కళాపూర్ణోదయము (1943)/ప్రథమాశ్వాసము
శ్రీలావణ్యవతీకుచద్వితయకాశ్మీరప్రభాచారువ
క్షోలంకారమణిప్రకాండము నవీనార్కుండుగా సన్మనో
నాళీ కావిరతప్రభాత మగుచు న్భాసిల్లుతత్వంబు నం
ద్యాలశ్రీనరసింహకృష్ణవిభు నిత్య శ్రీయుతుం జేయుతన్ .
చ. ప్రమదవిలాసనర్తనవిభాసురగోపకిశోరమూర్తితో
దమ కిలువేలు పై వెలయు తాండవకృష్ణుపదాబ్జసేవ ను
త్తమతనయాది సంపదలు తామరతంపర లై ప్రవర్దిలన్
రమణఁ దనర్చుఁగావుత ధర నరసింగయకృష్ణుఁ డెంతయున్
మ. వలకే ల్దాపలికిం గుచస్తబక సేవాలోలతం బోవ డా
పలి కేల్సిగ్గునమాన్ప నల్పసవి దత్పార్శ్వంపు లేఁ జెక్కుఁగో
మలపాదంబును ముట్టుచు న్వలచుబ్రహ్మం బర్ధ నారీశ్వరుం
డెలమిన్నిత్యముఁ బ్రోచుఁగృష్ణవసుధాధీశున్ నృసింహాత్మజున్
చ. అనయముఁబ్రేమసంధిలఁగ నాస్యచతుష్టయయౌగపద్యచుం
బనఘనకాంతుఁ బోలె నిగమంబుల పేరిట నాల్గురూపులం
దనరెడుభార్యమాట జవదాఁటక సృష్టి యొనర్చు వారిజా
సనుఁడునృసింహకృష్ణవిభుఁజాలఁజిరాయువుఁజేయుఁగావుతన్
చ. ఒనరఁగ నూర్ధ్వలోకముననుండి ధరిత్రికి డిగ్గుగంగకు
న్మనసిజవైరిమాళియు హిమక్షితిభృత్కటకంబుఁబోలె శో
భనరసభవ్య కావ్యమయ భారతికి న్వసతిస్థలంబు లై
తనరెడువామలూరుభవతాపసు సాత్యవతేయుఁ దెల్చెదన్
చ. పలుకఁ దలంప దవ్వు లగుభారత రామకథార్థముల్ విభా
సిలఁగ నరంటిపం డొలిచి చేతికి నిచ్చినరీతి నంధ్రవా
క్సులలితశక్తి నందఱకు సుప్రధితంబులు చేసినట్టిధ
న్యుల నుతియింతునన్నయబుధోత్తముఁదిక్కన నెఱ్ఱసత్కవిన్
ఉ. మెచ్చి యొకింతగౌరవము మెచ్చకయుండి లఘుత్వ లేశముం
దెచ్చుటకున్సమర్థులె కృతిక్రియకుం గుకవిత్వగర్వితుల్
తచ్చరితం బుపేక్ష కుచితం బగుఁగాక నగంగనైన వా
క్రుచ్చి యజాగళస్తనసగోత్రుల వారల నెన్న నేటికిన్ 7
సీ. విశ్రామవిహతి గావింపక సారవ
త్సాహిత్యసౌమనస్యంబు లెఱిఁగి
సమయంబు దప్పక శ్రవణకఠోరంబు
లైనశబ్దముల నత్యాకులాత్మఁ
జేయక సత్పరిచితసుకుమారవా
క్సరళితాభిప్రాయఁగా నొనర్చి
పదబంధశిథిలత వాటిల్లఁగా నీక
యేచందములయందు నేమరిలక
ఆ. పరఁగుకవియు దోహకరుఁడును యశము దు
గ్ధమును బడయు నట్లు గాని నాఁడు
కృతియుఁ దాఁపు మొదవుఁ గీర్తియుఁ బాలు నీ
కుంట కాదు హాసయోగ్యుఁ జేయు. 8
వ. అని యిష్ట దేవతాప్రార్థనంబు గావించి సుకవుల సేవించి కుకవులుపేక్షామాత్రదంగ్యు లగుట భావించి సకలలక్ష్మణలక్షితంబైనమహాప్రబంధంబు కీర్తి కారణం బనియు నితరం బపహాస కారణం బనియు నూహించి యెద్దియేనియు నొక్క సరస ప్రబంధనిబంధనంబునకు జాతకౌతూహలుండనై యుండునంత.9
సీ. తనకీర్తి సకలదిగ్ధంతిదంతానంత
కాంతిపంక్తి కిఁ జెలికత్తె గాఁగఁ
దనప్రతాపంబు మార్తాండమండలచండి
మోపదేశమునకు నొజ్జ గాఁగఁ
దననీతిపస యుగంధరభట్టిచాణక్య
ఘనచతురికి నిదర్శనము గాఁగఁ
దనవిలాసంబు కందర్పేంద్రనందన
వార్త కు ఖండనవాది గాఁగఁ
గీ. వెలయు మనుమార్గవర్తనావిరతవిహిత
ధరణిపరిపాలనపరిస్ఫురిత రాజ్య
వైభవుండు నృసింహభూవరసుతుండు
జిష్ణుతుల్యుండు నంద్యాలకృష్ణవిభుఁడు. 10
వ. అనర్ఘ్యమణిమయాభరణకిరణకిమ్మీరితదిగంతరుండును గంధసారకస్తూరికాద్యనులేపసౌరభసంవాసిత పర్యంతభాగుండు
నగుచుం జెలువుమీఱి కొలువుకూటంబున గురుశుక్రనీతిచాతురీఖ్యాతివంచనాచుంచుపంచాంగ నయజయాతి శయభూషిత శేముషీవిశేషవైయాత్యు లగునమాత్యులును సదనూచాన సంప్రదాయ సిద్దాధ్యయన శుద్దిగరిమ పరిపూర్ణశక్తివిభ్రాజమాన నానావేదమంత్ర తంత్రసంతాయమానశాంతికర్మదూరవారితదైవికాత్యాహితు లగుపురోహితులును గాణాదకాపిలగౌతమీయజైమినీయ వైయాసికపాతంజలతంత్ర రాద్దాంతపూర్వపక్ష వైపరీత్యకరణచణయుక్తి కల్పనానల్ప కల్పిత ప్రతివాదిబుద్ధివిధ్వంసు లగువిద్వాంసులును బ్రాహ్మ పాద్మవారాహ వైష్ణవమాత్స్యమార్కండేయ భాగవత బ్రహ్మ వైవర్త కౌర్మగారుడ స్కాంద వాయవ్య వామన బ్రహ్మాండాది నిఖిలపురాణకథాకథన పాండిత్య పరితోషితాంతర్వాణికు లగుపౌరాణీకులు నాశు మధురచిత్రవిస్తారకవితావిజృంభణ స్తంభితబాణభవభూతిభాసకాళిదాసముఖ్య విఖ్యాతిగౌరవులగుకవులును బహువిధపురాతనజ్యౌతిషసిద్దాంతసంఘర్షనిశితమతిచతురిమ సమధిగత కళాకాష్టానిమేషాదిసూక్ష్మ సూక్ష్మ తర సూక్ష్మతమ కాలకలనా కౌశలప్రకాశకీర్తి కు లగుమౌహూర్తికులును, ధన్వంతరిదస్రచరకప్రముఖనిఖిలాద్యవైద్య వైశారద్యదృష్టాంత భావభాజనాయుర్వేద వేదిత్వ వైభవాలంకారులగునగదంకారులును విశ్వావసుతుంబురునారదాంజనేయభరతమతంగకోహలదత్తిలప్రభృతిగాంధర్వకౌశలగౌరవ స్మరణకారణగానమాధురీధురీణతాప్రీణిత బుధశ్రేణికులగువైణికులును రూపలావణ్యవిభ్రమవిలాసవిభవవిస్మాపిత
వివిధజనస్వాంత లగువారకాంతలును నిరంతరపరిణతబహువిధప్రహరణవ్రణకిణగణకాఠిన్యఖండిత కంకటా పేక్షవక్షోవిభాగజోఘుష్యమాణశౌర్యసాహసోద్భటు లగుభటులును యథోచితప్రదేశవర్తు లగుచుం గొలువ వేత్రహస్త జనసనామాఖ్యానసందర్శితసామంతకుమారులసేవలు కటాక్ష హాసభాషణాదులనాదరింపుచుగీత వాద్యతాళానువర్తి నర్తకీనర్తన ప్రవర్తనంబు లవధరింపుచు ననేకవిధ రాజ్యకార్యవినియుక్తులైనయధికార పురుషులవిన్నపంబు లాలింపుచు వందిబృందపఠ్యమానబిరుదావళి ప్రబంధబంధురశబ్దార్థ చమత్కా రంబులు పరికింపుచు నొడ్డోలగం బైకూర్చుండి కావ్యప్రసంగవశంబున. 11
సీ. శోభితాపస్తంభసూత్రు గౌతమగోత్రు
సుచరిత్రుఁ బింగళిసూరసుకవి
పౌత్రు నన్నపపతి భావన దౌహిత్రు
నమరధీనిధికి నబ్బమకుఁ బుత్త్రు
ననుజున్ములైనట్టియమరన యెఱ్ఱనా
ర్యులు భక్తి సేయంగ నలరువాని
సత్కావ్యరచనావిశారదుండగు వాని .
సూరన నామవిశ్రుతుని నన్నుఁ
ఆ. బ్రియము సంధిలంగఁ బిలిపించి బహువస్త్ర
భూషణాధిదానములఁ గరంబు
సంతసం బొనర్చి యెంతయు గారవ
మెసఁగ మధుర ఫణితి నిట్టు లనియె. 12
శా. నీచే నొక్కమహా ప్రబంధముఁ గడు న్నిర్ణిద్రసారస్యలీ
లాచిత్రం బగు దాని నోయనఘ వాలాయంబుఁ జేయించుకో
మాచిత్తంబున వేడ్క యుండు నది నీమాధుర్యధుర్యోరువా
గ్వేచిత్రి న్సఫలంబుసేయుము సుధీవర్గంబు లోహోయనన్
మ. ఇట మున్గారుడసంహితాదికృతు లీ వింపొందఁగాఁ బెక్కొన
ర్చుట విన్నారము చెప్పనేల యవి సంస్తుత్యోభయశ్లేషసం
ఘటనన్ రాఘవపాండవీయకృతి శక్యంబే రచింపంగ నె
చ్చట నెవ్వారికినీకె చెల్లెనది భాషా కావ్యముం జేయఁగన్
క. అని యాదరణము మిగులం
దనర నియోగింప నేను నాకొలఁది గనుం
గొన కీయకొంటిఁ దగ నా
యనముఁడు సంకల్పసిద్దుఁ డనునమ్మికచేన్. 15
వ. ఇవ్విధంబునం బూని యమహాప్రభువుసగౌరవనియోగంబునకు ననుగుణంబుగ మదీయశక్త్యనుసారంబున విచారించి యత్యపూర్వకథాసంవిధాన వైచిత్రీమహానీయంబును శృంగాగరసప్రాయంబును బుణ్యవస్తువర్ణ నాకర్ణనీయంబును నగుకళాపూర్ణోదయం బనుమహా కావ్యంబు నిర్మింపం గడంగితి నిట్టిమహనీయ కృతి కధీశ్వరుం డగుచుం బెంపొందునంద్యాలభూవిభునిగృష్ణరాయనివంశావతారం బభివర్ణించెద.
