ఉద్భటారాధ్యచరిత్రము/ద్వితీయాశ్వాసము

శ్రీ

ఉద్భటారాధ్యచరిత్రము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీనగజాధిపచరణ
ధ్యానసుధానుభవలోల! దర్పవిదూరా!
భానుసమదీప్తి! భాసుర
ధీనిత్యా! అన్నమంత్రి దేచామాత్యా!

1


వ.

ఆకర్ణింపుము.

2


చ.

అని పలుకంగఁ దా వినతుఁడై తగమాఱు వచించి వేడ్క చెం
దినమది వాఁడు వేగఁ జనుదెంచె ధరిత్రి కదృశ్యమూర్తియై
మనమున శంకరుండు తను మన్ననఁ జేరఁగఁబిల్చి యప్పుడా
ఘనవాక్యవైఖరికి డింపనిహర్షము నూలుకొల్పుచున్.

3


సీ.

నునుపార [దువ్విన ఘనకేశపాశం]బు
        గముకమై యవటుభాగమున వ్రేల
రుద్రాక్షమయహేమరూఢికుండలకాంతి
        నిద్దంపుఁజెక్కుల ముద్దుగురియ
జమిలించి తాల్చిన జన్నిదంబుల [రేఖ
        యుత్తరీ]యస్ఫూర్తిఁ బొత్తుదొడుకఁ
గటి ఘటించిన నీరు[కావిదోవతి]పింజ
        కడకొన్నమోఁకాళ్లు కప్పిదూల

గీ.

నొసలి భసితంబు ముఖలక్ష్మి బసలుసేయ
రసన తుదయందుఁ బంచాక్షరంబు గ్రాల
[రాజసత]యును బ్రహ్మవర్చసము గలిగి
యుద్భటుం డీశ్వరాకృతి నుర్వి నిల్చె.

4


క.

హరునాజ్ఞఁ జేసి ప్రమధులు
వరవిప్రాకృతులు దాల్చి వర్ణక్రమముల్
పరితశ్రుతిముఖులై వ
చ్చిరి ధర కగ్గురునిపజ్జ శిష్యత్వమునన్.

5


సీ.

పరమతంబులు వేరుపట్టినఁ దెరలించి
        శైవాగమంబులు జాడవఱిచి
ఇందుశేఖరుతత్త్వ మెఱుఁగక దైవతాం
        తరలగ్ను లగువారి తెరువు లుడిపి
యెందు శంకరుతీర్థ మెసఁగు నచ్చటి కేఁగి
        మతిమంతులకు మహామహిమ దెలిపి
శాంతుఁడై లోన విశ్వాసంబు గల్గిన
        సచ్ఛిష్యునకు మంత్రసరణి చూపి


గీ.

స్నానదానావిధులఁ బ్రసూనబాణ
దమనునకుఁ దుష్టిగావించు ధన్యమతులఁ
గలసి వర్తించి మఱిపెక్కుగతుల నవని
బ్రబలి విహరించు నుద్భటారాధ్యవరుఁడు.

6


క.

పరుసము సోఁకిన లోహము
వెరవారఁగ హేమ మైనవిధమున నా స
ద్గురువరుని మహిమకతమున
వరశుభసంపన్ను లైరి వసుధాజనముల్.

7

గీ.

భాస్కరుఁడు చీకటుల్ పటాపంచు గాఁగఁ
గిరణమాలికచేఁ దోలుకరణి మోప
నమ్మహాభాగుఁ డద్రిజాప్రాణనాథ
కథల దురితంబు లన్నియు గనువుగొట్టె.

8


మ.

స్ఫురితజ్ఞానవిధాన మాగురుకులాంభోరాశిచంద్రుండు శం
కరుఁడై తాఁ దనుఁ గొల్చువారికి నమోఘశ్రీవిశేషంబులం
దొరకంజేయుచు ధాత్రినుండు [నెడ] దోడ్తోఁ గించిదూనంబుగా
హరశాపాబ్దచయంబుఁ ద్రోచిరి కుబేరాఫ్తుల్ పిశాచాకృతిన్.

9


గీ.

ఎన్నఁ డుద్భటుఁ డిలఁ బుట్టు నెన్నఁ డిట్టి
కలుషదుర్దశ దిగఁద్రోయుఁ గరుణ [గలిగి
యని యెపు డెదురె]దురె చూచు నప్పిశాచ
పతులపాటులు గడతేర్ప నతఁడు గలిగె.

10


ఉ.

తత్సమయంబునన్ ధవళధామకిరీటపదాబ్జభక్తిసం
పత్సుఖవేది రాజకులమండనుఁ డాప్రమథేశ్వరుండు భూ
భృత్సుతవోలె భద్రములఁ బేర్చి ప్రభావతి నామధేయయౌ
వత్స నృపాలపుత్త్రి తగువల్లభ గా విలసిల్లె పల్లకిన్.

11


గీ.

పద్మినీవల్లభునకును బ్రభయుఁబోలెఁ
గువలయాధీశునకు[నుగల్వవలె నాశు
శుక్షణికి నర్చిభంగి నాక్షోణిపతికి]
నగుచుఁ బొల్చుఁ బ్రభావతీహరిణనేత్ర.

12


మ.

అలిపోతంబులు చంద్రలేఖ మరువిండ్లందంబు ముత్తెంపుఁజి
ప్పలు నూఁబువ్వును శ్రీలు శంఖము లతల్ భద్రేభరాట్కుంభముల్
జలదాద్యంబు తరంగముల్ సుడి తమస్సారంబు చక్రంబు రం
భలు తూణీరము లబ్దముల్ మదిఁ దలంపం గాంతకాంతాంగముల్.

12

గీ.

అఖిలజగదేకమోహిని యగుచు[నావి
శాలమీనప్రతీకాశ]లోలనేత్రి
తనకు నర్ధాంగలక్ష్మిగా ధర్మమార్గ
మునఁ బ్రవర్తించు నమ్మహీభుజుఁడు ప్రీతి.

14


క.

ప్రాలేయకిరణముఖి యగు
బాలామణిఁ గూడి ప్రమథపాలాభుఁడు భూ
పాలా[గ్రగణ్యుఁ డాతఁ డ
నాలో]లమనస్కుఁ డయ్యె యౌవనవేళన్.

15


క.

గలిగి సురూపముఁ బ్రాయముఁ
గలిగియుఁ గలగంఠిపొందు గలిగియు లోనన్
గలుగంగనీఁడు దుర్మద
ముల హయ[శతశక్తి] నృపకులాగ్రణి యెందున్.

16


చ.

పరమపవిత్రయై తగుప్రభావతితోడుత నిష్టభోగముల్
బొరయుచు నేలనల్గడలు పూని నిజాజ్ఞకు లోనుజేయుచున్
హరుఁ దరుణేందుమౌళి భువనాధిపుఁ భక్తి భజించు నన్నరే
శ్వరునకుఁ గల్గదయ్యె సుతసంపద సంపదకెల్లఁ బ్రోదియై.

17


క.

సుతలాభమ్మునకుం దగ
క్షితిపతి చింతించి తనదు సీమంతినితోఁ
జతురత నిట్లను నొకనాఁ
డతులరహస్యైకగోష్ఠి ననుకూలుండై.

18


ఉ.

ఏలితి నేలనల్గడ లహీనబలంబున వైరివీరులన్
దోలితి భూమిభృద్గుహలు దూఱ మనోంబుజకర్ణికాస్థలిన్
గీలన చేసితిన్ వృషభకేతనుపాదము లింతి! యీశుభ
శ్రీలకుఁ దోడు నందనులచెన్ను గనుంగొనుఁ టెంతభాగ్యమో.

19

మ.

గలుగ ల్లంచును గాళ్ళయందియలు పల్కం జక్కులన్ మద్దికా
యలతళ్కుల్ గరువంవుచూపు నిటలవ్యాకీర్ణలంబాలకం
బులతో ముద్దులు చిల్కుచుం గలవచఃపూర్ణాస్యుఁడై తప్పుట
డ్గులు వెట్టంగలపుత్త్రుఁ డబ్బునొకొ నాకు న్నీకు లోలేక్షణా.

20


క.

వారణవాజివధూవసు
వారాత్మక మైనరాజ్యవైభవ మిది దా
నౌరసుఁడు లేనికతమునఁ
జారుముఖీ! యెన్ను లేని సస్యము కాదే.

21


గీ.

పుత్రముఖవీక్షణంబునఁ బొదలుసుఖము
పూర్ణ(?)తలనిండ నర్థంబు పోసినపుడు
కలుగ దిట్టివిశేషంబుఁ గాంచువార
లెంత భాగ్యంబు చేసినా రిందువదన!

22


మ.

అని చింతింపుచు నున్నప్రాణవిభు నయ్యబ్జాక్షి వీక్షించి యి
ట్లను రాజన్యకులావతంస! నగధైర్యా! యార్యసంస్తుత్య! నీ
కును జింతాభర మేల యింతపనికై గోరాజకేతుండు దా
మనపాలన్ సురశాఖియై సకలసంపత్ప్రాప్తి నూల్కొల్పఁగన్.

23


సీ.

మిన్నేటితలనీటి మించుకెంజడలపై
        నెలవంక బొదివి వెన్నెలలు గొలువ
విపులహాలాహలవిషమషీకృతముద్ర
        మృగనాభిరేఖయై మెడఁ దలిర్ప
వవనాశనాధీశ [పదకముద్రుచి] గల్గి
        బాహుమధ్యంబునఁ బరిఢవిల్ల
పలుమొగంబుల పారువలుదపున్కలపేరు
        చుట్టిన చేపోటు ముట్టు వెలుఁగ

గీ.

గంటఁ దిగిచిన గందంపుఁ గమ్మఁదావి
పొలుపు పర్యంత భూముల బుగులుకొనఁగఁ
గొండరాచూలితో నొక్కకుత్తుకయిన
వేల్పుఁ గొల్చినఁగల్గు సంకల్పసిద్ధి.

24


సీ.

ఎలదోఁటలోపల మొలచుఁ గల్పకములు
        నిచ్చలుఁ గనుగన్న నిలుచు సురభి
సిద్ధరసంబు సంసిద్ధమౌ నింటిలో
        నణిమాదిసిద్ధులు నాజ్ఞ సేయు
నింటివెచ్చము పెట్టు నిందిరాదేవత
        తోడ మాటాడు వాక్తోయజాక్షి
దండఁ జింతామణి యుండు ముంగొంగునఁ
        బసిఁడి చూపట్టి సంపదలు వెంచు


గీ.

(గ్రహము లేకా) దశస్థానగతిఫలంబు
నిచ్చుఁ బాపించుఁ గోరిక యెట్టిదైనఁ
జంద్రికాధాము దేవతాసార్వభౌముఁ
గొలుచు శుద్ధాత్ములకు మహీతలమహేంద్ర!

25


వ.

....................వల్లభుఁడు వర్షాపవనస్పర్శనంబునఁ గోరకించిన నీప భూరుహంబునుంబోలె హర్షోత్కవచనంబునం బులకితతనుఫలకుం డయ్యెఁ బ్రభావతియుం బ్రభాతలక్ష్మియుంబోలె వికసితముఖారవింద యయ్యె నిట్లు దంపతులు సంప్రాప్ర..............సంతానులు కాఁ జెలంగి యన్యోన్యవాక్యామృతంబుల నితరేతరహృదయంబులు పొదలింపుచుఁ గాశిగావిభుం గాద్రవేయముద్రికాముద్రితకరాంగుళీకిసలయుం గిసలయవిభాసిపిశంగజటాధరు ధరశరాసనవిజితవిరోధిపురుం బురుషత్రయరూపు నారాధించు తలంపున జగదేకరమ్యంబగు నవిముక్తక్షేత్రంబునకుం బోవ సమకట్టి రంత నొక్కనాఁడు.

26

మ.

పరభూపాలురదైన్యముం నిజబలప్రాచుర్యమున్ నిశ్చయిం
చి రసామండలి ధాన్యముం ధనము లక్షీణంబు లై యున్కికిన్
బరితోషంబు వహించి మూలనగరిన్ భవ్యాత్ములం రక్షణ
స్థిరులం జేసి మహీమహేంద్రుఁడు దలంచెన్ గాశికిం బోవఁగన్.

27


ఆ.

అమ్మహీధరుండు ప్రాణేశ్వరియుఁ దాను
హారిశిల్పమైన యరద మెక్కి
విశ్వనాథుపురికి విజయంబు చేసిరి
పుత్త్రకాంక్ష హృదయ మాత్రపడఁగ.

28


చ.

శ్రవణవుటాభిరామమృదురావములన్ విలసిల్లి లోచనో
త్సవకరమైన తేరు జలజాతవిరోచనతోడ నెక్కి భూ
భువనవిభుండు వొల్చె మణిపుష్పక మెక్కి వినోదలీలలన్
దవిలి శచీపురందరులు ధారుణిపై విహరించుకైవడిన్.

29


సీ.

కమనీయకల్లోలకలితఘనాంభోధి
        కడఁగి వేలాకాంతఁ గౌఁగిలించె
బరిమళంబును శీతభావంబుఁ దలచూప
        మందగంధవహంబు మలసె దిశల
అతినిర్మలాకారుఁడై వలిమలఱేఁడు
        చలువమించు దొలంకుచాయ లీనె
గంధర్వభామినీగాంధర్వములఁ గూడి
        సురవుష్పవృష్టియుఁ గురిసె మింట


గీ.

వినుతవిలసనశిఖలచేఁ దనరె వహ్ని
యవని సంపూర్ణసౌభాగ్య మావహించెఁ
గాశికాభర్త గౌరీశుఁ గాలకంఠు
నమ్మహీపతి సేవింప నరుగువేళ.

30

గీ.

ఇట్లు మందానిలాది సమిద్ధభద్ర
సూచకంబుల వీక్షించుచుం బ్రభావ
తికి నతిప్రీతిఁ దెలుపుచు ధీరవృత్తి
నా ధరాధీశుఁ డల్లన నరిగి మ్రోల.

31


గీ.

భూరికైవల్యలక్ష్మికిఁ బుట్టినిల్లు
పరమవిజ్ఞానసిద్ధికిఁ బట్టుగొమ్మ
యైన కౌండిన్యునాశ్రమం బధికభక్తి
నరసె నప్పుడు రవి నిల్చెఁ జరమశిఖరి.

32


చ.

మొదలఁ బుగందరాశఁ దగ ముట్టితి రాగముతోడఁ బద్మినిన్
బిదపఁ జమత్కరించితిని వేడ్కఁగరంబులు సాఁచి యింక నన్
బొదువకు మంచు దూఱుచు నపూర్వదిశాంగన కాలఁదాఁచినన్
దదమితయావకద్రవముఁ దాల్చెను నా నినుఁ డొప్పె రక్తిమన్.

33


చ.

ఉదయము నొందె సానులకు నొద్దిగఁ బద్మినిఁ దేర్చి తద్గృహం
బదవదసేసెఁ దత్కువలయప్రభఁ దూలిచె నట్టె వారుణిం
దుదిఁ గనె సంచుఁ దన్ జనులు దూలఁగనాడిన నింద యోర్వకో
గొదగొని పశ్చిమాంబునిధిఁ గ్రుంకె సరోరుహమిత్రుఁ డత్తఱిన్.

34


సీ.

పాటలంబులవన్నె తేట మంకెనలబిం
        కము......విద్రుమములసొబగు
పద్మరాగంబులపస ప్రియంగుచ్ఛాయ
        కుసుమ మొప్పిదము కుంకుమము చెలువు
లత్తుక చెన్ను పల్లవ నముల్లాసంబు
        కాశ్మీరజాంగరాగంబు పూత
చక్కఁదనంబు హంసముల చంచుస్ఫూర్తి
        పటుపలాశద్రుమప్రసవకాంతి

గీ.

బింబఫలవిభవము చందిరంబుఠీవి
యాదిగాఁగల రక్త(పదార్థ)సమితి
నలువ కేలికి నొకచోట నలమికూ(ర్చె)
ననఁగఁ జెలువొందె నెఱసంజ యపరదిశను.

35


సీ.

అంతటఁ జరమసంధ్యావేళ జనపతి
        యరదంబు డిగ్గి సంధ్యార్హకృత్య
ములు మనం బలరంగఁ గొలనులోపలఁ దీర్చి
        పుణ్యంబులకు జన్మ(భూమి యైన
కౌండిన్యు) నాశ్రమక్షమఁ గల్గి కనుపట్టు
        బహువిశేషములకుఁ బరమహర్ష
మాత్మఁ బెంపెసలార నా నిజాన్వయగురు
        నుటజంబు డాయంగ నుచితవృత్తి


గీ.

నిందుబింబాస్యతోఁ గూడ నేఁగి తనదు
రాకఁ దగువారిచే మౌనిలోకమౌళి
రత్నమున కెఱిఁగింప (నా)రాజునకును
సమ్ముఖం బిచ్చె నాతండు సంభ్రమమున.

36


చ.

