కామకళానిధి/ప్రథమాశ్వాసము

శ్రీ

కామకళానిధి

ప్రథమాశ్వాసము

శా.

శ్రీగౌరీసతిపెండ్లివేళ స్వశిరస్సీమంతచంద్రాంతకో
ద్యోగాత్మాకృతి యన్యకాంత యని తా నూహింప రత్మాంకురా
భోగశ్రీశుభకాకృతిన్ మరుగుగా బూనించుదేవుండు ని
త్యాగారస్థితి బ్రోచుగాత జయసింహస్వామి నెల్లప్పుడున్.


శా.

ప్రాంచామంచన ప్రీతినుంచి యమరుల్ పట్టాభిషేకంబు గా
వించన్ జానకి మోముక్రేగనుఁగవన్ వీక్షించుచోఁ బద్మరా
గాంచత్కుట్టిమభూమి నీడఁగని మానాసక్తగా దేవి దన్
గాంచ న్నవ్వు విభుండు ప్రోచి జయలక్ష్మీసింగలాధీశ్వరున్.

చ.

చరమచరమ్మునాదగిన సర్వజగమ్ముల కంతరాత్మయై
యరయఁన భిన్నుఁడయ్యు వివిధాకృతులన్ జగమున్ సృజించుచున్
సరసతసర్వశక్తియగు శారదతో విహరించుధాత సు
స్థిరమతి మత్కృతీశు జయసింహధరాధిపు బ్రోచుఁగావుతన్.


సీ.

ముకుటరత్నప్రభాముద్రితేందుకిశోర
                    కాంత చేర్చుక్కతో రంతు సేయ
ముగ్ధప్రవాళాగ్రముక్తాగుళుచ్ఛంబు
                    బాలికాపాళితో వావు లెన్న
చారుప్రవాళప్రసారికారాగంబు
                    చేకట్ల కొకకొంత చెల్వు నింప
తంత్రికావాదనోద్ధతహేమజీవక
                    చ్ఛవినఖాంశువులతో సౌరు గుల్క
విభున కనురాగ మొల్క వేవిధములైన
రాగముల మేళగతులను రంగురక్తు
లొలుక వల్లకి వాయించు నలువచెలువ
విద్యల నొసంగు జయసింగవిభున కెపుడు.


చ.

హరునిశిరంబునందు గల యైందవరేఖను జూచి కేతకం
బరు దిది తీసి యిమ్మనుచు నారడి బెట్టి తలన్ స్పృశించు న
ప్పరుగనినవ్వునవ్వ నతివా కొనుమంచును ............
.........................ననవద్యకృపామతి బ్రోచుఁగావుతన్.

మ.

సకలాంధ్రోక్తుల కాంధ్రపాణిని యనన్.........................
.............న్ననయంబుకొఱకై భాష్యంబు గావించి దే
శికుఁడై రాజులచేతఁ బూజగొను నాశేషాచలర్షి న్నివృ
త్తికులస్వామిని మద్గురుం గొలుతు భక్తిన్మానసాబ్జంబునన్.


క.

ఆదిమకవులన్ వాల్మీ
క్యాదుల నాంధ్రులగు నన్నయాదుల మదిలోఁ
బాదుకొలిపి యధునాతను
లై దనరినబుధులఁ దలఁతు నతిమోదమునన్.


క.

పరపదరక్ష్మాదృతమతి
నరయుచును దదార్జవంబు నందక కుక్షిం
భరవృత్తి మెలఁగుకవుల
పరుషతరార్భటులఁ జక్కఁబరుప న్వశమే.


వ.

అని యిష్టదేవతావందనంబును, సుకవిజనాభినంద
నంబును, కుకవినిందనంబును గావించి సమంచితమనీష సకల
జనగ్రాహ్యంబుగా నొకప్రబంధంబు రచియింప నిశ్చయించియున్న
సమయంబున.


సీ.

ఒకవంక గోవిదప్రకరంబు బహుశాస్త్ర
                     ఫక్కిక ల్మిగుల నుపన్యసింప
నొకచాయ సత్కవివ్యూహంబు బహువిధ
                     రచనావిశేషముల్ ప్రచురపరుప

నొకమేరఁ జేరి గాయకులు మేనులు పల్ల
                     వింప సంగీతంబు వినికిసేయ
నొకచెంత సామాజికకులంబు సమయంబు
                     తెలిసి కార్యంబులు తెలియబలుక


గీ.

సరసచుక్కలలోనున్న చంద్రుకరణిఁ
బ్రజలకెల్లను గన్నులపండువుగను
నిండుకొలువుండు జయసింహమండలేంద్రుఁ
డాశ్రితుండగు నను గాంచి యాదరమున.


చ.

హితుఁడవు పాకనాఁట నుతికెక్కిన నెల్లురివంశజాతుఁ డీ
వతులితసాహితీపటిమ యాదవరాఘవపాండవీయమన్
గృతిగలవీరరాఘవకవీంద్రసుతుండవు కొద్దివాఁడ వే
తతమకి సంస్కృతాంధ్రకవితానిరతా శివరామసత్కవీ!


క.

హితమతిఁ బండితపామర
మతమై పురుషార్థమై సమంచితమౌ నా
తతకామకళానిధిఁ గృపఁ
జతురత రచియింపవలయు సరసులు మెచ్చన్.


వ.

అని సగౌరవంబుగా వికచారుణాబ్జసమరసంబులైన
కరుణావలోకనంబుల నాలోకించుచు మణిభూషణకదంబజాం
బూనదాంబరాడంబరసమంచితంబుగాఁ గర్పూరతాంబూలంబు
వెట్టినం బట్టి సకలజనులకు నావశ్యకంబైన పురషార్థంబు కామ

శాస్త్రం బదియును బహుమతంబుల సంకీర్ణం బగుటను గీర్వాణ
భాషామయం బగుటను సర్వసాధారణంబు గాదు; కావున నది
త్రిలింగభాషారచితంబైనం దేటయై యిక్కలికాలంబున కను
రాగసౌహృదకరంబై గ్రాహ్యంబై నరక్షణీయంబై యొప్పు బహు
కాలంబు నిలువ నద్దాన న్యశంబు గలుగునని నిశ్చయించి యీ
కృతికిఁ బ్రారంభించితి నే తదాదియందుఁ దదీయవంశావతారం
బభివర్ణించెద.


సీ.

అఖిలజగత్స్రష్ట యగుకశ్యపబ్రహ్మ
                     గణుతింప నెవ్వాని కన్నతండ్రి
సమదరాక్షసహారి శతకోటిరమణీయ
                     దోర్బలుం డెవ్వానితోడఁబుట్టు
వలఘుచతుర్వర్గఫలహేతువగు నాగ
                     మత్రయం బెవ్వాని మాన్యమూర్తి
సృష్టిస్థితిలయప్రసిద్ధులౌ ముమ్మూర్తు
                     లరయ నెవ్వాని మూర్త్యంతరంబు
లెవ్వఁడు గభస్తితతివర్షహిమఘనాత
పములఁ గల్పించి లోకైకబంధుఁ డయ్యె
నతఁడు పొగడొందు సర్వదేవాధికుండు
భవ్యతేజోమయాత్ముండు భాస్కరుండు.

క.

అతఁ డఖిలలోకధర్మ
స్థితికై సంజ్ఞాఖ్యయైన చెలియందుఁ గనెన్
సుతు నతఁడు సువర్ణమకీ
ర్తితుఁడై సూర్యాన్వవాయదీపకుఁ డయ్యెన్.


క.

వానికి నిక్ష్వాకువు మొద
లైన మహామహులు గలిగి రతిరథులు కళా
మానితు లనఘులు పదుగురు
సూనులు దిక్కలితకీర్తిసూనులు వరుసన్.


క.

ఆయిక్ష్వాకుకులంబున
శ్రీయుతులు దిలీప రఘు హరిశ్చంద్ర కకుత్
స్థాయు స్సగర భగీరథు
లాయతమతు లుదయమంది రతులప్రౌఢన్.


గీ.

వారికులమునఁ గలిగె నవార్యబలుఁడు
భోసలాభిధధాత్రీప్రభుం డతండు
హితమతి మహారటదేశంబు నేలుచును య
శంబు దిక్కుల నించె భాస్వరవిభూతి.


గీ.

అతనిపేరిట నాభాస్కరాన్వయంబు
భోసలకులం బనంగను పొగడుగనియె
నతనికి బురోహితుఁడు గాధిసుతుఁడు గాన
ధాత్రి నతనికిఁ గౌశికగోత్ర మమరు.

మ.

అలగోత్రంబున సంభవించి సకలాశాధీశకోటీరని
స్తులమాణిక్యవిభాచయారుణనఖస్ఫూర్తిస్ఫురత్పాదపీ
ఠలసద్వామవిభూషితావితతిరూఢప్రౌఢి మాలోజి భూ
తలనాథుండు విరాజిలెన్ సకలవిద్యాభోజుఁడై యిద్ధరన్.


సీ.

సకలలోకవ్యాప్తసంపూర్ణచంద్రాయ
                     మాననిర్మలయశోమండలంబు
అవపణంబు మహాబాడబీకృత
                     ప్రబలప్రతాపప్రభాచయంబు
సతతవిశ్రాణనసంతృస్తనవవిధి
                     లాలితలోకపాలకగణంబు
రణరంగనిర్జితారాతిక్షమానాధ
                     మందీకృతదినేశమండలంబు
గాఁగఁ జతురబ్ధివేశ్టితక్ష్మాతలంబు
బాలనము సేసె నెవ్వాఁడు బాహుశక్తి
నతఁడు చెలువొందు సకలధర్మానుసారి
రమ్యగుణహారి మాలోజిరాజశౌరి.

గీ.

అతఁడు శంభుమహాదేవు నధికభక్తిఁ
గొలిచి యతని ప్రసాదంబువలన నలఘు
పుత్రపౌత్రాభివృద్ధియు భూరిరాజ్య
సంపదలు గాంచి జగతి ప్రశస్తి గనియె.


గీ.

అమ్మహారాజు తనకు నర్ధాంగలక్ష్మి
యగు సుమాదేవియందు శాహక్షితీశుఁ
గనియె వాసవు డా శచీకాంతయందు
ఘనజయంతుని గాంచిన క్రమము దోప.


శా.

ఆశాహక్షితిపాలకుండు నిజబాహాజాగ్రదుగ్రాసిధా
రాశీర్ణప్రతిపక్షభూమిభృదురఃప్రాలిప్తగోరోచనా
శ్రీశోణప్రచురప్రతాపరుచియై శిష్టావళీరక్షకుం
డై శాసించె ధరాతలంబు నయవిద్యాపారగుల్ మెచ్చగన్.


గీ.

తనదుభుజశక్తియును శౌర్యధైర్యమహిమ
గాంచి డిల్లీశ్వరుఁడు సంతసించి చెల్మి
నాప్తుఁడై మహారాజవిఖ్యాతి నొసఁగ
స్థిరతరవిభూతిచేతఁ బ్రసిద్ధి గనియె.


వ.

మరియు నతండు.


సీ.

శివనామకీర్తనాంచితము జిహ్వాగ్రంబు
                     బహుపాకరుచుల నెబ్భంగి గనునొ?

శంభుమూర్తీక్షణాసక్తముల్ నేత్రముల్
                     వివిధిప్రపంచ మేరీతిఁ గనునొ?
హరకథాకర్ణనాయత్తము ల్కర్ణముల్
                     రాజకార్యంబు లేరహిని గనునొ?
పరమేశ్వరార్చనానిరతముల్ హస్తముల్
                     నిత్యకృత్యంబు లేనియతిఁ గనునొ?
అరయ సర్వజ్ఞుఁ డతఁడు చిత్తాధిరూఢ
శంకరం డయ్యెనని తను జనులు వొగడ
రాజఋషితుల్యుఁడై కడుప్రౌఢిఁ గాంచె
నీశ్వరనిభుండు శాహ మహీశ్వరుండు.


క.

అలఘనుఁడు గుహుఁడు శుభలీ
లల వల్లీదేవసేనలం బరిణయమై
వెలయుగతి జిజాదేవిని
దులజాదేవిని ముదంబుతో వరియించెన్.


గీ.

అలజిజాదేవియందు మహానుభావుఁ
డగు శివాజినృపాలు వీరాధివీరుఁ
డైన శరభోజిరాజు నుదారలీల
నిద్దరు కుమారులను గాంచె నెసగ మెసఁగ.


క.

తులజాంబిక యగురెండవ
లలనామణియందుఁ గనియె లాలితవిభవో

జ్జ్వలు నేకోజి మహీవిభుఁ
గలశాంబుధి పూర్ణచంద్రుఁ గాంచినమాడ్కిన్.


క.

వారలలో నగ్రజుఁడగు
సారమతి శివాజిరాజచంద్రుఁడు బాహా
ధారకరవాలధారా
దారితముష్కరతురుష్కతతియై వెలసెన్.


మ.

అతఁ డుద్వేలభుజాబలాఢ్యుఁ తురుష్కాధీశుఁడౌ పాదుషా
నతిశౌర్యాప్తిఁ దృణీకరించి బహుదేశాధ్యక్షులం గూర్చి సం
తతధాటీగతి హస్తిపట్టణముపై దండెత్తి పోరాడి ని
ర్జితఢిల్లీళసమాఖ్యఁ జెందె నృపతిశ్రేణుల్ ప్రశంసింపఁగన్.


సీ.

