అధ్యాయం : 37

నా అమెరికా ప్రయాణం

“అమెరికా! వీళ్ళు కచ్చితంగా అమెరికన్లే!” కొన్ని పాశ్చాత్య ముఖాల[1]తో నిండిఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది. రాంచీ విద్యాలయంలో[2] సామానుగదిలో, దుమ్ముపట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నాను. కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో, ఒక ఏకాంత స్థలం చూసుకోడమే నాకు కష్టంగా ఉండేది!

అంతర్దర్శనం కొనసాగింది; అపార జనసమూహం ఒకటి తదేకంగా నావేపు చూస్తూ నటీనట బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది.

సామానుగది తలుపు తెరుచుకుంది; మామూలుగానే, కుర్రవాళ్ళలో ఒకడు, నేను దాక్కుని ఉన్న చోటు కనిపెట్టేశాడు. “ఇలా రా, విమల్,” అని ఉత్సాహంగా పిలిచాను. “నీకో వార్త చెప్పాలి - ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు!”

“అమెరికాకాండీ?” అంటూ ఆ అబ్బాయి, నా మాటల్ని మారుపలికాడు; “చంద్రలోకానికి” అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా.

“ఔను! కొలంబస్‌లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు; ఈ రెండు దేశాలకీ మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది!”

విమల్ ఎగిరి చక్కాపోయాడు; కాస్సేపట్లో, ఈ రెండు కాళ్ళ వార్తా పత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయమంతకీ తెలిసిపోయింది.

దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిపించి, విద్యాలయాన్ని వారికి అప్పగించాను.

“విద్యాబోధనలో లాహిరీ మహాశయుల యోగాదర్శాన్ని మీ రెప్పుడూ మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచు ఉత్తరాలు రాస్తూ ఉంటాను; దేవుడు సంకల్పిస్తే, ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను,” అన్నాను.

చిన్న చిన్న కుర్రవాళ్ళ వేపూ, ఎండపడుతున్న రాంచీ భూముల వేపూ చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు; ఇకనుంచి నేను దూరదేశాల్లో ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మర్నాడు, అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభ (International Congress of Religious Liberals) కు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను. ఆ సంవత్సరం అది, బోస్టన్‌లో, అమెరికన్ యూనిటేరియన్ ఎసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది.

నా తల సుడిగుండంలో పడ్డట్టయి, శ్రీరాంపూర్‌లో శ్రీయుక్తేశ్వర్‌గారి సన్నిధికి చేరాను.

“గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభలో మాట్లాడ్డానికి ఇప్పుడే నా కో ఆహ్వానం వచ్చింది. దయ ఉంచి, మీ సలహా చెప్పండి.”

“నీ కోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి,” అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు. “వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదు.”

“కాని, గురుదేవా, బహిరంగోపన్యాసాల గురించి నాకేం తెలుసండి? నేను ఉపన్యాస మిచ్చిందే అరుదు; అది కూడా ఇంగ్లీషులో ఎన్నడూ కాదు,” అని దిగులుగా అన్నాను.

“ఇంగ్లీషయేది కాకపోయేది; యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాలవాళ్ళు విని తీరవలసిందే.”

నేను నవ్వాను. “బాగుంది, కాని పూజ్య గురూజీ, అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారనుకోను! ఇంగ్లీషు భాషలో అడ్డు చాటుకుపోవడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి.”[3]

నాన్నగారి దగ్గర నా ఉద్దేశాలు బయటపెట్టేసరికి, ఆయన అదిరి పడ్డారు. అమెరికా, ఆయనకు నమ్మశక్యం కానంత దూరదేశంలా అనిపించింది; మళ్ళీ నన్నెన్నడూ చూడలేరేమోనని భయపడ్డారు. “ఎలా వెళ్ళగలవు?” అని కఠినంగా అడిగారు. “నీ ఖర్చు ఎవరు భరిస్తారు?” నా చదువుకూ నా యావజ్జీవితానికి అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడంవల్ల, ఆయన ప్రశ్న నా ప్రయత్నాన్ని ఠపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారాయన.

“ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తారు.” నేను ఈ జవాబు ఇస్తున్నప్పుడు, ఇలాంటి జవాబే చాలాకాలం కిందట ఆగ్రాలో అనంతన్నయ్యకి ఇచ్చానని తలుచుకున్నాను. ఆట్టే అపోహ కలిగించకుండా, ఆ తరవాత అన్నాను, “నాన్నగారూ, నాకు సహాయం చెయ్యమని బహుశా దేవుడే మీ మనస్సుకు తోపించవచ్చు.”

“ఊఁహుఁ, ఎన్నటికీ అలా జరగదు!” అంటూ జాలిగా చూశారు నావేపు.

అందువల్ల, ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

“నేను నీకీ డబ్బు ఇస్తున్నది, తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు; లాహిరీ మహాశయులకు విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా మాత్రమే. ఇక ఆ పడమటి దేశానికి వెళ్ళు; జాతిమతభేదం లేని క్రియాయోగ బోధలు వ్యాప్తిచెయ్యి.”

నాన్నగారు నిస్స్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని పక్కకి పెట్టగలిగినందుకు నా హృదయం గాఢంగా చలించింది. నన్ను విదేశయాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకు ముందు రాత్రి ఆయనకు సరయిన అనుభూతి కలిగింది.

“బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోమేమో.” అప్పటికే అరవై ఏడేళ్ళ వయస్సులో ఉన్న నాన్న గారు విచారంగా అన్నారు. “ఈశ్వరుడు మళ్ళీ మరొక్కసారి మనని తప్పకుండా కలుపుతాడు,” అంటూ సమాధాన మివ్వడానికి, అంతర్‌జ్ఞానానుభూతివల్ల కలిగిన దృఢవిశ్వాసం ఒకటి ప్రేరణ ఇచ్చింది.

అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోడానికి, గురుదేవుల్నీ నా స్వదేశాన్నీ విడిచి వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా, నాకు కొద్దిగా భయం పుట్టింది. “భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం” గురించి నేను చాలా కథలు విన్నాను; సాధుసత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీత మవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైన దీ ప్రపంచం.

“తామే అధికులమని అహంకరించే పాశ్చాత్యుల ప్రవర్తనను ఎదుర్కోవాలంటే, ప్రాచ్యదేశంనుంచి వచ్చిన గురువు, హిమాలయాల వల్ల కలిగే చలిబాధలకు తట్టుకోడానికి అవసరమైనదానికన్న ఎక్కువ దృఢంగా ఉండాలి!” అనుకున్నాను.

ఒకనాడు వేకువవేళ ప్రార్థన చెయ్యడం ప్రారంభించాను; ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే, దేవుడి మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నాను. ఆయన ఆశీస్సులూ, ఆధునిక ఉపయోగితావాదపు పొగమంచులో నేను దారి తప్పిపోనన్న హామీ, కావాలని కోరుకున్నాను. అమెరికా వెళ్ళడానికే నా మనస్సు మొగ్గి ఉంది, కాని అంతకన్న గట్టిగా, దైవానుమతితో చల్లని పలకరింపు ఒకటి వినాలని తీర్మానించుకుంది.

వెక్కివెక్కి వచ్చే ఏడుపు ఆపుకోడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. జవాబేమీ రాలేదు. మధ్యాహ్నానికి నా ప్రార్థన పరాకాష్టకు వచ్చింది; వేదనాభారంతో నా తల తిరిగిపోతోంది. మరొక్కసారి ఏడిచానంటే, నా మనోవేదన మరింత గాఢమయి నా తల పగిలిపోతుందేమో ననిపించింది. ఆ సమయంలో, మా గుర్పార్ రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్న చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకొని తలుపు తీశాను, సన్యాసులు కట్టుకొనే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచాయన ఎదురుగా కనిపించారు; ఇంట్లోకి వచ్చారు.

