కవి జీవితములు/తెనాలి రామకృష్ణ కవి
మలయమారుతకవియు, నొక్కఁడే యని గాని చూపుటకు గ్రంథదృష్టాంతములు లేవు. అట్టిప్రతీతియైనను వ్యాపకములో లేదు. ప్రబోధచంద్రోదయ, వరాహపురాణములలోఁ బై యిర్వురు కవులకవిత్వ మున్నను దానిలో నేది యేకవికవిత్వమో చెప్పఁజాలము. కాని మాయిర్వురిలో మల్లయకవి ప్రథమగణ్యుఁ డవుటం జేసియును, రెండవకవి యగుమలయమారుతుఁ డాతనిమేనల్లు డగుటంజేసియుఁ బ్రథమకవియే ప్రధానగ్రంథకర్త యనియును, మొదల నుండియు సగముగ్రంథ మాతనికవనమే యనియును, తక్కినసగముభాగమును మలయమారుతకవి కవనం బనియును నూహింపఁదగియుండును. ముక్కుతిమ్మకవికిం గల మృదుకవనం ప్రబోధచంద్రోదయములోని పూర్వఖండములోఁ జూడ దగును. రెండవఖండములోని కవననైపుణి లెస్సగఁ బరికించినచోఁ బైకవనములోఁ గించిత్తు తక్కువయైనశయ్యతో నొప్పును, వరాహపురాణములోని మృదుతరభాగములు మల్లనకవి వనియును, నంతకుఁ గొంచెము న్యూనముగ నుండునది మలయమారుతకవికవన మనియును నిర్ణ యింప వచ్చును.
ఆంధ్రపంచకావ్యకవులచారిత్రము.
12
తెనాలి రామకృష్ణ కవి
ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు, శుక్లయజుశ్శాఖలోనివాఁడు. ఇతఁడు తనవంశముంగూర్చి పాండురంగక్షేత్రమహాత్మ్యములోఁ గొంత చెప్పియున్నాఁడు. అంతకు విశేష మగువృత్తాంతము లేమైనను "పాండురంగవిజయ మనుగ్రంథములో నుండవచ్చును. కాని యాగ్రంథ మా మూలాగ్రముగఁ బ్రస్తుతము దొరుకుట లేదు. నా మిత్త్రులు కొందఱాగ్రంథములోనికొన్ని యాశ్వాసములు చూచినట్లె చెప్పియున్నారు. కాని వారికే యది రామకృష్ణునికవిత్వమని చెప్పఁదగినట్లుగాఁ గనుపిం
చలే దని చెప్పినారు. రామకృష్ణునిచే రచియింపఁబడిన గ్రంథము పాండురంగమాహాత్మ్యమే గాని విజయము కా దని సంప్రదాయజ్ఞులైన పురాతనపండితుల యభిప్రాయము. ఒకవేళ రామకృష్ణకవిప్రణీత మైన మఱియొకగ్రంథ మున్నను నుండవచ్చును. దానిపేరు పాండురంగవిజయమును గావవచ్చును. కాని యది లోకములో హాస్యరసప్రధానుఁడగు రామలింగకవిది కాక తన్నాముఁ డగుమఱియొకకవిదై యుండవచ్చును. కాదేని మఱియొకరిచే నది రచియింపఁబడి రామకృష్ణునిపేరిటఁ బ్రకటింపఁబడి యుండవచ్చును. అటు గానిచో నప్పకవీయాదిగ్రంథములలోఁ బాండురంగక్షేత్రమాహాత్మ్యములోని పద్యములే గ్రహింపఁబడి విజయములోనిపద్యము లేల కైకొనంబడవు. కావున విజయ మనుగ్రంథమును మాహాత్మ్యగ్రంథమువలెనే ప్రామాణికగ్రంథ మని గాని మాహాత్మ్యగ్రంథకర్త యగురామకృష్ణకవిరచిత మని కాని యంగీకరింపఁజాలము. ప్రస్తుతము మనము వ్రాయుచున్న చారిత్రములో రామకృష్ణునికులగోత్రములు మాహాత్మ్యగ్రంథములోఁ జెప్పఁబడినవిధము ననే వివరించుచున్నారము :-
రామకృష్ణకవిగోత్రాదికము.
వీనింగూర్చి మాహాత్మ్యములో నీ క్రిందివిధముగ నున్న యది.
"క. కౌండిన్యస గోత్రుఁడ వా, ఖండలగురునిభుఁడ వఖిలకార్యస్ఫురణన్,
గుండలితకుండలివి భూ, మండలవినుతుఁడవు లక్ష్మమావరతనయా."
అని యుండుటంబట్టి యితఁడు కౌండిన్యసగోత్రుఁడనియు నితని తల్లిపేరు లక్ష్మమ్మ యనియుం దేలినది. కృతిపతి యితనికవనముంగూర్చి కొంత శ్లాఘించినట్లుగా మఱికొన్ని పద్యము లున్నవి. అం దీతని నివాసస్థలము మొదలగునవి వివరింపఁబడినవి, ఎట్లన్నను :-
"క. నను రామకృష్ణకవిఁ గవి, జనసహకారావళీవసంతోత్సవసూ
క్తినిధిఁ బిలిపించి యర్హా, సనమునఁ గూర్చుండఁ బనిచి చతురత ననియెన్.
సీ. తగసంస్కృతముఁ దెనుంగుగఁ జేయఁ దెనుఁగు సం,స్కృతముగ జేయంగఁజతురమతివి
నలు దెఱంగుల వాక్య నవసుధాధారల, ఘనుఁడ వాశువునందుఁ గరము మేటి
వఖిలభూమీపాల కాస్థానకమలాక, రోదయతరుణసూర్యోదయుఁడవు
శైవవైష్ణవపురా ణావలినా నార్థ, ములు నీకుఁ గరతలామలకనిభము
గీ. లంధ్రభూమికుచా గ్రహారాభ మైన, శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత వగ్ర
శాఖకోకిలమవు నీవు సరసకవివి, రమ్యగుణకృష్ణరామయ రామకృష్ణ.
పై పద్యములవలన రామలింగము కవిత్వ విశేషములు తెలిసినవాఁడే కాక, యతఁ డాంధ్రదేశములోని తెనాలి యను నగ్రహారము నేర్పర్చినవాఁ డనియును, యాజ్ఞవల్క్యశాఖ (శుక్ల యజుశ్శాఖ) లోని బ్రాహ్మణుఁ డనియును, నతనితండ్రిపేరు రామయ్య యనియును దేలినది.
రామకృష్ణకవి కవిత్వవిశేషములు.
పై రెండుపద్యములలో నీతనికవిత్వవిశేషములుగూడఁ గొన్ని కాన్పించుచున్నవి. దానింబట్టి రామకృష్ణుఁడు సంస్కృతమును దెనిఁగించుటలోను, దెనుఁగును సంస్కృతము చేయుటలోను జతురుఁ డనియును, జతుర్విధకవితావిశారదుఁ డనియును, నాశుకవిత్వనిపుణుఁ డనియును శైవ వైష్ణవపురాణసార వేది యనియును దేలినది. మఱియొక పద్యమువలన నీతనితో సమాను లాంధ్రకవులలో లేరనియుఁ దేలుచున్నది. ఆపద్యము కృతిపతి రామకృష్ణునింగూర్చి చెప్పినట్లుగా నున్నది. అది యెట్లన్నను :-
మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునన్ జుట్టిరా
విదితం బైనమహిన్ మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢి నీ
కెదు రేరీ సర సార్థబోధఘట నా హేలా పరిష్కారశా
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా సాంద్ర కీర్తీశ్వరా.
రామకృష్ణకవిమతము.
రామకృష్ణుఁడు గ్రంథాంతమునందు రచియించినగద్యముంబట్టియును, నతఁడు గ్రంథారంభములోఁ గృతిపతింగూర్చి వ్రాసిన వర్ణనముంబట్టియు నతండు వైష్ణవమతప్రవిష్ణుఁ డని స్పష్ట మగుచున్నది. రామలింగనామము రామకృష్ణుఁడుగా మాఱినను మాఱవచ్చును.
వైష్ణవమతప్రవిష్టుఁ డగుటకు గద్యములోని పరమపదసనాథశబ్దమే చాలియుండును. ఆగద్య మెట్లన్నను :-
"ఇది శ్రీమత్పరమపరమపద నాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత సరస కవితాసనాథ రామకృష్ణకవినాధప్రణీతం బగుపాండురంగ మాహాత్మ్యము."
అని యున్నది. కృతిపతి యగువిదూరివేదాద్రిమంత్రి నీక్రింది విధంబున వర్ణించెను. అదియెట్లన్నను :-
సీ. తనకులాచారవర్తన వైష్ణవాచార, పర్యాయముల కోజబంతి గాఁగఁ
దననూనృతము పురాతనసత్యవిధులయు, న్నతికిఁ బునఃప్రతిష్ఠితము గాఁగఁ
దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు తెల్ల,ముగఁ దెల్పు నాఖ్యానముద్ర గాఁగఁ
దనవ్రాయుగంటంపు మొనవాఁడి విశ్వంభ, రాప్రజలకుఁ బ్రాణరక్ష గాఁగఁ
గీ. వెలయ మంగయగురవభూవిభుని పెద్ద, సంగభూపాలమణిరాయసంప్రపత్తి
జయయుతుం డైన రామానుజయ్యసుతుఁడు, భద్రగిరివిదూరివేదాద్రిశౌరి.
కృతిపతిప్రభుఁ డగుసంగభూపాలునిఁగూర్చి.
ఈరామకృష్ణకవి తనకృతిపతియాధిత్యమును దెల్పుటకుఁ గా నాతనిప్రభుం డగుపెద్దసంగభూపాలునివిశేషము లీక్రింద వివరించుచున్నాఁడు. కవికాలమును, కృతిపతికాలమును నిర్ణ యించుటకుఁగానప్పటి రాజులకాలవిజ్ఞాన మవసర మైనది కావున నాయంశముల నీక్రింద వివరించెదను. అవి యెవ్వి యనఁగా :-
"వెండియు నవ్వేదాద్రిమంత్రీశ్వరుండు రవికులతిలకుండును, నఖండితభాగ్యవర్ణ పూర్ణలలాటఫలకుండును, పూర్వసింహాసనాధీశ్వరుండును, సతతసమారాధిత నిర్మలసంగమేశ్వరుండును, రాయరాహుత్తుండును, లోకోత్తరగుణోత్తరుండును, రణరంగధీరుండును, అంబునిధిగంభీరుండును, భట్టారబాహాంకుండును, నకలంకుండును, నరవత్తారుమండలీకరగండండును, నుద్దండభుజాదండుండువై, పరనారీ సహోదరుండును, నితరనరవర సముపార్జితకీర్తివధూవల్ల భుండును, గోపికాగోవిందుండు నయ్యును నీశ్వరలక్షణలక్షితుండును, పొన్నాంబరదేవరదివ్యశ్రీపాదపద్మారాధకుం డయ్యును, ప్రతిష్ఠాపిత పరమవైష్ణవ కుటుంబవిశేషుండును, నయినఘనుని"
అనియును
"గీ. గుఱుతు గలరాజుమంగయ గురవరాజు, పుత్త్రు పెదసంగభూపాలుశత్రుజైత్రు
భామసహాతేజు విద్యావిధానభోజుఁ, గొలిచి వేదాద్రినిత్యలక్ష్ములఁ దనర్చు".
సూర్యవంశము
|
మంగరాజు
|
గురువరాజు
|
పెద్దసంగమరాజు
ఇందులోని పెద్దసంగమరాజు పూర్వసింహాసనాధీశ్వరుఁ డని యుండుటంబట్టి తూర్పుదేశములోనిసింహాసనముగలవాఁ డని తేలును. "తూర్పు"అనఁగా నేదేశమునకుఁ దూర్పని యూహింపవలసి యుండును. అప్పటికిఁ గృష్ణరాయ లుండువిజయనగర (అనిగొందె) సింహాసనమునకుఁ బశ్చిమరాజ్యసింహాసన మని ప్రసిద్ధి యుండుటంబట్టి యీపూర్వ సింహాసన మానిగొందెకుఁ దూర్పుగా నున్న యాంధ్రదేశసింహాసన మని తెలుచున్నది. సంగమేశ్వరపూజారతుఁ డని చెప్పుటచేత సంగమేశ్వరక్షేత్రములోనియీశ్వరపూజాపరాయణుఁ డని తేలును. ఈసంగమేశ్వరక్షేత్ర మెచ్చోటిది యని శంక పొడముచున్నది. అది గోదావరీమండలములోని రామచంద్రపురము తాలూకాలోనిమాండవ్యపురా వరనామమున నొప్పుమండపేటకును, నచ్చటికే క్రోసుదూరములో నున్న యేడిధె యనుగ్రామమునకు మధ్యమునం దొకగ్రామ ముండును. అది చిరకాలముక్రిందటనే చెడిపోయెను. అది ప్రస్తుతము మనము వ్రాయుచున్నప్రభునిది కాదు. రెండవసంగమేశ్వరము పూర్వ ముదయగిరిసీమలోఁ జేరినచింతకుంటతాలూకాలోని యాణిమలసముతులోని దైనట్లుగా నచ్చటికైఫియతులో నీపైరాజువంశావళి చెప్పుటచేత నూహింపనై యున్నది, (See Local Records Vol. VII page 47)) చింతకుంటతాలూకాకైఫియతు - అందులో దేవాలయమునకు దక్షిణ భాగమున నేటియొడ్డున సదాసివరాయని కాలములోని శాసన మున్నది. అదెట్లన్నను :"శ్రీసదాశివదేవమహారాయలు విజయనగరమందు రత్న సింహాసనస్థుఁడై రాజ్యమేలుచుండగా సూర్యవంశస్థులైన శ్రీమన్మహామండలేశ్వర, సంగరా జను నాయన తత్పూర్వమందె యీసంగమేశ్వరస్థలమునకు దక్షిణభాగమందు పరుగుదూరమున గ్రామము గట్టుకొని పదియిండ్లరాచవారిని గూర్చుకొని యాపల్లె వారిజాగీరుగా ననుభవించుచుండిరి అందుచే నది రాజుపాలెం" అని చెప్పఁబడును.
సంగరాజుకుమారులు :-
1. బొమ్మ రాజు.
2. మంగ రాజు.
3. గురవ రాజు. (శైవుఁడు) ఇతనికిఁ గొడుకులు తొమ్మండ్రు గలిగిరి. వారి, పే ళ్లెవ్వి యనఁగా :-
1. పెదసంగ రాజు.
2. చినసంగ రాజు.
3. తిమ్మ రాజు.
4. రుద్రరాజు.
5. బసవరాజు.
6. పెడచిట్టిరాజు.
7. చినచిట్టిరాజు.
8. బొజ్జసంగ రాజు.
9. పాపసంగ రాజు.
