ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 33
అధ్యాయం : 33
ఆధునిక భారతీయ యోగీశ్వరులు
బాబాజీ
బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమగిరి శిఖర ప్రాంతం, బాబాజీ ఉనికితో ఈనాటికీ పునీతమవుతున్నది. బాబాజీ లాహిరీ మహాశయుల గురుదేవులు. ఏకాంతవాసు లయిన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా - బహుశా అనేక సహస్రాబ్దులుగా - తమ భౌతికరూపాన్ని నిలుపుకొంటున్నారు. మరణంలేని బాబాజీ అవతార పురుషులు. సంస్కృతంలో అవతరించడం అంటే, “కిందికి దిగడం” అని అర్థం. అవతార శబ్దంలో “అవ” అనే ఉపసర్గకు “కిందికి” అనీ, ‘తృ’ అనే ధాతువుకు “దాటడం” అనీ అర్థాలు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం, దైవం భౌతిక శరీరం రూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది.
“బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది,” అని నాకు వివరించా రొకసారి శ్రీయుకేశ్వర్‌గారు. “మానవుల కుంఠిత దృష్టి, ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు. అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థప్రయత్నమవుతుంది. అది అనూహ్యమైనది.”
ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశనూ ఉపనిషత్తులు సునిశితంగా వర్గీకరించాయి. సిద్ధుడు (“పరిపూర్ణత పొందినవాడు”) జీవన్ముక్త (“జీవించి ఉండగానే విముక్తిపొంది ఉన్నవాడు”) స్థితి నుంచి పరాముక్త (“సర్వోత్కృష్ట స్వతంత్రుడు” - మృత్యుంజయుడు) స్థితికి పురోగమించి ఉంటాడు. చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచీ జన్మపరంపరావృత్తిలోంచీ పూర్తిగా బయటపడి ఉంటాడు. అందువల్ల పరాముక్తుడయినవాడు తిరిగి భౌతిక శరీరం పొందడమనేది సకృతు. ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాలా అవతార పురుషుడే; ప్రపంచానికి దివ్యమయిన దీవెనలు కురిపించడానికి దైవనిర్ణీతమైన సాధనమే. అవతారపురుషుడు విశ్వజనీన వ్యవస్థకు బద్ధుడు కాడు; తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధదేహం ప్రకృతికి ఏ విధంగానూ ఋణపడి ఉండదు.
సాధారణ దృష్టికి, అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేదీ అవుపించకపోవచ్చు. కాని ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు, నేలమీద అడుగు జాడా పడదు. అంధకారాన్నించీ భౌతిక దాస్యాన్నించీ పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకలవంటి నిదర్శనాలివి. అటువంటి దైవ-మానవుడొక్కడే చావుపుట్టుకల సాపేక్షతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు. ఎంతగానో అపార్థానికి గురిఅయిన. ఉమర్ ఖయ్యాం ‘రుబాయత్’ అనే అమరగ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు:
“ఆహా, కళలు తరగతి నా ఆనంద చంద్రబింబం,
ఉదయిస్తోంది మళ్ళీ దివ్యేందు బింబం;
ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇకముందు
ఇదే ఉద్యానంలో - వ్యర్థంగా నా కోసం!”[1]
క్రీస్తు తన విముక్తినిగురించి మరో రకంగా చెప్పాడు. “ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు. స్వామీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను. అందుకు క్రీస్తు ఇలా అన్నాడు - గుంటనక్కలకు బొర్రె లున్నాయి; గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి; కాని మనుష్య కుమారుడికి తలదాచుకోడానికయినా చోటు లేదు.”[2]
అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మ సాధనలో తప్ప మరోవిధంగా అనుసరించగలరా?
కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు. దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి, చెప్పుకోదగ్గంత కావ్యసాహిత్యం తమిళంలో బయలుదేరింది. క్రీస్తు శకారంభానికి ముందూ ఆ తరవాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు. ఆయన ఈనాటికీ భౌతిక రూపాన్ని నిలుపుకొనే ఉన్నట్టు ప్రతీతి. ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారత దేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన, పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారు లనిపించుకోడానికి అర్హులు. సన్యాసుల మఠామ్నాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి[3] మధ్య యుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకూ తామే యోగదీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన. పందొమ్మిదో శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసినంతవరకు, విస్మృతమయిన క్రియాయోగాన్ని పునరుద్ధరించిన లాహిరీ మహాశయులు.
బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలిసి ముక్తి ప్రదమయిన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను, మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే: యుద్ధాలనూ జాతివిద్వేషాలను మతపరమయిన పక్షపాతాన్ని ప్రయోగించినవాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలనూ విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం. ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు; ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతేకాదు, యోగపరమయిన ఆత్మ విమోచన పద్ధతులను ప్రాచ్య, పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చెయ్యవలసిన అవసరాన్ని గ్రహించారాయన. బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావనా లేక పోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ పరమోత్కృష్ట, గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్ర వర్ష ప్రణాళికలో స్థానం లేదు. ఏకైక నీరవశక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ విన్రములయి మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు.
క్రీస్తు, కృష్ణుడు వంటి మహా ప్రవక్తలు ఒకానొక విలక్షణమయిన ఆసక్తి కరమయిన ప్రయోజనంకోసం భూమికి అవతరిస్తూ ఉంటారు; వచ్చిన పని నెరవేరడంతోటే నిష్క్రమిస్తూ ఉంటారు. బాబాజీవంటి ఇతర అవతారపురుషులు, చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహా సంఘటనకు కాక, కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు. అటువంటి మహా పురుషులు జనసామాన్యం స్థూలదృష్టికి అతీతంగా తెర మరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగయే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాలవల్లా తమనుగురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండడంవల్లా ఇటువంటి ఆధ్యాత్మిక మహామేరు సదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు. ఈ పుటల్లో నేను ఇయ్యదలచినది కేవలం, బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే; బహిరంగంగా తెలపడానికి తగినవీ సహాయకరమైనవీ అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే.
బాబాజీ కుటుంబాన్ని గురించికాని, జన్మస్థలాన్ని గురించి కాని రచయితకు ప్రీతిపాత్రమయే పరిమిత వాస్తవాలేవీ వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో; కాని ఏ భాషలో నయినా అవలీలగా మాట్లాడ గలరు. ఈయన బాబాజీ[4] (పూజ్యులయిన తండ్రిగారు) అన్న సరళమైన పేరు పెట్టుకొన్నారు; ఇది కాక లాహిరీ మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి: మహాముని బాబాజీ, మహారాజ్ (పరమానంద మగ్నులయిన సాధువు), మహాయోగి (యోగులందరిలోకి గొప్పవారు), త్ర్యంబక బాబా, శివబాబా (శివుడి అవతారమనే అర్థంలో). అన్ని బంధాల నుంచీ విముక్తులయిన ఈ మహాగురువుల గోత్రనామా లేవో తెలియకపోతే నష్టమేమిటి?
“ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది” [5] అన్నారు లాహిరీ మహాశయులు.
మృత్యుంజయులయిన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నా లేవీ ఉండవు; పాతికేళ్ళకు మించని యువకుడిలా కనిపిస్తారు. పసిమిచాయ, నడితరం పుష్టి ఎత్తూ గల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి; ప్రశాంతంగా, ప్రేమార్ద్రతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరీ మహాశయులకు ఎంత దగ్గరిపోలిక కనిపిస్తుందంటే కడపటి ఏళ్ళలో లాహిరీ మహాశయులు, యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చెలామణి కాగలిగేటట్టు ఉండేవారు.
ఋషితుల్యులయిన నా సంస్కృతభాషాధ్యాపకులు స్వామి కేవలానందగారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు.
“సాటిలేని ఈ పరమ గురువులు, తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోటినుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు,” అన్నారు కేవలానందగారు నాతో. “ఆయనతో బాటు ఉండే చిన్న బృందంలో, ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరున్నారు. ఒక ప్రదేశంలో కొంత కాలమున్నాక బాబాజీ, ‘డేరా డండా ఉఠావో’ (‘ఇంక బిచాణా ఎత్తేద్దాం’) అంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక ‘దండం’ (వెదురు కర్ర ) ఉంటుంది. ఆయన మాటలు, తమ బృందం తక్షణమే మరో చోటికి మారడానికి సూచన. ఆయన ప్రతి మాటూ సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు; ఒక్కొక్కప్పుడు ఒక కొండ మీంచి మరో కొండ కొమ్ము మీదికీ కాలినడకనే వెళ్తూంటారు.
“బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కాని వాళ్లు ఆయన్ని గుర్తుపట్టడం కాని జరుగుతుంది. వేరువేరు భక్తులకు ఆయన, కొద్దిపాటి తేడాగల వేరువేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు. ఒక్కొక్కప్పుడు గడ్డం, మీసాలతో; మరొకప్పుడు అవి లేకుండా, చ్యుతిలేని ఆయన దేహానికి ఆహార మక్కర్లేదు; అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యులపట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన, అప్పుడప్పుడు పళ్ళో, పాలూ నెయ్యీ పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు.
“బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమయిన సంఘటనలు రెండు తెలుసు నాకు,” అంటూ చెప్పుకొచ్చారు, కేవలానందగారు. “ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు, పవిత్రమయిన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి, భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చునిఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు, మండుతున్న కట్టె ఒకటి తీసుకొని, హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు.
“ ‘స్వామీ, ఎంత క్రూరం!’ అన్నారు ఆపేక్షణగా, అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు.
“ ‘అయితే ఇతను, తన పూర్వకర్మ ఫలానుసారంగా నీ కళ్ళముందే కాలి బూడిద అయిపోతూంటే చూస్తూంటావా?’ ”
“ఈ మాటలతో బాబాజీ, శిష్యుడి వికృత భుజం మీద ఉపశమన చాయకమయిన తమ చెయ్యి వేశారు. ‘ఈ రాత్రి నిన్ను బాధాకరమయిన మృత్యువునుంచి తప్పించాను. నిప్పు సెగవల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది’; అన్నారాయన.
“మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక అగంతకుడు రావడంవల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బసచేసిన చోటికి దగ్గరగా, చేరడానికి దాదాపు అశక్యమయిన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కవచ్చాడు.”
“స్వామీ, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి. ఆ వ్యక్తి ముఖంలో మాటలకందని భక్తిప్రపత్తులు వెలుగొందాయి. ‘మీ కోసం, చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతులేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకొంటున్నాను,’ అన్నాడు.”
“మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు, కొండ కొమ్ముకు దిగువునన్న బండల వరసవేపు చూపించాడు. ‘మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండమీంచి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్థకం.’ ”
“ ‘అయితే దూకు,’ అన్నారు బాబాజీ, ఏమాత్రం ఉద్రేకం లేకుండా. “నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను.’ ”
“వెంటనే ఆ మనిషి కొండమీంచి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు. బాబాజీ వాళ్ళవేపు చూసి, ఆ అగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు, దాని మీద తమ చెయ్యి వేశారు. వెంటనే, చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులయిన గురుదేవుల ముందు సువినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు.”
“ ‘ఇప్పుడు పనికొస్తావు నువ్వు, శిష్యరికానికి,’ అంటూ బాబాజీ, మళ్ళీ బతికిన శిష్యుడివేపు ఆప్యాయంగా చూశారు. ‘కఠినమయిన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయావు నువ్వు.[6] చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను; నువ్విప్పుడు మా అమరబృందంలో ఒకడివి,’ అన్నారు. ఆ తరవాత, అలవాటు ప్రకారం, ‘డేరా డండా ఉఠావో’ అంటూ బయలు దేరమన్నారు. మరుక్షణంలో వారి బృందమంతా కొండమీంచి మాయమయింది.” అవతారమూర్తి సార్వత్రికమయిన చిదాత్మలో జీవిస్తాడు. నాలుగు దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతికరూపాన్ని నిలుపుకోడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే: మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శన ఒకటి చూపించాలన్న కోరిక. దైవత్వాన్ని మాంసల (మానవ) రూపంలో దర్శించే అవకాశం కనక మనిషికి లేకపోయినట్లయితే, మర్త్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా బ్రాంతి అతన్ని అణచిపెట్టి ఉంచుతుంది.
ఏసుక్రీస్తుకు తన జీవితక్రమ మేమిటో మొదటినుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటననూ ఆయన అనుభవించింది. తన కోసమూ కాదు, కర్మనిర్బంధం వల్లా కాదు; చింతనాపరులయిన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్తికులు (ఇవాంజిలిస్టులు) నలుగురూ భావితరాలవారి ఉపయోగార్థం అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు.
