ఉద్భటారాధ్యచరిత్రము/ప్రథమాశ్వాసము

శ్రీ

ఉద్భటాచార్యచరిత్రము

ప్రథమాశ్వాసము

శా.

[శ్రీవక్షః కమలాసనాది దివిజశ్రేణి శిరోమణ్య భి
ఖ్యావృద్ధి ప్రదశాణవన్నఖర] పాదాంభోజుఁ డధ్యాత్మవి
ద్యావిశ్రాంతుఁడు చంద్రశేఖ[రుఁడు నిత్యశ్రీ]యుతుం జేయు భ
ద్రావాసుండగు నూరదేచవిభు [నిత్యశ్రీయుతుం జేయుతన్.]

1


మ.

[కమనీయంబగు నాథుమోమున నపాంగక్రీడ గావించి క]
ర్ణ మరుద్భుక్ఫణరత్నదీప్తిలహరీ రక్తాంకగండస్థ రే
ఖ మృగాక్ష్యంతరదత్తనూతన నఖాంకంబంచు నంకించు నా
హిమశైలాత్మజ [యూరదేచవిభు నెంతేఁబ్రోచు నశ్రాంతమున్.]

2


ఉ.

[స్వీకృత తల్పరూపుఁడగు శేషు ఫ]ణామణికాంతి పర్వి ని
త్యాకరరత్నగైరిక మహాద్యుతిఁ బొల్పగు నీలశైలముం
జీకొనుమేను మేటిజగతీధరధారి మరా[ళవాహనున్
సాకిన బొడ్డతమ్మిగల శౌరి యలర్చుత దేచ ధీనిధిన్.]

3


ఉ.

అంచితపక్షపాతగతి నారయఁ గూరుట గల్గి శారదా
చంచలనేత్ర! హంసిక్రియఁ జారు నిజాననపద్మమందు గ్రీ
డించ సుఖించు ప్రో[డ ప్రకటీకృత సృష్టికిఁ దోడునీడ యా
కాంచన గర్భుండేలు నొడి]కంబుగ నన్నయమంత్రిదేచనిన్.

4

సీ.

సజలవలాహక శ్యామమోహనమూర్తి
        భద్రకాళికి నేత్రపర్వమొసఁగ
వీరరసాం[పగా వీచీలసద్వీక్ష
        ణములు భువన రక్షణమును దెలుప]
[నసదృశ మందహాసాంశు జా]లంబులు
        నెలపూవు నమృతంపుఁ గలిమిఁ బోల్పఁ
దరళదంష్ట్రాధాళ ధళ్యంబులును భూష
        ణప్రభాంకురము లున్నతిఁ దలిర్పఁ


గీ.

గొండవీటి [కనకపీఠిఁ గొలువుదీరు
భక్తమానస చాతకవార వార్ష
సమయవిస్ఫూర్తి] శ్రీవీరశరభమూర్తి
ప్రోచు నూరన్నధీమణి దేచమంత్రి.

5


చ.

అమృతకరావతంసు తలయందలి యేటిజలంబుఁ గ్రోలి తుం
డము గొ[నితోడుతోఁగు ధరనాథ తనూభవ మ్రోల స్తన్య పా
నమున నెసంగి యిర్వురు పెనంగొని ముద్దిడుకొన్న] యుగ్మవి
భ్రమము వహించు హస్తిముఖుఁ బ్రార్థన చేసెద నిష్టసిద్ధికిన్.

6


ఉ.

అధ్వరకర్మకౌశలసమంచితు మానసపద్మకీలితో
క్షధ్వజ[భక్తిసౌరభు నఖండషడధ్వ రహస్యపారగున్
మధ్వతి శాయివాణి శ్రిత మానస గుప్తతమోనభోమ]ణిన్
సాధ్వనుభావు మద్గురుఁ బ్రసన్ను భజించెద నైలనాహ్వయున్.

7


మ.

కలశాంభోనిధి యాఁడుబిడ్డ, శశికిం గారాబుతోఁబుట్టు, [వి
ద్యల దేవేరికి నత్త, యజ్ఞపురుషుండౌ విష్ణు నిల్లాలు, శ్రీ
జలజాతేక్షణ ప్రోచుఁగాత] నిరతైశ్వర్యం బవార్యంబుగా
నలఘుప్రాభవు నూరయన్నవిభు దేచామాత్యు నిత్యోన్నతున్.

8

సీ.

సింహా[సనీకృత చిరయశః కవిచిత్త
        యుపవనీకృతరసాభ్యుదితరచన
లీలాపదీకృత కీలితాచ్ఛాం]భోజ
        సైంధవీకృత మదస్ఫారహంసి
ప్రియసఖీకృతమనఃప్రియద పాండురకీరి
        సరసీకృతాంభోజ జాతవ(దన)
[విహృతస్థలీకృత వేధాః పరిష్వంగ
        విహృతిస్థలీకృత వేదవీధి


గీ.

అనవరత కరుణాఝరీ కనదపాంగ
ధ్వ]ణిత మణిమయవీణా వితతఝంక్రి
యా సమాకర్ణన ప్రహృష్టాంతరంగ,
శారదాదేవి మతిఁ గృతీశ్వరున కొసఁగు.

9


శా.

సంసా(రాహ్వయసింధు)పోతము జగత్సంబోధదీపాంకురున్
కంసారాతిపదాబ్జభంభరము సాక్షాత్పద్మగర్భున్ బుధో
త్తంసంబున్ శ్రుతిసంకరోద్దళన పాథఃక్షీర భేదక్రియా
హంసంబున్ బరిశీలితస్మృతిరసున్ వ్యాసున్ బ్రశంసించెదన్.

10


క.

శ్రీరామాయణదుగ్ధాం
భోరాశిసుధామయూఖు బుధవినుత[1]గుణో
దారు నఘమత్తవారణ
వారణరిపుఁ బ్రస్తుతింతు వాల్మీకిమునిన్.

11


ఉ.

గ్రాంథిక సన్నుతప్రతిభఁ గాంచి రసజ్ఞత మించి యాదిమ
గ్రంథము లుగ్గడించి ఫణి రాట్పరికల్పిత శాస్త్రవీధికిన్
బంధువులైన సత్కవులఁ బ్రార్థన చేసెద దుష్ప్రబంధ సం
బంధమహాంధకార ఖరభాను గభీరవచోమచర్చికన్.

12

వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును విశిష్టసత్కవికీర్తనంబును బరిఢవించి యొక్కప్రసిద్ధప్రబంధరచనాకౌతూహలంబు మనంబునం బెనంగొని యుండు నవసరంబున.

13


సీ.

మహితమూలస్థాన మల్లికార్జునశిర
        స్స్థలచంద్రచంద్రికాధవళిమంబు
చెదలువాటీపుర శ్రీరఘూధ్వహభుజా
        స్తంభరక్షణవిధాసంభృతంబు
వేదండముఖతడాగోదితపద్మసౌ
        గంధికగంధపాణింధమంబు
రాజబింబాననారాజితగంధర్వ
        మాధురీసాధురీతీధరంబు


గీ.

కరటికటనిర్గళద్దాన నిరవధిక
మగ్రనూతనవృష్టి జంబాలితాఖి
లావనీపాలమందిరప్రాంగణంబు
గురుసమృద్ధుల సయిదోడు కొండవీడు.

14


మ.

పరఁగన్ వారిధివేష్టితాఖిలమహీభాగంబునన్ రెడ్డిభూ
వరసింహాసనమై, శుభాయతనమై, వర్ధిల్లుతత్పట్టణం
బురుబాహాబలసంపదం బెనుచు భద్రోద్యోగి నాదెండ్ల గో
పరసాధీశుఁ డశేషబంధుకుముదప్రాలేయధామాకృతిన్.

15


సీ.

భూధురంధరభావమున భోగిపతియయ్యు
        విప్రవరాసక్తి వృద్ధిఁ బొంది
వరవిక్రమప్రౌఢి నరసింహుఁడయ్యు నె
        పుడు హిరణ్యకశిపు స్ఫురణ గాంచి
దివ్యభోగవ్యాప్తి దేవతావిభుఁడయ్యు
        బలపోషణఖ్యాతిఁ బరిఢవిల్లి

ప్రచురకారుణ్యసంపద రాఘవుండయ్యు
        శివధర్మపాలన స్థితి వహించి


గీ.

బాణ బాణాసనస్ఫూర్తి ద్రోణుఁడయ్యు
నవ్యపాంచాల లక్షణోన్నతి వహించి
జలధివలయిత వసుమతీ స్థలమునందుఁ
గొమరు దీపించు నాదెండ్ల గోపవిభుఁడు.

16


సీ.

దరహాసచంద్రికాధాళధళ్యంబులు
        భుజగేంద్రకాంతాకపోలములకు
తారహారచ్ఛటాధాగధగ్యంబులు
        చారణకామినీస్తనములకును
సంఫుల్లమల్లికాచాకచక్యంబులు
        గంధర్వమదవతీకబరికలకు
నవచందనాలేపనైగనిగ్యంబులు
        దివిషన్నితంబినీదేహములకు


గీ.

ధవళధామ సుధాశారదాపటీర
దర సుధావారినిధి సుధాంధఃకరీంద్ర
సాంద్రతర కాంతివిభ్రమ సంగతములు
తిమ్మవిభుగోపమంత్రి సత్కీర్తిరుచులు.

17


సీ.

కరవాలకామారి కరివధూనయన క
        జ్జలు హాలహలభోజనము గాఁగ
ప్రచురదానాంబుధారాపద్మ కర్థిహ
        స్తంబులు వరనీరజములు గాఁగ
అకలంకమతిమరాళికిఁ జతుశ్శ్రుతివీధి
        సాంద్రపయఃపూర్ణఁసరసి గాఁగ
గుణమౌక్తికములకుఁ గోవిదశ్రుతిసీమ
        ల కుటిలగుప్తి పేటికలు గాఁగ

గీ.

భూమ సప్తార్ణవీసప్తకీమనోజ్ఞ
సర్వసర్వంసహా పూర్ణచంద్రవదన
రాణివాసంబుగా ఖ్యాతి రాసి కెక్కె
గురుయశోహారి నాదెండ్ల గోపశౌరి.

18


సీ.

అరిపురజయలక్ష్మి హరునిఁ బోలెనె కాని
        తగులండు విషధరత్వంబు నింత
సంపూర్ణతరకాంతిఁ జంద్రుఁ బోలెనె కాని
        దోషకరోన్నతి దొరలఁ డెందు
నిజభుజాబలరేఖ విజయుఁ బోలెనె కాని
        భీమోన్నతస్ఫూర్తిఁ బెరుఁగ నీఁడు
గాంభీర్యమునఁ బాలకడలిఁ బోలెనె కాని
        భంగసాహిత్యంబుఁ బట్టఁ డర్థి


గీ.

నఖిలదుర్మంత్రివదనముద్రావతారుఁ
డాత్మపంకజవీథీ విహారిశౌరి
కీర్తి గంగాపవిత్రత క్షితితలుండు
గుణమరున్మంత్రి నాదెండ్ల గోపమంత్రి.

19


ఉ.

ఆహవకౌశలప్రహసి తార్జునతన్ సముదీర్ణధైర్య రే
ఖా హృతమేరుసారత మహాద్భుతుఁడై గుణనిర్జితేభ ర
క్షోహరుఁ (డై చెలంగు నల) గోపనమంత్రికి రాజకార్య ని
ర్వాహకుఁ డూరదేచసచివప్రవరుండు దలిర్చు నుర్వరన్.

20


సీ.

తన దానవిభవంబు ధనదానవద్య వి
        శ్రాణనప్రక్రియఁ జౌకపఱప
తన వచశ్శుద్ధి శాంతనవ పౌత్త్రాదు లం
        తటివారలకు నద్భుతం బొనర్ప
తన మూర్తి చూచినంతన మూర్ధములు వంచి
        దర్పితారాతిబృందములు దలఁక

తన మనస్స్థితి పురాతనమహామునిమృగ్య
        మగు శంభుతత్త్వంబుఁ దగిలి ప్రబల


గీ.

ప్రబలుఁడై యొప్పు నాదెండ్ల భవ్యవంశ
దీప తిమ్మప్రధానేంద్ర గోపసచివ
రాజ్యసంరక్షణక్రియారబ్ధబుద్ధి
గోచరుండూరయన్నయ దేచమంత్రి.

21


వ.

