కవి జీవితములు/నంది తిమ్మన


సముతో నిట్లనియె. "అయ్యయ్యో ! నా కీకుఱ్ఱలం జూచిన జాలి యయ్యెడిని. పెద్దన యింకను గొంతకాల ముండిన వీరికిం జదువుసంధ్యల నేర్పి తనయంతవారిం జేయును గదా ! ఇపుడు వీరికి విద్య యలవడు టెట్లు తండ్రివిద్వాంసుఁ డైనఁగొడుకులును నట్టివారగుట యెచ్చటనో గద అనుభట్టుమూర్తి పల్కులాలించి పెద్దనకుటుంబిని తనపుత్త్రుల నతఁడధిక్షేపించుటగ నెంచి కనలి యిట్లనియె. నాపుత్త్రులు తండ్రిఁబోలెవిశేషముగఁ బ్రజ్ఞావంతులు గాకున్న శ్లేషకవనము చెప్పికొని యైనను బొట్టపోసికొనెడువా రగుదురు పొమ్ము, వీరింగూర్చి నీవు వగవకుము. అనుడు భట్టుమూర్తి యాపెపల్కుల నాలించి తా శ్లేషకవి యవుటయుఁ దాఁ పెద్దనకు మిగుల నిష్టుండు గాకుండుటయుఁ దలఁచి యామె యట్ల నె నని యూహించి యనంతరము నిజనివాసమునకుఁ జనియెను.


ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.

11.

[1]నంది తిమ్మన

ఈ తిమ్మనచారిత్రము దెల్పుటకు మనకు రెండుగ్రంథములు గలవు. అం దొకటి పారిజాతాపహరణము. రెండవది యాంధ్రప్రబోధ చంద్రోదయము - అందు మొదటిదానిలో :-

"సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ, సూత్రుఁ డాఱ్వేలపవిత్రకులుఁడు
    నందిసింగామాత్యునకును దిమ్మాంబకుఁ, దనయుండు సకలవిద్యావివేక
    చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే, నల్లుండు కృష్ణరాయక్షితీశ
    కరుణాసమాలబ్ధఘనచతురంతయా, నమహాగ్రహారసన్మానయుతుఁడు

గీ. తిమ్మనార్యుండుశివపరాధీనమతి య, ఘోరశివగురుశిష్యుండు పారిజాత
   హరణ మనుకావ్య మొనరించె నాంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ,

దీనింబట్టి చూడఁగా దిమ్మకవి కౌశికగోత్రుఁ డగునాఱ్వేలనియోగిబ్రాహ్మణుఁ డనియును, వీరిగృహనామము నందివా రనియును, నీతనితండ్రిపేరు సింగన యనియును, తల్లి పేరు తిమ్మాంబ యనియును, దేలుచున్నది - ఇతని మేనమామపేరు మలయమారుతకవి. ఈమలయమారుతకవీంద్రుఁడు సకలవిద్యావివేకచతురుం డని ప్రబోధచంద్రోదయకృతిముఖంబునంగూడ వ్రాయఁబడినది. ఇతనిగ్రంథము లెవ్వియో యింకను మనకు గోచరము గాకున్నవి.

తిమ్మకవి గ్రంథారంభములోఁ దాఁను మొదట రాజాజ్ఞానుసారముగ నీపారిజాతాపహరణగ్రంథము రచియింపకుండుటంబట్టి యట్టిసందర్భము చెప్పఁడయ్యె. అనంతరము రాజు దానిం గృతి నందినాఁడు గావునఁ దన కాతనివలనం గలిగినవిశేషాదికము వక్కాణించి యుండెను. అందుఁ జతురంతయాన మహాగ్రహారముం జెందెను. ఈతఁ డఘోరశివగురునిశిష్యుం డని వ్రాసియుండుటంబట్టి దక్షిణామూర్తి మంత్రోపాసనాపరుండని తెలియవలయును. ఇట్టిశైవోపాసనమునం గల్గినప్రతిభవలననే తా నీగ్రంథమును రచియించితి నని మఱియు విస్పష్ట మగుకొఱ కాశ్వాసాంతగద్యములో "శ్రీమ దుమామహేశ్వర లబ్ధసారసారస్వతాభినంది" అని వ్రాసియుండె. ఇతఁడె కాక యితనివంశ్యులలో మఱికొందఱుగూడ నీదక్షిణామూర్తి నుపాసించినట్లే కానుపించును. ఈదక్షిణామూర్తి నుపాసించువారికిఁ గవిత్వప్రౌఢిమయే కాక విజ్ఞానసంపత్తియుం గల్గు నని చెప్పుటకు శంకరాచార్యుదులే చాలియున్నారు.

పారిజాతా పహరణము.

కృష్ణరాయలపేరిటఁ గృతి యీఁబడినపారిజాతాపహరణగ్రంథ రచనమున కొకచిత్రమయినకథ గలదు. ఒకానొకదినమున రాయలు రాత్రి భోజనానంతరము పండితజనగోష్ఠిచే సభలో నిశీథముదనుక నుండి యాస్థానము చాలించి శయ్యాగృహంబునకుఁ జనియె. అచ్చో నాతనిపట్టమహిషి యంతకుమున్ను హంసతూలికాతల్పమునం గూర్చుండి చెలులతో ముచ్చటలాడుచు భర్త్రాగమనంబు వీక్షించుచుండి, నిశీ


