కవి జీవితములు/రామరాజభూషణకవి

శ్రీరస్తు.

కవిజీవితములు.

ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము.

15.

రామరాజభూషణకవి.

ప్రబంధాంకము రామరాజభూషణుఁడు హరిశ్చంద్రనలోపాఖ్యాన గ్రంథకర్త. ఆంధ్రములో రాఘవపాండవీయముతో సమానమై అంతకంటెను గవిత్వశయ్యాదులలో గౌరవాధిక్యము నందినకావ్య మీహరిశ్చంద్రనలోపాఖ్యాన ద్వ్యర్థికావ్య మైయున్నది. అట్టికావ్యములోని విశేషముల నుడువుటకుఁ బూర్వ మాకావ్యమును రచించినకవి యెవరు అనుసంప్రశ్నముంగూర్చి వ్రాయవలసియున్నది.

నరసభూపాలీయకర్త యగుభట్టుమూర్తియే దీనినిఁగూడ రచియించినట్లు వాడుక గలదు. అట్లు కాదనియు నీయిర్వురు వే ఱనియు సంగ్రహముగాఁ గొన్నిమాటలు పూర్వము నాచే రచియించఁ బడిన కవిజీవితపుమొదటికూర్పులో వ్రాయంబడినవి. అట్టివానినిఁ దిరస్కరించి కొందఱును బలపర్చి కొందఱును వాదింప నారంభించిరి. పిమ్మట నందులో నిర్వురు పండితు లీవిషయమై విస్తారము సంవాదము చేసి వారియభిప్రాయముల వ్యక్తీకరించుచుఁ గొన్ని గ్రంథములు వ్రాసి ప్రకటించిరి. అట్టి గ్రంథములు రెండును నాకడకు వచ్చి యుండుటంజేసియు నేను తిరుగ నాకవిజీవితములను రెండవకూర్పునఁ బ్రకటించుచుండుటంజేసియుఁ బైపండితులగ్రంథంబులపై నా వలన నీవఱలో నీయంబడియున్న యభిప్రాయము గలయొకసిద్ధాంతోపన్యాసము నిందులో ముందు ప్రకటించుట మంచి దని యెంచి యట్లు చేయుచున్నాను. అది కొంచెము గ్రంథవిస్తరము గలదిగా నున్నను ఇపుడు మనము చరిత్ర వ్రాయుచున్న రామరాజభూషణుఁడు నరసభూపాలీయకృతిపతి యగుభట్టుమూర్తి స్పష్టముగా కాఁ డని నిశ్చయించి చెప్పుటకు చాలియుండఁగా, అట్టిసిద్ధాంతము ప్రత్యేక మాయిర్వురివలనను జేయంబడిన వసుచరిత్ర హరిశ్చంద్రనలోపాఖ్యాన నరసభూపాలీయములనుండియే చూపింపఁబడినది గావున నది సర్వజనాదరణీయము కాకపోదు కావున నాయుపన్యాససంగ్రహము నిట వివరించెదను.

భట్టుమూర్తి రామరాజభూషణుఁడా ?

ఆ 1896 సంవత్సరములోని పట్టపరీక్ష (B. A. Degree Examination) కుఁ బఠనీయాంధ్రగ్రంథములలో నొక్కటియగు హరిశ్చంద్రనలోపాఖ్యానగ్రంథమును ముద్రించి ప్రకటించుచున్న బ్ర. మ. పూండ్ల రామకృష్ణయ్యపంతులవారివలన నెల్లూరినుండి పంపఁబడిన (68) పుటలగ్రంథసంచిక యొకటి యీనడుమ మాకార్యస్థానముం జేరినది ఆగ్రంథములోనివిశేషముల నారయుటకై కోరి మొదటిపుట తిరుగ వేసి చూచినతోడనే యముద్రితగ్రంథచింతామణిపత్త్రి కాధిపతి యగు పైరామకృష్ణయ్యపంతులవారిచే రచియింపఁబడినపీఠిక యనుశీర్షిక యొకటి కాన నాయెను. అందలియంశములు చూడంజూడ ప్రథమమున దాని పైని మాయభిప్రాయ మీయనిదే గ్రంథవిషయ మైనయభిప్రాయమీయ వీలు లేనందున నిపు డాపీఠికపై యభిప్రాయమునే వ్రాయుదము.

ఆపీఠికలో 7 పేరాలవఱకును కవి యగురామరాజభూషణుని చారిత్రవిషయమై బ్ర. కందుకూరివీరేశలింగము పంతులవారికిని రామకృష్ణయ్య పంతులవారికిని నడిచిన సంవాదమై యున్నది. అట్టియుభయులసంవాదమును ప్రస్తుతము మేము విమర్శన చేసి మాఅభిప్రాయముతోఁ బ్రకటించెదము. రా. కృ. పీఠికలో హరిశ్చంద్రనలోపాఖ్యానమును వసుచరిత్రాది కావ్యములను రచియించినసూరపాత్మజుఁ డగుప్రబంధాంకము రామరాజభూషణకవి విరచించెను, ఇక్కవి నిజమైననామముబట్టి మూర్తి యనియును, రామరాజభూషణుఁ డనునది రామరాజుయొక్క యాస్థానమం దుండుటచేత వచ్చినబిరుదునామముగా గొందఱనుచున్నారని క. వీ. ఆంధ్రకవులచరిత్రమునఁ బ్రకటించి తా మట్టివారి యభిప్రాయములను ఖండించి వ్రాయనందున నందుల కొప్పుకొనినవారుగఁ గనుపించుచున్నా రని వ్రాసియుండిరి. అయితే ఇట్టిచోటుల ఆంధ్రకవుల చరిత్రములో నెట్లు వ్రాయ బడినదో దాని నుదాహరింపనిదే మాయభిప్రాయ మీయ వలనుపడదు. గావున దాని నీక్రింద వివరించెదము.

ఆంధ్రకవులచరిత్రము 66 వ పుటలో

"మూర్తి యనియు రామరాజభూషణుఁ డనియును ఇద్దఱు వేఱువేఱుకవు లనియును, అందు మూర్తికవి నరసభూపాలీయమును, రామరజభూషణకవి వసుచరిత్ర హరిశ్చంద్రనలోపాఖ్యానములను రచియించి రని కొందఱును, ఇద్దఱు నొక్కరే యనియును, మూర్తి యనునది నిజమైనపేరు అనియు రామరాజభూషణుఁ డన్నది రామరాజుయొక్కసభ కలంకారముగా నుండుటచేత వచ్చినబిరుదుపే రనియును నతఁడు సూరపరాజున కౌరసపుత్త్రుఁడై తదగ్రజుఁ డైనవేంకటరాయభూషణునకు స్వీకృతపుత్త్రుఁ డని మఱికొందఱును చెప్పుచున్నా రనియును, వసుచరిత్రములోనిగద్యమొకవిధముగాను నరసభూపాలీయములోని గద్య మింకొకవిధముగా నుండుటంబట్టియు, హరిశ్చంద్రనలోపాఖ్యానములో సూరపాత్మజుఁడు రామభూషణుఁడనియు, నరసభూపాలీయములో వేంకటరామభూషణ సుపుత్త్రుఁ డగుమూర్తియనియు తండ్రులను వేఱువేఱుగాఁ జెప్పుటనుబట్టియు వారు వేఱుకవు లైనట్లు పైకి కానవచ్చు చున్నను కొన్ని హేతువులం బట్టి రెండవపక్షమువారు చెప్పెడియంశములు కూడ సావధానముగా విచారించ వలసినవి గానున్నవి" ఇట్లు వ్రాయంబడి ఆంధ్రకవులచరిత్రములోఁ బైయుభయపక్షములవారును జెప్పెడుయుక్తులను చక్కఁగా గ్రహింపఁ గలుగుటకై వంశక్రమమును తెల్పెడురెండుపద్యము లుదాహరింపఁబడినవి. అయితే క. వీ. గారి కావఱకు పైకవు లిర్వురు వేఱువేఱని కల్గినయభిప్రాయము రెండవ వృత్తాంతము వినినతోడనే మాఱినట్లును దాని నొకసిద్ధాంతము చేయుటకు తోఁచక చదువరు లట్టిసిద్ధాంతము చేసికొనుటకు పైకవు లిర్వురు నొక్కనిగానే భావించి ఆపక్షములో నితరులు చెప్పుయుక్తులు తామే చెప్పి వారిపక్షమును తామే అవలంబించి వ్రాసిన ట్లున్నది. రెండుపక్షములును వినినచదువరులు సిద్ధాంతముఁ జెప్పవలసినవారు కావున నే నిపుడట్టి సిద్ధాంతమును స్పష్టీకరించెదను. వారిసిద్ధాంతమునకు ప్రధానమైనయొకవిశేషముగూడ వివరింపఁబడినది. అది యెద్దియనఁగా, ఇరువురును భిన్ను లైనను కాకపోయినను చరిత్రభాగమునందు వేఱు వేఱుగ వ్రాయవలసినయంశము లేవియుఁ గానఁబడవు అను దీనితో నే నేకీభవింపను. ఇరువురు భిన్ను లైనపుడు వ్రాయవలసిన చరిత్రభాగమున్న దనియే నాయభిప్రాయము. కావున నీ సంప్రశ్నము సంపూర్ణముగా విచారించవలసిన దని చె ప్పెదను. దానికిగా నుదాహరింపఁబడిన పద్యము లెవ్వి యనగా :-

నరసభూపాలీయము.

సీ. శతలేఖినీపద్యసంధానధౌరేయు, ఘటికాశతగ్రంథకరణధుర్యు
     నాశుప్రబంధబంధాభిజ్ఞు నోష్ఠ్య ని,రోష్ఠ్యజ్ఞు నచలజిహ్వోక్తినిపుణుఁ
     దత్సమభాషావితానజ్ఞు బహుపద్య, సాధితవ్యస్తాక్షరీధురీణు
     నేకసంధోచితశ్లోకభాషాకృత్య, చతురు నోష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞు
     నచలయమకాశుధీప్రంబంధాంక సింగ, రాజసుతతిమ్మరాజపుత్త్రప్రసిద్ధ
     సరసవేంకటరాయభూషణసుపుత్త్రు, నను బుద్ధవిధేయు శుభమూర్తినామధేయు.

హరిశ్చంద్రనలోపాఖ్యానము.

సీ. వనధిలంఘనకృపావార్ధితోభయకవి, తాకళారత్న రత్నాకరుండ
    సకలకర్ణాటరక్షాధురంధరరామ, విభుదత్తశుభచిహ్న విభవయుతుఁడ
    వసుచరిత్రాదికావ్యప్రీతబహునృప, ప్రాపితానేకరత్నప్లవుండ
    శాశ్వతశ్రీవేంకటేశ్వరానుగ్రహ, నిరుపాధికైశ్వర్యనిత్యయశుఁడ

శ్రీకరమహాప్రబంధాంక సింగరాజ, తిమ్మరాజప్రియతనూజదీరసూర
పాత్మజుఁడ రామభూషాఖ్యఁ బరగుసుకవి, నంకిత మొనర్తు నీకావ్య మనఘభక్తి.

వసుచరిత్రము.

మ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
      దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశిసం
      జనితైకై కదినప్రబంధఘటికాసద్యశ్శతగ్రంథక
      ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెం గృపన్.

మూఁడుపద్యము లుదాహరింపఁబడినవి. కాని యీమూఁటికి సహచరములుగా నున్నయాశ్వాసాంతగద్యములలో నున్న విశేషము లీస్థలములో నుదాహరింపఁబడనందున వానింగూడ నిటఁ జేర్చి యనంతర మందులోనిభేదా భేదగుణంబులం జూపెదను.

నరసభూపాలీయము.

4. "ఇది శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసార, సారస్వతాలంకార, నిరంకుశ ప్రతిభాబంధుర ప్రబంధరచనపఠనధురంధర, ప్రబంధాంక వేంకటరాయభూషణ సుపుత్త్ర, తిమ్మరాజపౌత్త్ర, సకలభాషావిశేషనిరుపమావధాన శారదామూర్తి మూర్తిప్రణీతము"

వసుచరిత్రము.

5. "ఇది శ్రీరామచంద్రచరణారవిందనందన, పవననందనప్రసాదసమా సాదిత సంస్కృతాంధ్ర భాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధకవితానిర్వాహక, సాహిత్యరస పోషణ రామరాజభూషణ ప్రణీతము"

ఇట్లు పైగ్రంథములలోఁ జెప్పంబడినకవిత్వవిశేషములఁ బర్యాలోచించుట కొక్కొకదానినే పరిశీలించి చూచెదము.

అందులో నరసభూపాలీయ సంబంధులు.

1. శతలేఖీనీపద్యసంధాన ధౌరేయత = అనఁగా శతఘంటకవిత్వము చెప్పెడు నేర్పు.

2. ఘటికాశతగ్రంథకరణశక్తి = అనఁగా గడియకు నూఱునుష్టుప్పు (శ్లోకము)లు రచియించుప్రజ్ఞ.

3. ఆశుప్రబంధ, బంధాభిజ్ఞత = ఆశుధారగా (Extempore) ప్రబంధములు చెప్పుట, అటులనే బంధకవిత్వము నుడువుట.

4. ఓష్ఠ్య, నిరోష్థ్యజ్ఞత = పెదవులు తగులునటులను అవి తగులనటులను కవిత్వము చెప్పుట. 5. అచలజిహ్వోక్తినైపుణ్యము = నాలుక కదల్చక కవనము చెప్పుట.

6. తత్సమభాషావితానజ్ఞత = తత్సమ, తద్భవ, దేశ్యాదిభాగములు గలయాంధ్ర భాషలోఁ గేవలము తత్సమభాషనే కవిత్వము చెప్ప నేర్చుట.

7. బహుపద్యసాధితవ్యస్తాక్షరీధురీణత = వ్యస్తాక్షరి చేయు నేర్పు పండిత సాధరణప్రజ్ఞ; అందులో ననేక పద్యములలో నొక్కసారి వ్యస్తాక్షరిం జేయుట యసాధారణప్రజ్ఞ, ఇట్టిపనిం జేయుట.

8. ఏక సంధోచితశ్లోకభాషాకృత్యచతురత = ఒక్క సంద కల్గునట్లుగా శ్లోకమంతయుం జెప్పుట.

9. ఓష్ఠ్యనిరోష్ఠ్య సంకరజ్ఞత = ఓష్ఠములు తగులునటులను, తగులనటులను కలిపి కవిత్వము చెప్పు నేర్పు.

10. అచలయనుకాశుధీ = చలించినట్టియు యమకయుక్తమగునట్టి అశుధారాకవిత్వము చెప్పెడుబుద్ధి.

గద్యము.

1. హనుమత్ప్రసాదలబ్ధకవితాసారుఁడ నని.
2. సారస్వతాలంకారుఁ డనని.
3. నిరంకుశప్రతిభాబంధురుఁడ నని.
4. ప్రపబంధపఠనరచనాధురంధరు డ నని.
5. సకలభాషావిశేషనిరుపమానధానశారదామూర్తి నని.

ఇ ట్లుండవానికిఁ గారణము లూహించవలసియుండును. అందు

(1) మొదటివిశేషణముం బట్టి యితఁ డాంజనేయోపాసకుఁ డనియు తనయుపాసనాదేవుని కటాక్షముచేత సంప్రాప్త మైనకవిత్వశక్తి కలదనియుఁ దెలియుచున్నది.

(2) రెండవవిశేషణములోఁ దాను సారస్వతాలంకారుఁ డని చెప్పుటచే విద్యాలంకారము గలవాఁ డని తేలినది.

(3) మూడఁవవిశేషణములో నిరంకుశప్రతిభాబంధురుఁడ ననుటంజేసి కవిత్వమునకుఁ బ్రధానసాధన మగునట్టిప్రతిభ కలవాఁడనియు, నదియు నిరంకుశమైన దనియుం దేలినది.

(4) నాల్గవవిశేషణములో "ప్రబంధపఠనరచనా ధురంధరుఁ డనుటంజేసి" తనకు ప్రబంధపఠనమందును, ప్రబంధరచనయందుంగూడ సమర్థత కల దని వక్కాణించును. తానావఱకొకప్రబంధమును రచియింపకున్నను, ప్రస్తుతములో నైన నట్టిరచనకు ననుకూలసమయము తటస్థించక పోవుటయును లో నూహించి అది దేశములో ప్రబంధరచనాకాల మవుటంజేసి అట్టిప్రజ్ఞ తనయెడ నున్నట్లగుపఱుచుకొనుట ప్రబంధకర్తల కవసర ముండదు. అది లేనినాఁడే దాని నేరైన విశదీకరించుట కవసరము కలుగును. వసుచరిత్ర నరసభూపాలీయకవులు వేఱుగ నుండవచ్చు నని సూచించు కారణములలో నిది యొకటి.

(5) ఇఁక నైదవబిరుదులోఁ దాను సకలభాషలలో నిరుపమాన మగు నవధానతంత్రము చేయఁగలవాఁడ నని సూచించె. ఇది యొక గొప్ప ప్రజ్ఞ. కవిత్వప్రజ్ఞ గలయందఱికిని అష్టావధానతంత్రప్రజ్ఞ యుండదు. అష్టావధానికిమాత్రము కవిత్వప్రజ్ఞ యుండక తీఱదు. అది లేనిచో నవధానప్రజ్ఞ నిరుపయోగ మగును. నరసభూపాలీయకవి కారెండుప్రజ్ఞలు కలవు.

రామభూషణునియొక్క పద్యములోను గద్యములో నుండునవియే రామభూషణకవి కవితావిశేషము లని చెప్పవలసియున్నది. కావున వానిని వేఱ్వేరుగ నీక్రిందఁ బరిశీలింతము.

1. ఏకైక దినప్రబంధఘటన = ఒక్కొక్కదినమున నొక్కప్రబంధము సంఘటింపఁ జేయుశక్తి.

2. సద్యశ్శతగ్రంథకల్పన = అప్పటి కప్పుడు నూఱనుష్టుప్పులు చెప్పునట్టిశక్తి.

3. సంగీతకళారహస్య వేదిత్వము = సంగీత శాస్త్రరహస్యములు తెలియు నని గాని సంగీతశాస్త్ర, చతు షష్టి కాశాశాస్త్ర రహస్యములు దెలియునని గాని చెప్పవచ్చును.