ఇట్లు మహనీయమనీషి మనఃకమలదివాకరుండును వివిధవిరోధిహృదయభీకరుండును, రసనాగ్రజాగ్రదశేష విద్యాసందర్భుండును, నభంగురప్రతిభాపద్మగర్భుండును, విశ్రుతవిశ్రాణనవిజితసముద్రుండును, విశుద్ధస్వాంతవిశ్రాంతవీరభద్రుండును, వనీపకవనోల్లాసనవచైత్రుండును, గౌండిన్యగోత్రుండును, సన్నుతసమున్నతమహభోగసంక్రందనుండును, నిబిడభుజాబలవిడంబితకుమారుండును, గృష్ణమాంబికా కుమారుండును, శాశ్వతైశ్యర్యపురశాసనుండును నగు నా ప్రధానపరమేశ్వరుం డొక్కనాఁడు.

22


మ.

కవులున్, బాఠకులున్, బ్రధానులు సుధీగణ్యుల్, పురాణజ్ఞులున్,
వివిధార్థుల్, సఖులున్, బురోహితులు నుర్వీనాథులున్, జోస్యులున్,
ధవళాక్షు ల్గొలువంగ నిండుకొలువై దైవారుహర్షంబుతో
నవధానంబున నుండి శంకరకథావ్యాసక్తి భాసిల్లుచున్.

23


సీ.

కౌండిన్యమునిరాజ! మండలేశ్వరవంశ!
        పాధోథి నవసుధాభానుమూర్తి!
బాలగుమ్మేలేశ! పదపయోజద్వయీ!
        ధ్యానధారణ సముదాత్తచిత్తు!
మానితాయాతయా మా(నామ)భావిత
        విపులమహాయజుర్వేదవేది!
రామేశ్వరస్వామి రమణీయకరుణావి
        శేషపోషితవిలసితసమగ్ర!

గీ.

సహజసాహిత్యమాధురీసంయుతాత్ము
లక్కమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు
రామధీమణికిని బుత్త్రు రామలింగ
నామ్యవిఖ్యాతుఁ గావ్యనిర్ణయధురీణు.

24


వ.

నన్ను సబహుమానంబుగా రావించి సమున్నతాసనబునఁ గూర్చుండ నియమించి కర్పూరతాంబూలంబు జాంబూనదపాత్రంబున నొసంగి తారహారాంగుళీయకంకణకర్ణభూషణపట్టమాంజిష్ఠాది విశిష్టవస్తుప్రదానపురస్సరంబుగా నిట్లనియె.

25


చ.

విలసదయాతయామబహువేదవివేకపవిత్రభావసం
కలితములైన వాక్యములఁ గావ్యముఁ జెప్పఁగ నేర్తు వాదికా
వ్యులకవితానిగుంభనసమున్నతిఁ గాంచినవాఁడ వౌదు నీ
వలఘువచోవిలాససుగుణాకర రామయలింగసత్కవీ!

26


మ.

భవపాశత్రుటనక్షమంబులగు నా ఫాలాక్షుగాథావలుల్
చెవులారన్ వినుచుండు నెవ్వఁ డతఁ డీక్షింపన్ మహాభాగుఁ డ
ట్లవుటన్ మామకబుద్ధి యెల్లపుడు దీవ్యచ్ఛైవశాస్త్రార్థసం
భవసాంద్రామృతసేవఁ దృప్తిఁ గనుచున్ భాసిల్లు నిస్తంద్రమై.

27


గీ.

హరునికంటెను దద్భక్తు లధికు లనుచు
వేదవేదులు వివరింప విందు మెపుడుఁ
గాన తద్భక్తసత్కథాఖ్యాతమైన
భవ్యచరితంబు వినువారు ప్రాజ్ఞతములు.

28


క.

హరభక్తులందు నుద్భట
గురుఁ డధికుఁడు తత్ప్రసిద్ధగుణమణిగణవి
స్ఫురణాభిరామమును నీ
వ రచింపుము కావ్య మొకటి వర్ణన కెక్కన్.

29

మ.

అని ప్రార్ధించిన దేచధీమణికి నిష్టావాప్తియుం గీర్తిఖే
లనయున్ భాగ్యసమృద్ధియున్ జయముఁ దుల్యస్ఫూర్తి వర్తిల్ల స
జ్జనతావర్ణితరీతి నాంధ్రమగు భాషాపద్ధతిన్ బల్కితిన్
వినుత శ్రీభరితోద్భటస్ఫుటకథావిఖ్యాతసత్కావ్యమున్.

30


వ.

ఇమ్మహాప్రారంభమునకు మంగళాచరణంబుగాఁ గృతీశ్వరు వంశావతారం బభివర్ణించెద.

31


కృతిపతి వంశావతారవర్ణనము

ఉ.

ధన్యవివేకశాలి, ప్రమథప్రభుపాదపయోజయుగ్మమూ
ర్ధన్యమనోద్విరేఫపతి, ప్రౌఢవచఃపరిభూతపండితం
మన్యుఁడు, మాన్యకీర్తినిధి, మన్యువిదూరుఁడునైన యట్టి కౌం
డిన్యమహామునీంద్రుఁడు మనీషికులాగ్రణి యొప్పునెప్పుడున్.

32


శా.

ఆవిర్భావము నొందెఁ దత్కులమునం దక్షుకీర్త్యావృత
ద్యావాపృథ్వ్యవకాశుఁ డీశపదపద్మధ్యానంసం(ధానవి
ద్యావిశ్రాం)తుఁడు సత్కృపాభరితశాంతస్వాంతుఁ డూరాగ్రహా
రావాసుండు పెదన్నమంత్రిమణి కొమ్మాంబామనోభర్తయై.

33


క.

ఆ జంపతులకుఁ గలిగిరి
భూజనకల్పద్రుమములు పురహరపూజా
బ్రాజిష్ణు లైలమంత్రియుఁ
దేజోనిధి తిప్పువిభుఁడు దేచప్రభుఁడున్.

34


క.

వారలలోఁ గవిజనమం
దూరుఁ డుదారుండు కీర్తిధగధగితదిశా
వారణదంతాచలుఁ డగ
ధీరుఁడు ధీరుచిరమూర్తి తిప్పన వెలయున్.

35


గీ.

చెప్పఁ జిత్రంబు శ్రీయూర తిప్పమంత్రి
యర్థులకు ధారవోయుట కఖిలనదులు

వెచ్చ పెట్టంగ నీక్షించి వృషభకేతుఁ
డభ్రనది నాఁచికొనియుండు నాత్మమౌళి.

36


చ.

బిసరుహపత్రనేత్రయగు పేరమకున్ బ్రతివాసరార్చిత
ప్రసవశిలీముఖారి పదపద్మయుగుండగు తిప్పమంత్రికిన్
మసృణయయశోవిభూషితసమస్తదిశావదనుండు నిర్జరేం
ద్రసముఁడు సంభవించె జితతామసుఁ డన్నవిభుండు సొంపునన్.

37


సీ.

సింహికాసుతుదంష్ట్రఁ జిక్కి నొవ్వని నాఁటి
        సంపూర్ణపూర్ణిమాచంద్రకాంతి
పెలుచఁ గవ్వపుఁగొండ గలఁచి యాడని నాఁటి
        క్షీరవారాశి గంభీరగుణము
దారుణతరవజ్రధార యంటని నాఁటి
        దైవతాహార్యంబు ధైర్యమహిమ
వితతభైరవకరాహతిఁ దలంకని నాఁటి
        పద్మగర్భుని ప్రతిభాభరంబు


గీ.

సత్యభామాధిపతిచేతఁ జలన మొంది
బలిమి దింపని నాఁటి కల్పద్రుమంబు
వితరణంబును దన యంద వెలయ వెలయు
నూరయన్న ప్రధానకంఠీరవుండు.

38


చ.

హిమగిరిధైర్యుఁడన్న విభుఁ డీశ్వరప్రెగ్గడమల్లనార్యు గౌ
రమకుఁ గుమారియై, రమకు నద్భుతసంపదసాటియై, మనో
రమకులయుగ్మహారమయి, ప్రౌఢి వహించిన కృష్ణమాంబ నె
య్యమున వరించి మించె శివుఁ డద్రిసుతన్ వరియించుకైవడిన్.

39


సీ.

సర్వసర్వంసహాదుర్వారతరభార
        నిర్వాహకభుజుండు పర్వతయ్య

నీలకంధరహిమనాళీకరిపుహార
        కైలాసనిభకీర్తి యైలమంత్రి
శ్రీచంద్రశేఖరవాచంయమేంద్రసే
        వాచారుతరబుద్ధి దేచమంత్రి
కుండలిమండలాఖండదోర్దండాసి
        మండాలహృతవైరి కొండశౌరి


గీ.

యనఁగ గల్గిరి సత్పుత్రు లన్ననార్యు
భార్య కృష్ణాంబకును నిత్యభాగ్యనిధికి
బ్రణతభూపాలకోటీరమణిమయూఖ
రాజినీరాజితాంఘ్రినిరేజు లగుచు.

40


క.

భూభాగజంభభేదను
నాభాగ దిలీపతుల్య నరవరమాన్య
శ్రీభరితు నూరపర్వతుఁ
బ్రాభవనిధిఁ బ్రస్తుతింతుఁ బటుతరఫణితిన్.

41


సీ.

నిటలలోచనజటాపటలాంతరమునకు
        భాగీరథీపయోభారధార
జంభభంజనపురీ కుంభివల్లభ కర్ణ
        సీమకు నభిరామచామరంబు
జలజాతభవవధూస్తనకుంభపాళికి
        ననవద్యతరహృద్యహారయష్టి
సంపూర్ణపూర్ణిమాచంద్రబింబమునకు
        విసృమరచంద్రికావిలసనంబు


గీ.

నగుచు జగముల విహరించు నహరహంబు
నిర్నిరోధవిహారమానితవిభూతి
హత్తి యూరయ్య సుప్రథానోత్తమ ప్ర
వృద్ధసుస్నిగ్ధనవయశోవిశదకాంతి.

42

ఉ.

యాచనకామరద్రుమ ముదగ్రతరాంతరరాతివిక్రియా
మోచనకారణం బ(ఖిలభూజనసంత)తసత్కృపాలస
ల్లోచనపద్మపత్రుఁ డతిలోకగుణాఢ్యుఁడునై వసుంధరన్
దేచనమంత్రి యొప్పు జగతీధరకార్ముకదత్తచిత్తుఁడై.

43


క.

ఖండపరశుపదసేవా
ఖండలనందనుఁడు కీర్తి గర్భీకృత ది
ఙ్మండలుఁ డూరన్నయవిభు
కొండన ధైర్యమునఁ బసిఁడి కొండన వెలయున్.

44


వ.

వారిలోన.

45


మ.

ప్రణుతప్రాభవుఁ డూరదేచవిభుఁ డభ్యర్చించు హస్తాగ్రసం
కణఝంకారము లంకురింప విరులన్, గంధంబునన్, బత్తిరిన్,
మణిహారంబులఁ, గాంచనాక్షతల శుంభద్వర్ణపంచాక్షరిన్
బ్రణవాత్మున్, బరమప్రకాశు గిరిజాప్రాణేశు నశ్రాంతమున్.

46


షష్ఠ్యంతములు

క.

ఏతాదృశకులమణికిని
మాతాపితృభక్తియుక్తి మహిమాఢ్యునకున్
కాతరజనసురశాఖికి
వాతాశనసార్వభౌమ వాగ్వైఖరికిన్.

47


క.

శ్రీకరనిజగుణ మాణి
క్యాకీర్ణపయోజసంభవాండ కరం డా
స్తోకాచ్ఛాదన సిత వ
స్త్రీకృత సత్కీర్తినిధికి ధీసన్నిధికిన్.

48


క.

 గీష్పతి నిభమతికిని వా
స్తోష్పతివిభవునకు నాత్మదోఃఖడ్గలతా

ర్చిష్పతి విపులజ్వాలా
నిష్పీడిత నిఖిలవిమత నృపసచివునకున్.

49


క.

అలఘుతర హరిద్దంతా
వళ కర్ణోద్భూతగంధవాహభర ప్ర
జ్వలితచటులప్రతాపా
నలునకు నసమాన(ధైర్య)నయధుర్యునకున్.

50


క.

శ్రీచంద్రశేఖరాహ్వయ
వాచంయమచంద్రపాద వనరుహసేవా
శ్రీచతురాత్మన కన్నయ
దేచామాత్యునకు సత్యధీనిత్యునకున్.

51


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యనర్పంబూనిన యీ మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

52


కథాప్రారంభము

ఉ.

గణ్యము దండకప్రముఖకాననకోటులయందు సర్వవై
గుణ్యనివారణక్షమ మకుంఠితవైభవశోభితంబు స
త్పుణ్యఫలాదికారణము భూనుతిపాత్రమునైన నైమిశా
రణ్యము (తేజరిల్లు) మునిరాజనికేతనభాసమానమై.

53


సీ.

