కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/143వ మజిలీ
కళ్ళెములాగి మడమలతో నించుకగొట్టి యదలించినంతనాగంధర్వంబు ఱెక్కలుగలదివోలె నతిజవంబునం బరుగిడుచు నాస్కందిత ధోరతికాది గతివిశేషములంజూపుచు వచ్చినదారిం బోవుచుండెను. దత్తుండు కళ్ళెము బిగలాగి యాహయరయం బుడుపవలయునని యెంత ప్రయత్నించినను నదియాగినదికాదు. మహావేగముగాఁ బోయిపోయి రెండు గడియలలో భోజరాజ రాజధానియగు ధారానగరము సమీపోద్యానవనంబు జేరినది. అని యెఱిగించి, వేళ యతిక్రమించుటయు మణిసిద్దుం నవ్వలికథ దరువాతి మజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.
143వ మజిలీ.
భోజుని కథ.
భోజరాజునకు నలువురు భార్యలని వెనుక తచ్చరిత్రంబునఁజెప్పి యుంటినికదా. వారినల్వురయందు సమాన ప్రతిపత్తిగలవాఁడై నను లీలావతిచేయు నుపచారములంబట్టియుఁ దొలుత నడవులఁ బెక్కిడుమలంబడి తన్నొడయనిగాఁ బడసినదగుటయు నామెయంతఃపురమునఁ దఱుచుగా వసించుచుండును. ఆసాథ్వీరత్న మత్యంత భక్తివిశ్వాసములతో భర్తనారాధించుచుండెను. భార్యలకంటెఁ బుత్రులకంటెఁ గాళిదాసకవియం దాభూభర్త కధికప్రీతి కలిగి యున్నది. ఆకవి శిఖామణింజూడ నొక యామ మెడమైనచో యుగాంతరములైనట్లు చింతించుచుండును. సభయందేకాక యాహారవిహార శయనాసనముల యందుఁగూడ నతండాపండితునివిడిచి యుండనేరఁడు. తాను లీలావతి యంతఃపురమునకుఁ గూడ కాళిదాసుందీసికొనిబోవుచుండును. అయ్యంబుజాక్షియు బ్రత్యక్షముగా నాకవితో సంభాషింపదు గాని భతన్‌సమక్షమున బెనిమిటితోఁగూడ సమయోచితములైన యుపచారములఁ గావించుచుండును. విసరుమనియు మడుపులందిమ్మనియు శయ్యఁగల్పిం పుమనియు రాజే యామెకునియోగించుచుండును. భోజుండుతనకు జేసేన దానికన్న నాకవికిఁ జేసిన యుపచారమువలన మిగులఁ బ్రీతుండగు చుండును. లీలావతియు భర్తమతి ననుసరించియే కాళిదాసునకు నుపచారములు చేయుచుండును.
ఒకప్పుడు భోజునకు దేహములోఁ గొంచె మస్వస్థత గలుగుటయుఁ గాళిదాసునితోఁగూడ సంతతము లీలావతి మందిరమందేవసించి యుండెను. ఆయునికి యితరకవులకు నితరరాజభార్యలకుఁగూడ నసహ్యా సూయల జనింపఁ జేసినది---
పండితులు కాళిదాసుగౌరవము జూడలేక యోహోహో! రాజెంత యవివేకియయ్యెను ! జారశిఖామణియై సర్వదా వారస్త్రీ లంపటుండుగుకాళిదాసుని లీలావతి యంతఃపురమునకుఁ దీసికొనిపోయి యేయవరోధములేకుండ నామెచే నుపచారములు జేయించుచున్నాఁడఁట. ఎంతప్రీతిగలిగినను నేక్షత్రియుండైన నిట్లు కావించెనా? వట్టి యమాయకుండై స్త్రీయంత్రమున దగుల్కొనెనని యాక్షేపింప మొదలు పెట్టిరి-
రాజభార్యలు లీలావతి గౌరవమును సహింపక యొకనాఁడు గుమిగూడి తమ పరిచారికలచే నిట్లు పలికించిరి.
ఒకతె – అయ్యో! లీలావతి చర్యలన్నియును నాకు రాజరత్నము జెప్పినది. భోగముదానికన్న నతిశయించినదఁట. కాళిదాసునకు మడుపులందించుటయు విసరుటయుఁ బన్నీరు జల్లుటయు లోనగునుపచారములన్నియు నామెయేచేయునట. ఇఁకఁ జెప్పనేమియున్నది. ఈ విషయమై రాజు వట్టి వెఱ్ఱివాఁడైపోయెను
మఱొకతె - మడుపుల చేతికందియ్యదు. నోటికే! ఆకవికి గందము పూయుచుండఁ బలుమాఱుచూచితినని నాకు జకోరాక్షి చెప్పినది. అంతప్రీతియున్నఁ బరిచారికలచేతఁ జేయింపరాదా? ఏరాజ భార్యయైన నిట్టివిరుద్ధకర్మముల కంగీకరించునా? వేఱొకతె -- సరి సరి. నీ కసలు తెలియలేదు. (చెపులో) గజ యాన చెప్పినది.
