుండు నీపని పట్టుదాన
మఱలఁజనుదెంచి యని యంత పెఱటిఁ కేగి
తెరపి నా వేషమంతయుఁ దీసివైచి.
వేడినీళ్ళ జలకమాడి నూత్నభూషాంబరంబులు ధరించి వచ్చి నన్నుఁ గలసికొనవలయు. ఇదియే ప్రతిదినము గావింపఁదగు క్రీడాముఖాంగమని యెఱిఁగించి దగ్గిరయుండియట్లు కావింపఁజేసి యాచేడియతో గ్రీడింపుచుండెను. లోకజ్ఞానమేమియు నెఱుంగనిదగుట నమ్మగువ యదియ యాచారమని నమ్మియట్లు కావించుచుండెను. మఱికొన్ని దినంబులు గతించినవి.
-♦ రత్నవర్తకులకథ. ♦-
ఒకనాఁడు గోమఠుండు గృహసంబారమ్ములఁ దెచ్చుటకైప్రాంతమందలి గ్రామంబునకరుగుచు భార్యతో నోసీ! నేనూరికిఁ బోయి రాత్రికేవచ్చెదను. తప్పె నేని ప్రొద్దునవత్తు తలుపులువైచికొని భద్రముగానుండుమని పలికి యతండరిగెను. అది మొద లాముదిత విరహతురయై జన్మలగ్నఫలంబునంజేసి పరపురుషసంగమాభిలాష హృదయంబున దీపింపఁ జక్కగా నలంకరించుకొని యాహా ! నేఁడీరాత్రిలోపల నెవ్వఁడేని పురుషుఁడిక్కడకు రాఁగూడదా. అయ్యో! నాకీనిర్బంధవాసమేమిటికి. మాయూరిలోనుండిన స్వేచ్ఛగా సంచరింతునుగదా. కానిమ్ము. మేడయెక్కి చూచుచుండెద. సాయంకాలములోపలఁ దెరువరి యెవ్వడైన నీదారిబోకుండునా; అని తలంచి మేడగోడ యెక్కి రాజమార్గ ముపలక్షించుచుండెను. అప్పుడు,
చ. నలువురు రత్నవర్తకు లనంతధనాఢ్యులు దాక్షిణాత్యుల
వ్వలిపురి సంతకేగుచు జవంబున మార్గముదప్పి మారుత్రో
వల నటకేగుదెంచి కడుభాసిలు నాయిలుసొంపు విస్మయం
బలరఁగఁజూచుచుండఁ గని యాసఖి వారల సంభ్రమంబునన్.
ఆహా! నేఁడు నాయదృష్టము ఫలించినది. వీరినలువురతో నేఁటిరాత్రి నాలుగుజాములు క్రీడించి నన్నుఁ బీడించుచున్న పంచశరుం గృతార్ధుం గావించెద. నేఁటికి నాపతి వచ్చువేళ మిగిలిపోయినది. అని తలంచి యమ్మించుఁబోఁడి పంచమస్వరంబున నోహో! తెరువరులారా! ప్రొద్దుగ్రుంకఁబోవుచున్నది. దాపున గ్రామమేదియును లేదు. ఇందు రండు. సుఖనిద్రజెంది రేపు పోవుదురుగాక యని కేకలు పెట్టినది. బాటసారు లామాట లాలించి మోములెత్తి యత్తలోదరింగాంచి యీగేస్తురాలు మనలరమ్మని చీరుచున్నది. భోజునసదుపాయముచేయక మానదు. ఈరాత్రి యిందుఁబండుకొని ప్రొద్దున పోవుదమని యొకఁ డనిన మఱియొకఁడు నట్టడవిలో నొంటిగానున్న యీవాల్గంటిదరికివిమర్శింపక పోవరాదు. అది భూతమో దయ్యమో పిశాచమో బ్రహ్మ రాక్షసియో తెలియదు. అనుటయు నింకొకఁడు సీ! నీవెప్పుడు నిట్లే పలుకుచుందువు. చంద్రబింబమువలె నొప్పుచున్న యాచిన్నదానిమొగము చూచితివా? దయ్యము బ్రహ్మరాక్షసి యిట్లుండునా? గొప్పవారు జనసంపర్కము సహింపక వివిక్త దేశమున మేడలు గట్టుకొని సుఖింతురు. ఉపకారమునకై మనలఁ బిలుచుచుండ లేనిపోని శంకలు చేయుచున్నావు. చాలుచాలు. పోవుటయే కర్జమని పలికెను.
