కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/వెనకటి పండితులు



వెనకటి పండితులు

వీరు చాలా అసిధారావ్రతంగా జీవయాత్ర గడుపుకున్నారని గురువులవారు చెపుతూవుంటే వినడమేకాదు కొందఱిని నాబాల్యంలో ప్రత్యక్షంగా చూచికూడా వున్నాను. ముఖ్యంగా వీరి జీవయాత్రకు కావలసింది నీటి సదుపాయం. అదేనా వ్యవసాయానికి వుపకరించేది కాదు, స్నానపానాలకు మాత్రమే. యిచ్చేదాతలు బహుమందివున్నా ప్రతిగ్రహణమంటే వీరికి చచ్చిన చావుగా వుండేది.

“పయః ప్రసృతిపూరకం కిమున ధారకం సారసమ్”

అన్నమాదిరిగా కాలాన్ని వెళ్లిద్దామనేకాని స్విష్టకృత్తుగా ఉదరాన్ని పూరించుకుందా మనేవాంఛ వీరిలో యేకొందఱికో తప్ప వుండేదేకాదు. కాలేకడుపుకు మండే బూడిద సామెతగా కాలం గడిపేవారు. యెంతసేపూ శిష్యులూ, వాళ్ల పాఠాలూ యేలోపమూ లేకుండా జరగడమే వీరికి కావలసింది. వీరి జీవయాత్రను యీపద్యం చెబుతుంది.

మ. చదువుల్ విస్తరికుట్లు జందెపుఁబనుల్ చాపల్ మఱిన్ దొడ్లలోఁ
     బొదలుం గూరలుగాఁగ వర్తిలిరి తద్భూమీసురుల్ నేఁటిసం
     పద “మోటారులు” మేడ లోడలునుగా మాఱెంగదా? వీరి కు
     న్నదె యవ్వారల తృప్తి వారిసుఖమానందంబుఁ గామేశ్వరీ.

