ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 38
అధ్యాయం : 38
గులాబీలమధ్య సాధువు,
లూథర్ బర్బాంక్
“శాస్త్రజ్ఞానం మాట అలా ఉంచి, మెరుగుపరిచిన మొక్కల పెంపకం విధానంలో ఉన్న కిటుకు ఏమిటంటే - ప్రేమ.” ఈ విజ్ఞత వ్యక్తం చేసినవారు లూథర్ బర్బాంక్. కాలిఫోర్నియాలో శాంటా రోసాలో ఆయనకున్న తోటలో ఆయన పక్కగా నేను నడుస్తూ ఉండగా అన్నమాట లివి. తినడానికి పనికి వచ్చే, నాగజెముడు మొక్కల మడిదగ్గర ఆగాం మేము.
ఆయన ఇంకా ఇలా చెప్పారు: “ ‘వెన్ను లేని’ నాగజెముడు తయారు చెయ్యడానికి నేను ప్రయోగాలు నడుపుతూ ఉన్నప్పుడు, ప్రేమ స్పందనలు సృష్టించడాని కని, నేను తరచుగా మొక్కలతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ‘నువ్వేం భయపడక్కర్లేదు,’ అంటూ మొక్కకు చెప్పేవాణ్ణి. ‘కాపుదలకోసం నీ కీ ముళ్ళు అక్కర్లేదు. నేను నిన్ను కాస్తాను.’ క్రమంగా ఎడారుల్లో పెరిగే ఉపయోగకరమైన ఈ మొక్క, ముళ్ళులేని రకంగా మారింది.”
ఈ అలౌకిక ఘటనకు నేను ముగ్ధుణ్ణి అయాను. “లూథర్‌గారూ, మౌంట్ వాషింగ్టన్ గుట్టమీద మా తోటలో నాటడానికి నాకు కొన్ని నాగజెముడు ఆకులు ఇవ్వండి,” అని కోరాను. దగ్గరలో ఉన్న ఒక పనివాడు, కొన్ని ఆకులు నాకు తుంచి ఇవ్వడానికి తయారయాడు, బర్బాంక్ అతన్ని ఆపారు.
“స్వామివారి కోసం నేనే వాటిని తుంచి ఇస్తాను.” మూడు ఆకులు నాకు ఇచ్చారు. తరవాత వాటిని నాటాను. అది క్రమంగా పెద్ద తోటగా వృద్ధి అవుతుంటే చూసి ఎంతో ముచ్చటపడ్డాను.
తాము సాధించినవాటిలో, చెప్పుకోదగ్గ మొదటి విజయం, పెద్దరకం బంగాళాదుంప అని చెప్పారు, ఆ మహా ఉద్యానశాస్త్రవేత్త, ఆ బంగాళాదుంప ఇప్పుడు ఆయన పేరుతోనే ప్రసిద్ధికెక్కింది. అకుంఠిత ప్రతిభా సంపత్తితో ఆయన, ప్రకృతిసిద్ధంగా ఉన్న మొక్కల్ని అంటు గట్టి మెరుగుపరిచి, కొన్ని వందల రకాలు ప్రపంచానికి అందించారు - టమాటా, మొక్కజొన్న, గుమ్మడికాయవంటి కూరగాయలు (స్క్వాష్), చెర్రీలు, రేగిపళ్ళు, నెక్టారైన్లు, బేరిపళ్ళు, గసగసాలు, లిల్లీలు, గులాబీలు మొదలైనవి ఆయన రూపొందించిన కొత్త బర్బాంక్ రకాలు
లూథర్‌గారు నన్ను, ‘ప్రసిద్ధమైన ఆక్రోటు (వాల్‌నట్) చెట్టు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే నేను కెమేరా ఫోకస్ చేశాను; ప్రకృతి పరిణామాన్ని ప్రయత్నపూర్వకంగా త్వరితం చెయ్యవచ్చునన్న సంగతి ఆ చెట్టుతోనే నిరూపించారాయన.
“ఒక్క పదహారేళ్ళలోనే ఈ ఆక్రోటు చెట్టు, సమృద్ధిగా కాయలు పండించే స్థితికి చేరుకుంది. దోహదం జరక్కుండా, ప్రకృతిసహజమైన రీతిలో ఈ పరిణామం రావాలంటే, అంతకు రెట్టింపు కాలం పట్టేది.
