కావ్యాలంకారచూడామణి/చతుర్థోల్లాసము

చతుర్థోల్లాసము

—————

క.

[1]శ్రీవిశ్వేశ్వరకరుణా, శ్రీవిలసితనిష్కళంకచిత్తుఁడు [2]కీర్తి
శ్రీవిశదచక్రవాళుఁడు, శ్రీవిశ్వేశ్వరనరేంద్రశేఖరుఁ డొప్పున్.

1


క.

ఇత్తెఱఁగున నష్టాదశ, వృత్తం బగు కావ్య మొప్ప [3]విరచింపఁ దగున్
మొత్త మగు నఖిలబలసం, పత్తియుఁ గలవేళ సుకవి ప్రతిభ దలిర్పన్.

2


క.

కృతిముఖమున [4]దేవనమ, స్కృతి యొండె నభీష్టవస్తుకీర్తన మొండెన్
[5]వితతాశీఃపద మొండెను, బ్రతిపాదింపంగవలయు భద్రాపేక్షన్.

3


మ.

[6]కవిసంసిద్ధపదంబు భావరసవిఖ్యాతంబు లోకోచిత
వ్యవహారంబు నుదాత్తనాయకము శ్రవ్యంబుం జతుర్వర్గసం
భవపద్మంబును నైనకావ్య మిల నాపద్మోద్భవస్థాయి యై
కవిసంస్ఫూర్తియు దాతృకీర్తియుఁ దగం గల్పించు నెల్లప్పుడున్.

4

కావ్యభేదములు

తే.

అట్టికావ్యంబు త్రివిధ మై, యతిశయిల్లు
నవనిఁ బద్యమయంబు [7]గద్యాత్మకంబు;
పద్యమయ మొప్పు ఛందోనిబద్ద మగుచు
గద్యమయ మొప్పు వాక్యసంకలిత మగుచు.

5


క.

ఆపద్యగద్యకృతములు, రూపకములు నాటకములు రూఢము లగు [8]నా
రూపమ చంపూకావ్యత, ప్రాపించును, నాటకములు బహుళము లరయన్.

6


తే.

సంబంధంబు కావ్యంబు సంస్కృతమునఁ,
బ్రాకృతంబున నాశ్వాసభాసురంబు,
నాటకము లెల్ల నంకసనాథకములు,
గద్య ముచ్ఛ్వాసలంబకాంకంబ యండ్రు.

7


క.

[9]ఇటువలెనె ముక్తకాది, స్ఫుటతరచాటుప్రబంధములలక్షణముల్
పటుమతి నెఱుఁగుట సుయశో, ఘటనంబుల కెల్లఁ గుదురు కవినృపతులకున్.

8

ముక్తకాదులు

సీ.

పరఁగు ముక్తక మేకపద్యంబు, పద్యద్వయంబు [10]ద్వికము నాఁగ నలరు, మూఁడు
పద్యముల్ త్రికము నా భాసిల్లుఁ, బంచపద్యంబులు పంచరత్నంబు లరయ,

గజమాల పద్యాష్టకము, పద్యనవకంబు నవరత్నమాలిక, నలినమిత్ర
మాలిక పండ్రెండు మధురపద్యము, లిందుకళ షోడశశ్లోకకలిత యైన,


తే.

సప్తవింశతి యైన నక్షత్రమాల,
తెలియ ముప్పది పద్యముల్ [11]త్రింశదాఖ్య,
మవలఁ బంచాశదాహ్వయం బైదుపదులు,
శతక మన నొప్పు మఱి పద్యశతము గూడ.

9


క.

అష్టోత్తరశతపద్యము, లష్టోత్తరశతక మనఁగ నడరుఁ గవీంద్రుం
డిష్ట మగు సంఖ్యఁ జెప్పిన, దుష్టము గా దదియుఁ గర్ణతుష్టిన చేయున్.

10

ఉదాహరణలక్షణము

క.

ధరఁ జాటుకృతులలోనం, బరఁగు [12]నుదాహరణ మనుప్రబంధము, తద్వి
స్తరలక్షణంబు బరువడిఁ, బరికింపఁగఁ దగు నశేషభాషాకవులున్.

11


క.

చతురశ్ర[13]త్ర్యశ్రాదివి, తతయతితాళములు గలుగుదళముల నెల్లన్
గృతగుచ్ఛానుప్రాసం, బతులికగతి నిలుపఁ దగు నుదాహరణలకున్.

12


క.

సురభాసాదిప్రాకృతపరిభాషల నైన నితరభాషల నైనన్
విరచించుట యుక్త ముదా, హరణ మిలాసురముఖాదు లగుపుణ్యులకున్.

13

విభక్తులకు మాఱుపేరులు

సీ.

ప్రథమావిభక్తి చొప్పడు వాణి నాఁగ, రెండవయది [14]ఝట నాగ నతిశయిల్లుఁ,
గీర్తి మూఁడవవిభక్తికిఁ బేరు, నాలవయది దేవలాభిని యండ్రు గృతులఁ,
[15]బంచమి పాణి నాఁ బరఁగు, షష్ఠవిభక్తి పాటిల్లు సుకవులు మోటి నాఁగ,
సప్తమి ఘోటికాసంజ్ఞిత, సంబుద్ధి సరసావళీనామ; జగతి వీని

విభక్తుల దేవతలు

తే.

కయిన వేల్పులు వీరావళియును [16]గీర్తి
మతి సుభగయును మఱి భోగమాలినియును
మహిఁ గళావతియును గాంతిమతియుఁ గమల
యును జయవతియు [17]నాఁగను నొప్పు నెపుడు.