నాల్గవవాఁడు సుందరీ ! మేమందువచ్చుచున్నాము. తలుపులు తీయింపుమని కేకలుపెట్టెను. అప్పుడాబోఁటి వేగవచ్చి కవాటములు తెరచినది. పడుచువారల నలువురంజూచి తలయూచుచులోపలకుఁ దీసికొనిపోయి యొకగదిలోఁబ్రవేశింపఁజేసినది. తృటిలో వంటజేసి వారికి భోజనముపెట్టినది. భోజనానంతరము వారిదాపున నిలువంబడి తాంబూలము నములుచు తెరువరులారా ! మీరెవ్వరు ? ఎందుఁబోవుచున్నారు? ఈపడుచుతనములో మీభార్యలను విడిచి తిరుగుట ధర్మమా? మీవిరహమున వారెంత వగచుచున్నారో ! నాభర్త నేఁటి యుదయముననే యూరికిఁబోయెను. ప్రొద్దునరాఁగలరు. ఒక్కనాటికే నాకెంతయో దుర్భరముగా నున్నది. ఒంటిగా బరుండుటవాడుకలేదు. మీలో నెవ్వఁడో యొకఁడు ధైర్యశాలి నాపడకటింట సహాయముగా నుండగలఁడా? యని యడిగినఁ గులుకుచు నావర్తకులు మేనుల సాత్వికవికారంబులు పొడమాప స్మరానుతాపముతో జవ్వనీ! నీవెవ్వతెవు? నీభర్త యెందుఁబోయెను? ఒంటిగా మీరిందుండనేల నీవృత్తాంత మెఱింగింపుము. ఒక్కఁడుగాదు. నలుగురమువచ్చి నీప్రక్కం బండుకొనియెదమని పలికిన విని యాకలికి యిట్లనియె.
ఇది నాపూర్వపుణ్యము. నలువురం జూచుభాగ్యము నాకు లేదు. తలిదండ్రుల కెడమైతిని నేనిందు వచ్చినతరువాతఁ బరపురుషులఁ జూచియెఱుంగను. నాపుణ్యమువలన నాపతి యూరికేగుటయు మీరు వచ్చుటయుఁ దటస్థించినది. నా వృత్తాంతము చాలగలదు. పిమ్మటఁ జెప్పెదంగాక. నిద్రమానుకొని మీనలుగురు నొకసారి రావలదు. జామున కొకఁడు రండు. ఎవ్వనికి గష్టముండదు. అందఱకు సుఖంబగు నని సూచించినది.
వారిలో వయసుకాఁడు తటాలునలేచి నేను ముందువచ్చెద. బడకగది చూపుమని చొరవగాఁబలికిన నవ్వుచు నాజవ్వని వానిఁ దన పడకటింటిలోనికిఁ దీసికొనిపోయి మంచముపైఁ గూర్చుండఁబెట్టి క్షణ కాల మందువసింపుము. నేనిప్పుడే వచ్చెదనని పలికి యవ్వలికిబోయినది. మంచముపైఁ గూర్చుండి యావర్తకుఁడు నాకీదివసం బెంతసుఖమైనది. అచ్చరవంటి మచ్చెకంటితో పచ్చవిల్తుని కేళిఁగూడఁ గల్గుచున్నది. ఈజెంత యెంతప్రోడయో కాక యింతలోఁ గ్రొత్తవానిఁగూడ యత్నించునా? నేను మంచిపనిఁ జేసితిని. రమ్మనఁగనే వాం డ్రాలోచించుచుండిరి. సాహసించి రాఁబట్టి తొలికలియకలు నాకు లభించు చున్నవి. నేను ధన్యుండ నని తలంచుచు నాచంచలాక్షి రాక నిరీక్షించుచుండెను.
