ఇంద్రాణీ సప్తశతీ/అనుష్టుభం శతకమ్‌




ఓం

తృతీయం

అనుష్టుభం శతకమ్

1. పధ్యా వక్త్రస్తబకము


1. హసితం తన్మహాశక్తే రస్మాకం హరతు భ్రమం |
   యత ఏవ మహచ్చిత్రం విశ్వ మేత ద్విజృంభ తే ||

2. రాజంతీ సర్వభూ తేషు సర్వావస్థాసు సర్వదా |
   మాతాసర్గస్య చిత్పాయాత్ పౌలోమీ భారతక్షి తిం ||

3. ధర్మైజ్ఞానం విభోస్తత్వం ధర్మోజ్ఞానం సవిత్రి తే |
   వ్యవహృత్యై విభాగో౽యం వస్త్వేకం తత్త్వతో యువాం ||

4. ఇంద్రేశ వాసుదేవాద్యైః పదైస్సంకీర్త్య తే విభుః |
   శచీ శివా మహాలక్ష్మీ ప్రముఖై ర్భవతీ పదైః ||

5. అంతరం వస్తునోజ్ఞాతృ తచ్ఛక్తం పరిచక్ష తే |
   శాఖా స్సమంతతో జ్ఞానం శక్తిం సంకీర్తయంతి తాం ||


1. మహాశక్తియొక్క మందహాసము మా భ్రమను హరించుగాక. ఏ మందహాసమువలన గొప్పదైన, చిత్రమైన యీ విశ్వము ప్రకాశించుచున్నదో (ఆ మందహాసమని భావము).


2. సర్వభూతములందు, సర్వావస్థలందు, సర్వ కాలమందు రాజిల్లు నది, ప్రపంచమునకు జనని, చిత్స్వరూపిణియగు ఇంద్రాణి భారత భూమిని రక్షించుగాక.


3. ఓ తల్లీ ! ధర్మీ భూతమైన ప్రజ్ఞానము ప్రభువుయొక్క తత్వ మనియు, దాని ధర్మమనెడి జ్ఞానము నీ యొక్క తత్వమనియు చేయబడు విభాగము వ్యవహారమునకు మాత్ర మొప్పును. తత్వ రీత్యా మీరుభయులు నొకే వస్తువు.


4. ఆ ప్రభువు ఇంద్రుడు, ఈశ్వరుడు, వాసు దేవుడు మొదలుగాగల పదములచే కీర్తింపబడుచుండెను. నీవు శచీ, శివా, మహాలక్ష్మి మొదలగు పదములచే కీర్తింపబడు చుంటివి.


5. వస్తువుయొక్క ఆంతర్యము జ్ఞాత, వానిని 'శక్తు'డనియు; వ్యాప్తమైన శాఖలు జ్ఞానము, దానిని 'శక్తి' యనియు కీర్తింతురు. (ఉభయుల స్వరూపము జ్ఞానమే యైనను, ప్రవృత్తిచే సర్వ వ్యాప్తము నెఱుగు జ్ఞానము శక్తిసంబంధమనియు, నివృత్తిచే కేంద్రము నెఱుగునది శక్తసంబంధమనియు కీర్తింతురు. క్రియా జ్ఞానమొకటి, కర్తృజ్ఞాన మింకొకటి. మహిమయొక్క వ్యాప్తము వలన జ్ఞాన మిట్లు విభాగమయ్యెను.)

6. అంతరస్యచ శాఖానా మైక్యం నిర్విషయస్థితౌ |
   విషయ గ్రహణేష్వేవ స విభాగః ప్రదృశ్యతే ||

7. స్యా దేవం విషయాపేక్షీ శాఖానామంతరస్యచ |
   అవిభక్తైక రూపాణాం విభాగో హరితామివ ||

8. లక్ష్యమంతర్వయం చక్రే ధ్యాయామో యత్ర నిష్ఠి తాః |
   అంతరీభావత స్తస్య నాంతరంతు విలక్షణం ||

9. అహంకృతే ర్వయం నాన్యే యత్రాహంకృతి సంభవః |
   సంపద్యేతాంతరం తత్ర జ్ఞానస్య జ్ఞాతృ తావహం ||


6. ఆంతర్యమునకు, శాఖలకు నైక్యము నిర్విషయస్థితిలోనే కలదు. విషయములను గ్రహించునప్పుడు మాత్రము వాని విభాగము గోచరించుచున్నది.

(చిత్తవృత్తి యను విషయము జనించినప్పుడు వృత్తిజ్ఞానము, విషయిగా 'నే' నను పుట్టు జ్ఞానము నొకదానివెనుక నింకొకటిగా కలుగును.)


7. శాఖలకును, ఆంతర్యమునకును విభాగము విషయముల నపేక్షించియుండును (విషయజ్ఞానమని, విషయిజ్ఞానమని విభాగము). విభజింపనలవిగాని యేకరూపమును (ఆంతర్యమును) విభజించుట దిక్కులను విభజించినట్లుండును.

(విషయస్ఫూర్తి లేనప్పుడు విషయిస్ఫూర్తియునుండక మిగులునది యవిభాజ్యమని తాత్పర్యము.)


8. ఏ చక్రమందు నిష్ఠ గలిగి (మూలాధారము) మేమంతర్లక్ష్యమును ధ్యానించుచుంటిమో, దానియొక్క అంతరీభావము వలన నాంతర్యమందు విలక్షణమగుటలేదు.

(విషయత్వదశ మొదట మూలాధారమందగును. స్థూల శరీర సంపర్కముచే)


9. ఎచ్చట 'అహంకృతి' పుట్టుచున్నదో, అచ్చట అహంకృతివలన మేము పుట్టుచున్నాము. అన్యులము కాదు. జ్ఞానమునకు జ్ఞాతృత్వ మొందించు నాంతర్య మచ్చటనే సంభవించుచున్నది.

(అహంకృతి యనగా శరీరము తానను భావము. ఇది పుట్టు చోటనే 'అహం' మూలమునెఱుగు వారి కాంతర్యముగూడ తెలియబడుచున్నది.)