ఇంకొకతె - ఆఁ ! ఆఁ ! ఏమీ ! అబద్ధమేమో?
వేఱొకతె - అబద్ధమా ! దానికేకాదు. అయ్యంతఃపుర పరిచారికల కందఱకును దెలియును. రహస్యములేదు. హేరాళమే.
ఇంకొకతె - రాజుగారి కిష్టమేనా? సహించుచున్నారా?
వేఱొకతె - ఆమె యాయస కేదియో మందువేసినది. రాజు మందమతియై వారెట్టి శృంగారలీలలఁ గావించుకొనినను జూచుచు సంతోషించును.
రాజభార్యలు -- (నగు మొగములతో) చీ! రండలారా! ప్రేలకుఁడు. మాయెదుట మాయక్క నాక్షేపించిన నూరకుందుమా! ఆమె తెలివిగలది. మగని వశపరచుకొన్నది. అంతియకాని మఱియొకటిగాదు..
పరిచారికలు - అమ్మా! నోరుమూసిన లోకమును మూయుదురా ? దేశమంతయుఁ జెప్పికొనుచునే యున్నారు. మీయక్కను మేమొక్కళ్ళమే యాక్షేపింపలేదు.
భార్యలు -- ఆమాట రాజుగారికిఁ దెలియునట్లామెయంత:పురమున వ్యాపిపఁ జేయుఁడు. అంతియెకాని మాయెదురఁ బలుకవలదు.
అని రాజభార్యలు పరిచారికల కుపదేశించిరి. వాండ్రు క్రమ క్రమముగా లీలావతి పరిచారికలకడను శుద్ధాంతములయందు నా మాటలే యాక్షేపించుచుండిరి. ముఖాముఖీగా రాజుగారి చెవింబడినది.
మొదట నతం డాప్రవాదము నంతగా లెక్కచేయలేదు. మఱి యొకనాఁ డొక పత్రిక యతని తలయంపినుంపఁబడినది, దానిని విప్పి చదువ నిట్లున్నది. శ్లో॥ ఘృతకుంభసమానారీ | తప్తాంగారసమఃపుమాన్
తస్మాద్ఘృతంచవహ్నించ | నైకత్రస్థాపయేద్బుధః ॥
రాజా ! నీవు బుద్ధిమంతుఁడవయ్యు మిత్రలోభంబునంజేసి స్త్రీ నెట్లు కాపాడవలయునో తెలిసికొనలేకున్నావు. కాళిదాసకవి యెంత జారుఁడో నీవెఱుఁగవా ? అతఁ డంతఃపురద్రోహము జేయుచున్నాఁడని లోకమంతయుఁ జెప్పెకొనుచున్నది. నీకిష్టమున్న భూములిమ్ము. గ్రామములిమ్ము. ద్రవ్యమిమ్ము. అంతియగాని యవమానకరముగా సంతతము నంతఃపురమందుంచికొని భార్యచే మర్యాదను మీఱిన యుపచారములఁ జేయింపరాదు. జతుకాష్టం బెంతగట్టిదైనను నిప్పు వేడిసోకిన మెత్తబడకుండునా ? కర్తవ్యమాలోచించుకొనుము అని యున్న యుత్తర మారాజు ముమ్మాఱుచదివెను. అది యెవ్వరువ్రాసినదియును పేరులేదు.
అందలివిషయములు నిర్మలమైన యతనిమనస్సును గలుషపఱచినవి. ఇంచుక యాలోచించి యతం డాహా ! మహానుభావుండగు కాళిదాసు మిత్రద్రోహము సేయునా ! చేయఁడు. పురుషుని మనంబు చంచలమగుట చేయుతలంపు గలిగియున్నను లీలావతి మహాసాధ్వి. తుచ్ఛపుపనుల కిష్టపడునా ? నాయందుగల యనురాగమంతయు మట్టుపరచి పరచింత వహించునా? వట్టిది. వట్టిది. మేరువుచలించినను నయ్యించుబోడి మది చలింపదు. గిట్టనివారెవ్వరో యిట్టికల్పనఁజేసిరి, అని నిశ్చయించి యాకళంకము మనసునుండి త్రోసివేసి యధాగతముగానే సంచరించుచుండెను.
