కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/అపవాదలు



అపవాదలు

అనఁగా నెవరిమీఁదనేని లేనినిందను మోపుటయని సామాన్య జనుల వాడుక, కాని బాగుగ విమర్శించినచో నిందను మాత్రమేకాక లేని సుగుణము నాపాదించుట కూడా అపవాదమే యగునని పరిశీలకులకు, తోఁచకమానదు. ప్రస్తుత మీవిషయమై వ్రాయుటకుఁగల బీజము నుదాహరించి పిమ్మట దీనిం గూర్చి ప్రస్తావించెదను.

విశాఖపట్టణం డి. భీమునిపట్నమునుండి, బ్ర|| శ్రీ|| గడ్డం ఆదినారాయణశర్మ ఉపాధ్యాయుఁడుగారు 31-03-35 తేదీని నాపేర నిట్లు వ్రాసినారు-

"తమరు శతావధానము చేయునపుడు, ఏవిషయమైన స్ఫురణకు రానిసమయమున ‘అంబా' యని అనుకొనుటయు ఆయమ్మ అనుగ్రహము వెంటనే కలుగుచుండుటయు, కలదని తెలిసిన పెద్దలవలన వింటిని. ఇది నిజమా?"

జవాబు

అయ్యా! ఇది నిజముకాదు, కేవలమసత్యము, స్ఫురణకురాకపోవుట కల్గినప్పుడు ఊర్ధ్వదృష్టిమీఁదఁగొండొకసేపు యోజించుట మాకేకాదు ప్రతిమనుష్యునకును స్వభావమే. అట్టి సమయములో, ఆస్తికుడగు ప్రతిమనుజునకును, ఇష్టదేవతను స్మరించుటకూడ సహజగుణమే కనుక మేముగూడ నెప్పుడేని మనస్సులో నట్లు ఇష్టదేవతయగు కాళికను స్మరించియుందుమేమో, దానింబట్టి ప్రపంచమునందలి పెద్దలలో మాయందు విశేషాభిమానముగల వారట్లనికొనియుందురు. అదియుంగాక మేము అవధాన మారంభించుటకుముందు

శ్లో|| నాళీకజాద్యదితిజాళీశిరఃకలిత||

లోనగు నస్మత్కృతశ్లోకములు పఠించుటగూడ వారియూహను బలపరచి యుండును. ఈశ్లోకపఠనమేకాక, ఆయాయవధానములయందు తత్తత్కాలోచితముగా మేము-

“ఉll ధారణనిల్చునా? నిలువదా?”

ఇత్యాది పద్యములు దేవియనుగ్రహము నభ్యర్థించుటను దెల్పునవి రచించుట కలదు. దీనివలననేమి, ఆత్మకూరు రాజుగారిచ్చిన గ్రంథమును తెలుఁగుజేయు సందర్భములో

"మాకునెట్టి దుష్కరమగు కార్యమేని కొనసాఁగఁజేసెడి తల్లి
 కాళియున్| బరమకృపారసంబు పయిపై వెదఁజల్లి యనుగ్రహింపదే"

అని నొడువుటంబట్టియేమి మఱికొన్ని పద్యములవలననేమి మీఁకు జెప్పిన పెద్దలకు-

“తిరుపతి వేంకటకవులకు శ్రీకాళీమహాదేవి తోడఁబల్కును”

అను నపోహ జనించియుండును. అహంకార నిరాసార్థము మనలో ననేకులు పెద్దలట్లు స్వకీయప్రజ్ఞా విశేషములను భగవంతునియం దాపాదించుట కలదు. శ్రీపోతరాజుగారు-

