కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/జగద్గురు తత్త్వబోధక స్వామి

ఖోజాజమాత్ ఖానాలలోఈగ్రంధాన్ని చదివేటప్పుడు ఖోజాలందరూ ఈ పదియవ ప్రకరణాన్ని అతి భక్తితో వింటారు. ఈ ప్రకరణం మొదలుపెట్టగానే సభవారంతా లేచి అది పూర్తిఅయ్యేవరకూ అలాగ నుంచుంటారు. పరమపూజ్యుడైన మౌలాఅలీ నామం ఉచ్చరించినప్పుడల్లా అతి భక్తితో ప్రణమిల్లుతూ వుంటారు.

ఇలాగ మౌలా ఆలీ దశావతారాలలో ఒక అవతారమైనాడు !

5. జగద్గురు తత్త్వబోధక స్వామి

[రాబర్టో డీ నోబిలీ అనే క్రైస్తవ ఫాదరీ చరిత్ర]

దక్షిణ దేశాన్నంతా ఏకచ్చత్రంగా పరిపాలించిన విద్యానగర చక్రవర్తులలో గడపటివారగు 1885 - 1914 మధ్య రాజ్యంచేసిన వెంగటపతి దేవరాయ మహారాజులు ఆయన కొన్నాళ్ళు పెనుగొండను, తరువాతి చంద్రగిరిని రాజధానిగా చేసుకుని దేశపరిపాలన చేశాడు. ఆయన రాజ్యం కృష్ణానదికి దక్షిణాన కన్యాకుమారివరకు వ్యాపించి యుండేది. శ్రీరంగపట్నంలో ఆయన తమ్ముడి కొమారుడే రాజప్రతినిధిగా వుండి మైసూరు కర్నాటక రాజ్యాలను పరిపాలించేవాడు. 1612 లో రాజఓడయరు మైసూరుకుపరిపాలకుడైనాడు. బేదనూరు, లేక ఇక్కేరీలో ఒక సామంత మండలేశ్వరు డుండేవాడు. ఇలాగే దక్షిణదేశంలో తుండీరానికి జింజిలోను, పాండ్యానికి మధురలోను, చోళదేశానికి తంజావూరులోను, సామంత మండలేశ్వరులు ఉండి పరిపాలించేవారు.

విజయనగర సామ్రాజ్యము నేలిన చక్రవర్తులు తెలుగువారే అయినందువల్లను, వారి కాలంలో వివిధ ప్రాంతాలను పరిపాలించిన రాజ ప్రతినిధులు, సామంత మండలేశ్వరులు రాజబంధువులుగానో, తెలుగునాయకులుగానో ఉంటూవున్నందువల్లను దేశప్రభుత్వమంతా తెలుగువారి చేతులలోనే ఉండి కన్యాకుమారివరకూ గల దక్షిణదేశమంతా తెలుగు మయంగా ఉండేది. ఆ కాలంలో ఈ దేశంలో ఉండిన పాశ్చాత్యులు చాలామంది ఈ సంగతిని గురించి వ్రాసియున్నారు.

విజయనగర సామ్రాజ్యం బలహీనమైనకొద్దీ సామంత మండలేశ్వరులు బలవంతులై కొంతకాలమునకు సామంతరాజులై తరువాత స్వతంత్రులైనారు. తంజావూరు, మధురలనేలిన నాయకరాజులు చోళపాండ్యరాజు లని ప్రసిద్ది చెందారు. వీరుకూడా విద్యానగర ప్రభువులలాగనే తెలుగు కవులను, గాయకులను, పండితులను పోషించిప్రజారంజకంగా దేశాన్ని పరిపాలించారు. వీరి కాలంలో సంగీత సాహిత్యాలు, కళలు సర్వతోముఖంగా అభివృద్ధి చెంది ఇప్పటికీ వారి కీర్తిని వేనోళ్ల చాటుతున్నవి.

వెంకటపతి దేవరాయల కాలంనాటికి కుమార కృష్ణప్పరాయలుడనే లింగయనాయకుడు మధురకు సామంత మండలేశ్వరుడుగా ఉండేవాడు. అతడును 1602 లో చనిపోగా ఆయనకుమారుడు ముద్ధుకృష్ణప్ప నాయుడు 1624 వరకూ పరిపాలించాడు. తరువాత ముద్ధు వీరప్ప నాయుడు 1624 వరకూ పరిపాలించాడు. వీరప్పనాయకుని కాలంలో వెంకటపతిదేవరాయలు చనిపోగా వీరప్పనాయకుడు మధురకు స్వతంత్రరాజైనాడు. ఆయన తరువాత తిరుమల నాయకుడని ప్రసిద్ధిచెందిన 'మహామాన్య రాజశ్రీ తిరుమలశౌరి అయ్యలుగారు ' 1623 లో మధురరాజ్యానికి పట్టాభిషిక్తుడై 1625 వరకూ పరిపాలించారు.

పోర్చుగీసువారు - క్రైస్తవ మత ప్రచారము

మన దేశానికి వర్తకం చెయ్యడానికి మొట్టమొదట వచ్చిన ఐరోపాజాతివారు పొర్చుగీసువారు. వీరు మన దేశరాజులను, వారి సామంతులను ఆశ్రయించి పశ్చిమ సముద్రతీరంలో అక్కడక్కడ కొన్ని వర్తక స్థానాలను ఏర్పరచుకున్నారు. వర్తకులతో పాటు రోమను క్యాతలిక్కు శాఖను చెందిన జెస్సూటులనే పోర్చుగీసు క్రైస్తవ మిష నరీలు కూడా ఇక్కడికి వచ్చి మతప్రచారం చెయ్యడం ప్రారంభించారు.*[1] వింత దుస్తులు ధరించి గొడ్డుమాంసం తింటూ మద్యపానం చేస్తూ కులభేదాలు పాటింపక మాల మాదిగలతో కలిసిమెలిసి తిరిగే యీ విజాతీయులనూ , వీరిలాగే ఉండేవారినీ మనవాళ్లు 'పరంగీ' లని అనేవారు. పోర్చుగీసువారు ఎక్కువగా ఈ దేశంలో సముద్రతీరాన్ని ఉండే పరవరులనే పల్లెకారులలో క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఈ పరంగీలకూ , దేశీయ స్త్రీలకూ పుట్టిన సంకరజాతి ఒకటి త్వరలోనే బయలుదేరింది.

వెంకటపతి దేవరాయ మహారాయల కాలంనాటికి విజయనగర సామ్రాజ్యములో చాలాచోట్ల పోర్చుగీసువారు స్థిరపడ్డారు. మన దేశరాజులు మొదటినుంచి సర్వమతాలవారిని సమానంగా చూసే సహనబుద్ది కలవారుగనుక రాయలవారు పోర్చుగీసువారి క్రైస్తవ మత ప్రచారానికి ఆటంకాలు కలిగించకపోవడమేగాక వారి క్రైస్తవమత


ప్రచారకులైన జెస్సూటమిషనరీ ఫాదరీలను ఆదరించి గౌరవించేవారు క్రైస్తవ దేవాలయాలు కట్టుకోవడానికి, పాఠశాలలు స్థాపించడానికి మత ప్రచారం చెయ్యడానికి అనుజ్ఞ నిచ్చేవారు.

చోళమందలంలో సముద్రతీరాన్ని ఉండే పరవరులనే పల్లెకారిజనంలో చాలా మందిని పోర్చుగీసు క్రైస్తవమత ప్రచారకులు రోమను క్యాతలిక్కు మతంలో కలిసినదువల్ల వాళ్ళ క్షేమంకోసం పోర్చుగీసు క్రైస్తవ మతాధికారు లొక మిషనరీ ఫాదరీని నియమించారు. ఇందుకోసం నియమింపబడిన జెస్సూటు క్రైస్తవమిషనరీ అయిన 'గొంజాలో ఫెర్నాండెజ్ ' అనే ఫాదరీ 1569 లో మధురానగరానికి వచ్చి అక్కడ తన నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పుడు మధుర రాజ్యాన్ని పరిపాలించే సామంతమండలేశ్వరుడైన కుమార కృష్ణప్ప నాయుడు ఆఫాదరీని ఆదరించి మధురలో ఒక క్రైస్తవ దేవాలయం కట్తుకోడానికి అనుజ్ఞ నిచ్చాడు. ఇలాగ పాండ్యరాజధానిలో క్రైస్తఫమత ప్రచారం చెయ్యడానికి అవకాశం ఒకటి ఏర్పడింది. ఫెర్నాండజ్ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాడు. ఏదో ఓక సందర్భంలో ఏసుక్రీస్తును గురించి చెప్పుతూఉండేవాడు.ఆయన మంచితనమూ, సద్గుణములూ, బ్రహ్మచర్యవ్రతమూ చాలామందిని ఆకర్షించింది. చాలామందికి ఆయనపై సదభిప్రాయం కలిగింది. అంతట ఆయ;న సంగతి తెలుసుకుందామనీ, ఆయన క్రొత్తమతం సంగతి తెలుసుకుందామనీ కుతూహలం తో కొందఱు బ్రాహ్మణులుకూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ఆయన యింటి దగ్గర మతధర్మాలను గురించి శస్త్రచర్చలు తరుచుగా జరుగుతూ ఉండేవి. ఈ జెస్సూటు మతప్రచారకుడు త్వరలోనే ఒక ఆసుపత్రిని స్థాపించి అక్కడ క్రైస్తవులకే గాక ఇతరులకు కూడా మంచి మదులిచ్చి చికిత్సలు చేసేవాడు.