గీ. సకలకువలయపాలనైశ్వర్యయుతుఁడు
చండధామకృతశ్రీఘనుండు నైన
రాజచంద్రుండు జగతిఁ గరంబు వెలయు
సంతతోదయ సౌభాగ్యశాలి యగుచు. 17
గీ. అత్రిలోచనభవుఁ డయ్యు నతఁడు మీఱె
నపరిమితతారకావళి కధిపుఁ డగుచుఁ
దాఁ ద్రిలోచనభవుఁ డయి ధరఁ గుమారుఁ
డేకతారకజయ మొందు టేమియరుదు. 18
క. చంద్రునివంశంబున
భూచంద్రుం డారువీటిబుక్క నరేంద్రుం
డాచక్రవాళశైల
క్ష్మాచక్రస్ఫూర్తికీర్తిసాంద్రుఁడు పుట్టెన్. 19
క. ఆబుక్క నృపాలునిబా
హాబలముకొలంది తదసిహతరిపువీర
ప్రాబల్యనిరాకృతనల
కూబరునకుఁ దెలియుఁ దెలిసికొనఁగలఁడేనిన్. 20
చ. మతినజుఁడంచురూపమున మన్మథుఁడంచునయోన్నతిన్బృహ
స్పతియనుచున్నదాన్యతనుభానుసుతుండనుచున్నుతించునా
ర్యతతి 'నిరంకుశాః కవయ'యంచది యోర్చుటగానిబుక్క భూ
పతికి సముండు లేఁడు తలఁప న్భువనంబుల నేగుణంబులన్ .
క. పావనగుణ యగునబ్బల
దేవిని గులశీలగుణనిధి న్మఱి బల్లా
దేవిని వివాహమయ్యె మ
హావిభవుఁడు బుక్కనరవరాగ్రణి వేడ్కన్. 22
క. అందును బల్లా దేవికి
నందను లుదయించి రింద్రనందన సదృశుల్
చందనవిశదయశుల్ సం
క్రందన వైభవులు రామరాజప్రముఖుల్ 23
ఉ. భూమహనీయశీలుఁ డగుబుక్కయయగ్రవధూటి కబ్బలాం
బామణికిన్ జనించిరి సమ స్తగుణాడ్యులుసింగరయ్యయున్
రామనిభుం డహోబళధరారమణుండును విక్రయాన్వయో
ద్దామత నొప్పు నీతికి నుదగ్రజయాభ్యుదయంబులుం బలెన్ .
ఉ. అందును సింగభూరమణుఁ డౌబళ దేవిని బెండ్లియాడి సం
క్రందనతుల్యవైభవులఁ గాంచెఁ దనూజుల మువ్వుర న్బుధా
నందవిధాయినిర్మలగుణప్రకరు న్నరసింగరాజు శ్రీ
నందనతుల్యు నారవిభు నవ్యపురూరవుఁ దిమ్మపార్థివున్.
ఉ. వాలినకీర్తిఁ బెంపెసఁగి వారలలో నరసింగరాజు నం
ద్యాలపురాధిపత్యవిభవాతిశయంబు వహించి మించె ను
ద్వేలనిరూఢి నెల్లెడల విశ్రుత మై తనవంశ మెల్ల నం
ద్యాలపదప్రసిద్ధిఁ దనరారుచు నెంతయుఁ దేజరిల్లఁగన్, 26
క. ఆనరసింగ క్షితిపతి
మానవతీతిలక మైనమాదమదేవిన్
భూనుతసమస్తగుణల
క్ష్మీనిధిఁ దగఁ బెండ్లియాడెఁ గీర్తి దలిర్పన్ 27
సీ. మందారమందాక్ష సందాయిదానప్ర
సిద్దుండు సింగరక్షితివరుండు
గర్వితారాతిదోర్గర్వనిర్వాపణో
దీర్ణుండు నారధాత్రీవిభుండు
భూభువనప్రశంసాభిశోభితమహా
ప్రాభవాడ్యుఁడు కుమారౌభళుండు
శరదిందుచంద్రికాపరిశుద్దవిహసన
స్ఫురదనర్గళకీర్తి వరదరాజు
గీ. ప్రచుర విక్రమరఘుపతి రఘుపతియును
దనయు లేవురు గల్గి రుదాత్తసకల
గుణగరిష్ఠులు నరసింగ కుంభినీత
లాధినాధున కమ్మాదమాంబయందు. 28
క. నరసింగవిభునిసింగరి
నరవరుఁ డసమానుఁ డధికనయసారత ని
ర్భరశూరత నతిధీరత
నరు దగుదానక్రియావిహారత నిలలోన్. 29
క. నారాయణభక్తుఁడు సుజ
నారాధనపరుఁడు జలరుహాక్షీసుమనో
నారాచుఁడు నరసింగయ
నారావనిపాలకుండు నరనిభుఁడాజిన్. 30
సీ.స్వారాజభావంబు కారణంబుగ నేమొ
శక్రుండు నెలవున జడియ కునికి
మిత్త్రపుత్త్రత దాను మిత్త్రుండ నని యేమొ
యముఁ డాత్మపురమునఁ దెమల కునికి
వారుణీ సేవామదారూఢిచే నేమొ
జలభర్త దనవీటఁ గలఁగ కునికి
తల్లడం బేల యే ధనదుండ నని యే మొ.
ధనరాజు నిజపురిఁ దలఁగ కునికి
గీ. తమకు మఱి దిక్కు లేమిని దలఁకి యేమొ
కడమనలువురు మూలల నడఁగి యునికి
వీరవరుఁ డైననంద్యాల నారవిభుని
యాజి ఘోర భేరీధ్వను లడరునపుడు. 31
చ. పగ లనుశబ్దమాత్రము నభఃకుసుమంబు నిజంబు నారభూ
జగదధిపప్రతాపగుణసంపద చే రవిఁ దత్సమానుఁగాఁ
దగునె నుతింప నారవిప్రతాపమహత్త్వముచేతఁబేర్చుచుం
బగ లొకనాఁడుఁ దప్పక యపారతఁ జొప్పడుఁగాకమానునే
చ. వదలక యుత్కలేంద్రునిసవాయిబరీదు నడంచుదుర్జయుం
గుదువనమల్కఁ దల్లడిలఁ గొట్టె మహాద్భుతసంగరంబులో
నెదిరిచి కొండవీటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్యసం
పదపస నారసింహవిభుపట్టికి నారనృపాలమాళికిన్. 33
సీ. శ్రీవిష్ణుపదభక్తి చే ధర్మసంపత్తి
ధర్మసంపత్తి చేతను జయంబు
జయసిద్ది చేత నుజ్వలబాహుశౌర్యంబు
శౌర్య గౌరవముచేఁ జతురనీతి
నీతి పెంపున మహనీయసామ్రాజ్యంబు
సామ్రాజ్యమహిమచే శాంతిగుణము
శాంతిచే వేదాదిసకలసద్విద్యలు
విద్యలచే బుద్ధివిలసనంబు
గీ. దానఁ బాత్రవివేకంబు దాన నీగి
దానఁ బ్రవిమలకీర్తియు దానఁ గులముఁ
బ్రేమ నత్యంతము నలంకరించుకొనియె
భళిర నంద్యాలనార భూపాలకుండు. | 34
చ. ఘనతరదానచాతురిన కాదు శ్రుతిస్మృతిశాస్త్ర నైపుణం
బునను బుధానురంజనుఁడు భూరిశుచిత్వమునంద కాదు శో
భనపుఁబ్రతాపసంపదను బావకుఁ డానరసింగభూపనం
దనుఁడుకుమార యోబవసుధాతలనాయకుఁ డివ్వసుంధరన్
ఉ. సాత్వికతాపరాయణుఁడు సత్యవచస్కుఁడు దానశాలి దో
స్సత్వవిజృంభితుండు రణసత్వధురీణుఁ డకల్మషుండు ధీ
రత్వముమన్కిపట్టు చతురత్వనిధానము నీతిపద్దతిం
దత్వవిశారదుండు వరదక్షితిపాలుఁ డలోలుఁ డెయ్యెడన్.
క. కరుణాఘనవీక్షణమున
శరణాగతరక్షణమున సంగరశౌర్యా
భరణాహితశిక్షణమునఁ
దిరముగ రఘుపతియ రఘుపతిం దలపోయన్. 37
ఆ. అందు సింగరయ్య యనవద్యగుణ గౌర
మాంబఁ బెండ్లియాడి యాత్మజులను
గనియె నారసింహజననాధు రఘుపతి
క్ష్మాతలేంద్రు నోబమనుజవిభుని. 38
క. ఆనారసింహవిభుఁ డస
మానగుణుఁడు రఘుపతిక్షమావరుఁడు యశ
శ్శ్రీనిధి యహోబళాఖ్యధ
రానాధుఁడు సకలగుణవిరాజితుఁ డయ్యెన్ 39
క. ఆమువ్వురలో నగ్రజుఁ
డై మించునృసింహునకుఁ దదంగన యగుశ్రీ
రామాంబకు నుదయించి మ
హామతి హావళిచినౌభళాఖ్యుఁడు వెలయున్ . 40
ఉ. దేవవిభుండు భోగమునఁ దీవ్రమయూఖుఁ డఖండచండతే
జోవిభవంబునం దపనసూనుఁ డనూనవితీర్ణిపెంపునం
దైవతమేదినీధరము ధైర్యమహత్వమునం దలంపఁ గా
నావళిచిన్నయోబమనుజాధిపముఖ్యుఁడు రాజమాత్రుఁడే.
క. ఇది సింగరయ్య సంతతి
తదనుజుననుజుఁ డగునోబధరణిపువంశా
భ్యుదయక్రమ మభివర్ణిం
చెద నిఁక భువన ప్రసిద్ది చెన్నెసఁగంగన్. 42
ఆ. ఆకుమారయోబభూకాంతుఁ డింపుతో
బెండ్లియాడె గుణగభీరచరితఁ
దిరుమలాంబ నెందుఁ బరమ పాతివ్రత్య
పావనతఁ దనర్చుభాగ్యనిధిని. 43
సీ. నానాగుణైకధానంబు నా నొప్పు
నరసింగమేదినీనాధవర్యు
నిద్దంపుఁగీర్తులఁ దద్దయు విలసిల్లు
నట్టిపెద్దయహోబళాధిపతిని
నాదిమనృపగతి మేదినీజనములఁ
బ్రోదిసేయుచు నొప్పుమాదవిభుని
సన్నుతోన్నతవృత్తి, నెన్నికఁ గన్నట్టి
చిన్న యహోబళక్షితిత లేంద్రు
గీ. సారతరచారుచారిత్రు నారనృపుని
నాకుమారౌబళుండు తిమ్మాంబయందుఁ
గనియె నేవురుసుతుల సత్కాంతియుతుల.
