ఇంద్రాణీ సప్తశతీ/బార్హతం శతకమ్‌





ఓం

చతుర్థం

బార్హతం శతకమ్

1. హలముఖీస్తబకము

1. క్షీరవీచి పృషతసితం ప్రేమధారి దరహసితం |
   నాకరాజ నళిన దృశ శ్శోకహారి మమ భవతు ||

2. అధ్వనో గళిత చరణా మధ్వర క్షితి మవిభవాం |
   ఆ దధాతు పథి విమలే వైభవేచ హరి తరుణీ ||

3. బ్రహ్మణ శ్చితి రథ నభః కాయభా గవగతి మతీ |
   యా తదా పృథగివ బభౌ ధర్మితాం స్వయమపి గతా ||

4. మోద బోధ విభవకృత ప్రాకృతేతర వరతను |
   సర్వ సద్గుణగణయుతం యా ససర్జ సురమిథునం ||

5. పుంసి దీప్త వవుషి తయో ర్బ్రహ్మ సో౽హమితి లసతి |
   యోషితే కిల ధియమదా త్తస్య శక్తి రహమితి యా ||

6. యాభిమానబలవశత స్తాముదారతమ విభవాం |
   మన్య తేస్మ వరవనితాం స్వాధిదైవిక తను రితి ||


1. క్షీరతరంగ బిందువులవలె స్వచ్ఛమైన ప్రేమను ధరించు ఇంద్రాణీ దరహసితము నా శోకమును హరించుగాక.


2. మార్గమునుండి చరణములు జారి, వైభవమును గోల్పోయిన యీ యజ్ఞభూమిని తిరుగ ఆ మార్గమునకు, వైభవమునకు గూడ ఇంద్రాణి తెచ్చుగాక.


3. బ్రహ్మకు చైతన్యమై, పిదప నాకాశశరీరిణియగుచు నంతటను గమనము గలిగిన దేవి తన ధర్మిత్వమును (చిత్తత్త్వమును) స్వయముగా బొందియున్నను వేఱుగా ప్రకాశించుచున్నది.

(విద్యుద్రూపిణియై, లేదా 'అహం' స్ఫురణరూపిణియై)


4. చిదానంద తత్త్వములతో గూడిన శ్రేష్ఠమైన దివ్యశరీరము గలిగి, సర్వ సద్గుణములతో గూడిన దైవమిధునము నేదేవి సృజించెనో, (అనగా సగుణదైవ మిధునమును)


5. ఆ మిధునమందు బ్రకాశించు పురుషునియందు 'సో౽హం బ్రహ'యని యేదేవి ప్రకాశించుచు, స్త్రీ భాగమునకు "ఆబ్రహ్మయొక్క శక్తిని నేను" అను బుద్ధిని గలిగించు చున్నదో.


6. ఏశక్తి యభిమాన బలవశముచేత నధిక వైభవము గలిగియున్న ఆ స్త్రీమూర్తిని తానే యధిదేవతగాగల శరీరిణిగా భావించు చున్నదో, (మూలశక్తి యీశ్వరాభిమానశక్తి, ఆమెలక్షణమే 'అహమ్మహ'మ్మను ప్రత్యేక భాసమానము.)

7. ఆదిపుంసి గగనతను ర్యా తనోతి తనుజ మతిం |
   ఆ దధాతి యువతి తనుః ప్రాణనాయక ఇతి రతిం ||

8. తాం పరాం భువన జననీం సర్వపాపతతి శమనీం |
   తంత్రజాల వినుత బలాం స్తౌమి సర్వమతి మమలాం ||

9. సా మతి ర్విదిత విషయా సారుచి ర్వితత విషయా |
   సా రతి ర్వినుత విషయా సాస్థితి ర్విధుత విషయా ||

10. యత్ర యత్ర మమధిషణా గ్రాహ్యవస్తుని గతిమతీ |
    తత్ర తత్ర విలసతు సా సర్వగా సకల చరితా ||

11. దుర్బలస్య బహుళ బలై రర్దితస్య జగతి ఖలైః |
    ఆదిదేవి తవ చరణం పావనం భవతి శరణం ||

12. పౌరుషే భవతి విఫలే త్వా మయం జనని భజతే |
    కింను తే యది విముఖతా పౌరుషం కథయ భజతాం ||


7. ఏ యాకాశశరీరిణి యీ ఆదిపురుషుని (సగుణదైవరూపమును) పుత్రభావముతో కల్పించి, తాను స్త్రీ తనువును బొంది యతనితో ప్రాణనాయకుని యందువలె రతి సల్పుచున్నదో,


8. జగన్మాతయు, సర్వపాపములను శమింపజేయునదియు, తంత్ర జాలముచే (శాస్త్రముచే) పొగడబడునదియు, సర్వమునకు బుద్ధిరూపిణియు, అమలయు, పరమమైనదియు నగు ఆమెను స్తుతించుచుంటిని.


9. విషయములను దెలియు బుద్ధియామెయే, విషయములందు వ్యాపించు కాంతియునామెయే, విషయములందు బ్రసిద్ధమైన ప్రీతి (యభిమానము) యామెయే. (విషయాభిమానముతో గూడిన వృత్తి చెప్పబడెను. అభిమానము వృత్తినుండి తొలగి మూలగతమైనప్పుడు విషయము లణగును). విషయముల నణచు స్థితికూడ నామెయే యగును.


10. ఎచ్చ టెచ్చట గ్రహింపదగిన వస్తువునందు నా బుద్ధి వ్యాపించు చుండునో, అచ్చటంతటను సకల చరితయైన నామె వ్యాపించి విలసిల్లుగాక.


11. ఓ దేవీ ! జగత్తునం దధిక బలముగల దుర్మార్గులచే పీడింపబడు దుర్బలులకు నీ పవిత్ర చరణమే శరణము.


12. ఓ తల్లీ ! పౌరుషము విఫలమైనప్పుడు నిన్ను సేవించుచుందురు. నీ కిష్టము లేనప్పుడు సేవించువాని పౌరుష మే మగునో చెప్పుము.