వాకిటిగదిలోనున్న మువ్వురు నాజవ్వని పలుకులు తలపోయుచు నయ్యో! మనబుద్ధులింత సురిగిపోయినవేమి ? వానికున్న సాహసము మనకు లేకపోయెనుగదా! పాప మాపైదలి వచ్చి మీలో నెవ్వఁడో యొకఁడు రావలయునని కోరినదికాని వానిపేరుపెట్టి పిలిచినదా? మనదేతప్పు. ఆచొరవయే వానికా తెఱవం గూడ జేసినది. ఆకాంత మనకుఁగూడ వంతులు సూచించినది. కాని వాఁడంతటితో విడువఁడు. మనపని వట్టిదే. వాఁ డెప్పుడువచ్చునోయని నిద్రలేక గడియలు లెక్కపెట్టుకొనుచు నిందుఁ బరితపింపవలసినవారమే. అని విచారించుచు నిద్రబోక వానిరాక చూచుచుండిరి.
ఆజారయు, బెరటిలోనికిఁబోయిఁ వాడుకప్రకారము చింపినగుడ్డ గట్టుకొని మసిబూసుకొని మండుచున్న కుంపటి నెత్తిపై బెట్టుకొని బెత్తము వేపరొట్టయు గరంబులధరించి హుంకారపూర్వకముగా ---
క. కరచెద మ్రింగెదఁ బొడిచెద
విరిచెద నిలునిలుమటంచు వెలఁది పడక మం
దిరమున కరుదెంచెను భీ
కరవేషముతోడ దానిఁగని యతఁడాత్మన్ .
అమ్మయ్యో! ఇది బ్రహ్మరాక్షసి; యెఱుఁగక మోసపోయితిని లేకున్న నొంటరిగా నీయడవిలో నింత చక్కనిచిన్నది వసించునా ? వాఁడు చెప్పుచునే యు౦డెను. ఈవిసరు నామీఁద బడినది. వారుమువ్వురు దీనివేషముజూచి యీపాటికిఁ బారిపోయి ప్రాణములు దక్కించుకొని యుందురు. నాకే చావుమూఁడినది. నేఁడు మృత్యుదివసంబని యెఱుంగక లేచినవేళ మంచిదని ముఱిసితిని. అన్న న్నా! దైవమెంతలో దీర్పరానికష్టములు గలుగఁజేసెను. అక్కటా! విథీ! నీకంటికి నేనొక్కడను గనంబడితినా? ఈబ్రహ్మరాక్షసి నాపైబడి బలవంతమునఁ జంపునుగాఁబోలు. కటకటా! నాభార్య పోవలదనుచుండ నిల్లు బయలుదేరితిని. ఇది రమ్మనినతోడనే యాలోచించక తటాలున నేనే రావలయునా? చొర వెప్పుడును కూడదు. నామూటలో లక్షవెలగల రత్నములున్నవి. అవియన్నియు వాండ్రు తీసికొనిపోవుదురు కాబోలు! నా భార్యకిత్తురా ? ఈయరు. ఇది వారింగూడ భక్షింపక విడుచునా? ఏమో ముందు నేను జిక్కితినిగదా. అని తలపోయుచుఁ గదలకమెదలక నిట్టూర్పువిడువక దానిదెసఁజూడక యొంటిప్రాణముతోఁగూర్చుండెను.
అప్పు డప్పడతి బెడిదపునుడువు లడర ముమ్మారు మంచము వలగొని యిదిగో! వచ్చి నీపనిపట్టెదఁ గూర్చుండుమని పలుకుచు బెరటిలోనికి, బోయినది. ఆయంతరమరసివర్తకుఁడు మంచము మెల్లనదిగి తొంగితొంగిచూచుచుఁ జప్పుడుకాకుండ నడిచి పొంచిపొంచి యల్లన వర్తకులున్న గదిలోనికింబోయెను.
