కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/కవిసన్మానం
కవిసన్మానం
స్వదేశోద్యమం ప్రారంభమైనాక మన ఆంధ్రదేశంలోనే కాదు; యితర దేశాలలో కూడా కవులకు సన్మానాలు జరుగుతూవున్న సంగతి అందఱూ యెఱిఁగిందే. ఆ సన్మాన సందర్భంలో ఆయా కవులకు కొన్ని బిరుదాలుకూడా యివ్వడం కొన్నిచోట్ల జరుగుతూ వుంది. ఆ బిరుదాలు పూర్వకాలంలో వుండే బిరుదాలను అనుసరించే వుంటూ వున్నాయి గాని వాట్లను వ్యతిరేకించి మాత్రం వుండడంలేదు. ఇట్టిస్థితిలో 6వ అక్టోబరు 1937 సం!! ఆంధ్ర వారపత్రికలో "కుక్కలవల్ల లాభమేమిటి?" అనే శీర్షిక కింద కొన్ని మాటలు కుక్కలనుగూర్చి వ్రాస్తూ ఆ వ్యాసకర్త బుద్ధి పూర్వకంగా కాదేమో? కాని కవులకవిత్వానికిన్నీ కుక్కల అఱపులకున్నూ అసకృదావృత్తిగా పోలికను వుపపాదిస్తూ జనరల్‌గా కవుల నందఱిని కుక్కలనుచేసి వదలిపెట్టారు. “న దుఃఖం పంచభిస్సహ" కనక సర్వసామాన్యంగా వున్న వ్యాసకర్తగారి వుల్లేఖానికి యెవరుగాని విచారింపవలసి వుండనప్పుడు ఆ కుక్కల్లో వకకుక్క కలగఁజేసుకొని యేవో రెండఱపులు అఱవడం అవసరమే అయినను అసలు నేను అరవజాతిలో వాణ్ణి కావడంచేత కొంచెం అఱిచినందుకు వ్యాసకర్తగారు నన్ను క్షమించవలసిందని ప్రార్థిస్తాను. వ్యాసకర్తగారి వ్యాసంలో వున్న కొన్నిమాటలు మచ్చుచూపుతాను.
1) ఓ కుక్కకు యేం దురద పట్టిందో? . . మొదలు పెట్టింది కవిత్వం
2) అందులోనుంచి జంటకవివచ్చి అందుకుంది రెండోపాదం మఱో కుక్క
3) చివరపాదంలో పేరుతో సహా ఝమాయించి కొట్టింది పద్యపాదాలన్నీ
4) మఱో శ్వానకవితల్లజుఁడు బయలుదేరాఁడు తీర్పుదిద్దడానికి.
5) ఆపళంగా వేఁడెక్కింది కవిత్వవాతావరణం. వీటి దుంపతెగా! వూరుకుంటయ్యా? పంచరత్నాలు, నవరత్నాలు వ్రాసుకొచ్చినయి.
6) అదికాదండీ కవిత్వం ప్రపంచానికి అంత అవసరమే అయి...
వోహో పొరపాటు చేస్తూన్నానే! వ్యాసకర్తగారి మాటలు చూపడానికి మొదలుపెట్టాను. వ్యాసమంతా యీ కుక్కల అఱపును కవిత్వంతో అభేదంగా సమర్ధించడంతోటే ప్రవర్తించింది. వుదాహరించవలసి వస్తే నాలుగుకాలాలున్నూ వుదాహరించవలసి వస్తుంది గదా! అందుచేత ఆ పని పనికిరాదు. యీలా వ్రాయడం యేదో ప్రౌఢత్వం అనే తాత్పర్యంతో వ్యాసకర్తగారు వ్రాసివుంటారు కాని యేవ్యక్తినిగాని యే సంఘాన్నికాని మనస్సులో పెట్టుకొని వ్రాసినట్టు నాకు తోఁచదు. "ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః" ఆపద్ధతిని వ్యాసకర్త వుద్దేశ్యము విమర్శనార్హం కాదు. కాని “శుచిర్విప్రశుచిః కవి" అంటూ వేదందగ్గరనుంచీ పరిశుద్ధపదార్థంగా అంగీకరిస్తూ వున్నకవిజాతిని పరమాపవిత్రమైన కుక్కలనుగా లోకానికి ప్రదర్శించడానికి యేర్పడ్డ యీవ్యాసాన్ని పరిశీలించకుండా పత్రికాప్రవర్తకు లేమని ప్రకటించారో? కొంచెం విచారించవలసి వుంటుంది. కాని వారు మాత్రం ప్రతీవ్యాసాన్ని పరిశీలిస్తూ వుంటారా? గవర్నమెంటువల్ల చిక్కువచ్చే వ్యాసాలే కొన్ని ముందు ప్రచురించి తరవాత చిక్కుతెచ్చుకుంటూ వుండేవి వుంటూ వుంటాయికదా! అందుచేత వారిని అడిగినా ప్రయోజనం లేదు. వ్యాసకర్తగారి వుద్దేశాన్ని గురించే మనలో మనం కొంత చర్చించుకుని చూదాం.