ఏవీరు తేజోదినేశున కౌరంగజాబు పా
                     చ్ఛా ఘూకశిశుక మయ్యె
నేధీరు సాయకాహికిఁ గ్రూరపారసీ
                     కకులంబు మూషికప్రకర మయ్యె
నేరాజు హయకోటి పోరాడ గోలకొం
                     డబిజాపురంబులు ఠావు లయ్యె
నేశూరు కీర్తిమ.......................
                     యంబు కరతలామలక మయ్యె
నెవ్వఁ డేకాతపత్రమై యెసఁగ ధరణి
వేలుచును ఛత్రపతియన మెప్పుగాంచె

నతఁడు విలసిల్లు సకలవిద్యావివేక
భాస్వరుండు శివాజిభూపాలకుండు.


ఉ.

ఆతనితమ్ముఁ డాహవకళాధికుఁ డుజ్జ్వలకాంతిశాలి వి
ఖ్యాతయశుండు ధైర్యతుహినాచలుఁ డున్నతసత్త్వుఁ డంగనా
నూతనపంచబాణుఁడు ఘనుండు కుమారనిభుండు శంభుజిత్
క్ష్మాతలనాయకుండుఁ గరిమన్ విలసిల్లె ప్రజల్ నుతింపఁగన్.


క.

ఆవీరున కనుజుఁడు వి
ద్యావినయవివేకశాలి యగు నేకోజీ
క్ష్మావిభుఁడు వెలయు నిజతే
జోవిముఖతశూరుఁ డగుచు సూరులు మెచ్చన్.


సీ.

ఏ మహామహుని తేజోమండలము ధాత
                     కవిరతోదితకమలాప్తుఁ డగును
ఏ రాజు కీర్తిప్రభారాశి శంభుమూ
                     ర్ధస్థితేందునకు బూర్ణతఁ ఘటించు
ఏ విభుదానధారావారిపూరంబు
                     జలధిపూరణ కాగిసరసి యగును
ఏ మహోన్నతుసద్గుణామేయవి
                     స్పూర్తి సజ్జ్నకర్ణభూషణతఁ బూను

నతఁడు చెలువొందు నిఖిలరాజాధిరాజ
రాజకోటీరత్న నీరాజితాంఘ్రి
రణతలకిరీటి విముఖితారాతికోటి
సాంబశివమూర్తి యేకరాట్చక్రవర్తి.


సీ.

పారసీకారట్టబాహ్లికాజానేయ
                     ఘోట్టాణదట్టముల్ గొలిచి నడువ
దండెత్తి నర్మదా దక్షిణావని సీమఁ
                     గల భూపతులనెల్లఁ గలచి వైచి
చేరి కర్ణాటకక్షితి బెంగుళూరిలో
                     నిలచి వింధ్యాచలతలమునందు
నతులపంచద్రావిడాధీశజయకృతా
                     క్షరపంక్తితో స్తంభ మునిచి
మరియు మైసూరిబలముచే మగ్నుఁడైన
పాండ్యరాజును రక్షించి ప్రబలుఁ డగుచు
చోళరాజ్యంబుఁ గైకొని యేలుచుండె
రమ్యగుణశాలి యేకభూపాలమౌళి.


క.

మానితగుణ సైబాయియు
ధీనిధియగు నానుబాయి దీపాంబలనన్
శ్రీ నీళాభూరమణుల
బోలువధూమణుల నితఁడు మువుర వరించెన్.

చ.

అల కులపాలికామణుల యందుఁగులంబున కాశ్రయంబునై
చెలువున జారుచర్యలను శీలమునన్ మహనీయకీర్తి ని
శ్చలమతి దీపమాంబ గుణసంపద నింపు వహించి యేకభూ
తలపతికిన్ బ్రియంబొదవ ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కె నెంతయున్.


క.

స్థిరయచల యనగ విశ్వం
భర వసుమతి యనఁగ గంధవతియన గరిమన్
ధరణీరమణికి సరియై
పురణించిన దీపమాంబఁ బొగడన్ వశమే.


క.

ఆనరనాయక మణివిన
యానతయగు దీపమాంబయందు గనె యశో
మానితుల ముగురు తనయుల
శ్రీనిధుల గళావిశేషశేషుల నెలమిన్.


సీ.

సకలదిగ్రాజన్యసన్నుతచరితుఁడై
                     ప్రౌఢిఁ గాంచిన శాహరాజవిభుఁడు
భామినీనూతనపంచబాణాకృతిఁ
                     బొలుపొందు శరభోజిభూమిరమణుఁ
డభియాతి బూతయయాతియై బహురాజ్య
                     సంపదఁదగు తులజప్రభుండు
ముమ్మూర్తుల విధానమూర్ధన్యులై కళా
                     భోజులై భాస్కరతేజు లగుచు

దనమదికి నింపు నింప సంతతవిభూతి
న్యాయమార్గంబు దప్పకమేయ మహిమ
చోళరాజ్యంబు పాలించె శుభచరిత్రుఁ
డేకభూపాలఘనుఁడు వివేకధనుఁడు.


క.

ఆతని యనుమతిచే ధర
ణీతలభరమున్ భజించి నృపనయవిద్యా
చాతురి రామవిభుండన
ఖ్యాతిం గనె శాహనృపతి ఘనతరమతియై.


సీ.

తనసముదగ్రప్రతాపాతపమునకు
                     దినమణి మొదటిమాదిరికె గాఁగ
తనయశోమహితముక్తాపరీక్షకు హరి
                     ణాంకమండలము చిప్పంటు గాఁగ
తనభుజాకరవాలధారకు శతకోటి
                     దార్వగలపవి(కసిధారవిసిలప)త్రంబు గాఁగ
.............................................
                     .........................................................
............................................
............................................
ధాత్రి నేలెఁ బవిత్రచరిత్రుఁ డగుచు
నతులదేహప్రభుండు శాహప్రభుండు.

క.

అతనికి బిమ్మట శుభతర
మతియై రమణీయకీర్తిమద్గుణమతియై
యతిధృతియై వరకృతియై
క్షితి యేలెన్ శరభనృపతి స్థిరతరనియతిన్.


సీ.

నీతి దప్పక ధారుణీరాజ్య మేలుచో
                     సరిలేని శ్రీరామచంద్రుఁ డనఁగ
దాడిగా జని శత్రుతతుల నిర్జించుచో
                     మేటియౌ నమరకిరీటి యనఁగ
తుదిపదాల్ గార నర్థుల కెల్ల నిచ్చుచో
                     నీడుగానని కల్పవృక్ష మనఁగ
శరణన్న నపరాధశతము క్షమించుచో
                     సాటిలేని యజాతశత్రుఁ డనఁగ
కృష్ణదేవుఁడు సేవింపఁ గ్రీడ సల్పు
బలునికైవడి దులజఁభూపాలకుండు
తను భజింపంగ వెలసె సత్యధనుఁడు
.................శరభరాజన్యఘనుఁడు.