కులపతి పాదపద్మములకున్ సతియున్ బతియున్ బ్రణామముల్
దిలకితభక్తిఁ జేయుడు సుధీమణి యమ్ము(ని)యున్ మనోంబుజం
బలఘుతరప్రమోదమయమై విలసిల్లగ వారిఁ బెక్కురీ
తులఁ దగ గారవించి సిరిఁ దోఁచిన దీవన లిచ్చె మెచ్చుగన్.

37


వ.

ఇటు కమనీయప్రభావతి యగు ప్రభావతియును సదారాధితప్రమథేశ్వరుండగు ప్రమథేశ్వరుంకును మౌనిమండలమాన్యుం డగు కౌండిన్యు నుచితోపచారంబులం బ్రసన్నుం గావించి, రమ్మహర్షియు రాజర్షికి నాతిథ్యం బొసంగి యర్హాసనంబునం గూర్చుండ

నియమించి దర్భపాటితతలంబగు కరకమలంబున వినయైకసారం బగు తచ్ఛరీరంబు నివురుచు నిట్లనియె.

38


సీ.

హెచ్చువచ్చునె పురోహితముఖంబున నీకు
        శాస్త్రోక్తనిర్మలాచారసరణి?
ఆరగింతురె వచ్చి యజ్ఞవేళలఁ గోరి
        హవిరన్నకబళంబు లమరవరులు?
శిరసావహింతురె విరులదండయపోలెఁ
        బరమండలంబు భూపాలురాజ్ఞ?
పురుషాయుషంబు సంపూర్ణమై వర్తింప
        నుండునే నెమ్మది నుర్విజనము?


గీ.

స్వాతితోడుతఁ దగినవర్షంబు గలదె
పంట పండునె ముక్కారు? పాపకోటి
భయము దూరంబె? రసవర్గభరిత మగుచు
దుర్గసముదాయ మమరునే దురితదూర!

39


ఉ.

మానము గల్లి శౌర్యమహిమస్థితి రూఢికి నెక్కి తాల్మి లోఁ
బూని గుణానుకూల్యమునఁబొంది నయమ్మనఁ బెంపు దాల్చి నీ
చే ననయంబుఁ బూజ్యగతి (జెంది పరస్పర వైర) మెంతయున్
మానినశూరు లిత్తురె సమగ్రజయోన్నతి నీకు భూవరా!

40


ఉ.

కూడుక వత్తురే బుధులు? కోరిన నర్జుల కిచ్చి పంపుదే?
వేడుక మంత్రలక్షణవివేక [ముపాయచతుష్టయంబు]తో
గూడఁగనిత్తువే? మనసు కుత్సితమార్గులఁ బ్రోవ నాత్మలోఁ
జూడక కీర్తియందుదువె సూరిజనంబులచే మహాబలా!

41


క.

అని పెక్కుభంగు లమ్ముని
జనసతి సేమంబు నడక చందంబును నె

మ్మనమార నడుగ వినయం
బు నయంబును గదురఁ బల్కు భూపతి యతనిన్.

42


ఉ.

యుగ్యము లయ్యె నెవ్వనికి నోలిఁ జతుశ్శ్రుతు లట్టి వేలుపున్
భోగ్యధినాథకంకణునిఁ బొందుగఁ గొల్చి ప్రభావసిద్ధికిన్
యోగ్యుఁడవై(న నీకరుణ యుండ నృపాలు)రలోన మిక్కిలిన్
భాగ్యము సేసినాడ మఱి బ్రాఁతియె సేమము నాకు నెయ్యెడన్.

43


చ.

సకలము భద్రమయ్యె గుణసాగర! నాకుఁ గొఱంత లేదు ని
న్నొకవని వేఁడుకోర్కి నిట కొయ్యన వచ్చితిఁ బ్రొద్దువోయె నేఁ
టికి నిది యెంతయేనియుఁ గడిందిప్రయత్నము విన్నవింతు మీ
కకుటిలబుద్ధి రేపకడ నంతయు విస్తరవాక్యపద్ధతిన్.

44


చ.

అనవుడు నట్ల యౌ ననుచు నమ్మునిభర్త సభార్యుఁడై (మహీ
శున కుచితంబుగాఁ బ్రియము) సూపుడు భూపతియున్ మహర్షి చూ
పిన యుటజంబులోన ధృతిఁ బెంపు వహించుచుఁ బల్లవాంగశ
య్యను సుఖనిద్రసేసె విమలైందవరోచులు చెల్వు చూపఁగన్.

45


చ.

వలపలనైనచీఁకటి ప్రభావరిహీణత దోఁచుతారలున్
గలఁగువిటీవిటోత్కరముఁ గందినచంద్రుఁడు మూతివిచ్చు ఱే
కులవిలసిల్లు తామరలు గూళ్ళను మేల్కనుపక్షులున్ రుచుల్
వెలిసిన చెందొవల్ గలిగి (వేకువ దాఁ బొడ)సూపె నంతటన్.

46


చ.

తముఁ గనవాయఁ జేయుటకు దాపురమై చనుదెంచు వేఁడిద
య్యముతుది నెత్తికోలు గన రక్కట భీతిలి రంగజాహవ
క్రమము....యం(చు......హతి) గాఢతరశ్రమ సుప్తకామినీ
రమణుల నవ్వె దీపనికరంబులు పాండువిభామిషంబునన్.

47


క.

పరుషకఠినక్షతిం దిన
కరరథగంధర్వవదనగళితం బగు నె

త్తురువోలె సాంధ్యరాగము
సురవరదిశయందుఁ గళుకు సూపెన్ గలయన్.

48


స్రగ్ధర.

అంతన్ గాన్పించె నింద్రాయతనదిశ రథాంగార్తిసంహర్తతీవ్ర
ధ్వాంతస్తంబేరమశ్రీదళనబలవిధాదక్షహర్యక్ష మాశా
కాంతాగ్రైవేయకాంచీకటకమణినిభాగర్వనిర్వాహకాంశుం
డంతర్లీనావిపక్షాహతజఠరసరోజాళిమై హేళిలీలన్.

49


వ.

ఆసమయంబున.

50


చ.

అమలసరోవరంబున నహర్పతిసన్నిభుఁ డాప్రభావతీ
రమణుఁడు నిత్యకృత్యములు రాగముతోడ నొనర్చి శంకరున్
గమలదళంబులన్ దొవలఁ గల్వల నర్చన చేసెఁ జంద్రికా
విమలమరీచి మత్పులినవేదికపై శివధర్మవేదియై.

51


ఉ.

రాజునకంటె మున్ను మునిరాజశిఖామణి మేలుకాంచి గం
గాజలపూర మట్టు లఘకర్షణమౌ నొకపుణ్యవాహినీ
రాజితనీరవేణికఁ దిరంబుగఁ గుంకి కృతాహకృత్యుఁడై
రాజకళాధరుం గుధరరాజసుతావిభుఁ గొల్చె వేడుకన్.

52


సీ.

పురహర నిర్మాల్య పుష్పాళి తనమ్రోల
        శుభ తపఃఫలసిద్ధిసూచకముగఁ
జేరి యధ్యయనంబు చేయు శిష్యులఘోష
        మలఘు గాంభీరాబ్ధియులివుఁ బోల
జలబిందువుల్ దాల్చుజడలు ముక్తాయుక్త
        విద్రుమద్రుమలతాముద్రఁ దెలుప
మానితస్ఫటికాక్షమాలిక చేఁబడ్డ
        హరకథాసారార్థగరిమ గాఁగ


గీ.

బ్రహ్మవర్చసమాన(సఫలకమునను
శై)వకళతోడఁ జెలువంబు సవదరింవ

శ్రీతరుచ్ఛాయఁ గూర్చున్న వీతరాగుఁ
బుణ్యుఁ గౌండిన్యు దర్శించె భూమివిభుఁడు.

53


గీ.

అంతఁ బ్రమథేశ్వరుండు సం(యమిశిరోన
తం)సమునకును మొక్కి తద్దర్శితాస
నమునఁ గూర్చుండి వినయావనతశరీరుఁ
డగుచు భయభక్తు లాత్మయం దతిశయిల్ల.

54


చ.

ఇటులు పవిత్రుఁడైన ధరణీశ్వరుఁ బల్కు ము(నీంద్రుఁ డంత వి
స్ఫుటమ)ధురాక్షరంబుగ యశోధన! నిన్నటిరాత్రి నన్ను నే
మిటికిఁ దలంపు సేసితివి? మి మ్మొకకోరిక కోరి నాదువ
చ్చుట యని చెప్పు మెట్టి దది శోభనబుద్ధి ఫలింపఁజేసెదన్.

55


క.

అనుకూలకార్యసిద్ధికి
మనసిజహరుఁ డున్నవాఁడు మనుజేశ్వర! నీ
మనమునఁ గొంగక వచ్చిన
పని చెప్పుము నీ కొనర్తు ఫలసంసిద్ధిన్.

56


ఉ.

నావిని యిట్లు వల్కు మునినాథునితోడఁ బ్రహృష్టచిత్తుఁడై
భూవరచంద్రముండు మునివుంగవ! రెండవ విశ్వభర్తవై
యీవు మదీయవాంఛితము లెల్ల ఫలింపఁగఁ జేయుపూనికం
బ్రావగఁబట్టి పల్కితివి భాగ్యము చేసితిఁ గంటి సౌఖ్యముల్.

57


చ.

కలవు సమీరుమీఱి వడి (గల్గుహయంబులు భద్ర)దంతులున్
గలవు రథంబులున్ గలవు కాంచనపూర్ణము లైనదుర్గముల్
గలవు విలాసినుల్ గలరు గల్గిన వన్నియు రాజచిహ్నముల్
గలుగదు పుత్త్రలాభ(మ యొకండది) నాకుఁ బితౄణ మీఁగఁగన్.

58


క.

నిర్ణీత ‘మపుత్త్రస్య గ
తి ర్నాస్తి’ యటంచు శ్రుతులు దెలిపినపలు కా

కర్ణింవు నాదుముఖము వి
వర్ణంబై యుండు నెవుడు పరతత్త్వనిధీ!

59


క.

మానుషయత్నము గా దిది
పూనిక యేరీతినైనఁ బోనీ ననినన్
మౌనివర! దైవకృత మిఁక
దీనిన్ సాధింపవచ్చు తెఱఁ గెట్టిదయో!

60


ఉ.

అందనిమ్రానిపండ్లకును నఱ్ఱులు సాఁచినయట్టు లిట్లు నే
నందనలబ్దికై_ ప్రతిదినంబును నువ్విళులూరుచున్ హృదా
నందము లేకయుండ నొకనాఁడు విచిత్రముగాఁగ నాకుఁ దోఁ
చెం దివినుండి పల్కొ(కటి) సిద్ధమునీశ్వర! శ్రోత్రపేయమై.

61


క.

“ఏటికిఁ బుత్త్రులు లేమికి
మాటికిఁ జంతింప నీకు మనుజేశ్వర! నీ
వేటిసగ మిందుశేఖరు
వాటంబుగఁ గొల్వు పోయి వారాణసిలోన్.

62


ఉ.

పొచ్చెముగాదు నాపలుకు పొమ్మిఁకఁ గాశికిఁ బుణ్యరాశి కీ
వచ్చట విశ్వనాథు నగజాధిపు నీక్రియఁ గొల్వు, కొల్చినన్
ముచ్చటదీర నీకు వరముల్ దయసేయు నతండు, శోభనం
బచ్చికమే వృషధ్వజుని నర్చన చేసిన భాగ్యశాలికిన్?

63


క.

అని బయలాడిన మాటలు
విని మీ కెఱిఁగించి పిదవ విశ్వపతిన్ శం
భుని గొల్తు ననుచు వచ్చితి
ననఘా! నా కెద్ది బుద్ధి? యానతియీవే.

64


ఉ.

అన్వయదేశికుండవు మహాత్ముఁడ వాగమపోష భూమిభృ
ద్ధన్వుఁడ వాత్మవేది వతిదాంతిపరుండవు నీవు నాతలం

వు న్వివరంబుగాఁ దెలిసి పొ మ్మను కాశికినైన నీవయై
న స్వర మిమ్ము విశ్వవిభు నాతరమే నిను మీఱి గానఁగన్.

65


గీ.

పుత్త్రలాభంబుపైఁ గాంక్ష పొదలుకతన
నదియు నౌఁగాక యనివింటి నభ్రవాణి
పడుచుఁబని గాదు [సులువైన క]డక గాదు
బయలుపందిరి వెట్టంగఁ బరగునయ్య!

66


క.

గౌరీశువలనఁ గానీ
సారయుత(భవత్ప్ర)సాదచాతురిఁ గానీ
యేరీతినైన నా కీ
కోరిక సిద్దింపఁజేయు గుణరత్ననిధీ!

67


క.

అని యీచందంబున నం
(దనుకొఱకై కాం)క్ష చేయు ధరణీపతి కో
రినకోర్కి ఫలితమగుతలఁ
వున నిట్లని పలుకు మానిపుంగవుఁ డెలమిన్.

68


క.

సంతానలాభమునకై
చింతాసంతాప మేల క్షితివర! గౌరీ
కాం(మనోహరుఁడు వర
చిం)తారత్నంబు నీకుఁ జేకుఱియుండన్.

69


శా.

ఆవైహాయ నభారతీ విభవ మార్యగ్రాహ్య మర్హంబుగా
దా విశ్వాసముచేయు మిందున విరూపాక్షుం డుమాభర్త కా
శీవాసుండు [ప్రసన్ను డీ నఖలముల్ చెల్వొ]ప్పు నిష్టార్థముల్
ప్రావీణ్యంబున దీన సంశయము దాల్పంబోల దుర్వీశ్వరా!

70


క.

భవమునకు సత్ఫలంబుగ
భవు నగజాప్రాణనాథు భజియింపుటకై

యవిముక్తభక్తిసంపద
భువి నవిముక్తంబునకును బోవఁగవలదే?

71


ఉ.

గుబ్బల ఱేనికూఁతు చనుగుబ్బల కమ్మజవాది గంధముల్
బొబ్బిలఁ బూయఁజూడ[నిల]చూపులుమూఁడగు వేల్పుఁ బెద్దకుం
గిబ్బల రాచతేజి నుఱికింపుచు [లోకము లేలు సామి కె
చ్చు]బ్బిన భ క్తి మ్రొక్కులిడఁ జుబ్బనచూరఁగఁ గల్గు సౌఖ్యముల్.

72


సీ.

గగనగంగోత్తుంగకల్లోలరేఖయు
        మల్లికాదామంబు మౌళి నమర
నునుపారు వెలిచాయ పెనుబాము ముత్యాల
        పేరువక్షఃపీఠి బిత్తరింప
(కాలకూటకఠోరకాం)తి రింఛోళియు
        మృగనాభిముద్రయు మెడఁ దలిర్ప
మెఱుఁగెక్కు మువ్వన్నె మెకము దుప్పటియును
        మాంజిష్ఠమును గటి మలసియుండ


గీ.

వలుదశూలంబు నుత్ఫుల్లవనరుహంబు
(హస్తములకు) విలాసంబు నాచరింప
నర్ధనారీశ్వరాకారుఁ డైన విశ్వ
భర్త కాకాశికాపురి ప్రాణపదము.

73


శా.

ఆ గంగాజలసేక మావటుకనాథావాససంవీక్షణం
భాగంధేభముఖప్రసాద(విభనం బా)యన్నపూర్ణార్చనం
బాగంగాధరపాదపంకజయుగధ్యానానురాగంబు నా
హా! గీర్వాణులకైన ముచ్చటలు సేయంజాలవే భూవరా!

74


క.

అవిముక్తంబులు దక్కిన
యవి ముక్తశరీరజంతుపుంజంబులు దా

రవిముక్తంబులు నీల్గిన
యవి ముకము లరసి చూడ నవనీనాథా!

75


సీ.

ఒనర నానందకాననము దండనె యుండు
        ప్రోడదండనె బన్ను భూతబలము
నమరావగాజలం బాడఁజూచిన ధన్యుఁ
        డాడఁజూచును లలాటాంబకమున
గజరాజముఖు డుంఠి గన నెవ్వనిం గూడుఁ
        గూడు వానికిఁ బాఁపకోరచేఁదు
చేరి విశ్వేశుఁ బూజించి మించినపేరు
        పేరురంబునఁ బున్క పేరుఁ దాల్చు


గీ.

మేన మణికర్ణికామృత్స్న మెత్తుఘనుఁడు
మేన సాయకమున నేయుమింటియూళ్ళు
కాన శ్రీకాశికాపురిఁ గాద్రవేయ
సార్వభౌముండు నుతియింపఁ జాలఁ డధిప!

76


సీ.

పేర్చుకెంజడముడి బింజించి నలుదెస
        జాహ్నవిసలిలంబు జాలువార
అద్రిజాదత్తనఖాంకంబు నాఁజాలి
        గండమండలిఁ జంద్రకళ నటింప
భుజగేంద్రహారంబుఁ బునుకపేరును వీకఁ
        బృథులవక్షఃపీఠిఁ బెసఁగొనంగ
తోరంపుఁగటిసీమ దుసికిలి పసిదిండి
        వలువ మాటికిఁ బెళపెళమనంగ


గీ.