14


క.

ఈవిదితాష్టవిభక్త్యధి, దేవత లాత్మీయ[18]నామధేయసమము గా
భావింపఁ దగినశుభములఁ, గావింతురు కర్తృనాయకద్వయమునకున్.

15


క.

మును శుభగణవర్ణతఁ బ, ర్విన మాలిని యొండెఁ జండవృత్తమ యెండెం
దనరింపవలయుఁ బ్రథమకు, ఘనకలికాష్టకతదర్థకలికాయుక్తిన్.

16


క.

ఇం బడరఁగఁ బ్రథమాదుల, సంబుద్ధ్యంతముల నైన సరళవిభక్త్యా
లంబనపద్యంబుల బిరు, దంబులు గలపౌరుషములు దగ నిడవలయున్.

17


తే.

కళిక యేతాళమునఁ బరిఘటిత యయ్యె
నుత్కళికయును దానన యునుపవలయు,

నంత్యచాతుర్థికోత్కళికాఖ్య చూడఁ
బడి చతుర్థియఁ బోలెఁ జూపట్టవలయు.

18


క.

ఓజఃపదబహుళము వి, భ్రాజితపటుగౌడరీతిబంధురమును ని
చ్ఛాజాతరసవిభావవి, రాజితమును గా నుదాహరణ దగుఁ జెప్పన్.

19


క.

[19]నాయకవిభవమునకుఁ గవి, నాయకచతురతకు భాజనం బగుపద్యం
బాయితము సేసి యిడఁ దగు, నాయతిగాఁ దుదలయం దుదాహరణలకున్.

20

సద్దళి

క.

సంబుద్ధి విడిచి మును గల, సంబంధం బెడలకుండ సప్తవిభక్త్యా
డంబర మడరించిన నొడి, కం బగు సద్దళి యనంగఁ గవులకుఁ జెప్పన్.

21

సద్దళివిద్దళి

తే.

[20]సరివిభక్తుల సంబుద్ధిసహిత గాఁగఁ
చెప్ప నొప్పారుఁ బద్దళి [21]సిద్ద మగుచు,
ముక్తసంబుద్ధి విషమవిభక్తికలిత
యైనకృతి పేరు విద్దళి యండ్రు బుధులు.

22

కల్యాణి ఉత్ఫుల్లకము

క.

కేవలకలికాసంగతిఁ, గావించినకృతికిఁ బేరు కళ్యాణి యగున్
వావిరి [22]నుత్ఫుల్లక మది, యావల నుత్కళికతోన యదికిన యేనిన్.

23


తే.

గ్రంథబాహుళ్యభీరుత్వ[23]కథన మిదియు,
ధర నుదాహరణాదిభేదములు పెక్కు,
[24]తెలియుఁ డొండెడ, మఱికొన్ని తేటపఱుతుఁ
[25]బటుపదార్థాప్తిఁ జాటుప్రబంధములను.

24

బిరుదములు

క.

బిరు శబ్దంబు విరోధో, త్కరము మహారాష్ట్రభాషఁ [26]దత్ప్రదవిధులన్
[27]బిరుదము లనఁ జను వానిన, ధర బిరుదావళి యొనర్పఁ దగు నండ్రు బుధుల్.

25


చ.

అతులకులక్రమానతము లై భుజవిక్రమసంభవంబు లై
ప్రతిపదసార్థకంబు లయి పార్థివకర్ణకఠోరకంబు లై
[28]వితరణశబ్దపూర్వపృథివీవరచిహ్నము లై తనర్చు ను
ద్యతబిరుదాళిచేత [29]బిరుదార్థము చెప్పుట యొప్పు నెప్పుడున్.

26


క.

వినయ భుజవిక్రమక్రమ, ఘనవితరణ రణవిహార కరు ణాదికళా
జననస్థలు లగుగుణములఁ, బెనుపొందఁగఁ జెప్పవలయు బిరుదావళికిన్.

27


క.

సముచిత[30]తాళదళమ్ములు, సమధికపటుగౌడరీతి సందర్భములున్
సుమనో[31]భాషం బొలుపుగ, నమరింపుఁడు కవులు ప్రాకృతాదులనైనన్.

28

తే.

పద్యదళ వాక్య తద్దళ పరిసమాప్తి
[32]గదురుపట్లను నెడ నెడఁ గలుగవలయు
ధీర గంభీర [33]జయ దేవదేవ యనెడు
లలితసంబుద్ధివచనంబు లొలయవలయు.

29


క.

ఉచితవిభక్తికమును గుణ, రుచిరాలంకారరసనిరూఢము నాశీ
ర్వచనంబును నగుపద్యము, రచియింపఁగ వలయు మొదల రంజన మొప్పన్.

30

గుచ్ఛములు

క.

[34]మెం డగు దళములు నాలుగ, యొండెను షట్కంబ యొండె నుండఁగఁ [35]దుదపై
నుండును గద్యము నెనిమిది, యొండెం బదియాఱు [36]నొండె నురుగుచ్ఛము లై.

31


క.

ఇడఁ దగు నూతనయతిసం, గడి దళములు నాలు గైన గడ నా ఱైనన్
బెడఁ గగువర్ణావృత్తులు, [37]వెడలింపఁగవలయు నండ్రు బిరుదావళికిన్.

32


క.

