కవిజనాశ్రయము/వృత్తాధికారము
శ్రీరస్తు.
కవిజనాశ్రయము
[1]వృత్తాధికారము.
- సమవృత్తములు -
వ. అత్యు క్తాఛందంబునకు రెం డక్షరములలో లుగువృత్తంబులు పుట్టె. అందు,
[12]శ్రీ పెంపువృత్తము. - శ్రీపెం
పోపున్
బ్రావున్
గావున్.
వ. మధ్యాఛందంబునకు మూఁ డక్షరంబులు నెనిమిదివృత్తములు పుట్టె. అందు,
వినయవృత్తము.- వినయం
బునయం
బునయ
జ్ఞునకున్ •
[13]మృగీవృత్తము.- విన్ము రే
ఫన్మృగీ
మున్ముగాఁ
జిన్మయా.
[14]నారీవృత్తము. -
నారీవృ
త్తారంభం
బారున్మా
కారంబై .
వ. ప్రతిష్ఠాఛందంబునకు నాలుగక్షరంబులు పాదంబుగాఁ బదునాఱువృత్తంబులు పుట్టు. అందు,
బింబవృత్తము. - పంబి భకా
రంబుగకా
రంబునుగా
బింబ మగున్. 10
సుకాంతివృత్తము . -
జకారమున్
గకారమున్
సుకాంతి కొ
ప్పకుండునే. 11
[15]కన్యావృత్తము, — పొత్తైగాగా
పత్తిం గన్యా
నృత్తం బయ్యెన్
జిత్తం బారన్. 12
వ. సుప్రతిష్ఠాఛంబున కైదక్షరంబులు పాదంబుగా ముప్పదిరెండువృత్తంబులు పుట్టె. అందు,
సుందరీవృత్తము – చెంది భకారం
బొంద గగంబుల్
సుందరి య న్పే
రందురు సూరుల్. 13
ప్రగుణవృత్తము. -
సగణం బొందన్
గగముం జెందన్
బ్రగుణం బ న్పే
రగు నీధాత్రిన్ - 14
అంబుజవృత్తము.-
ఇంబుల భకా
రంబును లగం[16]
బుం బొనరఁగా
నంబుజ మగున్.[17] 15
వ. గాయత్రీఛందంబునకు నాఱక్షరంబులు పాదంబుగా నఱువది నాలుగువృత్తంబులు పుట్టె. అందు,
విచిత్రవృత్తము.— యయంబుల్ విచిత్రా
హ్వయం బయ్యె ధాత్రిన్ - 16
తనుమధ్యావృత్తము -
[18]చంచ త్తయము ల్ప్రా
పించున్ దనుమధ్యన్. 17
[19]సురలతావృత్తము — పరఁగ నయంబుల్
సురలత కొప్పున్. 18
[20]వసుమతీవృత్తము. - అందంబుగఁ దసల్
పొందున్ వసుమతిన్. 19
వ. ఉష్ణిక్ఛందంబునకు నేడక్షరంబులు పాదంబుగా 128 వృత్తంబులు పుట్ట. అందు,
విభూతివృత్తము. - శ్రీఫలా విభూతికిన్
రేఫపై జగం బగున్. 20
మదనవిలసితవృత్తము. -
మదనవిలసితం
బుదిత [21]ననగముల్. 21
కుమారలలితవృత్తము[22]. -
కుమారలలిత కం
దమాయె జనగముల్. 22
సురుచిరవృత్తము –
భాసుర భసగల్ రే
చా సురుచిర మయ్యెన్. 23
[23]మదరేఖావృత్తము. -
కోపొందన్ మసగంబుల్
ప్రాపించున్ మద రేఖన్. 24
వ. అనుష్టుప్ఛందంబున కెనిమిదియక్షరంబులు పాదంబుగా 256 వృత్తములు పుట్టె. అందు,
విద్యున్మాలావృత్తము. -
ఉద్యన్మాగాయుక్తం బైనన్
విద్యున్మాలావృత్తం బయ్యెన్. 25
చిత్రపదవృత్తము. - సద్విధిఁ జిత్రపదం బౌ
భద్వయగద్వయ ముప్పన్. 26
మాణవకవృత్తము. -
మాణవకాఖ్యం బగు న
క్షీణ భతంబు ల్లగముల్. 27
ప్రమాణీవృత్తము.-- అగున్ జకార రేఫలున్
లగంబునుం బ్రమాణికిన్. 28
సమానీవృత్తము. - ఇంబుగా రజంబు వకా
[24]రంబు గా సమాని యగున్. 29
సింహ రేఖావృత్తము. -
[25]శ్రీ రజంబుపై గగంబుల్
చేర సింహ రేఖ యయ్యెన్ . 30
వ. బృహతీఛందంబునకుఁ దొమ్మిది యక్షరంబులు పాదంబుగా 512 వృత్తంబులు పుట్టె. అందు,
భుజగశిశురుతవృత్తము. –
భుజగశిశురుత మౌఁ బె
న్నిజముగ ననయముల్ గాన్. 31
హలముఖీవృత్తము. -
చిత్తజోపమ హలముఖీ
వృత్త మయ్యెను రనసలన్. 32
ఉత్సుకవృత్తము. –
సుందర మై భభరంబు లిం
పొందిన నుత్సుక మై చనున్. 33
భద్రకవృత్తము. -
విద్రుతాఘ రనరంబులన్
భద్రకం బగు ధరిత్రిపై.[26] 34
- యతినియమము. -
[27]క. వెలయ నిటఁబట్టి వళ్లిడ
వలయును విశ్రమము నిలుపవలయును గబ్బం
