ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/పీపుల్స్ ఫ్రెండ్

6

పీపుల్స్ ఫ్రెండ్

పీపుల్స్ ఫ్రెండ్ అవతరణ - నాటి మద్రాసు పత్రికల స్థితి

క్రీ.శ. 1785 లో మద్రాసు కొరియర్ (Madras Courier), మద్రాసు గెజిటు (Madras Gazette), మద్రాసు మేల్ అసైలం హెరాల్డు (Madras Male Asylum Herald) మొదలైన పత్రికలు ఆరంభించబడ్డాయి1. మూడూ వారపత్రికలే. ఈ పత్రికలు కొద్దికాలం మాత్రమే కొనసాగాయి. వీటి తర్వాత మద్రాస్ కన్సర్వేటివ్ (Madras Conservative) ఆరంభమయింది. 1832లో ఫోర్ట్ సెయింట్ జార్జి గెజిటు (Fort Saint George Gazette) ప్రారంభమయింది. ఇది ఈస్టిండియా కంపెనీ (East India Company) అధికార పత్రిక. పోస్టేజి అవసరం లేకుండా ప్రెసిడెన్సీకంతటికీ బట్వాడా అయ్యేది. ఇంగ్లీషుతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ప్రకటనలుండేవి2. 1833లో కర్ణాటిక్ క్రానికల్ (Carnatic Cronicle) ఇంగ్లీషు, తమిళం, తెలుగు, త్రిభాషా పత్రికగా ఆరంభమైంది. ఈ పత్రిక మతవివాదాల జోలికి పోకుండా, స్థానికవిషయాలకు ప్రాధాన్యం ఇచ్చింది3. 1840లో సి. నారాయణస్వామినాయుడు నేటివ్ ఇంటర్‌ప్రిటర్ (Native Interpreter) పత్రికను ప్రారంభించాడు. రెండేళ్ళపాటు హిందువుల అభివృద్ధికి ఈ పత్రిక కృషి చేసింది.4 1843లో మద్రాసు మిషనరీలు నేటివ్ హెరాల్డు (Native Herald) పత్రిక ప్రారంభించి మత ప్రచారం సాగించారు.5 1844 లో గాజుల లక్ష్మీనరసుసెట్టి క్రెసెంట్ (Crescent) పత్రికను ప్రారంభించాడు. ప్రెసిడెన్సీలోని హిందువుల మనోభావాలు, ఆశలు ఈ పత్రిక పుటలలో వ్యక్తమయ్యేవి. పత్రిక ఆర్థికంగా నిలదొక్కుకోడానికి, లక్ష్మీనరసుపెట్టి మద్రాసు సంపన్నవర్గాల ప్రముఖులను భాగస్వాములుగా తీసుకొన్నాడు. ఈ పత్రిక షుమారు ఇరవై సంవత్సరాలు సమాజానికి ఉపయోగకరంగా కొనసాగి, మూతపడింది.6 క్రెసెంట్ నిలిచిపోయిన తర్వాత, దాని ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి హిందూ క్రానికల్ (Hindu Cronicle) ప్రారంభమైంది.7 కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె, ఆయనమిత్రులు, అనుచరులు సంఘసంస్కరణ కోసం, స్త్రీ విద్యకోసం కృషిచేశారు. ఎం. వెంకటరాయులునాయుడు 1853లో రైసింగ్ సన్ (Rising Sun) పత్రిక స్థాపించి, పదేళ్ళు నడిపాడు. ఈ పత్రిక నిలిచిపోయిన తర్వాత, 1860 దశాబ్దంలో నేటివ్ అడ్వొకేట్ ఆరంభమైందని, సుందరలింగం రాశాడు.8 1845 లో ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్ (Athenaeum and Daily News) పత్రిక ప్రారంభమైంది. "The barrister's father was a partner of Pharoah and Co., who are also Publishers of the Athenaeum when it flourished under Mr. John Bruce Norton's editorship" అని నరసయ్య ఈ పత్రికను గురించి రాశాడు.9 ఈ పత్రిక యాజమాన్యం యూరోపియన్లదే అయినా, మద్రాసు ప్రజల జీవితాన్ని గురించి, హిందువుల సాంఘికసమస్యలను గురించి రాసింది. 1875 ప్రాంతాలలో ఈ పత్రిక కొనసాగుతున్నట్లు సూర్యాలోకం తెలియచేసింది.10

1858లో మద్రాస్ టైమ్స్ (Madras Times) ప్రారంభమైంది. ఇది యూరోపియన్లలో దిగువ వర్గాలవారి పత్రిక. చిన్న వ్యాపారులు, టీతోటల యజమానుల సమస్యలు ఇందులో చర్చించబడేవి.11 1865 ప్రాంతాలలో మద్రాస్ స్టాండర్డ్ (Madras Standard) పత్రిక వెలువడుతూంది. 1868 డిసంబరులో మద్రాస్ మెయిల్ (Madras Mail) తొలిసంచిక విడుదలైంది. యూరోపియన్లలో ఉన్నతవర్గాలవారి అభిరుచులకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ పత్రిక సాగింది. ఇది ఛేంబర్ ఆఫ్ కామర్సు (Chamber of Commerce), యూరోపియన్ క్లబ్బులకు సంబంధించిన ఎగువతరగతి వర్గాలకు చెందిన పత్రిక. ఇంగ్లాండులో ముద్రించబడే మంచి పత్రికల బాణీలో నడిచింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ పత్రికకు ఉన్నంతమంది చందాదారులు ఇంకే పత్రికకూ లేరు. స్పెక్టేటర్ (Spectator), మద్రాస్ టైమ్స్ ఇందులో లీనమయ్యా యి.12 1870 దశాబ్దిలో టి. మాధవరావు, ఆర్, రఘునాథరావు నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ (Native Public Opinion), ఎ. రామచంద్రఅయ్యరు మదరాసీ (Madrassee) పత్రికలను ప్రారంభించారు. ఈ ముగ్గురు పాశ్చాత్య విద్యావిధానంలో విద్యార్థనచేసిన తొలితరం వ్యక్తులు. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రజాభిప్రాయాలను ఈ పత్రికలు తెలియజేస్తూ వచ్చాయి. కొంతకాలం తర్వాత ఈ రెండు పత్రికలు కలిసి, మద్రాస్ నేటివ్ ఒపీనియన్ (Madras Native Opinion) ఆవిర్భవించింది. ప్రభుత్వం దేశభాషాపత్రికల చట్టం అమలుచేసినపుడు, ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాయడానికి దేశీయుల చేతుల్లో ఇంగ్లీషు పత్రికలు లేకుండాపోయాయి.13

హిందూ ఆవిర్భావం

ఎం. వీరరాఘవాచారి, జి. సుబ్రహ్మణ్యఅయ్యరు పచ్చయ్యప్ప విద్యాసంస్థలో అధ్యాపకులు. వీరి అధ్వర్యంలో ట్రిప్లికేన్ లిటరరీ సొసైటీ (Triplicane Literary Society) మద్రాసు పౌరుల అభిప్రాయ వేదికగా పనిచేసింది. ముత్తుస్వామి అయ్యరు హైకోర్టు జడ్జి నియామకాన్ని, యూరోపియన్ పత్రికలతో పాటు, దేశీయుల యాజమాన్యంలో నడుస్తున్న “మద్రాస్ నేటివ్ పబ్లిక్ ఒపీనియన్" పత్రిక కూడా వ్యతిరేకించింది. కొన్ని భాషాపత్రికలు అయ్యరు నియామకాన్ని సమర్థిస్తూ రాసినా, వాటి ప్రభావం చాలా తక్కువ.14 1877లో మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం మీద పదమూడు దేశభాషాపత్రికలు మాత్రమే ఉన్నాయి. వాటి సర్క్యులేషను (circulation) నాలుగువేలకు మించదు.15 ఆంగ్లో ఇండియన్ పత్రికల విమర్శ ఎదుర్కొనడానికి, స్థానికుల అభిప్రాయాలు తెలియపరచడానికి, ఒక ఇంగ్లీషు పత్రిక కావాలనే తీవ్రమైన కాంక్ష నుంచి హిందూ జన్మించింది.

1878 సెప్టెంబరు 20న 'హిందూ' వారపత్రికగా ఆరంభమైంది. ఎం. వీరరాఘవాచారి, జి. సుబ్రహ్మణ్యఅయ్యరు, వారి నలుగురు మిత్రులు ఈ పత్రికను ప్రారంభించారు. దీనికి సుబ్రహ్మణ్యఅయ్యరు సంపాదకుడుగా, వీరరాఘవాచారి ప్రచురణకర్తగా వ్యవహరించారు. హిందూ 1883లో ట్రైవీక్లీ అయింది, 1889లో దినపత్రికగా ఆవిర్భవించింది.16

1881 లో భాష్యంఅయ్యంగారి అధ్యక్షతన మద్రాస్ నేటివ్ అసోసియేషను కొంతకాలం క్రియాశీలంగా పనిచేసింది. ప్రభుత్వం ఈ సమాజ వ్యవహారాలను అనుమానించడంతో చాలామంది అందులో సభ్యత్వం తీసుకోడానికి వెనుకంజ వేశారు. 1884లో మద్రాసు మహాజనసభ ఏర్పడేదాకా, మద్రాసు మేధావుల వాణిని వినిపించడానికి హిందూ ఒక వేదిక అయింది.17 హిందూ యాజమాన్యం 1881 నుంచి 'స్వదేశమిత్రన్' తమిళ వారపత్రికను ప్రచురించడం మొదలుపెట్టింది. ఇది 1889లో దినపత్రికగా పరిణమించింది. దక్షిణ భారతదేశంలో ఒక దేశభాషలో వెలువడిన తొలి దినపత్రిక ఇదే.18 హిందూను ప్రారంభించిన కొన్ని సంవత్సరాల వరకు వీరరాఘవాచారి, సుబ్రహ్మణ్య అయ్యరు, పచ్చయ్యప్ప సంస్థలో అధ్యాపకులుగా కొనసాగారు. ఇది సంధికాలం. దేశీయుల యాజమాన్యంలోని పత్రికలు ఔత్సాహిక దశను దాటి నిర్వాహకులు పూర్తికాలం వినియోగించవలసిన స్థితికి చేరుకొంటున్న సమయం. దేశీయపత్రికలు అనేక సమస్యలతో సతమతమవుతున్నకాలం. పాఠకులు చందాలు సక్రమంగా చెల్లించకపోవడం, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు అందకపోవడం, ఇంగ్లీషువారు నడిపే పత్రికలతో పోటీపడవలసి రావడం, దేశీయ వ్యాపార వర్గాలు, స్థానికులు ఈ పత్రికలలో పెట్టుబడులు పెట్టకపోవడం, పత్రికా నిర్వాహకులు పూర్తికాలాన్ని పత్రికకోసం వినియోగించలేకపోవడం వంటి పరిస్థితులు దేశీయపత్రికలు నిలదొక్కుకోలేక పోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇందుకు భిన్నంగా యూరోపియన్ యాజమాన్యాలు పత్రికలను సమర్థవంతంగా నిర్వహించేవి. యూరోపియన్లకు పత్రికా నిర్వహణ ఒక వృత్తి, వ్యాపారం. ప్రభుత్వం అండదండలు ఉండనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఇంగ్లీషు విద్య అభ్యసించినవారిని పత్రికారంగం ఆకర్షించలేకపోయింది. కొందరు విద్యావంతులు పత్రికలు ప్రారంభించి, ఉద్యోగ పర్వంలో పదోన్నతి సాధించడానికి నిచ్చెనమెట్లుగా వాడుకొన్నారు.19 కొంతమంది యువకులు మాత్రం ఉద్యోగాలు, వృత్తులు మానుకొని, దేశభక్తితో, గొప్ప ఆదర్శాలతో పత్రికలు నడపడానికి ఉద్యమించారు. అధ్యాపకులు, వకీళ్ళు, ప్రభుత్వోద్యోగులు పత్రికారంగంలో ప్రవేశించారు.

హిందూ ప్రారంభమైన తర్వాత, 1880 దశాబ్దంలో భారతీయుల యాజమాన్యంలో ఇంగ్లీషు, తమిళం, తెలుగు మొదలైన దేశభాషల్లో పత్రికా ప్రచురణ ఊపందుకుంది. కొన్ని పత్రికలు ఇంగ్లీషు - దేశభాష రెండింటిలో వెలువడుతూ వచ్చాయి. ఇదే సమయంలో మతపరమైన పత్రికలు పుట్టుకొచ్చాయి. జిల్లాలలో దేశభాషలలో పత్రికాప్రచురణ ప్రారంభం అయింది. ఆ కాలంలో జర్నలిజం సామాజిక రాజకీయాంశాలతో ముడిపడి ఉంది. ఇంగ్లీషు విద్య అభ్యసించిన తొలితరం విద్యావంతులు బ్రాహ్మణులు, పై వర్గాలవారు కావడంవల్ల, తొలితరం పత్రికా నిర్వాహకులు కూడా ఆ వర్గాలనుంచి వచ్చారు.20 సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే నరసయ్య మద్రాసులో అడుగుపెట్టాడు. ఆయనలో అణగి ఉన్న కాంక్ష ఊరుకోనివ్వలేదు. నిక్షేపమైన డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగం విడిచిపెట్టి మద్రాసు దారిపట్టాడు. పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ప్రచురణ, పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ నిర్వహణ వృత్తిగా స్వీకరించాడు.

పీపుల్స్ ఫ్రెండ్

అచ్చాఫీసు ప్రారంభించడం మాటలు కాదు. 1840 ప్రాంతాలలో ఒక్క తెలుగుభాషలో పత్రిక నిర్వహించడానికి కనీసం రెండువేల రూపాయల పెట్టుబడి అవసరం అయ్యేదని ఒక అంచనా.21 మూడు భాషల్లో అచ్చుపనులు నిర్వహించడానికి, ఇంగ్లీషులో వారపత్రిక నడపడానికి అనువైన ప్రెస్ సమకూర్చుకోడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అయి ఉంటుంది. ఆ రోజుల్లో దేశీయుల యాజమాన్యంలో సాగే పత్రికావ్యాపారాల్లో పెద్ద లాభాలు ఉండేవికావు. యజమానులకు, సంపాదకులకు కొద్దిమొత్తం ప్రతిఫలంగా మిగిలేది. మంచి సర్క్యులేషను ఉన్న పత్రికలలో కూడా మూడంకెలకు మించి ఆదాయం ఉండేది కాదు.22 నరసయ్య ప్రభుత్వోద్యోగం చేసిన కాలంలో కూడబెట్టిన డబ్బంతా ప్రెస్సు కోసం వెచ్చించి ఉంటాడు.

"I was the Editor of People's Friend at Madras from April 1881 to 1897 July" అని నరసయ్య నెల్లూరుజిల్లా మునిసిఫ్ కోర్టు (Nellore District Munsif Court) లో ఇచ్చిన వాఙ్మూలంలో పేర్కొన్నాడు. "People's Friend order book from April Ist 1881 to 30th September 1883" అని నరసయ్య సొంతదస్తూరితో రాసిపెట్టిన ఆఫీసు ఆర్డరు బుక్కు లభ్యమయింది. 1883 డిసంబరు 1వ తారీకు పీపుల్స్ ఫ్రెండ్ సంచిక వాద సంపుటం III సంచిక 18 అని, 1886 జనవరి 30 సంచిక మీద సంపుటం VI సంచిక 5 అని, 1888 ఫిబ్రవరి 25 సంచికమీద సంపుటం VIII సంచిక 8 అని ఉంది.23

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రజల పత్రికని, అతి సామాన్యులైన గుమాస్తాలకు సైతం అందుబాటులో ఉండాలని భావించాడు. పత్రిక నుదుటి మీద "A Cheap Journal published every Saturday evening" అని ప్రకటించుకొన్నాడు. 1883 డిసంబరు 1 సంచికలో నెలచందా ఆరణాలని, ముందుగా చందా పంపిన వారికి సంవత్సరం చందా నాలుగున్నర రూపాయలని, సంవత్సరం అంతా పత్రిక స్వీకరించి, చివర చందాపంపేవారికి ఆరురూపాయలని ఉంది. 1886 జనవరి 30 సంచిక ముఖపత్రం మీద దళసరి కాగితంమీద ముద్రించిన పత్రిక సంవత్సరం చందా ఆరురూపాయలని, పల్చని కాగితంమీద ముద్రించిన పత్రిక చందా నాలుగున్నర రూపాయలని ఉంది.

ఆ రోజుల్లో మద్రాసు ఫోర్ట్ సెంట్ జార్జి గెజిటు మంగళవారం సాయంకాలం విడుదలయ్యేది. అందులోని వార్తలు సేకరించుకొని, ముద్రించుకోడానికి అనువుగా పీపుల్స్ ఫ్రెండ్ శనివారం సాయంత్రం రాయల్ సైజులో నాలుగుఫారాలు అంటే ఎనిమిది పుటలతో వెలువడేది.24 తొలి మలి పుటలు, చివరిపుట నిండుగా ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో ప్రకటనలుండేవి. “ది థింకర్ ఏన్ ఆంగ్లో తమిళ్ జర్నల్ ఆఫ్ ది ఫ్రీథాట్” పత్రిక ప్రకటన 1883 డిసంబరు 1 తొలిపుటలో ఉంది. ఆనాటి ఇతర పత్రికలలో ఇదే విధంగా ప్రకటనలుండేవి. 1950 వరకూ 'హిందూ' తొలి పుట నిండుగా ప్రకటనలుండేవి.

నరసయ్య పత్రిక తీసుకొనిరావడంతో పాటు పుస్తకప్రచురణ, విక్రయం కూడా సాగించాడు. ఇంగ్లీషు, తమిళం, గ్రంథ లిపులలో పుస్తక ప్రచురణ, జాబ్ వర్కు, 'పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరి' పేర పుస్తక విక్రయం కొనసాగించాడు. ప్రభుత్వ చట్టాలు, రెగ్యులేషన్స్‌కు సంబంధించిన పుస్తకాలు, తెలుగు తమిళ ప్రాచీనకావ్యాలు, సాహిత్యగ్రంథాలు, బ్రహ్మసమాజ గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, గైడ్లు, పాత పాఠ్యపుస్తకాలు, రఘునాథరావు ఇతర సంస్కరణవాదుల గ్రంథాలు, పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ ద్వారా విక్రయంఅయ్యేవి. నరసయ్య రచించిన “ఎసన్షియల్స్ ఆర్ ఫస్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ ఈజీ తెలుగు (Essentials or a First book of English Grammar in Easy Telugu) ఈ సంస్థ విక్రయించే పుస్తకాల జాబితాలో ఉంది. ఇది వ్యావహారికభాషలో రాయబడిన తొలి తెలుగు పాఠ్యపుస్తకాలలో ఒకటి కావచ్చు.

టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India), స్టేట్స్‌మన్ (Statesman), హిందూ (Hindu) మొదలైన పత్రికలలో ప్రచురించబడిన వార్తలు పీపుల్స్ ఫ్రెండ్‌లో ధారాళంగా పునర్ముద్రణ పొందాయి. ఆనాటి భారతీయ పత్రికలు, ముఖ్యంగా చిన్నపత్రికలు సోదర పత్రికల నుంచి, విదేశీపత్రికల నుంచి వార్తలు సేకరించి ప్రచురించేవి. ఆంగ్లో ఇండియన్ పత్రికలు కూడా ఈ పద్ధతినే అనుసరించేవి. ఒక్క మెయిల్ పత్రికకు తప్ప మద్రాసు నుంచి వెలువడే ఇతర పత్రికలకు వేటికి న్యూస్ సర్వీసు (News Service) సౌకర్యం ఉండేది కాదు. విద్యావంతులైన స్థానికులు రాసిన వార్తలు, వ్యాసాలు, లేఖలు అన్ని పత్రికలూ ప్రచురించేవి. ఈ పత్రికలకు ప్రత్యేకంగా విలేకరులు ఉండేవారు కాదు.

పీపుల్స్ ఫ్రెండ్ మూడోపుటలో అక్నాలెడ్జిమెంటు (Acknowledgement) శీర్షికలో ఆ వారం కొత్తగా చందాదారులైన వారి పేర్లు కనిపిస్తాయి. 1883 డిసెంబరు 1 సంచికలో షుమారు 32 మంది కొత్తగా చందారులైనవారి పేర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, కోయిలకుంట్ల, పుంగనూరు నుంచి ముగ్గురు చందాదారులయ్యారు. వారిలో ఒకరు ముస్లిం. మిగిలిన చందాదారులు దాదాపుగా తమిళదేశానికి సంబంధించినవారు. ఒకరో ఇద్దరో కేరళవాసులు.

1888 ఫిబ్రవరి 25 సంచికలో 15మంది గ్రామీణ ప్రాంతాల నుంచి చందాలు పంపిన వారి పేర్లున్నాయి. నెల్లూరుజిల్లా ఇందుకూరుపేటనుంచి ఒకరు, ఒంగోలు, అనంతపురం, భద్రాచలం, సికిందరాబాదు, ఒరిస్సా, కేరళ ప్రాంతాలనుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మిగతావారు తమిళ గ్రామీణ ప్రాంతాలవారు. వీళ్ళలో కొద్దిమంది ముస్లిమ్‌లు, క్రైస్తవులు కూడా ఉన్నారు.

1883 డిసంబరు 1 సంచిక

పీపుల్స్ ఫ్రెండ్స్ ప్రతిపుట నాలుగు 'కాలా'లుగా విభజించబడింది. మూడోపుట మొదటికాలంలో ప్రకటనలున్నాయి. ఆపుటలోనే చందాదారులను ఉద్దేశించి నరసయ్య చేసిన సుదీర్ఘమైన విన్నపం సంగ్రహానువాదం : “సహృదయ పాఠకులారా ! పీపుల్స్ ఫ్రెండ్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతూంది. ఈ పత్రిక యజమాని, సంపాదకుడు పాఠకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చెయ్యగలిగినంత చేశాడు. దక్షిణ భారతదేశంలో పత్రికా నిర్వాహకులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తేనేతప్ప, పాఠకుల్లో ఉత్సుకతను మేల్కొల్పడం సాధ్యం కాదు. దళసరి కాగితంమీద పత్రికను అచ్చువేయాలనే అభిప్రాయంతో సంవత్సరానికి రెండణాలు అదనంగా చందా చెల్లించమని విన్నవించుకొన్నాము. ఇందుకు మా చందాదారులు ముందుకు రాలేదని చెప్పడానికి విచారిస్తున్నాము. దళసరి కాగితం మీద ముద్రిస్తే పత్రిక ఎంత ముచ్చటగా ఉంటుందో మా పాఠకులు గ్రహించినట్లు లేదు. మాకు పెద్ద సర్క్యులేషను ఉంది. అది రోజు రోజుకు వృద్ధి చెందుతున్నందుకు మేము ఆనందిస్తున్నాము. పాఠకులు మా పత్రికను ఇష్టపడుతున్నారని ఇందువల్ల స్పష్టంగా తెలుస్తూంది. ఎన్నో కష్టనష్టాలను భరించి పాఠకుల అభిప్రాయాలకు అనుగుణంగా పత్రిక సాహిత్య స్వరూపాన్ని (Literary get up) తీర్చిదిద్దుతున్నాము. మేము పెట్టే కర్చులో వ్యాసాలకోసం నెలనెల చెల్లించే మొత్తం కూడా తక్కువేమీ కాదు. అందించగలిగినంత సహాయం అందచేయవలసినదిగా మా మిత్రులను ప్రార్థిస్తున్నాము.”