బంధురముగ ని ట్లతుల, స్కంధచతుష్కంబుచేతఁ [38]గవి విభుని యశో
గంధాధివాసితాశా, [39]సింధురముగ దీవనల విశేషింపఁ దగున్.

33

చక్రవాళము

క.

పద్యం బొక్కటి మొదలను, గద్యాష్టక ముచితదీర్ఘగతిఁ గబ్బములన్
హృద్య[40]దళాష్టక మిడిన స, ముద్యత మగుఁ జక్రవాళ మూహింపంగన్.

34


తే.

వరుస నాదిమపద్యాంతవర్ణయుగళ
మంత్యవా[41]క్యాదిమాక్షరయమళకముగ
నిడి [42]చతుఃస్కంధములయందు నిట్లు చెప్ప
[43]నచ్చముగఁ జక్రవాళత్వ మబ్బుఁ గృతికి.

35


క.

[44]కవినామనాయక[45]స్వ, స్తివచఃకవితాద్యపద్యశిఖరంబులఁ బ
ల్లవ మైనవర్ణయుగళం, బవిరళముగ నాద్యమునకు నాద్యక్షరముల్.

36

గుచ్ఛతతి

క.

తొలి తొలి[46]పద్యమునఁ జతు, ర్దళమును నట పల్లవద్వితయ మంతమునన్
[47]గలఘనపద్యము నాలుగు, దళముల నన్నింట [48]గుచ్ఛతతి యన వలయున్.

37


క.

కలయఁగ సంబుద్ధ్యంతర, ముల నునుపఁగవలయు నందముగ జయ జీవో
జ్జ్వలదేవాదిపదంబులు, నలి నిడుచతురుత్తరంబు నలుమా ఱైనన్.

38

చతుర్భద్రము

క.

ఇదియె చతుర్భద్రం బగు, సదములధర్మార్థ[49]కామసహితస్తుతులం
బొదివికొని సర్వరీతుల, విదితం బగునేని శాస్త్రవిదులకు నెక్కున్.

39

రగడ

క.

[50]సరియౌ పదిఱేకులచేఁ, బరువడి నుత్సాహవృత్తపదయుగళముచే
నిరపుగ వడిప్రాసంబుల, నరుదుగ రచియింప రగడ యగుఁ దగువృత్తిన్.

40

మంజరి

క.

శృంగారప్రాయముగా, [51]రంగద్ద్విదళిన పొసంగ రచియింపంగా
శృంగారమంజరీ[52]కృతి, సంగత యగు సకలరాగసంభృతరీతిన్.

41

దండకము

క.

ఛందోభవలక్షణగణ, సందోహనిబద్ధ యగుచు శ్రవణానందా
మందానుప్రాసంబుల, నందం బగు దండకము మహాకవికృతులన్.

42


క.

ఇవి యెల్లను నానావిధ, కవికృతశాస్త్రములచేతఁ గల్పితములు, పె
క్కువిధంబులఁ జాటుకృతి, ప్రవరంబులు పరఁగు నెఱుఁగఁబడు నొండెడలన్.

43


సీ.

ఆపూర్ణలక్షణోదాహరణావలి యుల్లంబునకు నింపు నొసఁగదేని
బిరుదావళీముఖ్యపృథులప్రబంధౌఘములు దిగంతంబులు మ్రోయవేని
పటుచతుర్భద్రాదిభవ్యచాటూక్తులు నృపతులవీనులు నిండవేని
మధురార్థదండకమంజరీమంజుతబంధుల నింపుల మూరిఁ బుచ్చదేనిఁ


తే.

గెరలి చని ముక్తకాదులు కీర్తిలతలఁ
జక్రవాళాద్రిమీఁదికిఁ జాఁపవేనిఁ
గడఁగి మెచ్చునె యొకపాటిగంతచాటు
చాటు[53]కృతులకు విశ్వేశచక్రవర్తి.

44

ప్రాధాన్యములు

క.

అరయ వస్తురసాలం, కారప్రాధాన్యవృత్తిఁ గబ్బంబులు పెం
పారుఁ త్రివిధార్థఘటనల, ధీరులు పరికించి వానిఁ దెలియఁగవలయున్.

45

వస్తుప్రాధాన్యములు

క.

వేడుక [54]విశ్వేశుఁడు శివ, చూడామణికులమునందు సుస్థిరుఁ డచటన్
జూడఁ గనకాద్రికవకుం, గూడక య[55]వ్వెండికొండ కొండిక యయ్యెన్.

46

రసప్రాధాన్యము

క.

వలిచన్నులు నగుమొగములు, దెలిగన్నులు మేనిజిగులు [56]తియ్యనిపలుకుల్
[57]సలికపునడుములు మరుతూ, పులఁ బ్రోచుఁ జళుక్య[58]విభునిపొలఁతుల కెపుడున్.

47

అలంకారప్రాధాన్యము

క.

[59]తగ విశ్వేశ్వరు చేసిరి, నెగడిన సత్కవులు దాననిపుణతఁ గర్ణున్
నగుదురు, కల్పమహీజముఁ, దెగడుదు, రదలింతు రమరధేనువు నైనన్.

48

—————

స్ఫురణములు

తే.

తనర శబ్దస్ఫురణము నర్ధస్ఫురణము
నుభయవిస్ఫురణము నన నుల్లసిల్లు;
నిత్తెఱంగులు మూఁడును నెఱుఁగవలయుఁ
జారుశబార్థగౌరవశక్తివలన.

49

శబ్దస్ఫురణము

క.