ఉత్తరాది తెలుగు జనము

అప్పట్లో మధురరాజ్యములో అన్నివర్గాలలోను తెలుగువారు చాలామంది ఉండేవారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగు వారిలో వివిధకులాల శూద్రజనాన్నిఅరవవారు 'వడుకరు' లు అనగా 'ఉత్తరాదివా'ళ్ళని వ్యవహరించేవారు. ఇందులో రెడ్లు, కమ్మవారు, గొల్లలు మొదలైన కులాలవా రుండేవారు. ఆకాలంలొ మన తెలుగువారు ప్రతివిషయంలోనూ అరవలకన్న చొరవకలవారుగా వుండేవారు, వీరు ఈఫాదరీతొ ఎక్కువ స్నేహంగా వుండి ఆయనను గౌరవించేవారు.

ఈ ఉత్తరాదిజనాన్ని క్రైస్తవమతంలో కలపాలని ఫెర్నాండెజ్ గారు విశ్వప్రయత్నాలు చేశారు. ఏసుక్రీస్తును గురించీ, క్రైస్తవమతధర్మాలను గురించీ అతడు ఎన్నివిధాలుగానో వారికి బోధచేస్తూ వుండేవాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ ఫాదరీగారు ఎంత మంచివాడైనా గొడ్దుమాంసం తిని, మద్యపానం చేస్తూ మాలమాదిగలతో కలిసిమెలసి తిరిగేజాతివాడనిన్నీ, అందువల్ల మతంలో కలిస్తే కులభ్రష్టులమైపోతామనిన్నీ భయపడి ఎవరూ క్రైస్తవ మతంలో కలవలేదు.

కుమారకృష్ణమనాయకుడి తరువాత మధుర రాజ్యాన్ని పరిపాలించిన ముద్దుకృష్ణఫ్ఫ నాయకుడుకూడా క్రైస్తవమత ప్రచారకులతో స్నేహంగానే వుండేవాడు. ఇది విని పోర్చుగల్లుదేశపు రాజుకూడా సంతోషించినట్లు ఉత్తర ప్రత్త్యుత్తరాలవల్ల కనబడుతూవుంది. ఇలాగ 12 సంవత్సరాలు ఫెర్నాండెజ్ ఎంతకష్టపడినా క్రైస్తవమతం వ్యాపింపలేదు.

రా బ ర్టో డీ నొ బి లీ

ఈ పరిస్థితులలో రాబర్టో డీ నొబిలీ అనే క్రైస్తవ మతప్రచారకుడు 1606 లో మధురానగరానికి వచ్చాడు. నొబిలీ ఇటలీదేశంలో మాంటీ పుల్చియానో అనే గ్రామంలో క్రైస్తవ మత గురువైన పోపులకు బంధువులైన గొప్ప కుటుంబంలో 1577 లో జన్మించారు. అతడు చిన్నప్పటినుంచీ తెలివైనవాడు. తన పదవయేటనే ఐరోపా దేశపు సంస్కృతభాష లనదగిన గ్రీక్ లాటినులను ధారాళంగా మాట్లాడేవాడు. నోబెలీ ఇక్కడి రాగానే మత ప్రచారం ఎందుకు బాగా జరగడంలేదని పరిశోధనచేశాడు. హిందూదేశముసముద్ర తీరాన్ని ఉన్న కొన్ని రేవు పట్నాలు పోర్చుగీసువారి స్వాధీనంలో ఉన్నా, పోర్చుగీసు క్రైస్ధవమత ప్రచారకులు హిందూదేశంలోని లోపలి భాగాలలోకి పోయి ప్రజలతో కలిసిమెలిసి వుండనందువల్ల మతప్రచారం సాగడంలేదని నోబిలీ గ్రహించాడు. 1607 డిశంబరు3 వ తేదీన నోబిలీ తన దేశానికి వ్రాసిన ఈ వుత్తరం వల్ల ఆయన అభిప్రాయాలు తెలుస్తున్నవి:-

"మధుర" ఈ రాజ్యానికి రాజధానినగరము. ధనవంతులూ, యుద్ధములందు ధైర్యవంతులూ, అయిన ప్రజలతో క్రిక్కిరిసివున్నది. కాని ఈ ప్రజలకు అసలు ఈశ్వరునిసంగతి తెలియదు. వారు కేవలము విగ్రహారాధకులు. మన క్రైస్తవమత ప్రచారకులు 12 సంవత్సరాల నుంచి ఇక్కడవుండి పనిచేస్తూవున్నా దేశీయులలో తమ అవసానకాలానికిముందు క్రైస్తవులైన ముగ్గురు నలుగురు తప్ప ఒక్కడైనా మన మతం స్వీకరించలేదు. ఇల్లాగని మన మత ప్రచారకులు అసమర్ధులుకారు. వారు చాలా సమర్ధులు, సద్గర్ములు." పూర్వకాలమునాటి రోమునగరములోని విగ్రహారాధనమువంటి విగ్రహారాధన మే ఈ మధురలో ఇప్పుడున్నదని నోబిలీ ఇంకొక వుత్తరంలో వ్రాశాడు.

క్రైస్తవమతం ఎందుకు వ్యాపించటంలేదు?

ఫెర్నాండెజ్ కృతకృత్యుడు కాకపొవడానికి గల కారణాలను నొబిలీ కనిపెట్టాడు. "రోము నగరంలో వున్నప్పుడు ఆ నగరవాసుల లాగనే ప్రవర్తించాలి" అనే సామెత ప్రకారం క్రైస్తవమత ప్రచారకుడు తాని నివసిస్తూవున్న దేశాచార వ్యవహారాలను గమనించి ఆ ప్రకారమే తానుకూడా ప్రవర్తిస్తేతప్ప లాభం లేదనిన్నీ, అలా ప్రవర్తించకపోవడమేగాక హిందూ దేశాచారాలయందు అగౌరవము కలిగించేటట్లు ప్రవర్తించడంవల్ల ప్రజలకు అనుమానము, అవిశ్వాసము కలిగి, వారు క్రైస్తవమతం దరికి చేరకున్నారనిన్నీ నోబిలీ కనిపెట్టాడు. అప్పటి విజయనగర చక్రవర్తియైన రెందవ వెంకటపతి దేవరాయ మహారాయల ఆస్థానంలో వుంటూవున్న ఆంటోనియో రూబినో అనే ఒక క్రైస్తవ ఫాదరీకూడా ఇల్లగే అభిప్రాయపడ్డారు. ఈ రూబినో ఒక ఉత్తరంలో ఇలాగ వ్రాశాడు:- "మనము గొడ్దుమాంసము తిని మద్యపానముచేసే పోర్చుగీసు జాతివార మనే కారణంవల్ల ప్రజలకు మనయందు అసహ్యభావం గలిగి యున్నది. అందువల్లనే మన మతానికి వారిని చేర్చే ద్వారములు మూయబడియున్నవి. మన మీ రాజ్యములో మద్య మాంసములను విసర్జించినా మనపట్ల వారికి విరోధము, అసహ్యము కలగడానికి మన నల్లని దుస్తులే చాలు.అందువల్ల మనలను వారొకమహామ్మారిని చూచినట్లు చూస్తారు. మనము పొర్చుగీసు దేశం నుంచి వచ్చిన క్రైస్తవమత ప్రచారకులమనే సంగతి వాళ్ళమనసులో బాగా నాటుకొనివున్నది. అందువల్ల మన కృషిలో ఫలితం కలగాలంటే ముందుగా మనం ధరించే దుస్తులను మార్చుకోవాలి. తినేతిండిని మార్చుకోవాలి. వీలైనంత వరకూ వారు అవలంబించే ఆచారాలను మనంకూడా అవలంబించాలి. రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారి (Father Provincial) కి ఈ సంగతిని గురించి నేను చాలా సార్లు వ్రాశాను. హిందువులు వేసుకునే దుస్తులు ధరింపజేసి, నన్ను ఎవ్వరూ ఎరగని వూరికి పంపించాలని ఆయన అనుకుంటున్నాడు."

