ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/చివరి మజిలీ : ఆంధ్రభాషా గ్రామవర్తమాని

7

చివరి మజిలీ ఆంధ్రభాషా గ్రామవర్తమాని

నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను ఎంతో 'కీర్తిప్రదం' గా నిర్వహించినట్లు ఒంగోలు వెంకటరంగయ్య పేర్కొన్నాడు. పత్రిక నిలిచిపోయిన పుష్కరకాలం తర్వాత కూడా గురజాడ వంటి బుద్ధిజీవులు "Bright English Weekly" అని ప్రశంసించడం, పీపుల్స్ ఫ్రెండ్ నుంచి నూరేళ్ళ హిందూ సంపుటం కోట్‌చెయ్యడం ఇందుకు నిదర్శనాలు.

1897 జూలై వరకు పీపుల్స్ ఫ్రెండ్ కొనసాగించి, ఆగస్టులో నెల్లూరు కాపురం వచ్చినట్లు నరసయ్య స్వయంగా పేర్కొన్నాడు.1 తను ఎంత గుండె బరువుతో నెల్లూరు ప్రయాణమై ఉంటాడో ఎవరి ఊహకైనా తట్టకపోదు. పదిహేడేళ్ళ క్రితం, ముప్పై రెండేళ్ళ వయసులో, నిక్షేపంలాంటి ప్రభుత్వోద్యోగం మానుకొని, ఎన్నో కలలు మూటగట్టుకొని మద్రాసు దారి పట్టాడు. జీవితం ఇంత నిష్ఠురంగా ఉంటుందని తనకు ముందే తెలుసు. తను ఎన్నుకొన్న మార్గం ఇతరులు నడవడానికి సాహసించనిది. చదువు, ఉద్యోగం, భద్రజీవితం ఈ వరుసలో తాను నడుచుకోలేదు. తన దారి వేరు. అడుగడుగునా ఎదురయిన కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు అధిగమించి, సమకాలికుల కంటే విలక్షణమైన ఆలోచనలతో, ఆశయసాధనకోసం పత్రికా రచయితగా, సంపాదకుడుగా జీవితం ఆరంభించాడు. ఈ క్రమంలో ఎన్నో వ్యతిరేక శక్తులతో సంఘర్షించవలసి వచ్చింది. తన సర్వస్వం ఒడ్డి పోరాడినా, పత్రిక కొనసాగించడం తన శక్తికి మించినపనే అయింది. ఆనాటి ఏ పత్రిక చరిత్ర చూచినా దాదాపుగా ఇదే కథ. పత్రిక కొనసాగించడానికి చివరకు నరసయ్య ఇల్లాలి నగలు కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది.2 తలకుమించిన రుణభారం తప్ప తనకు మిగిలిందేమి లేదు. తొమ్మిదేళ్ళు కూడా నిండని పసివాణ్ణి, అనారోగ్య పీడితురాలైన భార్యను వెంటపెట్టుకొని నెల్లూరు చేరాడు. "How many wicked men and women have worried my path. God thy hand I trust in all events.."3 అని దినచర్యలో రాసుకున్న వాక్యం ఈ నిస్పృహను సూచిస్తుంది.

నరసయ్య నెల్లూరు రావడానికి మరొక కారణం ఉంది. నాలుగేళ్ళ వయసున్న ఒకే ఒక కుమారుణ్ణి అక్క మీనాక్షమ్మకు దత్తత ఇచ్చాడు. ఆమెకు నెల్లూరు సమీపంలో కోడూరు గ్రామ పరిసరాల్లో పెద్ద భూస్థితి ఉంది. ఆమె అమాయకత్వం వల్ల, అశక్తతవల్ల ఆ భూములన్నీ తాకట్టుపడ్డాయి. బాకీ తీర్చకపోవడం వల్ల పొలాలు రుణదాతల స్వాధీనమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆస్తి వ్యవహారాలు చక్కపెట్టాల్సిరావడం వల్ల కూడా నరసయ్య నెల్లూరులో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తనకు వ్యవసాయమే జీవనాధారమైంది.

కోడూరు వ్యవసాయంతో నరసయ్య అనుబంధం ఈనాటిది కాదు. ఇరవై ఏళ్ళుగా ఆ పొలాల మీద అజమాయిషి తనదే. పనులకాలంలో కోడూరులో ఉండి వ్యవసాయం మంచి చెడ్డలు చూచేవాడు. ఫలసాయంలో అక్కకు పదిపుట్లిచ్చి, మిగిలింది తాను తీసుకొనేవాడు.4 ఈ అయివోజుతోనే మద్రాసులో ఉన్నన్ని రోజులు నెట్టుకొచ్చినట్లుంది. కోడూరు, భట్టారంవారి కండ్రిగ, పొగడదొరువు కండ్రిగ, విలుకానిపల్లె మొదలయిన ఊళ్ళన్నీ తనకు పరిచయమే. అక్కడి ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసు. ఈ పల్లెటూళ్ళలో మసలడంవల్ల అక్కడి పేదల కడగళ్ళు, భూస్వాముల ఆగడాలు, పెత్తందార్ల అక్రమాలు, గ్రామాధికారుల మాయలు, మోసాలు, ఏవీ ఆయన దృష్టినుంచి తప్పిపోలేదు. నిత్యం ఆ గ్రామాలకు రాకపోకలు సాగించడం వల్ల కొత్త సంగతులు తెలిశాయి. అక్కడి ప్రజల దయనీయ పరిస్థితులను ప్రభుత్వం ముందుంచడానికి, దేశప్రజల దృష్టికి తీసుకొని రావడానికి తనకొక పత్రిక అవసరం. పత్రిక తన ఆయుధం. అచ్చాఫీసు నడపడం తన ప్రవృత్తి. ఎన్ని సమస్యలు ఎదురైనా పత్రిక నడపాలనే పిపాస నరసయ్యలో తీరనేలేదు. నరసయ్యకు జర్నలిజంతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ “ఆ రోజుల్లో Tale of Two Cities లాగా జర్నలిజంపై ఇంత పిచ్చి కనపరచినవాడు అపురూపం” అని బంగోరె నార్లకు ఒక ఉత్తరంలో రాశాడు.5 మద్రాసు మహానగరంలో ప్రారంభమైన నరసయ్య జర్నలిజం ప్రస్థానం నెల్లూరుజిల్లాలోని కోడూరు గ్రామంవరకు సాగి సమాప్తమయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 'ఆంధ్రభాషా గ్రామవర్తమాని' చివరి మజిలీ. మూడు ఇంగ్లీషు పత్రికలు ప్రచురించిన పాతికేళ్ళ జర్నలిజం అనుభవంతో తెలుగు పత్రికా సంపాదకుడుగా కొత్త పాత్రలో ప్రవేశించాడు.

తన కళ్ళముందే ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రారంభమూ, ముగింపు జరిగిన కథ ఒంగోలు వెంకటరంగయ్య ఇట్లా వివరించాడు. “దంపూరు నరసయ్యగారు 1897-98 ప్రాంతములలోఁ జెన్నపట్నము నుండి నెల్లూరికిఁ దిరుగ వచ్చి, ఇచ్చట స్థావరము కుదుర్చుకొని 1900 సంవత్సరమున ఆంధ్రభాషా గ్రామవర్తమాని యనునొక చిన్న వారపత్రికను ప్రారంభించిరి.... పాఠకాదరణము చాలమిని, ప్రవర్తకుని వార్ధక్యము వలనను నియ్యది శైశవముననే యంతరించినది.” ఈ పత్రిక వెలువరించే నాటికి నరసయ్య వార్ధక్యంలో ఉన్నట్లు వెంకటరంగయ్య అభిప్రాయపడ్డాడు.6 “వార్ధక్యం అంటే ఎన్నేళ్ళనోకాని అప్పటికి నరసయ్యగారి వయస్సు 51" అని పెన్నేపల్లి గోపాలకృష్ణ వ్యాఖ్యానించాడు.7 ఈ పత్రిక నడుపుతున్న కాలంలో నరసయ్య కోర్టు పనులమీద తరచుగా వెంకటరంగయ్యను కలుసుకొంటూనే ఉన్నాడు. ఈ సంగతి ఆయన తన దినచర్యలో పలుమార్లు ప్రస్తావించాడు. అప్పటి నరసయ్య స్వరూపం, పరిస్థితి ఆయన వార్ధక్యదశలో ఉన్నట్లు అభిప్రాయం కలిగించి ఉండాలి. ఆనాటి భారతీయుల సగటు ఆయుర్దాయం 30 సంవత్సరాలో, అంతకన్న తక్కువో! పైగా నరసయ్య ఆర్థికంగా చితికిపోయి, జీవిత పోరాటంలో ఓడి నెల్లూరు చేరిన సందర్భం.8