13. కర్తు రప్రతిహత గిరః పౌరుషా చ్ఛతగుణమిదం |
    ధ్యాతు రస్ఖలిత మనసః కార్యసిద్ధిషు తవ పదం ||

14. పౌరుషం విదితమఫలం కాంక్షి తే మమ సురసుతే |
    శక్త మీదృశితు సమయే శ్రద్దధామి తవ చరణం ||

15. పౌరుషం యది కవిమతం దేవి తేపి పద భజనం |
    దైవవాదపటు వచసో మూకతైవ మమ శరణం ||

16. పూర్వజన్మ సుకృతబలం దైవమంబ నిగదతి యః |
    భక్తిపౌరుష విరహిణో భావితస్య రిపు దయితం ||

17. ఉద్యతస్య తవ చరణం సంశ్రితస్యచ సురసుతే |
    పూర్వజన్మ సుకృతబల శ్రద్ధయా౽లమహృదయయా ||


13. వాక్కు లప్రతిహతముగా నుండువాని పౌరుషముకంటె నస్ఖలిత మనస్సుగల ధ్యానికి కార్యసిద్ధి యీ నీ పాదము శతగుణాధికముగా నిచ్చును.

(అనగా పౌరుషముతో గూడిన వాక్సిద్ధికంటె నిశ్చలమనస్సున కధిక బలమని)


14. ఓ దేవీ ! నా యభిలాష విషయమై పౌరుషమువలన లాభము లేదని తెలియుచున్నది. ఇట్టి సమయమందు నీ చరణమే సమర్ధమని నేను శ్రద్ధతో నమ్ముచుంటిని.


15. ఓ దేవీ ! నీ పాదభజనముకూడ బౌరుషమే యన్నచో దైవ వాదినగు నాకు మౌనమే శరణము.


16. ఓ తల్లీ ! ఎవడు పూర్వజన్మ సుకృతబలమే దైవమని చెప్పునో భక్తి పౌరుషములులేని (పౌరుషము = పురుషయత్నము) వాని యొక్క కాబోవు దైవము తనకు శత్రువగును.

(పూర్వజన్మ కర్మయే తన కిహమందు ప్రేరేపించు దైవ మనుకొనువారికి దైవము జడమగును. ఏల ననగా కర్మజడము కనుక. ఆ జడదైవము తా ననుకొనినట్లు ప్రే రేపింపజాలదు గనుక తన కది శత్రువగును. కనుక 'బుద్ధిః కర్మానుసారిణీ' అను వాక్యము తప్పు. 'కర్మబుద్ధ్యనుసారివై' = బుద్ధి ననుసరించి కర్మయుండును. అని సవరించుకొనవలెను.)


17. ఓ తల్లీ ! నీ చరణముల నాశ్రయించుచు పురుష ప్రయత్నము చేయుచున్న ప్పుడు, నమ్మదగని పూర్వజన్మ సుకృతబలమును గూర్చి శ్రద్ధ యవసరములేదు. (ఈ జన్మలో చేయు కర్మ కుత్తరజన్మలోగాని ఫలము రాదనువారికిది జవాబు.)

18. అస్తు పూర్వభవ సుకృతం మాస్తువా జనని జగతాం |
    సాంప్రతం తవపదయుగం సంశ్రితోస్మ్యవ విసృజవా ||

19. నాస్తి సంప్రతి కిమపి కిం భూతిమాప్స్యపి కిము తతః |
    అన్య జన్మని వితరుణే కాప్రసక్తి రమర సుతే ||

20. నాన్య జన్మని బహుశివం నాపి నాకభువన సుఖం |
    కామయే ఫల మభిమతం దేహి సంప్రతి శచి నవా ||

21. మేదినీ భువన తలతో నిస్తులాదుత గగనతః |
    భాస్కరా దుత రుచిని దేః కామ్య మీశ్వరి వితర మే ||

22. విష్ట పే క్వచన వరదే దాతు మీశ్వరి కృతమతిం |
    వారయే జ్జనని న పర స్త్వాం జనస్తవ పతి మివ ||

23. దేహివా భగవతి నవా పాహివా శశిముఖి నవా |
    పావనం తవ పదయుగం సత్యజామి హరిదయితే ||


18. ఓ తల్లీ ! పూర్వజన్మ సుకృతబల ముండుగాక, లేకపోవుగాక. ఇప్పుడు నీ పదయుగము నే నాశ్రయింతును. రక్షింపుము, మానుము.

(ప్రే రేపించునది బుద్ధి యగునుగాని జడమైన కర్మ కాజాలదు. కనుక బుద్ధిని సవ్యమొనర్చుకొని, జడమైన కర్మఫలము నారాధించుట మాని, చిద్రూపిణి యగు దేవత నాశ్రయించవలెను.)


19. ఓ తల్లీ ! ఇప్పు డేమియు లేదు. (పూర్వజన్మ కర్మఫలముచొప్పున నైశ్వర్య మిప్పు డేమియులేదు). ఐశ్వర్యమును (ప్రస్తుత కర్మ ఫలముగా) పొందగోరినచో తరువాత ఏమిటి ? (ఈ జన్మలోని కర్మకు ఫలము) మఱియొక జన్మలో నివ్వడమనెడి ప్రసక్తియేల ?


20. ఓ శచీ ! ఇతర జన్మలం దెక్కువ మంగళములు నేను కోరుట లేదు, స్వర్గసుఖమైన కోరుట లేదు. నా కభిమతమగు ఫలమును ఇప్పుడు నేను కోరుచుంటిని. ఇచ్చిన నిమ్ము, లేదామానుము. (ఫల మిచ్చునది దైవము కనుక నిప్పటి పుణ్యకర్మకు దైవ మిప్పుడైన నీయగలదని భావము.)


21. ఓ దేవీ ! భూలోకమునుండికాని, నిరుపమానమగు నాకాశము నుండికాని, కాంతినిధియగు సూర్యునినుండిగాని నా కోర్కెను నెరవేర్పుము.


22. ఓ తల్లీ ! నీవు సర్వేశ్వరివి కనుక నీవీయఁదలఁచినచో నిన్ను ఏలోకమునందును నీ భర్తనువలె నడ్డగింపగలవారు లేరు.


23. ఓ దేవీ ! ఇచ్చిన నిమ్ము, లేదా మానుము. రక్షింపుము, మానుము. పావనమైన నీ పాదములుమాత్రము నేనువిడువను.