మఱియొకనాఁడు. లీలావతి స్వయముగా వంటజేసి భర్తకు వడ్డించినది. కాళిదాసకవి దాపుననే పైడిపువ్వులపీటపై గూర్చుండి రాజుతో వినోదముగా మాటలాడుచుండెను. పొట్టుతీసిన పెసరపప్పును జూచి రాజు, శ్లో॥ ముద్గదాళీగదవ్యాళీ కవీంద్రవితుషాకథం।
రోగములఁ బోగొట్టెడు నీపెసరపప్పునకుఁ బొట్టేమిటికిఁ దీయ వలయును. కవీంద్రా! చెప్పుము. అనియడిగినఁ గాళిదాసు
శ్లో॥ అంథోవల్లభసంయోగే జాతా విగతకంచుకా॥
అన్నమనుభర్తలోఁ గలసికొనుటచే నది విగతకంచుకయైనది. అనగా రవికలేనిదియైనదనియుఁ బొట్టులేనిదియనియు శ్లేషించి సమాధానము జెప్పెను. ఆచమత్కారసమాధానము గ్రహించి లీలావతి యించుక నవ్వినది. ఆనవ్వే యానృపాలుని హృదయాంబుజమునకు వెన్నెల యైనది.
అతండు మొగముముడుచుకొని యాత్మగతంబున నయ్యో ! స్త్రీసమక్షమం దీతండింత నిర్భయముగా నిట్టి యుత్ప్రేక్షప్రకటించెనే! లీలావతి యదివిని సిగ్గుపడక సంశయమువిడిచి నవ్వినది. ఇది యెంత యనుచితమైనపని. దీనిఁబట్టిచూడ లోకాపవాదము కొంతసత్యమేమో యని భ్రమకలుగఁ జేయుచున్నది,
శ్లో॥ న స్త్రీణా మప్రియః కశ్చి త్ప్రియో వాపి న విద్య తె।
గావ స్తృణమి వారణ్యే ప్రార్థయంతి నవం నవం॥
స్త్రీలచిత్త మిట్టిదని దేవుఁడే తెలిసికొనలేడన నాకెట్లు శక్యమగును. అని యనేకవిధంబుల నాలోచించుచు మఱికాళిదాసుతో మాటాడ లేదు. కోపదృష్టుల భార్యనిరీక్షించుచుండెను. వెనుకటివలెఁ గాళిదాస కవియుఁ దానుంగూర్చున్నసమయంబున నామెవచ్చి యుపచారములఁ జేయఁబూనిన నవ్వలఁబొమ్మని తీక్షణముగాఁ బలుకును. ఈరీతిఁ గొ"న్నిదినములు గడచినవి. ప్రచ్ఛన్నముగా వారిచర్యలు పరీక్షించు చుండును.
ఒకనాఁడు లీలావతి తనపనికత్తెనుబిలిచి నీవుపోయి యాగదిలో నిప్పు డెవ్వరుండిరో చూచిరమ్ము. రాజుగారొక్కరే యున్నచో వడిగా వచ్చి చెప్పుము. ఆయనతోఁ గొన్నిరహస్యములు మాటాడవలసియున్నదని చెప్పిన నాపరిచారిక పోయి తొంగిచూచినది.
అందొకశయ్యపైఁ గాళిదాసకవి యవ్వలిమొగంబై పండుకొని నిదురించుచుండెను. భోజుఁడు వేరొకపీఠముపైఁ గూర్చుండి పరిచారిక తొంగిచూచివెళ్లుట పరికించి శంకాకళంకితమతియై మెల్లగా నవ్వలకుదాఁటి చాటునఁ గూర్చుండెను.
పరిచారిక పోయి యయ్యగారొక్కరే పండుకొనియున్నారని రాజభార్యతోఁ జెప్పినది. అప్పుడాయిల్లాలు దివ్యమణిభూషాంబరంబులు ధరించి యుపహారంబులఁ గైకొని మెల్లగా నాగదిలోనికింబోయి యొకశయ్యపై ముసుంగిడికొని పడుకొనియున్న కాళిదాసుం జూచి భర్తయనుకొని యామంచముపైఁ గూర్చుండి మనోహరా ! లెండు. ఈఫలాహారముల భుజింపుఁడు. నాపై గోపమువచ్చినదా యేమి? వెనుకటివలె మాటాడుట మానివేసిరేమి? కవిరాజు రాఁగలఁడు వేగలెండు మీతోఁ గొంత ముచ్చటింపవలసియున్నది. అని పలుకుచు ముసుఁగు లాగినది. కాళిదాసనిగ్రహించినది.