పై గురవరాజు దేవునియుత్సవములకు గడువక తనకుటుంబ సహితముగ విద్యానగరమునకుం బోయి శ్రీరంగరాజు, రామరాజుల ద్వారముగ సదాశివరాయలను దర్శించి, యాయనవలన నాల్గుగ్రామములు స్వామినిమిత్తముఁ గైకొనియెను. ఇది జరిగిన కాలము శా. సం. 1465 శోభకృత్తు సంవత్సరము (A. D. 1543)
పై కథనుబట్టి పెదసంగ రాజుకాలమును, అతనిమంత్రియుఁ గృతిపతియు నగువేదాద్రికాలమును, కవియగురామకృష్ణుని కాలమును మన మించుమించుగా నూహింపవచ్చును. పైగురవరాజును నతనితొమ్మండ్రుకొడుకులును బై శాశనములో వక్కాణింపఁబడుటచేత నప్పటి కతఁడు మిక్కిలి ముదుసలియై యుండవచ్చును. గురువరాజునకుఁ జెప్పంబడ నిరాయరాహుత్తు మొదలగుబిరుదులు పెద్దసంగమ రాజునకుఁ గల్గుటంబట్టియుఁ బూర్వసింహాసనాధీశ్వరుం డని యుండుటంబట్టియుఁ జూడఁగా నీ పెద్దసంగరాజునాఁడు విశేషవిభవంబు గల్గినట్లు గోచరంబయ్యెడిని. అట్టివిభవము గల్గుట క్రమముగా నానెగొందిప్రభువుల యనుగ్రహం
బున నైనను గావచ్చును. కాదేని సదాశివరాయలకాలములో నాదేశమునఁ గల్గినయ రాజ కావస్థలో సింహాసనమును సంపాదించి యైనను నుండవచ్చును. ఇది శా. సం. 1450 ల సమీపకాలముగా నిశ్చయించుటకుఁ దగి యుండును.
పై వేదాద్రిమంత్రికాలమును నాతనిగురుం డగునాళువందారు కందాళయప్పయాచార్యులకాలముంబట్టియు నిర్ణ యింపఁదగి యుండును. అతనివర్ణనము రామకృష్ణునిచే నీక్రిందివిధముగఁ జేయంబడియెను. ఎట్లన్నను :-
సీ. వేదమార్గప్రతిష్ఠాదైవతజ్యేష్టుఁ, డభ్యస్తషడ్దర్శనార్థరాశి
యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత, యఖిలపురాణేతిహాసకర్త
బంధురదివ్యప్రబంధానుసంధాత, పంచసంస్కారప్రపంచచణుఁడు
వాధూలమునిచంద్ర వంశవర్ధనమూర్తి, సకలదేశాచార్యనికరగురువు
గీ. పట్ట మేనుంగు శ్రీరంగపతికి నణ్ణ, గారుగ ర్భాంబురాశినీహారరశ్మి
సారసాహిత్యసర్వస్వశయ్యవేది, యాళువందారుకందాళయప్ప గారు.
వైష్ణవగురువులలో ముఖ్యు లగువారిచారిత్రములు ప్రపన్నామృతము మొదలగుగ్రంథములలోఁ గాలనిర్ణయముతోఁగూర్చి చేర్చంబడి యున్నవి. అవి యన్నియును వేఱుస్థలములలోఁ జేర్పంబడును గావున నందలివిశేషములు గాని కాలనిర్ణయము గాని వ్రాయను.
ఈవఱకును మనము వ్రాసిన రామకృష్ణునిచారిత్రము గ్రంథస్థమైనదియు సంశయింప నవసరము లేనిదియునై యున్నది. ఇఁక ముందు వ్రాయువృత్తాంత మంతయును లోకమువాడుకంబట్టి వ్రాయునదియై యున్నది. ఎట్లన్నను :-
రామకృష్ణునిజన్మాదికము.
తెనాలిరామకృష్ణుని (రామలింగము) వాసస్థలము కృష్ణామండలములోనిగార్లపా డనునొక గ్రామము. దానిచే నీతని యింటిపేరు గార్లపాటి [1] వారనియుం జెప్పఁబడును. ఈతని చిన్న నాఁడె తండ్రి గతిం
చెను. అనంతర మీతనిమాతులుం డితనిని దనగ్రామం బగు తెనాలికిం గొంపోయి యచ్చో నీతనికి నామకరణాదికర్మంబుల జరిపెను. ఆగ్రామమున రామలింగేశ్వరుం డనునొకదేవుఁడు గలడు. ఈచిన్న వాని కాతని నామమే యుంచినట్లు వాడికొనంబడెడి. ఇతనిచారిత్రము మిగుల వినసొంపగు చమత్కారములు గల్గి చదువువారల కెంతయు సంతసంబు పుట్టించును. ఈతఁడు హాస్యప్రవర్తనమున కెంతయుఁ బ్రసిద్ధుఁడు. ఆంధ్ర భోజుం డనఁ బరఁగిన కృష్ణరాయలయాస్థానమున నితఁడు హాస్య కాళిదాసు. అష్టదిగ్గజములలో నొక్కఁడు. తక్కుంగలదిగ్గజములు పెక్కురు వాక్చాతురీధురీణు లైనను రామలింగమున కెల్లప్పుడుఁ జిక్కిరి గాని ధిక్కరింపఁ జాలరైరి. ఇట్టియీతనిధిక్కారంబుల మన మిపుడు వ్రాయవలయు నైనను, ఈతనిబాల్యావస్థఁ గొంత తెలిపి పిమ్మట దానిని వ్రాయుదము. దీనిం దెల్పుకథలు పెక్కులు గలవు. అందు మిగుల విరుద్ధంబులు కానివాని నిపు డిట వక్కాణించుట యుక్తము. ఇతనికి మేనమామ యక్షరాభ్యాసము సేయించి యొకయుపాధ్యాయుని కొప్పించె. అపుడు రామకృష్ణుండు బాల్యచాపలంబున బడి కరుగక కడు దుడుకుఁదనము సేయుచు నెడనెడ నుపాధ్యాయునిం గని తడబడఁ బాఱుచుఁ బట్టువడినతఱి నాతనినుడి పెడచెవి నిడి పుట్టలఁ, బూరుల దాఁగుచు, సాయంసమయమున నిలు సేరి యచ్చో నారాత్రి వసియించి వేకువఁ బరాకు లేక పలాయనము సేయుచుండెను. ఇట్టిస్వేచ్ఛావిహారంబునఁ దోడిబాలురతోడ నాడుచుండు సమయంబున నొకనాఁడు సిద్ధుం డొక్కరుండు తన్మార్గంబున నేతెంచుచు వచ్చి రామకృష్ణుని జూచి వానితేజోవిశేషంబులకు సంతసిల్లి డగ్గఱి వర్ణం బేమి యని డిగియ బ్రాహ్మణుం డౌటఁ దెలిసికొని సంతసించి యిట్లనియె.
సిద్ధుం డుపదేశించుట.
ఓబాలకా ! యిదె నీ కొకమంత్ర ముపదేశ మిచ్చెదఁ గైకొమ్ము. దానిఁ గొని నీవు కాళి, ధ్యానించినచో నీ కాయంబ వాసరంబు
లోపల సాక్షాత్కరించి నీకోర్కుల నెల్ల సాఫల్యము నందించు. నాకు నిర్యాణకాలము సమీపించినది. నాతో నీమంత్ర మంతము నందును. తనచే నభ్యస్తం బగువిద్య నొరుల కెఱింగింపక తనతో నంతంబు నొందింపఁ బ్రహ్మరక్ష స్సగు నని శాస్త్రము గలదు. కావున నీవు దీని విఫలంబు గాకుండ నుపాసించి మను మని తన్మంత్రము ససాకల్యముగ నుపదేశ మిచ్చెను.
కాళిదేవి ప్రత్యక్ష మగుట.
అనంతరము రామకృష్ణుం డామంత్రప్రభావం బెంతమాత్రమో చూత మని యానాఁటిరేయిఁ గాళీదేవళంబులోనికిం జని యెంతయు నియమమున నాపె నుపాసించిన, నాదేవి భక్త పరాధీన గావున నాతనికి సాక్షాత్కరించినది. ఆట్లావిర్భవించినభవానిం గని రామకృష్ణుండు కింకరుండ నని యంజలి యొనర్చి వినమ్రుండై యుండఁగా నాదేవి కరుణించి తనవామదక్షిణకరంబుల మెఱుయుచున్న స్వర్ణ రజతపాత్రంబులం జూపి యిందొకదానిలోఁ బెరుఁగు, నింకొకదానిలో బాలు నున్న యవి. వానిం గ్రోలినవారలకుఁ గ్రమంబున విద్యయు. నైశ్వర్యంబును జేకుఱును. అని తనహస్తంబుల నత్తుకొని యున్న చషకయుగంబుఁ జూపి నీ కిం దెద్ది వాంఛితంబో వేఁడు మనుడు, రామకృష్ణుం "డమ్మా ! నాకు వీనియందలివిశేషంబు లేర్పరింప రాకున్నవి. చూచికొన నిచ్చెదవేని కల తెఱం గెఱిఁగింతును" అని యా రెంటి గైకొని యొక్కపరి వానిలోని దధిక్షీరంబులఁ దనగొంతునం బోసికొని మ్రింగి "అమ్మా! రెండును రుచ్యంబులే కావున నా రెంటింగూడ నుంచితిని గినియకు మా "యని నవ్వెను. దానికిం గనలి శర్వాణి "యోరీ నాయాజ్ఞోల్లం ఘనంబుఁ జేసితివి.
కావున నీవు విద్వాంసుండ వయ్యును వికటకవి వగుదువు పొమ్మని శాపంబిచ్చెను. అపుడు రామకృష్ణుఁడు "తల్లీ ! నా యజ్ఞానంబు సైఁపుము. తనయుని తప్పులు తల్లి మన్నింపకున్న నిఁక వానికి శరణ
మెవరు గలరు. తల్లి విషమిడినను, తండ్రి ధనికుల కమ్మఁ జూపినను బిల్లలకు దిక్కెక్కడిది?" అని దీనాలాపంబులఁ బ్రార్థించిన నెట్టకేల కాయమ్మ కరుణించి "వికటకవి వయ్యు రాజసన్మానము గాంచెదవు రాజ సభాభూషణంబ వయ్యెద" వని వర మిచ్చి యంతర్హిత యయ్యెను.
తాతాచార్యులఁ జూచుట.
అపుడు రామకృష్ణుఁడు నిజనివాసంబున కేతెంచి నివుఱు గప్పిన నిప్పువలెఁ దనసామర్థ్యము గుప్తము సేసికొని కొన్నిదినము లుండెను. అనంతర మొకనాఁ డిట్లు చింతిచెను. నాకుఁ గాళికాదేవి రాజసన్మానము గల్గు నని వర మిచ్చినది. దాని కేమి? ముందుగఁ తత్సాన్నిధ్యమునఁ బ్రవేశము గల్గు టెట్లు? ఇంతియ కాక నేను విద్వాంసుఁడ నని యొరు లెఱుంగనిసమయమున నానామము వ్యాపక మౌట కేది యుపాయము? "అందలిమ్రానిపండ్లకు నఱ్ఱు చాఁప నేల?" యని యూరకున్నచో భుక్తిముక్తు లలవడు టెట్లు? ఎట్లైనను రాజానుగ్రహము సంపాదించుట ముఖ్యము." అని రాజగురుఁ డగుతిరుమలతాతాచార్యుల (లక్షగోదానముల తాతాచార్యులను)జూడఁ జని తనయభీష్ట మెఱిఁగించెను. అతఁడు సమయ మగునపుడు కార్యము చేసెద నని తెల్పెను. నాఁట నుండియు రామకృష్ణుం డహరహమును తాతాచార్యులఁ జూచుచు వేఁచియుండెను, ఇట్లు చిర కాలమయ్యెను. అంత నొక్కనాఁడు రామలింగము తనలోఁ దా నిట్లు చింతించెను. అద్దిరే తాతాచార్యుం డెంత మోసగాఁడు.
తాతాచార్యుని మోసపుచ్చుట.
తత్కాలోపయోగము లైనకొన్నిమాటలాడి తుదిఁ దన్నుంగాదన్న ట్లూరకున్న వాఁడు. సమయము వచ్చిననేకాని యెవ్వరిస్వభావమును దెలియఁబోదు. ఇట్టిమోసగానియెడ నయం బనయంబును గూడనిపని
రాజు కింకరులం బంపుట.
ఆచార్యుఁడును దన కగునవమానము తలవంపులు తేఁగా నితరులకు ముఖము సూపలేఖ తల వంచి తనయంగమచ్చము మాటుపడ నడువఁదొడఁగెను. ఇట్లుండ రా జాతని దూరమునుండి పొడగాంచి గురుం డని నిశ్చయించి నిజభటులఁ గొందఱం బిలిచి యాయిరువురం జూచి వారిలోఁ బైవానిని గ్రిందికి దిగఁ ద్రోసి మర్దించి మా సమ్ముఖమ్మునకుఁ దెం డని యాజ్ఞ యొసంగెను.
కింకరు లాచార్యుని దండించుట.
అపు డాకింకరులు భయంకరాకారంబున శంకాతంకములు లేక జమునికింకరులవడువున బయలువెడలిరి. ఇట రామకృష్ణుఁడు పైనుండి చూచి యావృత్తాంత మంతయు నిమిషమాత్రమున గ్రహించి జాగ రూకత కది సమయ మని యెంచి పుడమిపైఁ బడ వడి నుఱికి యాచార్యులపాదములు పట్టుకొని యిట్లనియె. "స్వామీ! నాయపరాధమును సైపుఁడు. స్వాములప్రభావం బీవఱకుఁ దెల్లము గాకుండుటం జేసి యిట్టి యెగ్గు గావించితిని. ఎఱిఁగియెఱిఁగి యనర్థావహ మగుతావున నెట్టియౌన్నత్యము గల్గినను నుండుట మాబోంట్లకుఁ దగనిపని. నా ప్రవర్తనము నాకే భయదాయియై యున్నది. ఇట్టిసమయమున దేవర పాదములు దక్క నా కభయదాయక మింకొకటి గలదే? కావున నిఁక నీపాదములు నాయౌదల నుంచి నన్ను రక్షింపుమని యాతనిఁ దన భుజంపై నెక్కించుకొని నడువఁదొడఁగెను. రాజగురుఁడును మెల్లఁగఁ గూర్చుండి రామలింగనిప్రతిపత్తికి నచ్చెరు వంది బుధజనాపరాధమునఁ గల్గుదోసము విని కిపుడు పొసంగందోఁప నోవు. మత్ప్రభావము వీని కిప్పటికిఁ దోఁచినట్లు గాన్పించుచున్నది" అనుచు స్వస్వరూపానుభవము సేయుచు నానందాబ్ధిమగ్నుఁడై మార్గాయాన మపనయించు కొనుచు బ్రహ్మరథమున నిజమనోరథములు సిద్ధించునట్లుండెను. అంతలో భూపతిభటు లేవునఁ జనుదెంచి కోపము దీపింప వీఁపునం బఱిచి
గొబ్బున నేలకు దిగద్రోసి మొగముచూడక గాలపాశానుకారిపాశ జాలముల నాభీలముగ గురుబలిని బంధించి కొట్టుఁడు, మట్టుఁ డనుచుఁ జెట్టలు ప్రేలుచు రాజమందిరము ప్రవేశించి యాతని రాజేంద్రునకుఁ జూపిరి.