భూతభవిష్యద్వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ, తమ దివ్యజీవన చర్యలనేకం, ఒకరు లేదా అంతకన్న ఎక్కువమంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా, శారీరకమైన అమరత్వానికున్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమయిందని బాబాజీ భావించినప్పుడు లాహిరీ మహాశయుల శిష్యు లొకరు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తి నిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ, శ్రీ రామగోపాల్ మజుందార్‌గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. మహాత్ము లెప్పుడూ తమ మాటలు చెబుతూ, పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు - ఇది కేవలం మానవ శ్రేయస్సుకోసం. క్రీస్తు కూడా ఇలా అన్నాడు: “తండ్రీ , నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు; కాని నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను.” (యోహాను 11 : 41-42).
రణబాజ్‌పూర్‌లో, “నిద్రపోని సాధువు”[7] అయిన రామగోపాల్ మజుందార్‌గారిని సందర్శించిన సందర్భంలో ఆయన, బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు.
‘కాశీలో లాహిరీ మహాశయుల పాదసన్నిధిలో కూర్చోడం కోసం ఒక్కొక్కప్పుడు నేను, ఏకాంతగుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి, అన్నారు రామగోపాల్‌గారు నాతో. “ఒకనాడు నడిరాత్రివేళ వారి శిష్య బృందంతో బాటు కూర్చుని ధ్యానం చేసుకొంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమయిన కోరిక ఒకటి కోరారు.
“ ‘రామగోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు,’ అన్నారు లాహిరీ మహాశయులు”
“వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రివేళ వెన్నెలతోను, మిలమిల మెరిసే చుక్కలతోను ప్రకాశిస్తున్నది. కొంత సేపు ఓపికగా, మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరిలోనే ఉన్న ఒక పెద్ద రాతిపలక మీద నా చూపు నిలిచింది. అది మెల్ల మెల్లగా లేచినప్పుడు, దానికింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడి అయింది. ఏ అజ్ఞాత సాధనంవల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తరవాత, ఆశ్చర్యం కలిగించేటంత అందమయిన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం, ఆ గుహలోంచి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువయిన కాంతి పరివేషం గోచరిస్తూ ఉండగా ఆమె, మెల్లగా నేలకు దిగివచ్చి ఒకానొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరి కామె కదిలి మెల్లగా ఇలా అన్నారు:
“ ‘నేను మాతాజీని[8] - బాబాజీ చెల్లెల్ని. ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్నీ లాహిరీ మహాశయుల్నీ నా గుహదగ్గరికి రమ్మని కోరాను.’ ”
“ఇంతలో, వెండిమబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిని తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకం కాని నీళ్ళమీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది. అది దగ్గరికి వచ్చి వచ్చి, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులయి నమస్కరించారాయన.
“నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్య పోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం, మా సమూహానికి దగ్గరిగా వచ్చి ఒక అందమయిన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయనే బాబాజీ అని వెంటనే పోల్చుకోగలిగాను. ఆయన లాహిరీ మహాశయుల్లా ఉన్నారు. కానయితే ఇద్దరికీ ఉన్న తేడా అల్లా, బాబాజీ ఆయనకంటె యువకుల్లా కనిపిస్తారు; పొడుగాటి జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.”
“లాహిరీ మహాశయులూ, మాతాజీ, నేనూ మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్యశరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువూ పరమానందానుభూతితో పరవశమయింది.
“ ‘నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదా మనుకుంటున్నాను,’ అన్నారు బాబాజీ.
“ ‘ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి?’ ఆ మహితాత్మురాలు ఆయనవైపు ప్రార్థనపూర్వకంగా చూశారు.”
“నా ఆత్మసాగరం మీద నేను, కంటికి కనిపించే అల రూపాన్ని ధరిస్తే నేమి, కనిపించని అల రూపాన్ని ధరిస్తే నేమి? తేడా ఏముంటుంది?”
“వెంటనే మాతాజీ, ‘అమర గురుదేవా, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి,’ అన్నారు ఛలోక్తిగా.
“ తథాస్తు,’ అన్నారు బాబాజీ, గంభీరంగా. ‘నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమిమీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదగా చెప్పించాడు. “ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు, ప్రసన్నంగా నావేపు తిరిగారు.”