1856లో 'దినవర్తమాని' పేరుతో ఒక తెలుగు వారపత్రిక వెలువడింది. కొక్కొండ వెంకటరత్నం 'ఆంధ్రభాషా సంజీవని' పత్రికను తర్వాత 1871లో ప్రారంభించాడు. వీటి స్ఫూర్తితో నరసయ్య తన పత్రికకు “ఆంధ్రభాషా గ్రామవర్తమాని” అని పేరు పెట్టినట్లుంది. ఆంధ్ర భాషలో గ్రామవర్తమానం తెలిపే పత్రిక అని అర్థం స్ఫురించేటట్లు ఈ పేరు ఎంపిక చేసినట్లుంది. ఆంధ్ర భాష మీద తనకున్న ప్రీతిని, అభిమానాన్ని వ్యక్తం చేయడానికీ, తన పత్రిక భాషా సాహిత్య విషయాలనూ ఆదరిస్తుందని ధ్వనించేందుకు 'ఆంధ్ర' పదం చేర్చి ఉంటాడు. ఆయన పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభించిన రెండేళ్ళకే, తెలుగులో వారపత్రికను వెలువరించేందుకు ప్రయత్నం చేసినా, ఇంతకాలానికి ఆ అభిలాష ఆకృతి ధరించింది. భాషకు సంబంధించి నరసయ్యకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. 1883 నాటికే ఆయన వ్యావహారిక భాషావాది. ఆయన కన్యాశుల్క నాటక సమీక్షలో పండిత భాషను తిరస్కరించి, ప్రజల భాషను ఆహ్వానించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు గ్రామస్థాయిలో ప్రజల సమస్యలపై దృష్టి నిలిపి పత్రిక ఆరంభిస్తున్నాడు. ఆయన కార్యరంగం కోడూరు చుట్టుపట్ల ఉన్న పల్లెటూళ్ళు. ఆయన పాఠకులు గ్రామీణ ప్రజలు. వారి కోసం తనకిష్టమైన ఇంగ్లీషు పత్రికా రచన విడిచిపెట్టి, తెలుగు జర్నలిజంలోకి మారాడు. చెన్నపట్నంలో ఉండి, రెండు దశాబ్దాలు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలపై వ్యాఖ్యానిస్తూ పత్రిక కొనసాగించి, కోడూరు వంటి కుగ్రామాల స్థానిక సమస్యలను విశ్లేషించి పరిష్కారాలు సూచించడానికి ఒక పత్రిక స్థాపించడం నరసయ్యకే చెల్లింది. యవ్వనావేశంలో 'నెల్లూరు పయొనీర్' పత్రికను ఇంగ్లీషులో తీసుకొని వచ్చాడుకాని, ఇప్పుడైతే ఆ పత్రికను తెలుగులోనే వెలువరించి ఉండేవాడు. ఆంధ్రభాషా గ్రామవర్తమానికి ముందూ వెనుక ఎన్నో పత్రికలు పుట్టిగిట్టినా, తెలుగు పత్రికల చరిత్రలో గ్రామీణ ప్రజలకోసం, అదీ నిరు పేద రైతుల ప్రయోజనాలకోసం ప్రత్యేకంగా పత్రిక నడిపిన ఉదంతం కన్పించదు. పత్రికా నిర్వహణలో ఇది అపూర్వ ప్రయోగం. “ఇది ముఖ్యముగా పల్లెటూళ్ళకును, నచ్చటి జనమునకు నుద్దేశింపఁబడినది. పల్లెటూళ్ళ రైతు లనేకురు తమ కష్టముల నీ పత్రికా ముఖమునఁ గెలుపుచుండిరి....... జీవించియుండిన కొలది కాలమును జనోపయోగములగు పలు విషయము లిందుఁ జర్చింపఁ బడుచుండెను. ఇది ముఖ్యముగా నెల్లూరు తాలుకా కోడూరు గ్రామము కొఱకు పుట్టినది” అని ఒంగోలు వెంకటరంగయ్య వివరించాడు.9

తను నిర్దేశించుకొన్న లక్ష్యాలవల్ల సాధారణ పాఠకులు, చందాదారులు ఆంధ్రభాషా గ్రామవర్తమాని మీద ఆసక్తి కోల్పోతారనే సంకోచం నరసయ్య మనసులో లేకపోలేదు. తనది చిన్న వార్తాపత్రిక అని, గ్రామ సమస్యలమీద, ప్రత్యేకంగా కోడూరు గ్రామ సమస్యల మీద దృష్టి పెట్టడంవల్ల, తరచుగా గ్రామాణుల స్థితి గతులమీద రాయవలసి వస్తూందని, పాఠకులు తన పత్రిక పరిమితులు దృష్టిలో ఉంచుకొని, విముఖత చూపకుండా ఆదరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. “ఇది చిన్న పత్రిక. ఇందులో అప్పుడప్పుడూ నెల్లూరుజిల్లా వార్తలను ప్రచురిస్తూ ఉంటాము. ఆయా విలేకరులు పంపిన వార్తలను, రచనలను కూడా ప్రచురిస్తాము. ప్రభుత్వాధికారులను, కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టరును ఈ పత్రికలో ప్రచురించబడుతున్న వార్తలను శ్రద్ధగా చదవమని కోరుతున్నాం” అని విన్నవించుకొన్నాడు. 10 1901 మార్చి, ఏప్రిల్ కళావతి మాసపత్రికలో ప్రచురించిన ప్రకటనలో “ఇది తెలుగు పల్లెటూళ్ళ జనులకుగాను సులభశైలిలో నెల్లూరు నుండి దంపూరు నరసయ్యగారిచే ప్రతి శనివారమును ప్రకటించబడు వార్తాపత్రిక” అని వివరణ వంటి వాక్యం ఉంది.11 ఆ పత్రిక ప్రారంభమైన ఏడాది తర్వాత, బహుశా తన పత్రిక పరిధి తెలుగుజిల్లాల పల్లెటూళ్ళకు విస్తరించాలని నరసయ్య భావించినట్లు ఈ ప్రకటనవల్ల బోధపడుతూంది.

నేటివ్ న్యూస్‌పేపర్ రిపోర్టులు

ఆంధ్రభాషా గ్రామవర్తమాని సంచికలు ఇప్పుడు లభించకపోయినా, ఆ పత్రికలోని కొన్ని వార్తలు, వ్యాసాలు, సంపాదకలేఖలు ఇంగ్లీషు అనువాదరూపంలో మనకు మిగిలాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1876 ప్రాంతాలకే దేశభాషా పత్రికలమీద నిఘా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అనువాదకులు దేశభాషలలో వెలువడే పత్రికలను పరిశీలించి, అవసరమైన విషయాలను అధికారులకు నివేదించేవారు. ఆ నివేదికలలో పత్రికలకు సంబంధించిన వివరాలు కూడా పొందు పరచేవారు. పత్రిక ఏ ప్రదేశం నుంచి ప్రచురించబడుతున్నది, ఎన్నిరోజులకు ఒకసారి వెలువడేది, ప్రచురణ తేది, ఏ తారీకున ప్రభుత్వ కార్యాలయానికి అందింది, ఎన్ని ప్రతులు ముద్రించబడుతున్నది మొదలైన వివరాలు నమోదు చేసేవారు. ఈ రహస్య నివేదికలవల్లే ఇప్పుడు లభించని అనేక పత్రికల వివరాలు, స్వరూప స్వభావాలు గ్రహించడానికి వీలుపడింది. ఇవి "నేటివ్ న్యూస్ పేపర్ రిపోర్టులు" (Native Newspaper reports) "కాన్‌ఫిడెన్షియల్ న్యూస్ పేపర్ రిపోర్టులు" (Confidential Newspaper reports) మొదలైన పేర్లతో చెన్నైలోని తమిళనాడు ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి ఉన్నాయి.12

ప్రారంభ సంచిక

ఒంగోలు వెంకటరంగయ్య ఆంధ్రభాషా గ్రామవర్తమాని 1900లో ప్రారంభమైనట్లు పేర్కొన్నాడు. ఆ పత్రిక ఎప్పుడు ప్రారంభమైందో మరింత నిర్దుష్టంగా చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. నెల్లూరు సాహిత్య మాసపత్రిక అముద్రిత గ్రంథ చింతామణి అధిపతి పూండ్ల రామకృష్ణయ్య తన మిత్రుడు వేదం వేంకటరాయశాస్త్రికి 1900 మే 22న రాసిన ఉత్తరంలో నరసయ్య పత్రికను ప్రస్తావించాడు....... దంపూరు నరసయ్యగారు ప్రతాప గురించి వారు నూతనముగా ప్రకటించుచున్న ఆంధ్రగ్రామవర్తమాని అను పత్రిక యొక్క 3 సంచికలో విమర్శించినారు. అందులో మన విమతులందరికి బుద్ధి చెప్పినారు” అని పేర్కొనడంవల్ల ఆంధ్రభాషా గ్రామవర్తమాని 3వ సంచిక అంతకుముందు కొద్దిరోజుల క్రితమే విడుదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతూంది. నేటివ్ న్యూస్ పేపర్ రిపోర్టులలో ఏప్రిల్ 28వ తారీకు సంచిక ప్రస్తావన మొదటిసారి వస్తుంది. తొలిసంచిక ఈ తేదీన ప్రచురించబడి ఉంటే, మూడో సంచిక మే 12వ తేదీ నాటిది అవుతుంది. నరసయ్య ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో ఏయే విషయాల మీద రాశాడో సాకల్యంగా పరిశీలించి రాయడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అనువాదకుడు తన నివేదికలలో చేర్చిన పరిమిత విషయాలు (షుమారు 160 అంశాలు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అనువాదకుడు తన సంకుచిత దృష్టికోణం నుంచి పరిశీలించి రిపోర్టు చేసిన సంగతులే - గ్రామ సమస్యల నుంచి, అంతర్జాతీయ వార్తల వరకు ఉన్నాయి. 1900లో 33 సంచికలలోని అంశాలు, 1901లో 43 సంచికలలోని విషయాలు ఈ రిపోర్టులలో పేర్కొనబడ్డాయి. ఈ రెండు సంవత్సరాలు పత్రిక సక్రమంగా వెలువడిందని చెప్పడానికి ఇంతకన్న బలమైన సాక్ష్యం ఏంకావాలి? ఈ రిపోర్టులలో పేర్కొనబడని కొన్ని సంచికల ప్రస్తావనలు ఇతర సాహిత్య ఆకరాల్లో, పత్రికల్లో వస్తాయి.13

వారంవారం ఆంధ్రభాషా గ్రామవర్తమాని 150 ప్రతులు అచ్చయ్యేవి. ఆ రోజుల్లో ఏ తెలుగుపత్రిక సర్క్యులేషనూ వేయి కాపీలకు మించలేదు. మద్రాసు నుంచి వెలువడే క్రైస్తవ మిషనరీల మాసపత్రిక “మెసెంజర్ ఆఫ్ ట్రూత్" (Messenger of Truth) ఒక్కటే 4800 ప్రతులు ముద్రించ బడుతున్న తెలుగు పత్రిక. ఆంధ్రప్రకాశిక (biweekly) 650 ప్రతులు, శశిరేఖ (bi-weekly) 550 ప్రతులు, హిందూజన సంస్కారిణి మాసపత్రిక 350 ప్రతులు, సత్య సంవర్ధని మాసపత్రిక, సూర్యాలోకం, దేశాభిమాని వారపత్రికలు 350 కాపీలు, రవి వారపత్రిక 250 కాపీలు, విడుదలవుతున్నట్లు తెలుస్తూంది. ఆంధ్రభాషా గ్రామవర్తమాని పరిమిత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే, ఈ సంఖ్య సమంజసంగానే తోస్తుంది. ఇంత తక్కువగా సర్క్యులేషను ఉండడంవల్లే ఆనాటి పత్రికలు ఇప్పుడు లభించడంలేదని భావించడానికి అవకాశం ఉంది. అయితే, నెలనెలా 100 నుంచి 150 ప్రతులదాకా ముద్రించబడుతూ వచ్చిన అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక ప్రచురణ ఆరంభమైన నూట ఇరవై సంవత్సరాల తర్వాత, ఇప్పుడు కూడా అనేక ప్రాచీన గ్రంథాలయాల్లో, వ్యక్తుల పుస్తక సంచయాల్లో భద్రంగా ఉండడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ పత్రిక ఒక్కటేకాదు, ఆనాటి ఇతర సాహిత్య పత్రికలు ఒకటి రెండు కాపీలైనా ప్రాచీన గ్రంథాలయాల్లో జాగ్రత్త చేయబడి ఉన్నాయి.14 వార్తాపత్రికలకన్నా, సాహిత్య పత్రికలను ప్రజలు పదిలపరచు కొన్నారని అనిపిస్తుంది. పత్రికల ఆకారం కూడా ఒక నిర్ణాయక అంశంగా మారినట్లుంది. పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్రభాషా గ్రామవర్తమాని 'రాయల్ ఫారం' మిద ముద్రించ బడడంవల్ల జాగ్రత్త చేయడం కష్టం అయి ఉంటుంది.