ఆయీ మాదిరిని కాలక్షేపం చేసేవారిని ప్రత్యక్షంగా నేను చూచి వున్నాను. రఘువంశం చదువుకొనేరోజుల్లో వొకరిదగ్గర పరాయత్పన్నాలు చెప్పుకోవడానికి శుశ్రూషకూడా చేసివున్నాను. ఆ వొజ్జగారి జీవయాత్రా విధానాన్నే పైపద్యంలో నేను వుటంకించాను. అటుతరువాత శుశ్రూషచేసిన గురువులు కూడా పైపద్యానికి వుదాహరణంగా వుండేవారే గాని మఱోమాదిరివారు కారు. రఘువంశపు గురువుగారు (కానుకుర్తి భుజంగరావు పంతులుగారు) మాత్రం ఆగర్భశ్రీమంతులు కావడంచేత దేవతార్చన స్వయంగా చేయడం యెపుడోగాని తటస్థించేదికాదు. దానికోసం వొక బ్రాహ్మణుఁడు నియమితుఁడు వుండేవాcడు. ఆ పండితులకి మనకి సంసారం యేలా గడుస్తుందనే ఆందోళన వున్నట్టు కనపడేదికాదు. మా పరమగురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రుల్లు గారి జీవయాత్ర మఱీ ఆశ్చర్యకరంగా వుండేది. యింకా ఆయన్ని యెఱిఁగిన ఆకాలపు మనుష్యులు కొందఱు అక్కడక్కడ వుండఁబట్టిగాని లేకపోతే నేను ఆయన్నిగుఱించి వ్రాసేవాక్యాలు శుద్ధ అబద్ధాలే అనుకుంటారు యిప్పటివాళ్లు. అయ్యయ్యో ఆజీవితానికిన్నీ యిప్పటి వారి జీవితాలకీ లేశంకూడా పోలికేలేదు. యిప్పుడు భాధాంతం తర్కం చదివినా సరే, భాష్యాంతం వ్యాకరణం చదివినాసరే, వారిని ఆదరించేవారు లేకపోవడంచేత మళ్లా భాషా ప్రవీణపరీక్షకు చదివి ప్యాసై అక్కడినుంచి వారినీ వారినీ ఆశ్రయించి సిఫారసుత్తరాలు సంపాదించుకొని యేస్కూల్లోనేనా పండితపదవి సంపాదించుకోడానికి యజమానులదగ్గరకి కాళ్లరిగేటట్లు తిరిగీనిన్నీకృతార్థులు కాలేనివారినిచూస్తే యెంతో విచారం వేస్తుంది. యింకోవిశేషం : ఆ యీ వుద్యోగప్రదాతల్లో కొందఱు నిన్నా నేఁటిదాఁకా నిషధయోగ్యులుగా వుండి ఆఖరికి పంచతంత్ర మార్జాలాలుగా మారడంచేత కొందఱిస్థితి మఱీ శోచనీయంగా మాఱింది. పాపం పెళ్లాం పుస్తే పూసా అమ్మి వారిని సంతోషపెట్టాక ఆయీ సంతోషపెట్టిన వాళ్లలో కొందఱికి ప్రతిఫలం కలిగించేటంతలో – “భాషామంజరీ సమాప్తా" అన్నట్లుగా యేదో అవాంతరం వచ్చి వారికివున్న అధికారంకాస్తా వూడి పోవడం (అధికారాంతము నందుఁ జూడవలదా! ఆ యయ్య సౌభాగ్యముల్) తటస్థమై తక్కినవాళ్లగతి - "రెంటికి చెడ్డ రేవణ” కావడం వింటే యెవరి మనస్సుకేనా విచారం కలక్కపోదుగదా? వెనకటి పండితుల్ని యెన్ని విధాల బలవంతపెట్టినా, బతిమాలినా భృతకోపాధ్యాయత్వానికి “ససేమిరా” అనడమేకాని ఆమోదించడమంటూ వుండేదే కాదు. యిప్పుడో ఆ మహా పదవికి లంచపంచాలుకూడా సమర్పించడమే కాకుండా పడరాని పాట్లన్నీ పడడంచేస్తే, పృథివి పుట్టింది మొదలు యీలాంటి దరిద్రదశ పాండిత్యానికి పట్టలేదనే అనుకోవాలి. యీలాటి వారిని ఆవుద్యోగప్రదాతలు యీసడించారంటూ చాటునా మాటునా వీరు సణుక్కోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయీ యీసడింపు “నాన్ బ్రామిన్సు మూమెంటు" మూలంగా వచ్చిందంటూ కొందఱు సణుక్కుంటారు. యివి మఱీ పిచ్చి మాటలుగా నాకు కనపడతాయి. పండితుఁడు వుండవలసినవిధంగా వుంటే యే “మూ మెంట్లూ" వారిని యీసడించకపోను. వృథాగా అన్యాయ ప్రవర్తనకు అధికారికి మార్గం చూపే యీపండితులమీఁద గౌరవం “నాన్ బ్రామిన్సు" కే కాదు “బ్రాహ్మిన్స్"కు మాత్రం యేలావుంటుంది? ఆకాలపు పండితులు బుఱ్ఱపోయినా సరే లౌకికవ్యాపారాల్లోకి అడుగుపెట్టేవారు కారు. చామర్ల కోట భీమవరంలో గుండుచేన్లుగారంటూ వొక వుడూలప్పండితులు వుండేవారఁట. ఆయనకి వసతివాడు లేమీలేవు. ఆకాలంలో వారుయత్నిస్తే యే. జమీందారులేనా ఆదరించి వసతివాడులు కల్పించి పూజించేవారే. కాని అందుకు ఆయనకి లేశమూ యిష్టం లేకపోవడంచేత కుటుంబపోషణకి యాయవారం చేయడం మొదలుపెట్టారని విన్నాను. “చామర్లకోటలోఁ జదివితి రాఘవాచార్యు సన్నిధిని" అనే రాఘవాచార్యులవారు యీ చేన్లుగారి శిష్యులే. అయితే యాయవారం మాత్రం ప్రతిగ్రహణంకాదా! అని కొందఱు అనుకుంటారేమో? యేదో విధానాన్ని