ఇట్లు కానుపించు పై కవిత్వప్రజ్ఞలు నిష్పక్షపాతబుద్ధితోఁ బరిశీలించినచో నాప్రజ్ఞలు గలవా రొకరైనదియు నిర్వురైనదియు స్పష్టము కాక మానదు.

వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానములు రచియించినకవికిఁ గలప్రజ్ఞలును, ఉపాసనావిశేషంబు లెట్లు చెప్పంబడినవో చూతము. అందు

1. మొదటిది శ్రీరామచంద్రచరణార వింద వందనము, ఇది కొందఱివలన కవియొక్కవిశేషణముగా నూహింపఁబడక ఆవాక్యము వెంబడినే వచ్చు "పవననందన" శబ్దముతో నన్వయింపఁబడుచున్నది. అట్లు సరి కా దనిచెప్పుట కనేకనిదర్శనము లున్నవి. వాని నీగద్యలోని విశేషములు చెప్పినతోడనే వివరింపఁదలంచి ప్రస్తుతము గద్యములోని విశేషముల నుడివెదము. అంతవఱకును ఆరెండువిశేషణములు వేఱుగాఁ గ్రహింప వేడుచున్నాము. అట్టిచో మొదటివిశేషణాభిప్రాయముంబట్టి పై రెండుగ్రంథముల రచియించినకవిమాత్రము పరమార్థవిషయమై కానోవు రామోపాసనము విశేషించి చేసె నని తేలుచున్నది.

2. రెండవ విశేషణమువలనఁ బవననందనప్రసాద సమాదిత సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్యకవి యని తేటపడు. ఉపాసకులలోఁ గొందఱు ఆముష్మికమున కొకదేవతోపాసనయును, ఐహికమున కొకదేవతోపాసనయుఁ జేయుట కలదు. అటులనే వసుచరిత్రకవి ఆముష్మికమునకు రామోపాసనయు, నైహికమున కాంజనేయోపాసనయుం జేసినట్లును స్పష్ట మగుచున్నది. ఇట్టి యైహికఫలముకొఱకుఁగాఁ జేసిన యుపాసనవలనఁ దనకు సంస్కృతాంధ్రభాషలలో గొప్పకవిత్వ ప్రజ్ఞ కల్గెనని చెప్పెను.

3. చతుర్విధ కవితా నిర్వాహక అను విశేషణము మూఁడవది చతుర్విధకవిత్వ మనఁగా గద్యకవిత్వము. పద్యకవిత్వము, పదకవిత్వము, బంధకవిత్వము అనునవి. అట్టిచతుర్విధకవిత్వప్రజ్ఞ కలవాడు.

4. "సాహిత్యరసపోషణుఁడు" అను బిరుదు వసుచరిత్రకవి కొక్కనికే ఆంధ్రభాషలోనికవులందఱలో మిక్కిలి తగియుండు నని చెప్పవలసియున్నది. ఇది నరసభూపాలీయకవి కున్న ట్లాగ్రంథ మొక సంస్కృతగ్రంథమున కాంధ్రీకరణ మవుటంజేసియు దానిం దెల్పు మఱియొకగ్రంథ మతనిపేరిట లేకుండుటం జేసియు, నతనిగద్యములోఁగాని కవిత్వవిశేషములం జెప్పినపద్యములోఁ గాని యీవిశేషణము చెప్పంబడకుండుటంజేసియు, నిష్పక్షపాతబుద్ధితో నెవ్వరును జెప్పఁజాలరు.

ఇట్లు వసుచరిత్రము, నరసభూపాలీయము ఈకృతియుగంబులోఁ గాన్పించినగ్రంథకర్తల కవితావిశేషంబులం జూపియున్నను రామోపాసనావిషయమై చెప్పవలసినవిశేషములు చెప్పకయే యితరాంశముల వ్రాయ వలనుపడదు. కాన దానిని ముందుగ నిట వివరించెదను.

వసుచరిత్రములో మొట్టమొదటి పద్యము.

శా. శ్రీభూపుత్రి వివాహవేళ నిజమంజీరాగ్రరత్నస్వలీ
     లాభివ్యక్తి వరాంఘ్రిరేణుభవక న్యాలీల యంచున్ మదిన్
     దా భావింప శుభక్రమాకలనచేఁ దద్రత్నముం గప్పుసీ
     తా భామాపతి బ్రోవుతన్ దిరుమలేంద్రశ్రీమహారాయనిన్.

అని స్వేష్టదేవతానతిపూర్వకముగాఁ గృతిపతి నాశీర్వదించి కవివలనఁ బైపద్యము చెప్పంబడియెను. ఇటులనే కావ్యప్రబంధకవులందఱు స్వేష్టదేవతానతి చేసి యొకరికి కృతి యిచ్చుట సర్వత్ర విదితవృత్తాంతమే. కొంద ఱొకకృతి దేవునకే యియ్యఁదలఁచుకొనినయెడలఁ గృతి కధీశ్వరుం డగుదేవుని స్తుతియించి అనంతర మిష్టదేవతను నుతియించుటయుంగూడఁ గలదు. కాని నరాంకిత కృతులందుఁ గవియొక్క యిష్టదేవతానమస్కారమే తఱుచుగాఁ గాన్పించును. వసుచరిత్రములోనే కృతిపతి తన్నుం బిలువనంపె నని చెప్పినసందర్భములోఁగూడ నను శ్రీరామపాదార విందభజనానందున్ అని విస్పష్టముగా వివరింపఁబడియున్నది. దీనినే స్థిరపఱుచుటకును, బలపఱుచుటకును హరిశ్చంద్రనలోపాఖ్యానములో మఱియును బుంఖానుపుంఖముగా శ్రీరామవర్ణనమును, తనకు శ్రీరామునియెడఁ గలభక్తి చూపుటకుఁగాను దాఁ జేసినకార్యాదికములంగూడఁ దెల్పె. అందుఁ గొన్నిటి నిట వివరించెదను :-

హరిశ్చంద్రనళోపాఖ్యానము. ప్రథమాశ్వాసము

కృతిముఖపద్యము.

శా. శ్రీవైదేహసుతన్ భృగూద్వహజయశ్రీనబ్జభృచ్చాపలీ
    లావాప్తిన్వరియించిసత్కుశలవత్వామూల్యమాంగల్యదీ

క్షావాలం బగునాపరిగ్రహయుగం బన్యోన్యహార్దంబునన్
సేవింపం దగు రామచంద్రుఁడు శుభశ్రీ లిచ్చు మా కెప్పుడున్.

అని గ్రంథారంభమందు వసుచరిత్రములో వలెనే శ్రీరామునిఁ గవి వినుతించె. అంతటితోఁ దనివి నందక శ్రీరామసహచరు లగు సీతామహాదేవిని, భరతుని, లక్ష్మణుని, శత్రుఘ్నుని, హనుమంతుని, నుతియించి యిట్టివారికథను కావ్యము చేసినవాల్మీకింగూడ ప్రత్యేక ప్రత్యేకపద్యములతో నుతియించె. ఇట్లు కృతికార్యములోఁ దనకవిత్వేష్టదేవత యగునాంజనేయుని యాజ్ఞయు నైనదనియును, ఆంజనేయుఁడుగూడ నీతనికిఁ గలరామభక్తికి సంతసించి తనకుం బ్రభుం డగురామునకుఁ గృతి యి మ్మని యుత్సహించుటంజేసి యట్లొసంగితి నని చెప్పెను. వసుచరిత్రకవి విశేషముగా రామభక్తుం డై నందునఁ దత్ప్రీతికొఱకాతనిచేఁ జేయంబడినకార్యములు తనకుఁగా దాఁ జెప్పుకొనిన నాత్మ స్తుతిదోషము కల్గు నని తోఁచి కానోవు నాంజనేయవాక్యములుగా నీక్రిందివిధమున వర్ణించె.

సీ. సుతులఁ బెక్కండ్ర శాశ్వతరామనామధ,న్యులఁ జేసిపిలుచుభాగ్యోదయంబు
    రచితాగ్రహారంబు రామచంద్ర పురాంక, పూతం బొనర్చిన పుణ్య రేఖ
    నవదివ్యభవనంబు సవిరించి శ్రీరామ, విభుఁ బ్రతిష్టించినవిపులమహిమ
    రామసరో నామ రమణీయముగఁ దటా,కము వినిర్మించినఘనయశంబు

తే. సఫలత వహించు నీహరిశ్చంద్రనలక, థాయుగనిబంధచిత్రబంధ ప్రబంధ
    మంకిత మొనర్చు రఘుభర్త కఖిలకర్త, కురుతరాభీప్సితము లెల్ల నొదవు నీకు.

దీనింబట్టి చూడఁగా నీవసుచరిత్ర, హరిశ్చంద్ర నళోపాఖ్యానముల రచియించినకవి తనకుఁ గల రామభక్తిం దెల్పుటకుంగాను, (1) తనకుమారులలో ననేకులకు రామనామ ముంచెననియును (2) ఒక గ్రామము గట్టించి దానికి రామచంద్రపుర మనునామ ముంచె ననియును, (3) సుందర మైనదేవతాభవనము (దేవాలయము) కట్టించి దానిలో శ్రీరామవిగ్రహప్రతిష్ఠ చేయించెననియును, (4) చెరువు త్రవ్వించి దానికి రామసరోవర మనునామం బుంచెననియు (5) ఇపు డీహ రిశ్చంద్రనళోపాఖ్యానకృతి రచియించి దీనిని శ్రీరామునకే సమర్పింప నుండె నని తేలినది.

ఇట్లు చెప్పి దానితోఁ దృప్తి నందక ఆగ్రంథములోనే రామాయణకథ నంతయు నిరువదేడుపద్యంబులు గలనక్షత్రమాలికగా నొనరించి రామునకు సమర్పించె. ఇది వసుచరిత్రము, హరిశ్చంద్ర నళోపాఖ్యానము రచియించినకవియొక్క రామభక్తి కథాసంగ్రహము.

ఇఁక నరసభూపాలీయకవికిఁ రామభక్తి యెంతవఱ కున్నదో దాని నాలోచింతము. అందు ప్రథమపద్యము.

"శా. శ్రీలీలావతి తా సురోమణిసభాసింహాసనత్కౌస్తుభా
      వేలాభాప్రతిబింబితాంగి యయిన న్వేఱొక్కతం దాల్చినాఁ
      డౌలే యంచుఁ దలంచునో యని యమందానందుఁ డై లక్ష్మి నే
      వేళం గౌఁగిటఁ జేర్చుశౌరి నరసోర్వీనాథునిం బ్రోవుతన్."

ఇందలిస్తోత్రము వైష్ణవపరమైనను అది కేవల మర్చావతారమగు శ్రీరామవర్ణనముగాక పరమపదనాథుఁ డై లక్ష్మీసనాథుఁ డై యుండిననారాయణుని వర్ణన యై కానుపించును. దీని ననుసరించియే క్రిందిపద్యములో సముద్రమునకు పుత్రికయై చందురునకు సోదరియై, కందర్పునకుం దల్లియై ముకుందసుందరి యైనయిందిరాసుందరి వర్ణింపఁబడినది. ఈదేవి అవతా రాంతరమందు సీతామహాదేవి యైన రామోపాసకులవలన నిట్లు వర్ణింపఁబడదు. అటనుండి సర్వప్రబంధ సామాన్య దేవతావర్ణనలు కొన్ని రచియింపఁబడినవి. అటుపిమ్మట తనకుఁ బ్రధానోపాస్యదైవం బగునాంజనేయునిమాత్ర మీక్రిందివిధంబున వర్ణించెను.

సీ. తనయాస్యగహ్వరంబునకు ఖద్యోతజృం, భణము ఖద్యోతజృంభణము గాఁగ
    తనక రాంభోజాతమున కలగంధమాదన, మొకగంధమాదనము గాఁగ
    తనశౌర్యహర్యక్షమునకు మైరావణ, స్ఫురణ మైరావణస్ఫురణ గాఁగ
    తనవాఁదంభోళి కెనయు కర్బురగోత్ర, గరిమ కర్బునగోత్రగరిమ గాఁగ

తే. వరలు రామానుజన్మ జీవప్రధాన, ధుర్యపర్యాయధాత మేదురవిరోధి
    బలపయోధి విలంఘనప్రబలశక్తి, యోబయనృసింహభూభర్త కొసగుఁగాత.

ఈపద్యములోఁ జేసినవర్ణనయంతయు కేవల మాంజనేయమంత్రకల్పప్రోక్తమహిమానువర్ణనమే కాని వసుచరిత్రములోను హరిశ్చంద్రనళోపాఖ్యానములోను జెప్పినవిధముగ రామభక్తిపరాయణత చే నాంజనేయునకుఁ గల్గినమహిమా విశేషములుగా వర్ణింపఁబడవు. అందు వసుచరిత్రయందలి వర్ణన.

సీ. తరుణార్కకబళ నోద్ధతిఁ జూపె నెవ్వాఁడు, రుచులచే ఫలమోహరుచులచేత
    అకలంక రామముద్రికఁ బూనె నెవ్వాఁడు, శయముచే హృత్కు శేశయముచేత
    మున్నీరు పల్వలంబుగఁ దాఁటె నెవ్వాఁడు, జవముచే గుణగణార్జవముచేత
    అక్షశిక్షాప్రౌఢి నలరారె నెవ్వాడు, రణముచే నియమధారణముచేత

తే. ధరణి, నెవ్వాఁడు దానవద్ద్విరదదళన, విహృతిఁ దనకేసరికిశోరవృత్తిఁ దెలిపె
    నతని మత్కావ్యమంజువాగమృతఘటన, మంజులస్వాంతు హనుమంతు మతిఁదలంతు.

            హరిశ్చంద్రనళోపాఖ్యానములో :-

సీ. రామభక్తునకు భారమె ఘోరపంకాబ్ధి, తరణపాటవ మన శరధి దాఁటి
    రామభృత్యున కరుదా మృత్యునిరసనం, బన మహాఛాయాగ్రహంబుఁ జేరి
    రామకింకరున కబ్రమె రమాసాన్నిధ్య, మన విదేహాధీశతనయఁ గాంచి
    రామైకమతికిఁ జిత్రమె పాశవిగళనో, పాయం బన నజాస్త్రబంధ మెడలి

తే. రామపరతంత్రునకు దుర్భరంబె విలయ, వహ్ని యన వాలశిఖి శిఖావ్యాప్తి నోర్చి
    యరిపురం బేర్చినయజేయు నప్రమేయు, నాంజనేయు మునిధ్యేయు నభిమతింతు.

నరసభూపాలీయకవికి రామవర్ణనఁ జేయుప్రసక్తి కల్గెనా యను దాని నూహింతము. కృతిపతివంశము వర్ణించుచుఁ జెప్పిన సూర్యవంశానువర్ణనములోఁగూడ నరసభూపాలీయకవి శ్రీరామవర్ణనములో విశేషవర్ణన చేయక అతనిపూర్వులందఱతోఁ గలిపి సామాన్యముగా వర్ణించియున్నాఁడు. చూడుఁడు.

సీ. భవ్యుఁ డాతఁడు దీర్ఘబాహునిఁ గనియె నా,తఁడు గాంచె రఘువు నాతనికిఁగలిగె
    బురుషాదుఁ డతనికిఁ బొడమెఁ గల్మాషపా, దుఁడు తత్సుతుఁడుశంఖనుఁడుసుదర్శ
    నుఁడు తత్తనూజుఁ డాతఁడు గాంచె నగ్ని వ,ర్ణ మహీశు నతఁడు శీఘ్రగునిఁ బడసె
    నతనికి మరుఁడు తదాత్మజుఁడు శుజుఁ డా,తని కంబరీషుఁ డాతనికి నహుషుఁ

తే. డతనికి యయాతి నాభాగుఁ డతని కతని, కజుఁడు దశరథుఁ డతనికి నతని కొదవె
    రామభద్రుఁడు తద్వంశరత్న మయ్యె, సొరిదిఁ గలివేళ గలికాలచోళవిభుఁడు.

తిరుగ నాయకగుణవర్ణనములోఁ గులముంగూర్చి చెప్పుచో.

" నేవంశమునఁ బుట్టె నిలఁ జతుర్దశలోక రక్షణక్షముఁ డైనరావణారి"

అని చెప్పెను. ఇట్లు రామదేవతో పాసనాదికములలోఁగూడ భేదంబులేక యున్నవసుచరిత్ర హరిశ్చంద్రనళోపాఖ్యాన గ్రంథకర్తయును, అట్టియుపాసనలలోఁ బ్రధాన రామదేవతోపాసన లేనినరసభూపాలీయకావ్యకర్తయు నొక్కఁడే యని నిర్దేశించి చెప్పంగలిగినచీ నిఁక యుక్తిశాస్త్రమును, గ్రంథదృష్టాంతములు పుక్కిటిపురాణములముందర నిష్ప్రయోజనములు కా వలయు నని చెప్పక తప్పదు.

సంక్షేపాభిప్రాయము.

ఇదివఱలో నచ్చటచ్చట వివరించి యున్న నరసభూపాలీయవసుచరిత్రకవులభేదప్రజ్ఞ లరయుటకుగా నేను పైయుపన్యాసములో నుదాహరించినకవిత్వవిశేషముల సంగ్రహముగాఁ జూపెదను.

నరసభూపాలీయకవి. వసుచరిత్రకవి.
1. శతఘంటకవి ఈబిరు దితనికి లేదు.
2. గడియకు నూఱనుష్టుప్పులు చెప్పఁగలడు ఇది యితనికిని బిరుదే.
3. ఆశుధారను ప్రబంధమును, బంధకవిత్వంబును చెప్పును. ఈబిరుదు లేదు.
4. సోష్ఠ్యముగా, నిరోష్ఠ్యముగాఁ గవిత్వము జెప్పును ఇదియును లేదు.
5. నాలుక కదల్చ నక్కఱయుండనికవిత్వము చెప్పును ఇదియును లేదు.
6. తత్సమభాషాకవి సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్యబిరుదు గలదు.
7. అనేకపద్యవ్యస్తాక్షరి చేయఁగలఁడు ఈబిరుదు లేదు.
8. ఏకసంధోచిత శ్లోకభాషాకృత్యచతురత ఇదియును లేదు.
9. ఓష్ఠ్యనిరోష్ఠ్యములం గల్పి చెప్పఁగల్గుట ఇదియును లేదు.
10. అచల మగునట్టియు, యమకముతోఁ గూడిన యాశుధారగలవాఁడు ఇదియును లేదు.
11. హనుమత్ప్రసాదలబ్ధకవితాసారము గలవాఁడు జగత్ప్రాణనందన కారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశి.
12. సారస్వతాలంకారుఁడు ఇది చెప్పఁబడలేదు.
13. నిరంకుశప్రతిభాబంధురుఁడు ఇదియుం జెప్పఁబడలేదు.
14. ప్రబంధపఠనరచనాధురంధరుఁడు ఇతఁడు ప్రబంధనిర్మాత యవుటంజేసి యీబిరుదు లేకున్న లోపము లేదు.
15. సకలభాషావిశేషనిరుపమావధాని ఇతని కీబిరుదు లేదు.
కాని వసుచరిత్రకవి కధికముగా నున్నవిశేషములు వక్కాణించెదము.