నరసయ్య దినచర్యలో ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రచురణ ప్రస్తావన ఉంది. "Sunday - Monday and half of Tuesday engaged in writing leaders, picking up news and writing for the issues of 'గ్రామవర్తమాని' for 25th May and 1st June 1901... By Tuesday afternoon work of 'గ్రామవర్తమాని' of 25th May fully set up" (1901 June 25th)1' పత్రిక నిర్వహణలో సంపాదకుడు, విలేకరి, ప్రూఫ్‌రీడరు అన్నీ తానే అయి వ్యవహరించినట్లుంది. అనాటి చిన్న పత్రికలన్నీ ఇదే పద్ధతిలో కొనసాగాయి. నెలరోజుల క్రితం విడుదల కావలసిన సంచికను ఇంత ఆలస్యంగా సిద్ధం చేశాడంటే, పత్రికను తీసుకొని రావడంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అర్ధమవుతుంది.

పత్రికల దృక్పథంలో వచ్చిన మార్పు

చరిత్రకారులు స్వాతంత్ర్యోద్యమాన్ని స్థూలంగా మూడు దశలుగా గుర్తించారు. 1885 నుంచి 1905 వరకు మొదటి దశ. ఈ తొలిదశలో ఇంగ్లీషు విద్యాధికులైన మేధావులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. పరిపాలనలోని లోపాలు సరిదిద్దితే చాలని భావించారు. ప్రజాచైతన్యాన్ని మేల్కొల్పి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపడానికి కృషి చేశారు. 1884లో మద్రాసు మహాజనసభ ఆవిర్భావం, భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడడం, జిల్లాసభలు ఏటేటా జరగడంతో మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం రగులుకొన్నది. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో పత్రికలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి.

కాంగ్రెసు దేశ ఆర్థిక విషయాల మీద దృష్టి నిలిపింది. దేశసంపద వృథా కాకుండా అడ్డుకోవాలని, ప్రభుత్వవ్యయం తగ్గించుకోవాలని, ప్రజల ఆర్ధిక పరిస్థితిమీద విచారణ జరపాలని కోరింది. అడవిచట్టాలు, ఉప్పుపన్ను, స్థానిక స్వపరిపాలన, బీళ్ళు, పచ్చికబయళ్ళు, నీటి వనరులు, అబ్కారి పన్ను మొదలైన సమస్యలమీద కాంగ్రెసు సమావేశాల్లో చర్చలు జరిగేవి. కరవుకాటకాల నుంచి విముక్తి కోసం అనుసరించవలసిన వ్యూహం, రైతుల పేదరికం, వారి దయనీయస్థితి ఇరవయ్యో శతాబ్దం ఆరంభమయ్యేసరికి కాంగ్రెసు సభలలో ప్రముఖంగా నిలిచాయి.

దాదాపు పై అంశాలే ఆనాటి భారతీయ పత్రికలలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఉన్నత పదవుల్లో భారతీయులకు అవకాశాలు లేకపోవడం, జాతివివక్ష, గ్రామీణ పేదరికం, ప్రభుత్వోద్యోగుల అవినీతి, పోలీసుశాఖ వైఫల్యం, ఆయుధచట్టం, న్యాయవ్యవస్థలో లోపాలు, కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలలో ప్రభుత్వాధికారుల పెత్తనం, లెజిస్లేటివ్ కౌన్సిళ్ళ పనితీరు, న్యాయవ్యవస్థను పరిపాలనావ్యవస్థ నుంచి విడదీయాలనికోరడం, న్యాయస్థానాల్లో మితిమీరిన జాప్యం , క్రైస్తవ మత ప్రచారకులకు ప్రభుత్వ ప్రోత్సాహం, మతమార్పిడి, భారతీయుల పేదరికం పట్ల ప్రభుత్వ ఉదాసీనత, ఆదాయంపన్ను విధానంలో లొసుగులు మొదలైన విషయాలు ఆనాటి పత్రికలలో ప్రముఖంగా చర్చించబడ్డాయి. పందొమ్మిదో శతాబ్ది ముగింపుకు వచ్చేసరికి విద్యావంతుల దృష్టి సామాజిక, సంస్కరణ విషయాల మీద నుంచి దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితుల వైపు మరలింది. వందేమాతరం ఉద్యమంతో ప్రజల రాజకీయ చైతన్యం జాగృతమైంది.

ఆ కాలంలో ఆంధ్రప్రకాశిక, వివేకవర్ధని, దేశాభిమాని, సూర్యాలోకం, రసికజనోల్లాసిని, శశిలేఖ వంటి పత్రికలు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో ముందు నిలిచాయి. నెల్లూరు నుంచి వార్తా దర్శిని, ఆంధ్రదేశోపకారి, ఆంధ్రభాషా గ్రామవర్తమాని వంటి రాజకీయ వార్తాపత్రికలు వెలువడ్డాయి. బుచ్చిరెడ్డిపాళెంనుంచి శ్రీ వర్తమాన తరంగిణి మాసపత్రిక సాహిత్యానికి, వార్తలకు సమప్రాధాన్యాన్నిస్తూ వెలువడింది.16

ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో చర్చించబడిన విషయాలు

దారిడొంకలు లేని ఊళ్ళు

కోడూరు గ్రామాభివృద్ధికోసం, ఆ గ్రామసమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కరించడానికి పత్రిక ప్రారంభించినట్లు నరసయ్య పదే పదే చెప్పాడు. నరసయ్య ఊహలో ప్రతి ఊరికి ప్రధాన మార్గాన్ని కలుపుతూ మంచిరోడ్డు, చుట్టుపట్ల ఊళ్లను కలుపుతూ చక్కని బాటలు, ఊరూరా ఒక పాఠశాల, గ్రంథాలయం, పోస్టాఫీసు, పశువులకు, మనుషులకు వైద్య సౌకర్యం, గ్రామీణుల చిన్న చిన్న తగాదాలను తీర్చడానికి గ్రామ న్యాయస్థానం, బందెలదొడ్డి తప్పనిసరిగా ఉండాలి. గ్రామాణుల సౌకర్యాలను పట్టించుకోక పోవడం ఇంగ్లీషువారి పరిపాలనలో పెద్దలోపమని ఆయన భావించాడు.

గ్రామాలలో రోడ్లను గురించి నరసయ్య వివరంగా రాశాడు. “వేసవిలో తప్ప పల్లెటూళ్ళకు బండిలో ప్రయాణం చెయ్యడానికి బాటలు లేవు. రోడ్లు వెయ్యకుండానే ప్రభుత్వం రైతులవద్ద 'రోడ్డు సెస్సు' వసూలుచేస్తూంది. ఈ సెస్సులో పాతికోభాగం రైతులకిస్తే, వారే గ్రామాలకు రోడ్లు వేసుకొంటారు. గ్రామాలను ప్రధాన మార్గాలతో కలిపినప్పుడే అభివృద్ధి చెందుతాయి. గ్రామాలలో భూస్వాములు రైతులకు సహకరించడం లేదు. ప్రభుత్వం రైతులగోడు పట్టించుకోకపోతే, ప్రభుత్వానికీ భూస్వాములకూ తేడా ఉండదు” అని ఒక వ్యాసంలో హెచ్చరించాడు.17 వర్షాకాలంలో కోడూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా, ఊరుముంగిట ప్రవహించే వాగుమీద వంతెన నిర్మించాలని జిల్లా కలెక్టరును అభ్యర్థించాడు.

శ్రోత్రియం గ్రామాలు

నెల్లూరు జిల్లా శ్రోత్రియం గ్రామాల సమస్యలను విశ్లేషించి శ్రోత్రియం భూములను, మాన్యాలను ఆక్రమించుకొని అనుభవిస్తున్న భూస్వాములకు వ్యతిరేకంగా రాశాడు. సమర్థులైన అధికారులచేత శ్రోత్రియం గ్రామాలను తిరిగి సర్వేచేయించి, లెక్కలు తేల్చాలని, అందువల్ల ప్రభుత్వాదాయం పెరుగుతుందని సూచించాడు. “జిల్లా కలెక్టరుకు విలుకానిపల్లె ఎక్కడుందో తెలుసా? తెలియకపోతే, మేము వివరిస్తాము. నెల్లూరుకు పదిమైళ్ళ దూరంలో ఈ పల్లె ఉంది. కోడూరు రోడ్డు ఈ పల్లె మధ్యగా వెళ్తుంది. రోడ్డుపక్కనే ఉన్న ఈ పల్లె అభివృద్ధిని గురించి పట్టించుకోకుండా, ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం దురదృష్టం. ఊరికి రోడ్డుకు మధ్య పొలాలున్నాయి. పైరు పెట్టిన తర్వాత మనుషులు, పశువులు ఊళ్ళోకి వెళ్ళడం సాధ్యం కాదు. ఈ ఊరి ప్రజలవద్ద ఎంతమొత్తం రోడ్డుసెస్సు వసూలు చేస్తున్నారు? ఇక్కడి ఇనాందార్లు తమ శ్రోత్రియాలను, మాన్యాలను అనుభవిస్తున్నారా? వారి పొలాలను ఎవరు ఆక్రమించుకొని సొంతం చేసుకొన్నారు? ప్రభుత్వం ఎన్నడైనా ఈ విషయాలు పరిశీలించిందా? ఇటీవలి సర్వేలో ఈ భూములను కొలిచి సక్రమంగా నంబర్లు ఇచ్చారా? సర్వేలో ఎంతభూమి మిగులు తేలింది? ఈ భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్న వారికున్న హక్కులేమిటి? ఈ వివరాలన్ని పరిశీలించి నిగ్గు తేల్చవలసిన అవసరంలేదా? ప్రభుత్వానికి నష్టం కలిగితే, ప్రజలకు నష్టంకాదా? మేము జిల్లా కలెక్టరును, తాసిల్దారును ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. ప్రజాశ్రేయస్సు, దేశహితం తప్ప, ఈ విషయాలు ప్రస్తావించడంలో మాకు వేరే ఉద్దేశాలు లేవు” అని విలుకానిపల్లె సమస్యలను వివరించాడు.18

