అధ్యాయం : 34

హిమాలయాల్లో

మహాభవన సృష్టి

“బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరీ మహాశయుల్ని కలుసుకున్న వృత్తాంతం, మైమరిపించే కథ; మరణంలేని మహాగురువుల గురించి వివరంగా తెలిపే వాటిలో అది ఒకటి.”

ఒక అద్భుత కథకు ఆముఖంగా, ఈ మాటలు అన్న వారు స్వామి కేవలానందగారు. ఆయన మొట్టమొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు నేను అక్షరాలా మంత్రముగ్ధుణ్ణి అయాను. అనేక ఇతర సందర్భాల్లో కూడా ఈ కథ మళ్ళీ చెప్పమని సౌమ్యమూర్తులయిన నా సంస్కృతం ట్యూటరుగారిని కోరాను; దరిమిలా, శ్రీయుక్తేశ్వర్‌గారు కూడా, వస్తుతః అవే మాటలు చెప్పారు. లాహిరీ మహాశయుల శిష్యులయిన వీరిద్దరూ ఈ అద్భుత కథను సూటిగా తమ గురుదేవుల నోటినించే విన్నారు.

“బాబాజీని నేను మొట్టమొదటిసారి కలుసుకున్నది, నాకు ముప్పై మూడో ఏట,” అని చెప్పారు లాహిరీ మహాశయులు. 1861 శరత్కాలంలో నేను దానాపూర్‌లో ఉండేవాణ్ణి. గవర్నమెంటు మిలటరీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంటులో ఎకౌంటెంటుగా పని చేస్తూండేవాణ్ణి. ఒకనాడు పొద్దున మా ఆఫీసు మేనేజరు నన్ను పిలిపించాడు.

“ ‘లాహిరీ, మన ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే ఒక తంతి వచ్చింది. నువ్వు రాణీఖేత్‌కు బదిలీ అవుతున్నావు; అక్కడ ఇప్పుడొక సైనిక స్థావరం[1] ఏర్పాటవుతోంది.’

“నేనొక బంట్రోతును వెంటబెట్టుకుని 500 మైళ్ళ ప్రయాణం ఆరంభించాను. గుర్రంమీదా బగ్గీమీదా ప్రయాణాలు సాగిస్తూ, ముప్ఫై రోజుల్లో, హిమాలయ ప్రాంతంలో ఉన్న రాణీఖేత్[2] చేరుకున్నాను.

“నా ఆఫీసు పనులు భారమైనవేమీ కావు. ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలకి గంటలు గడిపేవాణ్ణి. ఆ ప్రాంతం మహా మునుల నివాసంచేత పునీతమైందన్న జనశ్రుతి నా చెవిని పడింది. వాళ్ళని చూద్దామని నాలో గట్టి కోరిక కలిగింది. ఒకనాడు మధ్యాహ్నం అలా తిరగడంలో, నన్నెవరో పేరుపెట్టి పిలుస్తూండడం విని ఆశ్చర్యపోయాను. జోరుగా, ద్రోణగిరి పర్వతం ఎక్కుతూ పోయాను. అడవిలో చీకటి ముసురుకుపోయేలోగా నేను వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనతో ఒక్క రవ్వ దిగులు కలిగింది.

“చివరికి, చెట్లులేని ఒక వెల్లడి ప్రదేశానికి చేరాను; దానికి ఈ పక్కా ఆ పక్కా గుహలు కనిపిస్తున్నాయి. రాతిగొట్టు కొండ అంచుల్లో ఒకదానిమీద, పడుచు వయస్సాయన ఒకరు చిరునవ్వు నవ్వుతూ నించున్నారు; నాకు స్వాగతం చెబుతున్నట్టుగా చెయ్యి చాపారు. ఆయన రాగిరంగు జట్టు ఒక్కటి మినహాయిస్తే, అచ్చూమచ్చూ నా పోలికలోనే ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. “ ‘లాహిరీ,[3] వచ్చేశావా!’ అంటూ ఆ సాధువు, నన్ను ఆప్యాయంగా హిందీలో పలకరించారు. ‘ఈ గుహలో విశ్రాంతి తీసుకో. నిన్ను పిలిచినవాణ్ణి నేనే.’ ”

“పరిశుభ్రమైన ఒక చిన్న గుహలోకి ప్రవేశించాను; దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళూ కొన్ని కమండలాలూ ఉన్నాయి.”

“లాహిరీ, ఆ ఆసనం జ్ఞాపకముందా నీకు?’ అంటూ ఆ యోగి, ఒక మూల మడిచిపెట్టి ఉన్న గొంగడివేపు చూపించారు.”

“ ‘లేదండి,’ నా సాహసయాత్రలో ఎదురవుతున్న వింతకు నేను కొద్దిగా విస్మతుణ్ణి అయి, “నే నిప్పుడు చీకటిపడే లోగా వెళ్ళిపోవాలండి. పొద్దున ఆఫీసులో నాకు పని ఉంది,’ అన్నాను.”

“ఆ విచిత్ర సాధువు ఇంగ్లీషులో జవాబిచ్చారు. ‘ఆఫీసును రప్పించింది నీ కోసం కాని, నిన్ను ఆఫీసుకోసం కాదు.’ ”

“ఈ వనవాసి సాధువు ఇంగ్లీషు మాట్లాడ్డమే కాకుండా, క్రీస్తు[4] మాటల్ని అన్వయించి చెప్పడం విని నేను మూగబోయాను. “ ‘నా తంతి పనిచేసినట్టు తెలుస్తోంది.’ ఆ యోగి చేసిన వ్యాఖ్య నాకు అగమ్యంగా ఉంది; దాని అర్థమేమిటని అడిగాను.”

“ ‘నేను చెప్పింది, నిన్నీ నిర్జన ప్రదేశాలకు రప్పించిన టెలిగ్రాం సంగతి. నీకు రాణీఖేత్‌కు బదిలీ కావాలని నీ పై ఆఫీసరు మనస్సుకు నిశ్శబ్దంగా సూచించినవాణ్ణి, నేను. ఎవరయినా, మానవ జాతితో తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకున్నప్పుడు అన్ని మనస్సులూ అతనికి ప్రసారణ కేంద్రాలవుతాయి; వాటి ద్వారా అతడు ఇచ్ఛానుసారంగా పని చేస్తాడు,’ అంటూ ఆయన, ‘లాహిరీ, ఈ గుహ నీకు, తప్పకుండా తెలిసిందానిలాగే కనిపిస్తోంది కదూ?’ అని అడిగారు.

