కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/మా ముత్తాత
మా ముత్తాత
“పెద్ద కవీంద్రుఁడై పేరుచెందినవాఁడు పిన్న ముత్తాత నర్సన్నగారు” అని దేవీభాగవతములో వంశవర్ణనారంభమందు పేర్కోబడ్డ నరసన్నగారు మాముత్తాతలు ముగ్గురిలోనూ ఆఖరువారు. మొదటివారు కామయ్యగారు, రెండవవారు అన్నయ్యగారు. వారిరువురినీ వదలి ముందుగా ఈయన పేరెత్తడానికి కారణం విద్యావృద్ధత్వమే. ఈయన యిప్పటికి సుమారు నూటపదకొండు సంవత్సరములకు పూర్వము, అనఁగా స్వభాను సం|| ఫాల్గున శు 3 గురువారం నాటితో పూర్తిగా వ్రాసికొని ముగించి ఆ తేదీని తుట్టతుద చేవ్రాలుతోసహా వ్రాసిపెట్టిన “ప్రయోగ ముక్తావళి" అనే ధర్మశాస్త్రం, తాటాకుల ప్రతి యిప్పటికిన్నీ మా యింట్లో ప్రతి నవరాత్రులలోనూ పూజింపఁబడుతూ చెక్కుచెమర్పకుండా భద్రంగా వున్నది. ఈయన జీవించిన కాలపరిమితి సుమారుగా వినికివల్ల యాభై నాలుగు. లేక యాభై అయిదు అని యెఱుఁగుదును. దాన్నిబట్టి చూస్తే ఆ ధర్మశాస్త్రం వ్రాసికొనే కాలంనాటికి సుమారు నలభై యేండ్లవయస్సు వాఁడు కావచ్చునని వూహించుకోవచ్చు. ఈ వూహ సరియైనదే అయితే, ఈయన జననం యిప్పటికి, అనగా క్రీ. శ. 1934 సంllరముకు సరియైన భావ సం|| ఆశ్వయుజ శుద్ధ తదియా గురువారం నాటికి, నూటయాభై యొక్క వత్సరప్రాంతంలో వుంటుంది. ఆ వత్సరాన్ని గూర్చిన చర్చ అవసరమైతే చదువరులే నిర్ణయించుకుంటారు కాఁబట్టి దీన్ని గూర్చి విస్తరించేదిలేదు.
ఈయన తన నివాసగ్రామమగు కడియానికి సుమారు మైలున్నరలో నున్న వేమగిరినివాసులు మేడవరపు కోనయ్యగారివద్ద తెలుగు చదువుకొన్నట్లు ఈయన కృతులలో ముఖ్యకృతియగు యామినీపూర్ణ తిలకావిలాసములో కనఁబడుతుంది- "కోనయాఖ్యాంధ్ర గురుకీర్తిఁ గూర్తు మదిని” అని పై పుస్తకాన్ని యీయన మొదట మూఁడాశ్వాసాలుగా రచించి అందులో దోషాలు విస్తారంగా వున్నట్టుతోచి, సంస్కృత సాహిత్యం కోసం కాకరపర్తిగ్రామం వెళ్లి అక్కడ శ్రీవేదుల వెంకట శాస్త్రులుగారివద్ద వ్యాకరణం చదివి, మళ్లా ఆ పుస్తకాన్ని సంస్కరించి ఆఱు ఆశ్వాసములు దాన్నిగా చేసినట్లు విన్నాను. దీనికితథ్యంగా ఆ మూఁడాశ్వాసాల చిత్తుప్రతి నా బాల్యంవఱకూ ఆయన పుస్తకసామగ్రిలో నిల్చివుంది. నాకు సంపూర్తిగా ఈ చిత్తుప్రతి మాత్రమే ఈయన స్వహస్తలిఖితం చూడడం తటస్థించింది గాని, సంస్కృత పాండిత్యం ముదిరిన మీఁద ఆఱాశ్వాసాలుగా మార్చి కూర్చిన నిర్దుష్టప్రతి చూచే అదృష్టం కలగనేలేదు. కారణమేమంటే, మా తాతగారు, వెంకన్నగారు, ఈ నరస కవిగారి పెద్దన్న కామయ్యగారి కొడుకగుటచే, ఈయన అనంతరం ఈయనకు పురుషసంతానం లేకపోవడంచేత ఈయన తాలూకు యితరాస్తితోపాటు పుస్తక సామగ్రిని కూడా వశం చేసికొన్నారు. ఈయనవద్ద బాగా చదివినట్టయితే మా తాతగారు ఈయన ప్రతిష్ఠని పూర్తిగా నిలపదగ్గ వాగ్దాటీ, వాజ్మాధుర్యమూ కలవాఁడేకాని, మనస్పర్ధలు కలిగి కాళి దాసత్రయం లోపునే చదువు చాలించారని వినికి. మనస్పర్థకు కారణం; నాఁటికాలపు పిఠాపురపు ప్రభువు శ్రీ నీలాద్రిరాయనింగారికి మా ముత్తాత నరసకవిగారి ముఖ్యశిష్యులైన చింతపట్ల వేంకటరాయు, మాధవరాయనింగార్లనే సోదరులు మేనమామలయిన హేతువుచేత, వారు చాలాసార్లు మేనల్లుడి దర్శనానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే, అప్పటి కాలపు పండితులలో యెవరో తప్ప సర్వసామాన్యంగా నిస్పృహులుగావుండి, "పంచమేహని షష్ఠేవా శాకంపచతి స్వేగృహే” అనే శ్లోకార్ధాన్ని గుఱి చేసికొని వర్తించేవారే అవుటచేతనూ, మా ముత్తాతగారుకూడా ఆ తెగవారిలో అగ్రేసరులై వుండడంచేతనూ, యెన్నడున్నూ స్వగ్రామం వచ్చియున్నప్పటికీ ఆ ప్రభువును చూడడానికి వెళ్లనేలేదనిన్నీ దానిమీఁద శిష్యులు మేనల్లుడితో విస్తరించి యీయన్ని గుఱించి తఱుచు చెప్పి వుండడంచేత నేమి, ఆ ప్రభువు రసజ్ఞుఁడైన కారణంచేత నేమి, యెట్లో యీయన్ని చూచి యీయన ముఖతహా కొంతవిని యీయన్ని సమ్మానించాలని బుద్ధిపుట్టి మేనమామలతో దానిని సంఘటించవలసిందిగా కోరితే, వారు “మనయింటికి శాస్త్రులవారు తఱచు దయచేస్తూనే వుంటారు, తాము దయచేస్తే వారిథోరణి విని యానందించడం తటస్థిస్తుంది." అని చెప్పేటప్పటికి, మంచిదని ఆ ప్రభువు తమదివాణానికి సమీపంలోనే వున్న మేనమామల యింటికి వచ్చి చాటుగా కూర్చుండి అంతకు ముందే ఆసమీపపుగదిలో గ్రంథకాలక్షేపం చేస్తూవున్న మా ముత్తాతగారి వాగ్ధోరణివిని, ఆనందించి, అప్పుడు యెదురుకుండా వచ్చి సగౌరవంగా ఆదరించి “కోరుకోవలసిం” దన్నారనిన్నీ దానికి మూ ముత్తాతగారు “మీదయవల్ల సమస్తమూ వుంది (మనసిచ పరితృప్తే కోஉర్థవాన్ కోదరిద్రః) లోటు లేదు.” అని చెప్పి యేమిన్నీ కోరలేదనిన్నీ తరువాత రాజుగారు బలవంత పెట్టఁగా, దానం పట్టడానికి బొత్తిగా ఇష్టంలేక "అయ్యా! మాకు సుమారు మీ జమీందారిలో వున్న భూమి అయిదుపుట్లలో (అనగా నలభై యకరాలలో) నామూడోవంతుకు పుచ్చుకొనే కట్టుబడిపన్ను కొట్టివేయించవలసిం"దని మాత్రం కోరేరనిన్నీ ప్రభువు