“క. పలికెడిది భాగవతమఁట! పలికించెడువాఁడు రామభద్రుండట!" అన్నారు. ఇట్లే పలువురు పలికిరి. మేమును అట్లే అనునది ముఖ్యాంశము. ఇంతమాత్రముచే మేము భగవద్భక్తిలేనివారమని కానీ, నాస్తికులమనికాని మీరుగానీ, లోకులుగాని భావింపకుందురు గాక. మనుష్యుడు నిమిత్తమాత్రుఁడనియు సర్వమునకు భగవంతుఁడే కర్తయనియుఁ జెప్పెడి సిద్ధాంతమును మేము శిరసావహించువారిలోఁ జేరినవారమే. కాని మాకు శ్రీకాళీమహాదేవి ప్రత్యక్షమను నపవాదమును మాత్రము మేము మోయఁజాలము. అసత్యమైనను మంచిదేకదాయని సంతసించి మిన్నకుందుమేని పిమ్మటఁ గొన్నిచిక్కులు కలుగవచ్చును. మొదటినుండి మముమంత్రోపదేశమునకుఁగా నాశ్రయించి పీడించువారితో ఒట్లు, సత్యములు పెట్టుకొని, మేము మంత్రశాస్త్రవేత్తలము కామని యెంత మొఱ్ఱవెట్టి చెప్పినను వారువిశ్వసింపక యీప్రవాదమును వ్యాపింపఁజేయుచు నుండెడివారు. ఒకపరి శ్రీఆత్మకూరు సంస్థానపు వివాదాల సందర్భములో, ఆగ్రామమున చలిజ్వరబాధ విశేషించి యున్నది. దానిబారిని రాజుగారుమొద లెల్లరును బడియేయుండిరి. మాకు, ప్రతికక్షియగు శ్రీ శ్రీనివాసాచార్యులుగారును దానిబారిఁబడి యంతంబోక రక్తగ్రహణిచేఁ బీడితులగు సమయమున ఆయనకే తోఁచినదో? లేక యెవరేని బోధించిరో? నిజము భగవంతున కెఱుక ఈరక్తస్రావమునకు కారకులు శతావధానులని యొకపుకారుపుట్టించి దాని నివారణకుఁగా నెక్కడనుండియో శాబరతంత్రజ్ఞులంబిలిపించి యేమేమో చేయించుసందర్భ మెట్లో శ్రీరాజావారికిఁ దెలిసి వారిట్లు మందలించిరి. “మీరు వ్యాధినివారణ కౌషధసేవ చేయుటకు బదులు నిరుపయోగమగుపని చేయుచున్నారు. శతావధానులకు మీరనుకొన్న ప్రజ్ఞ లేకపోలేదు, ఏప్రజ్ఞయు లేకున్నచో, ఇంతదూరమువచ్చి ఇక్కడవారికన్న నెక్కుడుగా సంస్థానపండితులతో ఢీకొని పోట్లాడగలరా? అగుచో "మా మీఁద వారి శక్తి నెందుకు ప్రయోగించలే” దందురేని, ఇక్కడ మాకు గ్రంథము కృతి యిచ్చి మా వల్ల వృత్తి (అగ్రహారము) కూడ స్వీకరించి మాకు ముఖ్యులైన మీ పట్ల దాని నుపయోగించునెడల మా మీఁద గూడ నుపయోగింపవలసినదే." ఇట్లు శ్రీరాజావారు మందలించినమీఁద వారాయుద్యమమునుండి విరమించిరి, కాని మాకు మాత్రము కలిగిన అపవాదను రాజుగారుకూడ విశ్వసించినట్లేకదా, ఒకపరి గద్వాలలోఁగూడ నిట్టిదే జరిగినది. దానిఁగూడ నుదాహరించుట అప్రస్తుతము కాదు. మా శతావధానము జరిగిన మఱుచటి వత్సర మొకకవివర్యుఁడవధానమునకుఁ బూనుకొనెను. ఈయన శాస్త్రవేత్త, కవి. అవధానమెన్నఁడును జేసినవాఁడుగాఁడు సరికదా చూచిన వాఁడుగూడఁగాఁడని నేను అప్పటికి గతమైన వత్సరమే గ్రహించితిని. ఎట్లనగా ఈయన శతావధానము, గంటలేక రెండుగంటల కాలములోc జేయవచ్చునని నాతో నిష్కర్షగా నుడివెను. ఈమాట విన్నది మొదలు ఈయన వట్టి యమాయకుఁ డనియు, కవిత్వముచెప్పిన జెప్పవచ్చునేమో కాని అవధానము మాత్రము చేయనేరఁడనియు గ్రహించితిని. తుదకట్లే జరిగినది. ఎంతో మందికిఁగాదు. 25గురు మాత్రమే పృచ్ఛకులు. శ్రీ గద్వాలరాజావారికి మా అవధానము చూడని పూర్వము అవధానమనినచో నిష్టమేలేదు. చూచినపిమ్మట వేఱొకరిది చేయఁగలరని నమ్మకము లేదు. అందుచేత 25 గురినిమాత్రమే యేర్పఱచినారు. శ్రీ రాజావారి హృదయమునఁగూడ మాకు దేవి ప్రత్యక్షమనియే దృఢనిశ్చయము, ఈకవి 25 గురకే పూర్తిచేయలేక తప్పినతోడనే మేము ప్రస్తావవశమున

“శతావధానకవితా సామ్రాజ్యపట్టాభిషేకముఁ బొందంగను మాకు, దక్కఁగలదే గద్వాలభూపాలకా!"