“నేను దిమ్మెరబోయి మౌనం దాల్చి ఉండడంతో, ఆ సాధువు నా దగ్గరికి వచ్చి నా నుదుటిమీద మెల్లగా తట్టారు. ఆయన అయస్కాంత స్పర్శతో నా మెదడంతటా అద్భుతమైన ఒక విద్యుత్ప్రవాహం ప్రసరించింది; నా గతజన్మ తాలూకు మధురమైన బీజస్మృతుల్ని మేల్కొలిపింది.

“ ‘జ్ఞాపకం వచ్చింది!’ పట్టలేని ఆనందంతో వెక్కివెక్కి ఏడవడం వల్ల నా గొంతు సగం పూడుకుపోయింది. ‘మీరు నా గురుదేవులు బాబాజీ; ఎప్పటికీ నావారే! గతకాలపు దృశ్యాలు సుస్పష్టంగా నా మనస్సులో మెదులుతున్నాయి; ఇక్కడ ఈ గుహలోనే గడిపాను, కిందటి జన్మలో చాలా ఏళ్ళు!’ చెప్పనలవి కాని జ్ఞాపకాలు నన్ను ముంచెత్తేస్తూ ఉంటే, కన్నీళ్ళు నింపుతూ గురుదేవుల పాదాలను చుట్టేసుకొన్నాను.

“ ‘నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావని ముప్పై ఏళ్ళు పైబడి నీ కోసం కాసుకొని ఉన్నాను.’ బాబాజీ గొంతులో దివ్య ప్రేమ తొణికిస లాడింది. ‘నువ్వు మరణానంతర జీవితపు కల్లోల తరంగాల్లోకి జారి అదృశ్యమయిపోయావు. నీ కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది; దాంతో నువ్వెళ్ళిపోయావు! నువ్వు నన్ను చూడలేకపోయినా, నీ మీంచి నా చూ పెన్నడూ చెదరలేదు. మహిమాన్వితులైన దేవదూతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మసాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లిపక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టుగా - చిమ్మ చీకట్లో, తుఫానులో, అల్లకల్లోలంలో, వెలుగులో నీ వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృగర్భవాసజీవితం నువ్వు పూర్తి చేసుకొని పసిపాపడుగా భూమిమీద పడ్డప్పటినించి నా కన్నెప్పుడూ నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు ఘుర్ణీ ఇసకదిబ్బల్లో పద్మాసనం వేసుక్కూర్చుని, నీ చిన్నారి ఒంటిని ఇసకతో కప్పేసుకుని ఉన్నప్పుడు, నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురుచూస్తూ, నెలలకు నెలలు, ఏళ్ళకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకొనే ఉన్నాను. ఇప్పటికి నువ్వు నా దగ్గరున్నావు! ఇదుగో నీ గుహ; పూర్వంనుంచీ నీకు ప్రియమయినది. నీ కోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా, సిద్ధంగా ఉంచాను. పునీతమయిన నీ గొంగడి ఆసనం ఇదుగో; విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవభక్తితో నింపడం కోసం నువ్వు నిత్యమూ కూర్చున్నది ఇక్కడే. నేను తయారుచేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి నువ్వు తరచు ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదుగో. చూడు, ఈ ఇత్తడి గిన్నె ఎంత తళతళలాడేలా మెరుగు పెట్టి ఉంచానో! ఎందుకు? ఎప్పుడో ఒకనాడు నువ్వు మళ్ళీ దాంతో తాగుతావని. నాయనా, ఇప్పుడర్థమయిందా నీకు?”

“ ‘గురుదేవా, ఏం చెప్పగలను నేను?’ అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. ‘ఇటువంటి అమరప్రేమ గురించి ఎక్కడయనా, ఎవ్వరయినా విన్నారా?’ నా శాశ్వత నిధిని జీవితంలోనూ మరణంలోనూ కూడా. నావారైన గురుదేవుల్ని, ఆనంద తన్మయుణ్ణయి తదేకంగా చూస్తూ ఉండిపోయాను. “ ‘లాహిరీ, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి, ఏటి ఒడ్డున పడుకో,” అన్నాడు బాబాజీ. బాబాజీ వ్యవహారజ్ఞానంలో ఎప్పుడూ ముందు జాగ్రత్త ఉంటుంది - అనుకున్నాను; వెనకటి జ్ఞాపకంతో చటుక్కున చిరునవ్వు వచ్చింది.”

“ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పుటికీ నాలో, హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించడం మొదలయింది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఆ నూనెలో పొద్దుపొడుపు వెచ్చతనాన్ని ఏమయినా రంగరించారా?”

“ఆ చీకట్లో, తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్టు గర్జిస్తూ, చుట్టూ నన్ను కొరడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లని చిట్టిపొట్టి అలలు, రాతిగొట్టు ఏటిగట్టున కాళ్ళు చాపి వెల్లకిలా పడుకున్న నా ఒంటిమీదికి వచ్చి పడుతున్నాయి. దగ్గరిలో పులులు గాండ్రిస్తున్నాయి; అయినా నా గుండెలో ఎంతమాత్రం భయం లేదు; నాలో కొత్తగా పుట్టిన ఉష్ణప్రసరణ శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలియజేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెల్లబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునస్సమాగమంతో కలిసి పడుగుపేకల పనివరసగా అల్లుకు పోయాయి.”

“ఏవో అడుగుల చప్పుడు దగ్గరవుతుండగా, ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందిచ్చి, నేను లేచి నిలబడ్డానికి సాయపడ్డాడు; తరవాత కొన్ని పొడిబట్టలు ఇచ్చాడు.”

“ ‘రా అన్నా, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు,’ అన్నాడతను.” “అడవి గుండా అతడు దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గర నేను, నిశ్చలమైన ఒక కాంతిపుంజాన్ని దూరంనుంచి చూశాను.”

“ ‘అది సూర్యోదయం కావచ్చునా?’’ అని అడిగాను. ‘నిజంగా రాత్రి అంతా గడవలేదు కదూ?’ ”

“ ‘ఇది అర్ధరాత్రి సమయం,’ అన్నాడతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు, అసదృశులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం ధగద్ధగలు. సుదూరమైన గతంలో నువ్వొకసారి, మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు; ఆ విధంగా నిన్ను, నీ చిట్టచివరి కర్మానుబంధం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నారు.’[5] తరవాత ఇంకా చెప్పాడతను. ‘ఈ రోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు, రమణీయమైన ఈ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసి నందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెబుతున్నారు. చూడు!’ ”

“మా ఎదుట, కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉండి, సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై, నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ - అసదృశమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుతదృశ్యం! చాలా ఎత్తయిన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలూ సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలు గొందుతున్న ద్వారాల దగ్గర, దివ్యతేజస్సు వెదజల్లుతున్న భవ్యమూర్తులు కొలువై ఉన్నారు.