1. దినమున కొకప్రబంధము రచించుట.

2. సంగీత కళారహస్యములం దెలియుట.

3. శ్రీరామమంత్రోపాసన

4. చతుర్విధకవిత్వనిర్వాహకత్వము.

5. సాహిత్యరసపోషకత్వము.

నరసభూపాలీయకవి. వసుచరిత్రకవి.
ఇ ట్లితనికి పదునైదుప్రజ్ఞలుకాన్పించును. వసుచరిత్రగ్రంథకర్తయెడఁ గల్గియుండినవి శేషప్రజ్ఞలలో నాల్గుప్రజ్ఞ లీతనికి లేవు. అ ట్లున్నను శతఘంటకవిత్వము అష్టావధానాదిప్రజ్ఞలు నుండుటచేత ననేక దేశములలో నితనిపేరు ప్రసిద్ధి నందుటకును తనప్రాగల్భ్యముంజూపుటకు ననువైనది. ఆకారణముచేతనే "లొట్ట యి దేటి మాట" అనుపద్యముం జెప్పుట కల్గెను. నరసభూపాలీయకవికిఁ గల్గియుండినపదునైదుప్రజ్ఞలలో నితనికి పదునొకొండు ప్రజ్ఞలు లేవు. కాని యితనికి మఱినాల్గు విశేషప్రజ్ఞ లుండుటచేత నీతనికవిత్వము నరసభూపాలీయ కృతికంటె మధురమై రసవంత మయ్యెఁ గాని సభారంజనముం జేయునట్టియవధానతంత్రము, శతఘంటకవిత్వాదిప్రజ్ఞలుగలనర్సభూపాలీయ కవికిఁగల ప్రఖ్యాతి యితనికి తేఁజాలకపోయినవి.

పైరెండు గ్రంథములలో నుండు కవిత్వతారతమ్యములం దెలిసినపిమ్మటనైన పైగ్రంథకర్త లిర్వురును ఒక్కరే యనుసిద్ధాంతమును విడువజాలక యుండుబుద్ధిశాలురకు మఱికొన్ని చమత్కారములఁగూడఁ జూపెను.

నరసభూపాలీయకవియొక్క ప్రజ్ఞావిశేషము లధికములనియు నట్టివిశేషములు వసుచరిత్ర కవిత్వములో నుండ వని చెప్పుటకుంగాకున్నను స్వప్రజ్ఞాప్రకటనాదికములు విశేషించి చేయుస్వభావము నరసభూపాలీయ కవి కెక్కుడుగ నున్నందుల కీక్రిందిపద్యము చాలి యుండును

సీ. బాణవేగంబును భవభూతిసుకుమార, తయు మాఘశైత్యంబు దండిసమత
    అలమయూఠసువర్ణ కలన చోరునియర్థ, సంగ్రహంబు మురారిశయ్య నేర్పు

    సోమప్రసాదంబు సోమయాజుల, నియమంబు భాస్కరుని సన్మార్గఘటన
    శ్రీనాథునిపదప్రసిద్ధధారాశుద్ధి, యమరేశ్వరుని సహస్రముఖదృష్టి

తే. నీక కల దటుగాన నేనేకవదన, సదనసంచారభేదంబు సడలుపఱిచి
    భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె, మూర్తిరవిచంద్ర విఖ్యాతకీర్తిసాంద్ర

ఈపద్యముం బట్టి చూడ నీకవి వీనినన్నింటిని డంబమునకై చెప్పియుండునా యని తోఁచకపోదు. కాని పరిశీలింప నట్లనుటలో న్యాయము లేదు. ఇతనికడ ననేకు లగుకవులలో నరిదిగఁ గన్పడుప్రజ్ఞలు చాలగ నున్నవి యనియు నది కారణముగా నీతఁ డాయాగుణములు గలకవులపేరులు చెప్పి వర్ణించినాఁ డనియుం జెప్పఁదగియున్నది. ఇట్టి ధైర్యశాలి గనుకనే 'లొట్ట యిదేటిమాట, యను పద్యముం జెప్పె.

ఇఁక వసుచరిత్రకారుఁడు వసుచరిత్రములోఁగాని హరిశ్చంద్రనలోపాఖ్యానములోఁగాని చెప్పుకొనినబిరుదులు సర్వకవిసామాన్యధర్మము లైనవగుటంజేసి యట్టివానింగూర్చి సాధారణముగాఁ జెప్పుకొని తనకవిత్వమందుఁ దా జెప్పినవిశేషములు విస్పష్టముగాఁ గాన్పించునట్లు చేసెను. అందులో నరసభూపాలీయకవి యత్నించలేనివి సంగీతవిద్యా సంప్రదాయవివరణము. ఇయ్యది కవి కనువైనపు డెల్లనాతనిచేఁ బ్రకటింపఁబడియె. అందు సంగీతవర్ణన లున్న పద్యములు రెంటిని జూపెదను.

మ. సకలామోదకతాళవృత్తగతులన్ సంగీతసాహిత్యనా
     మకవిద్యాయుగళంబు పల్కుఁజెలికిం బాలిండ్ల జో డైసిరుల్
     ప్రకటింపన్ నఖరేఖలందు నలఘుప్రస్తారము ల్సేయుస
     ర్వకళాకాంతుఁడు బ్రోవుతన్ దిరుమలేంద్రశ్రీమహారాయనిన్.

                      వసుచరిత్రము. అశ్వా 1. ప 3

సీ. ఒకటి యక్షరవిలాసోల్లాసమున మించ, నొకటి తాళప్రౌఢి నుల్లసిల్ల
    నొక్కటి నారికేళోన్నతిఁ దాల్ప నొ, క్కటిగో స్తనీగుచ్ఛకలనఁ దనర
    నొకటి సువృత్తభావోన్మేష మొంద నొ, క్కటి వల్లకీతుంబికలనఁ జెలఁగ
    నొకటి భారవిశేషయుక్తిఁ బెం పొంద నొ, క్కటి గిరీశమతానుకారిగాగ
    నపమసాహిత్యసంగీతరసము లనెడు, గుబ్బపాలిండ్లు దాల్చుపల్కులవెలంది
    సరసగుణహారునో బయనరసధీరు, నవ్యకృతినాయకుని గా నొనర్చుఁగాత.

ఈరెండుపద్యములం జూచినచో నీరెండు గ్రంథములు కవులకుఁ గలప్రజ్ఞా భేదము స్పష్టము కాఁగలదు. వసుచరిత్రములోఁ గలసంగీతరహస్యములం దెల్పుపద్యములు పెక్కు లున్నను అట్టిపద్యములు నరసభూపాలీయములో నుండుటకు ననువు లేక యుండుటంబట్టి రెంటిని విరళించి చూపునవకాశము లేక యున్నది. అయినను వసుచరిత్రములోని యింకొకపద్యముం జూపి యీవిషయమై వ్రాయుట వదలెను.

మ. అరిగాఁ బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై
     ఖరిఁ జూపన్ పికజాత మాత్మరవభంగవ్యాకులం బై వనీ
     ధర నాలంబిత పల్లవవ్రతవిధుల్ ద్రాల్పన్ తదీయధ్వనిన్
     సరిగాఁ గైకొనియెన్ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్.

ఈయిర్వురుకవులకుం గలప్రజ్ఞల స్పష్టీకరించుటకుఁ గొన్ని ప్రతీతులు గూడ పుట్టియుండును. వానిలో వసుచరిత్రకవి ప్రస్తుతపువీణియలమెట్లలోఁ జేసినవిశేషాదిక మతని సంగీతవిద్యాప్రాగల్భ్యముం జూపుటకును నరసభూపాలీయకృతికర్త అయ్యలరాజురామభద్రకవి నాక్షేపించఁబోయి

"పృథులషడ్జస్వనోదీర్ణభిల్లపల్ల, వాధరీగీతికాకర్ణనాతిభీత,
 పరవశాత్మపటీరకోటరకుటీర, లీనఫణి యగునక్కాన కాన నయ్యె"

అనుపద్యములోనిసంగీతసంప్రదాయము తెలియనివాఁడై సభలో నవమానించఁబడె ననుకథలోని న్యూనతయును, పైవృత్తాంతముల బలపఱుచుటకుం జాలియుండు.

ఇ ట్లుండుటం బట్టి పైపద్యములో నుపయోగింపఁబడిన విశేషములు కొన్ని భిన్నములుగా నున్నను, పరస్పరవిరుద్ధము లైన వేవియును లేనందున వానినిఁ బట్టి గ్రంథకర్తలు భిన్ను లని సాధించుట కాధార మేదియు లేదు" అని వీరేశలింగముగారు చేసినసిద్ధాంత మందఱివలెనే స్థూలదృష్టితోఁ జేసినది కాని శ్రమచేసి సూక్ష్మదృష్టితో నాలోచించినది కా దని చెప్పవలసినందులకు వగచుచున్నాను. కాఁబట్టి ఆసిద్ధాంతము మనస్సునం దుంచుకొని వ్రాసియున్న తరువాయి వచనము లన్ని నిరస్తములయ్యె నని వక్కాణించెదను. ఇంతదనుక మనము ప్రత్యేకము క్రొత్తమార్గమున భట్టుమూర్తిరాజు, రామరాజభూషణకవి వేఱని చూపుటకుఁ జర్చించుచుంటిమి గాని యీమనయుపన్యాసమునకుఁ బ్రధానకారణ మగు పూండ్ల, రామకృష్ణయ్య పండితుఁడు కందుకూరి వీరేశలింగము పండితుఁడును చేయు సంవాదములోని యాథార్థ్య మారసి చెప్పం బ్రాలుమాలినాము. అయినను అ ట్లూహించంబనిలేదు. పైయుపన్యాసములో నేదియో యొక పక్షము స్పష్టమే అగుచున్నది కావున నిఁక మనయభిప్రాయము చెప్పుటలో శ్రమ యుండనేరదు. పైయుపన్యాసము వినినతోడనే పై యిర్వురురియుక్తులలో నేది ప్రశస్తమో యేది కాదో అది కరతలామలక మై కాన్పించు. ఇది మొదటిపేరాకు విమర్శనము.

(2) అందులో రామరాజభూషణుఁ డనుకవి వసుచరిత్రము నరసభూపాలీయము, హరిశ్చంద్రనలోపాఖ్యానమును వరుసగా రచియించినాఁ డని క. వీ. గారు చెప్పినమాట నిలిచినది కాదు. భట్టుమూర్తికి రామరాజుయొక్క ఆస్థానమం దుండుటచేత వచ్చినబిరుదాంక మిది కాదని రా. కృ. గారు చెప్పినయుక్తులు సహేతుకములు. అందు రా. కృ. గారు చెప్పినబంధకవిత్వ దృష్టాంతము మట్టుకు రామభూషణుఁడు చతుర్విధ కవితానిర్వాహకుఁడని నని చెప్పుకొని యుండుటం బట్టియు నట్టిప్రజ్ఞ తన కున్నట్లు చెప్పుకొనిననరసభూపాలీయకవి దానిం జెప్పుటం బట్టియుంజూడ నీస్థలములో రా. కృ. గా రుద్దేశించినయుక్తి నిద్ధారణకుఁ జాలి యుండ దని చెప్పవలసి యున్నది. క. వీ. గారు జనశ్రుతినిఁ బాటించి గ్రంథస్థగాథలఁ బరిహరించుటలో న్యాయము లేదు.

(3) I. పురాణనామచంద్రికలోను, II. దక్షిణహిందూస్థానకవులచారిత్రములోను, III. బ్రౌణ్యనిఘంటువు నందును, VI. సుజనరంజనిపత్రికయందును, V. ముద్రిత మైనవసుచరిత్ర ముఖపత్త్రము నందును. VI. పాండురంగవిజయములోని దని పుట్టినచాటువునందును, VII. శ్రీరాథాకృష్ణసంవాదమునందును, వ్రాయంబడిన సిద్ధాంతములు గతానుగతికములు కాని పరిశీలనా జన్యములు కావు. కావున నందలి. సిద్ధాంతములు పూర్వపక్షకోటిలోని వై ప్రస్తుతకాలములో నగ్రాహ్యము లయ్యె నని గ్రంథస్థ మగుసాక్ష్యమును బట్టి చెప్పవలయును.

(4) అందులో రామరాజభూషణుఁడు వేసికొనిన "శుభచిహ్న" అను దానికి క. వీ. గారు చెప్పినట్లు శుభ మనుబిరు అర్థము కాక రా. కృ. గారి సిద్ధాంతానుసారముగ నాందోళికాదిచిహ్నము లని చెప్పుటయే యుక్తము.

(5) "సంగీతకళారహస్యనిధి" నని వసుచరిత్రములో రామభూషణుఁడు వ్రాసియున్న దానికన్న వీణియకు మెట్లు కల్పించుటంజేసి కల్గె నను దానివృత్తాంతమంతయు నిపుడు ప్రకటింపవలసి యున్నది. దాని నిటుపైని సయుక్తికముగా విస్పష్టపఱుచుచున్నాను. కాని యందెచ్చటను రామభూషణుఁడు రచియించె నని వాడుకొనంబడుసంస్కృతాంధ్రకృతులు (పదకవిత్వము) గాని వానివిశేషములుగాని వివరింపఁ బడలేదు. ప్రబంధములలో సంస్కృతాంధ్రకృతు లావఱకే రచియించి యుంటి నని చెప్పినదానికి ప్రబంధములుగా నన్వయించుటయు, యక్షగానములు రచియించుగ్రంథములలోఁ గూడఁ సంస్కృతాంధ్రకృతు లని యున్నను పైరీతిని గ్రంథములే అని చెప్పుట సహజముగా నున్నది. సంగీతములో నుండుకృతు లనునామముతో నొప్పుప్రస్తుతగీతభేదములు నవీనము లనియుఁ బూర్వకాలములో నిట్టి నామ మున్నందులకు నిదర్శనములు గాని నిబంధనగ్రంథములలో వాని నిర్వచనములుకాని కానుపించుట లే దనియుం జెప్పవలసియున్నది. కావున నిందులోఁగూడ రా. కృ. గారిసిద్ధాంతమే సరియైన దని చెప్పవలసియున్నది.

(6) ఇందులో రామరాజభూషణుఁ డనుపేరితో నున్నకవి "సూరపాత్మజుఁడ" నని వ్రాసుకొనుటచేత నతని కితఁ డౌరసుఁ డనియు, నరసభూపాలీయములో "వేంకటరాయ భూషణనుపుత్త్రు" అని వ్రాసియుండుటచేత పైకవియే వేంకటరాయభూషణునకు దత్తుఁడని దృఢపఱుచుచున్నట్లు కొంద ఱనుచున్నాఁరని క. వీ. గారు వ్రాసినది అట్లు చెప్పువారికి ధర్మశాస్త్రజ్ఞానము లే దని సూచించుటకై యుండునుగాని వారిసిద్ధాంతబోధమునకుఁ గాదు. అట్లుగానిచో క. వీ. గారిధర్మశాస్త్రా భిప్రాయ మదియే యని యూహించుటకుఁ మే మెంతమాత్ర ము నుత్సహింపము రా. కృ. గారి ఆక్షేపణలు ధర్మశాస్త్రసంరక్షకములనియు నిర్దుష్టములనియు, సిద్ధాంతీకరించెదము.

(7) ఇందులో రా. కృ. గారు నరసభూపాలీయకవి వేఱనియు నతనిపేరు మూర్తి (లేక మూర్తిరాజు) అను భట్టుమూర్తి యనియును, వసుచరిత్ర హరిశ్చంద్రనళోపాఖ్యానముల రచియించినకవి పైకవికి వే ఱై రామరాజభూషణనామమున వ్యవహరింపఁ బడువాఁ డనియు, నాయిర్వురు నొక్కరే యని యిదివఱకు భ్రమపడుటకుఁ గారణములు కొన్ని యున్నను అవి యన్నియు బూర్వపక్షములుగా భావింప వలయు నని చెప్పిన సిద్ధాంతవచనము నీయుపన్యాసారంభములో మేము చూపినగ్రంథసాక్ష్యనిదర్శనములంబట్టి జిగిపడినదై పుక్కిటిపురాణగాథలను నిర్మూలముచేసి యిఁక బూర్వపక్షోక్తి శతముల కైన కదలింపరాని పూనాది గల దైన దని మఱి మఱి వక్కాణించుచున్నాము.

కాకమానిమూర్తి యెవ రని.

కాకమానిమూర్తియే భట్టుమూర్తి అని యిదివఱలో నాకవిజీవితములో వ్రాసియున్న దనియు నట్లు వ్రాయుట కేవలము హాస్యాస్పద మని పూ. రామకృష్ణయ్యపండితుఁడు వ్రాసియున్న దానికి సమాధాన మీయక యిపుడు మనము వ్రాయుచున్న చారిత్రకథాభాగముల లోనికిం దిగ రాదు. అందువిషయమై చెప్పవలసినసమాధానము విశేషించి యుండదు. ఈకథావిషయమై భట్టుమూర్తింగూర్చియు, రామరాజభూషణుంగూర్చియు వ్రాయంబడినచారిత్రగ్రంథములో నీకాకమానిమూర్తింగూర్చి వ్రాసియుండలేదు. ఆభాగములో భట్టుమూర్తి యింటిపేరు ప్రబంధాంకమువా రనునట్లు నిశ్చయించియే 52 పుటలోఁ బ్రబంధాంకము సింగరాజు మూలపురుషుఁ డని చెప్పుటచేత సూచింప నై యున్నది. ఆవిషయమైనవేఱుసంవాద మున్నట్లు సూచన యైనఁ జేయంబడనిచోట మఱియొకవిధముగ శంకకల్గించుకొనుట కవకాశ ముండదు. నేను చారిత్రము వ్రాయుచో గ్రంథస్థగాథ లేవియో ఉదాహరణములతోను, గ్రంథస్థములు కానిగాథలను వాడుకనుబట్టియు వ్రాయుచున్నానని వివరించుచునే యుంటిని. దీనింగూర్చి ప్రస్తుతము నేను ప్రకటించిన రామకృష్ణునిచారిత్రములోఁ చూడవలయును. అ ట్లీ గ్రంథములోఁ గానుపించనివానిఁ గుఱించి విమర్శకులు పట్టిపల్లార్చవలసిన పని యుండదు.