శ్లో. “విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని
శుని చైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః"
అన్న గీతవాక్యాన్ని బట్టి గోవునూ, కుక్కనూ వకటేరీతిగా చూడడం దోషాపాదకం కాదని తేలడమే కాకుండా పైఁగా విజ్ఞానుల తాత్పర్య మైనట్టుకూడా కనపడుతూవుంది. కనక విజ్ఞానాగ్రేసరులైన వ్యాసకర్తగారు కవులను కుక్కలుగా చిత్రించివుంటారా? బహుశః ఆశ్లోకతాత్పర్యం తక్కువ జంతువును కూడా యెక్కువ జంతువులతోపాటు సమ్మానించడమే కనక,
శ్లో. శ్వాన కుక్కుట మార్జాల పోషకస్తు దినత్రయమ్
ఇహజన్మని శూద్రస్స్యా చ్చండాలః కోటిజన్మసు.
అనేరకంతో చేరిన కుక్కలకు గౌరవం కలిగించడమే వ్యాసకర్తగారి తాత్పర్యమనుకుంటే ప్రస్తుత కాలానుగుణ్యంగా కూడా వుంటుందిగాని వ్యాసకర్తగారి కొన్నివాక్యాలు దీనికిన్నీ అనుకూలిచండంలేదు. “1) వీటి దుంపా తెగా, 2) వీటితాడు తెగా వీటిని యెట్లా పుట్టించేఁడో? దేముఁడు" ఇత్యాదివాక్యాలు వ్యాసకర్తగారికి కుక్కలను గొప్పచేయాలనే తలఁపున్నదనడానికి వప్పుకోవు. యీ ఘట్టంలో కొన్ని వాక్యాలు కవుల కొంపలకే కాక గాయకుల కొంపలకు కూడా వ్యాసకర్తగారు అగ్గిదాఁకొల్పే వుద్దేశంతో వున్నట్టు కనపడతాయి. వకటి వుదాహరిస్తాను. 1) “ఒకసమయం సందర్భం లేకుండా ఒకటేరాగం, ఒకటే మెడపట్లు, ఒకటే తదరినాంతోం; పైఁగా త్యాగయ్య మాదేశంలో పుట్టాఁడని గర్వం”
కవులను గురించిన వాక్యాలకన్న ఈ వాక్యం యీ వ్యాసకర్తగారికి కొంత వుద్దేశం లోపల వున్నట్టే సూచిస్తుంది. త్యాగయ్య పుట్టినదేశం అఱవదేశం కనక ఆ మాటనుబట్టి దక్షిణాదిగాయకులను తట్టాబాజీచేసే వుద్దేశంతో వ్యాసకర్తగారి లేఖిని ప్రవర్తించిందను కోవడానికి అవకాశం వుంది. మొత్తం వ్యాసకర్తగారికి, కవులన్నా గాయకులన్నా బొత్తిగా పడదని ఆయా వాక్యాలు చెపుతూవున్నాయిగాని కొన్ని మాటలవల్ల యీయన అంతో యింతో యీ రెండిటియందున్నూ ప్రవేశం కలవారనికూడా తేలుతూవుంది. కవులకూ కుక్కలకున్నూ పోలిక చెప్పడానికి యింతవరకు నాకు ఆధారం అంత పనికివచ్చేది కనపడలేదుగాని గాయకులకుమాత్రం వకాయన చెప్పిన సంగతి జ్ఞాపకం వస్తూవుంది. దాన్ని వివరిస్తాను. భైరవరాగమంటూ వకరాగం వుందికదా! ఆరాగం కుక్కల ధ్వనులనుబట్టే ఏర్పడ్డదని శ్రీకృష్ణగానచటికా భాగవతులు సెలవిస్తూవుంటే విన్నాను. భైరవశబ్దం కూడా దాన్ని తెలుపుతూనే వుంది. ఆ రాగాన్ని పాడని గాయకులు వుండరు కనక యీ “బదరీబాదరాయణ" సంబంధాన్నిపట్టి వ్యాసకర్తగారి రచన కొంత సమర్థనీయంగా తోస్తుంది. వ్యాసకర్త సంస్కృతాంధ్రాలు అప్రధానంగా నున్నూ యింగ్లీషు ప్రధానంగానున్నూ అభ్యసించినవారుగా తోస్తారు. సంస్కృతాంధ్రాలు చదివినవారికంటె యింగ్లీషు చదివినవారి రచన మృదువుగా వుంటుందని పలువురంటారు. నాకు ఇంగ్లీషు రాకపోవడంచేత వ్యాసకర్తగారి రచనయందుండే మార్దవం పొడకట్టడం లేదేమో? ఆసంగతిని వ్యాసకర్తగారే వివరిస్తారు కనక విస్తరించేది లేదు. కవులను కుక్కలను చేయడానిక్కూడా వక ఆధారం దొరికింది. సుమారు యిప్పటికి యిరవై యేళ్లనాఁడు వొకానొక సంస్థానంలో దివాన్‌జీగారి యింటివద్ద దివాన్‌జీ గారికి సూత్రభాష్యం పాఠం చెప్పడానికి వొక విద్వత్కవిశిఖామణి దయచేశారు. ఆ సమయంలో అక్కడ ఒక వుద్యోగి మంచి వాచాలకతాశక్తి కలవాఁడు, అంతో యింతో కవిత్వంచెప్పేవాఁడు, హాస్యప్రాయంగా మాట్లాడేవాఁడు, దివానుగారితో బాగా చనువున్నవాఁడు కూర్చుని వున్నాఁడు. యీయన వచ్చిన కవిశిఖామణిని "దయచేయండి కవిశునకంగారూ!” అని సగౌరవంగా ఆహ్వానించేటప్పటికి దివాన్‌జీగారు నిలువునా నీరయిపోయి– “సరిలే! నేర్చుకున్నావు, నీకు సమయా సమయాలుగాని, యెవరి నేమాట అనాలో, యెవరిని యేమాట అనకూడదో అనే పరిశీలనగాని బొత్తిగా తెలియదు, యెల్లప్పుడూ వొకటేహాస్యం దిక్కుమాలినహాస్యం" అంటూ చీవాట్లు పెట్టడానికి ఆరంభించేటప్పటికి, ఆ తాబేదారు లేశమూజంకక - "యేమిటీ? నాకా తెలియకపోవడం మీకా? వినండి. పూర్వపు రాజులు వేలకువేలు వెచ్చించి యేనుఁగులను కొని వాట్ల పోషణకు వేలకువేలు ఖర్చుపెట్టేవారు. ఇప్పుడో? వున్న యేనుఁగులను అమ్మివేయడమే కాకుండా వేలకువేలు ఖర్చుపెట్టి రకరకాలు కుక్కలను కొని వాట్ల పోషణకు వేలకువేలు ఖర్చుచేస్తూ వున్నారు. ఆకాలంలో సమర్థులైన కవులను అష్టదిగ్గజాలని వాడడం గౌరవంగా వుండేది. యీ కాలంలోనో? ఆపేరుకు గౌరవంలేదు. రాజానుమతోధర్మః కాఁబట్టి శునకపదమే బాగుంటుందో? మరోపదంబాగుంటుందో చూడం"డని వుపన్యసించడానికి మొదలుపెట్టేటప్పటికి దివాన్‌జీగారు 'పక్కున' కడుపు పగిలేటట్టు నవ్వారఁట! యీ యితిహాసాన్ని బట్టి చూస్తే వ్యాసకర్తగారి రచన సమర్థనీయంగా తోస్తుంది. యింకా లోఁతుకు పోయి విచారిస్తే - "నానృషిః కురుతే కావ్యమ్" అని వుండడంచేత కవులు ఋష్యంశ సంభూతులని తేలుతుంది. ఆఋషి తండ్రి పేరు శునకశబ్దంకాకతీరదు. యిదిన్నీ శునశ్శేఫ-శునఃపుచ్చ-శునోలాంగూలపదాలతో