కావ్యాలంకారచూడామణి/సప్తమోల్లాసము

సప్తమోల్లాసము

—————

ఛందస్సు

క.

శ్రీవిశ్వేశ్వరునకు నై, భావితవిశ్వేశ్వరాంధ్రపద్మునకై సం
భావితపదవాక్యకళా, [1]కోవిదుకై నయవిశేషగుణవిదునకు నై.

1


క.

ధీయుత పింగళనాగ హలాయుధ జయదేవ ముఖ్యు లగునార్యులచే
నాయత మై యామ్నాయప, దాయిత మగుఛంద మొప్పిదముగ నొనర్తున్.

2


క.

ఛందోవిభ్రమవిధితోఁ, బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా
మందిరము లైన యయ్యర, విందభవునివచనములకు విభవం బొసఁగెన్.

3


శా.

పొం దై గౌరవలాఘవప్రకృత మై పూర్ణాక్షరస్నిగ్ధ మై
యందం బై శ్రుతిసమ్మతప్రకట మై ప్రాపించు నానావిధ
చ్ఛందస్సూత్రము లేక లోకములఁ జంచద్వాక్యరత్నావళీ
సందోహంబులు కంఠభూషణము లై సంధిల్లు నే యేరికిన్?

4


క.

ఛందము వాఙ్మయ[2]విద్యా, కందము యతిగమకసమకగణవృత్తకృతా
నంద మమందార్థకళా, విందము వాణీకరారవిందము ప్రతిభన్.

5


క.

పటుమతి నట మున్ను మహా, నటుఁ డీశుఁడు [3]వాచకాభినయమునకై యు
త్కటయతిలయమయతాళ, స్ఫుటవికటచ్చంద మందముగ నొనరించెన్.

6


క.

సృజియించి యిచ్చె నజునకు, నజుఁడును భరతునకు నిచ్చె నమ్మునివరుఁడున్
ఋజుమతి యగు పింగళుఁ డను, భుజగమునకు నిచ్చె భుజగభోజనుఁ డచటన్.

7


క.

[4]ప్రియ యది యేటిది నావుడుఁ, బుయిలోడినపలుకుతుదల పొల్లులచేతన్
మ య ర స త భ జ నగణము లు, దయ మొందె ఛంద మొందెఁ దద్గణయుక్తిన్.

8


క.

గురువును లఘువును శంకర, [5]గిరిజాతాకృతులు తత్ప్రకృతములు గణముల్
[6]గరుడునిపై పింగళిఫణి, విరచించినతెఱఁగు వరుస వివరింతుఁ దగన్.

9


వ.

[7]అవి యెయ్యవి యనిన ధీశ్రీస్త్రీమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్,
సాతేక్వత్, [8]కదాసజ్, కింవదభ్, [9]సహసన్; ఇ ట్లని గరుడభయంబుననుం [10]దిర్య
గుదితస్వభావంబునను సాభిప్రాయజ్ఞేయనేయార్థంబుగా గణస్వరూపనిరూపణం
బునకునై పింగళనాగంబుచేత నుచ్చరితంబు లగుత[11]ద్వాక్యాంతరంబులం బొల్లు లై
తోఁచు మకార-యకార-రేఫ-సకార-తకార-జకార-భకార-నకారంబులు
గణాభిధానంబులకు వాద్యక్షరంబు లగుటచేత మగణ-యగణ-రగణ-సగణ-త
గణ-భగణ–[12]నగణంబులు గ్రమంబునం బ్రస్తారోద్ధారంబునం బ్రభవించెఁ.
దత్స్వరూపంబులనుం దదధిదైవతంబులను పరిపాటిం బ్రకటింతు నె ట్లనిన.

10

క.

ధీశ్రీస్త్రీ మన మగణము, విశ్రుత, మధిదైవతంబు విశ్వంభర; ని
త్యశ్రీల నొసఁగు మగణ, ప్రశ్రయముఖకవిత [13]చెప్పఁ బని దనుఁ దలఁపన్.

11


క.

జగతివరాహా యనఁగా, యగణం బుదయించె నుదక మధిదైవత మై,
యగణప్రయోగములయెడఁ, [14]దగిలించున్ సిరులుఁ దన్నుఁ దలఁపున నిలుపన్.

12


తే.

[15]బ్రమిసి కాగుహా రనునట్టి పలుకు రగణ
మయ్యె; నధిదైవతము వహ్ని యయ్యెఁ గానఁ,
గవితముఖమున రగణంబు గట్టునపుడు
వహ్నిఁ దలఁపఁగఁ బగఱకు వచ్చుఁ జావు.

13


క.

గతికై ఫణి వసుధాసని, మతిఁ దలంచిన సగణ మయ్యె; మారుత [16]మధిదై
వత మండ్రు; సగణముఖ మగు, కృతి పగఱకు మగుడులేని కీ డొనరించున్.

14


క.

సాతేక్వ దనుడుఁ దగణము, జాతం బై శూన్య మగుడు, [17]జద లధిదైవం
బై తనరెఁ; దగణముఖకృతి, శ్రీతుం డగునృపుని నైన హీనుం జేయున్.

15


ఆ.

తనరఁ [18]బింగళుఁడు కదాస జనన్ జగ
ణము జనించెఁ, దదధినాథుఁ డినుఁడు;
తొలుతఁ [19]గృతిని జెప్పఁ దణఁగుచో నర్కుని
దలఁప నరికి రోగతతులు వొడము.

16


క.

ఖగపతి కింవద భన నది, భగణం; బుడురాజు తదధిపతి; భగణాద్యం
బుగను గృతి చెప్పునప్పుడు, మృగాంకుఁ దలపంగ నగు సమీహితకాంతుల్.

17


క.

[20]సహస నని పలుక నగణం, బహుతం బగుఁ, దదధిదైవ మగుఁ బ్రాణుఁడు; త
ద్విహిరస్మృతి నాయువు గడు, నిహితం బగు నగణముఖవినిర్మాణములన్.