బర్బాంక్‌గారి చిన్న పెంపుడు కూతురు, తన కుక్కతో ఆడుకుంటూ తోటలోకి వచ్చింది. “అది నా మానవ వృక్షం.” లూథర్‌గారు ఆ అమ్మాయివేపు ఆప్యాయంగా చెయ్యి ఊపారు. “ఇప్పుడు నేను మానవజాతిని బ్రహ్మాండమైన ఒక మొక్కగా చూస్తున్నాను. దాని అత్యున్నత ప్రయోజనాలు నెరవేరడానికి కావలసిన వల్లా - ప్రేమ, విశాలమైన ఆరుబయలువల్ల కలిగే ప్రకృతిసహజమైన లాభాలు, తెలివిగా అంటుగట్టడం, ఎంపిక. ఒక్క నా జీవితకాలంలోనే, వృక్షపరిణామంలో ఎటువంటి అద్భుత ప్రగతి గమనించానంటే, ప్రపంచంలో పిల్లలకు, సాదాగానూ హేతుబద్ధంగానూ జీవించడానికి సంబంధించిన నియమాలు కనక నేర్పితే, ఆరోగ్యవంతమూ సుఖవంతమూ అయిన ప్రపంచం రూపొందుతుందన్న ఆశాభావంతో దానికోసం ఎదురుచుస్తూ ఉంటాను. మనం ప్రకృతి దగ్గరికీ ప్రకృతిదైవం దగ్గరికీ తప్పకుండా తిరిగి వెళ్ళాలి.”
“లూథర్‌గారూ, ఆరుబయటి తరగతులూ ఆనందమూ నిరాడంబరతా గల వాతావారణమున్న మా రాంచీ విద్యాలయాన్ని చూస్తే మీరు సంతోషిస్తారు.”
నా మాటలు, బర్బాంక్‌గారి హృదయాన్ని కదిలించాయి. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం - చిన్నపిల్లల విద్య, లోతయిన, ప్రశాంతమైన ఆయన కళ్ళలో ఆసక్తి తొణికిసలాడుతూ ఉండగా, నా మీద ప్రశ్నల వర్షం కురిపించారాయన.
చివరికి ఆయన ఇలా అన్నారు: “స్వామీజీ, మీ విద్యాలయం లాంటివే ముందు యుగాలకొక ఆశారేఖ. పిల్లల్ని ప్రకృతినుంచి విడ దీసేసి, వాళ్ళలో వ్యక్తిత్వ వికాసాన్ని కుంటుపరిచిన, మన కాలపు విద్యా వ్యవస్థలంటే నాకు వెలపరం పుడుతుంది. ఆచరణాత్మకమైన మీ విద్యాదర్శాలతో నేను మనఃపూర్తిగా ఏకీభవిస్తున్నాను.” ఈ సత్పురుషుని దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉండగా, ఆయన ఒక చిన్న పుస్తకం మీద సంతకంపెట్టి, దాన్ని నాకు బహూకరించారు.[1]
“ఇదుగో, ‘ది ట్రెయినింగ్ ఆఫ్ ది హ్యూమన్ ప్లాంట్’[2] (మానవ వృక్ష శిక్షణ) అన్న విషయం మీద నా పుస్తకం,” అన్నారాయన. “శిక్షణలో కొత్త రకాలు - నిర్భయ ప్రయోగాలు అవసరమిప్పుడు. పండ్ల లోనూ పూలలోనూ అత్యుత్తమమైనవాటిని సాధించడంలో, అప్పుడప్పుడు అతిసాహసంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అలాగే, పిల్లలకోసం విద్యాబోధన సంబంధమైన నవకల్పనలు కూడా ఇంకా బహు సంఖ్యాకంగా, సాహసికంగా తయారు కావాలి,” అన్నారు.