10. అంతరావర్త భూయస్త్వా దేకస్మిన్ బోధసాగరే |
    బోద్ధారో బహహో౽భూవ న్వస్తు నైవతు భిద్య తే ||

11. చిద్రూపే మాతరేవం త్వం పరస్మాద్బ్రహ్మణో యథా |
    నదేవి దేవతాత్మభ్యో జీవాత్మభ్యశ్చ భిద్య తే ||

12. సమస్త భూతబీజానాం గూఢానామంతరాత్మని |
    తవోద్గారో౽య మాకాశో మాతస్సూక్ష్మరజోమయః ||

13. న సర్వభూత బీజాని వస్తూని స్యుః పృథక్ పృథక్ |
    త్వయి ప్రాగవిభక్తాని బభూవురితి విశ్రుతిః ||

14. యథాంబ స్మృతి బీజానాం ప్రజ్ఞాయా మవి శేషతః |
    తథాస్యా ద్భూతబీజానా మవిభక్త స్థితి స్త్వయి ||


10. ఒక్క టైన జ్ఞానసముద్రమం దాంతర్యముల నెడి సుడులయొక్క బాహుళ్యముచే పెక్కుమంది జ్ఞానులు పుట్టుచున్నారు. వస్తువు మాత్రము భిన్నము కాలేదు.

(సుడియం దాకారభావముచే వస్తువు వేఱైనట్లుండును. త్రిపుటియు సంభవించును. నిజమునకు సుడియందు సముద్రము కంటె వేఱు వస్తువు లేదు)


11. ఓ దేవీ ! ఈ విధముగా నీవు పరబ్రహ్మవలెనే దేవతాత్మల కంటె, జీవాత్మలకంటె భిన్నము గావని తెలియుచున్నది.


12. ఓ తల్లీ ! గూఢములైన సకల భూత బీజములయొక్క అంతరాత్మలందు సూక్ష్మరజోమయమైన ఈ యాకాశము నీ వల్లనే పుట్టెను.

(బీజరూపములు కూడ వాసనాస్మృతులవలె సూక్ష్మములైనను, ఆకారములుగలవి; వాని కాంతర్యమున నున్న యాకాశము రజస్సుచే వ్యక్తస్థితి బొందినను నిరాకారము)


13. భూతబీజవస్తువులు వేఱ్వేఱుగాలేవు. వస్తుసృష్టికి పూర్వమవి నీయందవిభక్తముగా నున్నవని శ్రుతి వచించుచున్నది.

(బీజస్మృతి రూపములు తొలగినప్పుడు బీజవస్తు వేకమై, దేవి కవిభక్త మగును.)


14. ఓ యంబా ! ఏ విధముగా స్మృతి బీజములస్థితి ప్రజ్ఞానమందు విశేషము జెందుటలేదో, ఆ విధముగా భూత బీజములస్థితి నీ యందవిభక్తమై యుండును.

(మనయందున్న వ్యష్టిస్మృతులకు, సమిష్టియందు గోళాదుల సూక్ష్మస్మృతులకు నిద్రస్థితియందు పోలిక. వ్యక్తముగాని

15. నాణూని భూతబీజాని ప్రా క్సర్గా త్త్వయి సంస్థితౌ |
    చితిశక్త్యాత్మకాన్యేవ నిరాకారిణి సర్వదా ||

16. అనాది చేదిదం విశ్వం స్మరణాత్తవ సర్జనం |
    సాదిచే దాదిమ స్సర్గో వక్తవ్యస్తవ కల్పనాత్ ||

17. విధాతుం శక్ను యా త్సంవి దభూతస్యాపి కల్పనమ్ |
    కల్పితస్యైకదా భూయ స్సర్జనావసరే స్మృతిః ||


స్థితియందు స్మృతులు మన ప్రజ్ఞానమందు లీనమై, భేదము జెందకయున్న స్థితి యిది.)


15. అణువులక్రింద విభజింపబడని భూతబీజములు సృష్టికిపూర్వము నీ యందు చిచ్ఛక్తి రూపముతోనుండి యన్ని విధముల నిరాకారమైయున్నవి.

(అనగా బీజద్రవ్యము వాసనలుగా నేర్పడక పూర్వము శక్తి స్వరూపమై యుండెనని భావము.)


16. ఓ దేవీ ! ఈ విశ్వమనాది యనినచో, నీ స్మృతి వలన సృష్టి కలిగి యుండవలెను. విశ్వమున కాదిగలదనిచో, ప్రథమసృష్టి నీ కల్పనవల్లనే వ్యక్తమై యుండవలెను.

(అనాదియను వారు విశ్వస్మృతులు వ్యక్తావ్యక్తస్థితులుగామారి సృష్టిస్థితి లయములకు కారణమగుచు నిరంతరమిట్లే యవస్థా భేదముచే నున్న వందురు. అవి యెప్పుడు రూపములుగా మొట్ట మొదట కల్పింపబడునో చెప్పశక్యముగాదనియు, వాటియొక్క స్మృతి దేవి కై నపుడెల్ల క్రొత్తగా వచ్చినట్లు పాతవిశ్వమే పునర్వ్యక్తమగునననియు చెప్పుదురు.)


17. పుట్టుకను కల్పించుశక్తిగలిగి సంవిత్తున్నది. కల్పితమైన దానిని తిరుగసృష్టింప నవసరమైనప్పుడు శక్తి స్మృతిరూపిణి యగును.

(ఒకటి క్రొత్తసృష్టి చేయగలదు, ఇంకొకటి పాత విశ్వవాసనలను ధరించి వ్యక్తపరచుచుండును. మొదటిదైన సంవిత్తు కేవలశక్తి, రెండవది విశ్వసంబంధమగు విద్యుత్తు.)