కంఠీరవకఠినభటా, కుంఠితకంఠారవావకుంఠితరణసో
ల్లుంఠనములు సురవని[60]తో, త్కంఠం గావించు విశ్వధరణిపుసేనల్.

50

అర్థస్ఫురణము

చ.

తనరెడుఖడ్గధార మును ద్రావినవారి విరోధిభీరులో
చనముల నుప్పతిల్లి కడుఁ జిక్కనివాహిను లయ్యె; నైన న
య్యనువునఁ గ్రొత్తపెండ్లికొడు కై మది నుబ్బుచునుండు [61]సాగరుం
డనిఁ గరవాలభైరవుమహత్త్వము చిత్రమ కాదె యెప్పుడున్.

51

ఉభయస్ఫురణము

స్రగ్ధర.

[62]లాటీఝాటీవరాటీలలితకుచతటీలగ్నపాటీరచర్చం
బాటించుం, జంద్రకాంతోపలములఁ గరంచున్, బర్వి చక్రాద్రియం
ఘాటోధ్య[63]త్కైరవాసక్తములుగ నదులం గట్టు గంధానుబంధిన్
జాటు శ్రీతోడ విశ్వేశ్వరుని సితయశశ్చంద్రికాసార మోలిన్.

52

శయ్య

క.

మృదుతరమై యొండొంటికిఁ, బదమిత్త్రత గలిగి నొడువుపలుకులలోనన్
పొదలెడు నర్థం బెచ్చట, నదలించి శయించు శయ్య యనఁగా నదివో.

53


చ.

చతురచళుక్యవిశ్వవిభు [64]చారుగుణంబు లరాతిరాజిరా
జితనయ హేతుభూతము, లశేషవిశేషవిహారవిక్రమో
చితరతు, లార్చయర్యలకు జీవిత, మంచితసంచితాగమా
తతమతి భారతీవదనకర్పణ, ముత్తమదర్పసంపదన్.

54

పాకము

క.

పాక మనంగా నర్థని, రాకులగంభీరయుక్తి, యది యిరుదెఱఁ గై
[65]లోకమునఁ బేర్చు ద్రాక్షా, పాకంబును నారికేళపాకము ననఁగన్.

55

ద్రాక్షాపాకము

క.

బహిరంతః స్ఫురితార్థో, పహితరసప్రసర మగుచుఁ బద్యము సుఖసం
గ్రహపద మెచ్చట నదివో, మహి ద్రాక్షా[66]పాక మనఁగ మధురం బెపుడున్.

56

శా.

[67]లీలామన్మథమంధరంబులుఁ గచాలీలాలితభ్రూలతా
కూలశ్రీలుఁ గపోలఖేల[68]దుచితాకూతానురాగంబులున్
సాలస్యంబులు నైనకౌతుకపరీతాలోకజాలంబులన్
బాలారత్నము కీలుకొల్పె ముద మొప్పన్ విశ్వభూపాలుపై.

57

నారికేళపాకము

క.

[69]అంతర్గూఢార్థసర, స్వంతం బగువాక్యగౌరవంబు మనీషా
వంతులకు నెక్కుఁ గవితా, భ్యంతరముల నారికేళపాక మనంగన్.

58


శా.

హృష్ణాతుండు నటుండు వోలె నదె విశ్వేశక్షమాభర్తకున్
లజ్జాకాండపటంబుచాటున వధూలావణ్యలాస్యంబులన్
సజ్జాతంబులఁ జేసి చూపెడు లసత్సారాంగహారాళిచే
బెజ్జం గొందఱు [70]కామినీమణులు కుప్యర్దర్పలై చూడఁగన్.

59

—————

అర్థవృత్తులు

ఆ.

ముఖ్యలక్ష్యగౌణములును వ్యంగ్యంబు నా
నర్థవర్ధనంబు లయ్యె నాల్గు
వానివలనఁ గలుగు వాచ్య భేదంబుల
నరసి తెలియవలయు నండ్రు బుధులు.

60

ముఖ్యార్థము

క.

సువ్యక్తము సరళంబును, నవ్యాజము నైన యర్థ మగు ముఖ్య మనన్,
[71]శ్రవ్యముగ నదియు జాతి, ద్రవ్యగుణక్రియలచేతఁ దగు నాల్గనఁగన్.

61

లక్ష్యార్థము

ఆ.

ఊహనీయలక్షణోపేత మగునర్థ
మరయ లక్ష్య మనఁగ నతిశయిల్లు,
[72]గంగయం దనంగ గంగాతటంబునఁ
గలిమిఁ జెప్పఁజాలు కారణమున.

62

గౌణార్థము

క.

గుణసాదృశ్యంబున ను, ల్బణ మగునర్థంబు గౌణఫణితము, గడుభీ
షణహరి యానృపుఁ డనఁ ద, ద్గుణ మగువిక్రమము దెలియఁదోఁచుటచేతన్.

63

వ్యంగ్యార్థము

ఆ.

ముఖ్యలక్ష్యగౌణముల యర్థములఁ ద్రోచి
యితర మర్థ మెచట నింపు నొసఁగు
వ్యంగ్య మండ్రు, కైరవంబులు విరిసె నాఁ
గమల[73]వైరిపొలుపు గానఁబడుట.

64

ధ్వని

క.

పాకాదికృతవ్యంగ్య, వ్యాకీర్ణం బైన కావ్య మది యుత్తమ మై
చేకొనఁబడు మధురార్థ, శ్రీకము ధ్వని యనెడు నెపముచేఁ జెలు వొందున్.

65


ఉ.