“ఈయన బాబాజీ అయి తీరాలి!” అనుకుని, దిగ్ర్భమ చెందాను. ఏమంటే, నా ఎదురుగా ఉన్నాయనకి, పడుచుతనంలో ఉన్న లాహిరీ మహాశయుల మొక్కట్లు ఉన్నాయి. ఆయన నా ఊహకు జవాబిచ్చారు. “ఔను. నేను బాబాజీని.” ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు. “మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు. ‘నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి ఆమెరికా వెళ్ళు. భయపడకు, నీకు రక్ష ఉంటుంది’ అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు.

స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తరవాత, బాబాజీ మళ్ళీ నాతో మాట్లాడారు. “పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే. చాలాకాలం కిందట, ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్‌ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరకి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకి చెప్పాను.”

నాకు నోట మాట లేదు; ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరి బిక్కిరి అయి, నన్ను శ్రీయుక్తేశ్వర్‌గారి దగ్గరికి పంపినవారు ఆయనేనని ఆయన నోటినించే విన్నందుకు గాఢంగా చలించిపోయారు. ఆ అమర గురువుల పాదాలముందు సాష్టాంగపడ్డాను. కృపాదృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి, కొన్ని ఆంతరంగిక సూచనలు ఇచ్చి, భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు.

“దైవసాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”

ఆ మహాగురువులు, మహత్తర శక్తియుక్తమైన ఒక్క చూపుతో నాలో విద్యుత్తు పుట్టించి, విశ్వచైతన్యానుభవం ప్రసాదించారు.

“దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా,
 యది భాఃసదృశీ సా స్యాద్ భాస స్తస్య మహాత్మనః."[4]
 
 (ఆకాశంలో ఒకేసారి వెయ్యిమంది సూర్యులు ఉదయించి
 నప్పటికీ కూడా, వారినుంచి వెలువడే కాంతి, మహాత్ముడి
 దివ్యప్రకాశానికి సాటి రాదు).

కాస్సేపట్లోనే బాబాజీ, గుమ్మందగ్గరికి వెళ్ళబోతూ, “నా వెంట రావడానికి పూనుకోకు. నువ్వలా రాలేవు,” అన్నారు.

“బాబాజీ, వెళ్ళిపోకండి; దయ ఉంచి వెళ్ళిపోకండి,” అంటూ మళ్ళీమళ్ళీ ప్రాధేయపడ్డాను. “నన్ను మీతో తీసుకుపొండి!”

“ఇప్పుడు కాదు. మరోమాటు,” అన్నారాయన.

ఉద్రేకం పట్టలేక, ఆయన హెచ్చరికను లెక్కచెయ్యలేదు నేను. ఆయన వెంట పడి పోవడానికి ప్రయత్నం చెయ్యబోతే, నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి తెలిసింది. గుమ్మంలోంచి ఆప్యాయంగా నావేపు ఒక చూపు విసిరారు బాబాజీ. ఆశీస్సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి, తరవాత వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయనమీదే నిలిచి పోయాయి, లాలసతో.

కొన్ని నిమిషాల తరవాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చుని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను; నా ప్రార్థనను మన్నించి సమాధాన మివ్వడమే కాకుండా, బాబాజీ ఆగమనభాగ్యం నాకు కలిగించినందుకు, దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సనాతనులూ నిత్యయౌవనపూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో నా శరీరం పావనమయింది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనస్సులో ఉంటూ వచ్చింది.

నేను బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు. నా మానవ జీవితానుభవాల్లో కల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి, నా గుండెలోనే దాచి పెట్టుకున్నాను. లోక ప్రయోజనాలపట్ల ఆసక్తిగల, ఏకాంతవాసులైన బాబాజీని నా కళ్ళతో నేను చూశానన్న సంగతి చెబితే, ఈ ఆత్మకథ చదివే పాఠకులు, ఆయన ఉనికి వాస్తవమే నన్న సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఈ పుస్తకం కోసం, ఆధునిక భారతీయ యోగీశ్వరుల యథార్థ చిత్రాన్ని గీయడానికి నేనొక చిత్రకారుడికి సాయపడ్డాను.