రాయఁడు పరితాపము నందుట.
అపుడు రాయఁడు గురునిజూచి ఱాపడి కొంతవడికి దెలిసి అహా ! గురుద్రోహి నైతి నిఁక నాకుఁ దారక మేది? అని కన్నీరు నించుచు "దేశకేంద్రా ! నాయపరాధము సైఁపుఁ డని" పాదముల మీదఁ బడియుండెను. అట్టివానిం గాంచి గుర్వవసాన వాక్యముల నిట్ల నియె. "లెమ్మా రాజశేఖరా" యని యాతని గ్రుచ్చి యెత్తి "ఓభూపతిపుంగవా ! నా కగునవమానమునకు వగవకుము. ప్రారబ్ధ మనుభవింపక తప్పించికొన నేరితరంబు? విధి యలంఘనీయము" అనునాచార్యుం జూచి వృత్తాంత మంతయుఁ దెలిసికొని లయకాల భైరవునిమాడ్కి భీషణాకారుఁడై "దీనికిఁ గుదు రగునీద్రోహిని జమునిమందిరమున కనిచెదఁగాక" యని నిజకింకరులం జూచి "వీనిం దోడ్కొని చని మీఘోరతరకర వాలములచే శిరస్సు తెగనఱికి రం" డని యాజ్ఞ యొసంగెను.
రామలింగని శిరస్సు నఱకుమనుట.
రాజకింకరులు నాతనిం గొని యొకవనికిం జని వధియింప నుండుచో రామకృష్ణుఁడు వారికి ధన మొసంగి సమాధానము చేసికొని యొక మేఁకం జంపి తద్రక్తసిక్తమయినమీహేతి భీతి తొలంగి రాజునకుం జూపుం డని వారిం బంచి తా నింటికిం జని స్వగృహోపరి చంద్రశాలాంతరస్థాయి యై ప్రచ్ఛన్న వేషముతో నుండి తనతల్లిం బిలిచి యిట్లనియె. అమ్మా ! నీకోడలిం దోడ్కొని చని యేడ్చుచు రాజసభాభవనంబుకుం జని యచ్చోటున భూపతిపాదభూపతితు లై యుండ నాతఁడు కారణ మడుగును. అపుడు భుక్తికిఁ గర్మకుఁ గొంతధన మడు
గుము. దానిచే మనకుఁ గొంతధనము రాఁగలదు. అని వారిం బనిచిన, వారును రోదనము సేయుచు రాజుం గాంచిరి. అపు డతఁడు కరుణాతరంగితాంతరంగుడై తత్కాలక్రియలకుఁ గొంతరొక్క మిచ్చిమాసవేతనమును నియమించెను. ఈవృత్తాంత మంతయుఁ దెలిసికొని రామకృష్ణుఁడు నిజమాయోపాయములకు నలరి గ్రానవాసోదైన్యము లేక సుఖముగ నుండెను.
రామకృష్ణుఁడు పిశాచవేషమును ధరించుట.
ఇట్లుండ నొకయాఱుమాసములు గడచినవి. ప్రచ్ఛన్నుఁడై మిద్దెయింట నుండి రామకృష్ణుఁడు రక్కసిక రాట మొకటి లక్కతోఁ జేయింపఁ దనవారల కాజ్ఞ యొసంగెను. తానును స్వర్గవిశేషదర్పణమనునొకగ్రంథము రచియించుచుండెను. తూర్ణమ యారెండును సంపూర్ణము గాఁ గని చీలమంలల నంటునొకనీలకంచుకము గుట్టించెను. ఇట్టివస్తుసమితిం బూని యొకనాఁటిరేయి మధూచ్ఛిష్టపువత్తియు గుగ్గిలపు తిత్తియుఁ బదిలంబు సేసికొని యొకగుడ్డపేలిక నగ్గి దగిల్చి యొడినిండఁ జిఱుతఱా లుంచుకొని నిజగృహము వెడలి తత్సమీపమున నున్న బహుపాద్విటపివిటపాగ్రమునకు నెక్కి యొరులకుఁ గానరాకుండ నడఁగి మడఁగి యాకులచాటు పిందెకైవడి నుండెను. ఆవాసరము హరివాసర మగుడు నుపవాసమునఁ గృష్ణరాయఁ డచ్చోఁ బండితజనపరివేష్టితుఁడై వచ్చి నిలిచెను. అపు డాచార్యుఁడు భాగవతము చదువ నారంభించి హరికథాసుథారసమున సభ్యులమనస్సును దనియింపుచుండెను. అట్టి సమయమునఁ బై నున్న రామకృష్ణుఁడు కంచుకము దొడిగి కరాటము శిరో వేష్టనముగ నమర్చి చేత నున్న యగ్నినిఁ బ్రజ్వరిలం జేసి వత్తి ముట్టించి క్రిందికిఁజనుదెంచి యూడలసమీపమునఁ గూర్చుండి పండితులపై ఱాలవాన గురిపించెను. వార లదియెద్ది యని తలలెత్తి మిన్నుం జూడ రామకృష్ణుడు తనచేత నున్నదీపము గుగ్గిలముచేఁ బ్రజ్వరిలం జేసి కరాటమున నున్నకరాళవక్త్రమును భీషణదంష్ట్రలును మిడిగ్రుడ్ల
ను జూపి తా నూర్ధ్వగామి యయ్యె. అపుడు సభ్యు లందఱును భయకంపితాంగు లగుచు లేచి దయ్యము దయ్య మని యొక్క పెట్టున బొబ్బ లిడుచు నలుఁగెలంకులఁ బరువు లిడిరి. అపుడు రామకృష్ణుఁడు దీపము సూపక శిలావృష్టిం గురిపించెను. అపుడు సభ్యు లాదెబ్బలకు నబ్బ బ్బా యని యిఁక నేటిపురాణము? లేచి రండు రం డనిరి. వారును బురాణము చాలించి దూరమున నిలువంబడి యిట్లుచింతించిరి. ఆహా ! యిది యెద్దియో ప్రళయమునకు సంభవించినమహాభూతమురీతి నున్నది. ఇఁక నేమియుపాయము ? నిక్కముగా నిది యొక్కబొమ్మరక్కసి యగును. ఈవఱకు మనరాజేంద్రుఁడు నీగురువులవారు నొకబ్రాహ్మణుని నిష్కారణముగాఁ జంపించియున్నారు. అది యూరక పోవునే? అధికార మున్నది గనుకఁ జంపించవచ్చును గాని తత్ఫల మనుభవింపక తప్పించుకొన నలవిగాదు గదా ! బ్రహ్మరక్షస్సు కులాంతమునఁ గాని చలమువిడువ దని పెద్ద లనెదరు. ఏమి కాఁదలచి యున్నదోఁ ముందు భగవంతునకుఁ దెలియును. అని యట్లు సభ్యులు చింతించుచుండఁగా రాజు మాంత్రికులం బిలిచి దానికిఁ బ్రతీకార మొనరింపుఁడనుడు వారును జంకి రాజసన్నిధానమున నుండుటంజేసి కొంత భీతి వదలి భూతి చేతం గొని ఆగచ్ఛ ఆదచ్ఛ యని కేకలు వేయుచు భూతిం జల్లుచుఁ గొంతతంత్రము గావించి తుదిఁ జేయునది లేక రాజుతోఁ బ్రత్యూషమున సుస్నాతులమై యీ భూతమునకు వలయుమారణోపాయములఁ జూతుము. ఇపుడు పనివినియెద" మని నిజవాసములకుఁ జనిరి. రాజును సభ్యులఁగూడి చనియె. రామకృష్ణుఁడును గుప్తవేషుండై వృక్షము డిగి యిలు సేరెను.
రామకృష్ణుఁడు రాజదర్శనము సేయుట.
మఱునాఁడు కృష్ణరాయఁడు కాల్యకృత్యములు నిర్వర్తించి కొని పేరోలగం బుండి ద్విజోత్తముల రావించి గ్రహమారణోపాయం బన్వేషింపుచుండెను. ఇట రామకృష్ణుఁడు వేకువ లేచి సుస్నాతుఁడై
కేశముల వ్రేలుముడి గీలించి తిరుమణి దీర్చి శ్రీచూర్ణము సాఁది పీతాంబరధరుఁడై తులసిమాలలు మెడ నిడి యుత్తరీయము వలెవాటుగ నమర్చి యుదకంపుస్థాలియు నక్షమాలయు నొకచేత నుంచుకొని రెండవహస్తమున "స్వర్గవిశేషదర్పణమును నాగబెత్తమును బట్టి పాదుకలం దొడగి రాజమార్గమున నిర్గమించెను. అపుడు జనులందఱును నీతనిఁ జూచి సాక్షా ద్విష్ణుం డగు నని యెంచి నమస్కరించి దాసానుదాసులై తోడ నడువ నారంభించిరి. ఇట్లు బహుజనపరివేష్టితుఁడై రామకృష్ణుఁడు రాజమందిరద్వారము సేరి దౌ వారికుం బిలిచి "స్వాములు వచ్చి యున్నా"రని రాజునకుం దెల్పు మని చెప్పిపుచ్చె. వాఁడు నట్లే యొనరించిన నానరపతి గురున కవ్వార్తఁ దెలిపి యాతనిం దోడ్కొని యా సూరివరుకడ కరుదెంచి యీతఁడు సాకారుఁడై యున్న రామకృష్ణునిగ నెఱింగి వెఱఁగంది మదిం గుంది మూర్ఛనొంద నపు డారాజేంద్రుఁడును "దైవమా ! యెట్టి యాపద తెచ్చితివి? ఇపు డీముప్పు తప్పించుకొను నుపాయ మెద్ది? అని చింతింపుచు ఱాపడి నిలిచి యుండెను. రామకృష్ణుఁడు వారిం జూచి "స్వామీ ! నే దయ్యమును గాను, భూతమును గాను. దేవరకరుణాకటాక్షమున స్వర్గమునకుం జని యచ్చటిభోగము లనుభవించి మీపితృజనప్రార్థితుండనై మీకు సౌఖ్యము సంపాదింప నీభువి కరుదెంచినరామకృష్ణుఁడను న న్న న్యునిఁగ భావింపవలదు. చంపఁ బంచితి రనుకిను కింతయైన నాస్వాంతమున లేదు. ఆచార్యులయాన"అని వట్టుఁ బెట్టికొని యీయిర్వురం దేర్చియుండ వార లాతనిం గవుఁగిలించుకొని "అన్నా ! నిన్ను బన్నముల సందించి చంపఁబంచిననిర్దాక్షిణ్యులము మాయెడఁ గరుణించి మమ్ము మన్నింపు" మని యనేకవిధములఁ ప్రార్థించి యాస్థానమునకుం గొనిపోయి యచ్చో నత్యున్న తాసనమునఁ గూర్చుండఁ బెట్టి తమపితృపితామహులకుశలసంప్రశ్నములు గావింపఁ దొడంగిరి. అపుడు రామకృష్ణుఁడు స్వర్గవిశేషదర్పణము విప్పి దాని వారల కందిచ్చి దీనిసావధానుల రై చూచితిరేని విశేషము లింకను
గోచరము లగును. మార్గాయానమున నున్నాఁడను కావున నే నిప్పటికిఁ బనివినియెదను" అని నిజావాసమునకుం జనియెను. ధరణీధవుఁడును సంతుష్టాంతరంగుఁ డై రామకృష్ణుని దలంచుచుఁ గొలువు సాలించి నిజా వాసమునకుం జనియెను.
రామకృష్ణుఁడు పండితుఁడుగా రాజుం దర్శించుట.
మఱునా డా రాజదేవేంద్రుఁడు నిజసభాభవనంబునఁ గవిబుధ నికరపరివేష్టితుఁ డై గురునితో సంభాషించుచుఁ గొలువుండి విద్యా గోష్ఠి సలుపుచుండెను. అత్తఱిఁ దలవాకిటఁ గట్టఁబడియున్న నూతన పండితజనవిద్యాప్రకాశకఘంటానాదము వీనులకు విన వచ్చినది. అపుడు పుడమిఱేఁడు విబుధదర్శనోత్సుకుఁ డై ఘంటానాదముతోడ నిజమోదము రెట్టింప దాని మరలమరల వినుచుండె. అపు డది మఱియొకపరి మొఱసినది. దాని విని పండితుఁడు రెండువిద్యల నేర్పరి యగు నని యేర్పరించుసమయమున నాధ్వని మరలమరలఁ గర్ణగోచరము గాఁ దొడఁగినది. దాని విని సభ్యులందఱును నత్యాశ్చర్యమున నుండిరి. అపుడు రాజోత్తముఁ డాపండితు నంతటితో ముగించి రమ్మని తెల్పుట కొక భటునిం బనిచె. వాఁడు రాజాజ్ఞానుసారముగ వచ్చి వృత్తాంతమును దెలిపెను. రామకృష్ణుఁడు దౌ వారికపురస్కృతుఁడై వచ్చి రాజుకట్టెదుట నిలువంబడియె. రాజు నాతనిం జూచి వెఱఁగంది "నీ నేర్చువిద్య లెన్నిగల వనుడు నాతఁడిట్లనియె. "స్వామి ! నానేర్చువిద్యల నెన్న నేండ్లు పట్టును సులభమార్గమునఁ దెల్పెద నాకర్ణింపుఁడు విద్యకు నొక్క వ్రేటైన నీగంట బీఁటవాయు. దేవరసన్నిధానమునకుఁ బరిక్షార్థినై వచ్చియున్నాఁడను. కావున నాయభీష్టము దీర్చి నను నాస్థానకవిగాఁ గైకొన వేడెదను. అను పల్కులకు సభ్యులందఱును భయమందిరి.
రామకృష్ణుఁడు జ్యోతిషములోఁ బరీక్ష నిచ్చుట.