“నా స్నేహితుడి వెనకాలే, విశాలమైన స్వాగత కక్ష్యలోకి ప్రవేశించాను. అగరుధూపాలూ గులాబీల పరిమళాలూ గాలిలో తేలిపోతున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నెవన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు, చిన్న చిన్న బృందాలుగా కూడి అంతశ్శాంతిలో మునిగి మృదుస్వరంతో గానం చేస్తున్నారు. కొందరు ధ్యానముద్రలో ఆసీనులై ఉన్నారు. స్పందన శీలమైన ఆనందం వాతావరణ మంతటా వ్యాపించింది.

“నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్న తను, సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: ‘నీ కళ్ళకు పండుగగా, ఈ భవనం కళావైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనక.’ ”

“ ‘అన్నా, ఈ భవనం అందం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మ మేమిటో దయచేసి వివరంగా చెప్పు.’ ”

“ ‘సంతోషంగా చెప్తాను.’ నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ‘ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం, దేవుడి కల. మానవుడు తన స్వప్నచేతనలో, సకలజీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణంపోసినట్టుగానే దేవుడు, తన మనస్సులోంచే సర్వవస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు.’ ”

“ ‘ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందిం చాడు. దాన్ని త్వరితం చేశాడు; పరమాణుశక్తి ఆ తరవాత పదార్థమూ పుట్టాయి. భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘనగోళాకృతిగా రూపొందించాడు. దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి, తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూ భావం, స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది.

“ ‘కలగనేవాడి అవచేతనాపరమయిన ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలుకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు, ఆ స్వప్నమూ, దాని మూలకాలు కూడా లయమయిపోతాయి. మనిషి, కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు; మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను, దేవుడి మౌలికాదర్శాన్ని అనుసరిస్తాడు. అదే విధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు, బ్రహ్మాండ స్వప్నరూపమైన విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు.

“ ‘సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ, మూలకణువుల్ని, సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణమాత్రంలో నెలకొలిపిన ఈ బంగారు భవనం, ఈ భూమి ఎంత వాస్తవమయినదో అంత వాస్తవమయినది. బాబాజీ ఈ సుందర సౌధాన్ని తమ మనస్సులోంచి సృష్టించారు? దాని పరమాణువుల్ని తమ సంకల్పశక్తిచేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్టూ, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచుతున్నట్టుగానే.’ ” “తరవాత అతను, ‘ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దాన్ని అదృశ్యం చేసేస్తారు’ అని చెప్పాడు.

“ఆశ్చర్యంతో నేను అవాక్కునై ఉండిపోగా, నాకు దారి చూపిస్తున్నాయన, ఆ భవనం వేపు చెయ్యి చాపి చూపిస్తూ ఇలా అన్నాడు: “అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై ధగద్ధగాయమానంగా ఉన్న ఈ రాజసౌధం, మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు; దాని బంగారమూ, రత్నాలూ కష్టపడి గనిలోంచి తవ్వినవేమీ కావు. ఇది జ్ఞాపకచిహ్నరూపంలో, మానవుడి కొక సవాలుగా ఘనాకృతిలో నిలిచి ఉంది.[6] బాబాజీ మాదిరిగానే, తనను దైవసంతానంగా అనుభూతం కావించుకున్నవాడు, తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తులచేత ఏ లక్ష్యాన్నయినా చేరుకోగలడు. ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు[7] గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి; అదే విధంగా, అత్యల్పుడైన మర్త్యుడు సైతం దివ్యశక్తికి ఉత్పాదకస్థానమే.’ ”

“ఆ సాధువు, దగ్గరలో ఉన్న ఒక బల్లమీంచి నాజూకు పనితనం ఉట్టిపడే పూలపాత్ర (వాజ్) ఒకటి అందుకొన్నాడు; దాని పిడి, వజ్రాలతో మెరిసిపోతోంది. ‘మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల్ని ఘనీభవింపజేసి ఈ సౌధం నిర్మించారు,’ అంటూ చెప్ప సాగాడతను. ‘ఈ పూలపాత్రా దీని వజ్రాలూ కూడా తాకి చూడు; ఇంద్రియానుభవ పరీక్షలన్నింటికీ నిలబడతా యివి.’ ”

“పూలపాత్రను పరీక్షించాను; దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. ధగధగ మెరిసే బంగారం గది గోడల్ని చేత్తో తడిమాను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో మరుగుపడి ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టూ నశించినట్టూ కూడా అనిపించింది.

“మహాప్రాసాదంలోకి దారితీసిన ఈ మిత్రుడు, అలంకారాలతో శోభిస్తున్న కమానులగుండా, నడవలగుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించాడు; ఒక చక్రవర్తి ప్రాసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణాలు అమర్చి ఉన్నాయి ఆ గదులు. మే మొక విశాలమైన హాలులోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది; దానికి ఉజ్జ్వల వర్ణమేళనంతో దీప్తులు విరజిమ్మే రత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ, పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు, మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేలమీద, ఆయన పాదాలముందు మోకరిల్లాను.

“ ‘లాహిరీ, నువ్వింకా బంగారు భవనంకోసం కన్న కలల కోరికలతోనే ఆనందిస్తున్నావా?’ నా గురుదేవుల కళ్ళు, వారి నీలమణుల్లాగే నిగనిగలాడుతున్నాయి. ‘మేలుకో! నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి.’ గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు. ‘నాయనా, లే!, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించడానికి దీక్ష తీసుకో.’ ”

బాబాజీ చెయ్యి చూపారు; ఒక హోమాగ్నికుండం వెలిసింది; దాని చుట్టూ పండ్లూ పూలూ అమిరి ఉన్నాయి. జ్వాజ్వల్యమానమైన ఈ అగ్ని వేదికముందు, మోక్షకారకమైన యోగప్రక్రియాదీక్ష స్వీకరించాను. “బ్రాహ్మ ముహూర్తంలో క్రతువు పూర్తి అయింది. ఆనంద తన్మయావస్థలో నాకు నిద్ర అవసరమనే అనిపించలేదు. అమూల్య నిధులతో, అద్భుత కళాఖండాలలో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నిటిలోనూ తిరిగి, తరవాత ఉద్యానవనాల్ని సందర్శించాను. దగ్గరిలో, నిన్నటి రోజున నేను చూసిన గుహల్నీ రాతిగొట్టు కొండ అంచుల్నీ గమనించాను కాని అప్పుడివి, ఒక మహాసౌధాన్నీ పూలతోటల్నీ ఆనుకుని లేవు.”

“చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రాసాదంలో మళ్ళీ అడుగుపెట్టి, నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై , ప్రశాంత శిష్యగణంచేత పరివేష్టితులై ఉన్నారు.”

“ ‘లాహిరీ, నీకు ఆకలి వేస్తోంది,’ అంటూ బాబాజీ, ‘కళ్ళు మూసుకో,’ అన్నారు.”

“నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి, మనోహరమైన మహాసౌధమూ దాని ఉద్యానవనాలూ అదృశ్యమయిపోయాయి. నా శరీరమూ బాబాజీ రూపమూ వారి శిష్యుల రూపాలూ, అదృశ్యమైన మహాసౌధం స్థానంలో, ఎండపడుతున్న రాతిగుహల ద్వారాలకు దగ్గరిలోనే కటిక నేల మీద ఉన్నాయి. బంగారు భవనం మాయమయిపోతుందనీ దాంట్లో బందీలై ఉన్న పరమాణువులు విడుదలయి, తా ముద్భవించడానికి మూలకందమైన ఆలోచనాసారరూపంలో లయమవుతాయని, నన్నిక్కడికి తీసుకువచ్చి నాయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించినా, నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈ రోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియలేదు.

“ ‘భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు నెరవేరింది,’ అన్నారు బాబాజీ. నేలమీంచి ఒక మట్టిపాత్ర ఎత్తారు. ‘అక్కడ చెయ్యి పెట్టి, నువ్వు కోరిన భోజన పదార్థం ఏదైనా సరే తీసుకో.’ ”

“ఖాళీగా, వెడల్పుగా ఉన్న మట్టిపాత్రను ముట్టుకున్నాను; వెన్నపూసిన వేడివేడి లూచీలు (పూరీల మాదిరి రొట్టెలు), కూర, మిఠాయిలు కనిపించాయి. నే నవి తింటూంటే, ఎప్పటికప్పుడు ఆ పాత్ర నిండి ఉండడం గమనించాను. భోజనం అయిన తరవాత మంచినీళ్ళ కోసం చుట్టూ కలయజూశాను. మా గురుదేవులు, నా ఎదుట ఉన్న పాత్ర వేపే చూపించారు. అందులో ఉన్న భోజన పదార్థం అదృశ్యమయింది; దాని బదులు నీళ్ళున్నాయి.”

“దైవ సామ్రాజ్యంలో ఐహికావసరాల్ని తీర్చే రాజ్యం కూడా కలిసే ఉంటుందని కొద్దిమంది మర్త్యమానవులే ఎరుగుదురు,’ అన్నారు బాబాజీ. ‘దైవసామ్రాజ్యం భూమికి కూడా వ్యాపించి ఉంటుంది; కాని భూసామ్రాజ్యం స్వభావ రీత్యా భ్రాంతిమూలకమయినందువల్ల, దాంట్లో సత్యసారం ఉండదు.’ ”

“ ‘ప్రియగురుదేవా, కిందటి రాత్రి మీరు, స్వర్గంలోనూ భూమిమీదా ఉన్న అందాలకు గల సంబంధాన్ని కళ్ళకు కట్టించారు!’ మాయమయిన మహాసౌధాన్ని గురించిన జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వాను; నిజంగా, మామూలు యోగి ఎవరూ అతిమనోహర విలాస వైభవోపేతమైన పరిసరాల నడుమ పరమాత్ముడి మహత్తర మర్మాల అనుభవలబ్ధి కోసం దీక్షాస్వీకారం పొందలేదన్నది నిశ్చయం! దానికి ఇప్పటి దృశ్యానికి గల పూర్తి భేదాన్ని ప్రశాంతంగా తిలకించాను. ఎండిపోయిన నేల, ఆకాశపు పైకప్పు, ఆదిమకాల సహజమయిన ఆశ్రయమిచ్చే గుహలు - ఇవన్నీ , నా చుట్టూ ఉన్న దేవదూతలవంటి సాధువులకు రమ్యమైన సహజ సన్నివేశాన్ని సమకూర్చాయనిపించింది. “ఆనాడు మధ్యాహ్నం, గతజన్మల అనుభూతుల పొందికతో పావనమయిన నా గొంగడి మీద కూర్చున్నాను. నా గురుదేవులు దగ్గరికి వచ్చి నా తలమీద నిమిరారు. నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి, అందులో అవిచ్ఛిన్నంగా ఏడు రోజులపాటు ఉండిపోయాను. ఆత్మజ్ఞాన స్తరాల్లో ఒకదాని తరవాత ఒకటి దాటుతూ, సత్యస్వరూపుడి అమరసీమల్లోకి చొచ్చుకుంటూ పోయాను. మాయావరణాలన్నీ తొలగి పోయాయి; నా ఆత్మ, విశ్వాత్ముడికి వేదికమీద సంపూర్ణంగా స్థిరపడింది.

“ఎనిమిదో నాడు నేను నా గురుదేవుల పాదాలమీద పడి, నన్ను ఎప్పటికీ తమకు దగ్గరగానే, తమ పవిత్ర వనభూమిలోనే ఉండనిమ్మని వేడుకున్నాను.

“ ‘నాయనా, ఈ జన్మలో నీ పాత్ర జనబాహుళ్యం కళ్ళ ఎదుట నిర్వహించాలి. ఈ జన్మకు పూర్వం అనేక జన్మలు నువ్వు ఏకాంత ధ్యానసాధన భాగ్యం పొందావు; ఇప్పుడు మానవ ప్రపంచంలో కలిసి మసలాలి.’ అన్నారు బాబాజీ నన్ను ఆలింగనం చేసుకుంటూ.”

“నువ్వు వివాహితుడివయి, సామాన్య కుటుంబంతో, ఉద్యోగ బాధ్యతలతో ఉండేదాకా ఈసారి నువ్వు నన్ను కలుసుకోకపోవడంలో గంభీరమైన ప్రయోజనం ఒకటి మరుగుపడి ఉంది. హిమాలయాల్లో మా రహస్య బృందంలో చేరాలన్న ఆలోచనలు నువ్వు పక్కకి పెట్టాలి. నీ జీవితం, ఆదర్శ గృహస్థయోగికి నిదర్శనంగా సేవచేస్తూ నగర జన సమూహాల మధ్య గడవాలి.