విష్ణు సేవాభిరతులఁ బ్రవీణమతుల. 44
క. అందు నరసింగవిభుఁ డిం
పొందఁగఁ దాఁ బెండ్లియాడె నుభయకులశ్రీ
సౌందర్యగుణచరిత్రము
లం దిర మై తనకుఁ దగినలక్ష్మీదేవిన్ . 45
స్ర. అలక్ష్మీ దేవియం దాయతమతి నరసింగావనీశుండు గాంచెం,
ద్రైలోక్యస్తుత్యుల న్నందనుల నురుయశోధన్యునోబాహ్వ
యక్ష్మా, పాలోత్తంసుం గవిత్వ ప్రమఖబహుకళాపారగుం
దిమ్మరాజుం, బాలాదిత్యోపమానప్రచురతరరుచిస్ఫారు నారక్షితీంద్రున్ 46
ఉ. వైభవజృంభణావమతవాసవుఁ డిందుముఖీనవీనచే
తోభవమూర్తి కల్మష విదూరుఁడు నిత్యరమాహారలీ
లాభవనాయమానసువిలాసకటాక్షనిరీక్షుఁ డాకుమా
రౌభళునారసింహసుతుఁ డౌభళుఁడెన్నికకెక్కునెంతయున్
శా. అత్రాసోజ్జ్వలశూరతాగుణకుమారాహోబళక్ష్మాపస
త్పుత్త్రశ్రీనరసింహతిమ్మవిభుకీర్తు ల్మీఱి యత్యంతవై
చిత్రిం దిక్తటుల న్నటింప నది దా శీలింపుచున్నట్ల తత్
స్తోత్రాకారసరస్వతీసతి నటించున్ సూరిరాడ్జిహ్వలన్.48
క. ఏసీమనెదురు లేక వి
భాసిలు నంద్యాలతిమ్మపార్థివుబలముల్
వాసి గలయతివిభాసి
ప్రాసాదులతోడ సత్రబంధములగతిన్. 49
ఉ. భూలలనాలలామ కడుఁ బొల్పెసలారెడు వేడ్కతోడ నం
ద్యాలకుమారయోబనరనాధునృసింహునినారశౌరియు
లౌలభుజాగ్రమెక్కుటయుఁదక్కకయెక్కెఁదదీయకీర్తి యుం
బాలసుమేరుశృంగము సపత్నికి మచ్చర మెచ్చ కుండునే.
ఆ. ఆతనిపిన్నతండ్రి యగు పెద్దయోబభూ
నాయకుండు గాంచె నందనులను
సారసుగుణమణిపయోరాశి నుద్దండ
యౌబళేంద్రుఁ జిన్న యౌబళునిని 51
ఉ. ధీరజనాభివర్ణ్యుఁడు తదీయకనిష్ఠపితృవ్యుఁ డుజ్జ్వలా
కారుఁడు పిన్నగయౌబళుఁడుగాంచెఁదనూజుల మువ్వురన్మనో
హారిగుణోన్నతుం దిరుమలయ్యను రాజమనాముఁ గృష్ణభూ
మిరమణోత్త ముం దిశల మించి నిజాన్వయకీర్తి వర్తిలన్.
క. ఇల నంద్యాలకుమారౌ
బళువంశచరిత్ర మిది సుపావనవృత్తిం
బొలు పొందుతదనుజన్ముని
విలసితవంశక్రమంబు వివరింతు నిఁకన్. 53
ఉ. సంగరపార్థు డావరదశౌరి సుమతిత్రయంబుఁ గాంచె నా
త్మాంగనయైనశ్రీతిరుమలాంబికయందు మహాగుణాఢ్యు శ్రీ
రంగజనాధిపు న్బుధవరప్రణుతు న్నరసింగమేదినీం
ద్రుం గవిపోషణాతిచతురుం గనకక్షితిపాలశేఖరున్. 54
గీ. అందు శ్రీరంగరాజు సమస్త గుణని
కేతనుం డాశ్రితసుపర్ణకేతనుండు
తనకుఁ గులరూపగుణములఁ దగినయట్టి
తిరుమలాంబికఁ బెండ్లి యై తేజరిల్లె. 55.
సీ. శోభనజయలాభసౌభాగ్యభూరిగు
ణాభిశోభితుఁ డైనయౌభళేంద్రు
నిర్మలసత్కర్మధర్మనిర్మితబుధ
సమ్మోదుఁ డై యొప్పుతిమ్మవిభుని
సురవంతిశరదభ్రహరిదంతింపునిభ
స్ఫురదుదంచితకీర్తి వరదవిభుని
విష్ణుసేవాఢ్యంభవిష్ణు నిత్యాచార
నిష్ణాతహృదయుని గృష్ణనృపుని
గీ. నందనులఁ గాంచె నలువుర నందనద్రు
మానువర్తనకీర్తనీయానవరత
దానముదితార్యతతుల ననూనమతుల
రమణఁ దిమ్మాంబయందు శ్రీరంగరాజు. 56
గీ. అట్టిశ్రీరంగవిభుద్వితీయానుజునకుఁ
గనకవసుధాధిపతికిని గలిగె సుతుఁడు
ధరఁ గనకగిరియౌబళేశ్వరుఁ డనంగ
నభినుతాహ్వయుఁ డగుచుఁ బెంపారు ఘనుఁడు. 57
వ. ఇది వరదరాజువంశక్రమంబు. 58
గీ. ఇట్టి వంశాభివృద్ధికి హేతువులయి
తనరు సౌజన్యనిధు లన్నదమ్ము లెపుడుఁ
దనదుసౌభ్రాత్రమునకుఁ జిత్తముల నలర
వెలసె నంద్యాలనారపృధ్వీవరుండు. 59
క. ఆనారక్షితిపాలుఁ డ
నూనశ్రీవిభవసముచితోద్వాహవిధిం
బూని వరియించె నిజరూ
పానుగుణం దిరుమలాంబ నధికప్రీతిన్. 60
గీ. పుణ్యకులశీలమహీమలప్రోక యనఁగ
నిష్కళంక పాతివ్రత్యనిధి యనంగ
వెలయునంద్యాలనారభూవిభునిదేవి
పరమశుభగుణనికురుంబ తిరుమలాంబ 61
క. ఆతిరుమలాంబయందుఁ బ్ర
భూతయశుఁడు నారవిభుఁడు పుత్రులఁ గనియెం
బూతాత్ముల నరసింగ
క్ష్మాతలవిభు మాదనృపుని గనకక్షితిపున్. 62
ఉ. ఉన్నతిఁ బేర్చి యెందు వెలయు న్నరసింగవిభుండు శౌర్యసం
పన్నుఁడటంచు విద్యఁ బ్రతిపన్నుఁడటంచుఁగవీంద్రకోటికిన్
సన్నిధి యంచు నిత్యహరిసన్నిధి యంచు విపన్నరక్షణా
సన్నుఁడటంచునెప్పుడుఁబ్రసన్నుఁడటంచుజనుల్నుతింపఁగన్
క. నారయనరసింహుఁడు మహి
నారయ నరసింహుఁడే యథార్థము కరజ
శ్రీరచితార్యస్థితి యై
భూరి ప్రహ్లాదభరణమున శోభిలుటన్.64
శా. స్ఫూర్తిప్రౌఢి నిరంతరం బగుచు నెచ్చోటం బ్రకాశింపఁగా
వర్తిల్లు న్భువనంబులందును సహావస్థానవత్కౌముదీ
మార్తాండద్యుతి వైభవంబుల ననిర్మర్యాద వైచిత్రితోఁ
గీర్తింప న్వశమే నృసింహవిభుసత్కీర్తిప్రతాపోన్నతుల్ .
ఉ. భానుసమానతేజుఁడు విభాసురరూపమనోజుఁ డుజ్జ్వలా
నూనయశోవిభాసి విభవోదయనిత్యవిలాసి విశ్వస
న్మానితవర్తనుండు కవిమండలనిర్మితకీర్తనుండు ల క్ష్మీ
నవమాధవుండు నరసింహునినారయమాధవుం డిలన్.
క. వితరణమున రణమున ను
న్నతవినయంబున నయంబునం దన కిలలోఁ
బ్రతి లేక నారభూపతి
సుతుఁ డౌమాద ప్రభుండు శోభిలు మిగులన్. 67
క. కన మహీభృద్వరుఁ డల
కనకమహీభృద్వరుండ గట్టిగ శౌర్యం
బున విబుధాధారత్వం
బునఁ బరహితధర్మభావమునఁ దలపోయన్. 68
శా. స్థానం బెన్నఁడుఁ బాయ దుత్సవఘనస్వస్త్రీసుఖక్రీడ పై
పై నొంద న్భువి నర్థిలోకము దివిం బ్రత్యర్థిలోకంబు న
న్యూనుం డాకనకయ్యయుద్యతకృపాణుండైనమాత్రంబునన్
దానక్షాత్రము లింతయంతయనుచుం దరింపఁగా శక్యమే
సీ. సంతానసురధేనుచింతామణిశ్రీకి
లజ్జఁ దా నొనరించు నొజ్జ యగుచు
నలకాధిపతిసూనునలకాములకు దర్ప
రహితత్వ మొనరించు మహీతలీల
నరభీష్మకోదండగురుభీష్మసమరంబుఁ
దక్కువ యనిపించు నిక్కువముగఁ
గుంభీనసక్రోడకుంభీనగిరులకు
విశ్రమం బొనరించు నశ్రమమున
గీ. సంతతౌదార్యసౌందర్యశౌర్యధరణి
భరణనైపుణగుణములఁ బ్రౌఢి మెఱసి
వరుస నరసింగమేదినీశ్వరునినార
నరవరేణ్యునికనకభూనాయకుండు. 70
క. ఆమువ్వురందు నగ్రజుఁ
డై మించిననారసింహుఁ డతులితవిభవ
శ్రీ మెఱయఁ బెండ్లియాడెం
బ్రేమం బెదకొండమాబఁ బినకొండాంబన్ . 71
చ. నిరుపమవిక్రమంబును వినీతియు నీతియుఁ బోలెఁ దత్వవి
త్పరిచయమున్విరక్తియునుభక్తియుఁబోలెసుయోగవర్తనా
దరవిభవంబు శాంతియును దాంతియుఁబోలెఁ గరంబలంకరిం
చిరి తమనిత్యసేవ నరసింగయ నిద్దఱుకొండమాంబలున్ 72
ఆ. అందుఁ బెద్దకొండమాంబయం దానర
సింగ భూవరుఁడు విశిష్టమతులఁ
గాంతియుతుల సుతులఁ గనియె మూర్తిక్షమా
రమణుఁ దిమ్మవిభుని రమణ మీఱి. 73
ఉ. ఆనరసింగభూపతి ప్రియం బెసఁగం బినకొండమాంబయం
దానమితాఖిలాహితసమాజుఁ దనూజుని గాంచె బంధుసం
తానసురావనీజు సముదంచితభోగబిడౌజు సూరిమై
త్రీనవభోజు భానునిభతేజుని గృష్ణమరాజు నున్నతిన్. 74
వ. అందు.75
సీ. శేషుదర్పము చివ్వి శీతాంశురుచి నవ్వి
పాలమున్నీటిపైఁ గాలు ద్రవ్వి
యాదిత్యుపస యాఁచి హాలహలంబును లోఁచి
హుతవహుగర్వ ముఱ్ఱూఁతలూఁచి
కల్పశాఖిని గెల్చి కర్ణుకీర్తి మరల్చి
ఖచరువార్తఁ దరల్చి ఘను వదల్చి
కందర్పు మఱపించి యిందుని నిందించి
నలకూబరు హసించి నలుని మించి
గీ. తనరుకీర్తి ప్రతాపవదాన్యతాసు
రూపవిలసనములచేత రూఢి కెక్కె
ధరణి నంద్యాల నరసింగనరవరేణ్యు
పట్టి యైనట్టిమూర్తిభూపాలకుండు. 76
వ. తదనుజుండు 77
క. తిమ్మక్షితిపతి శోభిలు
నిమ్మహిలో మిగుల వాసికెక్కెడుగాంభీ