కుటుంబపోషణ జరగాలి కనక అప్పటి పండితులు, “యదహ్నాత్కురుతే పాపం" గా ఆ యీ వృత్తిని ఆశ్రయించడానికి సమ్మతించేవారు. (కుక్కదానం పట్టి కుటుంబాన్ని పోషించమని సామెత.) బులుసు అచ్చయ్యగారు నప్రతిగ్రహీతలుగా (పదేసి వేలు, యిరవైయేసి వేలు ఆయాచితంగా యింటికి స్వయంగా పట్టుకువచ్చి యిచ్చే దాతలు వుండఁగా కూడాను) వుండి వుండి ఆఖరికి జన్మానికల్లా శివరాత్రిగా వొక్కమాటు కాఁబోలు హైదరాబాదా దివాన్ చందోలాలాగారి వద్ద వొక నిలువు చెంబెఁడు పూల వరహాలు పరిగ్రహించారని వినడం. అదేనా యెందుకు తటస్థించిందంటారు? భార్య వీథిగుమ్మం అలుకుతూ వుండఁగా అచ్చయ్యగారు యీవాళ యింట్లో శాకపాకాలేమిటి అని ప్రశ్నించారనిన్నీ దానిమీఁద ఆ మహాయిల్లాలు హేలగా “యేమున్నాయి, యిత్యర్థల పులుసూ, యితిభావల కూరా" అన్నదనిన్నీ అది విని ఆవిడహృదయం ధనాశా విద్ధంగా వున్నట్టు (పరేంగితజ్ఞానఫలాహి బుద్ధయః) గ్రహించి సదరు అచ్చయ్యగారు (యీయనకీ వేదశాస్త్రాలు యావత్తూ వచ్చివుండడంచేత యే పేరూ చివర తగుల్చుకోడానికి వీలుగాక పుట్టు పేరుతోనే వుండిపోయారని చెప్పకుంటారు) నీవు ఎంతసొమ్ము తెచ్చియిస్తే సంతోషిస్తావో ఆసంగతి మళ్లామళ్లా కాక ఒకమాటే విధిస్తే తెచ్చియిస్తానని ప్రతిజ్ఞచేశారనిన్నీ ఆ అమాయకపు యిల్లాలు ఆ సమయానికి తన చేతిలోవున్న నిలువుచెంబు (యా ఖర్వేణపిబతి తస్యైఖర్వః అని వేదం) చూపి దీఁనెడు వరహాలు కావాలందనిన్నీ తరువాత ఆ చెంబు చేత పుచ్చుకొని ఆపూటే ప్రయాణమై హైదరాబాదులో అన్ని వరహాలూ దివాన్‌జీగారివద్ద పరిగ్రహించి తెచ్చియిచ్చి ఆవిడకి సంతుష్టిని కలిగించారనీ చెప్పుకుంటారు. అచ్చయ్యగారు అంతకంటె అధికంపుచ్చుకోక పోవడంచేతంగాని చందోలాలాగారి యీవి అంతమాత్రంతో ఆగేదికాదు. యిచ్చేవాఁడు దొరికాఁడుకదా అని యావత్తుకూ ఔపాసన పట్టేవాఁడైతే అచ్చయ్యగారు చరిత్రపురుషుఁడెలా అవుతాఁడు? అస్మదాదులకు వారిని గుఱించి ముచ్చటించుకొనే అధికారం కూడా లేదనిపిస్తుంది నాకు. చేన్లు గారి యాయవారంలో అచ్చయ్యగారు అవాంతరంగా వచ్చి తగిలారు. ఆయన యాయవారానికి బయలుదేరారంటే? యేమన్నమాట? సాక్షాత్తు ఈశ్వరుఁడు (అణిమాద్యష్టైశ్వర్యోపేతుఁడు) వెండికొండ గుహలో నివసించేవాఁడు బంగారుకొండ చేతులో కలవాఁడు ప్రత్యక్షమైనాcడన్నమాటేకదా? యిఁక చూడండీ! కుంచాలక్కుంచాలతో కమ్మయిల్లాండ్రు గుమ్మరించేవారు బియ్యాన్ని అవి సమాప్తమయే దాఁకా ఆయన మళ్లా బయలుదేఱేవారే కారు. బహుశః వారానికోసారి వెళ్లవలసి వచ్చేదేమో? అయితే బయలుదేరిన రోజున వొక బస్తా బియ్యానికేనా చావు లేదుగదా? వీట్లని చేన్లుగారే మోసుకునేవారా? అంటారేమో? వారెందుకు మోసుకోవాలి? కూడా శిష్యులున్నారుగదా బోలెడుమంది. బస్తా కాదు యెన్నిబస్తాలేనా మోస్తారు. ఆదృశ్యం నేనైతే చూడలేదుగాని చూడవలసిన దృశ్యం మాత్రం అవును. పండితుఁడైన వాఁడికి నెత్తిమీఁద తట్టతలపాగా తగుల్చుకొని భృతకోపాధ్యాయత్వాన్ని ఆచరించడంకంటె యాయవారం యెత్తుకోవడమే శోభస్కరంగా వుండేదేమో? అప్పటి కాలంలో, యెవ్వరో అలాంటి మహనీయులు అవలంబించే ఆ వృత్తిని యిప్పుడు బడుద్దాయులందఱూ అవలంబించారు. తత్తధాస్తాం. ఈ కాలపు ఉపాధ్యాయత్వమంటారా? శ్లో. అర్థానా మార్టనే దుఃఖ మార్జితానాంచ రక్షణే. అనే శ్లోకార్థానికి సంబంధించి వుంటుంది. పూర్వప్పండితులు వీట్లని నిరసిస్తారని చెప్పడంతో అవసరమే లేదు. యీగతి “డిగ్రీలు" సంపాదించి ఆర్జించుకొన్న వుపాధ్యాయత్వానికి సంబంధించినది- పూర్వప్పండితులలో ఎవరో తప్ప దీనికి ఆమోదించేవారు కారని వ్రాసే వున్నాను. యేనుగులను పట్టుకొని తీసుకువచ్చేవాళ్లు వాట్లకి మొట్టమొదట నల్లమందు అభ్యాసం చేస్తారనిన్నీ దానికి అలవాటు పడ్డాక దానికోసం అవి స్వాధీనపడి వాళ్లకి లొంగిపోయి “దాసోహం” అంటాయనిన్నీ చెప్పఁగా వినడం. అలాగే పూర్వప్పండితులలో యేకొందఱో భృతకానికి