థ మయ్యెఁ గావున నాపె నిద్రాభరంబునకు నోఁపఁజాలక పరాకున వ్యత స్తముగ శయనించినది. అత్తఱిఁ జెలు లాపెపై నొక్కపటము గప్పి యథేచ్ఛం జనిరి. కృష్ణరాయం డతఃపురంబున కే తెంచి స్వతల్పమునఁ దొంటియట్ల శయనించె. ఇట్లుండ ననంతరము వ్యత్య స్తశయాన యైననిజమహిషి పాదమాపురరవం బాతనికిఁ గర్ణగోచరం బయ్యెను. తోడనే దిగ్గన లేచి మంచమునలుగెలంకులఁ బరికించి యచ్చోఁ బాదము లుంచి నిద్రించుభార్యం గాంచి కారణ మూహించుచుఁ గొంతవఱకుఁ దెలిసి కోపించి తనలోఁ దా నిట్లనియె - "అద్దిరేయింతు లెంత మొఱకులు ఆలస్యము చేసితి నని నాపై నలిగినది గాఁ బోలు. కోపించినఁ గోపించుఁ గాక నను నవమానింపఁ దలంపఁ దా నెంతటిది ? ఇట్టియనుచితకృత్యమున కుద్యోగించినచో నొకపరి దండించిన ముం దెన్నం డిట్టిచెట్టలఁ జేయదు" అని పండ్లు పటపటం గొఱికి క్రూరదండనోపాయం బన్వేషింపుచు "భార్యాదండః, పృథక్ఛయ్యా" అని యున్నది గావున నట్లే చేసెదంగాక యని యచ్చోటు వాసి యింకొక భవనంబునకుం జని యచట శయనించెను. అనంతర మిట నాసాధ్వీమ తల్లి యెల్లవృత్తాంతమును జెలిక త్తియలవలన విని మనమున మిగుల దిగు లొంది కర్జంబు గానక యూరకుండెను. అట్లు గొన్ని దినములు గడచినవి.

ఇట్టివృత్తాంతము నంతయు నాపెయరణపుకవి యగుముక్కుతిమ్మన (నంది తిమ్మన) చూచాయగ గ్రహించి వైళంబ పట్టమహిషికడ కరుదెంచి "తల్లీ! నీ మొగము తొంటితేజంబుననుండ లేదు. దుర్లభకార్యమును జింతించుచున్నట్లు గాన్పించు. నే నుండ మీ రిట్లు చింతింప నేల? వృత్తాంత మెట్టిది యైన సెలవిం డనును రాజమహిషి "యంతఃపురరహస్యములు వెలువరించినచోఁ బ్రాణహాని యగును. నాపుణ్య మెట్లున్నదో యట్లగును వృథావిచారం బేల?" యనుడు నాతఁ డట్లనియె. "తల్లీ! పుత్త్రుఁడు రహస్యము నీకంటెను గుప్తముగ నుంచి


కార్యము సానుకూలం బవుటకు యత్నించు నని నమ్ముము. నీపితృసఖుండ నైననేను నీకింతమాత్ర ముపకారము నీయిష్టానుసారముగ నొనరింపలేకున్నచో నిచ్చో నుండులాభం బెద్ది?" అను తిమ్మనపల్కు లాలించి యాఱేనియాలు కన్నీ రొలుక నేడ్చుచుఁ గడచినవృత్తాంత మా మూలాగ్రముగఁ జెప్పినది. దాని నంతయు విని "తల్లీ నీ వింతమాత్రము చే భయంపడ నేల? ఈవారములోపల నీనాథుఁడు తనంతన నీకడ కరుదెంచి నిన్ను మన్నించును వగవకుము నేనుబోయి వచ్చెదను" అని నిజగృహమునకుఁ జనుదెంచి రహస్యమునం గూర్చుండి "రాజమహిషి నూరార్చుటకు నచ్చోఁ బ్రాగల్భ్యములు పల్కి వచ్చితిని. ఇపుడు కార్యం బెట్లు నిర్వహింతును. ఈవర్తమానము రాజునకుం దెలిసినచోఁ దలకొట్లగును. ప్రస్తావవశమున నన్యాపదేశముగఁ బల్కినచో నాతఁడు దీనిని గ్రహింపఁ దగుసమర్థుండు. అసాధ్యుఁడు. ఆవులించినఁ బ్రేవులు లెక్కించువాఁడు. పిమ్మట నెటువోయి యెటు లయ్యెడినో" అని యనేకవిధంబుల నూహించి కొంతవడికి మనంబు పదిలంబు సేసికొని తన యిష్టదేవతకు మ్రొక్కి యిట్లు నిశ్చయించె. ఇపుడే ఱేనిపేరిట నొకప్రబంధము రచించి దాన దీని కనుగుణం బగుకథ పొందుపఱిచెదను. అందుఁ బ్రస్తావవశంబునఁ బల్కునట్లు మదభిప్రాయము తేటపఱిచెదను రాజును గడు రసికుఁడుగావునఁ దనలోపమును దానిచే నెఱింగి సుపథంబున వర్తించు నటులైనమదీప్సితము సేకూఱును.

అని తలంచి పారిజాతాపహరణం బనుకథఁ గొని ప్రబంధమురచి యింప నారంభించెను. అందుం దొలియాశ్వాసముననే తనయభిప్రాయము తేటపఱిచి దానికిఁ దగుపద్యములు విరచించి దానిచేఁ దనయభీష్టంబు సిద్ధించు నని యెంచి గ్రంథ మంతయు వైళంబ పూర్ణము సేసి రాజునకుఁ దెలియఁబఱిచెను. అతఁడును గ్రంథములకుఁ గృతినాయకుఁడుగా నుత్సహించువాఁడు గావున నొకశుభదినమున సభఁ జేసి గ్రంథము జదువఁ దిమ్మనకు నాజ్ఞ యొసంగెను. అపుడు తిమ్మన తనమృదు


తరవాగ్వైఖరి మెఱయ నాగ్రంథమును జదువ నారంభింప నందు నారదుఁడు శ్రీకృష్ణసాన్నిధ్యమునకు వచ్చి పారిజాతసుమం బిచ్చిన వృత్తాంతంబును పిమ్మట సత్యభామ నాతఁడు నిందించుటయును సాత్రాజితికిఁ గల్గినకోపకారణమును శ్రీకృష్ణుఁ డాపెకుఁ గోపోపశమనము సేయుటయుఁ జదివి భర్తయెడ నాయింతికి గోప ముడుగకున్న నారమాభర్త :-

"ఉ. పాటలగంధిచిత్తమునఁ బాటిలుకోపభరంబుఁ దీర్ప నె
    ప్పాటను బాటు గామి మృదుపల్లవకో మలతత్పదద్వయీ
    పాటలకాంతి మౌళిమణిపంక్తికి వన్నియ వెట్ట నాజగన్నా
    టకసూత్రధారి యదునందనుఁ డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్.

అని చదివి పిమ్మటఁ దనయభిప్రాయము తేటపఱుప నిట్లనియె.