ర్యమ్మున ధైర్యమ్మున శౌ
ర్యమ్మునఁ బ్రఖ్యాతుఁడై జనావళి పొగడన్ 78
సీ. శ్రీపుత్త్రతులనానురూపంబు రూపంబు
నిర్మలాంగిరసవినీతి నీతి
మహనీయతానుపమానంబు మానంబు
భూతిమద్రిపుదావహేతి హేతి
ధాత్రీసురశ్రీనిధానంబు దానంబు
తులితమారుతిభీమబలము బలము
గోవిందచింతాస్వభావంబు భావంబు
కోవిదబంధుసంతులము కులము
గీ. తరమె నుతియింప ఘనకుభృత్తటకుటీర
కటురట..[?]ల్లి కాచ్చటాఘటితబిరుద
కాహళారావశంకాప్రకంపితప్ర
తీపనృపజాలునంద్యాలతిమ్మవిభుని. 79
ఉ. చెన్నెసఁగెన్నృసింహనృపశేఖరుతిమ్మనృపాలమౌళియ
భ్యున్నతకీర్తి ముజ్జగము నూనఁగ మానవకన్యలట్ల తా
రెన్నఁడుఁ బోనిపున్నమసమృద్దులు గాంచితిమంచునుబ్బుచు
న్వెన్నెలకుప్ప లాడుదురు వేలుపుఁగన్నెలు నాగకన్యలున్
ఉ. శ్రీయుతుఁ డైనయట్టినరసింహునితిమ్మనికీర్తివైభవ
శ్రీయనుమౌక్తికావళికిఁ జెల్వధికంబుగ దిక్కుల న్నిజ
స్ఫాయదకీర్తినీలపటసంవరణం బొనరించు మున్నుగా
నాయన శత్రువర్గము ప్రియం బిఁక నెవ్వఁడు సేయకుండెడున్
మ. క్షితి నంద్యాలనృసింహుతిమ్మవిభుసత్కీర్తిప్రతాపంబు లు
న్నతిఁ బర్వున్నవఫేనవిద్రుమములై నానాబ్ధులన్ సింహసం
తతిధాతుప్రకరంబు లై వలయగోత్రంబున్ శ్రవశ్చామరో
ర్జితసిందూరము లై దిశాగజతతిం జెన్నోందఁ గైసేయుచున్
మ. అతిధన్యుం డగు నారసింహవిభుతిమ్మాధీశుహస్తాబ్జసం
గతిచే వింతగ దానవారి సముదగ్రప్రౌఢిచే విప్రసం
తతియందు న్నెఱుపున్ ధ్రువస్థితినిదానత్వంబుఁ బ్రహ్లాదపో
షితయుంగాకయశేషభోగపదతం జెన్నొందుసౌభాగ్యమున్
ఆ. ఇట్టితిమ్మమేదినీశ్వరుం డనుఁగుఁద
మ్ముఁడు సభక్తి వినయమోదగరిమఁ
దను భజింప గలరుఁ జినకొండమాంబగా
రాబుఁబట్టి కృష్ణభూపవరుఁడు. 84
సీ. ఆఖండలాహంక్రియాఖండనోదంచి
తాఖండవిభవోదయాంచితుండు
వారణారిత్రకారణాజిస్థలా
వారణాంచద్బుజాపౌరుషుండు
మందేహరిపుదీప్తిసందేహఘటనాత్య
మందేహతేజసమన్వితుండు
బంధురాజీపయస్సింధు రాజీభవ
ద్బంధురాజీజయభ్రాజితుండు
గీ. వెలయు నిఖిలదిగంతపృధ్వీతలాధి
పతిశిరఃకంపకంపితశ్రుతివలక్ష
మణిమతల్లీఘృణి ప్రతిమల్లఫుల్ల
కీర్తివిభవుండు నంద్యాలకృష్ణవిభుఁడు. 85
మ. అనఘాత్ము న్నరసింహకృష్ణవసుధాధ్యక్షున్ విరాజద్గుణై
కనిధిన్ వర్ణనసేయఁగాఁ దరమె దిక్చక్రంబునం దెల్ల శో
భనతత్కీర్తినదీమతల్లి ప్రవహింపం బూన మున్మున్నుగా
ఘనమై యుబ్బుఁ గవీంద్రు లన్చెలమలం గావ్యామృతం బెంతయున్. 86
చ. అవిరళనిత్యభోగవిభవాతిశయోల్లసితుండు నారపా
ర్థివునరసింహుకృష్ణజగతీపతి నిత్యసువర్ణవర్షముల్
కవినికరంబుపైఁ గురియఁగాఁ బ్రవహించుచు హృద్యగద్యప
ద్యవివిధకావ్యరూపత ననంతసువర్ణమహాప్రవాహముల్.
ఉ. దానము నందుఁ గృష్ణవసుధావరుఁడప్రతిముండు యుక్తముం
దీని గణించినన్ సురమణీతతి గొల్చుచు నున్కి సప్తసం
తానసమృద్ది చేకుఱుటఁ దద్వినయాదిగుణంబు లన్నియున్
బూనిక మీఱఁగాననయమున్సురభిత్వము దాల్చియుండుటన్
మ. తమి నంద్యాలనృసింహకృష్ణునిమహాదానక్రియా కౌశలం
బు మహత్త్వంబున నర్థిబృందము ధనంబుంజెందఁబ్రత్యర్థిబృం
దము చెందు న్నిధనంబు నింతయుమదిందర్కింపయుక్తంబ త
ధ్యము వర్ణాధికులెందుఁ గోరుదురు వర్ణాధిక్యవద్యోగమున్
మ. ఒక ప్రద్యుమ్నుని గాంచెఁ దొల్లి యదువంశోద్భూతిఁ బెం
పొందుచున్ , సకలక్ష్మాసురులం గరం బిపుడు శ్రీనంద్యాల
కృష్ణక్షితీం, ద్రకరాబ్జాన్వయసంభవంబుకతనం బ్రద్యుమ్ను
లం జేయుచుంబ్రకటం బయ్యెడు దానవారి యవతారంబొంది ధాత్రీస్థలిన్
చ. కలన నృసింహకృష్ణుఁ డతికౌశలతన్ జళిపించుఖడ్గ మ
గ్గలికఁ దటిల్లత ల్వెడలఁగ్రాయు నరాతినరాధిపు ల్మనన్
వలసిన వీనిఁ గైకొనుఁడు వక్త్రములం దని పండుఁబూరిపు
ల్లలు వెదచల్లెనో యనుతలంపులు చూపఱకుం జనింపఁగన్
క. బల్లిదుఁడు కృష్ణభూపతి
పెల్లుగ జళిపించువాలు పెనుఢాకకు భీ
తిల్లినపగ వాఁ డడవిని
భిల్లవిలాసినులచూపుబెళుకుల కులుకున్
చ. పొలుపుగ నారసింహనృపపుంగవుకృష్ణుఁ డనంత వైభవో
జ్జ్వలుఁడు ప్రతాపకుంకుమపుఁజర్చలఁ బాండుయశఃప్రసూన పూ
జలనలరించువిశ్వమును జక్రివిరాడ్త వౌటెఱింగి యౌ
భళి యదివో మహాద్భుతపుభక్తి మనంబుననెన్ని చూడఁగన్
చ. సుమధురమూర్తిగృష్ణవిభుఁజూడనియింతులెటన్న నండ్రుగా
ని మది యొకింత చేర్చియతనింగనుఁగొన్న తుదన్సుధాంశురూ
పము ప్రియ మన్నవారు మఱి భావజు మే లనువారుఁగల్గుట
బ్ర మిదియ సాక్షి యానృపతి రాజమనోజులరూపువాసికిన్
మ. అవనీకాంత కరంబు రంజిలెడు నంద్యాలాధిపుం గృష్ణపా
ర్థివునిం జేరి సదా యనంతవిభవాధిక్యంబు సొంపు న్వరా
హవసత్కౌశలజృంభణంబుఁ గులగోత్రౌన్నత్యము న్మానసో
త్సవమైనట్టియనేకపావనగుణోదారత్వముం గల్గుటన్. 95
సీ. శ్రీవిష్ణుభజనైకశీలుం డలోలుండు
వైదికమతరక్షణాదరుండు
నెఱబంటుతనమున మెఱయుజోదులయందు
గజహయారోహదీక్షాగురుండు
కీర్తిప్రియుండు సంగీత సాహిత్యాది
సకలకళావిచక్షణుఁడు రసికుఁ
డీవిపట్టునఁ గొంచె మెఱుఁగఁడు తగవరి
కలనైన నెఱుఁగఁడు కల్లలాడ
గీ. ధీరుఁడు గభీరుఁ డుచితవిహారుఁ డార్య
వర్తనుఁడు శరణాగతవత్సలుండు
శేషునకు నైన వర్ణన సేయ వశమె
యనఘు నంద్యాలకృష్ణధరాధిపతిని. 96
-:షష్ఠ్యంతములు:-
క. ఈదృశగుణరమ్యున క
న్యాదృశధరణివరదురభినయసామ్యునకున్
వైదిక పథరక్షునకు న
లాదిక నృపనయతిరస్క్రియాదక్షునకున్. 97
క. ఆధునిక రామభద్రున
కాధిక్యచణాహవక్రియారుద్రునకున్
మాధవపదపద్మసమా
రాధనవిధిసాధితావిరతభద్రునకున్. 98
క. జయలక్ష్మీపరిణయసహృ
దయకీర్తిసతీసమర్పితస్పుటతేజో
మయహారిద్రాక్షతసం
చయమధురితదిక్పురంధ్రిజననిటలునకున్. 99
క. దానోదకధారామహి
మానారతశీతలీకృతాంగణభూభా
గానుష్ఠితయాచక సం
తానాకించన్యజన్యతాపక్షతికిన్. 100
క. ఇభకర్ణ తాళవృంత
ప్రభవానిలసుఖితపరనృపప్రహితసువ
స్తుభరవహజనసమాకీ
ర్ణభవనగోపురబహిర్ధరాభాగునకున్. 101
క. శ్రీనంద్యాలనృసింహ
క్ష్మానాధతనూజునకు సమంచితవిభవ
శ్రీనవ్యబిడౌజునకును
దానకళాతులిత దైవతక్ష్మాజునకున్. 102
క. ఆత్రేయమౌనిగోత్రప
విత్రునకు విరోధిమదలవిత్రునకు దిశా
జైత్రునకు లోచనోత్సవ
గాత్రునకును గొండమాంబికాపుత్త్రునకున్. 103
క. విశ్రుతతిరుమలతాతా
ర్యశ్రేష్ఠాన్వయసుదర్శనాచార్యతనూ
జశ్రీనివాసగురుచర
ణాశ్రయణ సమార్జితాఖిలాభ్యుదయునకున్. 104
క. జిష్ణుయశోధిక్షేపణ
ధృష్ణుమహాశౌర్యపద్దతీఖేలునకున్
వైష్ణవమతశీలునకుం
గృష్ణమహీపాలునకును గృతిలోలునకున్ 105
వ. అభ్యుదయపరంపరాభివృద్ధియు నాయురారోగ్యసమృద్ధియు నగునట్లుగా
నాయొనర్పంబూనినకళాపూర్ణోదయం బను మహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టి దనిన. 106
క. శ్రీలకు నాకరమై వి
ద్యాలతలకు నాలవాల మై హరికి సదా
కేళీభవనం బై మహిఁ జాలన్
ద్వారవతి యొప్పు సౌభాగ్యములన్. 107
ఉ. తోయధియంక భాగమునఁ దోరపుఁ బెంపులతోడఁ దత్పుర
శ్రీ యతఁ డూర్మిహస్తములచేఁ దను ని ట్టటు ముట్టిలాలనల్
సేయఁగ నొప్పు నంగగుణలీలల నెంతయుఁ బెద్ద యయ్యు నే
ప్రాయము లైనఁ దండ్రియెడఁ బట్టరు వేఱొకరీతిగా జనుల్ .
