కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/పదకవులు



పదకవులు

అనఁగా గేయాలు రచించిన కవులు. వీరిలో మిక్కిలి రసవంతమైన వాక్కు కలవారు కనపడతారు. కాని ఆ రసం తెలుసుకోవలసివస్తే కొంత సామగ్రీ సహాయంతో చక్కఁగా పాడేవ్యక్తి పాడినప్పుడే అవగతమవుతుందిగాని యెవరు పడితేవారు దాన్ని పద్యాలలాగా చదివితే అవగతం కాదు. (పద్యమేనా గాత్రమాధుర్యం బొత్తిగా లేని వారు చదివితే పదడయి పోతుందిగాని యేమేనా దీనిలాగ పదడుకాదు) దాన్నిబట్టి ఆ రసం సంగీతానికి సంబంధించిందే కాని అసలు దానికి సంబంధించింది కాదని కవులు పదకవిత్వాన్ని యీసడించారని తోస్తుంది. యీసడించడంలోనున్నూ యింతా అంతా కాదు. శ్రీనాథుఁడు యేలా యీసడించాడో చూడండి.

క. ముదివిటులు విధవలంజలు - పదకవితలు మాఱుబాసబాపనివారల్
   చదువని విద్వద్వర్యులు - కదనార్భటవీరవరులు కడిదిపురమునన్.

యీ పద్యంలో నాలుగోచరణానికి అర్థం నాకిప్పటికీ తెలియనే లేదు. (యేదేనా పాఠాంతరం వుందేమో తెలియదు) గాని మొత్తం యేదో దురర్ధం చెప్పక తప్పదని మాత్రం ప్రకరణాన్నిబట్టి తెలుసుకున్నాను. యెందఱో మహనీయులు పదకవులలో కనపడుతూవున్నా శ్రీనాథుఁడంతవాఁడు యింత నికృష్టంగా యీసడించడాని క్కారణం గోచరించడమేలేదు. పద్యకవిత్వం కూడా శ్రుతితాళ సమన్వితంగా కుశలవులు పాడి శ్రీరామచంద్రుని మెప్పును పొందినట్టుగా పండితులు పరంపరగా చెప్పుకోవడం సర్వులూ యెఱిఁగిందే. పద్యకవిత్వానికి మొట్టమొదటి కవిత్వం వాల్మీకిరామాయణానికే కీర్తనలవలె పాడడంవల్ల గౌరవం కల్గినప్పుడు అసలు రాగతాళ సంబంధంగా రచియించినదాన్ని శ్రీనాథుఁడు యెందుకు యీసడించవలసి వచ్చిందో! అని నాకు సందేహం కలుగుతూ వుంది. పోనీ యీ పదకవిత్వాన్ని యే పామరులో తప్ప పండిత కవులు ఆదరించలేదేమో అనుకుంటే జయదేవుఁడు గీతగోవిందాన్ని రచించి యెంతో యశస్సును పొందివున్నాఁడు. గీతగోవిందంలో అక్కడక్కడ లయతో అవసరంలేని శ్లోకాలున్నూ వున్నప్పటికీ ప్రాధాన్యం కీర్తనలకే కనపడుతుంది. మనదేశంలో యీ గీతగోవిందాన్ని సక్రమంగా పాడేవారు లేరు. ఉత్తరదేశంలో వున్నట్టు వినడం. ఇప్పుడిప్పుడు ఆ దేశస్థులవల్ల విని మన దేశస్థులు కూడా కొన్నిటిని పాడుతూ వుంటే యెంతో హాయిగా గ్రామఫోను ప్లేట్లల్లో వింటున్నాము.

“ధీరసమీరే, యమునాతీరే, వసతి వనే వనమాలీ"

దీన్ని పూర్వం మన దేశంలో రేగుప్తిరాగంలో పాడేవారు. ఆపాడడం భాగోతపుకత్తుగా వుండేది. ఇప్పుడు యేదో రాగంమీఁద ఆతాళం మీఁదే పాడినది ప్లేట్లలో వింటే దానికిన్నీ దీనికిన్నీ సహస్రాంతం వారకనపడుతూ వుంది. దీన్నిబట్టి పదకవిత్వానికి గానంవల్ల యెక్కువ సారస్యం కలుగుతుందని వొప్పుకోక తప్పదుగాని అసలు సరుకు మంచిదికాకపోతే కేవలగానం యేంపనిచేస్తుంది? అసలు వంకాయలు గిజరు వంకాయలయితే వంట బ్రాహ్మఁడెంత ఆఱితేఱినవాఁడయితే మాత్రం ప్రయోజన మేముంటుంది? కాని ఆలా తోసివేయడానికిన్నీవీలుకాదు. యేమంటారా? “తుమ్మచెట్టుమీఁద కాకి వాలింది తుపాకిదేరా కొడదాము” అనే గేయంలో యేం రసముంది? లేకపోయినా శ్రుతిలయలతో మేళగించి యేదో రాగం మీఁద పాడితే యెంతో హాయిగా వుండడమున్నూ అనుభూతమే. "తత్తదిమిత దిద్ది యని సదా, శివుఁడాడినాఁడె" అనే పల్లవిలో కవిత్వపు మాధుర్యం యేమి వుంది? వుండకపోయినా గాయకులు లోకాతీతంగా పాడి మెప్పిస్తారు. అంతమాత్రంచేత గేయకవిత్వంలో రసం వుండనేవుండనక్కఱ లేదనిన్నీ శ్రుతిలయలే ఆభారాన్నంతనీ వహిస్తాయనిన్నీ అనుకోవడం యుక్తంకాదు. 1) గీతగోవిందం, 2) తరంగాలు, 3) అధ్యాత్మరామాయణకీర్తనలు, 4) ప్రహ్లాదనాటకం, 5) రామనాటకం యివి కొంత ప్రాచీనాలు. గరుడాచలనాటకం వగయిరాలు కొన్ని నవీనాలున్నూ వున్నాయి. వీట్లలో అధ్యాత్మరామాయణకీర్తనలు రచించిన కవి కవిత్వం తెలుఁగులో ఉత్తమస్థానాన్ని అలంకరిస్తుంది.