బులఁ గావున నే నెయ్యడ
నిలిపితి నయ్యెడల నెఱిఁగి నిలుపుఁడు వానిన్. 35
వ. పఙ్త్కిచ్ఛందంబునకుఁ బది యక్షరంబులు పాదంబుగా 1024 వృత్తంబులు పుట్టె. అందు,
రుగ్మవతీవృత్తము. -
వాగ్మి ! భమప్రవ్యక్తి సగంబుల్
రుగ్మవతీ సద్రూపక మయ్యెన్. 36
మత్తావృత్తము. -
మత్తావృత్తం బగు మభసంబు
ద్యత్తేజస్వీ ! గయుతము గాఁగన్. 37
మయూరసారివృత్తము. -
పన్ను గా రజంబుపై రగంబుల్
సన్ను తా ! మయూరసారిఁ జెప్పున్. 38
[28]శుద్ధవరాటీవృత్తము. -
[29]సంబుద్ధిన్ మసజంబుతో, గకా
రంబై శుద్ధవరాటి నాఁ జనున్. 39
పణవవృత్తము. -
యత్నంబై మనయగముల్ వాక్ఛ్రీ
పత్నీవల్లభ ! పణవం బయ్యెన్. 40
వ. త్రిష్టుప్ఛందంబునకుఁ బదునొకం డక్షరములు పాదంబుగా 2048 వృత్తంబులు పుట్టె అందు,
శాలినీవృత్తము. -
[30]వంద్య శ్రీసంసేవ్యవక్షా! మతాగా
నింద్యంబైనన్ శాలినీనామ మయ్యెన్. 41
ఇంద్రవజ్రావృత్తము. -
ఇత్తాజగాసంగతి నింద్రవజ్రా
వృత్తం బగున్ సన్నుతవృత్త రేచా ! 42
ఉపేంద్రవజ్రావృత్తము. -
సపద్మపద్మా[31] ! జతజల్ గగం బీ
యుపేంద్రవజ్రాఖ్యము నొప్పుఁ జెప్పన్. 43
రథోద్ధతవృత్తము. -
నందితప్రియ ! రనంబుపై రవం
బొంది వచ్చిన రథోద్ధతం బగున్. 44
చంద్రికావృత్తము. -
ససరవము వినమ్రవిద్విషా!
జినమతహిత ! చెప్పుఁ జంద్రికన్. 45
స్వాగతవృత్తము. -
స్వాగతం బగు లసద్గుణలక్ష్మీ
భాగభోగి! రనభల్ గగయుక్తిన్. 46
కాంతావృత్తము. -
సారప్రభవాద్య! తజాపము లా
కారస్మర ! పొందినఁ గాఁత యగున్. 47
శ్యేనీవృత్తము. -
శ్యేనికిన్ రజంబు చెందఁగా రవం
బానతారి! పొందు నంద మొందఁగాన్. 48
వాతోర్మివృత్తము. -
వారశ్రీవల్లభ ! వాతోర్మికి నా
ధారం బయ్యెన్ మభతంబుల్ లగమున్. 49
[32]తోధకవృత్తము. -
శ్రీయుత! భత్రయ సేవ్యగగంబుల్
తోయజలోచన! తోధకమయ్యెన్. 50
వ. జగతీఛందంబునకుఁ బండ్రెం డక్షరములు పాదంబుగా 4096 వృత్తంబులు పుట్టె. అందు,
భుజంగప్రయాతవృత్తము. -
జగద్గీతకీర్తీ ! భుజంగప్రయాతం
బగున్ రేచనా! యద్వయద్వంద్వమైన. 51
తోటకవృత్తము. -
తుదిదాఁక సకారచతుష్కముగా
విదితంబుగఁ దోటకవృత్త మగున్. 52
ఇంద్రవంశవృత్తము. —
సన్మానదానా! తతజంబు రేఫతో
విన్మింద్రవంశాహ్వయవృత్తమై చనున్. 53
వంశస్థవృత్తము. -
సముజ్జ్వలాంగా! జతజంబు రేఫతో
నమర్ప వంశస్థసమాహ్వయం బగున్. 54
ద్రుతవిలంబితవృత్తము. --
ద్రుతవిలంబిత దుష్కరవృత్త మ
ప్రతిమమయ్యె నభారగణంబులన్. 55
[33]తోదక వృత్తము. -
జలరుహవక్త్ర! నజాయగణంబుల్
వెలయఁగఁ దోదకవృత్తముఁ జెప్పున్. 56
స్రగ్విణీవృత్తము. -
వాగ్వధూవల్లభా! వార్ధిరేపావళిన్
స్రగ్విణీవృత్త విశ్రామముల్ ధాత్రిపై. 57
జలధరమాలావృత్తము. -
మారాకారా! జలధరమాలావృత్తా
కారం బయ్యెన్ మభసమకల్పం బైనన్. 58
[34]ప్రియంవదావృత్తము. -
నయుతమై నెగడినం బ్రియంవదా
హ్వయ మగున్ భజరవర్గ మిమ్మహిన్. 59
ప్రమితాక్షరవృత్తము. -
అమరంగఁజేయు సజసావళితోఁ
బ్రమితాక్షరాఖ్యము నపారగుణా! 60
జలోద్ధతగతివృత్తము. -
జలోద్ధతగతిన్ జసంబుల జసం
బులొంది యెఱిఁగింపు భూజననుతా![35] 61
[36]విశ్వదేవీవృత్తము. -
విద్వద్వంద్యోద్యద్వృత్త ! విన్మద్వయంబున్
యద్వంద్వంబున్ గావించునవ్విశ్వదేవిన్. 62
వ. అతిజగతీఛందంబునకుఁ బదుమూఁడక్షరంబులు పాదంబుగా 8192 వృత్తంబులు పుట్టె. అందు,