చ. సురుచిరవస్తుసంపదలసొంపునఁ బెంపు వహింపుచున్నయ
వ్వరపురి యాత్మసామ్యపువివాదము దీర్చుకొనంగఁబిల్చు ని
ర్జరనగరిన్ సువర్ణమయసౌధకరప్రసరంబు చేత నం
బరము గ్రహించిభూరితరపౌరజనారవగౌరవంబునన్ 109
చ. అహిమకరప్రచారసుదురాసద మై నిబిడాంధకారస
న్నహనముపొల్పు దెల్పుచుఁదనర్చు సముద్రమహోదకంబుచే
బహిరభివేష్టితం బగుచుభాసిలుఁ దత్పురికోట మిక్కిలిన్
మహిమనుజక్రవాళగిరిమాడ్కి నిజూడ్కికివేడ్కసేయుచున్
చ. నలుగడలందుఁ గంబము లనం దగి రైవతకాదిపర్వతం
బులు పయి కప్పుఱాచలుపపోలికి నింగియు నందు చిత్రభం
గులు పచరించుసౌధమణికూటమరీచులు నొప్ప నొప్పు మి
క్కిలిఁ బురలక్ష్మి కొలుచవికెం గొలువున్నగతిన్శుభస్థితిన్
చ. కొలఁదికి నెక్కుడై వరుణుకోటలు మేడలు గోపురంబులుం
గొలువఁగ వచ్చి యప్పురముకోటల మేడల గోపురంబులన్
జలనిధి తుంగ భంగచయసంగతతత్ప్రతిబింబసంతతి
చ్ఛలమున నంత మ్రొక్కు ధరఁజాఁఁగిలి యీ డనువారుచిన్నవోన్
ఉ. శైవలనీలముం గమలశాలియు నైనయగడ్తనీరు ప
ద్మావళి వ్రాఁతతోడికరకంచుగ నొప్పుచుఁ గోట శాటీలా
గైవఱలంగ హర్మ్యకనకాంశునికాయము పేరఁ దత్పుర
శ్రీ విలసిల్లు నభ్రచరసింధువు మౌళికి మల్లెదండగన్ 113
చ. విలసితవీచికాయతరవిప్రతిబింబమిషంబున న్మహా
జలనిధిలక్ష్యపార్శ్వశయచక్రిపయిం జెయిసాఁచి యొప్పు సం
ధ్యలఁ బురలక్ష్మి ధర్మవిధు లన్నియు నొజ్జలపుచ్చకాయ గా
వలయు విడం డతండు రసవత్పరిఖామిషబాహుబంధమున్
చ. అగణితలీల నప్పురమునందు విరాజిలుచుండు నెంతయున్
మృగమదపంకలేపములమేలిమికోటలుఁ బువ్వుఁదోఁటలు
న్నిగనిగ మన్విటంకములనీలపు మేడలుఁ బైఁడిగోడలుం
బగడపుటంచుపొంకములపచ్చలతిన్నెలు వింతవన్నెలున్.
లయ. అలికులము నీలములచెలువము వహింప నవ
దళములు హరిన్మణులపొలుపునఁ దలిర్పం
దలిరుగమి కెంపులుగఁ బలు దెఱఁగుక్రొవ్విరుల
విలసనము ముత్తియపుగుళికలకుఁ దక్కుం
గలమణులకుం బసిఁడికళుకులకు నీ డగుచు
వెలయఁగఁ బరాగములు లలితపువితానం
బులుగ గృహముఖ్యముల చెలువు ప్రతిబింబములు
బలెఁ బురమునల్దెసలఁ బొలుచును వనంబుల్.
చ. అనుపమితస్వవాద్యనివహంబులతోసరిమ్రోయుటల్ సహిం
పనియది యై పురంబెదురుపౌజులుదీర్చెనొ మచ్చరంబున
న్వనధి కనంగనయ్యుపవనంబులుపొల్చు మిళిందబృందముల్
ఘనమకరాకృతిం దనర గాడ్పులఁ జింద మరందబిందువుల్ .
చ. కొలఁదికి మించుకెంజిగురుగుత్తుల మొగ్గలఁ బుష్పగుచ్చకం
బులఁ బువుఁదేనెఁ బుప్పొడులఁ బూపలఁబిందెలఁ గాయలన్
ఫలం, బుల నెపుడున్ సమగ్రపరిపూర్తి వహింపుచుఁ దద్వన
వ్రజం, బెలమిఁదలిర్చునందనసమృద్ధికిఁగోటిగుణాధికంబుగన్
శా. చాతుర్యాధిగతాఖిలశ్రుతిచయుల్ షడ్డర్శనీ పారగుల్
శ్రోతస్మార్తవిధిప్రసిద్ధపదవీసంచారసన్మార్గణుల్
చేతో నామవిలోచనాచలిత లక్ష్మీనాధసంజ్ఞాదిమ
జ్యోతిర్నిత్యనిరీక్షు లప్పురములో నున్నట్టియుర్వీసురుల్ .
శా. నానాయుద్ధవిహారశూరులు గుణానందజ్జయశ్రీనఖాం
కానూనభ్రమదాయుధవ్రణకిణోదంచచ్చరీరుల్ సదా
దానప్రౌఢియశోవిశేషజితమందారుల్ గభీరుల్ మహా
మానాధారులు రాకుమారు లతిభూమన్మింతు రవ్వీటిలోన్
చ. తమతమ పెద్దవారు మునుదాఁచినద్రవ్యములున్నయట్లయుం
డ మితము లేక యొప్పెడుధనంబులు దారు గడించి యుర్వి ని
త్యము నమితంబుగా నవనిధానము లున్పుచు నప్పురంబులో
నమరెడుకోమటుల్ నగుదు రల్లకుబేరునిధీశ్వరత్వమున్.
క. ద్విజులను శాస్త్రనియు క్తిని
భజియింపుచు నిండ్ల సకలభాగ్యవిభవ మ
క్కజ మై తనర సుఖింతురు
సుజనులు తత్పురములోనిశూద్రులు నెమ్మిన్. 122
క. ఎప్పట్టున ఘనసారపుఁ
గుప్పలగుగజాశ్వసుభటకోటుల చేతం
గప్పురపుఁగ్రోవి యనఁ దగి
యప్పురము కరంబు వెలయు నవనీస్థలిపై. 123
బంధు. అరుదుగఁ బిడికిట నడఁగెడునడుముల్
హస్తిసమానపుయానములున్
గురుజఘనములును గుచములభరముం
గొప్పులగొప్పతనంబులు మే
గరిగరికలు సిరి గలనగుమొగముల్
కల్కి మెఱుంగుఁగనుంగవలున్
దొరయఁగ వెలపడఁతులు విటధనముల్
దోఁతురు చొప్పడ నప్పురిలోన్.
చ. అమరఁగ వింతయిం పొసఁగు సందు విటాలికి వేశ వాటిహ
ర్మ్యములు విమానమానహరహారిశిరోగృహభాగభోగభా
గమర భుజంగ సంగహృదయంగమరంగదనంగసంగర
క్రమరమణీమణీమణితకల్పన నేర్చినవారువాలచేన్. 125
ఉ. మాటలు వేయు నేటికి రమావిభుఁ డందు పదాఱువేలపై
నూటెనమండ్రుభార్యలు దనుం బరిపూర్ణరతోత్సవంబులన్
గాటముగాఁ దనర్చుకుతుకంబులఁ గొల్వఁ గడున్ సుఖించునే
నాఁట నెఱుంగు నివ్విలసనంబు లతం డల తెల్లదీవిలోన్.
ఉ. అందును వారు వీ రనక యందఱు ధర్మధురీణు లైనవా
రందఱు శుద్దభాగవతు లందఱు వేదనిరూఢిఁ గన్నవా
రందఱు సాత్విక ప్రవరు లందఱుఁ దత్త్వ మెఱింగినట్టివా
రందఱు సత్కృపానిరతు లందఱుఁ బావనులెన్నిచూడఁగన్
క. ఇ ట్ట ట్టన నేటికిఁ ద
త్పట్టనమున నున్నయట్టిప్రజ లేజాతిం
బుట్టినవారలు వంద్యులు
గట్టిగఁ దద్వినుతి నెల్లకలుషము వాయున్. 128
క. అం దొకనటముఖ్యునిప్రియ
నందన శైశవమునంద నానాగుణరే
ఖం దనరారుచుఁ గ్రమమున
నందంబుగ యౌవనోదయముఁ బ్రాపించెన్. 129
క. కలభాషిణి యనుపే రా
వెలఁది మును వహించు సహజవిలసత్కలభా
షలకుఁ దగఁ జాల దిపుడది
కలికితనముఁ జతురతయును గలపలుకులకున్ . 130
వ. ఆ సమయమున. 131
క. బాలిశకేలిశతాలస |
తాలసదచిరావతరణతరుణిమతరుణీ
లోలాలసాలసవిలస
నాలోకనములు విటాళి నట్టిటు చేసెన్.132
ఉ. కూకటివేణితోఁ గురులు కూడకమున్నకుచప్రరోహముల్
పోకలతోడిసామ్యమును బొందకమున్న నితంబసీమకున్
వ్రేఁకఁదనం బొకింత ప్రభవింపకమున్న ప్రసూన బాణుఁ డ
ఱ్ఱాఁకల బెట్టెఁ దా నఱవ నావెలబాలికకై విటావళిన్.
చ. తనదుమెఱుంగుఁజెక్కిళులు దాఁకఁగనీక మొగంబు నాఁపుచున్,
జనుబొగడల్ నఖాకలనఁ జక్కిలిగింతలువోవ లోఁగుచున్,
మనసిజుమించుభీతియును నానయుఁ బూనుచు నీ మృగాక్షి యిం,
పొనరుచు టెన్నడొక్కొ యని యువ్విళ్లు లూరుదు రత్తఱిన్ విటుల్.134
క. తొలుఁబ్రాయపు మగకొదమల
తలపులతగులములు మిగులఁ దను నెదురుకొనన్
జలజాక్షిజవ్వనము గడు
వెలసె బ్రతిక్షణము వింతవింతగ నంతన్. 135
ఆ. మొదల బలురేఖ గల దఁట యదియుఁ గాక
వయసు క్రొత్తఁట వెలయాలివంగడ మఁట
వనిత చక్కఁదనంబును వన్నెలాఁడి
తనముఁ గల్కితనంబును దరమె పొగడ.136
సీ. మెఱుగుటద్దముమించుమించు బాగుల నింపు
నింపుచక్కనిముద్దనెమ్మొగంబు
నవచంద్రికల నవ్వునవ్వుఠీవులఁ జూపు
చూపులచొక్కపుసోయగంబు
నారూఢిఁ బలుమారు మారువిండ్లకు నేర్పు
నేర్పుకన్బొమదోయి నెఱతనంబు
కటికిచీకటికప్పుకప్పుపూనిక కొప్పు
కొప్పుతోరంపుఁబెక్కువబెడంగు
గీ. గుబ్బపాలిండ్లు లేఁగౌను గొప్పపిఱుదు
బాహులతికలు మృదుపదపల్లవములు
బంగరుసలాకపస భంగపఱచు మేనుఁ
గలిగి చెలువొందుచుండు నాచెలువ మిగుల.137
చ. బెళుకులఁ జిమ్ముచుం గలికిబిత్తరిచూపు సరత్న కుండలాం
చలకషణోజ్జ్వలత్వముపస ల్నెఱపం జళిపించున్ భుజం
గులహృదయస్థలుల్వొడిచికొంచక తోడన పోటుగంట్లఁదూ
ఱె లలనయౌరయొక్కొకతఱిఁబువుఁబోండ్లుకటారిక త్తియల్
ఉ. కీర్తనపాత్రచిత్రమృదుగీతకళాకలనప్రవీణతన్
నర్తన నైపుణీవిలసనంబుల పెంపున నత్యపూర్వని
ర్వర్తితపంచబాణ సమద క్రియలన్ హరిణాక్షి యప్సరః
కీర్తిబలెన్ హరింపఁదొడఁగె న్విటసంచయచిత్తవిత్తముల్ .