18


క.

గురులఘువులు గలములు; లఘు
[21]గురులు గురులఘువులు నెన్ని కొన వ హము లగున్;
గురులఘువులు త్రితయము లై
మురిసిన నవి మగణ నగణములు నాఁ బరఁగున్.

19


ఆ.

మగణరచన కాదిమధ్యాంతలఘువులు
గలిగె నేని య ర త గణము లయ్యె;
నగణరచన మొదల నడుమను గడ గురు
వుండెనేని భ జ స లొప్పు మిగులు.

20


క.

[22]లోవంక వ్రాయ గురు వగు; [23]నేవంకయు లేనివ్రాత [24]యెసఁగును లఘు వై;
[25]జైవాతృకరేఖాయుత, భావజశరనిభము లండ్రు ప్రాజ్ఞులు మఱియున్.

21


క.

గురువు లగు నొంటిసున్నల, నిరుసున్నల జమిలివ్రాల నెడమల నూఁదన్
బొరసినవియు దీర్ఘములు, ని, తరములు లఘువులు గణములు తత్త్రితయంబుల్.

22


క.

ఇందుఁడు గాంతి [26]వపుః ప్రభఁ, గందర్పుఁడు సప్తసప్తి ఘనరుచి ననఁ, జె
న్నందినయవి గురువులు చె, న్నొందిన నిడుపులును నట్ల యున్నవి లఘువుల్.

23

క.

[27]కృతికౢపులును తృపిదృపులును, పితృభృతులును [28]నిలుచు పదముపిఱుఁదన లఘువుల్
[29]కృతిలో నగణములును దీ, ర్ఘత నొందినయేని [30]రెట్టి గాఁ దగు నెఱుఁగన్.

24


మ.

కమనీయంబగు గద్యపద్యమయమై కావ్యంబు; గద్యంబు నా
నమరుం బాదనియంత్రణానియమవిన్యస్తప్రశస్తార్థ మై,
రమణీయాంఘ్రిచతుష్టయస్ఫుటవళిప్రాసాభిరామంబు ప
ద్యము; తత్పద్యము వృత్త జాతు లన రెండై పర్వుఁ [31]గావ్యంబునన్.

25


క.

వృత్తం బనఁ జతురంఘ్రి సు, వృత్తం బై వళుల వ్రాల [32]వెలయును; మాత్రా
యత్తగణంబులచేతఁ బ్ర, వృత్తాకృతిఁ బరఁగు జాతివితతులు కృతులన్.

26


తే.

విరతి విశ్రామ విశ్రాంతి విరమ విరమ
ణాభిధాన విరాదుమము లనెడిపేళ్లు
యతికిఁ బర్యాయపదము లై యమరుఁ గృతిని;
[33]యుక్తి పదములఁ గృతియందు నునుపవలయు.

27


క.

కరి గిరి [34]పుర నిధి శశి ది, క్పరిసంఖ్యానంబు గణితపరిభాషలచే
నరసి యతి నిలుపుచోటులు, పరికింపఁగవలయుఁ [35]గావ్యబంధన వెలయన్.

28

వళిప్రాసములు

క.

పాదప్రథమాక్షర ము, త్పాదిత మగు వళి యనంగఁ; బ్రాసం బనఁగాఁ
బాదద్వితీయవర్ణము; పాదచతుష్కమున కివియ ప్రాణము లెపుడున్.

29

వళిభేదములు

క.

స్వరజలు వర్గజ లితరే, తరవర్గజ లనఁగ నేకతరజ లనంగాఁ
బరపారు వళ్లు నాలుగు; వరుసఁ దెనుంగునకు వాని వలయుం దెలియన్.

30


క.

కోరి యకారము మొద లౌ, కారము తుద యైన యచ్చుగమి పండ్రెండున్
వారక యొండొంటికీ నిం, పారఁగ వళ్లయ్యె నాల్గు నైదురును మూఁడున్.

31

అజ్విరమము

క.

ఆ ఐ ఔ లత్వమునకు, నీ ఏలును ఋద్వయంబు నిత్వమునకుఁ దా
మూ ఓ లుత్వమునకు వళు, లా[36]యచ్చుల దొరసి యుండ హల్లుల కెల్లన్.

32

అకారవళి నిరూపణము

తే.

అవని ధర్మజుఁబోలు [37]నిత్యార్యచర్య,
నాదిరాజుల దొరయు నిత్యైంద్రభూతి,
[38]నరులఁ బ్రహరించు బాహుదండౌగ్ర్యమునను,
విధుకులాగ్రణి చాళుక్యవిశ్వవిభుఁడు.

33

ఇకారవళి నిరూపణము

ఆ.

ఇనజుఁ డీగి, భారతీశుండు చతురత,
నేకవీరుఁ డాజి ఋజుతయందు,
[39]ౠజరిపుఁడు సిరి, నహీనుండు భూవహ
నమున [40]విశ్వమనుజనాథవిభుఁడు.

34

ఉకారవళి నిరూపణము

క.

ధరణీవరాహలాంఛితుఁ, డురరీకృతసకలవిద్యుఁ డూరీకృతసం
గరజయుఁడు విశ్వభూవరుఁ, [41]డురుకీర్తుల నెగడు [42]నా బిడౌజోనిభుఁ డై.

35[43]

వర్గవళి నిరూపణము

క.

[44]తుది నున్న ఙ ఞ ణ న మ ములు, వదలిన యా [45]క చ ట త పల వర్గాక్షరముల్
[46]వొదిఁ దనవంగడములలో, నదికిన నవ్వళులు వర్గజాఖ్యము లరయన్.

36


సీ.

కమనీయరాజశిఖామణి కరిరాజగగ్వమహీధ్రనిర్ఘాతమునకు
[47]చతురయశస్సితచ్ఛత్త్రి [48]కాయోధనజయదాశ్వభంజళీఝంపునకును
టంకితరాయకఠారిసాళువునకు డంభలాంఛిన[49]కోలఢాలునకును
తత్త్వపురాణకథారసవేదికి దానదయాధర్మధామమతికి


తే.