ప్రీతిఁ జళుక్యవల్లభుఁడు పృథ్వి వహించి గుణాఢ్యుఁ డైనచో
[74]శాతమదాష్టదంతులు వశావశతన్ జరియించె, శూలికిం
జేతుల భూషణస్ఫురణఁ జేకొనె, వార్డులు గోత్రభూధర
[75]వ్రాతము నిల్వ నయ్యెఁ, గడు మ్రాన్పడె నిర్జరపాదపంబులున్.

66

—————

శక్తిగ్రాహకములు

సీ.

విహితసంయోగంబు విప్రయోగంబును సామర్థ్యమును సాహచర్యకంబు
నర్థవిరోధలింగౌచిత్యచేష్టలు పరిశబ్దసన్నిధిప్రకరణములు
దేశకాలక్రమాదికములు శబ్దార్థకలితానవచ్ఛేదకల్పనములు
స్మృతిహేతుకములు విశేషవాక్యస్వరవ్యక్తులు నాఁగఁ బర్యాయగతుల


తే.

నలరు నన్నింట నర్థంబు నవగమింపఁ
దగు ననేకార్థయుతము లై తనరుశబ్ద
సంతతుల కర్థసంధానచతురు లెల్ల;
నింకఁ దద్వృత్తు లెఱిఁగింతు నెఱుఁగవలయు.

67

కావ్యవృత్తులు

క.

ధీరస్తుత కైశికియును, నారభటియు [76]సాత్త్వతియును నట భారతియున్
జారుతరవృత్తు లివి శృంగారాదిరసంబులందుఁ [77]గరణీయంబుల్.

68

కైశికి

తే.

సకలసుకుమారమధురార్ధ[78]సరళరచిత
కైశికీవృత్తి; శృంగారకరుణరసము
లధికసుకుమారములు, వాని నగు నొనర్పఁ
గైశికీవృత్తిచేతన కవుల కెల్ల.

69


మ.

[79]దళదిందీవరసుందరంబులును నంతఃకౌతుకాంకూర[80]సం
దళితస్నేహములున్ బ్రసన్నములు నై వర్తిల్లు నాలోకనం
బు లుపేంద్రాత్మజు నిందువంశజుఁ గళాపూర్ణాత్మకుం జూచుచోఁ
బొలిచెం బొల్తికి సానురాగరస[81]సంపూర్ణంబులై యత్తఱిన్.

70

ఆరభటి

క.

ఆరభటీవృత్తి యనఁగ, [82]నారూఢాభ్యుద్ధతార్థ, యత్య[83]ద్భుతము
ల్గా రౌద్రము బీభత్సము, నారభటీవృత్తిఁ చెప్ప నగు నీరెండున్.

71

మ.

అతికుప్యత్పరగండ[84]భైరవమహోద్యత్ఖడ్గ ముగ్రాకృతిన్
బ్రతిపక్షప్రకరంబు నొంచు నలఁచున్ [85]భంగించు దండించు ను
ద్ధతి నుగ్గించు వధించు వ్రచ్చు యమదోర్దండప్రచండక్రియా
గతి రూపించు నటత్కబంధమయసంగ్రామంబు భీమంబు గాన్.

72

భారతి

తే.

భారతీవృత్తి కైనకల్పనము చూడ
నర్థ మించుక సుకుమార మై తనర్చు;
నల్పమృదువులు హాస్యశాంతాద్భుతములు
భారతీవృత్తిచేఁ [86]జెప్పఁబడు నవియును.

73


మ.

అతికందర్పము రూప, ముజ్ఝితసుపర్వానోకహరం బీగి, నిం
దితచంద్రద్యుతి కీర్తి, గర్హితసురాద్రిస్ఫూర్తి ధైర్యంబు, కుం
ఠితకంఠీరవ ముగ్రవిక్రమము, వర్ణింపం జళుక్యావనీ
పతి; కీయద్భుతువృత్త మేనృపులకున్ బాటిల్లునే యెచ్చటన్?

74

సాత్త్వతి

తే.

సాత్త్వతీవృత్తి నాఁగ నీషత్ప్రగల్భ
సార్థరూపిణి; వీరభయానకములు
[87]నీషదుక్తి ప్రగల్భసమీహితములు;
సాత్త్వతీవృత్తిచే వీని జరుపవలయు.

75


మ.

అతిదృప్యత్కరవాలభైరవపతాకాభీలకోలధ్వజా
కృతులం జూచినవీరు [88]లుబ్బుదు రొగిన్ గీర్వాణలోకార్థు లై,
సతతత్రస్తులు దూలిపోదురు మహాశైలాగ్రకూటార్థు లై,
గతవిద్వేషులు విశ్వనాథ వినుతు ల్గావింతు రాత్మార్థు లై.

76

—————

కావ్యరీతులు

తే.

అఖిలకావ్యంబులకు రీతు లాత్మ యంత్రు;
ప్రాణదశకంబు వానికిఁ బ్రాణ మరియ;
ధర సలంకారమతవిభేదముల నవియుఁ
బెక్కు, లొక కొన్ని తగ గానిపింతుఁ దెలియ.

77


క.

[89]ఈడిత లగు వైదర్భీ, గౌడీ[90]పాంచాలలాటికారీతులు [91]కా
వ్యాడంబరకరుణార్థ, క్రీడలఁ జతురాహ్వయములఁ గృతకృత్యులచేన్.

78

గుణములు

క.

