కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/నీలాపనిందలు

నీలాపనిందలు

ఈ శబ్దం సాధువైనా కాకపోయినా నిర్హేతుకంగా ఆపాదించే అపవాదలను యీ శబ్దంతోనే పండితులూ, పామరులూ వాడతారు. దీన్ని దిద్దేయెడల నిరపనిందలు అని దిద్దవలసివస్తుంది. యెన్నో శబ్దాలు యీలా మాఱిపోయిన వున్నాయి. యీ శబ్దం యెంతో అపభ్రంశంగా మాఱికూడా సంస్కృతశబ్దమేమో? అనే భ్రమను కలిగిస్తూవుంది. నీలా + అపనింద = నీలాపనింద అన్న వ్యుత్పత్తి చెప్పి వొకప్పుడు వొక పద్యంకూడా చాలా కాలం క్రిందట చెప్పబడింది --

"నీలాపనింద యనఁగా, భూలోకమునం దబద్ధపుం బలుకగు నీ,
  నీలాపనింద ప్రకృతము, నీలవలనఁ గలుగుకతన నిజమై తోcచెన్"

ప్రస్తుతం మనక్కావలసింది నిర్హేతుకాపవాదలకు లోకంలో యీ పదం పర్యాయ పదంగా అందఱూ వాడుకుంటూ వున్నారన్నది. యీ అపవాదలువేసే జనులు కొందఱు ప్రతీకాలంలోనూ వుంటారన్నందుకు త్రేతాయుగంనాటి వొక చాకలాయన మనకు వుద్బోధకుడుగా కనబడతాడు. కాని సవిమర్శంగా ఆలోచిస్తే ఆ రజకుడు సీతాపాతివ్రత్యం దురుద్దేశంతో అపవదించినట్టు కనపడదు. యేమంటారా? రాములవారియందుగాని, సీతామహాదేవియందుగాని వాడికియేవిధమైన దురుద్దేశమున్నూ వుందని ఎవ్వరూ యింతవఱకు చెప్పగా యెవరేనా విన్నారా? లేదు, నిజానికి వాడు. "తెల్లని వెల్లా పాలూ, నల్లని వెల్లా నీళ్లు" అనుకొనే వాళ్లల్లోవాడు, పెళ్లామేమో తన యిల్లు విడిచి అన్యత్ర వుండడమే దోషంగా వానిక్కనబడ్డది, ఆ పట్టాన్ని "వెఱ్ఱి రాముణ్ణి కాను. యేలుకోవడానికి నేను” అంటూ ఉపమానవిధయా ప్రసంగించాడు, రాములవారి నౌకరు విన్నాడు. మనవి చేయడం తప్పక మనవి చేశాడు, దానితో కొంపమీదకే వచ్చింది. ప్రస్తుతం మనకది యావతూ విచారించ వలసిన అగత్యంలేదు. లోకంలో వుండే అపవాదకులు అపవదింపబడేవారిమీద యేదో వైరం వుంటే దాన్ని పురస్కరించుకొని యేవో అపవాదలు వేసి కసితీర్చుకుంటూ వుండడం వుందిగాని ప్రస్తుతపు రజకుడియందు అట్టిదోషం లేశమూ లేకపోవడం చేత యితణ్ణి యీ అపవాదకాపశదకోటిలో చేర్చవలసి వుండదని తోస్తుంది. సుమారు ముప్ఫైయేళ్లనాడు కాకినాడలో వెలువడే సరస్వతీ పత్రికలో - "అపవాదతరంగిణి" అనే శీర్షికతో ఒక గద్యపుస్తకం వెలువడింది. కాని, అందులో వున్న విషయం ప్రస్తుతవిషయాన్ని బోధించేదిగా వున్నట్టులేదు దాని కాపేరు యెందుకు పెట్టవలసివచ్చిందో? అని ఆరోజుల్లో నాలో నేను అనుకున్నట్లుకూడా జ్ఞాపకం వుంది. నైజాం సంస్థానాలు చూచే రోజుల్లో వొక విద్వత్కవి మేం వెళ్లినప్పుడే అక్కడికి వచ్చాడు. యేదో సంస్థాన పండితులు పరీక్ష చేసేటప్పుడు మాతో ఆయనకూడా కూర్చున్నాడుగాని నాడు ఆయనకు దైవాత్తూ జ్వరం తగలడంచేత యేమీ వ్రాయలేదు. ఆయేడు ఆలా గడిచిపోయింది. మఱుచటివత్సరం అవధానసభ యేర్పాటుచేశారు. ఆయనకి ఆవేళ యేకాదశి. వుపవాసంతోటే ఆయన శతావధానాని కంటూ పృచ్ఛక ప్రశ్నలను వింటూ ప్రథమచరణం చెప్పడానికి మొదలు పెట్టారు. 25 మందికి 25 చరణాలు మొదటివి చెప్పిన అంతట్లో ఆయనకి యేం తోచిందో? మెడకు పైమీద కండువా చుట్టుబెట్టుకొని సభకు సాష్టాంగపడి “అయ్యా! నాకు యీ వేళ యేమీ స్ఫురించడంలేదు కనక క్షమించండి; మఱొవొకప్పుడు సభ చేస్తే అప్పుడు చేస్తాను అవధానం" అని చెప్పేటప్పటికి రాజుగారున్నూ సభ్యులున్నూ, ఏకాదశీ ఉపవాసం దీనికి కొంత కారణమై వుంటుందని అనుకున్నారు గాని అంతకంటే యేమీ అనుకున్నట్లే లేదు. వెళ్లిపోయింది. యిది జరిగిన సంవత్సరం మన్మథ.

