కవి జీవితములు/పిండిప్రోలు లక్ష్మణకవి
శ్రీరస్తు.
కవిజీవితములు.
ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము.
16.
పిండిప్రోలు లక్ష్మణకవి
ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు కాఁపురము గోదావరి జిల్లాలోని రామచంద్రపురము తాలూకాలోని 'కుయ్యేరు' అనుగ్రామము. ఇతఁ డాగ్రామమునకు మిరాసీదారుఁడు, ఇతనిగ్రామము పిఠాపురపుజమూన్‌దారీలోనిది. ఇతనినాఁడు తత్సంస్థానమునకుఁ బ్రభుఁడు రావు నీలాద్రిరాయనాయకపద్మనాయకవంశభూషణుఁడు.
ఇతనికాలీనులు.
1. రాజా కొచ్చెర్లకోట. వేంకటరాయనామక మంత్రిశిఖామణి ఈయన అత్తిలి, ఆచంట సంస్థానాధిపతి.
2. బులుసు అచ్చయ్యశాస్త్రి. ఈయన మొన్నటివఱకు విశేష విఖ్యాతిం జెంది కీర్తిశేషు లగు బులుసుపాపయ్యశాస్త్రినామకాపర విద్యారణ్యుని తండ్రి.
3. ఒక్కలంకవీరభద్ర కవివరుఁడు. ఇతఁడే వాసపదత్తాపరిణయ మనుసంస్కృత వాసపదత్తనామక గ్రంథమును ప్రబంధముగా నాంధ్రీకరించినవాఁడు.
4. శిష్ణుకృష్ణమూర్తిశాస్త్రి. వేంకటాచల మహాత్మ్యము, సర్వకామదా పరిణయము మొదలగునాంధ్రకావ్యకర్త,
5. ఇంద్రకంటి విశ్వపతిశాస్త్రి. నారాయణ మననాదిక వేదాంత గ్రంథకర్త. వేదశాస్త్రరహస్యవేది.
6. రాజా కాకర్లపూడి పద్మనాభరాజు, రామచంద్రరాజు. వీరు రామచంద్రపురం కోట జమీన్దారీసంస్థానాధిపులు.
7. మొక్కపాటి పేరిశాస్త్రి. తర్కవ్యాకరణశాస్త్రవేత్త.
8. Mr. C. P. Brown, the Telugu Lexicographer. సి. పి. బ్రౌనుదొర. బ్రౌణ్య నిఘంటు వను నాంధ్రాంగ్లేయ నిఘంటు ద్వయము రచియించినవాఁడు. లక్ష్మణకవి ప్రజ్ఞావిశేషములు.
ఇతఁ డాంధ్రగీర్వాణములలో విశేషప్రజ్ఞ గలవాఁ డని ప్రతీతి నందెను. అం దాంధ్రమున మిక్కిలి ప్రజ్ఞ గలవాఁడు. ఇతఁడు తెనాలి రామకృష్ణునివలె హాస్యస్వభావుఁడు. ఆకారణముచేత నితనిపేరు గోదావరీ మండలములో నాధునికులలో విశేషవిఖ్యాతిం జెందె అట్టిచమత్కారములలోఁ బెక్కులు రసహీనము లవుటంజేసి వానిలోఁ గొన్ని మాత్రమే యుదాహరింపవలసియుండును. అవి యథాస్థలములలో నవసరము ననుసరించి ప్రకటింపంబడును. ప్రస్తుత మతనిప్రధానగ్రంథ మగు లంకావిజయా పరనామక "రావణదమ్మీయముం" గూర్చి వ్రాసెదను. అం దొకకథ యతనిదియును, అతనికి విరోధి యగు రావు దమ్మారాయఁ డనునొక సామంతునిదియు నై యున్నది. ఇఁక రెండవ యర్థమునందు వచ్చెడుకథ కేవలము రామాయణకథయే అయియున్నది. అందు దమ్మరాయఁడే రావణస్థానీయుఁడు. కావున దానికి రావణదమ్మీయ నామము కల్గినది. కవిచరిత్రము కొంత పూర్ణముగా నతనిచే రచియింపఁబడిన గ్రంథమునందే యున్నది కావున నందలి సంగ్రహమే యీమనచరిత్రమునకుం జాలియుండును. అసంగ్రహమే వ్రాసెదను.
గ్రంథపీఠిక.
దీనిలో నీకవి గోపాలదేవుని కృతిపతిం జేసెను పిమ్మట శివ, చతురానసులను, రమా, గౌరీ, సరస్వతులను, వినాయకుని నుతించి, నవగ్రహములంగూడ వినుతించె. ఇట్లు నవగ్రహముల నుతియించుట నవీన కవులలో నవీనపద్ధతి. అనంతరము సంస్కృతాంధ్రప్రసిద్ధకవుల వినుతించె. అం దాంధ్రకవులంగూర్చి చెప్పినపద్యములలో వారికవిత్వ విశేషములు గొంచెము నుడువఁబడెంగావున నాపద్యము నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-
సీ. ఆర్యవర్యుని నన్న పార్యుని రమ్యయ, శోరాజి తిక్కనసోమయాజి
రమణీయసుగుణాభిరాము నాచనసోము, రసికత్వసాంద్రు వెఱ్ఱసుకవీంద్రు
సకలకవిసుతయశస్కరు భాస్కరు, గీతగుణసమాజు పోతరాజు
భూసుతవాక్యభాషానాథు శ్రీనాథు, పృథుకకవిస్వాంతభీము భీము
తే. సూక్తిచాతుర్యు పింగళిసూరనార్యు, ప్రీతబుధముఖ్యు నలసాని పెద్దనాఖ్యు
నాంధ్రభాషా విశారదు లైనయట్టి, సకలసత్కవివర్యుల సన్నుతింతు.
ఇతఁడు తనకు గురుండు కీర్తియనతయ్య యని చెప్పి యతని గోత్రాదికముం జెప్పక యీక్రిందివిధంబున వ్రాసెను.
క. సేవింతు న్మద్గురుని య, శోవిలసితవిమలచిత్తు సురుచిరవిద్యా
ప్రావీణ్యు కీర్తికులజు మ, హావినుతచరిత్రు నయ్యనంతాఖ్యుఁ దగన్.
లక్ష్మణకవి వంశావళి.
గ్రంథరచనాకాలవివరము.
ఈవిషయమై గ్రంథములో కవివలనే యొకవచనము వ్రాయంబడెఁగావున దాని నీక్రింద వివరించెదను. అందులో నీలక్ష్మణకవి గ్రంథరచనాకాలముం దెల్పియున్నాఁడుగావున దానింబట్టి యించుమించుగా నీకవిజననకాలముంగూడ నూహింపవచ్చును. ఆవచన మెట్లున్నదనఁగా :-
"వ. అని యిష్టదేవతా వందనంబును, నవగ్రహ ధ్యానంబును, మద్గురుసేవనంబును, సుకవిజనస్తుతియును, కుకవిప్రతారణంబును, మజ్జననస్థలంబై నకుయ్యేరు పురవర్ణనంబును, మద్వంశసూచనంబును, గావించి, యే నొకప్రబంధంబు నవరసభావార్థలక్షణానుబంధంబుగా నూహించి కల్యబ్దములు 4896 శాలివాహనశకాబ్దములు 1719 ఇంగ్లీషు సంవత్సరములు 1797 (A. D. 1797) ఫసలీ 1207) 1207 అగు పింగళ సంవత్సర శ్రావణమాసములో రచియింప నుద్యోగించియున్న సమయంబున"
అని యున్నది.
దీనింబట్టి చూడ నీలక్ష్మణకవి యీగ్రంథమును రచియించిన కాలము శాలివాహన సంవత్సరముయొక్క పదునెనిమిదవ శతాబ్ద ప్రారంభమం దని తేలుచున్నది. అప్పటి కతఁ డేఁబదిసంవత్సరముల వయసువాఁడే అయ్యె నేని అతని జననకాలము శా. స. 1660 సమీపకాలమై యుండును. కాఁబట్టి యీకవి శాలివాహన శతాబ్దముయొక్క పదునేడవ శతాబ్దమధ్యము మొదలు పదు నెనిమిదవశతాబ్దముయొక్క మధ్యము దనుక నున్న ట్లూహింపనై యున్నది. ఇదివఱలో నీచరిత్రాదిలో నీలక్ష్మణకవి నైఘంటికుఁ డగు సి. పి. బ్రౌన్ (Mr. C. P. Brown.) దొరకాలీనుఁ డని చెప్పియుంటింగావున నాదొరకాలమువఱకు నీకవి జీవించి యుండె నని చెప్పవలసియున్నది. ఆకాలమునాఁటి కీ కవి మిక్కిలి ముదుసలివాఁ డై యుండనోవును. అ ట్లుండియు లక్ష్మణకవి పై బ్రౌనుదొర రాజమహేంద్రవరము జిల్లాకోర్టులోనో లేక బందరుప్రొవిన్షియల్ కోర్టులోనో సివిల్ జడ్జీగా పనిచేయుచున్నపుడు తనమేనల్లునివిషయమై పద్యరూపక మగునొకవిజ్ఞాపన పత్త్రము వ్రాసి పంపినట్లు వాడుక గలదు. ఆపద్యము లుదాహరించుతఱి నావృత్తాంత మంతయు వివరించెదను. కావున నిపు డాకథ వదిలి లక్ష్మణకవి క్రీ. శ. 1770 సం. మొదలు క్రీ. శ. 1840 సం సంవత్సరమువఱకు జీవించియున్నట్లు నిశ్చయించెదను.
గ్రంథరచనాకారణము.
దీనింగూర్చి గ్రంథకర్తయే కొన్ని కారణములు వివరించె. అవి నమ్మఁదగిన వైనను కాకున్నను వానిని వివరించుట మంచిదికావున వివరించెదను. ఎట్లన గాఁ దన కొకనాఁడు స్వప్నం బయ్యె ననియును, అపు డాస్వప్నంబునఁ దనతండ్రి యగుగోపాలమంత్రి తనకుఁ గనుపించి తాను కావించుభక్తిపూర్వకనమస్కారంబు లంగీకరించి తన్నుంగూర్చి యీక్రింది వృత్తాంతమును గ్రంథము చేయు మని ఆజ్ఞాపించెనఁట. అదెట్లనఁగా :-
"సీ. 'ఆరెవెట్టం' బన్న యూర నుండెడు రావు, బుచ్చయ్య నరసమపుత్త్రకుండు
దమ్మనరా వన ధర్మరాయం డన, నిరుపేళ్లతోడుత నెసఁగువెలమ
యరయ భద్రయ్య, జగ్గయ్య, తమ్మయ్య, భా,వయ్య లన్నలుగురి కగ్రజుండు
పుత్త్రాదిసంపత్తిఁ బొసఁగునతఁడు మన, కుయ్యేరు ప్రీతితో గుత్తసేసి
గీ. నీదులంకమాన్యము బల్మినిహరించెఁ, గానతత్ప్రాప్తికై రాముకథయు మనక
థయును జతగాఁగ నర్థంబు ఘటనపఱిచి, కృతి రచించి గోపాలున కిమ్ము తనయ"
అని యున్నది.
ఇట్లు పల్కి పిమ్మట నీలక్ష్మణకవినే తనకవిత్వ మీక్రిందివిధంబుగ నుండవలె నని చెప్పినట్లు చెప్పె. ఎట్లన్నను :-
ఉ. కొందఱు శబ్దసౌష్ఠవముఁ గొందఱు భావముఁ గొంద ఱర్థమున్
గొందఱు సంధిసంఘటనఁ గొంద ఱలంకృతి వృత్తిఁ గొందఱున్
గొందఱు దెన్గు సంస్కృతముఁ గొందఱు ఛందముఁ గొంద ఱన్నియున్
గొందఱు జూతు రెల్ల కవికోటి భళీ యనఁ జేయుమీ కృతిన్.
గీ. లక్ష్మణుఁడు లంకాపతి లక్ష్మణాగ్ర, జుఁడు కవనచారి గోపాలసూనుఁ డజసు
వంశజాతుఁడు రాజాంబవత్స పిండి, ప్రోలికవివరుఁ డనుపేళ్లఁ బొదలుమీవు.
అని యి ట్లెన్మిదిపే ళ్లుంచి కవిత్వముఁ జెప్పు మనియుం జెప్పిన ట్లున్నది. ఇదియంతయు స్వప్నగతార్థమే కావునఁ బాఠకులు దేని నెట్లు గ్రహించినను గ్రహింపవచ్చును.
అని యిట్లు స్వప్నంబున తండ్రి యాజ్ఞ కాఁగా లక్ష్మణకవి మేల్కాంచి తనహితులకు తనస్వప్నంబు తెలిపి తాను పింగళిసూరన మొదలగు కవులవలె ద్వ్యర్థికావ్యము రచియింపఁగలనా యని వారితోఁ దెల్పఁగా వారు తన్నుంగూర్చి యీక్రిందివిథంబుగాఁ బల్కి రని చెప్పె. ఎట్లన్నను :-
"చ. గణుతికి నెక్కునట్టి ఘనకావ్యము లొప్పుగఁ జేయ శాస్త్రని
ద్గణములు మెచ్చ భావములు కల్పనసేయ రసంబు లొప్ప భా
షణముల కర్థగుంభనము సమ్మతి సేయఁగఁ బిండిప్రోలిల
క్ష్మణకవివర్య నీవె తగుజాణుఁడ వన్యులు నీసమానులే.
క. శ్రీమన్నారాయణకరు, ణామహిమప్రాప్తసహజనవరసభావా
ర్థామలవాగ్విలసనుఁడవు, సామాన్యకవీశ్వరుఁడవె చర్చింపంగన్".
ఇట్లుగాఁ బైని చెప్పిన పద్యయుగళములో లక్ష్మణ కవికవితా విశేషములుగొన్ని బోధపడుచున్నవి కావున నిఁక వానింగూర్చి మనము వేఱుగ వ్రాయవలసినయవసర ముండదు. ఇట్లుగాఁ దనమిత్త్రులుగూడ గ్రంథరచనకుఁ గాను తన నుత్సహింపఁజేయుటచేతఁ దాను గ్రంథము చేయనారంభించితి ననియునుఁ అందులోఁ దన కథ రామకథతోఁ జేర్చి చెప్పుటచేతఁ దన కైహికఫలప్రాప్తికల్గుటయకాక ఆముష్మికిఫలమును గల్గునని నిశ్చయించుకొని గ్రంథారంభము చేసెను. అందలి లక్ష్మణకవి చరిత్రసంగ్రహ మిపుడు మనము వివరింపవలసియున్నది. ఆ దెట్లన్నను.