పశుపతిప్రాప్తసామ్రాజ్యఫలున కబ్జ
బంధుబంధుర[50]తేజోవిభాసునకును
విశ్వవిభునకు సరి లేరు విశ్వజగతి
ననిన నివి వర్గవళ్లకు నచ్చు గృతుల.

37

కాదివర్గమునకు గుణితస్వరవళి నిరూపణము

క.

కా కై కౌ లట కత్వము, కీ కేలు [51]కృ కౄలు నట్లె, కిత్వము వళులై,
కూ కోలు [52]కుత్వమునకును, జేకొను [53]దత్కాదిళాంత[54]సిద్ధార్ణతతిన్.

38

ఇతరేతరవర్గజవళి నిరూపణము

క.

ఇతరేతరవర్గజవళి, తతికిఁ జవర్గువును శ ష స దగు నొకగమి యై;
కృతులకు న హయ లు నేక, స్థితి [55]నొకవంగళము; [56]న ణ లుఁ జెలఁగు నొకటియై.

39


చ.

చతురచళుక్యవిశ్వవిభుశాసన మెక్కినరాజమౌళు ల
చ్ఛత మకుటోజ్జ్వలస్రగనుషక్తము లై విలసిల్లు నెందు; నీ
జతనము నీతిమంతులకు సాగిన నేమి కొఱంత? సంతతో
జ్ఝిత[57]మదబుద్ధులుం గుశలసిద్ధులు [58]పొందుట లెల్లఁ బోలవే.

40


ఆ.

[59]చతురుపాయబహుశక్తిక్షమావళిఁ
బాఱ విడిచి చిత్రభానుసాక్షిఁ

బాఱె సర్వసిద్ధిపద మేది ధరణీవ
రాహమునకు నోడి రాచకదుపు.

41


చ.

[60]అమమత కాస్పదంబు, వినయంబునకుం గుదు, రుబ్బులేనినె
య్యమునకు నాలవాలము, మహాగుణపంక్తికి జన్మభూమి, దా
నమునకు [61]నాదరం, బరిరణక్రియ కుగ్రనికేతనంబు, నా
నమరుఁ జళుక్యవిశ్వమనుజాధిపుచిత్త [62]మమత్తవృత్తియై.

42

ఏకతరవళి నిరూపణము

క.

[63]మ ర వ ల ఱ లేకతరవళు, లరయఁగఁ దమతమక కవులయనుమతి వళులై
పరఁగుఁ, బదాంతముకారము, [64]పొరిఁబొందిన పు ఫు బు భు ము లు పొసఁగినచోటన్.

43


ఆ.

మధురవచనుఁ డార్యమాననీయాగ్రణి
[65]రసికవరుఁడు రాజరాజనిభుఁడు
[66]వరుస యెఱిఁగి సుకవివరులకు నిచ్చిన
లచ్చి విశ్వవిభునిలాగు మెచ్చు.

44


ఆ.

అజ్జు లాని యీగి ఱావడి సభలోన
ఱేసి పోరి లోప ఱిచ్చఁ బొఱసి
ఱెన్న మడుగుపుడమిఱేండ్ర నేల నుతింప
మనకు విశ్వనాథుఁ డొనరియుండ.

45

ముకారవళి నిరూపణము

తే.

పుడమి విశ్వవిభునిభుజమునకుఁ దొడవు
ఫుల్లపద్మాలయవితీర్ణమునకు బోటి
బుధులు విద్యావివేచనమునకు సాక్షి
భువనములు కీర్తికి నివాసములు దలంప.

46

ప్రాదివళి నిరూపణము

క.

ప్ర ప రాప స మను సు ప్ర, త్యపి ని ర్దు రధి న్యు పా భ్యు దాఙ్వ్య త్యవ ప
ర్యుపసర్గవింశతికి వళు, లు పరస్పరవర్ణయుక్తి నుభయముఁ జెల్లున్.

47
ప్ర - పరా - అప - సమ్ - అను - ను - ప్రతి - అపి - నిర్ - దుర్ - అధి - ని - ఉప - అభి - ఉత్ - అఙ్ - వి- అతి - అవ - పరి: — ఇవి యిరువదియు నుపసర్గలు; ఇందు అప్యాజ్ అను నిరూపణ మప్రసిద్ధము.
శా.

ప్రారంభించు నశేషధర్మముల సంపాదించు సత్కీర్తులన్,
బ్రారబ్ధంబులు నిర్వహించు ఫలపర్యంతంబుగా నెప్పుడున్,
బ్రారబ్ధప్రతిలబ్ధసంపదలచే రాగిల్లు నుల్లాసి యై
యీ రా జంచు నుతింతు రార్యు లిల విశ్వేశావనీవల్లభున్.

48

తే.

రిపుల విశసించుచోటఁ బరేతనాథుఁ
డుర్వి రక్షించుచోటఁ బరోఢభుజుఁడు
బహుధనావాప్తిచో ననపాయబుద్ధి
యంతరరులకు నీ రా జపాయకరుఁడు.

49


చ.

స్మయరహితంబు వైభవసమాగమ, మాహవధుర్యశౌర్య మ
వ్యయము, జయంబు విస్మయసమగ్రము, పాదవినమ్రశాత్రవా
న్వయపరిరక్షణం బభినవంబు, నయోచితశాస్త్రవాచకా
న్వయనిపుణంబు చిత్త, మనయంబును విశ్వనరేంద్రభర్తకున్.

50


తే.

స్వర్ణగిరిచాపుఁ డర్చింప వలయువేల్పు
స్వంత మగుమంత్ర మాప్తపంచాక్షరంబు,
తథ్యమగుధర్మ మెపుడు ప్రత్యక్షకృత్య,
మాత్మ విశ్వేశ్వరునకుఁ బ్రత్యహముఁ దగిలి.

51


సీ.