రేగుప్తి - అట

ఈ సంశయము వారింపవే! జగదీశ! నన్ను
మన్నింపవే! భాసమానవిలాస! నేనిదె
నీ సత్కృపావలోకనమున, నీ సమయమునఁ
దెలియవలసినదే సమస్తమిదే ప్రశస్తము ||ఈసం||

తెలుఁగులో పద్యకవిత్వానికి భారతాని కున్నంత గౌరవమున్నూ, పదకవిత్వంలో ఆధ్యాత్మ కీర్తనలకు వుందంటే కాదని యే విజ్ఞులున్నూ అనరు. అంత్యనియమాదులతో మంచి లయపిక్కట్టుగావుండే యీ కీర్తనలు వేదంలాగు గురుముఖతః చెప్పుకొనిపాడేవారు నా చిన్నతనంనాటికి కొందఱు వుండేవారు 1) ఉప్మాక బ్రహ్మన్నగారు 2) ముక్కామల జోగయ్య గారు 3) చక్రవర్తుల చిట్టెయ్యగారు వగయిరాలు. కాని ఆ సంప్రదాయంగా పాడేవారు యిప్పుడు క్రమంగా అంతరించినట్లు కనపడుతుంది. 

సురట - ఆది

'చేరి వినవె శౌరిచరితము గౌరి సుకుమారి గిరివరకుమారి'

యిది పరశురాములవారి యుద్ధాన్ని గూర్చిన కీర్తన. దీనిలో వుండే పదాలపొందిక వగయిరాలు గ్రంథకర్త సామర్థ్యాల్ని పూర్తిగా తెల్పుతాయి. యిందులో వుండే అంత్యప్రాస నియమం

“బెండువంటి విల్లు నడిమికి రెండుచేసి పెల్లు"

అని ప్రారంభించి చాలా భాగం నడిపి నడిపి ఆఖరికి

“నా విల్లు దండివైరులకు ముల్లు"

అని ముగించి అంతతో కూడా ఆపక మళ్లాదురితాన్ని ఉపక్రమించి అప్పుడు చరణాన్ని ముగించాఁడు. పద్యం వ్రాయడానికి కావలసిన సామగ్రి కంటె దశగుణంగా సామగ్రి వుంటేనేకాని ఆ యీ మాదిరి రచనతుదనెగ్గదు. (యీ కీర్తన వొక్కొక్కటి వొక్క శతకం అంత వుంటుంది) ఆ యీ పరిశ్రమ శ్రీనాథుడివంటి మహాకవికి తెలియకపోదు కనుక “ముదివిటులు” అని లోగడ వుదాహరించిన యీసడింపు ఎవరిదో అయివుంటుంది కాని బహుశః శ్రీనాథుఁడిది కాదేమో! అని నేను అనుమానిస్తాను. అయితే ఆధ్యాత్మకీర్తనలు శ్రీనాథుఁడి కాలానికి చాలా యిటీవలివై వుండడంచేత ఆయన యిది చూడక యేవో లాకలూ కాయల బాపతు "అక్షయపాత్రకు వచ్చినాయి మమ్మాదరింపుఁడమ్మా మూతులు విఱవక ముక్కులువిఱవక ముష్టి పెట్టరమ్మా" అనేమాదిరి కీర్తనలుచూచి అలా యీసడించి వుంటాఁడేమో! అని కొందఱు అభిప్రాయపడతారనిన్నీ యెఱుఁగుదును. కాని అధ్యాత్మకీర్తనలు చూడకపోయినా వాల్మీకి రామాయణశ్లోకాలు కుశలవులు (కుశీలవౌ కుశలవ నామధేయౌ) గానంచేసి రాముణ్ణి మెప్పించారన్న విషయమేనా శ్రీనాథుఁడికి అవగతంకాకుండా వుంటుందా? అయితే కుశలవులు ఆ రచనను గేయంగా మార్చుకొన్నా అవి శ్లోకాలేకాని పుట్టుకచేత కేవల గేయాలుకావు కనుక వాట్లకియీ "ముదివిటులు అనే పద్యపు యీసడింపు తగలదనిన్నీ కొందఱనవచ్చును. కాని యిప్పుడు ఖిలసంహితలాగు అంతరించిపోయినా శ్రీనాథుఁడి కాలానికి యీఅధ్యాత్మ కీర్తనలవంటి గేయరచన యేదోకొంత పూర్వకవులది వుండకుండా వుండదు. అలా వుండడమే తటస్థించి దాన్ని ఆ మహాకవి చూడడమే తటస్థిస్తే అలా ఆయన యీసడించడం పొసగదనే నేననుకుంటాను. శ్రీనాథుఁడిమాట అలా వుంచుదాం. వేణుగోపాల శతకం రచించిన కవి యెన్నాళ్లనాటి వాఁడోకాఁడు. అతఁడు ఆయీ ఆధ్యాత్మ రచన చూచేవుంటాఁడు. దీన్నిచూచినట్టి ఆధారం వెదికితే కాని చట్టన దొరకదుగాని తాళ్లపాకవారి గేయాలు చూచినట్టు

"అల తాళ్లపాక చిన్నన్న రోమములైతె తంబురుదండెకు తంతులౌనె?"