కథాసంగ్రహము.
లక్ష్మణకవితండ్రి యగుగోపాలమంత్రి రావుమహీపతిరాయాజ్ఞ చేతఁ గుయ్యే రనుగ్రామములో నధికారము చేయుచుండెను. అతనికి నల్గురుకుమారు లుండిరి. వారి నల్వురికిని గ్రమముగ వివాహము లొనరించె. అందుఁ బెద్దకుమారుఁ డగుతిరుపతయ్యకు రమణమ్మయను చిన్నదానిని, రామకృష్ణయ్యకు తిరుపతమ్మ యనుచిన్న దానిని, లక్ష్మణకవికి జగ్గమ్మ అనుచిన్నదానిని, రామయ్యకు వేంకటలక్ష్మి యనుచిన్న దానిని వివాహము చేసెను. ఇట్లుండఁ గొందఱు బ్రాహ్మణుల బృందములు వచ్చి గోపాలమంత్రిని ధన మిప్పింపుఁ డని యాచింపఁగ నాతండు వారల కట్లే యిచ్చెను. ఆధనముం గైకొని వారలు సంతోషించి అతని నతనిపుత్త్రులను దీవించి చనిరి.
ఇట్లుండ గోపాలమంత్రి తనచుట్టునుం బరివేష్ఠించి యున్నసభ్య జనులయనుమతంబున ప్రతిభాసంపన్నుఁ డగు తనపెద్దకుమారుని తిరుపతయ్యను బిలిచి నియోగులలో నుండునట్టి యాచారానుసారముగా వ్యవహారము నడుపుకొమ్మని ఆజ్ఞ యిచ్చెను. అనంతరము గోపాలమంత్రి తనభార్య రాజమ్మ స్వర్గస్థురాలు కాఁగా రెండవవివాహమాడెను. ఆరెండవభార్యపే రచ్చమ్మ. అట్లు వివాహమైన యనంతరము. తిరుపతయ్యకు వేఱ యొక లోఁగిలి కట్టించి అం దాతనిఁ గాఁపుర ముంచెను. అతఁ డట్లుండి యిర్వురు పుత్త్రులం బడసి పిదప కాలధర్మము నందెను. ఇట్టిపుత్త్రదుఃఖములో నుండిన గోపాలమంత్రి క్రమముగఁ గృశింపనారంభించి మఱికొన్ని నాళ్లకు నిర్యాణము నందెను.
అంతట గోపాలమంత్రి రెండవకుమారుఁ డగురామకృష్ణయ్య తనతండ్రికి నుత్తరక్రియలు గావించి కుయ్యేరు గ్రామమునకుఁ గరిణీకకమును వహించెను.
ఇ ట్లుండి యొక కాలమున నీరామకృష్ణయ్య తమ్ములను వెంటఁ బెట్టుకొని ఆత్రేయీనామక గోదావరీశాఖలో స్నానమునకుం బోయి సుస్నాతుఁ డై తిరిగి యింటికి వచ్చుచు నచ్చట వేంచేసియున్న గోపాలస్వామి యాలయమునకుం బోయి ఆస్వామి ననేకవిధముల నుతియించి సాష్టాంగదండప్రణామం బాచరించి వెడలి శివాలయంబునకుం బోయి అచ్చట శివుని దర్శించి నమస్కారాదు లొనరించి యింటికిం బోయియుండె. అంతట నొక్కనాఁడు సరస్వతీదేవి లక్ష్మణకవియన్న యగురామకృష్ణయ్య యెదుటఁ బత్యక్షమై నిన్ను వరియింప వచ్చితిఁ గైకొ మ్మనుఁడు నాతఁడు తనతమ్ముం డగులక్ష్మణకవిం జూపి అతని వరియింపు మనుఁడు నట్లన చేసెను. లక్ష్మణకవి అభారతిని చేపట్టెను. వేదముల నుపనిషత్తులలోనియర్థముల నరసి ప్రసిద్ధికెక్కునట్లుగా బ్రహ్మతత్త్వమును గ్రహించెను. అని కొంతపూర్వోత్తరము చెప్పంబడినది.
ఇట నుండి లక్ష్మణకవి కవితాప్రాగల్భ్యము వర్ణింపఁబడెం గావున నతని మూలవచనమునే యీక్రిందఁ బొందు పఱిచెదను. ఎట్లన్నను :-
"వ. మఱియు సత్కృతిరచనావిచక్షణుం డగులక్ష్మణాగ్రజుండు విబుధాభినందితాత్మీయశ్లోకాసహిష్ణువు లై యిది మహాక్రియ యనక సుప్పనక వాక్యంబులన్నిటం దుర్బోధంబుఁ జెందినకతంబున నాగ్రహించి యెదిర్చినఖరదూషణముఖ్యు లగు విరోధులం దనశాస్త్ర బలసంపత్తిచేత జయించి నిజసామర్థ్యంబు ప్రకటంబుగ నెఱపు చున్నంత"
అని చెప్పెను.
దీనిచేత తనబద్యములయం దసూయాపరులై యున్నవారి ననఁ గా శత్రువులను తనశాస్త్రసామర్థ్యముచేత గెల్చి తనసామర్థ్యము లక్ష్మణకవి చూపుచుండె నని తేలుచున్నది. ఇ ట్లుండఁగా జయశీలుఁ డగు దమ్మన్న యనువెలమ లక్ష్మణకవియొక్కలంకనేల నున్నగోతిచేను అను భూమిని వివాదములోనికిం జేర్చెను. అపుడు లక్ష్మణకవి నల్లనై భూసారము గలతనబంకభూమిని హరింపఁగోరి దమ్మన్న తనతమ్ముఁ డగు భావన్న యనునతని నధికారికడకుఁబంపుట విని ఆవిషయములో సామోపాయము చేయుచుండెను. ఇట్లుండి లక్ష్మణకవి ప్రభునికడ కేఁగి తనలంకభూమికి మాన్యముగ పట్టా నందివచ్చెను. ఈవృత్తాంతమును దమ్మన్న విని మఱియును క్రోధము బూనినవాఁ డాయెను. ఇ ట్లుండి దమ్మన్న లక్ష్మణకవి కాభూమి చెల్లకుండఁజేయ యత్నింపసాగెను. పిమ్మట దమ్మన్న తనపాఁపురస్థల మగునారెవెట్ట మనుగ్రామమునుండి బయలు వెడలి, తనయుద్దేశ మితరులకుఁ దెలియకుండఁగ తనయిజారా గ్రామ మగుకుయ్యేరునకు వచ్చి లక్ష్మణకవియొక్క లంకమాన్యము తనభూమిలోనిదిగా నిర్ణయించి పోయెను.
ఇట్లు తనమాన్యము దమ్మన్నవలన నపహరింపఁబడఁగా లక్ష్మణకవి దానిని సంపాదించుటకుగాను భగవంతుని బ్రార్థించుటయుఁ దమ్మరాయని శపించుటయుఁ గర్జం బని తలంచి అటనుండి చెప్పెడు కథలో నంతట నతని రావణుంగాఁ బోల్చి చెప్పుచుండెను.
అట్లు దమ్మన్న లక్ష్మణకవియొక్కమాన్య మాక్రమించుకొని దున్నించి దానికి పాలికాపుంచి తనయూరికిం దిరిగి పోయెను. ఇట్లు దమ్మన్న తనభూమి నాక్రమించె నని విని లక్ష్మణకవి మిక్కిలి విచారించి తన కాభూమికిగా నీయంబడిన పట్టా వెదకి తీసి యుంచి ముందు సామోపాయముచేతఁ గార్యసాధనము చేయుదునుగాక యని యోఁచించి దమ్మన్న యున్న గ్రామంబునకుం బోయి అతనియింటఁ గూర్చుండియున్న అతని పరిజనంబుతోపాటుగఁ దానును లక్ష్మణకవి ప్రచ్ఛన్నుం డై కూర్చుండి యుండె. అపు డాదమ్మరాజుపరిజనములు ఏవోకొన్నివ్యర్థలాపంబు లాడుకొనుచుండఁగా విని లక్ష్మణకవి తనవిశేషములు స్పష్టీకరించు తలంపున నీక్రిందిపద్యములం జదివె అవి యెట్లన్నను.
"మ. ఏ-నిను నాశ్రయించి హృదయేప్సిత మెల్లను దీర్చుకొందునన్
పూనికఁ జేరవచ్చిన ననున్ గడకంటను జూడవేమి యిం
పూనఁగ మాటలాడుటకు నొప్ప వి దేమిచలంబు వద్దిఁకన్
మాననిరూఢ సత్కృపను మన్పుము దమ్మన యిమ్ముమీఱగన్.
క. నగు మొగముతోడ నను దయ, యిగురొత్తఁగఁ జూచి తాల్మి నెదవేడుక మీ
ఱఁగ లంక విడిచి యానం, దగరిమ మానదగ దీవనను బొందఁగదే"
అని పల్కి నిజసామర్థ్యంబు ప్రకటించువాఁడై యిట్లనును.
"గీ. ఒనరు మద్వాక్కులం దెలుంగునకు బద్ధుఁ, డగునువాగనుశాసనుఁ డైన నమ్ము
మలఘుమద్దివ్యగోచయంబులకు బద్ధుఁ, డగును శ్రీమనోవసుచోరుఁ డైన నిజము.
క. తెలియ విను రామకావ్యా, దులు సూరకవిప్రముఖపృథుప్రతిభావం
తులు భీమశ్రీనాథు, ల్వెలయఁగ నాకరణిఁ దిట్ట లే రూఢమతిన్.
క. ఖరదూషణముఖ్యులు కవి, గురులు నడిచినట్టిత్రోవఁ గోరి నడవ ను
ద్ధురుఁడ వగు నీదువాక్యవి, సరపరుషత్వమున కేను జంకుదునె మదిన్
గీ. విన్ము లక్ష్మణాగ్ర జన్మ మాన్యక్షేత్ర, మేను విడువ నెపుడు మానగుణము
మద్వరోగ్రశక్తి మఱి యింక లంక నే, లగలవాఁడ నగుచు నెగడ వీవు."
అని యిట్లు దమ్మన్న యుత్తర మీయఁగా లక్ష్మణకవి కోపోటోపంబున నుత్తరమీయ నున్న నతని హితు లతని నివారించిరి. అటు పిమ్మట లేచి తనయింటికిం బోవఁ గమకించి లక్ష్మణకవి దమ్మన్న నుద్దేశించి సాధువాక్యంబుల ధర్మంబు బోధించిన నంతకంతకు దమ్మన మౌర్ఖ్యమునే యవలంబించుటకుం గనలి.
"క. ధరశ్రీరామేద్భక్తుఁడ, గరిమన్న మ్మువినినాదు కత నరసాజా
నిరయంబున నినుఁ జేర్చున్, దురిత మణఁచి నెమ్మి రాదు దొసఁగొంద నిఁకన్.
క. లేదమ్మా కష్టము నీ, కేదమ్మా నేగి భీతి ఘృణ నీవొందన్
రాదమ్మా యిఁక మిన్నక, పోదమ్మా యుక్తి నిజము పొలుపుగదమ్మా.
క. అని యిట్లనేక ములు పెం, పెనయంగాఁ బలికి జీవితేశునికడకున్
జనుసమయము నీ కిదె వ, చ్చెను వేగిరపడకు మనుచుఁ జెప్పుచు మఱియున్.
క. నీపతితత్వం బంతయు, వ్యాపకతం జెందునట్లు వర్ణించెద నే
నోపిక వాణీ రచనా, నైపుణి నీమదికి నొప్పి నాటుకొనంగన్."
అని పల్కి మఱికొన్ని వాక్యము లతనితోఁ జెప్పెను.
"గీ. ఏడుపందు ముల్లోకంబు లెఱుఁగ లంక, నేలకొలపరక్షేత్రాప్తి మేలు గాదు
పేర్మి నాభూమిజాత సంప్రీతితోడ, వీడు మదియె సౌఖ్యము లిచ్చు వేయు నేల."
"గీ. జ్యేష్ఠుఁడా లక్ష్మణాగ్రజక్షేత్రమీవు, వదలకుండిన మోసంబు వచ్చు నింక
చండనిర్భీకవనచారి పిండిప్రోలి, కవికులవరుతో రిపుత ముఖ్యముగ వలదు."
అట్లుగా వలదనుట కీక్రిందికారణములఁ జెప్పుచున్నాఁడు ఎట్లన్నను :-
"సీ. లలి భూతలంబునం దెలుఁగులరాజాంబ, వత్సమాఖ్యప్రసిద్ధి వరలెడునిపు
ణుండు వాగనుశాసనుఁడు తిమ్మఁడొకఁడు, ధూర్జటిరామలింగసంజ్ఞాప్రధితుఁడు
బుధవరుల్ భాస్కరపోతనలాదిక, వనచారులు మఱియు ననుపమాన
కృతిరామభద్రుఁడు శ్రీనాథుఁడు గణింపఁ, దత్సముల్ దధికులు ధరణి లేరు
తే. కళల సోముఁడు పెద్దన్న కరణి వెలయు, చుండు రెండవవీరుండనూనమతిని
రూపణము సేయకుండలీంద్రుండు సుమ్ము, లక్ష్మణాఖ్యుఁడు గాన చలంబు విడువు."
ఇఁక సంస్కృతకవులతో నీతనిం బోల్చి చెప్పిన పద్యమును తెలియఁదగినదే. ఎట్లన్నను :-
"ఉ. భాణుని, భారవిన్, ఘనసుబంధుని, నాభవభూతి, సర్వగీ
ర్వాణపదంబులన్ గొనినవారిఁ దదన్యుల విందుమే కదా
క్షోణిని వారికన్న మతిసూక్ష్ముఁ డవారణవిద్య నిన్ను ని
ష్ప్రాణునిఁ జేయు నాఁతఁ డరయన్ బురుషోత్తముఁ డౌకతంబునన్.
అని యున్నది. ఈపద్యములో లక్ష్మణకవి శ్లేషనైపుణ్యముం జూపుటయేగాక తనకవిత్వప్రజ్ఞయు విశేషించి చూపెను.