వానిరాక నిరీక్షించుచుఁ గన్నులమూయక యాదెసం జూచుచున్న మువ్వురువర్తకులు వానింజూచి లేచి ముందు నేనుబోయెద నేనుబోయెదనని ముందర కడుగు వేయఁబూనిరి. అప్పుడతండు వారి నాటంకపరచుచు నోరులుమూసి మెల్లగా నిది యాఁడుదికాదు. బ్రహ్మరాక్షసి. ఇందుండిన మనలనందఱఁ జంపఁగలదు. అని సంక్షేపముగా జెప్పెనో లేదో యెవనికివాఁరే యేమాటయం బలుకక యేమూటయుం బూనక యుపవస్త్రమైన దాల్చక ముల్లెలువిడిచి తలుపులు దెరచుకొని యొకరికొకరు జెప్పక కాలికొలఁదిని బారిపోవఁ దొడంగిరి.
ఆముద్దియ యాసద్దువిని వికటవేషముతోనే పారిపోవువారి వెంటపడి యోహో! సుందరులారా! పారిపోయెద రేల? రండురండు మీనిమిత్త మంతయో యాసపడితిని. నాయభిలాష తీర్పకపోవచ్చునా? ఇప్పుడేమి వచ్చినది? అని కేకలుపెట్టుటయు వాండ్రు తిరిగిచూచి అమ్మయ్యో! దానివేషము భయంకరముగానే యున్నది మనలఁ దరుముకొని వచ్చుచున్నది. చంపునేమోకదా? అని తలంచి ముల్లనక చెట్టనక గుట్టనక శక్తికొలఁది పారిపోవఁదొడంగిరి.
జారయుఁ గొంతదూరముపోయి పిలిచి నిరాశజెంది వెనుకకు మరలి తలుపులన్నియువైచి శయ్యపైఁ బండుకొని దుఃఖించుచు నెట్ట కే తెల్లవార్చినది. వర్తకులు తెల్లవారువఱకు పరుగిడి పరుగిడి సూర్యోదయమున కొకపల్లెజేరి వెనుకకుఁ దిరిగిచూచి అమ్మయ్యా! ఇప్పటికి బ్రతికితిమని తలంచుచు, నంతలో మూటలమాట జ్ఞాపకమువచ్చుటచే నయ్యో ! అయ్యో! నాలుగులక్షల వెలగల రత్నముల మూటలుపోయినవే! దరిద్రులమైపోతిమి. ఇళ్ళకు బోయి యేమిచేయుదుము? భార్యా పుత్రుల నెట్లు రక్షించుకొందుమని యందున్న చెరువుగట్టునగూర్చుండి దుఃఖించుచుండిరి.
అప్పుడు సూర్యోదయమైనది. గోమఠుండు సామగ్రింగొని యింటికిఁబోవుచుఁ దటాకతీరమున నుపవస్త్రములులేక కట్టుగుడ్డలతో గూర్చుండి విచారించుచున్న వర్తకులంజూచి శంకించుకొనుచు దాపునకుఁబోయి మీరెవ్వరు? చింతించుచుంటి రేల? ఒక్కనికిం బైగుడ్డలు లేవేమి? అని యడిగిన వారిలోనొకఁడు జరగినకథ యంతయుఁ జెప్పి రత్న పేటికలు పోయినవని యేడువఁ దొడంగెను. అప్పుడతండు గోణికాపుత్రుఁడుచెప్పిన యపాయము సఫలమైన దని సంతసించుచు వర్తకులారా ! మీరు ప్రాణములు దక్కినవని సంతసింపక మూటలుపోయినవని విచారించెద రేమిటికి? మీ పెండ్లాముల మెడత్రాళ్ళు గట్టివి కనుక, బతికివచ్చితిరి. అది బ్రహ్మరాక్షసి. పగలు దివ్యరూపంబునఁ గనంబడుచు మార్గస్థుల భ్రమపెట్టి శృంగార చేష్టల వెలయింపుచు లోపలికిఁ బిలిచి చీఁకటిపడినతోడనే వారిం గడ తేర్చుచుండును. దానిబారి తప్పించుకొని మీరెట్లు వచ్చితిరో వింతగా నున్నది. రత్నములకాసపడి యాదెసకుఁ బోవుదురుచుఁడీ! ప్రాంతములఁ గాచికొనియుండి మీఁదఁబడి చంపఁగలదు. అని యెఱింగించిన విని వర్తకులు బాబూ! నీపుణ్యము. మంచిమాట తెలిపితివి. మావాఁడొకఁడు సొమ్మునకాసపడి పదుగుర వెంటఁబెట్టుకొని యక్కడకిఁ బోవలయునని చెప్పుచున్నాఁడు. బ్రతికియుండిన సొమ్ము వేరొకరీతి సంపాదించుకొనఁగలము. అని పలుకుచు వారు మఱియొక మార్గమునఁ దమదేశమునకుం బోయిరి.