అనే సీసచరణంవల్ల స్పష్టపడుతూవుంది. ఈచరణంలో వున్న- "రోమములు" కీర్తనలే. (తాళ్లపాక చిన్నన్నగారి గేయాలు యెంత మధురంగావున్నా ఆకవికి యిష్టంలేదన్నమాట) ఆయీ చరణం వున్న సీసం చాలా అందంగానే వుంటుందిగాని తక్కినచరణాలు- ఏలేశ్వరోపాధ్యాయుల - భట్టరాచార్యులు “అలరాచబిడ్డ-" అనేవి చాలా ముదురు పాకంలో వుండడంచేత వుదాహరించలేకపోయాను. యీ కవి పేరు తెలియదు. యీ వేణుగోపాల శతకం తప్ప యేపుస్తకం వ్రాశాఁడో అంతకంటే తెలియదు. గాని యితనికి వున్నంత ప్రపంచకజ్ఞానం యెక్కడోగాని సర్వసాధారణంగా యితరకవులకు లేదనేచెప్పవచ్చును. శతకాలలో యితని శతకం అగ్రస్థానాన్ని వహిస్తుంది. ఇతనికి కీర్తనల కవిత్వమే కాదు ద్విపద కూడా రుచించదు. అందుచేతే

“ద్విపదకావ్యంబు ముదిలంజ దిడ్డిగంత"

అంటూ యేకడానికి మొదలు పెట్టాఁడు. (ఆయీ యీసడింపు వున్నప్పటికీ ద్విపదకవులను కవులచరిత్ర స్వీకరించిందిగాని గేయకవులను మాత్రం వెలివేసినట్టు బహిష్కరించింది. ప్రత్యేకించేనా యీ కవులచరిత్ర వ్రాస్తే బాగుంటుంది.) భవతు. అంతమాత్రంచేత జయదేవాదులు ఆమోదించిన పద కవిత్వం మట్టిగొట్టుకు పోవలసిందేనా? కొందఱు శ్లోకాలనూ, పద్యాలనూ కీర్తనలకింద మార్చి ఆనందించడంలో కొంత అర్ధంవుందిగాని లేకపోలేదు. నిన్న మొన్న కీ|| శే|| లయిన అల్లంరాజు పేర్రాజు (కృష్ణగానచటికాభాగవతులుగారు) శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలలో చాలా వాటికి చక్కని మట్లు యేర్పరచి శ్రవణానందంగా పాడడం చాలామంది యెఱిఁగిన విషయమే. అందులోనూ

భైరవి - రూపకం

సజలజలదనీలం, వల్లవీ కేళిలోలం IIసజలII

అనేది పల్లవిచేసి పాడుతూవుంటే దీక్షితులవారి

“చింతయ మాకంద మూలకందం”

అనే కృతిని జ్ఞాపకం తెచ్చేది. కుశలవులు గాయకులు కూడా అనే సంగతి “కుశీలవౌ కుశలవ నామధేయౌ" అనేదానివల్ల స్పష్టమవుతూ వుందని లోఁగడ సూచించే వున్నాను. వాక్యరూపంగానో, ఛందోబద్ధంగానో వున్న వేదాన్ని సామవేదులు గానంతో మిళితం చేయడం అనాదిసిద్ధంగానే కనపడుతూవుంది. అట్టిస్థితిలో మొట్టమొదటనే లయబద్ధంగా రచించిన గేయాల యెడల యిటీవలివారికి అనాదరం యెందుక్కలిగిందో బోధపడడంలేదు. అయితే అక్కడక్కడ వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలుండడాన్ని బట్టి యీసడించారనుకుందామా అంటే; అదిన్నీ తగినంత హేతువుగా కనపడదు. 1) జగమేలే పరమాత్మ, 2) అంతారామమయం! మాదిరి ప్రయోగాలు పద్యకవుల కవిత్వాలలో కూడా కనపడుతూనే వున్నాయి.

చ! ఒకని కవిత్వమం డెనయు నొప్పులుఁదప్పులు నాకవిత్వమం దొకనికిఁ దప్పుపట్టఁ బనియుండదు!!

అని సప్రతిజ్ఞంగా గర్జించిన రామలింగమే కాక అతని కంటె పూర్వ మహాకవులున్నూ పిమ్మటి మహాకవులున్నూ శనగపప్పులాగ వాడికొన్న క్త్వార్ధక సంధిని వ్యాకరణం నిషేధించింది కదా? అంతమాత్రంచేత ఆయా కవిత్వాలయందెవరికేనా యీసడింపు కలిగిందా? అందుచేత అదిన్నీ కారణంగాదు.

ఆ వె. గురువు లఘువుఁజేసి కుదియుంచి కుదియించి
       లఘువు గురువుఁ జేసి లాగిలాగి
       కవితఁ జెప్పినట్టి కవిగులామును బట్టి
       ముక్కుఁ గోయవలయు ద్రొక్కిపట్టి.