మూడో పుట సంపాదకీయం కోసం కేటాయించబడింది. ఈ పుటలో రెండు, మూడు 'కాలా'లలో “టూ పిక్చర్స్” (Two Pictures) శీర్షికతో ప్రధాన సంపాదకీయం ఉంది. సంపాదకీయం పై భాగంలో ఆ నెల కేలెండరు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ప్రచురించబడ్డాయి. ఇదే పుటలో నాలుగో 'కాలం' గతవారం 'లీడర్' (సంపాదకీయం) తరువాయి భాగం "ది బెంగాల్ టెనెన్సీ బిల్ (The Bengal Tenancy Bill) ప్రచురించబడింది. రచయిత పేరు 'F' అని మాత్రం ఇవ్వబడింది. ఈ సంచికలోనే “సర్ విలియం హేమిల్టన్స్ వ్యూ ఆఫ్ ది థియరీస్ ఆన్ ది బిలీఫ్ ఆన్ ఎక్స్‌టర్‌నల్ వరల్డ్” ("Sir William Hamilton's view of the theories on the belief on external world") వ్యాసం ఉంది. వ్యాసరచయిత సి.పి. దొరస్వామిచెట్టి బి.ఏ. ఇది తత్త్వశాస్త్ర సంబంధమైన వ్యాసం. ఈ సంచికలోనే కనాట్ డ్యూక్ (Duke), డచెస్ (Duchess of Connaught) భారతదేశ పర్యటనకు సంబంధించిన సుదీర్ఘమైన రిపోర్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి పునర్ముద్రించబడింది. ఈ సంచికలో “పాళియంకోట ఇన్ 1810-1827" అనే ధారావాహిక కూడా ప్రచురించబడింది. ఈ ధారావాహిక పీపుల్స్ ఫ్రెండ్ లో చాలాకాలంగా ప్రచురించ బడుతున్నట్లుంది. ఈ సంచికలో 1826 సంఘటనలు వివరించబడ్డాయి. తిన్నెల్వేలి జిల్లాలోని పాళియంకోట కేంద్రంగా క్రైస్తవ మిషనరీల అనుభవాలు, మత ప్రచారం ఉత్తమపురుషలో వివరించబడ్డాయి. ఈ సంచికలోనే కడలూరు ప్రభుత్వ కళాశాల బహుమతి ప్రదానోత్సవం మీద సుదీర్ఘమైన నివేదిక ప్రచురించబడింది.

రెండో పుటలో “అవర్ కరస్పాండెన్సు” (Our correspondence) శీర్షికలో రెండు సంపాదకీయ లేఖలు ప్రచురించబడ్డాయి. ఉత్సవదినాల్లో పుణ్యక్షేత్రాలు దర్శించే యాత్రికులకు ఎస్.ఐ.ఆర్ రైల్వేవారు తిరుగు టిక్కెట్లు ముందుగా ఇవ్వాలని కోరుతూ రాసిన లేఖ ఒకటి. రెండోది తంజావూరు దేవస్థానం ఆదాయవ్యయాలకు సంబంధించిన వివాదంలో ఒక వర్గం వారి లేఖ. ఈ వివాదంలో ఉభయపక్షాలు కొన్ని నెలలుగా పీపుల్స్ ఫ్రెండ్‌కు సంపాదకీయ లేఖలు రాస్తున్నట్లు తోస్తుంది. మూడో పుటలో “టెలిగ్రామ్స్ ఫ్రమ్ డెయిలీ పేపర్సు” (Telegrams from Daily Papers) శీర్షికలో ప్రపంచ దేశాల వార్తలున్నాయి. ఈ వార్తలన్నీ విదేశీ పత్రికల నుంచి పునర్ముద్రించినవే. బ్రహ్మసమాజ నాయకుడు కేశవచంద్రసేన్ ఆరోగ్యాన్ని గురించి స్టేట్స్‌మన్ ప్రచురించిన వార్తను ఈ శీర్షికలోనే ఇట్లా ప్రచురించాడు. “ఈ వార్త విని చాలామంది సంతోషిస్తారు. మహానుభావుడు, బ్రహ్మసమాజ నాయకుడు కేశవచంద్రసేన్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అయినా ఆయన పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు స్టేట్స్‌మన్ రాస్తూంది. ” లండన్‌లో జర్మన్ కార్యాలయాన్ని పేల్చివేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో పోలీసులు ఒక జర్మన్ జాతీయుణ్ణి అరెస్టు చేస్తారు. అతడు సోషలిస్టని ఆ వార్తలో ఉంది. ఇటువంటి అనేక జాతీయ, అంతర్జాతీయ ఆసక్తికరమైన వార్తలు ఈ శీర్షికలో ప్రచురించబడ్డాయి. కొత్తగా ఉన్నతోద్యోగాలలో చేరడానికి ఇంగ్లాండు నుంచి భారతదేశం వస్తున్న వారి వివరాలు, పదవీవిరమణ చేసిన పెద్ద ఉద్యోగుల వివరాలు ఈ శీర్షికలోనే ఇవ్వబడ్డాయి.

“నోట్స్ అండ్ న్యూస్” (Notes and News) శీర్షికలో భారతదేశ వార్తలు, పండిత రమాబాయి సంక్షిప్త జీవితచరిత్ర ఇవ్వబడ్డాయి. ఇందులో కొన్ని వార్తలు సోదరపత్రికల నుంచి స్వీకరించి ప్రచురించినవి కూడా ఉన్నాయి. ఫోర్ట్ సెంట్ జార్జి గెజిటు నవంబరు 27 మంగళవారం సంచికలోని అనేకవిషయాలు ఈ శీర్షికలో పునర్ముద్రణ పొందాయి. “సెలెక్టు టెలిగ్రామ్స్” (Select Telegrams) శీర్షికలో ఆయా పత్రికల నుంచి ఎంపిక చేసిన వార్తాకదంబం కనిపిస్తుంది. లభించిన ఒకటి రెండు సంచికలను బట్టి పత్రికను అంచనా వెయ్యడం సాహసమే అయినా, సాంఘిక, సామాజిక విషయాలమీద, జాతీయ అంతర్జాతీయ సంఘటనలమీద ఆసక్తి, అవగాహన ఉన్న విద్యాధికులైన సంస్కారులీపత్రికకు పాఠకులని అనిపిస్తూంది.

పీపుల్స్ ఫ్రెండ్ ఉద్యోగులు

పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ మొదట మద్రాసు వడమాలవీధిలో, 253 నంబరు ఇంట్లో, ప్రారంభించబడింది. రెండేళ్ళ తర్వాత ఆఫీసు నంబరు 355, మింట్ స్ట్రీటుకు మార్చబడింది.25 తొలినాళ్ళలో పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక పనితీరు, ఉద్యోగుల వివరాలు తెలియజేసే "ఆఫీస్ ఆర్డర్ బుక్”లో నరసయ్య స్వదస్తూరితో వేసిన 37 ఆఫీసు ఆర్డర్లు ఉన్నాయి. ఆ పుస్తకంలో ఉద్యోగుల నియామకాలు, జీతబత్యాలు, విధులు, ఇంక్రిమెంట్లు, మెచ్చుకోళ్ళు, జుల్మానాలు అన్నీ రాసి ఉంచాడు. ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు, ప్రెస్‌కార్మికులు అని రెండురకాలుగా ఉండేవారు. ఆఫీసు అజమాయిషీ హెడ్‌క్లర్కు బాధ్యత. అతని కింద మొదటి గుమాస్తా, రెండవ గుమాస్తా అని వరుసగా ఐదుమంది గుమాస్తాలుండేవారు. అందరి విధులు ఆఫీసు ఆర్డరు పుస్తకంలో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. పత్రిక శనివారం సాయంత్రం విడుదలౌతుంది కనుక ఐదుగురు కంపాజిటర్లు శుక్రవారం రాత్రంతా పనిచేసేవారు. శనివారం ఉదయం పదిగంటలకల్లా నాలుగోఫారం అచ్చుపూర్తయి, పత్రిక విడుదలకు సిద్ధమవుతుంది. ఉద్యోగులందరూ కలిసి సాయంత్రంలోపల డిస్పాచ్ పూర్తిచేసి ఇళ్ళకు వెళ్తారు.

పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్‌కు అనుబంధంగా ఒక లైబ్రరి, దాని వ్యవహారాలు చూచుకోడానికి లైబ్రేరియన్ ఉండేవాడు. పుస్తకాలకు కేటలాగులు తయారుచేయడంతో పాటుగా, పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ పేరుతో నరసయ్య నిర్వహించిన పుస్తక విక్రయసంస్థ పనులు కూడా ఈ లైబ్రేరియన్ చూచుకొనేవాడు. ప్రెస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక సూపర్నెంటు ఉండేవాడు. ఇతనికి ప్రూఫులు చూడడం మొదలైన బాధ్యతలుండేవి. ఇతనికి సాయంగా ప్రూపురీడర్లు ఉండేవారు. కంపాజిటర్ల పనులు అజమాయిషీ చెయ్యడం, ప్రూఫులుచూడడం వంటి పనులు వీరు చూచుకొనేవారు. ఎన్.సి. శ్రీనివాసాచారి కొంతకాలం సూపర్నెంటుగా పనిచేశాడు. ఇతణ్ణి గురించి నరసయ్య ఆర్డరుబుక్‌లో ఈ విధంగా రాశాడు. "N.C. Srinivasachari, who in consideration of his possessing some knowledge of 4 languages viz. English, Telugu, Tamil and Sanskrit appears to be much better fitted to supervise the printing business of various kinds in this office, whose salary will ( at ) present be Rs 9 (Nine) a month". (office order 12 dated 8-1-1882) తెలుగు, తమిళ, గ్రంథ వెర్నాక్యులర్ ఫోర్మన్ (Vernacular Foreman) రాజగోపాల్ నెలజీతం 9 రూపాయలు. ఇతని పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని, నరసయ్య రోజూ 5 1/2 అణాల జీతం ఏర్పాటు చేశాడు. పేపర్‌బాయిస్, చందా వసూలు చేసే ఉద్యోగులు వగైరా చిల్లర ఉద్యోగులు కొందరు. వీరిలో 'బుల్లర్' (Buller) అనే ఒక చిన్న ఉద్యోగి ఉండేవాడు. ఇతని జీతం నెలకు మూడు రూపాయలు. పనివారు చేసే తప్పులను నరసయ్య ఆఫీసు ఆర్డరు ద్వారా వారి దృష్టికి తీసుకొని వచ్చేవాడు. వారిని మందలించి సరిదిద్దడానికి ప్రయత్నించడం, జరిమానా విధించడం, ఒకపూట జీతం కోతపెట్టడం, చివరకు మారడని తోచినప్పుడు విధులనుంచి తొలగించడం, ఉద్యోగి ప్రాధేయపడితే క్షమించి మళ్ళీ పనిలో చేర్చుకోడం ఆయన అనుసరించిన ఆఫీసు పరిపాలనా పద్దతి. క్రమశిక్షణతో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ఆఫీసుఆర్డర్లు రాశాడు. అటువంటి వారికి జీతం వృద్ధి చేయడం కనిపిస్తుంది. విశ్వనాథయ్య ఎఫ్.ఏ పాసైన సంగతి తెలిసి, ఆఫీసు ఆర్డరు ఈ విధంగా రాశాడు. "Viswanathaiah having passed the F..A. exam and that somewhere in the middle of the list, the undersigned is willing and thinks it just to encourage him by giving a slight increase not in ( ............. | of the services he has already done, but with a view to attach a pay somewhat more suitable to one of his educational attainments. He will draw accordingly Rs 12 (Twelve) with effect from 1st February 1882". (office order no.2 dated 2-2-1882)

ఆఫీసు ఆర్డర్లలో సబ్‌ఎడిటరు ప్రస్తావన లేదు. పత్రికంతా ఒంటి చేతిమీదుగా నడిచే సంప్రదాయం కొనసాగిన రోజులవి. నరసయ్య ప్రభుత్వాధికారులకు పంపిన లేఖలలో చేవ్రాలు చేసి, కింద “ప్రొప్రైటర్, పీపుల్స్ ఫ్రెండ్” అని రాసేవాడు. 1883 డిసంబరు 6వ తారీకు రాసిన ఉత్తరంలో మాత్రమే చేవ్రాలు కింద “ఎడిటర్ అండ్ ప్రొప్రైటర్” అని రాశాడు.26 ఆఫీసు ఆర్డర్లలో మేనేజరు ప్రస్తావన లేదు. 1884లో ప్రెస్ మేనేజరుగా ఐ. వెంకటరావు, 1888లో ఎం.ఆర్. తిరువేంగడం మొదలియారు వ్యవహరించారు.27

పత్రికల కట్టలు కూలీద్వారా సీపోర్టు ఆఫీసుకు పంపినట్లు ఆఫీసు ఆర్డర్లలో ఉండడంవల్ల, కొన్ని కాపీలు నౌకలో రవాణా అయ్యేవని తెలుస్తూంది. పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక నాలుగు కాపీలు ఫైల్లో వేసి జాగ్రత్త చేస్తున్నట్లు కూడా ఆఫీసు ఆర్డర్ల వల్ల తెలుస్తుంది.

మెయిల్ తర్వాత తనదే ప్రజాదరణ పొందిన పత్రిక అని, వారం వారం 1200 కాపీలు అచ్చవుతున్నాయని తెలియజేస్తూ మద్రాసు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి నరసయ్య ఒక ఉత్తరంలో తెలియజేశాడు.28

The People's Friend Office,

Madras,

6th December, 1883

To

The Chief Secretary, Fort St. George.

Sir,

I have the honour to bring to your notice that as already intimated in the office letter No. 2451, dt. 15th October 1883, we issue nearly 1200 copies of our popular weekly. The circulation of the "People's Friend" of which I have to enclose a copy is therefore, to the best of my information and belief, larger than that of any other Madras newspaper with the sole exception of the "Mail".

I request accordingly that (the) Government will be pleased to draw the attention of the Heads of Departments to the "People's Friend" as an English medium for the advertisements.

I have the honour to be Sir,

Yours most obedient servant,

D. Narasaiah,

Editor & Proprietor.

ఆయా ప్రభుత్వ శాఖలు అవసరం అనుకొంటే పీపుల్స్ ఫ్రెండ్‌కు ప్రకటనలు ఇవ్వవచ్చునని, ఉత్తరం మీద అధికారి రాసిన నోట్లో ఉంది.

1888 ఫిబ్రవరి 25 సంచిక సంపాదకీయంలో “ఈ ప్రెసిడెన్సీలో ఒక స్థానిక పత్రికగా హిందూ తర్వాత స్థానం మాదే. హిందూ అచ్చు వేసే ప్రతి మూడు సంచికలకు మేము ఒక సంచికను అందించ గలుగుతున్నాము” అని పత్రికా లోకంలో పీపుల్స్ ఫ్రెండ్ స్థానాన్ని నరసయ్య పేర్కొన్నాడు.

మద్రాసులో సంస్కార భోజనం

1882 నాటికి మద్రాసు పత్రికలు నరసయ్యను సంస్కర్తగా గుర్తించాయి. జూలైలో మద్రాసులో ఏర్పాటయిన ఒక సంస్కార భోజనంలో ఆయన పాల్గొన్నాడు. రాజమండ్రిలో తొలి వితంతు వివాహం జరిపించి, ఆ దంపతులను వెంటబెట్టుకొని, వీరేశలింగం మద్రాసు వచ్చాడు. వీరేశలింగం బృందంతో కలిసి భోజనం చేయడమే సంస్కార భోజనం. ఈ సంఘటనకు పూర్వం మద్రాసులో కొన్ని సంగతులు జరిగాయి.

వీరేశలింగం పట్టుదల, కృషి వల్ల 1881 డిసెంబరు 11వ తేదీ రాజమండ్రిలో తొలి స్త్రీ పునర్వివాహం జరిగింది. ఈ పెళ్ళికి ముందే దక్షిణ భారతదేశంలో రెండు స్త్రీ పునర్వివాహాలు జరిగాయి. 1867లో బెంగుళూరులో ఒక వివాహం జరిగింది. వధువు తండ్రి మహారాష్ట్ర బ్రాహ్మణుడు. సంఘ బహిష్కరణకు వెరవకుండా తన కుమార్తె పునర్వివాహం జరిపించాడు. నాగర్‌కోయిల్‌లో శేషయ్యంగారు అనే న్యాయవాది తన కుమార్తెకు పునర్వివాహం చేశాడు. ఈ పెళ్ళి జరిగిన తర్వాత ఆ కుటుంబం బహిష్కరణకు గురి అయింది. రజకులు, క్షురకులు, పురోహితుల సేవలు అందకుండా చేశారు. కుటుంబ సభ్యులకు ఆలయ ప్రవేశం నిరాకరించబడింది. చివరకు బావుల్లో నీళ్ళు తోడుకోనీకుండా కట్టడి చేశారు. ఈ సంగతులన్నీ 'ఎథీనియం' పత్రిక తెలియజేసింది. ఈ సాంఘిక బహిష్కరణ ఒత్తిడిని ఎదుర్కొనడానికి శేషయ్యంగారు స్త్రీ పునర్వివాహ సంఘాన్ని స్థాపించి, వితంతు బాలికలకు వివాహం జరిపించేవారికి ఆర్థికసహాయం, సలహాలు అందించడానికి కృషి చేశాడు. నాగర్‌కోయిల్ బ్రాహ్మణ సమాజంవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోడానికి అవసరమైన సహాయ సహకారాలు అర్థిస్తూ మద్రాసు సంస్కరణోద్యమ నాయకులకు విజ్ఞప్తి చేశాడు. శేషయ్యంగారి కృషి మద్రాసులో మార్పును కోరుతున్న విద్యావంతుల హృదయాలను కదిలించినట్లుంది.29

హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్

1874 ఏప్రిల్‌లో మద్రాసు హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్ స్థాపించడం కోసం ఒక సమావేశం ఏర్పాటైంది. ఈ సమాజాన్ని స్థాపించడంలో రామయ్యంగారు, ముత్తుస్వామి అయ్యరు కృషి చాలా ఉంది. వాళ్ళిద్దరూ సమాజ కార్యవర్గ సభ్యులుగా, పళ్ళె చెంచలరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. స్త్రీ పునర్వివాహాలు ప్రోత్సహించడం ఈ సమాజ ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. విధవా వివాహాలకు శాస్త్రగ్రంథాల ఆమోదం ఏ మేరకు ఉందని పరిశీలించడం వరకే ఈ సమాజ కార్యక్రమాలు పరిమితం కావాలని పనప్పాకం అనంతాచార్యులు, ఆర్. రఘునాథరావు వాదించారు. వారికి సంప్రదాయ హిందువుల మనోభావాలను గాయపరచడం ఇష్టం లేదు. సభ్యులలో అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనలను తిరస్కరించడం వల్ల వీరిద్దరూ ఈ సమాజంలో సభ్యులుగా చేరనే లేదు. మద్రాస్ హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్ సభ్యులు వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతం అయితేనే విజయవంతం అవుతాయని విశ్వసించారు. ఈ దిశలో వితంతు వివాహాలకు అనుకూలంగా ఉన్న శాస్త్ర గ్రంథాలలోని విషయాలను ముందుగా ప్రచురించడానికి పూనుకొన్నారు. అప్పటికి ఈ సంస్కరణవాదులు కులవ్యవస్థను వ్యతిరేకించలేదు. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. హిందూ విడో మ్యారేజ్ అసోసియేషన్ ఈ పరిమిత లక్ష్యాలు కూడా కార్యరూపం ధరించలేదు. హిందూ సమాజం నుంచి వీరికి ఎటువంటి ప్రోత్సాహం లభించక పోవడంవల్ల, ఈ సంస్థ కార్యక్రమాలు వెనకబడిపోయాయి.30

మద్రాస్ విడో మ్యారేజ్ అసోసియేషన్ సభ్యులకు పట్టుదల లేదని, ఇంగ్లీషు అధికారుల మెప్పుకోసమే ఈ సమాజాన్ని స్థాపించారనే విమర్శలు వచ్చాయి. ఈ సమాజ సభ్యులు బహిరంగసభల్లో, పత్రికల్లో వ్యక్తపరచిన ఆశయాలను ఆచరణలో పెట్టలేని పిరికివాళ్ళనే మాటలు పుట్టాయి. అసలు సంగతి, ఈ సంస్థ సభ్యులు సంప్రదాయవాదులతో ముఖాముఖి తలపడడానికి ఇష్టపడలేదు. మద్రాసు బ్రాహ్మణుల్లో ఎక్కువమంది బాల్యవివాహాలను నిరసించే వారే అయినా, ఆచరణలో సంప్రదాయాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకుండా, నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. రంగనాథశాస్త్రి, ముత్తుస్వామి అయ్యరు, రామయ్యంగారు వంటి విద్యాధికులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా మూఢ నమ్మకాలను, దుష్ట సంప్రదాయాలను ఎదిరించడానికి జంకుతున్నారని, బాధ్యతలనుంచి తప్పుకొంటున్నారని పత్రికలలో విమర్శలు వచ్చాయి. వీరు సంస్కరణలకు అనుకూలమే అయినా సంప్రదాయవాదులను నొప్పించకుండా మార్పు తీసుకొని రావాలని ప్రయత్నించారు.31 1875లో మద్రాస్ విడో మ్యారేజ్ అసోసియేషన్ వితంతు వివాహాలమీద ఒక సభ నిర్వహించింది. పరవస్తు వెంకటరంగాచార్యులు విశాఖపట్నం నుంచి సభకు రావడమే కాక, స్త్రీ పునర్వివాహం శాస్త్ర సమ్మతమని సమర్థిస్తూ పుస్తకం రాసి ప్రకటించాడు.32 అంతకంటే ముందే బందరు పత్రిక 'పురుషార్ధ ప్రదాయిని' లో వితంతు వివాహాలను సమర్థిస్తూ వ్యాసాలు వెలువడ్డాయి. వేద సమాజపత్రిక 'తత్త్వబోధిని' లోను కొన్ని వ్యాసాలు వచ్చాయి. వీరేశలింగం స్త్రీ పునర్వివాహాలను సమర్థిస్తూ అనేక వ్యాసాలు రాసి, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలచడానికి ప్రయత్నించాడు.