అమెరికాకు బయలుదేరడానికి ముందునాటి రాత్రి, శ్రీయుక్తేశ్వర్‌గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను. “నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మరిచిపో, అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవరుచుకోకు; రెండు దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైనవి తీసుకో,’ అని చెప్పారాయన, తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో. “దేవుడి కుమారుడిగా, నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో, ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమగుణాల్నీ అన్వేషించి, వాటిని నీలో కలుపుకో.”

ఆ తరవాత నన్ను ఆశీర్వదించారు: “దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చేవాళ్ళందరికీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళ వేపు చూస్తుంటే, నీ కళ్ళలోంచి వెలువడే ఆత్మ విద్యుత్ప్రవాహం వాళ్ళ మెదళ్ళలోకి ప్రవేశించి, వాళ్ళలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ళ భౌతి మైన అలవాట్లను మార్చేస్తుంది.” చిరునవ్వు నవ్వుతూ ఇంకా అన్నారు, “చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా - నట్టడవిలోనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు.”

శ్రీయుక్తేశ్వర్‌గారి ఈ ఆశీస్సులు రెండూ సమృద్ధిగా ఫలించాయి. ఒక్క స్నేహితుడు కూడా లేకుండా, నేను ఒంటరిగా అమెరికా వచ్చాను, కాని ఇక్కడ, కాలాబాధితమయిన ఆత్మోపదేశాల్ని అందుకోడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేలకొద్దీ కనిపించారు.

నేను 1920 ఆగస్టులో, ‘ది సిటీ ఆఫ్ స్పార్టా’ అనే ఓడలో భారతదేశం నుంచి బయలుదేరాను. ప్రపంచయుద్ధం ముగిసిన తరవాత అమెరికాకు బయలుదేరిన మొట్టమొదటి ప్రయాణికుల ఓడ అదే. ప్రభుత్వ కార్యాలయ నిత్యపరిపాటి వ్యవహారాల్లో కేవలం గుడ్డిగా అనుసరించే పద్ధతులవల్ల నా పాస్‌పోర్టు మంజూరు కావడానికి అనేకమయిన అటంకాలు ఇబ్బందులూ, అలౌకిక అద్భుత రీతుల్లో తొలగిపోయిన తరవాతే నా ప్రయాణం టిక్కెట్టు బుక్‌ చేసుకోగలిగాను.

రెండు నెలలు పట్టిన ఆ ప్రయాణంలో, నా తోటి ప్రయాణికు డొకడు, నేను బోస్టన్ మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్న సంగతి కనిపెట్టాడు. “స్వామి యోగానందా,” అంటూ చిత్రమైన ఉచ్ఛారణతో సంబోధించాడు నన్ను; నేను, ఉత్తరోత్తరా అమెరికన్ల ఉచ్ఛారణలో నా పేరు పలకగా విన్న అనేక రకాల్లో అది ఒకటి. “వచ్చే గురువారం రాత్రి మీరు ప్రయాణికులకు ఒక ఉపన్యాసం ఇచ్చి అనుగ్రహించండి. ‘జీవిత సంగ్రామం - దాన్ని ఎదుర్కోడం ఎలా?’ అన్న విషయం మీద మాట్లాడితే మా కెంతో లాభంగా ఉంటుందనుకుంటాను,” అన్నాడాయన.

