ఎందరో వికీమీడియన్లు/స్ఫూర్తికి సోర్సు, సోర్సుకు స్ఫూర్తి
స్ఫూర్తికి సోర్సు, సోర్సుకు స్ఫూర్తి
వికీసోర్సు గురించి మీకు తెలుసుగదా... కాపీహక్కులు ముగిసిన ప్రముఖ పుస్తకాలను ఉన్నదున్నట్టుగా ప్రతీ ఒక్క పేజీనీ టైపు చేసి వికీసోర్సులో పెడతారు. తద్వారా ఎవరైనా స్వేచ్ఛగా ఆ పుస్తకం చదూకోవచ్చు. "టైపు చెయ్యడం ఎందుకూ... సుబ్బరంగా పుస్తకాన్ని పీడీయెఫ్ చేసి పెట్టెయ్యొచ్చు గదా అని మీరు అనొచ్చు". "మరి గూగుల్ వెతుకులాటలో పీడియెఫ్‌లు దొరకవు గదా. దొరికినా వాటిలోని పాఠ్యాన్ని కాపీ చేసుకోవాలంటే వీలు కాదు గదా!" అని వికీసోర్సు జవాబిస్తుంది. "మరి టైపు చేసేటపుడు బోల్డన్ని తప్పులు దొర్లుతాయి గదా" అని మళ్ళీ మీరు అడుగుతారు. "ఎలా దొర్లుతాయ్... మాకు మా శ్రీరామమూర్తి గారున్నారు గదా!" అంటామ్మేము.
ఆయన ఎవరని అంటున్నారా... శ్రీరామమూర్తి గారిని తెలుగువికీ లోకి ఆయన భార్య తీసుకొచ్చారు. ఆయన్ని తీసుకు రావడం వరకే సుజాత గారి పని. ఆ తరువాత ఆయన వికీని అల్లుకు పోయారు. సుజాత గారు తెవికీని, విక్షనరీనీ సొంతం చేసుకుంటే, శ్రీరామమూర్తి గారు వికీసోర్సు నాదన్నారు. సర్లే అది మీదేలే సార్ అని ఒప్పేసుకున్నారందరూ. తప్పదు మరి, ఆయన చేసిన కృషి అటువంటిది.
వికీసోర్సులో ఒకరు టైపు చేసిన పేజీని మరొకరు తప్పులు సరిదిద్దుతారు. అప్పుడు దాన్ని ఇంకొకరు మళ్ళీ సరిచూసి "వాకే బాగుంది, పేజీ ఇక సిద్ధం" అంటారు. ఆ మరొకరూ, ఈ ఇంకొకరూ... అందరూ కూడా శ్రీరామమూర్తి గారు టైపించిన పేజీలను సరిచేసేందుకే ఆసక్తి చూపుతారు. ఎందుకో తెలిసిపోయిందా... ఔను మరి, ఎక్కడో అడపా దడపా అర కొర తప్పులు దొర్లితే సరిదిద్దడం బహు వీజీ గదండీ!
అదీ మా రామమూర్తి గారి గొప్పదనం. “తెలుగున టైపించుటయందు రామమూర్తికిన్ రెండవసాటి వికీమీడియను లేడనుచున్ గడకట్టి భేరికా డాండడ డాండ డాండ…”