(నానారాజసందర్శనము చూ.)

అను పద్యమును జదివితిమి. ఈ మాట శ్రీ రాజావారి వుద్దేశమును మఱింత బలపఱచి యుండనోపు. అది యటులుండె, గంటకో లేక రెండు గంటలకో, శతావధానము చేయఁగలమన్న వారింగూర్చి వ్రాసినమాలిక

“బళి బళి యెంత వింతయో"

అన్నది నానారాజసందర్శనములో నచ్చయి యున్నది. అది యీ కవిని గూర్చినదియే, సందర్శనములోని పద్యములలో ననేకముల కిట్టి యుపోద్ఘాతము వ్రాయవలసినది కలదు. అది తద్‌జ్ఞులవలన నెఱుఁగుదురని యందందుదాహరింప మైతిమి. ఉదాహరించినచో నెంత పెరుఁగునో చెప్పఁజాలము. ఇది యిటులుండె, మఱి యెనిమిదేండ్లకు కర్నూలు ప్రాంతమున నుండి యేలూరికి నేత్రావధానమున కనివచ్చిన వేదవేత్తలవలన, ఆగద్వాలలో నాఁటియవధానమున, ఆకవి తప్పినది మాప్రయోగతంత్రమువలననే, అని తేలినది. ఆయేలూరిలో వారి నేత్రావధానముకూడ నట్లగునేమోయని వారు నాబసకు వచ్చి నన్ను మిక్కిలిగాం బ్రార్ధింపఁదొడఁగిరి. నాకు మిక్కిలి సిగ్గైనది. ఏమైన నేమి, యథార్ధముచెప్పిన వారువిందురా? వినరు, ఇట్టివనేకములు. ఒకటి శతావధానసార పీఠికలో నుదాహరించియే యున్నాము. అది గోదావరీమండలము. మండపేటకు సంబంధించినది. ఈ భ్రాంతి వడినవారు ఆపాదుకాంతదీక్షాపరులు బ్రII శ్రీ|| ఆదిభట్ల రామమూర్తిశాస్త్రులవారు, “ఆపాదుకాంత" పదమువల్ల జ్ఞప్తికివచ్చినది. నన్నేమో, ఇట్టి మహానుభావులందఱును మంత్రశాస్త్రవేత్తనుగా. - అంతమాత్రమేకాదు, మంత్రసిద్ధిని పొందినవానినిగాc దలఁచుచున్నారు కదా? నా ప్రజ్ఞ యెంతయో? ఈ విషయమున నీక్రిందిసంగతివలన విజ్ఞులరయుదురు గాక! నేను ఇప్పటికి 5, 6 సంవత్సరములకు పూర్వము వఱకును “ఆపాదుకాంతదీక్ష" అనఁగా పావుకోళ్లు తొడిగికొని సర్వదా నడచునంత గొప్పదనముగల మంత్రశాస్త్రజ్ఞులకు సంబంధించినదని యనుకొనుచుండు వాcడను. సంప్రదాయార్థ మెటులున్నను, సామాన్యముగా, ఆపదమునకు తోఁచు నర్ధముకూడ నిదియే. ఇటీవల నా కాపదమునకుఁగల యథార్థ మొక విజ్ఞుఁడు చెప్పఁగాఁ దెలిసినది. ఆ విజ్ఞుని పేరిపుడు జ్ఞాపకము లేదు. ఆయన మా తిరుపతిశాస్త్రి గారికి మంత్రశాస్త్రగురువు. మీరు మంత్రశాస్త్రవాసనయేలేదని చెప్పుచున్నారే? స్వవచో వ్యాఘాతముగా మరల తి. శా. గారికి మంత్రశాస్త్ర గురువున్నట్లు వ్రాయుచుంట కర్థ మేమందురా తి. శా. గారు అవసానకాలమునకు నాలుగేండ్లకు ముందు మంత్రశాస్త్రమున మిక్కిలిగాఁ బరిశ్రమ చేసిరి. అందువలన నతనికి గురువేర్పడియెను. ఆయన అన్నవరములో నొకపరి కన్పట్టి నన్నుఁగూడ నుపదేశము పొందవలసినదని ప్రస్తావించెను. నేను తపశ్శక్తిలోపమువలన నిరాకరించితిని. దీనితత్త్వమిది. ప్రస్తావనలో ఈ తిరుపతిశాస్త్రిగారి గురువువలన— "ఆపాదుకాంతదీక్ష" అనఁగా నేమొ తెలిసికొంటిని. తేలినసారము : మా యిరువురకుఁగూడ గద్వాలాదులు వెళ్లునప్పటికి