అలవాటుపడిదీర్షా యుర్ధాయం పట్టడంవల్ల జీవితకాలంలోనే ఆనల్లమందు ప్రదాతలచేత పాఠశాలనుండి తొలఁగింపఁ బడవలసి వచ్చినప్పుడు యెంతో దైన్యానికి గుఱికావలసి రావడం అందఱూ యెఱిఁగిందే కనక విస్తరించేది లేదు. (యీ దైన్యం అనుభవించినవారిని పేర్కోవలసివస్తే చాలా విస్తరిస్తుంది వ్యాసం) భృతకో పాధ్యాయత్వానికే కాదు. మహారాజాస్థానంలో పండితపదవి కూడా ఆకాలప్పండితులలో చాలామంది అంగీకరించడం అరుదుగానే వుండేది. కొవ్వూరు గోపాలశాస్త్రుల్లుగారినీ, భాగవతుల హరిశాస్త్రుల్లుగారినీ విజయనగరం మహారాజులుంగారు కాశీనుంచి పెద్ద ప్రయత్నంచేసి తీసుకువచ్చారని తజ్ఞుల వల్లవిన్నాను. విజయనగర సంస్థానంలో పండితులకు వుండేగౌరవం అసాధారణం. కొందఱు జమీందారులు పండితుల్ని గౌరవవేతనాలిచ్చి పోషించడమైతే వుంటుందిగాని అది మనోవర్తి (భరణం) మాదిరిని వారు అనుభవిస్తూ వుండడంమట్టుకేగాని వారి గోష్ఠికి ఆ జమీందారులు అవకాశం యివ్వడం వుండనే వుండదు. విజయనగరప్పద్ధతి అలాటిదికాదు. ప్రతిదినమూ పండితగోష్ఠి కంటూ కొంతటైము రిజర్వుచేసి వుంచి ఆ టైముకు రాజుగారికి యితర తొందర పనులేవేనా వున్నట్టయితే ఆ పండితులసభకు వచ్చి నమస్కారాది సంభావనలు జరిపి ఆశీర్వచనాన్ని పుచ్చుకొని వారి ఆజ్ఞను పొంది ఆవలి రాచకార్యానికి వెళ్లడం ఆచారం. ఈ ఆచారం యిప్పుడేమేనా మాఱిందేమో కాని ఆనందగజపతి మహారాజులుం గారి ప్రభుత్వకాలంలో లేశమూ మాఱలేదని యెఱుఁగుదును. సంస్థానగౌరవంగాని, పండిత గౌరవంగాని మన ఆంధ్రదేశంలో ఆనందగజపతితో అంతరించిందంటే అంగీకరించనివారుంటారని నేను అనుకోను. ఆ కాలంలో వుండే పండితుల మర్యాదలు యిప్పటివారికి మఱికొందఱికి అంతగారుచించవని యెఱిఁగిన్నీవొకటి యిక్కడ వుటంకిస్తాను. మహామహోపాధ్యాయ (పూర్వం యీ బిరుదు యీలాటి వుద్దండులకు వుండేది) శ్రీ పరవస్తు రంగాచార్యుల వారు విజయనగరానికి సన్నిహితంగా వుండే విశాఖపట్టణ నివాసులైవుండి కూడా ఆ సంస్థానానికి వెళ్లనేలేదు. దానిక్కారణం వారి మర్యాదలకు సంస్థానంవారు సమ్మతించక పోవడమే. ఆచార్లవారికి వారి మర్యాదలకు సంస్థానంవారు సమ్మతించకపోవడమే. ఆచార్లవారికి వుండే మర్యాద లేలాటివంటే! కోట ఆవరణదాఁకా సవారీమీఁద వెళ్లడమున్నూ రాజసభలోకి పాదుకలతో నడిచి వెళ్లి ఆస్థానంలో స్వంత చిత్రాసనం మీఁద కూర్చోవడమున్నూ. బాగా ఆలోచిస్తే పాండిత్యానికి తగ్గ వేషభాషలంటే వైష్ణవులవే. యిందులో చివరదానికి మహారాజులుంగారు సమ్మతించఁ జాల మన్నారఁట. యెందుచేతనంటే? మీవంటి పరమపూజ్యలను మేము మీ ఆచారప్రకారం పూజించడానికి అభ్యంతరం లేదు గాని అది మా సంస్థానపండితులకు అవమానకరంగా వుంటుంది కనక అంగీకరించమన్నారఁట. ఆ పద్ధతిని మీ సంస్థానానికి మేము రాజాల మన్నారఁట ఆచార్యులవారు. (ఆ యీ సంగతులు నేఁటివారు పిచ్చిగా భావిస్తారు) అంటే. అంతతో కథ ముగిసింది. "సా కిం న రమ్యా నచ కిం నరంతా బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా" వుర్లాం పేరుకు చిన్నజమీనే అయినా పండితసత్కారం పరీక్షించి చేసేది కావడంచేత మన దేశంలో దాని పేరు ప్రతిష్ఠలు చాలా వ్యాపించాయి. యే యూనివర్సిటీకికూడా దానికున్నంత అధికారంలేదు. ఇచ్చేదేమో సా 1 కి 12-0-0 రూపాయిలు మాత్రమే కాని చేసే పరీక్ష మాత్రం నూటికి నలభై మార్కుల బాపతుకాదు. నూటికి నూరూ రావడం విధి. దీనిలో యేమాత్రం తగ్గినా దానిలోటు యిచ్చే రు 12-0-0 లలో అణో అర్ధణో కానో తుదకి పైసో తగ్గించి మఱుసటి సంవత్సరం ఆలోటు భర్తీ అయిన తరవాతే పూర్తి వార్షికం యిచ్చేవారు. ఆ సంస్థానంలో పరీక్షాధికారులుగా వుండే పండితులకు మాత్రం నూటపదహార్లు వార్షికము వుండేది. రంగాచార్లవారు శాస్త్రాలకు పరీక్షాధికార్లు. వీరిని వంచించాలని కొందఱు పండితులకు కుతూహలం కలిగి మంత్రవాది లక్ష్మీనారాయణ శాస్తుర్లుగారిని ప్రోత్సహించినట్లున్నూ, వారు