గోమఠుండును వేగముగా నింటింకింబోయి భార్యనుబిలిచెను. ఆమె వచ్చి తలుపుదీసినది. అమ్మగువమొగముజూచి కన్నులట్లెఱ్ఱగా నున్న వేమి ? నిద్రపట్టలేదా? అని యడిగిన నప్పడఁతి బుడిబుడిదుఃఖ యభినయించుచు మనోహరా! మీవియోగంబున రాత్రి నేను పడిన పాటులు దైవ మెఱుంగును. ఆదిభయమో, విరహమో, పరితాపమో తెలియదు. కన్నులు మూతపడినవికావు. అని యేమేమో చెప్పుచుండ నతండు ఔను. నేనామాటయే యనుకొనుచుంటిని. ఇఁక నెన్నఁడు నిన్ను విడిచి పోవను. పోయినను రాత్రికిఁ దప్పక రాఁగలను. అని యూరడఁబలికెను. భార్య వంట చేయుచున్న సమయంబున నిల్లంతయు వెదకి వర్తకులమూటలు దాచినచోటు తెలిసికొనియెను. రాత్రిభోజ నానంతరమున జార వాడుకప్రకారము ప్రారంభకృత్యములు నిర్వర్తించిజలకమాడి నూత్నాంబరధారిణియై కలియవచ్చినంత నతండు భా ర్యహృదయాంతరమునఁ జెవినిడి యామెడెందము తనతో నేదియో చెప్పుచున్న ట్లిట్లభినయించెను.
ఊ ఊ. తరువాత వర్తకులు నలుగురా? ఊ. సాయంకాలమున నీదారింబోవుచున్నారా? ఊ. మేడగోడయెక్కి కూర్చుండి వారినిబైకి రమ్మనిపిలిచినదా? ఊ. పిమ్మట అందఱు లోపలికివచ్చిరా? ఆనక చావడిగదిలోఁ గూర్చుండఁబెట్టినదా? ఊ. తృప్తిగా భోజనముపెట్టినదీ! తరువాత. వారిలో నొకని ముందుగాఁ బడకగదిలోనికిఁ దీసికొనిపోయి మంచముపైఁ గూర్చుండబెట్టినదియా ఊ. తరువాత మొదటివికార వేషమువేసికొని వచ్చి స్నా నార్ధమై పెరటిలోనికిఁ బోయినదా? తిరుగావచ్చునప్పటికి కావర్తకులు మూటలువిడిచి పారిపోవుచుండిరా? ఆ. వెనుకకొంతదూరము పోయిరమ్మని పిలిచినదీ. ఊ. వాళ్ళురాలేదూ? అయ్యో! పాపము తరువాత వారినిమిత్తము చింతించుచుఁ దెల్లవార్లు నిద్రపోలేదూ ! మఱివారిమూట లేమిజేసినది! చిన్నగదియకటుపై దాచినదా? సరే? అని యామెహృదయము తనతో నాకథయంతయు జెప్పినట్లభినయించెను.