"మ. జలజాతాసన వాస వాది సుర పూజా భాజనం బై తన
     ర్చులతాంతాయుధుకన్న తండ్రిశిర మచ్చో వామపాదంబునం
     దొలఁగం ద్రోచె లతాంగి యట్ల యగు నాథుల్ నేరము ల్సేయఁ బే
     రలుకం జెందినయట్టికాంత లుచితవ్యాపారము ల్నేర్తురే."

అని చదివి దానికి విశేషదృష్టాంతములు దెల్పుచు సరసంబుగ స్త్రీలు కోపించి యొనరించెడివృత్తాంతములఁ జెప్పి యప్పట్టున మఱలఁ గోపించక శ్రీకృష్ణుఁ డెట్లుండెనో చూచితిరే యని :-

"చ. నను భవదీయదాసుని మనంబున సెయ్యపుఁగిన్కఁ బూని తాఁ
    చినయది నాకు మన్ననయ చెల్వగునీపదపల్లవంబు
    మత్తనుపులకాగ్రకంటకవితానము సోఁకిన నొచ్చు నంచు నే
    ననియెద నల్క మానవు గదా యిఁక నైన సరాళకుంతలా."

అనునీపద్యమును జదివెను. తోడనే రాయనికిఁ దనమనంబున స్వకీయవృత్తాంతము జ్ఞప్తికి వచ్చి తా నిట్టిసమయమున నడిచినవిధమంతయు విరసముగఁ గాన్పింపఁ దనలోఁ దా నిందించికొనుచు "కృష్ణుఁడు లోకారాధ్యుఁ డయ్యును గోపించి తన్నినభార్యయెడ నెట్లు వర్తించెనో చూడుఁడు. కృష్ణునట్టిరసికుఁ డుండవలదా. అవ్వలివృత్తాంతము చదువుఁడు" అనుడుఁ దిమ్మన తనతంత్రము కార్యకారి యయ్యె నని లోన ముదితుండై మీదివృత్తాంతము చదివి సత్యభామ కృష్ణున కిచ్చినయుత్తరము లని యిట్లనియె :

"క. మానంబే తొడవు సతులకు, మానమె ప్రాణాధికంబు మాన మఖిలస
    న్మానములకు మూలం బగు, మానరహిత మైనబ్రదుకు మానిని కేలా."

అనుదీనిని రసపుష్టి చేసి యన్వయించి చెప్పిన విని రాజు బలే నీచెప్పిన దంతయు మేలుగ నున్నది. అనంతరవృత్తాంతముఁ జదువు మనుడు నాయాశ్వాస మంతయు ముగించెను. అంత సూర్యా స్తమయన మయమయినది.

అపుడు రాయఁడు పండితులం జూచి నేఁటికి నాస్థానమును జాలింత మని వారలకు సెల వొసఁగి తా నంతఃపురికి వచ్చి దాసీజనమును గాంచి కేళికాధామ మలంకరింప నాజ్ఞ యొసంగెను. వార లతిసంభ్రమ మునం జని రాజ్ఞి కవ్వార్తఁ దెలిపిరి. ఆయమ యానందాబ్ధిమగ్నయై వారికిఁ గనకాంబరాభరణము లొసంగినది. ఱేఁడు నాఁటిరేయి భార్యా ద్వితీయుఁడై సుఖముగ నుండెను. రాజమహిషి మఱునాఁడు వేకువ నవ్వార్త రహస్యముగఁ దిమ్మనకు నొక చెలికత్తెచేఁ బంచినది. దాని విని యాతఁడు నత్యాంతానందంబు నందెను.

కృష్ణరాయలు పారిజాతాపహరణవృత్తాంతము విని యున్న వాఁడు గావున నందలికథాసందర్భము మనమునకు వింత దోఁపింప భార్యను బిలిచి యాపెతో నిట్లనియె. "ముక్కుతిమ్మన చేసిన పారిజాతాపహరణములోనికథాసందర్భము కల్పితమై యుండును. అట్లు గాకున్నఁ గృష్ణుఁడు తనభార్యకుఁ గోపముతీఱుపం జనినను ఆపె తన్నిన నూరకుండుట నిజముగఁ గల్గునా? ఇట్టిచిత్రవృత్తాంత మెపుడైనను జరుగునా ? అనుడు నాపె నవ్వి పురుషులు కాలానుసారముగఁ గార్యములు నడిపెదరు దీనియాథార్థ్యము కాలాంతరమున మీకే గోచరం బగు నని యప్పటికి నూరకుండెను.

పిమ్మట నారాజపత్ని తనచమత్కారమును బురుషులకక్కుఱితియును గనుపఱుప నొకయుపాయ మారయం దొడంగినది. అంతఁ దన దాసీజనములో బిన్నవయసున నున్నట్టిరూపలావణ్యాతిశయముల నొప్పునట్టియొకజవరాలిం దెచ్చి తనయాభరణము లుంచి దాని నలంకరించి


తనయింట నుంచి కృష్ణ రాయలు వచ్చినతఱి మాటలమధ్యను దనపిన తల్లికూఁతురు తన్ను జూడ వచ్చిన దనియును అది తనయింట నుండు వఱకును దనకై యతఁడు తఱుచుగ వచ్చిన బాగుగనుండదనియును జెప్పినది. ఆమాటలు వినినతోడనే కృష్ణరాయని కాచిన్న దానిఁ జూచువేడుక యధిక మయ్యెను. కావున నాఁడు మొదలు తనభార్యం జూచునెపమున వేళగానివేళల వచ్చి తనమఱఁదలిఁ జూచి కొంచెముగా సంభాషింప నారంభించెను. దాని కతనిభార్యయు నర్థాంగీకారముగా నూరకుండుటకు సంతసించి యొకనాఁడు తనభార్యతోఁ దా నభ్యంజనముకాఁ గోరెద ననియును, తనమఱఁదలు తనభార్యయును దనకు రాణివాసంబుననే యభ్యంజన స్నా నాదికమును జేయింపవలయు ననియును దెల్పెను. దాని కాతనిభార్య సమ్మతింపక యనేకాటంకములు కలిగించినది. దాని కతఁడు కోపింపక యా పెను మిగులఁ బ్రార్థించిన నపు డాపె తా నేమియు ననలేనట్లుగ నభినయించి, మఱఁదలితో మాటలాడక దానిం గన్నెత్తి చూడకుండినచో నది వచ్చు ననియుఁ బల్కినది. దానికిఁ గృష్ణరాయుఁడు సమ్మతించి యభ్యంజనము చేయించుకొన నారంభించెను. తిరుమల దేవియును నదియ తనయభీష్టసిద్ధికిం దగినతఱి యనియెంచి యేదియో పని యున్నట్లుగా లోనికిం బోయి యొక తెరచాటున నొదిగి నిల్చి యుండెను అదియ యనుకూలసమయ మని కృష్ణరాయఁడు తనమఱఁదలి యొంటిపైఁ జెయి వేసెను.