24. రక్షితుం భరత విషయం శక్త మింద్ర హృదయ సఖీ |
    చంద్రబింబ రుచిర ముఖీ సా క్రియా ద్భువి గణపతిం ||

25. సంప్రహృష్యతు హలముఖీ ర్భాస్వతీ ర్గణపతి మునేః |
    సా నిశమ్య సురనృపతే ర్మోహినీ సదయ హృదయా ||

                   ________


2. భుజగశిశుభృతాస్తబకము

1. మరుదధివ మనోనాధా మధుకర చికురాస్మాకం |
   వృజిన విధుతి మాధత్తాం విశద హసిత లే శేన ||

2. అఖిల నిగమ సిద్ధాంతో బహు మునివర బుద్ధాంతః |
   సుర పరిబృఢ శుద్ధాంతో భరత వసుమతీ మవ్యాత్ ||

3. భగవతి భవతీ చేతో రతి కృదభవ దింద్రస్య |
   సతవ జనని సంతాన ద్రుమవన మతి రమ్యం వా ||

4. పతి రఖిల యువశ్రేష్ఠః కిమపి యువతి రత్నం త్వం |
   వన విహృతిషు వాంచేతో హరణ మభవ దన్యోన్యం ||

5. మధుర లలిత గంభీరై స్తవ హృదయ ముపన్యాసైః |
   వన విహరణ లీలాయా మహరదయి దివోరాజా ||


24. చంద్రబింబముఖియైన ఇంద్రాణి భరతభూమిని రక్షించుటకు గణపతిని భూలోకమందు శక్తిమంతునిగా జేయుగాక.


25. దయతోగూడిన ఇంద్రాణి ప్రకాశించుచున్న యీ గణపతి మునియొక్క 'హలముఖీ' వృత్తములను విని సంతోషించుగాక.

_________


1. తుమ్మెదలనుబోలు ముంగురులు గల ఇంద్రాణి తన నిర్మల మందహాసముచే మాయొక్క పాపములను నాశన మొనర్చు గాక.


2. సకల వేదములందు కొనియాడబడి, బహుమునివరులచే తెలియబడు నంతముగలిగి, యింద్రుని యంతఃపురస్త్రీయై యున్న దేవి భారతభూమిని రక్షించుగాక.


3. ఓ తల్లీ ! ఇంద్రుని మనస్సునకు రతిగూర్చుదానవు నీవు, నీ మనస్సునకు రతిగూర్చువాడా యింద్రుడు. రమ్యమైన కల్పక వనము మీ యుభయులకు రతిగూర్చునదయ్యెను.


4. నీ పతి యఖిల యువకులలో శ్రేష్ఠుడు, నీ వొకానొక యువతీ రత్నమవు. వనవిహారములందు మీ యన్యోన్యత్వమే మీ మనస్సు లొకదానిచే నొకటి హరింపబడుటకు తోడ్పడుచున్నది.


5. దేవీ ! ఇంద్రుడు వనవిహార లీలలందు మధుర, లలిత, గంభీర వాక్కులచే నీ హృదయము నాకర్షించెను.

6. కలవచన విలాసేన ప్రగుణ ముఖ వికాసేన |
   భువనపతి మనో౽హార్షీ ర్జనని వన విహారే త్వం ||

7. కనక కమల కాంతాస్యా ధవళ కిరణ వక్త్రేణ |
   అసిత జలజ పత్రాక్షీ సిత నళిన దళాక్షేణ ||

8. అళిచయ నిజధమ్మిల్లా నవజలధర కేశేన |
   మృదులతమ భుజావల్లీ ధృఢ తమ భుజదండేన ||

9. అమృతనిలయ బింబోష్ఠీ రుచిర ధవళ దం తేవ |
   అతి ముకుర లసద్గండా వికచ జలజ హస్తేన ||

10. యువతి రతితరాం రమ్యా సులలిత వపుషాయూనా |
    భగవతి శచి యుక్తా త్వం త్రిభువన విభునేంద్రేణ ||

11. వికచ కుసుమ మందార ద్రుమ వన వరవాటీషు |
    విహరణ మయి కుర్వాణా మనసిజ మనుగృహ్ణాసి ||

12. తవశచి చికు రేరాజ త్కుసుమ మమర వృక్షస్య |
    నవ సలిల భృతో మధ్యే స్ఫురదివ నవ నక్షత్రం ||

13. అభజత తరు రౌదార్యం విభవ మహాంతం సః |
    వికచ కుసుమ సంపత్త్యా భగవతి భజతే యస్త్వాం ||


6. ఓ తల్లీ ! వనవిహారమందు నీవు మధుర వాగ్విలాసములచేతను, మిగుల గుణములుగల ముఖవిలాసము చేతను ఇంద్రుని మనస్సాకర్షించితివి.


7. బంగారుపద్మమువలె సొగసైన ముఖము. నల్లకలువ రేకులవంటి నేత్రములుగలది దేవి. తెల్లని కాంతులుగల ముఖము, తెల్లని తమ్మిరేకులవంటి కనులు గలిగినవాడు విభుడు.


8. తుమ్మెదలగుంపువంటి కొప్పు, మిక్కిలి మృదువైన భుజములు గల్గినది దేవి. వర్ష కాలమేఘమువంటి జుట్టు, మిక్కిలి దృఢమైన భుజదండములు గలవాడు విభుడు.


9. అమృతమునకు నిలయమైన బింబోష్ఠము, అద్దములను మించి ప్రకాశించు చెక్కిళ్లు గల్గినది దేవి. కాంతిగల తెల్లని దంతములు, వికసించిన పద్మములవంటి హస్తముగలవాడు విభుడు.


10. ఓ శచీ ! అత్యంత రమ్యమైన యువతివై నీవు సుందరశరీరము గలిగి యౌవనవంతుడై, త్రిభువనపతియైన నింద్రునితో గూడితివి.


11. ఓ దేవీ ! వికసించిన పుష్పములుగల మందార వృక్షవనపంక్తు లందు విహరించుచు నీవు మన్మధు ననుగ్రహించుచుంటివి.


12. ఓ శచీ ! నీ ముంగురులందు బ్రకాశించు కల్పకపుష్పము నూత్న మేఘ మధ్యమందు బ్రకాశించు నూత్న నక్షత్రము వలె భాసించుచున్నది.


13. ఓ దేవీ ! ఏ యమరవృక్షము వికసించిన పుష్ప సంపత్తితో నిన్ను భజించునో, అ తరువు ఔదార్యమును, ఐశ్వర్యమును గూడ (నీ వలన) బొందుచున్నది.