ఇటులనే మఱికొన్నిపద్యములు చెప్పి లక్ష్మణకవి రామాయణ యుద్ధమును తనవివాదసమాప్తియు నీక్రింది గద్యపద్యములలోఁ జూపు చున్నాఁడు. లక్ష్మణకవియొక్క యితరచర్యలు చూపుట కీగాథ యడ్డగించుచున్నది కావున దీనిని ముందుగ ముగించెదను. ఎట్లన్నను :-
"వ. తదనంతరంబ నిజవిజయంబు గోరుచుఁ బయలుదేఱినయాలంకాధిపతి పటుతరగోశక్తి హరిబలంబున దృఢత గలయంగదాదుల లీల నాక్రమించి సుదర్శన హస్తనాభివత్సజఘనదృఢత్వం బడంచుచుఁ, బృధు జంఘాతిశయబలంబుఁ ద్రుంచుచు సుబాహు గంధవహాత్మజానుతాపంబొనరించుచు, నీలతార కోపస్థితి విఫలంబుచేయుచు, సుముఖ సుగ్రీవాదులకు వివర్ణతం బుట్టింపుచుం జేరియున్న రసమాజవర్యు నొక్కింత వివశత నొందింప నాలక్ష్మణాగ్రజుం డంత ముఖ్యశత్రు వధార్థఁబుగా ననుపమానా గస్తి మితవచనాంగీకృత హరిమంత్రుం డై కమలాప్తుం డగుభగవంతు వేదవిధ్యుక్తము గా నిశ్చలభావంబున ధ్యానంబుజేసి తత్ప్రసాదలబ్ధదివ్యతేజో బలవిరాజితుండై ఆత్మీయామోఘ గోశక్తి ప్రకటం బగునట్లుగా విజృంభించిన.
క. లలి మున్నలబుధవైరికి, బొలుపు నెరయ నాభిముఖ్యముగ నున్నసుధా
తులసద్బల మడఁగెను బే, ర్చులక్ష్మణాగ్రజుని దివ్యశుచిగోశక్తిన్.
వ. తదనంతరంబ.
క. ఏపుచెడి నవకము లడఁగి, గోపాలతనూజునతనుగురువాణీశా
స్త్రోపాసనము సఫలముగ, నాపరుఁడు హృదయము సెదరి యసువులఁ బాసెన్.
క. శ్రితుసరమాకాంతుని బుధ, సుతు నాసురవర్యు లక్ష్మణుం డాలంకా
పతి గారామునెరయు నా, నతిఁ జేసి గభీరభాషణంబులఁ బలికెన్.
క. రవియును శశియును దారలు, నవనియు రాముకథ నుండునన్నాళ్లును దా
నవనాథ విభీషణ లం,క విమతభయవిరహితంబుగా నేలు మిఁకన్."
లంకావిజయోదాహృతపద్యవ్యాఖ్యానము.
44. రాఘవార్థము. చలంబు వద్దు ఇఁకన్, ఓమానిని = మానవంతురాలా, ముదమ్ము = సంతోషమును, అనఁగా రూఢసత్కృపన్ = దయచేతను, మన్పుము = జీవింపఁజేయుము.
లక్ష్మణకవియర్థము = ఏన్ = నేను, నినున్, ఆశ్రయించి = అనుసరించి, హృదయేప్సితము = మనస్సునందున్న కోర్కెను, తీర్చికొందున్ అనన్ = అనెడు, పూనికన్ = ప్రతిజ్ఞచేత, చేరవచ్చినన్ = చేరఁగా, ననున్, కడకంటను = కీఁగంటిచేతనైనను, చూడవు ఏమి, ఇంపు = ఇష్టము, ఊనఁగన్, మాటలు, ఆడుటకున్, ఒప్పవు. ఇదేమి, చలంబు వద్దిఁకన్ = మత్సరముతో గలసియుండుటను, మాని, ఓదమ్మన్నా, ఇమ్ముమీఱఁగన్ = రహస్యము అతిశయింపగా, నిరూఢసత్కృపను = నిశ్చయమయిన దయను, మన్పుము = వృద్ధిబొందింపుము.
45. రా. లంకన్, విడచి, ఆనందగరిమము, అనఁదగదు, ఈ వ = నీవే, ననున్, పొందఁగదే.
ల. నగు మొగముతోడన్ = నవ్వుచున్నమోముతో, దయఇగురొత్తన్ = చిగిరింపఁగా, ననున్, చూచి, తాల్మిన్ = ఓరిమిచేత, ఎదన్ = ఉల్లమునందు వేడుక = కౌతుకము, మీఱఁగన్, లంకన్ = లంక నేలను, విడిచి, ఆనందగరిమము సంతోషాతిశయము, అనన్ = పొందఁగా, తగన్. దీవనను = ఆశీర్వచనమును, పొందఁగదే.
48. రా. ఒనరుమద్వాక్కులందున్, ఎలుంగునకున్ = కంఠమునకు, వాగను శాసనుఁడైనను = బ్రహ్మయయినను. బద్ధుఁడగును కంఠమెత్తి నేను మాట్లాడునపుడు బ్రహ్మయయినను నా కోడుననుట, అలఘు మద్దివ్యగోచయంబులకున్ = బాణపరంపరలకు, శ్రీ = లక్ష్మియొక్క, మనః = మనస్సనెడు, వను = ధనమునకు, చోరుఁడు = హరించువాఁడగు విష్ణు వైనను, బద్ధుఁడగును = ఓడుననుట. ల. ఒనరుమద్వాక్కులన్ = ప్రకాశించునట్టి నామాటలచేత, తెలుంగునకున్ = ఆంధ్రభాషకు, వాగనుశాసనుండైనను = ఆంధ్రవ్యాకరణ సూత్రములు చేసి భారతము గొంత తెనిఁగించిన నన్నయభట్టైనను, బద్ధుండగును = కట్టువడును, నాప్రయోగమందు తప్పెంచఁడనుట, అలఘు = విస్తారములగు, మత్ = నాయొక్క, దివ్య = ప్రకాశించుచున్న, గోచయంబులకు = మాటలకు, శ్రీ = శోభాయుక్తమగు, మనః = మనస్సును, వసు = ధనముగల, చోరుఁడైనను ఈపేరుగల కవియైనను, బద్ధుఁడగును = అంగీకరించు ననుట.
రా. ఓరామ = ఓసీతా, కన్యాదులు = పితృ దేవతలును, సూర = సూర్యుఁడు, ని. సూరసూర్యార్యమాదిత్య ద్వాదశాత్మదివాకరాః, అమరము కవి = శుక్రుఁడు, ప్రముఖ = మొదలుగాఁగల, పృథుప్రతిభావంతులు = గొప్పకాంతి గలవారు, భీమశ్రీనాథుల్ = శివకేశవులైనను, రూఢధృతిన్ = నిశ్చితమైన ధైర్యముచేత, వెలయఁగన్ = కూడఁగా, నాకరణి దిట్టలే = నావలె గట్టివారా? కారనుట.
ల. తెలియన్ = తెలియు నట్లు, విను రామకవ్యాదులు = తురగారామకవి మొదలగువారును, సూరకవి = పింగళసూరన, ప్రముఖ = మొదలుగాగల. పృథుప్రతిభావంతులు = అధికబుద్ధిశాలులు, భీమశ్రీనాథుల్ = వేములవాడ భీమన్నయు, శ్రీనాథుడును, ఊఢధృతిన్ = వహింపఁబడిన ధైర్యముచేత, నాకరణిన్ = నావలె, తిట్టలేరు = వారికన్న గట్టిగా బాధించునట్లు తిట్టెద ననుట.
రా. అతనితోన = రావణునితోనే, రసాసంతతి = సీత.
ల. అతనితోన్ = లక్ష్మణకవితో, నరసాసంతతి = దమ్మన్న.
రా. ఖరదూషణముఖ్యులు = ఖరదూషణులు ,మొదలుగాఁ గల, కవిగురులు = శుక్రుఁడు గురువుగాగలవారు, శుక్రశిష్యులు = రాక్షసులు, నడిచినట్టిత్రోవన్ = రామబాణ హతులైనవారు పోయినట్లనుట, కోరినడువన్, ఉద్ధురుఁడవు, అగు, మదిన్. ల. ఖరదూషణముఖ్యులు = రేఫలకారముల కభేదము, ఖల = దుష్టులగునట్టియు, దూషణముఖ్యులు = దూషించుటేముఖ్యముగాఁగల, కవిగురులు = కవిశ్రేష్ఠులు, నడచినట్టిత్రోవన్ = నడచినమార్గమును, కోరి, నడువన్ = నడుచుటకు, ఉద్ధురుఁడవు = భారమును వహించినవాఁడవు, అవు = అగునట్టి, నీదు = నీయొక్క, వాక్యవిసర = వాక్యసముదాయము యొక్క, పరుషత్వమునకున్ = కాఠిన్యమునకు, మదిన్, ఏను జంకుదునె = భయపడుదునా.
రా. విన్ము, ఏను, లక్ష్మణాగ్రజన్మమాన్యక్షేత్రము, రాము భార్యను, ఎపుడు, మానగుణము = మాన అభిమానమనెడు, గుణము, లేక, మాన గుణము, పాతివ్రత్యము = ద్వంద్వైకవద్భావము, విడువ, ఈవు, మద్వరోగ్రశక్తిన్ = మత్ నాయొక్క, వర = భర్తయొక్క, ఉగ్ర = భయంకరమైన శక్తిన్ = శక్తిచేత, లంకన్ = ఈలంకను, ఏలఁగలవాఁడను = పాలించఁగలవాఁడవు, అగుచున్, నెగడవు = వృద్ధినొందవు.
ల. ఓలక్ష్మణాగ్రజన్మ = ఓలక్ష్మణకవీ, విన్ము = ఆకర్ణింపుము, మాన్యక్షేత్రము = నీమాన్యమైనచేను, ఎపుడు, విడువన్ = విడిచిపెట్టను, గుణము, పరక్షేత్రాపహరణమును, మానన్ = మానను, మద్వరోగ్రశక్తిన్-మత్ = నాయొక్క, వర = శ్రేష్ఠమగు, ఉగ్ర = భయంకరమై, శక్తిన్ = సామర్థ్యమును, మానన్, మఱి = ఇంకను, ఈవు = నీవు, లంకనేలగలవాఁడవగుచున్ = లంకభూమిగలవాఁడవగుచును, నెగడవు = వృద్ధిఁబొందవు.
రా. ధరన్, ఏను, శ్రీరామేడ్భక్తుఁడన్ = శ్రీరాముఁడనెడు ప్రభువునకు భక్తుఁడను, గరిమన్, నమ్ము, నాదుకతనన్ = నావలన, విని = నీవృత్తాంతముననుట. రసాజాని = రాముఁడు, దురితము = ఈ పాపస్వరూపుఁడైన వావణుని, అణఁచి నినున్, రయంబునన్ = త్వరఁగానే, నెమ్మిన్ = ప్రియముతో, చేర్చున్ = తనసమీపమును బొందించికొనుననుట, ఇఁకన్, దొసఁగు = వ్యసనము, ఒందరాదు. ల. ధరన్ = పుడమియందు, నేను, ఇది, అధ్యాహారము శ్రీరామేడ్భక్తుఁడన్, గరిమన్ = గౌరవముచేత, నాదుకతన్ = నావృత్తాంతమును, విని, నమ్ము, నరసాజా = దమ్మన్నా, దురితము = ఈబ్రహ్మక్షేత్రాపహరణ దోషము, నినున్, అణఁచి = సంహరించి, నిరయంబునన్ = నరకమునందు, చేర్చు, ప్ర మాణవచనము. స్వదత్తాం పరదత్తాం వా యో హ రేతి వసుంధరాం, షష్టిర్వర్షసహస్రాణి విష్ఠాయాం జాయతే క్రిమిః" నెమ్మి = ఇష్టము, రాదు, ఇఁకన్, దొనఁగున్ = ఆపదను, ఒందన్ = పొందను.
రా. అమ్మా = ఓతల్లీ, నీకున్ కష్టము లేదు, అమ్మా ఇఁక నేగి = కీడును, భీతి = భయమును, ఏది = ఎక్కడ. నీవు, ఘృణన్ = జుగుప్సను, నిందననుట, ఒందన్ రాదు = పొందఁగూడదు, అమ్మా, మదుక్తిన్ నామాట, నిజము, పొలువుగదా = ఇష్టముగదా.
ల. దమ్మా = ఓదమ్మన్నా, లే = లెమ్ము, దమ్మా, కష్టము = ఆయాసము, సేగి = అనుభవమును, భీతి = భయమును, (నీ కేవచ్చునని శేషము,) దమ్మా. నీవు, ఘృణన్ = జుగుప్సను. ని. ఘృణా జిగుప్సా కృపయోః. జుగుప్స యనఁగా నింద. ఒందన్ = పొందుఁటకు, రా = రమ్ము, దమ్మా, ఇంకన్, మిన్నక = ఊరక, పో = వెళ్లు. ఓదమ్మా! మదు క్తి, నామాట, పొలుపుగన్ = ఇష్టముగా, నిజము = వాస్తవము.
61 రా. నీవు జీవితేశునికడకుఁ = ప్రాణనాథుఁ డగురామునివద్దకు. ని. జీవితేశౌ యమ ప్రియౌ. చనుసమయము, ఇదె వచ్చెను, వేగిరపడకుము = ఉద్బంధనాదియత్నమును జేయవలదనుట.
ల. అనియిట్లు, అనేకములు, పెంపు = వృద్ధి, ఎనయంగాన్ = ఒప్పఁగా, పలికి, నీకున్, జీవితేశునికడకున్ = యమునివద్దకు, చనుసమయము = వెళ్లెడుకాలము. ఇదె వచ్చెను = ఇదిగో వచ్చినది. వేగిరపడకుము = త్వరపడవలదు, అనుచున్ = చెప్పును. మఱియున్. రా. ఓపికవాణీ = కోకిలపలుకులవంటి పలుకులు గల ఓసీతా, నేను, రచనానైపుణి = కల్పనాచమత్కారము, నీమదికిన్ = నీయుల్లమునకు, ఒప్పి = ఇష్టమై, నాటుకొనంగన్ = నీపతితత్వంబు నీపతియొక్క నిజమును. వ్యాపకతన్ = చెందునట్లు, వర్ణించెదన్.
