కాశీమజిలీకథలు/ఆరవ భాగము/59వ మజిలీ

వచ్చిన నిక్షేపము తృటిలో నిర్మూలముఁజేసితివి. నీవునాకు కూతుఁరవు గావు యభి యాతినివి. నీవిప్పుడు మరల నతనియొద్దకుఁ బోయి నాతల్లి యొప్పుకొనలేదని చెప్పి హారము దీసికొనిరమ్ము. లేనిచో నిన్నుఁ జంపి నే నురిఁబోసికొనియెదనని బెక్కు నిష్టురము లాడినది.

ఆమాటలు విని నవ్వుచు వీణావతి అమ్మా ! నీవింత తొందరపడియెదవేల? నే నాలోచింపక చేసితి ననుకొంటివా? నీకడుపునంబుట్టి చేతిలోఁ బెరిగిన నాకు వేశ్యా ధర్మములు బోధింపవలయునా? నే చేసినపని మంచిదని విచారించిన నీకే తెలియఁగలదు, కోట్లకొలది వెలఁగల యా హారము పెద్ద లెఱుంగకుండ నారాజపుత్రిక మన కిచ్చినది. గదా? తరువాత నా వార్త తలిదండ్రులకుఁ దెలియక మానదు. కూఁతు మందలింపక మానరు. మనలం బట్టికొనుట కీపాటికిఁ గింకరులం బంపియే యుందురు. అది యంతయుం దెలిసియే మనకు బ్రమాదము వచ్చునని భయముతో నిట్లు చేసితిని. అది తప్పంటివేని యిప్పుడుపోయి యా రవణము దీసికొని వచ్చెద. నతం డీయనివాఁడు కాడు. ఏమనియెదవు? విచారించి నుడువు మనుటయు నా వేశ్యమాత పోనిమ్ము ఏదియో చేసితివిగదా? దాని మరలఁ దిరుగఁ దోడనేల? నీ వాలోచించి నదియుఁ గొంత యుచితముగా నున్నది. అని సమాధానపడి యావారనారి యూరకొనినది.

అని యెరిగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి మజిలీయందిట్లని చెప్పందొడంగెను.

ఏబది తొమ్మిదవ మజిలీ కథ

ఆహా? లోకులెట్టి యక్రమ నిందావ్యాపకులోగదా? మాయన్న యేపాప మెరుఁగనిదే దుర్వ్యాపారియని యపనిందమోపిరి. దుస్సహవాస మెట్టివారికి నపఖ్యాతి మూలకము కాకపోదు. ఈవార్త మాయన్న బెరింగించెదనని తలంచుచు సావిత్రి యొకనాడు సహదేవుని మందిరమున కరిగినది. అప్పు డతండు మంచముపై శయనించి యెద్దియో ధ్యానించుచుండెను. అతనింజూచి యాచిగురుబోణి వెఱఁగుపడుచు అన్నా ! ఇదియేమి? అకారణముగాఁ బండుకొంటివి. తండ్రిగారన్న మాట వింటివా యేమి ? అనుటయు నతం డదరిపడి లేచి తండ్రిగారు నన్నే మనిరి చెప్పుము, చెప్పుము. అని యడిగిన నప్పడఁతి యిట్లనియె.

అన్నా ! మొన్న నీవు మణిహారముంగొని పదివేలనిష్కము లవ్వేశ్యల కిచ్చితివిగదా? ఆయీవి వేఱొకతెఱగునఁదలంచుచు నిన్ను వేశ్యాలోలుండని జనులు నిందించుచుండ తండ్రిగారువిని నన్నుఁబిలిచి నీయన్న నిష్టలు వింటివాయని యడిగిరి. ఆపలుకుల కులికిపడి నే నతండేమిచేసెనో చెప్పుడని యడిగితిని. మొన్న వీణావతియును వేశ్య కొక్కదినమునకే పదివేళ నిష్కము లిచ్చెనట. చక్కనికన్యలఁ దెచ్చిన బెండ్లి యాడక జితేంద్రియుండువోలె నే మేమొ చెప్పి యిప్పుడిట్టి తుచ్చపుంబనులఁ జేయ వచ్చునా? ఇంతలో తనకుఁ గలిగిన పరస్త్రీ పరాజ్ముఖుఁ డనువాడుక చెడఁగొట్టుకొన వచ్చునా? నీ వతని సుగుణములఁ బెద్దగా నుతియింపుచుందురు. గాన నిన్నడుగుచుంటినని యడిగిన నే నిట్లంటిని.