ఆలాగే చేశారనిన్నీ వినికి. ఈయంశం గీరతంలోకూడా టూకీగా వుదాహరించాను. ఇందులో నిజమెంతో, కల్పితమెంతో నిశ్చయించడానికి ఆధారం తక్కువ. ఆలాకొట్టి వేయడానికి పూర్వం యెంతపన్నువుండేదో తెలుసుకొందామంటే వీలుచిక్కిందికాదు. రాజదర్శనానికి వెళ్లకపోవడానికి కారణం, ఈయనకి కొంచెం సభాకంపం వుండేదనిన్నీ కొందఱు చెప్తారు. అయితే యిదికూడా సత్యమేయేమో. ప్రభువు మేనమామలింటికి వచ్చినప్పుడేనా చదివేటప్పుడు చాటుగా వుండి వినేటట్టేవారు సంఘటించడానికి ఇదే కారణమనిన్నీ కొందఱివల్ల విన్నాను. అయితే ప్రభువు కోరవలసిం దన్నప్పుడు ఏదో కోరనే కోరేడుకదా! హెచ్చు కోరిక కోరడానికి మాత్రం సభాకంపంబాధించి, తక్కువ కోరడానికి బాధించలేదనుకుందామా? బాగా ఆలోచిస్తే ప్రతిగ్రహదోషానికి సంశయించినట్లే నాకు తోస్తుంది. ఈయనేకాదు. ఆకాలంలోనేకాదు, నిన్న మొన్నటిదాఁకా, ఈసంశయం కలవారు పండితులలో మనదేశంలో పలువురున్నారు. వుదాహరణకి వొక్క పేరిస్తాను. బులుసు అచ్చయ్యగారు. ఇంతపండితులు "నభూతో నభవిష్యతి." వీరు నప్రతిగ్రహీతలై "ఇత్యర్థలు | పులుసూ, ఇతిభావలు కూర" అన్నరీతిని జీవితం గడిపినట్లు ప్రతివారున్నూ చెప్పుకొంటారు. ప్రకృత ముపక్రమిస్తాను. మా ముత్తాత గారు కోరిన కోరిక యావత్తు భూమికిన్నీ సంబంధించక, ఆయనవంతుకి మాత్రమే సంబంధించడంచేత, మా తాత గారికి పాండిత్యం అంతంతలో ఆగిపోయిందన్నది మనకు ప్రస్తుతం.
ఆ స్వల్ప పాండిత్యంతోపాటు స్వల్పంగా కవిత్వం కూడా మాతాతగారు అల్లేవారట కాని,యేమీ గ్రంథరూపంగా రచించినట్లులేదు. చాటువులున్నూ దొరకలేదు. “అలా రామస్వామీ! యాలా! పండితులతోటి యద్వాతద్వాల్" అనే కందపద్యభాగం మాత్రం | మాతాత చెప్పినదని మానాన్నగారు చెప్పఁగా విన్నాను. దీన్నిబట్టి తెలుగు పాండిత్యం కూడా వ్యాకరణ పాండిత్యంతో మిళితమైనది కాదని స్పష్టమే. ఏమైనా ఈమాత్రమేనా విద్యాప్రవేశం వుండడంచేతనే, పినతండ్రిగారి తాలూకు విద్యాధనం యిరువదినాలు తాటాకుల పెట్టెల పుస్తకాలున్నూ బహుజాగ్రత్తగా ఈయన భద్రపరచారు. పోయిన సూత్రాలు అప్పుడప్పుడు మరమ్మత్తు చేస్తూ, చివికిపోతూ చెదతింటూవున్న పత్రాలు క్రొత్త తాటాకులమీఁద యెత్తి వ్రాసి సంపుటాల్లో చేరుస్తూ, ప్రతి సంవత్సరమున్నూ చిత్తకార్తి యెండలో యెండబెడుతూ, ఆ యీ పుస్తకధనాన్ని మా తాతగారు భద్రపరచినందుకు, తుదకిది ఆంధ్రభాషాప్రవేశానికి వొకరివద్ద శుశ్రూష చేయకుండా కొంతవఱకు నాకు గురుత్వం చేసింది.
చిత్తకార్తి యెండలో యెండబెట్టిన సందర్భంలో ఒక పర్యాయం పిఠాపురాన్నుంచి వచ్చిన ఠాణాదారు అప్పలరాజుగారు (ఇంటిపేరు మఱపు తగిలింది) మా యింటిప్రక్కవున్న కరణాలసావిట్లో బసచేసిన కారణం చేత, ఈ పుస్తకాలు ఆయన చూచారు. చూచి ఆసక్తితో ఆయా సంపుటాలు తిరగవేస్తూ వుండంగా, ఆఱాశ్వాసాలుగా మార్చి సాపువ్రాసిన సంపుటం యామినీపూర్ణతిలకావిలాసం కనపడ్డది. అప్పటికప్పుడే ఈ గ్రంథం పేరు చాలా వ్యాప్తిగా వుండడంవల్ల, కనపడేటప్పటికి “ఇప్పడే చూచియిస్తానని పుచ్చుకొని, తుదకు స్వగ్రామం పట్టుకువెళ్లి వ్రాసికొని పంపిస్తానని చెప్పి, యియ్యనేలేదు. గట్టిగా మాట్లాడితే అధికారితో పని. అప్పటి కాలంలో అధికార్లంటే వుండేభయం ఇప్పటివారికి బాగా తెలియదు. అప్పుడు కరణాలన్నా ఠాణాదార్లన్నా చాలా భయపడేవారు. అందుచేత మళ్లా గట్టిగా అడగాలేదు, ఆయన యివ్వాలేదు.
“పుస్తకం వనితా విత్తం, పరహస్తగతంగతం" అనే యోగంపట్టి నా బాల్యంనాటికి ఆచిత్తుప్రతే గతి అయింది. తరువాత ఆ అప్పలరాజు గారు గతించారు. నేను చామర్లకోటలో మాధుకరం యెత్తుకుంటూ చదువుకొనే రోజుల్లో చాలసార్లు పిఠాపురం యిందుకోసమని వెళ్లి యీశుద్ధ ప్రతికొఱకు ప్రయత్నించాను గాని, వారి వంశస్థులవల్ల నాకది లభించనే లేదు. ఇంకొక శుద్ధప్రతి మా ముత్తాతగారి స్వహస్తలిఖితమే ఆపుస్తక సామగ్రిలోనే కనపడ్డది. దానిలో కొన్ని మార్పులున్నూ కొన్ని కొత్త పద్యాలున్నూ వున్నాయి. గాని అందులో రెండాశ్వాసాలకు లోపుగానే గ్రంథం వుంది. బహుశః ఎందుకేనా మంచిదని మఱొక ప్రతి వ్రాయడానికి మొదలుపెట్టి పూర్తికాకపూర్వమే మధ్యకాలంలో పరలోక గతులైరని వూహించవలసి వుంటుంది. ఏమంటే, ఈయన అత్తవారి వూరుకాకరపర్తి వెళ్లి, అక్కడ హఠాత్తుగా మరిడీజాడ్యంవల్ల స్వర్గస్థులైనట్లు విన్నాను. ఈ హఠాన్మరణహేతువుచేతనే, అన్నదమ్ములు అంతకుముందు పంచుకొన్ననూ ఈ గ్రామంలోవున్న రికార్డుయావత్తూ మాతాతగారికి చేజిక్కి సమష్టి అని వాదించడానికి అవకాశం కలిగింది. అప్పటికి నరస కవిగారికి పురుషసంతానం నష్టమైననూ, స్త్రీ సంతానం కలదు. వ్యష్టి అవడంవల్ల ఆయన వాటా ఆపెకు వెళ్లడం న్యాయం. అయినా మా తాతగారు సమష్టివాదం పెట్టి కోర్టులో గెల్చుకున్నారట. అందుచే నరసకవి గారి భార్య మనోవర్తిదారురాలయింది. ఈమె పేరు గవరమ్మగారు. ఈవిణ్ణి నేను ఎఱుఁగుదును. ఈమె నరసకవిగారికి రెండవభార్య మాతాత గారిని నాయెదుటకూడా శపిస్తూ వుండేది యీవిడ.