అంటూ వొక ఆక్షేపణాన్ని తెల్చే పద్యం యెవరు చెప్పిందోగాని నా బాల్యగురువులలో శ్రీ కానుకుర్తి భుజంగరావు పంతులవారు చదువుతూ వుంటే విని వున్నాను. యీ ఆక్షేపణ గానమనే పేరు చెప్పేటప్పటికల్లా “తాటితో దబ్బనం" లాగు వుండేదేగాని దీన్నిబట్టే యీసడించేటట్టయితే సామవేదానిక్కూడా యీ యీసడింపు వర్తించవలసి వస్తుంది. ఆ వేదం గానం చేసేవారు తీసేదీర్ఘాలు యేగాయకులూ తీయనేతీయరు. కాబట్టి పద కవిత్వాన్ని పద్యకవులు యెందుకు యీసడించవలసి వచ్చిందో అని విచారిస్తే తగినంత హేతువు గోచరించడమే లేదు. తగినంత రసవత్తరమైన రచన పదకవిత్వంలో లేదేమో అనుకుంటే క్షేత్రయ్యకంటే రసవత్తరమైన కవిత్వాన్ని రచించిన పద్యకవులంటూ వున్నారా? ఈయన వెళ్లినన్ని శృంగారప్పోకడలు యే మహాకవి కవిత్వంలోనూ కనపడవు. ఈయనేకాదు యెందఱో రసవత్తరమైన కవులు పదకవిత్వం చెప్పినవారిలో వున్నారు.

“అలిగితే భాగ్య మాయె మరేమి వాఁ ||డలిగితే||
తలిరుబోఁడిరొ! వాని దండింప! గలన వాc ||డలిగితే||

యీలాటి సరసమైన కవిత్వం యే పద్యకవి రచించాఁడో వొక్కఁడి పేరు చెప్పవలసిందంటే చెప్పఁగలమా? యేదో వొక్కటి మచ్చుకు కనపఱిచాను. (రేపూ వత్తువుగాని పోరా నేcటికి తాళి, వగయిరాలు చూచుకోండి) క్షేత్రయ్య కవిత్వంలో యిలాంటివి కొన్ని వందలున్నాయి. క్షేత్రయ్య శృంగార భక్తికోసం అవతరించిన మహాకవి. సంస్కృతంలో జయదేవ లీలాశుక నారాయణతీర్థు లేలాటివారో తెలుఁగులో క్షేత్రయ్య ఆలాటివాఁడు. పద్యకవుల కవిత్వంలో శ్రవణకటు ప్రయోగాలు- “శ్రోత్ర ఘచ్చటలు" వగైరాలు కుప్పతెప్పలుగా దొర్లుతాయిగాని పద కవుల కవిత్వంలో ఆలాటి శ్రవణకటువులు యెంతో వెదికితే యేమోగాని చట్టన దొరకనే దొరకవు. అసలే దొరకవని కూడా చెపుతాను.

హాస్యకవిత్వం చెప్పిన కవులు నలువురు వున్నారు.

“ఇందుకా? నీకుపంచాంగము చెప్పింది, యిన్నాళ్లనుసరించి యెద్దు తాకటఁబెట్టి మిద్దెటింటికి నిల్వుటద్దము తెచ్చింది పెద్దలఋణమటె ముద్దుcబెట్టు మటంటె మోము దిప్పుకొనేవు; కద్దబే యీరీతి కంచిగరుడసేవ IIఇందుకా!"

యీ గేయంలో ప్రతీచరణం చివరా వొక్కొక్క లోకోక్తి వాడఁబడింది. యీలాటి హాస్యరస గీతాలేకాక జాతీయగీతాలు-

"అగ్గితిరుణాళ్లంట : అర్జునుకతలంట"

అనే మాదిరివి చెప్పిన కవులున్నూ వున్నారు. కవి యేలాంటి వాఁడైనా సరే గేయం రచించడమంటూ వస్తే అది కైశికీవృత్తిలోనే నడుస్తుందిగాని యితర పెటుకు వృత్తులలో నడవకపోవడం వొక విశేషం.

“అనఘ! రాఘవ! కాముకుఁడనై అతివవలలను జిక్కితిని విను, వనమునకు ననిచి ప్రాణము లీ తనువునను మనవనెను భూపతి"

యిది అధ్యాత్మరామాయణంలోదే. దీనిలోనల్లా రెండు ఘకారాలున్నూ వొక భకారమూతప్ప తక్కినవర్ణాలు గానానుకూలాలే. క్షేత్రయ్య కవిత్వంలో యీమాత్రమూ వత్తక్షరాలు పడవని చెప్పవచ్చును.

"తెలివి యొకరి సొమ్మా యెందుకె విభుని తిరుగ పొమ్మంటినమ్మ"

యిందులో వక వొత్తక్షరం మాత్రమే కనపడుతుంది. ఇతనిగేయాలకు "మువ్వగోపాల పదాలు" అని వాడుక. యిదేపోలికలో వున్న మరి కొన్ని గేయాలుకూడా యితని పేరుతోనే వ్యవహరింపఁబడుతూ వున్నాయి.