“గ్రామాలలో దురలవాట్లు అధికం. గ్రామాణులు పశువులను ఇతరుల పొలాలలోకి, దొడ్లలోకి విడిచిపెడతారు. పశువులు పంటపొలాలను నాశనం చేస్తాయి. నీటి వసతి ఉన్నా వేసవిలో పైరు పెట్టుకొనే అవకాశం లేదు. ప్రతి గ్రామానికి ఒక బందెలదొడ్డి ఉండాలని” దాన్ని నిర్వహించే ఏర్పాట్లను కూడా నరసయ్య ఒక వ్యాసంలో చర్చించాడు. పశువుల వైద్యం కోసం అన్ని తాలుకాలకు వెటర్నరీ ఇన్‌స్పెక్టరులను నియమించాలని మరొక వ్యాసంలో సూచించాడు. రోగాలవల్ల పశుసంపద నశిస్తుందని, అందువల్ల వ్యవసాయాభివృద్ధి మందగిస్తుందని ఆ వ్యాసంలో వివరించాడు.19

గ్రామీణ పాఠశాలలు

నరసయ్య విద్యావేత్త. స్కూళ్ళ ఇన్స్‌పెక్టరుగా పనిచేసిన అనుభవం ఉంది. పల్లెటూళ్ళ చదువులను గురించి తన పత్రికలో తరచుగా చర్చించాడు. 500 పైబడిన జనాభా ఉన్న ప్రతి ఊరిలో ప్రభుత్వ పాఠశాల నెలకొల్పాలని, చిన్న చిన్న ఊళ్ళలో గ్రాంటు స్కూళ్ళు ప్రారంభించాలని, స్కూలు సెస్సు (school cess) వసూలుచేసి బళ్ళు నిర్వహించాలని సూచించాడు. కొన్ని వేలమంది విద్యార్థులు ఇంగ్లీషు నేర్చుకొని, పాండిత్యం సంపాదిస్తున్నారని ఒకవైపు సంతోషపడుతూ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు చదువుకోడంలేదని విచారం వ్యక్తం చేస్తాడు. బడికి వెళ్ళి చదువుకోవలసిన మగపిల్లలలో ఇరవై అయిదు శాతం కూడా స్కూళ్ళకు పోవడంలేదని నిట్టూరుస్తాడు. "ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నం వృథా అవుతూంది. ఇప్పుడు అమలులో ఉన్న “సాధారణ గ్రాంటు స్కూళ్ళ విద్యా విధానం” విద్యను ప్రోత్సహించడం లేదు. సామాన్య ప్రజలకు విద్యమీద ఆసక్తి లేదు. వారి దృష్టి చదువుమీద నిలిపే ప్రయత్నం కొనసాగడం లేదు. ఈ పరిస్థితికి ఎవరిని తప్పుపట్టాలి? చిన్నపిల్లలనా? తల్లిదండ్రులనా? ప్రభుత్వాన్నా?” అని ప్రశ్నిస్తాడు.

పల్లెటూళ్ళలో కాస్త తెలివితేటలున్న వారిని ఉపాధ్యాయులుగా నియమించి వారికి జీతబత్యాలు ఏర్పాటు చెయ్యాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల దగ్గర 'ఫీజు' వసూలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని సూచిస్తాడు. ఏడాదికొకసారి ఇన్‌స్పెక్షను జరిపి అసమర్థులైన ఉపాధ్యాయులను తొలగించాలని స్కూళ్ళ సంస్కరణను సూచిస్తాడు.20 సూళ్ళలో ఇంగ్లీషు బోధన సక్రమంగాలేదని, తరచుగా పాఠ్యపుస్తకాలను మార్చడం మంచి పద్దతి కాదని, నరసయ్య అభిప్రాయం. "Nesfield's Grammar" లోపాలను వివరించి, ఇంగ్లీషు వ్యాకరణ బోధనలో అనుసరించవలసిన పద్ధతులను సూచిస్తాడు.21 1898-99 మద్రాసు అడ్మినిస్ట్రేషను రిపోర్టు (Madras Administration Report) ను ఉదాహరించి, ప్రెసిడెన్సీలోని 53 శాతం పెద్ద ఊళ్ళలో, 94 శాతం చిన్న ఊళ్ళలో స్కూళ్ళులేవని, ఈ అన్యాయమైన పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నాడు. “ప్రతి గ్రామంలో ఒక చిన్నబడి ప్రభుత్వం ఎందుకు ప్రారంభించకూడదు? విద్యలేని ప్రజలు అజ్ఞానులతో సమానమైనవారు” అని చెప్తూ స్కూలు సెస్సు వసూలుచేసి ప్రతి ఊళ్ళో బడి జరపవచ్చని సలహా ఇస్తాడు. పట్టణాలలో ప్రజలకు ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తున్నారని, గ్రామాలలో సక్రమంగా ఉత్తరాలు బట్వాడా చేసే ఏర్పాటు కూడా లేదని పల్లెటూళ్ళపట్ల ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తాడు.22

గ్రామ న్యా యస్థానాలు (Village Courts)

గ్రామ న్యాయస్థానాలమీద ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో నరసయ్య తరచుగా రాశాడు. 1889 ఒకటవ యాక్టు (Act I of 1889) ప్రకారం విలేజి కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ చట్టం పరిధిలో గ్రామాల్లో చిన్న చిన్న సివిల్ క్రిమినల్ కేసులను విచారించి, పరిష్కరించే బాధ్యత, అధికారం గ్రామాధికారులకు, విలేజి మున్సిపులకు అప్పగించబడింది. ఈ గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ నెల్లూరు జిల్లాలో చక్కగా అమలు కాలేదు. విలేజి కోర్టులు చక్కగా పనిచేస్తే, గ్రామాలలో తగాదాలు తగ్గి శాంతి నెలకొంటుందని, 'లిటిగేషన్' (litigation) సమసిపోతుందని నరసయ్య అభిప్రాయపడ్డాడు. ప్రతి పెద్ద గ్రామంలో విలేజి కోర్టు ఏర్పాటు చెయ్యాలని, కొన్ని చిన్న , చిన్న గ్రామాలను కలిపి ఒక కోర్టు నిర్వహించాలని, గౌరవప్రదమైన జీతంతో ఈ కోర్టు నిర్వహణను ఆయా గ్రామ మున్సిపులకు అప్పచెప్పాలని, మెట్రిక్యులేషను పాసయినవారినే గ్రామ మునిసిపులుగా నియమించి వారికి సివిలు, క్రిమినలు, రెవెన్యూ పరిపాలన బాధ్యతలను అప్పగించాలని ఆయన తన పత్రిక ద్వారా ఒక ఉద్యమం నడిపాడు. అవసరమైనపుడు 'గౌరవ' విలేజి మున్సిపులను నియమించి, వారికి ఈ కోర్టుల బాధ్యత అప్పగించవచ్చని సూచించాడు. గ్రామ న్యాయస్థానాల చట్టం పాసయి ఎన్నేళ్ళయినా అమలులోకి రాలేదని, “ఈ చట్టం అసలు అమలులో ఉందా? లేదా? సమర్ధులైన మున్సిఫులను ఎక్కడ నియమించారు? ప్రభుత్వానికి శిస్తు వసూలైతే చాలు. ఇంకేమీ పట్టదు” అని తీవ్రంగా రాశాడు. చివరకు తన కృషి ఫలించి, కోడూరు గ్రామ మునిసిపు విలేజికోర్టును చక్కగా నిర్వహించి, సంతృప్తికరంగా తీర్పు చెబుతున్నట్లు ఒక వార్త రాశాడు.23

రైతుపక్షపాతం

నరసయ్య నిరుపేద రైతుల కష్టాలను తన పత్రిక ద్వారా వెల్లడిచేశాడు. గ్రామీణ పేదరికాన్ని గురించి రాస్తూ, “తరచుగా కరవు కాటకాలు పలకరిస్తున్నాయి. రోజురోజుకూ గ్రామీణులు నిరుపేదలుగా మారుతున్నారు. గవర్నరులు వస్తారు పోతారు. పేద రైతుల పరిస్థితులు పైన ఉన్న దేవుడికి, ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలుసు” అని వ్యాఖ్యానిస్తాడు.24 రైతుల మధ్య గ్రామంలో ఉండి సొంత సేద్యం చేయడంవల్ల ఆయనకు రైతుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసు. నీటిపారుదలశాఖ అధికారుల అవినీతి, నిరుపేద రైతులచేత ప్రభుత్వం బలవంతపు కుడిమరమ్మత్తు పనులు చేయించడం, గ్రామాధికారుల మోసాలు, పిలవని పేరంటంగా వచ్చి తొంగిచూచే కరవు కాటకాలవల్ల రైతులు నాదారయిపోవడం - దేనినీ నరసయ్య విడిచిపెట్టలేదు. “జమాబంది దగ్గరపడుతున్న కొద్దీ రైతులు నానా హైరానా పడుతున్నారు. ధాన్యం ధరపడిపోతూంది.” అంటూ రైతులు శిస్తుచెల్లించే విధానంలో మార్పులుతెచ్చి, వెసులుబాటు కలిగించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తాడు. ఏ సంవత్సరం అసెస్మెంటు (assessment) ఆ సంవత్సరమే వసూలుచెయ్యకుండా,వచ్చే ఫసలీలో వసూలు చెయ్యాలని రైతుల పక్షాన ప్రార్ధించాడు. శిస్తు మొత్తం ఒక్కసారి కాకుండా, వాయిదాల పద్దతిలో వసూలు చెయ్యాలని సూచించాడు. గిట్టుబాటు ధర వచ్చేవరకు