పాతతరం సంస్కరణవాదుల్లో రంగనాథశాస్త్రి చనిపోయాడు. రామయ్యంగారు తిరువాన్కూరు దివాను పదవిని అంగీకరించి మద్రాసు విడిచిపెట్టాడు. ఆ సమయంలోనే ఆర్. రఘునాథరావు డెప్యూటీ కలెక్టరుగా మద్రాసు తిరిగి వచ్చాడు. ఆయనకు ప్రభుత్వ పాలనలో విశేషానుభవం ఉంది. మద్రాసులో అడుగు పెట్టగానే సంస్కరణోద్యమంలో మనస్ఫూర్తిగా నిమగ్నమయ్యాడు. ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో ఆయనలో సంస్కరణ మీద ఆసక్తి మొదలైంది. హిందువులు స్వచ్ఛమైన వైదికాచారాలను వదిలిపెట్టి మూఢనమ్మకాలవైపు ఆకర్షించబడ్డారని ఆయన పరిశీలనలో తేలింది. శాస్త్రాచారాలకు దూరం కావడంవల్ల స్త్రీలను అణచివేసే దురాచారాలు హిందూ సమాజంలో తలఎత్తాయని, బాల్య వివాహాలు, నిర్బంధ వైధవ్యం మొదలైన అంధ విశ్వాసాలకు హిందూ శాస్త్రాల ఆమోదంలేదని గ్రహించాడు. వేద యుగానంతరం వెలువడిన వ్యాఖ్యానాలు, విమర్శలు అనేక అపార్థాలకు తావిచ్చాయని, దక్షిణ భారతదేశంలో మూర్ఖంగా సంప్రదాయాన్ని నమ్మేవారివల్లే సంస్కరణ పురోగమించడం లేదనే నిశ్చయానికి వచ్చాడు. రఘునాథరావుకు ఇంగ్లీషు విద్యావంతుల మీద గూడా భ్రమ తొలగిపోయింది. మొదట్లో ఇంగ్లీషు విద్యావ్యాప్తి వల్ల సంస్కరణోద్యమం బలపడుతుందని ఆయన భావించాడు. ఇంగ్లీషు నేర్చిన యువకులు పాశ్చాత్య సంస్కృతి మోజులో తమ మతాన్ని, జీవనవిధానాన్ని చులకన చేసి తృణీకరిస్తున్నారని, విగ్రహారాధనను నిరాకరించి నాస్తికులుగా మారుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఈ యువకులు అభిలషిస్తున్న తీవ్రమైన మార్పులు హిందూ సమాజానికి చెడుపు చేస్తాయని, శాస్త్ర గ్రంథాల ఆధారంగా నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకొని రావచ్చునని విశ్వసించాడు. ఆయన సంస్కరణ అనే మాటను కూడా వాడడానికి ఇష్టపడలేదు. దానికి బదులు “మన జీవితానికి సంబంధించిన ప్రాచీన సూత్రాలు” అని వాడుక చేశాడు. శాస్త్రం ఆమోదం లేకుండా హిందూ సమాజాన్ని మార్చడం సాధ్యంకాదని, సంప్రదాయ వాదులను నొప్పించకుండానే సంస్కరణ, మార్పు నిదానంగా రావాలనే నిర్ణయానికి వచ్చాడు. పళ్ళె చెంచలరావు, మద్రాసు హైకోర్టు వకీలు సుబ్రహ్మణ్యంఅయ్యరు మొదలైన ఈయన మిత్రులు ఈ అభిప్రాయాలను సమర్థించారు. వీరి ఆలోచనలతో ఏకీభవించనివారు “హేతువాదులు” గా ముద్రపడ్డారు. ఈ వర్గంవారు మార్పుకు తర్కం, ఇంగిత జ్ఞానం పునాది కావాలని భావించారు. నరసయ్య ఈ భావజాలానికి చెందినవాడని అనిపిస్తుంది.33

రఘునాథరావు మద్రాసుకు రావడంతో హిందూ మ్యారేజ్ అసోసియేషన్ పునరుద్ధరించబడింది. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించేవారే సంస్థలో ప్రధాన కార్యకర్తలు అయ్యారు. రఘునాథరావు అధ్యక్ష పదవి చేపట్టాడు. పదేళ్ళ కన్నా తక్కువ వయసు బాలికలకు వివాహం చేయడాన్ని ఈ సంస్థ అంగీకరించలేదు. వివాహమై కొంతకాలం సంసారం చేసిన స్త్రీలకు వేదమంత్రాలు పునర్వివాహం అంగీకరించలేదని, కన్యలైన వితంతువులకు మాత్రమే శాస్త్రం వివాహ విధిని అంగీకరించినట్లు ఈ సంస్థ అభిప్రాయపడింది. వితంతువులు పునర్వివాహం చేసుకొంటే తొలి భర్త ఆస్తిమీద హక్కు పోతుందనే కారణంతో, వితంతు బాలికల పునర్వివాహాలకు కన్నవారే అడ్డుపడుతున్నారని, అందువల్ల 1856 హిందూ వివాహ చట్టాన్ని సవరించవలసి ఉందని ఈ సంస్థ భావించింది. ఉత్తర సర్కారు జిల్లాలలో వీరేశలింగం ప్రారంభించిన వితంతు పునర్వివాహ కార్యక్రమంతో ప్రేరణపొంది, వితంతు వివాహాలు కుదిర్చినవారికి, అర్హులైన కన్యల వివరాలు తెలియజేసినవారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని సంస్కరణకు అనుకూలంగా మలచడంలో రఘునాథరావు, ఆయన మిత్రులు ఈ సంస్థ ద్వారా కృషి చేశారు.34

వీరేశలింగం తొలి వితంతు వివాహం జరిపించిన నాలుగో రోజే రెండో వితంతు వివాహం జరిపించాడు. దాంతో రాజమండ్రి సంప్రదాయ బ్రాహ్మణ వర్గం వీరేశలింగంమీద చర్య తీసుకొన్నది. ఈ వివాహాలతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ వెలివేసింది. స్థానిక పీఠాధిపతి సంస్కరణవాదులను వెలివేస్తూ పత్రికలు పంపాడు. వీటిని ఎదుర్కొనే శక్తి లేక కొందరు ప్రాయశ్చిత్తం చేసుకొన్నారు. వీరేశలింగం ఆయన అనుచరులు కొద్దిమంది మాత్రమే ఈ కష్టాలు సహించి నిలబడగలిగారు.35

రాజమండ్రిలో జరిగిన పునర్వివాహ వార్తలు విని మద్రాసు సంస్కరణవాదులు ఎంతో సంతోషించారు. వీరేశలింగాన్ని అభినందిస్తూ లేఖలు రాశారు. చెన్నపట్నం వచ్చి ఈ వేడి చల్లారక మునుపే కొన్ని ఉపన్యాసాలు చేయవలసిందని వీరేశలింగాన్ని ఆహ్వానించారు. ఆయన ఉపన్యాసాల ప్రభావంతో మద్రాసులో కూడా కొన్ని వితంతు వివాహాలు జరగవచ్చునని రఘునాథరావు, ఆయన మిత్రులు భావించారు.36

వీరేశలింగాన్ని మద్రాసుకు పిలిపించడానికి పళ్ళె చెంచలరావు కృషిచేశాడు. “మాతో సహ భోజనమున కేర్పాటుచేసి మాకు ప్రోత్సాహము కలిగించుటకయి చెంచలరావు పంతులుగారు మమ్మచటకు రమ్మని ఆహ్వానము చేసిరి” అని వీరేశలింగం స్వీయచరిత్రలో రాశాడు. వీరేశలింగం మద్రాసు రాకవల్ల అక్కడ పునర్వివాహ ఉద్యమం బలపడడమేకాక, ఆయనతో సహపంక్తి భోజనం చేసి, ఆయనను బ్రాహ్మణుడుగా అంగీకరించడం కూడా “మద్రాస్ విడో మ్యారేజ్ అసోసియేషన్” వారి ఆలోచనలో ఉంది.37

సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు

ఆ యేడు మే నెలలో తొలి వితంతు వివాహ దంపతులను వెంటబెట్టుకొని సతీసమేతంగా వీరేశలింగం మద్రాసు చేరాడు. మద్రాసులో వీరికి గొప్ప అతిథి మర్యాదలు జరిగాయి. వీరేశలింగం క్రిస్టియన్ కాలేజి ఆండర్సన్ హాలులో, ఇతర సమావేశాల్లో స్త్రీ పునర్వివాహ సమస్య మీద ఉపన్యసించాడు. ఆ రోజుల్లోనే కొక్కొండ వెంకటరత్నం, వేదం వేంకటరాయశాస్త్రి సంస్కరణను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు చేశారు. తెలుగు బ్రాహ్మణులు వీరేశలింగం పాల్గొన్న సభల్లో సంస్కరణను వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు.38

వీరేశలింగం మద్రాసుకు రాకముందే స్త్రీ పునర్వివాహాన్ని బలపరచేవారెవరో తెలుసుకోడానికి చెంచలరావు, రఘునాథరావు సహపంక్తి భోజన వివరాలను పత్రికలలో ప్రకటించారు. ఈ సందర్భంలో 'హిందూ' పత్రికలో రోజూ రెండు మూడు ఉత్తరాలు ప్రచురింపబడుతూ వచ్చాయి. అవి సంస్కరణ వాదులకు ప్రోత్సాహం ఇచ్చేవి కాదని వీరేశలింగం స్వీయచరిత్రలో రాశాడు. 'పేరుగల'వారు ఇరవై ముప్పైమంది ఆహ్వానాన్ని అంగీకరిస్తూ ఉత్తరాలు రాశారు. చివరకు అంత విశాలమైన మద్రాసు మహానగరంలో సహపంక్తి భోజనంలో పాల్గొన్నవారు అయిదుగురు మాత్రమే.39 ఈ సంఘటన గురించి వీరేశలింగం స్వీయచరిత్రలో ఈ విధంగా రాశాడు. “దేశాభిమానులయిన సంస్కార ప్రియులందరకును నిర్ణీత దినమున సంస్కార భోజనమునకు దయచేయ వలసినదని బహు దినములకు ముందుగానే ఆహ్వాన పత్రికలు పంపిరి. వానికి బదులు వ్రాయుటకే కొందరు సంస్కార ప్రియులకు తీరిక కాలేదు. పలువురు కార్యాంతర భారములచేత తాము రాలేక పోయినందుకు విచారములు తెలుపుచూ క్షమాపణలు చేసిరి. సబుజడ్జిగా నుండిన గణపతయ్య గారొక్కరు మాత్రమాహ్వాన మంగీకరించి రాఁగలిగిరి. అప్పుడు... ఆ విందుకు వచ్చినవారు వివాహదంపతులుగాక, రఘునాథరావుగారును, చెంచలరావు పంతులుగారును, గణపతయ్యగారును, దంపూరు నరసయ్యగారును, మన్నవ బుచ్చయ్యపంతులుగారును, నేనును గలసి సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు. ఈ యాఱుగురితోను విందు జయప్రదముగా ముగిసిన తర్వాత .......”40

"సబుజడ్జిగా నుండిన గణపతయ్య గారొక్కరు మాత్రమే ఆహ్వానమంగీకరించి రాగలిగిరి” అని వీరేశలింగం రాయడంచేత, సంస్కారభోజనానికి వచ్చిన అతిథి ఆయన ఒక్కరే అని తేలుతుంది. నరసయ్యతో సహా మిగిలిన నలుగురు సంస్కార భోజనం ఏర్పాటు చేసిన కార్యకర్తలని స్పష్టమవుతుంది. ఆనాటి మద్రాసు పత్రికలు ఈ సంఘటలను గురించి రాస్తూ "Six Reformers" అని తరచుగా పేర్కొన్నాయి. వీరేశలింగం ఈ పత్రికల నుంచి స్ఫూర్తిని పొంది స్వీయచరిత్రలో “సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు” అని వర్ణించి ఉంటాడు.

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించి సంవత్సరం అయింది. ఈ కాలంలోనే మన్నవ బుచ్చయ్యతో స్నేహం బలపడి ఉండాలి. మొత్తం మద్రాసు మహానగరంలో విద్యావంతులెవరూ ధైర్యంగా ముందుకురాని ఈ సంస్కార భోజనంలో నరసయ్య పాల్గొన్నాడు. బ్రహ్మ సమాజ సంబంధాలు, సంస్కరణపట్ల గాఢమైన నిబద్దత ఆయన సహపంక్తి భోజనంలో పాల్గొనేటట్లు చేసి ఉంటాయి.

మద్రాసు సంస్కార భోజనంలో పాల్గొన్న వారి కష్టాలు తర్వాత కొద్దికాలానికే మొదలయ్యాయి. రఘునాథరావు, గణపతయ్యరు, చెంచలరావు అందరూ పెద్ద ప్రభుత్వోద్యోగులు గనుక వెంటనే స్వకులంవారి నుంచి అంతగా వ్యతిరేకత ఎదురై ఉండదు.41 సంస్కార భోజనంలో పాల్గొన్న రెండు మూడు నెలలకే రఘునాథరావు, చెంచలరావు మెత్తబడి ఒక అడుగు వెనక్కువేసి సంప్రదాయ వాదుల మెప్పు పొందడానికి ప్రయత్నించారు. రాజమండ్రిలో శంకరాచార్యులు వీరేశలింగంతోబాటు ఆత్మూరి లక్ష్మీనరసింహాన్ని వెలివేశాడు. నరసింహం శంకరాచార్యులమీద రాజమండ్రి న్యాయస్థానంలో కేసువేశాడు. కేసు శంకరాచార్యులకు అనుకూలం అయింది. తర్వాత నరసింహం మద్రాసు హైకోర్టులో అపీలు చేశాడు. రఘునాథరావు, చెంచలరావు శంకరాచార్యుల మీద హైకోర్టులో అపీలు చేయడాన్ని ఖండించి సంప్రదాయవాదుల ఆగ్రహాన్ని చల్లబరచడానికి ప్రయత్నించారు.42 మన్నవ బుచ్చయ్య, నరసయ్య ఇద్దరు తెలుగు స్మార్త బ్రాహ్మణులు. వీరి మీద చర్య తీసుకోవడానికి కంచి పీఠాధిపతికి అవకాశం ఉంది. బుచ్చయ్య అప్పుటికే 'బ్రాహ్మో' గా పరివర్తన చెందినట్లుంది. “ఆ రోజుల్లో బ్రహ్మసమాజంతో ఎటువంటి సంబంధం పెట్టుకున్నా సనాతన హిందువులు హీనంగా చూసేవారు”.43 బహుశా వీరిద్దరూ అప్రకటిత వెలికి గురి అయ్యారేమో తెలియదు.

బహిష్కరణ

సంస్కార భోజనంలో పాల్గొన్న ఏడాది తర్వాత ఈ “ఆరుగురు సంస్కర్తలను” పీఠాధిపతులు వెలివేసినట్లు 'మద్రాస్ టైమ్స్' రాసింది.44 ఈ బహిష్కరణ వెనుక ఒక సంఘటన, ఒక తక్షణ కారణం ఉంది. చెంచలరావు, రఘునాథరావుల ఆహ్వానం అంగీకరించి వీరేశలింగం ఎనిమిదవ వితంతు వివాహం మద్రాసులో జరపడానికి నిశ్చయించాడు. అయితే చివరి నిమిషంలో ఇద్దరూ వెనుకంజ వేశారు. మద్రాసు వితంతు పునర్వివాహ సమాజ సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించామని, సమావేశానికి హాజరైన సభ్యులలో బ్రాహ్మణులు వివాహానికి వచ్చినా, పెళ్ళిభోజనం చేయడానికి సిద్ధంగా లేనందువల్ల మద్రాసులో ఈ వివాహం చేయడం 'అవివేకచర్య' గా భావిస్తున్నట్లు రఘునాథరావు వీరేశలింగానికి తెలియజేశాడు. వివాహం మదరాసులోనే చేయాలనే పట్టుదలతో పెళ్ళిబృందాన్ని వెంటబెట్టుకొని వీరేశలింగం మద్రాసు వచ్చాడు. అయిష్టంగానే రఘునాథరావు పెళ్ళి ఏర్పాట్లు చేశాడు. మద్రాసులో జరుగుతున్న తొలి పునర్వివాహం గనుక వందమందిపైగా పెళ్ళికి వచ్చారు. వీరిలో మద్రాసు వితంతు పునర్వివాహ సంఘసభ్యులు, విద్యార్థులు ఉన్నారు. వేడుక చూడవచ్చినవారిలో కొద్దిమంది మాత్రమే వధూవరులతో కలిసి పెళ్ళి భోజనం చేశారు. పెళ్ళిభోజనానికి “రఘునాథరావు మొదలైన ప్రముఖులు” రాని సంగతి పత్రికలలో ప్రకటించమని కొందరు యువకులు పట్టుపట్టినా, తానాపని చెయ్యలేదని వీరేశలింగం స్వీయచరిత్రలో పేర్కొన్నాడు.45

ఆనాటి మద్రాసు పత్రికలు ఈ పెళ్ళిముచ్చట్లను గురించి వివరంగా రాశాయి. పెళ్ళి ఆడంబరంగా జరిగినట్లు, పెళ్ళి ఊరేగింపు మైలాపూరు బ్రాహ్మణ వీధి గుండా సాగినట్లు వర్ణించాయి.46

"This stirred the ire of the religious heads who promptly excommunicated six reformers who had participated in a dinner given to the married couple. An attempt to settle the differences amicably at a conference in September 1884 failed, owing to the insistence of the Head Priest of Triplicane to be the sole judge of the discussion" అని సుందరలింగం పేర్కొన్నాడు. ఈ విషయాలను ఆయన మద్రాస్ టైమ్స్ 1883 జూన్ 11, 1884 సెప్టెంబరు 9 సంచికల నుంచి కోట్ చేశాడు.47

“ఈ బహిష్కరణ తర్వాత చెంచలరావు, రఘునాథరావుగారును పెండ్లి భోజనములు చేయకపోయినను, కులమువారైన మాధ్వులు చెన్నపురిలోని ఎనిమిదవ వివాహానంతరము వారిని కొంత బాధింపసాగిరి. వారి యాచార్యుడైన యుత్తరాదిస్వామి చెన్నపురికి వచ్చి కొంత కాలమచ్చట వాసమేర్పరుచుకొనిరి” అని పేర్కొనడమేకాక, రఘునాథరావు, చెంచలరావు ప్రాయశ్చిత్తం చేసుకొన్నసంగతి వీరేశలింగం స్వీయచరిత్రలో పేర్కొన్నాడు.48 వితంతు వివాహాలను ప్రోత్సహించవద్దని పీఠాధిపతి చేసిన ఆదేశాన్ని అంగీకరించి, రఘునాథరావు, చెంచలరావు పీఠాధిపతితో రాజీపడినట్లు ఆనాటి పత్రికల రాతలవల్ల తెలుస్తుంది.49

రఘుపతి వెంకటరత్నం

1885 జనవరి లో వీరేశలింగం మద్రాసులో వితంతు వివాహాల మీద ఉపన్యసించాడు. ఈ సందర్భంలో ఆయనకు ఇద్దరు బాల వితంతువులకు వివాహం చేసే అవకాశం లభించింది. మద్రాసులో పెళ్ళిళ్ళు జరిపిస్తే తాము హాజరు కావలసివస్తుందని, పెళ్ళిళ్ళు వేరొకచోట జరిపిస్తే పెళ్ళిళ్ళకు వెళ్ళలేదనే అపవాదు తప్పుతుందని, తాము సంస్కరణ పక్షం నుంచి వైదొలగినట్లు తెలిస్తే, ఉద్యమానికి నష్టం వాటిల్లవచ్చని రఘునాథరావు, చెంచలరావు వీరేశలింగానికి నచ్చచెప్పి, పెళ్ళిళ్ళు బళ్ళారిలో జరిగించేటట్లు ఒప్పించారు. ఈ ఏర్పాటులో మన్నవ బుచ్చయ్య, రఘుపతి వెంకటరత్నం వీరేశలింగానికి అండగా ఉన్నారు.50

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ప్రారంభించడం, రఘుపతి వెంకటరత్నం కళాశాల విద్యకోసం మద్రాసులో అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి. అప్పుడు రఘుపతి వెంకటరత్నం వయసు ఇరవై సంవత్సరాలు. ఆయన 1881-85 మధ్య ఉన్నతవిద్య అభ్యసిస్తూ మద్రాసులో ఉన్నాడు. 1881లో ఎఫ్.ఏ చదువుతూ, పండిత శివనాథశాస్త్రి ఉపన్యాసాలు విని బ్రహ్మసమాజంవైపు ఆకర్షించబడినట్లు, బ్రహ్మసమాజ కార్యకర్తగా పరివర్తన చెందడంలో మన్నవ బుచ్చయ్య ప్రోత్సాహం ఉన్నట్లు ఆయన ఆత్మకథలో వివరించాడు.51 వెంకటరత్నం కళాశాలవిద్య కొనసాగిస్తూనే బ్రహ్మసమాజ ఆశయాలను ప్రచారంచేశాడు. బ్రహ్మసమాజ భవన నిర్మాణానికి కృషి చేశాడు. సాంఘిక స్వచ్ఛతా ఉద్యమం ప్రారంభించి, ముందుకు తీసుకొని వెళ్ళాడు. వ్యక్తిగత జీవితంలో నిర్మలమైన నడవడిక, మద్యపానానికి దూరంగా ఉండడం, కళావంతుల వ్యవస్థ రద్దుకు కృషిచేయడం ఈ స్వచ్ఛతా ఉద్యమం ప్రధాన ఆశయాలు. ఈ ఉద్యమం బలపడి ప్రెసిడెన్సీలోని ఇతర పట్టణాలకు వ్యాపించింది. వెంకటరత్నం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి పట్టాపుచ్చుకున్న తర్వాత, “సంవత్సరంపాటు ది పీపుల్స్ ఫ్రెండ్, బ్రహ్మ ప్రకాశిక, దిఫెలో వర్కర్‌లలో” తన పత్రికావ్యాసంగం కొనసాగించాడని ఏభై ఏళ్ళ క్రితమే డాక్టర్ వి.రామకృష్ణారావు రికార్డు చేశాడు.52 వెంకటరత్నం పీపుల్స్ ఫ్రెండ్ సంపాదక వర్గంతో సన్నిహితంగా ఉండి రచనలు చేసినట్లు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ పేర్కొన్నాడు.53 నరసయ్య బ్రహ్మసమాజ కార్యకర్త, సంస్కరణోద్యమ కార్యకర్త కాబట్టే వెంకటరత్నం సాంఘిక స్వచ్ఛతా ఉద్యమానికి పీపుల్స్ ఫ్రెండ్‌లో చోటు కల్పించాడు. బ్రహ్మసమాజంతో, సంఘ సంస్కరణ ఉద్యమంతో ఉన్న సంబంధాలే నరసయ్యను, మన్నవ బుచ్చయ్యను, వెంకటరత్నాన్ని కలిపాయి. బ్రహ్మసమాజ సంబంధాలవల్లే నరసయ్యకు బెంగాలులోని మేధావులతో పరిచయాలు ఏర్పడ్డాయి.54 వెంకటరత్నం జర్నలిజం తొలి పాఠాలు నరసయ్య వద్ద నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. నరసయ్య, వీరేశలింగం మధ్య జరిగిన 'కరస్పాండెన్సు' తాను చదివినట్లు, వెంకటరత్నం పీపుల్స్ ఫ్రెండ్‌లో పనిచేసినట్లు నరసయ్య మనుమడు కృష్ణమూర్తి చెప్పడం కూడా ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తుంది.