ఆయన పుస్తకాన్ని ఆ రోజు రాత్రే గాఢమైన ఆసక్తితో చదివాను. ఆయన కన్ను, మానవజాతికి మహోజ్జ్వలమైన భవిష్యత్తును దర్శిస్తోంది. ఆయన ఇలా రాశారు: “ఈ ప్రపంచంలో అన్నిటికన్న మొండిప్రాణీ మార్చడానికి వీలుకాకుండా ఉండేది, నిశ్చితమయిన కొన్ని అలవాట్లకు స్థిరపడ్డ మొక్క ఈ మొక్క యుగయుగాలుగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ వస్తున్న విషయం గుర్తుంచుకోవాలి; బహుశా, అనేక యుగాలకు పూర్వం రాళ్ళలో పుట్టి, సుదీర్ఘ కాలగతిలో కూడా ఏ విధమైన పెద్ద మార్పు చెందకుండా ఉన్నది అదే కావచ్చు. ఇన్ని యుగాల ఆవృత్తిలో, మొక్క, అసమాన దృఢత్వంగల సంకల్పశక్తిని (ఉదాహరణకు అలా చెప్పాలనుకుంటే) అలవరచుకోదంటారా? నిజానికి, కొన్ని రకాల తాటిచెట్లలాంటి మొక్కలు, ఎంతగా మార్పుకు లోనుకాకుండా ఉంటాయంటే, ఇంతవరకూ ఏ మానవశక్తి వాటిని మార్చలేకపోయింది. మొక్క సంకల్ప శక్తితో పోలిస్తే మానవ సంకల్పశక్తి బలహీనమయినది. కాని, మొత్తం మొక్కకున్న యావజ్జీవ దృఢత్వం, కేవలం ఇంకో కొత్త జీవితో దాన్ని కలిపినంత మాత్రాన ఎలా విచ్ఛిన్నమయిందో చూడండి; సంకరకరణంవల్ల దాని జీవితంలో సంపూర్ణమూ శక్తిమంతమూ అయిన మార్పు తీసుకురావడం జరిగింది. దృఢత్వంలో ఆ విచ్ఛిన్నత వచ్చినప్పుడు దాన్ని ఓర్పుగా పర్యవేక్షిస్తూ, ఎంపికచేస్తూ ఆ మార్పును స్థిరపరిస్తే, కొత్తమొక్క కొత్తరీతిగా జీవిస్తుంది; పాతరీతికి తిరిగిపోదు. చివరికి దాని దృఢసంకల్పశక్తి విచ్ఛిన్నమై పరివర్తితమవుతుంది.
“అదే, ఎంతో సంవేదనశీలంగానూ నమ్యంగానూ ఉండే శిశుస్వభావ విషయంలో అయితే సమస్య చాలా తేలికవుతుంది.”
“అమెరికా దేశస్థుడైన ఆ మహానుభావుడివేపు అయస్కాంతంలా ఆకృష్ణుణ్ణి అయి నేను, ఆయన్ని కలుసుకోడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తూండే వాణ్ణి. ఒకరోజు పొద్దున నేను వెళ్ళేసరికి పోస్ట్‌మాన్, బర్బాంక్‌గారి అధ్యయనమందిరంలో, దాదాపు వెయ్యి ఉత్తరాలు పెట్టి వెళ్ళాడు. ప్రపంచం నలుమూలలనుంచీ ఉద్యానశాస్త్రజ్ఞులు ఆయనకు ఉత్తరాలు రాశారు.
“స్వామీజీ, మీరుండడంవల్లనే నేను తోటలోకి రావడానికి నాకు కావలసిన వంక దొరికింది,” అని ఉల్లాసంగా చెప్పారు లూథర్‌గారు. ఆయన ఒక పెద్ద డస్కు సొరుగు తీశారు; దాన్నిండా, విదేశయాత్రలకు సంబంధించిన కరపత్రాలు వందలకొద్దీ ఉన్నాయి.
“చూడండి, ఇలాగే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా మొక్కలకీ, ఉత్తర ప్రత్యుత్తరాలకీ కట్టి పడేసినవాణ్ణి కావడంవల్ల అప్పుడప్పుడు ఈ బొమ్మలకేసి చూస్తూ విదేశయాత్రల మీద నాకున్న కోరిక తీర్చుకుంటూ ఉంటాను.”