మఱి యేడెనిమిదేళ్లకు అనగా శోభకృత్సంవత్సరంలో నేను యేలూరులో సోమంచి భీమశంకరంగారికి, అతిథిగా వున్నప్పుడు ఆ నైజాం దేశీయులు యిద్దఱు బ్రాహ్మణులు నేత్రావధానంచేశేవారు వేద విద్వాంసులు సంచారార్థం వచ్చారు. సంపన్న గృహస్థులను చూచారు. వారికి కన్యకాపరమేశ్వరి ఆలయంలోనే అనుకుంటాను సభ యేర్పాటయింది. సభాదినంనాడు వారు నా బసలోకి నన్ను చూచే నిమిత్తం వచ్చి యేదో పిచ్చాపాటీ మాట్లాడుకోవడం జరిగిన తరువాత లోగడ గద్వాలలో సభకు సంబంధించిన వృత్తాంతాన్ని యెత్తుకొని "నాడు తమ అనుగ్రహాన్ని ఆయన కోరకపోవడంచేత ఆలా జరిగింది. అందుకోసమని తమదర్శనానికి వచ్చి ఆజ్ఞపొంది వెడదామని వచ్చా" మని మెల్లిగా చెప్పడానికి మొదలు పెట్టేటప్పటికి నిర్ఘాంతపడ్డాను. అప్పటిదాకా నాటి “ఏకాదశీ ఉపవాసపు సభావృత్తాంతం" యిలా పరిణమించిందని సుతరామూ నే నెఱుగను. మనదేశంకంటే ఆదేశం యీలాటి విశ్వాసం విషయంలో చాలా అగ్రగణ్యంగా వుంటుంది. అనేక గాథలు పూర్వపండితుల వాదోపవాదాలకు సంబంధించినవి యీలాంటివి విద్వత్పరంపర చెప్పుకొనేవిలేకపోలేదు. పోనీ, ఆయనకిన్నీ మాకూనున్నూ యేమేనా వాదోపవాదాలేనా జరిగాయేమో? అంటే అదిన్నీ లేదు. యిల్లా వున్న సంబంధం ఉభయులమూ కవులమవడం తప్పయితరంలేదు. యెవరు కల్పించారో మహాప్రబుద్దులు ఆయన నాడు అవధానం చేయడానికి ఆరంభించి మధ్యలో విరమించడానికి మమ్మల్ని కారణంగా నిరూపించారు. ఆలా నిరూపించినట్లు యీ వేదవిద్వాంసుల అమాయిక ప్రసంగం సాక్ష్యమిచ్చింది. దీన్ని యథార్థాన్ని చెప్పి పోగొట్టుకుందామంటే శక్యమౌతుందా? ప్రయత్నించినకొద్దీ మఱింత బలపడుతుంది. అయితే యిదికల్పించినవారికి మాయందేమేనా ద్వేషంవుండివుండునా? ద్వేషంలేదు సరిగదా, పైగా అంతో యింతో, అనుగ్రహమే వుండివుంటుంది. అందుచేత యీ “నీలాపనింద" అనుగ్రాహకులద్వారాగానే కల్పితమయిందనుకోవాలి. యిది జరిగిన మఱుచటి సంవత్సరమే ఆత్మకూరు సంస్థానంలో పండితులకూ మాకూ కొంత విద్యావివాదం జరిగింది. అందులో వుండగా ఆ సంస్థాన పండితులలో ప్రధాన పండితుడికి “గ్రహణి" వ్యాధి ప్రారంభించి చాలా చిక్కు పెట్టింది. అప్పడు వారు దాన్ని “చేతబడి"గా భావించి దానికి ప్రతిక్రియలు చేయడానికి పెద్ద అట్టహాసం చేయడం రాజుగారికి తెలిసి "తగిన వైద్యం చేయించుకోండి, “చేతబళ్లు" వుంటే వుండనివ్వండిగాని ప్రస్తుతం ఆలాటి అనుమానంతో లేశమున్నూ అవసరంలేదు.” అంటూ నివారించాడు. ఆ పండితులు ఆ దోషం మామీద ఆపాదించాలని బుద్ధిపూర్వకంగా పన్నిన పన్నుగడే కాని నిజంగా ఆ గ్రహణివ్యాధి మేము వారికి "చేతబడి" ద్వారాగా పంపిందని వారు విశ్వసించి వుండరని మే మనుకున్నాం. యిప్పడంతగా లేదుగాని పూర్వకాలంలో కాస్త కుంకుమబొట్టు పెట్టేవాళ్లకల్లా యీ అపవాద వుండేది. నిన్న మొన్నటిదాకా జీవించి వున్న “పాలంకి రమణయ్య" గారికే కాక యిప్పుడింకా సజీవురాలై వున్న ఆయన భార్యకుకూడా యీ "చేతబడి" విద్యలో చాలా ప్రవేశమని దానికి సంబంధించిన చాలా గాథలు చెప్పకోవడం వుంది. విస్తరభీతిచేత ఆగాథలు వుదాహరించలేదు.

పండితులకూ కవులకూ యీ అపనింద అంతగా లేదుగాని పగటి వేషాలవారికీ, భాగోతులకూ విశేషించి వుంది. యేదో గింజలు నోటిలో వేసుకొని సభలో యేమీ యెఱుగనివాడిలాగ కూర్చుని ఆ గింజలు పటుక్కున కొటికేటప్పటికల్లా మద్దిలి పగిలిపోయిందనిన్నీ భాంవేషగత్తె విరుచుకు పడిపోయిందనిన్నీ తరవాత యీ సంగతి కనిపెట్టి ఆ భాగోతుల్లోనే మఱొకడు (యీ చేతబడి విద్యలో ప్రవేశం కలవాడు) యేదో విభూతి మంత్రించి హ్రాం హ్రీం హ్రూం అని ఆ చేతబడి తిప్పిన తరవాత భాగోతం సక్రమంగా నెఱవేఱిందట! గాని తెల్లవాఱిన తరవాత భాగోతం చూడడానికి వచ్చిన జనమంతా యెవళ్ళిళ్లకువాళ్లు వెళ్లడం జరిగాక మొట్టమొదట చేతబడి చేసిన పురుషుడు అక్కడే కదలక మెదలక ఆగిపోవలసి వచ్చిందనిన్నీ దానిక్కారణం భాగోతులు తమమీద కొట్టిన దెబ్బను (చేత బడినన్న మాట) తప్పించుకొని మళ్లా కొట్టడ మనిన్నీ వినడం. నాబాల్యం నాటికి బాగా యిలాటివి చెప్పుకోవడం వుండేది. అంతకాకపోయినా యిప్పుడు కూడా యీలాటి సందర్భాలు వింటూనే వున్నాము. “సర్వా వెంకటశేషయ్య యమ్. యే." యితనికి యిట్టి ప్రయోగబాధ తటస్థించడమూ, యింకా నివర్తించకపోవడమూ గత సంవత్సరమే బందరులో విన్నాను. మంత్రశాస్త్రాన్ని విశ్వసించేవారికి యివి విశ్వసనీయాలే. భారత యుద్ధాలు, రామాయణం యివన్నీ మంత్రశాస్త్ర విశ్వాసంతో సంబంధించివుంటాయి. నిన్న మొన్నటిదాకా పూర్వపు యుద్ధాలలో వుండే ఆశ్చర్యాలనుగూర్చి మనం చాలావఱకు కవుల కల్పనకింద తోసేయడం జరిగేవి యిటీవల యూరపుఖండ యుద్ధాలలో ప్రత్యక్షంగా జరుగుతూవున్న ఆశ్చర్యాలు కాదనడానికి వల్లకాక పోవడంచేత పూర్వపు వాట్లకుకూడా కొంత యోగ్యత కలిగింది. యిప్పటిదానికిన్నీ అప్పటిదానికిన్నీ వున్న భేదం యెంతోలేదు. అదంతా మంత్రబలమని వాళ్లు వ్రాశారు; కాదు "యంత్రబలమే" అని యిప్పటివాళ్లు ఋజువు చేస్తూన్నారు. యంత్ర బలం గొప్పదా? మంత్రబలం గొప్పదా? అని మనం విచారిస్తే మంత్రబలమే యెక్కువదిగా తేలుతుంది. మంత్రబలంచేత సాధించిన కార్యాన్ని మనం యంత్రబలంచేత సాధించగలిగినా, దానికున్నంత అమోఘత్వం దీనికి వుండదు. ప్రస్తుతం యీ విషయం విచార్యం కాదు.