క.

ఆరాజు పరోక్షమున న
పారమహామహిమఁ బట్టభద్రుండగుచున్
దా రాజ్య మేలె దులజధ
రారమణుఁడు సకలరాజరాజి భజింపన్.

సీ.

స్మృతినివహోదిత శీలనురక్షిత
                     ధర్మ మాధారభూతలము గాఁగ
నిజభుజోద్భవసమున్నిదప్రతాపంబు
                     కనకాలవాలమై గరిమఁ జెంద
రమణీయదానధారాప్రవాహంబులు
                     సతతాభిషేకార్థజలము గాఁగ
గృతివరవారజేగీయమానగుణాళి
                     ప్రబలతమంబైన ప్రాకు గాఁగ
గరిమ గాంచినయట్టి సంకల్పలతిక
మించి త్రిభువనముల నాక్రమించియుండ
ధరణి వర్ధిల్లు నాచంద్రతారకముగ
నీశ్వరవిభుండు తుళజమహీవిభుండు.


సీ.

కోవిదశ్రేణికిఁ గొంగుబంగారంబు
                     కవిజనమ్ములపాలి కల్పతరువు
సకలసాంగీతికులకుఁ గామధేనువు
                     బాంధవావళికిని భాగ్యరాశి
నమ్మినవారికి నట్టింటినిధి భృత్య
                     పంక్తికిఁ బూర్వతపఃఫలంబు
ఆశ్రితజనముల కరిదిచింతామణి
                     యర్థికులంబున కర్థపేటి

అనుచు వేనోళ్ళ భూప్రజ లభినుతింప
పుత్రపౌత్రులతోఁ గూడి భోగభాగ్య
ముల ననుభవించుచును ధాత్రి ముదముఁ జెందు
సరసగుణహారి తులజరాజన్యశౌరి.


సీ.

సుందరాకృతియైన సుందరాబాయియు
                     మాన్యయౌ రాజకుమారబాయి
శుభతరచారిత్ర సుకుమారబాయియు
                     బాలయౌ మోహనబాయి దేవి
రమణీయశీలయౌ రామకుమారాంబ
                     లలితలక్షణయగు లక్ష్మిబాయి
అనుపమతరభాగ్యయైన రాధాదేవి
                     సతి యుమాబాయి దా సద్గుణనిధి
వీర లెనమండ్రు యాదవవిభుని యష్ట
మహిషులవితాన దను నతిమహిమ గొల్వ
విబుధజనములపాలిటి వే ల్పనంగ
జగతి వర్ధిల్లు దులజరాజన్యవిభుఁడు.


సీ.

అల సుందరాబాయియందు సద్గుణనిధి
                     జనపాలమణి హరిశ్చంద్రవిభుని
ధర్మైకవసతి రాధాబాయియందు
                     నృసింహవిక్రము జయసింహవిభుని

రమణీయచరితయౌ రాజకుమారాంబ
                     యందు నేకోజి ధరాధినాథు
వరరూపయగు నుమాబాయియందు గుణాఢ్యు
                     డైన ప్రతాపసింగావనీంద్రుఁ
గాంచి నాల్గుభుజమ్ముల ఘనత గాంచు
శ్రీమహావిష్ణుకైవడిఁ జెలఁగు నతఁడు
సేతుపతి గర్వహరణ ప్రసిద్ధికీర్తి
చారుతరమూర్తి తులజరాట్చక్రవర్తి.


క.

ఆ రాకొమరులయందు ను
దారయశోమహిమ వెలయు నాహవవిజయా
ధారుడగు హరిశ్చంద్ర ధ
రారమణుడు సూర్యవంశరత్న మ్మనఁగన్.


సీ.

పాండ్యకేరళరాజభామినీకచభార
                     కల్హారములకాంతిఁ గాకుపరచి
కరహాటకురులాటకర్నాటకామినీ
                     కుంకుమరేఖల సుంక మడిగి
ద్రవిడకరూశవిదర్భమద్రాంగనా
                     వీటికారుచులకు వెరపు జూపి
కుంతలనిషధాంధ్రకాంతాకుచద్వయీ
                     గోరోచనాచ్ఛవి మారుపఱచి

తనదుతీవ్రప్రతాపముద్యద్విభూతి
సకలజగముల నెరసి నిశ్చలము గాఁగఁ
సత్యభాషావిజితహరిశ్చంద్రుఁ డగుచు
జగతి వర్ధిల్లు శ్రీహరిశ్చంద్రనృపతి.


క.

ఆయన కనుజుఁడు సుజనవి
ధేయుఁడు జనవినుతనామధేయుఁడు శ్రీరా
ధేయుఁడు దానకళారా
ధేయుఁడు జయసింహరాజధీరుఁడు వెలయున్.


సీ.

సరిపోల్పఁగారాదె సురరాజరత్నంబు
                     హృదయకాఠిన్యంబు వదలెనేని
తులగాదె గోరంతకలశపాథోరాశి
                     గలఁగకయుండుట కలిగెనేని
సాటిగాదా కొంతచామీకరనగంబు
                     శివుని చేఁజిక్కక చెలఁగెనేని
పోలడా యిసుమంతపుణ్యజనాధీశు
                     .................. మనిచెనేని
దానగాంభీర్యధీరత్వధనసమృద్ధి
ననుచు జనములు వేనోళ్ళ నభినుతింప
నవని వర్ధిల్లు నెపుడు బ్రహ్మాయు వగుచు
రతివరాకృతి జయసింగ రాజనృపతి.

క.

ఈనరపతి కనుజుఁడు వి
ద్యానిధి యేకోజిరాజు ధరఁ జెలువొందున్
నానావిధవైభవస
న్మానితుఁడై దానదేవమణియై గుణియై.


సీ.

ఆవిక్రమార్కాదులైన నీతనిసరి
                     గానేర్తురా పరాక్రమము బల్మి
నాధనాధీశాదులైన నీతనితోడ
                     జోడౌదురా ధనస్ఫురణకలిమి
నాయంగరాజాదులైన నీతనిసాటి
                     పూనెనుదరా దానపూర్తి నెలమి
నాకాళిదాసాదులైన నీతని కెన
                     యౌదురా కవనమహత్త్వ మెలమి
ననుచు విబుధులు గొనియాడ నలరు నౌర
భోసలామ్నాయవారిధిపూర్ణచంద్రుఁ
డైన రాజకుమారాంబికాగ్రసుతుఁడు
యేకరాజన్యఘనుఁడు వివేకధనుఁడు.


చ.

అనయము నన్నదమ్ములు ముదాపహలీల గూడియుండఁగా
జనకులు ముద్దుముద్దుగ ప్రసన్నత నెప్పుడు గారవింపఁగా
దనయులు బౌత్రులుం జెలు లుదారత గొల్వ జిరాయు రున్నతుల్
గని ధర వర్ధిల్లున్ సుఖముగా జయసింహనృపాలుఁ డెప్పుడున్.