"ప రం గీ లు"

క్రైస్తవమత ప్రచారం బాగా జరగక పొవడానికి ఇంకొక కారణంకూడా యున్నది. క్రైస్తవులైన దేశీయ పరవరులను, వారి మతప్రచారకులును పరంగీలని దేశీయులనేవారు. దీని నిజమైన అర్ధం ఎరగపోవడంవల్ల క్రైస్తవ మిషనరీలు ఆ పేరును స్వీకరించేవారు. ఈ పరంగీ అనే పదాన్ని ప్రజలందరూ చాలా నీచంగా చూసేవారు. నోబిలీ జాగ్రత్తగా విచారించగా దీని కారణం తెలిసింది. "పరంగీ అనే మాటను పోర్చుగీసువారనిగాని, ఐరోపాదేశీయులనిగాని, క్రైస్తవు లనిగాని అనే అర్ధంలొ ప్రజలు వాడడంలేదు. ప్రజలకు వీరి సంగతి తెలియనే తెలియదు. 'పరంగీ ' అంటే నీతిధర్మాలుగాని, మానమర్యాదలుగాని లేక త్రాగుబోతులుగావుండి అసహ్యకరమైన జంతువుల మాంసాలనూ, తుదకు మనుష్యమాంసాన్నీ కూడా పీక్కుతింటూ శాస్త్రమతధర్మాలు లేని పశుప్రాయులైన నీచమానవు లని ఆమాటకు అర్ధం."

"ప్రతిభాశాలురైన పోర్చుగీసుజాతివారి నెవ్వరినీ హిందువులు చూచివుండ లేదు. ఇక్కడనుండేవారు రెండురకాలవారుగా వుంటారు కొందరు, ఇక్కడనే పుట్టిపెరిగి పోర్చుగీసు రక్తస్పర్శ ఆవంతమైనా లేకపోయినప్పటికీ నాలుగు పోర్చుగీసు ముక్కలు నోటికి రాగానే తమ అసలు జాతిలోనుంచి బైటపడి పోర్చుగీసువారి మైతి మనుకునేవారు. వీరిని పోర్చుగీసువారు 'టోపాజు ' సంకర జాతివాళ్లని అంటారు. హిందూ దేశీయులు వీరిని పరంగీలంటారు. తెల్లవాడైనా నల్లవాడైనా పోర్చుగీసువాళ్ల లాగ దుస్తులు ధరించే నల్లవాళ్ల నందరినీ పరంగీ లనడం అలవాటయింది. ఇక ఇక్కడకు వచ్చే ఇంకొకరకం మనుష్యులు పుట్టుక వల్ల యూదులై వుండిన్నీ పోర్చుగీసువారితో ఏర్పాటుచేసుకొని వర్తక వ్యవహారాల మీద యిక్కడికి వచ్చేవారు. వీరినికూడా మధురాపట్టణవాసులు పరంగీలంటారు. ఈ రెండురకాల వారితో ఏమాత్రం సంపర్కం గలవారికైనా వీరి కులము,శీలము, విశ్వాసపాత్రత, శుభ్రత ఎలాంటివో బాగా తెలిసిన విషయాలే కదా! అందువల్ల 'పరంగీ ' అనే మాట నీచంగా వాడబడడంలో ఆశ్చర్యమేముంది" అని నోబిలీ వ్రాశారు.

'పద్ధతి మార్చాలి'

పైన చెప్పిన సంగతి సందర్బాలన్నీ యోచించిన మీదట హిందువులను క్రీస్తుమత ధర్మాలవైపునకు ఆకర్షించాలంటే ముందుగా మిషనరీలు తమ జీవిత విధానాన్నీ, ఆచారవ్యవహారలనూ, పద్ధతినీ మార్చుకొవలసివున్నదనే సంగతి స్థిరపడివుంది. రాబర్టోడీ నోబిలీ తన ఉద్దేశ్యాలను ఆచరణలో పెట్టేటందుకు ముందు పైవారితో ఆలోచించాడు. రాష్ట్రీ య మతాధికారియైన లెయిర్జియో, నోబిలీ వేసిన పధకాన్ని మనస్పూర్తిగా అంగీకరించాడు. ఆయనపై యధికారియైన క్రాంగనూరు ఆర్చిబిషప్పు ఫ్రాన్సిస్కోరోన్ గారితోకూడా నోబిలీగారు ఆలొచించి వారి అంగీకారాన్ని పొందినాడు. ఇద్దరూ కలసి ఒక కార్యాచరణ పద్ధతిని నిర్ణయించారు. ఆర్చిబిషప్పుగారు కూడా హిందువుల విగ్రహారాధనను గురించీ మతధర్మాలను గురించీ, వ్రాయబడిన పుస్తకాలను కొన్నింటిని ముందుగా చదివారు. తరువాత మలబారు తీరాన్ని, ఉన్నరోమన్ క్యాతలిక్క క్రైస్తవమత ప్రచారకులలో ప్రజ్ఞావంతులైన విద్వాంసులతోను, పోర్చుగల్లు దేశంలోవున్న మతాచార్యులతోనూ కూడా ఆలోచించారు. అందరూకూడా వీరి అభిప్రాయాలతో నేకీభవించారు. ఆందువల్ల ఈ ఆర్చిబిషప్పుగారు కూడా నోబిలీగారికి ఈ విషయంలో తమ అంగీకారము ను తెలిపారు.

బ్రాహ్మణులు ధరించే శిఖాయజ్ఞోపవీతములు, అనగా జుట్టు ముడిన్నీ, జందెములున్నూ, వారు పెట్టుకునే గంధాక్షతాల, బొట్టున్నూ, వారు అవలంబించే ఇతరాచారాలున్నూ వారి మతసంప్రదాయాలకు సంబందించిన చిహ్నాలుకావనిన్నీ, అవి కేవలము వారు ఉత్తమవంశజు లనిన్నీ, ఉన్నతకులం వారనిన్నీ చూపడానికి యేర్పడిన బాహ్యచిహ్నాలనిన్నీ, అందువల్లక్రైస్తవమతంలో కలిసిన హిందువులు తమతమ కులాచారాలకు సంబంధించిన జుట్టు, కట్టు, బొట్టు మొదలైన బాహ్యచిహ్నాలను యేలాంటి అభ్యంతరమూ లేకుండా వుంచుకోవచ్చుననిన్నీ, ఈ క్రైస్తవమతాచార్యులు ఆఖరికి ఒక నిశ్చయానికి వచ్చారు. ఈ సంగతులనీ 1909 లోను, 1913 లోను రాష్ట్రీయక్రైస్తవమతాధికారికిన్నీ, క్రాంగనూరు ఆర్చిబిషపుగారికిన్నీ జరిగిన వుత్తర ప్రత్యుత్తరాలవల్ల కనబడుతున్నవి.

జగద్గురు తత్వబోధకస్వామి

నోబిలీ మధురానగరానికి వచ్చిన ఒకసంవత్సరానికి 1907లో తన సోదర క్రైస్తవమిషనరీఫాదరీ అయిన ఫెర్నాండెజ్ తో సంబంధం లేకుండా తానొక కొత్తపంధాతొక్కి ఒక నూతన జీవితవిధానాన్ని ప్రారంభించాడు. ఇతడు మధురానగరంలోని బ్రాహ్మణుల దగ్గరికివెళ్ళి తాను పరంగీని కాననిన్నీ, పోర్చుగీసుజాతివాడనుకూడా కాననిన్నీ ఇటలీదేశానికి మకుటాయమనంగా వుండి ఒక పురాతన నాగరిక సామ్రాజ్యానికి రాజధానియైన రోమునగరంలో ఒక ఉత్తమ రాజవంశానికి చెందిన రాజకుమారుడననిన్నీ, తనకీప్రపంచంమీద రోత పుట్టివైరాగ్యంగలిగి సన్యసించితిననిన్నీ చెప్పి ఒక సన్యాసిలాగనే జీవించడం ప్రారంబించాడు. ఆ క్షణంనుంచి శూద్రసేవకుల నెవ్వరినీ తన దగ్గరికి రానివ్వక తన పరిచర్యల నిమిత్తం బ్రాహ్మణులనే నియోగించాడు. ఒక్కపూటమాత్రం ఇంత అన్నమూ, పాలూ, కూరగాయలూ పుచ్చుకుని నియమంగావుండేవాడు. బ్రాహ్కణ అగ్రహారమ్లో ఒక సంపన్నుని ఆశ్రయించి, కొంత స్థలం పుచ్చుకుని తన తోడ క్రైస్తవ మత ప్రచారకుడితో సంబంధంలేకుండా అక్కడ ఒక పూరి యిల్లు వేసుకుని అందులో నివసించడం ప్రారంభించాడు. ఈ యింటిని మధురానగ రాధికారే యిచ్చాడని ఫాదరు గుర్రెయిరో వ్రాశాడు.