రసభావశీలి నిరంతరశ్రుతిశాలి యర్థావబోధనిరర్గళుండు
రాజన్యజన్యదురంతవిక్రముఁడు దురవగాహవిద్యావిహారభూమి
దానార్హసంపదధ్యావాస మాయుధాయతవేదశశ్వదధ్యయనవేది
న్యాయతర్కాదినానాశాస్త్రకుతుకి విన్యస్తపూతార్థమహాశయుండు.

52


ఆ.

ప్రచురఫలితచతురుపాయాభిరాముఁ డు
పేంద్రభూపతనయుఁ డింద్రనిభుఁడు
భీమబలుఁడు జగదభీహితశోభనా
భ్యర్థి విశ్వనాథుఁ డవనివిభుఁడు.

53


క.

చంచలత లేక దానో, దంచితుఁ డగువిశ్వనాథధరణీశ్వరుచే
మించినసుకవీశ్వరుల దృ, గంచలముల మలయు సిరు లుదగ్రప్రీతిన్.

54


చ.

వ్యపగతదోషుఁ డవ్యసనవర్గుఁ డుదంచితమంత్రపంచక
వ్యపగతశత్రుమండలుఁ డయాన్వితుఁ డూర్చితవైరిభూవర
ద్విపవరమత్తకేసరి యతీంద్రియఖేలనుఁ డార్యచర్యుఁ డ
త్యుపచికశౌర్యశాలి సుగుణోన్నతి విశ్వనరేంద్రుఁ డెప్పుడున్.

55


తే.

విశ్వవిశ్వంభరాసమావేక్షణమున
నడరు నీహితబహుఫలావాప్తు లెల్లఁ
బ్రణతు లొనరింతు రఖిలపర్యంతనృపులు
నర్ది విశ్వేశ్వరునకుఁ బర్యాయగతుల.

56

సబిందువర్గవళి నిరూపణము

తే.

ట త ప వర్గాక్షరములకు డాపలించి
యొనర నూఁదిన బిందువు లుండెనేని

వరుస ణ న మ లు వళు లగు వాని కెల్ల
నవనిఁ గొందఱు సుకవులయనుమతమున.

57


చ.

కినుకఁ జళుక్యవిశ్వనృపకేసరి ఱేసినచోఁ గృపాణదం
డనమునఁ గల్గుఁ బో సురగణత్వము తత్పదవారిజాతవం
దనమునఁ గల్గుఁ బో మనుజనాథతతద్భటదర్శనావలం
బనమునఁ గల్గుఁ బో గహనమధ్యనివాసము వైరకోటికిన్.

58

ద్వ్యక్షర త్ర్యక్షర ప్లుతాక్షర వళి నిరూపణము

ఆ.

మొదలివ్రాఁత రెండు మూడు నక్కరములఁ
గూడెనేని యదియ కూర్చు వళుల,
నంత్యవర్ణము నిడుపయి తర్కభేదద?
యార్థ మయిన వచ్చు హల్లు వళులు?

59


క.

ప్రియకరుఁడు సర్వలోకా, శ్రయబిరుదోదగ్రుఁ డుగ్రజనవరసేనా
జయలక్ష్మీసుఖకరసం, శ్రయఁ డీచాళుక్యవిశ్వరాజేంద్రుఁ డిలన్.

60


తే.

ధర్మములు నిత్యసత్యకృద్వ్యాప్తు లెపుడు,
వర్జ్యములు చిత్తమున కసద్వ్యసనచయము,
లర్హములు వర్ణవిభ్రమద్వ్యక్తివిధులు
పతికి ననుటయు విశ్వభూపతికి నమరు.

61


క.

త్రాసమతి విమతు లడుగులు, డాసిన నీసోమవంశ్యుఁ డారక్షింపం
డీ సుడిగి యుచితగతి వి, న్యాసంబునఁ గొలువవలువదా విశ్వేశున్.

62


మ.

కమలోత్పత్తినిమిత్తముం గువలయాకాంక్ష్యాతపజ్జీవనీ
యము నై నంతన నభ్రవిభ్రమము నేలా సర్వలోకాశ్రయ
క్షమతం బేర్చు చళుక్యవిశ్వవిభు శశ్వద్దానధారాజ లౌ
ఘములో సాటికిఁ బాటి సేసెదవు క్రిక్కా చక్కఁ దర్కింపుమా.

63

ఆదేశవళి నిరూపణము

క.

ద్వీపమునకు నాకమునకు, నాపై శాస్త్రోక్తి నచ్చు లాదేశ సమా
సాపత్తి గలుగుటయు వళు, లాపాదింపుదురు కొంద ఱచ్చును హల్లున్.

64


ఉ.

ద్వీపులఁ ద్రుంచు విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటయున్ బ్రసన్నయై
గోపతిధేను వవ్విభునకుం దనవైభవ మిచ్చెఁ గాక యే
భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్రసిద్ధి వహించి రుర్వరన్.

65


క.

నీకరవాలము పాలై, నాకంబున కరిగి రాజనారాయణ యా
భూకాంతు లెట్టిచన వో, నాక విటోత్తములఁ దూల నడుతురు లీలన్.

66

క.

విను మన్యోన్యపదంబున, కొనరింతురు కవులు గొంద ఱో నో లాయుం
దనుబోనియచ్చు కలుగుటఁ, జొనుపుదు రాయచ్చు వళియు సుకవులు కృతులన్.

67


ఉ.

ధన్యుఁడు విశ్వభూవిభుఁడు ధారుణి యేలఁగ భూజనంబు [67]
న్యోన్యహితత్వసంపదల నొందిరి, దంపుడు లింపు నింప న
న్యోన్య[68]సుఖానుకూలతల నోమిరి విప్రులు వేల్పుఁబిండు న
న్యోన్యసుపుష్టితుష్టికుశలాదులఁ జెందిరి నాఁడునాఁటికిన్.

68

దేశీయవళి నిరూపణము

చ.