యిప్పుడుకూడా "చేతబళ్లు" వున్నట్లు కొన్ని ప్రమాణాలు కనబడుతూనే వున్నాయని వ్రాసే వున్నాను. యివి తుచ్ఛదేవతోపాసనలవల్ల సాధించేవనిన్నీ మహామంత్రోపాసకులు పరమార్థదృష్టితో వుపాసన చేస్తారే కాని యిట్టి తుచ్ఛఫలాన్ని అపేక్షించి తపస్సు వ్యర్థపఱచరనిన్నీ అందఱూ చెప్పుకొనే విషయమే. కీ.శే. నడివింటి మంగళేశ్వరశాస్త్రుల్లు గారికి సంబంధించిన చరిత్రలో యీ మంత్రశాస్త్ర విషయం చాలా ప్రధానంగా వుంటుంది. యేదో సంస్థానంలో రాజుగారు వీరిని "అయ్యా! మీరు "శివో౽హం, శివో౽హం” అంటూ వుంటారు కదా? పార్వతీదేవి మీకు భార్యే అవుతుందా?” అంటూ ప్రశ్నించేటప్పటికి శాస్త్రుల్లుగారు అప్పటికి వూరుకొని, రాజుగారి తల్లికి ఆబ్దికము నాడు వెళ్లి కూర్చుని, (తమకు అక్కడికి వెళ్లవలసిన ప్రసక్తితో సంబంధంలేక పోయినా) శాస్త్రులుగారు రాజుగారు చేసిన శంకవంటివే కొన్ని నిర్మొగమాటంగా, నిర్భయంగా చేసేటప్పటికి, ఆ శంకలు శుద్ధాంతానిక్కూడా అవమానకరమైనవిగా వుండడంచేత శౌర్యం పట్టజాలక “చూస్తారేం పట్టుకోండి" అని నౌకర్లను హెచ్చరించేటప్పటికి నౌకర్లు శాస్త్రుల్లుగారిని పట్టుకోవడానికి దగ్గిఱకు రాబోయేటప్పటికి ఆయనవద్ద సిద్ధంగానే వున్నవిభూతిని వాళ్లమీదకి వూదేటప్పటికి వాళ్లు “కుయ్యో, మొఱ్ఱో" అని పాఱిపోవలసి వచ్చిందనిన్నీ తరవాత రాజుగారుకూడా స్వయంగా ప్రయత్నించి చూచారుగాని కృతార్థులు కాలేక లజ్జింపవలసి వచ్చిందనిన్నీ చెప్పుకుంటారు. ఆ యీ గాథలు యించుమించు 60 లేక 70 యేండ్లనాటివికాని, యుగాంతరాలనాటివి కావు. నిన్నమొన్న వొకానొక శాస్త్రుల్లుగారిని (వీరు పల్నాటి తాలూకా వారు) గూర్చిన మంత్రశాస్త్ర ప్రసక్తి అత్యాశ్చర్యకరమైనది చదివాను త్రిలింగపత్రికలో, ఆయా నడివింటి శాస్త్రుల్లుగారికి సంబంధించిన మంత్రశాస్త్ర పాండిత్యం లోగడ మాప్రధాన గురువువల్ల వినివుండడంచేత నాకు విశ్వాసంగానే కనపడింది. ఆయీ నడివింటివారి చరిత్రకు సంబంధించిన గాథలు చాలా వున్నాయి. మఱొకప్పుడు ముచ్చటించుకుందాం. సంస్కృతంలో అత్యాశుధారతో వీరు రచించిన శ్లోకాలు చాలా వున్నాయి. బొబ్బిలిలో వీరికి నాల్లోతరంవారో, అయిదో తరంవారో యిప్పుడు వున్నారు. అమలాపురం తాలూకా ముమ్మిడివరం ప్రాంతంలోనూ కొందఱు వున్నారు. సంస్కృతభాషాభ్యాసానికి మొట్టమొదట ప్రారంభించి చదివే శబ్దమంజరి వీరు రచించిందే. దానిలో “శ్రీమధ్య మందిరకుల” అన్నమాటకు సరియైన నడివింటి (నడివింటి - నడిమి + యిల్లు నడిమిల్లు) పదం కొంత సంప్రదాయజ్ఞులకుగాని బోధపడదు. నేను మా గ్రామాన్నిగూర్చి “కంకణ గ్రామంబు కాపురంబు" అని వాడివున్నాను. మా ముత్తాతగారు “వలయపురం" అంటూ వాడివున్నారు. యిది అనాదిగాకవుల ఆచారం. యీ శాస్త్రుల్లు గారి అల్లుడు రెడ్డి శాస్త్రుల్లుగారు ప్రాచీనకాలపు ప్లీడరు. కొంత సంస్కృతసాహిత్యం వున్నవారు. ఆయనకు సిద్ధాంతకౌముది చదవాలనే కుతూహలం వుండి మామగారిని కోరేటప్పటికి ఆయన మనఃపూర్తిగా ఆశీర్వదించినట్లున్నూ ఆపట్లాన్ని కౌముది పేలపిండిగా రెడ్డిశాస్త్రుల్లుగారికి అన్వయమై నట్లున్నూ బహుమంది చెప్పగా వినడం. యివి అసత్యమనడానికీ వల్లకాదు. నిజమనడానికిన్నీ వల్లకాదు, కొన్ని యిప్పుడుకూడా వున్నాయి. కాని వాట్లని వ్రాస్తే కొందఱు సహృదయులు విశ్వసిస్తారు. గాని కొందఱో గేలిచేస్తారు కాబట్టి దీన్ని ఆపి ప్రస్తుతం అందుకుంటాను.