తోడనే యాచిన్నదియును నొక కేక వేసి "మాయక్కతోఁ జెప్పెద నని పరుగిడఁ దొడంగినది కృష్ణరాయఁడు తత్తరమున నాబిత్తరి పాదములు పట్టుకొని లోనికిం బోవల దనియును, నావృత్తాంత మొరులకుం జెప్పవల దనియును బతిమాలుచుఁ దనచేతిభద్రముద్రికం దీసి దానిచేత నుంచి నీ కిది బహుమాన మిచ్చితి నని తెల్పెను. ఇట్టివృత్తాంతము రహస్యముగ లోపలనుండి చూచు చున్న తిరుమల దేవి కెంతయు సంతసము కల్పింపఁ దాను రాజుం జూచుసమయం బదియ యని యే


మియు నెఱుఁగనిదానివలె వచ్చి అయినదా అభ్యంజన మని పల్కి తనపెనిమిటి తత్తరపడుట చూచి నవ్వుచుఁ గార్యావసరమున శ్రీకృష్ణునంతవాఁడే యాఁడుదాని పాదములు పట్టఁగా యుష్మదాదులన నెంత యనుడు రాయనికిఁ కొంచెము గుండియ కుదుటఁ బడియె. అట్టిభర్తం జూచి తిరుమలదేవి నవ్వుచు "ప్రాణనాథ ! నీవు వగవం బని లేదు. ఇది నీయిష్టానుసారముగ నుండఁదగిన మగువయే. పురుషుల కక్కుఱితిం జూపుటకుఁగా నావలన నీపన్నాగము చేయంబడె నని తెల్పినఁ గృష్ణరాయఁడు నివ్వెఱగంది యిట్టివృత్తాంతములు పూర్వయుగములలోపల జరిగి యుండు ననుటకు సందియ ముండదు. కృష్ణుఁడును నటులనే చేసి యుండె ననుమాట నమ్మఁదగియే యున్నది. అని తెలిపి భార్యచమత్కృతి కెంతయు సంతసించెను.

తిమ్మకవి త్రిస్థలీదండకమును రచించెను. ఈతఁడు లలితకవనమునకుఁ బ్రసిద్ధుఁడు గావున రామలింగ మీతని కవననైపుణిం గూర్చి పల్కుచో, "ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్కు," అని చెప్పి యుండెను. ఈ వాక్యమునే మఱియొకకవి యింకొకవిధమున రసపుష్టి చేసి పద్యరూపముగాఁ జెప్పెను. అదెట్లనిన :-

"క. [2] లోకమునం గలకవులకు, నీకవనపుఠీవి యబ్బు నే కూపనట,
      ద్భేకములకు గగనధునీ, శీకరములచెమ్మ నందిసింగయతిమ్మా."

ఈతనిమృదుత్వశయ్య నగుపఱుచుపద్యములఁ గొన్నింటి నీవఱకే మనము వ్రాసి యుంటిమి. ఈపద్యంబున కొకకథ గలదు. దాని నిచ్చో వివరింతము.

ఒకకవి రాజదర్శనార్థము వచ్చి చిరకాలము వేచి యుండి దర్శనము గాకుండుటం జేసి సంస్థానకవి యగునీతిమ్మనం జూడ నిశ్చయించి యాతనికవిత్వవిఖ్యాతియు శక్తియుక్తులును వినియుఁ గనియు నున్నాఁడు గావునఁ బైపద్యము రచియించి యాతనిం గాంచి దానిం జదివెను.


తిమ్మన దానిని విని యాకవిశిఖామణి శయ్యాలాలిత్యమున కెంతయు సంతసించి తనచెవుల నున్న పచ్చలచౌక ట్లాతనికి బహుమానం బిచ్చి రాజ దర్శనమునకుం దోడ్కొని చనియెను. రాజును నవీనకవీంద్రుం జూచి యే ప్రశ్నంబును నడుగకముందె యాచౌక ట్లెవరిబహుమానం బని యడిగెను. అపు డాకవి వాని మీయాస్థానకవివరుం డగుతిమ్మన యిచ్చె నని తెల్పెను. ఆమాటలువిని "యేమికారణమున నాతఁడు వీని నిచ్చె" నని యడుగుడు నాకవి "యాతనిపైఁ బద్యము సెప్పితి నని విన్నవించెను. అపుడు రాజు దాని కెంతయు నాశ్చర్యమునొంది "యేదీ యాపద్యము విందము చదువుఁ"డనుడు నాకవియుం దానిం జదివెను. దాని విని కడు సంతసించి రాజు కవిం జూచి మీపద్యములోని "గగనధునీ" అనుశబ్దంబునకు మాఱుగా "నాకథునీ" అని యుంచినచోఁ బద్యమునడక మఱియు సొబగుగ నుండునుజుఁ డీ! యనియెను - అట్లే యుంచి యాపద్యము మఱలఁ జదివి దానియమకమున కెంతయు సంతసించి యాకవి ప్రభునిసరసత మెచ్చి తనచెవుల నున్న చౌకట్లం దీసి రాజున కందించి స్వామీ ! దేవరరసజ్ఞత కిది తగు బహుమానముకాదు. అయినఁ జంద్రున కొకనూలుపోగు అన్నట్టు లేను గవిచంద్రుండ వగు నీకీపారితోషికం బిచ్చెదఁ గైకొమ్ము అనుడు సరసుండు గావున రాయండు వాని నందికొని యాకవియౌదార్యసాహసములకు మెచ్చి యొకపళ్ళెరంబున వరాల నుంపించి యామీఁద నీచౌకట్ల నుంచి యాకవికి మరల బహుమానం బిచ్చెను. అనంతర మాకవి శిఖామణి దాని కెంతయు సంతసించి పనివిని యధేచ్ఛం జనియెను.