18. చితే రస్మా దృశాం వీర్యం స్వప్నేచే ద్విశ్వకారణం |
    చితే స్సమష్టి భూతాయాః ప్రభావే సంశయః కుతః ||

19. మాత స్సమష్టి చిద్రూపే విభూతిర్భువనం తవ |
    ఇహ వ్యష్టి శరీరేషు భాంతీ తదను పశ్యసి ||

20. త్వం బ్రహ్మ త్వం పరాశక్తి స్త్వం సర్వా అపి దేవతాః |
    త్వం జీవా స్త్వం జగత్సర్వం త్వదన్యన్నాస్తి కించన ||

21. సతీచిదంబ నైవ త్వం భావ భావ విలక్షణా |
    శక్తి శక్తి మతో ర్భేద దర్శనాదేష విభ్రమః ||

22. తవాంబ జగతశ్చాస్య మృత్తికా ఘటయోరివ |
    సంబంధో వేదితవ్యస్స్యా న్న రజ్జుఫణినో రివ ||


18. మావంటివారల చిత్తుయొక్కబలమే స్వప్నమందు విశ్వ నిర్మాణమునకు కారణము కాగలిగినప్పుడు (క్రొత్తరూపములను నిర్మించ గలిగినప్పుడు), సమష్టి భూతముగానున్న చిత్తుయొక్క ప్రభావమును గుఱించి సంశయమేల ?

(ప్రతిజన్మయందు మనమొనర్పగల్గునది ప్రారబ్ధవశమువల్లనే యను మాటకూడ దీనివలన ఖండింపబడినట్లగును.)


19. ఓ తల్లీ ! అందువలన భువనము నీ విభూతియే (కల్పనమే). ఇచ్చట వ్యష్టి శరీరములందు నీవు ప్రకాశించుచు, దానిని (భువనమును) అనుసరించి చూచుచుంటివి.

(సమష్టి విశ్వము సంవిత్కల్పనము ; వ్యష్టిశరీరమందు ప్రత్యేక స్మృతియున్నను, సంవిత్తున్నది. అది సమష్టియందువలెనే కల్పించగలదని భావము.)


20. ఓ దేవీ ! నీవే బ్రహ్మవు, నీవే పరాశక్తివి, నీవే సర్వ దేవతా స్వరూపిణివి. జీవుల స్వరూపము నీవే, సర్వజగత్తు నీవే. నీకంటె భిన్నముగా నేదియులేదు.


21. ఓ యంబా ! చిద్రూపిణివైన నీవు భావభావమందు భిన్నముగా లేవు. శక్తి, శక్తిమంతుడు అను భేదదృష్టివలన ఈ భ్రమ గలుగుచున్నది.


22. ఓ తల్లీ ! నీకు, జగత్తుకు మృత్తికాఘట సంబంధ మూహింప దగునిగాని రజ్జు సర్ప భ్రాంతివంటి సంబంధము తగదు.

(భ్రాంతిగల మన కీ సంబంధము కొన్నింట వర్తింప జేయవచ్చును గాని దేవికి జగత్తుకు చెప్పుట దేవికి భ్రాంతిచెప్పుట యగును.)

23. త్వం శక్తిరస్య విచ్ఛిన్నా భావై రాత్మ విభూతిభి: |
    అంతరాస్తు మహేంద్రస్య శక్తస్య ప్రతిబింబవత్ ||

24. శక్తి ర్గణవతే: కాయే ప్రవహంతీ సనాతనీ |
    భారతస్య క్రియాదస్య బాధ్యమానస్య రక్షణం ||

25. ఇమాని తత్త్వవాదీని వాసిష్ఠస్య మహామునేః |
    పథ్యా వక్త్రాణి సేవంతా మనంతా మభవాం చితిం ||
                  _______


2. మాణవకస్తబకము

1. శక్తతమా శక్రవధూ హాసవిభా మే హరతు |
   మానస మార్గావరకం జేతు మశక్యం తిమిరం ||

2. భారత భూ పద్మదృశో దుర్దశయా క్షీణతనోః |
   బాష్ప మజస్రం విగళ ద్వాసవ భామా హరతు ||

3. దండిత రక్షో జనతా పండిత గీతా వనితా |
   మండిత మాహేంద్రగృహా ఖండిత పాపా జయతి ||

4. సద్గుణ సమ్పత్కలితం సర్వశరీరే లలితం |
   దేవపతేః పుణ్యఫలం పుష్యతు మే బుద్ధిబలం ||


23. ఓ తల్లీ ! నీ యాత్మవిభూతులే యగు మనోభావములతో నీవు కూడి శక్తివై యుంటివి. శక్తుడైన మహేంద్రున కీ విభూతులు ప్రతిబింబములవలె అంతరమున నున్నవి.


24. గణపతిముని శరీరమందు బ్రవహించు సనాతనమైన శక్తి బాధపడుచున్న భారతభూమిని రక్షించుగాక.


25. వాసిష్ఠమునియొక్క తత్త్వవాదములగు నీ 'పథ్యా వక్త్ర' వృత్తము లనంతమైనట్టి, పుట్టుకలేనట్టి చిత్తును సేవించుగాక.

_________

1. అత్యంత సామార్ధ్యముగల ఇంద్రాణీ మందహాసకాంతి నామనః పథము నావరించి జయింపనలవిగాక యున్న అజ్ఞానాంధకారమును హరించుగాక.


2. దుర్దశచే క్షీణించిన శరీరముగల భరతభూమి యను కాంత యొక్క యేకధారగాస్రవించు కన్నీటి నింద్రాణి హరించుగాక.


3. రాక్షస సమూహమును దండించునది, పండితులచే కీర్తింప బడునది, యింద్రుని గృహమున కలంకారమైనది, పాపములను ఖండించునదియైన వనిత ప్రకాశించుచున్నది.


4. సద్గుణసంపత్తికలది, సర్వశరీరమునందు సుందరమైనది, ఇంద్రుని పుణ్యఫలమగునదియైన దేవి నా బుద్ధిబలమును వృద్ధి జేయుగాక.

 5. హాస విశేషైరలసై ర్దిక్షు కిరం త్యచ్ఛ సుధాం |
    ఇంద్ర దృగానందకరీ చంద్రముఖీ మామవతు ||

 6. ప్రేమతరంగ ప్రతిమై శ్శీతల దృష్టిప్రకరైః |
    శక్రమనో మోహకరీ వక్రకచా మామవతు ||

 7. గాఢరసై శ్చారుపదై ర్గూఢతరార్థై ర్వచనైః |
    కామకరీ వృత్రజితో హేమతను ర్మామనతు ||

 8. మృత్యుతనుః కాలతనో ర్విశ్వపతేః పార్శ్వ చరీ |
    ప్రేత జగద్రక్షతి యా సా తరుణీ మామవతు ||

 9. ప్రేత జగత్కేచి దధో లోక మపుణ్యం బ్రువతే |
    శీత రుచేర్నాన్యదిదం తత్త్వవిదన్యో వదతి ||

10. భూరియ ముర్వీవసుధా వారిజవై ర్యేష భువః |
    స్వర్మహసాం రాశి రసౌ యేషు నరప్రేత సురాః ||


5. మందమైన నగవుయొక్క విశేషముచే దిక్కులందు నిర్మల సుధను జిమ్మునది, యింద్రుని నేత్రముల కానంద మిచ్చునది యైన చంద్రముఖి నన్ను రక్షించుగాక.