సీ.

నమ్మినవాని నెన్నఁటికి బ్రోచునె కాని
                     యలసాత్మునైన దూ రనుటలేదు
ఏపాటినరునైన హెన్చుసేయునె కాని
                     తప్పించి తగ్గించు తలపులేదు
మొగముముందర ముఖాముఖి నాడ వినుగాని
                     వెనుక నాడినమాట వినుటలేదు
ఆడినమాట శిలాక్షరాకృతి గాని
                     తటపటచేసి తప్పుటయు లేదు
భళిర భోసల తుళజభూపాలచంద్రు
భాగ్యరాశి యితండని ప్రస్తుతింప
ధరణి వర్ధిల్లు నాచంద్రతారకముగ
రాజమాత్రుండె జయసింగరాజవిభుఁడు.

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశగుణనిధికిన్
సాతిశయతపఃప్రసన్నశరధిశరధికిన్
జాతదయామితనిధికిన్
ఖ్యాతయశోనిధికి విపులకరుణాంబుధికిన్.


క.

చండతరమండలాగ్రవి
ఖండితరిపుమండలున కఖండితవిభవా

ఖండలునకుఁ గీర్తివిభా
హిండితశశిమండలున కహీంద్రభుజునకున్.


క.

పంచద్రవిడావనితల
పంచజనాధీశమత్తవారణపటలీ
పంచానన బిరుదునకు వి
పంచీవాదన కళాప్రపంచజ్ఞునకున్.


క.

శారదనీరదనారద
శారదపారదసమానచారుయశునకున్
వీరానతచారాహిత
వారాహితనతివలోకపదపద్మునకున్.


క.

అతులప్రతాపనవిభవో
న్నతికిన్ రాజాధిరాజనందితమతికిన్
భృతకవికృతకృతికిన్ గిరి
ధృతికిన్ జయసింహవసుమతీతలపతికిన్.


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూ
నిన కామశాస్త్రంబునకుఁ బ్రారంభం బెట్టిదనిన.

గీ.

వెలయు నఖిలభువనముల కధీశ్వరుఁడైన
కమలజాక్షువలనఁ గమలయందు
సంభవించి బ్రహ్మసర్గంబునకు నధి
ష్ణాతయయ్యె బంచసాయకుండు.


సీ.

దేవతామానవస్థావరతిర్యగా
                     ఖ్యలు గల్గు నీత్రిలోకములయందు
అఖిలమనస్సాక్షియై మనోభవుఁ
                     డన ముఖ్యరజోగుణమూర్తి యగుచు
జీవరాసులనెల్ల సృజియింపఁ గర్తయై
                     దంపతులకు నధిదైవ మగుచు
అనుపమమమకారహంకారముల కధి
                     దేవతయగు రతిదేవిఁ గూడి
పూవులు చివురులు నునుకైదువులును దాల్చి
మువురువేల్పులు మౌనులు మొదలుగాఁగ
జగములు నిజాజ్ఞలోనుండఁ జతురవృత్తి
మహిమ మీఱంగఁ జెలువొందు మన్మథుండు.


వ.

అట్టి మదనదేవాధిష్ఠితంబగు తృతీయపురుషార్థంబు
పరలోకసాధనంబగు ధర్మశాస్త్రంబుకన్న నిహలోకసాధకం
బగు కామశాస్త్రంబు మతిమంతు లగువారికి మోక్షసా
ధకం బగునది యెట్టులనిన:-“ధర్మావిరుద్ధో లోకేస్మిన్

కామోఽస్మి భరతర్షభ” యను భగవద్వచనప్రామాణ్యంబున
ధర్మార్థంబుల ననుసరించిన కామంబు కామత్వంబు నొసంగు. స్వ
కాంతామాత్రకృతకామకళావిశేషంబులఁ బుత్రసంతతి గల్
గుటంజేసి పరలోకసాధకంబగు గార్హస్థ్యధర్మంబున సౌఖ్యావహం బ
గుట నిహలోకసాధకం బగు మరియు జ్యోతిష్టోమాదులకు నివియ
ఫలంబు లగుటను, ‘అపుత్రస్య గతిర్నాస్తి’ యను వచనంబునకు
విషయం బనియును, గామశాస్త్రంబు గ్రాహ్యంబనికాదె వా
త్స్యాయనాది మహామునులు దీనివిధంబు తేటపరచిరి. ఈ
శాస్త్రంబున నిత్యంబులగు కామ్యకర్మంబు లాచరించి స్వదార
మాత్రంబున విషయానుభవంబు సేయుచు ఫలంబుకొఱకు పర
కాంతాసంగమాదినిషిద్ధకర్మంబు లాచరింపక యీశ్వరార్పిత
సర్వకర్మకారియై మనఃప్రసన్నత గలుగుటంజేసి ధర్మావిరోధ
సామశాస్త్రంబు మోక్షంబునకు సాధకంబగునని కాదె మను
ప్రభృతి స్మృతులయందు గృహస్థాశ్రమంబు హెచ్చని వర్ణింప
బడియె నదియునుం గాక.


క.

మానిత మార్కండేయపు
రాణాదులయందు విహితమగు దుష్టసురా
పానాదులవలెఁ బాపవి
ధానము గలదే యొకింత తలపోయంగన్.

క.

కావున నిస్సారంబగు
నీవిశ్వమునందు సార మెంచగ యువతీ
భావానుకూలరత మొక
టై వెలయు పరాత్మపరచిదానందములన్.


క.

ధారుణి సర్వేంద్రియసుఖ
మారయ నానందరూప మది బాహ్యాంత
స్సారసురతములఁ గల్గు న
పారపరబ్రహ్మసౌఖ్యపద మన మిగులన్.


ఉ.

జాతియు లక్షణంబు కళ సత్వము భావము దేశమున్ మనః
ప్రీతియు భోగవైఖరులభేద మెఱుంగక వారిజాక్షులన్
బ్రీతులఁ జేయలేమి సుఖవృద్ధిని గాంతురె హాపశుక్రియన్
గోతికి నారికేళము లఘుక్రియ నబ్బినఁ గార్య మున్నదే?


క.

ఆరయ సంభోగవిధాన
ప్రారంభము రతి యనంగఁ బరగు దదీయా
ధారమగు రసము దా శృం
గారంబన వినుతికెక్కుఁ గౌతుక మమరన్.

క.

ధారుణి శృంగారమునకుఁ
గారణ మరయంగ నాయికానాయకు లా
మేర యలంకారములం
దారూఢిగఁ బలుకఁబడియె నభిమతఁ గతులన్.


సీ.