14. అమర నృపతి నాసాకం కుసుమిత వనవాటీషు |
    భగవతి తవ విశ్రాంతే స్సజయతి సమయః కోపి ||

15. అమర తరువర చ్ఛాయా స్వయి ముహురుపవిశ్య త్వం |
    శచి కృతి జన రక్షాయై మనసి వితనుషే చర్చాం ||

16. కిము వసు వితరాణ్యస్మై సుమతి ముత దదా న్యస్మై |
    క్షమతమ మధవాముష్మి న్బలమురు ఘటయానీతి ||

17. హరి తరుణి కదావామే వినమదవన చర్చాసు |
    స్మరణ సమయ ఆయాస్య త్యమల హృదయరంగే తే ||

18. శచి భగవతి సాక్షాత్తే చరణ కమల దాసో౽హం |
    ఇహతు వసుమతీలోకే స్మర మమ విషయం పూర్వం ||

19. నయది తవ మనోదాతుం స్వయమయి లఘ వే మహ్యం |
    ఉపవన తరు కర్ణేవా వదమ దభిమతం కర్తుం ||

20. నిజ విషయ మతిశ్రేష్ఠం విపది నిపతి తంత్రాతుం |
    స్వకులమపి సదధ్వానం గమయితు మపథే శ్రాంతం ||

21. అఖిల భువన సమ్రాజః ప్రియ తరుణి భవత్యైవ |
    మతిబల పరిపూర్ణో౽యం గణపతిముని రాధేయః ||


14. ఓ తల్లీ ! పుష్పవన వాటికలందు ఇంద్రునితో గూడి నీవు విశ్రాంతి బొందు నొకానొక సమయము సర్వోత్కృష్టము.


15. ఓ శచీ ! అమర వృక్షచ్ఛాయలందు నీవు మాటి మాటికి గూర్చుని పుణ్యజనరక్షణము గుఱించి మనస్సున చర్చించుకొను చుంటివి (కాబోలు).


16. ఆ పుణ్యజనులకు 'ధనమిత్తునా, జ్ఞానమిత్తునా, లేక అధిక బలమిత్తునా ?' అని చర్చించుచుంటివా ?


17. ఓ తల్లీ ! విశేష నమ్రులైన వారి రక్షణవిషయమై చేయు చర్చ లందు నీ నిర్మల హృదయరంగమందు నన్ను స్మరించు కాల మెప్పుడు వచ్చును ?


18. ఓ దేవీ ! నేను సాక్షాత్తు నీ చరణకమల దాసుడనై యుంటిని. ఈ భూలోకమందు నా విషయమును మొదట స్మరింపుము.


19. ఓ దేవీ ! అల్పుడైన నాకు స్వయముగా నిచ్చుటకు నీకు మనస్సు లేనిచో ఉపవనమందున్న యీ చెట్టు చెవిలోనైన నా యభిమతమును దీర్చెదనని చెప్పుము.


20. విపత్తులో పడిన నతిశ్రేష్ఠమగు నా దేశమును రక్షించుటకును, తప్పుమార్గమునబడి యలసిపోయిన స్వకులమును సన్మార్గము బొందించుటకును,


21. ఓ దేవీ ! నీ చేతనే యీ గణపతిముని బుద్ధిబలపూర్ణుడు గావింపబడుగాక.


22. నకిము భవతి శందేశే గతివతి కలుషే కాలే |
    తవ భజన మఘం సద్యో హరిహయ లలనే జేతుం ||

23. త్రిజగతి సకలం యస్య ప్రభవతి పృథులే హస్తే |
    స బహుళ మహిమా కాలో మమ జనని విభూతిస్తే ||

24. అనవరత గళ ద్బాష్పాం భరత వసుమతీం త్రాతుం |
    వితరతు దయితా జిష్ణో ర్గణపతి మునయే శక్తిం ||

25. భుజగ శిశుభృతా ఏతాః కవి గణపతినాగీతాః |
    విదధతు ముదితాం దేవీం విబుధపతి మనోనాథాం ||

                   ________

3. మణిమధ్యాస్తబకము


1. మంగళదాయీ పుణ్యవతాం మన్మధ దాయీ దేవపతేః |
   విష్టపరాజ్ఞీ హాసలవో విక్రమదాయీ మే భవతు ||

2. దృష్టి విశేషై శ్శీతవరై ర్భూర్యనుకంపైః పుణ్యతమైః |
   భారత భూమేస్తాపతతిం వాసవకాంతా సా హరతు ||

3. పావన దృష్టి ర్యోగిహితా భాసురదృష్టి ర్దేవహితా |
   శీతలదృష్టి ర్భక్త హితా మోహనదృష్టి శ్శక్రహితా ||


22. ఓ తల్లీ ! సుఖప్రదమగు దేశమం దీ కలుషకాలములో నీ భజన వలన పాపములు వెంటనే జయింపబడవా యేమి ?


23. ఓ జననీ ! ఏ కాలముయొక్క గొప్పహస్తములో ముల్లోకము లిమిడి యుండునో, బహుళ మహిమగల ఆ కాలము నీ యొక్క విభూతియే కదా. (కాళి)


24. ఎల్లప్పుడు కన్నీరుకార్చు భారత భూరక్షణకై గణపతిముని కింద్రాణి శక్తి నిచ్చుగాక.


25. గణపతి కవిచే గానము చేయబడిన యీ 'భుజగశిశుభృతా' వృత్తము లింద్రసఖికి ప్రీతి నిచ్చుగాక.

__________


1. పుణ్యాత్ములకు మంగళములనిచ్చునది, ఇంద్రుని మోహింప జేయునది యగు ఇంద్రాణీహాసలవము నాకు విక్రమము నిచ్చు గాక.


2. ఆ యింద్రాణి విశేషదయకలిగి, మిక్కిలి పవిత్రములై, అత్యంత శీతలములైన దృష్టి విశేషములచే భారత భూతాపములను హరించుగాక.


3. పావనదృష్టి కలదు గనుక యోగులకు హితురాలు, ప్రకాశించు దృష్టి యుండుటచే దేవతలకు హితురాలు, శీతలదృష్టివలన భక్తులకు హితురాలు, మోహనదృష్టిచే నామె యింద్రునకు హితురాలగుచున్నది.