6. ప్రేమ తరంగములతో సమమగు శీతలదృష్టులచే నింద్రుని మనస్సును మోహింపజేయునది, వక్రమైన కొప్పు గలదియైన దేవి నన్ను రక్షించుగాక.


7. గాఢరసము, మనోహరపదములు, గూఢతరమైన అర్థములుగల వాక్కులచే దేవేంద్రునకు కామము గలిగించు హేమతనుదేవి నన్ను రక్షించుగాక.


8. కాలమే శరీరముగాగల ఇంద్రునకు పార్శ్వవర్తినియై, మృత్యు రూపిణియై యే దేవి ప్రేతలోకమును రక్షించుచున్నదో, ఆ స్త్రీ నన్ను రక్షించుగాక.

(కాళీరూపలక్షణము. స్థూలమును నశింపజేసి, సూక్ష్మమును గాపాడునది యని భావము)


9. కొందఱీ ప్రేతజగత్తును పాపభూయిష్ఠమగు నధోలోక మందురు. మఱియొక తత్త్వ వేత్త యిది చంద్రునికంటె వేఱుకాదను చున్నాడు.


10. ఈ భూలోకము నుర్వి, వసుధయనియు, భువర్లోకమును పద్మములకు శత్రువైన చంద్రుడనియు, తేజోరాశియైన సూర్యుని సువర్లోకమనియు, భూలోకములో నరులు, భువర్లోకములో ప్రేతలు, సువర్లోకములో సురలు వసింతురనియు చెప్పబడును.

11. రాజతశైలం శశినః కేచిదభిన్నం బ్రువతే |
    మృత్యు యమా వేవ శివా వీశ్వరి తేషాంతు మతే ||

12. రాజతశైలః పితృభూ రోషధిరాడేష యది |
    కాంచనశైల స్సురభూ ర్బంధురసౌ వారిరుహాం ||

13. పావయ భూమిం దధతః పావకకాయస్య విభోః |
    భామిని భావానుగుణే సేవక మగ్నాయి తవ ||

14. యస్య యమో భూతవతి ర్బుద్ధిమతస్తస్య మతేః |
    అగ్నిరుపేంద్రో మఘవా కాంచన గర్భో భగవాన్ ||

15. యస్య మహాకాలవధూ ర్మృత్యురపి ద్వే న విదః |
    త్వం శచిమేధా౽స్యమతే పావకశక్తిః కమలా ||

16. నామసు భేధో౽స్తు ధియా మీశ్వరి నిష్కృష్ట మిదం |
    సూర్య ధరేందు ష్వజరే త్వం త్రితను ర్భాసె పరే ||

17. సాత్త్విక శక్తి స్సవిత ర్యాదిమరామే భవసి |
    రాజస శక్తిర్భువి న స్తామస శక్తి శ్శశిని ||


11. ఓ యీశ్వరీ ! కొందఱు కైలాసము చంద్రునికంటె వేఱు కాదందురు. వారి మతములో పార్వతి మృత్యురూపిణి, శివుడు యముడు (కాలరూపుడు) అగుదురు.


12. కైలాసము పితృభూమియనియు (శ్మశానము), అదియే చంద్రుడనియు చెప్పుదురు. మేరువు దేవతల భూమియనియు, నది సూర్యుడే యనియు చెప్పుదురు.


13. భూమిని ధరించుచు, అగ్నియే శరీరముగాగల విభుని భావముల కనుగుణవైన యో స్వాహా దేవీ ! నీసేవకుని బవిత్రునిఁ జేయుము. (అగ్నాయి = అగ్ని పత్ని)


14. ఎవని మతములో భూతపతియైన యీశ్వరుడు యముడో, ఆబుద్ధిమంతుని మతములో అగ్ని యే ఉపేంద్రుడగును (విష్ణువు), హిరణ్యగర్భుడే యింద్రుడగును. (జిష్ణువు. అనగా సూర్యాధిష్ఠాన పురుషుడు)


15. ఎవని మతములో మాహాకాలుని భార్య మృత్యు వైనను ద్వివిధముగా లేదో (సంహార నిర్మాణములకు రెండు రూపములు గలదిగా లేదో), వాని మతమందో శచీ ! నీవు తెలివిగాను, నీవే యగ్ని శక్తిగాను, లక్ష్మిగాను చెప్పబడుచుంటివి.


16. ఓ జననీ ! నామభేదములుండుగాక. ఇది మాత్రము నిశ్చయము - నీవే సూర్య, భూ, చంద్రులందు మూడు శరీరములతో ప్రకాశించుట (నిశ్చయమని అన్వయము.)


17. ఓ తల్లీ ! నీవు సూర్యునియందు సాత్వికశక్తిగాను, మా భూమి యందు రాజసశక్తిగాను, చంద్రునియందు తామసశక్తిగా నుంటివి.

18. సర్వగుణా సర్వవిభా సర్వబలా సర్వరసా |
    సర్వమిదం వ్యాప్యజగ త్కాపి విభాంతి పరమా ||

19. వ్యోమతను ర్నిర్వపుషో దేవి సతస్త్త్వం దయితా |
    అస్యభియుక్తై ర్విబుధై రంబ మహేశ్వర్యుదితా ||

20. సా ఖలు మాయా పరమా కారణమీశం వదతాం |
    సా ప్రకృతి స్సాంఖ్యవిదాం సా యమినాం కుండలినీ ||

21. సా లలితా పంచదశీ ముత్తమ విద్యాం జపతాం |
    సా ఖలు చండీ జననీ సాధు నవార్ణః భజతాం ||

22. సా మమ శచ్యాః పరమం కారణరూపం భవతి |
    కార్య తను ర్దివి శక్రం సమ్మదయంతీ లసతి ||

23. వ్యోమతనో స్సర్వజగ చ్చాలన సూత్రంతు వశే |
    నిర్వహణే తస్య పున ర్దివ్య తను స్త్రీ త్రితయం ||

24. పాతుమిమం స్వం విషయం హంత చిర్నాన్ని ర్విజయం |
    కింకర మీశే విభయం మాం కురు పర్యాప్తశయం ||


18. సర్వగుణములు, సర్వ తేజస్సులు, సర్వబలములు గల్గి యీ సర్వ జగత్తును వ్యాపించి, ప్రకాశించు నొకానొక ఉత్కృష్టమైన దానవు నీవు.