ధాన్యం అమ్మవద్దని, శిస్తు చెల్లించడానికి అవసరమైన ధాన్యంమాత్రమే అమ్మమని రైతులకు హితవు చెప్తాడు. “ప్రభుత్వం రైతులను కన్నబిడ్డలవలె చూచుకోవాలి. రైతునాశనమైతే, దేశం నష్టపోతుంది, ప్రభుత్వం నష్టపోతుంది.” అని హెచ్చరిస్తాడు.25

రెవెన్యూ వ్యవస్థ

రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను నరసయ్య నిర్దాక్షిణ్యంగా విమర్శించాడు. ఈ వ్యవస్థలోని అమానుషత్వాన్ని ఎండగట్టాడు. “మద్రాసు పరగణాలోని రైతులు నిరుపేదలు. ఈ పరగణాలో రైత్వారీవిధానం మహాసంక్లిష్టమైనది. ఈ వ్యవస్థ భూకామందులకు, కరణాలకు, రెవెన్యూ అధికారులకు దోచుకోడానికి అనుకూలమైనది. బొంబాయి పరగణాలో భూమి సర్వేచేయించినట్లు ఇక్కడ కూడా తిరిగి సర్వేచేయించి రైత్వారివిధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి. పేదరైతుల దారుణ జీవన స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం అనుకూలంగా స్పందించాలి” అని పేదరైతుల తరఫున వకాల్తా తీసుకొంటాడు.26

జమాబంది

“రెవెన్యూ అధికారులూ, గ్రామాధికారులూ కలిసికట్టుగా రైతులను కొల్లగొట్టేవిధానం జమాబంది” అని, జమాబంది పేరుతో సాగే నాటకాన్ని బయట పెట్టాడు. “రెవెన్యూ అధికారుల దండుగమారి చాకిరి జమాబంది” అని కూడా ఎగతాళి చేస్తాడు. “ఇది కొరగాని కార్యక్రమం. ప్రజలకు జమాబంది అధికారులెవరో తెలియదు. గ్రామాధికారులు, తాలుకా హుజూరు అధికారులు వృథాగా శ్రమిస్తారు. జమాబంది కర్చంతా రైతులనెత్తిన రుద్దుతారు. జమాబందిలో మంజూరుచేసిన పట్టాలను రైతులకు ఇవ్వరు” అని జమాబంది పేరుతో సాగే తంతును పేర్కొంటాడు.27 “రైత్వారీ విధానంలో ప్రతి రైతుకు ఏటా భూమిపట్టాలు ఇస్తారు. రైతులు చెల్లించవలసిన శిస్తులు, సెస్సులు మొదలైన వివరాలు ఈ పట్టాలలో పేర్కొంటారు. ఈ పట్టాలు జారీచేసే కార్యక్రమానికి మరో పేరు 'జమాబంది'. జమాబంది నిర్వహించిన అధికారి రైతుల విన్నపాలు ఓపికగా వింటున్నాడా? మా ఎరుకలో అటువంటి అధికారులు లేరు. జమాబంది చాలా సంక్లిష్టమైన కార్యక్రమం. దీన్ని నిర్వహించే అధికారిలో ఎంతో ఓర్పు, సుగుణాలు ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవారు ఈ రోజుల్లో అరుదు. అందువల్ల మేము శాశ్వత పట్టాలిమ్మని ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నాము” అని రాశాడు. అంతేకాదు “రైత్వారీ విధానంలో రైతు ఏటా ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తూంది. జమాబందిలో గ్రామాధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, హుజూరు సేవకులు, గుమాస్తాలు లాభపడతారు. శిరస్తదార్లు, తాసిల్దార్లు, ఇతర జమాబంది అధికారులు రైతులవద్ద బత్తాలు పుచ్చుకొంటారు. వారికి అనేకరూపాల్లో సప్లైలు అందుతాయి. రైతులు తెలివిమీరి నడుచుకొంటే తప్ప, వారికి ఏదీ జరగదు. జమాబందిలో మంజూరు చేసిన పట్టాలు చేతికిరావు. కోడూరు గ్రామాధికారి ఈ పత్రికా సంపాదకుడికి పట్టాలు అందచేసిన పాపాన పోలేదు.” అంటూ జమాబంది పేరుతో నడిచే మోసాలను వివరిస్తాడు.28

గ్రామాధికారులు

ప్రభుత్వ యంత్రాంగంలోని దోపిడి పద్ధతులను నరసయ్య క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఆయన గ్రామాధికారుల వ్యవస్థను వ్యతిరేకించాడు. “గ్రామాధికారులు మహాబలవంతులు, వారే సర్వాధికారులు. పంట పొలాలను పరిశీలించకుండానే చిత్తం వచ్చినట్లు సెస్సులు ప్రతిపాదిస్తారు. వారు ఎంత అంటే అంత మొత్తం రైతు చెల్లించాల్సిందే. వారు రాసే లెక్కలు కాకిలెక్కలు. రికార్డులో నమోదుచేసిన మొత్తంకంటే అదనంగా వసూలు చేసిన డబ్బును గ్రామాధికారులు, రెవెన్యూ అధికారులు తలా ఇంత పంచుకొంటారు” అని వారి వ్యవహారాన్ని బయటపెడతాడు.29 రెవెన్యూశాఖలో అక్రమార్జన గురించి తెలుసుకోడానికి సి. రంగాచారి రాసిన “రెవెన్యూ బ్రైబరి” (Rev. enue bribery) గ్రంథాన్ని పరిశీలించమని పై అధికారులకు సూచిస్తాడు. ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన ఏ దివాన్ బహదూరు రఘునాథరావునో, పళ్ళె చెంచలరావునో అన్ని జిల్లాలకు పంపి, రెవెన్యూశాఖ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతాడు.30

“పరిపాలనలో లోపాలున్నాయని రాస్తే మీకు కోపం వస్తుంది. మేము రాసే ప్రతి అంశానికి సాక్ష్యం తెమ్మంటే పేదవాళ్ళు ఎక్కడ నుంచి సాక్ష్యం తెస్తారు? సత్యమైన సంగతే అయినా ప్రతిదీ నిరూపించడం సాధ్యంకాదు. ప్రభుత్వమే విచారించుకోవాలి” అని రెవెన్యూశాఖ అవినీతిని గురించి వ్యాఖ్యానిస్తాడు. ఆ రోజుల్లో లంచగొండి అధికారులు నరసయ్య పేరుచెప్తేనే హడలి చచ్చేవారని సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ద్వారా తెలిసింది.31

గ్రామకరణాలు

“తప్పుడు లెక్కలు రాయడంలో గ్రామకరణాలు అసాధ్యులు. వీరి దొంగలెక్కల వల్ల రైతు ప్రాణాలకు వస్తుంది. కరణాలు పొలాలకు వెళ్ళి పరిశీలించరు. ఇష్టం వచ్చినట్లు పంటల వివరాలు నమోదుచేస్తారు. వీరు నమోదుచేసిన రకరకాల శిస్తులను, సెస్సులను పై అధికారులు ఆమోదిస్తారు. కరణాల మోసాలు పసిగట్ట గలిగిన అధికారులెవరూ ఉండరు. ఈ మోసాలను జమాబంది అధికారికూడా కనిపెట్టలేడు. రెవెన్యూశాఖ నిబంధనలమూలంగానే అధికారులు అవినీతి పరులవుతున్నారు. గంజాం, నెల్లూరు, కడప కరణాలు పెద్ద అవినీతి పరులని ప్రభుత్వానికి తెలుసు” అని 1897-99 అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు (Administration Report) నుంచి వివరాలు వెలికి తీసి చూపాడు.32 విద్యా గంధంలేనివారిని, ఒకే కుటుంబానికి చెందినవారిని, అన్నదమ్ములను పక్కపక్క పల్లెల్లో గ్రామ మునిసిపులుగా నియమించడాన్ని నరసయ్య వ్యతిరేకించాడు.33 స్థానికులను గ్రామాధికారులుగా నియమించే విధానాన్ని మాని, విద్యావంతులు, సమర్థులైనవారిని గ్రామాధికారులుగా నియమించాలని, రైతుల కష్టాలు కడతేరడానికి ఇదొకటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డాడు. గ్రామాధికారులు విధులు నిర్వహించే గ్రామాలలో వారికి భూములుండకూడదని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును మద్రాసు పరగణాలో కూడా అమలుచెయ్యాలని ప్రభుత్వాన్ని అర్థిస్తాడు.34 పెద్ద భూస్వామ్య కుటుంబానికి చెందిన కోడూరు మునిసిపు అక్రమాలను పత్రిక ద్వారా వెలికితెచ్చి, ప్రభుత్వం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగించేవరకు ఆయన నిద్రపోలేదు.35

గ్రామాధికారులకు వ్యతిరేకంగా ఇంత రాసినా, వారి కష్టాలు నరసయ్యకు తెలియకపోలేదు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పత్రికలో చర్చించాడు. గ్రామాధికారుల వేతనాలు చాలా తక్కువని, వారి వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. పై అధికారులకు 'సప్లై'లు చెయ్యలేక, కొందరు గ్రామాధికారులుగా కొనసాగడానికి విముఖత చూపుతున్నారని, ఇటువంటి అవసరాలకే గ్రామాధికారులు రైతుల వద్ద అదనంగా వసూళ్ళు చేస్తారని వివరిస్తూ వారి స్థితిగతులను సానుభూతితో చర్చించాడు.36

గ్రామ సేవకులు

వెట్టిచాకిరి గురించి, వెట్టి వారి జీతబత్యాలను గురించి, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే కఠిన పరిస్థితులను గురించి నరసయ్య ఎంతో సానుభూతితో రాశాడు. “గ్రామాధికారులు గ్రామ సేవకులకు, కావలివారికి నెలనెలా చెల్లించవలసిన వేతనంలో కొంతభాగం దిగమింగకుండా సక్రమంగా చెల్లిస్తున్నారా? ప్రతి ఫలం ఇవ్వకుండా తమ పొలాల్లో గ్రామ సేవకులచేత వెట్టిచాకిరి చేయించుకోడం లేదా?” అని సూటిగా ప్రశ్నిస్తాడు.37

కుడి మరమ్మత్తు పనులు

“రైతులకు ఇబ్బంది కలిగించే నిబంధనలు విధించరాదనే సంగతి అందరికీ తెలిసినదే. ఆచరణలో అట్లా జరగడం లేదు. రెవెన్యూ అధికారులు పేద రైతులను కుడి మరమ్మత్తు పనులకు రమ్మని వేధిస్తున్నారు. బలవంతంగా పనులకు మళ్ళించుకొని పోతున్నారు. పనులకు వెళ్ళకుండా ముఖంచాటు చేసిన రైతులను అనేక విధాలుగా పీడించి జుల్మానాలు వసూలు చేస్తున్నారు. ఈ విధమైన జుల్మానాలను భూమిశిస్తు బకాయి మాదిరే వసూలు చెయ్యడానికి 1856 చట్టంలోని 6వ సెక్షను అధికారం కల్పిస్తున్నది.” ఈ చట్టాన్ని పురస్కరించుకొని మరమ్మత్తుశాఖ అధికారులు చేసే బలవంతపు వసూళ్ళను, సప్లైల కోసం చేసే దాష్టీకాన్ని నరసయ్య పత్రికాముఖంగా బహిర్గతం చేశాడు.