అయ్యో! ఇప్పుడు నా జీవిత సంగ్రామాన్నే ఎదుర్కోవలసి వచ్చిందే అని తెలుసుకున్నాను బుధవారం నాడు. నా భావాల్ని ఇంగ్లీషులో ఒక ప్రసంగవ్యాసంగా రాయాలని ప్రయత్నించి, ఆ అవస్థ పడలేక, చివరికి అన్ని సన్నాహాలూ విరమించుకున్నాను. నా ఆలోచనలు, జీనుకేసి చూసిన అడవి గుర్రప్పిల్లలాగ, ఇంగ్లీషు వ్యాకరణ నియమాలతో సహకరించడానికి మొరాయించాయి. అయితే, మా గురుదేవుల వెనకటి హామీల్నే పూర్తిగా నమ్ము కొని, గురువారం నాడు, ఓడలో ఉన్న సమావేశం హాలులో హాజరయిన శ్రోతల ఎదటికి వచ్చాను. వాగ్దార ఏదీ నా పెదవుల దాకా రాలేదు; నోట మాటలేక, సభాసదుల ముందు అలాగే నిలబడిపోయాను. పది నిమిషాల పాటు సహన పరీక్షకి గురిఅయిన తరవాత శ్రోతలు, నా అవస్థ కనిపెట్టి నవ్వడం మొదలెట్టారు.

ఆ సమయంలో, ఆ పరిస్థితి నాకయితే వినోదంగా ఏం లేదు; దాన్ని అవమానకరంగా భావించి, నిశ్శబ్దంగా గురుదేవులకు నా విన్నపం పంపాను.

“నువ్వు మాట్లాడగలవు! ఊఁ, మాట్లాడు!” అంటూ ఆయన స్వరం తక్షణమే నా అంతరంగంలో ధ్వనించింది.

వెంటనే, నా భావాలు ఇంగ్లీషుభాషతో స్నేహసంబంధం ఏర్పరచుకున్నాయి. నలభై అయిదు నిమిషాల తరవాత కూడా శ్రోతలు సావధానంగా ఉన్నారు. ఆ ఉపన్యాసమే, ఆ తరవాత అమెరికాలో నేను వివిధ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానాలు సంపాయించి పెట్టింది.

ఆ తరవాత, నేను మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. జాగ్రత్తగా వాకబుచేసిన మీదట, ప్రయాణికులు కొందరు చెప్పిన దేమిటంటే: “సంచలనం కలిగించే విధంగా, శుద్ధమైన ఇంగ్లీషులో మీరు ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు.” ఈ సంతోషకరమైన వార్త విని, దేశ కాలావరోధాలన్నిటినీ సున్న చేస్తూ గురుదేవులు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంగతి మళ్ళీ కొత్తగా గ్రహిస్తూ, సరిగ్గా సమయానికి నాకు అందిచ్చిన సహాయానికి ఆయనకు సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.

తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు, బోస్టన్ మహాసభలో ఎదురుకాబోయే ఇంగ్లీషు ఉపన్యాసమనే కఠిన పరీక్షగురించి భయాందోళనలు అనుభవించాను.

“ప్రభూ, నువ్వే నాకు ఏకైక స్ఫూర్తివి అయేలా అనుగ్రహించు,” అని గాఢంగా ప్రార్థించాను.

మా ఓడ, ‘ది సిటీ ఆఫ్ స్పోర్ట్’ సెప్టెంబరు చివరిలో, బోస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది. 1920 అక్టోబరు 6న, అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా, మహాసభలో ప్రసంగించాను. శ్రోతల కది బాగానే నచ్చింది. ‘అమ్మయ్య!’ అని ఒక నిట్టూర్పు విడిచాను. ఉదార హృదయులైన, అమెరికన్ యూనిటేరియన్ కాంగ్రెస్ కార్యదర్శి, మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్ష[5]లో, కింది విధంగా వ్యాఖ్య రాశాడు.


“రాంచీ బ్రహ్మచర్యాశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద, ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకువచ్చారు. ధారాళమైన ఇంగ్లీషులో, పటిష్ఠమైన వచస్సుతో, దార్శనిక స్వభావానికి సంబంధించిన ‘మతశాస్త్రం’ (ది సైన్స్ ఆఫ్ రెలిజియన్) అనే విషయం మీద ఉపన్యాసం ఇచ్చారు; అధికసంఖ్యాకులకు అందించడం కోసం, దీన్ని కరపత్రరూపంలో ముద్రించడం జరిగింది. మత మన్నది విశ్వ జనీనమని అది ఒక్కటేననీ అన్నారాయన. కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీల్ని ఆచారాల్నీ మనం విశ్వజనీనం చెయ్యలేకపోవచ్చు; కాని మతంలో ఉన్న సామాన్య తత్త్వాన్ని విశ్వజనీనం చెయ్యవచ్చు; అందరూ దాన్ని సమానంగా అనుసరించి, మన్నించాలని కోరవచ్చు.”

నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కువల్ల, మహాసభ ముగిసిపోయిన తరవాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను. బోస్టన్‌లో అతిసామాన్య పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. నేను బహిరంగోపన్యాసా లిచ్చాను, తరగతుల్లో బోధించాను. ‘సాంగ్స్ ఆఫ్ ది సోల్’ (ఆత్మగీతాలు) అన్న కవితా సంపుటి రాశాను. ఈ కవితా సంపుటికి, ‘సిటీ ఆఫ్ న్యూయార్క్ - కళాశాల’ అధ్యక్షులైన ఫ్రెడరిక్ బి. రాబిన్‌సన్ పీఠిక రాశారు.

1924 లో నేను అమెరికా ఖండ పర్యటన ప్రారంభింస్తూ, అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను. సుందరమైన అలాస్కాలో విశ్రాంతిగా గడపడంకోసం సియాటిల్‌లో ఓడ ఎక్కాను.

విశాల హృదయులై న విద్యార్థుల సహాయంతో 1925 లో, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్‌లో, మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్‌లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయభవనం, నేను చాలా ఏళ్ళ క్రితం కాశ్మీరులో కలిగిన అంతర్దర్శనంలో చూసినదే. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాల్ని తెలిపే ఫోటోలు శ్రీయుక్తేశ్వర్‌గారికి వెంటనే పంపాను. ఒక పోస్టుకార్డు మీద, ఆయన బెంగాలీలో సచూధానం రాశారు; దాన్ని ఇక్కడ అనువాదం చేస్తున్నాను.

11 ఆగస్టు, 1926

నా ప్రియవత్సా, ఓ యోగానందా!

నీ విద్యాలయమూ విద్యార్థులూ, ఉన్న ఫొటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతోందో చెప్పడానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థుల్ని చూసి ఆనందంలో మునిగిపోతున్నాను.

స్తోత్ర గీతాల్లో, రోగనివారక స్పందనల్లో, రోగనివారక దైవ ప్రార్థనల్లో నీ పద్ధతులగురించి విని, నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను.

బయటి గేటు, వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి, మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్‌కు దిగువున విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే, వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను.

ఇక్కడంతా సజావుగా సాగిపోతోంది. దేవుడి దయవల్ల , నువ్వెప్పుడూ ఆనందంగా ఉందువుగాక!

—శ్రీయుక్తేశ్వర్ గిరి

ఏళ్ళకేళ్ళు చకచకా సాగిపోయాయి. నా కొత్త దేశంలో ప్రతిచోటా నేను ఉపన్యాసాలిచ్చాను. వందలకొద్దీ క్లబ్బుల్లో, కళాశాలల్లో, చర్చిల్లో, అన్ని రకాల శ్రోతల సమావేశాల్లోనూ ప్రసంగించాను. 1920 - 1930 మధ్య దశాబ్దిలో కొన్ని లక్షలమంది అమెరికన్లు నా యోగవిద్యా తరగతులకు హాజరయారు. వాళ్ళందరికీ నేను, 1929 లో, ప్రార్థనలూ పద్యాలూ గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను; ‘విస్పర్స్ ఫ్రం ఎటర్నిటీ’ అన్న ఈ పుస్తకానికి, ప్రఖ్యాత గాయని ఎమిలీటా గలీకుర్సీ పీఠిక రాశారు.

