ఎందరో వికీమీడియన్లు/పీఠాధిపతి

పీఠాధిపతి

తెవికీలో రోజు కొక వ్యాసం రాయడం ఒక ఆరోహణ. రోజుకో వ్యాసం చొప్పున వందరోజుల్లో వంద వ్యాసాలు అనే పోటీ ఒకటి వికీలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టారు. ఈ వంద రోజుల స్ప్రింట్‌ ఈవెంటును అవలీలగా పరుగెత్తారు మనవాళ్ళు. అయితే, మా ప్రణయ్ రాజ్ మాత్రం ఇది స్ప్రింట్ కాదు మారథాన్ అన్నాడు. ముందు 365 రోజుల మారథాన్ అన్నాడు. ఆ తరవాత వెయ్యి రోజుల మారథాన్ అన్నాడు. కాదుకాదు ఐదేళ్ళన్నాడు. ఇప్పటికి ఏడేళ్ళైంది. తెగకుండా రోజుకు కనీసం ఒక్క వ్యాసమైనా రాస్తూనే ఉన్నాడు.

రోజుకో వ్యాసం వ్యసనాన్ని అనేకమందికి అంటించిన ఈ ప్రమాదకారి, తెలుగు వికీపీడియా లోనే కాదు యావత్తు వికీమీడియా ప్రపంచం లోనే ఎత్తాటి పీట వేసుకుని కూచున్నాడు. ప్రపంచం గుర్తించిన తన బిడ్డను తెలుగు వికీపీడియా గుర్తించకుండా ఉంటుందా... అతని గురించి ఒక వ్యాసం రాయించుకుంది. 5,800 పైచిలుకు వ్యాసాలు రాసాడు ఇప్పటిదాకా. తెవికీలో ఉన్న మొత్తం వ్యాసాలు 90 వేల లోపు. 6% ఈ ఒక్క మనిషే రాశాడు!

ప్రవృత్తితో జీవితం పెనవేసుకుపోయిన ప్రణయ్ లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. పెళ్ళీ పేరంటాలు, రాత్రీ పగలూ, ఎండా వానా, పండగా పబ్బం ఏమొచ్చినా సరే... ఈ తెవికీ యజ్ఞం ఆగదు. ఈ యజ్ఞకర్త ఆగడు. వార్తా పత్రికల్లో తెవికీ కనబడినపుడల్లా ప్రణయ్ కనబడడం మామూలు. మామూలే కాదు సహజం కూడా. సహజమే కాదు, సమర్థనీయం కూడా. సమర్థనీయమే కాదు ఆవశ్యకం కూడా.