లార్డ్ స్టాన్లీ ఆల్డర్‌లీ (Lord Stanely Alderley) భారతదేశంలో అమలులో ఉన్న నిర్బంధ వసూళ్ళు చట్టవిరుద్ధమైనవని లార్డ్స్ సభ (House of Lords) లో చేసిన ఉపన్యాసాన్ని లా టైమ్స్ (Law Times) పత్రిక నుంచి ఉదాహరించి, “ఈ దేశంలో నిజంగానే అటువంటి చట్టం అమలులో ఉందా?” అని నరసయ్య నెల్లూరు కలెక్టరును నిలదీస్తాడు. “అటువంటి చట్టం అమల్లో ఉంటే, 'కుడిమరమ్మత్తు' పనులకు రమ్మని రైతులను బలవంతపెట్టే అధికారం ఎవరికి ఉంది?” అని అక్రమ నిర్బంధ శ్రమను వ్యతిరేకిస్తాడు.38

“అధికారులకు లంచం చేతిలో పడకపోతే, రైతులకు ఏదీ సవ్యంగా జరగదు. డెల్టా అధికారులు రెవెన్యూ అధికారుల మాదిరే ప్రవర్తిస్తున్నారు. గ్రామాలకు నీరు సక్రమంగా పంపిణీ చెయ్యడం లేదు. నిష్పక్షపాతంగా నడుచుకోడం లేదు. సేద్యాలు దెబ్బతింటున్నాయి. రైతులు చందాలు వేసుకొని గ్రామాధికారుల ద్వారా నీటిపారుదలశాఖ అధికారులకు లంచాలు ముట్టచెప్పి పనులు జరుపుకొంటారు. ఈ అక్రమాలను విచారించే నాథుడే లేడు. నీళ్ళు సక్రమంగా ఇస్తే, ఎంత సెస్సు విధించినా రైతులు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు” అని సాగునీటి ఇబ్బందులను గురించి వివరిస్తాడు. పంటకాలువలు తవ్వి బీళ్ళు సాగులోకి తెస్తే ప్రభుత్వాదాయం పెరుగుతుందని సూచిస్తాడు.39

టెనెన్సీ బిల్లు (Tenancy Bill)

ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో నరసయ్య రాసిన వ్యాసాలలో పాలికాపుల తరఫున, టెనెన్సీ బిల్లుమీద రాసిన వ్యాసం ముఖ్యమైనది. ఈ వ్యాసంలో ఆయన వర్గదృక్పథం వ్యక్తమవుతుంది. తాను చిన్నపాటి భూస్వామి అయి ఉండీ, పేదకౌలుదార్ల తరఫున వకాల్తా పుచ్చుకొంటాడు. “కౌలుదారిబిల్లు గతి ఏమయిందని” ప్రశ్నిస్తాడు. "ప్రభుత్వానికి నిరుపేద రైతులమీద రవంతయినా దయలేదా? భూస్వాముల కబంధహస్తాల్లో కౌలుదార్లు ఎంతకాలం నలిగిపోవాలి?” అని తీవ్రంగా నిరసిస్తాడు. “భూస్వాములు పేదరైతుల కష్టాలు పట్టించుకోడం లేదు. ఎన్నో ఏళ్ళుగా సాగుచేసుకొంటున్న రైతులను క్షణంలో తొలగించి భూములు స్వాధీనం చేసుకొంటున్నారు. రైతులు దుక్కులు దున్ని రెండో కారుపెట్టడానికి పొలాలను సన్నద్ధం చేసుకొంటున్న తరుణంలో, కౌలుదార్లను తొలగించి, కొత్తవారికి కౌలుకిస్తున్నారు. టెనెన్సీ బిల్లు వస్తేకాని పేదరైతుల బాధలు పోవు” అని మరొక వ్యాసంలో రాస్తాడు.40 కౌలుదారులను తొలగించి భూస్వాములు కొత్తవారికి కౌలుకిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే కౌలుదారీ చట్టంతేవాలని ఒక రైతు రాసిన ఉత్తరాన్ని కూడా నరసయ్య తన పత్రికలో ప్రచురించాడు.41

జమిందార్లకు వ్యతిరేకం

1888లోనే నరసయ్య వెంకటగిరి జమీందారీ రైతుల సమస్యలను గురించి పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రస్తావించాడు.42 పత్రికాధిపతులు జమీందార్ల ప్రాపకంకోసం, పోషణకోసం పడిగాపులు కాస్తున్న రోజుల్లో ఇంపార్షియబుల్ ఎస్టేట్ యాక్టు (Impartiable Estate Act)ను నరసయ్య తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆనాటి పత్రికలేవైనా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాశాయా అని పరిశోధించవలసిన సందర్భంలో ఆయన ఎంత ముందుచూపుతో ఈ వ్యాసం రాశాడా అని విస్మయపడక తప్పదు.

ఎంత ప్రాచీన చరిత్ర కలిగిన ఎస్టేట్లనైనా జమీందార్లు తమ చిత్తం వచ్చినట్లు అన్యాక్రాంతం చెయ్యడం చెల్లుబాటవుతుందని పిఠాపురం ఎస్టేటు కేసులో ప్రీవీ కౌన్సిలు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు విజయనగరం, వెంకటగిరి, బొబ్బిలి వగైరా పెద్ద జమీందార్లను కలవరపెట్టింది. తమ ఎస్టేట్లు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోడానికి ప్రభుత్వాన్ని ఆశ్రయించి “ఇంపార్షియబుల్ ఎస్టేట్ యాక్టు” చట్టం చేయించుకొన్నారు.43 బొబ్బిలి, వెంకటగిరి తదితర జమీందార్లు ఈ బిల్లు పాసు కావడానికి తమ పలుకుబడినంతా ఉపయోగించారు. “ప్రభుత్వం పేదరైతుల గోడు పట్టించుకొని వారి బాధలు నివారించడం కోసం ఒక్కచట్టమైనా తీసుకొని రాలేదు గాని, జమిందార్ల సంక్షేమం కోసం, వారికి అనుకూలమైన చట్టాలు తీసుకొని వస్తూంది. ఇంపార్షియబుల్ ఎస్టేట్ యాక్టు 'రెట్రాస్పెక్టివ్' గా అమలయ్యేటట్లు చట్టం తెస్తున్నారని వింటున్నాము. ఈ విధంగా చట్టం తేవడం న్యాయంకాదు. అనాదిగా అవిభక్తంగా ఉన్న జమిందారీలకు మాత్రమే ఈ చట్టం వర్తింపచెయ్యాలి. ఈ జమిందార్లు ప్రభుత్వానికి, ప్రజలకు ఏమి ఉపకారం చేశారు?. భవిష్యత్తులో ఏమి మంచి చెయ్యబోతారు? వీరి ఎస్టేట్లు సాధారణమైన ఎస్టేట్లమాదిరే అవసరం ఏర్పడినపుడు విభజించుకోడానికి వీలుగా ఉండడమే న్యాయం. జమిందార్ల ఎస్టేట్లు అవిభాజ్యంగా ఉండేటట్లు చట్టం చేసేటట్లయితే, శ్రోత్రియందార్ల శ్రోత్రియాలు, ఇనాందార్ల ఇనాములు, సాధారణ పట్టాపొలాలు అన్నీ అవిభాజ్యంగా ఉండేటట్లు చట్టంచెయ్యాలి” అని బిల్లును వ్యతిరేకిస్తూ వ్యంగ్యం, పరిహాసం ఉట్టిపడేటట్లు రాశాడు.44

జమీందారీ భూముల సర్వే

నరసయ్య తన పత్రిక ద్వారా జమీందార్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం సాగించినట్లు తోస్తూంది. 1801 లో పర్మినెంటు సెటిల్మెంట్లు జరిగినప్పుడు, జమీందారీ గ్రామాలలో గ్రామకరణాల నియామకం, వారి జీతబత్యాలు, వారిమీద అధికారం అన్నీ జమీందార్ల అజమాయిషీకే విడిచిపెట్టబడ్డాయి. దాంతో రైతులను పీడించి, తమ చిత్తం వచ్చినట్లు శిస్తులు, పుల్లరులు వసూలుచేయడానికి జమిందారులకు అవకాశం ఏర్పడింది. నరసయ్య ఒక వ్యాసంలో ఈ సంగతులు వివరించాడు. జమీందార్లు దొంగలెక్కలు తయారుచేయించి, సక్రమంగా శిస్తు చెల్లించకుండా ప్రభుత్వాన్ని వంచిస్తున్నారని ఆరోపించాడు. ఇటువంటి మోసాలను అరికట్టడానికి జమీందారీ గ్రామాలను సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి, ఆయా గ్రామకరణాలను ప్రభుత్వమే నియమించాలని ప్రతిపాదించాడు. గ్రామకరణాలను నియమించే అధికారం జమీందార్ల చేతిలో ఉన్నంతవరకు వారు ఇటు రైతులను, అటు ప్రభుత్వాన్ని వంచిస్తూనే ఉంటారని, ప్రభుత్వం చర్యతీసుకోకుండా ఎందుకు ఊరకుందని ప్రశ్నిస్తాడు. ఈ అంశంమీదనే మరొక వ్యాసంలో జమిందారీ, శ్రోత్రియం గ్రామోద్యోగులకు ప్రభుత్వమే జీతబత్యాలు చెల్లించే చర్య చేపట్టాలి. అందువల్ల రైతులకు, ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. ఈ చర్యవల్ల దుఃఖించేవారు జమీందార్లు, శ్రోత్రియందార్లు మాత్రమే అని రాస్తాడు.45

