కళాపూర్ణోదయము (1943)/పింగళి సూరన
పింగళి సూరన
| |
శ్రీమదాంధ్రసారస్వత మమృతతుల్యము. ఈ భాష విశేషశ్రవణీయ మై సర్వాంగసుందర మై ప్రస్తుతికిఁ బాత్ర మగుచుఁ బ్రకాశించుచుండును. సంస్కృతకవి యైనసుధాకరుఁ డాంధ్రభాషాసుధామాధుర్యము నిట్లు మిక్కిలి యెక్కువగఁ గొనియాడినాఁడు.
శ్లో. | "యోవేత్త్యాంధ్రమయీం వాణీం | |
మన తెలుఁగు ప్రాగ్దేశభాషలం దెల్ల నెక్కుడు శ్రావ్యమైన దని ప్రాక్పశ్చిమఖండవాసులచేఁ బొగడఁబడినది. ఐరోపాదేశీయుఁ డైన 'బిషప్ కాల్డువెల్' అనుదొర మనదక్షిణహిందూదేశమునకు వచ్చి యిచటిదేశభాషల నెల్ల మిగుల బాగుగ నేర్చికొని భాషాతత్త్వవేత్తలలో నగ్రగణ్యుఁడు గ నెంచంబడినవాఁ డాంధ్రము దేశభాషలలో నెల్ల విశేషశ్రావ్య మైనదని శ్లాఘించెను. తెలుంగుబాస సంగీతమున కెంతయుఁ దగియున్నది. గాయకు లాంధ్రులు కాని యనాంధ్రులు కాని యర్థము తెలిసినను, తెలియకున్నను, తెలుఁగుపాట లనేకములు పాడుదురు. ఇట్టియత్యధికమాధుర్యగరిమ గలమనయాంధ్రభాషయొక్కయౌన్నత్యము పురాతనాంధ్రకవిప్రవరులచే స్తుతింపఁ బడినది. అఖండపండితుఁడు, అనేకగ్రంథావలోకనకుశలుఁడు, వివిధదేశభాషాకోవిదుఁడును, రసగ్రహణపారీణుఁడును, కవిశిఖామణియు నైనకృష్ణదేవరాయభూపాగ్రణి
ఆ. | “తెలుఁ గదేల యన్న దేశంబు తెలుఁ గేను | |
అని దీనిని మెచ్చినాఁడు. కొండొకపురాతనకవీంద్రుఁ డైన వినుకొండ వల్లభరాయఁడో లేక శ్రీనాథుఁడో రచియించిన క్రీడాభిరామమునందు
ఆ. | "జనని సంస్కృతంబు సకలభాషలకును | |
అని దేశభాషలందుఁ దెనుఁగు లెస్స యనియే కాక సంస్కృతముకంటెఁ గూడ నుత్కృష్టమైన దనియు వచింపఁబడినది. ఈభంగిని మనభాషాప్రాశస్త్యము ప్రశంసింపఁబడియె. ఇట్లు మహత్తరముగ భాసిల్లు మనభాషయం దనేకసత్కావ్యములు వెలయుచున్నవి. వీనిలో నెల్ల నుత్తమోత్తమము లైన సుప్రశస్తప్రబంధములు కొన్ని గలవు. వీనిని మించిన చెలువము గల రచనలు ప్రపంచమునం దెందును గోచరింపవు. ప్రభావతీపద్యుమ్న, కళాపూర్ణోదయ, ప్రబంధరాజము లీగ్రంథరాజి లోఁ జేరి రాజిల్లునవియ. ఇట్లు పేర్కొనఁబడినగ్రంథద్వయమునకుఁ గర్త సూరనార్యకవివరేణ్యుఁడు. ఇతఁ డత్యుత్తమకవివతంసులలోనివాఁ డని మఱి వేఱె వక్కాణింప నక్కఱ లేదు.