వీట్లల్లో కొన్ని గౌరవాపాదకాలుగానున్నూ కొన్ని లాఘవాపాదకాలుగానున్నూ కొన్ని ఉభయాపాదకాలుగానున్నూ వుంటాయి. శ్రీ శంకరాచార్యులవారు మద్యం పుచ్చుకోవడానికి సంబంధించిన కథ ఒకటి వుంది. చాలామంది చెప్పుకుంటూ వుంటారు. శిష్యులుకూడా వారిని అనుసరించి – “మనోజనో యేన గత స్పపంథా" కనక మద్యపానం మొదలుపెట్టే టప్పటికి ఆచార్యులవారు దాన్ని వారించడానికి వొక కంచరి దుకాణంలో కరుగుతూవున్న సీసాన్ని కొంత మంచినీళ్లప్రాయంగా గడగడ తాగి మిగిలినదాన్ని శిష్యులకి యియ్యబోయేటప్పటికి యే శిష్యుడున్నూదాన్ని గ్రహించక పాఱిపోయారనిన్నీ తద్ద్వారాగా ఆ శిష్యులకు బుద్ధివచ్చి మద్యపానాన్ని మానడం తటస్థించిదనిన్నీ చెప్పుకుంటారు. యిది నిజమైనదే అయితే నీలాపనిందలలో చేరదు. కానిపక్షంలో - అనగా కల్పితమే అయితే శంకరాచార్యుల వారియందు "కర్తు మకర్తు మన్యథా కర్తుం సమర్థత్వాన్ని" - ఆపాదించే వుద్దేశమే కాని యీ కథలో దురుద్దేశం లేశమున్నూ లేదు. బాగా ఆలోచిస్తే యీ కల్పనలు చేసేవారిలో సదుద్దేశపరులున్నూ వుంటారు; దురుద్దేశపరులున్నూ వుంటారు. వారివారి వుద్దేశానుసారంగా వారి వారి కథాకల్పనలు వుంటూవుంటాయి. యేదో మహత్తు వుండడానికి అవకాశం వున్నవాళ్ల విషయంలో యీలాటి యితిహాసాలు పరంపరగా వస్తూ వుండడంచేతనే అనుకుంటాను, యిటీవల సామాన్యవ్యక్తులను గుఱించి కూడా యీలాటివి కల్పన చేస్తారు. యివి పామరముఖతః రావడమూ వుంది. పండితముఖతః రావడమూఉంది. మొదటిదానికంటె రెండోదాని యందు ప్రామాణ్యం యెక్కువ వుంటుందని చెప్పనక్కఱలేదు. కాని వారు కూడా కొందఱు అతిశయోక్తి కల్పనలు చేస్తూనే వుంటారని నాఅనుభవంలో వున్నది వొకటి చూపుతాను.

నేను కావ్యాలను చదువుకొనే రోజుల్లోది యీ కథ; కాని నాకు షష్టిపూర్తి దాటిన తరవాత బయలుపడింది. లంక బ్రహ్మ సోమయాజులు అనే వక శిష్యునివల్ల విన్నాను. దాని స్వరూపం యిది; నే నేమో, గురువుగారివద్ద పాఠం కంగాబంగా చదవడమేగాని ఆ పాఠాన్ని వల్లించడమంటూ వుండేదికాదనిన్నీ దాన్ని కనిపెట్టి వకనాడు ఆ గురువుగారు కూకలేసేటప్పటికి- "అయ్యా! నే చదువుకొనే పుస్తకంలో నన్నెక్కడ అడుగుతారో, అడగండి" అన్నాననిన్నీ వారు అడిగారనిన్నీ వందలకొలది శ్లోకాలు సవ్యాఖ్యానంగా వప్పజెప్పాననిన్నీ వొక గురువుగారు చెప్పినట్లు ఆ సోమయాజులు నాతో అనగా విని, యిది కేవలమూ ఆ గురువుగారికి నాయందు వుండే అనుగ్రహాతిశయంగా భావించి- "నాయనా, ఇది నిజంకాదు, నా పాఠమందు నేనెన్నడూ అశ్రద్ధగా వుండటమంటూ లేదు. విశేషించి వర్లన లేకుండానే నాకు శ్లోక వ్యాఖ్యానాలు స్వాధీనం కావడం మాత్రం నిజం. పై కథ దాన్ని అనుసరించి పుడితే పుట్టిందేమో? కాని నిజంమాత్రంకాదు” అని అతనితో చెప్పి వున్నాను. అతడు విశ్వసించాడో, లేదో? యెన్నో చోట్ల వున్న యథార్థాన్ని నేను ప్రకటిస్తూనే వున్నప్పటికీ మామూలు కథలు కథలుగానే నడుస్తూన్నాయి.

“అమంత్రోపాసకౌ సంతా వపి కాళీ దయాకరౌ!
 తిర్పతి ర్వేంకటేశశ్చ పరస్పరహితౌచ యా"