నూతన సమాజ నిర్మాణం కోసం నరసయ్య

నరసయ్య బ్రహ్మ సమాజ వార్తలను, సంస్కరణోద్యమ వార్తలను, మహిళాభ్యుదయానికి సంబంధించిన వార్తలను పీపుల్స్ ఫ్రెండ్‌లో తరచుగా ప్రచురించినట్లు నిరూపించడానికి ఆధారాలున్నాయి. 1883 డిసంబరు 1వ తారీకు సంచికలో ఇటువంటి విషయాలు కనిపించాయి. కేశవచంద్రసేన్ ఆరోగ్యం మీద ఒక వార్త ఉంది. ఇదే సంచికలో నరసయ్య పండిత రమాబాయి మీద రెండు కథనాలు ప్రచురించాడు. మాక్స్‌ముల్లరు ఆహ్వానాన్ని పురస్కరించుకొని రమాబాయి ఆక్స్‌ఫర్డ్ వెళ్తుంది. అక్కడ కవి సమ్మేళనాల్లో పాల్గొని ఆశువుగా కవిత్వం చెపుతుంది. ఆమె అసాధారణ ధారణాశక్తి, నిర్దుష్టమైన సంస్కృత భాష ఉచ్చారణకు ఆక్స్‌ఫర్డ్ మేధావులు అబ్బురపాటు చెందుతారు. క్లిష్టమైన ఛందస్సుల్లో ఆశువుగా కవితలల్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె సముద్రయానం చేసిన తొలి భారతీయ మహిళ అని నరసయ్య ప్రశంసిస్తాడు. పండిత రమాబాయిని గురించిన మరొక కథనం కూడా ఇదే సంచికలో కన్పిస్తుంది. ఇంగ్లాండులో ఉన్నప్పుడు అక్కడి పత్రిక ప్రచురించిన ఆమె ఆత్మకథను నరసయ్య ఇదే సంచికలో పునర్ముద్రించాడు. రమాబాయి తండ్రి స్త్రీ విద్యాభివృద్ధికోసం కృషి చేస్తాడు. ఆయన తన భార్యకు సంస్కృతం నేర్పుతాడు. కుమార్తె రమాబాయి విదుషీమణి అవుతుంది. బాల్యవివాహాలు విద్యాభ్యాసానికి ఆటంకమనే కారణంతో తల్లిదండ్రులు తనకు బాల్యవివాహం చెయ్యలేదని ఆమె వివరిస్తుంది. రమాబాయి అక్కకు సంప్రదాయ పద్ధతిలో బాల్యవివాహం జరుపుతారు. ఆ వివాహం విఫలమవుతుంది. రమాబాయి కథ చివర, ఈ అంశాలను ప్రస్తావిస్తూ నరసయ్య పాఠకులకు ఈ విధంగా విజ్ఞప్తి చేశాడు. "We hope this will have the effect of stipulating and encouraging the majority of Hindu fathers to stamp out the system of early marriages from this country. The case of Ramabaye's sister was only a typical one." ఆ రోజుల్లో దేశీయుల యాజమాన్యాలలోని పత్రికల్లో రమాబాయికి అనుకూలంగానో, ద్వేషపూరితంగానో మాత్రమే వార్తలు ఉండేవి.55

1886 జనవరి 30 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఆర్. రఘునాథరావు, పనప్పాకం అనంతాచార్యులు హిందూ వివాహచట్టం మిద రాసిన చిన్నపుస్తకాలు, వీరేశలింగం రచనలు “పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరి" ద్వారా అమ్ముతున్నట్లు ఒక ప్రకటన ఉంది. "పేపర్స్ ఫర్ అవర్ ఎడ్యుకేటెడ్ కంట్రీమెన్ (Papers for our educated countrymen) శీర్షిక కింద “విడో రీ మేరేజస్”, “సీతా అండ్ రామా - ఎ టేల్ ఆఫ్ ది ఇండియన్ ఫేమిన్” (Sita and Rama... a Tale of the Indian famine) అనే ఇంగ్లీషు దీర్ఘ కవిత, ఇతర పుస్తకాలు విక్రయిస్తున్నట్లు ఉంది. ఇందులో మొదటిది సంస్కరణకు, రెండవది దేశ పరిస్థితికి సంబంధించింది. పీపుల్స్ ఫ్రెండ్ పుటలన్ని ఇటువంటి వార్తలతో, వ్యాసాలతో నిండినట్లు అనిపిస్తుంది.

“మహారాజ రాజశ్రీ కందుకూరు వీరేశలింగంపంతులుగారు ధైర్యసాహసములతో అనేక హిందూ స్త్రీ పునర్వివాహములను చేయుచున్నారు గనుక సి.యస్.ఐ. బిరుదుకు తగుదురని పీపుల్స్ ఫ్రెండ్ పత్రికాధిపతులు వ్రాయుచున్నారు.” అని వీరేశలింగం సేవలను ప్రశంసిస్తూ నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రకటించిన అభిప్రాయాన్ని 1889 మార్చి ఒకటవ తారీకు హిందూ జనసంస్కారిణి పునర్ముద్రించింది. ఈ ప్రశంస వల్ల కూడా నరసయ్య వీరేశలింగం వెంట, సంస్కరణవాదుల జట్టులో ఉన్నట్లు తెలుస్తుంది. “వీరేశలింగంగారి మార్గంలోనే వెంకటగిరిలో కొన్ని వితంతు వివాహాలను నరసయ్యగారు జరిపించార”ని బంగోరె పేర్కొన్నాడు.56 "He is a member-Veeresalingam Pantulu Saranalaya" అని బంగోరె తన నోట్సులో రాసి, పక్కన 'రాధమ్మ' అనే పేరు గుర్తు రాశాడు. “నరసయ్య వెంకటగిరి అరవవీధిలో ఉండే పురాణం వెంకటసుబ్బయ్య మరదలు రాధమ్మకు వీరేశలింగంగారి వద్ద పునర్వివాహం జరిపించారు” అని కమలమ్మ (నరసయ్య మనుమడు శేషయ్య భార్య) చెప్పింది. “నరసయ్య మద్రాసులో జరిగిన వితంతు వివాహాల్లో పాల్గొన్నారు. వెంకటగిరిలోనో, మద్రాసులోనో, మా ద్రావిడుల అమ్మాయికి పునర్వివాహం జరిపించారు. ఆమె సంతతి ఇప్పుడు నాగపూరులో ఉంటున్నారు” అని నరసయ్య మనుమడు కృష్ణమూర్తి వివరించాడు.

ఏజ్ ఆఫ్ కన్‌సెంట్ బిల్లు ( Age of Consent Bill ) ను ఎంతోమంది సంస్కరణవాదులు సమర్థించినా, తొలితరం నాయకులు టి. మాధవరావు, ఎస్. సుబ్రహ్మణ్యఅయ్యరు, చెంచలరావు మొదలైనవారు సమర్థించలేదు. వీరిలో కొందరికి అప్పటికే దివ్యజ్ఞాన సమాజంతో సంబంధాలు ఏర్పడ్డాయి. కొందరి మీద ఆ సమాజ ప్రభావం ఉంది. మద్రాసు బ్రాహ్మణులు తమ కుర్రవాళ్ళను సంస్కరణోద్యమ ప్రభావం నుంచి కాపాడుకోడానికి దివ్యజ్ఞాన సమాజాన్ని అడ్డుపెట్టుకున్నారు.57 వీరేశలింగం, నరసయ్య దివ్యజ్ఞాన సమాజాన్ని ఎద్దేవా చేశారు. "Avoid the absurd claims of the Theosophist and other shams" అని పరిహాసం చేస్తూ రాసిన వాక్యాలను నరసయ్య 1886లో పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రచురించాడు.58 థియోసఫిస్టు దివ్యజ్ఞాన సమాజం వారి పత్రిక. నిజమైన సంస్కరణవాదులకు దివ్యజ్ఞానసమాజం బలమైన ప్రత్యర్ధి, బద్ధ శత్రువు. 1897లో నరసయ్య చేసిన కన్యాశుల్క సమీక్షలో తాను ఎవరి వెంట ఉన్నది స్పష్టం చేశాడు. ఆయన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్లు ఆ వ్యాసంలో వెల్లడి అయ్యాయి.

నరసయ్య సంఘ సంస్కరణ నిబద్ధతను నిరూపించడానికి లభించిన ఆధారాలు చాలా పరిమితమైనవి. ఆయన సంస్కరణవాదుల వెంట ఉన్నాడని చెప్పడానికి ఈ రుజువులు చాలు. పీఠాధిపతుల బెదిరింపులు, బహిష్కరణలకు నరసయ్య భయపడి ఉంటే, పత్రికను సంస్కరణకు సంబంధించిన వార్తలతో నింపడంగాని, వెంకటరత్నం రాసిన వ్యాసాలు ప్రచురించడంగాని, వీరేశలింగాన్ని సి.ఎస్.ఐ. బిరుదంతో సత్కరించమని ప్రభుత్వాన్ని అర్ధించడంగాని చేసి ఉండడు.

పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయాలు

1. టూ పిక్చర్స్ సంపాదకీయం

1876లో సురేంద్రనాథబెనర్జీ “ఇండియన్ అసోసియేషన్” (Indian Association) స్థాపించాడు. విద్యావంతులైన కలకత్తా మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వేదిక అయింది. ఈ సంస్థద్వారా బ్రిటిష్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజాభిప్రాయాన్ని సమీకరించారు. లార్డ్ రిప్పన్ (Lord Ripon) వైస్రాయిగా ఉన్నకాలంలో 1883లో ఇల్‌బర్ట్ బిల్లు తయారు చేశారు. వైస్రాయి సలహా మండలిలో 'లా మెంబరయిన' (law member) కోర్ని ఇల్బర్ట్ ("Sir Courtney illbert") క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Criminal Procedure Code) కు సవరణ ప్రతిపాదించాడు. చట్టంముందు అందరూ సమానులే అని చెప్పడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. బ్రిటిష్ పౌరులైన యూరోపియన్లు అంతవరకూ అనుభవిస్తూ వచ్చిన ప్రత్యేక సౌకర్యాలను తొలగించడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. సివిల్ సర్వీసుల్లో ఉన్న యూరోపియన్ మేజిస్ట్రేట్లకు (European Magistrates) భారతీయులను క్రిమినలు చట్టాల ప్రకారం విచారించే హక్కు ఉన్నట్లే, సివిల్ సర్వీసుల్లో ఉన్న భారతీయ జిల్లా మేజిస్ట్రేట్లకు యూరోపియన్లను విచారించే అధికారం లేదు. ఇల్బర్ట్ బిల్లు చట్టం అయితే వారికి ఈ అధికారం లభిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చినా దాని పరిధి ఒక్క బెంగాల్ పరగణాకు మాత్రమే పరిమిత మవుతుంది. ఆ రోజుల్లో ఐ.సి.ఎస్. పరీక్ష పాసై, జిల్లా మేజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న కొద్దిమంది భారతీయులు ఆ పరగణాలో మాత్రమే ఉన్నారు. లార్డ్ రిప్పన్ ఇల్‌బర్ట్ బిల్లు ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న అసంబద్ధతను తొలగించడానికి పూనుకొన్నాడు.

బెంగాల్ పరగణాలో టీతోటల యజమానులందరూ యూరోపియన్లు. వారు భారతీయ కూలీలను హీనాతిహీనంగా చూచేవారు. దేశీయులపట్ల జాత్యహంకారంతో ప్రవర్తించి, అనేక రకాల వివక్షలు ప్రదర్శించేవారు. ఆయుధచట్టం ప్రకారం దేశీయులు ఆయుధాలు కలిగి ఉండడం శిక్షార్హమైన నేరం. యూరోపియన్లకు ఈ చట్టం వర్తించదు. యూరోపియన్ టీతోటల యజమానులు, చిన్న పెద్ద వ్యాపారులు, అడ్వకేట్లు, యూరోపియన్ పత్రికా సంపాదకులు, ఇల్‌బర్ట్ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బిల్లు పాసైతే భారతీయ మేజిస్ట్రేట్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తారు, యూరోపియన్లు ఈ దేశంలో ఉండడం అసాధ్యమౌతుందని పసలేని వాదన లేవదీశారు. భారతదేశంలోని యూరోపియన్ సమాజం కలిసి కట్టుగా ఉద్యమం కొనసాగించి, బ్రిటిష్ సామ్రాజ్యం ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చినట్టు ఒక అభిప్రాయాన్ని కలిగించింది.

భారతీయ పత్రికలు, మేధావులు, విద్యావంతులు ఇల్‌బర్ట్ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లును మార్పులేకుండా యథాతథంగా ఆమోదించాలంటూ ప్రజాభిప్రాయాన్ని సమీకరించారు. బిల్లులో ప్రతిపాదించిన మంచి విషయాలను గుర్తించి, భారతీయ పత్రికలు ఈ బిల్లు చట్టం కావాలని రాశాయి. పార్లమెంటులో మంత్రివర్గంమీద బిల్లు ఉపసంహరించుకోవాలని శ్వేతజాతీయులు తమ పలుకుబడినంతా ఉపయోగించారు. చివరకు కొన్ని సవరణలతో ప్రభుత్వం బిల్లు పాసుచేసింది. ఇందులో భారతీయ నేరస్థులకు లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు యూరోపియన్ నేరస్తులకు కలిగించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన యూరోపియన్ వర్గాలు ఈ విధంగా తమ జాత్యహంకార స్వభావాన్ని నిలబెట్టుకోగలిగాయి. దీంతో భారతీయులకు బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయి. వారి ఆత్మగౌరవం మేలుకొన్నది. ఇల్‌బర్టు బిల్లుకు వ్యతిరేకంగా యూరోపియన్ వర్గాలు ఉద్యమం సాగిస్తున్న రోజుల్లో, బిల్లు సవరణలతో చట్టం కాబోతున్న సమయంలో 1883 డిసంబరు 1వ తేది పీపుల్స్ ఫ్రెండ్‌లో నరసయ్య “టూ పిక్చర్స్” (Two Pictures) పేరుతో ఒక సంపాదకీయం రాశాడు.

కలకత్తా టౌన్‌హాలు సభ

1883 ఫిబ్రవరి 28న కలకత్తా టౌన్‌హాల్లో శ్వేతజాతీయులు పెద్దఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేశారు. టీతోటల యజమానులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు అసంఖ్యాకంగా ఈ సమావేశానికి తరలివచ్చారు. ఆంగ్లో ఇండియన్లు, (Anglo Indians) అర్మీనియన్లు (Armenians) గూడా పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టౌనహాలు జనంతో కిటకిట లాడింది. వక్తలు ఆవేశంతో ఊగిపోతూ జాత్యహంకారాన్ని రెచ్చగొడుతూ ఉపన్యాసాలు చేశారు. కలకత్తా హైకోర్టులో బారిస్టరు ప్రాక్టీసు (Barrister practice) చేస్తున్న ఫరంగీ బ్రాన్‌సన్ (Feringhee Branson) భారతీయ న్యాయాధిపతులను, మేజిస్ట్రేట్లను దూషిస్తూ అసహ్యంగా, అనాగరికంగా పొగరుబోతుతనం ఉట్టిపడేటట్లు మాట్లాడాడు. ఆ సభ జరిగిన తరువాత భారతీయ వకీళ్ళు, అడ్వొకేట్లు అతనితో కలిసి పనిచేయడానికి నిరాకరించారు. భారతీయ పత్రికలు ఆయన ఉపన్యాసం మీద తీవ్రంగా స్పందించాయి. బ్రాన్సన్ తను వాడిన భాష సరియైనది కానందుకు క్షమాపణ చెప్పాడుగాని, మాట్లాడిన విషయాలకు పశ్చాత్తాపం ప్రకటించలేదు.59 ఇతను ఇంగ్లాండు వెళ్ళినప్పుడు బర్మింగ్ హేం (Birmingham) లో మర్యాద తొణికిసలాడే కంఠస్వరంతో ఎంతో సంస్కారిలాగా ప్రసంగించాడు. నరసయ్య "టూ పిక్చర్స్” లో బ్రాన్సన్ వికృత నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు. హిందువులకు, యూరోపియన్లకు మధ్య నెలకొనిఉన్న స్నేహభావాన్ని దురాగ్రహంతో భంగపరుస్తున్నాడని అతణ్ణి నిందించాడు. ఈ సంపాదకీయం తెలుగు అనువాదం :-

రెండు చిత్రాలు

“కొన్ని నెలల క్రితం జరిగిన సంగతి. ఈ ఉపన్యాసకుడు కలకత్తా టౌన్‌హాల్లో మాట్లాడుతూ బెంగాలీ బాబులను వట్టి చాడీకోరులని, నీచులని, దుష్టులని హేళన చేశాడు. వారు వట్టి అవినీతిపరులైన మాయగాళ్ళని, అసమర్థులైనా మహా నైపుణ్యం ఉన్న వారిలాగా నటిస్తారని నిందించాడు. ఈ ఉపన్యాసకుడే బర్మింగ్‌హాంలో వేదికమీద తెలివిగా ఇంకో యుక్తిని ప్రదర్శించాడు. ఈసారి టోకున తిట్లకు దిగలేదు. మోతాదు మించకుండా అపహాస్యం చేశాడు. అసూయాపరుడైన కవి అలెగ్జాండర్ పోప్ తన మిత్రుడు ఎడిసన్‌ను చాటుమాటు మాటలతో వ్యంగ్యంగా ప్రస్తావించినట్లు, అస్పష్టంగా పొగడుతున్నట్లే నిందకు పూనుకొన్నాడు. మాకు “ఈ రెండు చిత్రాలు” వినోదం కలిగిస్తున్నాయి. పోలికల్లో బర్మింగ్‌హేం బ్రాన్సన్‌కు, కలకత్తా బ్రాన్సన్‌కు పొంతనే లేదు. కలకత్తా బ్రాన్సన్ చాలా కీతాగా కనిపిస్తాడు. మొక్కట్లు ఒకటేగాఉన్నా ధోరణి వేరుగా ఉంది. బిగిసిన పిడికిళ్ళతో, భయం కొలిపే హావభావాలతో, ఉద్రేకం, అపహాస్యం కలగలిసిన కంఠస్వరంతో, నిగ్రహంలేని తీవ్ర పదజాలంతో, నింద తొంగిచూచే విశేషణాలతో కలకత్తా టౌన్‌హాలు బ్రాన్సన్ ఫోటోగ్రాఫ్ మన ముందు నిలుస్తుంది. సుతిమెత్తని పొగడ్తలతో “మాగ్నాకార్టా” (Magnacharta) సహకారంతో, వ్యక్తిత్వానికి, స్వేచ్ఛకు సంబంధించిన ప్రాచీన ఆలోచనలతో సంయమనం, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ, నెమ్మదితనం తొణికిసలాడే భాషలో, కలకత్తా ఉపన్యాసంలోని డాంబిక పదజాలం లేకుండా మాట్లాడే వ్యక్తిగా బర్మింగ్‌హాం చిత్రంలో కనిపిస్తాడు !

ఇంతకూ అసలీ బ్రాన్సన్ ఎవరు? ఇతగాడు కలకత్తా బార్లో (Calcutta Bar) సభ్యుడు. ఆ హోదా ఇతనికి ఎంతో గౌరవం కలిగించింది. ఇతను మద్రాసు వాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువు సంధ్యలు నేర్చాడు. మొదట వెపేరీ గ్రామర్ స్కూలు (Vepery Grammar School) లో చదివాడు. హాలీ (Mr.Halley) కాలంలో డోవిటన్ కాలేజి (Doveton College) విద్యార్థి. తర్వాత ఇంగ్లాండు వెళ్ళాడు. తన సంగతి మద్రాసులో అందరికీ తెలుసు గనుక, తెలివిగా కలకత్తా వెళ్ళి అక్కడ బార్లో సభ్యుడయ్యాడు. హుగ్లీ పెద్దమనుషులు ప్రసిద్ధికెక్కిన ఇతని ఉపన్యాసం విని పెద్దగా కేకలువేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరచారు. సర్ ఛార్లెస్ ట్రెవిలియన్ (Sir Charles Trevelyan) కు ఎంతో “గౌరవప్రదమైన” కూవంనది ప్రవహించే చెన్నపట్నంలో అయితే ఈ ఉపన్యాసాన్ని అసలు సహించి ఉండరు. ఇతని తండ్రి ఫారో అండ్ కో (Pharoah & Co.,) లో భాగస్వామి. జాన్ బ్రూస్ నార్టన్ (John Bruce Norton) సంపాదకత్వంలో ఎథీనియం పత్రిక వెలువడుతున్న రోజుల్లో ఫారో అండ్ కో ఆ పత్రికను ప్రచురించేది. ఘనత వహించిన ఈ టౌన్‌హాలు సిసిరో (Cicero) బర్మింగ్‌హేంలో అశ్లీలభాగాలు తొలగించబడి, నిర్దుష్టంగా రూపొందించబడిన ప్రచురణ వంటి సిసిరో - ఇంతా చేస్తే మదరాసీ. తానిప్పుడున్న స్థితికి ఈ పట్నం నుంచే ఎదిగినందుకు మేము ఎంతగానో గర్విస్తున్నట్లు ప్రకటిస్తున్నాము. తన గంభీరమైన వాక్కులతో మాగ్నాకార్టా గురించి, ప్రాచీనమైన హక్కుల గురించి ఉపన్యసించి కలకత్తా యూరేషియన్లను (Eurasians) యూరోపియన్లను, ఒక మదరాసీగా మంత్రముగ్ధులను చెయ్యలేదని తెలుసుకొన్నపుడు పశ్చాత్తాపం వంటి భావం ఒకటి మాకు కలిగింది. స్థిమితంగా ఆలోచించి ముసాయిదా బిల్లు మంచి చెడ్డలను అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్న శ్రోతలను ఉద్దేశించి, జాతి ద్వేషం హృదయాల్లో నాటుకొని పోయి ఉద్విగ్న స్థితిలో ఉన్న శ్రోతలను ఉద్దేశించి, తీవ్రమైన భాషలో ఈ బార్ సభ్యుడు చేసిన ఉపన్యాసం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

బ్రాన్సన్ స్వల్ప విషయాలకు లేనిపోని ఆర్భాటంచేసి, అనాగరికంగా ప్రవర్తించడానికి ఎటువంటి కారణంలేదని స్పష్టంగా తెలుస్తూంది. తనలాగే ఈ దేశంలో జన్మించి, ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చి, ఇంగ్లాండులో వృత్తిపరమైన అర్హతలు సంపాదించుకొన్నవారు, అవినీతిపరులైన బాబులను గురించి కలవరపాటు చెందనవసరం లేదని ఇప్పటిదాకా తెలుసుకొని ఉండకపోతే ఇప్పుడైనా గ్రహించాలి. టౌన్‌హాల్లో ఇతని ప్రవర్తన తాము ఉత్తమ జాతివారమని ప్రదర్శించుకొనే గర్వంగా మేము భావిస్తున్నాము. ఇతనికున్న నేపథ్యం వంటి నేపథ్యం నుంచి వచ్చి ఇతని మాదిరే విద్యాధికులై, ఇతని మాదిరే అదృష్టవంతులైన వ్యక్తుల్లో పొడసూపే గర్వంగా దీన్ని మేము భావిస్తున్నాము. అందువల్ల బ్రాన్సన్ దురాగ్రహాన్ని ఆయన శ్రోతల ఆగ్రహం కంటే భిన్నమైనదిగా మేము పరిగణిస్తున్నాము. ఇతను పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా తాను పొందిన ప్రతి అవకాశానికి, ఈ దేశానికి రుణపడి ఉన్నాడు. ఈ దేశ ప్రజలతో కలసిమెలసి జీవించాడు. ఈ దేశప్రజల డబ్బే ఇప్పటికి ఇతని జోబిలోకి పోతూంది. ఇటువంటి వ్యక్తి కృతఘ్నతతో నిండిన, దుస్సహమైన ప్రవర్తనను మేము నిస్సంకోచంగా ఖండిస్తున్నాము. సరేలేండి, ప్రజలు "బ్రూటస్ నువ్వు కూడానా?” (et tu Brute) అని ఆశ్చర్యపోవచ్చు. ఇతని ప్రసంగంగానీ, ఇతని సోదరుడు అట్కిన్ (Atkin) ఉపన్యాసంగానీ, ఇల్బర్ట్‌బిల్లు రూపంలో ఉన్న సర్పాన్ని గాయ పరచాయేగానీ చంపలేకపోయాయి. ఈ విషయంలో హోంశాఖ (Home Authorities) వైస్రాయిని బలపరచడానికి నిశ్చయించుకొన్నట్లు తాజా వార్తలవల్ల తెలుస్తూంది. ప్రభుత్వ నిర్ణయానికి ఈ కోపోన్మాదమే కారణమయింది. వివేకం కోల్పోయి, న్యాయమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమానుషమైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెర్రి అపోహల వల్లే అన్ని వర్గాలకు అనుకూలమైన పరిష్కారాన్ని నిరాకరిస్తున్నట్లు ఈ సంఘటన సూచిస్తుంది. కాసేపు బ్రాన్సన్‌ను అట్లా ఉంచుదాం. ప్రతి రంగంలోను ఇతని కన్న మిన్న అయినవారు భారతదేశాన్ని గురించి ఏమనుకుంటున్నారో పరిశీలిద్దాం. భారతీయులను గూర్చి ఎట్లా అభిప్రాయపడుతున్నారో తెలుసుకుందాం. ముందుగా ఇటీవల మన గవర్నరుగా పనిచేసిన ఛార్లెస్ ట్రెవిలియన్‌ ప్రారంభిద్దాం. ఆయన మాటలు గుర్తించుకోదగినవి. “ఇంగ్లాండులో పోటీ పరీక్షలలో నెగ్గలేని నానారకాల యువకులు, ఆ పరీక్షలు రాయడానికి గూడా సాహసించలేనివారు, సిఫారసులు చేతబట్టుకొని భారతదేశానికి వెళుతున్నారు. వీరు పోలీసుశాఖలో నియమించబడుతున్నారు. రెవెన్యూశాఖలో డెప్యూటీ కలెక్టర్లుగా నియమించబడుతున్నారు. ఈ విధానం అన్యాయమైనది.”