“ ‘భయపడకు రామగోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయావు,’ అన్నారాయన.”
“బాబాజీ మృదుమధురస్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపమూ లాహిరీ మహాశయుల రూపమూ మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానది వేపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా, వారి దేహాల చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతిపలక మళ్ళీ, కిందికి వచ్చి, కంటికి కనిపించని మీట ఏదో నొక్కితే జరిగినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది.
“అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరీ మహాశయుల నివాసానికి దారి తీశాను. వేకువ సంజెలో ఆయనముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు.”
“ ‘చాలా సంతోషం రామగోపాల్,’ అన్నారాయన. ‘బాబాజీనీ మాతాజీనీ దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తంచేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది.’ ”
“నడిరాత్రి వేళ నేను ఇక్కణ్ణించి వెళ్ళినప్పటినించి లాహిరీ మహాశయులు తమ వేదికమీంచి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు.”
“ ‘నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తరవాత ఆయన, అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు.’ అన్నాడొక శిష్యుడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్ల, రెండు శరీరాలతోనో అంతకంటే ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటా డని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను.
“ఈ భూమికి సంబంధించిన గుప్తమయిన దివ్యప్రణాళికలోని అధిభౌతికాంశాలను లాహిరీ మహాశయులు, తరవాత నాకు వివరించారు,” అంటూ ముగించారు రామగోపాల్‌గారు. “ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తూంటాయి, పోతూంటాయి. అయినప్పటికీ మరణంలేని ఈ మహాగురువులు,[10] ప్రపంచరంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు.
- ↑ ఎడ్వర్డ్ ఫిట్జ్ జిరాల్డ్ అనువాదాన్ని అనుసరించి.
- ↑ మత్తయి 8 : 19-20 (బైబిలు).
- ↑ చారిత్రకంగా గోవిందయతి శిష్యులని తెలుస్తున్న శంకరులు, కాశీలో బాబాజీ దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు. ఈ వృత్తాంతం లాహిరీ మహాశయులతోను, స్వామి కేవలానందగారితోను ముచ్చటిస్తూ బాబాజీ, ఈ అద్వైతవాదితో సమాగమనానికి సంబంధించిన ఆకర్షకమయిన వివరాలు అనేకం చెప్పారు.
- ↑ బాబాజీ (పూజ్యులయిన తండ్రిగారు) అనేది సామాన్యమైన బిరుదు. భారతదేశంలో చాలామంది గురువులను “బాబాజీ” అని పిలుస్తారు. కాని లాహిరీ మహాశయుల గురువులయిన బాబాజీ మాత్రం వాళ్ళలోవారు కారు. ఈ మహావతారుల ఉనికిని గురించి లోకానికి మొట్టమొదటిసారిగా వెల్లడి అయింది 1946లో, ‘ఒక యోగి ఆత్మకథ’ ద్వారా.
- ↑ ఈ ప్రకటనలోని సత్యం, ఈ పుస్తకం చదివిన చాలామంది పాఠకుల వల్ల రుజువయింది (పచురణకర్త గమనిక)
- ↑ విధేయతకు సంబంధించిన పరీక్ష. జ్ఞానపూర్ణులయిన గురుదేవులు, ‘దూకు,’ అనగానే ఆ వ్యక్తి విధేయుడయి దూకేశాడు. దాని కతను వెనకాడి ఉంటే, బాబాజీ గురుత్వం పొందలేని జీవితం నిరర్థకమని భావిస్తున్నట్లుగా తను చెప్పిన మాటలు అబద్ధమని రుజువయ్యేవి. అంతేకాదు, గురువుమీద తనకు సంపూర్ణమయిన విశ్వాసం లేదన్న సంగతి బయట పెట్టుకునేవాడు. అందువల్ల ఈ పరీక్ష కఠినమూ అసాధారణమూ అయినప్పటికీ అప్పటి స్థితిలో అదే సరయినది
- ↑ తారకేశ్వర ఆలయం ముందు నేమ తలవంచలేదని గమనించిన సర్వవ్యాపి యోగిపుంగవులు (అధ్యాయం 13).