దివ్యనాయకులు నదివ్యనాయకులును
                     నుభయనాయకులన నొప్పుమొదల
నలకూబరజయంతనలినబాణాదులు
                     దివ్యు లర్జునబలదేవముఖ్యు
లరయ వీర లదివ్యు లగుదురు విక్రమా
                     ర్కాదులు నుభయనాయకులు దలఁప
నీ త్రివిధంబుల నెనయు నాయకులకు
                     నాల్గుజాతులు ప్రధానంబు లవియు
భద్ర కూచిమార పాంచాల దత్తుల
నాఁగనొప్పు దేవనాథుఁడాది
భద్రజాతి, మాణిభద్రాదు లలకూచి
మారజాతి యగుచు సౌరుగంద్రు.


ఆ.

పంచబాణముఖులు పాంచాలజాతియౌ
చంద్రముఖులు దత్తజాతివారు
నింక నుభయులందు నెఱిఁగింతు బలభద్ర
ముఖులు భద్రజాతి ముఖ్యు లరయ.

ఆ.

కూచిమారజాతిఁ గొమరొందు భీముండు
రఘుకులేంద్రుఁడైన రామవిభుఁడు
ప్రౌఢయశుఁ డొకండె పాంచాలపురుషుండు
తపనతనయుఁ డాది దత్తజాతి.


ఆ.

ఇపుడు పలికినట్టి యీ పురుషులకెల్ల
లక్షణములఁ గన నలక్షితములు
నైన మనుజులందు నభిహితలక్షణం
బుల నెఱుంగవలయు ముదముతోడ.


సీ.

అతిబలసంపన్నుఁ డభిమాని పృథుకాయుఁ
                     డరుణనేత్రుఁడు క్రోధి యతులతేజుఁ
డతివిశాలంబగు నాస్యంబు వక్షంబు
                     గలవాఁడు వక్రోక్తి బలుకువాఁడు
నార్ద్రదేహుఁడు నీతిశాలి గంభీరుండు
                     బవిరిగడ్డమువాఁడు బల్లిదుండు
సాహసాంకుఁడు దాత సత్యవాక్యరతుండు
                     మేరుధీరుఁడు రాగమేదురుండు
వళులు గలవాఁడు పొడవగు పాండుమేన
రోమములు చాల గలవాఁడు రూఢిఁ జెందు
భద్రపురుషుం డనంగ విభ్రమముతోడ
విక్రమార్కుఁడు మొదలగు వీరవరులు.

సీ.

సమబలుఁ డతిఖర్వుఁ డమలనేత్రుఁడు కామి
                     ద్యూతపరుండు నిమ్నోదరుండు
అతినీలవర్ణుండు మతిశాలి తంత్రజ్ఞుఁ
                     డధికమత్సరి మూర్ఖుఁ డల్పరతుఁడు
మర్యాదలేమి సమ్మతముగానియతండు
                     పరనిందరతుఁడు నిష్కరుణుఁ డెపుడు
ఇంగితజ్ఞానవిహీనుండు మత్సర
                     గ్రస్తుండు కఠినవాక్భాషణుండు
సంతతంబు తనదు సంస్తుతికలరెడి
స్వార్థపరుఁడు పరహితార్థవైరి
నాస్తికుండు కోపి ప్రస్తువాక్యుండు
కూచిమారుఁ డనఁగఁ గొమరుజెందు.


సీ.

అతికరుణాశాలి యతిధర్మనిష్ఠుఁడు
                     ప్రియవాది మితభాషి ధీరహితుఁడు
నిండుచందురునవ్వు నెమ్మోముగలవాఁడు
                     వెడఁదకన్నులవాఁడు వినుతయశుఁడు
ఆజానుబాహుండు రాజలక్షణశాలి
                     మత్తమాతంగసమానయాయి
నిమ్మపండు వితాన నెమ్మేనుగలవాఁడు
                     మంజుభాషయుతుఁడు మానధనము

ఆ.

గలుగువాఁడు మేను చులకనగలవాఁడు స
త్కర్మరతుఁడు సత్యతత్పరుండు
విక్రమించునెడను వీరాధివీరుండు
పూతచరితుఁ డార్యపూజితుండు.


గీ.

దేవతాగురుపూజలఁ దేలువాఁడు
ఏకపత్నీవ్రతుఁడు వివేకశాలి
దానమును నుబ్బు విద్యయుఁ దనరువాఁడు
పురుషవర్యుఁడు పాంచాలపురుషుఁ డగును.


సీ.

అలసుఁడు మత్సరి యతిశయధృతిమంతుఁ
                     డల్పబలుండు మిథ్యాగుణుండు
అతిదంభయుతుఁడు విహారశీలుఁడు కామి
                     కుటిలచిత్తుఁడు రక్తకుంతలుండు
అతికృశదేహుండు వితతాధరాంగుండు
                     కూచిగడ్డమువాఁడు కుత్సితుండు
చెక్కుల ఱొమ్ము వెన్నునఁ జేతుల రోమముల్
                     మొలవనివాఁడు సమున్నతుండు

మఱపుగలవాఁడు చింతల మలయువాఁడు
కర్కశాంగుండు దుర్నీతి గలుగువాఁడు
కృపణచిత్తుండు మందుండు విపులకేశి
దత్తుఁ డని పల్కఁబడియె సమ్మతముగాఁగ.


గీ.

ఇంక స్త్రీలకు జాతుల నేర్పరింతుఁ
బద్మిని యనంగఁ జిత్తినీభామ యనఁగ
శంఖిని యనంగ హస్తినీసంజ్ఞు యనఁగ
వరుస దివ్యాదిభేదము ల్గరిమ జెందు.


గీ.

దివ్యకాంతలలో శచీదేవి మొదలు
భామినులు పద్మిను లనంగఁ బల్కఁబడిరి
చిత్తినులు మేనకాదులై చెల్వుగాంతు
రవల శంఖిని తారయై యతిశయిల్లు.


క.

వినుము తిలోత్తమ హస్తిని
యనఁగాఁ జెలువొందు నింక నతినిపుణముగాఁ
గననగు దివ్యాదివ్యాం
గనలందును వీటివిధము క్రమ మెఱుగంగన్.


గీ.

పద్మినీజాతి రుక్మిణీభామ దలఁపఁ
జిత్తిని యనంగ ద్రౌపది చెలఁగుచుండు
శంఖినీజాతిభామిని సత్యభామ
రాధికాదేవి హస్తినీరమణి యయ్యె.

వ.

ఇంక నాదివ్యలైన పద్మినీ, చిత్తినీ, శంఖినీ, హస్తినీ
నామంబులుగల స్త్రీల లక్షణంబు లెఱింగింతు నందులీ పద్మినికి
లక్షణం బెట్టిదనిన.


సీ.