ఉ. ఆరమణీశిఖామణి మహావిభవంబున నొక్కనాఁడు సిం
గారము లెంతయు న్మెఱయఁగాఁ జెలికత్తెలతోడఁ జేటికా
వారముతోడ వింతచెలువంబు నయంబుఁ దలిర్పఁగా వసం
తోరువిలాసభాసురపుపవనంబున కేఁగి యచ్చటన్.
సీ. క్రొన్నన ల్వలరాచమన్ననల్ గనఁ గర
మల్లిక ల్గొనియున్న మల్లికలును
సంతానముల కళిసంతానములయాట
పాటల ములుచూపుపాటలములు
ఠీవి చేకొన్నవూఁదావిచేఁ బథికాంత
రంగముల్ నొంచునారంగములును
మారుమే లైనబంగారుమేడలఁ బొల్ప
భంగి యై మించుసంపంగిగములు
గీ. మంజులము లై కనంబడువంజులములుఁ
గుందములును వాసంతీకాబృందములును
గేసరములును నవనాగకేసరములుఁ
గాంతలార కంటిరె కడువింత లనుచు. 141
పూఁబోఁడి యొరసికొని చన
గాఁ బయ్యెద యొడిసి పట్టె గనుఁగొంటె చెలీ
లేఁబొన్నను భళిరా యిది
గోఁ బురుషాహ్వయము నిలుపుకొనుసమయంబున్. 142
ఆలికుచంబులు నాగ
య్యాలికుచంబులును వాదులాడెడురొద గా
బోలు ననఁ దనరె నూపుర
కోలాహలచకితకీరఘోషము వింటే. 143
క. లేఁగరువలిచే ముందటి
పూఁగొమ్మలు పాయవడుచు భుజగతి నెఱపం
గాఁ గురవక మిదె తివిరెడుఁ
గౌఁగిటికి న్నీకుఁ దగునె కైకొనవె చెలీ. 144
చ. పయఁట చెఱంగు శాఖ యనుపాణిఁ దెరల్చుచు నోలతాంగితా,
బ్రియమున భృంగ కేతవనిరీక్షణము ల్కుచకుట్మలంబు లం,
గయికొన నొప్పుపల్లవశిఖామణి మామిడి రి త్తవోవునే
భయ మిఁక నేల యే మిచటఁ బత్త్రముఁ బుష్పము వేడ్క నందితో 145
వ. అని యీ ప్రకారంబుల మఱియుఁ దాను జెలికత్తెలు నొండొరులతో ననేకవిధ సరససల్లాపంబులం
బిసాళింపుచు నింపుదళుకొత్త గ్రొత్తవిరిగుత్తుల చేత నేత్రపర్వం బగుచున్న యాపువ్వుఁదోఁట
దఱియంజొచ్చి. 146
సీ. అరవీడుకొప్పులవిరులవాసనకుఁ దో
రపు టూర్పుఁదావులు ప్రాపు గాగఁ
నడలమందతఁ బెంచుబడలికలకుఁ బిఱుం
దులవ్రేఁగుఁ జను వ్రేఁగుఁ దోడుపడఁగఁ
జెమటచిత్తడిఁ గ్రొత్తచెలువు గాంచినవళుల్
మొలనూళ్ల కాంతికి బలిమి నొసఁగఁ
బయ్యెద లాడింపఁ బ్రభవించుకంకణ
నాద మందెలమ్రోఁతఁ బ్రోది సేయ
గీ. మిగుల రొదగాఁ గికాకిక సగుచు రతుల
యాయములు సోఁక నెద్దియే నాడుకొనుచు
సందడింపుచుఁ బుష్పాపచయము సలిపి
యంతఁ గడఁగిరి డోలావిహారములకు. 147
వ. అప్పు డాకాశమార్గంబునం గృష్ణసేవాలాలసుం డగుచు నేగుదెంచు నారదమహామునీంద్రుని
మణికంధరుం డనుగంధర్వకుమారుండు గానవిద్యావిశేషాభిలాషంబునం గొలిచి వచ్చుచు నుండి
యమ్మగువలప్రగల్భతాగరిమకు వెఱఁగందుచు శతానందనందనున కిట్లనియె 148
మ. తమిఁ బూఁదీఁగెలఁ దూఁగుటుయ్యెలలఁ బం తాలాడుచుం దూఁగు నా,
కొమరుంబ్రాయపుగబ్బిగుబ్బెతలయంఘ్రుల్ చక్కఁగాఁ జాఁగి మిం,
టీమొగం బై చనుదెంచుఠీవి గనుఁగొంటే దివ్యమౌనీంద్ర నా,
కమృగీ నేత్రలమీఁదఁ గయ్యములకుం గా ల్చాఁచులా గొప్పెడున్ 149
వ. అనుటయు నారదుండు. 150
మ. బళిరా సత్కవి వౌదు నిక్కమ తగ న్భావించి నీ వన్న యా
యెలప్రాయంపుమిటారికత్తెలబెడం గే నెందునుం గాన వా
రలడోలాచలనోచ్చలచ్చరణముల్ త్రైవిష్టపస్త్రీలయౌ
దలఁదన్నంజనునట్లు మించెననినం దప్పేమి యొప్పేయగున్ . 151
క. అని పలుకునపుడు నికటం
బున నలకూబరుఁడుఁ దాను మొగులుమఱుఁగునన్
ఘన మగుదివ్యవిమానం
బునఁ జనుచున్ రంభ విశదముగ నది వినియెన్. 152
ఆ. విని యొ కింత కనలి మన సొకలా గైన
నతని నారదుఁ డని యత్మ నెఱిఁగి
భావవికృతి యెఱుక పడనీక యడఁచి య
మ్మగువ తనదుప్రియుని మొగము చూచి. 153
క. ఆలించితెయా పలుకుల
పోలిక దెలియంగఁ గలహభోజనముని గాఁ
బోలు మన మితనిఁ గని యుచి
తాలాపము లాడి చనుట యభిమత మనియేన్. 154
ఉ. నారదుఁడుం దదీయవచనంబు వినంబడుదిక్కుఁజూచె నె
వ్వారలో మాటలాడుచును వచ్చుట తోఁచె నటంచు నచ్చటన్,
వారివిమానరత్నమును వారిధరంబుమఱుంగు వాసె బా
లారుణ భానుబింబ ముదయాద్రిమఱుంగునఁ బాయుచాడ్పునన్. 155
క. ఆ రంభయును గుబేరకు
మారుఁడు నవ్వేళఁ దమవిమానోత్తమమున్
నారదమౌనీంద్రుపదాం
భోరుహములక్రిందిచాయఁ బోనిచ్చి తగన్. 156
ఆ. పారిజాతకుసుమసౌరభంబులు వెద
చల్లుతమశిరంబు లల్లనల్ల
నద్దుచును దదీయ మగుపాదయుగళి వా
సించి రంతఁ గొంత సేపు నిలిచి. 157
క. ఆ వరమౌనియు నొం డోరు
పై వదలని ప్రేమ కలిగి భాసిలుఁ డనుచున్
దీవించే రంభ యపు డా
దైవతమునివర్యుఁ జూచి దరహాసమునన్. 158
క. ఓమునివర మీదీవన
చే మాపైఁ బ్రేమ కొంత చెడక నిలుచునో 159
యేమో కాని యిఁక న్నర
భామలపోఁడుముల కితఁడు భ్రమయక యున్నే
వ. అని తనమనంబునం గలయీరసంబు సైరింపంజాలక యెక్కసక్కెంబుగా నాడుమాటలకు
సందియంబు నొందుచు నిది యేమి యనుట వివరింపు మని మునివరుండు నిలిచి
యడుగుటయు దేవరకుం బ్రస్తుతగమననిరోధంబు గాకుండ విమానంబుమీఁదికి విచ్చేయుఁడు
మీవంటిమహానుభావులం గొంతమేరయైనం గొలిచివచ్చుట భాగ్యంబుగాదె యనుచుశిష్య
సమేతంబుగా నతనిం దమవిమానమునందు నునుచుకొని తదలంకారచామరంబులు రెండును విడిచి
పుచ్చుకొని తన ప్రియుండునుం దాను నిరుగెలంకుల నిలిచి యల్లనల్లన వీచుచు నప్పడంతి
మౌనివర్యా యిప్పుడు మీరలాడోలికా విహారిణుల ప్రసంగంబున శిష్యుతోడ నే మనిపలికితి రది
యానతీయవలయు ననుటయుఁ జిఱునగవుతో నతండు.
మ. బళిరా సత్కవి వౌదు నిక్కమ తగ న్బావించి నీ వన్న యా
యెలప్రాయంపుమిటారికత్తెలబెడం గే నెందునుం గాన వా
రలడోలాచలనోచ్చలచ్చరణముల్ త్రైవిష్టపస్త్రీలయౌ
దలఁ దన్నంజనునట్లు మించెననినం దప్పేమి యొప్పేయగున్.
క. అని పలికితి నిం దే మై
నను గాని తెఱంగు గలిగినం జెపుమా యో
వనజాక్షి యింక దాఁపం
బని యేమి మనంబులోనిభర మని పలికెన్. 162
వ. పలికిన నవ్విలాసిని యతనిం జూచి. 163
క. మీరలు పెద్దలు త్రైలో
క్యారాధ్యుల రేమియన్న నంటిరిగా కె
వ్వారలు మాన్చెద రిదియే
మారసి యాడితిరొ యనుచు నడిగితి ననఘా 164
ఉ. ఊహ యొనర్పరో యతిశయోక్తులవర్ణనలందు నిట్టియ
వ్యాహతి చెల్లు నంచునొ యిటాడితి రింతియ కాక యేవరా
రోహలు మమ్ముఁ బోలమికి రూఢిగ నిమ్మెయి నున్నయీ జగ
న్మోహనమూర్తి యర్థపతిముద్దుకుమారుఁడెసాక్షి నావుడున్ 165
ఉ. అల్లన నవ్వుచున్ముని సురాంగనఁ జూచి యెటాడుకొన్న నుం
జెల్లుఁగదమ్మ నీకుఁ గడుఁ జెల్వుఁడు నిబ్బరమైన ప్రేమ రా
జిల్లఁగ నిట్లు వర్తిలుటఁ జేసి మృగేక్షణ యైన నిట్ల రా
వెల్ల దినంబులున్ సవతి యేగతిఁ గల్గునొ మీఁదు గంటివే.166
క. నినుఁ బోలువనిత నీకును
వనజముఖి యితనిఁ బోలు వాఁ డితనికి నెం
దును గల్గి కలఁచునో యి
ట్టినిగాఢపుముదముసొంపుఠీవులు చనునే.167
క. అనుటయు నవ్వుల కనినన్
మునివర మీమాట యిట్లమోఘం బగునో
వినలే నిట్టివి మానుఁడు
నను మన్ననచేసి యనుచు నాతుక మొక్కెన్. 168
వ. అంత నమ్మహామునీంద్రునియాజ్ఞానుసారంబునం దద్విమా నంబు కలభాషిణి
విహరించుచున్న యెలదోఁటలోనికిం దిగియె నట్టియెడ రంభనలకూబరులు
వినయపూర్వకంబుగా నతని చేత ననిపించుకొని యప్పు డెదుటఁ గాన్పించు వాసుదేవుని
ప్రాసాదరాజంబునకుం జెయ్యెత్తి, మొక్కి తమ విమానంబుతోడ నిజేచ్చం జనిరి.