19. ఓ తల్లీ ! ఆకాశ శరీరిణివైన నీవు శరీరములేని సద్వస్తువునకు భార్యవైతివి. యుక్తిగల పండితులచే నీవు మహేశ్వరివని చెప్ప బడుచుంటివి.


20. ఈశ్వరుడే కారణమని చెప్పువారి కామె పరమమైన మాయ యగుచున్నది. సాంఖ్యవాదుల కామె ప్రకృతియై, యోగులకు కుండలినీ యగుచున్నది.


21. 'పంచదశి' యను నుత్తమ విద్యను జపించువారి కామె లలిత యగుచున్నది. శ్రేష్ఠమైన నవార్ణమంత్రమును భజించువారి కామె చండి యగుచున్నది. (నవార్ణ మంత్రములో 9 అక్షరము లుండును. అర్ణము అనగా వర్ణము.)


22. ఆ చండి శచీదేవియొక్క ఉత్తమమైన కారణరూపమై నా సంతోషముకొఱకును, కార్యశరీరమై స్వర్గమం దింద్రుని సంతోషముకొఱకును ప్రకాశించుచున్నది.


23. వ్యోమమే శరీరముగాగల యీమె సర్వజగత్తులయొక్క చాలన సూత్రమును వశ మొనర్చుకొని తిరుగ (సృష్టి) నిర్వహించుటకై దివ్యతనువులుగల స్త్రీత్రయమగుచున్నది.


24. ఓ తల్లీ ! చిరకాలమునుండి జయములేని ఈ స్వకీయ దేశమును రక్షించుటకు యీ సేవకుని భయరహితునిగాను, సమర్ధునిగాను జేయుము.

25. చారుపద క్రీడనకై ర్మాతరిమై ర్మాణవకైః |
    చేతసి తే దేవనుతే ప్రీతి రమోఘా భవతు ||

                 _________

3. చిత్రపదాస్తబకము

1. అప్యలసో హరిదంత ధ్వాంత తతేరపి హర్తా |
   అస్తు మహేంద్ర పురంధ్రీ హాసలవ శ్శుభకర్తా ||

2. పాహి పరైర్హృతసారాం నేత్రగళ జ్జలధారాం |
   భారతభూమి మనాథాం దేవి విధాయ సనాథాం ||

3. చాలయతా సురరాజం పాలయతా భువనాని |
   శీలయతా సతరక్షాం కాలయతా వృజినాని ||

4. లాలయతా మునిసంఘం కీలయతా దివి భద్రం |
   పావయ మాం సకృదీశే భాసుర దృక్ప్రసరేణ ||

5. సర్వ రుచామపి శాలాం త్వాం శచి మంగళ లీలాం \
   కాలకచా ముతకాళీం పద్మముఖీ ముత పద్మాం ||

6. యస్స్మరతి ప్రతికల్యం భక్తి భరేణ పరేణ |
   తస్య సురేశ్వరి సాధో రస్మి పదాబ్జ భజిష్యః ||


25. ఓ తల్లీ ! సొగసైన పదక్రీడనగల యీ 'మాణవక' వృత్తములచే నీ హృదయమం దమోఘప్రీతి గలుగుగాక.

___________

1. మందమైనను, దిక్కుల మూలమూలలనుండు చీకట్లను నశింప జేయు ఇంద్రాణీహాసలవము నాకు శుభ మొనర్చుగాక.


2. ఓ దేవీ ! శత్రువులచే సారము హరింపబడి, నేత్రములనుండి నీటిధారలను స్రవించు భారతభూమియను ననాధను సనాథగా జేసి రక్షింపుము.


3. దేవేంద్రుని చలింప జేయునది, భువనములను పాలించునది, నమ్రులను రక్షించు శీలముగలది, పాపములను ధంస మొనర్చునది,


4. మునులను లాలించునది, స్వర్గమందు మంగళములను నెలకొల్పునదియునైన నీ దృక్ప్రసారముచే నొక్కసారి నన్ను (చూచి) యీశ్వరీ ! పవిత్రము గావింపుము.


5. ఓ శచీ ! సకలకాంతులకు నిలయమై, మంగళప్రదమగు లీలలు గలదానవై, నల్లని కొప్పుగలిగి 'కాళీ' యనియు, పద్మమువంటి ముఖముగలిగి లక్ష్మియనియు చెప్పబడునిన్ను

(తరువాత శ్లోకము చూడుడు)


6. ఓ దేవీ ! యెవడు ప్రతిదినము నుదయమందతి భక్తితో స్మరించునో, సాధువైన అతని పాదపద్మములకు నేను సేవ చేయుదును.

 7. యస్తవనామ పవిత్రం కీర్తయతే సుకృతీ నా |
    వాసవ సుందరి దాస స్తచ్చరణస్య సదా౽హం ||

 8. యస్తవ మంత్ర ముదార ప్రాభవ మాగమ సారం |
    పావని కూర్చముపాస్తే తస్య నమశ్చరణాయ ||

 9. పావక సాగర కోణం యస్తవ పావన యంత్రం |
    పూజయతి ప్రతి ఘస్రం దేవి భజామి తదంఘ్రిం ||

10. శాంత ధియేతరచింతా సంతతి మంబ విధూయ |
    చింతయతాం తవపాదా వస్మిసతా మను యాయీ ||

11. శోధయతాం నిజతత్వం సాధయతాం మహిమానం |
    భావయతాం చరణంతే దేవి పదానుచరో౽హం ||

12. యో౽నుభవే న్నిజదేహే త్వామజరే ప్రవహంతీం |
    సంతత చింతన యోగా త్తస్య నమామి పదాబ్జం ||

13. బోధయతే భవతీం యః ప్రాణగతా గతదర్శీ |
    కుండలినీ కులకుండా త్తంత్రి దివేశ్వరి వందే ||


7. ఓ తల్లీ ! పవిత్రమైన నీ నామమును సుకృతియైన యేమనుజుడు కీర్తనచేయునో వాని చరణములకు నే నెల్లప్పుడును దాసుడను.