ఉ. | “ఎంగిలిత్రోవలం బడక యెప్పటికప్డు నవీనకల్పనల్ | |
అనెడి యోలేటి వేంకటరామశాస్త్రి విద్వత్కవిసత్తమునివాక్కులు నిక్కువములు. ఈపింగళి సూరనార్యుఁడు మహాకవివర్యుఁడు. కళంకరహిత మైనకవితాకళాకౌశలవైశాల్యము గలిగి విలసిల్లువాఁడు. అత్యద్భుతప్రతిభాశాలి. విశ్వకవి. మృతిరహితుఁ డైనరచయిత. ఆచంద్రార్క మీతనికావ్యములు ప్రకాశించుఁగాక! ఇతఁ డాంధ్రకవీంద్రులందఱలో నగ్రగణ్యులలో నొకఁడు. ఇంతియ కాదు. హిందూదేశమందలి యితరమండలములందే కాక ప్రపంచమునందు సర్వదేశముల, సర్వభాషల, సర్వకాలములయందు, వెలసినకవిశిరోమణిశ్రేణిలోనివాఁడు. ఈతనిమించిన కవిని విశ్వమునం దెందును గానము. ఇతఁడు బహుగ్రంథరచనాధురంధరుఁడు. నిర్దుష్టకవితాదక్షుఁ డైనమహాలాక్షణికుఁడు. వింతవింతతో)వలు తొక్కిన తేజశ్శాలి. తన ప్రభావతీప్రద్యుమ్నమునఁ దా నిటులు చెప్పుకొనియె.
మ. | “జనము ల్మెచ్చఁగ ము న్రచించితి నుదంచద్వైఖరిం గారుడం | |
| దెనుఁగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదిసంబాల్యవ | |
ఇదు వచింపఁబడినవానిలో 'రాఘవపాండవీయము', 'కళాపూర్ణోదయము', 'ప్రభావతీప్రద్యుమ్న' మనుమూఁడుప్రబంధరత్నములు మాత్రము మనకు లభించు భాగ్యము గలిగినది. తదితరగ్రంథములు దురదృష్టవశమున మనకు దొరకలేదు.
ఈగ్రంథత్రయమునందు మొదటి దైన 'రాఘవపాండవీయము' ద్వ్యర్థిప్రబంధము ద్వ్యర్థి యైన నర్ధము సులభముగ బోధపడును. రామాయణభారతగాథలలో దేనిని మనము మనమున నుంచి చదువుదుమో దానికిఁ దగినయర్థము తేలికగాఁ దెలియును. ఇట్టిపుస్తకమునుంగూడ రసవంతముగ రచించినాఁడు. ఇది మిక్కిలి కష్ట మైనపని దీనిని సరిబోలుద్వ్యర్థికావ్యము వేఱొకటి లే దని వచింపవచ్చు. రెండవది యగు 'కళాపూర్ణోదయము' స్వకపోలకల్పితము. అనిర్వచనీయరచనాసమంచిత మైన కావ్యరత్నము. మూఁడవదియగు 'ప్రభావతీప్రద్యుమ్నము' పురాణకథ యైనను నూతనరీతులు గలిగి రమణీయము లగు వర్ణనలతో విరాజిల్లుచున్నది. అతిలలితశైలీవిలసితము. ఇది మిగుల మనోహర మగు మహాకావ్యము.
కవిత్వతత్త్వ మీతీరున నుండఁదగు నని సూరనార్యుఁడు తనకావ్యములలో నీలీల నిర్వచించె.
సీ. | “శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగనీక | |
| యాకాంక్షితసుపూర్తి యాచరించుచును శా | |
గీ. | నొకటఁ బూర్వోత్తరవిరోధ మొందకుండఁ | |
(ప్రభావతీప్రద్యుమ్నము)
సీ. | "పొసఁగ ముత్తెపుసరుల్ పోహళించినలీలఁ | |
గీ. | యమర నుపమాదులును యమకాదులు నగు | |
లయవిభాతి. | “చలువ గల వెన్నెలలచెలువునకు సౌరభము | |
| బొలు పెసఁగుకప్పురపుఁబలుకులకుఁ గోమలత | |
(కళాపూర్ణోదయము)
సీ. | "విశ్రామవిహతి గావింపక సారవ | |
ఆ. | పరఁగుకవియు దోహకరుఁడును యశము దు | |
(కళాపూర్ణోదయము)