అచలసుతాభర్త కర్పించి మఱి కాని
        మృగములు లేఁబూరి మేయ వచట
అసమలోచనునకు నర్పించి మఱి కాని
        యళులు క్రొవ్విరితేనె లాన వచట
అంధకధ్వంసికి నర్పించి మఱి కాని
        కోయిల లిగురాకుఁ గొఱుక వచట
అంగజారాతికి నర్పించి మఱి కాని
        చిలుకలు పండ్లు భుజింప వచట

గీ.

తక్కుఁగల జంతువులు శంభుఁ దలఁచి కాని
యుచితవర్తనములఁ గోరి యుండ వచట
వదనములు వేయుఁ గలయంత వానికైన
నా యరణ్యంబుఁ గొనియాడ నలవి యగునె.

54


మ.

హరిణంబున్ బులివెంచు సింగ మొగి సయ్యాటంబు లాడున్ గరిన్
బురినీడన్ ఫణిడింభజాలములు నిల్పుం గేకి చిట్టెల్కలం
గరుణన్ బిల్లులజాలముల్ పెనుచుఁ గాకంబుల్ నిశావేళ భీ
కరమూకంబులపొంతఁ గన్ను మొగుచున్ గాక్షించి తద్భూములన్.

55


గీ.

తబిసిమొత్తంబు రేపాడి తానమాడి
దిగ్గియలచేరువలను (బూదియలలందు)
కాలమునఁ బల్కును “ద్రియంబకం యజామ
హే” యటంచును జలపక్షు లెల్లయెడల.

56


ఉ.

సామగుణంబుఁ గొల్చుఁ బికశాబకపంక్తులు శైవధర్మముల్
ప్రేమ నుపన్యసించు శుకబృందము లీశ్వరయోగశాస్త్రముల్
కోమలరీతి శారికలు గూడి పఠించు వినోదలీలలన్
గామవిరోధిఁబాడు నధికంబుగ ముచ్చట భృంగపోతముల్.

57


ఉ.

పూచినక్రోవులుం దొరుఁగుపుప్పొడిఁ జెల్వగుమావులుం దగన్
గాచినమోవులున్ శుకనికాయసమప్రభమించు జూవులున్
వాచవియైనఁ బంచజనవాంఛలు తీర్చుననంట్ల ప్రోవులున్
జూచి ముదంబునన్ నిలువఁజూతురు తద్వనవీధి దేవతల్.

58


ఉ.

నాలుగువేదముల్ గడచనంగఁ బఠించి సమస్తశాస్త్రముల్
మూలము ముట్టఁగాఁ దెలిసి మోహముఖాహితులం జయించి సం
శీలితశైవధర్మగతిచేఁ దనరారుచు నద్భుతస్థితిన్
గాలము ద్రోచియుందురు రఖర్వతపోనిధు లవ్వనంబునన్.

59

క.

ద్వాదశవార్షికమగు క్రతు
వాదరమునఁ జేయుచున్న యమ్మౌనుల సం
పాదితపుణ్యఫలము దా
నై దైవికఘటన సూతుఁ డట కేతెంచెన్.

60


క.

ఏతెంచిన సూతుం గని
యా తాపసముఖ్యులెల్ల నతనికి వినయో
పేతమతి నుక్తవిధిచే
నాతిథ్యము చేసి రప్పు డధికప్రీతిన్.

61


సీ.

అంతట నర్హాసనాసీనుఁడైయున్న
        సూతు సద్వినయసమేతుఁ జూచి
యప్పుణ్యకుశలంబు నడి యాయన దమ్ము
        నడిగినఁ దమసేమ మర్థిఁ జెప్పి
యుచితభాషణముల నొక్కింతవడి కాల
        యాపనం బొనరించి యనఘచరిత!
యఖిలపురాణరహస్యంబు గరతలా
        మలకమై యుండు నీమదికి నెపుడు


గీ.

శైవధర్మసదాచారసరణి మిగుల
వినఁ బ్రియంబగుఁ జెప్పవే విశదఫణితి
ననుచుఁ దన్నట్లు ప్రార్థించి యడుగు శౌన
కాదిమౌనుల కిట్లను నతఁడు ప్రీతి.

62


చ.

అనఘవిచారులార! వినుఁ డాగమతత్త్వమునందు మీ యెఱుం
గనియది లేదు నన్నుఁ ద్రిజగన్వినుతోదయుఁ జేయఁగాఁ దలం
చినపని కాదె యే నొకటి చెప్పఁగ విందు మటంచు నిట్లు మీ
యునికి భవత్కృపాగరిమ నొందితిఁ జెందితి భాగ్యసంపదన్.

63

ఉ.

వాలుక లెన్నవచ్చు నుడువర్గము లెన్నఁగవచ్చు భూరజో
జాలము లెన్నవచ్చు నతిచంచలవార్ధివికీర్ణవీచికా
మాలిక లెన్నవచ్చు బుధమండలకర్ణపుటామృతంబు తా
బాలశశాంకశేఖరుని భవ్యచరిత్రము లెన్నవచ్చునే?

64


ఉ.

అంగదయోగసిద్ధికిఁ బ్రయాసముఁ బొందఁగ నేల సంశయా
బ్ధిం గడు ముంపుచున్న బహుభిన్నపథంబులఁ బోవనేల? భ
క్తిం గనఁజాల (కావృషభకేతను)ను బ్రస్తుతి సేయుచుండినన్
దంగెటిజున్ను గాదె హిమధామకిరీటుఁడు భక్తకోటికిన్.

65


ఉ.

ఆకులఁ గందమూలముల నంబుఫలంబులఁ గూరగాయలం
జేకొని ప్రాణరక్షణముఁ జేసి మహాటవిలోనఁ దీవ్రని
ష్ఠకలనన్ శరీరము గృశంబుగ నుండిన ముక్తి గల్గునే?
ప్రాకటమైన భక్తిఁ బురభంజనుఁ బూజ యొనర్పకుండినన్.

66


సీ.

మ్రొక్కు నెవ్వాఁ డష్టమూర్తికి నలవోక
        బలె నాతఁ డమరులప్రణతియందుఁ
జల్లు నెవ్వాఁడు ధూర్జటిమీఁదఁ బుడిసెడు
        జలము లాతఁడు సుధాజలధిఁ దేలు
నుతియించు నెవ్వాఁడు శితికంఠు నేకవా
        రం బాతఁ డల వచోరమణి నేలు
నిలుపు నెవ్వాఁ డీశు నిమిషమాత్రము మనం
        బున నాతఁ డామీఁది పొడవుఁ దెలియుఁ


గీ.

గాన మ్రొక్కఁగ నభిషిక్తుఁగా నొనర్ప
వినుతిసేయంగఁ దవిలి భావింప నెందుఁ
దగిన దేవాదిదేవుఁ డాతండు సూవె
భుక్తిముక్తు లపేక్షించు భక్తులకును.

67

ఉ.

వాసన లేనిపూవు, రసవర్ణనలేని కవిత్వరేఖ, య
భ్యాసము లేనివిద్య, జలజాప్తుఁడు లేనిదినంబు, చంద్రికో
ల్లాసము లేనిరాత్రి, కమలస్థితి లేనికొలంకు చూవె కై
లాసనివాసు నాత్మఁ దలంపని మూఢులజన్మ మారయన్.

68


గీ.

చూడఁదగదే వివేకించి సుజనులకును
జంద్రరేఖావతంసుని చరణయుగళి
యెంతచక్కనిదో? రమాకాంతుఁ డంత
వాఁడు నందును దన కన్ను వైచె మున్ను.

69


గీ.

శైవులగువారు చెప్పినజాడయందు
నడువనేరదు మూఢుల గడుసుబుద్ధి
వానపై వాన గురిసిన నానునొక్కొ?
సహజకాఠిన్య ముడిగి పాషాణకులము.

70


సీ.

శివపదాంభోరుహప్రవిమలోదకపాన
        సిద్ధి నాలుకవిఁ జెలఁగదేని
శంభుదాసాంగైకసంస్పర్శనంబున
        నెమ్మేను పులకల నిలుపదేని
త్రిపురదానవవైరి దివ్యలింగస్ఫూర్తి
        కన్నులారఁగఁ జూడఁ గలుగదేని
దర్పకధ్వంసియౌ దలనిడ్డ పూవుల
        తావిపై నాసిక దవులదేని


గీ.

కాలకంధరు సత్కథాకర్ణనంబు
కర్ణపుటవీధి నందంద కదియదేని
వాని జన్మంబు జన్మమే వాని బ్రతుకు
బ్రతుకె హరదూరుఁడగువాఁడు పశువు దెలియ.

71

క.

శివలింగదర్శనంబును
శివపూజావైభవంబు శివసద్గుణసం
శ్రవణంబును మానవులకు
భవనీరదపటలచటులపవమానంబుల్.

72


సీ.

ఏ వేల్పు పదముల కిందిరావల్లభు
        వలకన్ను పూజనావారిజాత?
మే వేల్పుకటిసీమ కిభదైత్యనాయకు
        బలితంపుఁ జర్మంబు పట్టుచేల?
మే వేల్పుతనువున కిక్షుబాణాసను
        గరువంపు నెమ్మేను కమ్మబూది?
యే వేల్పు కెంజాయ నేపారుజడలకు
        విధి కపాలశ్రేణి విరులదండ?


గీ.

యట్టి భువనాధినాథున కాదిదేవు
నకును మానసపుత్త్రుఁడై ప్రకటమహిమ
వెలయ నుద్భటగురుమూర్తి గలఁ డొకండు
సకలభవపాశలుంఠక చతురబుద్ధి.

73


గీ.

అతులదుర్మతకరటిపంచాననుండు
నిఖిలశైవాగమజ్ఞానసఖమనీషుఁ
డాశ్రితేప్సితదానదివ్యద్రుమంబు
నైన యుద్భటుచరిత నెయ్యమున వినుఁడు.

74


వ.

మహాత్ములారా! ఇది మీ యడిగినప్రశ్నంబునకు సదుత్తరంబై యుండు నీ చరిత్రంబు భవలతాలవిత్రంబు, నిశ్శ్రేయసక్షేత్రంబునునై వెలయునని యక్కథకుండు కథాకథనోన్ముఖుండై మహర్షుల కిట్లనియె.

75

చ.

విలసదుదారనాగకులవిశ్రుత మాశ్రితసర్వమంగళం
బలఘుగణేశ్వరంబు హరిదంబరసంకలితంబునున్ మహో
జ్జ్వలము మృగాంకశేఖరము సాంద్రసితద్యుతిభాసురంబునై
పొలుపు వహించు తారగిరి భూతపతిం దన భర్తఁ బోలుచున్.

76


ఉ.

వాలిన కన్నులున్ వలుదవట్రువచన్నులుఁ దీయమోవులున్
నీలపురంగులం దెగడ నేర్చినకొప్పులు నిండుచందురుం
బోలిన ముద్దుమోములును బుత్తడిబొమ్మల గెల్చు పూన్కికిం
జాలినమేనులున్ గలుగు సాధ్యసుమధ్యలు వొల్తు రగ్గిరిన్.

77


చ.

సమములుగాని పాదములజాడలు వామపదంబు చొప్పునం
దమరిన క్రొత్తలత్తుకలయంకములుంగల తన్నగేంద్రకూ
టములు ప్రియంబునం గని కడంక నుతింతురు సిద్ధదంపతుల్
ప్రమథవిభుండు శాంకరియుఁ బాయక యొక్కట నున్న చందముల్.

78


ఉ.

కిన్నరకామినుల్ పసిఁడికిన్నరలంది యభిన్నరీతులన్
దిన్ననిపాటఁ గూర్చి జగతీధరకార్ముకపాణిఁ బాడఁగా
మిన్నక యాలకింపుచు నమేయగతిం బులకించియున్న రే
ఖ న్నగమొప్పు వజ్రకలికాకలితాఖిలసానుభాగమై.

79


సీ.

చిగురుజొంపంబుల నిగుడిన కెంజాయ
        రుచిరజటాచ్ఛటారోచి గాఁగ
కలయంగఁ గప్పిన కమ్మపుప్పొడిదుమ్ము
        పొలుపొందు భసితంపుఁబూఁత గాఁగ
సోలుచుఁ బూఁదేనెఁ గ్రోలురోలంబ బా
        లిక లంచితాక్షమాలికలు గాఁగ
తఱచు కొమ్మలవెంటఁదగిలి ప్రాఁకిన నవ్య
        లత లహిభూషణతతులు గాఁగ

గీ.

ఇసుక చల్లిన రాలక పసరుడాలు
నాకు దళసరి హస్తిచర్మాంబరముగ
నలరి సాక్షాత్కరించిన హరునిఁ బోలి
పాదుకొనియుండు నక్కొండఁబాదపములు.

80


సీ.