"నోబిలీ బ్రాహ్మణ ఆచారాలన్నీ అవలంబించాడు.తన సపర్యల నిమిత్తం బ్రాహ్మణులనే నియో గించాడు. తాను రోమునగరాన్నుంచి వచ్చిన ఒక ద్విజుడ నని సన్యాసినని చెపుతూ అందుకనుగుణ్యముగా ఈదేశపు బ్రాహ్మణ సన్యాసుల లాగనె ఐరోపాజాతివారితోగాని, అస్పృశ్యులతోగాని సంపర్కం లేకుండా ఏకాంతవాసం చెయ్యడం ప్రారంభించాడు." అని జాన్ డిబ్రిటో అనే క్రైస్తవ మతాచార్యుడు వ్రాసియున్నాడు. త్వరలో ఈ నోబిలీ కేవలమూ ఒక బ్రాహ్మణ వేదంతిగా మారిపోయినాడని రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారియైన ఫ్రాస్సిస్కో రోన్ గారు అన్నారు. క్రైస్తవమత ప్రచారకుడైన ఫాదరు రాబర్టో డీ నోబిలీ అచిరకాలము లోనే 'జగద్గురు తత్వబోధకస్వామి ' అనే నూతన నామకరణంతో ప్రసిద్ధికెక్కాడు. 1907 డిశంబరు 1 వ తేదీన కార్దినల్ బెల్లార్మినోగారికి నోబిలీ వ్రాసిన రహస్య లేఖలో అతడు ఇలాగ అన్నాడు. "ఇప్పుడు నేను చుట్టూ మట్టిగోడలుగల పూరి పాకలో వాసంచేస్తున్నాను. దివ్యసౌధంకంటె నాకిదే ఆనందకరంగా వుంది. ఈశ్వరసేవకోసం ఈవిధంగా దేశాంతరంలో ఏకాంతవాసం చెయ్యడంలో వుండే మానసికశాంతి ఇంకొకదానిలో లేదు. అయినా నేను పూనిన ఈదీక్షలోవుండే శ్రమ ఒక్కొక్కపుడు చాలా భాధాకరంగావుంటున్నది. నాయవజ్జీవము ఇలాగ శ్రమపడాలేమోననే ఆలోచనవల్ల, చివరదాకా నిగ్రహించలేనేమోనని ఒక్కొక్కపుడు అధైర్యం కలుగుతూవుంటుంది. నానిత్య జీవితం ఇలాగ జరుగుతూఫుంది:- ప్రొద్దున్ననుంచి సాయంత్రం దాకా ఎక్కడికీ కదలకుండా నేను నా యింట్లోనే కాలక్షేపం చేస్తూ వుంటాను. నాతో ఎవరైనా మాట్లాడడానికిగానీ, చర్చించడానికిగాని వస్తే నేను ఈశ్వరప్రార్ధనము చేసినతరువాత వాళ్లకు దర్శనమిస్తాను. దేశీయులలో ప్రబలియున్న పొరబాటు మతసిద్ధాంతాలను ఖండిస్తూ దేశభాషలో వ్రాసేటందుకు మిగతా కొద్దికాలాన్ని వినియోగిస్తూ వుంటాను. నేను ఎల్లప్పుడూ నాయింటిలోని చిన్న గదిలోనే కాలక్షేపం చేస్తూవున్నందువల్లనూ, మాంసముగాని కోడిగ్రుడ్లుగాని నాగడపలోకి రావడానికి వీలులేదని నేను నిషేధించినందువల్లను, నేనుతినేఆహారము నాకు తగిన బలము నివ్వనందువల్లనూ, నాకు ఎప్పుడూ ఏదో జబ్బుగానే వుంటూవున్నది. నాకడుపులోనో, తలలోనో నొప్పిలేకుండా వున్నరోజులు బహుతక్కువ. నేను తినే ఆహారము వరిఅన్నమూ, కూరగాయలూ, పళ్ళూను. నేను ఇవితప్ప ఇంకొకటి తినకూడదు. ఈ దేశంలో తత్వబోధ చేసే మతాచార్యులూ, సన్యాసులూ ఇంకా కఠినమైన యమ నియమాలతో జీవిస్తారు. ఒక్కమెతుకు అన్నమైనా తినని వాళ్లుకూడా వున్నారు. ఈ దేశప్రజలు నానురొట్టె తినడం ఎరగనే ఎరగరు. ఇక మద్యం అనగా సారాయమును 'మాస్ ' అనే క్రైస్తవప్రార్ధన నిమిత్తమాత్రమే నేేను వుపయోగిస్తున్నాను. అన్నంకూడా వర్జిస్తే ఇక మనిషి తినే ఆహారం ఎంత స్వల్పంగా వుంటుందో ఊహించండి. అన్నం వర్జించడానికి నేను సాహసించ లేదు. ఇప్పుడు నేను పెట్టుకున్న నియమాలే, అనగా మాంసము, చేపలు, గ్రుడ్లు వర్జించడమే నేను నిజమైన మతాచార్యుడ నని ప్రజలు అనుకునేటందుకు చాలును. ఈ వుత్తరం వ్రాస్తూవున్న సమయంలో నేను ఉబ్బసం దగ్గువల్ల వూపిరి ఆడక బాధపడుతున్నాను. అందువల్ల దీనిని మెల్లమల్లగవ్రాస్తున్నాను."

నోబిలీ ఒక బ్రాహ్మణవంటవాడిని పెట్టుకున్నాడు. శూద్రుని చేతి అన్నం తినడానికి సాహసించేవాడుకాదు. సన్యాసులందరిలాగనే అతడు మధ్యాహ్నం నాలుగు గంటలవేళ వంటిపూట భోజనం చేసేవాడు. దినమంతా అతడు దేశ భాషలను చదవను వ్రాయను నేర్చుకునేవాడు. అతడు ఈ దేశానికి రాగానే కొచ్చినులోనే అరవం నేర్చుకొవడం ఆరంభించాడు. ఆరునెలలు ఇతరులతో మాట్లాడేశక్తి సంపాదించాడు. రెండేళ్లలో (1909 లో) అతడు మళ్లీ తన దేశానికి వ్రాస్తూ అరవంలో మాట్లాడడంకంటె ఇటాలియను పోర్చుగీసు భాషలలో మాట్లాడడమే ఇప్పుడు తనకు కష్టముగా వున్నదని వ్రాశాడు. ఈ అరవభాష చాలా గొప్పదనిన్నీ, అందమైన దనిన్నీ కూడా వ్రాశాడు. అతడు తమిళ గ్రంధకర్తలలోనుంచి పద్యాలు చదువుతూ కధలు వుదాహరిస్తూ గ్రాంధికమైన అరవాన్ని చక్కగా మాట్లాడే వాడని 1608 లో ఆయన తోడి మతాచార్యుడొకడు వ్రాశాడు.

అరవం బాగా వచ్చిన తరువాత నోబిలీ తెలుగును, సంస్కృతమును నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇంతవరకూ తెల్లవారెవరూ తెలుగు బాగానేర్చుకోలేదు. మధురవాస్తవ్యుడైన ఒక బ్రాహ్మణపండితుడు నోబిలీకి ఈ భాషలు నేర్పడానికి కుదిరాడు. 1609 ఏప్రిలు 22 వ తేదీన రాష్ట్రీయాధికారికి నోబిలీ వ్రాసిన ఉత్తరంలో తన పంతులు వారిని గురించి ఇలాగ వ్రాశాడు. "ఈ సద్భ్రాహ్మణుడు నాకు చేసే ఉపకారానికి తగినట్లుగా నాకృతజ్ఞతను తెల్పజాలను. ఆయనవల్ల నేను సంస్కృతము, తెలుగు నేర్చుకొనడమే గాక అంతకన్న అమూల్యమైన విషయాలను ఆయనవల్ల తెలుసుకో గలిగాను. వేదాల రహస్యాలను ఆయన నాకు చెప్పారు. వేదాలను వ్రాయడం మహాపాతక మని బ్రాహ్కణుల వూహ. దానిని ఎంతో కష్టపడి పదిపన్నెండేండ్లు పాఠము చెప్పించుకుని కంఠస్థము చేస్తారు. ఈ విషయంలో నా గురువు తన శంకలను మాని ఆ సూత్రాల నన్నింటినీ నాకోసం వ్రాసిపెట్టాడు. అయితే ఇది చాలారహస్యం గా చెయ్యాలి. ఈ సంగతి ఇతర బ్రాహ్మణులకు తెలిస్తే వాళ్లు ఆయను గ్రుడ్లు పీకుతారు. ఇది నేర్చేటందుకు ప్రాణభయానికి కూడా తెగించాలి. ఎందువల్లనంటే హిందువులను క్రైస్తవమతంలో కలపాలంటే ఈరహస్యాలు తెలియడం చాలా అవసరం." ఈ విద్యను అభ్యసించడంలో నోబిలీ అమితమైన పట్టుదలతో పనిచేశాడు. ఆఖరుకు క్షవరం చేయించుకుంటూ వున్నప్పుడుకూడా పాఠాలు చదువుతూనె వుండేవాడు.