[69]కఱకరి కల్లడంబు కడుఁ గట్టిఁడి దెమ్మెర [70]లోలమాస గ్ర
చ్చఱ యెసలారు లుల్లుఱుకు [71]లాడెడి వీఱిఁడి రజ్జలాఁడు గ్రి
క్కిఱియఁట నాఁ దెనుంగునకు నీయుభయంబు వళిప్రకార మై
మెఱయఁ గవిప్రయోగమున మేల మెఱింగి రచింప నేర్చినన్.

69


క.

చెన్నక్కకుఁ జెన్నక [72]మా, చన్నన మాచన యనంగ నచ్చట వళి యై
చెన్నగు నకార మార్యుల, మన్నన హల్లేని గలుగు మఱియొక్కొకచోన్.

70


క.

కడలాలుం జవరాలును, జడుఁ డొక్కం డొకఁ డనంగఁ జను[73]నుడువుల న
చ్చిడుటయె తగు వడి హల్లును, వడి సేయుదు రండ్రు కవులు వలసినచోటన్.

71


క.

ఏకైకము సోదర నా, కౌకులు ననుశబ్దములకు నొగి నేత్వోత్వా
నీకము వళు లగుఁ గొందఱు, గైకొందురు వృద్ధివళులు [74]కవు లొడఁబడికన్.

72

షడ్విధప్రాసములు

క.

భాసురము లగుచు సుకర, ప్రా సానుప్రాస దుష్కరప్రా సాంత్య
ప్రాస ద్వంద్వ త్రితయ, ప్రాసము లన షడ్విధములు పరఁగుం గృతులన్.

73

సుకరప్రాసము

క.

సుకుమారము శ్రుతిసుఖదము, నకలంకము నైనవర్గ మాద్యక్షరసృ
ష్టికి రెండవవ్రాయి సుమీ, సుకరప్రాసం బనంగ సులభము కృతులన్.

74


క.

అరవిందహితుఁడు దీధితి, నరవిందోచరుఁడు విద్విడపహరణముచో
[75]నరవిందభవుఁడు చతురత, ధర ధరణివరాహ విశ్వధరణిపుఁ డెపుడున్.

75

అనుప్రాసము

క.

[76]ఇడునెడఁ బ్రాసాక్షరములు, బడి తప్పక పాద[77]పదవిభాగములఁ గడున్
బెడఁగైన ననుప్రాసం, బడరుం [78]గబ్బముల నెల్ల నమరినతొడవై.

76


క.

రుంద్రములు సాంద్రములు [79]ని, స్తంద్రములును గుణము లెపుడు ధర సత్యహరి
శ్చంద్రునకుఁ జంద్రవంశ్యున, కింద్రోర్జితమహిమునకు నుపేంద్రసుతునకున్.

77

దుష్కరప్రాసము

క.

పరువడిఁ బాదాదుల ను, చ్చరణాసహ్యాక్షరముల సమకూర్చిన దు
ష్కర మనియెడుప్రాసం బహు, సరసాలంకార మనుచుఁ జను సత్కృతులన్.

78


క.

నుర్గయి విశ్వేశ్వరుదో, రర్గళహతిఁ జన్నరిపు లన వినుతింపన్
స్వర్గవధూకుచకుంభవి, నిర్గళదంబువులచేత [80]నిర్మలు లగుటన్.

79

అంత్యప్రాసము

క.

మొదలిచరణంబుకడ శుభ, పద మయ్యెడివ్రాయి [81]యన్నిపాదంబులకున్
దుదనుండి మండనం బ, నది యంత్యప్రాస మనఁగ నమరుం గృతులన్.

80


క.

భూజనహితనయశీలున్, బూజింతురు నృపులు విశ్వభూమీపాలున్
రాజితకీర్తివిశాలున్, రాజేంద్రచ్ఛత్రచామరశ్రీలోలున్.

81

ద్వంద్వత్రిప్రాసము

క.

క్రమమునఁ బాదాదులయం, దమలము లై రెండు మూఁడు నక్కరములు చె
న్నమరిన ద్వంద్వత్రిప్రా, సము లనఁగాఁ బరఁగు వానిఁ జనుఁ దెలియంగన్.

82


క.

[82]దానంబు వివిధకుశలని, దానంబు విరోధిరాజదత్తధనచయా
దానంబు గవులసొ మ్ముప, దానం బిత్తెఱఁగు విశ్వధరణీపతికిన్.

83


క.

[83]శీలనమును దన్నవపరి, లాలనము నశేషశాస్త్రలాలితవిద్యా
ఖేలనము ధర్మధరణీ, పాలనమును విశ్వధరణిపాలున కొనరున్.

84

ల ళ డ ఋక్రాంతప్రాసములు

క.

వలసినచో లళములు డల, ములు మఱి ఋక్రాంతవర్ణములు ప్రాసము లై
యలవడు సత్కవికృతులన్, నిలుపందగు వానిఁ దెలిసి నియతప్రీతిన్.

85


క.

[84]తాళము దాలము నాఁజనుఁ, జోళుఁడు చోడుండు నాఁగ సొం పగు నుగ్ర
వ్యాళ వ్యాడ వ్యాలము, లోలిన సమరూఢి [85]బ్రాసయుక్తిం జెల్లున్.

86


తే.

భీకరాకారుఁ డయ్యు నంగీకృతుండు
[86]మేదురక్రోధుఁ డయ్యు ననాదృతుండు
పావనాత్మకుఁ డయ్యు బలావృతుండు
నాఁగఁ బ్రాసంబులకు సమానంబు లెపుడు.

87

వృత్తములు

క.

ఇది ప్రాస[87]లక్షణం బిఁక, విదితంబుగఁ బింగళాహివిరచిత మగుచున్
బొదలెడు ఛందోగణసం, పద యగు వృత్తప్రపంచపద మెఱుఁగఁ దగున్.

88

క.