వరయోగశక్తి శంకరు మనఃపద్మంబు
        పై జేర్చి మోదించు పాశుపతులు
హరసమారాధనాయత్తులై సందడి
        గా విహారము సల్పు దేవముఖ్యు
లఖిలదర్శనములయందు నిందుధరుండె
        పరతత్త్వమని చూచు పరమమునులు
నిటలలోచనుని తొల్లిటివిజయాంకంబు
        లమరఁబాడుచు నాడు ప్రమథవరులు


గీ.

పావడంబులు గెల్చి ప్రాభవము దాల్చి
భవునిసారూప్యమున నుండు భక్తజనులు
గలిగి జగదేకకల్యాణకరవిభూతి
లక్షణంబుల మించుఁ గైలాసశిఖరి.

81


చ.

గుహగణమాతృకావలులు కుంజరవక్త్రుఁడు భృంగియున్ మహా
మహిమయుతుండు నందియు సమంచితభక్తి సమృద్ధిఁ గొల్వ న
య్యహివలయుండు శంభుఁడు హిమాద్రిసుతారమణుండు తద్గిరిన్
రహి వహియించియుండు సురరాజముఖామరపూజితాంఘ్రియై.

82


క.

చిగురులఁ గ్రొవ్విరిగుత్తుల
నగజాధిపుఁ బూజసేయ నరుదెంచె ననన్
దగి యొక్కకాలమున నా
జగతీధరవనములన్ వసంతము దోఁచెన్.

83

సీ.

భవుఁ గొల్చువారల పాతకంబులరీతి
        రమణఁ గారాకులు రాలెఁ దరులఁ
బార్వతీపతిమీఁదఁ బ్రాజ్ఞుల కనురాగ
        మునుబోలె నిగురెత్తె భూరుహములు
నీశానభక్తులయిండ్ల సంపదలీలఁ
        గలయంగ ననుచుట గలిగెఁ జెట్ల
శశిమౌళిదాసుల సంకల్పములభంగి
        ఫలియించె నందంద పాదపములు


గీ.

సకలపాదపవికసితస్వచ్ఛగుచ్ఛ
సాంద్రమకరందరససమాస్వాద ముదిత
మత్తమధుకర జేగీయమాన మగుచు
మించి మధుమాస మావిర్భవించె నపుడు.

84


క.

కుసుమితరక్తాశోక
ప్రసక్తిచేఁ బొలుపు మిగులు బంభరగణముల్
కుసుమాయుధ [ప్రేమసరా?]
గ్ని సముద్ధితధూమవితతికిని బోలికయై.

85


గీ.

బాలచంద్రకళాకలాపమునఁ బొల్చి
గమియఁ గరితోలు నెమ్మేనఁ గప్పుకొన్న
హరుని నడకించె మొగ్గల నతిశయిల్లి
నీలరుచి మీఱు మునిధారుణీరుహములు.

86


క.

కురివిందకమ్మఁదీగెలు
నరవిందము ననఁగి పెనఁగ సహకారంబుల్
గిరివరతనయాలింగిత
హరమూర్తిం దలఁపఁజేసె నామనివేళన్.

87

వ.

ఇవ్విధంబునఁ జిగురులకుం జిగియును, గ్రొన్ననలకుం జెన్నును, విరులకు మురిపెమ్మును, బిందెలకు నందమ్మును, గాయలకు సోయగంబును, దోరలకు గౌరవంబును, బండులకు మెండును గలిగించి పలాయితహేమంతంబుగ వసంతం బయ్యె నయ్యెడ.

88


ఉ.

చల్లనిగాడ్పులన్ సొబగు చల్లెడు వెన్నెలఁబువ్వుఁదావులన్
బల్లవవిభ్రమస్ఫురణఁ బ్రౌఢపికాళిశుకాలిపల్కులన్
బల్లిదుఁడైన యట్టిగణభర్త భవానియుఁ దాను వేడ్క వ
ర్ధిల్లఁగ నెల్లచోట విహరింపఁగ నొప్పె సఖీపరీతుఁడై.

89


సీ.

కలకంఠకులకుహూకారాంతరములైన
        మావిమోకలజాడ మరలి మరలి
సొలయునెత్తావులు చోడుముట్టెడు పువ్వుఁ
        బొదరిండ్లనెలవులఁ బొదలి పొదలి
అలిబాలికామనోహరఝంక్రియలఁ బొల్చు
        దీర్ఘికాతటములఁ దిరిగి తిరిగి
మకరందపంకిలమంజుమార్గంబుల
        నీడల నీడల కేఁగి యేఁగి


గీ.

చంద్రికాధౌతనిర్మలచంద్రకాంత
నిచితనవపుష్పశయ్యల నిలిచి నిలిచి
కలికిబాగునఁ బొదలలోఁ గలసి తిరిగి
రటుల దంపతు లా వనాభ్యంతరమున.

90


క.

విరులం బుప్పొడి రేఁపుచుఁ
దరఁగలు గదలించి కొలఁకు తండంబులలోఁ
దిరుగు మందసమీరణ
మరయుచు మురిపెమునఁ దిరిగె నభవునిమీఁదన్.

91

సీ.

కమలకర్ణికలు బంగారంపుదుద్దుల
        మురువు సూపఁగఁ గర్ణముల ఘటించి
పొగడఁ జోటగుకమ్మ పొగడపూవులచీరఁ
        గమనీముగఁ గూర్చి కటి నమర్చి
సింధువారశ్రేణి సీమంతవీథికి
        సొబగుముత్యాలచేర్చుక్కఁ జేసి
పొలుపొందు పూఁదేనెఁ బోసి మేదించిన
        పొన్నక్రొవ్విరులపుప్పొడి యలంది


గీ.

కలయ నవకంపు మెఱుఁగులు దొలుకరించు
చంపకావలి పతకంబుసరణిఁ జూపి
శంకరుఁడు పార్వతికి నిట్లు సలిపి వేడ్క
శంబరారాతి మదిలోనిశంక యుడిపె.

92


ఉ.

అల్లన మావికొమ్మచిగురాకు నిజాంచితచంచుధారచేఁ
జిల్లులు వుచ్చి తద్రసవిశేషము నాలుక సోఁకఁ జొక్కుచున్
ద్రుళ్ళుపికంబుఁ జూడిమని ధూర్జటి చూపినఁ జూచి పార్వతీ
హల్లకగంధి వంచె వదనాబ్జము కన్నుల నవ్వు దేరఁగాన్.

93


సీ.

తరుణశశాంకశేఖరమరాళమునకు
        సారగంభీరకాసార మగుచు
కైలాసగిరినాథకలకంఠభర్తకుఁ
        గొమరారు లేమావికొమ్మ యగుచు
సురలోకవాహినీధరషట్పదమునకుఁ
        బ్రాతరుద్బుద్ధకంజాత మగుచు
రాజరాజప్రియరాజకీరమునకు
        మానితపంజరస్థాన మగుచు


గీ.

నురగవల్లభహీరమయూరమునకుఁ
జెన్నుమీఱిన భూధరశిఖర మగుచు

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి
యద్రినందన వొల్చె విహారవేళ.

94


క.

అలకాంతకలికముఖి యగు
కులకాంతయుఁ దానుఁ గూడి గోపతిగమనుం
దలకాంత కలధౌతా
చలకాంతస్థలులఁ గ్రీడ సలుపుచునుండెన్.

95


వ.

ఇట్లు సాక్షాత్కరించిన పంచశరసామ్రాజ్యలక్ష్మియుంబోలెఁ బ్రేక్షణీయ యగు దాక్షాయణిం గూడి క్రీడాపరాయణుండై నారాయణసఖుం డఖండితానందకందళితహృదయారవిందుండై యుండు నవసరంబున.

96


సీ.

తేటవెన్నెలమించుఁ దెఱచిరా జనిపించు
        నకలంకహారవల్లికలతోడ
ఠేవఁ గాంతుల పెల్లుగా వసంతము చల్లు
        కటకాంగదకిరీటములతోడ
తివుట నెత్తావుల దిక్కగుఠావుల
        నలమి వాసించు మాల్యములతోడ
ప్రకటితంబుగ జూపులకు విస్మయముఁ జూపు
        రమణీయచిత్రవస్త్రములతోడ


గీ.

ప్రమదసల్లాపకోలాహలముతోడఁ
గాంతులొలుకంగఁ దొడసిరాఁ జెంత రాలు
పుప్పొడులతోడ గంధర్వముఖ్యు లటకు
నురువిమానంబు లెక్కి వచ్చిరి ప్రియమున.

97


ఉ.

పొచ్చెము గాని నేమమునఁ బోఁడిమికిం దము మెచ్చి ధాత ము
న్నిచ్చిన తద్వస్ఫురణ నెచ్చటఁ గొంకొక యింతలేక క
న్నిచ్చకు వచ్చినట్టుల చరించెడువారలు గాన వారు వా
రచ్చటఁ గేలికై నిలిచి రాత్మవిమానము లోలి డిగ్గుచున్.

98

క.

ఇది రజతాచల మిందున్
మదనారి వసించు విబుధమానితమని నె
మ్మదిఁ దలఁపక గంధర్వులు
తదద్రిపై విడిసి రధికదర్పం బెసఁగన్.

99


క.

గంధర్వులు మోహనమృదు
గాంధర్వము గలుగు పుష్పగంధులతో గ
ర్వాంధత నీప్సితమతి కలి
బంధరులై తన్నగేంద్రపాదస్థలులన్.

100


సీ.

కాంచీకలాపంబు కటిమండలముమీఁద
        నొక్కింత సడలినఁ జక్క నిలిపి
వలుదపాలిండ్లక్రేవల జాఱి వెలిగొన్న
        యాణిముత్తెములపే రనువుపఱిచి
కలికిచెక్కులమీఁదఁ దొలకరించిన ఘర్మ
        జలకణంబులఁ గాంతు లొలుకఁదుడిచి
రాలుపుప్పొడిధూసరములైన చూర్ణాల
        కంబులు కొనగోళ్ళఁ గలయ దువ్వి


గీ.

అతులపుష్పాపచయఘనాయాస ముడుగ
నంకపీఠిక శాంకరి నావరించు
త్రిపురమర్దనుపుష్పమంటపసమీప
వసుధ నిలిచిరి గంధర్వవర్యు లంత.

101


చ.

చిలుకలకొల్కులైన సరసీరుహనేత్రలఁ గూడి వేడుకన్
గొలకొలమంచుఁ దత్ఖచరకోటులు వ్రాలుడు నందికేశ్వరుం
డలికవిలోచనానుచరుఁ డద్భుతమై దివి నిండఁ బర్వు త
త్కలకల మోర్వఁజాలక యఖండితరోషకషాయితాక్షుఁడై.

102

ఉ.

భీకరరేఖతోఁ బసిఁడిబెత్తముఁ ద్రిప్పుచు ఘర్మబిందు జా
లాకరమౌ మొగంబు తరుణారుణతేజము లీనఁ గన్ను లు
ల్కాకళలన్ జ్వలింపఁ దమకంబున శంకరుపువ్వుటింటి య
వ్వాకిట నిల్చి యిట్లనియె వారలతోఁ ద్వరమాణవాణియై.

103


క.

చీకులరె మీర? లీశుఁడు
లోకేశ్వరుఁ డీవనం(బులో నీశ్వరితో)
నేకాంతంబున నుండఁగ
నీ కాంతలు మీరు వచ్చు టిది తగ వగునే?

104


క.

అని తము నిరసించిన నం
దినిఁ జీరికిఁగొనక వారు దిగ్గన మౌర్ఖ్యం
బునఁ బువ్వుఁజప్పరము డా
సిన నవ్విధ మా(త్మ నెఱిఁగి శివుఁడు కుపితుఁడై).

105


గీ.

పులుఁగరంబునఁ బూని మీరలు పిశాచ
రూపమున నుండుఁడని వైవ రూపరేఖ
దప్పి వికటాంగులైరి గంధర్వనాథు
లెంతవారికిఁ దప్పునే యీశ్వరాజ్ఞ?

106


క.

ఆ యందము లా చందము
లా య(ద్భుతరూపరే)ఖ లా మంజుసుధా
ప్రాయోక్తులు మిడివోయెను
గాయజహరు కినుకకతన గంధర్వులకున్.

107


క.

కొఱకును బోవం బడి క
ల్లుఱక పయిం బడినకరణి నొకపనికై రా
నుఱుమని పిడుగై వారి(కిఁ
గఱకంఠునిచేత) నీచగతి వాటిల్లెన్.

108

గీ.

చంప నలిగియు నొక్కింత చలము మాని
విషమనయనుండు పులి నాకి విడిచినట్లు
చావుతోడుత జోడైన చటులఘోర
కష్టరూపంబు వారికిఁ (గలుగఁ జే)య.

109


సీ.