ఒక్కొక్కప్పుడు (మామూలుగా, నెలలో ఒకటో తారీఖున, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయం మౌంట్ వాషింగ్టన్ సెంటర్ నిర్వహణకు అయిన ఖర్చుకు బిల్లులు చుట్టచుట్టుకుని వచ్చి పడ్డప్పుడు) భారతదేశపు నిరాడంబర ప్రశాంతికోసం ఉవ్విళ్ళూరుతూ దాన్ని తలుచుకునేవాణ్ణి. కాని ప్రతిరోజూ, తూర్పు పడమటి దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండడం గమనించేవాణ్ణి; నా ఆత్మ ఆనంద తరంగితమయేది.

అనేక సందర్భాల్లో తనకు దైవ మార్గదర్శిత్వం లభించినట్టు అనుభూతి పొందిన “స్వదేశపిత,” జార్జి వాషింగ్టన్ (తన “వీడుకోలు ప్రసంగం”లో) అమెరికాకు ఆధ్యాత్మికో త్తేజం కలిగించే మాటలు ఇలా అన్నాడు:

“స్వతంత్రమై, జ్ఞానసంపన్నమై, అద్యతన భావిలోనే ఘనత నందుకోగల దేశం మానవజాతికి అందించడానికి తగినది, సర్వదా సమున్నతన్యాయమూ లోకహితమూ నడిపించినట్టుగా నడుచుకొనే ప్రజల ఉదార, అతినవ్య ఆదర్శం (అంటే, అమెరికా ప్రజలు ఆ విధంగా మానవజాతి కొక ఆదర్శంగా నడుచుకోవాలి). కాల, చరిత్రల గతిలో అటువంటి ప్రణాళికల వల్ల కలిగే ఫలితాలు, దానికి నిలకడగా కట్టుబడి ఉండడం వల్ల కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలకయినా సమృద్ధిగా పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు శంకించగలరు? భగవంతుడు ఒక దేశం శాశ్వతసౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడి పెట్టకుండా ఉంటాడా?”

వాల్ట్ విట్మన్ రాసిన “హిమ్ టు అమెరికా"

(“దౌ మదర్ విత్ దై ఈక్వల్ ట్రూడ్” లోంచి)

“నీ భవిష్యత్తులో నువ్వు,

  స్త్రీపురుషుల విస్తార, విజ్ఞతాయుత చింతనలో నువ్వు - నీ
          నైతిక, ఆధ్యాత్మిక క్రీడాకారుల్లో; దక్షిణం, ఉత్తరం,
          పడమర తూర్పుల్లో నువ్వు,

  నీ నైతిక సంపదలో, నాగరికతలో (అప్పటిదాకా అతిగర్విష్ట
          మైన నీ భౌతిక నాగరికత వ్యర్థంగా ఉండవలసిందే)
          నువ్వు,

  నీ సర్వార్థసాధక, సర్వగ్రాహక ఆరాధనలో- కేవలం ఏ
          ఒక్క మతగ్రంథంలోనో, రక్షకుడితోనో ఉండి
          పోకుండా నువ్వు,

  నీ రక్షకులు అసంఖ్యాకులు, నీ లోనే అంతర్నిహితులు, ఒకరి
          కొకరు సమానులూ ఒకరిలో ఒకరు దివ్యులూ . . .

  ఇవన్నీ! ఇవన్నీ నీలో (తప్పక జరుగుతాయని) జోస్యం
           చెబుతున్నా నీ రోజు.”

  1. దరిమిలా నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు చూసి, తక్షణమే గుర్తుపట్టిన అనేక ముఖాలు.
  2. 1959 లో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్) అధ్యక్షురాలు శ్రీశ్రీ దయామాత, రాంచీలో సామానుగదిలో పరమహంసగారికి అంతర్దర్శనం కలిగిన చోట నిర్మించిన ‘యోగానంద ద్యానమంది’రానికి ప్రవేశోత్సవం జరిపారు. (ప్రచురణకర్త గమనిక),
  3. శ్రీయుక్తేశ్వర్‌గారూ నేనూ మామూలుగా బెంగాలీలో మాట్లాడుకునే వాళ్ళం
  4. భగవద్గీత 11 : 12
  5. న్యూ పిల్గ్రిమేజెస్ ఆఫ్ ది స్పిరిట్ (బోస్టన్ : బీకన్ ప్రెస్, 1921)