అపుడు రాజు సభాసదులఁ జూచి యీమహావిద్వాంసునిఁ బరీక్షించుటకుఁ దగుశాస్త్రమును దగుపండితుని నెఱిఁగింపుఁ డని యాజ్ఞ
యొసంగెను. అపుడు వా రందఱును నాలోచించి జ్యోతిషమున నీతని నాంధ్రకవితాపితామహుఁడు పరీక్షింపఁదగు ననిరి. దానికి రాజును సమ్మతించెను. అపుడు పెద్దలపల్కులాలించి పెద్దన తనలోఁ దా నిట్లని చింతించె. ఆహా ! యిదేటివృత్తాంతము ? వీరందఱును నాపైఁ ద్రోచి యున్నారు. రామకృష్ణునిసామర్థ్యము మన మీవఱ కెఱుఁగము. ఎదిరి సామర్థ్యము స్వసామర్థ్యము నెఱుఁగక పరువులిడిన భంగపా టగును. గావున నూరకుండుట లెస్స యని యూహింప ననువు గాకున్నది. నన్నీ వఱకు నీసభ్యులు బలుమానిసిగా నెన్ను చున్నారు. ఈతఱి నూరకున్న బండితమాని యనరే ? ఎట్లైనను నీయిక్కట్టుఁ దప్పించుకొనుటకై యాకున కందనిదియుఁ, బోఁకకు బొందనిదియు, నగు నొకసంప్రశ్నము గావించెదను. అనంతరము భగవంతుం డున్నాఁడు. అని నిశ్చయించుకొని రామకృష్ణుం జూచి జ్యోతిషమున స్వర్గలోక వార్తావిశేషము లిపు డెఱింగింపుమనియె. అట్టి ప్రశ్నమునకు రామకృష్ణుం డాతని నుతించి ఇదె చెప్పెద జూడు మని కన్నులు మూసి మిన్ను జూచి యంగుష్ఠము లెన్ని ఛాయల లెక్కించి రెండుగిఱుల గీచి యిట్లనియె. ఓభూపతిపుంగవా! మనశిరములకు సూటిగ నిపుడు నాకము న నా కేశుడు కొలువై యున్నాఁడు. ఎదుట నాతనియానందమునకై రంభాద్యప్సరసలు నాట్యము సలుపుచు వినోదములు సేయుచున్నారు. ఇపుడు రంభపాదనూపురము గళితమై ధరాతలమునం బడుచున్నది. ఒకయామములోపల నది యిచ్చోఁ బడును. నాబుద్ధిచే నాలోచింప నది యిం దొకగిరిం బడును. "భవంతి న భవంతిచ" అను పార్వతీదేవి శాపముచే దీనిస్థలము నిష్కరింప నలవి గాకున్నది, అనుడు రామకృష్ణునిపల్కులకు సభ్యులందఱును ఱిచ్చపాటున నుండిరి. యథాకాలమునకు నూపురమొక్కటి ఘల్లుఘల్లన మ్రోయుచు నాతనియిష్టదేవతానుగ్రహంబున నొకగిరిం బడి రెండవదానికి ద్రొర్లినది. అపుడు సభ్యు లందఱును రామకృష్ణుని బహుభంగుల నుతించిరి. రాజున
నాతనికి విశేషసమ్మానము గావించి యీతఁడు మనకు లభించుట మన భాగ్యముసుఁడీ. ఈతని నష్టదిగ్గజములకు వలయువారిలో నొక్కనిగ నియమించితిమి. దానికి మీరు సమ్మతింపవలయు ననుడు సభ్యులు విశేషానందంబున సమ్మతించిరి.
రామకృష్ణుఁడు వరాలపళ్లెరము నందుట.
ఇట్లు ప్రభుసన్మానమును గాంచి రామకృష్ణుఁడు నిజచిత్రవ్యాపారముల సకలజనవినోదములు గావించుచుండెను. ఇట్లుండఁగా నొకానొకదినమునఁ గృష్ణరాయఁడు వరా లుంచి యొక పళ్లెరము దెచ్చి నిర్దోషముగాఁ బద్యము సెప్పి దీని నందికొనుఁ డని పండితుల కాజ్ఞ యొసంగెను. అపుడు పెద్దన లేచి నేనే పద్యము సె ప్పెదనని యీక్రిందిపద్యము సెప్పెను.
మ. శరసంధానబలక్షమాదివివిధైశ్వర్యంబులం గల్గి దు
ర్భరషండత్వబిలప్రవేశ చలనబ్రహ్మఘ్నత ల్మానినన్
నరసింహక్షితిమండలేశ్వరుల నెన్న వ్వచ్చు నీసాటిగా
నరసింహక్షితిమండలేశ్వరునికృష్ణా రాజకంఠీరవా.
అని తనయాశుకవిత్వనైపుణిం జూపినపెద్దనకవిం జూచి నవ్వి రామకృష్ణుఁడు తాతా ! బిలముఁ జొచ్చినను రాజకంఠీరవా ! రమ్మని తోఁకబట్టుకొని వెలి కీడ్చుచున్నావు. ఇది దోషమే కదా! మఱి నేను వచించెదఁ జూడు మని యీక్రిందిపద్యము నుడివెను.
"మ. కలనం దావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండమం
డలభేదం బొనరించి యేఁగునెడఁ దన్మధ్యంబునన్ హారకుం
డలకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లోఁ
గలఁగంబాఱుచు నేఁగె నీవ యనుశంకం గృష్ణ రాయాధిపా."
రామకృష్ణుఁడు కవిధూర్జటిరహస్యముం బ్రకటించుట.
ఒకానొకదినమునఁ గాళహస్తిమాహాత్మ్యమును దెలిఁగించిన ధూర్జటి యనునొకకవీశ్వరుం డరుదెంచి కృష్ణరాయనితోఁ దనగ్రంథమునుగూర్చి ప్రశంస యొనరించెను. అపు డాతఁ డాగ్రంథముఁ దెప్పించి సావధానముగఁ బరిశీలించి యాకవివాక్చమత్కృతి కెంతయు నలరి పండితులం జూచి. -
"చ. స్తుతమతి యైనయాంధ్రకవిధూర్జటిపల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?"
అనుసమస్య నిచ్చెను. పండితు లందఱు మేమియు నుత్తర మీఁ జాలక యూరకుండిరి. అపు డీరామకృష్ణుఁడు లేచి "స్వామీ ! నాకొకపక్షమువఱకు వ్యవధానం బిచ్చితిరేని గ్రంథమంతయుఁ జూచి దీనికారణం బూహించెదను. పిమ్మట దేవరచిత్తమునకు నున్న తెఱం గెఱింగించెదను" అని రాజును సమ్మతింప జేసి రామకృష్ణుండు నాఁటనుండియు సభకు రాఁడయ్యెను. ఇ ట్లింటికడ నుండి యాపక్షాంతమున మాఱువేషంబు ధరియించి యాధూర్జటి యున్న యింటికిం జని రాత్రియగువఱకు నటు నిటు దిరిగి యనంతరము మెల్లన నాయింటికడఁ బండియుండెను, నిశీథ మగుడు ధూర్జటి యిలు వెడలి నడువందొడంగెను. అపుడు రామకృష్ణుఁడు ధూర్జటికి దూరదూరంబుగ నుండి వెంటాడించి చనుదెంచుచుండెను. ధూర్జటియు దీని నేమియు నెఱుంగక యెప్పటియట్ల యొకనాగవాసంబునావాసంబులోనికిం జనియె. రామకృష్ణుండును వెనువెంట వచ్చి యాగృహముకడనె పవ్వళించి యుండెను. ధూర్జటి తడవు లో నుండి వెలికిం జనుదెంచెను. అపుడు రామకృష్ణుం డాతనిపదంబుల పైఁ బడి లేచి "స్వామీ! నేను రామకృష్ణుండను యుక్తసమయము గాకుండ వచ్చియుండుటకు క్షమియింపుఁడు. నేను బనివినియెదను. అని యచ్చోటు వాసి త్వరతోఁ జనియె. అపుడు ధూర్జటి రామకృష్ణుండిట్లు కాన్పించుటంజేసి వెఱఁగంది "యేమిదైవమా ? ముందుగతి" యని కొంతతడవు చింతించి యింటికి వచ్చి నిద్రించెను. మఱునాఁడు
సూర్యోదయం బగుడు నెప్పటియట్ల కాల్యకృత్యములు దీర్చుకొని ధూర్జటి యొంటిప్రాణంబుతో నాస్థానంబునకుం జనుదెంచెను. అంతకుమున్నె రామకృష్ణుండు వచ్చి యొకచోఁ గూర్చుండి యుండెను. విభూతియు రుద్రాక్షలు మెఱయఁ గేవలము ధూర్జటివడువున వచ్చెడిధూర్జటిం గని రాయఁడు మిక్కిలి సంతసంబున : -
"చ. స్తుతమతి యైనయాంధ్రకవిధూర్జటిపల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?
అనుడు రామకృష్ణుండు లేచి : -
"హా తెలిసెన్ భువనైక మోహనో
ద్ధతసుకుమార వారవని తాజన తాఘన తాపహారిసం
తతమధురాధరోదితసుధారసధారలఁ గ్రోలుటం జుమీ."
అనుడు రాజును సభ్యులు రామలింగము పల్కులకు నెంతయు నవ్విరి. ధూర్జటియుఁ దలవంచుకొనియెను.
రామకృష్ణుఁడు సహస్రఘంటకవి నోడించుట..
ఒకానొకదినమున రాజదర్శనార్థమై సహస్రఘంటకవి యగుప్రెగడ రాజు సర్సన యనునాతఁడు వచ్చి సముచితంబుగఁ దనరాక నెఱిగించి పుచ్చె. సహస్రఘంటకవి రాక విని రాజు మిగులఁ జింతించి పండితుల రావించి యిట్లనియె. "ఓసభ్యులారా ! సహస్రఘంటకవి వాదార్థియై వచ్చియున్నాఁడు. ఇచ్చో నాతని కీడగువా రున్నట్లు గానరాదు. కర్తవ్యం బెద్ది? మనసభకుఁ బండితసభ యనుమాట నేఁటితో ముగియ నున్నది. దీనికి మీ రేమిచేయ నున్నా రనుడుఁ బండితు లుల్కి మొగంబులు వెల్వెలఁబాఱ, బయలు సూచుచు డోలాయమానమానసులై యొకరి నొకరు వీక్షించుచు గుసగుసలాడ నారంభించిరి. ఇట్లు కొంత సే పుండి వారందరుఁ బెద్దనను దలంచికొని "పెద్దన మనకుం బెద్ద. కావున మనల నుద్ధరింప నతఁడె సమర్థుం" డని యాతని నుపాయము సెప్పు మనిరి. అతఁడును నించుక చితించి వికసన్ముఖుఁడై ప్రభునిం జూసి యిట్లనియె. "స్వామీ ! యిట్టితంత్రం బెచ్చో నైనఁ గాంచితిరే.
రామకృష్ణుఁడు మనల నుద్ధరింప సమర్థుం డయ్యును సమయం బగుడు నిజప్రతాపము గుప్తము సేసి వానరాలాపము లాలింపుచు మిన్నక యున్న పవమాననూనుంబలె నున్నాఁడు. అట్లు గావున నీతఁ డాయంజనాసుతుమాడ్కి రాజ కార్యమును బంధుకార్యమును జక్కంజేయఁగ విరోధిసముద్రం బవలీల దాఁట నున్నాఁడు. దేవర యాజ్ఞ యొసంగుఁ డనుడు, రాజును మిగులం బొంగి రామకృష్ణుఁ జూచి "నీ విక్కార్యము నెఱ వేర్ప నుత్సహింపు" మనుడు, రామకృష్ణుఁడు భాసురమందహాసవికసితముఖపంకజుం డై యేకగ్రీవం బైనసభం జూచి యిట్లనియె. "పండితర్షభులారా! నా కీవఱ కట్టిసామర్థ్యము లేకున్నను మహాకవివరామోఘవాక్పటిమచేతను బుధజనాశీర్వాదముచేతను ప్రభునియాజ్ఞ చేతను గల్గెడిని. తొల్లి యంజనాసూతి వృద్ధభల్లూకాధిపుచే నుత్సహింపం బడియేకదా ! స్వామికార్యనిర్వాహం బొనర్చె. అట్లే నే నీవృద్ధునిమాట పాటించి పగతు నశ్రమంబున గెల్చి రాజకార్యనిర్వహణం బొనర్చెద. కావున విరోధివలన భయ ముడుగుఁడు. ఎల్లి యాతని నేలికదర్శనమునకు రాఁబంపుఁడు. అపు డేను లక్షఘంటకవినామమున వేష ధారినై వచ్చెద. అనంతరవృత్తాంతము తనంతనే విస్పష్టం బగును. నే నిపుడే పనివినియెదను. అనుడు రాజు వల్లె యని తనయాస్థానము సాలించి నర్సనకు మఱునాడు దర్శనమునకు రా నాజ్ఞ యొసంగెను.
నర్సనయు మఱునాఁడు రాజాజ్ఞానుసారంబుగఁ జనుదెంచి రాజమందిరద్వారమున నిలిచి ప్రతీహారులవలన నాక్ష్మాభర్తకుఁ దనరాక యెఱింగించి పుచ్చెను. అపు డా రాజు సహస్రఘంటకవిం దోడ్కొని రాఁ దగువారలం బనిచె. వారును నాతని సగౌరవంబుగఁ దోడ్తెచ్చిన నాధరణీజానియు సామంతజనపరివృతుండై కతిపయపదంబులు దూరము నడిచి యెదురుగ వచ్చి కవిం గారవించి యాస్థానమునకుం దెచ్చి యర్ఘ్యపాద్యము లొసంగి ధన్యుండ నైతిఁ జుఁడీ యనునవసరంబున, దౌవారికుండొక్కరుండు వచ్చి రాజుం గై వారంబు సేసి "దేవరా ! హజారమున
లక్షఘంటకవి యనునొకమహానుభావుండు దర్శనార్థంబై వచ్చియున్నాఁడు. సెలవే" యనుడు, రాజు సభ్యులం జూచి "యాహా! యిది బహుసుదినంబు. పండితులపైఁ బండితు లేతెంచుచున్నారు. వారి నిటకుఁ దోడ్కొని రాఁదగువారిం బంపుఁ డని తిమ్మర్సున జాజ్ఞ యొసంగె. అతండును గొందఱుబుధజనులం దోడ్కొని వేషధారికడ కేఁగి రాజాజ్ఞఁ దెలిపెను. అతండును రాజాను మతంబు దెలిసి లోనికిఁ జనుదెంచు చో శిష్యజనులకుఁ బాఠంబు లుపన్యసింపుచు జను లచ్చెరువంది చూడ సభామంటపంబు సమీపించె. అంత నాభూకాంతుం డెదురుగఁ జనుదెంచి నితాంతభక్తి నాతనిపదంబుల కెఱఁగి సభాభవనమునకుం దోడ్కొనివచ్చి నిజసింహాసనపురోభాగమున నున్న యత్యున్న తాసనమునఁ గూర్చుండ నియమించి బహుమానపూర్వకముగఁ బూజలు సేసి నిజసింహాసనమున నుండెను. ఇట్లు కూర్చుండి యున్న రాజశిఖామణింగాంచి వేషధారి యచ్చో నుండువిద్వజ్జనంబులఁ జూసి మృదుమధురభాషణముల వారివారి నామములును సామర్థ్యాతిశయములు నడుగం దొడంగెను. అనంతరము తమయెడమప్రక్కను గించిదున్న తాసనమునఁ గూర్చుండి యున్న నరసన్న దిక్కు మొగంబై వీ రెవ్వార లనియె. రా జాతఁడు సహస్రఘంటకవి యని తెల్పెను. తెల్పిన నతఁడు వీరు సహస్రఘంటకవులా? వీరినామం బేమి యనుడు ప్రెగడరాజు నర్సన యని వాక్రుచ్చె. అపు డతనితో ముచ్చటింప నుద్యుక్తుం డైన ట్లభినయించి స్వామీ! యీ కవిశిఖామణిముఖము చూచినతోడనే సంభాషింప మనస్సున నుత్సాహము కల్గు చున్నది. సెలవే? అనుడు రాజు లక్షఘంటకవిం జూచి "విద్వా నేవ విజానాతి విద్వజ్జనపరిశ్రమమ్." అనునట్లు మీమీసామర్థ్యబోధంబున కై సంభాషింపఁ దగు ననుడు రామకృష్ణుండు మందహాసకంద ళితముఖారవిందుండై నర్సనకవిం జూచి యిట్లనియె.