మంత్రశాస్త్ర ప్రవేశము సుంతయులేదనియు తి|| శాII గారికి మాత్రము అవసానకాలమున కించుకపూర్వము తచ్ఛాస్త్ర ప్రవిష్టతకల్గినది కాని నాకిప్పటికిని లేనేలేదనియు తేలినది. కాళీసహస్రములో “అమంత్రోపాసకౌసంతౌ" అని వ్రాసితిని. ఇట్లు కంరోక్తిగా నచ్చటచ్చట నేను వ్రాసినను లోకము దీనియెడల నిశ్చయము లేకయేయున్నది. ఉపదేశమునకై వచ్చి యాశ్రయించు పలువురతోనే నీవిషయమును చెప్పచునేయున్నాను, వారుమాత్రము విశ్వసించినట్లులేదు. ఇట్లు చెప్పుట మానలేదు. నాకుఁ దెలిసినదెంతో అంతే యొప్పుకొనుట సమ్మతము. కాని చాలమంది తెలియని విషయము తెలిసినట్లితరులకు నెక్కింపవలయునని మిక్కిలిగాఁ బ్రయత్నింతురు. కొందఱు కావ్యసాహిత్యముమాత్రమే సంపాదించుకొని కవిత్వరచన చేయుచుఁ బేరు ప్రతిష్ఠలు సంపాదించికూడ, అన్నా! మనకు శాస్త్రప్రవేశము లేదను నపవాదము తొలఁగు టెట్లని దానికై బ్రహ్మాండమైన ప్రయత్నము చేయుచుందురు. అంత మాత్రమున ప్రాజ్ఞలోకము వారిని శాస్త్రజ్ఞులనుగాఁ గైకొనదు. కైకొనకున్నను వారు ప్రయత్నము మానరు. లేనిప్రజ్ఞను, ఉన్నట్లు మేమును నొప్పికొంటిమే యనుకొందము. పనివడినప్పుడు ఆ ప్రజ్ఞను చూపఁగలమా? లేము. మేము గురుసన్నిధి నభ్యసించినది వ్యాకరణము మాత్రమే. లోకులుకొందఱు మమ్మును, తదితరశాస్త్రములను గూడ వచ్చినవారినిగా వ్రాయుచుందురు. ఈ వ్రాఁతకూడ దేవీప్రత్యక్షపు కథవలెనే అపవాదమని లోకు లరయుదురుగాక. మేము మాత్రము “శబ్దశాస్త్రప్రశస్తప్రభావం బాతపత్రమ్ము దివ్యచారిత్ర మాకు” అనియు 'గురుపాదసేవనాదరలబ్ద మగువిద్య నాగరాజ ముఖోదితాగమంబు' అనియు “అ ఇ ఉ ణ్ మొదలుగాఁగ" అనియు, అక్కడక్కడ శబ్దశాస్త్రమును మాత్రమే నేర్చితి మనునంశమునే ప్రకటించుచు వచ్చితిమి. ఇఁక నొకటి. మేము చదివిన దింతమాత్రమే యైనను మా ముఖ్య గురువరులు బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రులవారి పాండిత్యముమాత్రము సర్వతోముఖమైనది. వారు వ్యాకరణపాఠము చెప్పుచున్నప్పుడు పూర్వమీమాంసాది శాస్త్రములయందలి విశేషాంశములు తఱచు దొఱలుచుండెడివి. మాకు గ్రహణధారణములు భగవద్దత్తములయి చిన్నప్పటినుండి యుండుటచే వారు నొడివిన విశేషములన్నియుఁ గాకున్నను గొన్నియేని జ్ఞప్తియందుండెడివి. అందుచేతనేమి, ఇటీవల దేవీభాగవతాంద్రీకరణము వల్లనేమి. యేస్వల్పమో మఱియితరశాస్త్రప్రసక్తి యాత్మకుపకరించునంత కలిగినను అది ఇతరులకు గురుత్వ మొనర్చుపాటిదిగాదు. మా ప్రధానగురువు సర్వశాస్త్రవేత్త, వారివద్ద మే మభ్యసించినది మాత్రము వ్యాకరణ శాస్త్రము. స్వబుద్ధిచే నార్జించుకొన్నవి చాల విషయములు గలవు. అవి సాహిత్యమును బలపఱచునేకాని శాస్త్రమును బలపఱుపనేరవు. పనిచేసినచో నంతో యింతో మాకు, "శబ్ద శాస్త్రమువచ్చునుగాని తక్కు