1908 లో నోబిలీని గురించి ఒకడు వ్రాసిన దానిలో ఇలావుంది. "అతడు సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతడు ఆభాషను చదవడమూ, మాట్లాడడమూ కొంతవరకు నేర్చుకొన్నాడు." రెండేళ్ల తరువాత 1910 డెశంబరు 8 వ తేదీన ఆ భాషను నోబిలీ బాగా అర్ధం చేసుకోగలుగుతున్నా డనిన్నీ, ధారాళంగా మాట్లాడుతున్నా డనిన్నీ లెయిర్జియో వ్రాశాడు. నోబిలీ మూడుభాషలను బాగా నేర్చుకున్నాడనిన్నీ, మతాంతరులైన హిందూదేశీయుల మతరహస్యాల నన్నిటినీ బాగా గ్రహించాడనిన్నీ, రాష్ట్రీయాధికారియైన రోస్ గారు 1913 లో వ్రాశారు. ఈ భాషలను కొంతవరకు అభ్యసించిన ఆర్చిబిషప్పుగారు కూడా నోబిలీయొక్క శక్తిసామర్ధ్యాలనూ, పాండిత్యాన్నీ చూచి ఆశ్వర్యపడ్డారు.

భే ష జ ము - ప టా టో ప ము

ఈ తత్వవేత్తచుట్టూ ప్రజలు గుమిగూడడం ప్రారంభమైనది. కొంద రీయనను గొప్పవాడని పొగడడం ప్రారంబించారు. ఈయనను చూడాలనీ, ఈయన చెప్పే సంగతులు వినాలనీ కొందరు ఈయన యింటికి పోవడం ప్రారంభించారు. "ఈకొత్తస్వాములవారు ఎక్కడ నుంచి వచ్చారు? ఇతనిది యేకులం ఈయన సిద్ధాంతా లేమిటి? జీవితవిధానం ఎలాంటిది?" అనే సంగతులన్నీ తెలుసుకొవాలని మధురాపుర జనులలో చాలా మందికి కుతూహలం కలిగింది. హిందూదేశపు స్వాములవార్ల పద్ధతులను నోబిలీ బాగా ఎరిగిన వాడైనందువల్ల మొదట తన యింటినుంచి బయటికి పోలేదు. చూడవచ్చినవారితో చాలా మితభాషణం జరిపేవారు. నొబిలీని చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు "ఇప్పుడు సమయంకాదు. స్వాములవారు సమాధిలో ఉన్నా"రనిగాని, "నిష్ఠలోఉన్నా"రనిగాని ఆయన శిష్యులు చెప్పేవారు. ప్రజలలో కుతూహలం అమితమై పోయినతరువాత - చూడవచ్చినవారు ఒకటిరెండుసార్లు దర్శనంకోసంవచ్చి తిరిగిపోయిన తరవాత నోబిలీ దర్శనం ఇచ్చేవారు. " 'అయ్యరు ' గారితో మాట్లాడడానికి వచ్చామని చూడడానికి వీలౌతుందా" అని వచ్చినవారు అడిగితే చాలాసేపటికిగాని దర్శనం ఇచ్చేవారు కాదు. ఆఖరుకు వారిని లోపలికి రానిచ్చినప్పుడు జేగురురంగుగుడ్డ కప్పివున్న ఎత్తైన ఒక వేదిక మీద ఆయన పద్మాసనం వేసుకొని కూర్చుండి వుండేవాడు. ఆయనముందు అలాంటి కాషాయరంగుబట్ట యింకొకటి పరిచివుండేది. దానికిదగ్గరగా ఒక చాప వుండేది. ఆయనను చూడడానికి వచ్చినవారందరూ చేతులెత్తి ఆయనకు నమస్కరించా లని అక్కడివారు చెప్పేవారు. ఎంత గొప్పవారైనా, రాజోద్యోగులైనా కూడా ఆయనకు అలాగ నమస్కరించేవారు. ఆయనను శిష్యులు కాదలచినవారు ఇలాగ మూడుసార్లు భక్తితో నమస్కరించి సాష్టాంగపడి మ్రొక్కేవారు. ఈ సంగతులను ఫిగోరా (Figuoroo) వ్రాశారు.

     ఈ ఐరోపాదేశపు స్వాములవారివల్ల కొన్ని సంగతులు వినాలని మధుర రాజైన ముద్దు వీరప్పనాయకునికికూడా కుతూహలం కలిగి తన దర్భారులో చాలాసార్లు అన్నాడట. అంతట నోబిలీని బాగా ఎరిగినవారొకరు ఈ సన్యాసి తనకు స్త్రీల ముఖం కనబడుతుందేమోనని తన యిల్లు వదలి బయటకే రాడని అన్నారట! ఒక్కమాటైనా వీధిలో నడవకుండా ఇలాగ ఒక సంవత్సరం పాటు నోబిలీ కాలక్షేం చేసేటప్పటికి ఆయన గురించి ప్రజలకు గౌరవం కలిగింది. తరవాత ఎప్పుడైనా ఒకమాటు ఊరింబయట దూరంగా ఉన్న తన పెద్దయింటికి ఒక పల్లకీలో నెక్కిపోయేవాడు. అప్పుడు ఆయన పల్లకీముందు ప్రజలను తొలగమని కేకలు వేస్తూ దోపుదార్లు పరిగెత్తేవారు.  కొన్నాళ్ల తరవాత నొబిలీ ఈ భేషజమంతా కట్టిపెట్టి సామాన్య స్వాములవారి లాగనే ఒక కాషాయాంబరం ధరించి ఒక పెద్ద పుడుగుపాటి దండం చేతపుచ్చుకొని ఇద్దరు బ్రాహ్మణ శిష్యులు వెంటరాగా కాలినడకనే బయలుదేరాడు.

మొట్ట మొదట ఇలాంటి భేషజము చూపించాలని నొబిలీ అనుకోలేదుగాని మాటలసందర్భంలో ఒక శైవ 'పండారము ' ఆయనకు ఇలాగ సలహా యిచ్చాడట: "కేవలమూ మీమట్టుకు మీరు తరించాలంటే మీ రే మారుమూల ప్రదేశానికో పోయి దిగంబరిగా వుండవచ్చును. కాని ఇతరులను తరింపజెయ్యా లని మీవుద్ద్యేశ్వమని మీరంటున్నారు. గనుక మీరు పటాటోపం కనబరిచితీరాలి. నిజమైన విరాగి పట్టు పీతాంబరాలనూ, గుడ్డపీలికలనూ, భాగ్యభోగ్యాలనూ, దారిద్య్రమునూ, మానాభిమానాలనూ, ఒక శవము వహించేటట్లుగా నిర్లిప్తతతో భరించాలి" అని అన్నాడట.

ఆ పండారము ఈ సలహా నిచ్చినది 1908 వ సంవత్సరం మధ్యలొ నట. అంతకుపూర్వము నోబిలీ యింకా పోర్చుగీసు మతాచార్యుల నల్లదుస్తులనే ధరించేవాడట. 'బడగ ' లనే తెలుగువారి కధ చాలా అసహ్యకరంగా వున్నదనిన్నీ, దీనిని తీసివేసి ఈ దేశంలో మత గురువులు, స్వాములు ధరించే దుస్తులనే మీరుకూడా ధరింవలసినదనిన్ని ఆ తమిళశైవుడు ఆయనకు గట్టిగా చెప్పాడట. మీరుమాత్రం తరించాలంటే మీయిష్టంవచ్చిన దుస్తులు వేసుకొనవచ్చునుగాని మీరు ఇతరులకు ముక్తిమార్గాన్ని బోధించ దలచుకుని శిష్యులను ఆకర్షించదలచుకుంటే మీరు సాధ్యమైనంతవరకు ఈ దేశాచారములను అవలం బించాలనికూడా అతడు అన్నాడట. అంతట నోబిలీ ఒక స్వాములవారిలాగ తయారైనాడు.