సిగ్గుపడుచు దిగ్గునలేచిపోయినది. రాజు గవాక్షవివరములనుండి యంతయుం జూచుచుండెను. కవిరాజు రాఁగలఁడు అనుమాటలో రాజురాఁగలఁడు అనుమాటమాత్రమే వినంబడినది. తన్నుఁ జూచి వెళ్లిపోయినదని నిశ్చయించెను. మెల్లన నామెగది దాపునకుఁబోయి యేమనుకొనుచుండునో యని పొంచియుండెను. అప్పు డత్తరుణి పనికత్తెతో తొత్తా ! తిన్నగాఁజూడక యబద్ధము చెప్పెదవా ? ఎంత ప్రమాదము. ఎంతప్రమాదము. చీ చీ అశ్రద్ధబుద్ధిని నిన్ను శిక్షింప వలయునని మందలించుచున్నది.
ఆమాటలు విని రాజు ఇప్పుడు తెలిసినది. నాయునికి యాపని కత్తెకుఁ తెలియక యాతఁడొక్కఁడే యున్నాడని చెప్పినదికాఁబోలు. ఇప్పుడు నన్నందుఁజూచి మందలించుచున్నది. వేశ్యాలంపటుఁడగు నాకవి నంతఃపురమునకుఁ దీసికొనివచ్చి చనువుజేయుట నాదేతప్పు. వనితయు లతయు దాపుననున్న వానిపైఁ బ్రాకునని శాస్త్రములు చెప్పి యుండలేదా? నాబుద్ధి సురిగినది. ఈయపకీర్తి లోకమంతయు వ్యాపించియున్నది కాఁబోలు అయ్యో ! నేను వట్టి మూడుఁడనై పోయితిని అని తలంచుచుఁ గోపోద్దీపితమానసుడై యప్పుడ కాళిదాసు నొద్దకుబోయి పెడమోముతో నీవు నాదేశమునుండి యిప్పుడే లేచి పోవలయును. అని పలికి యజ్జనపతి యవ్వలకుఁ బోయెను.
ఆమాటనిని కాళిదాసు నేనేమితప్పుజేసితిని? నన్నెందులకుఁ బొమ్మంటివి? అని యేమియునడుగక మహాప్రసాదమని యుచ్చరించి యప్పుడే లేచి కట్టుగుడ్డలతో నెక్కడికో పోయెను. పిమ్మట నతం డంతటితో వదలక యాంతరంగిక పరిచరులఁ గొందఱంజీరి లీలావతి నొరులె రుంగకుండ నర్ధరాత్రంబునం దీసికొనిపోయి మహారణ్యములో విడిచి రమ్మని నియమించెను. దైనప్రతికూలదినములలో మంచియంతయుఁ జెడ్జక్రిందఁ బరిణమించునుగదా? అనియెఱింగించి మణిసిధుండవ్వలికథ పైమజిలీయందుఁ జెప్పఁదొడంగెను.
- ___________
144 వ మజిలీ
శ్లో॥ సతాం హి సందేహపదేషు వస్తుషు
ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః॥
మిత్రునిఁ గళత్రమును వెడలఁద్రోయించినది మొద లమ్మేదినీపతి హృదయమున స్థిమితము చెడిపోయినది. సభకుఁ బోవఁడు. ఇతరులతో మాటాడుటమానివేసెను. ఏదియో ధ్యానించుచు నొక్కఁడు గూర్చుండును. వారి విషయమై పరిజను లేమనుకొనుచున్నారో యని చాటుచాటుగాఁబోయి వారిమాట లాలించుచుండును. ఒకచో నిరువురు పనికత్తెలిట్లు మాట్లాడుకొనుచుండ నాలించెను.
ఒకతె - కనికీ ! నిలునిలు. ఎందు బోయెదవు? చేసినపని సాఁగినదికదా? కానుక లందితివా?
కనికి -- బాపియా! తొందరగాఁ బోవలసిన పనియున్నది. కానుకలా? ఒడలంతయు బంగారమైపోయినది.
బాపి -- అట్లనుచున్నావేమి ? వారు కానుకలీయలేదా? నీతల్లి యీయేటితో ఋణవిముక్తుల మగుదుమని చెప్పినదే.
కనికి - చేతిలో వేసికొనికాని యేపనియుం జేయరాదు. ఆపండితులిచ్చిన పత్రిక రాజుగారి మంచముపై వైచితిని. అది చదివికొనియే కాళిదాసుపై ననుమానముగలిగి మొదటఁ గొన్నిదినములు మాటాడుట మానివేసిరి. పిదప నయ్యనుమానము బలపడిన పిమ్మట లేవఁగొట్టిరి. అది నేను జేసినపనివలన గాదఁట.
బాపి -- మఱియెవ్వరు చేసినపనివలన ?
కనికి - లీలావతిపనికత్తియ బుచ్చివెంకి చేసినదఁట.
బాపి - అది యేమిచేసినది ?