అని కాళీ సహస్రంలో కంఠోక్తిగా, మాకు క్రమమైన ఉపాసన లేదని చెప్పబడి వున్నా మంత్రోపదేశంకోసం మమ్మల్ని వెూవెూట పెట్టేవారెందఱో వుండడం అనుభూతం. వొకాయన కౌముదిదాకా చదువుకొని నా దగ్గిరికి విద్యాభ్యాసవ్యాజంతో (అసలు వుద్దేశం అదికాదు) వచ్చి అహోబలపండితీయం మొదలెట్టి చదువుతూ, నాలుగైదురోజులయిన తరవాత అసలు కోరికను, బయలుపఱిచాడు. నాకు ఆలాటి శక్తియుక్తులు లేవంటే; ఉపదేశించడానికి అంగీకారం లేక ఆలా చెప్పినట్టు భావిస్తాడుగాని విశ్వసిస్తాడా? అందుచేత యథార్థం చెప్పినా ప్రయోజనంలేదు. కనక సరే దీన్ని చదువుతూ వుండు, మంచిరోజు చూచి దానిసంగతి ఆలోచిద్దామని గంభీరంగా చెప్పి, మొదలెట్టిన పాఠాన్నే కొన్నాళ్లు సాగించి మఱికొంత చనువు చిక్కిన తరవాత వున్న యథార్థాన్ని తెలిపాను. విశ్వసించాడో, లేదో? చెప్పలేను. అతడు మంచి కవి; ఆశుకవికూడాను. పండిత కవి. పేరు వ్రాస్తే అతడి కేం కోపంవస్తుందో అని దీనిలో వుదాహరించలేదు. మంత్రోపదేశానికి మిష కల్పించుకు వచ్చినవాడేకాని అతడు శిష్యకోటిలోవాడుకాడు. యీ మంత్రోపాసనా ప్రవాద యింతతో ఆగితే కొంత నయమే; ఆగలేదు. యిది “పీత్వా" దాకా డేకింది. అదిన్నీ నా చెవిని బడింది. యేమిటి చేసేది? “కథక్కాళ్లంటూ వుంటాయా?” అనుకొని వూరుకోవలసిందే. జీవితానంతరం యీలాటి కథాకల్పనలు బయలుదేఱడం కొంత సహజమే. జీవితకాలంలోనే బయలుదేఱితే కొంత యుక్తం. ఇవి ఆలాటివారి ద్వారా బయలుదేరినవిగా తోచవు. మొట్టమొదట వీటికి జన్మస్థానం (“ఏఱుల జన్మంబు" అన్నట్టు) యెక్కడో తెలుసుకోవడానికి వశంకాక యెవరో ప్రారంభిస్తారు. వారిద్వారా వీరూ, వీరిద్వారా వారూ దాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. లోకము మూయను మూకుడున్నదే?

తెనాలి రామలింగానికి పెద్దన్న ముక్కుతిమ్మన్న భట్టుమూర్తి యింకా కొందఱూ ఏక కాలీనులు కారని నేటివారు బాగా ఋజువు చేసినప్పటికీ వీరందఱితోటిన్నీ రామలింగానికి ముడిపెట్టి చెప్పకొనే కథలు చెప్పకుంటూనే వున్నారు. ఆలాగే పై నీలాపనిందలు సత్యేతరాలని యెంత గాఢంగా ఋజువుచేసినా చెప్పకొనేవారు చెప్పకుంటూనే వుంటారు. యీలాటి సందర్భాలనుగూర్చి కొందఱు విమర్శకులు కొంత కృషిచేసి తత్త్వ నిర్ణయానికి పాటుపడడం ఆవశ్యకమే కాని ఆ విమర్శకులు అంతతో ఆగక నల్వురూ శిరసావహించే భారత భాగవత రామాయణాల మీదికి కూడా తమ బుద్ధి చాకచక్యాన్ని ప్రసరింపజేసి ఆయా పుణ్యగాథలయందు లోకానికి అవిశ్వాసాన్ని కలిగించడం శోచ్యంగా వుంది. వేదంలో వుండే యితిహాసాలు గాని, పురాణాల్లో వుండే యితిహాసాలు గాని సమస్తమూ అర్ధవాదలుగా (లేని కథలు కల్పించి సత్యం వగైరాలను దృఢపఱచడం పేరు అర్థవాదమంటారు మీమాంసకులు) నిర్ణయించే వున్నారుగాని, వాట్లవల్ల యిట్టి చిక్కురాదు. అది “గజంమిథ్య పలాయనం మిథ్య" వంటిది కనక యెవరికోగాని అవగాహన చేసుకోతగ్గదిగా వుండదని తాత్పర్యం. ప్రతి ప్రసిద్ధవ్యక్తినిగూర్చిన్నీ యేదో నిందా కల్పన వున్నట్టే కనపడుతుంది. సంస్కృత గ్రంథంలో లేని నింద తెలుగు అనువాదంలో కనపడడం వుంది. ద్రౌపదీ స్వయంవరసమయంలో ఆ ధనుస్సు కర్ణుడు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొట్టడానికి సిద్ధపడుతూవుండగా, పాండవులు మత్స్యయంత్రం తెగిపడ్డట్టే తలుస్తూవుండగా (మేనిరే పాండునందనాః) ద్రౌపది “నా౽హం వరయామిసూతమ్” అని నిరాకరించడంవల్ల కర్ణుడు రసాభాసశృంగారమందు యిష్టంలేని ఉత్తమనాయకుడు కనక (ఏకతైవానురాగశ్చే ద్రసాభాసః) ఆ వుద్యమాన్నుంచి విరమించినట్లు సంస్కృతంలో వుంటే, తెలుగులో నన్నయ్యగారు అసలు ఆ ధనుస్సు యెక్కుపెట్టడమే తిలగింజంతగాబోలును తరవాయి వున్నట్టు వ్రాశారు. యిక్కడ నన్నయ్యగారికి కర్ణునియందు ద్వేషం వుందని యెవ్వరూ చెప్పరు. ఫోనీ కృతినాయకుడు రాజరాజనరేంద్రుణ్ణి సంతోషపెట్టే వుద్దేశంతో (రాజరాజ నరేంద్రుడు పాండవ వంశస్థుడనుకొనే పద్ధతిని) ఆలాటిమార్పు చేశాడేమో? - అనుకుంటే భారతకాలంలో వారికి యెవరికో తప్ప కర్ణజన్మ రహస్యం తెలియదుగాని రాజరాజ నరేంద్రుని నాటికి ధర్మరాజాదు లేలాటి పాండవులో కర్ణుడూ ఆలాటి పాండవుడే అనే సిద్ధాంతం సర్వవిదితమేకదా? అందుచేత ఆయీ వూహలు పొసగవు. కర్ణుడుకూడా అభిమానపాత్రుడే అవుతాడు. ఆ శ్లోకాలు నన్నయ్యకు బాగా సమన్వయించలేదు. మనకే సమన్వయించాయి అనుకోవడం బొత్తిగా రుచించనిమాట. భారతప్రతులు నానాదేశాలలో నానారీతిగా ఉపలబ్ధం అవడాన్నిగూర్చి లోకంలో వివాదం లేదుకాబట్టి, నన్నయ్యగారికి లభించిన భారతంలో ఆలాగే (తిలమాత్రం యొక్కుపెట్టడం తరవాయి) వుందనుకోవడమే యుక్తిసహం. అయితే భారతాలు నానావిధంగా యెందుకు వుపలబ్ధం కావలసివచ్చింది? అనే ప్రశ్న ఒకటి యిక్కడ ప్రస్తుతమవుతూవుంది. యిది పెద్ద ప్రశ్న దీన్ని గుఱించి పలువురు వ్రాసేవున్నారు. నేను వ్రాయవలసి వుండదు. భారతం బహు కర్తృకమనే ప్రవాదాన్ని వొప్పకొనేవారికి యీ శంక క్షణంలో నివర్తిస్తుంది. యెవరు వ్రాసినా వారు ఆకాలీనులే అయినా యావత్తు సంగతినీ ప్రత్యక్షంగా చూచి వ్రాయడం అనుభవవిరుద్ధంకదా? కొంత ప్రత్యక్షంగా చూచి వ్రాసినా కొంతేనావిని వ్రాసినభాగం వుండితీరాలి. మత్స్యయంత్రం తెగొట్టినపిమ్మట చాలాసేపటికే వచ్చారో వ్యాసులవారక్కడకి, యింకా మఱునాడే వచ్చారో? ద్రౌపదిని అయిదుగురికి పెళ్లి చేయడం యేలాగ? అనే ధర్మసందేహం తీర్చేటందుకు కదా- వ్యాసులవారు అక్కడికి వచ్చింది. అందుచేత వారు యేలా విన్నారో? ఆలా వ్రాసివుందురు. ప్రత్యక్షంలో చూచినవారెవరేనా అక్కడవుంటే ఆ భాగంలో వ్యాసులవారు వ్రాసినదానికి భిన్నంగా ప్రచారంచేశారేమో? ఆయా విషయం తేలేదికాదు. నా అనుభవాన్ని బట్టి కథకు సంబంధించిన వ్యక్తుల జీవిత కాలంలోనే కథలు తాఱుమాఱవుతూవుండగా కొంతకాలం పాతబడిన తరవాత తాఱుమాఱవడంలో అభ్యంతరం వుండదనియ్యేవే. నేటి పాశ్చాత్యయుద్ధవార్తలు మనకు సరిగా తెలుస్తూన్నాయా? అప్పుడిన్ని సాధనాలు కూడా లేవాయె తత్తథాస్తాం.