ప్రహర్షిణీవృత్తము. –
నీతిజ్ఞస్తుత ! ధరణిన్ బ్రహర్షి ణీవి
ఖ్యాతంబుల్ మనజరగంబు లంబుజాస్యా! 63
[37]రుచిరవృత్తము. -
అనంగసన్నిభ! రుచిరాహ్వయం బగున్
ఘనంబుగా జభసజగంబు లొందినన్. 64
[38]మత్తమయూరవృత్తము. —
అన్వీతోద్యద్వాజ్ఞిలయా! మత్తమయూరం
బన్వృత్తంబయ్యెన్ మతయంబుల్ సగయుక్తిన్. 65
మంజుభాషిణీవృత్తము. -
జగదేకమిత్ర ! సజసంబుపై జగం
బగుమంజుభాషిణికి నంద మొందఁగాన్. 66
[39]జలదవృత్తము. -
ఆభరనంబుపై భగురువైనఁ గవీం
ద్రాభరణీయమాన ! జలదాఖ్య మగున్. 67
[40]ప్రభాతవృత్తము. -
మొనసి నజూరగముల్ సనం బ్రభాతం
బనియెడువృత్త మనంగ సన్ని భాంగా! 68
వ. శక్వరీఛందంబునకుఁ బదునాలు గక్షరంబులు పాదంబుగా 16384 వృత్తంబులు పుట్టె. అందు,
వసంతతిలకవృత్తము. -
సారంబుగాఁ దభజజంబు వసంతరాజా
కారా ! వసంతతిలకం బగు గాయుతంబై. 69
[41]పరాజితవృత్తము. -
ననర సలగముల్ పెనంగిన సద్యశో
ధన ! వినుము పరాజితం బగు రేచనా! 70
[42]వనమయూరవృత్తము. --
నందితా గుణా ! భజసనంబులు గగం బిం
పొంది చనఁగా వనమయూర మగుఁ బేర్మిన్. 71
ప్రహరణకలితవృత్తము. -
[43]ప్రహరణకుశలా ! ప్రహరణకలితా
సహజము లనఁగాఁ జను నసభనవల్. 72
అసంబాధవృత్తము. -
[44]సారప్రజ్ఞాంభోనిధి పురుష ! యసంబాధా
కారాన్వీతంబై చను మతనసగాయుక్తిన్. 73
భూనుతవృత్తము. -
శ్రీనివాస! రనభావలిఁ జెంది గగంబుల్
భూనుతంబుగ నొడంబడి భూనుత మయ్యెన్ . 74
[45]సుందరవృత్తము. --
సుందరరూపసమేత! సుందరవృత్త మిం
పొందుచు భారసవంబు లొంది బెడంగగున్. 75
వ. అతిశక్వరీఛందంబునకుఁ బదునై దక్షరంబులు పాదంబుగా 32768 వృత్తంబులు పుట్టె. అందు,
[46]మణిభూషణశ్రీవృత్తము. -
శ్రావకాభరణ! శుభ్రయశా! మణిభూషణ
శ్రీ వెలుంగు రనభార విశేషగణంబులన్. 76
అలసగతివృత్తము. -
[47]పొలసి నసనంబు భయమున్ వెలయఁగా నిం
దలసగతి నొందుఁ గృతియందు నుతియందున్. 77
వ. [48]అష్టీఛందంబునకుఁ బదియా ఱక్షరంబులు పాదంబుగా 65536 వృత్తంబులు పుట్టె. అందు,
పద్మవృత్తము. -
నభజజంబులు జగంబుఁ బెనంగి యతు ల్దిశా[49]
ప్రభవమై కవిజనాశ్రయ! పద్మ మనంజనున్. 78
ప్రియకాంతావృత్తము. -
నయనయసంబుల్ గురువు పెనంగం బ్రియకాంతా
హ్వయమగు శిష్టామరతరువా! దిగ్యతియైనన్.[50] 79
చంద్రశ్రీవృత్తము. -
కవీంద్రేంద్రక్ష్మాజా! యమనసరగప్రాప్తమైనన్
గవీంధ్రుల్ చంద్రశ్రీయనిరి యతిగా రుద్రసంఖ్యన్. 80
మేదినీవృత్తము. —
నజభజముల్ రగంబులఁ బెనంగి దిగ్విరామ
ప్రజనిక లొప్పు మేదినికిఁ బంకజోపమాస్యా ! 81
పంచచామరవృత్తము. --
[51]కనద్యశా ! జరంబుతో జకారమున్ రజంబులున్
జనన్ గకారయుక్తిఁ బంచచామరం బగున్ ధరన్. 82
[52]మదనదర్పవృత్తము. -
శ్రీభసజరజుల్ గయుక్తిఁ జెంది వచ్చినం గుమా
రాభ! మదనదర్ప మయ్యె నబ్జభూవిరామమై. 83
వ. అత్యష్టీఛందంబునకుఁ బదియే డక్షరంబులు పాదంబుగా 131072 వృత్తంబులు పుట్టె, అందు,
శిఖరిణీవృత్తము. –
పురారాతిస్ఫర్థీ! యమనసభవంబుల్ పెనఁగి సుం
దరంబైనన్ రేచా! శిఖరిణియగున్ ద్వాదశయతిన్. 84
[53]సుగంధివృత్తము .--
భాసురంబుగా రజద్వయంబుపై రవంబు గూడఁగా
నాసుగంధికిన్ దిశావిరామ మంచితం బగున్ ధరన్. 85
హరిణీవృత్తము. -
నసమరసవప్రోక్తంబై రుద్రనవ్యవిరామ మిం
పెసఁగ హరిణీవృత్తంబయ్యెన్ గవీంద్రజనాశ్రయా ! 86
[54]పాలాశదళవృత్తము. -