- ↑ “పవిత్ర మాత.” మాతాజీ కూడా అనేక శతాబ్దాలుగా జీవిస్తూన్నారు. ఆధ్యాత్మికంగా ఈమె, దాదాపు సోదరులందుకున్నంత ఉన్నత స్థితిని అందుకున్నారు. దశాశ్వమేధ ఘట్టం దగ్గర భూమిలో ఉన్న ఒక రహస్య గుహలో ఆనందపారవశ్యంలో మునిగి ఉంటారు.
- ↑ ఈ సంఘటన నాకు థేలీజ్ కథను గుర్తుకు తెస్తోంది. ఈ ప్రముఖ గ్రీకు తత్త్వవేత్త, జీవితానికి మరణానికి భేదం లేదని బోధించాడు. “అయితే మరి మీ రెందుకు చనిపోరు?” అని అడిగాడొక విమర్శకుడు., “రెంటికి తేడా లేదు కనకనే,” అని జవాబిచ్చాడట థేలీజ్.
- ↑ “ఇదుగో, ఎవరయినా నా మాటను మన్నించినట్లయితే (అవిచ్ఛిన్నంగా క్రీస్తు చైతన్యంలో మునిగి ఉన్నట్లయితే) అతనికి మరణమే ఎదురుకాదు. (యోహాను 8 : 51, బైబిలు).
ఇలా అనడంలో ఏసుక్రీస్తు, భౌతికదేహంతో అమరజీవనం గడపడం గురించి చెప్పడం లేదు. దుర్భరమయిన అటువంటి నిర్భంధం, సాధువు సంగతి అలా ఉంచి, పాపికి విధించడానికే ఎవరూ పాలుపడరు! క్రీస్తు ప్రస్తావించిన జ్ఞాని, మరణంలాంటి అజ్ఞాన నిద్రాపారవశ్యంలోంచి మేల్కొని శాశ్వత అమరత్వ సిద్ధి పొంది ఉన్నవాడు (43 అధ్యాయం చూడండి). మానవుడి ప్రధాన ప్రకృతి నిరాకారమయిన సర్వవ్యాప్తమయిన ఆత్మ నిర్బంధంగా, లేదా కర్మానుబంధంగా సంభవించే శరీరధారణ ‘అవిద్య’కు అంటే అజ్ఞానానికి ఫలితం. చావుపుట్టుకలు రెండూ విశ్వంలోని మాయవల్ల సాక్షిభూతమయేవే నని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతాయి. చావుపుట్టుకలన్నవి సాపేక్ష ప్రపంచంలోనే అర్థవంతమయినవి. బాబాజీ ఒక భౌతిక శరీరానికి కాని ఈ గ్రహానికి కాని పరిమితులయి ఉన్నవారు కారు; భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ లోకానికి ప్రత్యేక సేవా విధి నిర్వహిస్తున్నవారు. స్వామి ప్రణవానందులవంటి మహాగురువులు కొత్త దేహాలు ధరించి ఈ లోకంలోకి తిరిగి రావడానికి కారణాలు వారికే తెలియాలి. ఈ లోకంలో, వారి జన్మలు కర్మసంబంధమయిన కఠిన నిర్బంధాలకు లోబడి ఉండేవి కావు. తమంతట తాము ఈ విధంగా తిరిగి రావడాన్ని ‘వ్యుత్థానం’. అంటే మాయాంధకారం తొలగిపోయిన తరవాత వెనకటి భూలోక జీవితానికి తిరిగి రావడం - అంటారు. సంపూర్ణంగా భగవత్సాక్షాత్కారం పొందిన గురువు, మామూలు రీతిలో చనిపోయినా, అద్భుత రీతిలో చనిపోయినా తన శరీరాల్ని తిరిగి పొంది భూలోక వాసులకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు. లెక్కకు అందనన్ని సూర్యమండలాలకు అధీశ్వరుడయిన పరమేశ్వరుడి సాయుజ్యం పొంది ఉన్న వ్యక్తికి భౌతిక శరీరాణువుల్ని సృష్టించటమన్నది కష్ట మయినదేమీ కాదు.
“నా ప్రాణాన్ని తిరిగి పొందాలనే నేను విడుస్తున్నాను,” అని ఉద్ఘాటించాడు క్రీస్తు. “దాన్ని నా నుంచి ఎవ్వరూ తియ్యలేరు; నేనే దాన్ని విడుస్తున్నాను, దాన్ని అలా విడిచే శక్తి తిరిగి పొందే శక్తీ నాకున్నాయి.” (యోహాను 10 : 17-18).