అన్నపూర్ణామహాదేవి యంతనింత
వెంటఁ జనుదేరఁ బ్రమథులు వెఱఁగుపడఁగ
విశ్వనాథుండు భవనంబు వెడలివచ్చి
కాశి నీల్గిననరుఁ జేరి కాచుఁ బ్రేమ.

77

మ.

అదె గంగాజలరేఖ యల్లదె శశాంకార్ధంబు ఫాలాక్ష మ
ల్లదె కాకోదరహారవల్లి యదె పద్మాపత్యభస్మచ్ఛటా
సదలంకారవిశేష మల్లదె మహాశాతత్రిశూలాయుధం
బదె యంచున్ సురలందు (రచ్చట మృతుండౌ) దేహి దేహంబునన్.

78


సీ.

దర్వీకరంబైన దర్వీకరముఁ జుట్టు
        మృగమైనఁ గెంగేల మృగముఁ బట్టు
శార్దూలపతియైన శార్దూలపతిఁ జీఱుఁ
        గరియైనఁ గరితోలుఁ గట్టి మీఱు
[జడలమెకంబైన యెడ జడల]నె మోచు
        నెద్దైన వెలిచాయ యెద్దుఁ బూన్చు
బోయవాఁడైనను బోయవానీరాడు
        నవియైన గావించు నవినవీడు


గీ.

పునుకయైనను విధిఁ గొట్టుఁ బునుకడుల్ల
నెముకయైనను మెడఁదాల్చు నెముకపేరు
(గాశికాపురిఁ బ్రవహిం)చు గగనగంగ
నీటఁ దోఁగిన మాత్రనె నృపవరేణ్య!

79


మ.

కకుబంతంబులవెంట గ్రాసమునకై కా లీచవో సారెసా
రెకుఁ గష్టాశఁ జరింపుచున్ ఫలముఁ దూలింపన్ వృథాయాసులై
[వికలత్వస్థితి దాసులై] పరిగళద్విజ్ఞానులై తూలి కా
శికి బోఁగానని వారిజన్మములు వీక్షింపన్ మృతిప్రాయముల్.

80


మ.

సుతులంచున్ సతులంచు గాంచనము లంచున్ దేరులంచున్ బురో
హితు లంచున్ బొ[డసూపి బుద్భుదములట్లే పోవుక్షర్యమ్ములన్]
సతముల్గా మది నమ్మి మూఢుఁడు దురాశాపాశబద్ధాత్ముఁడై
శితికంఠున్ భజియింప లేఁ డహహ! కాశీపుణ్యదేశంబునన్.

81

సీ.

పవడంపుఁ బొదరింట బాలహంసముపోలె
        జడముడి శశిరేఖ గడలుకొనఁగ
(నాకాశమండలి) నంగారకుఁడువోలె
        నిటలపట్టిక నగ్నినేత్ర మమర
వలుదశంఖములోనఁ బొలుచునీలమువోలెఁ
        గంధరమున మచ్చ గానుపింప
అమృతాంబురాశి నీరానుమేఘముపోలె
        నెమ్మేనఁ గరిచర్మ మెమ్మె మీఱ


గీ.

వలను మిగిలిన భాగ్యదేవతయపోలె
శ్రీవిశాలాక్షి చెంగటఁ జెలువుమిగులఁ
గాశికాపురిఁ బట్టంబు గట్టుకొన్న
విశ్వపతిఁ గొల్వ సౌఖ్యంబు శాశ్వతంబు.

82


క.

ప్రాయము మేఘచ్ఛాయా
ప్రాయము, విద్యున్నికాయభంగుర మరయన్
గాయము, కాశికిఁ బోవుట
నాయము దేహులకు ధరణినాయక! వింటే!

83


సీ.

పంచేద్రియస్ఫూర్తి పారుబట్టినఁ గాని
        చిత్తంబు నిల్కడ హత్తుకొనదు
చిత్తంబు నిలుకడ హత్తియుండినఁ గాని
        బుధసంగమమునకు బుద్ధి చొరదు
బుధసంగమంబునఁ బ్రొద్దుఁ ద్రోచినఁగాని
        విధ్యుక్తమార్గంబు వినఁగఁబడదు
విధ్యుక్తమార్గప్రవేశనైపుణిఁ గాని
        సత్త్వగుణంబు నిశ్చలము గాదు


గీ.

సత్త్వగుణమునఁ గాని ధూర్జటియె దైవ
మను విబోధంబు సమకూడ దందుఁగాని

యొండుదెస ముక్తి గనుపట్ట దుగ్రుఁ డేలు
నగరికడ నీల్గుమాత్రనె తగులు ముక్తి.

84


సీ.

కన్నులారఁగఁ గాశిఁ గననివానిభవంబు
        సలిలంబులేని కాసారమట్లు
కాశి కేఁగఁ బ్రియంబు గలుగకుండినవాని
        భావంబు దలపోయఁ బాడుకొంప
కలదు తీర్థము కాశికకుఁ దుల్యమనువాని
        కెందుఁ బ్రాయశ్చిత్త మింతలేదు
కాశికాపురమున్కిఁ గడచి యొండొకచోటి
        కేఁగు నెవ్వఁడు భాగ్యహీనుఁ డతఁడు


గీ.

యాగములు వేయు చేయంగ నైనఫలము
కోటిగోదానముల నొనగూడుఫలము
పెక్కునల్లిండ్లు నిలుపుటఁ బేర్చుఫలము
కాశి నొకపూట వసియింపఁ గలుగు నధిప.

85


క.

గోపతి గమనునిపురి గం
గాపగలోఁ గ్రుంకువెట్టు నతిపుణ్యులకున్
దాపత్రయం బుడిగి యొక
తాపము బాలమున నెవుడుఁ దరలకయుండున్.

86


సీ.

అభ్రగంగాప్రవాహంబు లెన్నియొకాని
        (తల ధరియింతు) రందఱును నదులు
పదినూఱుపడగలపాము లెన్నియొకాని
        యందఱు నురగేంద్రహారయుతులు
డాలొందు చంద్రఖండంబు లెన్నియొకాని
        యందఱు ధరియింతు (రమృతకరుని
విషరాశిఁ) బుట్టిన విషము లెన్నియొకాని
        యంతఱు హాలాహలాంకగళులు

గీ.

గంధగజదైత్యు లెందఱోకాని యంద
ఱతుల కరిచర్మపటధారు లైనవారు
కర్మబంధంబు [స్వప్నభాగముగనైన]
క్రాలు కొనకుండ నిద్రింపఁ జాలుఘనులు.

87


సీ.

ప్రతిదినంబును మదభ్రాంతుఁడై సింధువు
        పానంబు సేయనీ బైసిమాలి
యోరంతప్రొద్దు నో రుడుపక కొండెంబు
        పలుకనీ లేనివి గ(లవి గూర్చి)
[యెపుడు దుర్భ]రహింసయే నిత్యకృత్యంబు
        గానుండనీ క్రూరకర్మపరత
కాయికంబుగ సదాకాలంబు హేమంబు
        లాగించనీ దొంగభాగుతోడ


గీ.

కవయనీ యెఱింగియుఁ [గాంత] గానివాని
తొడుకనీ [దుష్టదానముల్ దొంతరలుగ]
గగనగంగాతరంగశీకరము సోఁకఁ
బావనుండగుఁ గాశిలోఁ బంచజనుడు.

88


క.

ఇలఁగలతీర్థము లాడిన
గలుగదు హరరూపలబ్ధి గాశికలోనన్
నెల గంగ నాడ నౌదల
నెల (పూఁపధరించు నరుఁడు నిక్కము) వింటే.

89


ఉ.

పుట్టువు సర్వదుఃఖముల పుట్టినయిల్లని పుట్టకుండ రా
దెట్టివివేకికైన నది యెట్లనినన్ దమపూర్వకర్మముల్
తిట్టలు జన్మహేతువులు తీరదు వానిజయింపఁ గర్మపుం
[దెట్టువ నిర్విశేషముగఁ] దెంపఁగ వచ్చును గాశి కేఁగినన్.

90

ఉ.

కోకకుఁ గూటికై యొకనిఁ గొల్చి తదీరితవాక్యపద్ధతిన్
జేకొని యూడిగంపుఁబని సేయుచుఁ బ్రాయము సత్తుగా మదిం
గై[కొన కీశ్వరున్ దిరిగినన్] కుసుమీకృతశీ[తభాఃకళా
ప్రాకటజూటితో నరుఁడు భాసిలు గంగ మునింగి కాశిలో.]

91


గీ.

[తనకుఁబలె స్వచ్ఛమై యొప్పు తనువొసంగి
తనదు నొకపాయ మల్లెపూదండఁ జేసి
వానిసిగ నిడు దేహావసానవేళ
స్నాతపైఁ గాశి గంగ కెంత కనికరమొ.]

92


గీ.

[మూడ దతనికి చాపు చావునకె మూడు
మూఁడుజన్మములం దంత్య మూడిపోయి
కనులు రెండున్నవానికిఁ గనులు మూఁడు
వారణాసి గంగాస్నానకారణమున.]

93


గీ.

[కాశిలోఁ బట్టతలవాఁడు గంగ మునిఁగి
జడముడి ధరించు దానిపై సవదరించు
ఫణిఫణారత్నరుచి దానిపై వహించు
మొలకజాబిలి జాజిపూమొగ్గవోలె].

94


గీ.

[ఈభవమ్మున ఫలమున కేమిగాని
రాఁగలభవమ్ము మొదలంట రాచినాఁడు
గంగలో వారణాసి మునుంగువాఁడు]
దొంటి భవమునఁ బుణ్యంబుఁ దొడినాఁడు.

95


సీ.

ఆనందవనమున కరిగెద నని తలం
        చినఁ దీర్థముల కెల్లఁ జనినయట్ల
వారాణసికిఁ బోయివచ్చెద నని పల్క
        సకలాగమంబులు (చదివినట్ల)

(ఇదె కాశిపురికిఁ) జేరెదనంచు నొకపదం
        బిడ భూమి వలగొనఁ దొడఁగి నట్ల
అవిముక్త మిదె యదె యని డాయఁ జనెనేని
        చిరపాపములకడ చేరినట్ల


ఆ.

ఆమహాశ్మశానభూమి[నిఁ గలయంగ
తేఱిచూచె]నేని తేటతెల్ల
గాఁగ ముక్తికాంతఁ గలయంగఁ జూచుట
యనుచుఁ జాటిచెప్పు మునికులంబు.

96


ఉ.

చాచఁడఁటే పదాంబుజము చక్కఁగఁ గాశికి నేఁగుత్రోవకున్
దోఁచఁడఁటే నిలింప [నదిఁ దోగఁగఁ బెన్మసనాన] పాపముల్
గ్రాఁచఁడంఁటే వివేకశిఖికాఁక[ల వాలి]చె మానవుండు తం
పీఁచము లెత్తకుండుదురె పేర్చినకిన్కఁ గృతాంతకింకరుల్.

97


ఉ.

ఆడుదు రొండు తీర్థముల నాడినఁ బాపము [నెల్ల నవ్విరా
పాడునొకో!] జను ల్పదము లాడినకాలమునందె బుద్ధిఁబో
నాడకా కాశి కేఁగి యమరాపగలోపలఁ జల్లఁగా జలం
బాడుట పుట్టువుల్ విరుగనాడుట ముక్తినిఁ బెండ్లియాడుటల్.

98


స్రగ్ధర.

...........స్థిత)మణికళికోదీర్ణసంపూర్ణకీర్ణాం
శుని శేషశ్రీవిలాసస్ఫురితపదసరోజుండు ఖండేందుజూటుం
డవధానం బొప్ప గంగాంబ్వుపహృతకలుషప్రాణికిం గాశిలోనన్
జెవి నోంకారా(క్షరంబున్ గురుకరణిఁ ద)గం జేర్చుఁ బ్రాణాంతవేళన్.

99


సీ.

తడవు కాలమువోలెఁ దల్లి గర్భంబున
        నణఁగియుండిన నిగ్రహంబు వాయ
జననంబుఁ గాంచి యజ్ఞానంబు చేసైన
        స్తన్యపానాది...................

ఒదిగి గ్రాసార్థమై యొకని సేవింపఁ బ్రా
        ప్తంబైన మది సంకటంబు వాయ
ఘనవయోమదమునఁ గన్నుగానక త్రిమ్మ
        రఁగ సంభవిల్లిన రట్టు వాయ


గీ.

ఆమయంబులచేనైన యలఁత వాయ
కర్మపాశంబు చుట్టిన కట్లు వాయ
చేరి కన్నుల కతిథిఁగాఁ జేయవలయు
నసమలోచను తలపూవు నభ్రగంగ.

100


చ.

జ్వరము పయోవగాహమున వర్ధిలు మానఁగ నేర దందు రి
ద్ధరపయి వైద్యు లెల్ల వసుధాతలనాయక! కాశిలోన నం
బరతటి నీజలస్ఫురణఁ బాపమహాజ్వర మాఱుఁ గ్రొత్త శ్రీ
కర హర వైద్యపుంగవ నికామ దయోదయబృంభణంబునన్.

101


సీ.

మెట్టనీ ధర చుట్టు మెట్టకుండినవాఁడ
        మృడుని పట్టణవీథి మెట్టఁడేని
ఆడనీ తీర్థంబు లాడకుండినవాఁడ
        యభ్రవాహినిఁ దీర్థమాడఁడేని
చూడనీ యఖిలంబుఁ జూడకుండినవాఁడఁ
        గాశీస్థితులఁ జూడఁగలుగఁడేని
కొలువనీ వేల్పులఁ గొలువకుండినవాఁడ
        గోరాజవాహనుఁ గొలువఁడేని


గీ.

చదువనీ వేదముల్ నాల్గు చదువకున్న
వాఁడ శివకథ చదువనివాఁడయేని
వేయు చెప్పంగ నేల పృథ్వీతలేంద్ర!
కాశి కేఁగినఁగాని మోక్షంబు లేదు.

102


ఉ.

తేలుచుఁ జొన్నయాకుపయిఁ దేనియవోలిన యాజవంజవ
శ్రీలఘుభోగసిద్ధిఁ బడి చిక్కినఁ జిక్కు మహాపదంబుధిం

గూలి నరుండు గాక యొనగూడిన భక్తిని గాశి కేఁగినన్
గాలముఁ ద్రోచి కాలు(నికిఁగాదని) కాలను బొమ్మగట్టఁడే.

103


క.

ధాత్రీశ! వినుము కాశీ
క్షేత్రంబునఁ జక్రమైన జీవం బఱి త
న్మిత్రేందుచక్రరథము వి
చిత్రంబుగ నెక్కియుండుఁ జెన్నెసలారన్.

104


సీ.

తక్కినయెడఁ దత్త్వ[దర్శ]నోజ్జ్వలు [డైన
        బోద్ధయిందలి] మందబుద్ధిఁ బోలఁ
డొకచోట యోగియై యుండినవాఁ డిందు
        భోగియై చరియించు పురుషుఁ బోలఁ
డన్యస్థలమున నధ్యయనతత్పరుఁడైన
        వాఁ డిందుఁ జదువనివానిఁ బోలఁ
[డెందేని వేదన కెల్ల యిచ్చు]ను దారుఁ
        డిందు లోభముఁ బూనుహీనుఁ బోలఁ


గీ.

డఖిలతీర్థంబు లాడిన యట్టిమేటి
బోలఁ డిందులయ స్నానశీలు నైన
ననుచు సంశయదూరులై యరసి చూచి
నడ[చెదరు పండితుల్ వారణాసి పురి]కి.

105


సీ.

అమితప్రదక్షిణక్రమణంబు గమనంబు
        మంత్రంబు లాడినమాట లరయ
నాహుతివిధులు నిత్యాన్నపానాదులు
        యోగప్రకారంబు భోగమహిమ
అఖిలస్థుఁ డని యీశు నర.....
        (సకలతీర్థా)సక్తి జలక మాట

వస్తుపరాఙ్ముఖత్వము చాలియొల్లమి
        సచ్ఛాస్త్రముల విన్కి జూడ వినుట


గీ.

జీవ పరమాత్మ సంపర్కసిద్ధినై న
చొక్కు నిద్రావిహారంబు సోమధరుని
మూ(ర్తిసంవీక్షణము బంధ)మోక్షణంబు
కాశి గాపురమున్న ప్రాగ్జనునకైన.

106


మ.

ధరణీవల్లభ! భక్తితోడ నవిముక్తక్షేత్రముం జేరు సు
స్థిరపుణ్యాత్ములు ముక్తిఁ గైకొనుటయే చిత్రంబు మున్నొక్కభూ
సురపుత్త్రుఁడు (మదాలసుండు...) శూన్యుండు దుర్మార్గసం
చరణోదగ్రుఁడు గాంచె నందు మృతుఁడై శంభుస్వరూపోన్నతిన్.