వ్యవహరింపఁబడే ఋషులు వేదకాలంలోనే వున్నట్టు వేదమే ప్రమాణంగా కనపడుతుంది. యీ శబ్దాలు సాధించడానికే “శేఫ పచ్ఛలాంగూలేషుశునః" అంటూ పాణిన్యాచార్యుల వారు వకసూత్రాన్ని నిర్మించి వున్నారు. యీ కాలంలో క్రమంగా ఋషికులజులైన బ్రాహ్మణుల గౌరవం తగ్గినట్టే పూర్వకాలంలో బుషులంతగా గౌరవించిన శునకగౌరవం కూడా తగ్గిపోయిందని వ్యాసకర్తగారు ఆలోచించి మళ్లా వాట్ల గౌరవం వాట్లకు నిలిపే వుద్దేశంతో రచన సాగించి వుంటారేమో? మొత్తం యివన్నీ వుత్ప్రేక్షలు, అన్యబుద్ధి అప్రత్యక్షంకదా! యిప్పటి వాళ్ల కవిత్వం బొత్తిగా నచ్చక వ్యాసకర్తగారు వారి యేవగింపును యీద్వారాగా వెలిపుచ్చినట్టు తోస్తుంది. గాన విషయం కూడా డిటోగానే తోస్తుంది. అయితే వారి అభిప్రాయం యిది కాదేమో? కాదని వారు చెపితే మాత్రం వచ్చేసువాసన ఆఁగుతుందా? ఆఁగదు. అయితే సర్వజన సాధారణంగా ఆహ్లాదానికి యేర్పడ్డ సంగీత సాహిత్యాలమీఁద వ్యాసకర్తగారికీ ద్వేషాని క్కారణమేమో? అదిన్నీ విచారణీయమే. దానికి సమాధానం కనపడుతుంది, యేమిటంటే ఆ విద్యలను వీరు ద్వేషించడంలేదు. ప్రస్తుతం ఆవిద్యలను ప్రకటించేవారి ప్రజ్ఞాలోపాన్ని ద్వేషిస్తున్నారంటే సరిపోతుందిగా! ఆ సరిపోతుంది. కాని ఆయన తరపున మనమా? జవాబు చెప్పడం. ఆయనే చెపుతారు, లేదా? పత్రికవారేనా చెపుతారు. వారూ చెప్పరు. వీరూ చెప్పరంటారా? యీ కాలంలో కవులకున్న గౌరవ మింతే కాఁబోలు ననుకోవడమే. వ్యాసకర్తగారి వ్యాసాన్ని పలువురు కవులు చదివి వుంటారుకదా! వారెవరున్నూ కిక్కురుమనక వూరుకుంటే మీరే దీన్ని కదపడం యెందుకు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం నామీఁద వుంటుంది. జవాబు కేముంది? యెవరు దీన్ని కదిపితే ఆ ప్రశ్న వారికే వస్తుంది. తగినంత వుద్దేశం లేకపోయినా వ్యాసకర్తగారికి కవులంటే పరమాసహ్యం అన్నంత వరకు దొంగాఁడి చేతులో పెట్టినా సారం తేలకమానదు. పయిగా ఆయన వుద్దేశాన్ని బట్టి చూస్తే కవి గాయకులంటే గడ్డిపరకలకన్నా కనిష్ఠంగా కనపడుతూ వున్నట్టు విస్పష్టమవుతుంది. అలా కనపడితే కనపడనివ్వండిగాని ఆసంగతిని బయట పెట్టడం యెందుకో? నాకు గోచరించడంలేదు. అంత నీచంగా కనపడుతూవున్న కవుల సన్మానాల్లో పాలుగొనకపోవచ్చును, లేదా? జరిగే సన్మానాలను తగినంత యత్నంచేసి ఆఁపుచేయవచ్చునుగాని దిక్కుమాలిన కుక్కలతో సామ్యం చెప్పడం యెందుకోసమో? కొందఱు యెక్కువ ప్రౌఢంగా మాట్లాడడానికి