అయితే యింకొకటి విన్నాను. నరసకవిగారు కాకరపర్తి వెళ్లేటప్పుడు మా తాతను పిల్చి “పుస్తకాలు జాగ్రత్తా" అని చెప్పి వప్పగించి వెళ్లినట్లు చెప్తారు. ఆలా వప్పగించడాని కారణం, ఆయనకు జ్యెతిష ప్రవేశంకూడా వుండడంచేత మృత్యుకాలం తెలిసి మరణం నిమిత్తమే వసిష్ఠానదీతీరమైన కాకరపర్తికి వెళ్లి వుంటారనిన్నీ అందుచేతనే ముగ్గురు సోదరులకూ మొత్తం వారసుగావున్న మాతాతగారికి వప్పజెప్పితే తప్ప ఆడవాళ్లవల్ల యీ పుస్తకాలు భద్రపఱపబడవనిన్నీ వూహించి అలాచేసి వుంటారనిన్నీ కొందఱనగా విన్నాను. మరణానికి అక్కడికి వెళ్లడమెందుకంటే : మా గ్రామం, గౌతమీభాగాల్లో వకటైన తుల్యభాగా తీరమే అయినా, వింధ్యపర్వత భాగంలో చేరుతుంది. అందుకే శ్మశానప్రదేశాన్ని తుల్యభాగకు అవతలి వొడ్డున మాగ్రామస్థులు యేర్పఱచుకొన్నారు. వింధ్యపర్వత సంబంధం వున్నచోట ప్రాణం విడిస్తే గాడిదజన్మం వస్తుందని పూర్వులకు భయం. మహాగౌతమీ తీరమైనప్పటికి రాజమహేంద్రవరానిక్కూడా ఈ దోషం వుందట. బజారు వీథివఱకున్నూ ఫరవాలేదని కొందఱు, అంతేకాదు అయిదుక్రోసులవఱకున్నూ గౌతమీతీరంలోనే లెక్కని మటికొందఱున్నూ చెప్తారు. ఈ సంశయంతో మనకేంపని అని మాముత్తాతగారు నిస్సంశయప్రదేశానికి రాబోయే మరణాన్ని గమనించి వెళ్లేరేమో అని నాకు తోస్తుంది. యేలాగైతేనేమి పుస్తకాలతోపాటు పారీఖత్తులుకూడా మాతాతగారి చేజిక్కడంచేత ఆయన కొమార్తెకు వెళ్లవలసిన ఆయన తాలూకువాటా భూమి మాకే సంక్రమించింది. నేను నరసకవిగారికి అన్నమునిమనుమడను. కాని మాచిన్న పిన తండ్రి కుమారుడు చిన్న వెంకటశాస్త్రులు నావలె మాత్రమేకాక తల్లి ద్వారాగా సాక్షాన్మునిమనమడుకూడా అయియున్నాడు. కారణం, అతని తల్లి నరసకవిగారి దౌహిత్రురాలు.
ప్రస్తుతానికి వద్దాం. ఇంతకూ మాతాతగారు యెంత భద్రంగా జాగ్రత్తపెట్టినా ఆయన కాలంలోనే మా ముత్తాతగారి కవిత్వంలో ముఖ్యమైన యామినీపూర్ణతిలక శుద్ధప్రతి నాకు దొరక్కపోయింది. ప్రయత్నించగ తుదకు వకమంగలి, విద్యాసక్తుఁడు యెక్కడో వ్రాసుకున్న ప్రతి నా బాల్యగురువులలో నొకరైన మధునాపంతుల సూరయ్యగారు సంపాదించి యథామాతృకగా వ్రాసుకున్నారు. అది నాకు వారు వ్రాసుకొనడానికిచ్చారు. కాని దానియందున్నూ దురుద్ధరమైన లోపాలున్నాయి. యేమయినా “లేనిబావకంటే గుడ్డిబావ మెఱు" గని దానినిబట్టి వక ప్రతి నేను కావ్యాలు చదువుకొనే రోజుల్లో వ్రాసుకున్నాను. అంతట్లో తునిలో భాగానగరం గురులింగదేవర అనే జంగమ కులస్థుఁడు దీనిని అచ్చువేస్తూ అయిదాశ్వాసాలు మాత్రమే దొరకినట్టున్నూ, ఆఱోది తనకు దొరకనట్టున్నూ, నాపేర దానిని యిప్పించవలసిందని ప్రార్థనగా వత్తరం వ్రాయగా, నా దగ్గఱనున్న ప్రతినిబట్టి వ్రాసి ఆయనకు నేను ఆఱవది పంపించాను. ఆ అచ్చుప్రతే వీరేశలింగం పంతులవారికి దొరకినదిన్నీ ఎవరి తప్పులో నిర్ణయింప శక్యంగాదుగాని, ఆ అచ్చుప్రతి నిండా తప్పులు కుప్ప తెప్పలు. ఇటీవల మాముత్తాతగారి వేంకటేశ్వరవిలాసం నేను ముద్రిస్తూ యామినీపూర్ణతిలకను కూడా ముద్రిద్దామని అనుకున్నానుగాని, తప్పులు సవరించడానికి నాతరం కాకపోయింది. బాగా ఆలోచిస్తే ఆ తప్పులలో వ్రాత పొరపాట్లు కానివిన్నీ యెన్నో వున్నాయి. అవి గ్రంథకర్తవేగాని అన్యులవి కావని నాకు పూర్తిగాతోచి, సంస్కరణానికి లొంగని హేతువున ఆ వుద్యమాన్నుంచి విరమించి వూరుకొన్నాను. ఇప్పుడు లోకంలో ఆ తప్పులన్నీ ఆ జంగందేవర నెత్తిని రుద్దడానికి స్థూలదృష్టుల కవకాశం కలిగింది. లేకపోతే ఈ అవకాశానికి హేతువుండదు. ఆ తప్పులలో మాదిరి కొకటి చూపుతాను.
“ఆ రాజేంద్రునిసగు భా ర్యా రతిశాస్త్రానురూప.” ఈ పద్యంలో, “భార్యా" శబ్దాన్ని హ్రస్వం చేయకుండా ప్రయోగించడం కవికృతంగాని యితరులదికాదు. ఇది దిద్దవలసివస్తే యెట్లా! అసాధ్యస్థలంలో వుంది. దిద్దవీలైనవికొన్ని వేంకటేశ్వరవిలాసంలో దిద్దాను. చూడండి.
"అలరు మందాకినీ యార్యాసహాయుఁడై పొలుపొందు సర్వజ్ఞ మూర్తియనఁగ" ఇందు మందాకినీ + ఆర్యా, అన్నచోట, సంస్కృత సంధి యణాదేశం రావాలి. ఆయన కీమాత్రమున్నూతెలియదా? తెలిసినప్పటికి మొదట తెలుగు కవిత్వాని కలవాటు పడడంచేత తెలుగు వ్యాకరణ మర్యాదగా యడాగమం పడ్డది. ఇది పూర్వాపరాలు చేయించే పురోహితుడికి అందులో మంత్రాలిందులోనూ, ఇందులో వందులోనూ దొరలడం వంటిది. ఈసంగతి అనుభవజ్ఞులకు తెలుస్తుంది. ఇంతమాత్రంచేత ఈయనకు కౌముది రాదనుకోవడం యుక్తంకాదు. యేమంటే : స్వదస్తూరీతో వ్రాసికొని చదివిన కౌముది ఆయన పుస్తకసామగ్రిలోనే వుందే? నేను దానిమీదనే కదా వ్యాకరణం చదవడాని కారంభించింది? ఎఱిఁగి కూడా తప్పువ్రాస్తేనే ప్రమాదమనుకోవాలి. ఈలాటి చోట్లనే "ప్రమాదోధీమతామపి" అని సమాధానం చెప్పుకోవడం. అచ్చులో "మందాకిన్యహార్యజా యుఁక్తుఁడై" అని సవరించి ముద్రింపించాను. ఈయన బుద్ధిపూర్వకంగా సమ్మతించి ప్రయోగించిన అఖండయతులేమి, కొన్ని తెలుగు వ్యాకరణ విషయాలేమి, మొట్టమొదట నాకు నచ్చినరీతిని వేంకటేశ్వరవిలాసంలో సవరింప మొదలుపెట్టి కొంత ముద్రణం జరిగినమీద ఈ పని అంత వుచితంకాదని మానివేశాను. కాని దిద్దిన భాగమే యొక్కువ.