“ఏరీతి బొంకేవురా! లేదని నాతో" ||యేరీతి||

యీ పదంలో “వేణంగిరాయ" అనే పేరుతో కృష్ణుణ్ణి వ్యవహరించడంవల్ల యిది క్షేత్రయ్యది కాదని విస్పష్టం. నవీనులలో రంపూరి సుబ్బారావుగారంటూ వకరు వుండేవారు. ఆయన రచించిన గేయాలకు "సింహపురి జావళీలు" అనిపేరు. కొంచెం పాకం పచ్చిగావున్నా శృంగార భావాలు యీ రసికాగ్రేసరుఁడు చిత్రించి గేయవాజ్మయాన్ని పెంపొందించాcడు. యీయన కాలంలోనే గబ్బిట యజ్ఞన్న లేక యజ్ఞనారాయణగారున్నూ వుండేవారు. ఆయన రచన కూడా శ్రవణపేయంగానే వుంటుంది. శ్రీదాసు శ్రీరాములుగారు పద్యకవులై ప్రసిద్ధివహించినా, పదకవిత్వాన్ని యీసడించి వదలిపెట్టలేదు. వీరి జావళీలు కూడా తెలుఁగుదేశంలో బాగా వ్యాపించే వున్నాయి. (పూర్వం పదాలని వాడేవాట్లని యిటీవల జావళీలని వాడడం మొదలుపెట్టారు. రచనలో కూడా యీ రెంటికీ భేదం వుంటుంది) ఆయీ కాలంలోనే సుప్రసిద్ధ హరికథకులు ఆదిభట్టవారున్నూ బయలుదేరి వున్నారు. వీరు ప్రాచీనపు మట్లలోనే రచన సాగిస్తూ యెక్కువరక్తిని కలిగించే గేయాలు ఆయా కథానుగుణంగా రచించి, గేయవాజ్మయాన్ని పోషించి వున్నారు. త్యాగరాయకృతుల మోస్తరుగానే వీరి గేయాలు కూడా గురుశుశ్రూషా పూర్వకంగా అభ్యసిస్తేనే తప్ప కేవల వినికివల్ల స్వాధీన పడేవికావు. యీయన రచనను కొంచెం వుదాహరిస్తాను.

“బాలచంద్రమౌళి పాదముల్ విడక
 కాలు నోర్చి వేగమె రమ్ము కొడుక! ||బాలII

 అంగముశైత్యపైత్యము లంటనీక
 గంగాభవాని నిన్ గాపాడుగాక ||బాల||

 పవలు రేయి తాపము జెందనీక
 రవిచంద్రములు నిన్ను రక్షింత్రుగాక 11బాల||

యింకా చరణాలు కొన్ని వున్నాయేమో? యీ గేయస్వారస్యాన్ని బట్టి నాకు యెప్పుడో విన్నంత మాత్రంచేత యిది ధారణకు వచ్చింది. ఇది ఆయనగాని, ఆయన శుశ్రూష చేసిన మరికొందఱు శిష్యులుగాని పాడుతూవుంటే వొళ్లు పరవశమైపోతుంది. (యీయన రచనలో యిలాంటివి యింకా యెన్నో వున్నా "తత్రాపిచ చతుర్థో౽ంకః" అన్నట్టు నాకు యీగేయం యెక్కువగా నచ్చింది) యీయనకు సంస్కృతాంధ్రాలయందేగాక మఱికొన్ని విదేశభాషలయందుకూడా, మంచి పాండిత్యంవున్నా దాన్ని ఆయీ గేయాలలో చూపక తేలికశైలిలోనే రచించడంచేత యింతటి హాయిని కలిగించడానిక్కారణ మయిందని నేననుకుంటాను. మొత్తంమీఁద ఆలోచించిచూస్తే పండితకవి కానివ్వండి, కేవల కవికానివ్వండి పదకవిత్వమంటూ చెపితే అది తేలిక పాకంలోనే వుంటుందిగాని, కఠినపాకంలో మాత్రం వుండదని నా అనుభవంమీఁద కనిపెట్టాను. మహామహోపాధ్యాయులూ షడ్దర్శనీపార దృశ్యులూ అయిన శ్రీమాన్ పరవస్తు రంగాచార్యుల అయ్యవార్లంగారు రచించిన గేయాలే యిందుకు నిదర్శనం.

“స్వాంత మనెడి చంచరీకమా! స్వామిచరణ సరసిజముల పైని వ్రాలుమా! చంచరీకమ! సరసిజముల పైనివ్రాలుమా|| రంగుగ నీవెల్లప్పుడు మంగళకరు శ్రీనివాసు, గాంగేయాంబరధారుని రంగార్యావన యనుచును. ||స్వాంత||

సంగీతానికి ముఖ్యంగా వత్తక్షరాలూ, ద్విత్వాక్షరాలూ అనుకూలించవు. వుదాహరించి చూపుతాను.

శ్లో. అభినవనవనీత స్నిగ్ధ మాపీతదుగ్ధం
    దధికణపరిదిగ్ధం ముగ్ధ మంగం మురారేః
    దిశతు భువనకృచ్ఛ్రచ్ఛేది తాపింఛగుచ్చ
    చ్చవి నవశిఖిపింఛాలాంఛితం వాంఛితం నః||

యీ శ్లోకం కృష్ణకర్ణామృత శ్లోకమే అయినా ఆయన శ్లోకాలలో నూటికి తొంభై తొమ్మిది శ్లోకాలు గానానుకూలాలే అయినా యిదిమాత్రం గానానికి విరోధిగాపడింది. యెక్కడేనా వొక అక్షరం వొత్తక్షరం పడితే చిక్కుండదుగానీ, విశేషించి పడితే చిక్కువస్తుంది. వూపిరంతా దానికే వినియోగించవలసి వస్తుంది. (వొత్తక్షరాల ద్విత్వాలే కటువుగా వుంటాయి కాని యితరద్విత్వాలు కటువుగా వుండవు. రచించే కవి యివన్నీ పరిశీలించకపోయినా గేయాలలో మృదువర్ణాలే పడతాయి) తరంగాలలో యీ నియమాన్ని అంతగా పాటించినట్లు లేదు.