పరీక్షలు పాసైన భారతీయ యువకులను ఈ పద్ధతిలోనే నియమిస్తున్నారా? లార్డ్ ట్రెవిలియన్ పేర్కొన్న ఈ పెద్దమనుషులు దేశీయ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించినపుడు వారు ఈ దేశ అవసరాలను ఇంతకన్న మెరుగైన రీతిలో పట్టించుకుంటారని భావించడం దురాశే అవుతుంది. ఈ విషయంలో లార్డ్ లారెన్సు (Lord Lawrence) ఏమంటున్నారో చూడండి.

“ఇంతకన్న విశ్వసించదగిన పదవుల్లో, ఇంకా పెద్ద జీతబత్యాలున్న విధుల్లో భారతీయులు నియమించ దగిన వారని నేను భావిస్తున్నాను. వారు ముఖ్యంగా న్యాయశాఖలో నియమించ దగిన వారు. భారతీయులు మంచి న్యాయాధిపతులుగా తయారు కాగలరని భావిస్తున్నాను.” (ఈ అక్షరాలను ఇటాలిక్స్‌లో మేమే ఉంచాము.) స్థానికులు న్యాయాధిపతులుగా నియమించబడడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నారని భారతదేశంలో విస్తృతానుభవం ఉన్న ఒక గవర్నర్ జనరలు అన్న మాటలివి. బ్రాన్‌సన్ ఆయన సభలో పాల్గొన్నవారు భారతీయులను చొరవలేని మందమతులనీ, పరిశుభ్రత లేనివారనీ భావిస్తారు. సర్ ఛార్లెస్ ట్రెవిలియన్, సర్ లారెన్స్‌ల కంటే చాలా తెలివిగలవారమని వీరు అనుకొంటారు. ఒకప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిన గౌరవనీయులైన డబ్ల్యు. ఎన్. మాసీ (W.N.,Massey) ఎస్. బార్టిల్ ఫ్రెరర్ (S.Bartle Frere) మొదలైన సమర్థుల ముందు, ఉన్నత పదవులు నిర్వహించిన అధికారుల నిశ్చితాభిప్రాయం ముందు బ్రాన్‌సన్, అతని అభిమానుల నిరాధారమైన అభిప్రాయాలు అల్పమైనవిగా, తృణప్రాయంగా కనిపిస్తాయి. వేదికలమీద, పత్రికల్లో రెచ్చగొట్టే ఇటువంటి భావాలను గురించి జాన్ స్టూవర్ట్ మిల్ (John Stuart Mill) చాలాకాలం కిందటే రాశాడు. ఈ వాక్యాలు తరచుగా ఉల్లేఖించబడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చెప్పడంవల్ల ఈ మాటలు తమశక్తిని కోల్పోవు. ఈ రోజుల్లో భారతీయులందరూ ఈ మాటల్లో అర్థాన్ని జీర్ణం చేసుకోవలసిన అవసరం ఉంది. “ఒక దేశాన్ని మరొక దేశం జయించి తన స్వాధీనంలో ఉంచుకొన్నప్పుడు, ఆ దేశసంపదను కొల్లగొట్టి సంపదలు మూటలు కట్టకుండా అందరికంటే ముందు పాలకులకు సంబంధించిన వ్యక్తులను గట్టిగా అదుపులో ఉంచాలి. ప్రధానంగా వీరివల్లే ప్రభుత్వానికి తలనొప్పి కలుగుతుంది. ఇది అనుభవం ధ్రువీకరిస్తున్న సత్యం.” ఈ మాటలు అక్షరాలా సత్యాలని ఇటీవల జరిగిన ఆందోళనలు నిరూపించడంలేదా? ఇంత తీవ్రంగా విదేశీయుడు తప్ప ఎవరు మాట్లాడారు? లార్డ్ రిప్పన్ వివేకవంతమైన విధానాలను ఎవరు నిరోధిస్తున్నారు? విదేశీయుడు తప్ప. వైస్రాయి సొంత దేశంవారు తప్ప ఎవరు అవిధేయతను రెచ్చగొడుతున్నారు? “భారత ప్రభుత్వానికి ప్రధానంగా అడ్డునిలుస్తున్నవారు విదేశీయులే” అని మహామనీషి అయిన “రెప్రజెంటేటివ్ గవర్నమెంట్” (Representative Government) గ్రంథ రచయిత అనలేదా? అందరికంటే ముందు తమవారినే అదుపులో ఉంచాలని ఈ రచయిత చెబుతున్నాడు కాదా? క్రమశిక్షణా రాహిత్యాన్ని వారే సృష్టించారు. వారే హానికరమైన వ్యక్తులు. వారి ప్రతిపాదనలను, అభిప్రాయాలను ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధేయతను రెచ్చగొడ్తారు. వారు చేస్తున్నదే ఈ అలజడంతా. ఈ దేశీయులకు హక్కులివ్వడం వారిదృష్టిలో అమానుషచర్య. వారు ఉద్యోగాలు చేస్తూ అధికారం చెలాయిస్తారు. వారి జీతబత్యాలు విస్తుపోయేంత పెద్ద మొత్తంలో ఉంటాయి. తాము విజేతలమనే భావనతో శ్రేష్ఠమైనదంతా తమకే కావాలి అంటారు. అంతా తామే ఆరగించి ఎంగిలి మెతుకులు దేశీయులకు విడిచిపెడతారు. తమ పూర్వుల ధైర్యసాహసాల తాలూకు గర్వం తలకెక్కించుకొని ఈ దేశ ప్రజలను ఏవగించుకొంటారు. ఈ ప్రజలను “ఛీ, హీనులు” (Damn, Niggers) అని అనడం న్యాయంగానే ఉందని భావిస్తారు.

ప్రజలముందు మా వాదన బలంగా ఉంచామని భావిస్తున్నాము. మా వాదనలో సత్యం ఉంది. మా వాదన విశ్వసనీయమైనది. ఈ ఆందోళన తగ్గు ముఖం పట్టినపుడుగానీ తాముసాగించిన హింస ఎంత అవివేకమైనదో ఆందోళనకారుల తలకెక్కదు. భావాల్లో, భాషలో ఈ హింసా ప్రవృత్తివల్లే ఆందోళనకారులు లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని కోల్పోయారు. బ్రాన్‌సన్ తన కలకత్తా ఉపన్యాసంలో వాడిన తీవ్రమైన భాషవల్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఈ పరిస్థితి ఎంతో దయనీయమైనదిగా మేము భావిస్తున్నాము. అతడు ఇంగ్లాండులో ఆందోళనలో పాల్గొనవలసింది; కాస్త ఆవేశం తగ్గి మనసు కుదుటపడడానికి సమయం చిక్కేది. అక్కడి వాతావరణం చల్లగా అనుకూలించేది గదా ! తాను ఎక్కడికి వెళ్ళినా తన ప్రవర్తనలో రవ్వంత ఔదార్యాన్ని చూపలేడు. అవకాశం దొరికినప్పుడల్లా ఐరిష్ జాతీయులు "స్వీట్ బ్లార్నీ” (Sweet Blarney) అని పిలిచే తన ఉపన్యాస ధోరణిని కొనసాగిస్తూ, చికాకు పుట్టించే ఈ పెద్ద మనిషిని మేము క్షమించలేము.”

ఇల్‌బర్ట్ బిల్లుకు వ్యతిరేకంగా యూరోపియన్లు, యూరేషియన్లు ఆందోళన చేసినపుడు దేశీయ పత్రికలు ఈ బిల్లుకు స్వాగతం పలుకుతూ ప్రజాభిప్రాయాన్ని పెద్దయెత్తున సమీకరించాయి. ఆంగ్లో ఇండియన్ ప్రెస్‌తో పోరాడి తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాయి. కలకత్తా టౌన్‌హాలు సభ తర్వాత భారతీయ పత్రికలు తీవ్రంగా స్పందించాయి. తెల్లవారి జాత్యహంకార ధోరణిని నిరసిస్తూ సంపాదకీయాలు రాశాయి. బ్రాన్సన్ ఇంగ్లండులో గొప్ప సంస్కారిలాగా నటిస్తూ అక్కడి సభలో ఉపన్యసించిన తర్వాత నరసయ్య “టూ పిక్చర్స్” సంపాదకీయం రాశాడు. ఈ సంపాదకీయం రాసేనాటికి నరసయ్య పత్రిక ప్రారంభించి మూడేళ్ళు. భారతీయ, యూరోపియన్ జాతులు సామరస్యంగా కలిసిమెలిసి జీవించే అవకాశం జారిపోతున్నదనే ఆవేదన ఈ సంపాదకీయంలో ఉంది. ఆవేశానికి లోనుగాకుండా వివేచించే శక్తి, వాదం వినిపించే నేర్పు, పరిణతి చెందిన రాజకీయ అభిప్రాయాలు, వైదుష్యం, వ్యంగ్యం కలబోసిన పరిహాసం ఈ సంపాదకీయానికి గొప్ప శక్తి నిచ్చాయి.

1886 జనవరి 30 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక

తమిళనాడు ఆర్కైవ్స్‌లో ఈ సంచిక భద్రపరచబడి ఉండేది. దురదృష్టవశాత్తు, ఆ ఫైలు ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఈ సంచిక తాలూకు కొన్ని ఫోటోలు (ఆర్కైవ్స్ అధికారికంగా సప్లై చేసినవి) బంగోరె పేపర్లలో లభించాయి.

పత్రిక తొలిపుటలో కలకత్తా నగల వర్తకులు కె.సి.ఆర్. దాస్ అండ్ కో వారి ప్రకటన, కలకత్తా నుంచి వెలువడే ఇంగ్లీషు వారపత్రిక "న్యూ ఇండియా” ప్రకటన, ఓరియంటల్ బాం వంటి మందుల ప్రకటనలు ఉన్నాయి. మూడవపుటలో "Do they deserve it", "Mrs. Grant Duff's advice to Europian and Eurasian lads", "Royal speech" అనే మూడు సంపాదకీయాలు ఉన్నాయి. ఈ సంచికలోనే కల్నల్ ఆల్కాట్ వ్యవసాయం మీద రాసిన వ్యాసం (Coln., Olcott on Agriculture), న్యూస్ అండ్ నోట్సు శీర్షికలో "Cost of Education in Madras" అనే వ్యాసం ఉన్నాయి.

ఈ సంచికలోనే Western Star పత్రిక నుంచి "Some Indian Newspapers" అనే కథనం పునర్ముద్రించబడింది. పత్రికల పేర్లతో ఈ కథనం సాగుతుంది. "In these Times of India great Progress is being made" అని మొదలయి "...... avoid the absurd claims of the Theosophist and other shams. A Muslim Herald is required to call the attention of his class to the want of ambition of the Musalman అని సాగి "......The Argus eyed press has been a great factor in educating the people; and in these days, life would actually be a blank, if the Madras Mail miscarries for a single day. The press is undoubtedly the People's Friend and is the Mirror of Native Public Opinion" అనే వాక్యాలతో ముగుస్తుంది. అనేక సమకాలిక పత్రికల పేర్లు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి.

2. వారికి అర్హత ఉందా : సంపాదకీయం

పందొమ్మిదో శతాబ్దంలో ప్రజాభిప్రాయాన్ని రగుల్కొల్పి, కూడగట్టడంలో పత్రికలు గొప్ప పాత్ర నిర్వహించాయి. దేశీయులు నడిపే పత్రికలు ఆదాయంపన్ను చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం 1860లో మొదటిసారి ఆదాయంపన్ను విధించినా, అయిదేళ్ళ లోపలే దాన్ని తొలగించింది. మళ్ళీ 1886లో వ్యవసాయేతర ఆదాయంమీద పన్ను విధించింది. ఈ చట్టం పరిధిలోకి కొద్దిమంది భారతీయులే వచ్చినా, పన్ను వసూళ్ళ పేరుతో అధికారులు సామాన్య ప్రజలను వేధించారు. ఆఫ్ఘనిస్థాన్ మీద రష్యన్ దాడి భయాన్ని ఎదుర్కొనడానికి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికి, కొత్తగా సైనిక దళాల ఏర్పాటు చేసుకోడానికి ఆదాయంపన్ను విధించక తప్పదని ప్రభుత్వం తీర్మానించింది. తన సామ్రాజ్య రక్షణ కోసం, క్షేమంకోసం ఈ నిధులను స్వయంగా ప్రభుత్వం సమకూర్చుకోవాలని భారతీయ యాజమాన్యాలలోని పత్రికలు వాదించాయి. వేయి రూపాయలకు మించి నెలజీతం అందుకొనే ఉద్యోగుల జీతంలో పదిశాతం పన్ను విధించాలని, వేసవిలో ప్రభుత్వ పాలనను శీతల ప్రాంతాలకు మార్చడం వంటి కార్యక్రమాలు మానుకొని, ప్రభుత్వ దుర్వ్యయాన్ని నిరోధించాలని ప్రత్యామ్నాయ మార్గాలను పత్రికలు సూచించాయి. 1887 మద్రాసు కాంగ్రెసు సభలలో నెలసరి ఆదాయం వేయిరూపాయలకు మించి ఉన్న వారిమీద మాత్రమే ఆదాయం పన్ను విధించాలని తీర్మానం చేయబడింది. ప్రజాందోళనకు తలఒగ్గి ఆదాయం పన్ను చట్టాన్ని సవరించినా, ఈ వ్యవహారంలో ప్రభుత్వం అపఖ్యాతిపాలైంది.

భారతీయులు నడిపే పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వంతోనే కాక, ఆనాటి ఆంగ్లో ఇండియన్ పత్రికలతోను పోరాడవలసి వచ్చేది. మెయిల్ పత్రికో, మరొక ఆంగ్లో ఇండియన్ పత్రికో ఆదాయం పన్ను మిద వ్యక్తపరచిన అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ నరసయ్య “వారికి నిజంగా అర్హత ఉందా !” అనే ఈ సంపాదకీయం రాశాడు. దీని తెలుగు అనువాదం :-

"క్షమించండి ! మేము ఎంతో గౌరవించే మా సహపత్రిక అభిప్రాయాలతో ఏకీభవించలేము. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఆదాయంపన్ను చట్టం విషయంలో స్థానికపత్రికలు నిష్కారణంగా వ్యతిరేకించి, అనవసరంగా స్పందిస్తున్నట్లు ఆ పత్రిక ఆరోపించింది. ఆ అభిప్రాయాలను మేము ఆమోదించలేము. పన్నుభారం కేవలం యూరోపియన్ల మీద మాత్రమే పడుతుందని మేము భావించడం లేదు. ఈ కొత్త పన్ను విధించడంవల్ల అధికసంఖ్యలో ఈ దేశప్రజలు బాధించబడరనే నెపంతో సత్యం కోసం, న్యాయం కోసం పోరాటం చెయ్యకుండా మౌనంగా ఉండలేము. ఆదాయం పన్నుకు వ్యతిరేకంగా స్థానిక పత్రికలు గళంవిప్పకుండా ఉండి ఉంటే అవి తమ బాధ్యతను, కర్తవ్యాన్ని విస్మరించినట్లు అయ్యేది. వినయంగా మేము వినిపిస్తున్న వాదనలో స్థానికుల ప్రయోజనాలు, యూరోపియన్ల ఆసక్తులు సమప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఈ దేశ ప్రజల సమస్యలను వివేకంతో మా పత్రికలో చర్చించాము. ఎంతో సమర్థవంతంగా, గౌరవప్రదంగా నిర్వహించబడుతున్న మా సోదర పత్రిక అభిప్రాయపడినట్లు ఆదాయంపన్ను యూరోపియన్ల ప్రత్యేక సమస్య కాదు. ఈ దేశంలో 40 రూపాయల అతితక్కువ సంవత్సరాదాయంతో బతుకులీడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. సెలెక్ట్ కమిటీ (Select Committee) ప్రవేశపెడుతున్న సవరణల దృష్ట్యా ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పన్నువడ్డన రుచి చూడబోతారు. ఈ పన్ను మూలంగా ఎన్నో కుటుంబాలు కలవరపాటు చెందుతాయి. మరెన్నో కుటుంబాలు తిండికి బట్టకు కటకటలాడవలసి వస్తుంది. ఈ విషయం అస్పష్టమైన, న్యాయసంబంధమైన సమస్య అని భావించినా, యూరోపియన్ సమాజంమీద మాత్రమే భారంమోపడం అని అనుకొన్నా, మనదేశ ప్రజల కష్టాలకు, ఇబ్బందులకు కారణం అయినా ప్రభుత్వం తలపెట్టిన ఈ పన్ను వ్యవహారాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. తన హక్కుగా భావిస్తూ, ఈ దేశ ప్రజలను ఆదాయంపన్ను చెల్లించమని కోరడానికి ప్రభుత్వానికి యోగ్యత ఉందా ?

ప్రజలందరు దేశరక్షణను బలపరచడం కోసం, శాంతిని కాపాడుకోడం కోసం యథాశక్తి పన్ను చెల్లించాలని కోరడం ఒక్కటే ఈ కొత్త పన్నును సమర్ధించే అంశం. ప్రభుత్వం పిలుపిస్తే, ప్రతి పౌరుడు ప్రభుత్వకోశానికి కొంత మొత్తం జమ చేయవలసినదే. దేశ రక్షణ కోసం మన ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వమని కోరేవారు తమ ప్రవర్తనతో మన విశ్వాసాన్ని చూరగొనాలి. ఉత్తమాటలతో కాదు; గట్టిచేతలతో, సత్ప్రవర్తనతో తమ మీద ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని వమ్ముచేయకుండా, ప్రజాధనంలో ఒక్కపైసా కూడా వృథా కాకుండా చూస్తారనే నమ్మకం కలుగజేయాలి. ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు విశ్వాసం కలుగజేసే విధంగా ప్రవర్తించారా? ప్రజలు తమ మీద ఉంచిన విశ్వాసాన్ని నిరూపించుకొన్నారా? మనదేశ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం ఏలుబడిలో ఎంతో విధేయతతో ప్రవర్తిస్తారు. మన విధేయత వాస్తవాలు గ్రహించడంలో అడ్డం రాకూడదు. దేశ అవసరాలను గమనించుకొంటూ, ప్రజలను కాపాడుతూ, ప్రభుత్వాన్ని నడిపే వదాన్యులైన మన పాలకులు ప్రభుత్వవ్యయం రోజురోజుకు పెరిగిపోతున్నదని సాధారణంగా వినిపించే ఆరోపణను చాలా తేలికగా తీసుకొంటారు. మనపాలకుల అంతరాత్మకు బాగా సర్దుకుపోయే గుణం ఉంది. అనంతమైన కష్టనష్టాలను ఎదుర్కొంటున్న ఈ నిరుపేద దేశాన్ని విడుపు లేకుండా దుర్వ్యయంలోకి నెట్టివేస్తున్న అనేక ఉదంతాలు మనకు కనిపిస్తాయి. గడిచిన రెండేళ్ళ కాలాన్ని పరిశీలిస్తే, బాధ్యతారహితంగా, విచ్చలవిడిగా విలాసాలకోసం, ప్రభుత్వం ఢిల్లీ రాయల్ దర్బారు నిర్వహించిన తీరు ఒక ఉదాహరణ. ఈ పరిస్థితికి నొచ్చుకొంటూ ఒక్క ప్రభుత్వ అధికారి అయినా తన పదవికి రాజీనామా చేశాడా? ఇంత దర్పం, ఆడంబరం ప్రదర్శించడానికి నిజంగా కారణం ఉందా? ఏ విజయాన్ని, పురస్కరించుకొని ఈ దర్బారు ఉత్సవాలు నిర్వహించారు? వీరు విధించ తలపెట్టిన ఆదాయం పన్ను ద్వారా కొన్ని సంవత్సరాలపాటు జమఅయ్యే మొత్తాన్ని ఆ దర్బారు ఒక్క గంటలో కబళించింది. సంవత్సరాదాయం 300 రూపాయలున్న పౌరుల మీద ఈ పన్ను విధించినా, ఇరవై కోట్ల దేశ ప్రజలనుంచి 7000 పౌన్లకు మించి వసూలు కాదు. ఈ దేశ దుర్భర దారిద్ర్యాన్ని నిరూపించడానికి ఈ ఒక్క విషయం చాలు. విజ్ఞులైన మన పాలకులకు ఇదంతా ఏంపడుతుంది? అధికార పీఠంమీద కూర్చొని అత్యున్నత పదవుల్లో ఉన్న అధికారులను ఏ బలమైన కారణాలు కదిలిస్తాయో సామాన్యుల ఊహకు అందదు.

ఈ కర్చంతా చాలనట్లు ఇటీవల ఒక అద్భుతమైన 'కేంపు' ఏర్పాటు చేశారు. అవును! “యుద్ధంలో అపఖ్యాతి తెచ్చిన విజయాలు” లేక అపజయాలు నిజంగానే అద్భుతమైనవి. (..................) ఇటువంటి నకిలీలను సహాయంగా తెచ్చుకున్న ప్రభుత్వం లార్డు డఫ్‌రిన్ (Dufferin), లార్డు (..................) దారిలోనే నడుస్తూంది. ఈ కేంపు 1877 ఢిల్లీ దర్బారుకు సరిజోడు కావచ్చు.

ముందుగా ఇండియా సైన్యాలను దూరదేశాల్లో దించమని ఆజ్ఞాపిస్తారు. ఆ తర్వాత ఇరవై, ముప్పై లక్షల కర్చుతో అదనపు సైన్యాలను సమకూర్చమంటారు. బాధ్యత విస్మరించి వృధాగా కర్చుచేస్తే ఈ ప్రభుత్వం దేశప్రజల హృదయపూర్వక విశ్వాసాన్ని, సహాయాన్ని ఏ విధంగా ఆజ్ఞాపించి, రాబట్టుకోగలుగుతుంది? మితిమీరిన ప్రభుత్వ వ్యయాన్ని స్థానిక పత్రికలు విమర్శించడం నేరమే, అవిధేయత ప్రకటించడమే. ఆదాయం పన్ను విధించడానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయి?"

3. మద్రాసులో విద్య ఖరీదు - వ్యాసం

ఈ వ్యాసం సమగ్రంగా లభించలేదు. అందరికి ఆధునిక విద్య అందుబాటులో ఉండాలని నరసయ్య ఈ వ్యాసంలో గట్టిగా వాదించాడు. ఈ వ్యాసం అనువాదం :

“గెజిటు ప్రకటన చదివి మేము ఆశ్చర్యపడక తప్పలేదు. 1886 డిసంబరులో నిర్వహించనున్న పరీక్షలకు, ఆ వచ్చే సంవత్సరాలలో నిర్వహించనున్న పరీక్షలకు ఫీజులు పెంచారు (................) పరీక్షల నిర్వహణ అధికారులకు ఫీజులు పెంచాలనే దుర్మార్గపు ఆలోచన ఉన్నట్లుండి పుట్టుకొచ్చినట్లుంది. ఇది విద్యాభివృద్ధిని మొగ్గలో తుంచి వేయడమే. విద్య ప్రతి పౌరుడి జన్మహక్కు, పౌరులు తమ విధులను చక్కగా నిర్వహించడానికి విద్య సన్నద్ధం చేస్తుంది. ఇంగ్లాండులో, యూరపులోని ఇతర దేశాల్లో నిర్బంధ విద్యను అమలు చేశారు. విద్యలేని వ్యక్తి గనిలో ముడిఖనిజం వంటివాడు. సుగంధం వృధా చేసుకొంటూ ఎడారిలో వికసించిన గులాబి వంటివాడు. ఇప్పుడు సమస్త నాగరిక ప్రపంచం ప్రజల విద్యాభివృద్ధికి మార్గాలను అన్వేషిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల కొలమానం ప్రకారం ఏనాటికైనా భారతదేశం పైకి రావాలంటే, ఈ దేశ ప్రజలు కనీసం ప్రాథమిక విద్య అయినా ఆర్జించాలి. ఈ గెజిటు ప్రకటనల వంటివి విద్యాభివృద్ధికి అవరోధాలు కాకమానవు.