మహాకవి, పండితకవి అయిన ఈయన కవిత్వమందు అన్ని లక్షణవిరుద్దా లెందుకున్నాయి. అని ప్రాజ్ఞులు శంకింపవచ్చును. వినండి : ఈయన కాలంనాటికి పుస్తకాలింకా సులభంగా అచ్చుపడి దొరకడంలేదు. ఎవరినో ఆశ్రయించాలి, సంపాదించాలి. అట్టిస్థితిలో ఆంధ్రలక్షణ గ్రంథాల్లో ముఖ్యమైన అప్పకవీయం ఈయనకు దొరకనేరదు. “అప్పకవీయంలోని కొన్ని యతిప్రకరణాలు" అనే శీర్షికగల సుమారు జానెడు పొడుగు తాటాకులు ఆఱో, ఆఱున్నొకటి మాత్రమో గల చిన్న పుస్తక మీయన పుస్తకసామగ్రిలో కనబడుటచే ఈయన కాధారం సులక్షణసారం వగయిరాలని స్పష్టంగా నిర్ణయింప వీలయింది. సంస్కృత వ్యాకరణ విరుద్ధాలు కూడా దీర్ఘసమాసాలలో క్వాచిత్కంగా లేకపోలేదు. ఏమంటే వయస్సు కొంత ముదిరినపిమ్మట కౌముది చదివినప్పటికీ యీయనకు అది యెంతవరకు అనుభవంలో వుందో అని నాకు సందేహం. ఈ సందర్భాలన్నీ స్తనశల్యపరీక్ష చేసేవారికిగాని స్థూలదృష్టి వారికి యింత సలక్షణకవి ప్రపంచంలో పుట్టనేలేదన్నంత గౌరవంకలదు. ఆ నమ్మకం యెవరికో యెందుకు? నా గురువులలో వకరున్నూ, కేవల సాహిత్యపరులున్నూ అయిన మధునాపంతుల సూరయ్యగారికే వుండేది. ఇటీవల నే నెప్పుడేనా ఆయీ విచారణాంశాలు ముచ్చటిస్తే, “తాతా,. యింకా ఆలోచించాలేమో" అనేవారు. ఈ ఆలోచించడంలో నాకున్న చేదస్తం యెవరికోగాని వుండదు. రామశబ్దం సర్వసమ్మతమైనా అదికూడా నిరాఘాటంగా ప్రయోగించడానికి నేను సందేహించడం కలదు. అట్టి పరమచాదస్తుణ్ణి నేను; గ్రంథమో, మా ముత్తాత కవిత్వం. అట్టి స్థితిలో ఇతరులెవరేనా తప్పంటే పోట్లాడవలసిన దానికి నేను తప్పంటానా? పేరెందుకు వ్రాయడం. బందరులోనే మా ముత్తాతవంటివారో, ఇంకా గొప్పవారో, ఒక విద్యావయోవృద్దులు, మహాకవులు వుండేవారు. ఆయన పాండిత్యం, అసదృశం. చాలా గ్రంథాలు వ్రాశారు. ఆయన కుమాళ్లు కూడా ప్రాజ్ఞులే. తండ్రిగారి కవిత్వమందేమి, తండ్రిగారియందేమి, మిక్కిలి భక్తులు. వారి కవిత్వములోనున్నూ మా ముత్తాతగారి కవిత్వంలోవలెనే ప్రమాదాలు విస్తరించి వున్నాయి. అంత గొప్ప పండితుల కెందుకుండాలి? అనకండి, నా అనుభవంలో పాండిత్యంవేఱు, పరిశీలన వేఱు, పరిశీలనగలవారు నూటనాటగాని పండితులలో తఱుచుగా వుండరు. హరిశాస్త్రులవారి శిష్యులు ఒకరు మహావైయాకరణులై కూడా తప్పుల కుప్పగా వ్రాసిన పుస్తకాన్ని నేను చూచాను. ఎవరేనా చెప్పితేనే గాని అంతవఱకూ ఆయనకు తప్పని తెలియనే తెలియదు. ఏమనుకోవాలి? ప్రస్తుతానికిరండి. అవి ప్రమాదాలని యెవరేనా అంటే, వారి కుమాళ్లు, జవాబు చెప్పడానికి ఆధారం లేకపోయినా, వప్పుకొనేవారు కారు. ఎవరికుమాళ్లు! బందరులోవారి కొమాళ్లు, నేనుకూడా మా ముత్తాతగారి యెడల అట్టి భక్తినే చూపవలసివుండగా చూపలేకపోతిని గదా అని విచారిస్తున్నాను. వీరేశలింగంపంతులవారు కూడా ఆముక్తమాల్యద వగయిరాలలో తప్పులున్నాయన్నారు గాని, మా ముత్తాతగారి విషయంలో కలం ఆ ధోరణికి తిప్పనేలేదు. ఈ “తాతామనుమల వరస” నాకే తటస్థించింది. ఇంతమాత్రంచేత నేను మా ముత్తాతగారియందు గౌరవంలేనివాడనని పాఠకలోకం భావించకూడదు. "పెద్దకవీంద్రుఁడై" అని యెత్తుకున్నాను గానా? ఇంకా చూడండి
“మ. అనఘుండై, మదనాభిరామనృపకన్యాచిత్రచారిత్రమున్
జననుత్యమ్మగు వేంకటేశ్వరవిలాసంబున్ దగంజెప్పి రా
మున కర్పించి పరంబుగన్న మహితున్‌ముమ్మాటికిం గొల్లు నా
పినముత్తాత నగణ్యపుణ్యవిభవాబ్ది న్నారసింహాఖ్యునిన్." -
ప్రకృతానికి వద్దాం. బిల్హణీయపు గాథను కావ్యంగా వ్రాసినవారిలో తుట్టతుదివారు మా ముత్తాతగారే. వీరేశలింగంగారు వీరి కవిత్వానికే యెక్కువ విలువ యిచ్చారు. ఈయన చాలవఱకు యితరుల ననుకరించే స్వభావం కలవారు. ఆ పద్యాలని వదిలిపెట్టి స్వతంత్రంగా వ్రాసినవి చాలా బాగుంటాయి. ధార మిక్కిలీ ధారాళంగా వుంటుంది. వసుచరిత్రని వరవడిగా బెట్టుకోవడంచేత కాబోలు, చేదస్తానికి మితిలేదు. ఈయనేకాదు ఈయనకు కొంచెం పూర్వులుగా వుండే కూచిమంచి తిమ్మకవిగారు లోనైనవారంతా వసుచరిత్రను వరవడిగా పెట్టుకున్నవారే. యమకానికి మాత్రం మా ముత్తాతగారు అందఱినీ అతిక్రమిస్తారు. అందులో అనేక రకాలు; వుదాహరించడానికి మొదలుపెడితే తెమలదు. అయినా మచ్చుకి వకపద్యం వుదాహరించడం మంచిదికదా?
చ. మగువపదంబు కోకనదమానదమా? నదమా? ప్రణాభి, న
మ్మగనగురూపు భాగ్యకరమాకరమా? కరమా? మృదూరు వెం
చఁగఁ గటిసీమ మోహదరసా? దరసాదరసాధుకంఠలీ
లగళనినాద మెన్నఁ బికలాపికలాపికలా? కచాళియున్.