ఎఱసంజ కెంజాయ నెక్కసక్కెంబాడు
        చికిచికిపల్లవెండ్రుకలవారు
గమకంబులగు గ్రచ్చకాయలఁ దలపించు
        క్రూరంబులగు మిట్టగ్రుడ్లవారు
ముడిబొమ్మలును బెద్దమిడిగ్రుడ్లు వెడఁ గోర
        దౌడలు గల్గు వక్త్రములవారు
పెనుబీరనరములు పెనఁగి పైఁ బ్రాకుటఁ
        గనుపట్టుపొట్ట పొంకములవారు


గీ.

కుఱుచలగు హస్తపాదముల్ గుదియఁబొడిచి
నట్లు బలసినమెడలతో నరయ నూచ
లైన యూరులతో వికటాంగు లైన
వారు నై రిట్లు గంధర్వవరులు పెలుచ.

110


చ.

పెదవుల నెత్తు రుండియును బేడులువారు బరళ్ళమేనులన్
గదిశి పిశంగరోమములు గ్రమ్ముకొనన్ నిశితోగ్రదంష్ట్రలన్
జెదరినవిస్ఫులింగములు చిందఱవందఱ గాఁగ రూపముల్
మదనవిరోధిశాపమున మార్పడియెన్ ఖచరేంద్రపంక్తికిన్.

111


మ.

చటులోదగ్రతరాట్టహాసములుఁ గేశచ్ఛన్నఘోరాస్యముల్
కుటిలక్రూరవిలోచనంబులు మెఱుంగుల్ గ్రాయుఫూత్కారముల్
పటుభీమోద్భటదంతపీడనము లస్పష్టాంగసంధుల్ మహా
ఘటపీనోన్నతకుక్షిభస్త్రికలు వేగం దాల్చి రాఖేచరుల్.

112

వ.

మఱియు భల్లూకవల్లభుల నుల్లసంబాడెడు నల్లజుంజుఱుమేనులును, దప్తారకూటచ్ఛాయాదాయాదంబు లగుపిశంగాంగంబులును, మంకెనక్రొవ్విరులబింకంబు హుంకరించు కెంపు సంపాదించు పొడవుగల యెడళ్ళును గలిగి కిలకలభాషణంబులుం, గహళహాట్టహాసంబులును, థళధళద్దంష్ట్రాంకురంబులును, ధగధ్ధగత్ప్రేక్షణంబులుం గనుపట్ట నెక్కడ యసృక్పానం బెక్కడ మాంసభక్షణం బెక్కడ మేదోలేపనం బెక్కడ కపాలధారణం బనుచుఁ గోరిక లీరిక లెత్తఁ జిత్తంబులు మత్తిల్లి సందడింపుచుఁ గ్రందుకొను పిశాచబృందంబులఁ జూచి డెందంబునం గొందలం బంది తదధినాథుం డగు చిత్రరథుండు.

118


సీ.

కలికినీలపురంగుఁ దులకించుకచములు
        నల్ల వెండ్రుక లైన బ్రమసి బ్రమసి
నిండుజవ్వనముచే గండుమీఱినమేను
        వికలభావం బైన వెఱచి వెఱచి
కమనీయమణిహారకటకకంఠిక లెల్ల
        నాంత్రబంధము లైన నలికి యలికి
యెలదిక్కులఁ దావి చల్లుగందపుఁబూత
        మెదడుచందం బైన బెదరి బెదరి


గీ.

కటిపటము పచ్చితో లైనఁ గలఁగి కలఁగి
యవ్విధం బెల్ల హరుచేఁత యగుట దెలిసి
భభవునకు మ్రొక్కి లేచి యిట్లనియె భక్తి
భయము లొనగూడ నూపిరి పట్టి యపుడు.

114


ఉ.

ఓపరమప్రభావ! పురుహూతముఖామరవంద్య! మేము నీ
పాపలవంటివారము; కృపాపరతంత్రత దక్కి యక్కటా
మావయి ని ట్లనుగ్రహము మానుటయే మఱి యింతమాత్రలోఁ
గోపము మానుమయ్య! యిఁక గోపతికేతన! దైత్యశాసనా!

115

సీ.

తలఁపవైతివె కాలఁ దాఁచి పై నుమిసిన
        యెఱుకమాలినయట్టి యెఱుకువాని
ధృతిఁ జిత్తమున మానితివె ఱాలుగొని ఱువ్వు
        సాంఖ్యతొండఁడు సేయుసాహసంబు
చింతింపవైతివె చేవ వింటను బెట్టు
        గొన్న కుంతీదేవి కొడుకుఁగుఱ్ఱ
ఊహింపవైతివె యుగ్రధాటీచల
        చ్చేరమక్షితిపతి చేతిగాసి


గీ.

అకట నీబంటుబంటుల మైనమమ్ము
నొక్కతప్పును సైరింప కుఱక ఘోర
శాపదావానలంబున సగముచావు
చంపితివి చాలు నిఁక బ్రోవు చంద్రజూట.

116


చ.

నెఱయఁగ లోకపూజ్యుఁ డగు నీచెలికానిఁ గుబేరుఁ గొల్చి మే
ముఱక వికారభావమున నొందుట నీకుఁ గొఱంత గాన యి
ట్లెఱుఁగక మందెమేలమున నే మొనరించినతప్పు గాచి యం
దఱఁ గరుణారసాబ్ధిఁ బరితాపము మానఁగఁ దేల్చు శంకరా.

117


గీ.

మృత్యుదేవత యోర్వదు మిహిరతనయుఁ
డోర్వఁ డిభదైత్యనాయకుఁ డోర్వఁ డెందుఁ
ద్రిపురదానపు లోర్వరు తీవ్ర మయిన
నీదుకినుకకు నే మెంత నీలకంఠ!

118


క.

కలుషించి తేల తృణక
ల్పుల మగుమామీఁదఁ గరుణ వోవాడి! కటా!
బలుదెగఁ గొని బ్రహ్మాస్త్రం
బిలఁ బిచ్చుకమీదఁ బూని యేయఁగఁ దగునే?

119

వ.

అని యనేకప్రకారంబుల సకరుణంబుగాఁ బ్రార్థింపుచుఁ బ్రణతుండైన గంధర్వాధ్యక్షుమీఁదం గృపాకటాక్షవీక్షణామృతంబు వొలయ దాక్షాయణీవల్లభుం డిట్లనియె.

120


క.

ఓహో వగ యుడుగుఁడు మీ
సాహసమున నింతపుట్టె శాపావధి కే
మూహించి తెరువుఁ జెప్పెద
మీహైన్యముఁ గొంత యోర్వుఁడీ ధైర్యమునన్.

121


సీ.

అనిన నార్యావర్త మనుదేశమున లోక
        మానిత వైభవస్థాన మగుచు
నమరు రెండవ కాశియై వల్లకీనామ
        మునఁ గల్లి యొకమహాపురము దాని
రుద్రభూమిఁ జేర్వ రుద్దార్కశశిమండ
        లం బగు నొక్కవటంబు వొల్చు
నావృక్షమున నీవు సానుచరుండవై
        ధృతి నుండు మొకనూఱు దివ్యసమలు


గీ.

అంత హాయనములు కొన్ని యరుగుపిదప
రాజకులరత్నమై ముంజభోజుఁ డనఁగ
రాజు జనియించు నుద్భటారాధ్యుశిష్యుఁ
డై మదంశంబు గొని యందు నతులమహిమ.

122


క.

నాయంశంబునఁ గలిగెడి
యాయవనీపతికిఁ గూర్మి నాచార్యకమున్
జేయు న్మన్మానససుతుఁ
డై యుద్భటగురువ రేణ్యుఁ డధికప్రీతిన్.

123


ఉ.

ఆగురుమూర్తి కాలగతి నందుడుఁ దత్తనుధూమయుక్తిచే
వేగ భవన్మహావికృతవేషము లన్నియు మాని పూర్వరే

ఖాగరిమంబుఁ దాల్చుటయ కాదు మదీయగణాధినాథతా
యోగము గల్గి నాకడన యుండెద రేఁగుఁడు భూతధాత్రికిన్.

124


సీ.

శివలింగధారణాంచితమూర్తు లగువార
        లష్టాంగయోగజ్ఞు లైనవారు
లరసి న న్నఖిలంబునందుఁ గన్గొనువార
        లాప్తపంచాక్షరు లైనవార
లెడసిన మద్ధర్మ మీడేర్చి మనువార
        లంతర్విరోధుల నడంచువారు
లను తాపత్రయం బార్పఁజాలినవార
        లేన దైవం బని యెఱుఁగువార


గీ.

లర్హవర్తనములఁ గూడి యలరువార
లెవ్వ రిల నుండుదురు వార లెల్ల మీకు
దుర్లభులు గాన వారల త్రోవఁ బోకుఁ
డన్యజనములం కారింపుఁ డరుగుఁ డీరు.

125


క.

శవశోణితపానాదిక
మవు కుత్సితభోగమెల్ల నతులసుధాపా
నవిశేషమునకు నవతుగ
భువి మత్కృపచేతఁ గలుగుఁ బొండిఁక వేగన్.

126


వ.

"ప్రారబ్ధ కర్మాణాం భోగా దేవక్షయ" యనువాక్యం బనుభవింపక తెగదు కావున నిందునకుం గొందలం బందవలవదు. కాలక్షేపంబు సేయక మదుపదిష్టంబగు మార్గంబున శాపావధిం గాంచి మదీయసాలోక్యంబున నుండెదరు. పొం డని కుండలి మండలేశ్వర కుండలుండు కొండరాచూలితో నంతర్ధానంబు నొందెఁ. బిశాచబృందంబులు నమ్మహాదేవు నాదరంబునం గొంత సంతాపంబు వాసెఁ దదనంతరంబ.

127

మ.

భవకోపోద్దత శాపఘోరవదనభ్రాంతంబులై ఖేచర
ప్రవరాంభోధరబృందముల్ కహకహప్రస్ఫీతగర్జామహా
రవముల్ దిక్కులఁ బిక్కటిల్ల నటఁ జేరన్వచ్చెఁ గాత్యాయనీ
ధవనిర్దిష్టవటావనీరుహనగోత్తాలాగ్రవాసార్థమై.

128


మత్త.

ఆవనస్పతియాకుఁ దండమునందు నూడలు మొత్తమై
జీవురంచు నభోగ్రవీధులఁ జిమ్మచీఁకటిఁ గప్పుడున్
ద్రోవగానక తత్తఱింపుచుఁ దోయజాప్తతురంగముల్
పోవు నవ్వలఁ ద్రోచి యంకియఁ బూని సూతుఁ డదల్చినన్.

189


క.

ఆయుగము బహుళతరశా
ఖాయతచాలనము కలిమి నవని భరింపన్
జేయోడు దిశాకరులకుఁ
జే యిచ్చువిధంబుఁ దోఁపఁ జెలువు వహించున్.

130


గీ.

ఇట్లు దిశ లెల్లఁ దానయై యెసక మెసఁగు
నమ్మహీరుహవరము డాయంగ వచ్చెఁ
దీఁగెతెంపుగ రజతాద్రి దిక్కునందు
నుండి ఖేచరమిథునంబు లొక్కమొగిని.

131


క.

తొల్లిటి పుణ్యానుభవము
చెలిన దివినుండి మహికి జిరజిరమనుచున్
దెళ్ళెడి పురుషుల కైవడి
నుల్లాసం బేది శాఖి కొరగిరి ఖచరుల్.

132


సీ.

రా రక్తలోచన! రమ్ము ఘంటాకర్ణ!
        రా వ్యాఘ్రనఖ! యిందు రమ్ము వికట!
రా సరీసృవరోమ! రా స్థూలనాసిక!
        రమ్ము కుంభశిరస్క! రా వృకాస్య!

రమ్ము విద్ద్యుజ్జిహ్వ! రమ్మాంత్రమేఖల!
        రా మహోదర! వేగ రా మృతాసి!
రా వజ్రదంష్ట్ర రా! రా విస్ఫులింగాక్ష!
        రా బాలఘాతుక! రా విరూప!


గీ.

రమ్ము కుంభాండ! రమ్ము నిర్ఘాతఘోష!
రమ్ము సుప్తఘ్న! రమ్ము కర్కశ శిరోజ!
యనుచు బహువిధనామంబు లమర నిలిచి
రావటంబున ఖేచరు లావటముగ.

133


మ.

అలకాచైత్రరథాంతికస్థితమణివ్యాకీర్ణకేలీనగం
బులపైఁ బూవులచప్పరంబులకడన్ బుప్పొళ్ళతో నైనవే
దులఁ గూర్చుండి మిటారికత్తె లగునింతు ల్వాడ మోదించువా
రలగా యీదురవస్థ? దైవగతి దీర్పన్ శక్యమే యేరికిన్?

134


సీ.