లెయిర్జియోగారి వుత్తరంలో నొబిలీ దుస్తుల వర్ణన కనబడుతూ వుంది. ఈయన ఒక పొడుగైన కాషాయపుటం గీని ధరించి ఒక కాషాయపు ఉత్తరీయాన్ని కప్పుకునేవాడు. ఆ రంగు గుడ్డతోనే తల కొక తలపాగాను చుట్టుకునేవాడు. కాళ్లకు పావుకోళ్లు తొడుగుకునేవాడు. ఇంతేకాదు. ఈ దేశంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ ఉపనయనంలో ధరించే ఉత్తరజందెముల వంటివి మూడు బంగారు పోగులూ, రెండు వెండిపోగులూ గల ఉత్తరజందెములను వేసుకొని వాటిమధ్య మెడలో ఒక శిలువనుకూడా ధరించేవాడు. దీనికి క్రైస్తవమతానికి సంబంధించిన ఒక అంతరార్ధం వున్నదని అనేవాడు. కొన్నళ్లైనతరువాత జగద్గురువు ఇలాంటి జందము వేసుకోనక్కరలేదని నోబిలీ దానిని విసర్జించాడు.

వి చి త్ర వే దాం త ము

నోబిలీ చేసే మతబోధ, ప్రచారము, చాలా చిత్రంగావుందని హిందువుల మతగ్రంధాలలోని కధలలోను సిద్ధాంతాలలోను తన కుపయోగించే సంగతులు తీసుకొని వాటిని బట్టి మతబోధ చేసేవాడు. ఈ హిందూదేశీయులకు నాలుగు వేదములున్న వనిన్ని, అందులొ ఒకటి పొయినదనిన్నె నోబిలీ విన్నాడు. ఇప్పుడున్న వేదాలలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులనుగూర్చి చెప్పబడిన వనిన్ని నాల్గవదానిలో కేవలమూ మోక్షమార్గమే వివరింపబడినదన్ని, కేవలము ఇప్పుడున్న వేదాలవల్ల తరించలేరనిన్ని, ఆ నాలుగవ వేదమును ఉద్దరించగల బుద్దిమంతు డెవ్వడూ లేడని కొందరు అనుకుంటున్నారనిన్ని విన్నాడు. ఈ ప్రజలు మోక్షమార్గమును వాంఛిస్తారు. అపచారాలకు ప్రాయశ్చిత్తాలను చేసుకుంటారు. దానధర్మాలు చేస్తారు. తమ విగ్రహాలకు అతిభక్తివిశ్వాలతో మ్రొక్కుతారు. అందువల్ల వీరినమ్మకాలను పురస్కరించుకొని నోబిలీ పనిచేయ దలచాడు. తాను మోక్షమార్గమును బోధించడానికి వచ్చాననిన్నీ, తమ బ్రాహ్మణులు పోయినదని చెప్పే నాల్గవ వేదంలోని మతధర్మాలను గురించి వారికి బోధించడానికే తాను దేశంగాని దేశాన్నుంచి ఇంతదూరం వచ్చాననిన్ని చెపుతూ నోబిలీ ప్రజలకు బోధించడం ప్రారంభిచాడు.

ఈ కొత్తపద్ధతి క్రైస్తవమతప్రచారము అతి చమత్కారంగా వున్నదనిన్ని, తాను క్రైస్తవులుగా చేయదలచిన ఈ హిందువుల మత విశ్వాసాలలోనూ, సిద్ధాంతాలలోనూ గల గట్టి ఘట్టాలనూ, లోపాలనూకూడా ఈ నోబిలీ ఎంతబాగా గ్రహించాడో దీనివల్ల బాగా తెలుస్తూవున్నదనీ మాక్సుమూలరుగారు వ్రాశారు.

'ఎక్సోడస్ ' అనే పుస్తకంలో తన ప్రచార పద్దతినిగురించి నోబిలీగారే ఇట్లు వ్రాశారు. "హిందువుల దేవుళ్ళు పనికిమాలిన వారైనా వారిని దూషించకూడదు. ఆ దేవుళ్ళను దూషిస్తే దానివల్ల మనకు లాభం కలిగేటందుకుబదులు నష్టం కలుగుతుంది. ఒక గదిలోనుంచి చీకటిని తొలగించాలంటే చీపుళ్ళు పుచ్చుకొని దులిపి కాలం వ్యర్ధపరుస్తామా? ఒకదీపం వెలిగిస్తాము. చీకటి దానంతట అదే మాయమవుతుంది. స్నేహంచేత క్రైస్తవేతరుడి హృద;యాన్ని ఆకర్షించాలి. అతనికి మనయందు భక్తివిశ్వసాలు కలుగచెయ్యాలి. తరువాత అతనికి సత్యమనె దివ్వెను ఇవ్వాలి. అంతట విగ్రహారాధనమనే అంధకారము చిక్కులు లేకుండా మాయమౌతుంది."

ఇంకొక ఉత్తరంలో తాను చేసే బోధను నోబిలీ వర్ణించాడు. "నా దగ్గరకు వచ్చినవాళ్లకందరికీ భగవంతు డొక్కడేననిన్నీ, ఆయన క్రైస్తవులునమ్మే మూడు మూర్తులలో సాక్షాత్కారం అవుతున్నాడనిన్నీ, ఆయనఅ నంతుడనిన్నీ, భూమండలమును మనుష్యులను సర్వ జంతువులను సృష్టించిన వాడనిన్నీ, మానవులను రక్షించేటందుకు మానవ శరీరాత్మలతో ఒక దివ్య కన్యాకుమారి కడుపున పుట్టినాడనిన్నీ, ఇలాగ పుట్టిన అవతారమూర్తి ఏసుక్రీస్తు అనిన్నీ, ఇతడునిర్వికారుడనిన్ని, మానవులపాపముల నన్నింటినీ తాను భరించిన రక్షకుడనిన్ని చెప్పి ఆ మత ధర్మాలను బోధించేవాడు. "ఈ మతధర్మాన్ని స్వీకరించే వారెవ్వరూ తమ కులాచారాలను వదులుకో నక్కరలేదు. ఇంకొక కులంలో చేరనక్కర లేదు. తనకులాచారాలకు విరుద్దమైన ఏపనినీ చేయనక్కరలేదు. భగవంతుని సాక్షిగా ఈ పవిత్ర మతధర్మము అన్ని వర్ణాలకూ అర్హమైనది. బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన ప్రజలందరు లౌకిక వ్యవహారాలలో ఈ దేశపు రాజైన మహానాయకుడి శాసనానికి ఎలా లోబడివుంటారో అధ్యాత్మిక విషయాలలో మానవులందరికి ప్రభువైన భగవంతుని ధర్మశాసనానికి అన్ని కులాలవారూ, అన్ని తరగతులవారూ లోబడివుండాని. ఈ దేశంలో పూర్వపు ఋషులు, సన్యాసులు చెప్పే ధర్మాలనే నేను కూడా చెప్పుతున్నాను. ఈ ధర్మాలు కేవలమూ అస్పృశ్యులకూ, పరంగీలకూ అర్హమైనవని ఎవరయినా అంటే వారు మహాపాతకం చేస్తున్నారన్నమాట. అన్ని కులాల మనుష్యులకూ భగవంతుడు ప్రభువు గనుక ఆయన ధర్మాన్ని అందరూ శిరసావహించాలి. ఈధర్మానికి లోబడినందువల్ల ఇంకను ఉన్నతమైన స్థితిని చెందని ఉన్నత కులములేదు. తన పవిత్రతను అవంతయైనాతగ్గకుండా ప్రపంచంలోని అన్ని కులాలమీదను, వస్తువులమీదను, సూర్యరశ్మి యెలా ప్రసరిస్తుందో అని బ్రాహ్మణులను అపవిత్ర పరచకుండా ఎలాగ తేజస్సు నిస్తున్నదో ఈ అధ్యాత్మికసూర్యరశ్మి కూడా మనుషులందరికీ తన పవిత్ర ధర్మాన్ని, పవిత్ర తేజాన్ని ప్రసాదిస్తుంది/." అని నోబిలీ ఉద్భోధించేవాడు.