దీని సమన్వయము నేను చిన్నప్పుడు సంప్రదాయజ్ఞులవల్ల విన్నాను. స్వంతంగా అయితే తెలిసికోనేలేనేమో? ఇప్పటివారిలో దీనిని అన్వయించేవారెందఱుంటారో చెప్పజాలను. అవసరమని యెవరేనా కోరితే పత్రికలో ప్రకటిస్తాను. దీనిని యిలావుంచి యింతకాలంనుంచి అనేక గ్రంథాలు చూస్తూ వున్నాయే గ్రంథంలోనూ చూడని క్రొత్తమోస్తరు పద్యం వకటి మా ముత్తాతగారి కవిత్వంలో వుంది. చూడండి వుదాహరిస్తాను
మ. మదభసలాళివంటి కచమా? మృదురంభలవంటి యూరులా?
మదనదరంబువంటి గళమా? ముకురమ్ములవంటి చెక్కులా?
కదలని మించువంటి తళుకా? విరిబంతులవంటి గుబ్బలా?
మదవతిజవ్వనం బమృతమాధురి సేయదె? యెంతవారికిన్.
దీనియందున్న క్రొత్తపోకడ అనుభవజ్ఞులు గమనిస్తారు. ఇట్టి చక్కని శైలిగల యిమ్మహాకవి ఏవో లేనిపోని వెఱ్ఱివెఱ్ఱి యమకాలకు లోనై దిజ్మాత్రముగాకాక వాట్లకే యెక్కువ చోటిచ్చి గ్రంథాన్ని చదివే వారికి విసుగు పుట్టించు మాదిరిగా రచించడానికి విచారించవలసి వచ్చింది. ఈయన దస్తూరీ చాలా చిన్నయక్షరాలుగా వ్రాస్తారు. అట్టి వ్రాతలో యేడెనిమిది తాటాకులు రోజువక్కంటికి స్వకవిత్వంతో నింపేవారని విన్నాను. దీనివల్ల అత్యాశుకవి యనుకోకతప్పదు. అయితే ఈయన ఆస్తితోపాటుగా అంతో యింతో కవిత్వంరీతికూడా నాకు సంక్రమించినట్లు చదువరు లనుకోకమానరు.
ఈయన ఆశుకవి యనడాని కింకొక యితిహాసం : సంస్కృత వ్యాకరణం చదువుకోవడానికి కాకరపర్తి వెళ్లినప్పుడు, గురువుగారు, “నరసన్నా! నీవు కవిత్వం చెబుతావట? ఏదీ చూదాము, ఈవృత్తంలో ఈవిషయం ఆశువుగా రచించూ” అని యేదో వృత్తం పేరుచెప్పి విషయంతో సహా ప్రశ్నించారనిన్నీ దానిమీద-
శ్లో, కమలాగృహతోరణారరాణాం
ఘటనాపాటనయో స్సమర్థకైః
అసురారిదృగంచలప్రసారై
ర్ఘనమజ్ఞానతమో నిహన్యతాం మే.
అనే యీశ్లోకాన్ని రచించి గురువుగారికి వినిపించారనిన్నీ గురువు గారు అది తాము నిర్దేశించిన వృత్తంకాని హేతువుచేత, "వృత్తం మాత్రం మఱొకటయిందన్నారనిన్నీ ^ దానిమీద మా ముత్తాతగారు వృత్తంకూడా సరిగానే చెప్పినానని నిర్భయంగా బదులు చెప్పేరనిన్నీ, అయితే లక్షణం చదువుమన్నారనిన్నీ వెంటనే కల్పనచేసి గురువుగారన్న వృత్తానికే తాను చెప్పినది సరిపడేటట్లు లక్షణం కూడా ఆశువులో రచించి సరిపెట్టేరనిన్నీ అది అసత్యమైనప్పటికీ మొదట చెప్పిన వర్ణనకంటె ఇది చాలా శ్లాఘాపాత్రమని గురువులచే మెప్పించుకున్నారనిన్నీ జనశ్రుతి. ఇదెంత సత్యమో నిర్ణయింప నాధారంలేదు. గురువు కోరిన వృత్తం పేరేదో తెలియదు. ఈయన చెప్పిన లక్షణ శ్లోకమున్నూ వుపలబ్ధం కాలేదు. ఈయన రచించిన వృత్తం పేరు వసంతమాలిక. గురువుగా రడిగినదిమాత్రం ఈ పేరు కలదికాదని వినికిడివల్ల యెఱుగుదును. దీనివల్ల అత్యాశుకవియని మాత్రం మనం తెలిసికోవచ్చును.
ఇదివరలో వ్రాసిన రాజబంధువులుకాకా, మాగ్రామంలో పేరు ప్రతిష్ఠలుగల వెలంవారు మఱికొన్ని కుటుంబాలవారు పూర్వకాలంలో వుండేవారు. వారుకూడా కొందఱు మాముత్తాతగారివద్ద శుశ్రూషచేసిన శిష్యులే. మా ముత్తాతగారికి ఆదొండకాయకూర చాలా యిష్టమవుటచేత ఆ వెలమశిష్యులు తఱచు ఆ కాయలు తెప్పించి పంపించడం కలదట. వకనాడు దానిమీద పద్యం చెప్పవలసిందిగా కోరేటప్పటికి ఈ పద్యం చెప్పేరట!
మ. ఠవణింతున్నుతి దైవతప్రమదదార్ఢ్యన్మోహినీనీరభృ
చ్యవమానామృతశీకరాభనవబీజప్రాంతరౌపమ్య స
ద్భవనాజాండకు షడ్రసప్లుతసముద్యత్స్వాదుమత్ఖండకున్
అవితుంగోద్భవకాండకున్ సరసమోహాఖండ కాదొండకున్.