4. ఉజ్జ్వలవాణీ విక్రమదా వత్సలవాణీ సాంత్వనదా |
   మంజులవాణీ సమ్మదదా పన్నగ వేణీ సా జయతు ||

5. శారదరాకా చంద్రముఖి తో యదమాలాకార కచా |
   మేచక పాథో జాతదళ శ్రీహర చక్షుర్వాసి కృపా ||

6. చంపక నాసా గండ విభా మండల ఖేల త్కుండల భా |
   ఉక్తిషు వీణా బింబఫల శ్రీహర దంత ప్రావరణా ||

7. నిర్మల హాస క్షాళి తది గ్భిత్తి సమూహా మోహహరీ |
   కాంచనమాలా శోభిగళా సంతతలీలా బుద్ధికళా ||

8. విష్టపధారి క్షీరధర స్వర్ణఘట శ్రీహరి కుచా |
   కాపి బిడౌజోరాజ్యరమా చేతసి మాతా భాతుమమ ||

9. దివ్యసుధోర్మి ర్భక్తిమతాం పావక లీలా పాపకృతాం |
   వ్యోమ్ని చరంతీ శక్రసఖీ శక్తిరమోఘా మా మవతు ||

10. సమ్మదయంతీ సర్వతనుం సంశమయంతీ పాపతతిం |
    సంప్రథయంతీ సర్వమతీ స్సంఘటయంతీ ప్రాణబలం ||


4. ఉజ్జ్వలవాక్కులు గలది కనుక నామె విక్రమమిచ్చును, ప్రేమ పూరితవాక్కులు గలదియై యోదార్చును, మంజులవాక్కులచే సంతోషమిచ్చును. ఇట్టి పన్నగవేణియగు ఇంద్రాణి ప్రకాశించు గాక.


5. శరచ్చంద్రునిబోలు ముఖము, మేఘపంక్తివంటి కొప్పుగల్గి నల్లని కలువ రేకులతో సమమగు చక్షువులందు వసించు దయ గల ఇంద్రాణి ప్రకాశించుగాక.


6. సంపెంగవంటి నాసిక, చెక్కిళ్లకాంతి మండలముతో క్రీడించు కుండల కాంతులు, వీణనాదమువంటి పల్కులు, దొండపండు శోభను హరించు నధరోష్ఠముగల యింద్రాణి ప్రకాశించుగాక.


7. నిర్మలములైన నగవులచే దిక్కులనెడి గోడల సమూహమును కడుగుచున్నది, మోహమును హరించునది, స్వర్ణ మాలచే బ్రకాశించు కంఠముగలది, సంతత లీలలతో గూడిన బుద్ధి కళలుగలది,


8. ప్రపంచమును బోషించు క్షీరభారమును ధరించు సువర్ణఘటములవలె ప్రకాశించు కుచములుగల మాతయైన నొకానొక దేవేంద్ర రాజ్యలక్ష్మి నా చిత్తమందు బ్రకాశించుగాక.


9. భక్తులకు దివ్యామృతము వంటిది, పాపాత్ముల కగ్ని వంటిది, ఆకాశమందు సంచరించు నింద్రసఖి యను నమోఘశక్తి నన్ను రక్షించుగాక.


10. అందరిని సంతోషపరచునది, పాపసమూహమును నాశన మొనర్చునది, అందరి బుద్ధులను బ్రకటించునది, ప్రాణబలమును సమకూర్చునది.

11. నిర్జితశోకా ధూత తమా సంస్కృత చిత్తా శుద్ధ తమా |
    వాసవశక్తే ర్వ్యోమజుషః కాచన వీచిర్మాం విశతు ||

12. ఉద్గత కీలం మూలమిదం భిన్నకపాలం శీర్షమిదం |
    ఉజ్ఘి తమోహం చిత్తమిదం వాసవ శక్తిర్మాం విశతు ||

13. దృశ్య విరక్తం చక్షురిదం భోగవిరక్తం కాయమిదం |
    ధ్యేయ విరక్తా బుద్ధిరియం వాసవశక్తి ర్మాం విశతు ||

14. చక్షు రదృశ్య జ్వాలభృతా వ్యాపక ఖేన ప్రోల్లసతా |
    విస్తృతకాయం సందధతీ వాసవశక్తి ర్మాం విశతు ||

15. కాయ మజస్రం వజ్రదృఢం బుద్ధి మశేషం వ్యాప్తిమతీ |
    దివ్యతరంగై రా దధతీ వాసవశక్తి ర్మాం విశతు ||

16. మూర్థ్ని పతంతీ వ్యోమతలా త్సంతతమంత స్సర్వతనౌ |
    సంప్రవహంతీ దివ్యఝరై ర్వాసవశక్తిర్మాం విశతు ||

17. భానువిభాయాం భాసకతా దివ్యసుధాయాం మోదకతా ||
    కాపి సురాయాం మాదకతా వాసవశక్తి ర్మాం విశతు ||

18. భాసయతాన్మే సమ్యగృతం మోదముదారం పుష్యతు మే |
    సాధుమదం మే వర్ధయతా న్నిర్జర భర్తుశ్శక్తిరజా ||


11. శోకమును బోగొట్టునది, తమస్సును దొలగించునది, చిత్తమును సంస్కరించునది, పరిశుద్ధ వ్యోమశరీరము బొందినది యగు ఇంద్రాణియొక్క వీచిక యొక్కటి నన్ను బ్రవేశించుగాక.


12. కిరణములు వెడలుచున్న యీ మూలాధారము, కపాలభిన్న మైన యీ శిరస్సు, మోహవర్జితమైన యీ చిత్తముగల నన్ను వాసవశక్తి యా వేశించుగాక.


13. ప్రపంచమునుండి విరక్తమైన యీ కన్ను, భోగమునుండి విరక్తమైన యీ దేహము, ధ్యేయవస్తువునుండి విరక్తమైన యీ బుద్ధిగల నన్నింద్రాణి ప్రవేశించుగాక.


14. కంటి కదృశ్యమైన జ్వాలలను భరించుచు, మిక్కిలి ప్రకాశించుచు విస్తరించిన ఆకాశముచే విస్తృతమైన శరీరమును ధరించిన యింద్రాణి నన్ను ప్రవేశించుగాక.


15. పూర్ణ బుద్ధిని వ్యాపింపజేయుచు నెల్లప్పుడు శరీరమును వజ్రదృఢముగా నొనర్చు ఇంద్రాణి నన్ను ప్రవేశించుగాక.


16. ఆకాశమునుండి శిరస్సుపైబడుచు, సర్వశరీరమునందును సంతత దివ్యప్రవాహముగానున్న యింద్రాణి నన్ను ప్రవేశించుగాక.


17. సూర్యునియందుగల ప్రకాశకత్వము, అమృతమందుగల మోదకత్వము, సురయందుగల మాదకత్వము - యీ మూడు వాసవ శక్తియందున్నవి. ఆమె నాలోఁ బ్రవేశించుగాక.