మద్రాసులో ఒక విద్యార్థి చదువుకొని, పైకి రావడానికి వెయ్యిన్నొక్క కష్టాలు పడవలసి ఉందని మా అనుభవం చెప్తూంది. యూరపులో, అమెరికాలో ఉన్నట్లుగా మద్రాసు స్థానికులకు ఉచిత విద్య అందించే పాఠశాల కాని, మాతృభాషలో విద్య నేర్పించే పాఠశాలకాని, ప్రారంభం కాలేదు. అనాదిగా కొనసాగుతున్న వీధిబళ్ళు పిల్లలు ఇంట్లో అల్లరి చెయ్యకుండా చూడడానికి తప్ప, అక్కడ నేర్పించేదేమి లేదు.

వీలున్నంతలో ఎంతమంది విద్యార్థులకు మంచి ఇంగ్లీషువిద్య చెప్పించడానికి కుదురుతుందో అంతమందికి అవకాశం కల్పించాలి. మంచి ఇంగ్లీషు విద్యను సముపార్జించడమే అసలు సమస్య. ఒక తాలూకాఫీసు గుమాస్తా సంగతే తీసుకొందాం. అతను పదిహేను రూపాయల జీతంతో పెద్ద కుటుంబాన్ని పోషించవలసి ఉంటుంది. పిల్లల్ని చదివించాలని ఎంత తపనపడ్డా ఏ విధంగా చదివించగలడని ప్రశ్నిస్తున్నాము. ఈ ప్రెసిడెన్సీలో అతితక్కువ ఫీజులు వసూలు చేసే ప్రభుత్వ, ఎయిడెడు పాఠశాలల ఫీజులు కూడా సామాన్యులకు అందుబాటులో లేనంత అధికంగా ఉన్నాయి. ఇక జీతాలుకాక, పుస్తకాలు, ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఈ ప్రెసిడెన్సీలో ఎంతోమంది తల్లితండ్రులకు సంతృప్తికరంగా తమ పిల్లలకు చదువు చెప్పించుకోడానికి అవకాశం లేదు. ఈ ఇబ్బందులకు తోడుగా ప్రభుత్వం కొత్తగా టర్మ్‌ఫీజు విధానం ప్రవేశపెట్టింది. ఇప్పుడు పాఠశాలల్లో నెలనెల జీతాలు కట్టించుకోడం లేదు. ఒక్కసారిగా మూడునెల్ల జీతమో, ఆరునెల్ల జీతమో ముందుగా చెల్లించమంటున్నారు. మద్రాసులో ఉద్యోగులకు నెలకొకసారి వేతనం అందుతుంది. నిత్యం డబ్బుకు ఇబ్బంది పడేవారు అంతమొత్తం ఒక్కసారిగా చెల్లించమంటే ఎక్కడ నుంచి తెస్తారు. పూర్వం భారత ప్రభుత్వ చట్టసభలో మంత్రిగా పనిచేసిన సర్ ఆక్‌లాండ్ కాల్విన్ (Sir Auckland Calvin) ఆదాయం పన్ను మిద చేసిన ప్రకటన ఈ దేశంలో పేదరికాన్ని గురించి తెలుసుకోడానికి పనికి వస్తుంది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేవిధంగా ఫీజులు వసూలు చెయ్యాలి. పేద విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చెయ్యకూడదు. ఇతర పరగణాలలో మాదిరి కాకుండా ఈ ప్రెసిడెన్సీ పాఠశాలల్లో ఒకటి రెండు వాయిదాలలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆధునికవిద్య పేదలకు, సంపన్నులకు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేది. పచ్చయ్యప్ప విద్యాసంస్థలు, మిషనరీ పాఠశాలలు విద్యార్థులవద్ద నెలజీతం రూపాయి కట్టించుకొని మెట్రిక్యులేషను పరీక్షకు సన్నద్ధం చేసేవి. సంపన్నులు మాత్రమే జీతాలు కట్టేవారు. పేదవిద్యార్థులు ఏమి చెల్లించకుండానే ఈ పాఠశాలల్లో చదువుకొనేవారు. ఈ పాఠశాలల్లో సంపన్నుల పిల్లలు అనుభవించే సమస్త సౌకర్యాలు పేదవిద్యార్థులకు అందుబాటులో ఉండేవి. జీతాలు చెల్లించిన విద్యార్థులకు ఇచ్చినట్లే పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చేవారు. బొంబాయి నగరంలోనూ ఇదే పద్ధతి ఉండేది. అక్కడి విశిష్ట పౌరులు అనేకులు ఈ విధంగా ఉన్నత విద్య అభ్యసించి పైకి వచ్చినవారే.”

పీపుల్స్ ఫ్రెండ్ కు ప్రభుత్వ వ్యతిరేకత

"The Hindu came to head on collision with the British Administration and its bureaucrats almost from its birth...... and waged a grinding and relentless debate"60

ఈ మాటలు హిందూ పత్రికను గురించి రాసినవే అయినా, స్వాభిమానంతో మనుగడ సాగించిన ఆనాటి పత్రికల కన్నిటికీ అన్వయిస్తాయి. పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభమైన కొత్తల్లోనే ప్రభుత్వం చిన్నచూపుకు, ఆగ్రహానికి గురిఅయింది. తమిళనాడు ఆర్కైవ్స్‌లో నరసయ్య 1886 ఫిబ్రవరి 24వ తారీకున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ భద్రపరచబడి ఉంది. 1886 ఫిబ్రవరి 22 తారీకుతో విడుదలైన జి.ఓ 397కు సమాధానంగా నరసయ్య ఈ లేఖ రాసినట్లు స్పష్టంగా ఉంది.61 ఈ లేఖ అనువాదం.

మద్రాసు,

24-2-1886

అయ్యా ,

397 జి.ఓ సంబంధించి ఈ లేఖ రాస్తున్నాను. ప్రభుత్వం ఉపయోగం కోసం నాకు ఇప్పటి నుంచి పీపుల్స్ ఫ్రెండ్ వారపత్రిక ఉచితంగా పంపేందుకు అనుజ్ఞ దయచేయమని అర్ధిస్తున్నాను. పత్రిక క్రమంతప్పకుండా వెలువడుతూ ఉంది. పెద్ద సంఖ్యలో పాఠకులున్నారు. నా దేశప్రజల ఇబ్బందులను, ఆకాంక్షలను గురించి రాసే ఈపత్రికను ప్రభుత్వఅధికారులు అప్పుడప్పుడు చదవడానికి తప్పక అవకాశం కలుగ జేయాలి. గౌరవపూర్వకంగా పంపబడుతున్న ఈ పత్రికను తిరస్కరించరనే భావిస్తున్నాను.

ఉంటాను

తమ విధేయుడైన సేవకుడు

డి. నరసయ్య

“పీపుల్స్ ఫ్రెండ్” యజమాని

ఇట్లా మొదలైన అధికారుల అసహనం, ద్వేషం 1888 కల్లా పరాకాష్ఠకు చేరుకుంది. 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక

పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించిన అయిదారు సంవత్సరాల లోపలే, నరసయ్యకు ప్రభుత్వాధికారులతో సంబంధాలు చెడిపోయాయి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఆయన తన పత్రికాముఖంగా తీవ్రంగా వ్యతిరేకించినట్లుంది. నరసయ్య ప్రభుత్వానికి రాసిన లేఖలో పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను ఉచితంగా పంపుతున్నట్లు, స్వీకరించమని కోరాడు. 1887లో ప్రభుత్వం పీపుల్స్ ఫ్రెండ్‌కు మొదటిసారి చందా చెల్లించి, పత్రికను తెప్పించుకోడం ఆరంభించింది.62 తర్వాత కొన్ని నెలలకే పీపుల్స్ ఫ్రెండ్ మీద కన్నెర్రజేసిన ప్రభుత్వం తన ప్రచురణలను పీపుల్స్ ఫ్రెండ్‌కు ఉచితంగా ఇవ్వడం నిలిపివేసింది. ఈ పరిస్థితిని వివరిస్తూ నరసయ్య సంపాదకీయాన్ని రాశాడు. పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక మేనేజరు ఈ సంపాదకీయాన్ని గవర్నరు కనమరా దృష్టికి తీసుకొని రమ్మని కోరుతూ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి ఈ ఉత్తరం రాశాడు.63

The People's Friend Office, Madras

Date 13th March, 1888

No. 448

From the Manager, The People's Friend, Madras.

To the Chief Secretary to the Madras Govt., Fort St. George.

Sir,

By desire of the Editor, I have the honour to request that you will be good enough to lay the accompanying copy of the People's Friend dated 25th February 1888, before His Excellency, the Governor in Council and draw His Lordship's attention to the leading article headed "The Madras Govt. and the Press". The Govt. has it in its Power to do whatever it pleases in matters like this. But I would respectfully invite the Govt. to examine the whole case in view of the grounds urged in the article, alluded to and cancel the orders recently passed in the matter discussed in the said article.

2. The orders referred to are the following :--

G.O. No. 7006, dt. 17th Nov. 1887; G.O. No. 7204, dt 24th Nov. 1887, G.O. No. 7284, dt 10th Feb. 1888.

3. We also beg to draw your attention and that of the Govt. to the following facts. The Govt. in their order No. 534, dt. 16th April 1881, Public Dept. were pleased to say, "The People's Friend will be included in the list of the newspapers to which Govt. Proceedings and Publica tions are supplied". And we have been accordingly ever since supplied regularly with the Tanjore, Salem, Kistna and other District Manuals. Dr. Caldwell's History of Tinnavelly, the Public Instruction reports from year to year and various other important publications as they issued from the Govt. Press from time to time.

4. Under the above circumstances I trust that Govt. will see fit to continue to supply the People's Friend with their publications as hitherto and order the issue to this office of the recently published Manuals of Malabor, Kurnool and Coimbatore as well as of the report of Public Instruction for 1886-87, all which have not yet been supplied to us.

I have the honour to be Sir, Your most obedient servant,

(Sd) xxx

M.R. Thiruvengada Mudr.

Manager, People's Friend

ఈ ఉత్తరం మీద అధికారులు నోట్ ఈ విధంగా రాశారు.

FOR ORDERS

NOTE-1

C-No. 2/5

The Manager, People's Friend, 13th March 1888.

In this letter the Manager of the People's Friend by the desire of the Editor, forwards a copy of the paper of the 13th March, 1888 and invites attention to a leader entitled "The Madras Govt. and the Press". He goes on to suggest that certain orders of Govt. should be cancelled and the People's Friend supplied with all Govt. publications and certain specified ones.

The question of the supply of Govt. publications to the Press is some what difficult. Orders of Govt. - as distinguished from reports, books, etc., are easily and conveniently given to any newspaper that wants them, but the case is different with regard to expensive books, such as Maclean's Manual of admn. or the Manual of Malabar of Mr. Logan. G.O. 11th April 83 No. 748. Public para-2 ruled that "the practice of issuing such reports gratis on application will be discontinued in future"; but this order has not been observed. In the first place certain newspapers, have continued to receive Govt. reports and publications and further more certain other papers have been since given the same privileges. Thus, the Christian College Magazine "Public" of sectarian character which hardly falls within the meaning of the term "the press has been given all Govt. publications and a comparison of the distribution list Maclean's and Mr. Logan's Manuals shows that several newspapers receive publications while others do not. If it were practicable - yet it is not - it would seem the proper course to cease all gratuitous supply of publications. It is a mere question of money not publishing information, and there is no reason why newspapers should not pay for their books like any other private tax payer. But the Govt. would hardly care to see the pens of all the newspapers in Madras and elsewhere at work to celebrate their disregard for "the firmament of the Fourth Estate". So long as this is the case the paper like the People's Friend seems to have some amount of genuine grievance - if they are refused publications while another paper next door gets. It would not cost much more to give Govt. publications to all bonafide newspapers and would remove what is to a certain extent a grievance. It is only necessary to look at a Distribution list like that of Maclean's Manual to see that it is not easy to draw a line of distinction.

The calm impudence of the present applicant who whilst asking for a favour forwards an article abusing the Govt. and its orders is (sic) amusing.

NOTE - 2

I submit that this is a very good issue for making a difference between newspapers. We cannot supply Govt. publications to all newspapers, but we may .............) to the leading news. The People's Friend certainly not a leading one. I submit that there is no reason to change the order.

చివరకు పీపుల్స్ ఫ్రెండ్‌కు ప్రభుత్వ ప్రచురణలు ఉచితంగా పంపనవసరం లేదంటూ ఈ ఆర్డరు జారీచేయబడింది.

NOTE-3 - FINAL ORDER

"The People's Friend", will, as already ordered, be supplied with such Govt. publications as are placed on the Editors' Table as regards reports and such publications; the general rule is that these are only given on payment, the government see no reason for making an exception in the case of the journal in question.

4. మద్రాసు ప్రభుత్వం - పత్రికలు

పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయానికి ప్రభుత్వం ఈ సమాధానంతో స్పందించింది. ప్రజాభిప్రాయాన్ని, పత్రికల అభిప్రాయాన్ని లెక్కపెట్టమని నిస్సిగ్గుగా చెప్పిన సమాధానం ఇది. ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగుల పొగరు బోతుతనం, దాష్టీకం, ప్రజాపక్షం వహించిన పత్రికలమీద వారికున్న చిన్నచూపు అన్నీ ఈ ఉదంతంవల్ల స్పష్టమవుతున్నాయి.

భారతీయ ఇంగ్లీషు పత్రికలు బ్రిటిష్ అధికారులతో తరచు పోరాడవలసి వచ్చింది. ప్రభుత్వ పక్షపాత చర్యలను నిర్భయంగా, నిర్మొహమాటంగా నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకీయాల్లో విమర్శించేవాడు. పత్రికారచనలో ఆయన పాటించిన ప్రమాణాలకు, ప్రదర్శించిన ఆత్మాభిమానానికి ఈ సంపాదకీయం నిదర్శనంగా నిలుస్తుంది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు అల్పబుద్దితో ఎంత విచక్షణారహితంగా ప్రవర్తించేవారో ఈ వ్యాసం తెలియజేస్తుంది. సర్ గ్రాంట్ డఫ్ (Sir Grant Duff) మద్రాసు గవర్నరు అయిన తర్వాత పత్రికల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన తీరును ఈ సంపాదకీయం బట్టబయలు చేస్తుంది. అధికారులకు ఇంత కోపం తెప్పించిన సంపాదకీయానికి అనువాదం :

“షుమారు ముప్పై ఏళ్ళ క్రితం ఈ ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉండిన సర్ ఛార్లెస్ ట్రెవిలియన్ తన సహజ రాజకీయ కౌశలంతో మొదటిసారిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. గోప్యంగా ఉంచనవసరం లేని సమాచారాన్ని, 'రహస్యం' పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లో నిగూఢంగా ఉంచుతున్న సమాచారాన్ని, 'ఎడిటర్స్ టేబుల్' ముందు ఉంచి స్థానిక పత్రికలకు అందుబాటులో ఉండేటట్లు చేశాడు. దీనివల్ల బహిరంగ చర్చ కొనసాగుతుంది. తమ ఏలుబడిలో ఉన్న దేశాభివృద్ధికి అవసరమైన సలహాలు, పరిష్కారాలు, ప్రభుత్వానికి అందుతాయి. ట్రెవిలియన్ గవర్నరు పదవి చేపట్టకముందు నుంచి కొనసాగుతున్న లంచగొండి విధానానికి, మూస ఆలోచనలకు సరిపడని కొత్తదనం ఈ పద్ధతి ద్వారా ప్రవేశపెట్టబడింది. మొదట్లో ట్రెవిలియన్ సలహాదార్లు, మార్గదర్శకులు ఈ నూతన విధానాన్ని సానుకూలంగా గ్రహించలేదు. ఛార్లెస్ ట్రెవిలియన్ గవర్నరు పదవి చేపట్టకముందే ఒక అనుభవజ్ఞుడైన పౌరుడుగా, న్యాయశాఖలో ఉదార స్వభావంతో బాధ్యతాయుతంగా మెసలుతూ సమకాలికుల కంటే ఎంతో ముందున్నాడు. ఆయన తర్వాత అధికారం చేపట్టిన వారందరూ గ్రాంట్ డఫ్ పరిపాలనలో ఒంటెత్తు పోకడలు రహస్యంగా ప్రవేశించే వరకు, ఆయన నెలకొల్పిన పద్ధతినే ఎంతోకాలం అనుసరిస్తూ వచ్చారు. ఎడిటర్స్ టేబుల్‌కు అందించే సమాచారంలో విషయమేమీ ఉండేదికాదని గ్రాంట్ డఫ్ పరిపాలన మీద అభియోగం ఉండేది. అరుదుగా మాత్రమే ఆసక్తి గలిగించే సమాచారం ఉండేది. ఏవో కొన్ని పరిపాలనా నివేదికలు తప్ప, రహస్యంగా సేకరించిన వార్తలో, క్లబ్ ముచ్చట్లలో చెవినబడినవో, బజారు వీధుల్లో అనుకొనేవో తప్ప పత్రికలకు రాయడానికి విషయమేమీ ఉండేది కాదు. రహస్యంగా ఉంచాల్సిన అవసరంలేని పరిపాలనా సంబంధమైన సమస్త నివేదికలు జిల్లా మాన్యువళ్ళు, ఉపయోగకరమైన -- సమాచారం స్థానిక పత్రికలకు అందించాలనేది మొదట ఏర్పరచిన నిబంధన. ఈ సమాచారం ఏఏ పత్రికలకు అందజేయాలో ఆ పత్రికల జాబితా గూడా తయారు చేయబడింది. ఈ విధంగా గుర్తింపు పొందిన పత్రికలలో పీపుల్స్ ఫ్రెండ్ ఉంది. ఆ పత్రికలతో బాటు పీపుల్స్ ఫ్రెండ్ కూడా సౌకర్యాలన్నీ అనుభవిస్తూ వచ్చింది. ఈ , నిబంధనవల్ల స్థానిక పత్రికా రచనకు అన్ని రిపోర్టులూ అందుబాటులో ఉండేవి. విమర్శించడానికి, సలహాలివ్వడానికి, అవసరమైన భోగట్టా పత్రికలకందేది.

ఇప్పుడు ప్రధాన సెక్రెటేరియట్ (Chief Secretariat) ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఏఏ పత్రికలకు ఈ నివేదికలు, మాన్యువళ్ళు ఉచితంగా ఇవ్వాలో, ఏ పత్రికలు వాటికి ధర చెల్లించి తీసుకోవాలో తీర్మానించడానికి తానే న్యాయ నిర్ణేత అయింది. ప్రతిఫలాపేక్ష లేకుండా, వివక్ష లేకుండా అన్ని పత్రికలకూ అందజేయాలని ట్రెవిలియన్ ప్రవేశపెట్టిన ఈ పద్దతి నుంచి వైదొలగడానికి కారణం కనిపించదు. పైన పేర్కొన్న విస్తృతమైన నివేదికలను ప్రభుత్వం తన ముద్రణాలయంలో అచ్చు వేస్తుంది. ఈ సంపుటాలను అమ్మి డబ్బు చేసుకోవడం ప్రభుత్వ ధ్యేయం కాదు. ప్రెసిడెన్సీలో ఏ కార్యక్రమం చేపట్టిందీ, ఏమి చేయబోతున్నది ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలకు ఉపయోగపడే ఆసక్తికరమైన సమాచారం అందరికీ వివరించడానికి ఈ విధానం ప్రవేశపెట్టబడింది. ఛార్లెస్ ట్రెవిలియన్ ఉద్దేశించినట్లు కొన్ని పత్రికలకు రిపోర్టులు అందుతున్నాయి. ఇతర పత్రికలు కాపీ కావాలని కోరితే డబ్బు పెట్టి కొనుక్కోమని ఆర్డరు జారీ చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వానికీ, పీపుల్స్ ఫ్రెండ్ కూ మధ్య సంబంధాలనుబట్టే మేము ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసి వస్తూంది. ఈ పత్రికా సంపాదకుడు “మలబారు మాన్యువలు” కోసం అభ్యర్ధన పంపుకొన్నాడు. “ఆ కాపీ ఉచితంగా ఇవ్వలేము” అని అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రభుత్వ అండర్ సెక్రెటరీ (Under Secretary) ఆర్. డబ్ల్యు , బెన్‌సన్ (R.W. Benson) చేవ్రాలుతో జీ.ఓ జారీ చేశారు. అదే నెలలో మరలా "కర్నూలు జిల్లా మాన్యువలు” కోసం విజ్ఞప్తి పంపుకొన్నాము. సెక్రెటరీ జె. ఫ్రెడరిక్ ప్రైస్ (J.Frederick Price) ఫేసిమిలి (Facsimile) స్టాంపుతో జి.ఓ. మాకు అందింది. ఈ నెలలో విద్యాపరిపాలన నివేదిక కోసం అడిగాము. “ప్రభుత్వ ముద్రణాలయం సూపర్నెంటు వద్దకు డబ్బు తీసుకొని వెళ్ళండి” అని అండర్ సెక్రెటరీ ఏ.సి. కార్డ్యూ (A.C. Cardew) సమాధానం రాశాడు.

ఇట్లా నిరాకరించడం నిలకడలేని విధానం. ద్వేషపూరితమైన చర్య. ఈ పరగణాను పాలించే ప్రభుత్వంమీద విశ్వాసం పొగొట్టే చర్య. ఈ జి.ఓలలో వ్యక్తమవుతున్న అల్పత్వం ప్రభుత్వ గౌరవాన్ని దిగజారుస్తుందని మేము కుండబద్దలు కొట్టినట్లు చెప్పక తప్పడం లేదు. మెసర్స్ ప్రైస్, బెన్సన్, కార్డ్యూ అండ్‌కో వారు డబ్బు ఆదా చేయడానికి ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లయితే ఈ నివేదికలను కొన్ని పత్రికలకు ఉచితంగా ఎందుకు ఇస్తున్నట్లు? ఈ ఉపకారం పీపుల్స్ ఫ్రెండ్‌కు దక్కకుండా పక్షపాత వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారు? సెక్రెటేరియట్‌కు ప్రభుత్వ పత్రాలను పత్రికల వారికి పంపిణీ చేసే విధానమంటూ ఏదీ లేదు. సెక్రెటేరియట్‌లోని అధికార త్రయం చిత్తంవచ్చినట్లు ఆజ్ఞలు జారీచెయ్యకుండా విచక్షణతో పరిశీలిస్తే, విద్యా వివేకం లేని ఒక చిరుద్యోగి తమను ఎటువంటి అసందర్భస్థితికి నెట్టాడో గమనించ గలుగుతారు. మా సోదర పత్రికలకు ఉచితంగా పంపిణీ చేసిన సంపుటాలనే మమ్మల్ని డబ్బు చెల్లించి తీసుకోమని ఆర్డరు వెయ్యడాన్ని మేము ఆక్షేపిస్తున్నాము.