శాస్త్రములురావు" అనుట స్వభావోక్తి పెద్దలెన్నినేర్చినను- “నహి సర్వ స్సర్వం విజానాతి" అని యూరక యనలేదు. సర్వజ్ఞత్వ మనఁగా? సర్వశాస్త్రవేత్తృత్వము సంభవింపదు. కావుననే, “సర్వజ్ఞనామధేయము శర్వునకే". “అనభ్యాసే విషంశాస్త్రమ్” అని పరంపరగావచ్చుచున్నది. శాస్త్రములనఁగా నన్నియు శాస్త్రములుగావు. తర్క వ్యాకరణ, పూర్వోత్తరమీమాంసలే శాస్త్రములు. ఇందు మొదటి రెండును గురుశుశ్రూషచేసి సంపాదించినచోఁదక్కు రెండును గొంత సులభసాధ్యము లనుటకు సందియములేదు. ప్రసక్తాను ప్రసక్తముగా శాస్త్ర ప్రస్తావనలోనికి విషయము కాలిడుచున్నది. మాకు అమ్మవారు తోడఁబల్కుననునది ప్రవాదమాత్రముగాని నిక్కము గాదను నదిప్రధానాంశము. మాకాపెయందు భక్తి మాత్రము విశేషించి కలదు. దైవవశమున మా యిరువుర కుటుంబములును శ్రీకామేశ్వరి యిలువేల్పుగా గలవియేరైనవి, అయినను మా తిరుపతిశాస్త్రిగా రవధానములలోఁ దక్క దేవీవిషయమున నంతగా భక్తిందెలుపు కవనము రచింపలేదు. నాకు అవసరము కలుగుటచే 1. కామేశ్వరీ శతకము. 2. ఆరోగ్యకామేశ్వరి, లోనైనవి వ్రాయవలసి వచ్చినది. అందలి సంగతులన్నియు ఫలించినవనిగూడ వ్రాయుచున్నాను. ఇంతమాత్రమేకాదు. నాకు ఈ 65 వత్సరముల కాలమునందును జాలసార్లు స్వప్నప్రత్యక్షముకూడ జరిగినది. ఈస్వాప్నిక ప్రత్యక్షము లనేకులకుఁ గలుగవచ్చును. అవి వారి వారి భావనల ననుసరించియుండును. అంతమాత్రమున వారికాదేవత ప్రత్యక్షమని వారుగాని, లోకులుగాని తలఁచుట యుక్తిసహముకాదని నేననుకొందును. ఆయీ భావనలుగూడ భిన్నభిన్నములు. శైవులకొకమాదిరి, వైష్ణవుల కొకరీతి, శాక్తేయుల కొకతీరు, మహమ్మదీయులకొకఫక్కీ క్రైస్తవుల కొకఠేవ. అంతమాత్రమున దేవతలు ప్రత్యక్షమైనట్లు వారు కాని ఇతరులుగాని నిశ్చయించుకోరాదనియే నేననుకొందును. స్వప్నమనఁగా సామాన్యముగాదు. మనుజుఁడు నిజముగా సుఖమునుగాని, దుఃఖమును గాని యనుభవింపవలసినచో స్వప్నమందే యనుభవింపవలయునుగాని జాగ్రదవస్థలో నేమున్నది. పుట్టమట్టి, వేదాంతశాస్త్రమంతయు స్వప్నమునే యాలంబించియున్నది. అదియటులుండె. నాకొకప్పుడు నూజివీటిలో నుండఁగా స్వప్నమున శ్రీకాళికావిగ్రహము పొడకట్టినది. ఆపెమోకాళ్లు పెద్దతాటియంత ప్రమాణముగ నున్నవన్నచో శిరస్సెంతవఱకుండునో వ్రాయనక్కఱలేదుగదా! ప్రత్యక్షమైనచోటొక మహారణ్యము. సమయము తెల్లతెల్లవారుతఱి. నేను భయసంభ్రమములతో గద్గదస్వరమునఁ గొన్ని పద్యములుకూడ నప్పుడు చెప్పుచు నామహాదేవి పాదములపైఁబడి నుతించితిని. కాని యీ పద్యములు మేల్కొన్నపిమ్మట జ్ఞప్తికిఁదగులవయ్యె మోకాళ్లు మునుఁగువఱకును పూజకుసంబంధించిన పుష్పములును, కుంకుమయును రాశిపడియున్నది. అట్లు పద్యములతో నుతించునావీఁపుమీఁద నాదేవి తన చేతితో నిమిరి “వాఁడేcడిరా" అని, తిరుపతిశాస్త్రిని