కనికి – అమరించినదానిలో వ్రేలుపెట్టినది. మఱేమియు లేదు. వినుము. లీలావతి యాగదిలో నెవ్వరున్నారో చూచిరమ్మనఁగాఁ గాళిదాసు పండుకొనియిండ రాజుగారని చెప్పినది. ఆమాటనమ్మి యామె వెళ్ళి కాళిదాసుముసుఁగు లాగినది. రాజుగారదిచూచి యిరువురను.
బాపి - మెల్లగాఁ జెప్పుము. భార్యను లేవఁగొట్టెనా
కనికి - బాబో అది బ్రహ్మరహస్యముసుమీ ! ఎవ్వరితోనైఁ జెప్పెదవుగాక.
బాపి - నా కామాత్రము తెలియదనుకొంటివా? నానమ్మకము మీయమ్మకుఁ . దెలియును, అందులకే మొదటి రహస్యము కనికి - అందులకే నేనునుం జెప్పితిని. మొదట నేను జేసిన పనివలన రాజుగారికి బాగుగా ననుమానముగలిగి యున్నది. చివరపని బుచ్చి వెంకికి మాటదక్కినది. కానుకలన్నియు దానికేవచ్చినవి.
బాపి - రాజుగారికి నిజము తెలియఁజేయుదునని బెదరింపలేక పోయితివా?
కనికి - దానంతట యదే బయలఁబడఁగలదు. మహాపతివ్రత నడవులపాలు సేసినందులకు ఫల మనుభవింపక పోవుదురా?
బాపి - (నవ్వుచు) అంతయెఱిగినదానవు మొదట నీవేలపూను కొంటివి?
కనికి -- గొప్పవారికి నీతియుండవలెఁగాని మనకేమి ? నేను గాకున్న మఱియొక తె సిద్ధపడును.
బాపి - అవును. ఆమాటయు నిజమే. అదిగో యెవ్వరో వచ్చు చున్నారు. పదపద. అని మాట్లాడికొని యిద్దఱు నిష్క్రమించిరి.
ఆమాటలన్నియు దైవికముగా రాజుగారి, చెవినిబడినవి. వారిద్దఱు నిరపరాధులని యతని హృదయమునందు బాగుగా సచ్చినది. ఏమిచేయుటకుఁ దోఁపక గదిలో మంచముపైఁ బండుకొని వారిచర్యల దలంచుకొనుచు నేడువఁ దొడంగెను. కొంతసేపునకు లేచి లీలావతి నడవికిఁ దీసికొనిపోయిన పరిజనుల రప్పించి యోరీ ! నాప్రియురాలి నేమిచేసితిరి? ఎందువిడిచితిరి? తిరుగా నాకావర్తమాన మేమియుం జెప్పితిరి కారేమి ?
అని యడిగిన వాండ్రు దేవా ! దేవరదర్శనార్ధమై నాఁడే వచ్చితిమి కావలివారలు లోపలికిఁ బోనిచ్చిరికారు. మీయాజ్ఞానుసారము మత్తుమందు వాసనజూపించి మై మఱచియుండ యామె నందలముపైఁ బండుకొనఁబెట్టి మన నగరమున కుత్తరముగానున్న మహారణ్యమునంబడి తెల్లవారువఱకుఁ బెద్దదూరము పోయితిమి. సూర్య కిరణములు సోకినంత నామెకు మెలకువవచ్చినది. మేము చోరులమనుకొనినది. వస్తువులన్నియుం దీసికొని తన్ను భర్తతోఁ జేర్పుఁడని మిక్కిలి దైన్యముతోఁ బ్రార్థించినది. మేము దుఃఖించుచు నందల మొకచోదింపి మీయాజ్ఞాపత్రికం జూపితిమి. చదివికొని హా! ప్రాణేశ్వరా ! యని పలుకుచు నేలంబడి మూర్ఛిల్లినది.
మేముచేయు నుపచారములవలనఁ బెద్దతడవునకు లేచి నలు దెసలు జూచి ఆ? ఏమి ! నాకిది స్వప్నమా? ఇట్టి పాడుస్వప్నము వచ్చినదేమి? నేనీ యడవి కెట్లువచ్చితిని? నాజీవితేశ్వరుఁడు నన్నీయడవిలో విడిచిరమ్మని మీకు నియమించెనా? చీ చీ యెంతమాట పలికితిరి ! ఆదయాశాలి సుగుణఖని నిరపరాధిని నన్నేమిటికి విడుచును ? నే నేమితప్పుచేసితిని? అది వట్టిబూటకము. కలలోవార్త. మామాటయుఁ గలలోనిదేయని పలికిన మేము తిరుగాఁ దమశాసనము చదివి వినిపించితిమి. అబ్బా ! అప్పు డాతల్లిపడినదుఃఖమును మేము చెప్పఁ జాలము. పెద్దయెలుంగున నడవిప్రతిధ్వను లిచ్చునట్లు శోకించినది. మాకుఁగూడ నేడుపువచ్చినది. తన్నుఁ జంపి పొండని మమ్ము బ్రతిమాలినది. మేమేమని యూరడింపము? విడువలేక విడువలేక యెట్టకే మేము బయలుదేరివచ్చుచుండఁ దమకిమ్మని యీపత్రికలో నేదియో వ్రాసియిచ్చినది. చూచుకొనుఁడని యది చేతికిచ్చిరి. అత్యంతాసక్తితోవిప్పి యతండిట్లు చదివెను.