"అరసికజనసంభాషణముకంటె రసికజనవాక్కలహము మేలు" అని యున్నది. కావున నే నిపు డామేలిపని నొనర్ప గమకించుచున్నాఁ
డను కినియకుఁడీ" అని యాతని బుజ్జగించి, స్వామీ! నా కొకటిరెండు సంశయము లున్నవి. ఆసందియములఁ దొలంగించి నామనస్సును నిష్కళంకముగఁ జేయుఁ డనుడు నర్సన "అబ్బా ! నే నంతవాఁడనే? అయిన నాయెడం గరుణించి యాప్రశ్నము లానతిచ్చిన విని కొంత తని సెదను." అనుడు రామకృష్ణుం డిట్లనియె. పండితవర్యా! నా కీవఱకు నుక్త లేఖనంబునఁ బ్రజ్ఞావంతుండును, దప్పులు దిద్దుటయందు నేర్పరియు నగు పండితుండును, కవియుఁ గాన్పించఁడయ్యె. మీర లేమైన వీనిని నేర్చి యుంటిరే? అనుడు నర్సన గర్వించి యిస్సిరో! యీతం డిట్టిప్రశ్నము లా నన్నడుగుట ఈతనిచేవ తెలిసినది. అని నిశ్చయించుకొని పండితోత్తమా! మేలుమేలు! గొప్పసంశయము లడిగితిరి. కవికి ముఖ్యముగా వలయినీరెంటిని నేర్చి యుండకున్న నేపండితుండును గవి యగు టెట్లు గల్గు? నాశిష్యు లందఱును మొదట నాకడ నీరెంటినే యభ్యసింతురు. వలయునేని నాశిష్యుం డొక్కరుండు మీకు నుత్తరం బిచ్చి మిమ్ముే దృప్తి నొందించును. ఇట్టిప్రశ్నము వేదమా? శాస్త్రమా! నేను యోజించుటకు? అని నర్సన లక్షఘంటకవి యనుభయ మింతయైన లేక యహంకారమునఁ బల్కినఁ గనలి రామకృష్ణుండు స్వామీ! మీశిష్యులకుం గఱపినతెఱఁ గెఱిగింపుఁడు. చూడ వేఁడుక గల్గుచున్నది. నానుడుపుపద్యం బిపుడు వ్రాసి నన్ను గారవింపుఁడు. అని తనచేతియాకును ఘంటము నందిచ్చి :-
క. త్ప్రవ్వఁట బాబా, తలపై పు వ్వఁట జాబిల్లి, వల్వ బూ చఁట, చేఁ దుం
బు వ్వఁట, చూడగ నుళుకు క్కవ్వఁట, యరయంగ నట్టిహరునకు జేజే.
అని చదివి వ్రాయుము వ్రాయు మని వేగిరింపుడు, నర్సన మొదటియక్కరము నుచ్చారణానుసారముగ వ్రాయఁ జేయాడక క్రిందు మీఁదు చూచుచు నొకపరి వ్రాసినయక్షరము మరలఁ దుడువు పెట్టుచు నింకొకవిధముగ లిఖించి దానిం జెఱిపి వేయుచు నీతీరున నదియే వ్రాయుచునుండె. అపుడు రామకృష్ణుం డాతనిం జూచి చాలు! చాలు!
నీ కిందు సంపూర్ణ పాండిత్యము గలదు. ఇఁక దప్పులు దిద్దుటయం దెట్టిప్రజ్ఞ గలదో దానింగూడ సభ్యులు చూడఁ దలఁచి యున్నారు. ఇదె యీపద్యములోనితప్పుల దిద్దు మని యీక్రిందిపద్యము చేతి కిచ్చెను :-
మ. గననీహారగు రామపద్మ ధళరంగ త్కీర్తి చాణూరమ
ద్ధనశుక్రాక్షికళేభరాణ్మృగపతీ త్రైలోక్య ధామోదరా
యనగాశంఖర వాంఛితార్థదగదా ద్యస్రైక పాణీజనా
ర్థనవా నేక ప వైరి విగ్రహముకుంధా మిత్రవింధాదిపా.
దీనిం జూచి నర్సన పైకిఁ దప్పులుగా నగపడుచుండునట్టిచాణూరమద్ధనాదిశబ్దంబులఁ గొన్నిటిఁ జాణూరమర్దన మొదలగు రూపము లుంచి దిద్ది యాతనికిం జూపె. రామలింగ మపుడు పక్కున నవ్వి సభాసదులం జూచి యిట్లనియె. అహహా! యీమహాకవిప్రజ్ఞావిశేషము లమేయములు. తనఁకుఁ దెలియని వన్నియుఁ దప్పులఁట! నాపద్యంబునఁ దప్పు లున్నవియఁట! చూడుఁడు ! అని తా నాపద్యము క్రమముగ నన్వయించి చాణూరమద్ధన మొదలగుశబ్దములకు జాణూరమత్ హన అని విరిచి యర్థము సెప్పి సభ్యుల నాయర్థమునకు మెచ్చించి నర్సనం జూచి యిట్లనియె :-
చ. తెలియని వన్ని తప్పు లని దిట్టత నాన సభాంతరంబునన్
బలుకఁగ రాకురోరి పలుమాఱు పిశాచపుపాడగట్ట నీ
పలికిననోట దుమ్మువడ భావ్య మెఱుంగక పెద్దలైనవా
రల నిరసింతురా ప్రెగడరాణ్ణరసా విరసా తుసా భుసా.
అని యంతటితోఁ బోనీయక,
చ. ఒకనికవిత్వమం దెనయునొప్పులు తప్పులు నాకవిత్వమం
దొకనికిఁ దప్పు పట్టుపని యుండదు కా దని తప్పు పట్టినన్
మొక మటు క్రిందుగా దిగిచి మొక్కలు పోవనినుంపకత్తితో
సిక మొదలంటఁ గోతు మఱి చెప్పునఁ గొట్టుదు మోము దన్నుదున్.
అని రామకృష్ణుఁ డుక్కుమిగిలి ధిక్కరించిన నక్కవిశిఖామణి యేమియు ననఁజాలక లజ్జితుం డై తనరాకఁ దిట్టుచుఁ జీఱుచెమ్మట
మొగమ్మునఁ గ్రమ్మఁ దల వాంచి కాల నేల వ్రాయుచు నూరకుండెను. అంతట రాజు నాయిర్వురం జూచి కార్యము మించుటకుఁ జింతించి యూరకుండుట తగనిపని యని యెంచి లేచి వారికరంబులు నిజకరంబులఁ బట్టి వజ్రం బెన్నండైన వజ్రంబునకుఁ దక్కువ యగునే. మీరిరువురు సమానులే యగుదురు. అని యాయిర్వురకుఁ కాంచనాంబరాభరణంబులు చీనిచీనాంబరంబులు నిచ్చి విశేషధనము నొసంగి యాపండితులకు సెలవొసంగెను. అపుడు కపటక్రియానిపుణుం డగురామకృష్ణుఁడు రాజుం జూచి, "స్వామీ! పండితమాని యగునీతని కీపండిత గండ యనుపెండేరం బుండఁదగునా యనుశంక వొడముచున్నది. దేవరచిత్త"మనుఁడు నర్సన వేషధారిపల్కు లాలించి రానియభిప్రాయమును గ్రహించి త్వరతోఁ దనకాలియందియ నూడ్చి లక్షఘంటకవి కిచ్చి రాజుకడఁ బనివిని వీథిం దిట్టుచు వచ్చినత్రోవం జనెను. రాజును లక్షఘంటకవికి సెల వొసంగి నిజావాసమునకుం జనియె. సభ్యులు లక్షఘంటకవిప్రజ్ఞావిశేషంబులఁ దలంచుచు యథేచ్ఛం జనిరి.
రామకృష్ణుఁడు భట్టుమూర్తివలన ముత్యాలహారముం గైకొనుట.
ఒకానొకదినంబున భట్టుమూర్తి కృష్ణరాయల నీక్రిందిపద్యము సెప్పి నుతించె నదెట్లన్నను :-
క. నరసింహకృష్ణరాయని, కర మరు దగుకీర్తి యొప్పెఁ గరిభిద్గిరిభిత్
కరికరిభిద్గిరిగిరిభిత్, కరిభిద్గిరిభిత్తురంగకమనీయం బై.
దీని విని రాయఁడు మిగుల సంతసించి తనమెడ వ్రేలుచున్న తార హారం నాభట్టుమూర్తి మెడఁ గీల్కొల్పెను. దాని ధరియించి భట్టుమూర్తి పండితసభలోఁ దారామధ్యస్థితుం డగుచంద్రుని భంగిఁ బ్రకాశింపఁ దొడంగె. ఇట్టిగౌరవం బీతనికిం గల్గుటంజేసి సభ్యు లేరును సమ్మతింపరైరి. కావున నిందలిముఖ్యపండితులు కొందఱు సభ చాలించినయనంతరము రామకృష్ణునియింటికి వచ్చి యాతనిరాకకు వేచియుండిరి. అతఁడును గొంతరాత్రి కింటికిం జనుదెంచె. అపు డీపండితులు సకరుణం
బుగా నాతనికిట్లనిరి. ఈవఱకు రాజు మనలనందఱను సమానంబుగ గారవించుచుండె నని తలంచుచుంటిమి. అది యంతయు నేఁటికిఁ దెల్లం బయ్యె. భట్టుముందట మన ముప్పునకును నూరగాయకుంగూడఁ గొఱ గా మని రాజునకుం దోఁచియున్నది. ఇట్లుండ మన మిచ్చో నుండులాభ మెద్ది? దేశాంతరగతుల మైన నీపంత కొంత మానును. అనుడు రామకృష్ణుఁడు వారలం జూచి కడచినదానికి వగచుట గతజలసేతుబంధనము. కర్తవ్యము నిర్ణ యించిన నాకుం బోలిన సహాయంబు సేసెద. అనుడు వార లాతనిం గాంచి "యోయీ! యుపాయంబు తోఁచకుండుటచేతనే కదా నీకడ కరుదెంచితిమి; యేదియేని యుపాయము చేసి మమ్ము నుద్ధరింపుము." నా విని రామకృష్ణుఁ డిట్లనియె. "నాకుంబోలినయుపాయంబు చెప్పెదవినుండు. చేతగానిపర్వులిడుట నాచేతఁ గాదు. ఎట్టియుపాయంబున నైన నాభట్టుమెడం బెట్టియున్నహారంబు తోరంబుగఁ బట్టి నామెడ నిడికొని వచ్చెద. ఇది మీకు సమ్మతంబె" అనుడు వార లగుంగాక యని తమయంగీ కారమును దెలిపిరి. అపుడె బయలువెడలి రామకృష్ణుఁడు భట్టుమూర్తిమనికిపట్టు చేరి యొకభటునిచేఁ దనరాక నాతనికిఁ జెప్పిపుచ్చె. రామకృష్ణుఁడు వచ్చియున్నాఁ డనుపల్కు విని కడు నుల్కి కారణం బేమని మూర్తి కడుఁ జింతించి యేమియుఁ గానక తుద కేదియో మునిఁగె నని యెంచి యొంటిప్రాణంబుతోఁ జనుదెంచె. అపుడు రామకృష్ణుఁ డెదురుగఁ జని యాతని గాఢాలింగనంబు సేసి యిట్లనియె. "ఓయీః నాయుల్లం బిపుడు గదా చల్లనయ్యె, ఇంత దనుక నే నిట నుండుపండితులమాటలకు లోనై ని న్నన్యునిగ నెంచి నీ ప్రజ్ఞాతిశయంబులకు సహింపలేనైతి. ఈ దినంబుతో నాసంశయంబు లన్నియుఁ బాసె. నామనంబు నిష్కళంకం బగుడు నేస్తంబున కాన వొడమె. కావున నాయీప్సితంబు సమకూర్చుకొన నీకడ కరుదెంచితిని. నీవును బరేంగితజ్ఞానివి గావున మద్వాంఛితార్థంబు నొసంగుదువు, అనురామలింగనిపల్కుల కేమియు ననఁజాలక వెఱఁగంది చూచుచున్న
భట్టుమూర్తిం జూచి యాతఁ డిట్లనియె. "ఓయీ! నిన్నుం జూడఁజూడ నీకవితసరసతయుఁ బ్రజ్ఞావిశేషంబులు నుతియింప నుత్సాహంబు వొడముచున్న యది నీప్రజ్ఞావిశేషంబు లల్పంబు లే?
"గీ. అలసాని పెద్దన యల్లికజిగిబిగి, ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్కు
పాండురంగవిభుని పదగుంభనంబును, కాకమానురాయ ! నీకుఁ దగుర.
అను రామకృష్ణునిమధురవాక్యంబులు వీనులకు నమృతంపుసోనలై సోఁకిన భట్టుమూర్తి పెల్లుబ్బి వెల్లువయై పాఱునానందంబునం దేలి నిజకంఠలగ్న తారహారం బూడ్చి యాతనిమెడ నిడి గాఢపరీరంభ మాచరించి లోనికిం దోడ్కొని చని యున్నతాసనంబునం గూర్చుండఁబెట్టి, యర్ఘ్యపాద్యంబు లొసంగి కర్పూరతాంబూలం బందిచ్చి "యిదియే నేస్తంపు విడెం బని తెల్పెను. రామకృష్ణుం డట్లే దానిఁ గై కొని పోయివచ్చెద నని తెల్పి నిజగృహంబున కేతెంచి తనరాక కెదురుచూచు చున్న పండితులం గాంచి, "యిదె మీహారంబు మీయిష్టానుసారంబుగ దీని వాడికొనుం డని వారిపైఁ బడవై చె. దానికి వారందఱును గడు సంతసిల్లి "యోయీ దీని హరింపను ధరింపను నీవ సమర్థుండవు. కావున నీకు దీని మేమందఱము బహుమానంబుగ నిచ్చితి మని యతనిమెడ దాని నుంచి యథేచ్ఛం జనిరి.