ఆదట నక్షరగణనో, త్పాదితగణసంప్రవృత్తితంత్రముచేఁ [88]గా
కోదరుఁడు గరుడునిం బ్ర, చ్ఛాదించుట ఛంద మనఁగ [89]జగతిం బరఁగున్.

89


క.

[90]ఇది లౌకికవైదికవా, క్పద మై పడ్వింశతి ప్రపంచాత్మక మై
మై షడ్వింశతిప్రపంచాత్మక మై
పొదలుం దెలియఁగవలయును, ముదమున నభిధానరూపముల చందంబుల్.

90


వ.

ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు,
బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిజగతి, శక్వరి అతిశక్వరి, అష్టి, అత్యష్టి,
ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అతికృతి, ఉత్కృతి,
అనం బ్రవర్తిల్లు; నందు నుక్తాదిచ్ఛందంబు లొక్కయక్షరంబునుండి యొండొంటికొ
క్కొక్క యక్షరంబుగా షడ్వింశాక్షరపర్యంతంబుఁ బెరుఁగు. అందు నుక్తాచ్ఛం
దంబునఁ బ్రతిపాదంబున కేకాక్షరం బై శ్రీ యను వృత్తం బయ్యె;
                 శ్రీ-శ్రీ-జే-యున్

91

అత్యుక్తాచ్ఛందఃపాదంబు ద్వ్యక్షరం బందు స్త్రీ యను వృత్తం బయ్యె :

                 స్త్రీరూ-పారు-గారూ-పారున్.

మధ్యాచ్ఛందంబు త్ర్యక్షరంబై నారీవృత్తంబునకు జనకం బయ్యె :

నారీవృ- త్తారంభంబారు న్మా- కారం బై,

ప్రతిష్ఠాచ్ఛందఃపాదంబు చతురక్షరం బై

కన్యావృత్తము

పొత్తై మాగా-వృత్తిం గన్యా-వృత్తం బయ్యెన్-జిత్తం బారన్

సుకాంతివృత్తము (జగ.)

జగంబులదం-గున్ సుకాం-తి గల్పిక-ప్రగల్భతన్.

సుప్రతిష్ఠాచ్ఛందఃపాదంబు పంచాక్షరం బై

సుందరీవృత్తము (భగగ.)

సుందరి యొప్పుం-జెంది భగా నిం-పొంద నియుక్తిన్-గందుకలీలన్.

ప్రగుణవృత్తము (సగగ.)

సగణాసక్తిం-గగసంయుక్తిన్-బ్రగుణాఖ్యం బై-తగు నింపారన్.

అంబుజవృత్తము (భవ.)

ఇంబగు భకా-రంబును వకా-రంబును జుమీ యంబుజ మగున్.

విచ్ఛందోధికారము

క.

ఇం దుండియుఁ గరణీయ, చ్ఛందోవృత్తముల నర్థసంజ్ఞితములుగా
నొందింతు గ్రంథవిస్తృతి, క్రందునకుం గాక యర్థగౌరవ మొప్పన్.

93

గాయత్రీచ్ఛందఃపాదంబు షడక్షరం బై

విచిత్రవృత్తము (యయ.)

విచిత్రంబునందున్- రుచించున్ యయంబుల్.

తనుమధ్యావృత్తము త్రయ.)

ఒప్పున్ తయ యుస్తం- జెప్పం దనుమధ్యన్.

సురలత (సయ)

సురలతఁ జెప్పన్ - సొరది నయంబుల్.

ఉష్ణిక్ ఛందఃపాదంబు సప్తాక్షరంబై

విభూతివృత్తము (రజగ.)

స్వస్థ సద్విభూతి దా-రస్థ జస్థగంబునన్.

మదనవిలసితము (ననగ.)

మదనవిలసిత- ప్రదములు ననగల్.

కుమారలలిత (జనగ.)

కుమార లలితకున్-సమగ్రజనగముల్.

అనుష్టుప్ఛందఃపాదం బష్టాక్షరం బై

విద్యున్మాల యనువృత్తము (మమగగ.)

శ్రీలీలన్ రాజిల్లు విద్యున్మాలాఖ్యం బై మాగాసక్తిన్.

చిత్రపదము (భభగగ.)

చిత్రపదం బన భాగా-చిత్రయతిప్రతిపత్తిన్.

ప్రమాణి (జరవ.)

జకారముఁ రకారము-వకారముం బ్రమాణికిన్.

సమాని (రజప.)

ఈసమానికిన్ రజన-వ్యాస మొప్పగుం గృతులన్.

సింహరేఖ(రజగగ.)

ఈరజాగ్రగా నియుక్తిన్-గోరి సింహరేఖ యొప్పున్.

బృహతీచ్ఛందఃపాదంబు నవాక్షరం బై

భుజగశిశురుతమనువృత్తము (ననయ.)

భుజగశిశురుత మయ్యెన్-ఋజు ననయ ముల చేతన్

హలముఖి (రసస.)

కామికక్రియ హలముఖీ - నామ మొప్పు రననలచేన్.

భద్రకము (రవర.)

భద్రకంబు రనగంబులన్ - భద్ర విశ్వనృపమన్మథా.

ఉత్సుకము (భభర.)

ఉత్సుక మౌ భభరంబులన్-మత్సరి మాన విమర్దనా.

—————

క.

ఇట నిం దీవల విశ్రమ, ఘటనలు కల్పింప వలయుఁ గబ్బంబుల నె
చ్చట నిలుపంగాఁ నగు న, చ్చటఁ దగఁ బరికించి నిలుప శాస్త్రప్రౌఢిన్.

94

పంక్తిచ్ఛందఃపాదంబు దశాక్షరం బై

రుగ్మవతి యనువృత్తము (భమసగ, 6.)

రుగ్మవతిం జేరున్ భమసంబుల్- తిగ్మరుచిద్యుద్దీప్తగయుక్తిన్.

మయూరసారి (రజరగ, 7.)

పర్వు నీరజంబుపై రగంబుల్-సర్వదా మయూరసారిఁ జెప్పన్.