ఇఁక తెనాలిరామకృష్ణునిగాథలు నుడువుచో లోకములో వాడుకొనంబడుచున్నకొన్నివృత్తాంతములు వ్రాయఁబడినవి. వానిలోఁ గూడ సాధ్యము లగునన్ని యంశములు యుక్తిచేతను, గ్రంథదృష్టాంతరములచేతను యథార్థబోధమునకై వ్రాయంబడుచుండెను. అట్టివానిలో లోపము లున్న యెడల వానిం దెల్పి గ్రంథము సవరణ చేయించుటకుగా నీవఱలో నాంధ్రపండితు లందఱు ప్రార్థింపఁబడియున్నారు. అందులో నీ రా. కృ. గారు నొక్కరు కావచ్చు నని యూహించియుంటిని. కాని వారు నీపైవిషయమును నవీనముగాఁ గనిపెట్టియే యుందురు. ఆవిషయములో నైన తాము వ్రాయుచున్న హరిశ్చంద్ర నలోపాఖ్యానకవిచరిత్రము నాగ్రంథముకంటె నాధిక్యత నందఁ గల దని యూహించి దానిని లోపలనే జీర్ణింపఁ జేసి యుంచియుందురు. అటు గాకున్న నీకవిజీవితము ఆ 1877-78 సంవత్సరములలోఁ బ్రకటింపఁ బడినది. అది మొదలు 1892 సంవత్సరమువఱకు నీవిశేషమును ప్రకటింపకపోవుటకుఁ గారణము కానుపించదు. ఇట్టిగొప్పవృత్తాంతము నెంతవిస్పష్టముగాఁ బ్రకటించిన నంతచారిత్రానుభవశక్తి వెల్లడి యగునని యెంచి కాఁబోలు పైయిర్వురుమూర్తులు నొకరు కా రని చెప్పినఁ జాల దని యూహించి ఆయిర్వురి వర్గత్రయములోఁ గలభేదము నీక్రిందివిధంబున వ్యక్తీకరించిరి.

"అల్లసానివాని అనునది కాకమానిమూర్తిని గుఱించి చెప్పఁబడినపద్యము. దీని లోకులు భట్టుమూర్తి కన్వయించి చెప్పుట యెంత హాస్యాస్పదముగా నున్నదో విచారింపుఁడు. భట్టుమూర్తిగారియింటి పేరు కాకమానివా రని యాతనిమెడఁ గట్టిరి. గమనించి చూడుఁడు.

1. కాకమానిమూర్తి కౌండిన్యసగోత్రుఁ డైనబ్రాహ్మణుఁడు = బట్టుమూర్తి బట్టు వంశజుఁ డైనశూద్రుఁడు.

2. కాకమానిమూర్తి బుధకవిసార్వభౌమపౌత్త్రుఁడు = బట్టుమూర్తి తిమ్మరాజు పౌత్త్రుఁడు.

3. కాకమానిమూర్తి రామలింగభట్టుపుత్త్రుఁడు = బట్టుమూర్తి వేంకటరాయభూషణపుత్త్రుఁడు. 4. కాకమానిమూర్తి కాద్రవేయాధిపవరప్రసాదకవితావిలాసుఁడు = భట్టుమూర్తి హనుమత్ప్రసాదాసాదిత కవితావిలాసుఁడు.

ఇట్లించుకయైన వర్ణ సంబంధము లేనియియ్యిరువురు నొక్క రేయని చెప్పుచుఁ గాకమాని మూర్తివిషయమై వ్రాయఁబడినపైపద్యమును భట్టుమూర్తికి నన్వయించుటకంటె మఱియొకచిత్రము కన్పట్టదు."అని విశేషోక్తిపరంపరలచే వ్రాసిరి. ఇంతశ్రమ అక్కఱలేకయే వీ రీపద్యమున కెట్లు సమన్వయింపవచ్చు నని న న్నడుగుటయే కల్గిన దీని కపుడే సమాధానము పంపియుందును. అట్టియదృష్టమునకుఁ బ్రాత్రులము మే మిర్వురముం గాకుండుటఁ జేసి ఆసమాధానమును నేనును గ్రంథరూపముగాఁ జేయవలసివచ్చినది. అది యెట్లన్నను :- లోకములో నెట్టికవియైన నొకయంశముంగూర్చి యితరుల నెగతాళిచేయవలసివచ్చినప్పుడు అట్టిభావమును జూపించుటకుగాను తాఁ బ్రత్యేకము పద్యము కల్పించి చెప్పుటకంటె అంతక్రితమువ్యాపకములో నుండెడుసమయోచిత మగునితరకవికృతపద్యములంగానీ శ్లోకములం గానీ ప్రస్తావనముచేయుట సర్వత్ర విదితాంశమే. అట్టిపట్ల ఆప్రస్తావకుఁడు స్వయముగా శ్లోకము చెప్పుటకంటె నన్యుల ప్రస్తావనశ్లోకమునే ప్రకటించిన రసవంత మగును.

కాళిదాసకృతశ్లోకములును, పండితరాయకృత శ్లోకములును, నీతిసంగ్రహములోని శ్లోకములును, వేమనపద్యములు సహితము ప్రస్తావనకు మున్మున్నుగ వచ్చుచుండుట అనుభవసిద్ధమే. అట్టిచోఁ రామలింగము భట్టుమూర్తివీఁపున తామరయున్నదని రాజునకుం దెల్పి యపహసించుటకు లో నూహించుకొని, ఆవఱలోవ్యాప్తమైయున్నపద్యముం జదివి దానిని సమన్వయించిన నన్వయించి యుండవచ్చును. లేకున్న ఆపద్యము తాఁ జేసినదే యని బాలుడై యున్న భట్టుమూర్తిని మోసపుచ్చి యైన నుండవచ్చును. అది తిరుగ రాజసన్నిధిం జదువు మనినపు డందులోనిచమత్కారభాగము చదివినట్లు పద్యమున్నది. ఇక్కడ కాక మానురాయ అని విడఁదీసినచోఁ గల్గెడువిశేషము బట్టుమూర్తికంచుక మూడఁదీసిన యెడలఁ గాన్పించు నని పరిహసించినం జాలియుండును. ఇట్లు వ్రాసియున్నంత మాత్రమున నీకథ కట్టుకథ కాకపోలేదు. ఈలాటికథలను నమ్మియే సిద్ధాంతము లే ర్పఱుపంబడలేదు. ఇట్లుండ పైమూర్తు లిర్వురియొక్కయు వర్గత్రయమును, వంశసాంప్రదాయములు తెలియక యొకరిపిల్లల నొకరి కిప్పించి సంబంధ బాంధవ్యములు జరిపినట్లు చెప్పియుండలేదు. కావున కట్టుకథలనువానికిని శాస్త్రీయవిమర్శనకుం గలభేదము ముందుగఁ దెలిసికొననిదే యీచారిత్రములు వ్రాయ గమకింపఁగూడ దని విన్న వించెదను.

రామభూషణునిసంగీతప్రజ్ఞ.

దీనిం దెల్పునట్టి "సంగీతకళారహస్యనిధి" యనుబిరుద మీకవికున్న ట్లిదివఱకే చెప్పియున్నాము. ఇపు డట్టిబిరుదు గల్గుటకు కారణము జెప్పవలసియున్నది. ఇది కేవలము గ్రంథస్థ మగుగాథ కాకున్నను దేశమందు సంప్రదాయజులవలన వినియున్నదియు నట్టివని సమర్థులవలనఁగాని కాని దగుటంజేసియు సంగీతరహస్యకళానిధి నని రామభూషణుఁడు స్వస్వరూపప్రకటన తానే చేసుకొని యుండుటంబట్టియు నట్టిమాటను వక్కాణించుటకు నీసంప్రదాయము సాక్ష్యముగా నగుచుండుటవలన దాని నిట వివరించెదను. దానిని బలపఱుచుగ్రంథప్రమాణములను వసుచరిత్రమునుండియే సంపాదించెను. దీనింగూర్చి వ్రాయుటకుఁ బూర్వము సంగీతవిద్యాసాధనాగ్రేసర మగువీణావిషయక మైనకొన్ని సంప్రదాయములు సంగ్రహముగా వక్కాణింప వలసియున్నది. అందులో నాకు విశేషపరిచయము లేకుండుటం జేసి ఆవిద్యాపారంగతులయభిప్రాయము కొంత కొంతయారసిదానినిటవక్కాణించెదను. ఎట్లనఁగా -

వీణియలసంప్రదాయము.

దీనిం దెల్పుగ్రంథములు కొన్ని కలవు. అవి సామాన్యముగ వీణావిద్యాసంప్రదాయమును స్పష్టీకరించును. అందు వీణియలు నాల్గు భేదములు గల వని యీక్రిందిశ్లోకమువలనఁ జెప్పఁబడును.

శ్లో. నారదస్యాపి మహతీ తుమ్బురోస్తు కళావతీ,
    విశ్వావసోస్తు బృహతీ సరస్వత్యాస్తు కచ్ఛఫీ.

అని దీనింబట్టి సంగీతవిద్యాసాధనములు వీణియలనునామముతోనే యొప్పుననియును అవి నాల్గుభేదములు గల వనియు వానిని మొదట కల్పించినవారు నల్గు రనియుఁ దేలినది. వానిభేదములును ఒక్కొక్కదానివిశేషములు నీక్రిందిపట్టికలోఁ గనబఱిచెదను.

నంబరు వీణాపేరు ధరించినవారి పేరు తంత్రుల సంఖ్య రూపము వ్యాపకదేశము పర్దాలుఅనఁగా మెట్లు రిమార్కులు.
1 2 3 4 5 6 7 8
1 మహతి నారదుఁడు 3 రెండుతుంబలు నొక వెదురు బొంగు మొదల చివర నదుకఁబడును. ఉత్తరహిందూస్థాన మనఁగా వింధ్యోత్తర దేశములు. 20 అరణ్యవాసు లగుమునులకు దండక మండలువులు గా నేర్పడినసొరకాయబుఱ్ఱలు, వెదురుబొంగులు దీనిపరికరములు
2 కళావతి తుంబురుఁడు. 4 తంబురాదీని రూపమే సర్వదేశములలో 20 కళలుగలదిగానఁ గళావతి యాయెను. కళ యనఁగా శ్రుతి ఇది గానము చేయువారివలన శ్రుతికొఱ కుపయోగింపఁబడు.
3 బృహతి. విశ్వావసునామ గంధర్వుఁడు. 15 'సారంగ రూప'ము అనఁగా లేడిరూపము లేడికి కాళ్లునాల్గులేకున్న నెట్లుండునో యట్లుండును. ఉత్తర హిందూస్థానము. 20 దీనిని సారంగు అని వాడుదురు. పిడేలువలె దీనిని విల్లువంటియాకారము గల యొక వెండ్రుకలుకట్టిన కోలతో వాయించెదరు.
4 కచ్ఛపి. సరస్వతి 3 తాఁబేటియాకారము. వింధ్యకు దక్షిణదేశము 24 దీనిని వెండితోను బంగారుతోను, ఏనుఁగుదంతముతోను నలంకరించెదరు.
పైనాల్గింటిలో మెట్లు (పర్దాలు)గలిగి యుండునది మొదటి మహతీవీణె యనియు, నాల్గవది కచ్ఛపివీణె యైయున్నట్లును స్పష్టమే గదా. ఈరెంటికే వీణె యనునామ మిపుడు సర్వత్ర వాడుకొనఁబడుచున్నది. అందు మహతి మధ్యమశ్రుతి గలదియును, కచ్ఛపి షడ్జమశ్రుతి గలదియు నై యున్నవి. ఇట్టిభేదములు ప్రథమవీణెలో మొదటిశ్రుతిలో మకారము పల్కుటంబట్టియును, రెండవకచ్ఛపివీణెలో మొదటిశ్రుతిలో నకారము బల్కుటంజేసియు నేర్పడినవి.

సప్తస్వరములలోను, న, ప అనునవి రెండును కళలు అనఁగా శ్రుతిపర్యాయములు. తక్కినయైదు ననగా, రి, గ, మ, ధ, ని, పేరుగల స్వరములు హెచ్చు తగ్గు స్వరములు గలవియై రెండేసి యయినవి. ఈ పదియును పై. న. ప స్వరములు కలిసిపండ్రెండు (12) స్వరములైనవి.

మేళవించుటను గూర్చి.

దీని నుత్తరదేశీయభాషలో "టాట్" అని వాడెదరు. ఇట్టి టాట్ చలము, అచలము నని రెండువిధములు గలది. అనఁగా వీణె యొక్కమెట్లు రాగానుసారముగాఁ గొంచెముక్రిందికిని మీఁదికిని జరుపుకొనవలసియున్నది. ఈయాచారమే పూర్వము విశేషమైయున్నట్లు కనఁబడును. చితారు అనునుత్తరదేశీయ సంగీతవిద్యాసాధన మిప్పటికి నిట్లే యున్నది. ఈవిధముగనే రుద్రవీణెకును, కచ్ఛపివీణకును చల టాట్ మార్గము స్వభావసిద్ధ మైనట్లు కానుపించును. అయితే కొందఱు బుద్ధిశాలు రట్టిదానిలో రాగములు మార్చుటలోఁ గల్గుభేదములు చిక్కులు నాలోచించి దాని నచలటాట్ గాఁ జేయ యత్నించిరి. అపు డుత్తరదేశస్థు లొకవిధముగా దాని నచలముం జేసిరి. అందుకు గా నింకొక యెనిమిదిస్వరములు గలయావృత్తమునకుం దగిన మఱియెనిమిది మెట్లు (పరదాలు) చేర్చి మొత్తమునకు నిరువది (20) మెట్లును బిగించిరి. ఇఁక దక్షిణదేశములోని వీణె నచలటాటు (అనఁగా నచలమేళనము) చేయుపని నవలంబించవలసివచ్చినది. అట్టిపని చేయుటకు నావిద్యలో సంపూర్ణ పాండిత్యము గలవారు యత్నింపవలసివచ్చును. ఆపనికై రామభూషణునికాలము వఱకును యత్నించినవా రేరును గానుపించలేదు. పిమ్మట రామభూషణు డట్టికార్యముఁ జేయంబూనుకొనియెను. అందాఁకను చేసినపని యెట్లున్న దనఁగా, ఉత్తరదేశీయు లిరువదిమెట్లు కల్పించినదానికి నింకొకనాల్గుమె ట్లధికముగా వేసెను. అనఁగా రెండుగాంధారములును, రెండుఋషభములను నధికముగాఁ జేసెను. దీనింబట్టి యీవీణెకు నిరువదినాల్గు (24) మెట్లేర్పడినవి. అనఁగా మొదటఁ జెప్పియున్న పండ్రెండుస్వరములును రెండావృత్తములు తిరిగినవి. ఇ ట్లుండటంజేసి యుత్తరదేశీయుల అచలటాట్ కంటెను దక్షిణదేశీయులఅచలటాట్ సులభమార్గమైనది. కావున సరస్వతి వీణ యగు కచ్ఛపి పండ్రెండేసి మెట్లు గలరెండుస్థాయులు కలదిగా రామరాజభూషణకవివలనఁ జేయంబడినది. దాని కనుగుణముగ రాగాలాపములు సరిపుచ్చవచ్చును.

సంగీత శాస్త్రముం దెల్పుపద్యములు.

వసుచరిత్రములో సంగీతసంప్రదాయముం దెల్పుపద్యములు పెక్కు లున్నవి. అందుఁ గొన్నిటిని పైయుపన్యాసార్థము వివరించెదను. ఇదివఱలో వివరింపఁబడినవి తిరుగ వివరింపఁబడవలసిన యవసరము లేదు గావున వానిని వదలివేసెదను. తక్కిన వెట్లనఁగా :-

"మ. సకలామోదకతాళవృత్తగతులన్ సంగీతసాహిత్యనా
       మకవిద్యాయుగళంబు పల్కుఁజెలికిం బాలిండ్లజో డై సిరుల్
       ప్రకటింపన్ నఖరేఖలందు నలఘుప్రస్తారము ల్సేయుస
       ర్వకళాకాంతుడు బ్రోవుతం దిరుమలేంద్రశ్రీమహారాయనిన్."
                                                     వసు. అశ్వా 1. పద్య 3.

"చ. అన నిని కేళికాసచివుఁ డాస్వన మల్లన నాలకించి యో
      జనవర పల్లకీరవము సంగతిఁ బాడెద రెవ్వరో వినూ

      తనగతి నిమ్మహాద్రిపయిఁ దన్మృదుపంచమ షడ్జ శయ్య కొ
      య్యన నెలుఁ గిచ్చె వింటెప్రమదాకులకోకిలకేకిలోకమున్." ఆశ్వా 2 పద్య 17.

"సీ. వలుదగుబ్బలు ప్రసేవకవృత్తిఁ దగుగుబ్బ, కాయల కపరంజిచాయ లొసఁగ
      లలితాంగుళీదళంబులు సమేళము లైన,సారెలపై రాగసంపద లిడ
      పాణికంకణరుతుల్ ప్రాణానుబంధంబు, గలతాళగతి కనుగ్రహము లీన
      నాలాపభంగి యత్యక్తసంవాదిస, మస్వరంబులకు గ్రామంబు లునుప

గీ. ప్రచురతా నామృతముల మూర్ఛనలచే న, చేతనంబులు చేతనరీతిఁ దనర
   చేతనంబు లచేతనభాతి నొనర, వీణె వాయించు నొకయలివేణిఁ గంటి."