కదియఁగ నననన నగగములకును బాలా
శదళ మనఁ జనునది దశమయతియుఁ గాఁగన్. 87
మందాక్రాంతావృత్తము. -
కాంతాకాంతా! మభనతతగా కాంతి సంక్రాంతి[55] మందా
క్రాంతంబన్పే రమరు దశమాశ్రాంతవిశ్రాంత మైనన్. 88
నర్కుటవృత్తము. -
నజభజజల్ వకారము పెసంగిన నర్కుటకం
బజితగుణాన్వితా! యతి దిశాన్వితమై పరఁగున్ . 89
[56]పృథ్వీవృత్తము. -
ప్రియంబగుచు రుద్రవిశ్రమము పృథ్వికాసంజ్ఞికా
హ్వయం బగు జసంబుతో జసయనంబులున్ గూడినన్. 90
వ. ధృతిచ్ఛందబునకుఁ బదునెనిమిది యక్షరంబులు పాదంబుగా 262144 వృత్తంబులు పుట్టె. అందు,
కుసుమితలతా వేల్లితవృత్తము. -
అశ్రాంతత్యాగాన్విత ! మతనయాయంబులన్ రుద్రసంఖ్యా
విశ్రాంతం బైనన్ గుసుమితలతావేల్లితావృత్త మయ్యెన్. 91
మత్తకోకిలవృత్తము. -
శ్రావకాభరణాంక ! విన్ రసజాభ రేఫల దిగ్విరా
మావహంబుగ మిత్తకోకిల యండ్రు దీనిఁ గవీశ్వరుల్. 92
[57]అతివినయవృత్తము. -
ననలుగలయఁగ సనలనసయుతము లగుచున్
దనరు నతివినయ కివి దశమయతి కృతులన్. 93
[58]త్వరితపదగతివృత్తము. -
సరిసిరుహభవసదృశ చతుర ! ననననాయల్
త్వరితపదగతి కమరు దశమయతియుఁ గాఁగన్. 94
వ. అతిధృతిచ్ఛందంబునకుఁ బందొమ్మిదియక్షరంబులు పాదంబుగా 524288 వృత్తంబులు పుట్టె. అందు,
శార్దూలవిక్రీడితవృత్తము. -
నారాచారవిశారదా ! యినయతిన్ శార్దూలవిక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ నతాగప్రాప్తమైచెల్వగున్. 95
మేఘవిస్ఫూర్జితవృత్తము. -
మృగేంద్రోద్యచ్ఛౌర్యా! యమనసములన్ మేఘవిస్ఫూర్జితాఖ్యం
బగున్మీఁదన్ రాగంబొడఁబడిన సూర్యాంకవిశ్రాంతమైనన్. 96
తరలవృత్తము. -
ప్రవర రుద్రవిరామయుక్తి నభంబులున్ రసజాగముల్
గవిజనాశ్రయ! పొంది యందముగా మహిన్ దరలం బగున్. 97
చంద్రకళావృత్తము. –
శ్రానకాభరణాంక ! దిశావిశ్రామముతోడ రసాతముల్
జావిలగ్నగకారయుతం బై చంద్రకళాహ్వయ మై చనున్. 98
భూతిలకవృత్తము. -
భారసజాగగణంబులన్ గుచభారనమ్రవధూముఖాం
భోరుహ భాస్కర! రుద్రయుగ్యతిఁ బూని భూతిలకం బగున్. 99
[59]శుభికావృత్తము. —
సూరిస్తుత్యా! మభననవిలసితసూర్యయతిన్ శుభికా
కారంబై యెల్లకృతుల వెలయును గల్పితభాగలచేన్. 100
వ. కృతిచ్ఛందంబున కిరువది యక్షరంబులు పాదంబుగా 1048576 వృత్తంబులు పుట్టె. అందు,
మత్తేభవిక్రీడితవృత్తము. -
స్మయదూరా! విలసత్త్రయోదశయతిన్ మత్తేభవిక్రీడితా
హ్వయ మయ్యెన్ సభరంబులున్ నమయవవ్రాతంబులున్ గూడినన్. 101
ఉత్పలమాలావృత్తము. -
భానుసమాన! వి న్భరనభారలగంబులఁగూడి విశ్రమ
స్థానమునందుఁ బద్మజయుతంబుగ నుత్పలమాలయై చనున్. 102
అంబురుహవృత్తము. -
శ్రీరమణీప్రియ ! మల్లియరేచ ! విశిష్టకల్పమహీజ ! భా
భారసనంబుల నంబురుహం బగు భానువిశ్రమయుక్తమై. 103
[60]ఖచరప్లుతవృత్తము. --
అమితసాహస! రుద్రవిరామాయత్తములైన నభామసా
వములగున్ ఖచరప్లుతనామవ్యక్తినియుక్తసమేతమై. 104
[61]ప్రభాకలితవృత్తము. -
వెలయునజాభరసంబులున్ రవివిశ్రమంబులునుం బ్రభా
కలితకు నొప్పునగణ్యపుణ్య! లగంబు మీఁద ధరన్ గృతిన్. 105
వ. ప్రకృతిచ్ఛందస్సున కిరువదియొక్క యక్షరంబులు పాదంబుగా 2097152 వృత్తంబులు పుట్టె. అందు,
స్రగ్ధరావృత్తము. —
శ్రీమన్మూర్తీ! మకారాశ్రితిరభనయయా సేవ్యమై సానుమద్వి
శ్రామంబై సానుమద్విశ్రమమునమరఁగా స్రగ్ధరావృత్తమయ్యెన్. 106
చంపక మాలావృత్తము. -