గూర్చియడిగినది. ఈమాటకేమి బదులు చెప్పితినో యిపుడుజ్ఞాపకములేదు. ఇంతవిలక్షణముగాఁగాకున్నను, చాలసారులిట్లే జరిగినది. ఇంతమాత్రమున దీనింబట్టి ప్రత్యక్షమైనదని యెవరను కొందురు? కాని యొకటి మాత్రమున్నది. ఇట్టి సంగతి జరిగిన కొలఁది కాలమున కేదో మంచి కలుగుట మాత్రము కలదు. ఇందులకు స్వప్నశాస్త్రజ్ఞు లంగీకరింతురు. ఈ నూజివీటి ప్రత్యక్షగాథ జరిగిన మఱునాఁడే నేను బందరు హైస్కూలు పండితుఁడనుగా నాహూతుఁడనై వెళ్లవలసి వచ్చినది. అక్కడనే గ్రంథ రచనాదులవలన నాకు విశేషించి మంచి కల్గినది. ఇంతమాత్రమున నాకు శ్రీకాళికాదేవి ప్రత్యక్షమని లోకుల ప్రవాదముతో బాటు నేనుగూడఁ జెప్పికొన మొదలిడినచో నెందఱకో యెన్నో చిక్కులు దీర్పవలసివచ్చును. అది చేతఁగాదుగదా? చదువని శాస్త్రము చదివినట్లు ప్రచురించు కొన్నవారు పాఠముచెప్పలేక పరాభూతులైనట్లే నేనును గావలసివచ్చును. కాన లోకులభిమానతిశయముచే నాయం దాపాదించు మహత్త్వమును నేనపవాదమునుగాఁ బరిగణించి యిందుమూలమునఁ దొలఁగించుకొను చున్నాఁడను. నేఁటికి సుమారు 16 యేండ్లనాఁడొక బ్రాహ్మణుఁడు నాయొద్దకువచ్చి, తాను కొన్ని వత్సరములనుండి దేవినుపాసించుచున్నట్లును, ఆయుపాసనకు సంబంధించిన సంతర్పణలక్రిందఁదనకుఁగల భూవసతి యావత్తును గడతేఱినట్లు, చెప్పి ప్రస్తుతము మిగిలినది కడుస్వల్పమనియు, ఇంతవఱకు నేమాత్రమును లాభము కలుగలేదనియు ఈమధ్యమాత్రము స్వప్నములో దర్శనమిచ్చి మీవిగ్రహమును జూపి: “నీకు వీరివలనఁ గృతార్థత కల్గును" అని చెప్పినదనియుఁ జెప్పి నన్నుఁబీడింపఁ జొచ్చెను. నాకేమియుc దెలియదని యాయనకెంత చెప్పినను నామాటలు చెవికెక్కలేదు. తుదకాయనకు దేవీభాగవతములోని కుమార్యర్చనా విధానమునుజెప్పి దీనివలన నీవు కృతార్థుఁడవగుదువని గంభీరముగ దీవించి పంపితిని. పిదప నేమిజరిగినదో కాని ఆయన మరల నాయొద్దకింతవఱకు రాలేదు. ఆయన గ్రామము మా గ్రామమునకు నాతి దూరమున నున్న రామచంద్రపురమునకు సమీపము నందలిదని జ్ఞాపకము. నా జీవితములో నన్నిట్లు పీడించి మోమోటపెట్టిన వారు పలువురుగలరు. వారిలో నేను పలువుర పేళ్లుగూడ నెఱుఁగుదును. వారిప్పుడు కవులై అక్కడక్కడ నెట్టెట్లో అవధానములుకూడఁ జేసి కొంత గౌరవమును సంపాదించుకొని యున్నవారగుటచే వారిపేళ్లిందుదాహరించుట యుక్తముకాదని మిన్నకుంటిని. ఏదోపూర్వజన్మమున నంతో యింతో దేవీపూజ చేసితిమేమో? లేనిచో ఈ నాలుగక్షరములును చిన్నమాట నప్రయత్నముగ రావేమో? మీవంటి వారిలోఁ బలువురాదరింపరేమో? అని మేమును అప్పుడప్పుడు మాలో ననుకొనుచుండువారము. ఇట్లనుమాన ప్రమాణము తప్పమాకుఁ బ్రత్యక్షప్రమాణము లేశమునులేదని లోకులకు మనవిచేయుచున్నాను. ఈయంశము మాపొత్తములలోc జాలచోట్ల నుపలబ్ధమగును. అయినను దిజ్మాత్ర మదాహరింతును