ఈ సంద్భరంలో కాస్తంత స్వోత్కర్ష కలగలిసిన నమ్మకంతో ఈ మాటలు చెపుతున్నాము. ప్రజల దృష్టిలో మాకొక స్థానం ఉంది. అందుకు మేము గర్విస్తున్నాము. పత్రికా లోకంలో మా ప్రజ్ఞనుబట్టి మేము బృహస్పతులమనో, శుక్రాచార్యులమనో చెప్పుకోడంలేదు. పత్రికా గగనంలో మా స్థానం ఎంత చిన్నదైనాకావచ్చు. మా విశ్వాసాలకు అనుగుణంగా మేము నడుచుకొంటాము. ప్రయోజనం అనే వెలుగును మా చుట్టూ వెదజల్లుతాము. ప్రజా సంబంధమైన ప్రభుత్వ చర్యలను మా పత్రిక న్యాయంగానే విమర్శిస్తూ వచ్చింది. ఈ ధర్మం నిర్వర్తించడం కోసం స్థానిక పత్రికలకు కల్పించిన సౌకర్యాలనే మేము కోరాము. ప్రభుత్వం మా సోదర పత్రికా రచయితల విషయంలో ప్రవర్తించిన నాగరిక పద్ధతిలో పీపుల్స్ ఫ్రెండ్‌తో వ్యవహరించలేదని ఎక్కువగానే చెప్పాము. ఈ విమర్శ లార్డు కనమరా దృష్టికి వస్తుందని, గౌరవనీయులైన కనమరా గౌరవప్రదమైన మా సోదర పత్రికలకు కల్పించిన సౌకర్యాన్ని మా పత్రికకు కూడా కలుగజేస్తారని భావిస్తాము. బహుశా మాది వారపత్రిక అని, నిరుపేద అయిన ఒక గుమాస్తాకు కూడా అందుబాటులో ఉండేంత తక్కువగా మా చందా రేటు ఉందని, అందువల్ల మా సర్క్యులేషను చాలా తక్కువ అని, మా పత్రిక ప్రభావం ఏమీ లేదని ప్రభుత్వం అభిప్రాయ పడినట్లుంది. వాదం కోసం దీన్ని నిజమనే అంగీకరించినా, ప్రభుత్వం మా విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించాలి. ప్రభుత్వ విధానాలను సమదృష్టితో విమర్శించి, ప్రచుర పరచడానికి అవకాశం ఇవ్వాలి.

ఈ ప్రెసిడెన్సీలో ఒక స్థానిక పత్రికగా హిందూ తర్వాత స్థానం మాదే. హిందూ అచ్చు వేసే ప్రతి మూడు సంచికలకు మేము ఒక సంచికను అందించ గలుగుతున్నాము. ప్రజాహిత సమస్యలను చర్చించే సందర్భాలలో, స్వేచ్ఛగా మా అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో, మితిమీరకుండా వ్యవహరించడంలో, జాగ్రత్త విషయంలో, నిజాయితీగా, ధైర్యంగా రాయడంలో, ప్రజల హక్కుల కోసం పోరాడడంలో మా కృషిని హిందూ కూడా గుర్తిస్తుందని భావిస్తాము."

5. మద్రాసు చట్టసభ - సంపాదకీయం

1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఎడిటోరియల్ నోట్సు శీర్షికలో నరసయ్య తన పేరు మీద ఈ వ్యాసాన్ని ప్రచురించాడు. ప్రభుత్వం మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలుకు వెంకటగిరి జమిందారు వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్రను నియమించింది. ఈ నియామకాన్ని హర్షిస్తూ నరసయ్య వ్యాసం రాశాడు. నరసయ్య కొంతకాలం ఈ జమిందారుకు ట్యూటరుగా పనిచేసినా, ఎంత ఆబ్జెక్టివ్‌గా ఈ సంపాదకీయం రాశాడో పాఠకులకు సులభంగా బోధపడుతుంది. నరసయ్య వెంకటగిరి జమిందారి రైతుల సంక్షేమాన్ని గురించి ప్రత్యేకంగా ఈ వ్యాసంలో ప్రస్తావించడం గమనార్హమైనది. ఈ వ్యాసానికి సంగ్రహానువాదం :

“కొంతకాలం క్రితం విజయనగరం మహారాజా వైస్ రీగల్ కౌన్సిలు (Vice Regal Council) కు నియమించబడడం వల్ల, మద్రాసు ప్రెసిడెన్సీ కౌన్సిల్లో ఏర్పడిన ఖాళీని పూరించడానికి స్థానిక పత్రికల్లో కొన్ని పేర్లు సూచించబడ్డాయి. ఈ గౌరవానికి వెంకటగిరి జమిందారు రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర పాత్రుడయ్యాడని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. సంస్కారవంతుడైన ఈ 32 ఏళ్ళ యువకునితో మాకు చాలాకాలంగా పరిచయం ఉంది. ఈయన మద్రాసులో ఎక్కువ రోజులు ఉండకపోయినా, తనతమ్ముడు బొబ్బిలి జమీందారులాగా తనకు మార్షు వంటి గొప్ప ఇంగ్లీషు ట్యూటర్లవద్ద విద్యాభ్యాసం చేసే అవకాశం లేకపోయినా, ఇంగ్లీషు చక్కగా అర్థంచేసుకొని, యాస లేకుండా మాట్లాడగలడు. ఇది చాలా గొప్ప విషయం. ఇంగ్లీషువారి పరిపాలనలో, ఇంగ్లీషు విద్యావిధానంలో ఆయన వ్యక్తిత్వం రూపొందింది. దక్షిణ భారతదేశంలో జమిందార్లు గర్వించదగిన వ్యక్తి, మంచి సాహిత్యాభిరుచి ఉన్నవాడు. తెలుగులో మహాకావ్యాలన్నీ చదివిన పాండిత్యం వృథాకాకుండా, ఆయన కొన్ని తెలుగు గ్రంథాలు ప్రచురించాడు. పదేళ్ళ క్రితం జమీందారీ పాలన చేపట్టిన తర్వాత, తన జమీందారీ రైతుల సంక్షేమం కోసం ప్రయత్నం చేశాడు కాని, అనేక కారణాలవల్ల ఆ ప్రయత్నం సఫలం కాలేదు.

చట్టసభలకు యోగ్యులయిన వారిని నియమిస్తున్నందుకు ప్రభుత్వాన్ని, మద్రాసు పౌరులను అభినందించక తప్పదు. ఒక లెజిస్లేటరుగా చెంచలరావు, సుబ్రహ్మణ్యఅయ్యరు వలె ఉపయోగకరంగా ఉంటాడని భావించలేముకాని, దక్షిణ భారతదేశ జమీందార్ల వ్యవహారాలను, ఆసక్తులను యువకుడైన ఈయన చక్కగా కాపాడగల సమర్థుడు.

ఉత్తముడైన రాజా జి.ఎన్. గజపతిరావుకు కౌన్సిల్లో స్థానం లభించకపోవడం విచారకరం. కౌన్సిల్లో ఖాళీలు ఏర్పడినపుడు గజపతిరావు నియామకం జరుగుతుందని ఆశిద్దాం. అవకాశం లభించినపుడు మద్రాసు స్థానిక వ్యాపారవర్గాల ప్రతినిధిని కూడా కౌన్సిలుకు నియమించాలి.”

6. ఉప్పు పన్ను వ్యాసం

1888 ఆరంభంలోనే ప్రభుత్వం దేశరక్షణ సాకుగాచూపి ఉప్పుమీద అదనంగా మణుగుకు ఎనిమిది అణాలు పన్ను విధించింది. ఈ సమస్యమీద చర్చించడానికి మద్రాసు పురప్రముఖులు ఫిబ్రవరి 14 తారీకు ప్రెసిడెన్సీ కళాశాలలో నార్టన్ అధ్యక్షతన సమావేశ మయ్యారు. నార్టన్ ప్రభుత్వ విధానాన్ని ఖండించి, ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఏదైనా చెయ్యాలని, అందుకు సంఘీభావం, ఆచరణ ముఖ్యమని ఉపన్యసించాడు. జి. సుబ్రహ్మణ్యఅయ్యరు మాట్లాడుతూ ఉప్పుపన్ను చరిత్రను వివరించాడు. ఆ సమావేశంలో భవిష్యత్కార్యాచరణకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. హిందూ రిపోర్టు చేసిన సభాకార్యక్రమాన్ని పీపుల్స్ ఫ్రెండ్ ఫిబ్రవరి 25 సంచికలో పునర్ముద్రించింది. ఇదే సంచికలో ఉప్పుపన్ను మీద వ్యాసం ప్రచురించబడింది. ఈ వ్యాసం అనువాదం :

“ఉప్పు పన్ను ఎక్కువ చెయ్యడం మీద ఇంగ్లీషు పత్రికలు మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. లండన్ టైమ్స్, ఇతర రేడికల్ పత్రికలు ఉప్పు పన్ను పెంచిన వార్తకు సంబంధించిన టెలిగ్రాములు ప్రచురించడం తప్ప మరేమి రాయలేదు. జీవించడానికి అవసరం కాబట్టి, ఉప్పుమీద పన్ను పెంచరాదని ఇప్పటికీ మేము భావిస్తున్నాము. ఈ చర్యవల్ల పెద్ద సంఖ్యలో నిరుపేద వర్గాలు కష్టాలపాలవుతాయి. ఉప్పు మనిషికి, పశువుకు అవసరం కనుక వ్యవసాయదారులు విపరీతమైన ఇబ్బందులు పడతారు. సరిహద్దురక్షణ, బ్రిటిషు సామ్రాజ్య రక్షణ అవసరంలేదని మేమనడంలేదు. నిధులు సమకూర్చుకోడానికి ఇదొక్కటే మార్గంకాదు, ఇతర మార్గాలూ ఉన్నాయి. రాష్ట్రాలకు కేటాయించే నిధులు ఎందుకు తగ్గించ కూడదు? పెద్దమొత్తంలో జీతాలు తీసుకొనే ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో ఎందుకు కోత విధించకూడదు? కొరగాని ఆడంబరాలకోసం ఎంతధనం దండుగ చేస్తున్నారు? నిధుల లోటు గురించిన పెడబొబ్బల మధ్య, ప్రతిదానికీ అడ్డుపడే ఆ నిరర్థక గవర్నరు (పదవీ విరమణ చేసిన) తన అనుచరగణం విలాసాలకోసం ఊటీలో ఎన్ని లక్షలు కర్చుచేశాడు? కనీసం ఆయనను మందలించారా? వెర్రి ఆడంబరాలకోసం కర్చు పెట్టిన ధనాన్ని తిరిగి చెల్లించమని నిర్బంధ పెట్టారా? అదేమి లేదు (.....) మిలో సేవా దృక్పథం, దేశభక్తి ఉంటే ఏటా నూరో ఇన్నూరో చందా వేసుకొని దేశ ఆర్థిక వనరులకు ఎందుకు తోడ్పడకూడదు? నిరుపేదలు జీవించడానికి అవసరమైన ఆహారపదార్ధం మీద, జంతువులు బ్రతకడానికి అత్యవసరమైన దినుసుమీద పన్ను విధించడం అవసరమంటారా? ఇందుకు “ప్రభుత్వ అవసరాలను” సాకుగా చూపుతున్నారు. పెద్దమొత్తంలో జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో ఎందుకు తాత్కాలికంగా కోతపెట్టకూడదు?”

నరసయ్య ప్రజల సమస్యలమీద ఎంత తీవ్రంగా రాసేవాడో, లభించిన ఈ అయిదారు సంపాదకీయాలవల్ల స్పష్టమవుతూంది. “ఒక మద్రాసు గవర్నరుకు ఇంగ్లీషు రాదని” నరసయ్య తన పత్రికలో వివాదం లేవదీసినట్లు తెలుస్తూంది. ఆయన రాతలలో కనిపించే తీవ్రత, చురుకు వల్ల ప్రభుత్వోద్యోగులు, పెద్దపెద్ద అధికారులు పత్రికమీద ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు. ఈ సంపాదకీయాలు చదివే, బంగోరె నార్లకు రాసిన ఉత్తరంలో “... ఈ రోజు అనుకోకుండా మద్రాసు ఆర్కైవ్స్‌లో పర్మిషన్ లభించింది. ఎన్నాళ్ళనుంచో నేను తపిస్తూ వచ్చిన మా నెల్లూరు జర్నలిజం జనకుడు దంపూరు నరసయ్య edit చేసిన People's Friend పత్రిక సంచికలు రెండింటిని కళ్ళారా చూచే భాగ్యం లభించింది. వాటిలో కొన్ని ముఖ్య Editorial items చదివిన మీదట దంపూరు నరసయ్య నిస్సందేహంగా గొప్ప జర్నలిస్టనే అభిప్రాయం సాక్ష్యాధారాలతో సహా నేడు మరింత ధృవపడిందే తప్ప, అది తగ్గలేదు” అని అభిప్రాయ పడ్డాడు.

1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ - కొన్ని విశేషాలు

ఈ సంచికలో ఆంధ్ర ప్రకాశిక వారపత్రిక మిద ఒక సమీక్ష ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీలో సక్రమంగా వెలువడుతున్న తెలుగు వారపత్రిక అని, ఇంగ్లీషు వారపత్రికల పద్దతిలో దీన్ని ప్రచురిస్తున్నారని ప్రశంస ఉంది. సమర్థతతో రాయబడ్డ రచనలతో, పత్రిక పాఠకాదరణ పొందిందని, ఇంగ్లీషు రాని పాఠకులు ఈ పత్రిక ద్వారా దేశపరిస్థితులను, రాజకీయాలను చక్కగా గ్రహించవచ్చని, పాఠకులకు ఆసక్తి కలిగించే ఎన్నో విశేషాలు ఈ పత్రికలో ఉన్నాయని ఇందులో ఉంది. ఆంధ్ర ప్రకాశిక ప్రకాశకుడు ఏ.సి. పార్థసారథి నాయుడుతో నరసయ్య స్నేహం చిరకాలం కొనసాగింది.

పీపుల్స్ ఫ్రెండ్ ఆరంభించిన నాటి నుంచి “ఎడిటోరియల్ నోట్సు” శీర్షిక నిర్వహించబడుతూ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ శీర్షికలో సమకాలిక సంఘటనలను వ్యాఖ్యానిస్తూ రచనలు ప్రచురించబడ్డాయి. ఇందులో అంశాలన్నీ పత్రిక సంపాదకవర్గం రాసినవే. కొన్ని అంశాల చివర "D.N." అని ప్రత్యేకంగా నరసయ్య పేరు కనిపిస్తుంది. ఎడిటోరియల్ నోట్సు వంటిదే 'Scraps' అనే మరొక శీర్షిక. 1883 సంచికలో ఈ శీర్షిక లేదు. పాఠకులకు ఆసక్తి కలిగించే చిన్నచిన్న వార్తలు అనేకం ఇందులో ఇవ్వబడ్డాయి. ఈ శీర్షికలో ప్రచురించిన కొన్ని వార్తా వ్యాఖ్యలను ఇతర పత్రికల నుంచి స్వీకరించి, ఆధారాలను పేర్కొనడం జరిగింది. కొన్ని వార్తలను పీపుల్స్ ఫ్రెండ్ స్వతంత్రంగా ప్రచురించింది. "The Week (original and selected) అని మరొక శీర్షిక ఉంది. ఈ శీర్షికలో ఫిబ్రవరి 18 శనివారం నుంచి వరసగా, రోజువారి జరిగిన ముఖ్య సంఘటనలు ప్రచురించబడ్డాయి. ఈ శీర్షికలోనూ ఇతర పత్రికలనుంచి వార్తలు స్వీకరించినపుడు ఆయా పత్రికల పేర్లు వార్తల కింద ఇవ్వబడ్డాయి. 'గెజిటు' శీర్షికలో ఫోర్టు సెంట్ జార్జి గెజిటు నుంచి అనేక విషయాలు యథాతథంగా ప్రచురించబడ్డాయి. "Telegrams selected from daily papers" శీర్షికలో ప్రపంచ వార్తలు ఆయా పత్రికల నుంచి పునర్ముద్రించబడ్డాయి. ఈ శీర్షికలో కొన్ని వార్తల చివర ఆకరాలు కనిపించవు.

హోల్కరు వ్యవహారం

ఎడిటోరియల్ నోట్సు శీర్షికలో అప్రతిష్ఠపాలైన హోల్కరు .మహారాజు వ్యవహారం నరసయ్యే స్వయంగా రాశాడు. ఈ సంస్థానాధిపతి దుర్వ్యసనాలకు, దుష్ట సహవాసాలకు అలవాటు పడినట్లు, అతని ప్రవర్తనకు 'గ్రహచారం' కారణమని జోస్యులు చెప్పిన కారణాన్ని నరసయ్య తిరస్కరించాడు. "We fear the astrology of women's starry eyes is doing much mischief to his moral, mental, spiritual and political state" అని వ్యంగ్యంగా రాశాడు. మహారాజుకు జాతకాలమీద, జోస్యులమీద విశ్వాసం ఉందని, అందుకు అతనిని ఏమీ అనలేమని, “సూర్యచంద్ర నక్షత్రాల ప్రభావం మనుషుల హృదయాలమీద ఉండదని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము” అని ఈ సందర్భంలో వ్యాఖ్యానించాడు. "Was it from experience that there is a devil in the moon for mischief" అనే బైరన్‌కవి చరణాలను ఉదాహరించి, "If so why not in the stars? There is doubtless a great deal of naughtiness, especially under bright Italian starry skys, and perhaps under Indian starry skies too" అని పరిహసించాడు . "Thousands are guided by Zodiacal Almanac, and that less pretty closely predicted events, at least some. The Maharajah only follows suit. When Doctor Johnson believed in the Cock lane Ghost what harm if a Maharajah who never composed a Dictionary or the "Wanity of human wishes" should place faith in astrologers! We trust that the Stars will be generous to Holker and remove the disfavour against him." అని నరసయ్య ఈ వ్యాఖ్యను ముగించాడు. మూఢనమ్మకాలను తొలగించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని వ్యాపింప చెయ్యడానికి, ఏరాయయినా పనికివస్తుందని ఆయన భావించినట్లు ఇందువల్ల తెలుస్తుంది. 'స్క్రాప్స్' శీర్షికలో ట్రావెన్కూరు మహారాజా దేశాటనలో కాలం వెళ్ళబుచ్చుతున్నాడని, ఈ సంస్థానం పరిపాలన పట్టించుకొనే నాథుడే లేడని, ఈ సంస్థానం గురించి ఎవరూ ఒక్క మంచిమాట చెప్పడం లేదని, ప్రభుత్వం పరిస్థితి గమనిస్తూ ఉందని వివరించబడింది. ఈ సంచికలోనే "The illegitimacy of Maharajah Duleep Singh" అనే వ్యాసం ట్రిబ్యూన్ (Tribune) పత్రిక నుంచి పునర్ముద్రించబడింది. నరసయ్యకు స్వదేశీ సంస్థానాధిపతుల మీద, జమీందారుల మీద అప్పటికే సదభిప్రాయం లేనట్లు అనిపిస్తుంది.

ఈ సంచికలో "Suit in connection with municipal law, Physical training in India, The Agricultural college at Delhi, The races of India, A Royal romance, Railway train telegraphs" మొదలైన వ్యాసాలు ఇతర పత్రికల నుంచి పునర్ముద్రణ పొందాయి.

ఎడిటోరియల్ నోట్సు శీర్షికలో పిచ్చికుక్క కాటుకు వైద్యం లేదని, ఈ రోగ నివారణకు మందు కనిపెట్టి మానవాళిని కాపాడాలని ఒక వార్త ఉంది. రైల్వే ట్రైన్ టెలిగ్రాఫ్స్ వ్యాసంలో నూతన శాస్త్ర ఆవిష్కరణలు రైలు ప్రమాదాలను నివారించగలవనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ శీర్షికలోనే బెంగాల్ పరగణాలో ఉప్పు ధర పెరిగినట్లు ఒక వార్త కనిపిస్తుంది.

రెండు కవితలు

ఈ సంచికలో ఈగల, దోమల బాధను వివరిస్తూ హాస్యకవిత ఒకటి ప్రచురించబడింది. వార్తలు స్పష్టంగా, సంగ్రహంగా, ఆసక్తికరంగా రాసే పద్ధతులు ఒక కవితారూపంలో వివరించబడ్డాయి.

Whatever you have to say my friend
Whether witty, or grave or gay
Condense as much as ever you can,
And whether you write on rural affairs

అని మొదలై
For editors do not like to print
An article lazily long, and the general reader do not care
For a couple of yards of song,
So gather your wits in the smallest place.
If you win the author's crown,
And every time you write, my friend - boil it down! చరణాలతో ఈ కవిత ముగుస్తుంది.

స్క్రాప్స్ శీర్షికలోనే నేపాల్ మహారాజు మరణించిన అయిదు నెలల తర్వాత, ప్రధానమంత్రి బలవంతంవల్ల విధవలైన రాణులు సతి ఆచరించినట్లు ఒక విషాదవార్త కనిపిస్తుంది. ఇదే శీర్షికలో ఫ్రెంచి భాషలో వెలువడే "The Journal des Mendicants" అనే వింత పత్రికను గురించిన వివరాలున్నాయి. డాక్టరు కె.ఎస్. బహదూర్జి లండన్‌లో వైద్యవిద్య అభ్యసించి, బొంబాయికి తిరిగివస్తున్న వార్త 'ది వీక్' శీర్షికలో ఇవ్వబడింది. ఈయన పశ్చిమ భారతదేశం నుంచి ఎం.డి. పట్టా సాధించిన తొలి వ్యక్తి అనే ప్రశంస కూడా ఉంది. ఈ సంచికలోనే రాయ్‌బరేలీలో ఆర్యసమాజం కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్న అనాథ శరణాలయానికి సంబంధించిన వార్త ఉంది. పత్రికంతా ఇటువంటి వార్తలతోనే నిండి ఉందని చెప్పడంలేదుగాని, సాధారణ పాఠకులు ఇష్టపడే “ఒకే కాన్సులో ముగ్గురు శిశువుల జననం, నగరానికి సర్కస్ ఆగమనం” వంటి సాదావార్తలు కూడా ఈ సంచికలో ఉన్నాయి.

ఛారిటీ స్కూలు

ఈ వార్తల మధ్య నరసయ్య మద్రాసులో నడిపిన “ఛారిటీ స్కూలు” (Charity school) ప్రస్తావన వస్తుంది. మద్రాసు షరీఫ్ (Shariff) సివాలై రామసామి మొదలియారు ఈ స్కూలుకు విరాళం ఇచ్చిన వివరం ఈ విధంగా ఉంది. "...... A cheque for one hundred rupees was forwarded to us on the other day by Sir Sivali Ramasami Mudaliar for the support of our paper and charity school....." ఈ రామసామి మొదలియారు మోనేగారి సత్రానికి 16000 రూపాయల విరాళం, "Going to school" అనే స్వచ్చంద సేవా కార్యక్రమానికి 30000 రూపాయల విరాళం ఇవ్వడం, రాజా జి.ఎన్.గజపతిరావు మోనేగారి సత్రానికి 1000 రూపాయల విరాళం ఇవ్వడానికి సంబంధించిన వార్తలు ఈ సంచికలోనే ప్రచురించబడ్డాయి.