నజభజజల్ జ రేఫలు పెనంగి దిశాయతితోడఁ గూడినన్
[62]ద్రిజగదభిస్తుతా!బుధనిధీ!విను చంపకమాలయైచనున్ .107
[63]లాటీవిటవృత్తము .-
సససామతయంబులు సూర్యయతిశ్రవ్యంబై లాటీవిటవృత్తం
బసమానయశా! నుతమానగుణా ! యాశ్చర్యాన్వీతంబగుధాత్రిన్. 108
వనమంజరీవృత్తము. -
నయుతజకారచతుష్కభ రేఫగణత్రయోదశవిశ్రమా
శ్రయమగు నప్వనమంజరి రేచన ! సర్వశాస్త్రవిశారదా ! 109
మణిమాలావృత్తము .-
కదియంగమూఁడుసజముల్ స కారయుతమైదిశాఖ్యయతిగా
మదనాను కారి ! నిఖిలాగమజ్ఞ ! మణిమాలయుండ్రుసుకవుల్. 110
[64]కరిబృంహితవృత్తము. -
మూఁడుభనములుగూడి రగణముముట్టికొనఁగరిబృంహితం
బాడువనము నిజార్థమునఁ గలయం ద్రిదశయతి నర్కులన్ . 111
వ. [65]ఆకృతిచ్ఛందంబున కిరువదిరెం డక్షరంబులు పాదంబుగా 4194304 వృత్తంబులు పుట్టె. అందు,
మహాస్రగ్ధరావృత్తము. -
లసదుద్యత్కీర్తివల్లీ లలితగుణగణాలంకృతాంగా! సతాన
స్థనరాగంబుల్ మహాస్రగ్ధరకువసుమునిస్థానవిశ్రాంతినొప్పున్. 112
[66]సుభద్రకవృత్తము. -
మందరభృత్సమాన! నిఖిలాగమజ్ఞ ! వెలయంగరుద్రయతితో
నందముగాభ సంయుతరనత్రయాగ్రగురువై సుభద్రకమగున్. 113
మానినీవృత్తము. -
కారకముల్ క్రియ గన్గొన నేడుభ
కారము లొక్క గకారముతో
గారవమై చనఁగా యతి పండ్రెటఁ
గల్గిన మానిని కామనిభా! 114
[67]తురగవృత్తము. -
నననన సజములను జగము దుద నాటుకొల్పిన రేచనా !
చనుఁ దురగ మన జగతి నిది మనుసంప్రయుక్తవిరామమై. 115
వ. వికృతిచ్ఛందంబున కిరువదిమూఁడక్షరంబులు పాదంబుగా 8388608 వృత్తంబులు పుట్టె. అందు,
అశ్వలలితవృత్తము. –
నజగణముల్ భజద్వయముతోఁ బె
నంగి భవయుక్తమై ధరణి సూ
ర్యజ మగువిశ్రమం బమరియున్న
నశ్వ లలిత మ్మగున్ గుణనిధీ ! 116
కవిరాజవిరాజితవృత్తము. --
క్రమమున నొక్కనకారము నాఱుజ
కారములుం బరఁగంగ వకా
రమును నొడంబడి రాఁ గవిరాజవి
రాజిత మన్నది రామనిభా ! 117
వ. [68]సంకృతిచ్ఛందంబున కిరువది నాలుగక్షరంబులు పాదంబుగా 16777216 వృత్తంబులు పుట్టె. అందు,
సరసిజవృత్తము. -
మారాకారా ! చారుచరిత్రా !
మతయననననస [69]మహియతిరచనన్
సారంబైనన్ సూరికవీంద్రుల్
సరసిజ మని వినఁ జదివిరి సభలన్.[70] 118
క్రౌంచపదవృత్తము. -
పంచశరాభా ! సంచితపుణ్యా !
భమసభ నననయపరిమితమైనన్,[71]
గ్రౌంచపదాఖ్యం బంచిత మయ్యెన్
గ్రమయతి దశవసుకలితము గాఁగన్.[72] 119
వ. [73]అభికృతిచ్ఛందంబున కిరువదియై దక్షరంబులు పాదంబుగా 33554432 వృత్తంబులు పుట్టె. అందు,
బంధురవృత్తము. -
అమరఁగ ననననసభభభగయుతం
బైతిథివిశ్రమ మొంది చనన్
బ్రముదితకువలయ! పరహితచరితా !
బంధుర మన్నది వృత్త మగున్ . 120
భాస్కరవిలసితవృత్తము. -
భాస్కరసదృశ సముజ్జ్వల తేజా !
భాసుర భనజయభననసగంబుల్
భాస్కరవిరమణబంధుర మైనన్
భాస్కరవిలసిత మనిరి కవీంద్రుల్. 121
[74]జలదరవవృత్తము. -
నన నన ననలు ననల నొడఁబడి
నయవినయనిధి! వినుము రే
చన ! మనుయతిని నిలుపఁగ మహిని
జలదరవ మగు గురువుతోన్. 122
వ. [75]ఉత్కృతిచ్ఛందంబున కిరువదా ఱక్షరంబులు పాదంబు గా 67108864 వృత్తంబులు పుట్టె. అందు,
భుజంగవిజృంభితవృత్తము. -
[76]ధీరాసారత్వోదారత్వస్థిరగుణ ! వసు
దశమయతిన్ భుజంగవిజృంభితా
కారం బారంగాఁ దోఁచున్ సంగతమమతన
ననరసకారమై వయుతంబుగాన్. 123
మంగళమహాశ్రీవృత్తము. -
శ్రీమహిత ! లోకహిత ! శిషజన సేవిత !