18. ఇంద్రాణిశక్తి నాయొక్క మానసిక సత్యమును లెస్సగా బ్రకాశింపజేయుగాక, నా కుదారసంతోషము నిచ్చుగాక, సాత్త్విక బల మిచ్చుగాక.

19. కశ్చన శక్తిం యోగబలా దాత్మశరీరే వర్ధయతి |
    ఏపి వివృద్ధిం భక్తిమతః కస్య చిదీశే త్వం వపుషి ||

20. సాధయతాంవా యోగవిదాం కీర్తయతాంవా భక్తిమతాం |
    వత్సల భావాదింద్రవధూ ర్గర్భభువాంవా యాతివశం ||

21. యస్య సమాధిఃకోపి భవే దాత్మమనీషా తస్యబలం |
    యస్తవ పాదాంభోజరత స్తస్య ఖలు త్వం దేవి బలం ||
    
22. ద్వాదశవర్షీ యోగబలా ద్యాఖలు శక్తిర్యుక్త మతేః |
    తాం శచి దాతుం భక్తిమతే కాపి ఘటే తే మాతరలం ||

23. యోగబలాద్వా ధ్యానకృతో భక్తిబలాద్వా కీర్తయతః |
    యాతు వివృద్ధిం విశ్వహితా వాసవశక్తిర్మే వవుషి ||

24. దుఃఖిత మేత చ్ఛ్రీరహితం భారతఖండం సర్వహితం |
    తాత్రు మధీశా స్వర్జగత స్సుక్షమబుద్ధిం మాం కురుతాం ||

25. సంతు కవీనాం భర్తురిమే సుందర బంధా శ్శుద్ధతమాః |
    సన్మణి మధ్యా స్వర్జగతో రాజ మహిష్యాః కర్ణ సుఖాః ||

                  _________


19. ఓ తల్లీ ! ఒకడు యోగబలముచే దన శరీరమందు శక్తిని వృద్ధి పొందించుకొనును. ఇంకొకని శరీరమున నీవే వృద్ధినొందుదువు.


20. సాధించు యోగవేత్తలకు, కీర్తనసల్పు భక్తులకుగూడ వాత్సల్యముతో గర్భమందుబుట్టినవారికి వశమైన ట్లింద్రాణి వశమగును.


21. ఓ దేవీ ! ఎవడు సమాధిజెందునో, వానికి తన బుద్ధియే బలము. ఎవడు నీ పాదముల నాశ్రయించునో వానికి నీవే బలముగాదా.


22. ఓ తల్లీ ! ద్వాదశవర్షములు యోగబలయుక్తుడైనవాని కేశక్తి కలిగెనో (శ్రీ రమణమహర్షి యుద్దేశింపబడెను), నీ యందు భక్తునకుగూడ (కవికి) నట్టిశక్తి నిచ్చుటకు నీకు ఒక్క గడియ చాలును.


23. యోగబలముచే ధ్యానించువానికి, భక్తిబలముచే కీర్తించువానికి నేశక్తి వృద్ధిబొందునో, అట్టి యింద్రాణీ సంబంధశక్తి నా శరీరము బొందుగాక.


24. దుఃఖించునట్టి, ఐశ్వర్యము గోల్పోయినట్టి, సర్వహితమైనట్టి యీ భరతఖండమును రక్షించుట కింద్రాణి నాకు సమర్ధబుద్ధి నిచ్చుగాక.


25. కవిభర్తయైన గణపతియొక్క సుందరమైన, పరిశుద్ధమైన యీ సన్మణిమధ్యావృత్తము లింద్రాణికి కర్ణసుఖము నిచ్చుగాక.


__________

4. మాత్రాసమకస్తబకము

1. శుక్లజ్యోతిః ప్రకరై ర్వ్యాప్త
   స్సూక్ష్మోప్యంతాన్ హరితాం హాసః |
   జిష్ణోః పత్న్యా స్తిమిరారాతి
   ర్ని శ్శేషం మే హరతా న్మోహం ||

2. శృణ్వత్కర్ణా సదయాలోకా
   లోకేంద్రస్య ప్రియనారీ సా |
   నిత్యాక్రోశై ర్విరుదద్వాణీం
   పాయాదేతాం భరతక్షోణీం ||

3. దేవేషు స్వః పరిదీప్యంతీ
   భూతేష్విందౌ పరిఖేలంతీ |
   శక్తిర్జిష్ణో ర్ద్విపదాం సంఘే
   హంతై తస్యాం భువి నిద్రాతి ||

4. నిద్రాణాయా అపి తేజ్యోతి
   ర్గంధాదేతే ధరణీలోకే |
   మర్త్యాః కించిత్ప్రభవంతీశే
   త్వం బుద్ధాచే త్కిము వక్త్యవ్యం ||

5. మేఘ చ్ఛన్నో౽ప్యరుణస్తేజో
   దద్యాదేవ ప్రమదే జిష్ణోః |
   అత్ర స్థానా భవతీ గ్రంధి
   చ్ఛన్నా ప్యేవం కురుతే ప్రజ్ఞాం ||


1. సూక్ష్మమైనను తెల్లని కాంతిచే దిక్కులందు వ్యాపించునది, తిమిరమునకు శత్రువైనది యగు ఇంద్రాణీహాసము నా యజ్ఞానమును బూర్తిగా హరించుగాక.


2. చెవులతో వినుచున్నదై (యీ స్తుతిని) దయగల యింద్రాణి నిత్యశోకముచే విశేషముగా రోదనమొనర్చు వాణి గల్గిన భారతభూమిని రక్షించుగాక.


3. స్వర్గములో దేవతలందు బ్రకాశించుచు, చంద్రగోళములో భూతములయందు క్రీడించు ఇంద్రాణి యీ భూమిలో మానవు లందు నిద్రించుచున్నది. ఆశ్చర్యము !

(మూలాధారమం దజ్ఞానులలో నిద్రించుచుండునని చెప్పబడును)


4. దేవీ ! నిద్రించుచున్నను, నీ తేజోగంధమువలన ఈ మనుజులు భూలోకమందు కొంతవఱకు సమర్ధులగుచునే యుండిరి. నీవు మనుజునియందు మేల్కాంచి తెలియబడినచో నింక చెప్పుట కే మున్నది ?


5. ఓ తల్లీ ! సూర్యుడు మేఘములచే గప్పబడినను వెల్తురునిచ్చు చుండెను. నీవు గ్రంధులచే గప్పబడియు నీ లోకములోని వారికి (భూలోకస్థులకు) ప్రజ్ఞ నిచ్చుచుంటివి.