ఇట భట్టుమూర్తి యప్పుడే రాజదర్శనార్థము చని తనరాక యాతని కెఱింగించి వుచ్చిన నాతఁడు భ ట్టిట్టిసమయంబున వచ్చుటచే నాతని కెద్దియేని యాపద సంభవించుటగా నిశ్చయించి దిగ్గన లేచి వచ్చి నీరాకకుఁ గారణం బే మని యడిగెను. అపు డాతఁడు నవ్వుచుఁ జిన్న విన్న పం బన రామకృష్ణుఁడు స్నే హార్థియై వచ్చిపల్కినపల్కు లన్నియుం దెల్పె. వాని విని రాజును గడు సంతసించి యీతఁ డొక్కఁడు మనవాఁడై యుంటంజేసి తక్కుంగలపండితుల నశ్రమంబునఁ గెలువ వచ్చును. మన కీదినంబు మిగుల సుదినంబు. ఎల్లి యెల్లవృత్తాంతంబు మాటలాడుదము చను మని యా రాత్రి నిద్రించి మఱునాడు రాత్రి
వృత్తాంతంబు మనంబునకు సంతసంబు పుట్టింప నాస్థానంబునకు వైళంబ వచ్చి రామకృష్ణుం బిలిచి యిట్లనియె. "ఓయీ ! పైత్యరోగికిఁ బాలు రుచ్యంబులుగాక తద్రోగాంతంబున దానిమేలిగుణంబు లగుపడునట్లు భట్టుమూర్తిగుణంబు లిపుడిపుడు గొప్ప పండితులకుఁ గాన్పించెడినికంటే?" అనుడు నవ్వి "దేవర యట్టిపండితు లెవ్వరో యెఱిఁగించిన ననంతరవృత్తాంతంబు మనవి సేయుదు ననుడు రాజు తొల్లింటిపద్యము చదివెను. దానికి రామలింగము నవ్వుచు నా పద్యము మరలఁ జదివితుదిని కాక, మానురాయ నీకుఁ దగురా అని కాక అనుదాని వేఱుచేసిన రాజు నీయభీప్రాయంబు స్పష్టీకరింపు మనియె. అపుడు రామకృష్ణుఁడు భట్టుం జూపి "యీతనికంచుకము దీయించిన మనసంశయము లుండ వనుడు రాజు దాని కాజ్ఞ యొసంగె. అపుడు రామకృష్ణుం డతనివీఁపున నున్న తామరం జూపి యతఁడు కూర్చుండెడుస్థలంబున నున్న స్తంభంబుఁ జూపి మానురాయ నీకుఁదగురా. అని యర్థంబుగాని యింకొకటి గా దనియె. దాని విని రాజును తేజు చెడి యూరకుండె. భట్టేమియుే బల్కనే లేేఁ డయ్యెను.
రామకృష్ణుఁడు వసుచరిత్రకృతి నాక్షేపించుట.
భట్టు రామరాజభూషణుఁడు వసుచరిత్రను రచియించి తెచ్చి సభలో వినిపింప నుండ రామలింగ మొకచిత్రకథ చేసె. అదెట్లనిన :-
ఒకానొకదినంబున భట్టురామరాజభూషణుఁడు పెద్దనమనుచరిత్రపాకచమత్కృతికి మనంబున నలరి యట్ల తాను నొకరసవత్ప్రబంధంబు గల్పింప నుత్సహించి రాయల కెఱిగించిన నాతఁడు కర్పూర తాంబూలజాంబూనదాంబరాభరణంబు లొసంగి కృతి నిర్మింపు మనుడు రామభూషణుం డత్యంతానందంబునం జని మిగులఁ బరిశ్రమం బొనర్చి మనుచరిత్రకు నెక్కుడురసోదంచితం బగువసుచరిత్ర యనునొకగ్రంథంబు రచియించి కృతి నొసంగ రాజున కెఱిఁగించిన నాతఁ డొకశుభదినంబున సభ సేసెద నని యాజ్ఞ యొసంగెను. అపుడు రామభూషణుండు
రాజున కొకవిన్న పం బని యిట్లనియె. "దేవర రామకృష్ణునివృత్తాంత మంతయు నెఱుంగుదురు గద. ఇట్టిదుష్టుఁడు ముందు తమసభ కేతెంచిన నాకష్టంబు గట్టెక్కదు. కావున నాతని నాఁటిదినంబు సభకు రా కుండ నుత్తరం బొసంగవలయు." అనుడు రాయఁడు రామలింగనిచేష్టల నాలోచించి "పరరంధ్రాన్వేషి యగునీతం డెద్దియైనఁ బల్కనోపును. అపుడు నామది కెట్లు దోఁచునో? కావున వీని నాఁటిసభకు రాకుండ నుండుటయే కర్జం" బని తనభటులకు నట్లుత్తర మొసంగి రామలింగనికి నట్లాజ్ఞ యొసంగె. అట్టిరాజాజ్ఞకు మిగులఁ గుపితుం డై రామకృష్ణుండు తనలోఁ దా నిట్లు చింతించె. "హా! భట్టెట్టి సాహస కార్యం బొనర్చె. ఏ నెన్నండేనియు వీనికిఁ గీడు దలఁచి యుంటినే? ఇట్టి నన్ను నిష్కారణవైరంబున నవమానింపఁ దలంచె. తన్నుఁ గట్టు త్రాళ్లు తాన తెచ్చికొన్నట్లు నాకు భంగంబు సేయఁదలంచె. ఈతని ప్రబంధంబున కేదియేని యంతరాయంబు గల్పించి రాజు వినకుండ నుండునట్లు సేసదఁగాక" యని యిష్టదేవతకు నమస్కరించి తా నొక ముదుసలియుప్పరివేషంబు దాల్చి సభామండపసమీపంబునఁ బనిసేయు నుప్పరులం గూడి యుండెను.
అంతట శుభదినంబునఁ ప్రభునియూడిగంపుజనులు సభకు నలంకరణం బొనరించిరి. రాజును సర్వసేనాపరివృతుం డై నిజవిభవం బేపార నేతెంచి కొలువు బలిసియుండె. అపుడు రామభూషణుండు తననేరువు సభ్యులందఱకు విస్పష్టంబు సేయఁదలంచి యొకయున్న తాసనంబునఁ బ్రభుసన్నిధిం గూర్చుండి యొప్పిదంబు లగుగీతంబుల మంగళగీతంబులు పాడుచు స్వకృతకృతిముఖశ్లోకంబున సుశ్లోకుం డగుకాకుత్ స్థతిలకు వర్ణించిచెప్పిన "శ్రీభూపుత్త్రి వివాహవేళ" అనుపద్యంబు చదివె. అపుడు దూరంబున నుండి యాఁగుఁ డాఁగుఁ డని" యొక్కధ్వని వీ తెంచె. అట్టి ధ్వని కర్ణగోచరం బైనతోన సభికులందఱును నుల్లంబులు తల్లడిల్ల నివ్వెఱఁగంది యుండిరి. నిశ్శబ్దంబుగ నున్న సభామధ్యంబునకు
నుప్పరులమధ్యంబు వెలువడి యొకముదుసలి యుప్పరి తనచే నున్నతట్టయుఁ బారయుఁ బాఱవైచి "సాయరా లచ్చి" యని కేక వేసి గుండెలు మోఁదికొనుచు రాజసన్నిధి కేతెంచి "సామీ ! యేలిక మేలు గోరి యీకవి కవితంబు సెప్పఁడు. నేఁటితోన ప్రభునకుఁ బ్రజకు ఋణంబు సెల్లె. ఇఁక నేమి సెప్పుదు" ననుడు రాజు "కారణంబే"మని యడిగె. అపుడు ముదుసలియుప్పరి రాజుం జూచి "యయ్యా! కొంత బూది తెప్పించిన నున్నరూ పెఱిగించెద" అనుడు రాజు నట్లు గావించె. ఆభూతి గొని యుప్పరి తనయఱచేత నొకబరి సేసి శ్రీ యనునక్కర మందు వ్రాసి భూ అని చేతికడ నోరుంచి పల్కె. దానిచే భూతియం దున్న శ్రీ రూపుమాసె. దాని రాజునకుం జూపి యిట్లనియె. "ఏలికసంపద నెల్ల నీభ ట్టిట్టిచెట్ట వెట్టి తొలఁగించె చూచితిరే! భూతిలోనిశ్రీ దొలంగె. ఇట్టికబ్బ మందుట కర్జంబు గా దని నాకుఁ బోలినట్లువక్కాణించితిని. ఇఁక దేవరచిత్తంబు అని యాయుప్పరి యచ్చోటు వాసి చనియె. రాజును నేమియు ననఁజాలక మఱియొకదినంబున నీగ్రంథంబు చూచెదమని యాస్థానంబు చాలించి యథెచ్ఛం జనియెను.
వసుచరిత్రమును పిండములపయి ధారపోయించుట.
అనంతరము రామరాజభూషణుండు విచారసాగరనిమగ్నుండై పుస్తకంబు హ స్తంబున నిడికొని యిల్లు సేరి విఘ్నకారుం డగునాముదుసలియుప్పరి యెవ్వం డగు నని యూహించి రామకృష్ణుం డగునని నిశ్చయించి స్వయంకృతాపరాధంబునకు వగచి యుపాయాంతరంబు లేమిం జేసి యాతనిపదంబు లాశ్రయించి కార్యంబు పొందుపఱిచికొందు గాక యని నిశ్చయించుకొని యాతనికడ కేఁగి చేతులు పట్టి నాయజ్ఞానంబు సైఁపు మని యిట్లనియె. అన్నా ! నే నిన్న వమానింపఁదలచి కావలసినట్టు లవమానంబు బొందితి. ఇపుడు నాకు జ్ఞానంబు వచ్చెను. ఇఁక నాయందుఁ గరుణించి నాకృతి రాజునకు శ్రుతిగోచర మవునట్లొనరించిన నీకు బహుపుణ్య ముండును. అంతటితోన నాయుల్లంబు
చల్లనగు. అని దీనాసనుండై ప్రసనుం డై యున్న రామరాజభూషణుం గాంచి సదయుండై రామకృష్ణుం డిట్లనియె. ఓయీ! వగవకుము ఎవ్వఁడో నీవిరోధి నీ కిట్టి విఘ్నం బొనరించె. అయిన నేమాయె. నేను రాజు కడ కరిగి నిన్నుఁగూర్చియు నీగ్రంథంబుఁగూర్చియు నాతనికి నెక్కుడుగఁ దెల్పి కార్యం బనుకూల మవున ట్లొనరించెదను. ఇదె పోయి వచ్చెద నని యప్పుడ ప్రభువు కడ కరుదెంచి యాతనితో నిట్లనియె. దేవరకు రామణూషణుండు నాఁడు కృతి నొసఁగ రా నాతని దురదృష్టంబున దానికి నంతరాయంబు సంప్రాప్తంబయ్యె. నాటంగోలె యాతం డన్న పానంబులు మాని దుఃఖంబునఁ గృశించుచున్నాఁడు. దేవర దాని నొకపరి విన్నంతమాత్రంబున నాతఁడు సంతుష్టాంతరంగుం డగును. కావున నాతనిఁ గరుణింపఁదగును. అనుడు రాజును గొంతదడవు చింతించి యోయీ! మున్ను కృతి నందక తిరస్కరించి మరల నాగ్రంథంబు విన మన మెట్లుత్సహించును. అనిన రామకృష్ణుఁ డిట్లనియె. సందియంబు దేవరడెందంబునఁ గ్రందుకొని యున్న దేని యొకయుపాయంబు సేయుదము. గతించినవారికేరికైన నీకృతి నిచ్చి యనంతరము దాని నిటఁ దెచ్చు న ట్లొనరింతము. ఇతరులు కృతిపతులైన గ్రంథంబు మనము వినుటకు శంక యుండదు. దోషంబులు గ్రంథంబున నుండు నేని తద్దోషంబులు కృతిపతిని బాధించుఁగాని శ్రోతలకేమి? కృతిపతి గతించి యుండుటచే నాతని నైన బాధించు ననుభయంబు లేదు. అనుడు రాజును దానికి సమ్మతించె. అప్పుడు రామకృష్ణుఁడు భట్టుకడ కేతెంచి యీ వృత్తాంత మంతయుఁ దెల్పి కృత్యాదిని నాశ్వా సాద్యంతములు మార్చి వైళంబ తెమ్మనుడు నాతఁ డట్లొనరించెను. అనంతరము రాజున కీవృత్తాంతంబు రామకృష్ణుఁడు దెల్పిన నాతఁడు సంతసంబున దాని వినుటకు సెలవొసంగెను. పిమ్మట రామరాజభూషణుఁడు వసుచరిత్రము నామూలాగ్రంబుగఁ జదివెను. దాని సావధానముగ విని రా జాతనిప్రజ్ఞా విశేషంబుల కెంతయు నలరి యిట్టిరామభూషణకృతికిఁ దాఁ గృతిపతి గాకుండ
ఈకూర్చుండుట యక్కడనే చేసితిరేని యెండవానలవలన శ్రమ తప్పును. నాగృహమును బావన మగును. కాఁబట్టి నన్నుఁ గటాక్షించి యరుఁగుపై దయసేయుం" డని ప్రార్థించెను. అట్టిప్రార్థన వినియును వినన ట్లూరకుండి రామకృష్ణుఁడు రాత్రివేళ జనులందఱును నిండ్లకుఁ బోయినతఱి నావేశ్యయరుఁగుపైకి వచ్చి, ప్రవేశించెను. మఱునాఁ డతఁడు తనయరుఁగుపైకి వచ్చి యుండుటఁ జూచి "గాలి విశేషముగ వీఁచుచున్నది గావున స్వాములు లోపలిసావిడిలోనికి వచ్చి కూర్చుండిన వెచ్చగ నుండును. తాను సర్వకాలములలోఁ బరిచర్య చేయుట కనువై యుండును. కావున నట్లుగా ననుగ్రహింపుఁ"డని మఱియొకసారి ప్రార్థించెను. దానికి నుత్తర మేమియుం "జెప్పక యారాత్రి తొల్లింటి యట్లనే యంతఃప్రవేశము చేసెను. కాని యారెండుదినంబులును బైరాగి మాటలాడుట మాని మౌనవ్రతస్థునివలెనే చేతిసంజ్ఞలనే కాలము గడుపుచువచ్చెను. మూఁడవనాఁ డెవ్వఱును తనచుట్టు లేని సమయమున నాలుగైదువరహాలం దీసి వేశ్యమాతచేతి కిచ్చి తనకుఁ గావలసినయొకసేరుపాలును, పంచదారయును, కర్పూరము మొదలగుపూజా ద్రవ్యంబులును తెచ్చి యిమ్మని పల్కెను. అట్లుగా నైనను తనతో మాట్లాడుట గొప్పభాగ్య మని సంతోషించి వేశ్యమాత కావలసినవస్తువులం దెప్పించి యిచ్చెను. రామకృష్ణుండు మరల రెండవనాఁడు మఱినాల్గువరాల నిచ్చి తొల్లింటిదినమువలెనే పాలును, పంచదార మొదలగువస్తువులం దెమ్మని చెప్పెను. "పాలునకును పంచదారకును నిత్యమును నాలుగేసివరహాల నిచ్చుబైరాగి యొకగొప్పమహానుభావుఁడు గాకయుండునా" అని యావేశ్యమాత యతనికడ నెద్దియో స్వర్ణయోగ ముండక తప్పదు. దాని నొకదానిని పరిగ్రహించిన నిఁక నెన్నఁటికిని ధనలోప ముండ దని నిశ్చయించుకొని తనకూఁతుం బిల్చి "మన మెటులనైన నతనియుల్లము రంజిల్లం జేసి యాదివ్యక్రియ సంపాదింపవలయు" నని చెప్పి దానిని సమ్మతింపంజేసి నాఁటినుండి స్వాములవారిపరిచర్యకు
దానినే యప్పగించెను. ఆవారనారియును దననేర్పు బై రాగికిం దోఁపించుకోర్కెతో ననేక చమత్కారంబులు చేయుచు నాబైరాగికిఁ బరిచర్య సేయ నారంభించునది. బైరాగియును మొదటఁ దాను స్త్రీలతోఁ బ్రసంగము నైనం జేయ నని తెల్పియుఁ గ్రమక్రమంబుగ పైసుందరాంగితోఁ దల యెత్తకయే మాటలాడుచు, నది దరిఁ జేర వచ్చినప్పుడు వలదు వల దని తత్తరముతో నివారించుచు, నది దరిని వచ్చి కూర్చున్న వ్రతము వ్రత మని కేక వేయుచు నిటుల యధార్థముగ విరాగివలెనే యభినయించుచుండెను. ఇట్లుండ మఱికొన్ని దినంబులు జరిగెను. క్రమముగ నొక నాఁటికంటె నొకనాఁటికి వేశ్యకుఁ జనవు చిక్కెను గావున నది యతని కృష్ణాజినముమీఁదనే కూర్చుండుటయును, అతనికి ఫలహారమును స్వయముగ నోటి కందిచ్చుటయును, అతఁ డటునిటుఁ బోయినపు డతని జపమాలయు, గోముఖియుఁ దానే ధరియించి యాతని యాసనంబుననే నిద్రఁబోవుచున్నట్లుగాఁ బడియుంటయు జరుగుచుండెను. ఎన్ని యున్న నాతఁ డింద్రియ నిగ్రహము గలవాఁడుగాఁ గాన్పించుటంజేసి తుద కతనికి స్వర్ణ యోగమనోరథముం దెల్పి యతనిమనోరథంబు పడయుఁ డని ప్రార్థించెను. అపుడు యోగి సుముఖుండు గాఁగ నతనివిభూత్యుద్ధూళ నావృతవికృతాకారముం జూచి కన్నులు మూసికొని రెండవప్రక్కకుం దిరిగి పండియుండె. అపుడు కపటయోగి యగురామకృష్ణుం డాభోగినీపతివ్రతకు స్వస్వరూపప్రకటనముం జేయుట కదియ తఱి యని నిశ్చయించి యిట్లనియె :-
"మ. వరబింబాధరమున్ పయోరుహములున్ వక్రాలకంబుల్ మనో
హరలోలాక్షులు చూప కవ్వలిమొగం బైనంత నేమాయె? నీ
గురుభాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకుం జాలవే గంగ క
ద్దరి మే లిద్దరి కీడునుం గలదె యుద్యద్రాజబింబాననా."