ఈతిమ్మన యొకానొకదినమున క్షౌరకుం బిలిచి పనిగొని వాని నేర్పున కెంతయు సంతసించి యొకపద్యము వ్రాసి యిచ్చి దీనిం గొని చని మంచికవి కిచ్చితి వేని నీకు రొక్క మెక్కుడుగ దొరకును బొమ్మనుడు మహాప్రసాద మని వాఁడు దానిం గొని కవులకుం జూప నారంభించె. అపుడు రామరాజభూషణకవి దానిచమత్కృతికి నలరి నాల్గువేలవరా లిచ్చి దానిని విలిచి తనవసుచరిత్రమునఁ గాలాంతరమున నుంచెనని వాడుక గలదు. ఆపద్యం బెద్ది యనిన :-

శా. నానానూనవితానవాసనల నానందించుసారంగ మే
   లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కానం దపం బది యో
   షానాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసియై
   పూసెం బ్రేక్షణమాలికామధుకరీపుంజంబు లిర్వంకలన్.

వసుచరిత్రము కృతినొందు సమయమున నున్న రాజు దీని విని వేయివరాలు చేయు నీపద్య మనుడు. రామకృష్ణుఁడు స్వామీ ! అంతమట్టుకు మాత్రమే మీర లిప్పించినఁ గవి కింకను మూఁడువేలు నష్టము అనుడు రాజు కారణం బేమి యని యడిగెను. అపు డాతఁడు క్షౌరకునివృత్తాంతము దెల్పెను. తిమ్మనకు ముక్కుతిమ్మన యని పౌరుషనామము గల్గుటకుఁ గారణ మీముక్కుపైని జెప్పినపద్యమే యని కొందఱియభిప్రాయము. ముక్కెక్కుడు గనుక నని కొందఱిమతము.

తిమ్మకవితమ్ముడును నతనిమేనల్లుఁ డగుమలయమారుతకవియును బ్రబోధచంద్రోదయముం దెనిఁగించిరి. అందులో వానింగూర్చి యీక్రిందివిధమున నున్నది :-

సీ. కలదు కౌశికగోత్రకలశాంబురాశిమం, దారంబు సంగీతనంది నంది
   సింగమంత్రికి బుణ్యశీల పోతమ్మకు, నాత్మసంభవుఁడు మల్లయమనీషి
   అతనిమేనల్లుఁ డంచితభరద్వాజగో, త్రారామచైత్రోదయంబు ఘంట
   నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మాలాం, బకు గూర్మితనయుండు మలయమారు

గీ. తాహ్వయుఁడు సింగనార్యుండు నమృతవాక్కు, లీశ్వరా రాధకులు శాంతులిలఁబ్రసిద్ధు
   లుభయభాషల నేర్పరు లుపమపరస, మర్థు లీకృతిరాజనిర్మాణమునకు.

అనుదీనింబట్టి దీనిలోని మొదటికవీశ్వరునియింటిపేరు నందివా రనియును, అతనితండ్రిపేరు సింగయమంత్రి యనియును, తల్లిపేరు పోచమ యనియును, కవిపేరు మల్లయ్య యనియును దేలినది.

ఇఁక రెండవకవి పైమల్లయకవికి మేనల్లుండు అతనిది భారద్వాజసగోత్రము, ఇంటిపేరు ఘంటవారు తండ్రిపేరు నాగధీమణి తల్లిపేరు అమ్మలాంబ మలయమారుతాహ్వయుఁ డగుసింగన యని కవిపేరు. ఈపద్యములఁబట్టి చూడఁగా ముక్కుతిమ్మనకు మల్లయకవి సవతితమ్ముం డనియును, సింగనకవి సవతిమేనల్లుం డనియును దేలినది. ఈసింగనకవికి మలయమారుతాభిధాన ముండుటంబట్టి యితఁడు తిమ్మకవికి మేనమామ యగుమలయమారుతకవికిఁ గుమారుని కుమారుఁడు గా నూహింపనై యున్నది.

ఈగ్రంథమునందును నాస్వాసాంతగద్యములో "ఇది శ్రీమదు మామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది అని చెప్పి యుండెను.

ఈకవులకు రాజయోగశాస్త్రమునందును. విశేషపరిశ్రమ గలదని చెప్పుట కీక్రిందిపద్యమే చాలి యున్నది. ఎట్లంటేని :-

చ. జలకము మూర్ధచంద్రసుధ షట్కమలంబులపూజ ధూపము
   జ్జ్వలతరబోధ వాసన-నివాళు సుషుమ్న వెలుంగు శౌర్యముల్
   తలఁపున నీగి బోనము సదాతననాదముఖంబు గాఁగ ని
   ష్కలుషతనీయనంతవిభుగంగన గొల్చు నిజాత్మలింగముల్.

ఈ కవులకవిత్వవిశేషమును శయ్యాచమత్కృతియునుం జూపుటకుఁ గృతిపతిని వర్ణించి చెప్పిన మఱియొకపద్య మీక్రింద వ్రాయు చున్నాను :-

"సీ. సరిలేనినీతిచాతురిచేత రాజ్యతం,త్రంబులు నడిపిన నడుపుఁ గాని
    అనిశము పుష్పచందనవనితాదిసౌ,ఖ్యంబులు నందిన నందుఁ గాని
    సమహితశక్తిని సదవవాసదను శా, సనలీల జరిపిన జరుపుఁ గాని
    సంగీతసాహిత్యసరసవిద్యావినోందంబులఁ దగిలినఁ దగులుఁ గాని

గీ. నీళ్లలోపలిసరసిజ నీదళంబు, సరణి నిర్లేపుఁ డైనసంసారయోగి.
   సందియము లేదు ప్రత్యక్ష శంభుమూర్తి, యీయనంతయగంగమంత్రీశ్వరుండు.