“ ‘దిగ్భ్రమ చెందిన అనేకమంది లౌకిక స్త్రీపురుషుల ఆక్రందనలు, మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు’ అంటూ ఇలా చెప్పారాయన: ‘మనఃపూర్వకంగా అపేక్షించే అసంఖ్యాకులకు క్రియాయోగం ద్వారా ఆధ్యాత్మిక ఉపశమనం కలిగించడానికి నువ్వు ఎంపిక అయావు. సంసార బంధాలతో, భారమైన లౌకిక విధులతో చిక్కులుపడుతున్న లక్షలాది జనం, తమలాగే సంసారివైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించడానికి నువ్వు దారి చూపించాలి. ప్రపంచంలో కూడా, వ్యక్తిగత ప్రయోజనోద్దేశం కాని అనుబంధం కాని లేకుండా తన బాధ్యతల్ని నిష్ఠగా నిర్వహించే యోగి, నిశ్చయమైన జ్ఞానమార్గాన్ని అనుసరిస్తాడు.”

“ ‘ప్రపంచాన్ని విడవాలని నిన్ను నిర్బంధించే అవసరం ఏదీ లేదు; ఎంచేతంటే లోపల్లోపల నువ్వు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్నీ పూర్వమే తెంపేశావు. నీ కుటుంబానికి, ఉద్యోగానికి, పౌరజీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విధుల్ని నువ్వు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడానికి నీ కింకా చాలా ఏళ్ళ వయస్సు ఉంది. దైవపరమయిన ఆశ అనే మధురమయిన కొత్త ఊపిరి సంసారుల శుష్క హృదయాల్లోకి చొరబడుతుంది. నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు, మోక్ష మన్నది అంతస్సన్యాసం మీదే కాని బాహ్యసన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటారు.’ ”

“ఉన్నతమైన ఆ హిమాలయ ఏకాంత ప్రదేశాల్లో మా గురుదేవుల వాక్కులు వింటూ ఉంటే నా కుటుంబమూ, ఆఫీసూ, ప్రపంచమూ ఎంత దూరమో అనిపించింది. అయినా ఆయన వాక్కుల్లో కఠోర సత్యం ధ్వనించింది; పావనమైన ఈ శాంతి ధామాన్ని విడిచి వెళ్ళడానికి అణకువగా అంగీకరించాను. యోగవిద్యను గురువునుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు.

“ ‘యోగ్యులైన శిష్యులకు మాత్రమే క్రియాకీలకం ప్రసాదించు,’ అన్నారు బాబాజీ. “దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించడానికి ప్రతిజ్ఞ పూనినవాడే, ధ్యానయోగం ద్వారా పరమ రహస్యాల చిక్కుముళ్ళు విడదియ్యడానికి అర్హుడు.’ ”

“ ‘గురుదేవా, నష్టమయిన క్రియాయోగాన్ని పునరుద్ధరించి మీరు, మానవజాతికి మహోపకారం చేసినట్టే, శిష్యరికానికి కావలసిన కఠిన నియమాలు సడలించి, దానివల్ల కలిగే లాభాన్ని మీరు పెంపొందించరా?’ అని విన్నవించుకుంటూ బాబాజీ కేసి చూశాను. ‘చిత్తశుద్ధి గల అన్వేషకు లందరూ మొదట్లోనే సంపూర్ణ అంతస్సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ, వారందరికీ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో, మూడు విధాలైన క్లేశాలకీ[8] గురిఅయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకి క్రియాయోగ దీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తిమార్గమే తొక్కకపోవచ్చు.’ ”

“ ‘అలాగే కానియ్యి. ఈశ్వరేచ్ఛ నీ ద్వారా వ్యక్తమయింది. వినయంగా నిన్ను సహాయమడిగే వాళ్ళందరికీ క్రియాయోగ దీక్ష ఇయ్యి,’ అని జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు.[9] “కొద్ది సేపు మౌనం దాల్చిన అనంతరం, బాబాజీ ఇంకా చెప్పారు.” ‘స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్’ అని భగవద్గీతలో[10] ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వినిపించు.’ [“ఈ ధర్మం (మత సంబంధమైన కర్మకాండ, లేదా సత్కర్మ) ఏ కొద్దిపాటి ఆచరణలో పెట్టినా, అది నిన్ను పెద్ద భయంనుంచి (మహతో భయాత్) కాపాడుతుంది”. అంటే, జననమరణ చక్ర పరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది].

“మర్నాడు ఉదయం నేను వీడుకోలు దీవెన కోసం గురుదేవుల పాదాలదగ్గర మోకరిల్లినప్పుడు, ఆయన్ని విడిచి వెళ్ళాలంటే నాలో ఎంత గాఢమైన అనిష్టముందో ఆయన పసిగట్టారు.”

“ ‘మనకి ఎడబాటు లేదు నాయనా,’ అంటూ ఆప్యాయంగా నా భుజం నిమిరారు. ‘నువ్వు ఎక్కడున్నా, నన్నెప్పుడు పిలిచినా, తక్షణం నీ దగ్గర ఉంటాను,” అన్నారు.

“ఆయన చేసిన అద్భుతమైన ఈ వాగ్దానంవల్ల ఊరట చెంది కొత్తగా పొందిన దివ్యజ్ఞాన స్వర్ణంతో సంపనుణ్ణి అయి కొండ దిగుదల దారి పట్టాను. ఆఫీసులో నా తోటి ఉద్యోగులు నాకు మనసారా స్వాగతం పలికారు; పది రోజులుగా వాళ్ళు, హిమాలయారణ్యాల్లో నన్ను పోగొట్టుకున్నామనే అనుకున్నారు. త్వరలో మా ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తరం వచ్చింది.

“ ‘లాహిరీ దానాపూర్ ఆఫీసుకు తిరిగి రావాలి,‘ అని ఉంది.” ‘రాణీఖేత్‌కు అతని బదిలీ పొరపాటున జరిగింది. రాణిఖేత్ విధులు చేపట్టడానికి మరో వ్యక్తిని పంపి ఉండవలసింది.’

“భారతదేశంలో ఈ బహుదూర స్థలానికి నన్ను రప్పించడానికి దారి తీసిన సంఘటనల, పరస్పర వ్యతిరేక దిశాభిముఖమైన గుప్త ప్రవాహాల్ని తలుచుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నాను.”

“దానాపూర్‌కు తిరిగి వచ్చే ముందు మురాదాబాద్‌లో ఉన్న ఒక బెంగాలీ కుటుంబంలో కొన్నాళ్ళు గడిపాను. అక్కడ నన్ను కలుసుకోడానికి ఆరుగురు వచ్చారు. ఆధ్యాత్మిక విషయాల మీదికి నేను సంభాషణ మళ్ళించేసరికి, నాకు ఆతిథ్యమిచ్చినాయన నిరాశగా ఇలా అన్నారు:”

“ ‘ప్చ్, ఈ రోజుల్లో ఇండియాలో సాధువులే కరువయ్యారు!’ ”

“దానికి నేను, ‘బాబూ, ఈ గడ్డమీద ఇప్పటికీ ఉన్నారు. మహామహులు!’ అంటూ ఆక్షేపణ తెలిపాను.”