8. ఓ పావనీ ! గొప్ప ప్రభావముగల ఆగమసారమైన నీ మంత్ర మనెడి కూర్చ నెవడుపాసించునో, వాని చరణములకు నేను నమస్కరింతును.


9. ఓ దేవీ ! అగ్ని, సముద్రములు కోణములుగా గల్గిన నీ పావన యంత్రము నెవడు ప్రతిదినము పూజించునో, వాని పాదములను నేను భజింతును.


10. ఓ యంబా ! శాంతబుద్ధిచే నితర సంకల్పసమూహమును నశింపజేసి నీ పాదములనే చింతించు సత్పురుషులను నే ననుసరింతును.


11. ఓ దేవీ ! నిజతత్త్వమును శోధించువారియొక్క, మహిమను సాధించువారియొక్క, నీ పాదములను ధ్యానించువారియొక్క పాదములయొద్ద నేను చరింతును.


12. ఓ దేవీ ! ఎవడు తన దేహమందు ప్రవహించు నిన్ను సంతత చింతనయోగముచే ననుభవించునో, వాని పాదములను నేను సేవింతును.


13. ఓ యీశ్వరీ ! ప్రాణముయొక్క యాతాయాతముల నెవడు చూచుచు కుండలినీ కులకుండమునుండి నిన్ను మేలుకొలుపునో వానికి నా వందనములు.

14. లోచనమండల సౌధాం లోకన మూల విచారీ |
    విందతి యః పరమే త్వాం వందన మస్య కరోమి ||

15. మానిని జంభజితస్త్వాం మానసమూల వితర్కీ |
    వేద హృదంబురుహే యః పాదమముష్య నమామి ||

16. అంతరనాద విమర్శీ వశ్యతి యస్సు కృతీ తే |
    వైభవ మంబ విశుద్ధే తేన వయం పరవంతః ||

17. ఇంద్రపద స్థిత చిత్త శ్శీర్ష సుధారస మత్తః |
    యో భజతే జనని త్వాం తచ్చరణం ప్రణమామి ||

18. రాస నవారిణి లగ్నః సమ్మద వీచిషు మగ్నః |
    ధ్యాయతి యః పరమే త్వాం తస్యపదం మమ వంద్యం ||

19. త్వాం సదహంకృతి రూపాం యోగినుతే హతపాపాం |
    ధారయతే హృదయే య స్తస్య సదా౽స్మి విధేయః ||

20. ధూత సమస్త వికల్పో యస్తవ పావన లీలాం |
    శోధయతి స్వగుహాయాం తస్యభవా మ్యనుజీవీ ||

21. యోభజతే నిజదృష్టిం రూప పరిగ్రహణేషు |
    కామపి దేవి కళాం తే తస్యపదే నివతేయం ||


14. ఓ తల్లీ ! దృష్టిమూలమును విచారించు నెవడు నిన్ను నేత్ర మండలమే నివాసముగలదానివిగా తెలిసికొనునో, వానికి నేను నమస్కరింతును.


15. ఓ తల్లీ ! మనస్సు మూలమును వితర్కించు నెవడు నిన్ను హృదయ కమలమందున్నట్లు తెలియునో, వాని పాదములకు నేను నమస్కరింతును.


16. ఓ తల్లీ ! అంతర నాదమును విమర్శించు పుణ్యాత్ముడైన యెవడు నీ వైభవము జూచుచుండునో, వానికి మేము పరాధీనులము.


17. ఓ తల్లీ ! ఇంద్ర పాదమందే చిత్తముంచి, శీర్ష సుధారసమందు మత్తుడైన యెవడు నిన్ను భజించునో, వాని చరణములకు నమస్కరింతును.


18. ఓ తల్లీ ! నాలుకయందుండు లాలాజలమందు లగ్నుడై, సంతోష తరంగములందెవడు మగ్నుడై నిన్ను ధ్యానించునో, వాని పాదములకు నమస్కారము.


19. ఓ తల్లీ ! సదహంకారమే రూపముగా గల్గి పాపములేని నిన్నెవడు హృదయమందు ధరించునో, వానికి నే నెల్లప్పుడు విధేయుడను.


20. సందేహ నివృత్తియైన యెవడు నీ పావన చరిత్రములను నిజ గుహయందు (హృద్గుహ) శోధించునో, వానికి నే ననుచరుడను.


21. ఓ తల్లీ ! ఎవడు రూపమును గ్రహించునప్పుడు తన దృష్టియందున్న నీ యనిర్వాచ్య కళను భజించునో, వాని, పాదములను నేను సేవింతును.

22. కర్మణి కర్మణి చేష్టా మంబ తవైవ విభూతిం |
    యశ్శిత బుద్ధి రుపాస్తే తత్పద మేష ఉపాస్తే ||

23. వస్తుని వస్తుని సత్తాం యోభవతీం సముపాస్తే |
    మాత రముష్య వహేయం పాదయుగం శిరసా౽హం ||

24. పాతు మిమం నిజదేశం సర్వ దిశాసు సపాశం |
    అంబ విధాయ సమర్థం మాం కురు దేవి కృతార్థం ||

25. చిత్ర పదాభిరిమాభి శ్చిత్ర విచిత్రా చరిత్రా |
    సమ్మద మేతు మఘో నః ప్రాణ సఖీ మృగనేత్రా ||

                     _________

4. నారాచికాస్తబకము


1. అంతర్విధున్వతా తమః ప్రాణస్య తన్వతా బలం |
   మందస్మి తేన దేవతారాజ్ఞీ తనోతు మే శివం ||

2. ఉత్థాప్య పుణ్య సంచయం సంమర్ద్య పాప సంహతిం |
   సా భారతస్య సంపదే భూయా ద్బలారి భామినీ ||

3. లీలాసఖీ బిడౌజస స్స్వర్వాటికా సుఖేలనే |
   పీయూష భానుజిన్ముఖీ దేవీ శచీ విరాజతే ||

4. పక్షః పరో మరుత్వతో రక్షః ప్రవీర మర్దనే |
   భామాలి భాసురాననా దేవీ శచీ విరాజతే ||


22. ఓ తల్లీ ! తీక్ష్ణబుద్ధిగల యెవడు ప్రతికర్మయందుండు వ్యాపారమును నీ విభూతిగా నుపాసించునో, వాని పాదములను నేనుపాసింతును.