ఈ కవు లిర్వురును ముక్కుతిమ్మకవితమ్ముం డనియు మేనల్లుండనియునుం జెప్పుటం జేసి వీ రాతనిసమకాలీనులే యగుదురు లేకున్న ముప్పదినలువదిసంవత్సరములు చిన్న వారలైన నై యుందురు. వీరలు కృష్ణరాయలసమకాలీను లని గాని లేక యతనియల్లుం డగురామరాయల సమకాలీను లని కాని నిర్ణ యింపఁబడవచ్చును. వీరు దక్షిణామూర్తిదేవతోపాసనవలనఁ గల్గినవిశేషమహిమ వచోధోరణి గలవారలై యున్నారు. వీరలచేఁ జేయంబడిన యీక్రిందిపద్యమువలన నీమూర్తియెడ వీరికిఁ గలభక్తితాత్పర్యములు స్పష్టము కాఁగలవు.

ప్రబోధచంద్రోదయములోని దక్షిణామూర్తి వర్ణనము.

"సీ. ఎఱుఁగనివారికి నేదేవుఁడు ప్రపంచ, మవు మరీచికలు నీ రైనకరణి
    ఎఱిఁగినవారికి నేదేవుఁడు జగంబు, గాఁడు పగ్గము పాము గానికరణి
    ఏదేవుఁడు వెలుంగు నాదిశక్తియుఁ దాను, నెలయును నిండు వెన్నెలయుఁబోలె
    బ్రహ్మనాడ్యాగతప్రత్యక్పరంజ్యోతి, నా మించు నేదేవు నడిమి నేత్ర

గీ. మట్టిసర్వేశుతోడఁ దాదాత్మ్యమహిమ, గలిగి పరిపూర్ణ భావవిఖ్యాతు లైన,
   దక్షిణామూర్తిదేశికోత్తము నఘోర, శివుల భజియించి యేకాగ్రచిత్తమునను.

నందిమల్లన్న ఘంటమలయమారుతకవుల కాలనిర్ణయము.

పేర్కొనఁబడిన కవు లిర్వురును పైనిజెప్పిన తిమ్మకవికి సంబంధులని చెప్పితిమి. దానిం దెల్పుట కొకపద్యము పైకశ్వరులచే వారిర్వురవలన నాంధ్రీకరింపఁబడిన ప్రబోధచంద్రోదయ మనుగ్రంథములో వివరింపబడెను గావున దానింబట్టి చూడగా నది యీ క్రిందివిధమున స్పష్టమగును. ఇది యిట్లుండ "ఆంధ్రకవుల చారిత్రము" లో ముక్కుతిమ్మకవి కంటె మల్లయకవి ప్రాచీనుఁ డనియును, ఇందులోఁ జివరఁ జెప్పఁబడిన మలయమారుత కవికిఁ దిమ్మకవి మేనల్లుం డనియును మల్లయకవివలనఁ గృష్ణరాయనితండ్రి యగుసాళువనరసింగ రాజునకు వరాహపురాణము కృతి యియ్యంబడెనుగావున నీమల్లయకవి తిమ్మకవికంటెఁ బూర్వుఁ డనియును వ్రాయంబడియెను. కవులకాలనిర్ణ యమునకుఁగాను రాజుల కాలనిర్ణయమును జేయవలయును గావున ముందుగ నందుఁ జెప్పంబడినరాజులకాలము ప్రస్తుతములో నప్రస్తుత మైనను నీక్రింద సంగ్రహముగా వివరించెదను. ఎట్లన్నను :-

వరాహపురాణములో సాళువనరసింహరాజు వంశవర్ణనము చేయఁబడిన దనియును. అతనివంశములో-

1. గుండ్రాజు.
2. సాళువ మంగరాజు.
3. గౌతరాజు.
4. గుండ్రాజు.
5. తిమ్మరాజు.
6. నరసింహరాజు. లుండిరనియుఁ జెప్పెను.

ఆనరసింహరాజుకడ సేనాని సాళువయీశ్వరరాజు ఈశ్వరరాజు పుత్రుఁడు సాళువనరసింగరాజు. ఇతనివంశము తుళువవంశ మాయెను అని చెప్పి యీశ్వరరాజు ప్రతాప మీక్రిందివిధమున వర్నింపఁబడినట్లు చెప్పఁబడియెను. ఎట్లనఁగా :-

"సీ. ఉదయాద్రి భేదించె హుత్తరి నిర్జించె, గండికోటపురంబుఁ గదలఁద్రవ్వెఁ
    బెనుగొండ సాధించెఁ బెగ్గులూరు హరించె, గోవెలనెల్లూరు గుంటుపఱిచె
    గుందాణి విదళించె గొడుగుచింత జయించె, బాగూరు పంచముపాడు చేసె
    నరుగొండఁ బెకలించె నామూరు మర్దించె, శ్రీరంగపురమును బారిచమిరె

గీ. రాయచౌహత్తిమల్లధరా వరాహ, మోహనమురారి బర్బరబాహుసాళ్వ
   నారసింహప్రతాపసస్న హనుఁ డగుచు, విశ్వహితకారి తిమ్మయయీశ్వరుండు.

కృష్ణరాయనివంశములోఁ జెప్పంబడినయీశ్వరరాజునకు నీపై యీశ్వరరాజునకును భేద మేమైన నున్నదో లేక యీయిర్వురును నొక్కరుగా నెన్న వలయునో దానిం దెలియవలసి యున్నది. పారిజాతాపహరణములోపల, మనుచరిత్రంబులోపల నొకయీశ్వరరాజు వర్ణనము గలదు. దాని నిచ్చో వివరించి పిమ్మటఁ బైనంప్రశ్న మాలోచింతము. అందు మనుచరిత్రములోపలఁ గనుపించిన వంశావళియే యాముక్తమాల్యదలోఁగూడ గానుపించుం గావున ముందారెండుగ్రంథములలో వివరింపఁబడినవంశముం జూపుదము.

మనుచరిత్రము - ఆముక్తమాల్యద.

చంద్రుడు

|

బుధుడు.

"క. అతనికి యదుతుర్వసు లను, సుతు లుద్భవ మంది రహితసూదునులు కళా
    న్వితమతులు వారిలో వి, శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై."

"గీ. వానివంశంబు తుళువాన్వ నాయ మయ్యె,
    నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నంది
    నిఖిలభువనాభిపూర్ణనిర్ణిద్రకీర్తి
    నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి."