ఈ పద్యాన్ని తెనాలి రామలింగకవికృతంగా నెవరో కొన్నాళ్ల క్రిందట యేదో పత్రికలో ప్రకటించినట్లు జ్ఞాపకం. ఎవరిదాకానో యెందుకు? మా శిష్యుడు ప్రభాకరశాస్త్రే ఈయన పద్యం రామలింగకవిదని వ్రాసినట్లు జ్ఞాపకం. బహుశా, ఆ పద్యం కూడా ఇదేనేమో. సుమారిప్పటకి నలభైయేళ్లనాడు, యెవరో జ్ఞాపకంలేదు గాని, మా ముత్తాతగారి గ్రంథంలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన “సీ. శరదంబువేణికి శాంతభావముచెందె." అనే పద్యాన్ని రామలింగకవి కర్తృకంగా వ్రాశారని జ్ఞాపకం. రామలింగకవికృతమైన పద్యము సీ.ద్విరదంబు నడతోడ" అనేది. దాన్ని వరవడిగా బెట్టుకొని మా ముత్తాతగారు రచించినది పైపద్యం. యథార్థ మీలా వుండగా ఎవరో యేదోరీతిని వ్రాస్తే దాన్నే లోకం నమ్ముతోంది. నిన్న మొన్నటిచరిత్రలను గూర్చిన నిజస్థితులే ఇలా తారుమారవుతూవున్నాయి. యిక ప్రాచీనాలని గురించి వ్రాయవలసిందేమి? అంతదాకా యెందుకు? వర్తమానకాలికమైన మా జీవితాన్ని గురించి వ్రాస్తూ వున్నవారి వ్యాసాల్లో కూడా వ్యత్యస్తాలు బోలెడు కనుపడుతున్నాయి. అది అలా వుంచుదాం. మీ ముత్తాతగారి నాటికి మాకు గ్రామంలో పౌరోహిత్యం వుండేదట. నరసకవిగారి అన్నగారు అన్నయ్యగారు దాన్ని చూచేవారట. ఈయనకి ప్రాజ్ఞతవచ్చిన తర్వాత పట్టుబట్టి దాన్ని మానిపించి దానికిగాయేర్పడ్డ మడిమాన్యాలసహితం పొన్నావారనే యింటిపేరుగల వారికి వశం చేయించినారట. ఇప్పటికిన్నీ ఆ పౌరోహిత్యం వారే నిర్వహిస్తూవున్నారు. దీన్నిబట్టికూడా ఈయన “నప్రతిగ్రహీత" అని తేలుతుంది. అయితే యిక “తేభ్యమెక్కడ తెత్తునయ్య? తెల్లవారింది" ఎట్లా జరిగేదంటే : పెద్దన్నగారు కామయ్యగారున్నారే, వారు మెరకపొలం యావతూ స్వంతకృషిచేసి బాగా జొన్నలు పండించేవారట. ఇప్పడా భూమి అంతా అంటూమామిళ్లమయమై యున్నప్పటికీ, పూర్వప్పేరు జొన్నపొల మవుటచే ఆపేరు పోనేలేదు. జొన్నపంట వున్నచోట పాడివుండుట ప్రసిద్ధమే. ఇక నేంకావాలి? పాడిపంటలకు లోటులేదు. కూరనారల కంతకుముందే లోటులేదు, తక్కిన షోకుల కప్పటివాళ్లలవాటు పడేవారేకారు. మా ముత్తాతగారు స్వేచ్ఛగా కవిత్వం చెప్పకుంటూ, వచ్చిన శిష్యులకు పాఠాలు చెపుతూ, యెప్పుడో మనకు వస్తుందనుకునే స్వరాజ్యం అప్పుడే చేసుకుంటూ హేలగా కాలక్షేపం చేసేవారట? పొలంలోకి వెళ్లేవారేకారట. యెప్పుడేనా వెళ్లినా పుస్తకాల నిమిత్తం తాటాకులు కొట్టించుకునే నిమిత్తం తప్ప వ్యవసాయప్పనికి అన్నగారికి లేశమున్నూ సాయపడడం లేనేలేదట, పాపం! ఈయన ముందు బయలుదేరేవాళ్లకోసమని పుస్తకాలకు పనికివచ్చే రకం తాటిచెట్లు అయిదాఱు వందలదాకా పాతించారు. అవి యిప్పుడు చాల పెద్దవై వృద్ధాప్యంలో వున్నాయి. ఈ కాలంలో వాటి వుపయోగం లేకపోయింది.
అయితే పైరీతిగా ఆయన బొత్తిగా గృహకృత్యానికి సాయపడకుండా భోజనవేళకి "పాత్రేసమితుడు"గా సిద్ధపడడానికి అన్నగారికి లేశమున్నూ కష్టంగా తోచకపోయినా, వదినగారు సరమ్మగారికి యిబ్బందిగా వుండి, ఒకరోజున గట్టిగా కంకడానికి మొదలు పెట్టేటప్పటికి, మా ముత్తాతకవిగారికి కోపంవచ్చి, మిట్టమధ్యాహ్నంవేళ సకుటుంబంగా గ్రామాంతరానికి ప్రయాణం కడుతుండగా, ఆ వీధి వెలమశిష్యులు బతిమాలి ఆపుచేసి. అప్పుడే వక పెద్దస్థలం యిచ్చి, తక్షణమే దానిలో పర్ణశాలవేసి, వంటచేసుకొనేటట్టు చేసేరట, ఈయన స్వార్జితం ఆ స్థలం మాత్రమే కనపడుతుంది. ఇప్పుడా స్థలం మూ పినతండ్రిగారి కుటుంబం వారిక్రింద వున్నది. వదినగారి కారణంచేత ఈయన అన్నగారితో విడిపోయినట్టయింది. అన్నగారియందు మిక్కిలి భక్తితోనే యిటీవలకూడా వున్నట్టు వేంకటేశ్వర్రవిలాసంలోని యీ పద్యంవల్ల తెలుస్తుంది.
క. కామయనామసుధీమణి
భూమిం గడునింపెసంగ భూతదయార్థ్ర
శ్రీమహితుండనఁగను బర
భామావిముఖవ్రత ప్రభావుండనఁగన్.
మా తాతగారు మా తండ్రులలో రెండవఆయనకు నరసకవిగారి పేరు పెట్టేరు కాని, చేవ్రాలుతప్ప ఆయనకేమీ విద్య అంటిందికాదు. ఈయనకు మాత్రమే కాదు, ఈయన సోదరులు తక్కిన యిద్దఱికీకూడా ఈయనతోపాటే. అయినప్పటికీ తక్కిన యిద్దఱినీ యేమీ అనక “మహా పండితుడి పేరు పెట్టినందుకేనా వీడు పండితుడు కావద్దా" అని కాబోలు, నరసకవిగారి పేరింటి కొమారుణ్ణి మా పినతండ్రిగారిని మా తాతగారు తఱుచు తిడుతూ వుండేవారట. అయితే మా తండ్రుల విద్యాశూన్యతకు కారణం మాతాతగారే అనికూడా తెలుస్తుంది. అందఱు కొడుకులనీకూడా చిన్నప్పటినుంచీ వ్యవసాయంలోనే పెట్టేరట. ఎవరేనా. "ఏమండీ! వెంకన్నగారూ! మీ అబ్బాయిలకు చదువేల చెప్పించ"రని అంటే. “మావాళ్లకి చదువెందుకు? నామాటలు నేర్చుకుంటే చాలదా” అని జవాబు చెప్పేవారట. నాకు నాలుగేళ్ల వయస్సులో వారు యెనభయ్యో పడిలో కాలంచేశారు. విగ్రహాన్నిమట్టుకు యెఱుగుదునుగాని, ఆయన వాగ్ధోరణి యెట్టిదో తెలిసికోదగ్గ జ్ఞానం నాకప్పటికిలేదు. పైగా యింకొకమాట అనేవారట. చదువుకుంటే వకళ్లని వెళ్లి మనంచూడాలి. వ్యవసాయం చేసుకుంటే మనలనే వచ్చి వకళ్లు చూస్తారనేవారట. అప్పటి మాటెట్లాగైనా, బ్రాహ్మణులకు వ్యవసాయం చేసుకుంటేనే బాగుంటుందనేకాలం యిపుడు వచ్చినట్టు తోస్తుంది. మా తాతగారికి, కొడుకులకు చదువు చెప్పించలేదనే అపకీర్తి వున్నది. నేను మాపిల్ల వాళ్లకు చిన్నప్పటినుంచీ విద్య చెప్పతూ వున్నానాకున్నూ ఆకళంకుతప్పలేదు. యేమంటే నేను చెప్పే విద్య “అకారంతః పుంలింగో" యీ కాలంలో విద్యకాదు కనుక, నేనా కళంకానికి మా తాతగారితోపాటు గుఱికాక తప్పిందికాదు. కానీ యీ మధ్య కొందఱు యింగ్లీషులో కృషిచేసి కృతార్డులయికూడా నిరుద్యోగడిపార్టుమెంటుకు ప్రసిడెంటులైవున్నవారు నన్ను అభినందించడానికి మొదలుపెట్టేరు. ఆ కారణంచేత నేను కొంత సరిపెట్టుకో గల్లుచున్నాను. లేకపోతే యింగిలీషు చదివించలేదనే కారణంచేత నన్ను లోకులు యెంతగా నిందించేవారో చెప్పశక్యం గాదుగదా?