పొందుగల్గిన మేను పున్నమచందురు
                     గేరుమోమును నీలకేశసమితి
అర్ధచంద్రునిబోలు నలికభాగము నల్ల
                     కల్వల నిరసించు కన్నుదోయి
యొండొండు గలియకయుండు కన్బొమ్మలు
                     నిద్దంపు నునుజెక్కుటద్దములును
నువుఁబువ్వు రీతిని నొనరైన నాసిక
                     పచ్చిక్రొంబగడంబు వంటి మోవి
ధవళముక్తామణులగేరు దంతపంక్తి
రేఖ లమరిన శంఖంబు రీతి గళము
నిక్కు శ్రీకారములఠీవి కెక్కుచెవులు
తమ్మితూడులనేలు కేల్దండ లమరి.


సీ.

అరుణమ్ములై మృదువైనహస్తమ్ములు
                     నక్షత్రములఁగేరు నఖరపంక్తి
యున్నంతబై చాల నొండొంటి నొరయుచు
                     బలువయి కఠినమై బలుపు గల్గి

సమమయి యెడలేక చక్కనిమారేడు
                     ఫలము సరివచ్చు చెలువు గలిగి
చనుదోయ నునుచీమచాలేరు నూగారు
                     పొన్నమొగ్గలఁబోలు చన్నుమొనలు
పైఁడిగేదంగిరేకుల పాటినునుపు
గలిగి రోమాళిలేక నిశ్చలములైన
చిరుతదోర్మూలములు నొక్కచేత నణఁగు
నడుము లేఁబొన్నపూవంటి నాభి గలిగి.


సీ.

నిండారునిసుకతిన్నెలఁబోలు పిరుదులు
                     విరుగండ్లఁబోలిన చిరుతగండ్లు
అద్దమువలె నున్ననైయున్న జఘనంబు
                     వళులొప్ప నరచేతివంటిబోటు
తామరమొగ్గవిధమైన మరునిల్లు
                     నబ్జగంధముగల్గు నచటిరసము
నునుబంగరనఁటుల నెనయు పెందొడలును
                     పూబంతి కాంతిని బోలుజాలు
లంపపొదియలు చిరుతొడ లబ్జములను
గేరుపదములు రాయంచ గేరునడుపు
మృదుశిరీషసుమంబుల నేలుమేను
గలుగుపూ(తిరు)బోఁడి పద్మినీకాంత యయ్యె.

సీ.

దేవతాభక్తియు దీనులయెడ దయ
                     నెరసిగ్గు పలుకుల నేర్పు గలిగి
పలుకాడునంతనే పొలయల్కయోరుపు
                     కలహంస లులికెడు నెలుగు గలిగి
తెల్లనిపూవులు తెల్లనివస్త్రముల్
                     సవరించు కొద్దిభోజనము గలిగి
కుందనమ్మువితాన నందమౌ మైచాయ
                     నల్లగల్వల నవ్వఁజాలుచాయ
గలిగి పొడవును బొట్టియుఁ గాకవ్రతము
లాచరింపుచు సాధ్వియై యధిపునందుఁ
బ్రేమగల్గిన యెలనాఁగ నేమమమరు
పద్మినీకాంతయన నొప్పుఁ బ్రస్తుతింప.


గీ.

రాత్రి నాలవజామున రతి యొనర్చు
బద్మిని యటందు రిఁకఁ బట్టబగటియందె
కరఁగు శుచి యయ్యు నల రవికరము లంటి
వికసనమునందు దామరవిధము దోఁప.


క.

ఈపద్మిని పాంచాలునిఁ
దా పరిణయ మగునుగాని తలపోయంగా
నేపట్టున నయినన్ గన
నేపురుషుల వలచియుండ దీలోకమునన్.

క.

ఋతుమతియుండ మధు
వ్రతములగుంపుపయి గ్రమ్మి పరిమళము గనున్
సతిమేన్ జెమరించినచో
బ్రతియేది సహస్రపత్రవాసన నిండున్.


వ.

ఇఁక జిత్తినీజాతి లక్షణంబు చెప్పెద నవధరింపుము.


సీ.

పలుచనిదేహంబు బటువైననెమ్మోము
                     చపలదృక్కులు శిల్పచతురతయును
కొదమతుమ్మెదగుంపుఁ గదలించు నెరికురుల్
                     పొడవైనసంపెంగఁ బోలుముక్కు
బలిసినకుచములు భారంపుబిరుదులు
                     నతికృశమైయుండు నట్టినడుము
మిక్కిలిలావును మిక్కిలిసన్నంబు
                     గాని నెమ్మేను నుత్కటరతీచ్ఛ
మొల్లమొగ్గలట్ల పొడవైన దంతముల్
చివురుజొంపమట్లు తొవరుమోవి
పోకబోదెరీతి పొలుపైన కంఠంబు
సన్నమైనకాక జంఘ లమరి.


సీ.

నెమిలికుత్తుకఁబోలు నీటుకంఠధ్వని
                     సంగీతమందునఁ జాలఁబ్రేమ

పొడవగుదేహంబు కడుస్థూలమును గాక
                     మదపుటేనుఁగు గతి మందగతియు
పలుచనిజఘనంబు పైని దట్టము గాక
                     విరళమౌ రోమముల్ వెళుపు గల్గి
లోపల నెడగల్గి లోఁతగు మరునిల్లు
                     నతిమృదువై యూర్ధ్వమై చెలంగు
మరునియుదకంబు తేనియ యొఱపువెగటు
వెలయుఁ జిత్రాంబరంబుల ప్రేమ గల్గి
మొదటిజామునఁ గలయుచు మోదమందు
జిత్తినీకాంత యెంతయుఁ జిత్రముగను.


క.

తనమనసు నీయ దొక్కరి
మన సవలీల గ్రహించు మమత యధికమౌ
తనయు నతివేగమున ముద
మొనరగ రతి భద్రజాతిపురుషునివలనన్.


వ.

ఇటుపైని శంఖినీజాతి లక్షణముఁ జెప్పెదము.


సీ.

శిరమును బాహువులే నెరయ దీర్ఘమ్ములై
                     కృశములై యుండు నారీతి కుచము
లల్పములై యుండు నటువలె గాఁకున్న
                     లంబమానములు నితంబయుగము

ఘనము పాదములు దీర్ఘములు దట్టమ్ములై
                     తనువును శిరమునుఁ దగు కచములు
లోవంపుదేహము భావింప స్థూలంబునై
                     క్రాఁగుచుండు నేయవసరమున
ఘుర్ఘరస్వరంబు కుత్తుకనడకయు
భూమి యదర వేగముగఁ జరించు
కుటిలమైనచూపు క్రూరమైన మనంబు
కొండెములనె పల్కుచుండు నెపుడు.


సీ.