అను పై రెండుపద్యములవలనను తుర్వసువంశమువారికి మొదలనుండియుఁ దుళువవంశస్థు లని పేరున్నట్లుమాత్రము కానుపించును గాని సాళువవంశ మని చెప్పి యున్నట్లు కానుపించదు. తరువాత నున్న పద్యములో నీవంశములోఁ బ్రసిద్ధుఁడు తిమ్మరా జనియును, నతనికుమారుఁ డీశ్వరరా జనియును జెప్పెను. అదిఎట్లన్నను :-

"మహాస్రగ్ధర, ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి శఠకమతగ్రావసంఘాతవా తా
శనరా డాశాంతదంతిస్థవిరకిరులజంజాటముల్ మాన్పి యిమ్మే
దిని దోర్డండైకపీఠిం దిరముపఱిచి కీర్తిద్యుతుల్ రోదసిం బ
ర్వ నరాతుల్ నమ్రులై పార్శ్వములఁ గొలువఁ దీవ్రప్రతాపంబు సూపెన్."

ఈతిమ్మరాజుంగూర్చి పారిజాతాపహరణములో వ్రాయకయే,

"క. ఉర్వీశమౌళి యగునా, దుర్వసువంశంబునందు దుష్టారిభుజా
    దుర్వారగర్వరేఖా, నిర్వాపకుఁ డీశ్వరాఖ్యనృపతి జనించెన్."

అని వ్రాసెనుగాని తరువాతిపద్యములో నీశ్వరరాజుంగూర్చి వ్రాయుచుఁ దిమ్మయయీశ్వరుం డని వ్రాయుటంజేసి యాయీశ్వర రాజుతండ్రి తిమ్మరా జని తేలును.

"ఉ. రాజులనెత్తుటం బరశురాముఁడు వ్రంతలు చేసె రెండు మూఁ
    డీజగతిన్ గణింప నది యెంతటివిస్మయ మబ్జినీసుహృ
    త్తేజుఁడు కందుకూరికడఁ దిమ్మయయీశ్వరుచే జనించె ఘో
    రాజి బెడందకోటయవనాశ్వికరక్త నదీసహస్రముల్.

పారిజాతాపహరణములోని యీశ్వరరాజువర్ణనము.

ఈశ్వరరాజు మనుచరిత్రములో నీక్రిందివిధముగ వర్ణింపఁబడియెను :-

"చ. బలసుదమత్తదుష్టపురభంజనుఁడై పరిపాలితార్యుఁడై
    యిలపయిఁ దొంటియీశ్వరుడె యీశ్వరుఁడై జనియింప రూపఱెన్
    జలరుహ నేత్రలం దొఱగిఁశైలవనంబుల భీతచిత్తు లై
    మెలఁగెడు శత్రుభూవరులమేనులు దాల్చినమన్మథాంకముల్."

ఇపుడు మనము పై నుదాహరించినయిర్వురు యీశ్వరరాజులకును జెప్పంబడినవిజయముల నరయఁగలము. అందు వరాహపురాణములోని యీశ్వరరాజు జయములు చెప్పుటలో

1. ఉదయాద్రి భేదించెను.
2. హుత్తరి నిర్జించెను.
3. గండికోటపురంబు త్రవ్వించెను.
4. పెనుగొండ సాధించెను.
5. బెగ్గులూరు హరించెను.
6. కోవెల, నెల్లూరు గుంటుపఱిచెను.
7. కుందాని విదళించెను.
8. గొడుగుచింత జయించెను.
9. బాగూరు, పంచముపాడు చేసెను.
10. నరుగొండ పెకళించెను.
11. నామూరును గొట్టెను.
12. శ్రీరంగపురమును సమరెను.

అని యున్నది. పారిజాతాపహరణాదులలోని యీశ్వరరాజు కందుకూరికడ గొప్పయుద్ధము చేసి యక్కడ బెడఁదకోట తురుష్కుల యొక్కగుఱ్ఱపుదళములను రక్తప్రవాహము లగునట్లుగాఁ గొట్టె నని మాత్ర మున్నది. ఆమాత్రపువృత్తాంతమైనను మనుచరిత్రములోను


జెప్పంబడలేదు. కావున వరాహపురాణములోఁ జెప్పంబడినయీశ్వర రాజు మనుచరిత్రములోను, పారిజాతాపహరణములోను, జెప్పంబడిన తుళువవంశములోని యీశ్వరరాజు గాక సాళువవంశములోని యీశ్వరరాజుగాఁ జెప్పంబడుట సరియై యున్నట్లు కానుపించును. ఈసాళువవంశములోనివా రందఱును ప్రత్యేకముగా మండలాధిపతు లైనంగాక యంతకంటెను డక్కువస్థితి గలసామంతప్రభువులై యున్నట్లు కానుపించును. దానికి దృష్టాంతము జైమినిభారతములోని సాళ్వమంగరాజుం గూర్చి జెప్పెడియీక్రిందిపద్యము చాలియుండును. ఎట్లన్నను :-

"సీ. దురములో దక్షిణసురతాణి నెదిరించి, కొనివచ్చి సాంపరాయనికి నిచ్చె
    సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప, నాచార్యబిరుదవిఖ్యాతి గాంచె
    శ్రీరంగవిభుఁ బ్రతిష్ఠించి యిర్వదివేల, మాడ లద్దేవునుమ్మడికి నొసఁగె
    మధురాసురత్రాణు మడియించి పరపక్షి, సాళువబిరుదంబు జగతి నెరపె

గీ. గబ్బితనమునఁ దేజి మొగంబు గట్టి, తఱిమి నగరంపుగవనులు విఱుగఁద్రోలి
   తాను వ్రేసినగౌడునుద్దవిడిఁ దెచ్చె, సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.