107


మ.

అనినన్ నేత్రసరోజపత్రములలో నానందబాష్పంబులన్
దనుసీమన్ బులకాంకురచ్చటలు [సంధానించి తాత్పర్య మొ]
ప్ప నరేంద్రుండు మునీంద్రుఁ బల్కె విను మోభవ్యాత్మ! నీ విట్లు చె
ప్పిన యానందవనప్రశంసకతనన భేదించితిన్ బాపమున్.

108


గీ.

పుత్త్రసంపత్తిపైఁ గాంక్ష పొరలు నాకుఁ
గలిగెఁ [గాశీనివాసభాగ్యంబుస్వామి!]
గాజుఁబూస నిరీక్షింపఁ గడఁగువాని
గరయ నవపద్మరాగంబు దొరకు నాఁగ.

109


క.

వినఁబడియె గాశిమహిమయు
ననిమిష, గంగాపయోభవాధిక్యము శం
భుని కీ(ర్తనంబువిధ)ములు
గనుఁగొంటిన్ బ్రదుకఁగంటిఁ గౌండిన్యమునీ!

110


వ.

మీర లిప్పుడు చెప్పిన మదాలసుండనువాఁ డెవ్వం డెద్దేశంబువాఁ డేవురంబునం గాఁపురంబుండుఁ దద్దుశ్చరిత్రుం బుత్త్రుండుఁ

గాఁ గాంచిన తండ్రియుఁ దల్లియు నెవ్వ, రేమి నెపంబున వాఁడు కులాచారదూరుం డయ్యెఁ గడపట నెట్లు కాశీలోన మేను దొఱంగి గంగాధరు కారుణ్యంబునఁ గృతార్థుఁడయ్యె నీయర్థంబుఁ దేటతెల్లంబు సేసి నన్నుఁ జరితార్థుఁ జేయవే యనుడుఁ దపోధనాగ్రణి యశోధనాగ్రణిం గూర్చి కూర్చిన నెయ్యంబున నిట్లనియె.

111


మ.

ఇలకుం గుంతలపుష్పదామ మన శ్రీ నింపారి సొంపొందు కుం
తలదేశంబున రత్నగర్భపురికిన్ నాథుండు గంభీరని
శ్చలతేజోనిధి చంద్రకేతుఁ డరివీక్షాధూమకేతుండు త
మ్ముల చుట్టంబగు వేల్పు వంగడమునన్ బుట్టెన్ మహీవల్లభా!

112


ఉ.

ఆదిమభిల్లు మంచుమల యల్లుఁ బయోరుహనాభ భల్లుఁ గా
కోదరరాజకుండలసముజ్జ్వలగల్లు భజించి మించునా
భూదయితావతంస మణిప్రోల మహీసురుఁ డొక్కఁ డొప్పు వి
ద్యాదివిషద్గురుండు మహిమాఢ్యుఁడు ధీనిధినామధేయుఁడై.

113


సీ.

చతురాగమంబులు సకలశాస్త్రంబులు
        నామూలచూడ మౌనట్లు తెలిసి
భక్తిసంపదయు నాసక్తియుఁ గల్గిన
        శిష్యుల కవియెల్లఁ జెప్ప నేర్చి
యరయ జ్యోతిప్టోమ మాదిగాఁగల సప్త
        తంతువు లన్నియుఁ దగ నొనర్చి
వేదాంతవిద్యావివేకం[బు గూర్చుచు
        నల]తులసోమయాజులుగఁ జేసి


గీ.

తగినవారికి దానంబు దా నొనర్చి
మఱి ప్రతిగ్రహశక్తిపై వెఱవు గలిగి

బ్రాహ్మణాకృతిఁ జూపట్టు బ్రహ్మవోలె
నవని ధీనిధి ధీనిధియై తలిర్చె.

114


చ.

(వ్రతములు చేసి) పెక్కు లుపవాసములున్ మఱిపెక్కు లుప్పిఁడుల్
ధృతి నొనరించి కూర్మిఁ బరదేసులఁ దల్లియపోలెఁ బ్రోచి మా
నితగతి మింటిదయ్యముల నేలకుఁ దెచ్చి కుమారుఁ గాంచెఁ ద
త్సతి [శుభకీర్తి నాబఁ]రగుఁజామ పతివ్రత సంతసంబునన్.

115


ఆ.

అవనినాథ! భూసురాగ్రణి తనపుత్త్ర
కుని మదాలసాఖ్యఁ గూర్చెఁ బ్రీతి
నలిమదాలసాత్ముఁ డగు నీతఁ డని మీఁదఁ
దలఁపు జనుల కెల్లఁ దెలుపు(రీతి.)

116


క.

[ద్వికమునకు వ]చ్చు బాలకు
నొకపూఁటనె పెంచుచుండె నుర్వీసురభి
తకురంగనేత్ర శుభకీ
ర్తికిఁ దగుశుభకీర్తిమోహదీపిత యగుచున్.

117


వ.

ఇట్లు దినదినప్రవర్ధమానుం డగు సూనునకు వి.............దజ్జనకుం డన్నప్రాశన చౌలోపనయనాది కృత్యంబులు యథాశాస్త్రంబును యథాకాలంబును నగునట్లుగఁ బరికల్పితంబులు సేయించి వేదాదికంబులగు విద్యావిశేషంబులఁ బాండిత్యంబు......ధుఁడగు ధరామరుకుమారి సుకుమారాంగి జంద్రవదనం జంద్రకళ యనుదానిం బెండ్లియార్చి సంతసిల్లుచుఁ దామరతంపరలగు సంపద్విలాసంబునం బెంపు వహించి కతిపయసంవత్స........మ్మహీబృందారకనందనుండు.

118


సీ.

కన్పుకన్పున మౌక్తికంబు లుద్దాలించుఁ
        జెఱకు సింగిణి చేతఁ జెప్పకున్నఁ

ద్రొక్కనిచోటులు త్రొక్కుచు మిన్నందు
        ఱెక్కలు గలతేజి నెక్కకున్నఁ
[జెలగి యిర్నాల్గు]దిక్కులు పువ్వుఁ గట్టించు
        నలుఁగులు పొదిలోన నిలువకున్న
మిగమిస మనుగండు మీనుటెక్కెముతోడఁ
        జిగురెల్లి నీడలఁ దగులకున్న


గీ.

[మానె యను] మానినీజనమానహరణ
[చాతురీసార]సౌభాగ్యశంబరారి
యనఁగఁ జూపట్టె భూమిదేవాత్మజుండు
నాలుగంచుల నవయౌవనంబునందు.

119


చ.

చతురామ్నాయవిహారముల్ మఱచె శాస్త్రక్రీడ చాలించె మా
నిరపౌరాణికవాక్యసంశ్రవణమున్ నిర్ధూతముం జేసె శ్రీ
సుత వాత్స్యాయన కూచిమారమతముల్ చూచెన్ గులాచారసం
గతికిన్ దూరము చేసె నెమ్మనము దుష్కర్ముండు పాఱుం డొగిన్.

120


సీ.

నెరవెండ్రుకలు దువ్వి నిలువుకొప్పు ఘటించి
        గుసుమదామము మీఁదఁ గుస్తరించి
నుదుట గందపుఁజుక్క నూల్కొల్సి నీలాల
        పోగంట్లు చెవిదోయిఁ బొందుపఱిచి
తరలమై బంగారుతాయెత్తుగల ముత్తె
        ములపేరు పేరురంబున ధరించి
కటిఁ దాళిగోణాము కడచుంగుదరఁజీర
        పట్టుదట్టీ ద్రిండుగట్టి నడుమ


గీ.

కేల డాఁపలి చిటికెనవ్రేలియందు
నలఁతి పగడాలయుంగర మనువుకొలిపి
గౌరవంబీని కలికి సింగార మొదవ
నారజంబుగఁ జరియించు నతఁడు మఱియు.

121

ఉ.

బోఁడికె మూపుపైఁ గరము పొందగఁజేసి కరంబు మ్రోయు నం
బాడిగ లోలి మెట్టి కరపద్మము క్రొవ్విరిచెండు మాటికిన్
వేడుక బారమీటుచు నవీననఖాంకవిలాసలక్ష్మితోఁ
గూడినమేను వమ్ముకొనఁ గ్రుమ్మరుచుండు నతండు వీథులన్.

122


శా.

క్రాలుం గన్నులనిగ్గు క్రొమ్మెఱుఁగు బింకంబుల్ దువాళింప నీ
లాలోలాలకకాంతి తుమ్మెదలచాయం జాయనం బూర్ణిమా
ప్రాలేయాంశునిఁబోలుముద్దుమొ[గ మొప్పన్ మారుపల్] దారులం
గేలిం బెట్టు మదేభగామినులతోఁ గ్రీడించువాఁ డిమ్ములన్.

123


గీ.

జూద మన్నను మదియందుఁ బాదుకొల్పుఁ
బరధనం బన్న నపహరింపంగఁ గోరు
నబ్జముఖి [యన్న నా ధన]౦బంద జేయు
బ్రహ్మవిద్యావిదూరుఁడై బ్రాహ్మణుండు.

124


గీ.

గమియఁ బూచిన తంగేటికరణి సకల
భూషణాంచితగాత్రియై పొలుపు మిగులు
చంద్రగళఁ గూడి సంసారచ[తురసుఖము
పొందగాంక్షింప] డతఁడు దుర్బుద్ధి యగుట.

125


సీ.

మూసిన ముత్తెంబు లౌసరోజాక్షులఁ
        గలికి కటారికత్తెలుగఁ జేసి
కలలోనఁ బరపూరషులపొం దెఱుంగని
        సతుల పాతివ్రత్యసరణిఁ జెఱచి
గరివోని వయసు [మీరుకన్యలకు రతి
        క్రమరుచి గు]రుకంబు గట్టిపెట్టి
తల్లి కూఁతురు మఱఁదలు నాక చిట్టంటు
        వలల నందఱి కొక్క వావి చూపి

గీ.

ఆర్యు లెఱిఁగినఁ గాదందు రనక విధి ని
షేధములయందుఁ గలిగినబోధ మెడలి
లజ్జచ[టితంబుగా వీథులందుఁ దిరుగు]
పరమకాముకముఖ్యుఁడు ధరణిసురుఁడు.

125


సీ.

కానక కన్నసంతానంబు గావున
        నౌఁ గా దనఁగ నోడు నంబ తనయు
వలదని వారింపఁ బల మెక్కు ననుశంకఁ
        దా నెఱుంగనియట్ల తండ్రి యుండు
[బరమపాతివ్రత్యపరిచితాత్మ]యుఁగాన
        నిల్లాలు పతిచేఁత కెదుర వెఱచు
యెక్కడి మే[వెంగడ] మితని దిద్దుద మంచుఁ
        గోరి మిత్రులు బుద్ధిఁ గూర్ప రతని


గీ.

బంధువు ల్వీని నిర్బంధపఱుప మనకు
నేమికారణ మని చెప్ప రింత యొత్తి
అన్ని ఠావుల [సముపేక్ష కగ్గమగుచు]
(నంతకం)తకుఁ బరచయ్యె నవనిసురుఁడు.

127


ఉ.

అల్లది మేలదయ్యె మఱి యల్లది కానుక యంపె నాకు నే
నొల్లను దాని విత్తమును నొక్కటి మాపటి నిన్న వీటిలో
మెల్లన పోవఁ గంటి న[ది మిఱ్ఱనుచున్ బ్రజనవ్వుకొ]న్నఁ దాఁ
బ్రల్లదుఁడై చరించుఁ జెడుపాఱుఁడు మన్మథగోచరాత్ముఁడై.

128


సీ.

పొటమరించిన వీటివిటుల యల్కలు దీర్చుఁ
        బోరించుఁ దమలోన వారసతుల
పలుమాఱుఁ గోడిపుంజుల(ను బోరాడించుఁ)
        గామశాస్త్రప్రసంగములు చేయు

నడిగించు మగనాండ్ర నర్థంబు వెదచల్లి
        కలవారిగృహములు గన్నవెట్టు
సాముసేయును బోటుచందంబు గనుకోర్కె
        కలికిబాగులు మీఱ నిలుపు


గీ.

సంధ్య వార్వఁడు వేల్వఁడు చర్చసేయఁ
డాగమంబులఁ దీర్థంబులాడఁ డుచిత
తిథుల నుపవాసముండఁడు తిప్పకాయ
చందములు దక్క భూసురనందనుండు.

129


క.

ఈ చందంబునఁ బరచై
నీచగతిం దిరుగునతని నిఖిలజనంబుల్
చీ చీ! యనఁ దొడఁగిరి యహ
హా! చెడదే యశము కామియగు మూఢునకున్.

130


ఉ.

భవ్యుడు తద్గురుండు నరపాలగృహంబున మాన్యుఁడై సుధీ
సేవ్యగతిం దలిర్చుటఁ బ్రసిద్ధుఁడు కావున “బ్రాహ్మణో నహం
తవ్య” యటన్న నీతియు సతంబయి చెల్లుట నద్దురాత్ముఁ బా
వవ్యవసాయుఁ జంపుటకుఁ బౌరులు లోగుదు రేమి సేసినన్.

131


సీ.

తగవు గాదని చెప్పెఁ దల్లి సద్భుద్ధులు
        హేతుదృష్టాంతంబు లేర్పరించి
ధర్మశాస్త్రముల యంతర్మర్మములు దెల్పి
        వలదని వారించె బెలుచఁ దండ్రి
కులమును వాసియుఁ గలవాఁడ వేలన్న
        యని చేరి బోధించి రనుఁగుసఖులు
“సరివారు నవ్వఁ ద్రిమ్మరి వేటి కయ్యెదు
        చాలింపు” మనిరి సజ్జనులు పెద్ద

గీ.

లిట్లు తగువారు సన్మార్గ మెద్దియైన
వివరముగఁ దేటపఱిిచిన వినఁ డతండు
హెచ్చి మూఁడవపురుషార్థమే యిహంబుఁ
బరము నీఁజాలునది గాఁగఁ బదిలపఱిచి.

132


గీ.

పిన్న వయసునఁ గడుఁ బెంచి పెరుఁగనిచ్చి
వంపలేరైరి సుతు వాలు వర్గమైన
దల్లిదండ్రులు మొలకైన తఱినిఁ జెట్టు
వంపఁబడుగాక హెచ్చిన వంపనగునె.

138


ఉ.

ఆరయఁ బాలవంటికుల మాఱడిఁ బోవఁగనిచ్చి వీటిలో
నారజమై చరించు వసుధామరనందనుఁ డిట్టివారు నె
వ్వారును జీరికిం గొనక [వాడిన పూవునుబోలెఁ] జుల్కఁగా
నీరసవృత్తిఁ జూచి రతినింద్యుఁడు వీఁడని యేవగింపుచున్.

134


క.

కొడుకుదెసఁ గలుగు మచ్చిక
విడిచిరి దలిదండ్రు లాత్మ విసుగుచు నేలా
[1]విడువక యఱ్ఱు దినంగా
దొ[డగుడు రే విసము తొలఁగె దొసఁ]గు నరేంద్రా!

135


వ.

ఇవ్విధంబున మదాలసుం డగు మదాలసుండు దన్నుం గాసునకైనం గొననివారలగుటఁ జుట్టంబులఁ బుట్టినవారలఁ బరిత్యజించి దేశాంతరంబు వోవం జిం[తించి యొక్కక్కనాడు.]

136


ఉ.

ఒక్కటఁ బిక్కటిల్లి యిరు లో యన నో యనునడ్కిరేయిఁ బెం
పెక్కిన తెంపునం బురి మహేశ్వరధామముఁ జొచ్చి విస్ఫుర
ద్రుక్కమనీయరత్నములతోటి యనర్ఘవిభూషణావలున్
వె[క్కస మౌచు నిండి తరలింపఁగఁ] బోలనిబెట్టె నెట్టనన్.

137

క.

కాఁగాదు దేవధన మని
లోగక లాగించి యడవిలో తెరువునఁ గా
రేగులుఁ దంగేళ్ళు గ నతం
డేఁగెం దనచొప్పు పౌరు లెఱుఁగకయుండన్.

138


చ.

మునుకొని జన్మభూమి [విడిపోయిన పోక నరణ్యసీ]మలోఁ
గనియెను బాహ్మణబ్రువుఁడు కాంచననిర్మితకేలిశైలమున్
దినకరచుంబి కేతుమణిదీప్తివిశాలముఁ బూర్ణచంద్రమో
వినిమయ యోగ్యయౌవత నవీనముఖాబ్దముఁ గన్య(కుబ్జమున్.)

139


ఉ.

[భూరి విచిత్ర]వస్తువుల పుట్టిన యిల్లగు నమ్మహాపురం
బారయ గూఢమార్గమున నల్లన చొచ్చి ధనాఢ్యు నొక్కబే
హారు వశంబు సేసికొని యాతనిచేతికి సొమ్ము దాఁపఁగాఁ
జేరికయిచ్చి సాత్త్వికుల చిహ్నముతో [నతఁడుండె నిమ్ముగన్.]