మొదలు పెట్టి తుదకు- "టెంకాయ పిచ్చికొండ” చేయడమున్నూ లోకంలో కనపడుతుంది. ఇది ఆ తెగలోకే చేరుతుందేమో? కొందఱు భక్ష్యపదార్థాలను పోల్చి మాట్లాడడం కలదు. ఆలాగే కుక్కల అఱపుతో కవుల కవిత్వాలకు చుట్టరికం కల్పివున్నారేమో? వ్యాసకర్తగారు. యేమేనా యీవ్యాసం వ్రాయడం కవులని తిట్టడానికి తప్ప కుక్కలని తిట్టడానికని కనపడడం లేదు. చూడండీ! యీ వాక్యాన్ని
“ఎప్పటినుంచో ఉన్నవాణ్ణి పండితుణ్ణి నేనిక్కడ వుండఁగానేనా? మీ ఆటలు సాగడం అంటూ, మిఠాయిదుకాణం పొయిలోనుంచి దూకింది మఱోకుక్క"
యీ వాక్యం పండిత కవులమీఁద వ్యాసకర్తగారికి వున్న కోపాన్ని పూర్తిగా వెల్లడిస్తూ వుంది.
“ఇంతలో మొరుగుడు శాస్త్రంలో మర్మం తెలిసిన మఱో కవి తల్లజుడు" అనే వాక్యం చెప్పనే అక్కరలేదు. వెనక శ్రీనాథుగారు కొండవీటిలో యెక్కడపడితే అక్కడే కవిత్వం చెప్పేవాళ్లు బయలుదేరడం చూచి వక గాడిదను వుద్దేశించి - కొండవీటిలో గాడిద! నీవునున్ గవిని గావుగదా? అంటూ ఒక హేలగా వక పద్యాన్ని చెప్పినట్టు వినడం. అయితే ఆయన లోకోత్తరుఁడైన కవి కనక ఆయన దృష్టిలో సామాన్యులు నచ్చక ఆలా చెప్పినా కొంత సమర్థనీయం కావచ్చు. వ్యాసకర్తగారు ఆలాటి మహాకవి అని తోఁచడంలేదు. అంతటి మహాకవి కాదు కొంతటికవేనా అయివుంటే - “తపోచిహ్నాలు” అని వ్రాయ తటస్థించదనుకుంటాను. వ్యావహారికభాషలో యెలా వ్రాస్తే యేముంటాది వ్యావహారిక భాషలోనేనా యీలాటిలోపాలు సహ్యాలు కావు. వాటి జవాబు చూస్తేనేకాని యీ వ్యాసం వారెందుకు వ్రాసిందీ తేలదు. జవాబులుగా వ్రాసిన మాట మాత్రం సత్యం. యెవరుగాని దీన్ని- "కాలినిపోయేదాన్ని నెత్తినిరుద్దుకో" వలసి మాత్రం లేదుగాని మొత్తం కవులందఱు కలిగించుకోవలసినంత అనాలోచన లేదా? తొందరపాటు దీనిలో కనబడుతూంది. కవుల తరువాత గాయకులకున్నూ వారి తర్వాత సన్యాసులకునూ కలిగించుకోవలసిన ప్రసక్తి దీనిలోవుంది. యెవరిక్కావాలి? దీరి కూర్చున్నవాణ్ణి కనక తోఁచీ తోఁచని యీ మాటలు రెండూ నేను వ్రాశానుగాని యితరులు కలగఁజేసుకోరు. ఆలా అనడానికిన్నీ వల్లకాదు. వెనక “ఆంధ్రకవుల అపరాధాలు” అంటూ బయలుదేరితే ఊరుకున్నారా యెంతవఱకు చేయాలో అంతవఱకున్నూ చేశారుగదా? యీ వ్యాసకవిగారు యేదో వక విధమైన కవిత్వం లోకాన్ని వుద్ధరిస్తుందనే నమ్మకంకలవారుగా వారి వ్యాసాంత మందలి యీ కింది వాక్యంవల్ల తేలుతుంది దాన్ని వుదాహరించి రెండు మాటలు వ్రాసి ముగిస్తాను.