క్రమమున నౌదార్యశ్లే, షములును సుకుమారతాప్రసాదమధురతా
క్రమతార్థవ్యక్త్యోజ, స్సమాధికాంతులును దగు దశప్రాణము లై.

79

ఉదారత

క.

వినుతసుశబ్దార్థంబులఁ- దనరు గుణోత్కర్షణం బుదారత్వ మనన్
[92]జను; నది పూరణబహుళత, ననఘశ్లాఘోదయమున నగుఁ గల్పింపన్.

80

శ్లేషము

క.

అశిథిలపదబంధం బై, [93]విశదాల్పప్రాణవర్ణవిస్పష్టం బై
కుశలగతి నొప్పు శ్లేషము, విశేషకావ్యముల కెల్ల విభవప్రద మై.

81

సుకుమారత

క.

శ్రుతిసుఖకరవర్ణంబుల నతి[94]కోమల మైనరచన మలవడు సుకుమా
రత [95]నాఁగఁ, గ్లిష్టశాస్త్ర, [96]స్మృతివాదపటిష్ఠనుతులఁ జేకొను నదియున్.

82


క.

లలిఁ [97]బదములతో నర్థము, [98]సలలిత మగు నెచట నది ప్రసాదము కృతులన్
[99]వలిపపుఁబయ్యెదలోనన్ [100]దొలఁకాడెడువలుదచన్నుదోయిని బోలెన్.

83

మాధుర్యము

క.

పటుబంధంబులు మృదుల, స్ఫుటవిన్యస్తాక్షరములుఁ బూరితరససం
ఘటితపదార్థంబులు నె, చ్చట నగు మాధుర్య మనఁగఁ జను నది గృతులన్.

84

సమత

క.

దొరఁకొన్నకొలఁది విడువక, చరణపదార్థములనడక సరి సాగెడు బి
స్ఫురణ యది సమత యనఁ జను; నరాయం గుకవులకు నంద దది పరికింపన్.

85

అర్థవ్యక్తి

క.

[101]తనరఁ గ్రియాకారకయో, జన మస్తవ్యస్తసరణిఁ జనకుండ యథా
జనితాన్వయముగఁ జెప్పినఁ, గన దర్థవ్యక్తి నాఁగఁ గవితల నొప్పున్.

86

ఓజస్సు

క.

[102]ఓజోగుణ మనఁగా వి, భ్రాజిత మగుఁ బటుసమాన[103]బాహుళ్యము రా
రాజదనుప్రాసాక్షర, [104]భాజన మై యొప్పు శబ్దభాసురఫణితిన్.

87

సమాధి

క.

స్థావరజంగమధర్మవి, భావితచరితములు వీడుపడక రసార్థ
ప్రావిర్భావము లగుటయ, భావింప సమాధి యనఁ బరఁగుం గృతులన్.

88

కాంతి

క.

లోకవ్యతిరిక్తార్థ, శ్రీకలితయు నూతనప్రసిద్ధవిరచనా
పాకకమనీయయును నగు, నాకబ్బముసొబగు కాంతి యనఁ జనుఁ గృతులన్.

89

—————

రీతుల లక్షణోదాహరణములు

వైదర్భి

ఆ.

ప్రాణదశకయుక్తి నల్పఘోషముల [105]వ, ర్గద్వితీయబహుత గలిగి ద్విత్రి
పదసమాస యైనఁ బరఁగు వైదర్భి స, మాసరహిత యైన మధుర యండ్రు.

90


చ.

భుజమున విశ్వభూవరుఁడు భూభరముం దగఁ దాల్చెఁ దాల్చినం
గజభుజగేంద్రులున్ గుధరకచ్ఛపఘోణులుఁ గామితక్రియా
భజనమునం జరింతు రని ప్రస్తుతులం బ్రసరించుచున్న [106]యా
ద్విజయజనంబులం ద్రిదశతృప్తి సమాప్తి వహించు నద్దివిన్.

91

గౌడి

క.

ఘటితసమాసోద్భటపద, పటలయు నోజస్సుకాంతిభరితయు ఘోష
స్ఫుటవర్ణయు నిబిడా[107]ర్థో, త్కటయును నా గౌడరీతి కల్పితకృతులన్.

92


శా.

శుభ్రాదభ్రపరిభ్రమత్పటుయశోజ్యోత్స్నా[108]సరిత్సారితా
తిభ్రష్టాధితమస్సమూహు లగుధాత్రీభర్తలం బోరిలో
విభ్రాజిల్లు[109]చళుక్యవిశ్వవిభుదోర్విక్రాంతి [110]పెం పొంది తా
నభ్రద్వీపవతీతరంగములలో నాడించుఁ [111]గ్రీడాగతిన్.

93

పాంచాలి

క.

పంచషపదకసమస్తత, జం దన్మాధుర్యకాంతిసంచరదోజ
స్పంచితసుకుమారతలను, మిం చగుఁ బాంచాలరీతి మృదులాకృతి యై.

94


మ.

చతురోదారచళుక్యనాథకరశిక్షాజాతరేఖాసుధా
లతలం గ్రాలెడుచారుసాయకనటీలాస్యాంగహారాదులన్
బ్రతిగా నిచ్చటఁ జూచి తత్పరిచితిన్ బ్రాపించు [112]శూరారు ల
శ్రుత[113]రంభాపరినృత్యకృత్యముల నచ్చోఁ జూతు రచ్చంబుగన్.

95

లాటి

తే.