“ఉత్సాహం పెల్లుబకడం వల్ల, హిమాలయాల్లో నా అలౌకిక అద్భుత అనుభవాల్ని వాళ్ళకి చెప్పాలన్న ఊపు వచ్చింది నాకు. ఆ మిత్రబృందం మర్యాదగానే అపనమ్మకం తెలియబరిచింది.”

“వాళ్ళలో ఒకరు ఊరడింపుగా ఇలా అన్నారు: ‘లాహిరీగారూ, పలచబడ్డ ఆ కొండగాలుల్లో మీ మనస్సు ప్రయాసకు గురి అయింది. మీరిప్పుడు చెప్పింది, ఏదో పగటి కల!’

“సత్యనిష్ఠమైన ఉత్సాహంతో ఊగిపోయి, ఉచితమైన ఆలోచన కొరవడి మాట్లాడాను. “నేను కనక పిలిచినట్లయితే, నా గురుదేవులు ఇక్కడ, ఈ ఇంట్లోనే దర్శనమిస్తారు.’ ”

“ప్రతి ఒక్కరి కళ్ళలోనూ ఆసక్తి మిలమిల్లాడింది; అటువంటి అద్భుతం చూడాలన్న ఉత్సుకత వాళ్ళలో కలగడంలో విడ్డూరం లేదు. కొంతమట్టుకు అనిష్టంగానే నేను, ప్రశాంతమైన ఒక గది, రెండు కొత్త గొంగళ్ళు కావాలని అడిగాను.

“ ‘గురుదేవులు ఆకాశం (ఈథర్) లోంచి భౌతికరూపం ధరిస్తారు’, అన్నాను. ‘తలుపవతల నిశ్శబ్దంగా ఉండండి; కాస్సేపట్లో పిలుస్తా మిమ్మల్ని.’ ”

“మా గురుదేవుల్ని సవినయంగా ఆవాహనచేస్తూ ధ్యానస్థితిలో మునిగిపోయాను. చీకటి చేసిన గది, ప్రశాంతి కలిగించే పలచని వెలుతురుతో నిండిపోయింది; దాంట్లోంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది.”

“ ‘లాహిరీ, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను?’ గురుదేవుల చూపు కఠినంగా ఉంది. ‘సత్యమన్నది హృదయపూర్వకంగా అన్వేషించేవాళ్ళకోసం; వ్యర్థమైన కుతూహలం గలవాళ్ళకోసం కాదు. ఎవరయినా, చూసినప్పుడు నమ్మడం సులువే; అప్పుడిక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోడానికి యోగ్యులూ దాన్ని ఆవిష్కరించేవాళ్ళూ, స్వాభావిక భౌతికవాదపరమైన సంశయశీలతను జయించినవాళ్ళే,’ ఆ తరవాత ఆయన గంభీరంగా, ‘నన్ను వెళ్ళనియ్యి!’ అన్నారు.

“నేను బతిమాలుకుంటూ ఆయన పాదాలమీద పడ్డాను. “పూజ్య గురుదేవా, ఘోరమయిన నా తప్పు తెలుసుకున్నాను; సవినయంగా మీ క్షమాపణ కోరుతున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది, ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళయిన వీళ్ళ మనస్సుల్లో విశ్వాసం కలిగించడానికి. నా ప్రార్థన మన్నించి, మీరు ఎలాగా ప్రత్యక్షమయారు కనక, కండి. వాళ్ళు అవిశ్వాసులే అయినప్పటికీ, చిత్రమైన నా ప్రతిజ్ఞావాక్యంలోని సత్యాన్ని శోధించడానికయినా కనీసం సుముఖంగా ఉన్నారు.’ ”

“ ‘సరే, కొంచెం సేపు ఉంటాను. స్నేహితులముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదు,’ అన్నారు బాబాజీ. ఆయన ముఖం శాంత పడింది. కాని మృదువుగా ఇలా అన్నారు: ‘నాయనా, ఇకనుంచి నేను నీకు అవసరమయినప్పుడే వస్తాను; నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను.’[11]

“నేను తలుపు తెరిచినప్పుడు మిత్రబృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళని తామే నమ్మలేక నా మిత్రులు, గొంగడి ఆసనం మీద ఉన్న తేజోవంతమైన స్వరూపాన్ని తేరిపారి చూశారు.”

“ ‘ఇది సామూహిక సమ్మోహనం!’ అంటూ అట్టహాసంగా నవ్వాడొకతను. ‘మాకు తెలియకుండా ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించడం అసంభవం!’ ”

“బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ముందుకు వచ్చి, తమ శరీరంలోని వెచ్చని, గట్టి మాంసాన్ని ముట్టుకొని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్ళారు. సందేహాలు పటాపంచలయిపోయి మా స్నేహితులు, దిగ్బ్రమతో కూడిన పశ్చాత్తాపంతో నేలమీద పడి సాష్టాంగ ప్రణామం చేశారు.” “ ‘హల్వా[12] తయారుచేయించండి.’ తమ భౌతిక వాస్తవికత విషయమై అక్కడివాళ్ళకి మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ ఈ కోరిక కోరారని నాకు తెలుసు, పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు, చనువుగా మాట్లాడారు. సంశయాళువులైన ఈ ‘థామస్‌లు,’ భక్తశిఖామణులైన ‘సెంట్ పాల్‌ల’ మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది. మేము హల్వా తిన్న తరవాత, బాబాజీ ఒక్కొక్కరినే ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక్క మెరుపు మెరిసింది; బాబాజీ దేహం తాలూకు ఋణవిద్యుదణు (ఎలక్ట్రానిక్) మూలకాలు తక్షణమే రసాయన విఘటనం చెంది, విస్తరించే బాష్పమయ కాంతిలా మారిపోవడం మేము కళ్ళారా చూశాం. దైవానుసంధానం పొందిన గురుదేవుల సంకల్పశక్తి, ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఈథర్ పరమాణువుల మీద తనకున్న పట్టు సడలించింది; వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న ప్రాణకణికా విస్ఫు లింగాలు (లైఫ్‌ట్రానిక్ స్పార్క్స్) అనంత ప్రాణాశయంలోకి అంతర్హిత మయాయి.

“ ‘మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను.’ వాళ్ళలో మైత్ర[13] అనే ఆయన పూజ్యభావంతో అన్నాడు. కొత్త జాగృతి కలిగించిన ఆనందంతో ఆయన ముఖబింబమే మారిపోయింది. ‘చిన్న పిల్లవాడు నీటి బుడగలతో ఆడుకున్నట్టే పరమ గురుదేవులు దేశకాలాలతో ఆట ఆడుకున్నారు. స్వర్గ, భూలోకాల కీలకాలు చేతనున్న వ్యక్తిని చూశాను.’