సంభోగమునఁ బ్రీతి చాలఁ గల్గిన యది
                     నెలవంకగుంపులు నిండఁగోరు
కోరికల్ మిక్కిలి కోరు నెఱ్ఱనిపూవు
                     లెఱ్ఱనివస్త్రము లిచ్ఛయించు
పచ్చవర్ణం బొండె హెచ్చు ధూసరకాంతి
                     యొండె కల్గినది రెండొండె ప్రకృతి
దయలేనియది మట్టి తలఁప భోజనము ద్ర
                     వము లేకుండు దర్పకునియిల్లు
అచటిరసమును కాక్షారమయ్యు నెగటు
గంధమును గల్గి యుండుఁ దాఁ గరగెనేని
వేగమే ప్రీతిఁ జెందు నివ్విధము గలది
శంఖినీకాంత కామశాస్త్రంబునందు.

క.

రాతిరి మూఁడవజామున
బ్రీతి వహింపందలంచుఁ బ్రియతమునిపయిన్
ఏతఱి శంక వహించుం
జేతోగతిఁ గూచిమారుఁ జేరి రమించున్.


వ.

ఇంక హస్తినీజాతి లక్షణముఁ జెప్పెద.


సీ.

మిక్కిలిస్థూలంబు మేను పొట్టియు దల
                     వెంట్రుక లెఱ్ఱనై వెలయు గళము
కుదిసి లావై యుండు క్రూర నిర్దయురాలు
                     పదము లంగుళములు వక్రములగు
బిరుసుమే నతిమంద మరయ యానము నెఱ్ఱ
                     నైనవర్ణము గొప్పయైన మోవి
ఏనుఁగుమదమున కెనయైన రతివారి
                     మేనిచెమ్మట నవ్విదానమరు
తరుచు నల్లని రుచి మేనఁ దనరుఁ జాల
భోజనము సేయు గాద్గద్యమును వహించు
కంఠనాదంబు రతియందు కష్టసాధ్య
హస్తినీకాంత నలుపుల నాసనేయు.


క.

అద్దమరేయిని రతిచే
నొద్దిక రమియించు వెండియుం బ్రియ మమరన్

ముద్దియ మధ్యాహ్నంబున
ముద్దు గనన్ భద్రజాతి పురుషునివలనన్.


వ.

ఇవ్విధంబున.


గీ.

నాల్గువిధములైన నాయికానాయకు
లందు గొన్నియైన లక్షణములు
గలిగెనేని తెలిసి కాంక్షఁ దత్తజాతి
నిర్ణయింపవలయు నేర్పుమీఱ.


వ.

మఱియు నాల్గువిధమ్ములైన కాంత లొక్కొక్కరు
ప్రత్యేకంబు దేవసత్వయు, గంధర్వసత్వయు, యక్షససత్వయు,
మనుష్యసత్వయు, పిశాచసత్వయు, నాగసత్వయు, కాకసత్వ
యు, ఖరసత్వయునన నెన్మిధివిధాలు గల్గియుందురు.


గీ.

కడుబ్రసన్నముఖము కమ్మనిమైతావి
మంచిపలుకు జనుల మంచితనము
చెలువు ముదము కలిమి శీలంబు గల్గిన
యతివ దేవసత్వ యనగనొప్పు.


గీ.

శ్రీకరంబగు నవయవశ్రేణి గల్గి
గంధమాల్యాభిరుచియును గానమహిమ
చారువేషంబు దగు విలాసములు గల్గి
కాంత యైనది గాంధర్వసత్వ యయ్యె.

గీ.

మహితభోగవాంఛ మద్యమాంసంబుల
నాస లజ్జ లేదు రోస మధిక
మింపుబటువు చనులు చంపకములచాయ
గలిగి యక్షసత్వ చెలువుమీఱు.


గీ.

అతిథిగురుదేవతాబంధులందుఁ బ్రీతి
మంచికోరికఁ దలఁచు నిర్మలము మనసు
వ్రతము లొనరించి కృశియించు వామనయన
ధారుణి మనుష్యసత్వయై తనరుచుండు.


గీ.

పొట్టిమలినంబు నలుపును సొట్టమోము
దుష్టచేష్టలు తేటిమేన్ దుష్టచరిత
అధికమయ్యును కుత్సితమైన భక్తి
శక్తిగల కామిని పిశాచసత్వ యగును.


గీ.

ఆవులించుఁ జాల నేవేళ నిదురించు
గుటిలశీలత బుస కొట్టుచుండు
అధికకోపి యగుట వ్యాకులచిత్తయై
సౌరుగాంచు నాగసత్వ యనఁగ.


క.

ఎక్కుడు త్వరచేఁ బనులన్
జక్కఁగఁ జేయదు భ్రమించు సరిమెల్లకనుల్
మిక్కుటమాఁకలి యెప్పుడు
నక్కామిని కాకసత్వ యన నొప్పదొకో.

క.

జలముల నాడదు పూయదు
కలపమ్ముల నెపుడు విప్రియమె మాటాడున్
తలఁపు స్వభావము దుష్టము
నలచెలి ఖరసత్వ యనగ నమరున్ గృతులన్.


క.

ఈయెనిమిదిభేదంబులు
నాయాయెడ బద్మినీముఖాంగనలందున్
దాయోజింపగ వలయును
వ్రాయఁగలేన్ గ్రంధవిస్తరంబగుట నిటన్.


వ.

ఇవ్విధంబున ముప్పదిరెండుభేదంబులుగల కాంతలు
ప్రత్యేకంబుగా వాతప్రకృతియు, పైత్యప్రకృతియు, శ్లేష్మప్రకృతి
యు నన బ్రకృతిభేదంబులు గలవార లగుదురు. తత్తత్ప్రకృతి
లక్షణం బెట్టిదనిన.


చ.

జయజయసింగభూరమణచంద్రమ చంద్రమనోజ్ఞకీర్తికా
శయ శయఖడ్గకృత్తరిపుజాలక జాలకసన్మణిగృహో
దయ దయమానవీక్షణసుధారసరక్షితసాధుగేయస
న్నయ నయనాభిరామనృపనందన నందనరాజవైభవా!


చౌపద.

భోసలవంశాంభోనిధిచంద్రా!
భాసురతేజోపాస్తదినేంద్రా
శ్రీసముదాత్తాశేషవిశేషా
వాసవభోగావర్ణితవేషా.

మాలిని.

సరసవిబుధగేయా సత్యభాషావిధేయా
నరవరమణిపూజ్యా నవ్యయోగాంతరాజ్యా
సురుచిరతరమూర్తీ సూరిసంస్తుత్యకీర్తీ
దరహసనవిలాసా దానలక్ష్మీవిలాసా.


గద్య.

ఇది శ్రీ గురుచరణారవిందమిళిందమాన నెల్లూరి
వీరరాఘవామాత్యతనూభవ సూరమాంబాగర్భశుక్తిముక్తా
ఫల సంస్కృతాంధ్రసాహిత్యసామ్రాజ్యసార్వభౌమ శివరామ
నామప్రణీతంబైన కామకళానిధియను కామశాస్త్రంబునందు
బ్రథమాశ్వాసము.