140


ఉ.

మానితలీల సజ్జనునిమాడ్కి మహీసురుఁ డప్పురంబులో
మానవపంక్తితోఁ గలసి మచ్చికయై తలలోని నాల్కయై
ధీనిధి యాతఁడే యనఁగఁ దేఁకువఁ దేజము గాంచియుండెఁ బెం
పూనఁగఁ గొన్నివాసరము........................తటన్.

141


క.

ప్రాఁబడిన పిదప మరునకు
లోబడియుం డిందు వారలోలాక్షులకుం
దాఁ బసిడిఁ బంపు విప్రుఁడు
తోఁ బుట్టిన పుఱ్ఱెగుణము తొలఁగునె యధిపా!

142


వ.

అక్కాలంబున.

143


చ.

(అనుపమమైనయ)ప్పురమునం దొకసానికి బిడ్డయై విమో
హనరుచిరాంగి రెండు బదియైన సమంబుల ముద్దులాడి క్రొ
న్ననవిలుకానిరాజ్యసుఖనవ్యసమృద్ధికిఁ బట్టుఁగొమ్ము నై
కనకలతా[భిధాన యొకకన్నియ] చెన్ను వహించె భూవరా.

144

మ.

చదివెం గామకళారహస్యములు శిక్షం గాంచె వీణాదులన్
బదిలంబయ్యె సమస్తనాట్యకలనాపాండిత్యహేలన్ మదిన్
గదియించెన్ గరువంబు జాణతనమున్ గాంభీర్యమున్ సిగ్గునన్
బొదలెన్ బాలిక కేలికాజితమరుత్పూర్ణేందుబింబాస్యయై.

145


ఉ.

సానికులంబులోనఁ గలసానులకెల్ల ననావతంసమై
మానిని మాననీయగుణమండన కొండిక ప్రాయ మొన్పఁగా
సానలఁ దేరినట్టి మరుశస్త్రియపోలె విటాలిజాలికిం
దే నెఱిఁగెన్ విలాసరసదేవతయై తగ నాఁడునాటికిన్.

146


శా.

ఆ కాంతామణి యిట్లు కాముకకటాక్షానందనిర్వాహక
శ్రీకిం గూర్చిన విం(దు) నాఁబరఁగి రాజీవాక్షులుం దాను లిం
గాకారంబున నొప్పు తన్నగరరథ్యావాసునాగేశ్వరా
ఖ్యాకున్ శంభు భజింప నేఁగె నొకనాఁ డత్యంతలీలాగతిన్.

147


సీ.

కుసుమగర్భం బైన కొప్పు నెత్తావుల
        సొబగు దిక్కుల బర్వి చోడుముట్టఁ
జపలకటాక్షవీక్షణవిభ్రమంబులు
        క్రొమ్మెఱుంగుల తళ్కుఁ గుస్తరింప
మొలకచన్నులమీద మొలకలెత్తినకాంతి
        పలిపపయ్యెదఁ బైఁడి వలువ సేయ
అడుగుఁ దమ్ముల తేటబెడఁగు మార్గమునకుఁ
        గ్రొత్తలత్తుకచాయ హత్తుకొలుప


గీ.

కలికిపలుకులఁ దేనియ లొలుక నలగ
గతులు రాయంచ నడవులఁ బ్రతిఘటింప
ప్రాణనంయుక్తదర్పకబాణ మనఁగ
నాతి వేంచేసె శితికంఠునగరి కపుడు.

148

మ.

చరణాంభోరుహహంసకధ్వని నిరాళస్వాంతులం జొక్కఁజే
య రతిం బోలినమూర్తి విశ్వజనతాహ్లాదంబు హత్తింవ న
త్తరుణీరత్నము [వచ్చెఁ బందెమి]డి యంతం దిక్కులం గెల్చి శం
బరవిద్వేషి సమంత్రశక్తి కొన యొప్పున్ గ్రమ్మఠం జేరెనాన్.

149


పృధ్వీ.

కనత్కనకకుంభసంగతము చారుముక్తావళీ
పినద్ధమణితోరణా[వృత మనల్పశిల్పాశ్రయం]త
బనింద్ర? మత్య నుపమాన వాద్యంబు నౌ
మనోజహరుధామ మమ్మహిళ చేరె హేలాగతిన్.

150


క.

మెలఁకువ మెఱుఁగులు చూపులఁ
గలువలు పలుకులను వజ్రకళికలు [మేనన్
బులకల పనలు]లు నెలకొన
నలికుంతల యంతఁ గాంచె నలికతలాక్షున్.

151


శా.

జ్యోతీరూపము దివ్యలింగము ద్రయీచూడామణిన్ లోకవి
ఖ్యాతున్ బాలిక నీలకుంతల సరోజా(స్యల్ వయస్యల్
ప్రీతిన్ గన్ను)లు మోడ్చుచున్ విలసనశ్రీ యొప్ప నాదేవుపై
గీతంబుల్ సొబగొందఁ బాడె రసము ల్గీల్కొల్పి తానంబులన్.

152


చ.

కల మృదులస్వరంబుగల కంజదళాక్షులఁ గూడి పాడు న
క్కలికి యొ[యారి పాటలకుఁ గామవిరో]ధియు మెచ్చె నాత్మలో
శిలలు గరంగెఁ దర్వులను జేకుఱెఁ బల్లవలక్ష్మి భక్తి పం
క్తులఁ గలజొమ్మలం గరము దూఁకొనె జీవిత మద్భుతంబుగన్.

153


ఉ.

ఆసమయంబునం [మధుమదాలసుఁడైన]మదాలసుండు లీ
లాసఖులైనవారు కడలన్ బరిహాసకథాప్రసంగవి
న్యాసము చూప వచ్చి జలజాననపాట మనంబు రంజిలన్
జేసినఁ బోక నిల్చె గుడిచేరువఁ గేలికురంగశాబమై.

154

చ.

నిలిచి (యొకింతసేపు రమణీమణిఁ గాంచి) ముదంబు విస్మయం
బలమి మనంబుతోఁ బెనఁగ నంగమునం బులకాంకురచ్ఛటల్
నెలకొనఁ దోన ఘర్మమును నిండఁగ నన్యములైనచేష్టితం
బుల సడలించి చిత్రకృతమూర్తియొ నాఁ గనుపట్టె నెట్టనన్.

155


శా.

(కామాంధుడయి) విప్రసూనుఁడు మహోత్కంఠాతిరేకంబుతో
రామారత్నము పాటవెంబడినె సంరంభంబుతోఁ జంద్రభృ
ద్ధామం బప్పుడు చొచ్చి కాంచె నచటన్ దారుణ్యలక్ష్మీ(లతా
రామంబున్ నళి)నాక్షి ప్రేక్షణసుధారాశిన్ రసావల్లభా!

156


ఉ.

తారలలోని చంద్రకళ తమ్ములలోని మరాళి మల్లికా
వారములోని గంధఫలి వట్రువముత్తెపుఁబేరులోని వి
స్ఫారమణీశ(లాకయన వారల)లోపల నున్నకన్నియన్
గోరి నుతించె భూసురుఁడు గొబ్బునఁ జిత్తము తత్తఱింపఁగన్.

157


క.

సానికుమారి యగు న
మ్మానినిఁ బ్రియమాని నిశితమన్మథశరముల్
మైనాట నాటఁ జూచె మ
హానందరసాబ్ధి నోలలాడుచు నతఁడున్.

158


సీ.

చీఁకటిగొనఁబోలు చికురవల్లరులలో
        గనుపట్టుచిమ్మచీఁకటులు వొదవ
జడనుగాఁబోలు నుజ్జ్వలచారువదనేందు
        మండలామృతపూరమగ్న మగుచు
ఇఱుకునఁ బడఁబోలు మెఱుగారు పాలిండ్ల
        దోయిసందు కరంబు దూరఁ బాఱి
అడుగుఁ జేరఁగఁబోలు నత్యంతగంభీర
        నాభీసరస్సీమ నాడఁజొచ్చి

గీ.

ఉరునితంబంబు వలగొన నరుగఁబోలు
మ్రొక్క జారంగఁబోలు నూరువులవెంటఁ
దిరుగఁగానేరదయ్యె భూసురకుమారు
చూడ్కి యెలనాఁగచెలువంబు చూచినపుడు.

159


మ.

అంతనింతయు నింపుసొంపున నంతకాహితుఁ గొల్చి మేల్
సంతసంబునఁ గూడి తోడివిశాలనేత్రలు దాను ది
గ్దంతియానము మించుయానము గల్గి యింటికి నేఁగ వి
భ్రాంతి నెంతయుఁ బట్టి ధీనిధిపట్టి యిట్లను భూవరా.

160


ఉ.

ఎవ్వతెయొక్కొ యీజలరుహేక్షణ దీనికి నామమెద్దియో
యెవ్వనిపుణ్య(వైభవమొ) యివ్వనితామణిఁ గూడఁగల్గుటన్
బువ్విలుకానిబారిఁ బడిపోవఁడె వారిజగర్భుఁడైనఁ బై
నివ్విధుబింబవక్త్రహసితేందురుచుల్ గరువంబు చూసినన్.

161


చ.

స్మరశరవిభ్రమంబు నవచంద్రకళావిభవంబుఁ బుష్పవ
ల్లరిఁ గల తేటబంగరుసలాకవిశేషము క్రొమ్మెఱుంగు వి
స్ఫురణము నీ మృగాక్షి యయి పొల్పెసలారెడుఁ గాకయున్న నీ
కరణి మదేభగామినులఁ గంటిమె యెచ్చటనైన వింటిమే.

162


క.

అనుచున్ మోహవశాంబుధి
మునుఁగుచు మరుఁ డేయుబాణములఁ దూలుచు నొ
చ్చిన విప్రుఁ జూచి తత్సఖుఁ
డనియెన్ బరభావవేది యనువాఁ డంతన్.

163


ఉ.

సానిదిగాన యీ (వికచసారసలో)చన పొంద దుర్లభం
బైనదిగా దిదెంతపని యన్నియుఁ జక్కనసేయువాఁడ లోఁ
బూనుము ధైర్య మిట్టియెడఁ బ్రొద్దిఁక నేఁటికిఁ బోయె నింటికిన్
బో నయమేది వట్టివెతఁ బొం(దఁగ నేటికి విప్ర)నందనా!

164

చ.

అని పరభావవేది వసుధామరనందను నొక్కరీతిచే
మనము మగిడ్చి చంద్రధరుమందిరమున్ వెడలించి యింటికిన్
జను మని యూఱడం బలికి చయ్యనఁ దాను యథేచ్ఛ నేఁగునం
త నవనిదేవుఁ డు(జ్జ్వలము దాని హొరంగు మ)దిం దలంచుచున్.

165


గీ.

ఉచితకృత్యంబులన్నియు నుజ్జగించి
మృదులశీతలశయ్యపై మేను వైచి
ప్రబలమన్మథవిశిఖాగ్ని భర్త్స్యమాన
మానసుండయి పలుకు నిమ్మాడ్కి నధిప!

166


ఉ.

పాటలగం(ధి నీకులుకుపాట నదేటికి విం)టి విన్న న
ప్పాట మదీయధైర్యగుణపాటన మేల ఘటించె నింక ని
ప్పాటఁ బ్రసూనబాణశిఖిఁ బ్రాణము నిల్పగ నెట్లు నేర్తు హృ
త్పాటవ మేది తూలుటయ పాటిలుఁగాక యనేకభంగులన్.

167


గీ.

(జలజలోచన యీనాఁడు) చంద్ర(నిశిత)
బహుకరాఘాతములచేత బ్రదుకు గలిగె
నేని యర్థంబు లీరాని విచ్చియైన,
బొందు గొనుకొందు నె ట్లరవిందనయన.

168


సీ.

గుడి వెళ్ళకుండంగఁ గుదియించి కొనకొంగు
        పట్టి క్రమ్మఱ (ముద్దు వెట్టనైతి)
(ఎదిరి నిలువ)రించి యిచ్చకం బొనరించి
        యించుక మాట లాడించనైతి
చెలికత్తియలనైనఁ బిలిచి మీ యెలనాఁగ
        తెఱఁ గెట్టిదో యని తెలియనైతి
మందయానముతోడ మఱలి యింటికిఁ బోవ
        దిగ(దిగ వెంబడిఁ ద)గులనైతి

గీ.

అకట యప్పుడు వాతప్పి హస్తగతని
ధాన మూరక పోనాడి మానసమున
వగచుచుండినఁ గార్యంబు వచ్చునేల
యసమశరుతూపులకు సగమైతిఁ గాక!

169


చ.

మతిఁ బరభావవేది కడుమచ్చికవాఁడని నమ్మి మోసపో
యితి నతఁ డాప్తుఁడేని నను నేటికి నేఁటికి నింటి కేఁగు మీ
వెత వెత మానుమంచు నను వీడ్కొని తాఁ దనయంత నేఁగెఁ బె
ల్లితరులబుద్ధిలోనఁ జరియించు విమూఢున కేటిసౌఖ్యముల్.

170


క.

తెచ్చినవిత్తము వృథగాఁ
బుచ్చక యమ్మచ్చెకంటిపొం దిఁకఁ గందున్
వెచ్చపడ వారవనితలు
వచ్చుటయే యరుదె యెట్టివానికి నైనన్.

171


ఉ.

అంచితలీల నొయ్యఁ గళ లంటి మనం బలరించి నేర్పుతోఁ
బంచశరాహవంబునకుఁ బైకొనఁజేయుదుఁ జొక్కి కించి దా
కుంచితనేత్రకోణ యయి గుబ్బచనుంగవ నాయురంబుఁ బొం
దించి సుఖించు నొక్కొ సుదతీతిలకం బొకనాఁడు వేడుకన్.

172


ఉ.

ఏనొకవేళ గాఢరతి నేడ్తెఱలోపల డస్సి దూలినన్
మానితచూతపల్లవసమానగుణాధరసంభవామృతం
బానఁగ నిచ్చుచుం గలయ నప్పదియున్ మది నూలుకొల్పు న
మ్మానవతీలలామఁ దగుమచ్చిక నెన్నఁడు గారవించెదన్.

173


సీ.

క్రొత్తనీలపురంగు గొదవచేసి చెలంగు
        కమనీయకుటిలాలకములతోడ
సంపూర్ణశశితేటచాయఁ జా యనుమాట
        మొలపించునిద్దంపుమోముతోడ

హేమకుంభవిభూతి యెమ్మెడించినరీతి
        తోడికె నవచన్నుదోయితోడ
చిగురుటాకులమేలు చిన్నవుచ్చఁగఁజాలు
        మోహనంబగు చిన్నిమోవితోడ


గీ.

పులినతలవిభ్రమముపూన్కి గెలుచునున్కి
డాలు దళుకొత్తుజఘనమండలముతోడ
వలనుమిగిలిన భాగ్యదేవతయపోలె
మెలఁగు కలకంఠి నెన్నఁడు గలుతునొక్కొ!

174


సీ.

వకుళపున్నాగచంపకపాటలావనీ
        రుహవాటికలఁ గలవిహరణంబు
కలహంసకులపక్షచలితవీచీఘటా
        కులసరోవరముల జలకమాట
అమృతనిష్యందమోహనచంద్రికాధౌత
        మానితహర్మ్యంబులోని యునికి
కమలరాగోనలఘటితనూతనకేలి
        శైలకూటములపై వ్రాలుకడఁక


గీ.

వీరులు సొమ్ములు పూఁత లంబరము లమిత
భక్ష్యభోజ్యాదు లొనరినపనుల నెల్ల
నింపు సమకొల్పు తనవల్పునిందువదనఁ
గలసి వర్తింపలేకున్న నిలువు సున్న.

175


ఉ.

అనుసమయంబునందుఁ గమలాప్తుడు లోచనగోచరాత్ముఁడై
వననిధినాథుదిక్కునకు వ్రాలె సమస్తదిశాంతరంబులన్
గనకము పూసినట్టిక్రియఁ గానఁగవచ్చెఁ దదంశురక్తిమన్
వనరుహలక్ష్మి కైరవవనంబు(లకుం జనె) తోడుతోడుతన్.

176

సీ.

ఈషద్వికుంచితాశేషపత్రసరోజ
        జఠరనిష్యందపుష్పంధయంబు
నీడద్రుమోన్ముఖనిర్భరజవఖగ
        స్పష్టకోలాహలాశ్లిష్టదిశము
భావితారాగణప్రతిమల్లమల్లికా
        మోదమోదితమానవాదికంబు
చక్రవాకస్వాంతసాంద్రశోకానల
        సంవర్ధనక్రియాసామిధేని


గీ.

కాంతివిస్మేరముఖసరఃకైరవంబు
నీలిమావృతసకలావనీతలంబు
ప్రకటసంధ్యాసమాధిమద్భాహ్మణంబుఁ
జాలఁజూపట్టె పశ్చిమ(సంధ్య యపుడు.)

177


సీ.