“రక్ష రక్ష అసురశిక్ష రాజీవదళాయతాక్ష
 అక్షీణ కృపాకటాక్ష ఆశ్రితపక్షసంరక్ష

వగయిరాలవల్ల పయిసంగతి స్పష్టపడుతుంది. యీ క్షకారం అంత కటుకుగాదు కాని అసలు కటువు కాకపోదు. చాలా మృదుపాకంలో నడిచినవీ వున్నాయి. వుదాహరిస్తాను.

కలయే యశోదే, తవ బాలం, వ్రజబాలక ఖేలన లోలమ్||
కలయ సఖి సుందరం బాలకృష్ణం IIకలయII
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ర్పభవిష్ణుం సమస్తలోక జిష్ణుం ||కలయ సఖి||

దీనిలో షకార ణకారద్విత్వం వున్నప్పటికీ లోఁగడ శ్లోకంలో చూపిన గకారధకార ద్విత్వానికిన్నీ చకార రేఫద్విత్వానికిన్నీ ఖర్చయినంత ప్రాణవాయువు దీనికి ఖర్చుకాదు. అంతేకాదు ఆద్విత్వాలు సక్రమంగా పలుకవలసివస్తే యెదటివాళ్ల మొగాలు చల్లబడవలసి వస్తుంది. కనక దీన్ని గూర్చి విస్తరించనక్కరలేదు. కవిత్వ విశేషాలలో శబ్దాలంకారం కూడా వొకటి కనక ఆ శ్లోకంలో వున్న ద్విత్వఘటితాను ప్రాసాలు కవులకు అభినందనీయాలేకాని గాయకులకుమాత్రం కావని చెప్పవలసివచ్చింది. జయదేవుఁడు సంస్కృతభాషలోనే రచించినా అష్టపదులు- -

నకురు నితంబిని గమనవిలంబనం అనుసర తం హృదయేశమ్ ధీరసమీరే, యమునాతీరే||

యే జయదేవునివంటి అవతారపురుషుఁడో సంస్కృతంలో కూడా గానానుకూలంగా రచన సాగించి లోకాన్ని మెప్పించినా, సర్వసాధారణంగా తెలుఁగుభాష గానానికి అనుకూలంగాని సంస్కృతం కాదని చెప్పక తప్పదు. అందుచేతే త్యాగరాయలవారు వుభయభాషా సాహిత్యం కల మహానుభావుఁడే అయి కూడా తెలుఁగులోనే రచన సాగించి తద్ద్వారా తెలుఁగు దేశీయులనే కాకుండా అరవదేశీయులని కూడా తరింపఁజేశాcడు. (కాని అఱవవారి నోళ్లల్లో బడడంచేత ఆయన సుప్రయోగాలెన్నో గాడిద గత్తఱగామాఱి అర్థశూన్యాలు కావలసివచ్చింది,) కొంచెం వుదాహరించి వ్యాసం ఆపుతాను. 1) రామ నీ సమాన మెవరు? 2) రాముఁ దెందుఁ దాగినాఁడో 3) జగమేలే పరమాత్మ యెవరితో మొఱలిడుదు ||నగుమోము గనలేని|| 4) చక్కని రాజమార్గము లుండగ సందులు దూరనేలనే వోమనస 5) కద్దన్నవారికి కద్దు, కద్దని మొఱలిడిన పెద్దలబుద్దులు నేఁడబద్ధ మవునే ||కద్దన్న|| 6) నీనామరూపములకు నిత్యజయమంగళం 7) ఉపచారము చేసేవారున్నారని మఱవకురామ 8) శ్రీరఘువర సుగుణాలయ||

ఇన్నికృతులలో పల్లవులుదాహరిస్తే వొకదానిలో కాఁబోలును “ఘు" అనేది వత్తక్షరం దొర్లింది. అదేనా ద్విత్వంగా (వాఘ్ఘరిః) వుపయోగించే పక్షంలో గానాన్ని నిర్బంధిస్తుందిగాని కేవలంగా ఉపయోగిస్తే బాధించదు. ఆయీ విశేషం సప్తస్వర బోధకాలుగా యేర్పడ్డ అక్షరాలలో - ధ - అనేది వొకటి వుండడంవల్ల కూడా మనం తెలుసుకోవచ్చును. కాని అవసరమైనప్పుడు మహాగాయకులు ఆ ధకారాన్ని దకారం చేయడమే గాదు, షడ్జ స్వరానికి బోధకంగా వుండే - స - అనే అక్షరాన్ని - చ - అని దంత్యంగా ఉచ్చరించడం గాయకులందఱూ యెఱిఁగిందే. గానమనేదిన్నీ శృంగారమనేదిన్నీ యెంతసేపూ మార్దవాన్ని సహిస్తుందిగాని పారుష్యాన్ని సహించదు. మహాక్రూరాలుగా వుండే వ్యాఘ్రాదుల ప్రవృత్తివల్ల మొదటి విషయం గుర్తింపవచ్చును, రెండో విషయం గాయనులనుండి (గాయకుల నుండికాదు) తెలుసుకోవచ్చును. మృచ్ఛకటికలో ఖండితంగా - "ఆడదాని సంస్కృతమున్నూ, మొగాడి గానమున్నూ నచ్చదు” అన్న సిద్ధాంతం తోసివేయఁదగ్గది మాత్రం కాదు. పాండిత్య విశేషాదులు పురుషులయందే వున్నాయెక్కడోగాని స్త్రీ గాత్రమందు వుండే మార్దవం పురుష గాత్రమందు వుండదు. పురుషులు స్వరకల్పన చేసేటప్పుడు యెంతో పారుష్యం కనపడుతుంది కాని కీర్తన రచనకంటూ మొదలు పెడితే దానిలో మాత్రం యే పదకవికీ పారుష్యం దొరలడం లేదనే నా అనుభవం.