తండ్రీ ! మీరు వినిన కిం వదంతి యసత్యమైనది సూర్యచంద్రాదులు గతులు దప్పినను దప్పుదురుగాని సహదేవుండు సహజగుణంబుల విడుచువాఁడు గాడు. వీణావతికి నిష్క ములిచ్చిన కారణము వేఱొకటి కలదని యావృత్తాంతమంతయుఁ జెప్పి యతనిమతి మరలించితిని. అప్పుడు మనతల్లి వల్లభునితో నీకు బెండ్లి చేయక యిన్ని దినము లుపేక్షించుట తప్పని పరిహసించినది. వివాహమును గురించి పెద్దగా వారిద్దరకు సంవాధము జరిగినది. వానికిం దగినకన్య లభించిన నేమిటికిఁ బెండ్లియాడడని నేనుఁ జెప్పితిని. అట్టి ప్రయత్నము లిదివరకు పదిసారులు చేసి విసిగి మానివేసితినని యాయన నిన్ను నిందించెను.

వాని కనురూపయగు బోటి దొరికిన బెండ్లి యాడించుట కేనుపూటయని మాట యిచ్చి వచ్చితిని. మన తల్లిదండ్రులకు నీవు పెండ్లి యాడలేదని మిక్కిలి చింతగా నున్నది నీయభిప్రాయము నేను వారి కెరిగించితిని గదా ! దేశాటనము చేసి యైన నిష్టము వచ్చిన కన్యనేరికొని పెండ్లియాడరాదా? యూరక నిందల పాల్పడ నేమిటికి? నీవుకోరిన నే చకోరనయన సమ్మతింపదు. అని పలికిన విని యతండించుక నవ్వు మొగంబుతో నాజవ్వని కిట్లనియె.

సహోదరీ ! నాకుఁ గలిగిన యపనింద విషయమై గలిగిన యనుమానము తండ్రిగారితో వాదముఁ జేసి పాయఁ జేసితివి. నీయాదరము కొనియాడఁ దగినదిగదా? అది అట్లుండె నా పెండ్లి కి పూటకాపువైతివిగదా ! అది చెల్లించుకొనవలయును. వీణావతి యెరిగించిన స్వయంప్రభ వృత్తాంతము నీవును వినియుంటివి. ఆ వాల్గంటి యందు నాడెందము దగుల్కొనినది. మొదటినుండియు వైరాగ్యవతియు రూపవతియు నగు యువతి సతిగా నుండవలయునని నా కభిలాషయుండునది ! ఆగుబంబు లా రమణియందున్నటులఁ దెల్ల మగుచున్నది కావున నీవోపితివేని యా మానినీరత్నమును నాకుఁ బాణిగ్రహణము గావింపుము. నీకన్న నా కాంతరంగితు లన్యులు లేరు. అని ఆత్మాభిలాష నయ్యోషామణితోఁ జెప్పికొనియెను.

అప్పు డప్పూఁబోడి నవ్వుచు అన్నా? ఈ నీ సంకల్పము మొన్న హారము గొనివచ్చినప్పుడే గ్రహించితిని. ఆ జవరాలే నీ కనుకూలయని తలంచితి. ఆ రాచపట్టి యెట్టివైరాగ్యతయైన తనంత వచ్చి నిన్ను వరించునట్లు చేసెద. నాబుద్ధిబలముఁ జూచెదవుగాక. ఉపాయంబునకు సాధ్యముగాని పను లుండునా? నీవు తొలుత నవ్వీటి కరుగుము, అత్తెఱవ చర్యలెల్లఁ బరిశీలించి నాకుఁ దెలియజేయుము. పిమ్మట కర్తవ్య మాలోచించెదముగాక యని యేమేమో చెప్పినది.