అను దీనిలో నుదాహరింపఁబడినసాంపరాయఁడు మండలాధిపతిఁ ఇతనికడను సాళ్వమంగు సేనానాయకుఁడై యుండి కొన్నియుద్ధములలో సాంపరాయనికిఁ దటస్థములైనచిక్కులఁ దొలఁగించి సాంపరాయ స్థాపనాచార్యబిరుదము నందెను. ఈసాళ్వమంగు జైమినిభారతకృతిపతి యగు నరసింహరాజునకుఁ బ్రపితామహుఁడు. కాఁబట్టి వీరివంశములో నుండువారు మండలాధీశ్వరులని గ్రంథదృష్టాంతము లగుపడువఱకును వీరు కృష్ణరాయవంశస్థులకుఁ బూర్వు లని చెప్ప వలనుపడదు; అది నిశ్చయమగువఱకును నావంశములోనివారి కాలనిర్ణయము నాసిద్ధాంతము పైని నిర్ణయింపఁ గూడదు. ఇంతియ కాక పైసాళ్వవంశమువారు కృష్ణదేవరాయనికాలమువఱకును సాళ్వవంశనామముతో నుండిరి. కృష్ణదేవరా యనికడ మన్నన గలమంత్రి యైనతిమ్మరుసు సాళ్వవంశమువాఁడై యున్నట్లు కృష్ణరాయవిజయములోని యీక్రిందపద్యమువలనఁ గాన్పించును. ఎట్లన్నను :

చ. కరచరణాదు లందఱుకుఁ గల్గినయంతటనే సమర్థతన్
   మెరవడిఁ గాంచ నేర్తురొ మనీషివరుల్ ధరలోన నెవ్వ రి
   క్కరణి ఘటింపుచుం గృతయుగంబునఁ ద్రేతను ద్వాపరంబునన్
   దరయుగ సాళ్వతిమ్మసచివాగ్రణికిన్ సరిమంత్రి గల్గునే.

అని యుండుటంబట్టి కృష్ణరాయనిమంత్రి యగుతిమ్మన్న యింటిపేరుసాళువవా రనియును. కృష్ణరాయనివంశనామము "తుళువవంశమువారు" అనియును దేలినది.

కావున నీశ్వరనారసింహ రాజు కృష్ణరాయనికాలమునకుఁ బూర్వపువాఁ డని కాని అందుమూలముగఁ నతనికవీశ్వరు లగునందిమల్లయ్య, మలయమారుత కవులు కృష్ణరాయనికంటెఁ గాని యతనితండ్రి యగునరసింగరాయనికంటెఁ గాని పూర్వు లయినట్లుగాఁ గాని యిందు స్థిరపఱుపఁబడదు అట్లైనను గాకున్నను కాలనిర్ణ యసిద్ధాంతమున కా యంశము చాలదు. మల్లయకవి కాలనిర్ణ యమును నట్లే కావున నామార్గము వదిలి యిఁక మల్లయ, మలయమారుతకవుల కాలము పారిజాతాపహరణ ప్రబోధచంద్రోదయములను వ్రాసినవిధముననే నిర్ణ యించెదము. అందు మల్లయకవియును, ముక్కుతిమ్మనయు నొక్క తండ్రికుమారులుగను తల్లిమాత్రము భేదముగాను నున్నట్లు కాన్పించుటంజేసి వారు సమకాలీను లైనట్లుండినను నుందురు. యిద్దిఱుతల్లులలో నెవ్వరు చిన్నయో యాసంగతి కాని మల్లయ, తిమ్మనలలో నెవ్వరు పెద్దయో యాసంగతిగాని చెప్ప నాధారము లేదు. వీరిర్వురును సవతియన్నదమ్ము లగుటంజేసి సమకాలీను లని చెప్పుట కేమియు నభ్యంతర ముండదు. ఈయిర్వురకు నలుబదియేఁబదిసంవత్సరములు వ్యవధి యున్నదని చెప్పినను జెప్పవచ్చును. అటులైన సమకాలీనులే యని నిర్ణయించి యిప్పటి కీసంవాదము నిల్పెదను.

నందిమల్లయకవికి ముక్కు తిమ్మన మనుమఁ డని కాని, యిందులోఁ జెప్పంబడిన మలయమారుతకవియు, తిమ్మకవిమేనమామ యగు


మలయమారుతకవియు, నొక్కఁడే యని గాని చూపుటకు గ్రంథదృష్టాంతములు లేవు. అట్టిప్రతీతియైనను వ్యాపకములో లేదు. ప్రబోధచంద్రోదయ, వరాహపురాణములలోఁ బై యిర్వురు కవులకవిత్వ మున్నను దానిలో నేది యేకవికవిత్వమో చెప్పఁజాలము. కాని మాయిర్వురిలో మల్లయకవి ప్రథమగణ్యుఁ డవుటం జేసియును, రెండవకవి యగుమలయమారుతుఁ డాతనిమేనల్లు డగుటంజేసియుఁ బ్రథమకవియే ప్రధానగ్రంథకర్త యనియును, మొదల నుండియు సగముగ్రంథ మాతనికవనమే యనియును, తక్కినసగముభాగమును మలయమారుతకవి కవనం బనియును నూహింపఁదగియుండును. ముక్కుతిమ్మకవికిం గల మృదుకవనం ప్రబోధచంద్రోదయములోని పూర్వఖండములోఁ జూడ దగును. రెండవఖండములోని కవననైపుణి లెస్సగఁ బరికించినచోఁ బైకవనములోఁ గించిత్తు తక్కువయైనశయ్యతో నొప్పును, వరాహపురాణములోని మృదుతరభాగములు మల్లనకవి వనియును, నంతకుఁ గొంచెము న్యూనముగ నుండునది మలయమారుతకవికవన మనియును నిర్ణ యింప వచ్చును.

ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.

12

తెనాలి రామకృష్ణ కవి


ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు, శుక్లయజుశ్శాఖలోనివాఁడు. ఇతఁడు తనవంశముంగూర్చి పాండురంగక్షేత్రమహాత్మ్యములోఁ గొంత చెప్పియున్నాఁడు. అంతకు విశేష మగువృత్తాంతము లేమైనను "పాండురంగవిజయ మనుగ్రంథములో నుండవచ్చును. కాని యాగ్రంథ మా మూలాగ్రముగఁ బ్రస్తుతము దొరుకుట లేదు. నా మిత్త్రులు కొందఱాగ్రంథములోనికొన్ని యాశ్వాసములు చూచినట్లె చెప్పియున్నారు. కాని వారికే యది రామకృష్ణునికవిత్వమని చెప్పఁదగినట్లుగాఁ గనుపిం

  1. ముక్కుతిమ్మన
  2. మాకొలఁది జానపదులకు