జమిందారీ పరిపాలనమీద రాస్తూ, వెంకటగిరి సంస్థానం దివాను సామర్థ్యంమీద నరసయ్య సందేహం వెలిబుచ్చాడు. పై అధికారులంతా ఇంగ్లీషువారే అయినపుడు ఇంగ్లీషు రాని దివాను ఏ విధంగా తన విధులు నిర్వహించగలడని ఒక వార్త రాశాడు.46 వెంకటగిరి జమిందారుకు ఆయన సోదరులకు ఆస్తి వ్యవహారంలో మనస్పర్ధలు కలిగి కోర్టుకెక్కారు. తర్వాత రాజీ కుదిరినా అన్నదమ్ముల మధ్య విరోధాలు చాలాకాలం సమసిపోలేదు. తమ్ముడు ముద్దుకృష్ణయ్య ప్రతి విషయంలో అన్నతో పోటీపడి అతిశయం చూపాడు. ఈ పరిస్థితులను వివరిస్తూ నరసయ్య ఒక వార్త ప్రచురించాడు. "సంస్థాన సేవకులు, ఆశ్రితులు ప్రత్యర్థి వర్గంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని ఇటీవల జమీందారు ఒక పనికిమాలిన ఆజ్ఞ జారీచేశాడు. దాంతో క్షురకులు, రజకులు కూడా స్వేచ్చగా తమ వృత్తి చేసుకోడానికి అవకాశం లేకుండా పోయింది. వెంకటగిరి ఊరు ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రజలు శుభాశుభాలకు బంధువుల ఇళ్ళకు వెళ్ళడం మానుకొన్నారు. వెంకటగిరిలో పార్టీ వాతావరణం నెలకొని ఉంది. ఇంగ్లీషువారి పరిపాలనలోనే ఇటువంటి దారుణ పరిస్థితి ఏర్పడింది” అని తీవ్రంగా రాశాడు.47

శార్దూలశతకకర్త విక్రాల రంగాచార్యులు వెంకటగిరి జమీందారు రాజగోపాలకృష్ణతో ఘర్షణపడి, తన సర్వస్వం కోల్పోయిన ఉదంతం నరసయ్య కళ్ళముందే జరిగింది.48 అయినా ధైర్యంగా వెంకటగిరి జమీందారీ రైతులకష్టాలు మొట్టమొదట పత్రిక ద్వారా లోకానికి తెలియచేసిన ఘనత నరసయ్యకు చెందుతుంది. ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో జమిందారీ రైతుల బాధలు ఒక స్థానిక పత్రిక ప్రచురించడం సామాన్యమైన విషయం కాదు. “వెంకటగిరి జమిందారీ రైతులు” శీర్షికతో ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో వెలువడిన వ్యాసంలో “తగినంత సాగునీరు అందక, పంటలు పండక ఎన్నో బాధలు పడుతున్నాము. పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉన్నా వెంకటగిరి రాజా మా కష్టాలు పట్టించుకోడంలేదు. నీరు అవసరమైన సమయంలో, పొలాలకు నీరు అందక పంటలు ఎండుతున్నా, సాగుచెయ్యకుండా బీడు పెట్టిన పొలాలను పరిశీలించడానికి అధికారులెవరూ రారు. శిస్తు రెమిషను ఇవ్వరు. శిస్తులు కట్టమని దౌర్జన్యం చేస్తారు. సివిల్‌కోర్టుల్లో, సమ్మరీ దావాలు (summary suits) తెచ్చి వేధిస్తారు. కఠినంగా నిబంధనలు అమలుచేసి శిస్తులు రాబట్తారు.” ఇదీ వ్యాసం సారాంశం. మరొక వ్యాసంలో నరసయ్య వెంకటగిరి ప్రాంతంలో కరవు పరిస్థితిని వివరించాడు. ఒక రైతు కరవు పరిస్థితిని వివరిస్తూ రాసిన రిపోర్టు ప్రచురించాడు.49 ఈ రైతుల అసంతృప్తి రగిలి, రాజుకొని ముప్పై ఏళ్ళ తర్వాత జమిందారీ వ్యతిరేక ఉద్యమంగా జ్వలించింది. ఈ ఉద్యమం అగ్నిగుండం నుంచి జమీన్‌రైతు పత్రిక ఆవిర్భవించింది. వెంకటగిరి జమిందారీ రైతులకు వెన్నుదన్నుగా నిలబడి వారి కడగళ్ళను లోకానికి చాటిన తొలిపత్రిక ఆంధ్రభాషా గ్రామవర్తమాని అని, వెంకటగిరి జమీందారీ రైతు ఉద్యమానికి ఈ వ్యాసమే అంకురార్పణ చేసిందని ఈ రచయిత గట్టిగా నమ్ముతున్నాడు.

కోర్టాఫ్ వార్డ్సు బిల్లు (Court of Wards Bill)

తనకు జమీందారీ వ్యవస్థ మీద రవ్వంత నమ్మకం లేకపోయినా, ప్రభుత్వం అపరిమిత అధికారాలను తన గుప్పిట్లో ఉంచుకొని నిరంకుశంగా వ్యవహరించడాన్ని నరసయ్య అంగీకరించలేదు. కోర్టాఫ్ వార్డ్సు బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన జమిందార్ల మీద సానుభూతితో రాసిన వ్యాసం ఇదొక్కటే. ఈ వ్యాసంలో చట్టసభ పరిశీలనలో ఉన్న ముసాయిదా బిల్లులోని లోపాలను బహిర్గతం చేశాడు. శారీరక, మానసిక వైకల్యం వల్ల తమ ఎస్టేట్లను పరిపాలించుకొనే సామర్యంలేని జమీందార్ల ఎస్టేట్లను ప్రభుత్వం తన అజమాయిషీలోకి తెచ్చుకోడానికి ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. “ఇంతటి నిరంకుశాధికారం ప్రభుత్వానికి ఉండకూడదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినపుడు జమీందారీ భవితవ్యాన్ని తీర్మానించడానికి హైకోర్టు ఫుల్‌బెంచికి నివేదించాలి. ఒక జమీందారీ ఎన్నిచిక్కుల్లో ఉన్నా కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి” అని తన అభిప్రాయం తెలియచేశాడు.50 ఆయన రాగద్వేషాలకు అతీతంగా సమస్యలను పరిశీలించేవాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

జమిందార్లకు, భూకామందులకు వ్యతిరేకంగా రాయడంవల్ల సంపన్న భూస్వామ్యవర్గాలు నరసయ్య పత్రికలకు సహకరించి ఉండవు. సామాజిక విషయాలలో, భాషా విషయాలలో నరసయ్య వైఖరి చాలామంది జమిందార్లకు, సామాన్య పాఠకులకు కూడా మింగుడు పడి ఉండదు. పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్రభాషా గ్రామవర్తమాని నిలబడలేక పోవడానికి ఇవి కూడా కారణాలు కావచ్చు.

స్థానిక సమస్యలు

నరసయ్య అనేక స్థానిక సమస్యలను తన పత్రికలో చర్చించాడు. వ్యవసాయదారులు పశుసంపద మీద ఆధారపడి జీవిస్తారని, పశువుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపకపోవడం వల్ల వ్యవసాయాభివృద్ధి మందగిస్తుందని రాశాడు. ఆయనకు శాస్త్రీయ వ్యవసాయంమీద గొప్ప అవగాహన ఉంది. కల్నల్ ఆల్కాట్ వ్యవసాయంమీద రాసిన వ్యాసాన్ని పీపుల్స్ ఫ్రెండ్‌లో ప్రచురించాడు.51 ఇంగ్లీషువారు కృషివిజ్ఞానాన్ని నిర్దుష్టమైన కళగా అభివృద్ధి పరచి, అనేక నూతన వ్యవసాయ విధానాలను అమలుచేస్తున్నారని ఒక వ్యాసంలో మెచ్చుకొంటాడు.52 గ్రామాలలో వ్యాపించిన కలరా, మలేరియా జబ్బుల గురించి, క్వినైన్ గ్రామీణులకు అందుబాటులో లేకపోవడాన్ని గురించి రాశాడు. అనుభవజ్ఞులైన సంచారవైద్య సిబ్బందిని నియమించి, గ్రామాలలో వైద్య సౌకర్యాలు కలిగించాలని సూచించాడు.53 నెల్లూరు జిల్లా వైద్యశాలలో వైద్యపరికరాలు, మందులకొరత తీర్చి పేదలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, జిల్లా బోర్డు ప్రతి తాలూకాలో ఒక ఆయుర్వేద కళాశాలను ప్రారంభించి అర్హతగల వైద్యులను తయారు చెయ్యాలని, నకిలీ వైద్యులను నిషేధించాలని ఒక విలేకరి రాసిన వ్యాసాన్ని ప్రచురించాడు.54

నెల్లూరు మునిసిపాలిటీ ఆరోగ్యకరమైన ప్రదేశంగా అభివృద్ధి చెందడానికి నరసయ్య అనేక సూచనలు చేశాడు. పూర్తి సమయం కేటాయించగల 'పెయిడ్ చేర్మన్' ను నియమించాలని, ఎప్పుడో తీరిక వేళల్లో ఆఫీసు విధులకు హాజరయ్యే వ్యక్తి తన బాధ్యతలకు న్యాయం చెయ్యలేడని వాదిస్తాడు. పౌరులు చట్టపరిజ్ఞానం కలిగి ఉంటేనే ప్రజాసౌకర్యాలు మెరుగవుతాయని, అసమర్థులను, చట్టం తెలియని వారిని కౌన్సిలర్లుగా నియమించిన జిల్లా కలెక్టరును, ఎన్నుకొన్న పౌరులను తప్పుపడ్డాడు. సమర్థులైనవారు కౌన్సిలర్లుగా ఉన్నప్పుడే మునిసిపాలిటీ బాగుపడుతుందని రాశాడు.55