23. ఓ తల్లీ ! ఎవడు ప్రతి వస్తువునందుగల సత్ నీవేయని యుపాసించునో, వాని పాదయుగమును నేను శిరస్సున బెట్టుకొందును.


24. ఓ తల్లీ ! సర్వదిక్కులందు పాశబద్ధమై యున్న నా దేశమును రక్షించుటకు నన్ను సమర్థునిగా జేసి కృతార్థుని జేయుమా.


25. చిత్రవిచిత్ర చరితముగలిగి, లేడి నేత్రములను గలిగిన యింద్రాణి యీ 'చిత్రపదా' వృత్తములవలన సంతోషించుగాక.

__________


1. ఆంతర్యతమస్సులను నశింపజేయునది, ప్రాణమునకు బలమిచ్చునది యగు మందస్మితముచే ఇంద్రాణి నాకు మంగళముల నొడ గూర్చుగాక.


2. ఆ యింద్రాణి పుణ్యసంచయము నుద్దీపవ మొనర్చి, పాపములను ధ్వంస మొనర్చి, భారతభూమికి సంపద నిచ్చుగాక.


3. స్వర్గవాటికలందు గ్రీడించుటలో దేవేంద్రునకు లీలాసఖియు, చంద్రునిజయించు ముఖముగలదియు నగు శచీదేవి విరాజిల్లు చున్నది.


4. రాక్షసవీరులను మర్దించుటలో నింద్రునకు సహాయభూతు రాలు, సూర్యునివలె ప్రకాశించు ముఖముగలది యైన శచీదేవి విరాజిల్లు చున్నది. ("భామాలి" అంశుమాలివంటిది. సూర్యు

5. భీతిం నిశాట సంహతేః ప్రీతిం సువర్వణాం తతేః |
   జ్యాటంకృతై ర్వితన్వతీ దేవీ శచీ విరాజతే ||

6. దేవేంద్ర శక్తి ధారిణీ శత్రు ప్రసక్తి వారిణీ |
   మౌనీంద్ర ముక్తికారిణీ దేవీ శచీ గతిర్మమ ||

7. సన్న స్వదేశ దర్శనా ద్భిన్న స్వజాతి వీక్షణాత్ |
   ఖిన్నస్య సంశ్రితావనీ దేవీ శచీ గతిర్మమ ||

8. సంఘే సహస్రధా కృతే దేశే నికృష్టతాం గతే |
   శోకా కులస్య లోకభృ ద్దేవీ శచీ గతిర్మమ ||

9. సా సంవిదో౽ధి దేవతా తస్యాస్స్వరః పరోవశే |
   సర్వం విధీయతే తయా తస్మా త్పరామతా శచీ |

10. సాయతి సూక్ష్మమప్యలం సాభాతి సర్వవస్తుషు |
    సా మాతి ఖంచ నిస్తులం తస్మా త్పరామతా శచీ ||


డనుటయే యుక్తము. పైశ్లోకమున భర్తతో విహరించునపుడు చంద్రముఖియునియు, నిందులో శత్రువులతో యుద్ధము చేయునపుడు సూర్యునివలె జ్వలించు ముఖముకలది యనియు జమత్కరించెను. "రాకేందు బింబమై రవిబింబమై" అను పోతనగారిపద్యము స్మరింపఁదగును.)


5. నారిటంకారములచే రక్కసులకు భీతి గలిగించుచు దేవతలకు ప్రీతినిచ్చు శచీదేవి విరాజిల్లుచున్నది.


6. దేవేంద్రునిశక్తిని ధరించునది, శత్రువుల ఆడంబరమును నివారించునది, మునులకు ముక్తినిచ్చునది యగు శచీదేవి నాకుశరణము.


7. కృశించిన స్వదేశమును దర్శించుటవలన, భిన్నమైన స్వజాతిని వీక్షించుటవలన ఖిన్నుడనై యున్న నాకు సంశ్రితులను రక్షించు శచీదేవి గతి యగుగాక.


8. సంఘము వెయ్యి విధములుకాగా, దేశము హీనస్థితినిబొంది యుండగా శోకమందు మునిగియున్న నాకు లోకములను కాపాడు శచీదేవి గతి యగుగాక.


9. ఆమె జ్ఞానమున కధిదేవత. పరమైన స్వరమామెకు వశమై, ఆమెచేతనే సర్వము విధింపబడుచున్నది గనుక శచి పరాదేవిగా వచింపబడుచున్నది.


10. ఆమె యత్యంత సూక్ష్మరూపిణియైనను సర్వవస్తువులందు బ్రకాశించుచున్నది. ఆమె నిరూపమానమైన ఆకాశమును కొలత చేయుచున్నది. కనుకనే పరా దేవియని శచి వచింపబడుచున్నది.

11. సా సర్వలోక నాయికా సా సర్వగోళ పాలికా |
    సా సర్వదేహ చాలికా తస్మా త్పరామతా శచీ ||

12. యస్యాః కృతిర్జగత్త్రయం యా తద్బిభర్తి లీలయా |
    యస్యాం ప్రయాతి తల్లయం సా విశ్వనాయికా శచీ ||

13. ధర్మే పరీక్షయం గతే యా౽విశ్వ నిర్మలం జనం |
    తద్రక్షణాయ జాయతే సా విశ్వనాయికా శచీ ||

14. వేధా ఋతస్యయోదితా మంత్రేణ సత్యవాదినా |
    బాధా నివారిణీ సతాం సా విశ్వనాయికా శచీ ||

15. యజ్ఞో యయా వినీయతే యుద్ధం తథా పృథగ్విధం |
    తాం దేవరాజ మోహినీం నారీం నుమః పురాతనీం ||

16. యస్యాస్సుతో వృషాకపి ర్దేవో సతాం ప్రశాసితా |
    తాం సర్వదా సువాసినీం నారీం సుమః పురాతనీం ||


11. ఆమె సర్వలోకనాయిక, సర్వగోళములను పాలించునది, సర్వ దేహములను చలింప జేయునదికనుక శచిపరాదేవియగుచున్నది.