6. ధ్యాయామో యత్కథయామో య
   త్పశ్యామో యచ్చృణుమో యచ్చ |
   జీవామోవా తదిదం సర్వం
   నిద్రాణాయా అపితే భాసా ||

7. నాడీ బంధా దభిమానాచ్చ
   చ్ఛన్నా మాంతర్వవతీ దేహే |
   ఏకాపాయా దితరో నశ్యే
   త్తస్మా ద్ద్వేధా తపసః పంథాః ||

8. చిత్తం యస్య స్వజని స్థానే
   ప్రజ్ఞా బాహ్యా నభవేద్యస్య |
   ఆధత్సే త్వం భువనాధీశే
   బుద్ధా క్రీడాం హృదయే తస్య ||

9. వాణీ యస్య స్వజనిస్థానే
   దూరేకృత్వా మనసా సంగం |
   మాతస్తత్రప్రతి బుద్ధా త్వం
   శ్లోకైర్లోకం కురుషే బుద్ధమ్ ||

10. హిత్వా దృశ్యాన్యతి సూక్ష్మాయాం
    చక్షుర్యస్య స్వమహోవృత్తౌ |
    విశ్వా లిప్తా జగతాం మాత
    ర్జాగ్రత్యస్మిస్ అచలాభాసి ||


6. మేము ధ్యానించుట, పల్కుట, చూచుట, వినుట, జీవించుట - ఈ సర్వము నీవు నిద్రించుచున్నను నీ కాంతివల్లనే జరుగు చున్నవి.


7. ఓ తల్లీ ! నాడీబంధమువలన, అభిమానమువలన గూడ నీవు దేహమందు గప్పబడియుంటివి. (కనుకనే వీటిని గ్రంధులనిరి). ఒక దాని కపాయముగల్గినచో, రెండవది నశించును. అందు వల్ల తపస్సునకు రెండు మార్గములు సంభవించెను.

(ప్రాణము లేదా శబ్దసంబంధ మొకటి, మనస్సు లేదా రూపాభిమాన సంబంధ మొకటి.)


8. ఓ దేవీ ! ఎవని చిత్తము స్వస్థానమందుండునో, యెవని ప్రజ్ఞ బాహ్యగతముకాదో, వానిహృదయమందు తెలివివై నీవుంటివి.

(అనగా మనస్సును తన మూలమైన హృదయమందణచి, శిరస్సునకు బాహ్యగత మగుటకై రానీకుండుట. ఇది శ్రీరమణ మహర్షి యుపదేశములో నొకభాగము.)


9. ఓ తల్లీ ! ఎవని వాక్కు మనస్సుతో కలియకుండ తన స్వస్థానమందుండునో (ప్రాణము తన మూలమం దనగియుండుట - మూలాధారమున) వానియందు నీవు జాగరూకురాలవై లోకములో కీర్తిజ్ఞానములు గలవానిగా నీ వొనర్చు చుంటివి.


10. ఓ తల్లీ ! ఎవని కన్ను దృశ్యములను విడచి, తన యతి సూక్ష్మ అంతస్తేజో వృత్తియం దుండునో (నిర్విషయాలోచన), విశ్వము నుండి యలిప్తవై (విశ్వవ్యాపారమునుండి విడి) నీ వాతని యందు మేల్కొని, యచలవై ప్రకాశింతువు.

11. శృణ్వత్కర్ణో దయితే జిష్ణో
    రంతశ్శబ్దం ధ్రియతే యస్య |
    బుద్ధా భూత్వా వియతా సాధో
    రేకేభావం కురుషే తస్య ||

12. యాతా యాతం సతతం పశ్యే
    ద్యః ప్రాణస్యప్రయతో మర్త్యః |
    విశ్వ స్యేష్టాం తనుషే క్రీడాం
    తస్మిన్ బుద్ధా తరుణీంద్రస్య ||

13. స్వాంతం యస్య ప్రభవేత్కా ర్యే
    ష్వంబై తస్మిన్నయి నిద్రాసి |
    ఆత్మా యస్య ప్రభవేత్కా ర్యే
    ష్వంబై తస్మిన్నయి జాగర్షి ||

14. యస్యా౽హంతా భవతి స్వాంతే
    తస్య స్వాంతం ప్రభవేత్కర్తుం |
    యస్యా౽హంతా భవతి స్వాత్మ
    న్యాత్మా తస్య ప్రభవేత్కర్తుం ||

15. స్వాంతం యస్య ప్రభవేత్కర్తుం
    తత్కర్మాల్పం భవతి వ్యష్టేః |
    ఆత్మా యస్య ప్రభవేత్కర్తుం
    తచ్ల్ఛాఘ్యం తే బలజిత్కాంతే ||


11. ఓ తల్లీ ! ఎవడు తన వినే చెవిలోని యంతశ్శబ్దమును గ్రహించునో, నీవా సాధకునిలో మేల్కాంచి యాకాశముతో నైక్య భావము నిత్తువు. (శబ్దమూలము నెఱుగుట యిదే.)


12. పవిత్రుడైన యెవడు ప్రాణముయొక్క యాతాయాతముల జూచునో, వానియందు మేల్కాంచిన యింద్రాణివై విశ్వమునకు ప్రియమైన క్రీడ సల్పుదువు.


13. ఓ యంబా ! ఎవని చిత్తము కార్యములందు సమర్ధమైనదో, వానియందు నీవు నిద్రించియుందువు. ఎవని యాత్మ కార్యము లందు సమర్ధమైనదో వానియందు నీవు మేల్కాంచియుందువు.

(చిత్తమే కర్తయని యహంకరించువాడొకడు, కర్తస్థానమాత్మయని తెలిసినవాడింకొకడు.)


14. ఎవని యహంకారము మనస్సునం దుండునో, వాని మనస్సు చేయుటకు సామర్ధ్యము బొందును (కాని వానియందు నీవు నిద్రింతువు. అనగా ఆత్మ కప్పబడును). ఎవని యహమాత్మ యందుండునో, వాని యాత్మ చేయుటకు సామర్ధ్యము బొందును. (అనగా దేవియే వానియందు చేయుచుండును.)


15. ఓ దేవీ ! ఎవని మనస్సు చేయు సామర్ధ్యము బొందునో, వాని యం దా కర్మ యల్పమగును. ఎవని యాత్మ క్రియా సామర్ధ్య మొందునో, వాని కర్మ శ్లాఘ్యము.

(అనగా వాని కర్మ కీర్తిమంతమగును.)