“త్వరలోనే దానాపూర్ తిరిగి వచ్చాను. ఆత్మతత్త్వంలో దృఢంగా నిలదొక్కుకుని ఉండి గృహస్థ సంబంధమైన రకరకాల సంసార బాధ్యతలూ, ఉద్యోగ బాధ్యతలూ మళ్ళీ చేబట్టాను,” అంటూ ముగించారు లాహిరీ మహాశయులు.

బాబాజీతో జరిగిన మరో సమాగమానికి సంబంధించిన కథ కూడా లాహిరీ మహాశయులు, స్వామి కేవలానందగారికీ శ్రీయుక్తేశ్వర్‌గారికీ చెప్పారు. ఆ సందర్భం, “నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను,” అన్న వాగ్దానాన్ని పరమగురుదేవులు నెరవేర్చిన అనేక సందర్భాల్లో ఒకటి.

“అలహాబాదులో కుంభమేలా జరుగుతున్న సన్నివేశమది,” అని చెప్పారు. లాహిరీ మహాశయులు తమ శిష్యులకు. “ఆఫీసు పనులనుంచి కొంచెం వెసులుబాటు దొరికినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఈ పవిత్ర ఉత్సవానికి హాజరవడం కోసం దూరదూర ప్రదేశాలనుంచి వచ్చిన సన్యాసి, సాధుజనాల గుంపుల మధ్య తిరుగుతూ, ఒంటికి బూడిద పూసుకుని చేత్తో భిక్షాపాత్ర పట్టుకుని ఉన్న ఒక తపస్విముందు ఒక్క క్షణం ఆగాను. ఈ మనిషి మోసగాడిలా ఉన్నాడన్న ఆలోచన నా మనస్సులో పుట్టింది; బాహ్యవైరాగ్య చిహ్నాలు ధరించాడే కాని, దానికి సరిపడే అంతరంగం లేనివాడనిపించింది. “నేనే తపస్విని దాటి వెళ్ళీ వెళ్ళగానే, నా చూపు బాబాజీ మీదపడి ఆశ్చర్యపోయాను. ఆయన, తల అట్టకట్టేసిన ఒక సన్యాసిముందు మోకరిల్లుతున్నారు.”

“గురూజీ!” అంటూ ఆయన పక్కకి వెళ్ళాను. ‘మీ రిక్కడ ఏం చేస్తున్నారు?’ ”

“ ‘నేను ఈ సన్యాసి కాళ్ళు కడుగుతున్నాను; తరవాత ఈయనకు వంటగిన్నెలు తోమిపెడతాను.’ బాబాజీ, చిన్న పిల్లవాడిలా నా వేపు చూసి చిరునవ్వు నవ్వారు; మనుషులు అధికులయినా అధములయినా, వాళ్ళ దేహాలయాలన్నిటిలోనూ సమానంగానే ఈ్వరుడు నివసిస్తున్నట్టు చూడాలి కాని ఎవ్వరినీ నేను విమర్శించగూడదని తాము కోరుతున్నట్టు నాకు తెలియజేస్తున్నారని గ్రహించాను.

“మహాగురువులు ఇంకా ఇలా చెప్పారు, ‘సాధువుల్లో జ్ఞానుల్నీ అజ్ఞానుల్నీ కూడా సేవించడంవల్ల నేను, అన్నిటికంటె ఎక్కువగా దేవుడికి సంతోషం కలిగించే వినయమనే సర్వోత్తమ గుణాన్ని అలవరుచు కుంటున్నాను.’ ”[14]

  1. తరవాత మిలటరీ శానిటోరియం. 1861 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో తంతి వార్తా విధానం నెలకొల్పింది.
  2. రాణీఖేత్ అల్మోరా జిల్లాలో, నందాదేవి పర్వత పాదసీమలో ఉంది. ఈ పర్వతం హిమాలయ శిఖరాల్లో బాగా ఎత్తయిన వాటిలో ఒకటి (25, 661 అడుగులు)
  3. నిజానికి బాబాజీ లాహిరీ మహాశయుల్ని పిలిచింది, “గంగాధర్” అన్న పేరుతో; అది ఆయనకి పూర్వజన్మలో ఉన్న పేరు. గంగాధరుడు (అంటే, “గంగను ధరించినవాడు”) శివదేవుడి పేర్లలో ఒకటి. పురాణ కథలో చెప్పినట్టు, పావనగంగ స్వర్గం నుంచి అవతరించింది. దాని ఉద్ధృత అవతరణ ధాటికి భూమి తట్టుకోడానికి శివుడు గంగను తన జటాజూటంలో బంధించి, అక్కణ్ణించి అనుకూల ప్రవాహంగా భూమి మీదికి వదలడం జరిగింది. “గంగాధర” శబ్దానికున్న అధిభౌతిక ప్రాముఖ్యం ఏమిటంటే వెన్నులో ఉన్న ప్రాణప్రవాహమనే “నది”ని అధీనంలో ఉంచుకున్నవాడు అని అర్థం.
  4. “సబత్ (విశ్రాంతి దినం) మనిషికోసం ఏర్పాటయింది కాని, మనిషి సబ్బత్ కోసం కాదు.” -(మార్కు 2 : 27 )
  5. కర్మసూత్రం ప్రకారం, మానవుడి ప్రతి కోరికా చివరికి తీరి తీరవలసిందే. కోరిక, ఈ విధంగా మానవుణ్ణి పునర్జన్మ చక్రానికి కట్టేసే గొలుసన్న మాట.
  6. “అలౌకిక ఘటన అంటే ఏమిటి? - అదొక మందలింపు. మానవజాతి మీద గుప్తమైన అధిక్షేపణ అది."

    -ఎడ్వర్డ్ యంగ్, ‘నైట్ థాట్స్’ లో.