అని యిట్లు చదివినపద్యంబు విని యాజవరా లతఁడు రామకృష్ణుఁడు గా నిశ్చయించి మోసమాయెఁ గదా యని యెంచి కుప్పించి యొక్కదాఁటున నింటిలోఁ బడి తల్లిం బిల్చి రామకృష్ణుఁడు భంగపఱిచె
నని తెల్పెను. ఇంతలో రామకృష్ణుఁడును గృష్ణాజినదండకమండలువు లచ్చటనే వదలి వడివడి నిలు సేరి సూర్యోదయంబుననే రాజాస్థానంబునకుం బోయి
"గంగ కద్దరి మే లిద్దరి కీరునుం గలదె యుద్యద్రాజబింబాననా"
పాతివ్రత్యప్రదర్శినీ తిరస్కారము.
ఒకానొకసమయంబున నొకకవి స్త్రీలకుఁ బాతివ్రత్యవిశేషములం దెల్పు "పాతివ్రత్యప్రదర్శిని" అను నొక గ్రంథమును రచియించి తెచ్చి రాయలసభలో సమర్పించెను. ఇట్లు సమర్పించుటయే కాక తా ననేకగ్రంథములు శోధించి వానిలోనిసారము నంతయు సంగ్రహించి నిర్దుష్టముగాఁ జేసి తా నాగ్రంథము రచియించితి ననియు నది తేటతెన్గుమాటలలో నుండు ననియు నాత్మస్తుతిగాఁ కొన్నిమాటలు ప్రస్తావించెను. అట్టిప్రస్తావనకు రామకృష్ణుఁడు కొంచెము కోపించి లేచినిలువంబడి యోయీ! నీ మనస్సునకు నిశ్చయముగ దోషరహితముగాఁ గానుపించుపద్యము నొకదానిం జదువు మని యడిగెను. దానికి లెస్స యని యాకవి యీక్రిందిపద్యము చదువ నారంభించెను. ఎట్లన్నను :-
"సీ. పతికి మాఱాడక పలుమఱు నేడ్వక, యలియక మిగుల గయ్యాళి గాక."
అనుడు రామకృష్ణుం డిఁక జాలుఁ జాలును. పైచరణములు చదువ నక్కఱలేదు. గ్రంథ మంతయు నీలాగుననే యుండును. అనుడు రాయలు అట్లైన నీయభిప్రాయాను సారముగ నాచరణమున కేమియర్థము చెప్పెదువో చెప్పు మనుడు రామకృష్ణుం డిట్లనియె. అర్థమున కేమి? అందఱకును స్పష్టమైనయర్థమే. ఇది విన్నంతమాత్రమున నిఁక నే యాఁడుదియును మగనికి నాజ్ఞావర్తిని గాకుండుటయే కాక వంటగూడఁ జేసి పెట్టు మని యాజ్ఞాపించును. ఇఁక మాబోంట్లకు నాబాధకూడఁ దటస్థింపకమానదు. అయినను పద్యము వినినయంతనే నాకుం దోఁచినయర్థము విశదీకరించెదను, చిత్తగింపుఁ డని యిట్లనియె.
ఆఁడుదానికిఁ జెప్పవలసినబుద్ధులలో మొదటిది భర్త పిలిచిన యపుడు మాటాడకుండుట. రెండవది పలుమాఱు నేడ్వఁగూడ దనుట. (అనఁగా నింటిలోఁ బనిపాటులు చక్కఁగాఁజేసికొనినపిమ్మట నాల్గు సారులో యయిదుసారులో నియతముగా నిత్యమును నేడువవలసిన దనుట.) మూఁడవది ఎట్టియవసరమైనపని యున్నను శరీర మలియక యుండునంతవఱ కే పని చేయవలెను గాని ప్రాణావసరము వచ్చినను
శరీరము నలియఁబెట్టకుండుట. ఇఁక నాల్గవనీతి యెట్లనఁగా; - మిగుల గయ్యాళి గాక యుండుట. అనఁగాఁ గొంతవఱకైనను గయ్యాళి గానిచో నాఁడుది కాఁపురము చేయఁజాలదు గనుక నామట్టుకు గయ్యాళిగా నుండవలయు ననియు నంత కధికముగా గయ్యాళి కాఁగూడ దనియు దీనియర్థము. అను రామకృష్ణునిపల్కులకు సభ్యులు రాజును విశేషధ్వనితో నవ్వందొడంగిరి. గ్రంథకర్త డగ్గుత్తిక దోఁప ముందరిచరణముం జదువలేకయుఁ జదివిన నిఁక నది యెట్లుగా నుపన్యసింపఁబడునో? అనుభీతిచేత నోరు మెదపక యూరకుండెను. రాయఁడును గ్రంథకర్తయొక్క యట్టినిశ్చేష్టితవ్యాపారములఁ జూచి సదయుం డై "రామకృష్ణుని పూర్వపక్షము లట్లే యుండును గావున సందియంబు వలదు. గ్రంథము మాకందఱకు నాదరణపాత్రము కాకపోదు" అనిపల్కి తద్గ్రంథకర్తకుఁ దగుబహుమానంబు లొనర్చి సాగం బనిచెను.
పంచతంత్రపద్యకావ్యవిషయము.
కృష్ణరాయని బావమఱఁది యగు "బైసరాజువెంగళరాజు" అను నఁత డొకగొప్పయాంధ్రకవి. ఇతఁడు పంచతంత్రిని బద్యకావ్యముగా నొనరించిన వారిలో నొకఁడు, తనగ్రంథము సంపూర్తియయినతోడనే వెంగళరాజు దానిని రాయలసభలోనిపండితులకు వినిపింపగోరి రాయనికిం దెల్పిన మంచిది యని పల్కెను. ఇట్లసుజ్ఞాతుండై పైకవి తనశపథములుగా గ్రంథపఠనమునకు ముందుగఁ గొన్ని మాటలం దెల్పెను. అందు మొదటిది తనకవిత్వమం దెవ్వరైనం దప్పు పట్టినచోఁ దన నాలుకం గోసికొనుట. రెండవది. తప్పులేకుండఁ దనగ్రంథములోఁ దప్పున్నట్లుగా నేరైనఁ జెప్పి రేని యట్లక్రమముగాఁ జెప్పినవారినాలుకం గోయుట. అనునిట్టిధూర్తనృపబంధుశపథంబులు విని కోపించి రామకృష్ణుండు లేచి
"ఈరాచకవిత్వబాధ పడరాదు గదా యెటువంటివారికిన్"
వాకిలికావలి తిమ్మన్నపైని జెప్పిన పద్య శేషము.
ఒకానొకదినంబున రాయలు తనవాకిలికావలిగా నున్న తిమ్మన్న యనునొకదండనాయకునియెడల నతనిశౌర్య విశేషమునకుగా సంతసించి యతని కొక విలువ గలపట్టుపచ్చడమును (సేలును) బహుమాన మిచ్చెను. అట్టి బహుమానము నాతఁ డంది తనయింటికివచ్చి వీథియరుఁగు పయిఁ గూర్చుండెను. అంతట నావీథినే, అల్లసాని పెద్దన్న, ముక్కుతిమ్మన్న, భట్టుమూర్తి, రామకృష్ణుఁడును బోవుచుండి రాయనికడ బహుమానము నంది వచ్చియున్నతిమ్మనదండనాయకునిఁ జూచి తమ సంతోషముంగూడ నాతనికిం దెలుపుకోరికెతో నతనికడఁ గొంతసేపు కూర్చుండి యతనిని మాటలతో నలరించిరి. అపుడు వారిలోఁ పెద్దన యొక పద్యముఁ జెప్పెడుతలంపున :-
క. వాకిటి కావలితిమ్మా
అనుడు - ముక్కుతిమ్మన్న లేచి
ప్రాకటముగ సుకవివరులపాలిటిసొమ్మా
అనుడు, భట్టుమూర్తి లేచి
నీ కీపద్దెము కొమ్మా
అనెను. అంత రామకృష్ణుఁడు లేచి :-
"నా కాపచ్చడమె చాలు నయముగ నిమ్మా"
అని పూర్తిచేసెను. తిమ్మనదండనాయకుఁ డాపద్యమున కెంతయు నలరి యందలితుదిభాగములో భావప్రకటన చేసినరామకృష్ణునకుఁ దాను బహుమానముగ నందివచ్చినపచ్చడ మిచ్చి తక్కినవారికి మఱి కొన్ని బహుమానముల నిచ్చి పంపెను.
ఇట్లింకను రామకృష్ణునివిశేషములం దెల్పుగాథలు పెక్కులు చెప్పంబడును. ప్రస్తుతము నాకు లభ్యమైనవానిలో రసికులు మెచ్చఁదగినట్టియు, పండితులకు శ్రవణయోగ్యము లగునట్టియు, నీరసములు కానట్టియుఁ గొన్నిగాథల వివరించితిని. తెనాలిరామకృష్ణునికథ లను నామముతో నొప్పునవి పామరజనమనోరంజకములుమాత్రమే గానవాని నిందుఁ జేర్పక రామకృష్ణుఁడు కేవలము పండితుఁడుగా నుండిపండితులతోఁ జేసినసంవాదవిశేషములనే చేర్చి వక్కాణించుట యయినది. రామకృష్ణునిచాటుధారాపద్యములు.
ఈరామకృష్ణుఁడు పదగుంభనకవిత్వంబునకు మిగులఁ బ్రసిద్ధుఁడు కావున నీతఁడు పాండురంగవిభునిపదగుంభన మని తొంటిపద్యంబున వాక్రుచ్చెను. దానికిఁ దార్కాణంబుగ నీక్రిందఁ గొన్ని పద్యంబుల వివరింతము.
గీ. అతివక చనాభిజఘనదేహాననము లు, మీనదరసాలతారాజపానిరాక
రణ మనంత మనాది నేత్రగళభుజన, భోష్ఠకుచవచోదంత ముభయగతిని.
ఈచిన్ని పద్యంబున నొకస్త్రీయవయంబులవర్ణన మంతయు నిమిడ్చె.
మఱికొన్నిపద్యంబుల వివరింతము.
"సీఁ. భుజగలోకాధీశభోగితల్పశయాన, హరిరూపధరమహాపురుష యనుచు
నతులాబ్జమకుటవర్ణితపాదరాజీవ, రామార్చనీయశ్రీరంగ యనుచు
మారీచమదభంగమహితవాయ వ్యాస్త్ర, శరదనిద్రితనేత్రజలజ యనుచు
సముదగ్రవర్షావసరయోగనిద్రాణ, కరిరాజవరద శ్రీకాంత యనుచుఁ
గీ. దలఁకు సులుకు నలంకు బెగ్గిలుచుఁ బలుకు, సఖులనయనస్వనశిరోజచరణకలన
పవనకందర్పఘనహాంసజవనతురగ, భటనటప్రియసముదాయపటిమ దోఁప.