ల. ఓదమ్మన్నా నేను, ఓపికన్ = ఓపికచేత, నీమదికిన్ = నీమనస్సునకు, నొప్పి = ఆయాసము, నాటుకొనంగన్ = నాటుకొనునట్లు, నీపతితత్వంబు = నీపాపాత్ముఁడౌటను, ప్యాపకతన్ = వ్యాపకత్వమును, చెందునట్లు, వర్ణించెదన్ = వర్ణింతును.
రా. లంకనేల = ఈద్వీపము, కొలన్ = యుద్ధమందు ముల్లోకంబులెఱుఁగన్, ఏడుపున్ = రోదనమును. అందున్ = పొందును, లంకలోనున్న జనులు రోదనము చేతురనుట, ఇది అజహత్స్వార్థ యనులక్షణ. పరక్షేత్రాప్తి = పరునిభార్యను పట్టుట, మేలు కాదు, అభూమిజాతన్ = సీతను, ప్రీతితోడ, వీడుము. భారతప్రమాణము. - "క. పరదారగమన మొప్పదు, పురుషుల కది యెల్లపాపములకంటె నరే, శ్వర పరమాయుస్సంక్షయ, కరంబు తద్వర్జనంబు కడు మే లరయన్."
ల. లంకనేలకొల = లంకనేలయొక్క ప్రమాణము, లోకంబులెఱుఁగన్, ఏడుపందుముల్ = మూఁడుపుట్లపందుము, పరక్షేత్రాప్తి = పరునిమాన్యముగొనుట, మేలుకాదు, పేర్మిన్ = ఇష్టముగా, నాభూమిన్ = నామాన్యమును, జాతసంప్రీతితోడన్ = పుట్టిన సంతోషముతో, వీడుము = విడిచి పెట్టుము, అదియె = ఆ యిచ్చుటె. ఇచ్చున్.
రా. జ్యేష్ఠుఁడా = రావణా, లక్ష్మణాగ్రజక్షేత్రము = రాముని భార్యను, ఈవు = నీవు, వదలకుండుట, మోసంబు = కార్యకారణముల కభేదము, ఇంకన్, చండ = యమభటుల వంటియు, ని. "చండో దైత్యవిశేషే యమదాసే త్రిషు తు తీవ్రకోపనయోః." నిర్భీక = భయములేనట్టి వనచారి = వానరములయొక్క, పిండి = సమూహము, ప్రోలికిన్ = ఈద్వీపమునకు వచ్చున్ = ఏ తెంచును, అవి సూర్యునియొక్క, ని. "అవి శ్శైలే రవౌ మేషే" కుల = వంశమునందు, వరుతోన్ = శ్రేష్ఠుఁడగురామునితో, రివుత = వలదు.
ల. జ్యేష్ఠుఁడా = అన్నయ్యా, లక్ష్మణాగ్రజ = లక్ష్మణకవియొక్క, క్షేత్రము = మాన్యమును, ఈవు = నీవు, వదలకుండుటన్, దీనిచేత, మోసంబు = హాని, వచ్చున్, ఇఁకన్, చండ = కోపముగల, నిర్భీ = భయములేనట్టియు, కవనచారి = కవిత్వముచేత తిరుగునట్టి, పిండిప్రోలి = ఈపద మింటి పేరుగల, కవికులవరుతోన్ = కవిసమూహ శ్రేష్ఠునితో, రివుత = వైరము ముఖ్యముగన్, వలదు.
రా. భూతలంబునందున్, ఎలుంగులరా = ఎలుఁగుబంట్లకురాజు, జాంబవత్ = జాంబవంతుఁడను, సమాఖ్య = పేరుచేత, వఱలెడు = ప్రకాశించునట్టి, నిపుణుండు = నేర్పరి, వాగనుశాసనుండు = బ్రహ్మవంటివాఁడు, బ్రహ్మవలనఁ బుట్టినవాఁడు, తిమ్మఁడు = ఒకఁడు = ఒకవానరుఁడు హనుమంతుఁడు, ధూర్జటి = శివసమానుఁడు, శివాంశవలనఁ బుట్టినవాఁడు, కాఁబట్టి, రామలింగసంజ్ఞాప్రథితుఁడు = రామునియొక్క ఉంగరమనెడు చిహ్నకలవాఁడు గనుక ఈసంజ్ఞ చేత ప్రథితుఁడు, భాస్కరపోత = సూర్యపుత్రుఁడగు, సుగ్రీవుఁడును, నల = నలుండును, ఆదిక = మొదలుగాఁగల. వనచారులు, బుధవరుల్ = దేవతాశ్రేష్ఠులు, తదంశజులనుట, మఱియున్, అనుపమాన = సాటిలేని, కృతి = కుశలుఁడు, రామభద్రుండు = శ్రీరాముండు. శ్రీనాథుఁడు = విష్ణ్వంశవలనఁ బుట్టినవాఁడు = , కళలన్ = కళలచేత, సోముండు = చంద్రసమానుఁడు, పెద్దనకరణిన్ = రామునివలె, వెలయు, రెండవవీరుండు, లక్ష్మణాఖ్యుఁడు = ఈపేరుగలవాఁడు, అనూనమతి = అధిక బుద్ధిశాలి, నిరూపణము సేయన్, కుండిలీంద్రుఁడుసుమ్ము = శేషుఁడుసుమా, "ని. కుండలీ గూఢపాచ్చక్షుశ్శ్రవాః కాకోదరః ఫణీ." కాన చలంబు వలదు.
ల. లలిన్ = క్రమముగా, భూతలంబునన్, రాజాంబవత్స = లక్ష్మణకవి, తెలుఁగులన్ = తెలుఁగుఁబలుకుబడులయందు, మాఖ్య = మల్లెపువ్వువలె, శుభ్రమయిన, ప్రసిద్ధిన్ = కీర్తిచేత, వఱలెడు = ప్రకాశించునట్టి, నివు ణుఁడు = నేర్పరి, వాగనుశాసనుఁడు = నన్నయభట్టును, తిమ్మఁడు = ముక్కు తిమ్మనయొకఁడు, ధూర్జటి = ఈపేరుగల కవియును, రామలింగ సంజ్ఞాప్రధితుఁడు = తెనాలిరామలింగకవియు, భాస్కర = హుళిక్కిభాస్కరుఁడును. పోతనలు = బమ్మెర పోతరాజు, ఇక్కడ. నకారమున కుత్వము రావలయు నని కొందఱనిరి. పోతనశబ్దముదేశ్యము. ఇది స్త్రీసమముగాన "పరవల్లింగం ద్వంద్వతత్పురుషయోః." అను న్యాయముచేత స్త్రీలింగసమమైనపోతనశబ్దమునకు "మహతో౽త ఉద్విభక్తౌ" అని ఉత్వము రాకపోయెను. వీరు, ఆది = మొదలుగాగల, కవనచారులు = కవిత్వమందు వర్తించువారు, అనుపమాన = సాటిలేని, కృతి = గ్రంథముగల, రామభద్రుఁడు = అనునతఁడును, శ్రీనాథుఁడు = అను కవియు, గణింపన్, బుధవరుల్ పండితశ్రేష్ఠులు, తదధికులు, తత్సములు, ధరిణిన్, లేరు, కళలన్ = విద్యలచేత, సోముఁడు = సోమకవి, పెద్దన్నకరణిన్ = అలసాని పెద్దనవలె, వెలయుచుండున్ = ప్రకాశించుచుండును, రెండవవీరుండు = పిల్లలమఱ్ఱి చిన వీరన్న, అనూనమతి = గొప్పబుద్ధి గలవాఁడు, నిరూపణము సేయన్, లక్ష్మణాఖ్యుఁడు = ఈలక్ష్మణకవి, కుండలీంద్రుండు సుమ్ము = తిక్కనసోమయాజిసుమా, తత్సదృశుఁడనుట. యజ్ఞము చేసి కుండ లేష్టి చేసినవారు కుండలములను ధరించుదురు. అందఱికన్నను గొప్పవాఁ డనుట. కానన్, చలంబు = మత్సరము, వలదు = వద్దు.
రా. భారవిన్ = కాంతిచేత సూర్యసమానుఁడయినట్టియు, ఘన = గొప్పవారగు, సుబంధున్ = మంచిబంధువులుగలిగి నట్టియు, ఆభవభూతిన్ = ఆశివునివల్లనైన సంపదగలిగినట్టియు, బాణునిన్ = బాణాసురుని, సర్వగీర్వాణపదంబులన్ = సమస్త దేవతాస్థలములను, కొనినవారిన్ = పుచ్చుకొనినవారిన్ = పుచ్చుకొనినవారిని, తదన్యులన్ = హిరణ్యాక్షుఁడు మొదలగువారిని, ఆయనతోడ కలహించి యోడినవారిననుట, విందుమేకదా. అన్నా, రణవిద్యన్ = యుద్ధవిద్యయందు, వారికన్నన్ మతిసూక్ష్ముఁడవా = సూక్ష్మబుద్ధి గలవాఁడవా, అతఁడు, పురుషోత్తముఁడు = విష్ణుమూర్తి, అవుకతంబునన్; నినున్, నిష్ప్రాణున్, చేయున్, ల. సర్వగీర్వాణపదంబులన్ = సమస్తసంస్కృతపదములను, కొనినవారిన్ = గ్రహించినట్టివారిని, బాణ, భారవి. సుబంధు. భవభూతులను. తదన్యులన్ = లాతివారిని, విందుమేకదా, వీరికన్నన్, అతండు అవారణవిద్యన్ = అడ్డు లేని కవిత్వవిద్యయందు, మతిసూక్ష్ముఁడు = సూక్ష్మబుద్ధిగలవాఁడు, అతఁడు, పురుషోత్తముఁడు = పురుషశ్రేష్ఠుఁడు, ఔకతంబునన్ = అయినందున, నినున్, నిష్ప్రాణున్, చేయున్.
రా. తదనంతరంబ, నిజవిజయంబుఁ గోరుచుఁ బయలు వెడలినట్టి, ఆలంకాపతి = రావణుఁడు, పటుతరగోశక్తి = సమర్థమగుబాణ సామర్థ్యముచేత, హరిబలంబున = వానరసేనయందు, ధృడతగల = ధృడత్వము గలిగినట్టి, అంగదాదుల = అంగదుఁడు మొదలగువారిని, లీల నాక్రమించి = యుద్ధవిలాసముచేత నాక్రమించినవాఁడై, సుదర్శనహస్తనాభివత్స జఘనధృడత్వంబడంచుచు = రథాంగపాణియొక్క నాభికమలమునకు శిశు వగుబ్రహ్మవలనఁ బుట్టినట్టి జాంబవంతునియొక్క యధికమగుధృఢత్వము నడంచివై చుచు, పృథుజంఘాతిశయబలంబు ద్రుంచుచు = పృథుండు, జంఘుండునువానరులయొక్క యధికశక్తి నపహరించుచు, సుబాహు గంధవహాత్మ జానుతాపం బొనరింపుచు = సుబాహునకు హనుమంతునకుం దాపంబు సేయుచు, నీలతారకోపస్థితి విఫలంబు జేయుచు = నీలునియొక్క తారునియొక్క గోపస్థితిని వ్యర్థమును జేయుచును, సుముఖ సుగ్రీవాదులకు వివర్ణతం బుట్టించుచు = సుముఖుఁడు = సుగ్రీవుఁడు మోదలగు వానరులకుం గాంతిహైన్యముం గలుగఁజేయుచు, చేరి = సమీపమునకు వచ్చి, అన్నరసమాజనిన్ = రాముని, ఒక్కింత వివశతనొందింపన్ = ఇంచుకంత మూర్ఛనందింపఁగా, ఆలక్ష్మణాగ్రజుండు = ఆరాముఁడు అంత, ముఖ్యశత్రు పదార్థంబుగాన్ = రావణవధ నిమిత్తముగా, అనుపమానాగస్తిమితవచనాంగీ కృతహరిమంత్రుండై = అసమానుఁడగునగస్తమునియొక్క మితవాక్యములచే నంగీకరింపఁబడిన సూర్యమంత్రము గలవాఁడై, "అగస్త్యో౽గస్తిః." ద్విరూపకోశము. కమలాప్తుం డగుభగవంతున్ = పద్మమిత్రుఁడగు భగవంతుని, వేదవి ధ్యుక్తంబుగా, నిశ్చలభావంబున ధ్యానంబు జేసి = శ్రుతి విధ్యుక్త మగు నటుల నిశ్చలత్వముచే ధ్యానించి, తత్ప్రసాద శుచిగోశక్తిన్ వృద్ధిబొందుచున్న రామునియొక్క దివ్యమగునట్టి యగ్నిరూపబాణ సామర్థ్యముచేత, అడఁ గెను. 'శుచిరప్సిత్తమ్.' అమరము.
ల. తదనంతరంబ నిజవిజయంబుఁ గోరుచుం బయలుదేఱినట్టి యాలంకాపతి = ఆలక్ష్మణకవియొక్క, పటుగోశక్తి = తక్కువగానట్టి వాక్య సామర్థ్యము, హరిబలంబున = విష్ణుబలముచేత, ధృఢత కలయన్ = ధృఢత్వము వ్యాపింపఁగా, గదాదులలీలన్ = రోగములు మొదలగువాటివలెను, 'రోగవ్యాధి గ దామయాః.' అమరము. ఆక్రమించి = అఱిమినదై, సుదర్శన = సుదర్శనముయొక్క, హస్త = కరములయొక్క, నాభి = పొక్కిలియొక్క, వత్స = వత్సముయొక్క, జఘన = కటివురోభాగముయొక్క దృఢత్వం బడంచుచున్, పృథు = విశాలమగు, జంఘా = పిక్కలయొక్క అతిశయబలంబుద్రుంచుచు, సుబాహు = శుభమగుభుజములకును, గంధవాహ = నాసికకును, ఆత్మ = మనస్సునకును, జాను = మోఁకాళ్లకును, అనుతాపం బొనరింపుచును. "క్లీ బే ఘ్రాణం గంథవహా ఘోణా నాసా చనాసికా" అమరము. నీలతారకోపస్థితి = నల్లనైనకనుగుడ్లయొక్కయునికిని, "తారాకాక్ష్ణః కనినికా." అమరము. విఫలంబుఁ జేయుచు, సుముఖసుగ్రీవాదులకు = సుందర మగుముఖము శుభ మగుకంఠము మొదలగువాటికి, వివర్ణతం బుట్టింపుచు. చేరి, అన్నరసమాజవర్యు = ఆనరసమ్మ కుమారులలో శ్రేష్ఠుం డగుదమ్మనను, ఒక్కింత వివశతనొందింపన్. ఆలక్ష్మణాగ్రజుండు = ఆలక్ష్మణకవి, అంతట, ముఖ్యశత్రుపధార్థంబుగాన్ = దమ్మన్నయొక్క వధనిమిత్తముగా, అనుపమానాగస్తి మితవచనాంగీకృత హరిమంత్రుండై, ఉపమలేనట్టియు, నిర్దోషములగునట్టియు, నిశ్చలములగునట్టియు వాక్యములచే నంగీకరింపఁబడిన విష్ణుమంత్రము కలవాఁడై కమలాప్తుండగు భగవంతున్ = లక్ష్మికి నాప్తుఁడగు భగవంతుని వేదవిధ్యుక్తముగా నిశ్చలభావంబున ధ్యానంబుజేసి, తత్ప్రసాదలబ్ధ దివ్యతేజో బలవిరాజితుండై, యాత్మీయామోఘగోశక్తి = తనసంబంధమగు వ్యర్థము కాని వాక్యసామర్థ్యము, ప్రకటం బగునట్లుగా విజృంభించిన.