వారి కుతూహలానికి అనుగుణంగా రెడ్డిగం వేసుకొని కూర్చున్నట్లున్నూ జమీందారు బసవరాజుగారు అది చూచి - "అయ్యా! రంగాచార్లగారు దయచేస్తున్నారు. రెడ్డిగం తీసివేయవలసిం” దనేటప్పటికి వినీ విననట్లు అనాదరించి శాస్త్రుల్లుగారు వూరుకున్నారనిన్నీ తరువాత క్రమంగా అది ముదిరి నన్ను జయించే పండితులు వచ్చేటప్పుడుగాని యీరెడ్డిగం నేను తీయవలసి వుండదని లక్ష్మీనారాయణ శాస్త్రుల్లుగారు జవాబు చెప్పడం తటస్థించిదనిన్నీ యింకా యేమో యేమో పండితులు చెప్పుకోఁగా విన్నాను. రంగాచార్లవారు షడ్దర్శనీపారంగతులు, లక్ష్మీనారాయణ శాస్త్రుల్లుగారు వ్యాకరణ శాస్త్రంలో మిక్కిలీ అభిమానంగల మహాపండితులు. అంతమాత్రమే కాదు, ఆయన సభలో సంస్కృతం మాట్లాడుతూవుంటే సాక్షాత్తూ మహాభాష్యాన్ని మఱపించే వుండేదఁట వాక్యరచన. రంగాచార్లవారికి అభిమానశాస్త్రం తర్కం. నాఁటి సభలో లక్ష్మీనారాయణ శాస్త్రులుగారు రంగాచార్యులవారికి అభిమాన శాస్త్రమైన తర్కంలోనే రంగాచార్లగారితో శాస్త్రార్ధంచేసి పండితులను మెప్పించినట్లు చెప్పకోఁగా విన్నాను. ఆలాటి సర్వతోముఖ పాండిత్యాలు క్రమంగా కాలదోషమో? ఏమో? చెప్పఁజాలంగాని “గానుగు రోకలి సిద్దిపిడి"గా మార్పుచెంది నానావిధ దైన్యాలకి పాల్పడుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఆనాఁటి పండితులకు కొన్ని నియమాలు వుండేవి. అపరగౌతములని ప్రసిద్ధి వహించిన కీ శే శ్రీపాద రామశాస్త్రులుగారికి (వీరు తమ్ములున్నూ శిష్యులున్నూ అయిన లక్ష్మీనరసింహ శాస్త్రులు గారు సజీవులు, చాలావృద్దులు, మళ్లా అన్నగారంతవారు, పిఠాపురాస్థాన విద్వాంసులు) వొక నియమం వుండేది. గృహస్థు (యెంత ఐశ్వర్యవంతుఁడైనా సరే) ఒకరూపాయికంటె అతనివద్ద యెక్కువ పుచ్చుకోమని నియమం. జమీందారువద్ద రు 10-0-0 కంటె అధికం పుచ్చుకోమనీ నియమం. వారి జీవితం ఆ నియమం భంగం లేకుండానే జరుపుకున్నారు. వారిని నేనుస్వయంగా యెఱుఁగుదు. యీ దేశంలో యిప్పుడెవరేనా నైయాయికులు వుంటే వారికి శిష్యులో ప్రశిష్యులో అయివుంటారు. యీ మధ్య కలకత్తా ప్రెశిడెన్సీ మిడ్నపు ప్రాంతంలో “శ్రీరామకృష్ణమిషన్" లో విద్యాభ్యాసం చేస్తూన్న విద్వాన్‌మైలవరపు పూర్ణానందం నాపేర వుత్తరం వ్రాస్తూ, వ్రాశాఁడుకదా మీ విద్యార్థిదశలో మనదేశంలో విద్యాభ్యాస పద్ధతి యేలాగు వుండేదో యేదేనాపత్రికకు వ్రాయవలసిందంటూ కోరివున్నాఁడు. దీన్నిబట్టిచూస్తే మనకు పూర్వం యెలా చదువుకొనేవారో కూడా యిప్పటివాళ్లకు పుస్తకాలదగ్గిఱికి వచ్చిందని తేలుతూవుంది. అతనికోరికనుబట్టి పనిలోపని ఈ మాటలూ వ్రాస్తూన్నాను. గురువులు యే సామాన్యులోతప్ప సుప్రసిద్ధభృతకోపాధ్యాలుగా వుండడానికి యిష్టపడేవారు కారు. "పంచమే౽షష్ఠేవా శాకం పచతి స్వేగృహే"గా జీవయాత్ర సాఁగిస్తూ పరమ బుద్ధితో శిష్యులను సుతనిర్విశేషంగా ఆదరించి విద్య చెప్పడమే వారి కృత్యం. (పైCగా కడుపునిండా అన్నం తినడానికి తగ్గంత వసతి వారు సంపాదిస్తే ముందువాళ్లు చదువుకోక చెడిపోతారని వారికి పెద్ద భయం వుండేది.) శిష్యులు చేసే ముఖ్య శుశ్రూష (ఉపచారమన్నమాట) గురువు గారి నీర్కావిబట్టలు వుతకడం, విస్తళ్లకు ఆకులుకోసి పట్టుకురావడం (అదేనా అనాధ్యాయాలలోనే) యింత మాత్రం మట్టుకే. శిష్యులు కొందరు వారాలు చేసుకొనిన్నీ మఱికొందఱు మాధుకరం చేసుకొనిన్నీ క్షున్నివకావించుకుంటూ చదువుకొనేవారు. మావారణ గురువుగారి గ్రామం (కడియె మిక్కిలి కుగ్రామం కావడంచేత శిష్యుల పోషణాన్ని గురువుగారే భరించేవారు. ఆలా భరించడంచేతనే “తిండికై యిల్లిల్లు తిరగనీయక మేయన్నదాత మాకింటనిడియె" అని వ్రాశాము. మా గురువులకు పూర్వకాలంలో మాట చెప్పలేము గాని, ఆ కాలంలో మాత్రం అన్నంకూడా విద్యాదానం చేసిన గురువులు మా పరమ గురువుగారు మాత్రమే. అయితే వీరు అగ్రహారీకులుగానీ వసద్దారులుగాని కారు. -