దీనిలోని విశేషము లావఱకు వీణావాద్యముంగూర్చి వర్ణించిన వారిపద్యములంజూచిన గోచరంబు లగు దృష్టాంతమునకు మనుచరిత్రంబునుండి యొకపద్యముం జూపెదను. ఎట్లన్నను :-

"సీ. తతనితంబాభోగథవళాంశుకములోని, యంగదట్టపుకావిరంగువలన
      శశికాంతమణిపీఠి జాజువారగ కాయ,లుత్తుంగకుచపాళినత్తమిల్ల
      తరుణాంగుళీధూతతంత్రీస్వనంబుతో, జిలిబిలిపాట ముద్దులు నటింప
      నాలాపగతి సొక్కి యరమోడ్పుకనుదోయి, రతిపారవశ్యవిభ్రమముఁ దెలుప

గీ. ప్రౌఢిఁ బలికించుగీతప్రబంధములకుఁ, గ్రమకరపంకరుహరత్న కటకఝణఝ
   ణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప, నింపు దళుకొత్తవీణ వాయింపుచుండె."

"శా. అజాబిల్లివెలుంగువెల్లికల డాయ న్లేక రాకానిశా
      రాజశ్రీసఖ మైనమోమునఁ బటాగ్రం బొత్తి యెల్గెత్తి యా
      రాజీవానన యేడ్చెఁ గిన్నరవధూరాజత్క రాంభోజకాం
      భోజీమేళవిపంచికారవసుధాపూరంబు తోరంబుగాన్." ఆశ్వా 4. పద్యం 5.

ఇక్కడ కాంభోజరాగము జాలిరాగములలోనిది కావున నట్టిసమయమునందు సంగీతసంప్రదాయము ననుసరించి రామభూషణుడు చెప్పెను. ఇట్టి దుఃఖమునే వర్ణించుచు నాంధ్రకవితాపితామహుఁ డొకపద్యముం జెప్పె. ఆపద్యమునకును దీనికిం గలభేదముం జూపుటకు దాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

"ఉ. పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక నీవు ద్రోయ ని
      చ్చోటభవన్న ఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య
      ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ గలస్వనంబుతో
      మీటినవిచ్చుగబ్బిచనుమిట్టల నశ్రులు చిందు నొందగ్గన్."

"సీ. వైణికవల్లకీశ్రేణీ నిమ్ముల మీటె, గాయక గాంధర్వగమక రేఖ
      గాంధర్వగమకరేఖఁ బరాహతము చేసె, వాంశికవంశికావైభవంబు

    వాంశికవంశికావైభవం బెగ నూఁదెఁ, గాళికాధరకరతాళగరిమ
    కరతాళగరిమంబు కంచుమించుగ నొత్తె, నానద్ధచటులతూర్యవ్రజంబు

గీ. చటులతూర్యవ్రజం బంటఁ జరచెఁ బరిణ, యాగతదిగంతనృపతినా గాశ్వరథప
    దాతికోలాహలంబు రోధసి నఖండ, మగుచు నాదాత్మకబ్రహ్మ మతిశయిల్ల."
                                                                 ఆశ్వా 5. ప 69

"చ. అకుటిలసౌమ్యమాననిలయస్ఫురణంబును నాతిమాత్రతా
      రక పరివర్తనంబు శుభరాగమిళత్పదపల్లవాంకము
      ద్రికయును పెంపు మీఱ నిజదృష్టులఁ బోలినసింధుకన్యకా
      ప్రకటవివాహగీతికలు పాడిరి పుణ్యపురంధ్రికామణుల్." ఆశ్వా 5. ప 7.

ఇంక నిట్టివే సంగీత సంప్రదాయబోధకము లగుపద్యములనేకములుగలవు. గ్రంథవిస్తరభీతిచే వివరింపను.

రామభూషణకవితావిశేషములు.

ఇదివఱకే రామభూషణునికవిత్వములోని కొన్నిపద్యములతో నాంధ్రకవితాపితామహునిపద్యములఁ బోల్చి చూపియున్నాము. ఇప్పుడంతకంటె విశేషించి చూపించవలసినయవసర ముండదు. అయినను ఆంధ్రకవితాపితామహునిమార్గ మవలంబించి కవిత్వము చెప్పినవారిలో నతనితో సమానముగా రసము తెచ్చినవారిలోను కొన్నికొన్నిపట్ల నతనికంటెను విశేషసరసముగాఁ జెప్పినవారిలో నీభట్టురామభూషణుఁడు మొదటివాఁ డని చూపుటకుఁగాను ఆయిర్వురికవిత్వములలో సమాన వర్ణన లున్న కొన్నిపద్యములఁ దెల్పి జూపెదను.

చంద్రవంశకరుం డగుచంద్రునివర్ణనము.

"సీ. కలశపాథోరాశి గర్భనీచిమతల్లి, కడుపార నెవ్వానిఁ గన్నతల్లి
      అనలాక్షుఘనజటావనవాటి కెవ్వాఁడు, వన్నె వెట్టుననార్తవంపుబువ్వు
      సకలదైవతబుభుక్షాపూర్తి కెవ్వాఁడు, పుట్టు గాననిమేనిమెట్టపంట
      కటికిచీఁకటితిండికరములగిలిగింత, నెవ్వాఁడు తొగకన్నెనవ్వఁజెనకు

తే. అతఁడు వొగడొందు మధుకైటభారిమఱఁది,కళల నెలవగువాఁడుచుక్క లకు ఱేఁడు
    మిసిమిపరసీమ నలరాజుమేనమామ, వేవెలుంగులదొరజోడు రేవెలుంగు." ఆ 1. ప. 18.

"సీ. జనక నేత్రఫలం బయినపాలపాపఁడు, వరవృద్ధిఁ గాంచుజై వాతృకుండు
      శ్యామాభిరాముఁ డై యమరులేఖాశాలి, రహిఁ గళల్వూనుసర్వజ్ఞమౌళి

     కువలయానందంబుఁ గూర్చుచల్లనిరాజు, తమమెల్ల నడఁచుసత్పథవిహారి
     వసువులు గురియుదివ్యవదాన్యతిలకుండు, లచ్చితోఁ బుట్టినలక్షణాఢ్యుఁ

తే. డంబుజాసనుఁ డన విధుఁ డనఁగ సోముఁ,డన నెగడి హంససంగతి నడర సురలఁ
    బ్రోవదాక్షాయణీప్రేమఁ బూననేర్చు,జాణ చంద్రుండుకాంతిని స్తంద్రుఁడలరు."
                                                             ఆశ్వా 1. ప. 21.

"సీ. వదనప్రభూతలావణ్యంబుసంభూత, కమలంబు లన వీనికన్ను లమరు
      నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడు, కరణి నున్నవి వీనిఘనభుజములు
      సంకల్పసంభవాస్థానపీఠికబోలె, వెడఁద యై కనుపట్టు వీనియురము
      ప్రతిఘటించుచిగుళ్లపై నెఱ్ఱవారిన, రీతి నున్నవి వీనిమృదుపదములు

తే. నేరెటేటియస ల్దెచ్చి నీరజాప్తు. సాన బట్టినరాపొడి చల్లి మెదిపి
    పదును సుధ నిడి చేసెనో పద్మభవుఁడు, వీనిఁగాకున్న గలదె యీమేనికాంతి."
                                                                ఆశ్వా 2. ప 34.

"సీ. తలిరుప్రాయమువాని వలరాజు నలరాజు, నలరాజుఁ దెగడుసోయగమువానిఁ
      బసిడిచాయలవానిఁ బగడంబు జగడంబు, జగడంబు గలమోవిసొగసువానిఁ
      దళుకుఁజెక్కులవానిఁ దులకింపుపలు కెంపు, పలు కెంపు లొలయు నవ్వొలుకువానిఁ
      జికిలిచూపులవాని సిరిమించు దొరయించు, దొరయించు కాంచనాంబరమువాని

తే. నొఱపు గలవాని మకుట కేయూర హార, కటకకుండలచాక చక్యములవాని
    నమ్మహీజానిఁగనిలేచి యమితవినయ, సంభ్రమము దోఁప నిలిచి రబ్జాతముఖులు."
                                                                  వసు. ఆశ్వా. 3 ప 46.

కోడికూఁతను వర్ణించుట.

"మ. సకలాశాగతినర్మకోపవిరతిశ్రౌతక్రియారంభణా
      త్మకవర్గత్రయికిన్ మదుచ్చరితశబ్దజ్ఞానమే మూల మిం
      తకుఁ బోలన్ వినుఁ డంచుఁ దెల్పుగతిఁ జెంతం గొండపై పల్లెలం
      గృకవాకు ల్మొరసెన్ గృహోపరిఁ ద్రిభంగిన్ భుగ్నకంఠధ్వనిన్."
                                                       మను. ఆశ్వా 3. 55.

"మ. ఒకనాఁ డింద్రునియంతవేలుపు మదీయోక్తిన్ విడంబించి తా
       నొకకాలం బెఱిఁగింప వచ్చి మునిశాపోద్వృత్తిపా లయ్యె మా
       మకశబ్దం బిది యల్పమే త్రిముని సంభావ్యత్రికాలీవిబో
       థక మన్‌రీతిఁ ద్రిభంగిగా మొరసెఁ జెంతన్ దామ్రచూడౌఘముల్."
                                                          వసు. ఆశ్వా. 4. ప 126.

అని యిట్లు కొన్నిటిని మాత్రమే వివరించినాఁడను ఇఁక నితర వర్ణనలో ననఁగా స్త్రీశృంగారవర్ణనలో చంద్రాద్యుపాలంభనలలో మన్మథాదివర్ణనలలో నితరము లైనబుతువర్ణన పుష్పలావికావర్ణనాదులలో మనుచరిత్రకారుఁ డూహింపని వర్ణన లనేకము లున్నవి. వానిని గ్రంథము చదివియే తెలియవలెఁగాని వ్రాయ వీలులేదు. హరిశ్చంద్రనలో పాఖ్యానము రాఘవపాండవీయముకంటె మిన్న యై యున్నదనుటకంటె విశేషించి చెప్పను.

భట్టురామరాజభూషణునిజన్మస్థానాదివిషయము.

దీనింగూర్చి యిదివఱలో నొకరిద్ద ఱొకటిరెండువిధముల వ్రాసియున్నారు. అం దాంధ్రకవిచరిత్రములో నితనిజన్మభూమి భట్టుపల్లె యనియును, ఈగ్రామము కృష్ణదేవరాయలవలనఁ గవిత్వమునందు ప్రవీణు లై ప్రబంధాంకమువా రని బిరు దందినయీతనిపూర్వు లగుభట్టురాజుల కీయఁబడె ననియు, నీగ్రామము బళ్లారి మండలములోని పాలమండలం తాలూకాలో నున్నట్లు కొందఱును, కడపమండలములోని పులివెందులతాలూకాలో నున్నట్లు మఱికొందరు చెప్పినట్లు నున్నది. దీని కాధారము లేమియుం జూపఁబడలేదు.

ఇఁకఁ గృష్ణామండలములోనిమోదుకూ రనుగ్రామములో నుండుకొందఱు బట్టుకులస్థులు తాము భట్టుమూర్తి వంశస్థుల మనియు నాతనికాఁపురస్థలము తమగ్రామమే యనియు కొంత కాలముక్రిందట కాకినాడలో నాతోఁ జెప్పియుండిరి. కాని తమకును భట్టుమూర్తికి నెందఱుపురుషులు మధ్యను గలరో ఆవృత్తాంతముగాని వంశవృక్షముంగాని చూపలేరైరి.

భట్టుమూర్తి, రామరాజ భూషణుఁడు అనుపేరులు గలపురుషు లొక్కరే యని ప్రప్రథమములో నాతోడ వాదించినవారు వారే. అప్పటిలో అట్టితమవాదమున కనుకూలము లైనచాటుధారలం జదువలేదు. కాని తమదేశమునం దున్నట్లును వానిం బం పెదమనియును నాతోఁ జెప్పియుండిరి. తిరుగ వారు పిఠాపురము మొదలగుస్థలములకు వచ్చియుండిరిగాని వారు తెచ్చి యిచ్చెద మనినపద్యములు తెచ్చి యియ్య లేదు. నాఁటనుండియుం గొన్ని చాటుధారలు మాత్ర మచ్చటచ్చట వ్యాపకములోనికి వచ్చుటఁ జూచుచున్నాఁడను. వానికి కారణము పైబట్రాజులు కావచ్చు నని యోఁచించెదను.

రామభూషణునికథ ముగించుటకుఁ బూర్వ మతనిపినతండ్రికొడు కై అతఁడే యితఁ డని యూహించి భ్రమ నందించుచున్నభట్టుమూర్తింగూర్చి కొంతవ్రాయుచు నాసందర్భములో రామరాజభూషణుంగూర్చి మొదట నావలనఁ గవిజీవితము రెండవభాగములో వ్రాయంబడినచారిత్రము పూర్వమువలెనే వక్కాణించి అచట నచట తిరుగ రామభూషణుని కవిత్వశయ్యాదుల నుడివెదను.

భట్టుమూర్తి.

ఈవఱకును మన మల్లసానిపెద్దనచారిత్రములో వాక్రుచ్చిన భట్టుపేరు మూర్తి. అతనినే జనులు భట్టుమూర్తి యని మూర్తిరాజనియు వాడెదరు. ఇతనివృత్తాంతముం గొంత యిదివఱకే పెద్దనచారిత్రములో వ్రాయంబడినది. ఇతనికిఁ గృష్ణరాయనియాస్థానపండితుఁడని విశేషవిఖ్యాతి గలదు. ఆరా జీకవిని బహుభంగులుగా గారవించి తుదిని తనసింహాసనార్ధమునఁ గూర్చుండఁ బెట్టె నని వాడుక గలదు. నరసభూపాలీయగ్రంథరచనాకుశలుఁ డితఁడే యని యిదివఱకే చెప్పి యుంటిమి. ఆగ్రంథము కృష్ణరాయనిర్యాణానంతరము మఱికొంతకాలమునకుఁ బుట్టినది.

కృష్ణరాయలకాలములో నీతఁడు గ్రంథము లేమియుఁ జేసినట్లు కాన్పించదు. చాటుపద్యంబులు విశేషంబుగఁ జెప్పియుండె, వసుచరిత్రంబు రచించినవాఁ డీతఁడే యని ప్రసిద్ధి గలదు, దానికి పై రెండుగ్రంథంబుల దృష్టాంతము లేమియు గానరావు. అయిన వసుచరిత్రములోనిజాడలు కొన్ని దీనిలోఁ గాన్పించుటఁజేసియు వసుచరిత్రకారుఁ డాగ్రం థంబునఁ దనతండ్రిపేరు స్పష్టీకరింపకుండుటంజేసియు నతఁడును హనుమదుపాసనాపరుం డౌటంజేసియు నతఁడే భత్తుమూర్తి యని చెప్పినపల్కులు నిజమా యేమి? యని తోఁచుచున్నది. గ్రంథంబులు రెండునుం జదువునపుడును మనము వినుచున్నకథంబట్టి యోఁచించునపుడును గొన్నిసంశయములు బుట్టుచున్నవి. మనము వినుచున్న వృత్తాంత మెద్దియనిన భట్టుమూర్తి ముందు వసుచరిత్రంబు రచించి యనంతరము నరసభూపాలీయమును విరచించె నని కాని వసుచరిత్రము రచించినకవియే పిమ్మట దీని రచియించునటు లైన నిందలిశయ్యావిశేషంబు లంతకంటెను బ్రౌఢంబుగ నుండవలయు. లేకున్న దానికి సమానంబుగ నైన నుండవలయును. అటుగాక న్యూనం బగుటకుఁ గారణం బేమియని యూహింపవలసియున్నది. ఇట్టిభేదంబులు రెండుగ్రంథములలోనికొన్నికొన్ని పద్యంబులు గైకొని వాటిరసపుష్టిం బరీక్షించిన స్పష్టంబు లగు. ఇంతియకాక వసుచరిత్రకారుఁడు తనకు మూర్తి యనునామాంతర మున్నట్లు చెప్పఁడు. నరసభూపాలీయ కారుండును తనకు రామభూషణనామ మున్నట్లు జెప్పియుండలేదు. నామాంతర మున్నయెడల నెఱ్ఱప్రెగ్గడయుంబోలె దానిని వివరింపక మానఁడు, వసుచరిత్రంబు తచించినయనంతరము రామభూషణునకు సాహిత్యరసపోషణుఁ డని బిరుదు కల్గెను. అట్టి బిరుదునే మఱియొకగ్రంథంబు విరచించు తఱిఁ గవి యొకఁడైన తప్పక నుడువును. అట్లు నరసభూపాలీయంబు నందు లేదు. ఈయిరువురుకవులకు సాహిత్యవిషయంబు లైనకొన్ని ప్రజ్ఞలు సమానములుగఁ జెప్పఁబడియె. వసుచరిత్రకారుఁడు సంగీతకళా రహస్యనిధి. ఇతఁడే వీణియలకు మెట్లు కల్పించినాఁ డని యున్నది. దీనింగూర్చి మఱియొకస్థలములో వివరించుట యైనది. అట్లైన నీతండు వుంభావసరస్వతి యని చెప్పవలదా ? అగును కాకున్న ని ట్లేరికి సంగీతసాహిత్యపాండిత్యంబు గలదు ? ఇంతియకాక యాశ్వాసాంతంబుల నీయిర్వురిప్రజ్ఞలు వేఱ్వేఱుగ నున్నట్లు చెప్పంబడియె. ఇట్లుండ నీయి ర్వురు నొక్కరే యని చెప్పుటకు మిక్కిలి సంశయంబు గల్గుచున్నది. ఇట్టిసంశయములు నివారింపఁబడుటకు నీగ్రంథంబులుగాక యింకొక గ్రంథ సహాయంబు గావలసివచ్చెను. ఈవిషయమున మనము యుక్తిచే దీని సాధించినను గ్రంథదృష్టాంతముగూడఁ జూపిన మేలై యుండు నని భట్టుమూర్తిచే రచియింపంబడె నను గ్రంథంబులఁగూర్చి యత్నంబు సేయఁ జిరకాలంబునకుఁ దాళపత్త్రగ్రంథం బొకటి "హరిశ్చంద్రనలోపాఖ్యానంబు" అనుద్వ్యర్థికావ్యంబు సంప్రాప్తం బయ్యె. దానియాశ్వాసాంతగద్యలఁ బరికించుచో వసుచరిత్రంబున నున్నట్లే కాన్పించె. అపుడు కొంత మనంబున నిందైన రామభూషణుఁడు తండ్రిపేరు చెప్ప కుండునా యని యూహించి గ్రంథానుక్రమణికం జూడ నీక్రిందిపద్యం బున్న యది. దానిచే మనసంశయంబు లన్నియు నివారింపఁబడియె. ఆపద్యం బెద్దియనిన :-

"సీ. వనదిలంఘవకృపావార్థితోభయకవి, తాకళారత్న రత్నా కరుండ
      సకల కర్ణాట రక్షాధురంధర రామ, విభు దత్త శుభచిహ్నవిభవయుతుఁడ
      వసుచరిత్రాది కావ్యప్రీత బహునృప, ప్రాపితా నేకరత్నప్లవుండ
      శాశ్వత శ్రీవేంకటేశ్వరానుగ్రహ, నిరుపాధికైశ్వర్యనిత్యయశుఁడ

గీ. శ్రీ మహాప్రబంధాంకసింగరాజ, తిమ్మరాజ ప్రియతనూజ ధీరసూర
    పాత్మజుఁడ రామభూషాఖ్యఁ బరఁగుసుకవి, నంకిత మొనర్తునీకావ్యమనఘభక్తి"

దీనిచే నీతనివంశంబు దెలసె. ఇఁక భట్టుమూర్తివంశంబు దెల్పుపద్యంబు నిట వివరింతము.