ఆయన గేటుముందు నా కారు ఆగి ఉంది. నేనూ లూథర్ గారూ ఆ చిన్న ఊళ్ళో ఉన్న రోడ్ల వెంబడి కారులో తిరిగి వచ్చాం. అక్కడి తోటలు ఆయన సృష్టించిన శాంటా రోసా, పీచ్ బ్లో, బర్బాంక్ గులాబీలతో ముచ్చటగొలుపుతున్నాయి. నే నక్కడికి వెళ్తూ వచ్చిన కొత్తల్లో ఒకసారి, ఆ మహాశాస్త్రవేత్త క్రియాయోగదీక్ష తీసుకున్నారు. “స్వామీజీ నేను దీక్షగా యోగసాధన చేస్తున్నాను,” అన్నారాయన యోగంలో వివిధ అంశాలగురించి ఆలోచనాత్మకమైన ప్రశ్న లనేకం చేసిన మీదట లూథర్‌గారు, మెల్లగా ఇలా వ్యాఖ్యానించారు.
“నిజానికి, పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ ఇంకా అన్వేషించడం మొదలుపెట్టని బ్రహ్మాండమైన విజ్ఞాన నిధులు ప్రాచ్య ప్రపంచానికి లభించి ఉన్నాయి.”[3] బర్బాంక్‌గారు ప్రకృతితో ఏర్పరచుకున్న సన్నిహిత సంపర్కం వల్ల, అది భద్రంగా దాచిపెట్టుకున్న అనేక రహస్యాల్ని ఆయనకి విప్పిచెప్పింది; దానివల్ల బర్బాంక్‌గారికి అపరిమితమైన ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులు కుదిరాయి.
“ఒక్కొక్కప్పుడు, నేను అనంతశక్తికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూంటుంది,” అంటూ సిగ్గుపడుతూ నాకు చెప్పారాయన. సంవేదన శీలమైన ఆయన సుందరముఖం, వెనకటి జ్ఞాపకాలతో వెలుగొందింది. “అప్పుడు నేను, నా చుట్టూ ఉన్న రోగుల్నీ తెగుళ్ళువచ్చిన చాలా మొక్కల్నీ నయం చెయ్యగలిగాను.”
ఆయన తమ తల్లిగారి గురించి చెప్పారు. ఆమె చిత్తశుద్ధిగల క్రైస్తవ మహిళ, “ఆవిడ చనిపోయిన తరవాత చాలాసార్లు, అంతర్దర్శనాల్లో ఆవిణ్ణి చూసే భాగ్యం కలిగింది; ఆవిడ నాతో మాట్లాడింది,” అన్నారు లూథర్‌గారు.
మనస్సు వెనక్కి లాగుతున్నప్పటికీ మేము మళ్ళీ ఆయన ఇంటికేసీ, ఆయనకోసం కాసుకుని ఉన్న వెయ్యి ఉత్తరాల కేసీ మళ్ళాం.
“లూథర్‌గారూ, ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచాల సత్యోపదేశాల్ని అందించడానికి నేనొక పత్రిక ప్రారంభిస్తాను; నా పత్రిక కొక మంచి పేరు నిర్ణయించడంలో మీరు సాయం చెయ్యండి,” అన్నాను.
రకరకాల పేర్ల గురించి మేము కొంత సేపు చర్చించుకున్నాం. లూథర్ బర్బాంక్
శాంటా రోసా, కాలిఫోర్నియా
యు. ఎస్. ఏ.
డిసెంబర్ 22, 1924
స్వామి యోగానందగారి యోగదా విధానం పరీక్షగా చూశాను; నా ఉద్దేశంలో అది, మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రకృతుల్ని సమన్వయం చేసే శిక్షణకు ఆదర్శవంతమైనది. కేవలం బుద్ధివికాసానికే పరిమితం కాకుండా, శరీరాన్ని సంకల్పాన్ని అనుభూతుల్నీ కూడా తర్ఫీదుచేసే విద్య బోధించడానికి, “జీవించడమెలా”గో నేర్పే విద్యాలయాలు ప్రపంచమంతటా స్థాపించాలని స్వామి వారి ఆశయం.
ధారణధ్యానాల సులభమైన శాస్త్రీయ పద్ధతులవల్ల, యోగవిధానంలో ఉన్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాస సాధనతో జీవితంలోని క్లిష్ట సమస్యలు చాలావరకు పరిష్కారం కావచ్చు. శాంతి, సౌహార్దం భూమిమీదికి అవతరించవచ్చు. సరైన విద్యనుగురించి స్వామివారికున్న భావం స్పష్టమైన లోకజ్ఞానం; ఏ విధమైన మార్మికతా ఆచరణలో అననుకూలతా లేనిది. లేకపోతే అది నా సమ్మతి పొంది ఉండేది కాదు.