ఏకదుక్తత్రిరీతిసమేత యగుచు
నల్పఘోషాక్షరములచే నతిశయిల్లి
తనరు సంయుక్తవర్ణముల్ [114]తఱుచు లేక
వెలసెనేనియు లాటికావృత్తి యండ్రు.

96


మ.

అనిశంబుం గరవాలభైరవునిపాదారాధనం బొప్పఁ జే
సినవారుఁ ద్రిదశాంగనాదయికు లై జీవింతు రిచ్చోటఁ జే
యనివారుం ద్రిదశాంగనాదయితు లై జీవింతు రచ్చోట నం
చు నిరూపింతురు విశ్వనాథబిరుదస్తుత్యప్రభావం బిలన్.

97


తే.

తనరు శృంగారహాస్యశాంతములుఁ గృపయుఁ
[115]దనరు మాధుర్యగుణమునఁ దగును జెప్ప

నద్భుతము రౌద్రవీరభయానకములు
నమరు బీభత్సరసము [116]నోజమునఁ జెప్ప.

98


క.

సకలరసములుఁ బ్రసాద, ప్రకటితములు [117]దక్కియున్న ప్రాణము లెల్లన్
సుకవుల కుచితనియోజ్యము, లకలంకత నెఱిఁగి యొనర నమరింప నగున్.

99


క.

ఇప్పగిది సులక్షణముల, విప్పగుకమనీయకావ్యవితతులు గైకో
నెప్పుడు నీచిత్తము నన, చొప్పడు శీతాంశువంశచూడారత్నా!

100


మ.

[118]మనుమోపేంద్రతనూజ సూరిజనతామందారభూమీజ భూ
జనరక్షాచతురత్రివర్గహృదయాసన్నోల్లసద్భర్త దు
ర్జనశిక్షాచణయుక్తదండ రిపురాజన్యాబ్జవేదండ చి
జ్జనితాశేషకళాభిరామ సమరస్థాణు[119]ప్రకారక్రమా!

101


క.

[120]నందకపాణి పరాక్రమ, నందిమహాకాళతుల్యనవ[121]శైవకళా
నందోదయపద జగదభి, నందితసత్కీర్తిశోభనస్థిరమూర్తీ!

102


మాలిని.

చతురగుణగరిష్ఠా సర్వవిద్యావరిష్ఠా
శ్రుతివిహితచరిత్రా [122]శూరసైన్యాళిజైత్రా
ధృతవిభవజయంతా ధీరవన్యావసంతా
వితతధృతినగేంద్రా విశ్వభూపాలచంద్రా.

103

గద్యము
ఇది శ్రీమదుమారణచరణారవిందవందన గోవిందామాత్యనందన వివిధబుధవిధేయ
విన్నకోట పెద్దయనామధేయవిరచితం బైన కావ్యాలంకారచూడామణి
యను నలంకారశాస్త్రంబునం ద్రివిధకావ్యచాటుప్రబంధలక్షణ
వృత్తిరీతిప్రముఖనానావిధవిశేషసముద్దేశం బన్నది
చతుర్థోల్లాసము.