రా. లలిన్ = సుందరముగా, మున్ను, అలబుధవైరికిన్ = ఆరావణునకు పొలుపునెఱయ నాభిముఖ్యముగనున్న సొగసుప్రకటనమగు నటుల నాభియందు ముఖ్యముగనున్న యట్టి, సుథాతులసద్బలము = అమృతముయొక్క యసమానమగు బలము, పేర్చు లక్ష్మణాగ్రజుని దివ్య కమలాప్తుండగు భగవంతున్ = లక్ష్మికి నాత్ముఁడగు భగవంతుని, ఆలక్ష్మణుండు, గారామునెఱయునానతిఁజేసి = ప్రీతిప్రకటమగునట్టి నమస్కారమును గావించినవాఁడై, గభీరభాషణంబులఁబలికెన్ = గంభీరవాక్యములను వక్ష్యమాణప్రకారముగాఁ బలికెను.
ల. లలి మున్ను, అలబుధవైరికిన్ = పండితవిరోధియగుదమ్మన్నకు, పొలుపునెఱయన్, అభిముఖ్యముగానున్న = స్వభావసిద్ధముగా నున్నట్టి, సుధాతులసద్బలము = శుభ మగుధాతువులయొక్కప్రశస్త మగుబలము, పేర్చులక్ష్మణాగ్రజుని దివ్యశుచిగోశక్తిన్ = వృద్ధినందుచున్నట్టి లక్ష్మణకవియొక్క దివ్యము లగునట్టియుఁ బవిత్రము లగునట్టియు వాక్యములయొక్క సామర్థ్యముచేతను, అడఁగెను.
రా. ఏపుచెడి = హెచ్చడంగి, నవకములడఁగి = తొమ్మిదితలలు పోయి, 'కంశిరోంబునోః.' అమరము. గోపాలతనూజు = దశరథరాజతనూజునియొక్క, అతను = అధికమగునట్టియు, గురు = శ్రేష్ఠమగునట్టిదియు, వాణీశ = బ్రహ్మసంబంధమగు, అస్త్రోపాసనము = అస్త్రముయొక్క యుపాసనము, అనఁగా బ్రహ్మస్త్రోపాసనమనుట, సఫలముగన్ = సార్థకముగ. ఆపరుఁడు = శత్రుడగునారావణుఁడు, హృదయము సెదరి = వక్షము వ్రక్కలై, అసువులఁబాసెన్ = ప్రాణములు వదలెను.
ల. ఏపుచెడి = అతిశయముపోయి, నవకములడఁగి = శరీరముయొక్కనవకముపోయి, గోపాలతనూజున్ = లక్ష్మణకవియొక్క, అతనుగురు = విష్ణువునుగూర్చినట్టి, వాణీ = సరస్వతినిగూర్చినట్టి, శాస్త్రోపాసనము = శా స్త్రోక్త మగునుపాసనము, సఫలముగన్ = సార్థకముగ, ఆపరుఁడు = ఆదమ్మన్న, హృదయము సెదరి = మనస్సుచెదరి, ఆసువులఁబాసెన్ = ప్రాణముల విడచెను.
రా. శ్రీతు = ఆశ్రితుఁడగునట్టియు, సరమాకాంతుని = సరమయనుస్త్రీమగఁడగునట్టియు, బుధనుతున్ = దేవతలచేఁ గొనియాడఁబడునట్టియు, అసురవర్యు = రాక్షసశ్రేష్ఠుఁడగునట్టియు, విభీషణుని, లక్ష్మణుండు = లక్ష్మణస్వామి, రామునెఱయునానతిన్ = రామునియొక్క ప్రకటమగునాజ్ఞచేత, లంకాపతిగాఁజేసి = లంకకు రాజునుగాఁ జేసి, గభీర భాషణంబులఁబలికెన్ = గభీర వాక్యములను బల్కెను.
ల. శ్రీతు = ఆశ్రయంపఁబడినట్టియు, సరమాకాంతుని = లక్ష్మియను స్త్రీకి పెనిమిటియగునట్టియు, బుధనుతున్ = పండితులచేఁగొనియాడఁబడునట్టియు, ఆసురవర్యు = సుర శ్రేష్ఠుఁడగునట్టియు నావిష్ణునిగూర్చి, లంకాపతి = లంకభూమికి నధిపతియు, లబ్ధదివ్య తేజో బలవిరాజింతుండై = సూర్యప్రసాదముచే నొందఁబడిన దివ్య తేజముచే బలముచేఁ బ్రకాశింపఁబడినవాఁడై, ఆత్మీయామోఘగోశక్తి ప్రకటంబగునట్లుగా విజృంభించిన, తనసంబంధ మగువ్యర్థము కానివాక్యసామర్థ్యము ప్రకట మగునట్లు విజృంభించిన.
రా, సూర్యుఁడు చంద్రుఁడు నక్షత్రములు భూమి రామునికథయును, నెన్ని దినంబు లుండునో యన్నిదినములును శత్రుభయ విరహితముగా దానవనాథుఁడ వగునోవిభీషణుఁడా లంక నేలుమిఁకన్ = ఇంతటనుండి లంకాపురిని బాలింపుము.
ల. దానవనాథవిభీషణా = రాక్షసశ్రేష్ఠులకు మిగుల భయంకరుఁడ వైనట్టి యోస్వామీ, లంక = లంకపొలమును, ఏలుమిఁకన్ = ఇఁక పరిపాలింపుమా (శేషమొకటే రీతి యని గ్రహింపవలయును.)
ఇ ట్లింతవఱకును లక్ష్మణకవిచరిత్రమును గ్రంథస్థ మైనదానిని వివరించి యున్నాను. ఇఁక వ్రాయఁబోవుచారిత్రము గ్రంథస్థము కానిదైయుండును. ఈచరిత్రారంభములో నీకవి సకాలీనుల నుదాహరించి యున్నాఁడను. అందులోని యందఱతోడ నీకవి చరిత్రకు సంబంధమున్నట్లు వినియున్నాఁడను. వారిలోఁ గథలుగా వాడుకొనంబడునవి యీకవికిని శిష్టుకృష్టమూర్తిశాస్త్రి కవికిని నడచిన సంవాదాదికములై యున్నవి. ఇట్టివాని నుదాహరించుటలోఁ గవిచారిత్రములు ప్రకటించుతలంపే గాని వేఱుగాదు. కావున వారివారిప్రస్తుతసంబంధు లగువంశములవారు మాయెడ నాగ్రహించఁగూడదనియును ఈగాథ లిపుడు వ్రాఁతమూలములు గానియెడల మఱికొన్నిదినములకైన నివి బయలువెడలక మానవనియును అపుడు మనము చేసినమాత్రమైనఁ బరిశీలనచేయుట కవకాశముండక మఱికొన్ని యసందర్భవాక్యములు చేర్చఁబడుననియుఁ గావున నిదివఱలోఁ జేయఁబడిన పరిశీలనమునే యిపుడు ప్రకటింపుదు ననియుఁ జెప్పుచున్నాను.
కృష్ణమూర్తికవి గ్రంథరచనాకారణాదికము.
పైకృష్ణమూర్తిశాస్త్రికవికోటరామచంద్రపురము పరగణాలకు జమీదారుఁ డగుకాకర్లపూఁడి రామచంద్రరాజును దర్శింపఁబోవుడు నా ప్రభుండు కృష్ణమూర్తిశాస్త్రికవి విద్యావిశేషములు వినియున్న వాఁడు గావున తనపేరిట నొకగ్రంథము రచియింపఁ గోరెను. దానికి సమ్మతించి కృష్ణమూర్తిశాస్త్రికవి సర్వకామదాపరిణయ మనునొకప్రబంధమును తనప్రజ్ఞ వెల్లడి యగునట్లుగా రచియించి తెచ్చెను. అట్టిగ్రంథమును కృతి నందుతలంపున సుమూహర్తంబు నిశ్చయించుకొని ఆనాఁడు సభ చేసి గ్రంథము నందెద నని రాజు పైకవికిఁ దెలియఁబఱిచెను. కవియును దానికి సమ్మతించి సభకు నాహ్వానము చేయవలసినపండితులకుఁ బత్త్రికలు వ్రాయించి పంపుఁ డని కోరఁగా రాజు దానికి సమ్మతించి అప్పటికి రాఁదగుపండితుల పేరులు తెలుపు మని చెప్పెను. అపుడు కృ. కవి తనజ్ఞాపకములో నున్నకొందఱి పేరులు చెప్పెను. రాజసన్ని ధాన వర్తులు మఱికొందఱి పేరులు వక్కాణించిరి. వానికిని కృ. కవి సమ్మ తించెను. అపుడు వారిలోఁ గొందఱవలన పిండిప్రోలి లక్ష్మణకవియొక్క నామమును తెలుపంబడినది. ఆపేరు వినినతోడనే కృ. కవి మీరు చెప్పినయతఁడు కవిత్వసంభావన లిచ్చెడు పెండ్లిపందిళ్లలో జరిగెడుసభలకుఁ బోవలసినవాఁడేకాని యిట్టిసభకు రావలసినవాఁడు కాఁడు. కాఁబట్టి అతనిపేరు జాబితాలోఁ జేర్చవల దని యధిక్షేపించి చెప్పెను. దానికి రాజసన్ని ధానవర్తులుగాని రాజుగాని సమాధానము చెప్పక మీ యిష్టము వచ్చిన వారినే పిలువ నంపుఁ డని చెప్పి యూరకుండిరి. కృ. కవియు నటులనే తనయిష్టమువచ్చిన వారిపేరిటనే శుభలేఖల నంపించెను. వానింబట్టి సభ కందఱును వచ్చియుండిరి.
లక్ష్మణకవి రామచంద్రపురమునకు వచ్చుట.
రాజసన్నిధి తనవిషయమై జరిగినవృత్తాంతమంతయు హితులవలన విని లక్ష్మణకవి తనయందు కృ. కవికిఁ గలయసూయచే నట్టి ప్రస్తావన చేసియున్నను రాజు వివేకియే అయిన దానిం దిరస్కరించి పదిమందిపండితులతోఁ బాటుగాఁ దనకును వర్తమానము బంపక పోవుటకు వగచి పిలువకున్న నైన సభలోనికిఁ బోయి తనప్రజ్ఞాదికములం జూపి రావలయు నని నిశ్చయించి ఆనాఁటికిఁ దానును రామచంద్రపురము వచ్చి చేరెను. అంతట ల. కవికి రాజాస్థానమున జరిగినవృత్తాంతముఁ జెప్పినమధ్యవర్తు లే. కృ. కవితో లక్ష్మణకవి గ్రామములో వచ్చియున్నాఁడు. కావున వర్తమానము బంపుట మంచి దనియును, ల. కవి కోటకుఁ బోవుమార్గములోనే బస చేసియుండెం గావున మర్యాదకు స్వయముగా నాహ్వానము చేసిన మఱియును మంచిదనియుంజెప్పిరి. ఆమాటలను గృ. కవి లక్ష్యము పెట్టక తనయూర నుండి యింతదూరము రాఁగల ల. కవి యీయూరిలో నుండురాజ సభకు రాలేఁడుగనుకనా? మనము పిలువకుండినను లోప ముండ దని సమాధానము చెప్పెను. ఆవృత్తాంతముం దెలుసుకొని ల. కవి తనంతటనే సభ ప్రారంభమైన కొంతసేపటికి బైలుదేఱిపోయి తనరాక రాజునకుఁ దెలియ వర్తమానంబు పంచెను. అది విని రాజు లోకమునకు జడిసి రమ్మని మాఱువర్తమానంబు పంపెను. అంతట ల. కవి సభలోనికి వచ్చెను. రాజునుచితగౌరవంబున ల. కవిని కూర్చుండనియమించి కృష్ణమూర్తిశాస్త్రులు చేసినప్రబంధము వినుచున్నాము మీరును సమయమునకే వచ్చినారుగావున దీనిని విని యిందలి గుణదోషములను బరిశీలించి మాకుం గృతినిప్పింపుఁ డని యుపచారముగఁ జెప్పెను. దానికి లక్ష్మణకవి సమ్మతించక నే నెంతవాఁడను. కృ. కవి మహాపండితులు, మీరు మహాప్రభువులు సభచేసి చిత్తగించుచున్నారు, కావున నేనును మీతోపాటుగ వినుచుం గూర్చుండెద ననియెను.