కలభాషిణియు నట మున్ను తన కనతిదూరంబున వినఁబడు వారలసల్లాపంబు
లాలకించియుఁ దదనంతరంబ ధగధగితదిగంతరం బగుచు జేర నేతెంచువిమానంబు
నవలోకించియు నాశ్చర్యంబు నొందుచుండి యప్పుడ ట్లరుగునలకూబరునిరూపలావణ్యాది
సౌభాగ్యంబులకు మిక్కిలి మెచ్చుచుఁ దదాలోకనంబులం దనియక కొంత మేర
తద్విమానంబుక్రిందటిచాయఁ బూఁ బొదరిండ్లయిరమిమఱుంగున వారిసల్లాపంబు
లాలకింపుచుం జని యంత నది మిక్కిలి దూరంబుగా నేఁగుటయుఁ దిరిగి వచ్చుచుఁ
దనమనంబున. 169
ఆ. ఇంతరూపవంతు నెంతయుఁ దనకుఁ గై
వసము చేసికొని యవార్యగర్వ
మతిఁ జెలంగుభాగ్యవతి యీలతాంగి యె
వ్వతె యొకో మనంగవలదె యిట్లు. 170
చ. మునుపు నిజేశు నర్థపతిముద్దుకుమారుఁ డటంచు నానితం
బిని పలుకంగ వింటిని గుబేరతనూజునికిం గరంబు మో
హనయగుకాంత రంభయని యాడుకొనంగ వినంబడు న్మనం
బున నిపుడెన్న నామెఱుగుఁబోఁడియ కావలయు న్నిజంబుగన్. 171
క. ఇప్పుడిది నిశ్చితంబుగ
నప్పరమమునీంద్రుఁ జేరి యడుగఁగవలయుం
దప్ప కతఁ డమరమౌనియ
యప్పటి కప్పటికి వచ్చు యదుపతికడకున్ 172
క. అని చింతించుచు సాయం
గన తా నొక్కతియ యేఁగి కడుఁ జేరువ నా
యనుపమతేజుని నారద
ముని గాగ నెఱింగి వినయమునఁ బ్రణమిల్లెన్. 173
వ. ప్రణమిల్లి లేచి విరచితాంజలియై. 174
క. మౌనీంద్రచంద్ర యిపుడు వి
మానముతో నేఁగినట్టిమహితాత్ములు రం
భానలకూబరులే యన
నానారదుఁ డట్ల యగుదు రని యాయకతోన్. 175
క. నీ వెట్లెఱిగితి చెపుమా
నావుడు మీరాడుకొన వినంబడుమాటల్
భావింప నట్ల యై నా
భావమునకుఁ దోఁచె ననుచు భామిని పలికెన్. 176
చ. పలికిన మింట నాడుకొనుపల్కులు వింటివొయన్న వింటినో
యలఘుతపోనిధాన తనయత్యధికం బగురూపసంపదం
జెలువుఁడు కైవసం బనుచుఁ జెల్లుఁబడిం బచరించి పల్కె నా
కలికి తదుక్తి కోర్వమి ప్రకాశిత మయ్యెను మీవచస్థ్సితిన్ . 177
క. అనుటయు ముని నాయకుఁ డో
వనితా యొ ట్లోర్వవచ్చు వలవనిగర్వం
బునఁ గన్ను గాన కాడెడి
యనుచిత వాక్యంబు లేరికై నఁ దలంపన్. 178
క. తరుణీ యేరికిఁ జెల్లునె
యరయఁగ నే మింతవార మనుకొన నిదిగోఁ
బిరువీకుగ నున్నది తాఁ
గర మద్భుత మైనసవతికయ్యము చేతన్ 179
క. సవతి యన నింక నొకతెన్
భువిలోపల వేఱ వెదకఁ బోవలయునె యో
ధవళాక్షి నీవ కానే
రవె దైవనియుక్తిఁ గొంత ప్రాప్తి గలిగినన్. 180
క. నావుడు నంతటిరూప
శ్రీ వైభవవతికిఁ గాక సిద్ధించునె యా
దై వనియుక్తియు మాబోం
ట్లేవిధమునఁ బాట్లఁ బడిన నిద్ధవివేకా. 181
గీ. అనుడు నామాట కేమి యోయంబుజాక్షి
రంభ మొదలైన యేయచ్చరలకు నైనఁ
దక్కువే నీదురూపసౌందర్యమహిమ
లెక్కుడే కాక మిగుల నూహించి చూడ.182
ఆ. అది యటుండనిమ్ము ముదిత నిన్నును జూచి
నట్లు దోఁచుచున్న యది యొకింత
నలిననాభుకొలువునకు వత్తువొ యన
వత్తు మిమ్ముఁ జూతు వరమునీంద్ర. 183
సీ. అని యింతి పల్కిన మునిపలె నవునవు
నెలఁత ని న్నె ఱుగుదుఁ దలఁచుకొంటి
మాశిష్యుఁ డై నయీమణికంధరాహ్వయుఁ
డిట గొన్నినాళ్ల క్రిందటను గ్రొత్త
గాఁగ హరిం బొడగానంగఁ దా వచ్చి
దండకరూపసంస్తవనరచన
యొనరింప నేక సంధన గ్రహించి పఠించి
నట్టి నేర్పరివిగదమ్మ నీవు
గీ. పేరఁ గలభావిణివిగద బిరుదుచదుర
వగుదు బళిబళి యిపుడు నీ కది ముఖస్థ
నున్నదియే శక్యమగునె చదువ
ననుడు శక్యంబు గాకేమి యనుచుం బలికి. 184
వ. అమ్మదిరాక్షి , ముధురగంభీరస్వరంబున నిట్లని చదివె. 185
దండకము. [శీకామినీకామితాకార సాకారకారుణ్యథారానవాంకూర శంకాకరాశోణరేఖామయూఖాళి
కీమ్మీరితాలోకనాలోకలోకైకసంస్తుత్యనిత్యప్రభావా విభావైభవాధిక్య ధిక్కారి తానంత
మార్తాండ కోటీక యాటీకమానామలాస్తంభ శుంభద్యశః పూరకర్బూర సౌరభ్య
మైత్రీపవిత్రీకృతామ్నాయవాయుప్రచారానిశాపాదితాపారసంసారసంతాప
నిర్వాపణా పాపనిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా
భవాభావలోభాకులీభూత చేతస్సుధీ వ్రాతనిర్ణీత సంప్రాప్తస
ద్భక్తిమార్గైకవిశ్రామ భూమీభవత్తత్త్వరూపా సురూపా
వళీదుర్నిరూపస్వరూపా గురూపాసనాసాదితానారతానన్య
సాంకర్య కైంకర్యమాధుర్యధుర్య ప్రసన్నా ప్రసన్నావళీమా
నసోదస్తభోగాపవర్థాభిలాషా హృషీకేశ యీశానవాణీ
శముఖ్యు ల్సువిఖ్యాత మైనట్టినీదివ్యచారిత్రచారుప్రచారం
బు పారంబుముట్ట న్నుతింపంగ లే రంచు నెంచంగ వించుం
బ్రపంచస్వభావంబు భావంబున న్మాన కి ట్టేము నీముం
దటం జూాటువాచాటత ల్చూపుచున్నార మిన్నేరము ల్గన్న
నంజేసీ సైరింపు మోవాసుదేవా సదానంద గోవింద నీ విందు మావింద వైడెంద మానంద
మొందింప నెందున్విచారఁబు లేమి న్వచోగోచరాగోచరత్వంబు లూహింప లే మైతి మోదేవ
మీ పాద సేవాదరంబు న్మదిం గోరుచు న్వేదవాదు ల్శమాదు ల్కడుం జాలనార్జించి భోగేచ్చ
వర్జించి నానాతపశ్చర్య లాశ్చర్య తాత్పర్యపర్యాకులత్వం బునం గైకొన న్మాకు నేయత్నము ల్లేక
యోకృష్ణ యీకైవడిన్ మీకృపాలోకసంసిద్ధి సిద్ధించుట ల్బుద్ధిఁ దర్కింప నత్యంతచిత్రంబు గాదే
జగన్నాధ యీరీతిఁ జెన్నార మున్నే ఋషుల్మిమ్ముఁ గన్నారఁగన్నారు మాకన్ను లెన్నంగ
నేపుణ్యము ల్సేసెనో యీవిశేషంబుఁగాంచె న్విరించోదయస్థాననాభీసరోజాతజాతాండముల్తండ
తండంబు లై యుండ నొండొండ నీరోమకూపంబు లేపారఁగాఁ దాల్చుట ల్చెప్పఁగా నీవుగోవర్థనం
బెత్తి తంచున్వరాహావతారంబునన్ ధారుణీచక్రమున్ దాల్చి తంచు న్మహాకూర్మభావంబునన్మం
దరగ్రావము న్మోచి తంచు న్జగంబు ల్సమస్తంబుఁ ద్రైవిక్రమ ప్రక్రియా వేళఁ బాదత్రయిం జాలఁ
బూరించి తంచు న్నుతింపంగ యుక్తంబె భక్తప్రజాధీన దీని న్వివేకించి లోకంబులోఁ గొందఱార్యో
త్తము ల్సర్వ వేదంబులు న్సర్వవాదంబులు న్సర్వయాగంబులు న్సర్వయోగంబులు న్సర్వ
మౌనంబులు స్సర్వదానంబులుం జూడ నీదాసదాసానుదా
సాంఘ్రిసంసేవలోఁ గోటికోట్యంశము న్బోలఁగాఁ జాలవంచుం దదాచారముం బూనివర్తింతు
రత్యున్నతిన్ సత్యసంకల్పనిత్యోదయా యేము నీనామమాత్రంబు మానాలుకం జేర్చుటల్దక్క
నొక్కింతయుం దక్కుత్రోవన్ భవన్మాయ దాఁటంగలే మవ్యయా భవ్యయోగీంద్రసాంద్రాదరా
కాంక్షితైకాంతసంసేవనా భావనాతీత కల్యాణనానాగుణ శ్రీసముద్బాసితాంగా మముం గేవలం
బైనకారుణ్యదృష్టిం గటాక్షించి రక్షించు లక్ష్మీమనోవల్లభా దేవదేవా
నమస్తే నమస్తే నమస్తే నమః 186
మ. అని యీ వైఖరి నంతయుఁ జదివి దైత్యారాతి యీదండకం
బునకు న్మెచ్చుచు నిచ్చినట్టిదిగదా భూరిద్యుతి న్నీదుశి
ష్యునికంఠంబున నొప్పునావిమలరత్నోదారహారంబు స
న్మునిలోకోత్తమ యంచుఁ బల్కి మఱియుం బూఁబోఁడి దానిట్లనున్ 187
సీ. పొసఁగ ముత్తెపుసరు ల్పోహణించినలీలఁ
దమలోన దొరయుశబ్దములు గూర్చి
యర్థంబు వాచ్యలక్ష్యవ్యంగ్య భేదంబు
లెఱగి నిర్దోషత నెసఁగఁ జేసి
రసభావములకు నర్హంబుగ వైదర్భి
మొద లైనరీతు లిమ్మగ నమర్చి
రీతుల కుచితంబు లై తనరారెడు
ప్రాసంబు లింఫుగాఁ బాదుకొల్పి
గీ. అమర నుపమాదులును యమకాదులు నగు