ఉ. ఉన్నది రెడ్డిసీమ తమకుండెడి దించుక వృత్తిదానికె
    న్నెన్నియొ యోగముల్ కుదిరెనేని ఫలించు ఫలించు దానిలోఁ
    దిన్నదిగాక తారయితు దెచ్చి యొసంగు ఫలం బదెంత హె
    చ్చున్నను వీరి కొక్క నెల యోపునొ? యోపదో? సందియమ్మగున్.

ప్రస్తుతానికి యీ పద్యం వొక్కటీ చాలును. యింకా కావలిస్తే జాతకచర్యలో చూచుకోండి. మా గురువుగారికి కుటుంబంకంటే కూడా శిష్యవర్గపోషణబాధ్యతే హెచ్చు. వీళ్ల పోషణమాత్రమే కాదు, పెళ్లి పేరంటాల విషయంలోకూడా తఱుచు వారే జోక్యం కలిగించుకొనేవారు. “పెండ్లి పేరంటముల్ ప్రియ మెలర్పఁగఁజేసి యే గుణనిధి మమ్ము బాగుచేసే” అనే సీసపద్యం పైసందర్భాన్ని వ్యాఖ్యానిస్తుంది. 'ఉదార హృదయానాంతు వసుధైవ కుటుంబకమ్" మా గురువుగారి గ్రామానికి నాతి దూరంలోనే వుంది జల్లిసీమ. ఆసీమ ధ్యానప్పంటకి పెట్టింది పేరు. ఆరోజుల్లో కాటాబస్తా వెల రు 2–0–0 లకు మించివుండేదికాదు. యుక్త కాలంలో మా గురువుగారు ఆసీమకు సంచారార్థం సవిద్యార్థికంగా బయలుదేఱేవారు. వీరు వెళ్లడమే తడవుగా ఆసీమ వాస్తవ్యులు క్షత్రియులు వారివారి శక్త్యనుసారంగా ధాన్యం పోగుచేసి పడవకి యెగుమతీకూడా స్వంతమనుష్యుల చేతనే చేయించేవారు. ఆ రాజులు మా గురువుగారెప్పుడు వస్తారా? అని ప్రతీక్షిస్తూ వుండేవారు. ఒక బస్తాకంటె తక్కువ యిచ్చిన గృహస్థును నేను యెఱుఁగను. సరే సంవత్సరానికీ సరిపడ్డప్రధాన పదార్థం గాదెలో నిలవుండేది. కూరా నారా స్వంత పెరట్లోనే పండేవి. యిఁక చెప్పేదేమిటి?... “మహాభాష్యంవా పాఠయేత్, మహారాజ్యంవాపాలయేత్" అన్నట్లు కాలక్షేపం జరిగేది. పెంకుటిళ్లు కట్టుకుందామనిగానీ వస్తువాహనాలు సంపాదించుకుందామనిగాని వారికి వాంఛ వున్నట్టే లేదు. పెట్టేబేడా వున్నట్టు లేదు. విభూతిసంచి మాత్రం వొకటి వుండేది, అందులోనే రూపాయి, అర్ధా వుంటే నిలవచేయడం.