గీ. అమితయమకాశుధీప్రబంధాంకసింగ, రాజసుతతిమ్మరాజపుత్త్రప్రసిద్ధ
    నరసవేంకటరాయభూషణసుపుత్త్రు, నను బుధవిధేయు శుభమూర్తినామధేయు.

ఇపు డీరెండుపద్యంబులంబట్టి చూడ నీయిర్వురకు మూలపురుషుం డొక్కం డనియు నీయిద్దఱుఁ బినతండ్రి పెదతండ్రి కుమారు లనియు స్పష్టం బయ్యె. ఇట్టి వృత్తాంతంబే మఱియును స్పష్టం బగునటుల నీక్రిందివంశవృక్షముం జూపెదను.

దీనిచేత మనము భట్టుమూర్తి రామరాజు కాఁ డని రూఢంబుగఁ దెల్పితిమి.

వసుచరిత్రములో రామరాజభూషణుఁడు స్మార్తులు గ్రంథారంభము చేసినట్లే కృతిపద్యంబులలో నీశ్వరత్రయమును శక్తిత్రయమును గజానను నుతియించె. ఇతఁ డాంజనేయోపాసనకుం డగుటంజేసి యాంజనేయస్తోత్రమును జేసి సంస్కృతమహాకవుల నుతియించి తనకుఁ బూర్వులగునాంధ్రకవుల నీక్రిందివిధంబున నుతియించెను.

మ. మహి మున్ వాగనుశాసనుండు సృజయింపం గుండలీంద్రుండు త
     న్మహనీయస్థితిమూల మై నిలువ శ్రీనాథుండు ప్రోవ న్మహా
     మహు లై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపువాటించు నీ
     బహుళాంథ్రోక్తిమయప్రపంచమునఁదత్ప్రాగల్భ్యమూహించెదన్. ఆశ్వా. ప. 1. ప. 10.

దీనింబట్టి రామభూషణునకుఁ బూర్వులు 1 నన్నయభట్టు 2. తిక్కనసోమయాజి 3 శ్రీనాథుడు 4. సీముఁడు (నాచనసోముఁడు) 5. భాస్కరుఁడు (హుళిక్కిభాసకరుఁడు) మొదలగువారై యున్నారు. ఇతఁడు తనకృతిపతి యగుతిరుమలరాయని వర్ణించి యొకపద్యమున నతనిబిరుదంబులం దెల్పుచు నొకవచనంబునుచెప్పెను. బిరుదంబు లున్న వచనము దేశచారిత్రములోఁ జేర్చినానుగావున నిపుడు పద్యముమాత్రము కృతిపతి గౌరవాదికము సంగ్రహముగాఁ దెలియుట కిట వివరించెదను.

"సీ. వసుమతీభారధూర్వహత నెవ్వనియుర్వ, రావరాహాంక మర్ధము వహించు
      కరగతచక్రవిక్రమశక్తి నెవ్వాని, రామానుజత్వంబు రమణ కెక్కు
      జీర్ణకర్ణాటలక్ష్మీపునస్పృష్టి నె, వ్వానిలోకేశ్వరత్వము పొసంగుఁ
      జటులశార్వరమగ్న సర్వవర్ణోద్ధార, పటిమ నెవ్వనిరాజభావ మెసఁగు

తే. అతఁడు వీరప్రతాపరాజాధిరాజ, రాజపరమేశ్వరాష్టదిగ్రాజకులమ
    నోభయంకరబిరుదుసన్నుతజయాభి, రామగుణహారి తిరుమలరాయశౌరి. ఆ 1. ప. 13

అనుదీనిం బట్టి చూడ నీతిరుమలరాయనికి భూవరాహలాంఛనమును, జీర్ణకర్ణాటరాజ్య పునరుజ్జీవనబిరుదమును వీరప్రతాప రాజాధిరాజ రాజపరమేశ్వ రాష్టదిగ్రాజకులమనోభయంకరబిరుదులు గలవని తేలును.

ఈ తిరుమలరాయఁడు సింహాసనాసీనుం డై యుండె నని తత్సింహాసనవిభవము రామభూషణునిచే నీక్రిందివిధంబున వర్ణింపఁబడియె. ఎట్లన్నను :-

సీ. కటకేంద్రుఁ డంపినగంధసింధురము లా, త్మస్వామిమాఱు హస్తములు మొగువ
    హయనాథుఁ డంపినహరులు కైజామోర, లార్చుచుఁ బతికి జో హారు సేయ
    నావాడపతి పంపినయమూల్యకటకముల్, కర్తపేరుగఁ బదాగ్రములఁ బెనగ
    బాండ్యేశుఁ డంపినభర్మంబు లధిపతి, ప్రతిగా నిజాంక ముద్రలు వహింప

తే. శౌర్యకీర్తులలో వచ్చుసకలదిఙ్న, రేంద్రరాజ్యేందిరలమాడ్కి నిగురుబోండ్లు
    చటులమాణిక్యమయదండచారుచామ, రములు నీవంగఁ బేరోలగమున నుండి.
                                                              ఆశ్వా. 1. ప. 15.

ఈపద్యమువలన గజపతియు నశ్వపతియు నీయిర్వు రితనిం గొల్చి యుండి రనియు నావాడపతియును, బాండ్యదేశాధివుఁడును ఇతనికి పన్నుల నిచ్చువా రనియుఁ దేలినది. పైపద్యమున అశ్వపతి గజపతులం జెప్పి నరపతి నేల చెప్ప లేదనుశంక వొడమును. ఇతఁడు నరపతియే గావున నాపే రిట వదలివేయఁబడియెను. కృష్ణరాయ లీమూఁడువంశములలోఁ జేరనివాఁ డగుటచే నతనికి మూరురాయరగండఁ డనుపేర చెల్లఃగల్గెను.

రామభూషణుండు తిరుమలరాయఁడు సింహాసనాసీనుఁ డై యుండి తనకు వర్తమానంబు పంపె నని యీక్రిందిపద్యములోఁ జెప్పుచున్నాఁడు :

ఉ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
    దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధా రాసుధా రాశిసం
    జనితైకైకదినప్రబంధఘటికా సద్యశ్శతగ్రంథక
    ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెన్ గృపన్. ఆశ్వా 1. ప 16

అను నీపద్యమువలన రామరాజభూషణుఁడు శ్రీరామ ఆంజనేయో పాసకుడనియు, ఏకదినప్రబంధఘటనాసమర్థుఁ డనియును, నద్యఃకాలమున నూఱుగ్రంథము లనఁగా ననుష్టుప్పులు చెప్పఁగల డనియును, సంగీత శాస్త్ర రహస్య వేది యనియుం దేలినది. ఇంతియకాక ఆశ్వాసాంతగద్యమువలన నీతఁడు సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్యసర్వంకషుఁ డనియును, చతుర్విధకవితానిర్వాహకుఁ డనియు, సాహిత్యరసపోషణుఁ డనియును దేలుచున్నది.

కాని వీర లిర్వురు కృష్ణరాయల కన్యు లగు రాజులఁ గృతిపతులఁ జేయుటకుఁ గారణంబు న డువమైతిమి. దానిఁగూడ వివరించినపిమ్మట వీరివ్యాపారాదుల వ్రాయవచ్చును. మన మీవఱకే రామభూషణాదులు కృష్ణరాయలకాలంబునఁ బిన్న వయసున నున్న వారని తెల్పితిమి. వా రందఱు నాతనియనంతరము తత్సింహాసనము నధిష్టించినరాజుల కడ మిగులఁ బ్రబలి గ్రంథంబుల రచియించిరి. కృష్ణరాయలయనంతరము జరిగినవృత్తాంతము కొంత తెలిపి పిమ్మట నీగ్రంథోత్పత్తులంగూర్చి వ్రాతము.

కృష్ణరాయలు శా. సం. 1453 మృతినొందెను. అపుడు తత్సింహాసనము కృష్ణరాయని యన్నకొడు కగునచ్యుతరాయనిచేఁ దీసికొనంబడియె. ఈతనికి నల్కయతిమ్మన యనుకృష్ణరాయసేనాని సహాయం బొనరించెను. ఈయచ్యుతరాయఁడు నాలుగైదువత్సరములు రాజ్యంబు సేసి తుదిఁ దురుష్కులతోఁ బోరి కాలగతిం జెందె. అపు డాతనిపుత్త్రుని నీతిమ్మరాజు సింహాసన మెక్కించె. ఈబుడుతఁడు పదివత్సరంబులవాఁడై యుండుటంజేసి యీతిమ్మరాజు వానిం దనపోషణలోనుంచి కొని తానే రాజ్యంబుచేయుచుండెను. ఇట్లు కొన్నిదినంబు లుండి యా సంస్థానంబునకుఁ దానె ప్రభుం డై యుండ మదిఁ గోరి తనసంరక్షణమున నున్న సదాశివరాయనికి విషప్రయోగంబు సేయించె. ఇట్టిద్రోహ కార్యంబు చేసి తా రాజ్యంబు జేయఁదలంచిన నది దైవంబునకు సమ్మతంబు కాదయ్యె. కావున నీతని సంహరింపఁ దగు నుపాయంబు లూహింపఁబడియెను :-

రాష్ట్రంబులోని జనులందఱుఁ గృష్ణరాయనియల్లుం డగునళియ శ్రీరామరాజును సింహాసనం బధిరోహింపుఁ డనియు, దాము సహాయ మొనర్చెద మనియుఁ బ్రార్థించిరి. ఈరాజు కృష్ణరాయని యనంతరమే రాజ్యమునకు రా నిశ్చయించి యుండఁగా నల్కయతిమ్మరాజు విఘ్నంబు కల్పించి యచ్యుతరాయనికి రాజ్యమిచ్చెను. ఈరామరాజునకుఁ బట్టాభిషేకకాలంబునఁ గల్గినవిఘ్నంబు సూచించి వసుచరిత్రంబున నొకపద్యంబు చెప్పఁబడియెను. అదియెట్లనిన :-

సీ. పట్టాభిషేకవిపర్యయంబునఁ బ్రోలు, వెడలి ప్రియానుజు ల్వెంటఁ గొలువఁ
    జిత్రకూటాభిఖ్యఁ జెలఁగుఁపెన్గొండసాం, ద్రహరిద్విపేంద్రనా దవనిఁజెంది
    ఖలజనస్థానవాసులఁ బల్వురవధించి, మహిమ సలక ఖరస్మయ మడంచి
    హరివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప, దురమునఁ గదిసి తద్ద్రోహిఁ దునిమి

గీ. యనఘతరపార్థి వేందిర నధిగమించి, సాధుకర్ణాటవిభవసంస్థాపనంబు
    పూని శరణాగతులనెల్లఁ బ్రోచె రాముఁ, డతఁడునిజచరితంబురామాయణముగ.
                                                               (ఆశ్వా 1. ప. 44.)

ఈ వృత్తాంతమునే నరసభూపాలీయంబునంగూడఁ జూడనగు. ఆ కవియు నీతనిపేరు చెప్పి యుండుటకుఁ గారణంబు కలదు. దాని ముందు వివరింతము, ఈరామరాజు నల్కయ తిమ్మని జయించి యింకఁ గొన్ని దేశములు స్వాధీనము చేసికొనినట్లు నరసభూపాలీయమున నున్నది.

సీ. ఖలు నతిద్రోహు సల్కయతిమ్మని హరించి, సకలకర్ణాటదేశంబు నిల్పె
    నతుని వర్ధితునిఁ దత్సుతునిఁ బట్టము గట్టి, కుతుపనమల్కన క్షోణి నిలిపె
    పదిలుఁ డై రాచూరుముదిగల్లుకప్పంబు, సేయఁ గాంచి సపాదుసీమ నిలిపె
    శర ణన్న మల్కనిజామున కభయం బొ,సంగి తదీయరాజ్యంబు నిలిపె

గీ. నవనియంతయు రామరాజ్యంబుజే సె, తనగుణంబులు కవికల్పితములు గాఁగ
    నలవియె రచింపసత్కావ్యములనువెలయ,భూమినొక రాజమాత్రుండెరామవిభుఁడు.

ఈ రామరాజు కృష్ణరాయలయల్లుం డైనందులకును సదాశివరాయనిరాజ్యంబు నందినందులకును రామాభ్యుదయము నందలిపద్యము.

ఉ. ఆపటుకీర్తి రామవసుధాధిపచంద్రుడు కృష్ణరాయధా
    త్రీపతిసార్వభౌమమహితృప్రియుఁ డై వితతప్రతాపసం
    తాపితశత్రుఁ డై యలసదాశివరాయనిరంతరాయ
    విద్యాపురరాజ్యలక్ష్మికి నిదానము తా నయి మించె నెంతయున్.

ఇట్లు పైనఁ జెప్పఁబడిన మూఁడుగ్రంథంబుల నీయళియరామ రాజు చెప్పఁబడుటకుఁ గారణం బేమనిన :-

వసుచరిత్రకృతి నాయకుఁ డీతనితమ్ముఁడు. రామాభ్యుదయ నరసభూపాలీయ కృతిపతు లితని మేనల్లుండ్రు. వారివారివంశంబులు నుతింపఁబడుచో వంశశ్రేష్ఠుం డగునీతండు మిగుల వర్ణింపంబడియెను. వీరి వంశవృక్షంబున వీరిసంబంధంబులఁదెలుపుచున్నాఁడను.

చంద్రవంశము.

|

తాత పిన్నమరాజు.

|

ఆర్వీటి బుక్కశౌరి.

|

రామరాజు 1.

|

తిమ్మరాజు. కొండశౌరి. శ్రీరంగరాజు.
కృష్ణరాయనియల్లుఁడు రామరాజు. వసుచరిత్ర కృతిపతి. తిరుమలరాజు. నరసభూపాలీయ కృతిపతి యగు నహోబలనరస రాజుతల్లి లక్కమ్మ రామాభ్యుదయ కృతిపతి యగు గొబ్బూరినరసరాజుతల్లి ఓబమ్మ.

ఇతఁడు కొంతకాలంబు రాజ్యంబు చేసి కాలపరిపాకంబు నందెను. ఈతనియనంతర మీతనితమ్ముం డగుతిరుమలదేవరాయఁడు సింహాసనం బునకు వచ్చెను. ఇతఁడే వసుచరిత్రను గృతినందినరసికుండు. ఈవృత్తాంతంబు స్పష్టపఱుచు వసుచరిత్రంబులోని పద్యము . -

క. అ రామశౌరిపిమ్మట, ధీరామరశాఖి వీరతిరుమలరాయం
    డా రామసేతుహిమవత్, క్ష్మారమణీరమణుఁ డై జగంబు భరించెన్.
                                                          ఆశ్వా 1. ప. 55.

ఇతనిచెల్లె లైనలక్కమాంబకుఁ బుత్రుం డైనయహోబల నరసభూపాలుఁ డితనికి మంత్రిగ నుండియుండెను. రామభూషణుఁడు మేనమామపేర వసుచరిత్రంబును, భట్టుమూర్తి మేనల్లునిపేర నరసభూపాలీయంబును రచియించిరి. ఇంతవఱకు తెనాలిరామకృష్ణుం డున్నట్లు మనకు దృష్టాంతము లున్నవి. అతనిపాండురంగవిజయంబు నీకాలంబు నాఁటిదే. ఈకాలంబులోనివసుచరిత్రంబుఁ జూచి యాముక్తమాల్యద రచియింపఁబడె నని చెప్పుటకంటె వింత యింకొకటి గలదే. ఈతిరుమలరాయనితో రామభూషణ రామలింగములనామంబు లంతరించెను. తిరుమలరాయనియనంతరము వేంకటాద్రి యనుశ్రీరామరాజు రెండవతమ్ముఁడు రాజ్యమునకు వచ్చెను. అతనికడ నోబమాంబ యనురెండవ సహోదరికుమారు లగుగొబ్బూరినరసరాజును జగ్గరాజును మంత్రులు. అందు రామాభ్యుదయంబు గొబ్బూరినర్సరాజుపేరిట రచియింపఁబడెను. దీని రచియించినవాఁడు అయ్యలరాజు. రామభద్రకవి, ఇతనితోఁగూడ భట్టుమూర్తి యున్నట్లు మనకు నిదర్శనంబులు గాన్పించెను. కృతిపతులకుఁ గలసంబంధంబులును కవులజీవితకాలంబులను వాక్రుచ్చితిమిగావున నిఁక వీరిగ్రంథవిశేషంబులు వ్రాయంజనును.

వసుచరిత్రమునకుఁ గల్గినవిఘ్నము.

(1) రామభూషణుఁడు వసుచరిత్రమును గృష్ణరాయనికాలంబున రచియించినట్లును దాని నతఁడు కృతినందకుండ రామకృష్ణుం డంతరాయంబు కల్పించినట్లును బిమ్మట రామభూషణుఁడు వాని నెంతయుఁ బ్రార్థింప నతఁడు రాజుకడకుం జని యొకయుపాయంబు చెప్పెద నని దాని మృతు లగునితరవంశీయులకుఁ గృతి నిప్పించి పిమ్మట దానిఁ బిం డంబులపై ధార వోయించె ననియు వాడుక గలదు. దీనిచే వసుచరిత్ర కృతినాయకుం డగుతిరుమలరాయండు కృష్ణరాయలకుం బూర్వంబే మృతి నొందినట్లు తేలుచున్నది. ఈరాజు కృష్ణరాయలకుఁ బూర్వుండు కాఁ డనియును గృష్ణరాయనియనంతరము రాజ్యము చేసిన యళియరామరాజుతమ్ముం డనియు నీవఱకే మనము చెప్పియుంటిమి. కాఁబట్టి కృష్ణరాయలకంటెను వసుచరిత్రకృతిపతి పూర్వమే మృతి నొందె ననుట యెట్లు సరి యగును.