వాసవద్రుమమున పడసిససురఁ గ్రోలు
        కడఁక నెత్తురు లానుకతన మఱచి
పరఁగుసాంబ్రాణిధూపంబు వాసన మెచ్చు
        టలు శవధూమంబు వొలయు మఱచి
హరిచందనముఁ జాల నలంది ఠేవఁ జరించు
        పోడిమి మొదడు పైఁ బూసి మఱచి
వీణానినాదంబు వీనుల నాలించు
        పని భూత కహకహధ్వనుల మఱచి


గీ.

హరసఖోవననాశోకతరులమురువుఁ
జూడగోరుట చితివహ్నిఁ జూచి మఱచి
వాలువర్గము గాఁగ నవ్వటముఁ జేరి
ఖచరు లొకకొన్నిసమములు గడపి రందు.

135

మ.

పడఁతుల్ దారు నదృశ్యులై నడికిరే ల్వా[2]రాడి గంధర్వు లె
క్కడ రుద్రాక్షయు భూతియుం దొఱఁగుమూర్ఖవ్రాతముల్ గల్గున
క్కడికిం బోయి తదీయబాలకుల జోక న్వారు వేపోయి పె
న్బడుముల్ గైకొని తృప్తిఁ జెందుదురు దౌర్భాగ్యంబె యోగ్యంబుగన్.

136


సీ.

తలలపైఁ బచ్చపూసలు కండతిండియు
        భీషణదగ్ధాస్థిభూషణములు
శూలాగ్రనరకంఠశోణితాస్వాదంబు
        బిలసంస్థశిశుశిరఃపలలసేవ
నవ్యకంకాళదండములు చేపట్టుట
        యురక నల్లడఁ జిచ్చు లుమియుటయును
బలితంవుఁ బ్రేవుల మొలనూలి చేఁతయుఁ
        గిలకలయును బొబ్బనులివుఠవణి


గీ.

కొరవిమసిబొట్టు పురి యలకోఱలందు
నింగలం బిడి రాజించు టెఱ్ఱగుడ్లు
మిడుఁగుఱులు గ్రమ్మఁ ద్రిప్పుచుఁ బుడమి మింట
బ్రమరివాఱుటయును బిశాచముల కొదవె.

137


గీ.

చిత్రసౌభాగ్యశాలియై చిత్రరథ స
మాఖ్య నలకాపురములోన సౌఖ్యలబ్ధిఁ
దనరు గంధర్వపతి వజ్రదంష్ట్రుఁ డనఁగ
వటముపై నుండె భూతభావము భజించి.

138


క.

ఆ మఱ్ఱియ యలకావురి
గా మది నూహించి ఖచరగణము లొగి నిజ
స్వామి యగు వజ్రదంష్ట్రుఁడు
దామును వర్తించు నివ్విధమున శివాజ్ఞన్.

139

క.

చెల్లుబడి వజ్రదంష్ట్రుఁడు
ప్రల్లదమున సకలభూతబలముల కెల్లన్
వల్లభుఁడై తన కిల్లా
కెల్లగఁ జెల్లింపుచుండె హేలాగతులన్.

140


గీ.

ఓలి నెనిమిదిదిశల కొక్కొక్కదిశకు
నలువురును నల్వురును గాఁగ నలఘుబలుల
దలవరుల ముప్పదిరువుర నెలవు కొలిపి
ధరఁ బిశాచాధిపత్య మాతఁడు వహించె.

141


శా.

త్రాట న్నీట విషంబునన్ శిఖి నిజప్రాణంబులన్ బాసి వ
మ్మౌటన్ ఘోరపిశాచరూపమున హైన్యంబొందు తన్మర్త్యసం
ఘాటం[3]బందునఁ గొల్వుపట్టుటకునై కైకొల్వునానాదిశా
[4]పాటివ్యాప్తనిజాజ్ఞుఁడై చెడనిఠేవన్ వజ్రదంష్ట్రుం డొగిన్.

142


వ.

మఱియు నతం డాతపతాపంబున జీవితంబు వోవిడిచియు, నిర్ఘాతఘాతంబున మృతి వడసియు, సింహశార్దూలకుంభీనసవృశ్చికాదులచేత నీలిగియు, జిహ్వోత్పాటనంబు సేసియు, సానువులం దేనియుఁ బ్రాణంబు లుజ్జగించియుఁ, గాంతానిమిత్తంబున నంతంబుఁ గనియును, నిరశనత్వంబున బంచత్వంబు నొందియు, శూలంబునం గూలి కాలవశతఁ బొందియు, వెండియు నానావిధదుర్మరణంబులను దుష్కర్మంబులను బట్టువడియు, పుట్టగతి లేక భూతప్రేతపిశాచరూపంబులం జాపలంబునం గ్రుమ్మరు నమ్మనుజులం గలపికొని వర్తించి వర్తించి.

143


చ.

కొలిచిన యప్పిశాచములఁ గూరిమి నిట్లను వజ్రదంష్ట్రుఁ డీ
రలు భయ మింక మానుఁడు ధరాస్థలిఁ బుట్టగలండు భూరిని

ర్మలయశుఁ డుర్భటుండు గురుమండల కుండల కుండలుండుఁ ద
న్మలహరమూర్తి కారణమునన్ గతి మీకును మాకుఁ గల్లెడిన్.

144


క.

[అని పలికి వజ్రదంష్ట్రుఁడు
మనమున నెలకొన్న భీతి మలుగఁగ నోదా
ర్చెను మఱ్ఱినీడ నాశా
జనకవచనరచన నాపిశాచగణములన్.]

(144-ఏ)


సీ.

వెఱవనివారల వెఱపించి పనిగొని
        కొలిచినవారిపైఁ గూర్మి చూపి
శివచిహ్నదూరుల చిత్తంబు లగలించి
        కలహించువారిసీమలు హరించి
యధినాథునాజ్ఞ దిగంతరంబుల నించి
        తగులునంతర్విరోధంబు లుడిపి
తరతమభావంబు లరసి జీవిత మిచ్చి
        నిజమండలము పెంచు నేర్చుఁ గాంచి


ఆ.

దానభేదసామదండంబు లనఁ గల్గు
చతురుపాయవిధులజాడఁ దెలిసి
సరిపిశాచలోకసామ్రాజ్య మొదవించి
వజ్రదంష్ట్రు మంత్రి వజ్రముఖుఁడు.

145


సీ.

కొలువుండు నొకవేళఁ గుణవశీర్షోపల
        కీలితోన్నతకేలి శైలశిఖల
విహరించు నొకవేళఁ గహకహధ్వనులతో
        దడము లొక్కటఁ గొల్వ నడికిరేల
వినుఁ బ్రేమ నొకవేళ వీనుల కింపైన
        కూశ్మాండగాయకకులముపాట

దండెత్తు నొకవేళ దర్పితబేతాళ
        మండలంబులమీఁదఁ జండదాడిఁ


గీ.

బనుచు నొకవేళఁ బనువులు తనకుఁ దిరుగఁ
బడిన వారలసంపద నొడిచికొనఁగ
భూనభోంతరసంచరద్భూతలోక
దండనోదగ్రుఁడగు వజ్రదంష్ట్రుఁ డెలమి.

146


గీ.

సకలభూతాధినాథుఁడై జగతిమించు
విజయమునఁ గ్రాలు తద్భూతవిభునిఁ జేరి
బ్రహ్మరాక్షసు లత్యంతభయముతోడ
రమణ దీవింతు రార్ద్రాక్షతములు చల్లి.

147


క.

ఈ చందంబున ఖచరపి
శాచనిశాచరము లిష్టసంచారములన్
నీచగతి బైకొను వసు
ధాచక్రమునందుఁ గలయఁ దత్కాలమునన్.

148


సీ.

శ్రీకంధరాచలోర్జితసముజ్జ్యలకూట
        సంకాశవిధుకాంత సౌధకులము
శాతమన్యవశిలాశకలదామజధామ
        కల్పిత[5]కారండకారభరము
చంద్రశాలాశరచ్చంద్రబింబాననా
        తారహారీభవత్తారకంబు
వితతగవాక్షనిగతనవాగరుధూప
        సౌరభవాసితాశాముఖంబు


గీ.

విమలపరిఘాజలాంతరవికచకుముద
కమలకల్హారకింజల్కకలిత లలిత

గంధవహధూతరతిఖేదకాముకంబు
గోపురోపమ మగువల్లకీపురంబు.

149


సీ.

శ్రీసములాసంబు చెలఁగు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము
సంతతార్యాసక్తి సాగు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము
వృషలాలనఖ్యాతి వెలయు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము
రాజ[6]భూషణకేళి ప్రబలు నాయందును
        దనయందె కల దనఁ దగదు సుమ్ము


గీ.

తానెఁ సేనానిగలవాఁడు గాని యేను
గా ననఁగఁబోల దమితసేనాని యేను
ననుచు నప్పురి హరుపై నహంకరించు
హర్మ్యకేతనకింకిణికారవముల.

150


మ.

వలదింద్రోపలఖండదీధితులఠేవల్ కంఠహాలాహలం
బులు సున్నంబులు భూతివెల్లపడగల్ మూర్ధస్థితస్వర్ధునీ
జలపూరంబులు లోనఁ గ్రుమ్మరుసతుల్ సాఁబాలు మైఁగొన్న యా
యలరుంబోఁడులయొప్పునై తగుఁ బురిన్ హర్మ్యేశ్వరశ్రేణికిన్.

151


ఉ.

కేతువు నీట ముంచి తమకించి ధనుర్లత మళ్ళఁబెట్టి వి
ఖ్యాతబలంబుఁ జెట్టులను గట్టి గుణంబునఁ గల్గుపక్షముల్
వే[7]తెరలించి యంపగమి వేడుకమూలకుఁ ద్రోచి యమ్మనో
జాతుఁడు తత్పురిం గలుగు శైవులపైఁ జన లోఁగు నెంతయున్.

152


గీ.

అతిమనోహర గుణవిశాలాక్షి యగుచు
నిత్యశివసంవిధానసంస్తుత్య యగుచు

సమరవాహినిగలదియు నై తలంప
నమ్మహాపురి శ్రీకాశి యనఁగ వెలయు.

153


సీ.

కడఁగి దీవించి యక్షతలు పైఁ జల్లి వ
        ట్టిన మ్రాకు లిగురుపట్టింతు రనఁగఁ
బ్రతిఘటించిన బ్రహ్మపట్టంబుఁ దిగఁద్రోచి
        యొకపూరిపై సృష్టి యునుతు రనఁగఁ
బ్రౌఢవాదక్రీడ ఫణిలోకపతినైనఁ
        బొ[8]త్తిఁ గన్నులు గప్పివుత్తు రనఁగఁ
ద్రినయనుఁడే దైవ మని రహస్యస్థితి
        నిగమంబులకుఁ దెల్ప నేర్తు రనఁగ


గీ.

సభల వాక్సిద్ధి బ్రహ్మవర్చససమృద్ధి
శబ్దపరిశుద్ధి శివదత్తశాంతబుద్ధి
తార తముఁ బోలఁదగుఁ గాక తత్పురంబు
బ్రాహ్మణులఁ బోల వ్యాససంభవునివశమె.

154


ఉ.

ఆడినమాట బొంకని మహామహు లర్థికి సంగరార్థికిన్
మాడలు వేల్పువీటఁ గలమాడుగులుం గనిపించు నేర్పరుల్
క్రోడపకచ్ఛపేంద్రకులగోత్రవిభుల్ జయవెట్ట ధారుణిన్
గ్రీడలపోలెఁ దాల్చు కృతకృత్యులు రాజకుమారు లప్పురిన్.

155


గీ.

ధనసమృద్ధుల ధననాథుతాత లనఁగ
వర్తకంబునఁ గీర్తిప్రవర్తు లనఁగ
ననృతలాభంబు లోభంబు నపనయించి
వీటఁ బొగడొందఁగలరు కిరాటపతులు.

156


శా.

చూడాభూషణరత్నమై వెలయుచున్ శ్రుత్యుత్తమాంగంబులన్
జూడంగాఁ దగువిష్ణుపాదమునకున్ నూనుల్బలోద్భాసితుల్

తోడంబుట్టువు లభ్రగంగకు మఱందుల్ పాలమున్నీటికిన్
బ్రోడల్ కీర్తి ధనార్జనంబునఁ బురిన్ బొల్పారుశూద్రోత్తముల్.

157


మ.

పవిలీలన్ బహుధారలన్ మురియుచున్ బద్మాక్షుచందంబునన్
భువనస్తుత్యసుదర్శనోదయముచేఁ బొల్పొందుచున్ వార్ధి రే
ఖవలద్వాహినిచొచ్చు నేర్పుఁ గొనుచున్ గర్వంబుఁ గాంచున్ బురిన్
బవనాఖ్యేయజవంబులైన హయముల్ భవ్యప్రచారంబులై.