ఉ. పెట్టెలు లేవు కల్గినను బీగమునున్న విభూతిసంచియే
    పట్టుదొకండు భూతి నిడు బంగరపున్ గనిగాఁగ రాజు రా
    జట్టులు శిష్యవర్గమున కన్నము విద్యయు నిచ్చు వేలుపుం
    జెట్టుల మద్గురూత్తములఁజెప్పి మఱొక్కరి నెట్లు సెప్పుదున్.

ఆయీ విశేషాలు వ్రాస్తే చాలా వ్రాయాలి. మఱొకప్పుడు చూచుకుందాం. తెల్లవారుజామున పాఠాలకు ప్రారంభం చేసేవారు. తక్కువ పాఠం వాళ్లకి ముందు ప్రారంభం. ఆ పాఠాన్ని పై తరగతివాళ్లంతా వినడం ఆవశ్యకం. యీ నియమం శాస్త్రపాఠాలకి మాత్రమే. కావ్యపాఠాల వాళ్లకి గురువుగారు చెప్పడంలేదు. విద్యార్థులలో పెద్దతరగతివాళ్లే చెప్పేవారు, గురువుగారివద్ద చెప్పుకొన్న శాస్త్రపాఠాన్ని క్రిందితరగతి వాళ్లకి పై గ్రంథాలు చదువుకొనే విద్యార్థులు చింతన చెప్పేవాళ్లు. ఆయీ విధంగా కష్టిస్తేనే తప్ప శాస్త్రం స్వాధీనంకాదు. యీ విధంగా అభ్యసించి నప్పటికీ యేకొందఱికోతప్ప సర్వేసర్వత్ర శాస్త్రం స్వాధీనంకాదు. (శ్లో. కేచిద్భగ్నాః ప్రక్రియారంభకాలే... సర్వేభగ్నాః కారక ప్రక్రియాఃయామ్) యీలాటి శాస్త్రాన్ని చదవకుండానే చదివినట్లు (పుస్తకం మాత్రం సంపాదించి స్వయంగా చూచుకొని అన్నమాట) నటించేవారికి శాస్త్రం యెంతవఱకూ స్వాధీనపడుతుందో వ్యాఖ్యానించనక్కఱలేదు. తర్క పాఠాలకు కూడా విధానం అంతా యిలాగే వుంటుంది. మా గురువుగారికి సమకాలీనులు శ్రీపాద రామశాస్త్రుల్లుగారిని గూర్చి లోఁగడ వుదాహరించే వున్నాను. వారి శిష్యులలో అగ్రేసరులు సంగమేశ్వర శాస్త్రుల్లుగారు. వీరి గ్రామం యేదో నాకు బాగా తెలియదుగాని శిష్యులకు అన్నోదకాలు నిరంతరాయంగా దొరకే గ్రామమని చెప్పి వీరు కాకరపర్తిలో ప్రత్యేకించి మకాంపెట్టారు. వొక పుష్కరకాలం సుమారు వీరు ఆ గ్రామంలోనే వుండి ఆ గ్రామవాస్తవ్యులకే కాక యితర గ్రామాలనుంచి వచ్చిన విద్యార్థుల క్కూడా పుష్కలంగా విద్యాదానం చేశారు. ఆ రోజుల్లోనే రేగిళ్ల అబ్భిశాస్త్రుల్లుగారి శిష్యులు మహాప్రసిద్దులు మంధా చెన్నయ్యశాస్త్రుల్లుగారు పేరూరు గ్రామంలో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారుండేవారు. తర్కశాస్త్రంయావత్తూ అనర్గళంగా పాఠంచెప్పేవారే అయినా ప్రకరణాలు మాత్రం వారు చెప్పినట్టు యెవ్వరూ చెప్పనే లేరనేప్రతిష్ఠ వారికి రిజిష్టరయి వుండేది. అక్కడ ప్రకరణాలమట్టుకుచదువుకొని తరవాయికి సంగమేశ్వర శాస్త్రుర్లుగారి దగ్గిఱికి వచ్చేవారు. విద్యార్థుల భోజన సౌకర్యం కొఱకు గురువులు స్వగ్రామం వదిలిపెట్టి వలస వెళ్లేవారనడంచేతనే అప్పటి గురువులకు విద్యార్థులందుండే వాత్సల్యం యెలాటిదో తెలుసుకోవచ్చును. యీ సంగమేశ్వర శాస్త్రుర్లుగారు తర్కశాస్త్రంలో వొక క్రోడగ్రంథం కూడా రచించి పండిత సమ్మతిని పొందిన మహావిద్వాంసులు. వీరితో మన దేశంలో గ్రంథకర్తృత్వం దాఁకావచ్చిన పండితులు ఆఖరయినారని అనుకోవచ్చును. వ్యాకరణానికి రాయుఁడు శాస్త్రుల్లుగారితో స్వస్తి. తర్క వ్యాకరణాలు యిప్పుడు కూడా క్రొత్తమార్గంలో డిగ్రీ సంపాదన పరమలక్ష్యంగా పెట్టుకొని అభ్యసిస్తున్నవారు లేకపోలేదుగానీ, యీ బాపతునుంచి గ్రంథకర్తలదాఁకా వచ్చేవారుంటారని తోఁచదు. (భాషామంజరీ సమాప్తా) సరికదా? అసలు చదివిన గ్రంథాలేనా వీరికి అవగతమై వుంటాయో లేదో అని సంశయించవలసే వుంటుంది. విద్యావిధానంలో వొకటేమిటి? యిప్పుడు సర్వమూ మాఱింది. విద్యార్థివర్తన యెంతమార్పు చెందిందో చెప్పలేము. శాస్త్రం చదువుకొనే విద్యార్థులుగాని, చెప్పే గురువులుగాని చాకింటి బట్టకట్టు కోవడం నేనెఱుఁగను. అట్లనిమురికి బట్టలు కట్టుకొనేవారేమో అంటే అదిన్నీ లేదు. “గన్నేరు పూవన్నె గల్గిన కట్టుదోవతుల నీర్కావిసంపద నటింప" అనే శ్రీనివాసవిలాసపు సీసపద్య చరణాన్ని జ్ఞాపకంచేసే శుభ్రవస్త్రాలు కట్టుకొనేవారు. యేపూటకాపూటగాని లేదా యేరోజు కారోజుగాని వుతికి ఆఱవేసిన బట్టలు కట్టుకోవడమేగాని పాచిబట్ట కట్టుకోవడం గాని బారగోచీ పెట్టడంగాని ఆనాఁటి విద్యార్థులలో వుండేవి కావు. క్రాపింగులు వగైరాలు అప్పటికింకా సర్వేసర్వత్ర ప్రారంభం కానేలేదు. ఆ తెగవాళ్లు యెక్కడేనా వున్నా వెలేసినమాదిరిగా వుండేవాళ్లు. ఆ విద్యార్థుల వా క్కెంత పవిత్రంగా వుండేదో ముఖవర్చస్సూ అంత పవిత్రంగానే వుండేది. ఆలాటి మహా విద్యార్థులతో ఆనాఁటి పండితులు బయలుదేఱి వస్తూవుంటే పురాణాల్లో చదువుకొన్న ఋషులు జ్ఞాపకం వచ్చేవారు. యిప్పుడు పాశ్చాత్యవాసన ఆ యీ విద్యార్థులని మాత్రమేకాదు, గురువులనికూడా ఆవరించింది. వీని బాస వేరన్నాఁడు భారతంలో వొక సందర్భంలో నన్నయ్యభట్టు, అలాగే యిప్పటిచదువున్నూ పరిణమించింది. దేశాటనం చేసి, కుటుంబ భరణం యథాకథంచిత్తుగా చేసుకునే పండితులే యిప్పుడు కనపడరు. ఆలాటివారు వున్నట్టయితే ఆదరించే గృహస్థులున్నూ కఱవైనట్టే. యిప్పుడల్లా ప్రయివేటు ట్యూషను చెప్పుకొనేవారు కనపడతారు. ఉచితంగా విద్యార్థికి విద్య చెప్పే పండితులున్నూ చాలాభాగం అంతరించారు. యీ విద్యలగతి - “హా సీతే! కిం భవిష్యసి" అన్న దగ్గఱికి వచ్చింది. వారిది భిక్షాటకప్రాయమైన జీవనమే అయినా గౌరవనీయంగానే వుండేది. యిప్పడో? యీ విద్యకు యెంత దైన్యం పట్టాలో అంతా పట్టింది. యెక్కడో, కనీసం యెలిమెంటరీ స్కూల్లోనే అనుకుందాం, మాస్టరీ సంపాదించుకోవడానికి యిప్పటి డిగ్రీల పండితులు పడేపాట్లు వర్ణించడానికి వశంకావు. మునుపు దండం పెడితే పుచ్చుకోని పండితులు యిప్పుడు ఆయావ్యక్తులకు నమస్కరించినా ఫలితం కనపడడంలేదు. ఒకటేమిటి, చూస్తూ వుండఁగా యెన్నో సందర్భాలుయెంతో మార్పు చెందాయి. పెళ్ళిళ్లు చూడండి! యెంత చిత్రంగా మారిపోయాయో? అయిదురోజులలో కావలసిన బ్రహ్మవివాహం అయిదు గంటలలో ముగుస్తూవుంది. యెక్కడా సదస్యం అన్నమాట లేనేలేదుకదా? యింక కొన్నాళ్లకు.