కాలకాముకుఁడు దిక్కాంతలపైఁ జల్లు
        వలుదకప్పురపుఁబల్కులొ యనంగఁ
జరమసంధ్యానాట్యచలదీశపటుజటా
        గళితగంగాఫేనకణము లనఁగ
నాకాశమండలం బనుమధూకంబునఁ
        బుట్టిన నవకంపుఁబూవు లనఁగ
రాజు రాకను నిశారమణి కెఱిగింప
        వచ్చు పెంచినవారువంబు లనఁగ


గీ.

భావినక్షత్రవల్లభప్రకటబహుళ
భరితసత్కీర్తి చంద్రికాంకురము లనఁగఁ
బరగి జగదేకకళ్యాణపదవిలాస
కరములై యొప్పెఁ దారకోత్కరము లపుడు.

178

సీ.

[కెరలు కాముకకాముకీచిత్తముల]యందుఁ
        జిగురుఁగైదువుజోదు (చే)రఁబడియె
మూఁకలుగట్టి యిమ్ముల మృగంబులు లేఁత
        పచ్చికపట్టులఁ బవ్వడించె
వసుధమీఁదికి మిన్ను వ్రాలెనో యనఁ జెన్ను
        దళుకొత్తఁజీఁకటి దట్టమయ్యె
దశదిశాంత[ముల మొత్తము దైన్యభావంబు]
        హరిహేతిహూతులయందు విడిసె


గీ.

జారులకు మోదసంపత్తి చాలకొదవె
జోరసంచారమునకెల్లఁ జోటుగలిగెఁ
జరమపాథోనిధాననిశ్చలతరంగ
సంగమంబున కినమూర్తి జాఱుటయును.

179


చ.

కలువలపొందు తామరలగాము నిశాసతిజీవగఱ్ఱ తా
రలగమికాఁడు వెన్నెలకరాటము చీఁకటివిచ్చుమొగ్గ చ
ల్వలగని చక్రవాకులతలంకు వియోగులపాలిజాలి వే
ల్పులకఱవెల్లఁ దీర్చుటకు (బువ్వము) చంద్రుఁడు దోఁచెఁ దూర్పునన్.

180


చ.

ప్రమదముతోడ నస్తమితభానునివేషముఁ దాల్చి రాగవి
భ్రమ మొనగూడఁ జంద్రుఁడు కరంబుల నంటినఁ జల్వఁ దాఁకి యో
కమలిని మోమువంచె నది గన్గొ[ని పక్కునఁ దాను] నవ్వె లోఁ
గుముదిని దాన సిగ్గుపడి గొబ్బున వెల్వెలనయ్యె నాతఁడున్.

181


గీ.

ఉదయరాగవిభూతి పయోజసూతిఁ
బిదప నొదవినవెన్నెల మదనదహను
మేనఁ దలుగొత్తుకప్పున దానవారిఁ
బోలి చూపట్టె నంత నంభోజవైరి.

182

చ.

హరిహరిదంబుజాక్షి నిటలాంచితచందనబిందువో యనన్
గరము దలిర్చెఁ జందురుఁడు కప్పును జూడఁగ నొప్పెఁ దత్సర
త్పరిమళలాభలోభపరిపాకవశంవదచిత్తవృత్తియై
తిరముగ (వ్రాలి)యున్న యెలదేఁటియపోలె జగంబు మెచ్చఁగన్.

183


చ.

వలవులరాచవారికిని వశ్యుఁడు చల్లనిమేనివాఁడు క
ల్వలచెలికాఁడు నైన యుడువల్లభజారుఁడు ప్రేమయామినీ
కులట మునుంగుగాఁగ నొనగూర్చిన నల్లనిచీర మేనికిన్
దొలఁగఁగఁ దీసెనాఁ బరగి తూలెఁ దమంబు దిగంతరంబులన్.

184


మ.

ప్రచురధ్వాంతమదేభపాకలము చక్రస్వాంతశోకాగ్నిధా
య్యచకోరీకులజీవనౌషధము తారానందకందంబు ప
ద్మచరశ్రీభరపశ్యతోహరము కందర్పత్రిలోకీజిగీ
షచరప్రక్రియ పర్వె వెన్నెల నిశాచంద్రాననాహాసమై.

185


సీ.

సకలదిక్కాంత లొమ్మిక వసంతము చల్లు
        కొనఁ గ్రమ్ము చందనక్షోద మనఁగ
నాకాశసిద్ధుదేహంబునఁ బూసిన
        నూతనస్నిగ్ధవిభూతి యనఁగఁ
రాజు నిశారాజ్యరతి మంగళాభిషే
        కంబునఁ దొరుగు గంగాంబు వనఁగ
కాలధీవరుఁ డంధకారమీనంబుల
        సంగ్రహింపఁగ వైచుజాల మనఁగ


గీ.

కడఁక రేచామ మైనిండఁ గప్పుకొన్న
జిలుఁగుబాళంపు వలిపంపుఁ జేలయనఁగఁ
దగి చకోరంబులకు నామెతలు మటించి
వెలఁది వెన్నెల గలయంగఁ దొలుకరించె.

186

వ.

ఇట్లు సకలలోచనానందకరుండగు నిశాకరుండు మృగమదమకరపత్త్రాభిరామం బగు సుత్రామదిశాకుశేశయగంధికపోలఫలకంబునుం(బోలె నీలరేఖాకలితాంతరాలుండై నభోమండలంబు నలంకరించి కలువలకుం జలువయుఁ, గైరవంబులకు విహారంబును, జకోరంబులకు వికారంబును, నిందుకాంతంబులకు నిష్యందంబును, రిక్కలకుఁ జక్కందనంబును, దిక్కులకుఁ జల్లదనంబును, బంకజంబులకు శంకయుఁ, బాంథులకు నంధకారంబును, దమంబునకు భ్రమంబును, బాటచ్చరులకు వెచ్చయుఁ, జగ్రవాకంబులకు విక్రియయు నెలకొల్పి యనన్యదుర్లభంబగు విభా(విభవంబున వెలసి)యుండె నప్పు డవ్విప్రుండు విప్రయోగవ్యథాదూయమానమానసుండై వేఁడివెన్నెలం బొక్కి యుక్కెడలి యొక్కరమణీయస్థలంబునఁ గనకలతం దలంచి యంతర్గతంబునం జింతింపందొడం(గె.)

187


ఉ.

ఓయెలనాఁగ!) నాకు నిలుపోవనితాపము నూలుకొల్పి నీ
వేయెడ నున్నదానవు? మదేతదవస్థ హరించి చక్కఁగాఁ
జేయుట నీదుపాలనె వసించుట యించు కెఱుంగవైతి వ
య్యో! యిగురాకుఁబోఁడులు దయోదయ(మింతయు లేనివారలే!

188


ఉ.

ఈపికరాజి యీశుకము లీశశికాంతులు నీసుధాపృథు
శ్రీపరిపక్వచంద్రిగలచెల్వము లీయలిపోతఝంకృతుల్
కోపవదంగజాతశరఘోరనిపాతముఁ గూడి నాకు హృ
త్తాపముఁ జేయుచుండె నిఁకఁ దాళఁగఁజాలను గావు మీయెడన్.

189


చ.

జలరుహగంథి! నీ వదనసన్నిధి పెన్నిధి, నీమనోహరా
త్యలసకటాక్షవీక్షణవిహారము హారము, నీసుధామిళ
త్యలమృదువాక్యవైఖరులగర్వము పర్వము, నీకపోలని
స్తులకళచెల్మి కల్మి, యయి తోఁచెడు నా కిఁక నెన్నిరీతులన్.

190

సీ.

మదిరాక్షి! నీముద్దుమాట లాలించిన
        పారఁబట్టనె పికస్ఫారరమణి
యెలనాఁగ! నీముఖం బింత చూచినమాత్ర
        వెలవెలచేయనే విధువిభూతి
హరిమధ్య! నీవదనానిలంబులు గ్రోలి
        కలఁచి తూలించనే కమ్మగాడ్పు
కొమ్మ! నీకమ్మనికెమ్మోవిఁ జుంబించి
        చిదిమివైవనె మావిచిగురుటాకు


గీ.

మత్తగజయాన! నీ మేను హత్తియుండి
పెలుచ నాకులపఱుపనే యలరుఁదీవ
నీయుపేక్షణ నా కింత నిబిడితాప
మానవలసె వివేకంబు మానవలసె.

191


గీ.

అనుచు నసమాశుగాశుగాహతుకఁ జేసి
చిత్త మెరియంగ వెన్నెలచిచ్చు సెగలఁ
గ్రాఁగువిప్రున కజకల్పకల్ప మగుచుఁ
గడచె నాఱేయి యంతటఁ బొడిచె నినుఁడు.

192


గీ.

దినముఖోచితకృత్యముల్ దీర్చి యంత
వచ్చి పరభావవేది భావజశరాగ్ని
నవశుఁడై యున్నసఖుఁ జూచి యాత్మ నులికి
యతని మెల్లనఁ దెలిపి యూరార్చి వలికె.

193


క.

వాలికలగు తెలిగన్నుల
బాలికకై యింత వంత బడలఁగ నేలా?
తూలి కడువైభవంబుల
కేలిక విఁకఁ గమ్ము నిన్ను నింతిని గూర్తున్.

194

మ.

పలుకం బారకుమీ సుధాంశురుచికిన్ భ్రాంతంబు గానీకు మీ
తలపు స్మందసమీరణంబునకు వంత న్మూలకుం బోకు మీ
యలరుందానికి నింక నోధరణిదేవాపత్య! నాసత్య మా
కలకంఠిన్ నినుఁ గూర్తు నేర్తు మరలం గాలింతుఁ గామోద్ధతిన్.

195


చ.

అన విని బాష్పధారలు నిజాననచంద్రునియందు మంచు రూ
పునఁ బొడగట్ట భూమిసురపుత్త్రకుఁ డుస్సురుమంచు వెచ్చ నూ
ర్చి నిజసఖున్ మనోభిమతసిద్ధికరున్ ఘనసారశీతలున్
గని కడు దీనుఁడై పలికె గద్గదికావిలకంఠనాళుఁడై.

196


ఉ.

కాముని బారిఁ ద్రోచి ననుఁ గామినిఁ గూర్పక వోయి తక్కటా!
యేననువాఁడ నిన్ను సఖ! యే మనువాఁడనె? విప్రయోగదుః
ఖామితతీవ్రవేదనల నందు మదేతదవస్థ యొక్కరుం
డేమియెఱుంగు? విశ్వపతి యీశ్వరుఁ డాత్మవిదుండు దక్కఁగన్.

197


సీ.

కర్ణ సూచిక యయ్యెఁ గలకంఠవరకుహూ
        కారమహోదారకలకలంబు
సంతాపకర మయ్యెఁ జంద్రాననాకరా
        బ్జాలోలతాలవృంతానిలంబు
గ్రీష్మోద్గమం బయ్యెఁ గృతగర్వయామినీ
        రమణసుధాపూర్ణవి(మలకాంతి)
విభ్రాంతిపద మయ్యె వికసితప్రసవాస
        వామోదవారివిహారకలన


గీ.

ఏమి సేయుదు? నాకింక నిందువదన
వదనపద్మావలోకనవ్యాప్తి లేమి
వామలోచనఁ గూర్చి నావంకఁ జేర్చి
యి(ట్టివెత మాన్పి ప్రీ)తిఁ జేపట్టు సఖుడ!

198

చ.

అనవుడు నట్లకాక మన కన్నిటికిన్ శివుఁ డున్నవాఁడు నీ
వని ఫలియించు నింతవెతఁబట్టకు భూసుర యంచు మిత్రు వీ
డ్కొని పరభావవేది యనుకూలములౌ శుభ(సూచకంబులన్)
గని మది నుబ్బుచుం జనియె గ్రక్కునఁ దత్పురివేశ్యవాటికిన్.

199


వ.

ఇట్లు ముందట.

200


మ.

శతమన్యుప్రదరాననోపమరాజత్తోరణం బంగనా
కృతగాంధర్వవిశేషగుంభితము లక్ష్మీపుండరీకాక్షప
(ర్వతజాశంకరవాఙ్మ)రాళరథరూపవ్యాప్తచిత్రంబు పో
షితపారావతముఖ్యకేళిఖగమున్ జేటీసమాకీర్ణమున్.

201


చ.

విలసనవద్విటీవిటము విస్ఫుటమంగళసంగతంబు ని
ర్మలశశికాంతకుడ్యము చ(మత్కృతిమత్కృతిధూర్తచేటికా)
తిలకము నైనవారసుదతీగృహ మొక్కడు గొంచె నాత్మలో
పలఁ గడు విస్మయంబు గనుపట్ట మదాలసుచుట్ట మయ్యెడన్.

202


క.

ఆ మందిరంబు కనకల
తామందిర మగుట నిలిచి తద్దయు...
.....దున కభిముఖుఁ
డై మెల్లన నడవఁ దొడఁగె నతఁ డిం పలరన్.

203


గీ.

ఏమి సేయిచునున్నవా రింటివారు
వచ్చితిమి మేము చుట్టాల మిచ్చటికిని
ననుచుఁ దరహసితాననుం డగుచుఁ జొచ్చె
నంత నాతండు తద్గృహాభ్యంతరంబు.

204


సీ.

పగలు రాతిరి సేయుఁ బరగంగ రాతిరి
        పగలు సేయఁగ గాడ్పుఁ దగిలి పట్ట

నిప్పు లొడిఁగట్ట నెఱిసందుగలిగిన
        సావడి కొట్టంబు చంకఁ బెట్ట
మున్నీరు దెగనీఁద మన్ను మిన్నును గూర్ప
        (మంచును గొలుప ధూమంబు) దివియఁ
గన్నుండఁగా లోనిగనుపాప వెడలించ
        బిట్టు శేషాహి వాకట్టు గట్ట


గీ.

ఱాతఁ దైలంబు పుట్టింపఁ జేతిలోన
సకలజగములు నొక్కట సవదరింపఁ
జాలి యేప్రొద్దు విటులకు జాలి యొసఁగు
కనకలతమాత మాయాప్రకారభూత.

205


చ.

పరగఁగ నెల్లవారు విటభల్లిక యంచుఁ దలంప వీటిలోఁ
జిరముగ నెన్నికం గనిన చేడియ లంజియతల్లి యిట్లు మం
దిరమునుగూర్చి వచ్చిన సుధీమణినందనమిత్రు గారవం
బరుదుగ నాసనాదుల ముదన్వితుఁగా నొనరించె వెండియున్.

206


క.

పాటలగంధులుఁ దగఁ బరి
పాటిం బాటీరచర్చ పై నెఱి నలఁదన్
జేటిక (తనచే నొసఁగిన
వీటిక) గొని యిచ్చి యతని వినుమని పల్కెన్.

207


ఉ.

మన్నన నామఱందలగు మంజులవాణికిఁ జుట్టమైన చి
ట్టన్నమభట్టునందనుఁడ వల్లుఁడ వారయ వావి నాకు నీ
వెన్నఁడు మాగృహంబునకు నేటికి రావిదె నీకు వింతయే
పిన్నవు గాన కూరుములపెంపుఁ దలంపవుగాక భూసురా!

208


క.

వానకునో పఱవునకో
పూనిక నీరాక వింతపొడమెన్ నాపై

నూనెనె యిన్నాళకు నీ
మానసమునఁ గొంతకూర్మి మంచిద యయ్యెన్.

209


చ.

తరతర మెన్నియైన మరదండ్లకు సొమ్ములు పెట్టనోడి లో
భరతినొ యిందు రావు హరుపంవున గ్రాసము గల్గియుండు నె
వ్వరిమది వేసరింపము భుజ్జనయిత్రికి నేల భీతి లోఁ
బొరయఁగ బెద్దవారిక్రియఁ బొం దొనరింపుము నీవు మాపయిన్.

210


గీ.

ఓడగట్టినదూలమై యుండవలయు
మీకు మాకును నెనరైనమిత్రభావ
మింటికిన్ వచ్చుచుం బోవు చుంట మేలు
నీకు మే మెంతవారము నీతి దెలుప.

211


క.

చేయం జేయఁగఁ బొం దగు
పాయం బాయంగ నెడలు బాంధవ మెందున్
మీయన్నగారికైవడి
మాయందులఁ బొందు నిలుపుమా విప్రవరా!

212


క.

నా విని మానసమున మో
దావేశము నివ్వటిల్ల ధ........మిత్రుం
డావెలఁదితోడ నిట్లను
ప్రావీణ్యవిలాససరసఫణితులు చెలఁగన్.

213


క.

ఇంటికి వచ్చిన జుట్టము
లింటికి రాకున్నఁ బరులె? యెనసిన యెదలో
నంటిన మచ్చిక గల్గినఁ
గంటం గనుగొంట కేమి? (కమలద)ళాక్షీ!

214

చ.