నట్టియర్థశబ్దాలంక్రియలు ఘటించి
కవితఁ జెప్పంగ నేర్చు సత్కవివరునకు
వాంఛితార్ధంబు లొసఁగనివారు గలరె. 188
లయ. చలువ గలవెన్నెలల చెలువునకు సౌరభము
గలిగినను సౌరభముఁ జలువయుఁ దలిర్పం
బొలు పెసఁగుకప్పురపుఁబలుకులకుఁ గోమలత
నెలకొనిన సౌరభముఁ జలువపసయుం గో
మలతయును గలిగి జగముల మిగులఁ బెంపెసఁగు
మలయపవనంపుఁగొదమలకు మధురత్వం
బలవడిన నీడు మఱి కల దగఁగవచ్చుఁ గడు
వెలయఁగలయీసుకవిపలుకులకు నెంచన్. 189
వ. కావున. 190
క. ఊరక యటు మిముబోఁటుల
చేరువఁ జరియింపఁగనిన సిద్ధింపవె యే
కోరిక లైన నజస్రముఁ
గోరుదు మీవీణ మోచుకొని కొల్చుటకున్. 191
సీ. మునినాధ యిటమున్ను వనజదళాక్షుని
యంతఃపురంబున కరుగువేళ
మణికంధరుని దదంగణమున నిల్పి మీ
వీణియ మీరలే పొణిఁ బూని
పోవఁగాఁ జూతు నప్పుడు దాని నేఁ బుచ్చు
కొని కొల్చివత్తునో యని తలంతు
దేవరచిత్తంబు దెలియమి నట్లు సే
యఁగ నేమి దోఁచునో యనుచు వెఱతుఁ
గీ. గరుణ నంతమాత్రపుటూడిగంబు నాకు
ముదలవెఁట్టు డటంచుఁ గేల్మోగిచి మిగుల
వినయ మొప్పఁగ నాయింతి వేఁడుకొనియె
నతఁడు నట్ల కాని మ్మని యనుమతించె.192
వ. అనుమతించుటయు నిమ్మహాత్మునియనుగ్రహం బీపాటిగలిగె దీనం జేసి నావాంఛితంబును సఫలం
బగునని సంతసిల్లి రంభానలకూబరులవలనఁ గడపట వినబడిన వాక్యంబొకటి దలంచుకొని యది
తెలియుటకుఁ గృతాంజలి యై వినయ భరంబునఁ గొంకుచు దానను మణికంధరుండు రహస్యశంకనెడ
గలుగఁ జనఁగ నమ్మహాముని కిట్లనియె. 193
సీ. మహితాత్మ మీర లిమ్మహినుండ సంకోచ
పడి యేమొ మిక్కిలి పొడవు చనఁగ
నీక విమానంబు నిలచేర్పునన కొంత
మేరఁ బోనిచ్చె నమ్మిథున మిప్పు
డేను వృథాభ్రాంతి నింతనంతను దాని
వెంబడిఁ జని పల్కు వింటి నొకటి
వినుఁ డది యర్థేశతనయుఁ డోయబల యి
న్నారదుమాటలనడుమ వేఱ
గీ. పొడమె నే మయ్యె నలకళాపూర్ణుసుద్ది
కడమచెపు మన్న రంభ యప్పుడ తెలుపనె
నీకు మఱి చెప్పరాకుంట యీకధయును
నీకు నాతోడుసు మ్ముబ్బనీకు మనియె. 194
గీ. ఏ నెఱుఁగ వేడ్క పడుచున్న దాన నోత
పోధనోత్తమ యాకళాపూర్ణుఁ డనఁగ
నెవ్వఁ డాతనిసుద్ధి ము న్నేమి చెప్పె
నెద్ది చెప్పరా దనియె నాయిగురుఁబోఁడి. 195
వ. ఇది యానతీయవలయు ననిన నతండు వెఱఁ గంది యిదియంతయుఁ గడునపూర్వంబు దీనిఁ దెలి సెదంగాక యని కొంత తడవు నిశ్చలుం డగుచు విశ్వప్రపంచంబునం గలభూత భవిష్యద్వర్తమానవర్తనంబు లన్నియు విమర్శించి తత్ప్రకారంబుఁ గాంచి కలభాషిణిం జూచి యారంభ ప్రియునకుఁ జెప్పరా దనినకథ యత్యపూర్వంబు నాకునుం జెప్పఁ దగదని పలికిన.196
గీ. అనఘ చెప్పరానికధాంశ మట్ల యుండ
నిమ్ము నలకూబరునకు నయ్యింతి యేమి
కారణమ్మున నీప్రసంగము వచించెఁ
దెలుపుఁడన దాని కి ట్లని తెలిపె మౌని. 197
సీ. ఈరంభయును వీఁడు నేవేళయును రతి
క్రీడాపరాయణుల్ కేవలమును
వీరి నొండొరుహాసవీక్షణోక్తులు దక్కి
నట్టిచేష్టితములు నెట్టి వైన
మన్మథోద్దీపనమహిమఁ జొక్కించు నొ
క్కొక ప్రేమచొ ప్పిది యుర్విఁ గలదు
కావున మము నేఁడు కనుఁగొనుటకు మున్ను
రంభ నవీనమార్తాండుదండ
గీ. శుభ్రఘన రేఖ వర్తిల్లఁ జూచి నగుచు
బ్రహ్మతోనున్న శారదారమణిఁ బోల్చె
ధనదసుతుఁడు నమ్మాటకుఁ దరుణిమోవి
దంతశిఖ నొత్తె నత్తఱిఁ దనరుతమిని. 198
క. ఒత్తుటయు నెడుఁ గలుగని
క్రొత్తతెఱంగునఁ జెలంగుకోమలకలవా
గ్వృత్తి యపు డొకటి బహువి
చ్ఛిత్తికమై దానికంఠ సీమన్ బొడమెన్ 199
ఉ. ఏయేడ నెన్నఁడుం గననియింపులు గుల్కెడుతద్గళ స్వనం
బాయత మైనకౌతుకము నద్భుతము న్మొలపింప నేదియే
దీ యిది చాలఁ గ్రొత్త బళి యింకొకమా ఱిక నొక్కమా
ఱటం, చాయలినీలవేణి నలకాధిపసూనుఁడు వేఁడె వేఁడినన్ 200
క. నా చేత నింకఁ గా దిది
యో చెలువుఁడ యనఁగఁ గాకయున్నన్ విడనే
నోచెలువ యనఁగ వచనా
గోచరసల్లాపరసము కొంతపు డొదవెన్. 201
వ. అంత నక్కాంత కాంతునికి సంతసంబుగాఁ గొంతకొంతతత్ప్రార్థనంబు సఫలంబు చేసె నతం డంత
నింతకు మున్నిదియెన్నఁడును విన్న యదిగాదిప్పుడెప్పగిదినొదవెఁ జెప్పుమని గుచ్చి గ్రుచ్చి
యడుగ నిది నేఁడు నేర్చినది కాదు తడవులనుండి నే నెఱింగినదియ యొక్క
కారణంబున నిది యెఱుకపఱుపక నెఱయ మఱచియు నేఁడు బాలభానుపాండుమేఘసంసర్గ
విశేషవీక్షణంబునం దలంపైన మానసంబులోనన పూని యుండి
యిప్పటినీదుండగంబువలనఁ గలఁగి వెలివిరియనిచ్చితినని పలికిన నతం డిట్లనియె. 202
గీ. ఏమికారణమున దాఁచి తిన్నినాళ్ళు
తరుణి యెఱిఁగింపు మనుడు నేతత్ప్రసంగ మునఁ
గళాపూర్ణుకధలు వచ్చునొ యనియెడు
తలఁపుచే దాఁచితి నటంచు వెలఁది పలికె. 203
సీ. పలికి పౌరుషాభరణ తత్కథలు వ
చ్చిన నేమి యంటేని వినుము తెలియ
నాకథ లిఁకఁ జెప్పినట్టి వారును విని
నట్టి వారును ధాత్రియందుఁ బుత్త్ర
పౌత్త్రప్రపౌత్త్రాదిబహుసంతతిని దన
ర్చుచుఁ జిర కాలంబు ప్రచురసంప
దభివృద్ధిశోభితశుభసౌఖ్యములు గాంతు
రనుమాట యున్నది యాదియంద
గీ. యేను నీ కది చెప్పిన వానికొఱకు
నవనిఁ బుట్టంగవలయునో యని వెఱచెదఁ
బ్రాణవల్లభ యవి తావకాంగసంగ
సౌఖ్యమునఁ బేర్చునాకు నిష్టంబు లగునె. 204
గీ. ఆది నీకథ వింటి వెట్లనియెదేని
యేను వినినట్టిపిమ్మట నిట్టిమాట
పలికె నొక యమోఘవాగ్విలసనుండు.
కావున వచింప విన నిఁకఁ గాదు నీకు. 205
వ. అని చెప్పెనని చెప్పి నారదుండు. 206
గీ. అతివ విను రంభకును గలయట్టిభయము
నాకుఁ గల్గుటఁ దత్కధ నీకుఁ జెప్పఁ
గూడ ద ట్లయ్యు మిక్కిలిఁ గువలయమున
వెలయఁ గల దది వెలయుత్రోవలును గలుగు. 207
వ. అది యట్లుండె రంభానలకూబరు లవ్విధంబున సల్లాపం బొనరించినయనంతరంబ తద్విమానంబు
మత్సమీపంబున కేతేర మీడోలికాప్రసంగంబులు వడియెనని కలభాషిణికిం
జెప్పి యప్పుడు తద్వనలక్మీవిలోకనకౌతుకంబున నెడగాఁజనియున్న మణికంధరుం బిలిచి
యంబుజాక్షునికొలువువేళ దప్పకుండం బోవలయు రమ్మనుచు నచ్చటు గదలిచనియెఁ గలభాషిణియు
నంతఁ దనుఁ జేరవచ్చిననెచ్చెలులుం దానును నిజగృహంబున కేఁగి వేగంబ కొలువుసింగారంబు సంఘ
టించుకోని కృష్ణనగరి కరిగె. 208
శా. శ్రీనంద్యాలపురాంక వాగ్విభవలక్ష్మీనాధపర్యంక సు
జ్ఞానశ్రీమిధిలేంద్ర సూనృతవచస్సంధాహరిశ్చంద్ర వి
ద్యానైపుణ్యసముద్భటార్భటికవిద్వద్వాదవాచాలితా
స్థానీమందిర యిందిరా రమణపత్పంకేరుహేందిందిరా. 209
క. అంభోనిధిసాధారణ
గాంభీర్య యరాత్యసుప్రకంపనచయకు
క్షింభరితరవారిమహా
కుంభీనసవర్య సమరగురుభుజశౌర్యా. 210
మానిని. శేషసుభాషణ శీలవిభూషణ సేవక పోషణ చిత్తరిపూ.
న్మేషనివర్తన నిర్మలకీ ర్న నిత్య సువర్తన నీతికళా
పోషవిచక్షణ పుణ్యనిరీక్షణ భూసురరక్షణ భూరిమద
ద్వేషణ శాసన ధీజలజాసన దీప్తివిభాసన ధీరమతీ. 211
గద్య. ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వ వైభవపింగళి
యమరనార్యతనూభవసౌజన్యజేయసూరయనామ
ధేయప్రణీతం బైనకళాపూర్ణోదయం బను
మహాకావ్యంబునందు
ప్రథమాశ్వాసము.