“హరా! నిన్ను నే నమ్మినాను గదరా
 కరుణాకర పురహర ||హరా||

 హరా నమ్మినానురా | కరుణఁ జూ
 డరా మ్రొక్కుచుంటిరా || ముదమ్ముతో || హరా||

 వరాలతండ్రి నా మొరాలకింపవు
 నిరాదరణకేమిరా? కారణము ||హరా||

యీకీర్తన విట్టల ప్రకాశంగారిది. యీయన అత్యాశువుగా రచించడమున్నూ, యితరులు వ్రాసికోవడమున్నూ నేను స్వయంగా చూచిందే. ఇందులో పారుష్యాన్ని కలిగించే అక్షరాలు లేశమున్నూ లేవు. (ప్రతాప రుద్రీయాదులలో లాక్షణికులు వ్రాసిన పారుష్యాన్ని బట్టి చూచుకోకూడదు. విశేషించి వత్తక్షరాలు లేకపోవడమే చూచుకోవాలి) యింకో విశేషం. పద్యకవులతోపాటు యతిప్రాసలబాధ వీరికిన్నీవుంది. వుండడమంటే సీసగీతాదులలోవలె యేదో వొకటి వుంటేనే చాలును. చంపకమాలాదులలోవలె రెండూ వుండనక్కరలేదు. యిన్ని అక్షరాలకు యతి పెట్టవలసిందనే నియమం లేదుగాని “యత్రతాళ స్తత్రయతిః” అనే నియమం మాత్రం వుంది. అయితే ఆతాళం యెన్ని అక్షరాల పరిమితి కలదిగా వుంటుందో దాన్ని బట్టి యతి పెడుతూ వుంటారు. యీ పదకవులు కొందఱు కొన్ని గేయాలలో అర్ధావృత్తానికే యతి పెడుతూ వుంటారు. కొన్నింటిలో పూర్ణావృత్తానికి పెట్టడమున్నూ కలదు. క్వాచిత్కంగా నాలుగైదు ఆవృత్తులదాఁకా యతిలేనివిన్నీ కనపడతాయి. దీనికి లోఁగడ వుదాహరించిన - రేపు వత్తువుగాని - అన్నది. వుదాహరణం. మాఱుమూలయతులు వీరెక్కడా వాడరు. వొక్కవర్గయతితోటే వీరి రచన యావత్తూ సాగిపోతుంది. ఏకతరయతి అనఁగా (యే అక్షరానికి ఆ అక్షరమే యతిగా పెట్టేది) విశేషించి వాడతారు. పద్యకవులలాగ సులక్షణసారాదులు చదువవలసిన ఆవశ్యకత్వం కూడా వీరికి కనపడదు. “పద్యం పద్యస్య లక్షణమ్” అన్నట్టే యీ పదకవులు అందఱూ కాకపోయినా చాలమంది "గేయం గేయస్యలక్షణమ్”గా రచన సాఁగిస్తారు. యిది నా అనుభవాన్నిబట్టి వ్రాసే వ్రాత. నేను యేవిధమైన లక్షణమూ యెరక్కుండానే యేవో గేయాలు చిన్నప్పుడు వ్రాసేవాణ్ణి యిటీవల వాట్లను పరిశీలిస్తే లక్షణానికి సరిపడే వుండేవి. “ఉపచారము చేసేవారున్నారని మఱవకు రామ|| ఉప|| “రామ నీసమాన మెవరు; రఘువంశోద్దారకా॥ రామ||"

యీకీర్తనలు త్యాగరాయలవి. వీట్లలో యే అక్షరానికి ఆ అక్షరమే యతిస్థానంలో పడింది. దీన్నే యేకతర యతి అని అన్నాను నేను; (అప్ప కవి రేఫకు రేఫ యతి చెల్లితేనే యేకతర యతి అన్నాఁడు ఇతరం కూడా కావచ్చునని నేననుకుంటాను) వర్గయతికంటే కూడా పదకవులు దీన్నే యెక్కువగా వాడతారు. అంతేనేకాని యేదోవిధంగా యతి సరిపెట్టే రచన, అంటే :-

శా. కేదారేశు భజించితిన్ శిరమునన్ గీలించితిన్ హింగుళా
    పాదాంభోజములన్ బ్రయాగనిలయున్ బద్మాక్షు సేవించితిన్
    యాదోనాథసుతా కళత్రు బదరీనారాయణున్-

అనేమాదిరిని శాస్త్రరీత్యా సరివడిన్నీ అనుభవానికి సరిపోని యతులు యెన్ని వేలకీర్తనలు వెతికినా దొరకనే దొరకవని సప్రతిజ్ఞంగా చెప్పొచ్చును. దీన్నిబట్టి చూస్తే తెలుఁగుభాషతోపాటు- “తాటితో దబ్బనంగా” పుట్టిన యతిప్రాసలనే సహజాలంకారాన్ని వదలకుండా ధరిస్తూవున్నది పదకవిత్వమేగాని పద్యకవిత్వం కానేకాదంటే తప్పేమి? పద్యకవిత్వం కంటే కూడా ముందుగా పదకవిత్వమే పుట్టిందేమో? అని నేననుకుంటాను. కాని దీనికీ నీకేమిటాధారమంటే తగినంత తృప్తికరమైన జవాబు చెప్పడం కష్టం. కవిత్వం సంస్కృతంలో చెప్పినా కవి తెలుఁగుదేశస్థుఁడైతే అందులో యతిప్రాసలు వుండడం కూడా అనుభూతంగా కనపడుతూ వుంది. తరంగాలు చూచుకుంటే యీ విషయం బోధపడుతుంది.