ఉ ప న్యా స ధో ర ణి

నోబిలీ చేసే ఉపన్యాస పద్ధతికూడా చాలా చిత్రంగానూ, దేశీయంగానూ వుండి శ్రోతల మనస్సులకూ, హృదయాలకూ బాగా నాటేటట్లు వుండేది. నోబిలీ తాను స్వయంగా చక్కని పద్యాల నెన్నోరచించి వాటిని శ్రావ్యంగా చదివేవాడు. ఈ దేశంలో మతధర్మాలను, పురాణాలను చెప్పేవారి పద్దతిలో ముందుగా తాను చెప్ప దలచిన మతధర్మాన్ని గురించి భావగర్భితమైన ఒక సూత్రాన్ని చెప్పి దానికి వ్యాఖ్యానం చెప్పడంలో అనేక గ్రంధాలలో నుంచి తన స్వంతకవిత్వంలోనుంచీ శ్లోకాలు, పద్యాలూ, కధలూ, గాధలు, వివరిస్తూ దీర్ఘమైన ఉపన్యాసం చేసేవాడు. మంచి విచక్షణ జ్ఞానంతో తప్పులు వెదకడానికి నడుము కట్టుకుని కూర్చున్న వారున్న సభలలో ఈవిదేశీయు డొక సంవత్సరలోనే దేశభాష నభ్యసించి తనపాండిత్యానికీ, భాషాజ్ఞానానికీ సభవారు ఆశ్చర్య పడేటట్లుగా ఇంత జయప్రదంగానూ, అనర్గళంగానూ ఉపన్యసించ గలిగాడంటే అతడు గొప్ప ప్రతిభాశాలి అనకతీరదని ఒక గ్రంధకర్త వ్రాశాడు.

భూ త వై ద్యం

నోబిలీగారున్నూ, ఆయన శిష్యులున్నూ ఏసుక్రీస్తు శిలువను రక్షరేకుగాను, క్రైస్తవపూజలోని పవిత్రోదకాన్ని మంత్రతీర్ధం గానూ వుపయోగించి జబ్బుపడినవారికి భూతవైద్యం చేసి కుదిర్చే తంత్రం ఒకటి ప్రారంభించాడు. 1907 లో ఒక ఆడమనిషికిన్ని, 1908 లో ఒక మహమ్మదీయునికిన్ని ఇలాగ దయ్యం వదలి పోయిం దనిన్ని ఫాదరీల ఉత్తర ప్రత్యుత్తరలలో వ్రాయబడియున్నది. ఒక మాటు ఈ నోబిలీ యేలాటి వాడని ఒక దయ్యాన్ని ఆయన శిష్యుడు అడుగగా అతడు చాలా శక్తులు గలవాడనిన్ని, ఆయన బోధించే ధర్మాలన్నీ నిజమైన వనిన్ని దయ్యం చెప్పినదట. ఈయన దలపెట్టిన కార్యానికి మొదట విఘ్నాలు కలుగుతా యనిన్ని, మూడేళ్లలో జయం కలుగుతుం దనిన్నీ కూడా చెప్పిందట. ఇలాగ భూతవైద్య తంత్రాలు జరపడంవల్ల మధురానగరంలో ప్రజలలో నమ్మకం కుదిరి నోబిలీగారి ప్రభావాన్ని గురించి విపరీతంగా చెప్పుకోవడం ప్రారంభించారు. మధుర రాజసభలోకూడా ఆయన ఖ్యాతి పాకింది. అనేకులైన ప్రభువులు ఆయనతో స్నేహం చెయ్యడం ప్రారంభించారు.

ఫ లి తా లు

ఇలాగ వేషధారణ చేసి కపట నాటకమార్గం ద్వారా ఏసుక్రీస్తుసేవ చేసే పద్ధతి త్వరలోనె ఫలప్రదమైనది. ఈనోబిలీ తన జీవిత విధానం వల్ల గర్విష్టులైన బ్రాహ్మణుల హృదయాలలో సంచలనం పుట్టించి వారిని ఆకర్షించాడు. అందువల్ల వా రీయనను చూడడానికి రావడం మాత్రమేగాక భగవంతుణ్ని గురించి ఆయన చెప్పే సంగతులను శ్రద్ధతో వినడము కూడా ప్రారంభించారు. అంతేకాదు. అందులో కొందరు భూమిమీద ప్రణమిల్లి ఆయన పాధధూళిని శిరస్సున ధరించేవారు. ఇంత బాగా తత్వబోధ చెయ్యగలవా డింకొకడు లేడని వేనోళ్లపొగిడేవారు! *(The Aravidu Dynasty. The Rev.H, Herss Chap XVIII pp. 362-396)

నోబిలీ వేసిన పధకం పారడానికి దారి ఏర్పడింది. అంతట అతడు హిందువులను బహిరంగంగా క్రైస్తవ మతంలో కలపడానికి ప్రయత్నించాడు. ఒక హిందూ మతగురువుతో నోబిలీ ఇరవైరోజులు- రోజుకైదారు గంటలచొప్పున శాస్త్రచర్చను వాదించి ఆఖరుకు తన సిద్దాంతాలను స్థాపించినట్లు జయభేరి వేయించి ఆగురువును క్రైస్తవమతంలో కలిపాడట. తనకు తెనుగుసంస్కృతములు నేర్పిన బ్రాహ్మణ గురువునుకూడా మతంలో కలిపాడు. అంతట ఒకరితరవాత ఒకరిని చలామందిని మతంలో కలపగలిగాడు. బ్రాహ్మణులు, రాజులు, రాజోద్యోగులు, శాస్త్రజులు, నాయకులు, గొప్పకులాలవారు, సంపన్నులు అతని దగ్గరికివచ్చి తరుణోపాయం చెప్పమని వేడుకొనేవారు. దేశంలో చాలా గొప్పవాడని ప్రఖ్యాతిజెంది విజయనగర చక్రవర్తుల వుద్యోగులలో పెద్దయైన దుంబిచ్చినాయకుడుకూడా ఈయనకు శిష్యుడు కావాలని కుతూహలపడ్డాడుగాని రాజుగారికి కోపంవస్తుందని వూరుకున్నాడు.

క్రైస్తవమతం అతిత్వరగా వ్యాపించింది. హిందూమతం కొద్దిరోజులలో నశిస్తుందా అని చాలామందికి తోచింది. దేశమంతా గగ్గోలుపుట్టింది. నోబిలీచేసిన ప్రచారంవల్ల బ్రాహ్మణ పురోహితుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. వ్రతాలు, పూజలు చేసే వారిచ్చే దక్షిణలు తగ్గిపోయినవి. హిందూ స్వాములవారికి ముడుపులుకూడా తగ్గిపోయినవి. అందువల్ల సనాతన ధర్మపరులందరూ కళ్లు తెరిచారు. నోబిలీ కట్టిన క్రైస్తవ దేవాలయంస్థలం తనదని మధుర దేవాలయం ప్రధాన అర్చకుడు తగాదాపెట్టినాడు. అంతట ఈనోబిలీగారి క్రైస్తవ ప్రచారానికి వ్యతిరేక ప్రచారం ప్రారంభమైనది. హెర్మేకత్తియనే శ్రీమంతు డొకడు నోబిలీగారికి సహాయ పడినందువల్ల అప్పటికి నోబిలీ గారి క్రైస్తవదేవాలయానికి ఆపద తప్పింది. ఈ హెర్మెకత్తి క్రైస్తవమతంలో కలియకపోయినా నోబిలీగారికి ప్రాపకుడుగా వుండేవాడు. ఇంతలో నోబిలీగారికి ఇంకొక తవాయి వచ్చింది. దానివల్ల ఆయన మతప్రచారం కట్టిపెట్టవలసివచ్చింది.

ఆ శ్వా సాం తం

ఇదివరలో మధురానగరంలో క్రైస్తవమత ప్రచారకునిగా ఉన్న ఫర్నాండజ్ గారికి ఈనోబిలీగారు అవలంబించే ప్రచారపద్ధతులు, చర్యలు క్రైస్తవధ్రర్మాలకు విరుద్ధంగా వున్నట్లు తోచింది. నోబిలీగారి కొన్ని చర్యలు చాలా అసహ్యకరంగ తోచి మందలించినా గాని లాభం లేకపోయింది. అంతట పైయధికారులకు ఈ చర్యలన్నీ వివరించి చెప్పడంవల్ల నోబిలీగారి ప్రవర్తన బాగాలేదని పైఅధికారులన్నారు. గోవానగరంలో ఉన్న పోర్చుగీసు క్రైస్తవమతాధికారులకు నోబిలీమీద ఈర్హ్యాభావముకూడా కలిగింది. క్రైస్తవమతంలో కలిసిన హిందువులు తమ పూర్వపు మతాచారాలన్ని అవలంబించవచ్చు నని నోబిలీగారు అనుజ్ఞ యిచ్చినందువల్ల క్రైస్తవమతం దురాచారాలకు పుట్టినిల్లుగా మారినదనిన్ని, ఈమతాన్నిగురించి ప్రపంచములో చాలా అపఖ్యాతి కలిగినదనిన్ని వారన్నారు. (1)ముఖ్యంగా నోబిలీగారు హిందూస్వాములవారిలాగ 'జగద్గురువు ' అనే బిరుదును తాల్చడము, (2) తాను పరంగిని కానని చెప్పి నటించడము (3) హిందువుల మూఢవిశ్వాసములను సూచించే పరిభాషను వేదాంతసూత్రము లను, మాటలను వుపయోగించడము, (4)తనమాటలు విశ్వసించి క్రైస్తవమతంలోకలిసిన హిందువులనువారు పూర్వాచారం ప్రకారం వుంచుకునే జుట్టుపిలకలను వుంచుకొనివ్వడము, జందెములు వుంచుకోనివ్వడము, ముఖముమీద గంధాక్షితలు మొదలైన బొట్లు పెట్టుకో నివ్వడము, అనేక సందర్భలలో స్నానాలు చెయ్యనివ్వడము, ఇంకా హిందూవర్ణాశ్రమధర్మాలయందు ఆదినుంచీ జరుగుతూ వస్తూవున్న ఆచారములను అవలంబించ నివ్వడము - ఇవిక్రైస్తవమత ధర్మాలకు విరుద్ధమని నిందించారు..