జీవన కళకు సంబంధించిన అంతర్జాతీయ విద్యాలయాలు స్థాపించాలని విజ్ఞప్తి చేసే స్వామివారితో నేను కూడా హృదయపూర్వకంగా కలవడానికి ఈ అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను; వీటిని స్థాపించినట్లయితే, నాకు పరిచయమైన ఏ ఇతర విషయం మాదిరిగానైనా, ధర్మరాజ్య స్థాపనకు అవి చక్కగా తోడ్పడతాయి.
“ఇది నా ఈస్ట్-వెస్ట్ పత్రికలో ప్రారంభ సంచికలో వస్తుంది,” అన్నాను కృతజ్ఞతాపూర్వకంగా.
మా స్నేహం గాఢతరం అయిన మీదట, బర్బాంక్ గారిని నేను, నా “అమెరికన్ సెయింట్” (అమెరికా సాధువు) అనేవాణ్ణి. “ఇదుగో, ఏ కపటమూలేని మనిషిని చూడండి!”[5] అన్న వాక్యం ఉదాహరించాను. వినయం, ఓర్పు, త్యాగం చిరకాలంగా అలవాటయి ఉన్న ఆయన హృదయం అంతుపట్టనంత లోతు. గులాబీలమధ్య ఉన్న ఆయన చిన్న ఇల్లు అతి నిరాడంబరమైనది; విలాసాల వ్యర్థత, కొద్దిపాటి వస్తువులవల్ల కలిగే ఆనందం ఆయనకు తెలుసు. శాస్త్రరంగంలో తమకు వచ్చిన కీర్తిని ధరించడంలో ఆయన చూపే నమ్రత, పండే పండ్ల బరువుతో కిందికి వంగిన చెట్లను పదేపదే గుర్తుకు తెస్తుంది; పసలేని దాంభికంతో తల పైకి ఎగరేస్తూ ఉండేది గొడ్డుబోతు చెట్టే.
1926 లో నా ప్రియమిత్రుడు గతించినప్పుడు నేను న్యూయార్కులో ఉన్నాను. కళ్ళ నీళ్ళు పెట్టుకొని, “అయ్యో! ఆయన కడసారి చూపుకోసం, ఇక్కణ్ణించి శాంటా రోసా దాకా సంతోషంగా నడిచి వెళ్తాను!” అనుకున్నాను. కార్యదర్శులకూ సందర్శకులకూ దూరంగా నేను, తలుపులు మూసుకొని, ఇరవైనాలుగు గంటలు ఏకాంతంగా గడిపాను.
ఆ మర్నాడు, లూథర్‌గారి ఫొటో ఒకటి పెద్దది ఎదురుగా పెట్టుకుని, వైదిక కర్మకాండ జరిపించాను. నా అమెరికన్ శిష్యుల్లో కొందరు హిందూ వేషధారణ చేసి, పాంచభౌతిక తత్త్వాలకూ అవి అనంత సత్తలో తిరిగి లయమవడానికీ ప్రతీకలయిన పూలతో, నీళ్ళతో, నిప్పుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా, మంత్ర పఠనం చేశారు.
బర్బాంక్‌గారి భౌతిక కాయం, శాంటా రోసాలోని తమ తోటలో తాము స్వయంగా పాతిన లెబనాన్ సెడార్ (దేవదారు) వృక్షం కింద పూడ్చిపెట్టి ఉన్నప్పటికీ, నా దృష్టిలో ఆయన ఆత్మ, విప్పారిన కళ్ళతో దారిపక్క పూసే ప్రతి పువ్వులోనూ ప్రతిష్ఠితమై ఉంది. ప్రకృతి విశాల తత్త్వంలో కొంతకాలం ఉండడానికి లూథర్‌గారు ఇక్కణ్ణించి వెళ్ళి పోయినా, ప్రకృతిలో వీచే గాలుల్లో ఆయన గుసగుసలాడడం లేదా, పొడజూపే తొలిపొద్దుల్లో ఆయన నడయాడడం లేదా?