1. ఏహి ముదందేహి శ్రీకృష్ణ! కృష్ణ! మాం -
   పాహి గోపాల బాలకృష్ణ! కృష్ణ! ||ఏహి ||

2. రామకృష్ణ గోవిందేతి నామసంప్రయోగే॥
3. స్వజనాదయాధృత దేహతయా
   విహరంత మమర మిహ భూతలే
   ప్రజభువి రాససమయరసపండిత
   గోపవధూకృతమండలే || పరమిహ॥

ఇంకా తరంగాలలో యిట్టివెన్నో వున్నాయి చూచుకోండి. ఆయీ సందర్భం పదకవిత్వ రచనానికి మాత్రమే, పద్యరచనకు సంబంధించదు, పద కవిత్వమేనాసరే కవి తెలుగు దేశీయుఁడుకాకపోతే అతఁడు యతిప్రాసలకోసం ప్రాకులాడఁడు. యిందుకు జయదేవుని (ఇతడు ఓఢ్రుడు) గీత గోవిందం చూచుకోండి “ధీరసమీరే” అన్నది లోఁగడ వుదాహరించేవున్నాను. ఆదేశపు కవులు హిందీ సంప్రదాయాన్ని బట్టి పోతారు. అందులో అంత్యప్రాస ముఖ్యం. దాన్ని జయదేవుఁడున్నూ ఆమోదిస్తాఁడు. అధ్యాత్మ రామాయణంతో పాటు గౌరవించతగ్గ పదకవిత్వం మృత్యుంజయ విలాసం వొకటి వుంది. ఇది గోగులపాటి కూర్మకవి రచించింది. మనదేశంలో యిప్పటి లాగ హరికథలు లేనప్పుడు యిదే ఆ స్థానాన్ని అలంకరించేది. ఇప్పటి హరికథకుల కవిత్వాలేవీ దీనితో దీటుకావు. కాని పాతిక ముప్పయ్యేళ్ల నుంచి దీనిప్రచారం చాలా తగ్గిపోయింది. పద్యకవిత్వాలకంటె పదకవిత్వాలు గుర్వపేక్ష లేకుండా చదువుకొని అర్థం చేసుకోడానికి వీలుగా వుంటాయి. నాకు ఆంధ్రానికి గురువులీ పద్దకవిత్వాలే. వ్యాకరణం స్కూల్లో చదివిన వెంకయ్య వ్యాకరణమే. తరువాతేనా భారతం ప్రత్యక్షరమూ చదివి వ్యాకరణపులోటు తీర్చుకున్నానుగాని బాలవ్యాకరణం చదివికాదు. నేను తెలుఁగు పండితుఁడుగా పనిచేసే రోజుల్లో యెన్నఁడూ సూత్రాలమీఁద శిష్యులకు వ్యాకరణాన్ని బోధించనేలేదు. సాలు ఒకటికి రెండు మూడు రోజుల కంటె దీనికోసం ఖర్చుపెట్టేవాణ్ణి కాను. యెవళ్లకోగాని యీ గొడవ తలకెక్కదు. యిది కంగా బంగా రావడంకంటే అసలు రాకపోవడమే మంచిది.యీకంగాబంగా వచ్చి పూర్వపక్షాలకు వుపక్రమించేవారు వృథాగా తుదకు చిక్కులో పడతారని ప్రాజ్ఞలోకానికి యిదివఱకే తెలుసును. కనక విస్తర మనవసరం. పదకవిత్వం తప్పుల తడకగా వుంటుందని అనాదిగా అప్రతిష్ఠ వుంది. కనకనే జయదేవుఁడికంటే పూర్వఁడు గోవర్ధనాచార్యులు.

“కి మపభ్రంశేన భవతి గీతస్య. కిం దారిద్ర్యేణ భవతిదయితస్య" అన్నాఁడు. కాని పదకవిత్వంలో వుండే తప్పులు చాలాభాగం గాయకులవిగాని అసలువారివి కావు. అందులోనూ త్యాగరాయాది మహాగాయకుల కొంప తీసినవారు దాక్షిణాత్యులు. పద్యకవులు ఆమోదించిన వ్యావహారికాలు పదకవులు బహుస్వల్పంగానే ప్రయోగించి వున్నారు. రసగ్రహణ పారీణులు వాటిని గణించరు. పద్యకవుల తలదన్నే పదకవులు (త్యాగరాయాదులు) యెందఱో వున్నారు. శ్రీహరినాగభూషణంగారి వంటి సంగీత సాహిత్య పరిపూర్ణులెవరేనా పదకవుల జీవిత చరిత్ర వ్రాస్తే బాగుంటుందని నాతలపు. నారాయణదాసుగారు వ్రాస్తే మరీ బాగా ఉంటుందిగాని ఆయన నాకన్నా చాలా వృద్దు. వీరేశలింగంగారు కవి జీవితాల్లో వీనిని అసలే స్పృశించక పోవడం యెందుచేతో, భవతు. పృథక్పాకానికి అవకాశం కల్గించినట్లయింది. కనుక సంతోషిద్దాం.

★ ★ ★