విశిష్టగుణ ! మంగళమహాశ్రీ
[77]నామ మగు నబ్భజసనంబులకడన్
భజసనంబులు గగంబులు పెనంగన్. 124
[78]క. కమనీయంబగు నీక్రియ
సమవృత్తము లిరువదాఱుఛందంబుల నీ
క్రమమున మల్లియరేచన
రమణీరమణీయరమణరమణుఁడు చెప్పెన్. 125
- ఉద్ధరమాలావృత్తములు. -
క. పరఁగఁగ నిరువదియాఱ
క్షరముల కగ్గలము చెప్పఁగాఁ బాదము లు
ద్ధరమాలావృత్తములై
పరఁగు లయగ్రాహి లయవిభాతి యనంగన్. 126
లయగ్రాహివృత్తము. -
[79]ఇం బడరఁగా భజసనంబులకడన్ భజస
నంబులు భ కారము నొడంబడి లయగ్రా
హిం బరఁగఁ జెప్పు కలశం బిడినయట్ల యగ
ణంబు కృతిమీఁద నమరుం బరహితార్థీ ! 127
లయవిభాతివృత్తము. -
నసననసనంబులును నసననసగంబులును
నెసఁగఁగృతి పాదముల రసికతను జెప్పన్,
గుసుమశరవత్సుభగ! యసదృశగుణా! వినుత
రస! లయవిభాతి యని రసమసుకవీంద్రుల్ . 128
త్రిభంగివృత్తము. -
ననననలును ససభమలును సగయుక్తము లైనన్
మృదు వైనన్ బ్రస్తుత మైనన్
వనరుహభవనిభ ! మన మలరఁ ద్రిభంగిని జెప్పున్
వడి దప్పున్ బ్రాసము లొప్పున్ . 129
[80]లయహారివృత్తము. -
పదునొకఁడునగణములతుద సగణమును గురువుఁ
గదిసి మృదుపదరచన నొదవి క్రియఁ బ్రాసా[81]
స్పదనిరతి నునుపఁదగు నది సుకవివరులు పొగ
డుదు రసమబహుకృతుల విదితలయహారిన్. 130
[82]దండకలక్షణము. -
అమరఁగ ననహంబులం[83]దాదిగా నొండె, కాదేని నాదిన్
దకారంబుగా నొండె, లోనన్ దకారంబు లిమ్మై గకారావ
సానంబుగాఁ జెప్పినన్, దండకం బండ్రు దీనిం గవీంద్రుల్ జగ
ద్గీతకీర్తీ ! పురారాతిమూర్తీ ! సదాచారవర్తీ ! సముద్యద్గుణార్థీ!
వణిగ్వంశచూడామణీ! బంధుచింతామణీ ! శిష్టరక్షామణీ!
సుందరీవశ్యవిద్యామణీ! రేచనా! కావ్యసంసూచనా[84]! 131
___________
- అర్ధసమవృత్తములు. -
[85]క. కమలాధీశుఁడు రేచన
కమలాసనక మలనాభకమలాప్రియవృ
త్తముల మహత్త్వము తేజ
స్సమేతుఁ డొనరించు నర్ధసమవృత్తములన్. 132
[86]క. ఆదిద్వితీయవిలస
త్పాదంబుల వేఱు వేఱుభంగుల నిడ న
ప్పాదములఁ బోలఁ దక్కిన
పాదము లర్ధసమవృత్తపద్ధతి యొప్పున్ . 133
వ. అర్ధసమవృత్తంబు లన్నవి స్వస్థానార్ధసమవృత్తములు, పరస్థానార్థ సమవృత్తములు నా రెండుదెఱంగు లయ్యె. స్వస్థనార్ధసమవృత్తము లన్నవి యుక్తాదిషడ్వింశతిచ్ఛందంబులలో నొక్కచందంబున మొదలిపాదంబును [87]రెండవపాదంబును మూఁడవపాదంబును నొక్క వృత్తముగా వ్య త్యాసముచేసి చెప్పునవి. మఱి పరస్థానార్ధసమవృత్తము లన్నవి మొదలిపాదంబును మూఁడవపాదంబును నొక్కఛందంబున రెండవపాదంబును నాల్గవపాదంబును నొక్క ఛందంబునఁ జెప్పునవి.
స్వస్థానార్ధసమవృత్తములలో. --
నారీప్లుతవృత్తము. -
[88]వారశ్రీసంసేవ్యవక్షా! మతాగా
కారంబు నిత్తాజగగస్వరూపం
బారంగం బూర్వాపరార్ధంబు లైనన్
నారీప్లుతం బన్నది నామ మయ్యెన్. 134
రతిప్రియవృత్తము. -
[89]ఖ్యాతంబై మనజరగ ప్రజంబుతో సం
గతంబుగా జభసజగంబు లూర్జిత
శ్రీతన్వీప్రముదితచిత్త ! చిత్తజాభా !
రతిప్రియం బనిరి తిరంబుగాఁ గవుల్. 135
[90]అజితప్రతాపవృత్తము. -
సజసాగణాళివిక సన్నవనీ
రజముఖా! నభజర వ్రజంబుతో
నజితప్రతాప కుభయార్ధము లై
నిజముగాఁ దగు సనుం దిరంబు గాన్. 136
పరస్థానార్ధసమవృత్తములలో. -
కోమలీవృత్తము. –
జననుతకీర్తి! నజాయగణంబుల్
ఘనంబుగా జభసజగవ్రజంబుతో
ననుపములై యుభయార్ధములందున్
బెనంగఁ గోమలియను పే రొడంబడున్ . 137
మనోహరవృత్తము. -
[91]చారిత్రనిదాన! తజావము లు
ద్ధురమయ్యె సకారచతుష్కముతో
నారంగఁ బడ న్నుభయార్ధములన్
విరచింప మనోహరవృత్తమగున్. 138
మణివితానకాంతివృత్తము. -
[92]సంబుద్ధీ! మసజంబుతో గకా
[93]రంబుతో రనమురంబునున్ వకా
రంబొందన్ గవిరాజితోభయా
ర్ధంబగున్ మణివితానకాంతికిన్ . 139
క. ఇప్పటఁ దొల్లి పింగళు
చెప్పినక్రియఁ దప్పకుండఁ జెలు వలరంగాఁ
జెప్పఁబడె వళ్లుప్రాసలు
తప్పక యర్ధసమవృత్తతతి విదితముగాన్. 140
గద్యము. ఇది వాదీంద్రచూడామణిచరణ సరసీరుహమధుకరాయమాన శ్రావకాభరణాంకవిరచితం బైన కవిజనాశ్రయం బనుఛందంబునందు వృత్తాధికారము.