158


ఉ.

రాజగృహంబులట్ల బహురాజితకక్ష్యల మించి వాహినీ
రాజియుఁ బోలెఁ బద్మనికరంబులఁ బెంపు వహించి విశ్వధా
త్రీజనవంద్య విప్రులగతిన్ మహనీయపదక్రమంబులన్
దేజముఁ గాంచు నప్పురి సుదీర్ణబలాఢ్యకరిప్రకాండముల్.

169


గీ.

చక్రసంపత్తి వాహినీసమితిఁ బోలి
ప్రథిత యగుయుక్తిఁ గా విభ్రమముఁ దాల్చి
యక్షమాలాసదాసక్తి యతుల మీఱి
నగరమునఁ జూడ నొప్పు నున్నతరథములు.

160


ఉ.

మింతురు సత్త్వసంపద సమీరకుమారకుమారముఖ్యులన్
నింతురు కీర్తి నల్లడల నిల్కడఁ బొంది రణాగ్రవీథులన్
గాంతురు వీరధర్మ మతిగర్వితపర్వతవజ్రపాణులై
సంతతమానుషోదయవిచారులు శూరులు తత్పురంబునన్.

161


సీ.

ఇవికావు నీలంబు లివికావు తుమ్మెద
        లవియుఁగా వివి కుటిలాలకంబు
లిందుని బింబంబు లివి గావు నెత్తమ్ము
        లవియుఁ గా వివి మోహనాననంబు
లిభకుంభపాళిక లివిగావు జక్కవ
        లవియుఁగా వివి మెఱుఁగారు చన్ను

లించువిల్తునిదొన లివికావు కాహళ
        లవియుఁగా వివి జంఘ లరసిచూడ


గీ.

ననుచు జనములు సంశయం బధిగమింప
ముదముకతమున విడిపడ్డ మదనురాణి
ముద్దురాచిల్క బోదల మురువు చూపి
భామినులు మింతు రమ్మహాపట్టణమున.

162


చ.

సిరులకుఁ బుట్టినిల్లు వరసీమ నిరంతరభోగసిద్ధికిన్
శరణము ధర్మనిర్వృతికి జాడ మహార్థవిహారలీలకున్
బరిసర మాగమంబులకుఁ బండితపంక్తికి నిల్వనీడ త
త్పురము తదీశ్వరుం డమరుఁ బుణ్యుఁడు శ్రీప్రమథేశ్వరుం డిలన్.

163


ఉ.

ఆయతబాహువుల్ వెడఁదయై కనుపట్టు భుజాంతరంబునున్
గాయజుఁ గ్రేణిసేయు నవకంబగు చక్కఁదనంబు గల్గు ల
క్ష్మీయుతమూర్తియుం జనులచిత్తములం గరఁగింప నొప్పు నా
గాయుతసత్త్వశాలి తుహినాంశుకులోద్భవుఁ డాతఁ డున్నతిన్.

164


చ.

కువలయరక్షకుండు బుధకోటికిఁ బ్రాణపదంబు పార్వతీ
ధవునకుఁ బువ్వుదండ యమృతంబుల పెన్నిధి దుగ్ధవార్థి సం
భవుఁ డిటువంటిరాజు కులభర్తగఁ దేజముగన్న యన్నృప
ప్రవరునిఁ బ్రస్తుతింప నహిరాజునకైనఁ దరంబె యిమ్మహిన్.

166


సీ.

చపలతరేంద్రియాశ్వముల శంకరపాద
        కమలంబు లను సాహణములఁ గట్టి
తాపత్రయాభీలదావానలస్ఫూర్తి
        విలసితవిజ్ఞానదృష్టి నడఁచి
యకలంకకీర్తిచంద్రికల లోకాలోక
        గుహలకుఁ దెలివి నూల్కొఁగఁ జేసి

చటులప్రతాపాంకుశము శత్రురాజన్య
        కరిశిరస్స్థలులపై నిరవుకొలిపి


గీ.

పలికి బొంకక గుణముల వెలితిగాక
నడక సడలక యడిగిన గడుసువడక
యన్వయాచార మెడలక యాదిశైవ
లక్షణంబుల నాధరాధ్యక్షుఁ డమరు.

166


మ.

తన జిహ్వాంచలరంగమధ్యమున విద్యానర్తకీరత్న మిం
పున నర్తింపఁ గరాంబుజంబున మరుద్భూజంబు చూపట్టఁ జూ
పునఁ జింతామణి విశ్రమింప వినయంబున్ విక్రమంబున్ జగ
ద్వినుతౌదార్యము బాహువీర్యమును జెందెన్ రాజు రాజత్ప్రభన్.

167


చ.

భరత భగీరథాంగ గయభార్గవరామ యయాతిముఖ్య భూ
వరచరితానుపాలన మవశ్యము తెల్లమిగాఁగ భూప్రజం
గురుభుజశ క్తికల్మి ననుకూలముగా జనకుండువోలె సు
స్థిరముగ నేలు నైదుపదిసేయఁ డతండు రణాగ్రవీథులన్.

168


ఉ.

కానుగ రాజధర్మ మని గైకొను లోభముపూని కాదు శి
క్షానియమంబునన్ రిపులఁ గాంచు విరోధముఁ దాల్చికాదు రా
జ్యానుసమానముద్రకు బలావలి నేలు భయంబుఁ బొంది కా
దానరనాథచంద్రుఁడు మహాద్భుత మాతని వర్తనం బిలన్.

169


సీ.

కులిశాయుధుఁడు స్వాతిఁ గురియించు వానలు
        పైరులు ముక్కారుపంటఁ బండు
పురుషాయుషమ్మును బూర్ణమై గరివోదు
        నడవడి చక్కనై నడచుఁ బ్రజకు
ధర్మంబు నాల్గుపాదంబుల వర్తించుఁ
        గలుషంబునకు నెడ గలుగ దింత

ధరమీఁద గనులు రత్నంబు[9]లుధరియించు
        రవళి ధేనువులు చ న్నవిసి పితుకు


గీ.

నామయవ్యాప్తి యొక్కింతయైన లేమి
జిఱ్ఱుమని చీద రెవ్వారు చిత్రకలన
సోమవంశాబ్ధిపరిపూర్ణసోముఁ డయిన
యానృపాగ్రణి సేయు రాజ్యంబునందు.

170


గీ.

చూచు శుద్ధాత్మవీథిలో సోమధరునిఁ
గాంచు శరణన్న మాత్రలోఁ గడిఁదిపగఱఁ
ద్రోచుఁ గలిదోష మెచ్చట దొరలకుండఁ
బ్రోచు నారాజు జయవెట్ట భూమిప్రజల.

171


మ.

అలకైలాసమునందు హేమమయకూటాగ్రంబులన్ రత్నని
ర్మలపీఠంబుల నిల్చి పార్శ్వములఁ బ్రేమన్ వల్లభుల్ తోడుగాఁ
గలరాగంబుగ మేళవించి కడువేడ్కన్ సిద్ధకాంతామణుల్
శిల లెల్లన్ గరఁగంగఁ బాడుదురు సంశీలించి తత్కీర్తులన్.

172


సీ.

కట్టింపఁ డేలకో కటి ని రింగులువాఱ
        మెఱుఁగుటొల్లియగాఁగ మెకముతోలు
సవరింపఁ డేలకో శంఖతుల్యగ్రీవ
        వదనంబు నూలుగా బాఁనఱేని
నెలకొల్పఁ డేలకో నిటలభాగమునఁ గా
        శ్మీరబిందువుగాఁగఁ జిట్లుఁగన్ను
ఘటియింపఁ డేలకో కలికిచుక్కలరాజుఁ
        దలమీఁద మల్లికాకళిక గాఁగ


గీ.

నలఁదఁ డేలకొ నెమ్మేన నంగరాగ
విలసనము చూప వలవుల వెల్లపూఁత

యఖిలలక్షణరేఖల నరసిచూడ
నాదిరుద్రుండు గాఁడె యీ యవనివిభుఁడు.

173


క.

రుద్రాక్షఖచితభూషా
ముద్రాంగుఁడు శివగుణోక్తిముఖరితముఖుఁ డు
న్నిద్రభసితాంగరాగుఁడు
కదూసుతకటకనిభుఁడు ఘనుఁ డతఁ డలరున్.

174


ఉ.

పూర్వభవంబునన్ హరునిపూజకుఁ బత్తిరి దే హుటాహుటిన్
బర్వతకోటులం దిరుగఁ బ్రస్తరఘాతముచేత నెత్తురుల్
వర్వుటఁ జేసి యన్నృపతి పాదపయోజము లప్డు సర్వదృ
క్పర్వము లయ్యె నమ్రనరపాలకిరీటమణీమరీచులన్.

176


సీ.

తిలయుతాక్షతల దూర్వలఁ దుమ్మిపువ్వులఁ
        బిల్వదళంబుల బిసరుహములఁ
గలువల బొండుమల్లెల నాగకేసరం
        బుల దవనంబునఁ దులసి మాచి
పత్తిరిఁ జేమంతి బంతి నారగ్వధం
        బులఁ గాంచనంబులఁ బొన్నవిరుల
మరువంపుననలఁ గన్నెరులఁ బలాశ ప్ర
        సవముల జాజులఁ జంపకముల


గీ.

సాంద్రఘనసారమయగంధసారచర్చ
ధూపముల దీవముల ఫలాపూపపాయ
సాదులను దుష్టి గావించు నతఁడు మంత్ర
పూతజలధౌతమూర్తికి భూతపతికి.

176


సీ.

అంత్యజుండును విరూపాక్షుఁ గాఁడనువాని
        జూచును బొడవుర్వుఁ జూచినట్లు

పసిబాలకుఁడు వేడ్క భాషణమ్ములఁ గూడఁ
        బెట్టు నీశ్వరగుడి గట్ట ననుచు
నతిదరిద్రుండు శైవారాధనమునకు
        బొదపెట్టు ప్రాణంబుఁ గుదువవెట్టి
అఖిలదూషకుఁడైన నాహార మొల్లఁడు
        భసితంబు నొసలిపైఁ బ్రామికాని


గీ.

గొల్లవాఁడును శివకథాగోష్ఠిఁ గొంత
ప్రొద్దుపుచ్చును గడుభక్తిఁ బొలములోన
సకలశివభక్తమకుటాగ్రజాతిరత్న
మతఁడు పాలించుధారుణియందు నెల్ల.

177


సీ.

ముగ్ధచంద్రకిరీటుమూర్తి వీక్షింపని
        ఖలుని వీక్షింపఁడు కన్ను విచ్చి
వృషభేంద్రవాహను విమలచారిత్రంబు
        పలుకనిజడుతోడఁ బలుకఁ డర్థి
హరునర్చనావేళ నంటఁగాననినీచు
        నంటడు కల గాంచునవసరమునఁ
బురవైరి మానసాంభోజకర్ణికఁ గూర్పఁ
        దలఁపని కష్టాత్ముఁ దలఁపఁ గోరఁ


గీ.

డంబికానాథునగరికి నరుగనట్టి
భాగ్యహీనుల భవనంబుపజ్జ నరుగఁ
డఖిలశైవరహస్యసిద్ధాంతవేది
పరమనిర్మలగుణవార్థి పార్థివుండు.

178


చ.

జడధులు మేరగాఁ గల రసావలయంబు నిజాంనపీఠిపై
నిడి ప్రమథేశ్వరుండు ప్రమథేశ్వరతుల్యుఁడు వృద్ధిఁబొందుచో
బుడిసెఁడునీళ్ళఁ బూన నొకపువ్వు నెఱుంగని పాడుగుళ్ళలో
మృడులకుఁ గల్గెఁ గుంకుమవిమిశ్రితనీరము రత్నహారమున్.

179

సీ.

క్రోధాదిరిపుల మార్కొన లోనఁ దలపోయుఁ
        దలపోయుఁ బ్రభుశక్తి బలము వెలిని
అష్టాంగయోగవిద్యల లోనఁ దలపోయుఁ
        దలపోయు సత్కీర్తి చెలువు వెలిని
మనసు శంకరుఁ గూర్చి మన లోనఁ దలపోయుఁ
        దలపోయుధరఁ బేరు నిలుప వెలిని
చపలేంద్రియముల శిక్షకు లోనఁ దలపోయుఁ
        దలపోయు ఖలులఁ బోదఱుమ వెలిని


గీ.

లోనఁ దలపోయు భవములు మానుపూన్కి
వెలిని దలపోయు లోభంబు వీడనాడ
నౌర! సాక్షాత్కరించిన యాదిరుద్రుఁ
డఖిలరాజర్షిమార్తాండుఁ డవ్విభుండు.

180


ఉ.