మత్త(మభసగ, 7.)

శైలక్రాంతిన్ మభసగలోలిం -గ్రాలన్ మత్తాఖ్యను గనుపట్టున్.

శుద్ధవిరాట (మసజగ, 6.)

సక్తం బై మసజస్థగ ప్రథా-రక్తిన్ శుద్ధవిరాట నాఁజనున్.

ప్రణవము (మనయగ, 6.)

అందం బై మనయగముల్ సొంపిం-పం దప్పొందిక పణవం బయ్యెన్.

త్రిష్టుప్ఛందఃపాదం బేకాదశాక్షరం బై

శాలినీవృత్తము (మతతగగ, 6.)

రాకాధీశాకార రాజన్మ తా గా- నీకప్రాప్తిన్ శాలినీవృత్త మయ్యెన్.

ఇంద్రవజ్రము (తతజగగ, 8.)

ఈతాజిగానిర్మితి నింద్రవజ్రా - నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్.

ఉపేంద్రవజ్రము(జతజగగ, 8.)

ఉపేంద్రవజ్రాహ్వయ మొప్పు నిం పై యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్

ఉపజాతి

ఈయింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర-శ్రయంబు గాఁగా నుపజాతి యయ్యెన్.

తోదకముఁ (భభభగగ, 7.)

కామితఛత్రయగాయుత మైవి- శ్రామపుఁదోదకసంజ్ఞతఁ జెందున్.

రథోద్ధతము (రసరలగ,7.)

రక్తిఁ బేర్చి రనరంబుపై లగం-బుక్త మైనను రధోద్ధతం బగున్.

చంద్రిక (ననరవ, 7.)

సలలితముఁ జెంద్రికాహ్వయం-బలరు ననర వాంక మై కృతిన్.

స్వాగతము (రసభగగ,7)

స్వాగతంబు రనభంబు గ గార్తన్ - సాగువిశ్వనృపచంద్రకులాఢ్యా.

శ్యేని (రవరవ, 7.)

శ్యేనికై రవంబు చెప్పి పైరవం బూనఁ జేయు టెల్ల నొప్పు నెప్పుడున్.

వాతోర్మి (మభతలగ, 7.)

తద్వాతోర్మిన్ మభ తంబుల్ లగమున్ - సద్విశ్రామస్థితి సంధిల్లుఁ దగన్.

జగతీఛందఃపాదంబు ద్వాదశాక్షరం బై

భుజంగప్రయాతవృత్తము (యయయయ, 8.)

భుజంగప్రయాతంబు పొం దారు నందం
బజస్రంబుగా నయ్యయామంబు లొందన్.

తోటకము (సససస, 9.)

సరసం బయి సానససంభృత మై విరచించినఁ దోటకవృత్త మగున్.

వంశస్థము (జతజర, 8)

జలంబులం జెంది నజంబు రేఫయున్ - సుతింప వంశస్థ మనుక్రమక్రియన్.

ఇంద్రవంశము (తతజర, 8.)

ఈతాజిరాకల్పన నింద్రవంశకా-ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా.

తోదకము (పజజయ, 8)

సలలిత మైననజాయగణంబుల్ - విలసితతోదకవృత్తముఁ జెప్పన్.

ద్రుతవిలంబితము (సభభర, 7.)

ద్రుతవిలంబితరూపితవృత్తిచేన్ - బ్రతతమయ్యె నభారగణంబులన్.

స్రగ్విణి (రరరర,7.)

స్ఫారితం బై యకూపారరశ్రేణితో-సార మై స్రగ్విణీచారువృత్తం బగున్.

జలధరమాల (మభసమ, 9.)

మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం - బ్రద్యోతించున్ మభసమభద్రవ్యాప్తిన్.

ప్రమితాక్షరము (సజసస, 9.)

అమలక్రియాప్తిఁ బ్రమితాక్షర మై-యమరున్ సయస్థససయంత్రిత మై.

విశ్వదేవి (మముయయ, 8)

మాయావర్ణం బొప్పం గ్రమన్యాసవృత్తిన్
జేయున్ భూభృద్విశ్రాంతిచే విశ్వదేవిన్


క.

అకలంకయతిచ్చందో, ధికార మిది దీని నెఱిఁగి తెలియఁగ వలయున్,
బ్రకటింతు విపులవృత్త, ప్రకరము బ్రస్తారసరణిరచనీయంబున్.


శా.

ఛందశ్శాస్త్రవివక్ష సత్కృతిపరిష్కార క్రియాదక్ష స్వ
చ్ఛందక్రీడదురుప్రతాప కరుణాసంపన్నసల్లాప ని
ష్ష్పందానందితసాధులోక భువనప్రఖ్యాతసుశ్లోక స
ద్వందారుక్షితిపాల పాలన కళాధౌరేయ ధైర్యోజ్జ్వలా.


రాజేంద్రచరిత్రద్వయ, రాజద్విజ యేందింభిరా మైశ్వర్యా
రాజాన్వవాయవర్యా, రాజీవకంబసూర్య రసికాచార్యా.


మాలిని.

రభసరణ విశంకా రాజనారాయణాంకా
సభయరిపుశరణ్యా శశ్వదాసన్నపుణ్యా
సభికహితపదార్థా సర్వలోకాశ్రయార్థా
విభవవిబుధనాథా వీరలక్ష్మీసనాథా.

గద్యము
ఇతి శ్రీమదుమారమణచరణారవిందవందన గోవిందామాత్యనందన
వివిధబుధవిధేయ విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన
కావ్యాలంకారచూడామణి యను నలంకారశాస్త్రంబు
నందు ఛందో గణ వళి ప్రాస ఛందోధి
కార లక్షణ సముద్దేశం బన్నది
సప్తమోల్లాసము.