సీ. ప్రాణేశ యడవిలోపల నన్ను విడిపించి
నందుల కెద జింతనొందనేను
బంధువిహీననై బలవంతముగ మేను
విడుతు నట్టడవి నంచడలనేను
సర్వసంపదల శాశ్వతసుఖంబనుభవిం
పగలేదటం చింత వగవనేను
క్రూరసత్వంబులుక్కున మీఁదబడి యొడ
ల్విదలించునని పలవింపనేను
గీ. ఎప్పుడో చావునిక్కంబె యెఱిఁగిచూడ
నస్థిరంబులె దేహసౌఖ్యములు దెలియ
“దుష్టనని” కానఁద్రోసినందులకు మిగుల
వగతుఁజింతింతు విలపింతు వనటఁగాంతు.
శా. మీపాదంబులె నమ్మి దైవమని మిమ్మేకొల్తు నెల్లప్పుడే
నేపాపంబునెఱుఁగ భూతనివహంబే సాక్షియోనాథ! నా
కీపైవచ్చెడు జన్మజన్మముల కీరే భర్తలై సత్కృపం
గాపాడన్ ఘటియింపు మంచెద జగత్కర్తం బ్రశంసించెదన్ .
ఆపద్యములం జదివికొని యతండు నేలంబడి మూర్ఛిల్లి యొక్కింత తడవునకుఁ దెప్పిరిల్లి యున్మత్తవికారముతో ఓఋఈ ! మీరా మెందీసికొనిపోయి యెన్నిదినములైనది యెఱింగిపుఁడని యడిగినవాండ్రుదేవా ! పదియేనుదినంబులైనదని చెప్పిరి. ఏమీ? ఇంతియే? నాకు యుగాంతరములై నట్లున్నది. కానిండు నేనాయడవికి వచ్చెద నాప్రియ యురాలినెందు విడిచితిరో చూపింపుఁడని పలుకుచు నెవ్వరికిఁ జెప్పక యశ్వశాలకుఁబోయి యొకగుఱ్ఱమునకు జీను గట్టించి యెక్కి వాండ్రవెంట నమ్మహారణ్యమున కఱిగెను.
ఆదూతలు మహారాజా! ఇందాందోళికమును దింపితిమి. ఇందు మీశాసన మెఱింగించితిమి. ఇందు దుఃఖించినది. ఇందు మీకు పద్యములు వాసియిచ్చినదని యాయాగురుతు లెఱింగించుచుఁ దచ్ఛాస నంబున నక్కాననంబంతయు నామెను వెదకిరి. ఎందు నామె జాడ కనంబడినదికాదు.
అప్పుడా ఱేఁడు మిక్కిలి పరితపించుచుఁ దాను వచ్చుదనుక రాజకార్యములనెల్ల మంత్రులఁ జక్క బెట్టుఁడని శాసనము వ్రాసియిచ్చి వాండ్ర నింటికిం బంపివేసి తానాయరణ్యమంతయుఁ దిరుగుచునమ్మదవతిని వెదక మొదలు పెట్టెను. హా ప్రేయసీ! యని కేకలుపెట్టుచుఁ దొల్లి శ్రీరాముండు సీతను గుఱించి పలవరించినట్లు పరితపించుచు నమ్మించుఁబోఁడి బలవన్మరణము నొందినట్లు నిశ్చయించియొక్క చెట్టు క్రిందఁ జదికిలంబడి తలంచెను.
అయ్యో ! పరమపతివ్రతా శిరోమణియగునిల్లాలింజంపించితిని మహానుభావుండై న కాళిదాసు నవమానించితిని. వారిర్వురు నిర్దోషులని యిప్పుడు నాహృదయమే చెప్పుచున్నది. నేను మహాపాతకుఁడ నైతిని. నాకీ పాపమెట్లుపోవును. నాకు నిష్కృతిగలదా? ప్రాయోపవిష్టుండనై ప్రాణంబుల విడిచెదను. అని కృతనిశ్చయుండై యాచెట్టు క్రిందఁ గూర్చుండి నలుమూలలు చూచుచుండ నుత్తరపుఁ దెసనుండి యొక బాహ్మణుఁ డాచెట్టుక్రిందికే యరుదెంచి యాతపక్లేశము నివారించుకొనఁ జెమ్మట లార్చుకొనుచు నందున్న యారాజుంజూచి వెఱుఁగుపడుచుఁ బల్కరించుటకు వెఱచి యూరక యాతనివంక చూచుచుండెను.