16. ఏతత్స్వాంతం హృదయా జ్జాతం
    శీర్షేవాసం పృథగాధాయ |
    హార్దా హంతాం స్వయమాక్రమ్య
    భ్రాంతానస్మాన్కురుతే మాతః ||

17. అస్మాకం భోః కురుతే బాధా
    మస్మజ్యోతిర్జనని ప్రాప్య |
    స్వాంతే నైతత్కృత మన్యాయ్యం
    కాంతేజిష్ణో శ్శృణు రాజ్ఞీ త్వం ||

18. స్వాంతేతేజో హృదయాదాయా
    చ్చంద్రేతేజో దినభర్తుర్వా |
    అశ్రాంతం యో మను తే ధీర
    స్తస్యస్వాంతం హృదిలీనం స్యాత్ ||

19. మూలాన్వేషి స్ఫురదావృత్తం
    నీ చైరాయా త్కబళీకృత్య |
    జానం త్యేకా హృదయస్థానే
    యుంజానానాం జ్వలసీశానే ||

29. శీర్షేచంద్రో హృదయేభాను
    ర్నేత్రే విద్యు త్కులకుండేగ్నిః |
    సంపద్యంతే మహసోంశై స్తే
    జిష్ణోఃకాంతే సుతరాంశస్తే ||


16. ఓ తల్లీ ! హృదయమునుండి పుట్టిన ఆ చిత్తము శిరస్సునందు ప్రత్యేకముకా (వేఱొక కర్తగా) వాసముచేసి, హృదయమం దుండు 'అహం'స్ఫురణను స్వయముగా నాక్రమించి (శిరస్సు నుండి హృదయమునకు ప్రతిఫలించుటద్వారా). మమ్ములను భ్రాంతియందు ముంచుచున్నది.

(చిత్తము మనస్సగుట, చిత్తాకాశము భూతాకాశమగుటయిట్లే)


17. ఓ తల్లీ ! ఆ చిత్తము మా తేజస్సును బొంది మాకే యధిక బాధలు కలిగించుచున్నది. మనస్సుచే నిట్టి యన్యాయము చేయబడెను. ఓ దేవీ ! రాణివైన నీవు వినువు.

(ఆత్మయం దహమ్మహమ్మను భాసమానము సహజమైయున్నది. ఈ భాసమానమును బొంది చిత్తము ప్రకాశించినప్పు డహం చైతన్య మూలముగుఱించి సందేహము రావచ్చును. మాన వచ్చును. చిత్తమే మూలమనిపించుట అహంకారము.)


18. సూర్యుని తేజస్సు చంద్రున కెట్లో, హృదయ తేజస్సు మనస్సున కట్లు. ఎవ డిట్లు తెలిసి నిత్యము తలచునో, వాని చిత్తము హృదయమందు లీనమగును.


19. ఓ దేవీ ! ఆ చిత్తము హృదయమందు లీనమై, మూలాన్వేషి యగుచు, మాటిమాటికి స్ఫురించుచు, గ్రంధులను కబళించి, క్రిందకు వచ్చును. అట్టి యోగుల హృదయమందు నీ వొక్కతెవే ప్రకాశింతువు.


20. ఓ తల్లీ ! శిరస్సునందు చంద్రుడు, హృదయమందు భానుడు, నేత్రమందు విద్యుత్తు, కుండలినియం దగ్ని - ఇట్లు నీ తేజస్సు యొక్క అంశలతో గూడి యున్నవి.

21. మన్వానాం త్వాం శిరసిస్థానే
    పశ్యంతీంవా నయన స్థానే |
    చేతంతీంవా హృదయస్థానే
    రాజంతీంవా జ్వలనస్థానే ||

22. యోనా ధ్యాయే జ్జగతాం మాతః
    కశ్చిచ్ఛ్రేయానవనౌ నా౽తః |
    పూతం వంద్యం చరణం తస్య
    శ్రేష్ఠం వర్ణ్యం చరితం తస్య ||

23. దోగ్ధ్రీం మాయాం రసనాంవా యో
    మంత్రం మాత ర్జపతి ప్రాజ్ఞః |
    సో౽యం పాత్రం కరుణాయా స్తే
    సర్వంకామ్యం లభతే హస్తే ||

24. ఛిన్నాంభిన్నాం సుతరాంసన్నా
    మన్నాభావాదభితః ఖిన్నాం |
    ఏతాంపాతుం భరతక్షోణీం
    జాయేజిష్ణోః కురుమాం శక్తః ||

25. క్లుప్తై స్సమ్యగ్బృహతీ ఛంద స్యే
    తై ర్శాత్రాసమకై ర్వృత్తైః |
    కర్ణా ధ్వానం ప్రవిశద్భి స్సా
    పౌలోమ్యంబా పరితృప్తాస్తు ||

           ________


చతుర్థం బార్హతం శతకమ్ సంపూర్ణమ్.


21. శీర్ష స్థానమందు నిన్నా లోచనరూపముగాను, నేత్రస్థానమందు చూపుగాను, హృదయస్థానమందు చైతన్యముగాను, కుండలినీ స్థానమందు దీప్తనుగాను, (ముందఱి శ్లోకములో నన్వయము)


22. ఓ తల్లీ ! ఎవడీలోకములో నిన్నట్లు ధ్యానించునో, వానికంటె శ్రీమంతు డింకొకడుండడు. వాని చరణము పవిత్రమై కొలువ దగినదగును. వాని చరిత్ర శ్రేష్ఠమై, వర్ణింపదగినదగును.


23. ఓ దేవీ ! మాయాబీజముగాని, దోగ్ధ్రీబీజముగాని, రసనా బీజముగాని యేప్రాజ్ఞుడు మంత్రముతో జపించునో, వాడు నీ కరుణకు పాత్రుడగును. వానికి సర్వ కార్యములు హస్తగత మగును.

మాయాబీజము = హ్రీం

రసనాబీజము = క్రీం

దోగ్ధ్రీబీజము = హూం


24. ఓ దేవీ ! ఛిన్నభిన్నమై క్షీణించుచు, అన్నము లేక అంతటను దుఃఖించు భారతభూమిని రక్షించుటకు నాకు శక్తినిమ్ము.


25. లెస్సగా రచింపబడిన బృహతీ ఛందస్సు గల 'మాత్రా సమక' వృత్తము లింద్రాణి కర్ణ మార్గమున బ్రవేశించి, యామెకు తృప్తినిచ్చుగాక.


___________