అప్పుడాజార వెల వెల పోవుచుండును. రండా ! నేనులేనప్పుడు నీవుగావించిన దుష్టచర్యలన్నియు నీ డెందము చెప్పినది. వింటివికదా? అట్లుచేసితివా? లేదా. నిజముచెప్పుము అనుటయుఁ గన్నీరుగార్చుచు రామ రామ. నే నేమియు నెఱుఁగనని బొంకిన్ది. చీ చీ. రంకులాడి ఇఁకనీబొంకులు నిలువవు. నిజముచెప్పెదవా? లేదా అనిపెనివైచిన త్రాటితోవీపుపై నాలుగుదెబ్బలు కొట్టెను. బాబో రక్షింపుము. రక్షింపుము అని మొఱవెట్టుచు యధార్ధముజెప్పి యీతప్పు మన్నింపుడు. ఇఁకెన్నడు చేయను. అని పాదంబులంబడి ప్రార్థించినది. అది మొదటితప్పుగా మన్నించి విడిచిపెట్టెను. యధాప్రకారమే వారు గ్రీడింపుచుండిరి. మఱినాలుగుదినము లఱిగినవెనుక ప్రొద్దునలేచి యతండు భార్యతో నే నూరికి బోయి సాయంకాలమునకుఁ దప్పక వచ్చెద నింటిలో జాగ్రతగానుండుమీ యనిచెప్పి యదిచూచుచుండ నవ్వలికిఁబోయి వేరొకమార్గంబున లోపలికివచ్చి పడకటింటియటుకపై గూర్చుండెను.
జారయుఁ బెందలకడభోజనముజేసి శయనగృహమునకుఁబోయి మంచముపై గూర్చుండి రవిక నూడదీసి హృదయాంతరము గ్రుద్దుచు పాడుహృదయమా! నారహస్యములన్నియు వెల్లడింతువా? నాకంటె నీకాయనదగ్గిరచుట్టమా? నిన్నేమిచేయుదునే చూడుము? ఇంకొకసారి చెప్పినఁ జీల్చిపారవేయుదును. నాప్రౌఢిమ యెఱుఁగవుగాక యని, పది గ్రుద్దులుగుద్దినది. తనకేనొప్పివెట్టినది. ఇఁకబుద్ధిరాఁగలదని నిశ్చయి౦చి వెండియు రవికతొడుగుకొని గృహకృత్యములు గావించుకొనుచుండెను.
గోమఠుండెట్లో భార్యకుఁదెలియకుండ నిలుదాటి యూరినుండి వచ్చినట్లు సాయంకాలమున నింటికివచ్చెను. భార్య పెందలకడ వంటజేసి భోజనముపెట్టినది. క్రీడాదియందు వెండియు నతండామదవతి హృదయంబునఁ జెవినిడి ఆ ఆ. ఏడ్చెదవేమి? ఊరుకో ఏమిచేసినదో చెప్పుము. నిన్ను గట్టిగా గ్రుద్దినదా? నాతోఁ దనరహస్యము చెప్పినందులకా ? ఆ. ఏమన్నది ? నాకంటె ఆయనదగ్గిరచుట్టమా ! అనినదీ ఇఁక జెప్పితివేని చీల్చి పారవేసెదనని గ్రుద్దినదా! ఊ తరువాత, నొవ్వ గ్రుద్దినదేమి? బాధగానున్నదా? కానిమ్ము మందలింతునులే. ఊరుకో. నీ కేమిభయములేదు. అని యభినయించి పలుకుచుండ జారభయపడుచు “నిఁక దీనిముందర నారహస్యములు నిలువవు. చేసినపని చెప్పకమానదు.” అనితలంచి యతండుదండిపఁబోవఁ బాదంబులఁబడి యింకెన్నడు తప్పుచేయను. చేసితినేని హృదయమే చెప్పునుగదా? ఈసారిపరీక్షించి చూడుఁడు మీరుచేసిన శిక్షకుఁ బాత్రురాలనగుదునని శపథము జేసినది. ఆతండు తలపంకించుచు జాగ్రత నీరంకులు నీబొంకులు నాకడఁ బనికిరావు ఈమాటు ఏపాటితప్పు జేసినదని నీహృదయము జెప్పినను నిన్నుగట్టిగా శిక్షింతుఁజుమా ? యని పలికి యొప్పించి మన్నించెను.