ఈ సంచికలో మద్రాసు ప్రభుత్వం - పత్రికలు, మద్రాసు చట్టసభ, కోయంబత్తూరు జిల్లా అనే మూడు సంపాదకీయ వ్యాసాలు ఉన్నాయి. వీటితోపాటు “మద్రాసు మునిసిపాలిటీలు” అనే వ్యాసం కూడా ఉంది. కోయంబత్తూరు జిల్లా అనే సంపాదకీయంలో ఆ జిల్లా భౌగోళిక, చారిత్రక విషయాలు వివరంగా చర్చించబడ్డాయి. ఈ వ్యాసం చివర, ట్రావెన్కూరు సంస్థాన వ్యవహారాల మీద రాసిన వ్యాసం చివర 'F' అని రచయిత సంగ్రహనామం ప్రచురించబడింది. 1883 డిసంబరు 1 సంచికలో "బెంగాల్ టెనెన్సీ బిల్లు" వ్యాస రచయిత కూడా ఈయనే. నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించిన నాటి నుంచి ఒకరిద్దరు మిత్రులైనా రచనలు పంపి సహకరించినట్లు ఇందువల్ల స్పష్టమవుతూంది. నరసయ్య తన పాఠకులకు చేసిన ఒక విజ్ఞాపనలో "Monthly payment for articles in the People's Friend forms no inconsiderable item of our total expenditure" అని పేర్కొన్నాడు. ఈ ఒక్క సంచికలోనే హిందు, మద్రాస్ మెయిల్, ట్రిబ్యూన్,ది డెయిలి టెలిగ్రాఫ్, టైమ్ మేగజైన్, ఛేంబర్సు జర్నల్ వంటి అనేక జాతీయ అంతర్జాతీయ పత్రికలనుంచి వార్తలు, వ్యాసాలు పునర్ముద్రించాడు. వీటిలో కొన్ని పత్రికలకైనా చందాలు చెల్లించడం పత్రికా నిర్వహణలో భాగమే. రచయితలకిచ్చే పారితోషికంలో ఈ కర్చు కూడా చేరి ఉంటుంది.

అంజుమన్ ముఫ్‌ది ఇస్లాం

నరసయ్య ఉదారభావాలు, విద్యాభిమానం తెలియజేసే మరొక వార్త ఈ సంచికలో ఉంది. ఏటా 200 మంది ముస్లిం విద్యార్థులకు అంజుమన్ ముఫ్‌ది ఇస్లాం సంస్థ సాంకేతిక విద్యలో శిక్షణ ఇచ్చేది. ఈ సంస్థ 600 రూపాయల వార్షిక గ్రాంటు మంజూరు చేయమని మద్రాసు మునిసిపాలిటిని అర్థించింది. ఇదే విధంగా ఇతర సంస్థలు కూడా సహాయం కోరవచ్చనే నెపంతో మునిసిపాలిటి ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ విషయం మిద వ్యాఖ్యానిస్తూ ఇస్లాం మతస్థులు చదువుల్లో వెనకబడి ఉన్నారని, ఇంతమంది విద్యార్థులకు చదువుకొనే అవకాశం కలిగిస్తున్న ఈ సంస్థకు ప్రత్యేకంగా గ్రాంటు మంజూరుచేసి, ప్రోత్సహించి ఉండవలసిందని, ఇదేమి పెద్ద మొత్తంకాదని పీపుల్స్ ఫ్రెండ్ అభిప్రాయపడింది.

పీపుల్స్ ఫ్రెండ్ విజ్ఞాపన

ఈ సంచికలోనే నరసయ్య చందాదారులకు, పాఠకులకు చేసిన ఒక విజ్ఞాపన ఉంది. ఏడేళ్ళ పత్రికా నిర్వహణలో చందాదారుల నుంచి నాలుగువేల రూపాయలు బాకీ ఉన్నట్లు అందులో ఉంది. ఈ విజ్ఞాపన అనువాదం :

“సహృదయులారా! పాత కొత్త చందాదారుల నుంచి నాలుగువేల రూపాయల బకాయిలు ఉన్నాయి. అందులో సగం మొత్తం ఇప్పుడు చందాదారులుగా కొనసాగుతున్న వారి నుంచే రావాల్సి ఉంది. మిలో ప్రతి ఒక్కరు రేపటి రోజు చందా బాకీ చెల్లించగలిగితే, వెంటనే కొత్త అచ్చులు కొని పత్రికను ఆకర్షణీయంగా వెలువరించగలను. ఈ పరిస్థితిలో మీ బాధ్యతను గుర్తించి సక్రమంగా నిర్వర్తించి సహకరించమని అర్థించే ఈ సేవకుడు, డి. నరసయ్య, ప్రొప్రైటర్, పీపుల్స్ ఫ్రెండ్.”

సుబ్రహ్మణ్య అయ్యరుకు వీడ్కోలు

నరసయ్య రాజకీయ అభిప్రాయాలను వివరంగా తెలుసుకోడానికి అవకాశం లేదు. మద్రాసు మహాజనసభ, భారత జాతీయకాంగ్రెసు స్థాపన వంటి ముఖ్య సంఘటనలు జరిగినపుడు ఆయన ఎంత సంతోషంగా స్వాగతం పలికి ఉంటాడో ఊహించుకోవాల్సిందే. నరసయ్య మద్రాసు మహాజనసభ అభిప్రాయాలను అభిమానించాడు. ఆ సంస్థ కార్యక్రమాలను ఆమోదించాడు. హిందూ పత్రికాధిపతులతో ఆయనకు ఆత్మీయమైన స్నేహమే తప్ప స్పర్ధలేదు.

1896-97 సంవత్సరంలో దేశంలో పెద్ద కాటకం సంభవించింది. ప్రభుత్వం సామాన్య ప్రజలచేత బండరాళ్ళు కొట్టి కంకర చేయడం వంటి అతికఠినమైన కరవు పనులు చేయించి ఉపాధి కల్పించింది. ఈ శ్రమకు ప్రతిఫలం చాలా స్వల్పంగా ఉండేది. ఒక్క మధ్య పరగణాలలోనే లక్షాయాభైవేల ఆకలి చావులు సంభవించాయని హిందూ పత్రిక అంచనా వేసింది. హిందూదేశంలో ప్రభుత్వవ్యయం విషయంలో విచారణ జరపడంకోసం ఇంగ్లాండులో “రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ ఎక్స్పెండిచర్" (Royal Commission on Indian Expenditure) పేర ఒక విచారణాసంఘం ఏర్పాటయింది. లార్డ్ వెల్‌బీ (Lord Welby) కమిషన్ అధ్యక్షుడు. దాదాబాయి నౌరోజీ కమిషన్ సభ్యుడు. మద్రాసు మహాజనసభ సుబ్రహ్మణ్యఅయ్యరును తన ప్రతినిధిగా కమిషన్ ముందు సాక్ష్యం చెప్పడానికి పంపుతున్నట్లు తీర్మానించింది. లండన్ వచ్చే ముందు హిందూ దేశంలో ప్రభుత్వ కర్చులను గురించి సమగ్రంగా వివరాలు సేకరించుకొని, సన్నద్ధుడై రావాలని నౌరోజీ సుబ్రహ్మణ్యఅయ్యరుకు సూచించాడు. సుబ్రహ్మణ్యఅయ్యరు లండన్‌కు బయలుదేరే ముందు కమిషన్ ఎదుట తాను ఏయే విషయాలు ప్రస్తావించ దలచినది క్లుప్తంగా రాసిపంపాడు. 1897 ఏప్రిల్ 10వ తేది ఆయన బొంబాయి నుంచి ఓడలో బయల్దేరివెళ్ళి మే నెలలో కమిషన్ ముందు రెండు సార్లు సాక్ష్యం ఇచ్చాడు.

సుబ్రహ్మణ్యఅయ్యరు లండన్‌కు బయలుదేరే సందర్భంలో ఆయనను అభినందిస్తూ నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్‌లో రాసినవ్యాసం నుంచి కొన్ని వాక్యాలు “ఎ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ ది హిందూ” సంపుటంలో ప్రచురించబడ్డాయి.64

The People's Friend of Madras welcomed Subramania Aiyer's trip to England. "It affords us no little pleasure to learn", it wrote, "that our brother, Mr. G. Subramania Aiyer, of The Hindu has been selected by the Mahajana Sabha to give evidence before Lord Welby's Commission on Indian Expenditure as its own and the people's representative from this part of the country. Mr. Subramania Aiyer, though a young man is very studious and conscientious and thoroughly masters all its details before he ventures to speak or write upon any subject and he has moreover the courage of his convictions as all Southern India knows. He is by no means an impracticable man and does not allow his patriotic zeal to run away either with his discretion or common sense. So his journey to England on this public duty will, we are sure, prove beneficial to one and all in many ways".

నరసయ్య ఒక పత్రికాధిపతిగా సాటి జర్నలిస్టు సుగుణాలను హృదయపూర్వకంగా ఈ మాటల్లో వ్యక్తీకరించాడు. అయ్యరు దక్షిణ భారతదేశం నుంచి ప్రతినిధిగా వెళ్ళడం హర్షదాయకమంటూ అందుకు ఆయన అర్హతలేమిటో వివరించాడు. నరసయ్య రాజకీయ భావాలు అప్పటి దేశప్రధాన రాజీకీయ స్రవంతితోనే సాగుతున్నట్లు ఈ వీడ్కోలు వ్యాసం వల్ల స్ఫురిస్తుంది. సుబ్రహ్మణ్యఅయ్యరు మద్రాసు తిరిగి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే పీపుల్స్ ఫ్రెండ్ ప్రచురణ నిలిచిపోయింది.

పీపుల్స్ ఫ్రెండ్ నరసయ్య కన్యాశుల్క నాటక సమీక్ష

గురజాడ కన్యాశుల్క నాటకం 1897 జనవరిలో అచ్చయింది. ఈ నాటకాన్ని జనవరి 21 పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో నరసయ్య సమీక్షించాడు. కన్యాశుల్క నాటకం మీద వెలువడిన తొలి సమీక్ష ఇది. సమకాలిక పత్రికలలో ఈ నాటకం మీద చాలా సమీక్షలు వెలువడ్డాయి. ఇంగ్లీషు భాష రానివారిలో కన్యాశుల్క దురాచారం కొనసాగుతూంది కనుక, అటువంటి పాఠకులకోసం ఈ నాటకం ఉద్దేశించబడిందని అముద్రిత గ్రంథ చింతామణి సంపాదకుడు పూండ్ల రామకృష్ణయ్య భావించాడు. అందువల్ల నాటకంలో వాడుక చేయబడ్డ 'గ్రామ్యోక్తుల'ను తాను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. శశిలేఖ కన్యాశుల్క నాటకాన్ని గ్రాంథిక భాషలో రాయనందుకు గర్హించింది. చింతామణి దీన్ని హాస్యరస ప్రధాన నాటకమని, “ఈ గ్రంథము నాటకరూపమున వ్రాయబడుటచే జదువరులకు హృదయ రంజకముగానే యుండ వచ్చును.” అని అభిప్రాయపడింది. గురజాడ సమకాలిక సమస్యలను స్వీకరించి, చమత్కారం, హాస్యం నింపి నాటకాన్ని రచించాడని ధీమణి భావించింది. ఇతివృత్త నిర్వహణలో నేర్పు, సహజమైన అభివ్యక్తి కన్యాశుల్క నాటకంలోని గొప్ప అంశాలని, ఈ నాటకం ప్రకృతికి అద్దం పడుతుందని వీక్‌లీ రెవ్యూ (Weekly Review) గుర్తించింది. హాస్యం పొంగులు వారే ఈ కథ నీతిదాయకమైనదని బాలిక ప్రశంసించింది. ప్రాచీన రూపకాలలో కన్పించని పాత్ర చిత్రణ ఈ నాటకంలో ఉందని, హాస్యం ఉట్టిపడే నాటకమని, తెలుగు హార్పు (Telugu Harp) పేర్కొన్నది. పాత్ర చిత్రణలో నూతనత్వం, సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు, ఇతివృత్త నిర్వహణలో నేర్పు అనే అంశాలను ఒకటి రెండు సమీక్షలు ప్రస్తావించాయి.

ఈ సమీక్షల్లో "ఎక్కువ భాగం భాషను గురించి తమ అనుమానాలు వ్యక్తం చేశాయి.” “1897-1915 మధ్య కాలంలో వచ్చిన కన్యాశుల్క విమర్శలను 'సమీక్షదశ' అనవచ్చు” అని, “భాషా విషయకమైన సుదీర్ఘచర్చలు, సలహాలు సందేహాలు - వీటిని గమనిస్తే ఈ సమీక్షదశ మొదట్లో - 1897లో - అముద్రిత గ్రంథ చింతామణి చేసిన విమర్శకు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు 1915వ సంవత్సరం చేసిన విమర్శ పొడిగింపు అనే అనవలసి వస్తుంది.” అని 1999లో "కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం” గ్రంథ సంపాదకులు భావించారే తప్ప, “అప్పారావు హృదయాన్ని సాకల్యంగా ఆవిష్కరించిన సమీక్ష మద్రాసు నుంచి దంపూరు నరసయ్య వెలువరిస్తూ వచ్చిన పీపుల్స్ ఫ్రెండ్ లో 1897 జనవరిలో అచ్చు పడింది.” అని ఈ విమర్శకులకంటే ఎంతో ముందుగా కె.వి. రమణారెడ్డి వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. రమణారెడ్డి మాటలను శ్రద్ధగా చదివి ఉంటే, నరసయ్య కన్యాశుల్క సమీక్షను, ఆనాటి ఇతర పత్రికలలో వచ్చిన సమీక్షలను ఒకేగాట కట్టి ఉండరు. రమణారెడ్డి అభిప్రాయమే కాదు, నరసయ్య సమీక్ష గురజాడకు కూడా ఎంతగానో నచ్చింది. 1909 కన్యాశుల్క నాటకం ప్రతిలో ఆయన తొలి ముద్రణ మీద వచ్చిన సమీక్షలను చేర్చాడు. అన్నిటికన్నా ముందు పీపుల్స్ ఫ్రెండ్ సమీక్షను వేసుకొని, నరసయ్యపై తనకున్న గౌరవాన్ని వ్యక్తపరచాడు. నరసయ్య ప్రతిభా పాండిత్యాలమీద, శేముషిమీద గురజాడకు గౌరవం ఉంది. ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో “ఆంగ్లభాషలో ఆయన గొప్ప పండితుడు” అని ప్రస్తుతించాడు. తెలుగుదేశంలో ఒక పుస్తకాన్ని సమీక్ష చేయగలసత్తా ఉన్నవారెవరూ లేరని రాస్తూ, ఆ సందర్భంలో నరసయ్య పేరు గుర్తు తెచ్చుకొని, “ఆయన జీవించి ఉన్నారా? ఉంటే ఆయన చిరునామా తెలియచేయి. ఆయనను కలుసుకో” అని రాశాడు. కొత్తగా అచ్చయిన కన్యాశుల్క నాటకం ప్రతిని (1909 ముద్రణ) నరసయ్యకు పంపాలనే కోరికతోనే, గురజాడ ఆయన చిరునామా వాకబు చేసినట్లు తోస్తుంది. నరసయ్య కన్యాశుల్క సమీక్ష గురజాడ హృదయంలో శాశ్వతంగా గుర్తుండి పోయిందని చెప్పడానికి ఈ ఉత్తరమే సాక్ష్యం .

కన్యాశుల్క నాటకంలోని మౌలికాంశాలను తరచి చూచిన సద్విమర్శకుడు నరసయ్య. ఆయన గురజాడ నాటక రచన లక్ష్యాలను, అనుసరించిన నూతన మార్గాలను గుర్తించాడు. చిరకాలంగా వాడుకలో ఉన్న నాటక రచనా సంప్రదాయాలను గురజాడ తృణీకరించాడని గ్రహించాడు. మొత్తం తెలుగు గ్రంథ రచనలోనే ఈ నాటకం కొత్త పుంతలు తొక్కిందని ప్రస్తుతించాడు. కన్యాశుల్కం ఇతివృత్తం అపూర్వమైనదని, ఆ నాటక పాత్రలు యథార్థ జీవిత ప్రతిబింబాలని కనుగొన్నాడు. కన్యాశుల్క నాటకాన్ని రంగస్థలంమీద ప్రదర్శనగానే కాక, సహృదయులు పఠించికూడా ఆనందిస్తారని భవిష్యద్వాణిని వినిపించాడు. పండితులకు ప్రీతిపాత్రమైన కృతక గ్రాంథిక భాషను విడిచి పెట్టి, జీవద్భాషలో నాటకరచన చేసినందుకు హృదయపూర్వకంగా అభినందించాడు.

నరసయ్య, గురజాడ ఇద్దరూ ఉదార పాశ్చాత్య విద్యావిధానం ప్రభావంలో వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొన్నారు. నరసయ్య విద్యార్థి దశనుంచి ఇంగ్లీషు సాహిత్యంతోపాటు రాజకీయ, ఆర్థిక శాస్త్రాలను, చరిత్రను నిశితంగా అధ్యయనం చేశాడు. తనకు పాశ్చాత్య రూపక సంప్రదాయాలతో గాఢపరిచయం ఉంది. అందుచేతనే కన్యాశుల్క నాటకాన్ని అంతగా అభిమానించి ఆహ్వానించాడు. గురజాడ కన్యాశుల్క నాటక రచనలో వాడిన భాషను ఆమోదించాడు. నరసయ్య వ్యావహారికభాష ప్రాముఖ్యాన్ని, ప్రయోజనాన్ని 1870 ప్రాంతాలకే గుర్తించాడు. నెల్లూరు కలెక్టరాఫీసులో అనువాదకుడుగా ఉన్న రోజులలోనే భాషా విషయంలో, ఆయన అభిప్రాయాలలో మార్పు వచ్చి ఉంటుంది. వెంకటగిరి జమిందారు సర్వజ్ఞకుమార యాచేంద్ర సాన్నిహిత్యంగూడా ఇందుకు కారణం. కొక్కొండ మొదలైనవారు వీరగ్రాంథిక భాషలో పత్రికలు వెలువరిస్తున్న కాలంలో నరసయ్య ప్రజల భాషలో తెలుగు పత్రిక తీసుకొని రావడానికి ప్రయత్నించాడు. పత్రికల భాషమీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. 1883 డిసెంబరు 1వ తేది పీపుల్స్ ఫ్రెండ్ సంచికలో ఈ ప్రకటన వేశాడు :

“నయమైన తెలుగు న్యూసు పేపరు"

ఇంగ్లీషులో ప్రకృత మందు ప్రచుర పరుస్తూ వుండే "పీపుల్స్ ఫ్రెండ్” వలెనే లోకులకు కావలసినటువంటిన్ని వారికి హితములయినట్టిన్ని అన్ని విషయములు కలిగి తెలుగు దేశస్థులు యేలాగున మాట్లాడుదురో ఆలాగే సులభ శైలిగా వ్రాయబడి నయమైన ప్రతి వారపత్రిక కోరే వారందరు ఆలస్యములేక తమపేరు, విలాసములు మాత్రము మాకు పంపించవలెను. పేపరు చందా పోస్టేజీతో సం||కు 3 రూపాయలు. మాసమునకు 4 అణాలు. పేపరు వారమునకు ఒక తూరి (2) రాయల్ ఫారములు అనగా " పీపుల్స్ ఫ్రెండ్”లో వుండే మాదిరి ఒక కాగితము అచ్చు వేయబడును.

1882 నవంబరు నెల 1 తేది

దంపూరి నరసయ్య”

చెన్నపట్టణం

సామినేని ముద్దు నరసింహం, సర్వజ్ఞకుమార యాచేంద్ర, వాడుక భాషకు ఉన్న శక్తిని గ్రహించి తమ వచన రచనల్లో ఉపయోగించారు. తొలి తెలుగు పత్రికలు వాడుకభాషలో వెలువడ్డాయి. 1842-58 మధ్య వెలువడిన వర్తమాన తరంగిణి వాడుక భాషలోనే వెలువడింది. ఈ సంప్రదాయం నరసయ్యకు పరిచయమైనదే. ఆయన ఎంతో ముందుగా పత్రికలు ప్రజల భాషలో ఉండాలని గ్రహించిన క్రాంతదర్శి. తాను నడిపిన తెలుగు పత్రిక ఆంధ్రభాషా గ్రామవర్తమానిని వాడుక భాషలోనే తీసుకొని వచ్చాడు. సాంఘిక, భాషా విషయాలలో నరసయ్యకు నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. ఆయన తన సమకాలికులకంటే ఎంతో ముందుగా మార్పును పసికట్టి ఆహ్వానించాడు. నరసయ్య కన్యాశుల్క నాటకం మీద రాసిన సమీక్షకు అనువాదం :-

“సాహిత్య విషయాలలో శ్రీ అప్పారావు మౌలిక భావాలు కలిగిన ప్రతిభావంతుడని అనిపిస్తాడు. తన హాస్యరస నాటకం కోసం తెలుగు పండితులకు ఎంతో ప్రీతిపాత్రమైన భాషను, కృతకంగా ఉండి పాండిత్యాడంబరాన్ని ప్రదర్శించే భాషను, ఛాందస సాహిత్యభాషను విడిచిపెట్టాడు. పండితులు నిష్కారణంగా ప్రశస్తమైనదని భావించే భాషను, వారు గ్రంథాల్లో వాడుక చేస్తున్న భాషను విడిచిపెట్టాడు. ఈ భాషకు బదులు ఇప్పుడు ప్రెసిడెన్సీ ఉత్తర జిల్లాలలో అన్ని వర్గాల ప్రజల నిత్యజీవితంలో వాడుకలో ఉన్న సరళ సామాన్య భాషను ఉపయోగించాడు. నాటక రచనలో ఈ పుస్తకం తెగువ ప్రదర్శిస్తూ కొత్త పుంతలు తొక్కింది. ఇంకా చెప్పాలంటే, తెలుగు గ్రంథరచనలో కొత్తదిశను నిర్దేశించింది. మార్పు లేకుండా, విసుగు పుట్టిస్తూ ఒకే ఇరుకు గాడిలో సాహిత్య ధోరణులు సాగుతున్న ఈ కాలంలో నాటక రచయిత గర్వించదగిన, సాహిత్యపరమైన సాహసోపేతమైన ధైర్యాన్ని ఈ రూపకం ప్రదర్శిస్తున్నదని మేము భావిస్తున్నాము. పూర్వపు ఔన్నత్యం కోల్పోయి, దిగజారిపోయిన ఈ నిస్సారమైన క్షీణయుగంలో, హాస్యాస్పదంగా పరిణమించిన వ్యాకరణ సాహిత్య శాస్త్రాలను రచయిత లెక్కపెట్టలేదు. తెలుగు రచనలో వ్యవహారంలో ఉన్న వ్యాకరణ సాహిత్య సంబంధమైన అంధ విశ్వాసాల నుంచి బయటపడ్డాడు. పూర్వ రచయితల వాడుకవల్ల లభించే సమర్థన లేకపోయినా, ఈ నాటకకర్త కొత్త సాహిత్యభాషను ధైర్యంగా వాడుక చేశాడు. ఈ భాష విశ్వజనీనమైన వాడుక వల్ల ప్రజామోదాన్ని పొందింది. ఈ నాటక రచయిత అపూర్వము, ఆసక్తికరమూ అయిన ఇతివృత్తాన్ని ఎన్నుకొని నిస్సందేహంగా తన ఉపజ్ఞను ప్రదర్శించాడు. రంగస్థలంపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే, ఏ తెలుగు ప్రేక్షకులనైనా సంతోషపెట్టగల వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే వైవిధ్యంగల పాత్రలను సృష్టించాడని మేము నమ్మకంగా చెప్పగలం. పఠనాసక్తి గల చదువరులు విశ్రాంతిగా తమ గదిలోనో, గ్రంథాలయాల్లోనో కూర్చొని చదివినా, కన్యాశుల్క నాటకాన్ని ఆనందించగలరు. అందువల్ల ఈ నాటకాన్ని చదవమని మా తెలుగు పాఠకులందరికీ సంతోషంగా సిఫార్సు చేస్తున్నాము. ...............రచయిత పాత్రలన్నింటినీ సాహసంతో చిత్రీకరిస్తూ, అసామాన్యమైన సృజనాత్మకతనూ, రూపకశిల్పాన్ని ప్రదర్శించి, నాటకాన్ని సమగ్రంగా, కళాత్మకంగా నిర్మించాడు. (ది పీపుల్స్ ఫ్రెండ్, జనవరి 21, 1897).65