ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ
పరువు పరువున నా కొర కరుగు దెంచు
నీదు నునులేత రెక్కల మీద వడిగ
నెత్తికొని పోవరాదె న న్నెచటి కేని
నిత్య తేజో మ యానంద నిలయమునకు!
నిముస మేనియు నిట నుండనేర నోయి!
సంజ మబ్బుల పవడాల చాయ లందొ
తరణి బంగారు కిరణాల మెరుగు లందొ
లీన మొనరింప రాదె యీలోన నన్ను?
మధుర సంధ్యా సమీర కుమార, దీను
మనవి విని యేగ రాదె యే మలయగిరికొ?
మధుర సంధ్యా సమీర కుమార, నన్ను
తోడుకొని యేగరాదె నీతోడ గూడ!