అయితే ప్రతి బ్రాహ్మణుడున్నూ"అకారాంతః పుంలింగో"కి సిద్ధపడితే బాగుంటుందని నా తాత్పర్యంకాదు. సిద్ధపడితే చెప్పేవారు లేరు. పూర్వకాలంలో ధర్మార్ధంగా ఈ విద్యలుచెప్పే గురువులుండేవారు. వారికి తిండిపెట్టేవారున్నూ వుండేవారు. వారందఱూ యిప్పుడు గతించారు. శేషించినవారున్నా యేపట్నమో ఆశ్రయించారు, యెట్లోపొట్ట పోసుకుంటూ వున్నారు. సబ్బు కుంకుడుకాయలనూ, కిర్సనాయిలు ఆముదాన్నీ తొలగించినట్లే, పూర్వపు విద్యలను ఇంగ్లీషువచ్చి “తోసిరాజు" చేసింది. ఇంట్లోవున్న చదువు కనుక నేను నా కొడుకులకి చెప్పడానికి వీలిచ్చింది. ప్రతివారున్నూ ఈలా చేయడానికి వీలుండదుకదా. కాబట్టి లాభమున్నా లేకపోయినా ఇంగ్లీషే చదివితీరాలి. అది ద్రవ్యసాధ్యం. ఆర్థికస్థితి ప్రస్తుత మడుగనక్కరలేదు. ఇక ముందువారి కేవిద్యాకూడా లేకపోతుందేమో. ఔరా! కాలగతి! "కొత్తనీరువచ్చి పాతనీరును కొట్టుకుపోయింది.” “హా సీతేకిం భవిష్యసి!" ప్రకృతానికి వద్దాం. ఇంతవఱకు నాపిల్లల్ని స్కూలుకెవళ్లనీ పంపనేలేదు. అక్షరాభ్యాసంతోటే రామశబ్దం మొదలుపెడుతూవున్నాను. రామశబ్దానికి కాకున్నా అక్షరాలకేనా స్కూలు పనికిరాదా? బాగా ఆలోచిస్తే పనికిరాదు. పనికిరానేరాదు. ముమ్మాటికీ పనికిరాదు. కారణాలు వ్రాయమనకండి, నా మనవి చిత్తగించి మీరే అనుభవంలోకి తెచ్చుకోండి, “ఈమీప్రతిజ్ఞ యికముందు సాగుతుందా?” అంటారా? ఆలా అడగండి. రూల్సువస్తే, టీకాలతోపాటు దీనికిన్నీ తలవగ్గుతాను. శారదాబిల్లు రజస్వలావివాహానికి సిద్ధంచేయడంలేదూ? ఆలాగే ఇదీ అనుకోండి, తప్పో వొప్పో నాకున్న అభిప్రాయం వ్రాశాను. మా ముత్తాతగారి ముచ్చటలో ఈసోదెందుకు? ఎందుకా? ఆయన ఆత్మ సంతోషించడానికి
ఇక ఆయన పద్యాలు స్వల్పంగా వుదాహరించి యీ వ్యాసాన్ని ముగిస్తాను :-
ఉ. డాలు కడానిమేను, మరుడాలునెదుర్కొనుఁజూపు, చంద్రఖం
డాలు నఖంబు, లేర్పుపగడాలు రదచ్ఛదకాంతు, లేన్గుతొం
డాలు తొడల్, మదాళిజగడాలుకురుల్, నునుదమ్మికెంపుతం
డాలు రదాళి, బర్నెబిరడాలు కుచాగ్రము లవ్వధూటికిన్.
పద్యము యామినీపూర్ణతిలకలోనిదే. యెంతమృదువుగానున్నదో చూడండి. ఈయనధార యెంతో మృదువైనది. కాని సహజమైన ధారను వదలికొని యితరుల ననుకరించడానికి మొదలుపెట్టేటప్పుడు మాత్రము యీ సొగసు పోగొట్టుకొంటాడు.
ఈయన, లోగడ నుదాహరించిన యక్షగానరచనవల్లనే సంగీత ప్రవిష్టుడని తేలుతుంది. అయినా దాని కుపోద్బలకంగా యింకొకపద్యం వుదాహరిస్తాను. దీనివల్ల యీయనకు గానమున నెంతయభిమానమో తెలుసుకోవడానికి వీలవుతుంది.
ఆ.వె. సరసులకును మోహసంపద లొదవించెఁ
బూలుపూచెఁ దరులు, రాలు గరగె
నేమిచెప్పవచ్చు నేలోకముననైన
గానమునకు సాటి గానఁగలదె?
గానమందీయన, చెట్టుక్రింది ప్లీడరువంటివాడేకాని, “సంగీత కళా రహస్యనిధి" యైన వసుచరిత్ర కవివంటివాడు మాత్రం కాడు. యేమంటే భట్టుమూర్తి కాంభోజీరాగంతో నాయకురాలిని యేడిపిస్తే, మా ముత్తాతగారు కళ్యాణీరాగంతో యేడిపించారు. దీన్నిబట్టి ఆలోచిస్తే గాలిపాటపాడే వారేకాని, రహస్యజ్ఞులు కారని తోచకమానదు. కాంభోజివలె కళ్యాణికి కరుణరసమును బ్రకటించు శక్తిలేదనుకుంటాను. అయిననూ యింకా దీన్ని గురించి గానవిద్యానిష్ణాతులు ప్రష్టవ్యులు. నాకు చేతనైనంతలో మా ముత్తాతగారి కవిత్వాన్ని గూర్చి వ్రాశాను. ఆయన యేమనుకుంటారో?
తే.గీ. పుత్రవతిరీతి పృథుకసంభూతిసమయ
గర్భనిర్భర వేదనావిర్భవంబు
వంధ్యలెఱుఁగుట యెట్లు? కావ్యప్రయాస
సుకవులకుఁగాక తెలియనే? కుకవితతికి. అనిన్నీ
“కవి చమత్కార గౌరవంబు”
తే.గీ. మనసెఱుంగునుగాక యెవ్వనితరంబు?
పాటిదెల్పఁగ నాత్మానుభవమురీతి
కాన ధారాప్రకల్పనకౌశలముల
ఫణితిఁదెలియుఁడి కవిసార్వభౌములార! అనిన్నీ
యామినీపూర్ణతిలకలో భవిష్యద్విమర్శకులనుగూర్చి వుటంకించియున్నారు. ఆయన యాత్మలో నన్నేమనుకొనునో! తోచింది వ్రాశాను. ఇప్పడీలాటి వ్రాతలకేకాబోలు, “రిసర్చి" అనే టైటిల్సు వస్తున్నాయి. కాని దీన్ని దానివంటిదాన్నిగా చదువరులు భావింపరను కొంటాను. అది యింకా లోతుగా వుంటుంది. తుండూతుపాకీగూడా యెగిరిపోతూ వుంటుంది. దాని ధోరణిలో భారతాంద్రీకరణం రాజరాజనరేంద్రుఁడిదే అయిపోతుందొకప్పుడు. కాబట్టి దానివంటిది యిది కాకూడదు.
ఈయన రచించిన ప్రబంధరాజములలో మొదటిది యామినీ పూర్ణతిలక. రెండవది వెంకటేశ్వరవిలాసము. యిది తుట్టతుది దినములలో రచించినదగుటచేత దీని రచనయే ప్రౌఢవిమర్శకు లగువారికి హృదయంగమంగా వుండవలసి వున్ననూ, పేరుమాత్రం యెక్కువగా మొదటిదానికే వచ్చింది. వేంకటేశ్వరవిలాసం రచించినట్లే నిన్న మొన్నటిదాకా లోకు లెఱుగరు. వీరేశలింగంగారు మొదటిదాన్నేకాని రెండోదాని పేరెత్తనేలేదు. మొదటిదాని శైలి చూపినాను. రెండవదానిశైలికై కొన్ని వుదాహరిస్తాను.
క. భాష్యంబు చెప్పి సకలమ
నీష్యగ్రణు లెన్నఁబ్రౌఢి నేర్పెద నీకున్
దూష్యంబులేదు దీనను
శిష్యా! ఆచెలియ జాడఁజెపుమా మాకున్.
తే.గీ. చెల్లబోదిఁక నీమాయ లెల్లఁదెలిసె
గామిడంబులు మాని చక్కంగ మసలు
వేగిరించుట పనిగాదు వినుము, చెంచు
వారికట్టడి బలుపెద్దతీరుసుమ్మ
చ. తొకతొకమానినీసవతి దోకొనివచ్చినయప్పుడూరకుం
డక యొకచాయఁ బెద్దగగలంబముఁ జేయవె? యవ్వ! యంతనుం
డిఁకఁ గడు మంచిబుద్ధిగని నిక్కము నిన్‌బతిమాలుకొంట మ
చ్చికదిరలాడకుంటె నను "సింగిహుళిక్కిది" యంచు నెంచుమీ.