- ____________
- ↑ ద-వియతిచ్ఛందో౽ధికారము, ఈ యధికారమునకు, క-ప-డ-ద-లు మాతృకలు.
- ↑ డ-ద-లలో మాత్ర మున్నది.
- ↑ క. సమవృత్తములఁ జతుప్పా, దముల నొకక్షరము మొదలు తలఁపఁగ నెక్కున్, గ్రమగణిత
వృత్తములకును, సమమై చను నిరువదాఱు ఛందములందున్. - ↑ డ-అ దెట్లనిన?
- ↑ డ-ద- మధ్యమ.
- ↑ ఉష్ణిహ.
- ↑ ప-సంకృతి.
- ↑ ప-ద-వ్యుత్కృతి.
- ↑ ఈపద్యము-క-డ-ద- స్థానాంతరముల నున్నది.
- ↑ స-విశ్రామములున్ , వృత్తార్థములం జెప్పుదు.
- ↑ ద-లో లేదు.
- ↑ ద-మధ్యమా.
- ↑ బ-లో నున్నవి.
- ↑ బ-లో నున్నవి.
- ↑ బ - లో నున్నది.
- ↑ ద-బుం బొరయఁగా.
- ↑ ఈపద్యము తరువాత క-డ-ద-లలోఁ ఇది వాదీంద్ర .. . విరచితం బైన కవిజనాశ్రయం బనుఛందంబునందు యతిచ్ఛందో౽ధికారము , అనుగద్యమును దరువాత , క. ఛందోదేనత బుధజన , వందిత గాయత్రి మధురవచనామృతని, ష్యందంబు మన్ముఖేందువు, నందొందించు నది గాత మానందముగాన్ . అను పద్యము నున్నవి.
- ↑ ప-లో లేదు. ద-లో-ఎంచం దయము ల్ప్రా.
- ↑ ప-లో లేదు.
- ↑ బ-లో నున్నది.
- ↑ డ-బదియు ననగముల్.
- ↑ ద-కుమారవిలసితము. కుమారవిలసితం, బుమాప జనగలన్.
- ↑ బ-లో నున్నది.
- ↑ ద-రంబునున్ సమాని కగున్.
- ↑ ద- వేరజంబుపై గగంబుల్.
- ↑ ద-లో నీపద్యముతరువాత "ఇది వాదీంద్రచూడామణి.... వియతిచ్ఛందో౽ధికారము సంపూర్ణము" అని యున్నది.
- ↑ బ-లో, "క. ఇట నుండి నళ్ళు విభ్రమ, ఘటనలఁ గల్పింపవలయుఁ గబ్బంబుల నె,చ్చట నే నిలిపితి బుధు లు,చ్చటఁ దగుఁబరికించి నిలుప శాస్త్ర ప్రౌఢిన్ . క. వృత్తములకుఁదగు పేళ్ళున, వృత్తగణాక్షరము లెడను విశ్రామంబుల్ వృత్తార్థము నన చప్పుదు, వృత్తసముహజ్ఞు లెల్ల వేడుకఁ బొగడన్. ఇది మొదలుగా యతులు గలవు." అని యున్నది.
- ↑ ద-శుద్ధవిరాటి.
- ↑ ద-సంబుద్ధీ.
- ↑ ద-పద్యశ్రీసంసేవితా భామతాగా, వేద్యం బైనన్ శాలినీవృత్త మయ్యెన్.
- ↑ ద-జపాఢ్య రేచా.
- ↑ ద-బ-తోదకవృత్తము. దోధక మని కొంద ఱందురు.
- ↑ క-ద-ల-లో రోదక.
- ↑ ద-ప్రియంవరా.
- ↑ క-భోజవినుతా.
- ↑ ద-లో లేదు. క , డలలో దీనితరువాత నాశ్వాసాంతగద్యమును బిదప "క. మందరధరనిభనిఖిల, చ్ఛందో౽ర్ణవ పారగుండు సత్కవులకు నీ, ఛందోలక్షణ మందం, బొందఁగ నాకవిజనాశ్రయుం డొనరించెన్." అనుపద్యము నున్నవి. పద్యము ద-లోఁ గూడ నున్నది.
- ↑ క-డ-బ లలో మాత్ర మున్నవి.
- ↑ క-డ-బ లలో మాత్ర మున్నవి.
- ↑ క-చ-డ-బ-లలో నున్నది.
- ↑ క-చ-డ-లలో నున్నది.
- ↑ చ-డ-లలో అపరాజితము
- ↑ క-చ-ద-లలో నున్నది.
- ↑ ద-ప్రహరణకలితం.
- ↑ ద-సారప్రాగంభోనిధి.
- ↑ ద-లో నున్నది.
- ↑ ప-లో లేదు.
- ↑ ద-మొలచి.
- ↑ ఇచ్చటనుండి యతిస్థానము వక్కాణింపఁబడినది .
- ↑ ద-యతిన్ దశా.
- ↑ ద-శిష్టాదరత దళావిశ్రమ మైనన్ .