అది మొదలాముదిత తన హృదయమునకు వెఱచి యడకువగా మెలం గుచుండెను. భార్యకుబుద్ధి కుదిరినదని నిశ్చయించి గోమఠుఁడు మఱికొన్ని దినములఱిగినవెనుక భార్యను బుట్టినింటికిఁ దీసికొనిపోయెను సోమవర్మయు భార్యయు వారిని మిక్కిలి సంతోషముతో నాదరించిరి. తల్లియు సఖురాండ్రును రహస్యముగా జారతో భర్త నిన్నిష్టముగాఁ జూచుచున్నాడా? కాపురమనుకూలముగా నున్నదియా ? విశేషము లేమనియడిగిన విని యవ్వనిత తన రెండుచేతులతో హృదయమును జూపుచు అవ్వ? అని నోరుమూసికొని యిదియున్నది. మాటాడకుఁడు వారితోఁ జెప్పఁగలదు. అని సంజ్ఞ చేయుటయు నాసన్న వారికేమియుం దెలిసినదికాదు. అప్పుడు తల్లి మఱియు మఱియుం దర్కించి యడిగిన నోరు మొత్తుకొనుచుఁ జెవులో "నే నేమిజేసినను నాహృదయము నామగనికిఁ జెప్పఁగలదు.” మీ రేమియు నన్నడుగవలదు. నాకాపుర మనుకూలముగానే యున్నది. అనిచెప్పినది.
ఆమె యావార్త సోమవర్మ కెఱింగించుటయు నతఁడు గ్రహించి యల్లుఁడుచేసిన నియమమున గూఁతురు బుద్ధిగలిగి వర్తించు చున్నదని మెచ్చుకొని వారిం దమయింటనుంచుకొని కాపాడుచుండెను.
శ్లో॥ సకృదపికులటాభి ర్యోగినీభిక్షు కాభిః
నటవిటఘటితాభి స్సంసృజేన్మౌలి కాభిః।
రుచిరమిదమముష్మై పథ్యమేతన్న వేతి
ప్రతిదినమపిభర్తు ర్భోజనేచ్ఛాంవిదద్యాతొ॥
జార భర్తబోధించినప్రకారము కులటలతో యోగినులతో భిక్షుకులతో నటులతో విటులతో మూలికావైద్యులతో నెన్నఁడును మాటాడునదికాదు వాండ్రు దూతకృత్యముల నిర్వర్తించి పతివ్రతల నైనఁ జెడుత్రోవల దింపఁగలరు. మఱియు భర్తకేదియిష్టమో తెలిసికొని భోజనసదుపాయము జేయుచుఁ బతివ్రతలలో నగ్రగణ్యయై యొప్పినది. స్త్రీలు సహజముగా దోషదూషితులైనను నడవడికచేఁ జక్క పడుదురు.
గోమఠుఁడు గొన్నిదినము లత్తవారింటనుండి భార్యగుణము జక్క పడినదని నిశ్చయించి మామగారికిఁజెప్పి తనకత్యంతోపకారము గావించిన గోణికాపుత్రుంజూడ ధారానగరంబునకుఁ బయనంబై పోయెను.
అనియెఱిఁగించి యాసిద్ధుండు తదనంతరావ సధంబునఁ దదనంతరోదంతం బిట్లుచెప్పందొడంగెను.
144 వ మజిలీ.
- ♦ రతినూపురకథ ♦-
పాటలీపుత్రమను నగరంబు మగధదేశమునకు రాజధానియై జగద్విదితంబై ప్రకాశించుచున్నది. ఆపట్టణంబు దత్తునకు జన్మభూమి యని యిదివఱకే చెప్పియుంటినిగదా మఱియునాపురంబున రతినూపుర యను వేశ్య కాపురము జేయుచుండెను. విద్యారూపవైభవంబుల ననవద్యయగు నగ్గణికా రత్నము కొంతకాల మేకపరిగ్రహయై కొంతకాల మనేక పరిగ్రహయై కొంతకాలమపరిగ్రహయై మిక్కిలి ధనమార్జించినది. కుబేరులవంటివిటుల జోగులఁజేసి సాగనంపినది. భూములుమిద్దెలు మేడలు చాల సంపాదించినది. సంతానముగలుగుటఁ కెడమైనది. వ్రతములు దానములు ధర్మములు సంతానాభిలాషఁ బెక్కుగావించినది. నడివయసున నొక విప్రునివలన నేవ్రత ప్రభావముననో దానికిరువురు పిల్లలుపుట్టిరి. వేశ్యల కాఁడుపిల్లపుట్టుట రాజులకుఁ బట్టభద్రుండుపుట్టి