ఉ. లేవరు లెండు లెండనిన లేచిన వారయినం దటాలునం
    బోవరు పొండుపొండనినఁ బోదుము పోదుము పోదుమంచుఁదా
    మీవరు సందు గేస్తునలయింతురు పెండిలిలో సదస్య సం
    భావనవేళజూడవలె బాపనసాముల సాములన్నియున్

అన్న దాసువారి పద్యం శుద్ధ అబద్ధంగా పరిణమిస్తుందేమో అనుకుంటాను. విష్ణుపురాణాదులలో వర్ణాల కేదో ముప్పు మూడుతుందంటూ వ్రాసివుంటే ఆ ముప్పు బలాత్కారమూలంగా తటస్థిస్తుంది కాఁబో లను కొనేవాణ్ణి. కాని పాపం ఆయా జాతులు అలాటి దౌర్జన్యం యీ క్షణం వఱకు యెక్కడఁగాని చేసినట్లు లేదు. అగ్రజాతులే యేదో లోక కల్యాణాన్ని అభిలషించి ఆయీ కాశ్మల్యాన్ని ఆపాదిస్తున్నారు. “విధం చెడ్డా ఫలమేనా దక్కితే" కొంత బాగుండును. తుదకు అది పూర్ణానుస్వారంగానే కనఁబడుతూవుంది. “జగతి శిరచ్ఛేద సమయమందునఁ దనకుండలమ్ముల యానఁగొనె ననంగ" అన్నట్టుంది మనంకోరే లోకకళ్యాణం. భోగలాలసత్వానికి దాసులై కొందఱు వారిలోవారికి భాగాలు తెగకతుదకి “మూలచ్ఛేదీ తవపాండిత్య ప్రకర్షః" దగ్గఱికి వచ్చింది ప్రపంచకప్టితి. యిది యెప్పడో గుర్తించే అనుకుంటాను మనఋషులు పూర్తిగా దీన్ని నిషేధించి వర్ణిస్తూ యితరులకుకూడా తమప్రవృత్తిని బోధించి వున్నారు. వారు బోధిస్తే మాత్రం "సానిమెఱుఁగూ సంతమెఱుఁగూ"గా భ్రమను కలిగించే నాగరికత ముందర ఆబోధ పనిచేఁగలుగుతుందా? అయినా కొందఱు సనాతన పండితులు పడరాని పాట్లు పడి పూర్వపు విద్యలు నిల్పడానికిన్నీ పూర్వాచారాలని పోకుండాపట్టడానికిన్నీ యత్నిస్తున్నారు. నానాఁటికి అధోగతికి వెళ్లవలసిన కాలంలో వారిప్రయత్నం సఫలంకావడం కలలో వార్తె అయినా, "యత్నేకృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష” కనక వారిని అభినందిచక తప్పదు.

“శా. వ్యాసాదుల్ ఋషులై నిజమ్ములయి తద్వాక్కుల్ భవిష్యద్గతిన్
      బూసం గ్రుచ్చినరీతిఁజెప్పు టదియున్ బోకుండి యౌరౌర వీ
      రే సారజ్ఞులు? వీరి కయ్యెడల లేనేలేదు విశ్వాస మీ
      యీసట్లే నెటులుండు భ్రష్టులగువారే తన్మతోద్ధారకుల్."

అని యీ విషయాన్ని చిరకాలంనాఁడే చమత్కరించి వున్నాం. మంచికాలం దాపయి వుందంటూ యెవరో జ్యోతిర్వేత్తలు వ్రాసినట్టు కొందఱువ్విళ్ళూరుచున్నారు. కాని అట్టి పుణ్యకాలం రావడానికి యింకా లక్షల కొలఁది సంవత్సరాలు పట్టవలసివస్తుందని వెనకటి పండితుల తాత్పర్యంగా కనపడుతుంది. వొకటి రెండు వత్సరాలలోనే అలాటి పుణ్యకాలం వస్తుందనే అర్థాన్ని వెనకటి పండితుల వాక్యానికి పాండిత్య బలంచేత యిప్పటి వారెవరో సంపాదించఁగల్గినా అది వారి పాండిత్యాతిశయాన్నే వ్యక్తంచేస్తుంది గాని ధర్మకాలాన్ని తీసుకురానేరాదు. నమో ఋషిభ్యః స్వస్తి.

★ ★ ★