  7. వైశేషిక, న్యాయ దర్శనాలనే ప్రాచీన భారతీయ గ్రంథాల్లో, పదార్థ అణునిర్మాణ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. “ప్రతి అణుగర్భంలోనూ, సూర్యకిరణంలోని అసంఖ్యాకమైన రజోకణాల మాదిరిగా విశాల జగత్తులు ఇమిడి ఉన్నాయి.” - యోగవాశిష్ఠం.
  8. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక క్లేశాలు; ఈ మూడూ వరసగా, జబ్బు, మానసిక లోపాలు లేదా వైకల్యాలు, ఆత్మవిషయకమైన అవిద్య అన్న రూపాల్లో వ్యక్తమవుతుంటాయి.
  9. మొదట్లో మహావతార బాబాజీ, ఇతరులకు క్రియాయోగ దీక్ష ఇవ్వడానికి లాహిరీ మహాశయుల కొక్కరికే అనుమతి ఇచ్చారు. తరవాత, యోగావతార మూర్తులైన లాహిరీ మహాశయులు, క్రియాయోగం ఉపదేశించడానికి తమ శిష్యుల్లో కొందరికి కూడా అధికారం ఇమ్మని కోరారు. బాబాజీ అంగీకరించారు; అంతే కాకుండా, భవిష్యత్తులో క్రియాయోగ దీక్షాప్రదానం, క్రియాయోగ పథంలో ప్రగతి సాధించి, లాహిరీ మహాశయులనుంచి కాని ఆ యోగావతారుల అధికృత శిష్యులు ఏర్పరిచిన మార్గాలనుంచి కాని అధికారం పొందినవాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలని ఆదేశించారు. యథావిధిగా అధికారం పొందిన క్రియాయోగ ఉపదేశకుల దగ్గర దీక్ష తీసుకున్న, భక్తివిశ్వాసాలుగల క్రియాయోగులందరి ఆధ్యాత్మిక సంక్షేమానికి జన్మజన్మాంతర బాధ్యత తాము స్వీకరిస్తామని బాబాజీ కనికరంతో అన్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ దీక్ష తీసుకునేవాళ్ళు, క్రియాయోగ ప్రక్రియను తాము ఇతరులెవరికీ వెల్లడి చెయ్యం అని ఒక ప్రమాణపత్రంమీద తప్పనిసరిగా సంతకం చెయ్యవలసి ఉంటుంది. ఈ విధంగా, సులభమూ సునిశితమూ అయిన క్రియాయోగ ప్రక్రియ అధికారం పొందని ఉపదేశకుల మూలంగా మార్పులకూ వికారాలకూ లోనుకాకుండా పరిరక్షితమై మౌలిక, అవికారరూపంలో నిలిచి ఉంటుంది.

సామాన్య ప్రజలు క్రియాయోగంవల్ల లాభం పొందడానికని బాబాజీ, పురాతనమైన వానప్రస్థ, సన్యాసాశ్రమ సంబంధమైన నిర్బంధాలు తొలగించినప్పటికీ దీక్ష కోరే వారికి ఎవరికయినా సరే క్రియాయోగ సాధనకు తయారుగా ప్రాథమిక ఆధ్యాత్మిక శిక్షణ కాలం ఒకటి లాహిరీ మహాశయులూ దాని ఆధ్యాత్మిక పరంపర (వై . ఎస్. ఎస్. - ఎస్. ఆర్ . ఎఫ్. గురుపరంపర) లోని శిష్యులందరూ విధించాలని ఆయన ఆదేశించారు. క్రియాయోగం వంటి అత్యున్నత యోగ ప్రక్రియాసాధన అస్థిరమైన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడేది కాదు. క్రియాయోగం ధ్యానప్రక్రియను మించినది; అదొకజీవిత మార్గం; అంచేత, దీక్ష పొందేవాడు కొన్నికొన్ని ఆధ్యాత్మిక విధుల్నీ నిషేధాల్నీ మన్నించడం అవసరమవుతుంది. మహావతార బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి శ్రీయుక్తేశ్వర్, పరమహంస యోగానంద గార్ల ద్వారా పారంపర్యంగా వచ్చిన ఈ బోధలను యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ నిష్ఠగా పాటిస్తున్నాయి. వై. ఎస్. ఎస్. - ఎస్. ఆర్. ఎఫ్. వారి పాఠాల ద్వారాను, వై . ఎస్. ఎస్. - ఎస్. ఆర్ . ఎఫ్. వారి ఆధికారం పొందిన ప్రతినిధుల ద్వారాను క్రియాయోగానికి, ఉపక్రమణగా నేర్పే హంస (హాంగ్సా), ఓం ప్రక్రియలు, క్రియాయోగ పథంలో అంతర్భాగాలే. ఈ ప్రక్రియలు, ఆత్మసాక్షాత్కారం పొందడానికి చైతన్యాన్ని జాగృతం చేయడంలోనూ ఆత్మను దాస్యం నుంచి విముక్తం చేయడంలోనూ సమర్థమైనవి.

  • అధ్యాయం 2 : 40.
  • ఆత్మసాక్షాత్కార సాధన పథంలో లాహిరీ మహాశయుల వంటి జ్ఞానులైన మహాపురుషులు కూడా ఉత్సాహాతిశయానికి లోబడిపోయి క్రమశిక్షణకు గురి అవుతూ ఉంటారు. దివ్యగురువైన కృష్ణుడు, భక్తాగ్రణి అయిన అర్జునుణ్ణి మందలించడం, భగవద్గీతలో, చాలా సందర్భాల్లో చదువుతాం.
  • వెన్నతో వేయించి, పాలలో మరిగించిన పిండి (‘గోధుమ పాల మీగడ’ మాదిరిది) తో తయారుచేసే ఒక రకం పాయసం.
  • ఉత్తరోత్తరా, ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప ప్రగతి సాధించిన కారణంగా, మైత్ర మహాశయులుగా పేరు పొందిన వ్యక్తి. నేను హైస్కూలు చదువు పూర్తి చేసుకున్న కొత్తలో మైత్ర మహాశయుల్ని కలుసుకున్నాను, నేను కాశీలో ఆశ్రమవాసిగా ఉన్నప్పుడు ఆయన, మహామండల ఆశ్రమాన్ని సందర్శించారు, మురాదాబాద్ మిత్రబృందం ముందు బాబాజీ సాక్షాత్కరించడం గురించి అప్పుడు చెప్పారాయన నాకు. “ఈ అలౌకిక అద్భుత ఘటన ఫలితంగా, నేను లాహిరీ మహాశయులకు యావజ్జీవ శిష్యుణ్ణి అయాను.” అని నాకు చెప్పారు మైత్ర మహాశయులు.
  • “స్వర్గంలోనూ భూలోకంలోనూ ఉన్నవాటిని చూడ్డానికి [ఆయన], తనను తాను తక్కువచేసుకుంటాడు.” సామ్స్ 113 : 6. “తనను తాను గొప్పగా తలుచుకునేవాడల్లా నీచపడక తప్పదు; తనను తాను తక్కువ చేసుకునేవాడు గొప్పవాడు కాకమానడు.” - మత్తయి 23 : 12 (బైబిలు).

    అహంకారాన్ని; లేదా మిథ్యామమత్వాన్ని తగ్గించడమంటే తన అనంతసత్తను ఆవిష్కరించుకోడమన్నమాట.