ఆమాటలకు రాజు సమ్మతింపక అలభ్యయోగంబుగ మీయట్టి మహాకవులు తటస్థించినయపుడు గ్రంథము పరిశీలించఁ బడకపోయిన నిఁక మఱియెప్పుడు పరిశీలింపఁబడవలయును. కావున నంగీకరించక తప్ప దనుడు మీ రంగీకరించినశాస్త్రి యంగీకరింపవలయునుగదా? శాస్త్రికిని మాకును సరిపడదుకావున నన్ను బలవంతపెట్టవల దన నా పల్కులు విని కృ. కవి యాగ్రహించి రాజుంజూచి యిట్లనియె. ఈయాస్థానములో లక్ష్మణకవిని విద్వాంసుఁ డని వచియించుట హాస్యాస్పదము కాకపోవునా ? అనేకులు మహావిద్వాంసు లుండఁగా నీతని నేమేమొ పెద్ద వని ప్రభుఁ డనుచుండ సిగ్గులేక తానును తగుదు నని ల. కవి యొప్పుకొనుచున్నాఁడు. నాగ్రంథములోఁ దప్పుపట్టువా రుండుటయే కల్గిన నతఁడు లక్ష్మణకవి కన్యుఁ డగుఁగాని లక్ష్మణకవి కాఁడు. ఈతఁడు పేరునకు లక్ష్మణకవి యేమైనను కవితావిషయములో నవలక్షణకవియే యనవలెను గదా ? అని కృష్ణమూర్తిశాస్త్రి గద్దించి పల్కిన దానికి రా జేమియుననఁ జాలక యూరకుండె. అట్టి రాజుయొక్కశక్తిహీనతయును, కృ. కవియొక్క విజృంభణముం జూచి ల.కవి కృష్ణమూర్తికవిని యుడికించినం గాని కార్యము గా దని నవ్వుచు రాజుదిక్కు మొగంబై చూచి ఆసమీపమునఁ బడియున్న యొకకఱికుక్కం జూచి "ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్"
అని యూరకుండెను. అట్టిమాటకుఁ గ్రుద్ధుండై కృ. కవి యిట్లనియె :-
"క. దాశరథీశబ్దంబును, దా శరధిపరంబు చేయుద్వైయర్థికి దు
ర్ధీశ క్తిబిడాలమునకు, నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్."
అని కృ. కవి ఆవఱలోఁ బ్రయోగించిన యొకప్రయోగములోనితప్పుం జూపెను. ఇట్టి వాక్యంబులు విని ల. కవి నవ్వుచు నేను గౌరవార్థముగా నీ కృ. కవిని నుతించిన నీతఁడు తా నంతస్తోత్రమునకుఁ దగనని తాను శునకసామ్యము గలిగియున్న ట్లొప్పుకొనుచున్నాఁడు. ముందు దాశరథిశబ్దమునకు నేను చేసినప్రయోగములోని సాధుత్వము చూపి అనంతరము నేను కృ. కవిని చేసియున్నస్తోత్రముం జెప్పెద నని సభవారిం జూచి యిట్లనియె. దాశరథిశబ్దముతోనితవర్గ ద్వితీయవర్ణ మునకుఁ దద్వర్గములోని చతుర్థవర్ణముం జెప్పితినని శాస్త్రి దురాగ్రహావేశంబునఁ దా శునకమగుట కొప్పికొనుటయే కాక అట్లే ధ్వనియునుఁ జేయు చున్నాఁడు. దాశరథిశబ్దము సముద్రపరముగాఁ జెప్పంబడియున్నమాట నిజమే. అక్కడఁ దా శరథి అని నేను చెప్పియుండిన కృ. కవి చేసినయాక్షేపణ సరియైనది యే అయియుండును. నామతమున నది యట్లుగాఁ బ్రయోగింపఁబడలేదు. దాశ = పల్లీలయొక్క, రథ = రథములు అనఁగా యానపాత్రములు అట్టివి కలవాఁడు దాశరథి అని సముద్రపరముగా నుపయోగించితిని. ఇం దేమైన దోష మున్నదేమో వైయాకరణ శిఖామణులు నిర్దేశించి చెప్పెదరుగాక యనఁగా నచట నుండుపండితు లాపక్షములో దాశరథిశబ్దము నిర్దుష్టమే అని యొప్పికొనిరి. దానిపైని కృ. కవి పూర్వపక్షము చెప్పలేక యూరక చూచు చుండెను. అంతట లక్ష్మణకవి నవ్వుచు నిటులనే కృష్ణమూర్తి అని నేను ప్రయోగించిన శబ్దములోఁ గూడఁ కృష్ణకవి పొరుపడి తాను శునకముగా నొప్పికొనియె. చూచితిరే పాండిత్యమున నీకృష్ణశాస్త్రి దే గాక యితరులది పాండిత్యమా ! అని ఈశు = శివునియొక్క, నకము = బాణము, కృష్ణమూర్తి యని నేను కృష్ణకవిని స్తోత్రము చేయం జూచిన నీపండితుఁ డట్టిస్తోత్రమునకుం దగ నని శునకసామ్య మంగీకరించెను. సభవారు నేను చెప్పిన వాక్యముల లోప మున్న యెడల నన్నును లేకున్నను కృ. కవిని మందలించెదరుగాక. అనుచుఁ బల్కి ఇట్టిలోకోత్తరపాండిత్యము గల దని గర్వించు నీపండితుని గ్రంథంబున నొరులు తప్పు పట్టలే రని సభలో ప్రాగల్భ్యముఁ జూపుట యెందులకు ? ప్రసక్తియే తటస్థించినఁ దప్పులున్నవో లేవో చూడవచ్చును. అధికముగఁ బ్రసంగించిన లాభ మే మున్నదని యూరకుండెను.
కృ. కవిని గ్రంథము చదువు మని రాజు కోరుట.
ఇట్లుగాఁ బ్రస్తావన నడచినపిమ్మట రాజు కృష్ణమూర్తికవితో సంవాదసమయ మిది కా దనియును, పూర్వపక్షమునకు లక్ష్మణకవి సమాధానము చెప్పియుండెఁగావున నాసంవాదము ముగిసినదియును, ఇఁక మీరుగ్రంథము చదివి నీగ్రంథములో దోషములు లేవనిపించుకొను పని మీయెందే యున్నదనియు ల. కవి అడిగినప్రశ్నముల కన్నిటికిని సమాధానములుచెప్పి అతని నొప్పించుటయే పండితధర్మ మని చెప్పఁగా దానికి సమాధానము లేక లక్ష్మణకవియే కాదు, ఎవ్వరు వచ్చియడిగిన నేమి భయమున్నది. గ్రంథ మటులనే చదివెదను. అని ల. కవిదిక్కు మొగంబై కృ. కవి యేవర్ణనచదువు మని కోరెదవు. లేక యింకేమి చెప్పుమని కోరెదవో సంప్రశ్నింపు మని విజృంభించెను. దానికి ల. కవి నవ్వుచు నీ కంతయుత్సాహమే యుండిన నడిగెదను. సమాధానములును జెప్పవచ్చును అని యిట్లనియె.
కృతిపతినిగూర్చి యడుగుట.
ఇపుడు నీవు కృతియిచ్చుచున్న గ్రంథ మెద్ది? ఎవ్వరికిఁగృతి నిచ్చినావు ? ఇపు డేకథాభాగము చదువుచున్నావు ? అని ల. కవి సంప్రశ్నము చేసెను. దానికిఁ గృ. కవి నేను కృతియిచ్చుచున్నగ్రంథముపేరు సర్వకామదాపరిణయము. దీనిని శ్రీరాజా శ్రీకాకర్లపూఁడి రామచంద్ర రాజుగారి పేరిటఁ గృతియిచ్చినాను. ఇపుడు చదువుచున్న గ్రంథభాగము కథానాయకుఁ డగుప్రభునివిషయమై యున్నది. అని యుత్తర మిచ్చెను. అటుపైని ల. కవి యిట్లనియె. సర్వకామదకుఁ బరిణయ మేమి అని ప్రశ్నించెను. దానికి కృ. కవి సర్వకామద యనునది యొకదేవత పేరు. ఆదేవతయొక్కకళ్యాణముం జెప్పుచుండుటంజేసి ఆగ్రంథమునకు సర్వకామదాపరిణయ మని పే రుంచితి ననియె.
ల. కవి సర్వకామద నీ కుపాసనాదేవత యైనఁ గానిమ్ము. అట్టిసర్వకామదకు వివాహము చేయఁగమకించినవారి నేరిం గానము. అయినను ఇక్కడ నుండువారివలననే నీసంశయము నివారించెద నని ఆసభయందు నృత్తగీతార్థమై వచ్చి నిలువంబడియున్న యొక వెలయాంలిం బిలచి మీ సంప్రదాయములు మీకే తెలియవలెఁగాని మాబోంట్లకుఁ దెలియవు. నీకుఁ బెండ్లి యయినదా లేకున్న నెప్పుడు కాఁగలదు. అని ల. కవి యడిగినతోడనేనవ్వుచు నా వెలయాలు తననుహాస్యముచేయుటకుఁగాకున్న వెలయాలిపెండ్లిసంగతి తన నేల యడిగెదరనియు బెండ్లియే యయి యుండిన మే మీ సభకు వచ్చుట యెట్లు కల్గు ననియు నుత్తరము చెప్పెను. ఆమాటకు ల. కవి సమాధానము చెప్పక కృ. కవిని జూచి వెలయాలు చెప్పుచున్నసంప్రదాయము విని దానికి సమాధానము చెప్పుట యవసర మనిరి.
కృ. కవి సర్వకామద యనుదేవతంగూర్చి నేను మాటలాడుచుండ నిచ్చట వెలయాలి ప్రసంగ మేల వచ్చెను.
ల. కవి. సర్వకామద వెలయా లగును. గనుక నే నట్లు ముచ్చటించితిని. మీ కిష్టములేనియెడల మఱియొకప్రశ్నం బాలోచించెదను. కానిండు. అన్న దమ్ములలోఁ బెద్దవాఁ డుండఁగాఁ జిన్న వానికి వివాహము చేయవచ్చునా ?
కృ. కవి. ఇక్కడ అట్టి ప్రస్తావన యే మున్నది. లేనిపోని ప్రశ్న లేల ? ల. కవి. ఇక్కడ నట్టి ప్రస్తావన వచ్చినది గనుకనే అడుగుట యైనది. రామచంద్రరా జనుజుండనియును, పద్మనాభ రా జగ్రజుండు నని యెఱిఁగినయంశమేగదా, అట్లుండ నన్నకుఁ గృతినీయనిచోఁ దమ్మున కీకృతికన్యక నెటులఁ బరిణయము చేసెదరు. ఇది ధర్మశాస్త్ర విరుద్ధ మనుసంగతి కవికిఁ దెలియకున్నను మీయట్టియాజ్ఞికునికైనఁ దెలిసియుండవలసినదే. అయిన నేమాయెను ఇపుడు. చదువుచున్నకథా భాగములో నీకు నిర్దోషముగాఁగాన్పించుపద్యము నొకదానింజదువుము.
కృ. కవి. నా కన్నిపద్యములు నిర్దోషములుగానే కాన్పించు చున్నవి. ఇదివఱలో నిలచియున్నపద్యము తరువాయి పద్యముం జదివెదను. అది కృతిపతియొక్క ధర్మపత్నీ వర్ణనము, అని యీక్రింది పద్యముం జదివె.
చ. తరణిశశాంకు లాభరణదంభమున న్వదనాక్షి కైతవాం
బురుహసితోత్పలాగ్రమున ముద్దియకుంతలదేశమాక్రమిం
చి రొకనెపంబుగాననగు చివ్వనుచుం బరరూపయుక్తిని
బ్బరముగ నంత సాంతముగ బ్రహ్మయొనర్చినసీమ పొల్పగున్.
అనుపద్యంబు విని లక్ష్మణ కవి రాజుంచూచి యిందులో నొక రహస్యము వ్యక్త మగుచున్నది. అది తెలిసినంగాని యీపద్యము నా కన్వయించదు. కావున దయచేసి నాసందియము నివారించఁ గోరెద నని యడిగెను. దానికి రాజు సమాధానము చెప్పెద నడుగు మనుడు ల. కవి యిట్లనియె.
ల. కవి. మీరాణికి నొకవైపుకంటిలోఁ బువ్వుగాని లేక రెండవ వైపుముఖభాగములో గొప్పపుట్టుమచ్చ గాని యున్న దా ?
రాజు. ఇది నాయనుభవమునఁ గనిపెట్టఁబడిన యంశముకాదు. ఇఁక ముం దిట్టిపుట్టు మచ్చ యుండినఁ గనిపట్టఁబడును. కన్నులలోఁ బువ్వులుగాని కాయలుగాని లేవని యిదివఱలో నున్న యనుభవము అనెను.
ల. కవి. అట్లు లేనిచోఁ గృ. కవి యీపద్య మిట్లు చెప్పుటకుఁ గారణ ముండదే. ఇదివఱలో నట్టిశరీరరాంఛనములు లేకున్న మహాకవి ప్రణీత కృతిలో నున్నవర్ణ నానుసారము జరుగునేమో. ఇట్టి కవిత్వప్రజ్ఞ యుండెను గనుకనే కృ. కవి. తనగ్రంథము నొరులు పరీక్షించఁగూడ దని నిశ్చయించుకొనియుండెను. అట్టివారియుద్దేశమును జెడఁగొట్టి ఆగ్రంథము నను బరిశీలించుటకుఁ గోరియున్నారు. గ్రంథమంతయుఁ బరిశీలించుట మిక్కిలి శ్రమకర మైనపని కాకపోదు. ప్రస్తుతపద్యమును బరిశీలించి తక్కినగ్రంథపరిశీలనా విషయముం బిమ్మట జెప్పెదను. అదెట్లన్నను :-
(1) "తరణిశశాంకు" లనుపేరు లాభరణపర మైనయపు డుండఁగూడదు. ఆభరణము లర్థము లగునపుడు సూర్య, చంద్రు లనుపేరులు రూఢములు.
(2) వదవాక్షు లనుచో నివి రెండు నేకదేశములు. కావున మొదటిది చెప్పినమాత్రముననే రెండును జెప్పిన ట్లగును.
(3) ముద్దియ కుంతలదేశ మాక్రమించి రనుచోఁ గుంతలదేశ మొకప్రసిద్ధిమైనది కాదనియును ద్రిలోకముల నాక్రమించు సూర్య చంద్రు లొకకుంతలదేశమును మాత్రమే ఆక్రమించి రని చేసినవర్ణనలో నదివఱకున్న గౌరవము దీసివేయఁబడిన దనియును, ఇంతియకాక యొక్క కుంతలదేశమునందే యీసూర్య చంద్రు లనుభూష లుండె నని చెప్పుట స్వభావవిరుద్ధ మనియుఁ జెప్పె.
(4) వదనాగ్రము నేత్రాగ్రము ననుచో వదనమున కగ్రము నిర్ణయించఁ బడవలయుననియు, నేత్రముయొక్క అగ్రము కనుకొలుకు లగుననియు నక్కడ సూర్యచంద్రులను నాభరణము లుంచిన నానా యిక నగ లుంచుకొనుతావులనైన నెఱుఁగనిస్త్రీ యగునుగనుక నట్లనుట ప్రస్తుతము చెప్పుచున్న రాజుభార్యయెడలఁ జెప్పఁగూడ దు.