పైన చెప్పిన విధంగా నోబిలీగారు 5 సంవత్సరాలు ప్రచారంచేసి క్రైస్తవమతం వ్యాపిస్తూవున్న స్ధితిలో పైయధికారులు ఆయన చేసే ప్రచార విధానాన్ని నిషేధించారు. అతణ్ణి కొన్నాళ్లు పని మాన్పించి తరువాత తక్కిన ఫాదరీలలాగనే ప్రచారం చెయ్యమన్నారు. నోబిలీ పడిన కష్టమంతా వృధాఅయింది. క్రైస్తవమత ప్రచారకులు ఈ కొత్త భేషజాలు మాని పూర్వపద్దతుల తోనే ప్రవర్తించడం ప్రారంభించారు. మళ్ళీ వీరిని పరంగీలని నీచంగా చూడడం ప్రారంభమైనది. ముద్దువీరప్ప నాయనిరాజ్యకాలంలో పరిపాలన నిరంకుశంగా జరిగిందని జెస్సూట్లు వ్రాశారు.

ఉ ప సం హా రం

ముద్దువీరప్ప తరువాత మహారాజమాన్య రాజశ్రీ తిరుమలశౌరినాయన అయ్యలుగారు మధుర రాజ్యానికి రాజైనాడు. ఆయన పట్టాభిషేకము 1924 లో జరిగినట్లు కనబడుతూవుంది. ఈ తిరుమలనాయకుడు విజయనగర సామ్రాజ్యం లోనుంచి విడిపోయి స్వతంత్రుడై పరిపాలింపసాగాడు. దేశం శాతంగానూ, సుభిక్షంగానూ వున్నది. ఈ సరికి రోమునగర క్రైస్తవాధికారులు తమపట్ల కొంతశాంతించి యుంటారని రాబర్టో డీ నోబిలీగారు ఊహించి 1923 లో తన పాతపద్దతిలో మళ్ళీ క్రైస్తవమతప్రచారం చెయ్యడానికి పూనుకొని మధురనుండి బైలుదేరాడు. ఇతడు మొదట తిరుచునాపల్లి, శండమంగలము, సేలము మొదలైన ప్రాంతాలకు బోయి కొందరిని మతంలో కలిపాడు.

మధురలో క్రైస్తవమతాన్ని వ్యాపింపచెయ్యడానికి బ్రాహ్మణులు ఆటంకాలు కలిగించడం ప్రారంభించారు. మధుర సనాతన ధర్మానికి దుర్గంగావున్నందువల్ల అతడు మెల్లిగా తిరుచునాపల్లి మొదలైన ప్రాంతాలలోనే గట్టి ప్రచారం చేశాడు. అక్కడకూడా సనాతనులు వీరిని బాధించారు. అంతట మిషనరీలు అడవులలో కల్లరులనే అనాగరికుల గ్రామాలకు పోయి ప్రచారం సాగించారు.

నోబిలీ ఇలాగ మొత్తంమీద నలభై రెండేండ్లు ఈ మధుర జిల్లాలో క్రైస్తవమత ప్రచారం చేశాడు. అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. అతనిదృష్టితగ్గిపోయి గుడ్దివాడైపోతున్నాడు. ఈస్థితిలో కొంచెం చల్లని ప్రదేశానికి పంపితే అతనికి ఆరోగ్యంకలుగుతుందేమోనని 1948 ఆ ప్రాంతంలో మిషనరీ అధికారు లతనిని సింహళానికి పంపించారు. కాని అతడు అక్కడ విశ్రాంతి తీసుకునే దానికి బదులుగా తన మామూలు పద్దతి ప్రకారమే కఠిన నియమాలతో జీవిస్తూ మత ప్రచారం చేస్తూనే వచ్చినందువల్ల ఆరోగ్యం కలగలేదు. అక్కడ కూడా కొందరను అతడు మతంలోకలిపాడు. అందువల్ల అతడుమొదటి నుంచీ పనిచేస్తూవున్న ప్రదేశాలన్నిటికీ దూరంగావుండేటట్లు చెన్నపట్నంలో మైలాపూరికి విశ్రాంతికోసం పంపించారు. అక్కడ ఇతడు తన శిష్యులుగావున్న నలుగురు బ్రాహ్మణులతో ఒక చిన్న మట్టింట్లో కొన్నాళ్ళు కాలక్షేపంచేశాడు. ఇంతలో గోలకొండనవాబుల సేనాధిపతుల దండయాత్రలవల్ల చెన్నపట్నంలో రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలంగా వున్నందువల్ల అధికారులు మళ్లీ అతనిని ఇంకొకచోటికి మార్చారు. ఇట్టి స్థితిలో 1956 లో ఈ క్రైస్తవమతాచార్యులు స్వర్గస్థుడైనాడు.

నోబిలీ అరవంలో వ్రాసిన తొమ్మిది గొప్ప గ్రంధాల తాళపత్రసంపుటాలు 1990 లో కనబడ్డవి. (Madura District Manual (1868-J.H. Nelson, Part II pp 116-120, 127, 160-161 180-181)

                                     ----
  1. జెస్సూటమిషనరీలు - సొసైటీ ఆఫ్ జీసస్ అనే రోమను క్యతలిక్కు క్రైస్తవ మత ప్రచార సంఘానికి చెందిన సన్యాసులు. వీరిని మనదేశీయులు "ఫాదరీ" లనేవారు. ఈ సంఘం 1539 లో స్థాపించబడి పోర్చుగల్లు స్పెయిను రాజ్యముల అధ్వర్యంకింద దేశదేశాలలో క్రైస్తవ సన్యాసుల మఠాలను స్థాపించి అతి తీవ్రమైన మతప్రచారం సాగించింది. ఈ సంఘంలోచేరిన జెస్సూటు మిషనరీలు కొంతకాలం నియమంగా మతవిద్య నభ్యసించి, కాంతాకనకములను వర్జించి బ్రహ్మచర్యవ్రతమవలంబించి క్రైస్తవమత ధర్మాలను త్రికరణాశుద్దిగా నాచరించే దీక్షను వహించి సన్యాసాశ్రమం స్వీకరించేవారు. ఇటలీదేశంలో రోమనునగరంలో నున్న క్రైస్తవమత జగద్గురువ్లైన 'పోప్ ' గారి అధికారానికి లోబడి ఈ జస్సూటుల మఠాలు పనిచేసేవి. క్రైస్తవసంఘంలోని ప్రోటెస్టెంటులు పోపుగారి అధికారాన్ని ధిక్కరించినప్పుడీ జెస్సూటులు పోపుగారికి కుడిభుజంగా నిలిచి పనిచేశారు. ఈ సంఘం వారు బలవంతులై క్రమక్రమంగా లౌకిక వ్యవహారాలలోనూ రాజకీయాలలోనూ పాల్గొంటూ ధనసంపాదనకోసం వర్తక వ్యాపారాలలో ప్రవేశించినందువల్ల ఈ సంఘములో కొన్ని దురాచారాలు ప్రబలినవి మతప్రచారంలో పేరుకొన్న అన్యాయ పద్దతులు కూడా అవలంబించారు. మన దక్షిణహిందూదేశంలో పడమటి సముద్రతీరాన్ని పొర్చుగీసు వర్తకుల రేవుపట్టణమైన గోవానగరంలో జెస్సూటుమఠం ఒకటి 1542 లో స్థాపించబడగా ఇక్కడ మతప్రచారం ప్రారంభమైంది