అప్పుడు భోజుం డతనింజూచి దీనస్వరముతోఅయ్యా! మీదే యూరు ! ఎందుఁబోవుచున్నారు? అని యడిగిన నతం డిట్లనియె. నేనొకబ్రాహ్మణుండను. నాపేరు ఘోటకముఖుఁడందురు. భోజ మహారాజుగారిం జూడ ధానగరంబున కరుగుచున్నవాఁడను. కాశీలోఁ జదివితినని తనవృత్తాంత మంతయును జెప్పెను.
ఆమాటలువిని రాజు నమస్కరించుచు నార్యా ! భోజునితో మీకేమిపనియున్నది? అని యడిగిన సౌమ్యా! అతండు పండితకల్పఁ భూజుండని కాశీలో విని మే మేడ్వురము సహాధ్యాయులము వారిం దర్శింప నిశ్చయించి వేఱువేఱుమార్గములనాయూరికిఁ బోవుచుంటిమి. నామిత్రు లీపాటికి తత్పురంబునకుఁ బోయియుందురు. నాకు దారిలో నంతరాయములు గలుగుట నాలశ్యమైనది అనిచెప్పిన నతండిట్లనియె.
అయ్యా! ఈయడవిలో నెందైన నొక యాడుది గనంబడినదా! యని యడిగిన నతండు సౌమ్యా ! కనంబడినది. ఆమె మూలముననే నాకు జాగైనది. అని చెప్పుటయు నతండులేచి ఎందుఁ గనంబడినదో చెప్పుము. నన్నచ్చటికిఁ దీసికొనిపొమ్మని బ్రతిమాలిన బ్రాహ్మణుం డిట్లనియె.
నే నొకదారింబడి వచ్చుచుండ నొకచోఁ జుట్టుకొమ్మకుఁ బైటచెరఁగు తగిలించి మెడ కురిఁబోసికొని చావఁ బ్రయత్నించుచున్న యొకచిన్నది నాకన్నులంబడినది. కన్నులుమూసికొని చేతులుజోడించి దైవమును ధ్యానించుచున్నది. తటాలున నేనప్పుడుపోయి యుఱి బిగియకుండ గట్టిగఁ బట్టికొని స్వాధీ ! నీవెవ్వతెవు? బలవన్మరణము నొందుచుంటివేమిటికి? ఇది పాపకృత్యముకదా ! నీ కేమి యాపదవచ్చినది? నిన్నుఁజూడ గొప్పదానవువలెఁ దోచుచున్నావు. నీయుదంత బెఱింగింపుమని యడిగిన నాచేడియ గన్నులుదెరచి నన్నుఁజూచి ఆర్యా! నీకు నమస్కారము. నన్ను విడువుము. నావృత్తాంత మడుగకుము. పట్టు వదలుము. అని బ్రతిమాలినది.
నేను — తల్లీ! నీవృత్తాంతము నాకుఁ జెప్పుము. నన్ను బుత్రునిగా భావింపుము. బలవన్మరణము నొందఁగూడదని యెంతయో బ్రతిమాలితిని. నామాటలచే మరణోద్యోగము మానినదిగాని తనవృత్తాంతము చెప్పినదికాదు. అప్పుడు నే నామెనేమిఁయుఁ బల్కరింపక తెరపికిఁ బోవుదము రమ్ము. మీయూరికిఁ దీసికొనిపోయెదను. అని పలుకుచు నుపలాలించి యొక దారింబెట్టి నడపింపసాగితిని.
నే నామెవంకఁ జూచుచు రమ్మనిచీరుచు నిలువంబడి పరికించుచుఁ గొంతదూరము తీసికొనిపోయితిని. ఆదారి నొకమాంత్రికుఁడు భల్లూకములను కోఁతులను కుక్కలను మెడకుఁద్రాళ్ళుదగిలించి నాజా లములఁ జేతనిడికొనివచ్చుచు మా కెదురుపడియెను. వాని చేతిలో నున్న దృష్టజంతువులనుఁ జూచి నేను జడియుచు నాయిల్లాలిని దరికిరమ్మని మార్గమునకోరగా నిలువఁబడి వాఁ డవ్వలికి బోవునని నిరీక్షించుచుంటిమి. ఆదుర్మాగుఁ డాచిన్న దానిమొగ మెగాదిగఁ జూచుచు నామెను తన దాపునకురమ్మని యంగుళితో సంజ్ఞఁగావించెను. ఆమె వాని మొగమే చూడలేదు. తరువాత నాతండాచిన్న దాని దాపునకు వచ్చి నీ వెవ్వతెవు? ఎందు బోవుచుంటివని యడిగిన జడియుచు నా యువతి నామాటునకు రాఁదొడంగినది.