ఆయన పేరిప్పుడు, సామాన్య వ్యవహారభాషా వారసత్వంలో వచ్చేసింది. వెబ్‌స్టర్ న్యూ ఇంటర్నేషన్ డిక్షనరీలో “బర్బాంక్” అన శబ్దాన్ని సకర్మక క్రియగా చేరుస్తూ ఇలా నిర్వచించారు: (మొక్క సంకరకరణంచేయు లేదా అంటుగట్టు. దాన్నిబట్టి, లాక్షణికార్థంలో మంచి లక్షణాల్ని ఎంపికచేసి చెడ్డవాటిని తిరస్కరించి లేదా మంచి లక్షణాల్ని చేర్చి (ఒక ప్రక్రియగాగాని, సంస్థగాగానీ, దేన్నయినా మెరుగు పరచడం.”
ఆ నిర్వచనం చదివిన తరవాత నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. “ప్రియమైన బర్బాంక్, ఇప్పుడు, మీ పేరే మంచితనానికి మారు పేరయింది!”
- ↑ బర్బాంక్‌గారు, సంతకం చేసిన ఫొటో కూడా ఒకటి నాకు ఇచ్చారు. ఒకప్పుడు లింకన్ బొమ్మను అమూల్యంగా భద్రపరచుకున్న హిందూ వర్తకుడిలాగే, నేను దాన్ని భద్రపరుచుకున్నాను. అంతర్యుద్ధాల కాలంలో అమెరికాలో ఉన్న ఆ హిందువుకు లింకన్ మీద ఎంత అభిమానం ఏర్పడిందంటే, ఆ దాస్య విముక్తి ప్రదాత బొమ్మ ఒకటి సంపాదించేవరకు భారతదేశానికి తిరిగి రావడానికి అతనికి మనస్కరించలేదు. న్యూయార్కులో ఉండే డేనియల్ హంటింగ్ టన్ అనే ప్రసిద్ధ చిత్రకారుడిచేత ఆయన బొమ్మ వేయించడానికి అనుమతి వచ్చేవరకు కదలనని, ప్రెసిడెంట్ లింకన్ నివాసభవనం దగ్గర భీష్మించుకొని కూర్చున్నాడు. చివరికి ప్రెసిడెంట్ లింకన్ ఆశ్చర్యపోయి అనుమతి ఇచ్చాడు. బొమ్మ పూర్తి అయిన తరవాత ఆ హిందువు, విజయగర్వంతో దాన్ని కలకత్తా తీసుకువెళ్ళాడు.
- ↑ న్యూయార్క్: సెంచరీ కం., 1922.
- ↑ సమాధి స్థితిలోకి వెళ్ళడానికి శ్వాసక్రియను నియంత్రించడానికి ఉపకరించే “ప్రాచ్యప్రక్రియల్ని” పాశ్చాత్య విజ్ఞానశాస్త్రవేత్తలు “నేర్చుకోవాలి.” అన్నాడు. ప్రఖ్యాత ఇంగ్లీషు విజ్ఞానశాస్త్రవేత్త, డా॥ జూలియన్ హక్స్‌లీ, “ ‘ఏం’ జరుగుతుంది? ‘ఎలా’ సాధ్యమవుతుందది? ” అన్నాడాయన. 21 ఆగస్టు 1948 తేదీనాటి ‘ఎసోసియేటెడ్ ప్రెస్’ పత్రికలో ప్రచురించిన లండన్ వార్తలో ఇలా రాసి ఉంది: “ప్రాచ్యదేశాల మార్మిక విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించడం మంచిదని డా॥ హక్స్‌లీ, కొత్తగా ఏర్పడ్డ మానసికారోగ్య ప్రపంచ సమాఖ్య (World Federation of Mental Health) కు సూచించాడు. “ఈ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా కనక పరిశీలించినట్లయితే, మీ రంగంలో మీరు, ముందుకొక పెద్ద అంగ వెయ్యగలరనుకుంటాను.” అన్నాడు.
- ↑ 1948 లో దీని పేరు ‘సెల్ఫ్ రియలైజేషన్ మేగజైన్’ అని మార్చడం జరిగింది.
- ↑ యోహాను 1 : 47 (బైబిలు).