మా - "గీరతం" పుట్టి యిప్పటికి సుమారు ముప్పైయ్యేళ్లు కావచ్చింది. గుంటూరుసీమ పుట్టి కూడా యించుమించు అంతే. యిప్పటిదాకా (కొందఱు లోపించినా) ఆ గ్రంథద్వయానికి సంబంధించిన పాత్రలు చాలా వఱకు సజీవులే. యిట్టి స్థితిలో అందులో సంగతులు (కొన్నే అనుకుందాం) సర్వాబద్ధం అని కొందఱు వ్రాయ సాహసించినవారు లేరా? ఆలాగే ఆ రోజులలోనున్నూ కొన్ని విషయములనుగూర్చి అపవదించేవారుకొందఱు వుంటే వుండవచ్చుననిన్నీ క్రమంగా వారి అపవాదులు విని నమ్మిన ఆకాలానికి కొంచెం యిటీవలి కవులు గ్రంథంలో చేర్చి వుందురనిన్నీ నాకు తోస్తుంది. నా అనుభవాన్నిబట్టి నేను యిది "లక్కగేదె సామెతగా వ్రాసే వ్రాత. ప్రత్యక్షంగా జరగడమే కాకుండా వాది ప్రతివాదులిరుపక్షాలుకూడా సుమారు ముప్పైయేళ్లు వూరుకొన్న దాని విషయంలోనే సాహసించి, అందులో ఒకదానిలోని ప్రధానాంశాన్ని గూర్చి- "నేను చెళ్లపిళ్లవారియొద్ద ఒక్క యక్షరమైనను చదువుకో లేదనియు” ఇంకా యేమో ఎక్సెట్రాలు అనియు వ్రాసినట్లు వ్రాసేవారు కనపడ్డ నాకు పైవిషయాలలో అట్టి సందేహం కలగడానికి అభ్యంతరం వుంటుందా? అసలు వ్యక్తి "చదువుకోలేదు" అని వ్రాసెనో? మఱేవిధంగా వ్రాసెనో? పరిశీలించేవారు లోకంలో నూటికి యెంతమంది వుంటారో? విజ్ఞులు విచారించాలి. విమర్శించకుండా యీ వ్రాతనేనమ్మి ప్రచారం చేయడంవల్ల కొందఱు ఆలా చెప్పకొనేవారున్నూ, కొందఱు యూలా చెప్పకొనేవారున్నూ వున్నట్టు భవిష్యత్కాలం వారికి తెలియబడుతుంది. దానితో రెండుమతాలు వున్నట్టవుతుంది. దానితో అది నిజమా? ఇది నిజమా? అనే సంకటం యేర్పడుతుంది.

భవతు. యివన్నీ “నీలాపనిందలు" కావు. ప్రసక్తానుప్రసక్తంగా వాట్లకి కాస్త దగ్గిఱచుట్టఱికం కలవికూడా యిందులో వచ్చి చేరినట్లయింది.

బాగా విచారిస్తే పురాణగాథలన్నీ యీలాటి సంకటానికి లోబడినట్టే కనపడుతుంది. వాల్మీకి రామాయణంలో రావణకుంభకర్ణులిద్దఱినీ రాముడే వధించినట్లు కనపడుతుంది. భారతంలో కుంభకర్ణుణ్ణి లక్ష్మణ స్వామి వధించినట్లు వుంది. యీ భేదాలకూ ఆదీ అంతమూ వున్నట్టేలేదు. యేమైనా పూర్వ గాథలో కావడంచేత వీట్ల కీగతిపడితే పట్టిందనుకుందాం, మాగాథలు నిన్నా మొన్నా జరిగినవాయె, మామాచేతివ్రాతలతో నిండివున్నవాయె. ఎందఱో ప్రాజ్ఞులు యెఱిగివున్నవాయె. వీట్లను (యెప్పుడోకాదు ఉభయ పార్టీల జీవితకాలంలోనే) అన్యథాకరించి వ్రాయడానికి సాహసిస్తే యేం చేసేది? ఆలా అన్యథాకరించడంలో యెంతో నైపుణ్యం వుంటే బాగుండేది. అదిన్నీ కనపడదు; యీకర్మం యిప్పటి చరిత్రలను అపవదించేవారికే కాదు. పూర్వగాథలను అపవదించే వారికిన్నీ వున్నట్టు నా బుద్ధికి కనపడదు.