తే, గీ. గామిడము సేసినాఁడవో కలిసికట్టు
సేసినాఁడవొ సామి! సెంచితయె నీకు
నిచ్చకమె పల్కిపానంబు లిచ్చినిల్పెఁ
గాకయుండిన నీమాటగానవచ్చు.
భిన్నభిన్న స్థలాలనుంచి ఉదాహరించిన పద్యాలవల్ల గ్రంథకర్త కవిత్వం చాలా ప్రసాదగుణవిశిష్టంగా వుంటుందనే కాకుండా జాతీయంగా కూడా వుంటుందని స్పష్టంగా తెలుస్తుంది. యమకానికేమి, చిత్రానికేమి, ఇంకా అనేక విధమైన త్రికమలకేమి, ఈయన పుట్టినిల్లే కనుక, ఆమోస్తరు పద్యా లుదాహరించి గ్రంథం పెంచలేదు.
కవిత్వం మావంశంలో ఈయన తరంలోనే పుట్టిందనుకోవడానికి వీలులేదుగాని, ప్రబంధరూపాన్ని తాల్చిందనిమాత్రం చెప్పక తప్పదు. ఈయనగద్యలో “కామకవిపుత్ర" అని వ్రాసుకోవడంవల్లనూ, "అశ్వత్థ నారాయణా" అనే మకుటంగల శతకం వకటి ఈయనకు పూర్వమందే మావంశస్టులు వ్రాసినట్లు ప్రతీతి వుండడంచేతనూ, ఈయనకన్న పూర్వం కూడా మావంశమందు కవిత్వం అంతోయింతో వుందనుకోక తప్పదు. పైశతకాన్ని గుఱించి మాతాతగారితో ఆయన మేనత్తకూతురు చెపుతూ వుండడమే కాకుండా, భక్తితో ఆపె వొక రావిచెట్టుకూడావేసి పెంచింది. నిన్న మొన్నటిదాకా ఆరావిచెట్టు "అమ్మిరావిచెట్టు" అనే పేరుతో వ్యవహరింపబడుతూ, జీవించివుండడం నేనున్నూ యెఱుగుదును. ఆవిడపేరు అమ్మి కనుక ఆవిడ వేసిన చెట్టుకు ఆపేరు వచ్చింది. బహుశః ఆ శతకం నేను స్కూల్లో చదువుకొనే రోజుల్లో పెద్దక్లాసువాళ్ల దస్తరంపాటుతో నాదస్తరం పెంచడానికి చేసిన తెలివితక్కువ పనిలో నశించిందేమో? ఈ సంగతి లోగడ వుదాహరించే వున్నాను.
నాకు పూర్వం చాలామంది మా వంశస్థులు కవులున్నారనే నమ్మికచేత నేను"కవితారంభప్రియంభావుకంబై మావంశము వొల్చు" అని దేవీభాగవతంలో వ్రాయ సాహసించాను. నాతరంలో నాపినతండ్రి కొడుక్కూడా కవిత్వం చెప్పేవాడు. వట్టికవిత్వమే కాకుండా దానికి తగ్గ పాండిత్యం కూడా అతనికి వుండేది. దేవీభాగవతంలో దశమస్కంధం అతడే తెలిగించాడు. అతడెక్కుడు పేరు ప్రతిష్ఠలు సంపాదించేవాడే కాని, అల్పాయుష్కుడై యిప్పటికి యిరువైయేండ్లనాడు ముప్ఫైయేండ్ల వయస్సులో స్వర్గస్థుడైనాడు. మంచిగాని, చెడ్డగాని వంశమం దున్నట్టయితే అది అనుశ్రుతంగా వస్తుందన్నందుకు నేను వ్రాసిన సంగతులు కొంత దృష్టాంతం కావచ్చును. తిరుపతిశాస్త్రిగారి తరంలోతప్ప వారి వంశమందీ కవిత్వం వున్నట్టులేదు. మళ్లా తిరుపతి శాస్త్రి కొడుకు పెద్దవాడు కవి. పోనీ తండ్రి కవిగనుక అతనికది సంక్రమించిందనుకుంటే, అతని అన్నకొడుక్కూడా కవి. దీన్నిబట్టి వంశంలో వుండనే అకర్లేదనిన్నీ తోస్తుంది. కొడుకులే అక్కఱలేదు. కవుల కూతుళ్లుకూడా కవిత్వం చెప్పడం కలదు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రులవారి కొమార్తె యిందు కుదాహరణం. వాళ్లు అయినా కాకపోయినా, తండ్రికి మాత్రం తనవిద్య తన సంతానానికి రావాలి అనే కోరిక వుంటుంది. దాన్నిబట్టిసాధ్యమైనంతవఱకు దాన్నే అభ్యసింప చేయాలని ప్రయత్నం తండ్రిచేస్తాడు. ఇప్పటికాలంలో మాత్రం లాభాపేక్షచే చాలా మంది తండ్రులు ఈ వుద్యమాన్ని వదలుకొన్నారు. ఇంకా నాబోటి చాదస్తులు ఈ వుద్యమంలోనే వున్నారు.
నిన్నమొన్నటినుంచి నావంటి చాదస్తులనికూడా అభినందించేవారు రాజకీయ విద్యాభాస్యం చేసినవారిలో కనపడుతూన్నారు గాని, యింతకు ముందు మాత్రం అట్టివారు బొత్తిగా లేరు అని వ్రాసేవున్నాను. కాని ఆలాటి రోజులలోనే నేను ఫ్రెంచి చదువుకుంటూ వుంటే, బెజవాడ బాపనయ్య నాయడుగారనే ఆయన మా తండ్రిగారిని పిలిచి “మీపూర్వులు కవీశ్వరులు, మీ అబ్బాయి కిదెందుకు? కులవిద్య చెప్పించండి, (కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా)” అని ప్రోత్సాహపరచి శ్రీకానుకుర్తి భుజంగరావుపంతులువారివద్ద నన్ను వప్పగించారు. ఈ బాపనయ్య నాయడుగారు నామమాత్ర శూద్రులు. తేజస్సుచేతనేమి, తెల్వితేటలచేతనేమి, ఈయన కెంతటిమహారాజులున్నూ సాటికారు. ఈయన యానాం కాపురస్థులు. ఫ్రెంచిరాజ్యంలో ఈయన వుద్యోగధర్మంచేత ఏకచ్ఛత్రాధిపత్యం చేశారు. మిక్కిలి భగవద్భక్తులు. నేను భీష్ముణ్ణి చూడలేదుగాని, ఈయన విగ్రహం తలపులో పొడకట్టినప్పుడు భీష్ముడే యీలా అవతరించినట్లభిప్రాయపడతాను. నాకు కులవిద్య రావడానికి మా ముత్తాతగారి ప్రతిష్ఠతో పాటు ఈ నాయడుగారుకూడా కారణం గనుక కొంచెం కృతజ్ఞతను తెల్పడానికి కొన్ని పంక్తులు ఈయన్ని గుఱించి యిక్కడ వ్రాశాను. మా పిల్లల్లో కూడా ఈ కవిత్వం అంతో యింతో వ్యాపించేటట్టు తోస్తుంది. దీనికంతకూ కారణం మా ముత్తాతగారే కనుక, ఆయనకు మాటి మాటికీ నమస్కరిస్తున్నాను. తరవాత పండితులవుతారో, కారో అది భగవదిచ్చగాని మోటుగా వుండే "శాస్త్రి" పేరే వుంచాను. భగవంతుడు వాళ్లను సర్వదా ఫలానా వంశస్టులనునట్లు అనుగ్రహించుగాక!
★ ★ ★