(5) సాంతముగ బ్రహ్మా యొనర్చిన సీమ పోల్పగున్ అనుచో నిక్కడ సీమాంతమును బ్రహ్మ చేసె నని చెప్పంబఫియుండె. ఇది యొ కగొప్పయాకక్షేపణయగును. సీమంతము చేసెడివాఁడు ధర్మశాస్త్రముం బట్టిచూడ భర్త యగును. రాజస్త్రీలకు నిత్యమును సీమంతముం జేయువారలు చెలికత్తెలుగాని బ్రహ్మదేవుఁడుగాఁడు. ఇతఁడు పాపట దిద్దె నని చెప్పుట యాక్షేపణార్హము. ఇది మనుష్యరచితముగాన బ్రహ్మ రచించె నని చెప్పుట అలంకారజ్ఞానహీనతం దెల్పును.
(6) బ్రహ్మ సూర్య చంద్రుల గమనమునకు వేర్వేఱు సీమ లేర్పరిచె నని చెప్పుటయు నసందర్భమే. లోకములో సూర్యుఁడు సంచరించు మార్గముననే చంద్రుఁడును బోవుచుండుట యనుభవసిద్ధమే. సూర్యుఁడు కొన్ని దేశములలోను జంద్రుఁడు గొన్ని దేశములలోను నగపడుటకు శాస్త్రసహాయము లేదు. పై యిర్వురకును గాలభేదము చెప్పిన నొప్పునుగాని సీమాభేదము చెప్ప నొప్పియుండదు.
(7) మఱియును వదనము పద్మ మని సూర్యుఁడును, నేత్రము లుత్పలము లని చంద్రుండును వచ్చి యుండె నని చెప్పుటంజేసి సూర్య ప్రచారము కల్గిన ముఖభాగము వికసించి యుండవలయు ననియును, చంద్రప్రచారము కల్గిన ముఖభాగము ముడుచుకొని యుండవలయుననియు, నటులనే చంద్రప్రచారము కల్గిననేత్రోత్పలము వికసించియుండు ననియును సూర్యప్రచారము కల్గిననేత్రోత్పలము ముడుచుకొని యుండవలయు ననిచెప్పి యిట్టి కాంతముఖ మమానుష్యముగా నుండకుండు నా యని పల్కెను. పైయాక్షేపణలలో నాల్గవ యాక్షేపణచేసిన వెంటనే అచ్చో సంచరించెడు రాజదాసీలలో నొకదానిం బిలచి పిల్లదానా సూర్యుఁడు చంద్రుఁడు అనునగలు కంటికొలుకుల నుంచుకొనియెదరా లేక నొసట నుంచుకొనియెదరా ? అని లక్ష్మణకవి ప్రశ్న సేయ నది అయ్యో తలమీఁద నమర్చుకొను నగలు కంటిమీఁదను ముఖముమీఁదను బెట్టుకొందురా? అని యడిగెద వేమి బాగు బాగు అని యుత్తర మిచ్చెను. అప్పుడు లక్ష్మణకవి మేము బీదబ్రాహ్మణుల మగుటంజేసి వస్తువులమొగమైన నెఱుఁగము. ఎక్కడ యేవస్తువు నుంచుకోవలయునో తెలి సికొనఁ జాలము. నీవు దివాణములోని స్త్రీల కలంకారముచేయు దానవుగావున నీకుఁ దెలిసియుండును. ఈసంగతియే శాస్త్రి సందేహము తీఱుటకుం జెప్పింపఁ గోరినా నని చెప్పి పాపట ముక్కు చెవులవలెగాని లేక కనుబొమలవలెఁగాని దేవుఁడు చేసిన దా లేక నీవు తీసినదా అది మాఱుపవచ్చునా అని అడిగెను. దానికుత్తర మది మేమే తీయుదుమనియు నొకప్పుడు పాపటయిరుప్రక్కల దీసి నడుమ తమలపాకు వేసెనమనియు నభ్యంజనసమయములోఁ బాపట లేకుండఁ గలిపివేసి అనంతర మెట్టి యలంకారము కోరిన నట్టిదాని కుపయుక్త మగుపాపటఁ దీయుదు మనియుం జెప్పె. నీకుఁ దెలిసినమాత్రము శాస్త్రిగారికిఁ దెలిసియున్న గ్రంథము బాగుపడి పోవునుగదా అని చెప్పి, ల. కవి దిగ్గున లేచి మహాప్రభూ యిట్టివిశేషములు గలప్రబంధమును రచియించుటకు కృ. కవి. యే తగును. దీనిని విని మంచిచెడ్డల నిరూపించి సంతసించుట కీసభవారే తగుదురుగాక. మాబోఁ ట్లిట్టిసభలో నాహ్వానమునకుం దగి యుండరు. కావున నే నీపాటికి సెలవు గైకొనియెదను. అని చెప్పి లక్ష్మణకవి సభ వదలి బసలోకిం జనియె. అంతట రాజు కృ. కవిం జూచి ల. కవి. చెప్పినపూర్వపక్షములకు సిద్ధాంతములు విననిది యీ గ్రంథములోని తరువాయి వినఁగూడదుగావున నేఁటికి పుస్తకముఁ గట్టి సభ చాలించవలయు ననియు మఱియొకనాఁడు సభ చేసెద మనియుఁ జెప్పి ఆస్థానము చాలించి నగరులోనికిం బోయెను. పిమ్మట కృ. కవియును ఖిన్నుఁడై పుస్తకము గట్టుకొని తనబసలోనికి వెడలిపోయెను. ఇది సర్వకామదాపరిణయ వృత్తాంతము.
రాజా కొచ్చెర్లకోట వేంకటరాయమంత్రి సభకు ల. కవి పోవుట.
పైవేంకటరాయమంత్రి యొకగొప్పజమీన్‌దారుఁడు. రాజ మహేంద్రపురనివాసి. కాని మిక్కిలి భయంకరచర్యలు గలవాఁడు ఇట్టి జమీన్‌దారునిదౌష్ట్య ముడువుతలంపున లక్ష్మణకవి యొకనాఁడుబయలు దేఱి అతని హజారమున ప్రభునికై వేసి యున్న యున్న తాసనమందుఁ గూర్చుండెను. దానికిఁ గోపించి వేంకటరాయ మంత్రి గొం తెత్తి అతి నాసీ నీ దనియే కూర్చుంటివా? అని యడిగెను. దానికి లక్ష్మణకవి సమానకంఠధ్వనితో నిది నీతివాసేనా? నీతివాసేనా? నీతివాసేనా? అని ముమ్మాఱు కేకవేసి సమాధానము చెప్పెను. దానిని విని యితఁడు లక్ష్మణకవి యని భావించలేక వేంకట్రాయమంత్రి యితఁ డెవ్వఁడో అధిక ప్రసంగిలాగున నున్నాఁడు. తగినట్లుగా జరిపి పంపినంగాని బాగు లే దని నిశ్చయించుకొని మీవారిలో నీవే అధికుఁడవులాగున నున్నావే అని యడిగెను. అపుడు ల. కవి. జంకక యొకటిరెండు వర్ణము లెచ్చు తగ్గుకాఁగా నందఱు సమానులే అగుదు రనియెను. ఆమాట బోధకు రాక వర్ణభేదము చెప్పితివేమిటి దానిని స్పష్టీకరింపు మని వేం. మంత్రి యడుగఁగా ల. కవి యిట్లనియెను. ర్యాలివారికి వర్ణములు రెండు. పిండిప్రోలివారికి వర్ణములు నాల్గు. కొచ్చెర్లకోటవారికి వర్ణము లైదు. ఇందు మొదటివారు ద్వివర్ణులు. రెండవవారు చతుర్వర్ణులు. మీరు పంచ వర్ణులు అనిపల్కిన, ల. కవింజూచి వేం. మంత్రి ఇతఁడేమి యోగివలె నర్థము లేనిమాటలు పల్కుచున్నాఁడు. ఎవఁడీతఁడు అనుడు ల. కవి ఇట్లనియె. ఇపుడు మాటలాడునతఁడు యోగికంటె పైవాఁ డగునియోగి పిండిప్రోలు లక్ష్మణుఁ డనువాఁడు. అనుపల్కులు విని వేం. మంత్రి తా నావఱకుఁ జేసినప్రసంగమున ల. కవి మనస్సు నొచ్చెనేమో యని శంకించి తా నతనింబోల్చలేకపోతిననియును తనతొందరపాటును క్షమించవలయి ననియును బ్రార్థించె. అపుడు ల. కవి తా నట్టితొందరపాటు గలప్రభులను శాంతింపఁ జేయవచ్చితినిగావున సెలవు గైకొనియెద ననుడు. వేం. మంత్రి యతనిం గూర్చుండఁబెట్టి యథావిధి నబహుమానంబుగా గారవించి పనిచె నఁట.
భగవద్గీతలఁ దెనిఁగింప మానుట.
ఈ ల. కవి ప్రస్థానత్రయముం జదువుకొని వానిలో నాంధ్రీకరిం పఁదగినగ్రంథము భగవద్గీతలుగా నెంచి ఆగ్రంథము నాంధ్రీకరింప బ్రారంభించెనఁట. అట్టి వర్తమానంబు వృద్ధగౌతమి కవ్వలియొడ్డున నివసించి యున్న బులుసు, అచ్చయ్య శాస్త్రి అనుపండితుఁడు (బులుసు. పాపయ్య శాస్త్రికిఁ దండ్రి) విని వేదాంతరహస్యములు గలగీతలు తెలుగుగాఁ జేయంబడుచుండెనే. దీనిమూలముగ వేదాంత శాస్త్రము వెల్లడియగునే అని చింతించి దానిని మాన్పింప నెట్లుగా నగు నని మనంబున నూహించుచుండి యొకనాఁటిమధ్యాహ్న సమయమునకు ల. కవి యొక్కగ్రామ మగుకుయ్యేరుం జేరెను. అట్లు చేరి ల. కవి యింటికింబోయి అతనితో తడవు మాటలాడుచునుండెన. అపుడు ల. కవి ప్రొద్దుపోయినది కావున మాధ్యాహ్నిక కృత్యము తన యింటనే జరిగింపుఁ డని అచ్చయ్య శాస్త్రిగారిని బ్రార్థించెను. ఆయన మొదట తనయూరునకుం బోవలయు నని చెప్పి తుద కక్కడనే యుండుట కంగీకరించెను. అటు పిమ్మట నిర్వురును స్నానాదికృత్యములం జరుపుకొని భోజనార్థము పరిషే,చనము చేసి మాస్తోదకముం గైకొనుచో నచ్చయ్య శాస్త్రి హస్తోదకముం గైకొనక యూరక చూచుచుండెను. ల. కవి ఆలస్యము లేదు హస్తోదకముం గైకొనుఁ డని వేగిరించినను, ఆశాస్త్రి అటుల చూచుచు నూరకొన, ల. కవి ఆయన కెద్దియో కోర్కె కలదని యూహించి మీయభిప్రాయ మెద్దియో దానిం జేయ సిద్ధముగా నున్నాను. హస్తోదకముం గైకొని భోజనము చేసి చెప్పవలసినది చెప్పవచ్చునా యని యడుగ ఆశాస్త్రి అటులైన మంచిది యని హస్తోదకముం గైకొని భోజనము ముగించెను. పిమ్మట ల. కవి ఆ. శాస్త్రిమనోగతాభిప్రాయ మరసి అదివఱలోఁ దానాంధ్రీ కరించుచున్న భగవద్గీత సంచికలను శాస్త్రిగారిపరముగా నిచ్చి యింతటనుండి యీలాటిగ్రంథంబులఁ దెనిఁగించ నని చెప్పి అ. శాస్త్రి నింటికిఁ బంచెనఁట.
లక్ష్మణకవి తనకాలీనులపైఁ జెప్పినకొన్ని పద్యములు.
మొక్కపాటిపేరిశాస్త్రి యనుపండితునకు నీలక్ష్మణకవికి నొకప్పుడు విద్యావివాదము తటస్థించెను. అందులోఁ బైశాస్త్రి లక్ష్మణక వికిఁ గవిత్వమేగాని శాస్త్రము లేమి తెలియు నని యాక్షేపించెనఁట. ఆవార్త విని ల. కవి యీక్రిందిపద్యము వ్రాసి పంపె. ఎట్లన్నను :-
"గీ. ఉక్కు చెద దిన్న దశదిక్కు లొక్కటైన
చుక్క లిలఁ బడ్డఁ గులగిరు ల్వ్రక్కలైన
మొక్కపాటింట నోటను ముక్కలేదు
పేరిశాస్త్రికిఁ గలిగెరా పెదవిపాటు."
ఇట్టి లక్ష్మణకవి చెప్పిపంపినపద్యము విని ఆగ్రహంబున పేరిశాస్త్రి యిట్టి పద్యములు చెప్పిన పైజాఱులఁ గొట్టించెద నని వర్తమానంబు పంపె ననియును దానికి సమాధానముగ ల. కవి లోజారుల ముందు గొట్టించి పిమ్మట పైజాఱుల సంగతి యోచింపు మని వర్తమానంబు పంచెనఁట.
ఇటులనే కూరపాటి, వేంకటశాస్త్రి యనునతఁ డొకపరి ల. కవితో విరోధించిన లక్ష్మణకవి యీక్రిందిపద్యంబు వ్రాసినంపెను.
"గీ. కూరపాటి వెంక కుక్కలు దినుకంక, లేనిపోనిశంక మాను మింక
ముఖము చూడఁ గుంకముండవనెడుశంక, నాకుఁదోచెఁ జంక నాఁకు మింక."
ల. రావునీలాద్రి రాయని నధిక్షేపించుట.
ఈలక్ష్మణకవి యొకపరి పిఠాపురాధిపుఁ డగురావునీలాద్రిరాయని దర్శింపఁబోయెను. అపు డచట జంగము బసవయ్య యను నొక రాజవైద్యుని మూలమున బ్రాహ్మణుల గౌరవము నిషేధింపఁబడుట తెలిసికొని లక్ష్మణకవి వ్యాజస్తుతిగా రాయని నీక్రిందివిధమున నుతియింప నారంభించెనఁట. ఎట్లన్నను :-
"రావువారిసంస్థానములోనే మర్యాదలు. రావువారిసంస్థానములోనే బహుమానములు. రావువారిసంస్థానములోనే పరువులు." అని ప్రారంభింప నం దేదియో అపహాస్య మున్న దని నీలాద్రిరావు లక్ష్మణకవిని నగౌరవంబుగా బహుమానించి పంచె నఁట.