ఆనందరామాయణమంటూ వొకటి బయలుదేఱింది. అదిన్నీ వాల్మీకి కృతమనే కనపడుతుంది. గద్యమునుబట్టి చూస్తే దానిలో వున్నంత అనౌచిత్యమూ పరస్పర విరోధమూ, యే గ్రంథములోనూ కనపడ్డట్టులేదు. యీ విరుద్ధ కల్పనలతో గ్రంథాన్ని లేవదీసినవారెవరో తెలుసుకుందామంటే ఆధారం కనపడదు. పేరు పెట్టుకోనేలేదు. మామా చరిత్రలలో గీరతానికి యీలాటిపీడ, ఆరోజులలో దాపరించినట్లు లేదుగాని, గుంటూరి సీమకు దాపరించింది. వాళ్లు “యథార్థవాది" - "సత్యవాది" యిత్యాది పేళ్లతో అసత్యాలు ప్రకటించడం వుండేది. ఆ “నీలాపనిందలు" మఱికొందఱు ప్రాజ్ఞుల వుత్తరాలద్వారా సమసిపోయేవి. ముప్పైయేళ్లు దాటిన తరవాత ఆయీ గాథలను బుద్ధిపూర్వకంగా అపవదించడానికి ఆరంభించారు. కొందరు. వీరి “నీలాపనిందలు" చూస్తే ఆశ్చర్యంగా కనపడతాయి.

పూర్వం మనదేశంలో నీలిమందు తయారయ్యే రోజుల్లో ఆమందు గూనలుదిగడానికి యీలాటివార్తలుచేయడం వుండేదంటూ వినడం. ఆమందు తయారు కావడానికిన్నీ యీ అపవాదాలకీ వున్న కార్యకారణభావం యేలాటిదో? నాకు బాగా తెలియదు. ఆయీసందర్భాన్నిబట్టి యెవరేనా అబద్ధపు వార్తలు వ్యాపింప జేసినప్పుడు వాట్లతత్త్వం తెలిశాక వాట్లను “నీలివార్తలు” అనడంమాత్రం అందఱికి తెలుసును. యీ నీలి వార్తలే, నానాటికి “నీలాపనిందలు"గా వ్యాప్తిలోకి వచ్చాయి.

యిందులో నానా విధకల్పనలు వుంటాయి. కల్పనలు యేలాటివైనా పేరుమాత్రం వొకటే. వీట్లకి కాస్త నామరూపాలున్నవాళ్లే విశేషించి గుఱి అవుతూ వుంటారు. యెవళ్లు కల్పిస్తారు, ముఖ్యంగా అది యేనాల్గురోజులో లోకంలో కొంత వ్యాపించి కొందఱికి పరితాపాన్ని కలిగిస్తుంది. అంతట్లో మళ్లా యథార్థవార్త తెలిసి ఆపరితాపం వారికి తగ్గుతుంది. యెవరిమీద కల్పితమవుతుందో, ఆదుర్వార్త వారికి “పీడా పరిహారం", అయిందని చెప్పి సంతోషించడంకూడా జరుగుతుంది. అసలువాళ్లు యెవశ్లో చేసినపని తప్పుపనే అయినప్పటికీ దాన్ని మంచిపనిగానే జమకట్టి సరిపెట్టుకోవడం సర్వత్రా లోకంలో ఆచారంగా వుంది గాని యీ అపనిందను వేసినవ్యక్తి యెవడో వాడు "ఫలానా" అని తెలియడమంటూవస్తే లోకం ఆవ్యక్తిని సుఖసుఖాల క్షమించడమంటూ వుండదని వ్రాయనక్కరలేదు. వూరూ పేరూ తెలియకుండా బయలుదేఱే వాట్ల విషయమే బయటికివస్తే, సుఖసుఖాల క్షమింపరానిదిగా వుండేటప్పుడు వూరూ పేరూ కనబడేటట్టుగానే కొందఱు అపవాదలు ప్రచురించడంచూస్తే, చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. యీ విషయంలో సజీవులకి సంబంధించినవి కొంత క్షంతవ్యాలే అనుకున్నా కీర్తిశేషులకు సంబంధించినవి బొత్తిగా క్షంతవ్యాలు కావు. ఆలాటివాట్లనుగూర్చి లోకం కలిగించుకోవడం ఆవశ్యకమయినా, కలిగించుకొన్నట్టు కనపడదు. అపవాదకుల వుద్దేశం కీర్తిశేషుడికి కళంకాన్ని ఆపాదించే తాత్పర్యం కలది కాకపోయినా తుదకి కళంకాన్ని ఆపాదించేదిగా పరిణమించినప్పుడు “ఇది యుక్తమేనా? మీకు” అని నిర్మొగమాటంగా అడిగి యికముందేనా యిట్టి "నీలాపనిందలు" ప్రచారం చేసి లోకపరితాపానికి కారకులు కాకుండా వుండడానికి తగ్గ వుపాయం చేయకపోవడం లోకులతప్పుగా నాకు తోస్తూ వుంది. యిట్టి కుకల్పనల విషయంలో వారు పెద్దలనిగాని, కవులనిగాని ఆలోచించి వూరుకోవలసివుండదు. “శ్లో, యుక్తియుక్తం వచో గ్రాహ్యంబాలాదపి సుభాషితమ్, వచనం తత్తునగ్రాహ్య మయుక్తంతు బృహస్పతేః".