క. విధుకృతకదనము వదనము, మధుకరనికరముల గేరు మగువచికురముల్,
విధుమధుకరలీలాజయ, మధురోక్తులు పిక్క లౌర మధురాధరకున్.
సీ. ద్విరదంబు నడతోడ సరి రాక ముఖణంగ, దశ నొంది నవ్వుతోఁ దనరఁ జూచె
గగనంబు నడుముతోఁ బగఁ జెంది మధ్యమాం,తము నొంది వేణితో సమతఁ బూనె
పారసం బంఘ్రితో సరి రాక సావర్ణ్య, గతి మాని మోనితోఁ గదియఁ జూచెఁ
గనకారి కటితోడ నెన మాని నారివే, షముఁ బూని మేనితో సరిగఁ జూచెఁ
గీ. దిరిగి సతికంఠకుచబాహుసరసనాసి, కలకు భయ మంది మొఱ పెట్టి గతులు మాని
యొరగి ధరఁ గూల వత్తులై యెకట రెంట, మూఁట నాల్గంటితో సరి మొనయవయ్యె.
గీ. అధరముఖవర్ణ శూన్యంబు లతివకుచము, లాననా కారరహిత మజ్జాక్షిమేను
అజజఘనమండలము లంచయానకురులు, చరసుఖాదితకరములు చానతొడలు.
చ. సతికుచవాక్సమత్వ మరిజాతసుధ ల్గొనఁ బూని వాదు లై
హతులయి వారిజాతవసుధాకృతు లూని యు దృజ్నితంబని
ర్జితరుచి గాంచియుం దుది నరిత్వముఁ జెందినచంద్రసేవధి
స్థితిని ముఖాంగము ల్గెలిచె సీ తగ దిన్నిట నొంటి నోడినన్.
"గీ. పల్లవం బూని సకియమే నెల్లఁ జేసి, పద్మగర్భుండు లా దీసి వాగుడిచ్చి
బూవిసర్జించి యప్పు డప్పూవుఁబోఁడి, డెంద మొనరించె సందేహ మొంద నేల."
ఇంకను ననేకపద్యంబు లున్నయవి. ఇవి యన్నియుఁ బాండురంగవిజయంబులోని వని యందురు. పాండురంగ విజయమునకుఁ గథానాయకు దనపేరిటివానినే నిర్మింప దలంచి తననామాంతర మైనపాండురంగఁ డనుపే రిడెనఁట! చాటుధార నీతఁ డనేకపద్యంబులు సెప్పి యుండెను :-
దశావతారపద్యములు
విష్ణునిదశావతారంబులఁ బద్యదశకంబున వర్ణించె. దానిం జూచిన నీతనిసంత్కృతసాహీతిపటిమయు సమాసకల్పన లోనిప్రజ్ఞయుఁ గాన్పించును కావున వాని నీక్రింద వివరింతము :-
శా. పాధీయోముఖపూరితోద్వమితతాసత్యోర్ధ్వగోదన్వద
ర్ణోధారాంతరట త్తిమింగిలగిల ప్రోద్ధాన నిధ్యానల
బాధీశప్రభుతాస్వభాగహరణార్థాయాయినాథానుజ
ప్రాధా న్యాతివిలోలవాగ్ద్రుగబటబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 1
శా. ద్యూత్తుంభద్గిరికల్పితావతరణద్యోదాహినీసంగమో
పాత్తేందూదయనిష్పితౄణజలధిప్రారబ్ధపుత్త్రోత్సవో
దాత్తక్వాక్తగజాశ్వవన్యశనక న్యాగోమణీదానసం
పత్తిప్రీణితదేవఢుల్యధిపతిబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 2
శా. ఆద్యాలోకనభక్తి సంభ్రమదనేహఃపూరుషత్యక్తస
త్పాద్యాంభస్తులపీభ్రమప్రదఖురప్రక్షాళ నామాత్రజా
గ్రద్యోగాంబుధిదంష్ట్రికాగ్రరిపుహృత్కాలామిషప్రాయశుం
భద్యాదోనిధిప ప్తకీస్థలికిటిబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 3
శా. డింభద్రోహివధోత్కటోత్క్రమణదుష్టిక్లిష్టతారోమకూ
పాంభోజప్రభవాండభాండదళ నోద్యద్ధ్వానధీకృత్సభా
స్తంభాంతస్ఫుటవస్ఫురత్పెళ పెళధ్వన్య స్త నిశ్చేష్టని
ర్దంభోద్యోగదిశావకాపనృహరిబ్రహ్మన్ స్తుమ స్త్వామనున్. 4
శా. స్వతలస్వచ్ఛతరారుణత్వరచితస్వస్త్రీపరేడ్భ్రాంతివా
క్ప్రతికూలత్వదశానుకారిగళ గాద్గద్యక్షమాంభోజభూ
నుతిహాసన్న ఖరప్రసారితపదాణ్ణీరుడ్జగంగాసవా
ప్రతిమాళీశక పర్దమండలవటుబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 5
శా. అజిప్రౌఢిమదుర్జయార్జునగళోదగ్రాసృగాస్వాదన
వ్యాజాపోశనభాక్తదస్వపహృతిప్రాణాహుతిప్రస్ఫుర
ద్రాజాళీనిఘసావసానవిఘసప్రాయేందుఫేలాయితా
బ్రాజాధ్యక్షకుఠారధారిభృగురాడ్బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 6
శా. చాపచ్ఛాత్రనిషంగభంగకుపితక్ష్మా భృద్ధనుఃపంచవ
క్త్రీపంచాళికదృఙ్ని యోక్తృహుతభుగ్గ్రీవాద్వయీపంచక
వ్యాపారభ్రమకారిపంక్తిగళగళ్యాఖండనాఖండదో
ర్నై పుణ్యప్రదరౌఘరాఘవపరబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 7
మ. కరిపూరుద్ధరణేర్థలాంగలవిభగ్న క్ష్మాభరాదక్షది
క్కరిపాదప్రహరస్ఫుటత్స్ఫటిపభోగ వ్యాపృతగ్రీవసూ
కరపీఠీకృతపృష్ఠతాహితమహాగాఢాధికూర్మాధిరా
ట్పరిక్లప్త ప్రళయాంబు గాహనహలిబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 8
మ. అతిదోఃపీడనకర్కరీఫలితకంఠాభత్వదుర్థర్త్వధూ
ర్తతృణావర్తదృఢాంగపాతహితగోత్రాభర్తృకోత్పాదిత
క్రతుభుగ్రా డ్గ్రహణాగ్రహోన్ముఖశతారథ్వస్తమైనాకని
ష్పతనభ్రాంతిగనందగోపక సుతబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 9
మ. స్వమహాబాహుకృపాణ కృత్తగళతుచ్ఛ మ్లేచ్ఛవీరస్ఫుటో
త్క్రమణాపాదితపద్మినీరమణమధ్యచ్ఛిద్రఖశ్యామికా
గమనా నాసమయోపరాగముదితక్ష్మా సౌర గం గానదీ
భ్రమకృత్కీర్తిక కల్కిమూర్తిక పరబ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్. 10
ఈ పద్యంబులలో నేకసమాసము లుండుటయు అను నను తెనుఁగుపద ముండుటయుఁ జిత్రము.
రామకృష్ణునిచాటువు లని వాడుక గలపద్యములు.
చ. దర, భుజగేణ, సింహములు, తద్గళ, వేణ్య, వలోకనద్వయో
దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం, గుహాం
తరముల పూన నిక్క, తిన, డాఁగ, స్రవింప, నిటూర్పు లూర్చ స
త్వరముగ నేఁగి నీడ గని తత్తర మందఁగఁ జేసి తౌ చెలీ. 1
శా. శైవాలంబును సైకతంబు లెదురై, చంద్ర, ప్రవాళాం, బుజ
గ్రావా, కాశ, భుజంగ, కూపములు దూరంబైన నే తత్పరీ
క్షావిద్యా విభవంబొనర్పఁగ దశాబ్జజ్యోత్స్నలో నర్ధచం
ద్రావిర్భావముఁ జూపినం గలిసెఁ దా నాత్మేశు భావజ్ఞయై. 2
చ. సరసిజనేత్ర! నీవిభునిచక్కనిపేరు వచింపు మన్న న
ప్పరమపతివ్రతామణియు భావమునన్ ఘన మైనసిగ్గునన్
గరియును, రక్కసుండు, హరుకార్ముకమున్, శర, మద్దమున్ శుకం
బరుదగువానిలోనినడిమక్కరమున్ గణుతింపఁ బేరనెన్. 3
సీ. శరదంబు వేణికి శాంతభావము నందె, దరహాస మడరి వెంట నె యమర్చె
మఱి కంత మెదిరింపఁ దిరిగి సమం బయ్యెఁ బిరుదాదినుంచిపైఁ దరలఁద్రిప్పె
నునుపల్కుకలిగించి మెనమాన్చెనంతట, జంఘలు ముఖభంగ సరణి మించె
పెందొడసిరితక్కు పొందక సవరించె, కరములు వెనుకముం దరుగఁజేసె.
గీ. తనురుచిస్ఫూర్తి సానుబంధత యొనర్చె, గతివిసర మెంచె నంతరంగములు గలఁగ
నవరసప్రాప్తి యొనఁగూర్చు నాఁడునాఁటి, కలరుచన్గుత్తు లీకొమ్మ కలరు జుమ్మ.
సీ. ఘనకేశ యని నీవు చెనక రాకు సమీర, భుజగరోమాళి యీపువ్వుఁబోఁడి
మీనాక్షి యనినచో మీరకు కోకంబ, చంద్రికాహాస యీచంద్రవదన
బింబోష్ఠి యనినచో బెదరింపకు శుకంబ, సాంకవామోద యీసన్ను తాంగి
కంజాస్య యనినచోఁ గలహించకు మృ గాంక, స్వర్భానువేణి యీజలజపాణి.
గీ. శ్వాస, వక్షోజ, వచనా, స్యబాంధవముల, బంధువులు గాన మీకుఁ జెప్పంగవలనె
నిట్లు వినకున్నఁ బరువులు నిడుట, యెగిరి, పడుట పదరుట కందుట ఫలము సుమ్మి.
క. తారకములఁ గోరకముల, వారకముల కెల్ల నెల్ల వారకము లిడున్
శ్రీరమణీహారమణీ, భారమణీయత్వదీయ పదనఖరంబుల్. 6
గీ. తామర బిడారు కొమ్మ నెమ్మోమునకును, సారచంద్రచంద్రస్ఫూర్తి సాటి యగునె
నాతితలమిన్న చెక్కిలివా తెరకును, సారచంద్రచంద్ర స్ఫూర్తి సాటి యగునె. 7
సీ. చక్ర స్తని యటంచు జగడించకు శశాంక, గురుతమోవేణి యీకుందరదన
మధురాధర యటంచు మట్టుమీఱకు తేఁటి, చంపక నాస యీజలజవదన
బిసబాహ యని మాఱు మసలకు రాయంచ, జలధరచికుర యీ కలువకంటి
పల్లవకర యని త్రుళ్లకు కోయిల, శ్రీరామమూర్తి యీకీరవాణి
గీ. వదన కుంతల, యాన, సుస్వరసఖిత్వ
మెనపి యుండినకతన మీ కిత వొనర్చు
ననుచు వళి, చంద్ర, పరభృత, హంసములకు
భయము, నయమును దెలియంగ బలికె మఱియు. 8
చ. వదలక మ్రోయు నాంధ్రకవివామపదస్థితహేమనూపురం
బుదితమరాళకంతనినదోద్ధతి నేమనిపల్కుఁ? బల్కుఁగా
ముదిసినకాలమందునను ముందటియట్లుగ భాగ్యరేఖ నీ
నుదుటను లేదు లే దనుచు నొచ్చిన మెచ్చిన భూవరుం డిలన్. 9
మ. సతతోత్సర్జనవార్ధునీసముదితస్వర్ణాద్రిరాట్కర్ణి కా
భ్రతలేందిందిరడింభగుంభితయశోభ్రాజచ్ఛితాంభోరుహా
తతవిస్ఫూర్తికరోరుదోఃప్రఢిమసత్ప్రాగ్రావజాగ్రన్ని జా
ద్భుతతేజోనవహేళిసంవరణభూభౄన్మౌళి యొప్పెన్ భువిన్. 10
మ. బలవద్దర్పకశస్త్రికానిహతి నైప న్లేక యవ్వేళ న
య్యలినీలాలక యంబరాంతపరిణీతాత్మీయభిన్నాననో
త్పలినీబాంధవ యౌచు నేడ్చెఁగడు భూపా లైకరాగంబునన్
గలకంఠీ, కలకంఠ, కంఠ, నినదైక్యస్ఫూర్తి శో భిల్లఁగన్. 11
గీ. ఓయి కురురాజ ! నీకొడు కుత్తగోల, కొండవలె నుండు విను మాల ముండ దింక
భండనంబునఁ గెల్పింతుఁ బాండుసుతుల, నురమునను బూలదండ రే కొత్తకుండ. 12
క. జలచరము మిడుత మ్రింగెను, జలచరమును మ్రింగె మిడుత జగతీస్థలిలో
వలరాజు రాజు మ్రింగెను, వలరాజును రాజు మ్రింగ వచ్చినఁ బడియెన్. 13
ఉ. అక్షరపక్షపాతమున నర్థము నూళ్ళ నొసంగ నుబ్బుచున్
భిక్షజటాధరాదికులు భిన్న నిజవ్రతు లౌదు రైన దు
ర్భిక్షరుజాశిశుచ్యుతులు పెక్క గుభక్తి య చాలు దాననౌ
తక్షుభితత్వమే యఘము దార్పుఁడు శంక దొఱంగు మీయెడన్. 14
చ. అలఘనచంద్రబింబనిభ మై తగుకాంతమొగంబు, దానిలోఁ
గలిగినయర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పుకొప్పు, చె
క్కులు రదనాంశుకంబు నవి గుబ్బలకున్ సరిరాక పోయెఁ జే
తులు సరి యయ్యె దానిగతి దోఁచెను బొంక పుటారు దానికిన్. 15
ఉ. అనలి నాక్షి వేనలికి నంబుథరంబు సమంబు గామిచే
దా నిరువ్రయ్యలై చనినఁ దద్దశఁ జూచి దయార్ద్రులై బుధుల్
దానిపదాంతరంబునను దారు వసించినవారు గావునన్
బూని తదంశమున్ సమతఁ బోల్చిరి తత్సతిదృక్కుచంబులన్. 16
పైపద్యములలో నన్నియుఁగాని కొన్నిగాని రామకృష్ణుని వని నిస్సంశయముగఁ జెప్పంజాలము. కావనియు నిర్ధారణ జేయ వలనుపడదు.
- ↑ ఈశ్వరప్రగ్గడవా రని మఱికొంద ఱందురు.