పెండ్లిండ్లకుఁ బోవుట.
లక్ష్మణకవి చుట్టుపట్ల నుండుగ్రామములలో మహాజనుల యిండ్ల లో నగు పెండ్లిండ్లకుఁ బిలువంబడినప్పుడు కవిత్వగౌరవతాంబూలము తనకే యిచ్చునట్లుగాఁ బ్రసంగించుచు వచ్చెనఁట. అట్టియాచారము క్రమముగ బలము కాఁగా నతఁడు పెండ్లికిఁ బోయినను పోకున్నను మహాజను లతని సభాతాంబూలం బతనికిఁ బంపుచుండిరఁట. అటులఁ గొన్నిదినములు జరిగినపిమ్మటఁ దనకుఁ గట్నము పంపక యెవరైన నతఁడు రా లేదని ఆక్షేపణ చెప్పునెడల లక్ష్మణకవి వారితోఁ దాను రాకయుండినఁ బెండ్లి యె ట్లగు ననియుఁ దాను వచ్చియే పెండ్లిపూర్తి జేసియుంటి నని పల్కు చుండునఁట. దానికిఁ గారణ మీక్రింది విధముగాఁ జెప్పు చుండునఁట. ఎట్లన్నను :- మీయింట జరిగినపెండ్లిలో నాకబలి జరిగెనా లేదా ? అట్టినాకబలికి పిండితో ప్రోలుపోసియుంటిరా లేదా ? అటుపిమ్మట నది లక్షణముగా నుండెనా లేదా ? కాదంటిరేని వివాహసిద్ధి లేదు. పైగా నశుభప్రసంగ మగును. అగునంటిరేని పిండి ప్రోలు లక్ష్మణలక్షితము కాఁగాఁ బిండిప్రోలు లక్ష్మణకవి సాన్నిధ్యమున లేఁ డని యెట్లుచెప్పవచ్చు నని చమత్కరించి కట్నములం గైకొనినట్లు చెప్పంబడును. ఇట్టిపట్లనే దమ్మన్న రావునకు నీతనికి విరోధము కల్గె నని చెప్పుదురు.
లక్ష్మణకవి తనమేనల్లుని వ్యవహారములోఁ బ్రవేశించుట.
ఈలక్ష్మణకవి మేనల్లుఁడు చింతలూరిమిరాసీదారుఁ డగుమంగన్న యనునతఁ డుండెను. అతఁడు జగ్గరా జనునొకజ్ఞాతికి దత్తతకావింపఁబడియెను. ఆవృత్తాంతముఁ దెలిసికొనినజ్ఞాతులు జగ్గరాజు గతించిన పిమ్మట మంగన్నకు సంక్రమించిన గృహక్షేత్రారామములంగూర్చి పండితనదరమీనుకోర్టులో రాజమహేంద్రవరములో దావా తెచ్చి యుండిరి. అపుడు శంకరమంచి అనంతంపంతు లనుబ్రాహ్మణుఁడు పండితనదరమీనుగా నుండెను. అతఁడు మంగన్న దత్తుఁడు కాఁ డని తీర్పుచేసి అతనిస్వాధీనములో నుండెడి జగ్గరాజుయొక్క చరస్థిర రూపపదార్థము లన్నియును జగ్గరాజుయొక్క సన్నిహితజ్ఞాతులపర మొనరించెను. అట్టి తీర్పునకుఁ గారణ మేమి యై యుండు నని విచారించి అది ధనకారణ మౌట యెఱింగి లక్ష్మణకవి పండితునిపైఁ గొన్ని పద్యంబులు, చెప్పి వ్యాపింపఁజేసెను. అవి యెట్లన్నను :-
సీ. మహనీయ శంకర మంచిగోత్రమునఁ బ్ర, పాతకుం డన థరిత్రీతలమున
బండితుండువలెఁ గన్పడును స్థాణుత్వ మే, ర్పడ నొక సాధులపలుకు వినవు
పుక్కిట విషమె యెప్పుడు నీకు నుండును, మది వీడ వెపుడుఁ దామసగుణంబు
భీముఁ డుగ్రుడు ననుపేరుఁ గాంచి నశింతు, వంబికాపతివి బ్రహ్మఘ్నుఁడవు న
గీ. నంతనాముండ వరయంగ నష్టమూర్తి, వగుచుఁబితృవనమందు భస్మాంగుఁడవయి
భూతములును బిశాచాముల్ బ్రోదిఁగూడు, కొనఁగనుండుదువండ్రునిన్ జనము లెల్ల.
మ. సరవిన్ శంకరమంచిపండితుఁ డనన్ జానొప్పువాఁ డర్థసౌ
ఖ్యరుచిన్ జెందియుఁ జింతలూరి యలమంగామాత్యసాధ్యాత్మమం
దిరసుక్షేత్రములన్ హరించి కపటాన్వీతుండు నౌవాదిక
ల్లరి గాఁ డంచునుఁ దీర్పు చేసి జనముల్ నవ్వం బడున్ దుర్గతిన్.
ఉ. దక్షిణదిక్కు నుండియ యుదంతముఁ దెచ్చినధర్మరాజు ప్ర
త్యక్ష మనంత పాతకున కిచ్చెడు మార్గము వోవునట్లు గా
దీక్షవహింపవే ధవళ ధేహుఁడ శంకరమంచి కూళ్లపై
పక్ష మదేల దుష్టజనభంజన సజ్జనభావరంజనా.
సీ. పరశురాముఁడు తండ్రిపంపున రేణుకన్, దనతల్లియనకను నఱికివైచె
జనకజాపతి తండ్రిపనుపున రాజ్యంబు, వాసి మహారణ్యవాసి యయ్యెఁ
గుండినముని జనకునియాజ్ఞచే సంశ, యింపక గోవుల హింసచేసె
భీష్ముఁడు తండ్రి యభీష్టంబు దీర్ప రా,జ్య శ్రీసుఖాదికార్యములు విడిచె
గీ. తండ్రిపంపునఁ దనకన్నతండ్రిపేరు, చెప్పుకతన నదత్తుఁడే చింతలూరి
మంగరా జిట్లు శంకరమంచిపండి, తుండు దీర్చుట జీవన్మృతుండు గాఁడె
సీ. వసుదేవసుతుఁ డన్న వాక్యంబుననె పద్మ, నాభుండు నందనందనుఁడు గాఁడె
మాద్రీతనయుఁ డన్న మాత్రంబుననె కవల్. కౌంతేయు లన్నవిఖ్యాతిఁ గనరె
పార్వతీసుతుఁ డని పల్కినంతనె కుమా, రుఁడును దాఁగార్తి కేయుండు గాఁడె
బాపిరాట్సుతుఁ డన్న భాషనె మంగన్న, ధృతి జగ్గరాడ్దత్తసుతుఁడుగాఁడె
గీ. వేదశాస్త్రపురాణము ల్వినియుఁగనియు, నెఱిఁగి యెఱుఁగనివాఁడునై యిట్లువిత్త
వాంఛ నన్యాయముగఁ దీర్చుపండితుండు, ఘోరనరకంబులందులఁ గూలకున్నె.
ఇ ట్లనేకపద్యంబులు చెప్పి పండితుని యన్యాయంబు జగంబున శాశ్వతముగా నుండునట్లు లక్ష్మణకవి కావించెను. లక్ష్మణకవి చెప్పినట్టి పండితునివంటి వార లిప్పటికి ననేకు లున్నను ఆధునికకవులు ప్రభుత్వమువారిభయమువలన రవ్వ చేయక యున్నారు. ల. కవి ద్య్వర్థికావ్యకవియును ధీరుండు నవుటంజేసి యిట్టిపద్యంబులఁ బ్రకటించుటయకాక యొకనాఁటి సమయములో దేవళంబునకుఁ బోవుచున్న పైపండితుం జూచి అతని యెదురుగా నిలువంబడి అతనిదుర్మార్గత యతనికిం దెలుప నిశ్చయించుకొని తానును స్వామిదర్శనార్థంబు బోయినట్లుగాఁ బోయి అనంతంపంతుల కెదుట నిలువంబడి శంకరు నుద్దేశించి నుతియించినట్లుగా నీక్రిందిపద్యంబు చెప్పెను. ఎట్లన్నను :-
మ. అవురా శంకర మంచి వాఁడవు ననంతాఖ్యుండ వై తీర్పెఱుం
గవు మంగన్నరఁజేసి నీవు బుధమార్గభ్రష్టతం జోగిరా
గ వరాలంది పినాకినిం బశుపతీకల్లోలివిం బట్టి స
త్యవధూసత్వము దానియం దిడితి వాశాయత్తు లిట్లేకదా.
అని జోగిరాజు వరాలు లంచమియ్యగాఁ నక్రమ మగుతీర్పు చేసి తని పండితుని ముఖముమీదఁ గొట్టినట్లు చెప్పి తనసమీపమున నుండెడువారితోఁ దాని కె ట్లీశ్వరపరముగా నర్థము చెప్పవలయునో దాని నన్వయించి యుపన్యసింపుడు, వినుచున్న పండితుఁడు తన్ను బాహాటముగఁ దిట్టుచున్నను ల. కవి పద్యమున కర్థాంతరముం జెప్పి తనపని యర్థాంతరము చేసె నని చిన్న వోయి మాటలాడక తొలఁగిపోయెను.
ల. కవి సి. పి. బ్రౌనుదొరం జూచుట.
ఇట్లుగా ల. కవి పండితుఁడు తనమేనల్లునకుఁ జేసినయపకారమునకు మిగులఁ జింతించినవాఁడై అప్పీలు చేయించియైన నతని ధనమును వసతియు నిలుప నూహించి మేనల్లుని వెంటఁ దీసుకొని బందరుపట్టణమునకుఁ బ్రయాణంబై పోయెను. అచ్చట నుండుప్రొవిన్షియల్ కోర్టులో నప్పీలు చేయించుట కేర్పర్చుకొని ల. కవి అందులో నొకజడ్జీగా నుండిన బ్రౌనుదొరను ముందుగా దర్శించి ఆతఁడు తెలుగులలోఁ బండితుఁ డవుటంజేసి యందులో నుండెడితనప్రజ్ఞ నతనికిఁ దెల్పి కార్యసాధనము చేసుకొన గమకించి యీక్రింది సీసమాలికను జదివె. ఎట్లన్నను. సీసమాలిక.
మ ధువైరికి న్వనమాలికిఁ గౌస్తుభ
హా రునకును సంశ్రితావనునకు
రా ధికాప్రియునకు రామసోదరునకు
జ గదీశునకు దయాసాగరునకు
శ్రీ నాథునకును రక్షితదేవసమితికిఁ
బ్రౌ ఢభావునకు నారాయణునకు
సు రగేంద్రతల్పున కరిశంఖధరునకుఁ
దొ గలరాయనిఁ గేరుమొగముదొరకు
ర ణనిహతదుష్ట రాక్ష సరమణునకును
గా నమోహితపల్లవీకాంతునకును
రి పువిదారికి హరికి శ్రీకృష్ణునకును
కిల్బిషారికి నే నమస్కృతి యొనర్తు.
సీ. చింతలూరికి మిరాసీదారుఁ డగుజగ్గ, రాజుకుఁ బుత్రు లౌరసులు లేమిఁ
దనకును బిన్న యౌతండ్రి నందను నను,బాపిరాట్సుతు దత్తభావుఁ జేసి
కొనుటచే నిదివఱకును తద్గృహక్షేత్ర, కర్తనై యుండుట కలకటరుక
చేరీలలెక్కలఁ జిత్తగించినఁ జాలు, నేది నేనెఱుఁగనియిట్టిపనికి
తే. బాపిరాట్సుతుఁ డని నేను పల్కినట్లు, వాది పన్నినకపటభావమె నిజ మని
పట్టి దత్తుఁడు గాఁ డంచుఁ బండితుండు, చేసె తీరు పుభయభ్రష్టుఁ జేసె నన్ను.
ఉ. అత్తినధర్మశాస్త్రవిధి కడ్డని చూడక కల్కటర్లసం
సత్తులలెక్క లారయ విచారము సేయక రాజ్య మేలుభూ
భృత్తు సభాస్థపత్త్రలిపిరీతిఁ దలంపక విత్తవాంఛచే
దత్తు నదత్తు డం చనునధార్మికపండితు డుంట యొప్పునే.
ఉ. పస్పసఁ జేసె నాబ్రతుకు పండితుఁ డిం కెటు నిల్తు నందు నే
నిస్పృహవృత్తి నుండఁగను నిన్నటిరేఁ గలలోనఁ గోర్టువా
రిస్పిసి యాలు పట్టి రిఁక నేర్పడ న్యాయము తీర్తు మంచు ధై
ర్యాస్పదసూక్తిఁ బల్కినటు లైన మిముం బొడగానవచ్చితిన్.
అని చదివిన విని బ్రౌనుదొర సంతసించి మంగన్న దాఖలుచేసిన అపీలు స్పెషల్ అప్పీలుగా నంగీకరించె ననియు నద్దానిం దెలిసికొని మంగన్న విరోధులు పండితునితీర్పు భంగ మగునేమో యని భయపడి మంగన్నతో సమాధానము పడి మంగన్న మరల బ్రౌనుదొరకడఁ జెప్పుకొన నక్కఱలేకుండ సంతోష పెట్టి రని కలదు.
ల. కవి విశేషములు పెక్కులు గలవు. తెనాలి రామకృష్ణునివాక్కులయం దెట్టిచమత్కృతి కలదో ల. కవి వాక్కులయం దట్టిచమత్కృతి కలదనియును, నీతఁడును సమయస్ఫురణము కలవాఁ డనియు, జంగము బసవయ్య మొద లగువారిపై ననేకచాటుధారపద్యంబుల రచించె ననియు వాడుక గలదు. అట్టిపద్యము లసభ్యములుగా నుండుటచేత వానిని వివరింపలేదు.
ఆంధ్రద్వ్యర్థికావ్యకవులచరిత్రము ముగిసెను.