బాగా ఆలోచిస్తే లోకం ఆలాటివ్యక్తులని మందలించవలసి వుంటుందనడంకంటే యే కాలకర్మదోషంవల్లనో ఆలాటి కుకల్పన చేయడం తటస్థించినప్పటికీ, అడుగునబడివున్న తమ ప్రాజ్ఞతను బయటికి తెచ్చుకొని పశ్చాత్తాపపడి, ఆపశ్చాత్తాపాన్ని స్వయంగా లోకానికి తెల్పడంలోనే విశేషంవుంది. కాని బుద్ధిపూర్వకంగా చేయాలని చేసినపనికి ఆలాటి సుయోగం యేలా సంఘటిస్తుంది? యిట్టి అయుక్తకార్యాలుచేసే వ్యక్తులు వసించే దేశానికి చిక్కు కలుగుతూ వున్నట్టు యీమధ్య వొకానొక సందర్భంలో గోచరించింది. బంగాళాదేశంలో మహాత్ముణ్ణిగూర్చి చేసిన (చెప్పు విసరడం) అపచారానికి బాధ్యత ఆదేశంలోనేకాక భరతఖండంలో సర్వత్రా పేరుమోసి వున్న శ్రీబోసుమీదికి రావడం పత్రికా పాఠకులందఱూ యెఱిగిందే కనక విస్తరించవలసి వుండదు. చతుస్సముద్రాలు వుండగా దక్షిణ సముద్రానికే బంధనం తటస్థం కావడమనేది ఆ సమీపంలో రావణాసురుడు వుండడంవల్లనే అని వొక కవి చమత్కరించి వున్నాడు. సర్వథా దుస్సహవాసంవల్ల ప్రాణికోట్లకే కాదు, జడపదార్థాలకు కూడా కీడు మూడడం సర్వానుభవసిద్ధం కనుక యీ విషయం జాగ్రత్తగా గమనించవలసి వుంటుంది. యిప్పటికాలానికిన్నీ పూర్వకాలానికిన్నీ భేదం వుంటుందని విశ్వసిస్తే తప్ప, ఆకాలమూ యీ కాలంవంటిదే అయేయెడల, ఆనాటి చరిత్రలలో యే భాగం సత్యమో, యేభాగం సత్యేతరమో? నిర్ణయించడానికి మానవమాత్రుడు సమర్దుడుకాడు. జ్ఞానదృష్టి కలవారు అనగా అతీంద్రియజ్ఞానవిధులే? ఆయాగాథలయందు వుండే యథార్థ్యాన్ని నిర్ణయించతగ్గవారు. వ్యాసాదులు అట్టివారనే కారణంచేతనే భారతాదికం మనకు విశ్వాస్య మవుతూవుంది. లోకంలో “సత్యకాలం" అనే పదం వాడుకలోవుంది. కాని అది యెప్పుడు అమల్లో వుండేదో? సరిగా చెప్పలేము, క్రమంగా సత్యానికి దుర్దశ వచ్చివుంటుందిగాని అమాంతంగా ఒకటేసారి వచ్చి వుండదు. కొంతకాలం యీ దుర్దశ పామరజనంలో అక్కడక్కడ దృశ్యాదృశ్యంగా వుండి క్రమంగా అంటువ్యాధిలాగ అలుముకొని తరవాతతరవాత యిది పండితులనుకూడా ఆశ్రయించింది. పండితులనగా “యిది మంచీ యిది చెడ్డా" అనే వివేకం కలవారుకదా? అట్టివారిక్కూడా యిదేం కర్మమని అనుకోవడానికి అవకాశంలేదు. యేమంటే కొన్ని అకృత్యాలు అవలంబించి తద్వారాగా పామరులు పొందుతూ వున్న తాత్కాలిక లాభాలు చూచి కళ్లుకుట్టి క్రమంగా ఆలాటి వ్యాపారాలలోకి పండితులుకూడా దిగుతూ వున్నట్టు యిప్పటి ప్రపంచకం సాక్ష్యమిస్తూనే వుంది గనక విస్తరించవలసింది లేదు. యిది ఆలాటిది కాకపోయినా అంటే? ఆ బ్రాహ్మణఛండాల పర్యంతమూ జంకవలసిందే. అయినాక్రమంగా జ్ఞానులలోకూడా వ్యాపించడానిక్కారణం యీ నీలాపనిందలకు యేవిధమైన అపకారమున్నూ దైవమూలకంగా వచ్చినట్టు లేకపోవడమే. దానితోటి "అసత్యకల్పన" మంటే సర్వసాధారణమైనట్టు కనపడుతుంది. యీ కల్పనకూడా వొకటే విధంగా వుండదు. కొందఱు లాభాపేక్షతో దీన్ని ఆశ్రయిస్తారు. కొందఱు యే ప్రయోజనమూ లేకుండానే దీనిలో వ్యాపకం చేస్తారు. యెవరెందుకు దీనిలోదిగినా, యెప్పుడో వొకప్పుడు యిది తగినంత ప్రాయశ్చిత్తముచేసి తీరుతుందిగాని వూరికేపోదు. కాస్త నలుగురిలో తలెత్తుకు తిరిగే యే వ్యక్తిన్నీ యీ నీలాపనిందా కారకత్వంలో పాల్గొనకూడదు. పాల్గొనడమే అనర్థదాయకమైనప్పుడు యావత్తు యాజమాన్యమూ వహించవలసివస్తే, యిక చెప్పేదేమిటి? యీ నీలాపనిందలకు గుఱియైనవ్యక్తులు చాలామంది వుంటారు గాని యీ కాలంలో తి|| వెం|| కవులు గుఱిఅయినంత యెవ్వరూ అయివుండరు. గీరతంలోనున్నూ, గుంటూరిసీమలోనున్నూ విశేషించి వుంటుంది. ఆ గ్రంథధ్వయం లోనున్నూ యీ నీలాపనిందలకు ముఖ్యంగా పరిశీలించతగ్గది గుంటూరిసీమ. గీరతంలో

ఉ. "కట్టుచునున్నవారు గృహకాండము నారకమందు" అనే పద్యాలు ప్రచురించిన తరవాతేనా అపవాదకులు భయపడి వెనక్కుతగ్గినట్టు కనపడుతుందిగాని, గుంటూరి సీమవిషయంలో తుట్టతుదదాకా వొకటే పోకడ; అయితే ఆ సీమలో పలువురు యోగ్యులు వుండి వెంటనే యథార్థాన్ని ప్రచురించి సహాయం చేయడంవల్ల కొన్నాళ్లకేనా ఆరొంపిలో నుండి బయట బడగలిగాం గాని లేకపోతే యేమయేదో? చెప్పజాలము. ఆయా వ్యక్తులందఱినీ కాదుగాని, అందులో వొకటి రెండు వ్యక్తులు జ్ఞాపకంవస్తే యిప్పుడుకూడా వొళ్లు జలదరిస్తుంది. యెప్పుడో ఆ కాలం అంతరించి పోయిందంటే "తుదకబ్బెరా తురకభాష" అన్నట్టు మళ్లాయిప్పుడు ఆలాటివారు బయలుదేరి యేవెఱ్ఱిమొఱ్ఱి అసత్యాలో వ్రాయడంచేత యేదో కొంత ‘పిల్లిమీదా యెలకమీదా" పెట్టి నాల్గు మాటలు వ్రాయడం; యింతే స్వస్తి-


★ ★ ★