(2) ఒకవేళఁ గృష్ణరాయలకాలంబున నీవిఘ్నంబు వచ్చుటంజేసి రామభూషణుం డపుడు దీనిం బ్రకటింపక కాలాంతరమునఁ దిరుమలరాయనికిఁ గృతియిచ్చె నని యోఁచింతము. అ ట్లయినఁ దొల్లి తనకు నవ యశస్సుం దెచ్చిన "శ్రీభూపుత్రి వివాహవేళ" అను కృతిముఖ పద్యంబు మార్చి దీని రామభూషణుఁ డొరులకుఁ జూపునుగాని తనతప్పుం జెప్పుపద్యంబుమాత్ర మం దుంచి కడమపద్యంబులు కృతిముఖంబున మార్పఁడుగద. కావున నిదియు లెస్సయై యుండలేదు.

(3) కృష్ణరాయని యనంతరము తత్సింహాసనాసీనుం డగునీతిరుమల రాయనికడ రామలింగము మొదలగుకవు లున్నారు. కావున నప్పుడే యీగ్రంథంబు రచియించి తేఁ గని రామలింగ మాక్షేపించినాఁ డని యూహింతము. అ ట్లయిన నిది మృతు లగునితరవంశీయులకు నీఁబడియె ననుమాటయుఁ, దీనిఁ బిండంబులపై ధారావోయించె ననుమాటయు బూటకమే యని చెప్పవలయును. ఈవృత్తాంతము కల్పిత మని చెప్పుటయే నిజముగఁ గాన్పించును. రామకృష్ణుండు తొంటియాక్షేపణముఁ జేసియుండిన నుండుగాక. రాజు నాఁడుగాకున్న మఱునాఁడైన రామలింగనిచేష్ట లవి యని యూహించి మరల గ్రంథమును దనంతట తానే వినకుండునా. కావున నీకథ నెంతమాత్రమును నమ్ముట న్యాయముగాఁ గాన్పించకున్న యది.

బట్టుమూర్తి తిమ్మ రసుపైఁ గోపించుట

ఇదివఱలో నేను వివరించియున్న మోదుకూరి కాఁపురస్థులగు భట్రాజులు "ద్వాత్రింశన్మంత్రులచరిత్రము" అనుగ్రంథములో నీభట్టుమూర్తిప్రతాప మున్నట్లుగాఁ జెప్పి దానిని సూచించుటకుఁగాను ఈగ్రంథమంతయుఁ బిఠాపురములోనుండు బ్ర. పెద్దాడ. చిట్టిరామయ్యనాము లగునామాతామహజ్ఞాతుల కొసంగిరి. దానిని వా రచ్చు వేయించి ప్రకటించిరి. అందులో నీభట్టుమూర్తిప్రతాప మున్నను అది ద్వాత్రింశన్మంత్రి ప్రతాపములున్నట్లు మనదేశములో మిక్కిలి విఖ్యాతి నందిన కృష్ణదేవరాయసార్వభౌముని ప్రసిద్ధప్రధానమంత్రి యగుతిమ్మరసుమంత్రిప్రతాప మందు లేదుగావున నందలిభట్టుమూర్తికథలు కల్పితములని యూహించవలసియున్నది. తిమ్మరసు వృత్తాంతము వేఱుచారిత్రముగా వ్రాసియుంటినిగనుక నిపు డీమంత్రిచరిత్రములో వ్రాయంబడిన భట్టుమూర్తి ప్రతాపమునే యిందుఁ బొందుపఱిచెదను. "కథకు కాళ్లును, ముంతకుఁ జెవులును లే" వని యున్నది. గావున పుక్కిటిపురాణము లెవరి వెవరి కదికిన నదుకవచ్చును. కావున నే నీవఱకు రామలింగముచరిత్రములోఁ జెప్పినభట్టుమూర్తిపద్యము రామలింగముపద్యమని చెప్పెడుదానికి సంశయింపం బనిలేదు. ఏదియైన నున్న నది పాఠాంతర మని యూహించుట మంచిది. అదియెట్లున్న దనఁగా :-

21 మంత్రి యగుతిమ్మరసుకథ.

"భట్టుమూర్తికి కిన్క రెట్టింప పచ్చలహార మర్పించె తిమ్మరసుమౌళి."

ఈయన రాయలవారియొద్ద ముఖ్యప్రథానుఁడు. తిమ్మర సనుపేరుగలవాఁడు. బహుబుద్ధిశాలి. ఈయనను రాయలు బితృసముఁ డని యప్పాజీ యని పిలుచుంగావున నప్పాజీ యనియుంగూడ నామంబు గలదు. ఈయన సర్వాధ్యక్షుండుగా రాయలవారియొద్ద నుండునపుడు భట్టుమూర్తి యెన్నండును కైవారంబు సేయకుండుటచే మనంబున నించుక మత్సరంబు గలవాఁడై యుండి యాకవికి నెప్పుడు వంచనము గావించెద నాయని యూహించుచుండఁ బెద్దన్న, రామలింగము మొదలగువారును తాము రాజాస్థానమున దిగువం గూర్చిండియుండ, మూర్తికవి రాజుతో నర్ధసింహాసనారూఢుం డై యుండు నని యెంతయు చింతచేఁ గుందుచు నొకసమయమున నీతిని కెఱిఁగింప నతఁడును మీర లూరక యుందురు. ఏ నేమిసేతు. మీర లాతనిఁ గ్రిందికి డించుయత్నంబు జేసిన నేనును సహాయభూతుండ నయ్యెదనని వక్కాణించను. ఇటులుండ నొక్కనాఁడు రాయల సంభాషణంబున రామలింగము వారింగూర్చి యొకపద్య మిటుల జెప్పెనుః

క. నరసింహకృష్ణరాయని, కర మరు దగుకీర్తి వెలసె కరిభిద్గిరిభి
    త్కరికరిభిగ్గిరిగిరిభిత్కరిభి, ద్గిరిభిత్తురంగక మనీయం బైః

అని చెప్ప నందఱు నానందింప భట్టుమూర్తి యూరకుండిన, నేమి యూరకుండి తీ వీపద్యం బెటులుండె ననవుడు నందఱకుం బాగుగా నుండ నాకుం బాగుగాదే యనఁ దిమ్మర సిది యేమో శ్లేషగాఁ బలుక నోవు నన రామలింగ మిది బాగుండ కుండిన నింతకుబాగుగా నీవు జెప్పిన నాసింహాసనంబునం గూర్చుండుము. లేనియెడ దిగు మనఁదిమ్మరసు ఔను రామలింగముమాట బాగుగా నుండె నన నపుడు భట్టుమూర్తి యాగ్రహించి నన్ను సింహాసనంబు దిగు మని తిమ్మరసు పలుకుంగాన యిదిగో తిమ్మరసును నిన్నుగూడఁ దిట్టెద నని వక్కాణించుచుఁ రాయలంగూర్చి జెప్పినపద్యము :-

ఉ. లొట్ట యిదేటిమాట పెనులోభులతో మొగమాట మేల తాఁ
    గుట్టకయున్న వృశ్చికముఁ గుమ్మరపు ర్వని యందురే కదా
    పట్టపురాజుపట్టిసరిపల్లె సరాసరి యియ్యకున్న నేఁ
    దిట్టకమాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ
    దిట్టితినా మహాగ్రహమతిన్ మకరగ్రహజర్జరీభటా
    పట్టపుదట్టఫాలఫణిభర్తృజహూకృతపర్జటస్ఫుటా
    ఘట్టనథట్టణాలకవి ఘట్టకనిర్గళ రాజభృత్యకీ
    చట్టచటార్భటీనయనజర్జరకీలలు రాలఁగావలెన్

జుట్టఱికంబునం, బొగడఁ జూచితినా రజతాద్ర్యధిత్యకా
పట్టణమధ్యరంగగతభవ్యవధూవద నానుషంగ సం
ఘట్టశిరస్థ్స గాంగఝరహల్లకజాలసుధాతరంగముల్
చుట్టుకొన న్వలెన్ భువనచోద్యరుఁగా భయదంబుగా మఱిం
దిట్టితినా సభాభవనధీంకృతభీమనృసింహరాడ్ధ్వజా
తాట్టమహాట్టహాసచతురాస్య సముద్భృకుటీతటీవటీ
కోట్టణరోషజాలహృతకుంఠితకంఠగభీరనాదసం
ఘట్టవిజృంభమాణగతిఁ గావలె దీవనపద్య మిచ్చి చే
పట్టితినా మణీకనకభాజనభూషణభాసురాంబరా
రట్టతురంగగంధగజరాజదమూల్యఘనాతపత్రభూ
పట్టణభర్మ హర్మ్యభటపంక్తి చిరాయు వనామయంబు వై
గట్టిగ తోడుతో వెలయఁగావలె నెక్కువఠీవిఁ జూడుఁడీ
యట్టిటు మందెమేలముల నందఱినింబలెఁ జుల్కఁ జూచి యే
పట్టుననైన కేరడము పల్కకుఁడీ పయివచ్చు నందులన్
గొట్టుచు దుష్కవిద్విరదకోటుల బంచముఖోద్భటాకృతిం
బెట్టుదు దండముల్ సుకవిబృందము కే నతిభక్తి సారెకున్
గట్టితి ముల్లె లేఁబదియుఁ గాఁగలనూటపదాఱు లెయ్యెడన్
రట్టడి భట్టుమూర్తికవిరాయనిమార్గ మెఱుంగఁ జెప్పితిన్.

అని యాగ్రహించిన రాయ లీబ్రాహ్మణు లొనరించు నీదురాలోచన నే నెఱుంగ. నీయాన. నన్నేల తిట్టెద వని యనర్ఘ్యబహుమానం బొనర్చి గాఢాలింగనంబు గావించిన సంతసించుచు భట్టుమూర్తి రాయలమీదఁ జెప్పినపద్యము.

ప. ఆబ్జముఖీమనోజ నరపాధిపనందన కృష్ణ నీయశం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీపరాక్రమం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీవితీర్ణిమం
    బబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిద్ధరన్. [1]

అని స్తుతించిన నది రామలింగనిపద్యముకంటె బాగుగా నున్న దని పెద్దన మొదలగుకవులు సంతసించిన రాజు గారవించెను. అపుడు భట్టుమూర్తి తిమ్మరసుం జూచి రా జీదు రాలోచనంబు గానఁడు. నీప్రోత్సాహంబున కవు లీవిషమాలోచనంబు గావించిరి. నేను నీకు కైవారంబొసంగకుండుట కారణంబుగా వీరి బురస్కరించుకొని నన్ను వంచింపంజూచితివైనను నీవృత్తాంతంబు జెప్పెద విను మని చెప్పినపద్యము.

"శా. గుత్తిం బుల్లెలు గుట్టి చంద్రగిరిలోఁ గూ డెత్తి పెన్గొండలో
      హత్తిన్ సత్త్రమునందు వెండిబలుదుర్గాధీశుతాంబూలపుం
      దిత్తు ల్మోసి పదస్థు లైనఘనులం దీవించ ....................."

అని మూఁడుచరణములు జెప్పువఱకు తిమ్మరసు దుష్కీర్తిభీతుండై రాయలవారు తాఁబట్టాభిషేకంబు నొనర్చుకొనునపు డిచ్చిన యమూల్యం బగుగారుత్మతరత్న హారంబు కవికంఠంబున నలంకరించిన పూర్తి జేసిననాలవచరణము.

                                              దీవించెదన్
"మత్తారాతియయాతినాగమనుతున్ మంత్రీశ్వరున్ దిమ్మరుస్."

                 అని దీవించి మఱియును రచించినపద్యము. -

క. అయ్య యనిపించుకొంటివి, నెయ్యంబునఁ గృష్ణరాయనృపపుంగవుచే
    నయ్యా నీసరి యేరీ తియ్యనివిలుకాఁడ వయ్య తిమ్మరసయ్యా.

అని కై వారం బొనర్చిన నత్యంతకౌతూహలం బంది యది మొదలు సఖ్యంబుగా నుండి నిరంతరైశ్వర్యంబు లనుభవించుచుండె నని యున్నది.

(1) భట్టుమూర్తింగూర్చి మఱికొందఱు వ్రాసినచరిత్ర విషయము.

ఈభట్టుమూర్తింగూర్చి. "Dekkan Poets" అనుగ్రంథములో నొకకొంతగ్రంథము వ్రాయంబడియున్నది. అదియాంగేయభాషయం దుండుటచేత దాని నట్లే యిందుఁ బొందుపఱిచి యాకవి చెప్పినపొరపాటుల నక్కడక్కడ సవరించెదను. ఈగ్రంథము

BHATTU MURTI.

(I) This poet was born in a village called Bhattu Palla in the district of Pulivendle, in the Aeded Districts, he was a distinguished okator, and possessed a critical knowledge of the Sanscrit & Telugu dialects. As the poets of his time were greatly patronized by the sovereigns of various provinces, Bhattu Murti chiefly confined his labours to versification in the vernacular tongue, and the harmony of his numbers were so much admired that ha obtained a great many scholars whom he made proficients in prosody. He in course of time, proceeded to the Court of Kristna Raya, who admiring his talents, retained him as one of his eight celebrated bards; during the life time of this monarch, he composed an epic poem entitled "Narasa Bhupaliyam," or the history of Narasa Bhupal, which was a work of great labour, and much admired by his comtemporaries, and by posterity. After the death of Kristna Rayaloo, he wrote another epic poem call "Vasoo charitra," the subject of which is the loves and nuptials of king Vasoo and the beautiful nymph Gireka; the work was dedicated to king Tirumala, and the invocation of the poem commences in the following manner ː-

The foregoing poem of the Vasoo Charitra was much admired by the contemporaries of Bhattu Murti, and became a model for after poets who composed in the Telugu language. Bhattu Murti was highly rewarded by Tirumala Raya for this and other works that he composed at the command of that monarch, so that he passed his days in peace and happiness until his deatha, which happened at his residence in the sixtieth year of his age.

It runs thusː- old nos 36&37. the two manuscripts are copies of a poem, by one of the Ashta Diggajas at Vijianagaram; there having been eight learned men, so termed, by way of distinction. Timmaraju or by title Bhattu Murti from poetical emiuence, was one of these poets of Krishna Rayer's court. This work, written by him, is entitled after the father of Krishna Rayer and as usual contains the geneology of the patron. Its subject is rhetorical and poetical, on the Laws of the drama, and poetical composition. It is highly esteemed, and regarded as a very superior work. లోను భట్టుమూర్తి కృష్ణదేవరాయలకాలములోనివాఁ డని పైద్వాత్రింశన్మంత్రి చరిత్రములోవలెనే వ్రాసియున్నది. అందులో నీతఁడు కృష్ణదేవరాయని యాస్థానాష్టదిగ్గజములలో నొకండుగా నున్నట్లును, కృష్ణదేవరాయలు జీవించియుండఁగా నితఁడు నరసభూపాలీయగ్రంథమును రచియించినట్లుం జెప్పెను. ఇతఁడును (REV. TAYLOR) దొరవలె నీనరసభూపాలీయము కృష్ణదేవరాయల తండ్రియగునరసరాజుపై రచియించియుండెనని యభిప్రాయపడి యున్నట్లు తోఁచెడిని అట్లు కాదనియును టెయిలరుదొరవలన వ్రాయఁబడినవ్రాఁత పొరపా టనియును చెప్పెదను.

అందులో వసుచరిత్రము నీభట్టుమూర్తి రచియించినట్లే యున్నది. అది పొరపా టని యిదివఱకే నాయుపన్యాసములోఁ జూపించియు న్నాను. కాఁబట్టి అందుకుగా నాతనిచే నీయంబడినవిశేషములు రామరాజభూషణునివిగా భావించి గ్రహింపఁబడవలసినది. భట్టుమూర్తి యఱవదిసంవత్సరములు జీవించి తనయింటివద్దనే కాలధర్మము నందె నని వ్రాయంబడియున్నది. దీనికి వేఱువ్రాఁతలయాధారము లేదుగావునఁ బాఠకు లెట్లు గ్రహించినను జిక్కు లేదు. టెయిలరుదొర వ్రాసిన దెట్లనఁగా :-

vide page 206 vol. 2 Catalogue Raisonnee by the rev. W. Taylor.

దీనింబట్టిచూడఁగా బై టెయిలరు దొరగారికే కాక వారికి నరసభూపాలీయము బోధపఱిచినపండితులకుఁగూడ నరసభూపాలీయపురాజులపరిజ్ఞానము లేనట్లు కానుపించును. అట్లు కాకున్న భట్టుమూర్తి నామాంతరము తిమ్మరా జనియును, ఆగ్రంథము కృష్ణరాయలతండ్రి యగునరసరాజునకుఁ గృతియియ్యఁబడినదనియును, అందులఁ గృష్ణరాయలవంశావళి యున్నదనియును, ఆగ్రంథము ప్రబంధాలంకారములనే కాక నాటకసంప్రదాయములంగూడ చెప్పుననియును జెప్పుట తటస్థించదు. దానిని మనము పరిశీలించి చూడఁగా నది కృష్ణరాయలతండ్రి యగునరసింగరాయనిపై నీయఁబడిన కృతి కాక తొరగంటి నరసరా జనునొకసామంతప్రభున కీయంబడినట్లును, ఈ నరసరాజు కృష్ణరాయనివలె చంద్రవంశపురాజు కాక సూర్యవంశస్థుఁ డైనట్లును, ఆకృష్ణరాయనివంశము వర్ణింపఁబడనట్లును, అందు నాటకములతోఁ జేరినభాగమంతయు వదలివేయఁబడనట్లును స్పష్ట మగును. కాఁబట్టి యిట్టిసంశయములు దీర్చుపట్టుల దేశస్థు లగుపండితులే పొరపడుచుండఁగా నిఁక నితరదేశీయు లగునాంగ్లేయపండితులు పొరపడుట కేమియబ్బురంబు? ఇట్టిపట్ల మిక్కిలి మెలఁకువతోఁ బరిశీలించవలయు నని పాఠకుల నుత్సహించెదను.