నే నడ్డమునిలిచి అయ్యా ! మాజోక్యము నీ కేటికి ? నీదారినీవు బొమ్ము. ఈమె నాకు సహోదరి. మేము బ్రాహ్మణులము. నేనుండ నాఁడుదానిం బల్కరించెద వేమిటికి? అని చెప్పితిని. అతండు నామాటలు విని తలయూచుచు బాపురే! బాపనయ్యా! నిలునిలు. అనిపలుకుచు నొకకుక్క గొలుసువిప్పి నాపైకుసిగొల్పెను అది మొఱగుచు వచ్చి నాపైఁబడినది. నాకుధైర్యముచాలక పారిపోయితిని. కుక్క నన్ను తరిమి కాలుకఱచినది. నేలంబడితిని. మేను వివశమునొందినది. పెద్ద తడువునకుఁ దెలివివచ్చినది. నలుమూలలు చూచినంత నందెవ్వరును గనంబడలేదు. అమెకొఱకు పెద్దదూరము తిరిగితిని. ఏజాడయుం తెలియలేదు. తిరిగితిరిగి విసిగి మఱలమార్గంబునంబడి నడచుచుంటిని. ఇదేయే వృత్తాంతమని చెప్పెను.
ఆకథవిని భోజుండు హా! ప్రేయసీ ! నీ కెట్టి యిడుమలందెచ్చి పెట్టితిని నేనుమిగుల పాపాత్ముండఁగదాయని దుఃఖించుచుఁ గొంతసేపటికి ధైర్యముదెచ్చికొని మాంత్రికునుద్దేశించి చీ ! దుష్టాత్మా ! ఎవఁడవురా నీవు ! కాంతారముల సంచరించుచు సాధుజనులకు బాధ గావింపుచుంటివి? నాకన్నులంబడిన నిన్ను బ్రదుకనిత్తునా ? ఈరాజ్య మెవ్వనిది ? ఇట్టిఘోరకృత్యములు జరగుచుండఁ బరీక్షింపకుండెనే ? ఈపాతక మాభూపతింజెందదా? అన్నన్నా ! చేతఁ గరవాలము లేక పోయెగదా? పండితప్రవరా ! పరోపకారపారీణు నిన్నావంచకుండు కుక్కచేఁ గరపించెనా? ఏదీ ! నీవ్రణము. అయ్యో ! దానికోఱలు లోతుగానేదిగినవి. గాయమింకను బచ్చిగనే యున్నది. వాఁడెం దేగెనో నాకు జూపుము. అని పలుకుచుండ ఘోటకముఖుఁడు ఓహో ! ఈతండెవ్వఁడో గొప్పవాఁడు. తేజశ్శాలి. పరాక్రమసంపన్నుండు. శ్రీరాముండువలె భార్య నడవికనిపి పిమ్మటఁ బశ్చాత్తాపము జెంది యయ్యిందువదనను వెదకుచున్నవాఁడు. నిక్కము దెలిసినది. ఆచిన్నది వీనిభార్య. పాపము ఆమెను వాఁడు చెరఁబట్టఁబోవ బలవన్మరణము నొందకమానదు. ఈదంపతులకిఁక కలయికదుర్ఘటమే. ఈతనివెంటఁ బోయి కులశీలనామంబులం దెలిసికొనెదంగాకయని తలంచుచు నతండానృపతికిట్లనియె.
అయ్యా ! నేను వారినిమిత్తము పెద్దదూరము తిరిగి వెదకితిని. ఎందునుగనంబడలేదు. ఆక్రూరునినొసటఁ బెద్దకుంకుమబొట్టున్నది. గడ్డముపెంచెను. జడలుముడివేయుఁబడియున్నవి. వాఁడీపాటికి జనపదంబులకుఁ బోవఁగలఁడు. నేను వాని గురుతుపట్టఁగలను. మనమీయడవి విడిచి గ్రామములమీదుగాఁబోయి వెదుకుదము. కనంబడక యెందు బోగలఁడు. అనియుపదేశించిన సంతసించుచు నాఱేఁడు ఘోటకముఖునితోఁ గూడ వానివెదకుచు దేశసంచారము గావించెను.
అని యెఱిగించి మణిసిద్ధుండు తదనంతరోదంతం బిట్లుచెప్పఁ దొడంగెను.
148 వ మజిలీ.
-◆ రుక్మిణికధ. ◆-
భోజరాజునకుఁ గంధర్వపుత్రికయగు కమలయను భార్యయందు జీత్రసేనుఁడను కుమారుఁడును రుక్మిణియను కుమార్తెయునుదయించిరి.