అది యటులుండనిమ్ము కమలానన! నీప్రియపుత్రి జవ్వనం
బొదవి విలాససంపదల నుజ్జ్వలయై విలసిల్లురేఖ చూ
చెద నని వచ్చితిన్ బిదపఁ జెప్పెద నొక్కరహస్య మన్నియున్
(కొదువ కొఱంత) లేక సమకూరెడు నీమదిఁ బర్వియుండినన్.

215


క.

శాతోదరి నీకూఁతుం
జూతము రప్పింపు మనుఁడు సుదతియుఁ బుత్త్రిన్
దోతెచ్చి యంకపీఠికఁ
జేతోమోదమున నిల్పి చెన్న(లరారన్).

216


సీ.

(కలికి) బంగరుబొమ్మ కందర్పుబాణంబు
        మొలకమెఱుంగు వెన్నెలలనిగ్గు
పగడంపుఁదీఁగె సంపంగికొన్నన చిన్ని
        హరిణాంకురేఖ కప్పురముసిరము
జాతిరత్నశలాక సాగరమధులక్ష్మి
        (రతనాలజిగి తేట) అతనురాణి
పెంచినచిల్క జీవాంచితాలేఖ్యంబు
        కస్తూరినిగరంబు కళలకరువు


గీ.

ననఁగఁ గమనీయమహితమోహనవిలాస
భాసమానాంగి యగుకూఁతుఁ బట్టిచూపి
పలుకు బలుతియ్య మింపులు గులుకునట్లు
(వేడ్క ముదివేశ్య) పరభావవేదితోడ.

217


గీ.

నీకు నాతోడును మ్మవనీసురేంద్ర!
మెచ్చు మ్రింగఁదలంచిన మృడునియాన
నిజము చెప్పుము మత్పుత్త్రి నీలవేణి
సవతు పూఁబోఁడి గలదె యిజ్జగమునందు.

218

ఉ.

(చక్క)నివానిఁగా వయసుచాలినవానినిఁగా ప్రదాతఁగా
తక్కనివానిఁగా విటులధర్మ మెఱింగినవానిఁగా సిరిం
బెక్కువవానిఁగా సొబగుఁ బేరును బెంపును గల్గువానిఁగా
నొక్కనిఁ జూడుమీ యరసి యుగ్మలి కన్నెఱికంబు విడ్వఁగన్.

219


ఆ.

ఎది(గి పసితనంబు ప్రిదిలిన నా)మైన
తగవు గాదు నిల్పఁ దలిరుఁబోండ్ల
నట్లుగాన దీని కనుకూలుఁడగు నొక్క
విటశిఖావతంసు వెదకు మీవు.

220


శా.

నేపాళేంద్రుఁడు మాళవేశ్వరుఁ డవంతిస్వామియున్ మున్నుగా
భూపాలోత్తము (లెందఱేని ధన మిందుం బెం)పు దీపింపఁ దా
రీపద్మానన కిచ్చి పొందు గొనుకో నేమేమొ యంచున్నవా
రాపృథ్వీపతు లిచ్చునీవిదెస నా కాకాంక్ష లే దింతయున్.

221


క.

మనసును మర్మంబు నెఱిం
గినవానికిఁ దగినవానికిని బొందుగ నీ
వనజాననఁ జేసెదనే
నని నాయున్నతి తలంతు నవనీదేవా!

222


వ.

అనవుడు నిది యతని చెలికానిమనోరథంబునకు ఫలకాలం బని యమ్మహీదేవుం డావేశ్యమాతకు నిట్లనియె.

223


గీ.

మంచివని సేసితివి నీవు మహిపసుతుల
తోడిజడ్డకుఁ జొఱక యో తోయజాక్షి!
మనము సంసారులము గాన మనకుఁ దగిన
వారితోడను బొందు భావ్యంబు చేయ.

224

మ.

ఒకఁ డున్నాఁడు మదీయబాంధవుఁడు గుణ్యుం డెల్లచోఁ బల్లవుల్
సకలానంగకళారహస్యవిదుఁ డీజాణండ యంచున్ దనున్
బ్రకటింపన్ భవదాత్మజాతకుఁ దగున్ భామా యతం డీను బు
చ్చుకొ సామర్థ్యము గల్గుఁ బేరు సమకూర్చున్ నీకు నైశ్వర్యముల్.

225


చ.

అనవుడు నింతి యిట్లనియె నట్టిదయేని ధరానిలింప! నీ
వనినరసజ్ఞుతో సరసిజాననఁ గూర్చుము మాకు వచ్చు వ
ర్తనములనెల్ల నిచ్చి యుచితజ్ఞత నావుడు నియ్యకోలుమైఁ
జనియె నతండు నెమ్మనము సంతస మొంద వయస్యుపాలికిన్.

226


క.

చని తనపోయినయంతయు
వినిపింపఁ బ్రమోదవార్ధివీచులలోనన్
మునిఁగి మదాలసుఁ డాలిం
గనమున సఖు గారవించి కడు నగ్గించెన్.

227


సీ.

పొసఁగ నీగతి మదాలసుచేతఁ గూర్మి సం
        భావితుం డయి పరభావవేది
తదనుమతంబునఁ దపనీయరత్నవ
        స్త్రము లాదిగాఁ బదార్థము లసంఖ్య
ములు సానిజననికిఁ దలఁపుకోరికకంటె
        నినుమడిగా నిచ్చి కనకరత్న
సంబంధమునుబోలె సరసులు గొనియాడ
        ఘటియించెఁ జెలికానిఁ గనకలతను


గీ.

గుసుమవల్లరి నలదేఁటిఁ గూర్చుమలయ
పవనుకైవడి నంత నాబ్రాహ్మణుండు
మన్మథాద్వైతసుఖవార్ధిమజ్జనమునఁ
దోఁగి పరితాపమంతయఁ దొలఁగఁ జేసె.

228

చ.

ఉడుగని కామతంత్రముల నూని మనోబ్జము పల్లవింపఁగాఁ
గడఁగి వశావశేభపతికైవడి మత్తమరాళికాతతిం
బుడికెడురాజహంసపతిపోల్కి మదాలసుఁ డమ్మ్మగాక్షితో
నొడఁబడియుండె సంతతము నొండుతెఱంగుల నుజ్జగింపుచున్.

229


గీ.

మాడ లన్నను మాడలు మణివిభూష
ణంబు లన్నను మణిభూషణంబు లెలమి
వలయువస్తువులెల్లఁ గైవసము సేయు
సానితల్లికి నవ్విప్రనూనుఁ డిట్లు.

230


క.

భజన చెడి దానిపొత్తున
భుజియించెను మధువుఁ ద్రావెఁ బొల యంటె వెసన్
ద్యజియించెఁ దగిననడవడి
కుజనుండై ధరణిసురుఁడు కుత్సితబుద్ధిన్.

231


ఉ.

పాటలభంగశోభిమధుపానవశుం డయి చొక్కి మిక్కిలిం
బాటవ మేది భూసురుఁడు పాటలగంధికిఁ జిక్కి శాటికల్
హాటకముల్ మణుల్ గలపదార్థము లన్నియు నప్పగించె వే
(యేటికి మోహవార్థి వశమే) తరియింపఁగ నెట్టివారికిన్?

232


సీ.

పతితునిపొందు పాపము చుట్టు సని రోసి
        ప్రాణబంధువు లెల్లఁ బాసిచనిరి
యెట్టివిద్యలయందుఁ బట్టిచూడఁగ లేమి
        యడుగునే దొరయును బుడుకఁ డర్థ
మింతి(బందుగులెల్ల నితఁ డపాత్రుం డంచుఁ)
        గైకొనరై రొక్కగవ్వకైన
సత్యంబుచాలనిచపలుండు వీఁడంచు
        వెచ్చంబు వెట్టంగ వెఱచె బచ్చు

గీ.

వలపు గలిగియు జనయిత్రివలన వెఱచి
కనకలత దక్కి మాఱుమొగంబు వెట్టె
నీతెఱంగునఁ జెడెగాని (యింతవుణ్య
కర్మసం)స్కార మతనికిఁ గలుగదయ్యె.

233


సీ.

మును మ్రుచ్చిలించి తెచ్చినయర్థ మంతయు
        నప్రస్తుతము వెచ్చమైనకతన
మనము నిల్పక పోయి మగువసొత్తునఁ దిన్నఁ
        గని తన్ను జనులు గైకొననికతన
(తనకష్టసుఖములఁ గను)చుట్ట మెవ్వఁడు
        మానుగ నేచ్చోట లేనికతన
నున్నతభోగంబు లన్నాళ్లుఁ గల్గి బి
        ట్టొకసారె నవియెల్ల నుడుగుకతన


గీ.

ప్రాణపదమైన యెలనాఁగఁ బాయుకతన
తొంటితేజంబు నుఱవేది (దుఃఖి యగుచుఁ)
బురములోపల వసియింప వెరవుమాలి
యరిగె నెందైన నాబ్రాహ్మణాథముండు.

234


క.

ఈ చందంబునఁ జని యా
నీచాత్మకుఁ డొక్కచోట నిలిచి మనములో
జూచును విత్తార్జన మె
ట్లైచేయుటొ యేమిభంగి నగునో యనుచున్.

235


చ.

వసమరి విత్తహీనుఁడగువాఁడును బ్రాణము లేనివాఁడు ధా
త్రి సములుగాఁగ నెన్నుదురు ధీనిధు లట్లగు గాన నాకు వె
క్కసముగ విత్త మేకరణిఁ గల్గెడిఁ బ్రాణమువోలె దాన నా
వసముగఁ జేయనొక్కొ ప్రియభామిని రూపమనోజకామినిన్.

236

గీ.

కనక మార్జింతు నెన్నిమార్గముల నైనఁ
గనక మార్జించుకొని కొందుఁ గనకలతను
గనకలతఁ గూడ నీమాఱు గలిగెనేని
వేయు నేటికి త్రిజగతీవిభుఁడఁ గానె.

237


శా.

ఆవింధ్యాచలపార్శ్వపట్టణము లత్యంతంబు నానాధన
శ్రీవాసంబుల నాఁగ విందుము జనశ్రేణుల్ ప్రశంసింప నే
నే వేగం జని తద్ధరాస్థలము పృథ్వీపాలకాగారముల్
ప్రావీణ్యంబునఁ గన్నపెట్టి సకలార్థవ్రాతముల్ దెచ్చెదన్.

238


క.

కడియును గత్తియు నాచే
వడి యుండినయేని పద్మభవునిల్లైనన్
పడిఁ జొచ్చి కన్నమున వెస
వెడలింపనె మినుకకుండ వేదండంబున్.

239


క.

అని కృతనిశ్చయుఁ డగుచు
జనియెన్ గహనంబు త్రోవ సాహసవృత్తిన్
మనమునఁ గొంగక దక్షిణ
మునకై ధనకాంక్ష దన్ను మునుకొని తివియన్.

240


చ.

నెనరగు నింతితోఁ బెరసి నీడమెఱుంగున నున్నవాఁడు గా
వున నడవంగలేక తనువుం గలచెయ్వులు దూలఁ జిక్కి విం
ధ్యనగసమీపకాననమునందుఁ బథిశ్రమ మోర్పు డింపఁ ద
త్కనకలతావిటుండు వెడగాడ్పు రవిప్రభఁ గూడి వీవఁగన్.

241


క.

వడదాఁకి దప్పిగొని యా
చెడుపాఱుఁడు పెదవు లెండఁ జెదరి పదంబుల్
వడవడ వడకఁగ వింధ్యపు
నడుతెరువునఁ బడియె నొక్కనగపతినీడన్.

242

శా.

ఆవేళం ధరణీసురుం డొకఁడు విద్యాపాలుఁ డన్వాఁడు వి
ద్యావాణీవిభుఁ డొక్కభూమిపతిచేతన్ నిష్కముల్ రత్నముల్
దేవగ్రాహ్యములైన వస్త్రములు తృప్తిగా దానరూపంబుగా
ఠేవం గైకొని వచ్చెఁ బాలుఁ దనపట్టిం గూడి యాత్రోవకున్.

243


గీ.

దైవయత్నంబుచే ధరాదేవుఁ డతఁడుఁ
దానుఁ దనయుండు వడదాఁకి తాపమొంది
యమ్మదాలసు వసియించునట్టి చెట్టు
నీడ కేతెంచె నొక్కింత నిలుచుకొఱకు.

244


క.

ఆ చెట్టునీడ నప్పుడు
చూచి మహీదేవవరుఁడు క్షోణీశయనున్
వాచావిహీనముఖు గగ
గోచ(రజీవున్ విబో)ధకుంఠితు నతనిన్.

245


వ.

చూచి వీఁ డెవ్వఁడొక్కొ? అగమంబగు నీ మార్గంబున కేమి నెపంబున వచ్చిన వాఁడొ వీని కేమియైన దొక్కొ? తెలియుదుముగాక యని చేరంజని యరసి యతని వడ(దాఁకినవాని)గా వివేకంబున నిశ్చయించి కృపాళుండై విద్యాపాలుండు.

246


చ.

తనకరదీప్తిలోని హిమధామసుధావిమలంబులైన తి
య్యనిసలిలంబు లొయ్యనఁ బ్రియంబునఁ బాణిసరోరుహంబునన్
[గొని చిలికించి యంగము]ల గోముఖమండలి మున్నుగాఁగ నా
తనికి నతండు గొంత పరితాపభరం బెడలించె నందునన్.

247


ఆ.

ఇట్లు సేదదేఱి హీనస్వరంబున
నతని కనియె నమ్మదాలసాఖ్యుఁ
డనఘ! కొంత మానె నారాటము [కడింది
దప్పిఁ దీర్చి గొంతు] దగులు వాపు.

248

చ.

అన విని సంభ్రమంబున దయాకరమూర్తి మహీసురుండునుం
దనమది హెచ్చరింప మును దత్తనపుం దడవంగఁ గొన్ని ని
ల్చినసలిలంబులన్ రసనఁ జిల్కుచుఁ గుత్తుక డెక్కు (నంతనం
తన సరిచేసికొంచును యథాస్థితి నూనఁగఁ జేసెఁ బ్రాణమున్.

249


ఆ.

అట్లు సేదదేఱి యల్లన చే గాలు
గదలనిచ్చి వదనకమల మెత్తి
కనులు విచ్చి చూచి గ్రక్కున లేచి కూ
ర్చుండి మాటలాడుచుండ నంత.

250


సీ.

తెలిసి యం(తట ధరిత్రీదేవకులనావ
        కుండు) విద్యాపాలుదండ వినతి
చేతఁ బ్రీతునిఁ జేసి చేదోయి మొగుడించి
        వినయావనమ్రుఁడై యనియె నతని
ననఘాత్మ! నీకతంబున నిప్పటికి బ్రాణ
        మున నుండ గంటి నీమూర్తి చూచి
సకలాంగకంబులు చల్లనయ్యెను నాకు
        (నిజవృత్త మెఱిఁగింతు) నీవు వినుము


గీ.

జాతివిప్రుండ వాదంబుచేత నోడి
సిగ్గుపడి శాస్త్రపాఠంబు సేయఁ గోరి
పోవుచున్నాఁడ నెటకై నఁ బోయి పోయి
అగ్గిదాఁకితి నిచ్చోట నైతి నిట్లు.

251


ఉ.

నామదిఁ దోఁచుచున్నయది నాయన! నీవు దలంప సర్వవి
ద్యామయమూర్తి వంచు ధృతి దప్పక నీపదపద్మయుగ్మమున్
బ్రేమ భజించి శాస్త్రములు పెక్కువతోఁ బఠియించి ప్రోడనె
భూమిజనైకవంద్యగతిఁ బొల్చెద నిల్చెదఁ గీర్తిసంపదన్.

252

గీ.

కాఁపురము నాకుఁ గడుఁబెద్ద కంచియంత
యిల్లు శ్రీధాన్యకటకమై హెచ్చు మిత్రు
లరయఁ దలవెండ్రుకలయంద ఱచ్చికంబు
లేదు గ్రాసంబునందు నోవేదమూర్తి.

253


వ.

అనిన విని యట్లకాక నీవు మాకుం గుమారునిమాఱు నీ కెవ్విధంబున నుండవలయు నవ్విధంబున మాతోడం గలసి వర్తింపుమని ప్రహర్షలోలుండై విద్యాపాలుండు నాళీకబాంధవుం డస్తశైలశిఖరం బరుగుడుఁ దడయక సంధ్యాదికృతంబు లవంధ్యప్రకాగంబున నొనరించి యథోచితంబుగఁ దృణాస్తరణంబగు ధరణిశయనంబునం బవ్వడించి నిద్రించుసమయంబున.

254


గీ.

ఆకృతఘ్నుండు బ్రాహ్మణునందుఁ జాల
ధనము గలుగుట వీక్షించి తత్తఱించి
అది సమస్తంబు మృచ్చిల నాత్మఁ దలఁచి
ప్రబలసంతమ సార్ధరాత్రంబునందు.

255


మ.