పంచ పాషాణములు.

వాని టీకయును.

1. ఉ. భండనభీమ ని న్నెదిరి పాఱక నిల్చినశాత్రవుల్ బృహ
       న్మండలపుండరీక హరినాకనివాసులు పాఱియున్ బృహ

   న్మండలపుండరీకహరినాకనివాసులు చచ్చియున్ బృహ
   న్మండలపుండరీకహరినాకనివాసులు చిత్ర మెన్నఁగన్.

అర్థము. భండనభీమ = యుద్ధములయందు (శత్రువులకు)భయము బుట్టించువాఁడా, నిన్ను, ఎదిరి = తాఁకి, పాఱక = (వెన్నిచ్చి) పఱుగెత్తక, నిల్చిన, శాత్రవుల్ = పగతులు, బృహ...సులు,బృహత్ = గోప్పవైన, మండల = గుండ్రములైన, పుండరీక = వెల్లగొడుగులతోడ, హరి = గుఱ్ఱములమీఁద నాక = సుఖముగా, ని, మిగుల, వా = తిరుగుటకు, ఆస = స్థానమైనవారు. పాఱియున్ = పాఱిపోయియు, బృహ...సులు, బృహత్ = గొప్ప, మండల = (ఒక దినుసు) పాములకును, పుండరీక = పులులకును, నాక = నెలవగు (అడవినేలల) చోటుల, ని, పోయిన, వాసులు = కట్టుబట్టలు గలవారై యుందురు. చచ్చియున్, బృహ...సులు - బృహత్ = విశాలమైన, మండల = ఎఱ్ఱనైన, పుండరీక = కమలములవంటి, హరి = సూర్యునియందును, నాక = వైకుంఠమందును నివాసులు = ఉండువారు.

వీనికి నిఘంటు ప్రమాణములు :-

మండలశబ్దమునకు మండలం వర్తులే రాష్ట్రే శోణే ద్వాదశ రాజకే, దేశే దేవాలయే బింబే స్థలేషు నికదంబకే. శాశ్వతనిఘంటువు. పుండరీకశబ్దమునకు, పున్డరీకస్తు శార్దూలే దిగ్గజే నర్సపుంగవె, మునౌ ఛత్రే రాజభటే కృష్ణే క్లీ బేచ పంకజే. నానార్థరత్నమాల. హరిశబ్దమునకు. యమాని లేంద్ర చంద్రార్క విష్ణుసింహాంశునాజిషు, శుకాహికపిభేకేషు హరిర్నాకపిలేత్రిషు. అమరము. నాకశబ్దమునకు. నాకస్తు గగనే స్వర్గే వైకుణ్ఠే భూతలే శుభే. అని. ని. ఉపవర్గ. వా. వా గతి గన్ధనయోః అని ధాతువు ఆసవువలె శె అను ధాతువు వీనిమీఁద సరి చూచునది.

2. ఉ. వీరరసాతిరేకరణవిశ్రుత వేమనరేంద్ర నీయశం
        బారభమానతారకహారసమానము నీభుజామహం

     బారభమానతారకరహారసమానము నీనికేతనం
     బారభమానతారకరహారసమానము చిత్ర మిద్ధరన్.

అర్థము. నీయశంబు = నీకీర్తి, ఆర = పాదరసముతోడను భ = నక్షత్రములతోడను, మాన = తుల లేని, తార = వెండితోడను, కర = వర్షోపముల (వడగండ్ల)తోడను, హార = ముక్తామణిరసములతోడను, సమానము, నీ భుజామహంబు = నీ బాహుప్రతాపము, ఆర = అంగారకునితోడను, భ = ఆ నలునితోడను, మాన = విద్రుమమతోడను, సమానము = సరియైనది. నీ నికేతనంబు = నీగృహము, ఆర = ధనమునకును, భ = ఈశ్వరునియొక్క, మా = సంపదవంటి సంపదగలిగిన, ఆనత = నమ్రులైన, ఆర = అరిసమూహముయొక్క, కర = కానుకులకును, హా = వీణెలయొక్క, రస = ధ్వలనుకును, మా = లక్ష్మికిని, ఆస = స్థానమయినది.

వీనికి కోశప్రమాణములు :-

ఆరశబ్దమునకు. ఆరస్తు పారదే విత్తే భౌమే వాయుసుతే రవౌ. శాశ్వతుఁడు. భశబ్దమునకు. భశ్శంభౌ భ్రమరే భావే శుక్రాంశేజల దేవుమాన్. మఱియు, భస్స్యాన్మధూకేశుక్రేచ. నానార్థరత్నమాల. మానశబ్దమునకు. మానస్తు నిస్తులే వ్యోమ్ని విద్రుమే జ్వలనే ద్యుతౌ, చిత్తేఽభిమానే ప్రమదే విమానే పరిమాణకే. కేశవనిఘంటువు. మఱియు, మానో మణౌచకనకే విమానే విద్రుమే ద్యుతౌ, గర్వే ప్రమాదేహృదయే నిస్తులే నికలీనివత్. విశ్వము. తారశబ్దమునకు, తారోముక్తాఫలే శుద్ధే రజతేకనకేఽపిచ, నక్షత్రేతరలేశ్రేష్ఠే కాంతారం హాసిలక్షణఃహలాయుధనిఘంటువు. కరశబ్దమునకు కరో వర్షోపలే హస్తే భానౌ తటితి వారిదే, ఉపదాయాం ద్యుతౌ శ్రేష్ఠే శున్డాయాం ప్రత్యయోధనమ్. హైమవతి. హారశబ్దమునకు "హరిహింసా మతౌ హారే వాసవే కనకేఽంబరే. కేశవనిఘంటువు. మఱియు, హార శ్చక్రే వరే నస్త్రే భూతుకేహేమ్ని మౌక్తికే. ఉత్పలమాల. హశబ్దమునకు, హత్యాగే గతివీణయోః రసశబ్దమునకు. రస శబ్దే అనుధాతువు. మాశబ్దమునకు. ఇంది రా లోకమాతా మా. అమరకోశము. అనశబ్దమునకు, అన ప్రాణనే అనుధాతువు. వీనింబట్టి సరిచూచునది. 2

3. ఉ. అబ్జముఖీమనోజ నరసాధిపనందన కృష్ణ నీయశం
        బబ్జక రాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీపరాక్రమం
        బబ్జక రాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీ [2] విహాపితం
        జబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిద్ధరన్.

అర్థము. నీయశంబు = నీకీర్తి, అబ్జ = అమృతముయొక్కయు, కర = కాంతియొక్కయు, అబ్జక = చతురాసనునియొక్క, అబ్జనయనా = కమలములవంటి కన్నులుగల సరస్వతీదేవి యొక్కయు, అబ్జ = శంఖము యొక్కయు, విలాసము = కాంతివంటికాంతిగలిగినది. నీపరాక్రమంబు, అబ్జ = అనలము, కర = హస్తమందుగలశివునియొక్కయు, అబ్జజ, అబ్జ = హుతాశనునియందు, జ = పుట్టిన కుమారస్వామి యొక్కయు, అబ్జనయన = వనరుహాక్షుఁడైన శ్రియఃపతియొక్కయును, అబ్జ = అర్ఝునుని యొక్కయును, విలాసము = విలాసమువంటి విలాసముగలది, నీవిహాపితంబు = నీయొక దాతృత్వము. ఆబ్జ = సముద్రములలో, కర = శ్రేష్ఠమైన సముద్రమును, అబ్జ = సూర్యునియందు, జ = పుట్టిన కర్ణు నిన్ని, అబ్జ = నిధిని. నయన = పొందినకుబేరుని, అబ్జ = చంద్రుని, వి = విశేషముగా, ల = గ్రహించుటకు, ఆసము = స్థానమైనది.

ఇందుకు నిఘంటుప్రమాణములు :-

అబ్జశబ్దమునకు. అబ్జ శ్శశాంకే విజయే జ్వలనేజ్వలశంబుధౌ. అని శుభాంగుఁడు. కించ. అబ్జః పద్మే ఽర్జునే హేమ్నిమీనే చన్ద్రే ప్రభాకరే. అని విజయుఁడు. మఱియు, కించ అబ్జః పద్మే సుధాయాంచ తపనే పావకే దధే,స్కన్ధే చన్ద్రే శ్వేతవాహే సముద్రే కనకే నిధౌ. మఱియు, అబ్జ స్సుధాయామిందౌచ నిధౌ శక్తిధరేఽనలే. ఉత్పలమాల. కించ. అబ్జో ధన్వంతరౌ శంఖే శశాంకే చ షడాననే వైజయంతి. కర శబ్దమునకు. కరో వర్షోపలేహస్తేభానౌ తటితి వారిదే, ఉపదాయాం ద్యు తౌశ్రేష్ఠే శుండాయాంప్రత్యయోధనే. హైమవతి. మఱియును. బలిహస్తాంశవః కరాః. అమరము. నయనశబ్దమునకు. నయనం లోచనే ప్రాప్తౌ జటాయా మంశుకే యుగే. భాగురి. వి ఉపసర్గ. లా ఆదానే అన ఉపవేశనే. అనుధాతువులు. వీనిమీఁద సరిచూచునది. 3

4. సీ. రాజనందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయవేమధరణిపతికి
       రాజనందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయవేమధరణిపతికి
       రాజనందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయవేమధరణిపతికి
       రాజనందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయవేమధరణిపతికి
       భావభవభోగసత్కళాభావములను, భాగభవభోగసత్కళాభావములను
       భావభవభోగసత్కాళాభావములను, భావభవభోగసత్కళాభావములను.

అర్థము. రాజ...లు, రాజ = చంద్రునికి, నందన = కుమారుఁడైన బుధుఁడును, రాజ, ర = సమర్థుఁడైనఁ అజ = ఈశ్వరుఁడును. రాజ = దేవే,ద్రుఁడును. ఆత్మజ = బ్రహ్మదేవుఁడును, వీరలు సాటి. భావ = బుద్ధియందును, భవ = ఐశ్వర్యమందును, భోగ = విభవమందును, సత్కళా = శ్రేష్ఠమైన విద్యలయొక్క, భావ = అతిశయమందును, ఇట్లుసీసము మొదటిచరణమునకు గీతము మొదటి చరణమునకు సరి. రాజనందన, ర = మనోహరమైన, అజ = శివునికి, నందన = కుమారుఁడైనకుమారస్వామియు, రాజ = కుబేరుఁడును, రాజ, ర = శ్రేష్ఠుఁడైన, అజ = రఘుకుమారుఁడైనయజుఁజుడును, ఆత్మజ = చంద్రుఁడును = వీరలు సాటి. వేనిలో ననఁగా భావ = క్రియయందును, భవ = ధనమందును, భోగ = పాలనయందును, సత్కళా, సత్ = యోగ్యమైన, కళా = కాంతియొక్క, భావ = బృందమందును. సీసగీతముల రెండవచరణములు సరి. రాజనందన, ర = బంగారంవంటిదీప్తిగల్గిన, అజ = బ్రహ్మకు, నందన = పుత్రుఁడైన సనత్కుమారుఁడును, రాజ = క్షత్రియుఁడును, రాజ, ర = శ్రేష్ఠుడైన, అ = బ్రహ్మకు, జ = పుట్టినట్టి వసిష్ఠుఁడును, ఆత్మ = బృహస్పతియందు, జ = పుట్టినకచుఁడును సాటి. ఎందులోననఁగా భావ = ఆత్మజ్ఞాన మందును, భవ = జననమందును, భోగ = అనుభవమందును, సత్కళా = అభివృద్ధిపొందునట్టి, భావ = పద్ధతియందును. మూడవచరణములు సరి. రాజ నందన, ర = గౌరవయుక్తుఁన, అజ = మన్మథునికి, నందన = కుమారుఁడైన అనిరుద్ధుఁడును, రాజ,ర = అంతట వ్యాపకుడైన, అజ = విష్ణువును, రాజ = యక్షుఁడును. ఆత్మజ = మన్మథుఁడును, వీరలు సాటి ఎందనఁగా, భావ = ఆకారమందును, భవ = నసారమందును, భోగ = సంభోగమందును, సత్కళా = సౌందర్యముయొక్కభావ = రీతియందును. 4. నాల్గుచరణములకును నాల్గు యెత్తుగీతలకున్ను అర్థము సరిపోయినది.

వీనికి నిఘంటువులు :-

రాజశబ్దమునకు. రాజా ధనపతౌ చన్ద్రే యక్షే క్షత్త్రియశక్రయోః, విశ్వము. రశ్శబ్దమునకు. రా స్త్రియాంహేమ్ని శాలాయా మా శంసాయాం గతావసి నానార్థరత్నమాల. మఱియు.రః వుమాన్ వ్యాపకే దీప్తౌ సమర్థేఽతిశయే బలే. శుభాంగు డు. అజశబ్దమునకు. అజః పితామహే విష్ణౌ కందర్పే శంకరైడకే. విజయుఁడు. మఱియుఁ. అజః పితామహే నాథే భాగే విష్ణౌ హరేఽబ్జజే. వైజయంతి. అజా విధిరజావిష్ణు రజశ్శంభు రజస్తుభః. అజోఽస్త్రీవార్షకావ్రీహి రజోరామపితామహే. ధనంజయుఁడు. అకారోబ్రహ్మవిష్ణ్వశకమఠే ష్వంగణే రణే, గౌరవేఽంతఃపురే హేతౌ భూషణేఽంఘ్రా పుమేజ్యయోః. మఱియు. అకాఠోభూషణే చంద్రేఽంతఃపురే గౌరవేఽంగణే, విధివిష్ణు మహేశాన కమఠే ష్వంబి కేజ్యయోః. ఆత్మశబ్దమునకు. ఆత్మా యత్న ధృతి స్వాంత స్వభావ పరమాత్మని, జీవబుద్ధిశరీరేషు. నానార్థరత్నమాల. మఱియు. ఆత్మయత్నో ధృతిర్బుద్ధి స్వభావా బ్రహ్మవర్ష్మచ. అమరము. ఆత్మా బృహస్పతౌ గాత్రే చిత్తే పద్మభవే ద్యుతౌ, పరమాత్మని యత్నే చ స్వభావే నిర్మలే ధృతౌ. హైమవతి. మఱియు. ఆత్మా ధృతౌ సురాచార్యే పరమాత్మని మానసే, దేవే ప్రయత్నే ప్రజ్ఞాయాం స్వభావే పద్మజే ద్యుతౌ. తారపలాశుఁడు. భావశబ్దమునకు. భావః పదార్థేఽ తిశయే జ్ఞానే బృన్దేచ పద్ధతౌ, లీలాయాంచమనిప్రాభూ చాకారేహృదయే మతౌ. మఱియు, భావః పదార్థసత్తాయాంక్రియా చేష్టాత్మయోనిషు. ధనంజయుఁడు. మఱియు, భావస్స్వభా వేఽభిప్రాయే జ్యేష్ఠానంతాత్మయోనిషు, క్రియాలీలపరార్థేషుబుధజంతు విభూతిషు. విశ్వము. భవశబ్దమునకు. భవసత్తాభద్రభర్గప్రాప్తిసంసారజన్మసు. వైజయంతి. మఱియు, భవఃసంసారసంప్రాప్తిశ్రేయశ్శంకరజన్మను. విశ్వము. భవ శ్శుభే ధనే రుద్రే విభూతౌ జననే సుఖే. భాగురి. భోగ శబ్దమునకు. భోగస్తు భోజనే విత్తే నిర్వేశే పాలనే సుఖే. శబ్దరత్నాకరము. భోగ ప్రబంధసుఖయో రుత్సాహే ఽహిఫణాంగయోః కేశవ నిఘంటువు. మఱియు, భోగ స్సుఖే ధనే చాపే శరీర ఫణయో రపి, పాలనే వ్యవహారే చ నిర్వేశే పణ్యయోషితి. విశ్వము. మఱియు, భోగ స్సుభోజనే విత్తే నిర్వేశే పాలనే సుఖే, వనితాదిభృతౌ రాజ్యే నర్ప స్సఫణభోగయోః నానార్థ రత్నమాల. కించ. భోగస్తు విభవే విత్తే కోదండే ఽహిఫణాంగయోః, సంభోగిపాలనే హర్షే భోజనే పణ్యయోషితి. తారపలాశుఁడు. కళాశబ్దమునకు. కళా చంద్రకళాయాంచ సౌందర్యే చధనే ద్యుతౌ, విద్యాయా మభివృద్ధౌచ శిల్పాదా వంశమాత్రకే. శుభాంగుఁడు. మఱియు, కళా స్యా న్మూలనే వృద్ధౌ శిల్పాదా వంశ మాత్రకే. షోడశాం శేచ చంద్రస్య కలంకాకలయోరపి, కలంశు క్లేకలోజీర్ణే ఽప్యవ్యక్త మధురధ్వనౌ. విశ్వప్రకాశము, మఱియు. కళాంశమాతే శిల్పాదౌ కళాస్యాత్కాలభేదయోః, ఇందోశ్చషోడశోభాగేస్యాన్మూల ధనవర్ధనే నానార్థ రత్నమాల.

5. సీ. మేఁకతోఁకకుమేఁక తోఁకమేఁకకు తోఁక,మేఁకతోఁకా మేఁక తోక మేఁక
                        "
                        "
                        "
   గీ. మేఁకతొకతోఁక మెకమేఁక తోఁకమేఁక
                        "
                        "
                        "

_________________________________________________________________

ఈ యర్థములును నిఘంటువులును మూలగ్రంథానుసారములే. మావికావు.

  1. ఈపద్యము పంచపాషాణము లని ప్రసిద్ధిం జెందినయైదుపద్యములలో నొక్కటి. దీనికిని తక్కిననాల్గింటికిని వ్యాఖ్యానమున్నచోఁ బాఠకుల కుపయుక్త మని యీచరిత్రాంతమందు వానివ్యాఖ్యం బ్రకటించెదను. తక్కినవి నాల్గుపద్యములుకూడ మూర్తికవి వని యూహింపఁగూడదు. వానికవులు ప్రత్యేకముగా నున్నారు అపద్యము లిదివఱలో నొక్కటి కొఱఁత గాఁ దక్కినవాని నుదాహరించియే యున్నారు.
  2. వితీర్ణి యున్.