శా. ఈజన్మమ్మునఁ గొంచెమేయనుము మున్నేజన్మమందేని నీ
    పూజన్ బూర్తిగఁజేసె వీcడదికతమ్ముంజేసియే లోకముల్ పూజించెన్!
                                                                  (ఆరోగ్యకామేశ్వరి)

ఇంతయెందులకు - మన పెద్దలిట్లువ్రాసిరి.

శ్లో. యద్ద్వారేమత్త మాతంగా 1 వాయువేగాస్తురంగమాః
   పూర్ణేందువదనా నార్య | శివపూజావిధేఃఫలమ్”

దీని ననుసరించియే యీమధ్య మొన్న మొన్న వ్రాసినమృత్యుంజయస్తవములో నేనీపద్యమును వ్రాసితిని... -

శా. ద్వారంబేరిది మత్తదంతి తురగస్థానంబో? యెవ్వారి సం
    సారం బాత్మజ సత్కళత్ర సకలైశ్వర్యాన్వితంబో? భవ
    చ్ఛ్రీరమ్యాంఫ్రిుసరోజ భక్తులని వారిన్నిర్ణయింపంజనున్
    వేఱెచ్చో ఘటియించు నిట్టి మహిమల్ విశ్వేశ! మృత్యుంజయా!

విష్ణుభక్తులలో విశేషించి యైశ్వర్యవంతులు లేకపోలేదుగాని శివభక్తులలో మిక్కిలి మనకుఁ గన్పట్టుదురు. ఇందుల కుదాహరణము నైజాములోని పలువురు శైవులగు కోమట్లు. దక్షిణదేశమునందలి నాఁటకోట్లను అని యెఱుఁగఁదగును. దీనిమీఁదఁ బూర్వపక్షము లేకపోలేదు. కాని మన శాస్త్రములను నమ్మువారినిగూర్చియే యీ నాలిఖించుట. తక్కినవారు నాకు దేవీప్రత్యక్షవిషయమయి యడుగువారిలోఁ జేరరుగదా? మనవారు యజ్ఞములవలన వర్షములు గుఱియునని వేదమున నుండుటను విశ్వసింతురు. అగుచో యూరపుఖండమున, అమంత్రగోమేధములు తప్ప సమంత్రకములు లేశమును. లేవుగదా, అచ్చట వర్షము లేల గుఱియుచున్నవి యనుటకు సమాధానము దుర్లభము. ఇతరులు విశ్వసింపకున్నను, పైశంకకుఁగూడ మనవారు మనకు సమాధానము చెప్పఁగలరు. మే మొకఖండము నుద్దేశించి యజ్ఞము చేయలేదు. కనుక మాయజ్ఞములే ఆయాఖండములకుఁ గూడ వర్షమును కల్గించుచున్నవని రహస్యములో సంతసించుచుందురు. ఏకదేశమాత్రమున నెగ్గఁదగు జవాబుగల విషయములందుఁ జిన్ననాఁట నుండి నాకు విశ్వాసము ඒක. ఏ విషయము మనకుఁ దెలియునని యొప్పుకొందుమో, అందొకనికి జంకనియంత శక్తియేని యుండవలెను, ఏమిడిమిడి జ్ఞానమో పనికిరాదుఅని నేను దలఁతును. ఈయంశముకూడ నేనిప్పటికి నలువది యేండ్లనాఁడు వ్రాసిన కామేశ్వరీశతకములో వాక్రుచ్చియున్నాఁడను.

మ. పరగేహమ్మున భుక్తి యన్యసతితో భాషించు బల్‌రక్తి య
     క్కఱకున్ గానిప్రసక్తి, వేఱొకనికిన్ గంపించుధీశక్తి, నీ
     చరణమ్ముల్ గనలేనిభక్తియును నిస్సారమ్ము లీయైదిటిన్
     మఱుఁగన్నీకుము మన్మనం బిదియె నిన్ బ్రార్థింతుఁ గామేశ్వరీ.