తనుఁ జాకుండఁగఁ బ్రోచినాఁ డనక వృద్ధబ్రాహ్మణుం బిన్నవాఁ
డని కొం కింతయు లేక తత్తనయునిన్ బ్రాణంబులం బిట్టు వా
పి నయం బింతయు లేక చేరి వెరజెం బేలైనతద్విత్తమున్
ధనకాంక్షాపరుఁడైనవానికి నిషేధం బేల చూపట్టెడిన్.

256


గీ.

వెతకబోయినతీఁగ వేవేగఁ గాలఁ
జుట్టికొనినట్లు కోరినయట్టియర్థ
మిట్లు దొరకిన సంతుష్టహృదయుఁ డగుచు
గనకలత కిత్తునని నిరాఘాటగతిని.

257

క.

ఆవేళఁ గదలిచనఁగా
దైవగతిం దెరువు దప్పెఁ దనపురిత్రోవన్
బోవిడిచి కాశినగరికి
నై వచ్చె నతండు గొన్నియహములు వోవన్.

258


సీ.

ఏవీడు విలసిల్లు శ్రీవిశ్వనాథ జూ
        టపినర్ధముగ్ధేందు విపులకాంతి
జెన్నొందు నేపురం బన్నపూర్ణాఘన
        స్తనభారకాశ్మీరసౌరభముల
వెలయు నేనగరంబు విబుధకల్లోలినీ
        కల్లోలహల్లీసకముల కలిమి
నేపట్టణం బొప్పు హేలామయుఁడు డుంఠి
        విఘ్నేశదానాంబువిభవలబ్ధి


గీ.

బెరిమ జూపట్టు నేపుటభేదనంబు
హృద్యకైవల్యలక్ష్మికి నిక్క యగుచు
నట్టి యవిక్తమునకు దినావసాన
సమయమునఁ జేరె వాఁ డదృష్టంబుకతన.

259


ఉ.

ఆ దురితాత్ముఁ డిట్లు మదనాంతకు పట్టణ మల్లఁ జొచ్చి బె
ల్లీదయు వానయుం దమము నేడ్తెఱఁ గూడి జనావరోధముం
బ్రోదిగఁ జేయఁగాఁ గడచి పోవ వసంబఱి ప్రాలుమాలి స
ర్పోదరమైన యొక్క[పొద నొక్కఁడు] చొచ్చి శ్రమాకులాత్ముఁడై.

260


క.

నిద్దురకుఁ గన్ను మోడ్చుచు
నుద్దవిడిం దెక్కియున్న యుగ్రోరగ ము
ద్యర్దహనజ్వాలావళి
నద్దినకోఱలకు నతని నాప్తునిఁ జేసెన్.

261

మ.

పవనాహారవిషాగ్నిదగ్ధుఁ డయి తాపం బందుచున్నట్టి భూ
దివిజుం జేరి హరుండు విశ్వవిభుఁ డద్రిస్వామికన్యాధవుం
డవధానంబున దక్షిణశ్రవణ మొయ్యన్ దారకబ్రహ్మ వి
ద్యవిశేషప్రతిభోపదిష్టముగఁ జేయం బూనుకాలంబునన్.

262


మ.

అరుణాక్షుల్ (గురుకుక్షులు న్వికటదం)ష్ట్రాభీలవక్త్రాంతరుల్
శరదాభుల్ కరవాలహస్తులు ఖరచ్ఛాయోర్ధ్వకేశచ్ఛటుల్
భరితాహంకృతు లంతకానుచరు లాపాపాత్ముఁ బాఱు న్మహో
ద్ధురవేగంబునఁ బట్టితేరఁ జని రెంతో పంతము ల్పల్కుచున్.

263


గీ.

ఒకనిఁ బట్టఁగఁ బదుగు రిట్లొత్తిపోయి
యమ్మదాలసు కడ నున్న యంతకారి
దేరగొని చూచి వచ్చిన తెరువు పట్టి
రంతకునికింకరులు భయంభ్రాంతు లగుచు.

264


చ.

తమపని కాకపోవుటకతంబున నప్పుడు విక్లబాస్యు లై
యముఁ గని తద్భటుల్ వడిఁ బ్రయత్నవిఘాతముఁ దెల్పి చెప్పుడున్
శమమఱి కాలుఁడుం గినిసి సైరిభరాజము నెక్కి బ్రాహ్మణా
ధముఁ గొనితేరఁగా నరిగె దట్టపుఁగింకరసేన గొల్వఁగన్.

265


మ.

అలి(కాక్షుండు మహానుభా)వుఁడు త్రిలోకారాధ్యుఁ డిట్లేల తా
నలదుష్టాత్ము ననుగ్రహించు నిది దా నాశ్చర్య మూహింప విం
తలు పుటైన్ మతి తత్ప్రవర్తనలకున్ దాఁ గూర్చునే యుగ్రుఁ డ
ట్టుల దీనం జెడు నెల్లధర్మములు చోటుందప్పి త్యక్తంబులై.

266


క.

అని సందేహింపుచుఁ దాఁ
జని కాశికలోనఁ గాంచె శమనుం డసమా
క్షుని సరిగద్దియఁ గూర్చుం
డిన భూసురపుత్త్రు నతులనిర్మలగాత్రున్.

267

గీ.

చూచి (మానుగ వీనులఁ) జూచుతొడవు
వేల్పునకు మొక్క యొకవంక వినయనమ్ర
దేహుఁడై నిల్చె నమ్మహాదేవు నాజ్ఞ
శిరసుపైఁ జేర్చి తలవంచి తరణిసుతుఁడు.

268


గీ.

ఒదిగి యత్యంతదీనుఁడై యడఁగి మడఁగి
సిగ్గుపడియున్నజము నిరీక్షించి మున్నె
యతనిరాకకుఁ గారణం బాత్మ గాంచి
యమ్మహాదేవుఁ డీక్రియ ననియె నగుచు.

269


ఉ.

వచ్చితి వేల? దండధర? వచ్చియు మూసినముత్తెమట్లు మో
మిచ్చి యొకింతయుం బలుకవేమి? మనంబున శంకఁ దక్కి వా
క్రుచ్చుము నావుడున్ హరునకున్ వెస నంజలి యాచరించుచున్
వెచ్చన యూర్చి యిట్లనియె పెల్లదనంబున నాకృతాంతుఁడున్.

270


ఉ.

ఏమని విన్నవింతుఁ బరమేశ్వర! విశ్వజనాంతరాత్మవై
భ్రామకవృత్తి జంతువులఁ బట్టి వినోదమపోలెఁ ద్రిప్పుచున్
భూమగుణప్రభావమునఁ బొల్చినమేటివి నీవు మన్మన
స్తామరసంబు వందురువిధంబును గాన నిదేమి చిత్రమో.

271


మ.

విధురేఖావిలసత్కపర్ద! విను మీ విప్రుండు దుష్టాత్ముఁడై
విధికిం బాసి నిషేధముం దవిలి వేవే లుగ్రపాపంబులన్
బుధులెల్లన్ హసియింపఁ జేసి పిదపన్ బొందెన్ భవద్రూప మీ
యధికారం బిఁక నాకు నేమిటికి ధర్మాధర్మముల్ లేనిచోన్.

272


సీ.

మొదల బాహ్మణకర్మములపట్టు వదలించి
        జారుఁడై కులటలఁ జంకఁ బెట్టి
తల్లిదండ్రులమాట తలమీఱి వర్తించి
        కైదువ ధరియించి జూదమాడి

చోరుఁడై శంకరుసొమ్ములు బొంగిలి
        హత్తి జారాంగనపొత్తు దొడఁగి
గంజాయి భక్షించి కలు ద్రావి నంజుఁడు
        నమలి కృతఘ్నుఁడై నట్టడవిని


గీ.

శాంతు వేదాంతవిద్యావిచారనివుణు
నిరపరాధు మహీసురవరుని నతని
పుత్త్రకునిఁ జంపి తుది నిన్నుఁ బోలినాఁడు
వీఁడు నేనేమి యనువాఁడ విశ్వనాథ!

273


ఉ.

కూరలు గూళ్లుఁగాఁ గుడిచి కోరిక లీరిక లెత్తనీక కాం
తారములోఁ దపంబు లతిధారుణభంగి నొనర్చువారికిన్
జేర వశంబుగాని నినుఁ జేరి శుభాకృతిఁ దాల్చియున్నవాఁ
డేరికి నంటరానిఖలుఁ డీతఁడు చోద్యము ప్రోపు శంకరా!

274


క.

ఇఁక నేల ధర్మసంగతి
యిఁక నేల! పరోపకారహేలావిభవం
బిఁక నేల విధినిషేధము
లిఁక నేల వివేక మాత్మ నెఱుఁగు తలంపుల్.

275


క.

వలసినలాగులు గ్రుమ్మరి
బలహీనుల వెఱవులేక పరిమార్చి తుదిన్
జలనంబు లేనినిన్నున్
గలయుట పనిగాదె తలఁపఁగా దేహులకున్.

276


ఉ.

తొల్లియు శ్వేతుఁ గాచితివి తుచ్చుఁడు వీఁడని చూడ కాత్మ శో
భిల్లుదయారసంబు గలప్రేమ దగంగని బ్రహ్మఘాతుకున్
గల్లరి నిన్నుఁ బొల్చుకొని కల్మషదూరుఁగఁ జేసి తద్రిజా
వల్లభ! యెల్ల నీవిషమవర్తనమైన నిజాధికారమున్.

277

ఉ.

నావిని మోముపైఁ జిఱుతనవ్వు దలిర్పఁ గృతాంతుఁ బల్కు న
ద్దేవుఁ డభంగురామృతవిధేయములౌ పలుకుల్ చెలంగఁగా
నీ విఁక భానుపుత్త్ర! మది నిల్పకు మీతమకంబు నీ మహీ
దేవుఁడు నేన తా నగుట తెల్లముగా వివరించి చెప్పెదన్.

278


శా.

లోకు ల్గాదనుచుండఁగా నవనిలో లోలాక్షులన్ విప్రులన్
బాకానాథగవాదులన్ గెడపనీ పట్టండు [పాపంబు నా
ళీకాప్తప్రియ]పుత్త్ర! మానవుఁడు మల్లీలానివాసార్హమౌ
నీకాశీనగరంబునం దెగినచో హెచ్చున్ ననుం బోలుచున్.

279


సీ.

పౌరుషంబు కొఱంతపడుట మేననెకాని
        కలుగదు వానివంగడమునందు
నెద్దుచందం బెల్ల నెక్కిరింతనెకాని
        తగులదు వానివర్తనమునందు
రెండునాలుకలౌట పెండారమునఁగాని
        హత్తదు వానివాక్యములయందు
[కడిఁది బండతనంబు] నిడుపుడెంకెనెకాని
        పరగదు వానిప్రాభవంబునందు


గీ.

భంగపోవుట తలపూవుపైనె కాని
నాటుకొన దింత వానిమానసమునందు
నెవ్వఁడేఁ గాశికాపురి కేఁగుదెంచి
బొంది దిగఁద్రోయు భాగ్యంబుఁ బొందెనేని.

280


గీ.

[ఉర్వి కా]శీస్థితుఁడు పుణ్యుం డటన్న
పాపకర్ముండు సుకృతంబుపాలఁ బోవు
కాశి కేఁగినఁ బాపంబు గడవ దన్న
పుణ్యమూర్తియు దురితంబుపొంతఁ బోవు.

281

గీ.

తేటిము క్కంటఁ బువ్వుతదీయరూప
మొందుగతి సిద్ధరసమున నూని యినుము
కాంచనం బైనకైవడిఁ గాశి నీల్గి
పాపకర్ముండు దనుఁ బోలు భానుతనయ.

282


క.

ఈపుణ్యక్షేత్రంబున
నేపుణ్యుఁడు జడత వాయనిడి మల్లింగ
స్థాపనము చేయు నాతఁడు
ప్రాప్తించును బొందివారఁబట్టక ముక్తిన్.

283


మ.

కడు నగ్రాహ్యము లైన యొండుమతముల్ ఖండించి యీకాశి నే
ర్పడరన్ నన్నుఁ బ్రతిష్ట సేయుఖలుఁడున్ బ్రాణంబులం బాయ కే
జడలంగట్టు శశాంకపోతము శిరస్స్వర్వాహినీపోతమున్
మెడలం జుట్టు భుజంగహారముఁ బ్రభానిర్ధూతనీహారమున్.

284


గీ.

ఇనజ! కైవల్యలక్ష్మికి మనికి యగుచు
వెలయు నిందుల మన్మూర్తి నిలిపి సుమ్ము
వృత్రవథసంభవంబైన విషమకలుష
భరము దిగఁద్రోచె దేవతాభర్త మున్ను.

285


క.

వరపుణ్యజలజదివసే
శ్వరమగు నిట నన్ను నిలిపి చంద్రుఁడు మును త
ద్గురుకాంతాసంగమభవ
దురితం బెడలించి కీర్తిఁ దొడికెఁ గృతాంతా!

286


గీ.

ఒనర లింగప్రతిష్ఠచే నొండె మేను
విడిచిపెట్టుటచే నొండెఁ దొడుకవచ్చు
నిమ్మహాక్షేత్రమున ముక్తి యెట్టిపాప
కర్మునకునైన నిక్కంబు కడము లేదు.

287

ఉ.

కావున సర్వకల్మషవికారనిబర్హణ మైనయిప్పురిన్
జీవము నుజ్జగించిన విశిష్టుఁడు గావున దుష్టుఁడయ్యు భూ
దేవుఁ డితండు నేన యయి తేజముఁ గాంచెన కాక తక్కినన్
దావకదండఘాతములు దప్పునె వీనికి భానునందనా?

288


ఉ.

నీవు మదాజ్ఞ మౌళివయి నిల్పి యథాస్థితి నుండు మంచు న
ద్దైవతసార్వభౌముఁడు ముదంబునఁ గాలుని వీడుకొల్పి భూ
దేవునిఁ గాచి విశ్వము నుతింప నిరంతరభక్తరక్షణ
శ్రీ వెలయంగ నుండె సురసిద్ధవరాసురపూజితాంఘ్రియై.

289


సీ.

కావున శ్రీకాశిమహత్వముఁ గొని
        యాడ నెంతటివాని కలవియగునె
నీవు నాకాశవాణీమార్గమున విశ్వ
        పతి నవిముక్తేశు భక్తవరదు
సేవింవు నీకోర్కి సిద్ధించుఁ దడయక
        యంచు దీవించి పొమ్మనిన నృపతి
కౌండిన్యముని పాదకమలంబులకు (నెల)
        నాఁగయుఁ దాను వినమ్రుఁ డగుచుఁ


గీ.

గాంచనస్యందనం బెక్కి కతిపయాను
చరులు దనుఁ గొల్వ వేడ్క నక్షణమ గదలి
సరవిఁ బొడగటుననుకూలశకునములకు
గరము హర్షించి విశ్వేశుపురికి నరిగె.

290


సీ.

....నరదంబుఁ జేర్ప నొక్కపురంబు
        నందు నుండఁగఁజేసి యాక్షణంబ
వరభాగ్యవతి ప్రభావతి ప్రేమఁ దనమేని
        నీడకైవడి వెంటఁ గూడి నడువఁ

గైవల్యలక్ష్మికిఁ గంఠహారంబైన
        విశ్వేశునగరంబు వెసఁ బ్రశస్త
మగు సన్ముహూర్తమునందుఁ బ్రవేశించి
        జహ్నుకన్నియలోన జలకమాడి


గీ.

యర్హకృత్యంబు లొనరించి యతులహేమ
దానముల భూనిలింపులఁ దనిపి పూత
చిత్తుఁడై ధరణీకాంతుఁ డుత్తముండు
గుడికి గమనించె నతిభక్తి గొనలుసాఁగ.

291


శా.

(స్వర్గంగారహరీపయో)హరమశ్చంచద్యశశ్చంద్రికా
వర్గాలంకతదిగ్వధూవదన దీవ్యత్కొండవీటీమహా
దుర్గాధీశ్వరగోపభూవరకృపాధూర్లబ్ధసామ్రాజ్య స
న్మార్గాధీనమనస్క భూభరణహ[ర్మ్యస్తంభదేచాగ్రణీ!]

292


క.

ఆశ్చర్యధుర్యధైర్య! వి
పశ్చిజ్జనకమలతరుణభాస్కరమూర్తీ!
నిశ్చలమానస! సత్యహ
రిశ్చంద్రనరేంద్ర! మతిసరీనృపవర్యా!

293


పంచచామరము.

కలాకలాప! కృష్ణమాంబికాకుమార! ధీరతా!
చలాచలాధినాథతుల్య!సత్ప్రతాపనిర్జితా
నలా! బలాహకప్రధానసవ్యరూపచాతురీ
నలా! హలాయుధేందుసన్మృణాళధిగ్యశోనిధీ!

294

గద్యము
ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ
రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి
బిరుదాభిరామ రామలింగయ నామధేయ ప్రణీతం
బైన శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము
శ్రీ

  1. పాఠాంతరము
    విడువక [క]ఱ్ఱు దినంగా
    దొ[డఁగుదురే వానిఁజూడ దొ]సఁగు నరేంద్రా.