కుండలి సార్వభౌమ కృతకుండలకృత్యు నుమాకళత్రుఁ బ్ర
హ్మాండములోన గల్గిన చరాచరరాసులయందుఁ బూర్ణుఁడై
యుండ నెఱింగి యానృపతి యొత్తినశత్రుల దుశ్చరిత్రులన్
గండడగించుచున్ గరుణ గైకొని దూఱును రాజధర్మమున్.

181


సీ.

చివికిన విధి శిరశ్శ్రేణిఁ దాల్చుట మాని
        బెడఁగైన విరిదండ ముడువఁ గోరి
తూలిపోయిన పులితోలుఁ గట్టుట మాని
        గట్టి కెంబట్టును గట్టఁ గోరి
వేమాఱుఁ బితృవనభూమి నుండుట మాని
        నురుసౌధములలోన నుండఁ గోరి
జవముమాలిన జరద్గవము నెక్కుట మాని
        హయసమూహము నెక్కి యాడఁ గోరి


గీ.

సగముమగరూపు మాని లక్షణసమగ్ర
వుంసవుస్స్ఫూర్తి నిరతంబుఁ బూనఁ గోరి

రాజమూర్తి వహించిన రాజమౌళిఁ
బోలి పొలుపొందె నమ్మహీపాలవరుఁడు.

182


మ.

జగదేకస్తవనీయుఁ డానృపతి యీ చందంబునన్ ధాత్రి మె
చ్చుగఁ బాలింపుచు నున్నకాలమున నక్షుద్రానుకంపాన్వితం
బగు చిత్తంబునఁ జిత్తజారి నిజశాపాయత్తు లౌ ఖేచరేం
ద్రగణాధ్యక్షులఁ బ్రోవఁగాఁ దలఁచె నంతం దత్ప్రసాదంబునన్.

183


ఉ.

కోమలచంద్రరేఖ గలకొప్పును ఫాలవిలోచనంబుఁ బెన్
బాముసరంబుచే నమరు బంధురకంధరముం దలంపులన్
గామవికారముల్ నిలువుగంధము గల్గి యొకండు వుట్టె జ్యో
త్స్నామహిమాస్పదంబు లగు సాంప్రతనప్రభ లుల్లసిల్లఁగాన్.

184


క.

అద్భుతముగ నీకైవడి
నుద్భవముం బొంది యున్న యురుపుణ్యుని నో
యుద్భట! యిటు రా రమ్మని
సద్భణితులఁ జేరఁ బిలిచె శంభుఁడు గరుణన్.

185


చ.

పిలిచిన నుద్భటుండు పురభేదను పాదపయోజయుగ్మముం
దిలకవిభూతిచే మిగులఁ దీండ్ర వహింపఁగ మ్రొక్కి పల్కు నం
జలియుతుఁడై తదంతికరసాస్థలి నిల్చిన నేమి దేవ! యె
వ్వలనికిఁ బోవఁగావలయు వారక నన్బనిపంవు నావుడున్.

186


గీ.

జలధరధ్వాసనిభ మైన యెలుఁగురవళి
తారగిరిసానువునఁ బ్రతిధ్వనులు సూపఁ
బుణ్యచారిత్రు మానసపుత్త్రుఁ జూచి
యర్ధచంద్రకిరీటుఁ డిట్లనియెఁ బ్రేమ.

187


చ.

విను మనఘాత్మ! మున్ ఖచరవీరులు గొందఱు కుంది నాకు పైఁ
పనిక్రియఁ ద్రుళ్ళినం గినిసి పల్కితి వారిఁ బిశాచులార! పొం

డని యిటులన్న మాత్రనె మహాశనిపాతమువోలె వారలం
గొనమునిఁగించె నాపలుకు కుత్సితరూపులుగాఁగఁ జేయుచున్.

188


క.

తలఁచని తలపై యీ క్రియ
నలమినమచ్ఛాపవాళ్యహతిఁ బీడితులై
యులికిపడి ఖచరవీరులు
వల నొండొక టిందుఁ గననివా రగుకతనన్.

189


ఉ.

కన్నుల బాష్పముల్ దొరఁగఁగా గుమిగూడుకవచ్చి మ్రొక్కి యో
పన్నగరాజభూషణ కృపాపరతంత్రకటాక్ష! మమ్ము నా
పన్నుల ఖిన్నులన్ దెలివివాసినవారలఁ గావు శాంతిసం
పన్నుఁడ వింత కిన్క మదిఁ బర్పితి వంచును నన్ను దూఱుడున్.

190


క.

ఏనును గరుణారసమున
నూనిన డెందంబుతోడ నోడకుఁ డని యా
దీనుల ధైర్యాధీనులఁ
గా నూఱడఁ బల్కి శాపగతి మరలింపన్.

191


వ.

ఒక్క యుపాయాంతరంబుఁ దలపోసి యిట్లంటి.

193


సీ.

గంధర్వులార! యాకర్ణింపుఁడీ మత్కృ
        తంబుఁ దప్పింపఁ దరంబె యేరి
కది యట్లు నుండె మీయతివినయస్ఫూర్తి
        కాత్మ మెచ్చితి దైన్య మపనయింపుఁ
డవని నార్యావర్త మనుదేశమున వల్ల
        కీసోమనిఖ్యాత మైనపురము
పొలుచుఁ దత్పురరుద్రభూమి చేరువ నొక్క
        వట మున్న దందు సంవత్సరములు


గీ.

దేవపరిమాణమున నూఱు దీఱఁ ద్రోయుఁ
డంత నామూర్తియగు నుద్భటాహ్వయుండు.

గురువరేణ్యుండు గలుగుఁ దద్గుణపయోధి
కతన మీయిట్టి దురవస్థ గడచుఁ బొండు.

193


ఉ.

నా వీని నన్ను వీడ్కొని పునఃపునరానతు లాచరింపుచున్
దేవగణంబు లేఁగె నతిదీనములై వటశాఖ నుండఁగాఁ;
బో వెస నీవు భూస్థలికిఁ బోయి మదీరితవాక్యపద్ధతిన్
శ్రీవిభవాభిరాములుగఁ జేయుము శబ్దచరాధినాథులన్.

194


సీ.

కెంజాయజడలపైఁ గీలుకొల్పిన చిన్ని
        నెలవంక లేఁతవెన్నెలలు గాయఁ
గుండలీకృతమహాకుండలీశ్వరు ఫణా
        మణికాంతి మోముఁదామర నెలర్ప
విపులవక్షఃపీఠి విధిశిరోన్విత మైన
        వనమాలికావల్లి గునిసియాడఁ
గటిసీమఁ గట్టిన కఱకు బెబ్బులితోలు
        మెఱుఁగు లాశావీథి గిఱకొనంగ


గీ.

వలుదశూలంబు డమరువు నలికనేత్ర
మాదియగు చిహ్నములు దాల్చి యలరు నన్నుఁ
బోలి యీలోకమున నుండి పొలుపు గానఁ
గలరు నీదుకతంబున ఖచరు లనఘ!

195


మ.

సకలాశాముఖముల్ సమగ్రరుచులన్ సంఛన్నముల్ చేసి మి
న్నగ లీలాసమ మైన యిట్టిబలుమేనన్ ధాత్రి నీ వుండఁగా
దకలంకోదయ యుండితేని జను లత్యంతంబు భీతిల్ల సా
రెకు నిల్పోవరు గాన మానుషవపుశ్శ్రీఁ జెంది పొ మ్మిమ్ములన్.

196


క.

సంసారయోగివై పర
హింసకు లోనీక వసుధ కేఁగియు జీవో

త్తంసుండ వగుచు దిక్కుల
మాంసల సత్కీర్తిఁ దెలుపుమా గురుముఖ్యా.

197


క.

నావచనమార్గమునఁ జని
పావనమతి పూని భూతపరివృఢు లగు త
ద్దేవకులమాననీయులఁ
బ్రోవుము ప్రమథేశుఁ డేలుపురి వల్లకిలోన్.

198


మ.

చతురాశావధికుంభికుంభవిలుఠచ్ఛాతప్రతాపాంకుశుం
డతఁ డంభోనిధివేష్టితాఖిలమహీయఃక్షోణిఁ బాలింపఁ ద
త్ప్రతివీరప్రమదాకపోలతలముల్ మించుఁ గస్తూరి కా
యతనానావిధపత్రభంగముల మారై స్రస్తకేశచ్ఛటల్.

199


గీ.

అట్టి ప్రమథేశ్వరుని కూర్మిపట్టి యైన
ముంజ భోజాహ్వయుఁడు రాజకుంజరుండు
నీకుఁ బ్రియశిష్యుఁడై కీర్తి నివ్వటిల్ల
సాధుసాలోక్యలక్ష్మిఁ జెందంగఁ గలఁడు.

200


ఉ.

గోపతి నెక్కి మంచుమలకూఁతురితో నిట యున్కి మాని నే
నేపురిఁ గావురంబు వసియింవుదు నా ముదిగొండపట్టణం
బో పురుషాగ్రగణ్య భవదుత్తమవంశజులుం దపోధన
శ్రీపులు నైనధీరులకుఁ బ్రేమపదం బగు ధామ మయ్యెడిన్.

201


సీ.

నిఖలశైవారాధ్యనేతృత్వమహిమచేఁ
        బరఁగుచు గురుసార్వభౌము లనఁగ
దుర్మతధ్వంసబంధురు లౌచుఁ బ్రతివాది
        జనభయంకరయశస్సాంద్రు లనఁగ
షట్కాలశంభుపూజాపరాయణవృత్తి
        జరుపుచు గురురాయశరభు లనఁగఁ

గొలుచువారికి నిష్టఫలదులై నిజశిష్య
        బహుళదారిద్ర్యనిఫాళు లనఁగ


గీ.

నన్ను సర్వంబునందుఁ గానంగఁజాలు
ఘనత చేపట్టి వేదమార్గప్రతిష్ట
బదిలు లననుండుదురు భవద్భావివంశ
జాతు లాచార్యముఖ్యులు చారుచరిత.

202


సీ.

ప్రతివాదివేదండపంచాననంబులు
        నిజధర్మపాలననివుణమతులు
కలలోననైన నవ్వులకైన భవియగు
        మూఢు నీక్షింపని గాఢయశులు
షట్కాలముల నన్ను శాస్త్రోక్తమార్గంబు
        చే సమారాధించు శిష్టమూర్తు
లిది సుఖ మిది దుఃఖ మిది నాయ దిది వాని
        దని విభేదంబు సేయనిమహాత్ము


గీ.

లొరుల ధనదాతలకు నింతయును మనమున
నఱ్ఱుతలఁ చని నిత్యపుణ్యాభిరాము
లర్థి ముదిగొండపురవరాధ్యక్షు లగుచు
వెలయఁగల రింగ మీవారు విమలచరిత!

203


గీ.

ఖచరవరులను రక్షింపఁ గలుగుఁ గీర్తి!
వలదు తడ విఁకఁ జేయ నోయలఘుమూర్తి!
పావనము సేయు పాదసంస్పర్శనమున
గలుషయుత మైన వసుమతీతలము నెల్ల.

204


ఆశ్వాసాంతము

శా.

ధీవిస్ఫూర్తి పయోజసంభవ భవానీ[10]సంస్తవోచ్చారణ
ప్రావీణ్యక్షమభావ! భావభవదూరస్వాంత రాజీవ రా

జీవాంభోరుహకుంభచామరముఖస్నిగ్ధస్ఫురద్భాగ్యరే
ఖావళ్యంకితపాద! పాదనఖశోభాస్ఫోటితోడుప్రభా!

205


క.

విద్వజ్జనచింతామణి!
విద్విట్కులహృదయభయదవిజయాంక! ప్రతీ
పద్వీపభూపదత్తజ
గద్వినుతసమస్తవస్తుగర్భితధామా!

206


మాలిని.

త్రిపురమధనపాదాధిష్ఠితధ్యాన! వేదా
ర్థపరిచయపవిత్రోదగ్రజిహ్వాగ్ర! మిత్రో
డుపతినయన శౌర్యాటోప నిర్నిద్ర ధైర్యా
ప్తిపరిచితనిజంగా! ధీపరీతాంతరంగా!

207


గద్యము
ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ
రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి
బిరుదాభిరామ రామలింగయ ప్రణీతం బైన
శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను
మహాప్రబంధంబునందు
ప్రథమాశ్వాసము
శ్రీ

  1. గుణాధారు. పా.అం.
  2. దాడి. పా.రం.
  3. బుంద
  4. నాట. పా. అం.
  5. గాడాంధ. పా. అం.
  6. పోషణ
  7. తరలించి. పా. ఆం.
  8. బత్తి. ప్రా.అం.
  9. లఫలియింఛు. పా. తు.
  10. ధీన. పా. అం.