12. ముల్లోకము లే దేవియొక్క కల్పనమో, యెవరి లీలవలన నవి భరింపబడుచున్నవో, తిరుగ నవి యెవరియందు లయమగు చున్నవో, విశ్వనాయికయైన ఆ శచి ప్రకాశించుగాక.


13. ధర్మము నశించుచుండగా నే దేవత విశ్వమందున్న సాధుజనులను రక్షించుటకై పుట్టుచున్నదో, ఆ విశ్వనాయికయైన శచి ప్రకాశించుగాక.


14. సత్యమునుబల్కు మంత్రముచే ఋతుమున కే దేవి (ఋతుము = మానసిక సత్యము) సృష్టి కర్త్రియని కీర్తింపబడుచున్నదో (మంత్రము మనస్సంబంధము. మంత్రమువలన ప్రతిపాదింపబడు ఋతము అనిర్వచనీయ సత్యమును నిరూపించును. అట్టి ప్రతిరూపమును సృష్టించినది), సత్పురుషుల బాధలను నివారించు విశ్వనాయికయై ఆ శచి ప్రకాశించుగాక.


15. దేవివలన యజ్ఞము లెట్లు నివర్తింప బడుచున్నవో, అట్లే యామెచే నింకొక విధముగా యుద్ధములుగూడ చేయబడు చున్నవి. ఇంద్రుని మోహింపజేయు పురాతనమైన ఆ స్త్రీకి మేము నమస్కరింతుము.


16. దేవుడైన వృషాకపి యే దేవతకు పుత్రుడై, సత్పురుషులకు రక్షకుడగుచుండెనో, సర్వకాల సువాసినియు, పురాతనియునైన ఆ స్త్రీకి మేము నమస్కరింతుము.

17. యస్యాస్సమా నితంబినీ కాచిన్న విష్టపత్రయే |
    తాం నిత్యచారు యౌవనాం నారీం సుమః పురాతనీం ||

18. యచ్చారుతా నదృశ్య తే మందార పల్ల వేష్వపి |
    తత్సుందరాచ్చ సుందరం శచ్యాః పదాంబుజంశ్రయే ||

19. యస్యప్రభా నవిద్యతే మాణిక్య తల్లజేష్వపి |
    తద్భాసురాచ్చ భాసురం శచ్యాః పదాంబుజంశ్రయే ||

20. నస్యాదఘై స్తిరస్కృతో యచ్చింతకో నరః కృతీ |
    తత్పావనాచ్చ పావనం శచ్యాః పదాంబుజంశ్రయే ||

21. రాజ న్న ఖేందు భానుభి స్సర్వం తమో విధున్వతే |
    బృందారకేంద్ర సుందరీ పాదాంబుజాయ మంగళం ||

22. గీర్వాణమౌళి రత్న భా సంక్షాళితాయ దీప్య తే |
    స్వర్గాధినాధ భామినీ పాదాంబుజాయ మంగళం ||

23. బాలార్క బింబ రోచిషే యోగీంద్ర హృద్గుహాజుషే |
    పాకారి జీవితేశ్వరీ పాదాంబుజాయ మంగళం ||


17. ఏ దేవికి సమానమగుస్త్రీ ముల్లోకములందు లేదో, అట్టి సుందరి, నిత్య యౌవన, పురాతని యైన స్త్రీకి మేము నమస్కరింతుము.


18. ఏ దేవి పాదములకు గల సౌందర్యము మందార పల్లవములకు గూడ లేదో, అట్టి సుందరాతిసుందరములైన శచీదేవి పాదములను నే నాశ్రయింతును.


19. ఏ దేవి పదకాంతులు ప్రశస్త మాణిక్యములందైన లేవో, భాసురమైన వానికంటె భాసురమైన యా శచీ పాదములను నే నాశ్రయింతును.


20. ఏ దేవిపాదములను చితించుటవలన నరుడు పాపములచే తిరస్కరింపబడడో, అట్టి పవిత్రమైన వానికంటె పవిత్రమైన శచీపాదములను నే నాశ్రయింతును.


21. ఏ దేవియొక్క నఖములందు రాజిల్లు చంద్రకాంతులు తమస్సును బారద్రోలుచున్నవో, అట్టి యింద్రాణీ పాదములకు మంగళమగుగాక.


22. దేవతల కిరీట రత్న కాంతులచే కడగబడుచు బ్రకాశించుచున్న ఇంద్రాణి పాదములకు మంగళమగుగాక.


23. బాలసూర్య బింబమువలె భాసించునది, యోగీంద్రుల హృదయ గుహలందు దీపించునది యైన ఇంద్రాణియొక్క పాదపద్మమునకు మంగళమగుగాక.

24. ఆత్మీయ దేశరక్షణే శక్తం కరోతు సర్వథా |
    పాప ద్విషాం ప్రియంకరీ వాసిష్ఠ మింద్ర సుందరీ ||

25. వాసిష్ఠ వాక్ప్రదీప్తిభి ర్నా రాచికాభి రీశ్వరీ |
    గీర్వాణ చక్రవర్తి న స్సమ్మోద మేతు సుందరీ ||

                  _________


తృతీయం అనుష్ణుభం శతకమ్ సంపూర్ణమ్.


24. పాపములకు శత్రువులైనవారికి బ్రియమొనర్చు ఇంద్రాణి ఆత్మీయ దేశరక్షణమందు వాసిష్ఠగణపతిమునిని సర్వధా శక్తి మంతుని చేయుగాక.


25. ఈశ్వరియగు నింద్రాణీదేవి వాసిష్ఠవాక్కులచే బ్రకాశించు 'నారాచికా' వృత్తముల వలన సంతోషము బొందుగాక.


__________