- ↑ ప-చ-లలో 'జరల్ జరల్ జగంబు గూడఁజాలి రేచనా నిధి, స్ఫురద్విరామమై ధరిత్రిఁ బొల్చుఁ బంచ చామరన్.' అనియున్నది.
- ↑ బ-లోమాత్ర మున్నది.
- ↑ బ-లో మాత్ర మున్నది.
- ↑ చ-లో మాత్ర మున్నది. దీని కిందే త్వరితపదగతి యనునామాంతరము గూడఁ గలదు.
- ↑ చ-డ-సంతాన.
- ↑ క-బ-లలో నున్నది.
- ↑ క-లో మాత్ర మున్నది.
- ↑ క-బ-లలో మాత్ర మున్నది.
- ↑ బ-లో మాత్ర మున్నది.
- ↑ ద-ఖచఫ్లుతము.
- ↑ క-ద-లలో నున్నది. బ-లో దీనికే భంగ్యంతరముగా లఘుప్రభాకలితనృత్తము గలదు . అమర సజాభరసంబులున్ లగ మందు సూర్యనిరామమున్ , గొమరుగఁ జెందు నవేందుమౌళి లఘుప్రభాకలితాఖ్యకున్.
- ↑ ద-ద్రిజగదభీష్టదా.
- ↑ ద-లాటవిట.
- ↑ బ-లో మాత్రమున్నది.
- ↑ క-అతికృతి
- ↑ చ-డ-బ లలో దీనికిఁ జంద్రకమను పే రున్నది.
- ↑ బ-లో మాత్ర మున్నది.
- ↑ చ-సత్కృతి. ప-నుకృతి.
- ↑ క-డ- మహితపురచనన్.
- ↑ చ-డ-ద- మొదలన్.
- ↑ క-ప- పరివృతమైనన్ .
- ↑ ప - రసదశకలితముగాఁగన్.
- ↑ క - లో నీఛందస్సు లేదు.
- ↑ బ-లో మాత్ర మున్నది.
- ↑ ద-వ్యుత్కృతి.
- ↑ ద-ధీరాధారత్వోదారత్వాదృత.
- ↑ ద-నామమునకున్ భజసనంబులు పెనంగు నసునామ యతి రెట్టిగఁ దుదిన్ గాన్.
- ↑ ఈపద్యము పిదపఁ జాల ప్రతులలో నీక్రిందిపద్య మున్నది. చ. ఒగిఁ బదుమూఁడు కోటులును నొప్పుగ నల్వదిరెండు లక్షలున్, దగఁ బదియేడువేలు విదితంబుగఁ దానట నేడునూటిపై, నగణితవైభవా ! యిరువదాఱగు సంఖ్యఁ జెలంగి యొప్పెడున్ , సగుణిత యిర్వదాఱు నగు ఛందములన్ సమపాదవృత్తముల్ . డ-లో- 3, 4 పాదములు. అగణితవైభవా ! యిరువదాఱగు సన్నుతపాద వృత్తముల్, జగమున నెన్ని చూడఁగ విశాలయశోనిధి రేచధీమణీ !
- ↑ డ-లో లేదు.
- ↑ డ-లయవిహారి.
- ↑ ద-వాచా.
- ↑ ప-లో లేదు.
- ↑ ప-అమరంగ సనహంబులన్.
- ↑ డ-త్యాగవై రోచనా. క-చ- లలో దండకాంతమునఁ బ్రకరణాంత గద్య మున్నది. డ-లో "ఇది స్వస్థానపర స్థానవృత్తాధికారము” అని యున్నది.
- ↑ క-ద-లలో మాత్ర మున్నది.
- ↑ క-ప-ద-లలో నున్నది.
- ↑ ద-నాఛందంబున నొక్కవృత్తంబున రెండవపాదంబును మూఁడవపాదంబును నాల్గవ పాదంబును నిట్లు వ్యత్యాసముగాఁ జేసిసి చెప్పునది. మూలము స్పష్టముగా లేదు. వృత్త మంతయు నొక ఛందమునకే చేరి యుండి బేసిపాదము లొకవృత్తమునకు ను సరిపాదములు వే ఱొకవృత్తమునకును సంబంధించి యున్నచో నది స్వస్థానార్ధసమవృత్త మగు నని భావము.
- ↑ క-ప-దలలో నున్నది. ఈవృత్తము త్రిష్టుప్ఛందములోనిది. బేసిపాదములు శాలినీవృత్తలక్షణమునకును సరిపాదము లింద్రవజ్రవృత్తలక్ష్మణనమునకును సరిపడును.
- ↑ క-ద-లలో మాత్ర మున్నది. ఈవృత్త మతిజగతీఛందస్సులోనిది. బేసిపాదములు ప్రహర్షిణీలక్షణమునకును సరిపాదములు రుచిఁనృత్త లక్షణమునకును సరిపడుచున్నవి.
- ↑ క-ద-లలో మాత్రమున్నది. ఇది జగతీఛందములోనిది. బేసిపాదములు ప్రమితాక్షరావృత్త లక్షణమునకును సరిపాదములు ప్రియంవదావృత్త లక్షణమునకును సరిపడుచున్నవి.
- ↑ బేసి పాదములు త్రిష్టుప్ ఛందస్సులోని కాంతావృత్త లక్షణమునకును , సరిపాదములు జగతీ ఛందస్సులోని తోటకవృత్తలక్షణమునకును సరిపడుచున్నవి.
- ↑ విషమపాదములు పంక్తిఛందస్సులోని శుద్ధవరాటివృత్తమునకును, సమపాదములు త్రిష్టుప్చందస్సులోని రథోద్దతవృత్తమునకును జేరుచున్నవి. ఇది క- ద- లలో నున్నది.
- ↑ రంబుతో రసరం బందుపైవకా, అని పాఠాంతరము.