—————

  1. క.గ.చ. కోవిదునకునై యశేష
  2. క. విద్యానందము
  3. క.గ.చ. వాచికాభినయము
  4. క.చ. ప్రియయిది యేటిది, గ. ప్రియయిడియంటిది
  5. క.గ.చ.గిరిజాత్మాకృతులు
  6. క.గ.చ. గరుడునికై
  7. క.గ.చ. అవి యెయ్యవి యంటేని
  8. చ. సవాసజ్
  9. గ.చ. నహసన్
  10. క.గ.చ. తిర్యగుచిత
  11. క.గ.చ. వాక్యాంతంబునఁ బొల్లవ్రాలై
  12. క.గ.చ. నగణంబులనఁ గ్రమంబున
  13. క.గ.చ. చెప్పు పనితను
  14. క.గ.చ. తగులించున్
  15. క.గ.చ. భ్రమశికాగుహా
  16. క.గ.చ. అధిదైవత మయ్యె
  17. క.చ. జలనిధి దైవంబు
  18. గ.చ. పింగళుఁడు సదాసజ్ నాన్
  19. క.గ.చ. కృతికిఁ జెప్ప
  20. క.గ.చ. నహస నని పలుక
  21. క.గ.చ. గురుగురులఘువులును నెన్ని
  22. క.గ.చ. లోవంక వ్రాయి
  23. క.గ.చ. ఏవంకయు లేని వ్రాయి
  24. క. ఎసఁగు లఘువునై
  25. క.గ.చ. జైవాతృకరేఖాయత
  26. గ.చ. వపుః ప్రథ
  27. క. కృతికృతుల వితృపువిదృపుల, గ.చ. కృతకృప్తుల విదృపులం
  28. క.గ.చ. నిలిచి పదముపిఱుఁద
  29. క.గ.చ. కృతిలో గగణములను
  30. క. రెట్టిగా నెన్నఁదగున్
  31. క.గ.చ. కావ్యంబులన్
  32. గ.చ. వెలయుసుమాత్రాయత్త
  33. క.గ.చ. యుక్తపదముల
  34. క.గ.చ. పురశరశశిది
  35. గ.చ. కావ్యబంధన వెలయున్
  36. క.గ.చ. అచ్చులఁ దొఱఁగియుండు
  37. గ. సత్యార్యచర్య
  38. చ. నరులఁ బ్రహసించు
  39. క. ఋక్షవిభుఁడు
  40. క.గ.చ. విశ్వమనుజనాథుఁ డెపుడు
  41. గ.చ. ఉరుకీర్తుల వెలయు
  42. క.గ. ఆబిడౌజనిభుండై
  43. విచారించేది పద్యాన గల సిద్ధి—
    క. తానంతబులను వరుస
       నౌనంచుంబలికె నియ్య(గాని) యచ్చేనియు హ
       ల్లేనియుఁ జెప్పమి పూర్వా
       నూనానుమతంబున వళు లుభయముఁ జెల్లున్.

    35వ పద్యముతరువాత నీపద్యము రెండుప్రతులలో నధికముగఁ గన్పట్టుచున్నది.

  44. క.గ.చ. తుదనున్న
  45. క. కచటతపలు వర్గాక్షరముల్
  46. క.గ.చ. పొది తమవంగడములలో
  47. క. చతురకీర్త్యతిసితచ్ఛవి, గ.చ. చతురకీర్తివిహితచ్ఛవికి
  48. క.గ.చ. ఆయోధనజయదాశ్వభంజరీ
  49. గ. కోలఠాలునకు
  50. క.గ.చ. తేజోవిభాసురునకు
  51. క. ఋఋల డాసి, గ.చ. ఋౠలఁ బాసి
  52. క.గ.చ. కుత్వమునకృతి
  53. క. తత్కాదిభాంత, గ. తత్కాదిఱాంత
  54. క. సిద్ధాంతతతిన్
  55. క.గ.చ. ఒకవంగడము
  56. క.గ.చ. నణలు చెలు వొక్కటియై
  57. క.గ.చ. మదబుద్ధులం
  58. క.గ.చ. పొందుటలెల్లఁబొల్లవే
  59. క. సమముపాయ, గ.చ. ససముపాయ
  60. క.గ.చ. అమమత కాశ్రయంబు
  61. క.గ.చ. నాకరం బతిరణక్రియ
  62. క.గ.చ. అమత్తవృత్తమై
  63. క. మరవఱల లేక, గ.చ. మరవఱలు లేక
  64. క.గ.చ. పొరినూదిన దూతిచనిన పుఫుబుభుములచోన్ 'లోన్ క.'
  65. చ. రసికవిభుఁడు
  66. క.గ.చ. వరుస యెఱుఁగు
  67. క.గ.చ. అన్యోన్యహితానుకూలతల నందిరి
  68. గ. హితానుకూలతల
  69. క.గ. కఱుకరికల్లడంబు
  70. గ.చ. లోలమాన
  71. చ. ఆడిరి వీఱిడి
  72. క.గ.చ. మాచన్నకు మాచన
  73. క.గ.చ. నుడువులకచ్చిడుట
  74. క.గ.చ. కవు లొడఁబడినన్
  75. క.గ.చ. అరవిందవిభుఁడు
  76. క.గ.చ. ఎడనెడఁ బ్రాసాక్షరములు
  77. క.గ.చ. పదవిభావముల
  78. క.గ.చ. కబ్బముల కెల్ల
  79. క.గ.చ. నతంద్రములును
  80. క. నిర్మల మగుటన్
  81. గ.చ. యెన్నిపాదంబులకున్
  82. క. దానం బనివిధ, గ.చ. దానంబు విబుధ
  83. క.చ. శీలంబు వినతనృపపరి, గ. శీలనము వినుతనృపతికిన్
  84. గ.చ. తాళము తాడము
  85. గ.చ. ప్రాసయుక్తము లయ్యెన్
  86. గ. మేదురక్రోధియయ్యు ఖలాదృతుండు
  87. క.గ.చ. లక్షణం బిల
  88. గ.చ. కాకోదరము
  89. క.గ.చ. జగతిం బరఁగెన్
  90. క.గ.చ. అది లౌకిక