"కుక్కలు మొరుగుతూనే వుంటాయి. ఏనుఁగులు పోతూ వుంటాయి. అని దాని అభిప్రాయం. ఇదే ప్రకృతి విరుద్ధం అయిన కవిత్వమంటే? ఇల్లాంటి కవిత్వమే మన హిందూదేశం ఇంత నీచస్థితిలో వుండడానికి కారణం."
యీ వాక్యం ఆయన యేలాటి కవిత్వాన్ని మనసులో పెట్టుకొని వ్రాశారో? చట్టన గోచరించకపోయినా ఆయనకి యేమాదిరి కవిత్వ మందో ఆదరాతిశయం వుందనిమాత్రం తెలుపుతుంది. దీన్నిబట్టి కవిబాంధవులని తేలుతుంది. ఆలాటి కవిత్వాన్ని యిప్పటి కవులలో వకరు కాకపోతే మరివకరేనా చెప్పకపోవడంచేత పట్టరానికోపం వచ్చి కవులందఱినిన్నీ కుక్కలుగా చేసే కృతకృత్యులైనట్టున్నూ పత్రికవారు దీని తత్వాన్ని అశ్రద్ధవల్ల పరిశీలించక లోకానికి అందించినట్టున్నూ నాకు తోస్తుంది. యీ విషయం అంత అత్యావశ్యకమే అయితే వ్యాసకర్తగారు స్వయంగానే ప్రకటించుకొనేవారు. ఆలా ప్రకటించుకోతగ్గ దీన్ని పత్రికవారుపేక్షిస్తే కొంత బాగుండేదేమోనని నేననుకున్నాను. యీ వ్యాసకర్తగారు తమ పేరును వుదాహరించే వున్నారుగాని అల్లా వుదాహరించినా "ఫలానా" అని నాకు గోచరించలేదు. కాని సుప్రసిద్దులై వుంటారన్నది మాత్రం నిర్వివాదాంశం. యీవ్యాసం వ్రాయడంలో వారికివున్న అంతరంగాభిప్రాయం యెట్టిదో తెలిపితే సంతోషం, లేదా అంతకంటే సంతోషం. యెంత సవిమర్శంగా దీన్ని చదివిచూచినా యిది కుక్కలకే సంబంధించిన వ్యాసంగా మాత్రం నాకు తోcచడంలేదు. కుక్కలు ఆ మాదిరిగా మొరగడాన్ని గూర్చి లోకానికి తెలపవలసినంత అవశ్యకత వుంటుందని తోఁచదు. అది సర్వసామాన్యమైన విషయం. వ్యాసమన్నప్పుడు అందులో యేదో కొత్త విషయం వుండి అది తాను మాత్రమే కనిపెట్టిందయితే “ఏకస్స్వాదు న భుంజీత" అనే న్యాయాన్ని బట్టి యితరులకు కూడా ఆ మహా రహస్యాన్ని బోధించే తలంపుతో పత్రిక కెక్కించవలసి వుంటుంది. అట్టి రహస్యం దీనిలో వుంటే వ్యాసకర్తగారు తెలుపుతారని తలుస్తాను.
★ ★ ★