ఈ పద్యరచనకు ముఖ్యకారణము మొదటియంశమే కాని తక్కినవి కావు. తక్కినవి ప్రసక్తానుప్రసక్తములు. అంత్యప్రాసమును బురస్కరించుకొని చేరినవి. అయినను - "ప్రాసకోసమన్నానే కూసుముండా" వంటివి మాత్రముకావు. సార్థకమైనవియే మొదటిదానికిఁగల ప్రసక్తియెట్టిదో తెల్పుట అంతయప్రస్తుతము కాదనుకొందును. నేను మందసా సంస్థానమునకు వెళ్లినప్పుడు వెళ్లిననాఁడు మొదలుకొనియే నాకు గ్రహణీరోగ మారంభమై మిగులబాధించినది. సంస్థానపు దివాన్‌గారు నన్ను మిక్కిలిగా నాదరించి భోజనాది సదుపాయములు వారియింటనే జరిగించినారు. ఆయన శ్రీవిజయనగర సంస్థానమునుండి అయ్యెడ కుద్యోగమునకు వెళ్లినవారు. శ్రీమదానందగజపతి మహారాజులుంగారి తండ్రిగారిరోజులలో శ్రీవారి ప్రయత్నము మీఁద విజయనగరము కేవలము ననేకసందర్భములలోఁ గాశీక్షేత్రముగా మార్చఁబడినది. ఆమార్పువలనఁ గాశీక్షేత్రములోని భంగుపానము విజయనగరమునకు సంపూర్తిగాఁ గాకున్నను జాలవఱ కలవడినది. అది మన ప్రస్తుతపుదివాన్‌జీవారికిని ముఖ్యమగుటచే, ఆయనసాయంకాలము సుమారు 5 1/2 గంటలవేళ దానిని పుచ్చుకొని షికారుకు బయలువెడలి రాత్రి సుమారు 11 గంటలప్రాంతమునఁగాని భోజనమునకు వచ్చువారు కారు. నేను గ్రహణీరోగ పీడితుఁడనై యంతవఱకు భోజనమున కాగుట యెంతచిక్కో ఆలోచింపుఁడు. అట్టి సంకటస్థితిలో వ్రాసిన యీ పద్యము మొట్టమొదటి యంశమునే పురస్కరించికొని పుట్టినదనుట యుక్తమగుటచే నట్లుయథార్థమును తెలిపితినేకాని, యిందలి యంశము లన్నియు నుపాదేయములే. ఆ యీ చిక్కులన్నియును గాకున్నఁగొన్నియేనియు నప్పుడప్పుడు పడియున్నకతముననే “పడవలెఁబడరానిపాటులెల్ల" అని నేను వ్రాయవలసి వచ్చినది. ఆ యీ చిక్కులన్నియు కవిత్వమున కుపకరించునవియే యని లాక్షణికులు వక్కాణించియే యున్నారు. “అహోభారో గురుఃకవే”.

దీనిని విస్తరించుట కిది చోటుగాదు. చిక్కులుపడి కవియైనవాఁడు పిదపఁ గొంతకాలము మిగులవలెను. అది యొక్కడనోగాని ఘటింపదు. ఘటించినచో నతని రచనకుఁబైచిక్కులు చక్కని పనిచేయును. అది యుటులుండె. మాకుc గాళిక ప్రత్యక్షమగుటగాని, తోడఁబల్కుటగాని లేదనునది వక్తవ్యాంశము. హృదయమందుండి పద్యములనో, శ్లోకములనో అవధానాదులలో పలికించు నందురా? అగుచో నెల్లర హృదయమునందును భగవంతుఁడుండి పల్కించుచునే యున్నాఁడు. ఇచ్చటనే యననేల? అందులో విశేషము లేదుగదా?

శ్లో. ఈశ్వరస్సర్వభూతానాం హృద్దే శే౽ర్జునతిష్ఠతి (భగవద్గీత)

ఉపాధ్యాయుఁడుగారి మొదటిప్రశ్నమునకు నా యెఱిఁగినంతలో ఆత్మవంచన లేకుండ నుత్తరమిచ్చితిని. వారే ఇంకొక ప్రశ్నమునుగూడ నడిగిరి. అది భగవద్గీతలోని యంశము. అర్జునుఁడు మొఱ్ఱో నేను యుద్ధముచేయనని వెనుదీయుచుండఁగా శ్రీకృష్ణభగవానుఁడు చేయకతప్పదని పురికొల్పవచ్చునా? అది దేవుఁడు చేయఁదగిన పనియేనా అనునది. ఇదివారికి స్వయముగాఁ దోcచిన శంకకాదనియు మతాంతరులు చేసిన ప్రశ్నమనియు వారేవ్రాసిరి. ఆమతాంతరులు భీమునిపట్నంలో నెవరైయుందురో? చెప్పకయే తెలిసెడిని. వారిలో నీప్రాంతములలో విశేషించి ప్రాజ్ఞులుండరు. "హావూపేడా మీరుహల్కికొంటారు" తెగలోవారుందురు. వారి ప్రశ్నలకు జవాబక్కఱలేదని యుపాధ్యాయులవారికి విన్నవించుకొనుచు నింతటితో ముగించుచున్నాఁడను.


★ ★ ★