—————

  1. క.గ.చ. శ్రీవిశ్వేశ్వరచరణ, శ్రీ
  2. క. కీర్తి శ్రీదళిత, గ.చ. కీర్తి శ్రీవలిత
  3. చ. వివరింపఁ దగున్
  4. క.గ.చ. దైవనమ, స్కృతి
  5. గ. వితతాశీర్వద మొండె
  6. క.గ.చ. కవిసంసిద్ధిపదంబు
  7. క.గ.చ. గద్యాత్మికంబు
  8. క.గ.చ. నారూపమ చంపూకావ్యము
  9. క.గ.చ. ఇటువలె ముక్తపదాది
  10. క.గ.చ. ద్వికంబు నా నమరు
  11. క.గ.చ. త్రింశదాఖ్య, మౌలఁ
  12. క.గ.చ. నుదాహరణ యను
  13. క.గ.చ. త్ర్యశ్రాదివి, తతియతి
  14. క. ఝటి నాగ, గ.చ. యెటి నాగ
  15. క.గ.చ. బంచమి వాది నాఁ బరఁగు
  16. క.గ.చ. గీర్తిమతియు సుభగయు
  17. క.గ.చ. ననంగ నొప్పు నెపుడు
  18. క.గ.చ. నామధేయసమము లై
  19. క. నాయకవిభవ మలరుఁ, గ.చ. నాయకవిభవములకుఁ
  20. క. సతవిభక్తుల
  21. క.గ.చ. సిద్ద యగుచు
  22. క.గ.చ. నుత్ఫలక మరి
  23. క.గ.చ. కథన మిదియ
  24. క. తెలియ దొందెడ
  25. క. బటుపదార్థాప్తఁ, గ.చ. బదపదార్థాప్తిఁ
  26. గ.చ. దత్పదవిధులన్
  27. క.గ.చ. బిరుదము లనఁ జను దానను
  28. క.గ.చ. వితరణలబ్ధపూర్వ
  29. క.గ.చ. బిరుదావళి చెప్పుట
  30. క.గ.చ. తాళదళంబుల
  31. క.గ.చ. భాషల బొదలుపు, డమరింపుఁడు
  32. క. గదురుపట్ల నెడ నెడఁ, గ.చ. గలుగపట్టుల నెడ నెడఁ
  33. క.గ.చ. జయ జీవదేవ
  34. క. మెండుగ దళములు
  35. క. దుదపై నుండెను, గ.చ. దుదపై నుండెడు
  36. క.గ.చ. యొండె యుతగుచ్ఛము లై
  37. క.గ.చ. పెడలింపఁగవలయు
  38. క. గరివిభుని
  39. క.గ.చ. సింధురుగా దీవెనల
  40. క.గ.చ. దళాష్టక మిట్లు
  41. క.గ.చ. క్యాదిమాక్షరయమకములు
  42. క.గ.చ. చతుష్కంధములయందు
  43. క.గ.చ. నచ్ఛముగఁ
  44. గ.చ. కవినాథనాయక
  45. క. స్వ, స్తివచఃకలితాగ్ర్య
  46. క.గ.చ. పద్యమునఁ జతుర్దళియును
  47. క.గ.చ. గల ఘనగద్యము
  48. క.గ.చ. గుచ్ఛతతియును వలయున్
  49. క.గ.చ. కామసేవ్యస్తుతులన్
  50. క.గ.చ. సరిఁజౌపదరేకులచే
  51. క.గ.చ. రంగద్ద్విపదలను బొసఁగ
  52. క. కృతిసంగతి యగు
  53. క.గ.చ. కృతులకుఁ జాళుక్యచక్రవర్తి
  54. క.గ.చ. విశ్వేశుఁడు నిజచూడామణి
  55. క.గ.చ. వెండికొండ కొండయ యయ్యెన్
  56. క.గ.చ. తియ్యఁబలుకులున్
  57. క.గ.చ. నళికపునడుములు
  58. క.గ.చ. విభునిపురవనితలకున్
  59. క.గ.చ. తగవిశ్వవిభుని జేసిరి
  60. క.గ.చ. ఉత్కంఠతఁ గావించు
  61. క.గ.చ. సాగరం బని
  62. చ.లాటీఘోటీవధూటీ
  63. క.గ.చ. కైరవాసక్తములుగ నలులం
  64. క.గ.చ. బారుగుణంబులు రాజరాజి
  65. క.గ.చ. లోకములఁ బేర్చు
  66. క.గ.చ. పాక మధికమధురంబు
  67. క.గ.చ. లీలామంథరమన్మథంబులు
  68. క.గ.చ. ఉచితాకూలానురాగంబులున్
  69. క.గ.చ. అంతర్గూఢార్థరసస్వంతంబగు
  70. క.గ.చ. కామినీజనులు కుప్యద్దర్పు లై
  71. క.గ.చ. శ్రవ్యముగ నదియ
  72. క.గ.చ. గంగయందు మంద
  73. క. వైరిపొడుపు, గ.చ. వైరిపొడవు
  74. క.గ.చ. సాతిమదాష్టదంతులు
  75. క.గ.చ. వ్రాతము విన్ననయ్యె
  76. చ. భారతియును నటసాత్వతియున్
  77. క.గ.చ. కరణీయ లొగిన్
  78. క. సకలరచిత, గ. సరసరచిత
  79. క. దళితేందీవర
  80. క.గ.చ. సంవళితస్మేరములున్
  81. క.గ.చ. సంపూరంబులై యత్తఱిన్
  82. క.గ.చ. ఆరూఢాత్యుద్గతార్ధయత్య
  83. క.గ.చ. ద్భుతముల్దారౌద్రము
  84. క.గ.చ. భైరవభుజోద్యత్ఖడ్గ
  85. క.గ.చ. భంగించు తుండించు
  86. క.గ.చ. చెప్పఁబడినయవియు
  87. క.గ.చ. ఈషదుక్తప్రగల్భ
  88. క.గ.చ. ఉబ్బుదు రనిన్
  89. చ. ఈడితమగు
  90. క. పాంచాలిలాటికా
  91. క. కావ్యాడంబరకరణార్థ
  92. క.గ.చ. జను నది వితరణ
  93. చ.విశదాల్పప్రాసవర్ణ
  94. క.గ.చ. కోమలమైనవచన
  95. క.గ.చ. నాఁగశ్లిష్టశాస్త్ర
  96. చ. స్మృతిపాఠపటిష్ఠ
  97. క.గ.చ. పదములలో నర్థము
  98. గ. సలలితముగ నెచట
  99. క. వలిపెపుఁబయ్యెద
  100. చ. తొలుకాడెడు
  101. క.గ.చ. తనరు క్రియాకారక
  102. క.గ.చ. ఓజోరీతి యనంగను
  103. క.గ.చ. బాహుళ్యము దా
  104. చ. భాజన మై నెగడు
  105. గ.చ. వర్గతృతీయబహుత
  106. క.గ.చ. యద్ద్విజయజనంబులన్
  107. క.గ.చ. ఉత్కటయును నై
  108. చ. సముత్సారితాతిభ్రష్టారి
  109. గ. చళుక్యవిశ్వపతి
  110. క.గ.చ. పెం పెట్టిదో
  111. క.గ. క్రీడాగతుల్
  112. గ.చ. శూరాదులశ్రుత
  113. క. రంభాకృతనృత్తనృత్యముల, గ.చ. రంభాకృతనృత్యకృత్యముల
  114. క.గ.చ. తఱుచు గాక
  115. క.గ.చ. పొసఁగ మాధుర్యమునఁ జెప్పుట గుణంబు
  116. క. నోజమును జెప్ప
  117. క.గ.చ. చిక్కియున్నప్రాణములు
  118. క.గ.చ. మనుభూపేంద్ర
  119. క.గ.చ. ప్రకామప్రమా
  120. చ. నందకహేతి
  121. చ. శైవకథా
  122. క.గ.చ. శూరసైన్యాతిజైత్రా