సూరనరచన సురుచిర మైనది. సత్కావ్యములకుఁ వలసిన సకలసద్గుణమణిగణములు గలిగి యగ్రగణ్య మైనది. మృదుమధుర పదగుంఫితము. సాధుజాతీయదేశీయపదతేజోవిరాజితము. అనర్గళధారాశుద్ధి గలదై శోభిల్లుచుండును. సరససారస్వతాంశప్రశస్తితోఁ బ్రకాశించును. శబ్దార్థాలంకారసంకలిత మై కలకలలాడుచుండును. వ్యర్థపదకళంకరహిత మైనది. తేటతెనుఁగుమాటలతోఁ దేజరిల్లుచుండును. పలుకుపలుకునకుఁ దేనియ లొలుకును. రసపోషణమునకు మిగుల బాగుగఁ దగినయంద మైనపదములపొందికయు, వృత్తములవరుసయుఁ గలిగి వెలుఁగొందుచుండును. వేఱువేఱురసములు వర్ణించు నపుడు భిన్నభిన్నభంగులపలుకులకూర్పును బద్యములపోకడలును నొప్పారుచుండును. సాధారణముగ మనము నాడుచుండుసాధుప్రయోగములతో నిండి కరము రమ్యముగ నుండును. మొత్తముమీఁద ద్రాక్షాపాకము. ఇందు సుప్ర్రసాదశక్తి యసదృశము. శ్లేష యటనటఁ గాననగు. దాని నాయాపట్టులఁ గవియే సూచన చేయుచుండును. ఈ కవితల్లజుఁడు చిత్రవిచిత్రము లైనపోకడలఁ బోయె. ఆపూర్వానల్పకల్పనాజల్పితములఁ జేసె. అత్యంతచమత్కారము లైనరచనలచాతుర్యముఁ గనఁబఱిచె. ఈమహనీయునిభావనాశక్తి మిక్కిలి సంభావితము. ఈతనికవితను విశేషవిస్మయావహములును సముదీర్ణములు నైనసహజవర్ణనలు సంపూర్ణరసభరితము లై భాసిల్లును. వర్ణనావైదగ్ధ్య మమితాశ్చర్యకర మై రాణించును. వర్ణితాంశము మనకనులకట్టెదుటఁ బటము గట్టినట్టు కన్పట్టును. ఎవ రెచట నేయేపట్టుల నెటులు వచింపవలయునో చరింపవలయునో యనువిషయములు చక్కనియౌచిత్యముతోఁ బాటింపఁబడెను. ఇక్కవి మానుషప్రకృతి కూలంకషముగఁ దెలిసికొనిన శేముషీవిభవాభిశోభితుఁడు. లోకజ్ఞానసంపన్నుఁ డైన ప్రజ్ఞాశాలి. ఈశ్వరసృష్టిరహస్యమును స్పష్టముగ గ్రహించినప్రతిభావంతుఁడు. "రవి గాననిచోఁ గవి గాంచునేకదా” అను నార్యోక్తి యిట వ్యక్తమయ్యె. రస మీమనీషివృషభునిచే మహాహర్షదాయకము గఁ బోషింపఁబడి పొంగిపొరలుచుండును. ప్రపంచమందలిమానవప్రకృతి యీ కవితయందుఁ బ్రతిఫలించును.
'కళాపూర్ణోదయము' నందు సర్వరసములు విశేషభాసురభాతిఁ బరిపోషితము లయ్యె. పరమరమణీయము లగువర్ణనలతో సొంపారుచున్నది. ఇందు ముఖ్యమైనది శృంగారరసము. అయిన నది యెంతమాత్ర మతివేల మన వీలులేదు. 'కళాపూర్ణోదయము,’ ‘ప్రభావతీ ప్రద్యుమ్నము' హృదయాహ్లాదకరము లైనప్రబంధరత్నములు. చదువరులడెందముల సమ్మోదసుఖాంబుధి నోలలాడించుచుండును వీనిం జదువఁ జదువఁ జవులూరుచుండును.
ఈ కవికులతిలకుని చతురకవితావిలాసము గణనాతీత మై రసోచితశయ్యతో నతిశయిల్లుచున్నది. ఎన్నితడవుఁ దిలకించినను దనివి తీఱదు దీనం గలుగునమందానంద మనవద్య మై యనుభవైకవేద్య మైనది. ఇట్టిసుప్రశస్తప్రబంధములు గలయాంధ్రభాష ధన్యాతిధన్యము. ఆంధ్రుల మైనమనము కృతార్థులము. ఈసత్కావ్యములరసాస్వాదన మొనర్చి బహులాభములఁ బొంది తరింతుము గాక! సూరనార్యకవీశ్వరా! గౌరవపురస్సరములును ననేకములు నైననానమోవాకములు కైకొనుము.
రావు వేంకటకుమారమహీపతిసూర్యారావు