అప్పలుకు లమృతబిందువులవలె చెవులకు సోకుటయు నతండుబ్బుచు చెల్లీ నీ బుద్దిబలం


బట్టియే నాగుట్టుఁ జెప్పితిని. స్త్రీలోలురం జూచి పరిహసించువాఁడ. నాకీస్త్రీలాలసత్వము గలిగినది. ఇది పరిహాసాస్పదము గాకపోదు. విరహసంతాపము క్షణక్షణ మభివృద్ధిఁ జెందుచున్నది. కాలయాపనము సైప. పెండ్లి మాటఁ దల పెట్టి నంతనే గృతాంతచర్యలం గావించు న న్నెలంత తనంత వచ్చి నన్ను వరించునట్లెట్లు ! గావింతువో తెలియకున్నది. ఇది నన్నోదార్చుట కనినమాట కాదుగద? నిజము చెప్పుము. చెప్పుమని యడిగినమాటయే యడుగుచు నున్మత్తుండువోలె ప్రలాపించుచుండ నావేదండగమన యతనికిఁ జేయవలసిన కృత్యము లన్నియు బోధించి యోదార్చినది.

అరువదియవ మజిలీ కథ

స్వయంప్రభావిరక్తి కథ

సాధ్వీ! స్వయంప్రభ చేసినపని వింటివా? వీణావతియను వేశ్యాంగన సంగీతముపాడునపుడు శృంగారశ్లోకములు పాడెనని కోపముతో దానివీణ విరుఁగ ద్రొక్కినదఁట. ఇంత కఠినురాలయ్యెనేమి? దానిబుద్ధి యెట్లుమరల్పుదుము. ఈ వైరాగ్య మెవ్వరుపదేశించిరి. దానిచెంతఁ బెండ్లియనినంత నేయివోసిన యగ్ని జ్వాలవోలెఁ బ్రజ్వరిల్లునఁట యేమి చేయుదుము. అని యింద్రమిత్రుఁ డొకనాఁడు భార్యతోఁ బ్రశంసించెను. ఆమెయు మనోహరా! మీరు విచారింపవలదు. దానికిఁ జిన్నతనము వదలలేదని యిన్నిదినము లుపేక్షించితిని. గట్టిగాఁజెప్పిన వినక యేమి జేయునుఁ రేపువోయి మందలించెదం గాక యని ప్రాణనాధునకు సమాధానముఁ జెప్పి యమ్మరునాఁడు రాజపత్ని స్వయంప్రభయున్న యుద్యానవన సౌధంబున కరిగినది.

అట్టి సమయంబున రాజపుత్రికయు సఖురాలితో నిట్లు సంభాషించుకున్నది.

హేమా! నీ మాటలేమియ నాకు రుచింపపు. పెండ్లి యేమిటికిఁ మన మెంతకాలము బ్రతుకుదుము. మానవశరీరములు జలబుద్బుదములకన్నఁ జంచలము లని యెరుంగవా! బ్రతికియున్న స్వల్పకాలములోఁ దగునీమంబుగలిగి పరము సాదించుకొనవలయుంగదా? పెండ్లియాడిన పిల్లలు కలుగుదురు. వాండ్రవలన మమత్వము పెరుగును. అదియే దుఃఖములకెల్ల మూలకారణము. స్వప్న ప్రాయమైన సంసారమునందు నాకేమియు నభిరుచిలేదు. మహాత్ములతోఁగలిసి తపమొనరించి ముక్తి బొందవలయునని యున్నది. నన్ను బలుమారు పెండ్లిం యని బాధింపకుము. నీపాదంబులకు మ్రొక్కెదనని యుపన్యసించుచుండ తలుపుమాటునుండి యంతయు నాలించి యొక్కింతతడవు విచారించి పదపడి వారియెదుట పడినది.