నరసయ్య పోలీసు, తపాలాశాఖలలో సంస్కరణలను సూచిస్తూ సలహాలిచ్చాడు. పోలీసుశాఖల అవినీతిని గురించి, అసమర్ధపాలన గురించి రాశాడు. విలేజి పోస్టుమాస్టర్ల జీతబత్యాలను పెంచాలని రాశాడు. ఆస్ట్రేలియాలో తపాలాశాఖ పత్రికలను ఉచితంగా బట్వాడా చేస్తుందని, ఆ చిన్న సదుపాయం ఇక్కడి పత్రికలకు ఎందుకు కలుగజేయగూడదని ప్రశ్నిస్తాడు.56 విశాఖ ఓడరేవును అభివృద్ధి చెయ్యకపోవడంవల్ల ఆ ప్రాంతపు మాంగనీసు ఖనిజం రైలుమార్గంగుండా, కలకత్తా ఓడరేవు ద్వారా ఎగుమతి అవుతున్నదని, విశాఖరేవు ఆదాయాన్ని కోల్పోతున్నదని 'రవి' పత్రిక ప్రచురించిన వార్తను తన పత్రికలో పునర్ముద్రించాడు. ఫీడర్ రైలు (Feeder rail) మార్గాలు నిర్మించాలని, కృష్ణాపట్నం నెల్లూరు రైలుమార్గం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. న్యాయస్థానాల్లో జరిగే జాప్యాన్ని, అవినీతిని ప్రస్తావించి, “జిల్లా మునిసిఫులకున్న అధికారాలు గొప్పవి. వారి జీతాలు మాత్రం చాలా తక్కువ” అని, ఇందువల్లే జిల్లా న్యాయస్థానాల్లో అవినీతి ప్రబలిందని విశ్లేషించాడు.57

నెల్లూరులో కల్లుఅంగడి యజమాని పొద్దస్తమానం కల్లుతాగమని చాటింపువేయడాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తాడు. “పాదచారులను మద్యపానానికి పురికొల్పడాన్ని చట్టం అంగీకరిస్తుందా? ప్రజలు తాగుబోతులు కావాలని ప్రభుత్వం కోరుకొంటున్నదా?” అని ప్రశ్నించి, చట్టవిరుద్ధమైన ప్రచారాన్ని నిరోధించమని జిల్లా అధికారులను కోరుతాడు.58

గంగిరెద్దులవాళ్ళు, పాములవాళ్ళు, విప్రవినోదులు మొదలైన సంచార యాచకులంటే నరసయ్యకు అసహ్యం. సోమరులన్నా, యాచకులన్నా ఆయనకు పడదు. యాచకవృత్తిని నిషేధించాలని తరచుగా పత్రికలో రాశాడు. “భారతదేశాన్ని బిచ్చగాళ్ళదేశం అని అనవచ్చు. లక్షలాది ప్రజలు యాచకవృత్తిలో జీవిస్తున్నారు. యాచన అవమానకరమైనదని గానీ, తప్పని గానీ వారు భావించరు. యాచకులకు సంబంధించి ఒక చట్టం తీసుకొనిరావాలి. బిచ్చమెత్తుకొనేందుకు లైసెన్సుఫీజు విధించాలి. ఈ చట్టం కుంటి, గుడ్డి యాచకులకు కూడా వర్తింపచేయాలి” అని పలుమార్లు రాశాడు.59 అన్నదానం వంటి వాటిమీద ఆయనకు నమ్మకం ఉంది. మహారాణి మరణించినపుడు భారతదేశ సంప్రదాయాన్ని అనుసరించి, నిరుపేదలకు ఒక రోజు అన్నదానం చెయ్యమని ప్రభుత్వానికి సూచిస్తాడు.60 నరసయ్య తన చిన్న స్థానిక వారపత్రికలో జాతీయ అంతర్జాతీయ విషయాలమీద రాశాడు. పోలీసుశాఖలో పైఅధికారులంతా తెల్లవారే అనీ, ఎంత తెలివితేటలున్నా స్థానికులకు ఉన్నత పదవులివ్వరని, మైసూరు సంస్థానంలో దేశీయులే పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్నారని వివరిస్తాడు.61 భారతీయులు ఇంగ్లాండు వెళ్ళి, క్లిష్టమైన పరీక్షల్లో కృతార్థులైతేనే తప్ప కలెక్టరు వంటి ఉన్నత పదవులు ఇవ్వరు. ఈ పద్ధతిలోనే యూరోపియన్లు స్థానిక భాషలు విధిగా నేర్చుకొని పరీక్షలు పాసైతేనే వారికి ఈ దేశంలో ఉద్యోగాలివ్వాలి. స్థానికభాషలు నేర్చుకొన్నందుకు ఇంగ్లీషు అధికారులకు ప్రోత్సాహక బహుమతులివ్వడం ఏం న్యాయం అంటాడు.62

మద్రాసు, బొంబాయి ప్రభుత్వాలలో గవర్నరు, ఇద్దరు సలహాదారులు ఉన్నారని, ఇతర పరగణాలలో సలహాదారులు లేరని, సలహాదారుల నియామకం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప ప్రజలకు ఒనగూడేదేమీ లేదని విమర్శిస్తాడు. పది, ఇరవై వేల జీతాలిచ్చి, గవర్నర్లను, గవర్నరుజనరల్‌ను నియమించడంకన్నా, నిజాయితీపరులైన ఆ దేశ సంపన్నులను ఆహ్వానించి, అయిదు, ఎనిమిదివేల జీతంతో సలహాదార్లుగా నియమించవచ్చని, అందువల్ల ప్రభుత్వ వ్యయం ఆదా అవుతుందని సూచిస్తాడు.63

లెజిస్లేటివ్ కౌన్సిలు సక్రమంగా జరగడం లేదని, నెలకొకపర్యాయమైనా సమావేశం కావడంలేదని, “గౌరవనీయులైన సభ్యులు” అనే మర్యాదా వాచకం తమ పేరు ముందు చేరినందుకే సభ్యులు సంతృప్తి చెందినట్లుందని, ఎద్దేవా చేస్తాడు. కౌన్సిలు సమావేశాలు కనీసం నెలకొకసారయినా జరగాలని, అనధికార సభ్యులకు గౌరవభృతి ఇవ్వాలని ప్రతిపాదిస్తాడు.64

ఉప్పుపన్ను

నరసయ్య ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో ఒక నెలలోనే రెండుసార్లు ఉప్పుపన్నుమీద రాశాడు. “పాలకులు పేదలపట్ల కనికరం చూపడం లేదు. నిరుపేదలు గంజిలో వేసుకొనే ఉప్పును ఎక్కువ ఖరీదుకు అమ్మడం అన్యాయమని తోచకపోవడం ఆశ్చర్యంగా ఉంది” అని అంటాడు. “ఆహారపదార్థాల మీద పన్ను విధించడమే తప్పు. ఆహార పదార్థాలన్నిటిలో ఉప్పు ప్రధానమైనది. ఉప్పుమీద పన్ను విధించడం అన్యాయమైన చర్య. దీనికన్న పోల్‌టాక్సు (Poll tax) విధించడంమేలు. మనుషులకు, వశువులకు వినియోగించుకోడానికి, ఆరోగ్యం కాపాడుకోడానికి సరిపడేంత ఉప్పును దేవుడిచ్చాడు. చట్టాలు తయారుచేసి, పెద్ద అధికార గణాన్ని నియమించి, పన్నువసూళ్ళలో లోటు రాకుండా పేదలను బాధించడం మహానేరం. ఉప్పుపన్ను చట్టాలలో సవరణలు తెచ్చిన వ్యక్తిని ప్రజలు విముక్తి ప్రదాతగా, దేవతదూతగా భావిస్తారు” అని ఆవేదనతో రాస్తాడు.65

మద్రాసు మహాజనసభ - రైతు సంఘాలు

కాంగ్రెసు సంస్థను గురించి నరసయ్య అభిప్రాయాలు తెలుసుకొనే అవకాశం లేదు. మద్రాసులో జరిగిన కాంగ్రెసు సభలకైనా ఆయన హాజరయ్యాడో లేదో ఈ రచయిత నిగ్గు తేల్చలేక పోయాడు. ప్రభుత్వ అనువాదకుడు ఆంధ్రభాషా గ్రామవర్తమానిమీద తయారుచేసిన రహస్య నివేదికలలో కాంగ్రెసు ప్రస్తావనలు రాలేదు. ఈ పత్రిక నడిపే రోజులలో నరసయ్యకు మద్రాసు మహాజనసభమిద అపారమైన విశ్వాసం ఉంది. మద్రాసు మహాజనసభ స్థాపనలో, ఆ సంస్థ కార్యక్రమాలలో ఆయన క్రియాశీల సభ్యుడుగా పాల్గొని ఉంటాడని తోచింది. ఏటా అఖిల భారత కాంగ్రెసు సభలు జరుగుతున్నా, తాను భావించిన గ్రామ సంఘాలు మద్రాసు మహాజనసభకు అనుబంధంగా పనిచెయ్యాలని అభిలషించడంవల్ల, ఆ సంస్థతో ఆయనకున్న అనుబంధం స్పష్టమవుతుంది.

ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి మద్రాసు మహాజనసభకు అనుబంధంగా గ్రామరైతు సంఘాలు ఏర్పడాలని నరసయ్య పిలుపిచ్చాడు. దేశాభివృద్ధి కోసం ప్రజలు గ్రామసంఘాలను, తాలూకా సంఘాలను, జిల్లా సంఘాలను నిర్మించాలని సలహా ఇచ్చాడు. ప్రతి రైతు గ్రామసంఘంలో సభ్యుడు కావాలి. ప్రభుత్వోద్యోగులు గ్రామసంఘాలలో సభ్యులుగా చేరడం ఆయనకు ఆక్షేపణ కాదుకాని, “ఈ గ్రామ సంఘాలకు ప్రభుత్వోద్యోగులు అధ్యక్షులుగా ఉండకూడదు” అని ఖండితంగా చెప్పాడు. గ్రామాధికారులు గ్రామ సంఘాల అధ్యక్షులై, ఆ సంఘాలను నిర్వీర్యం చేస్తారని, లేదా ప్రభుత్వ అనుకూల సంస్థలుగా తయారు చేస్తారని ఆయన అభిప్రాయమై ఉంటుంది. ప్రతి సభ్యుడు కనీసం ఒక అణా అయినా సంఘానికి సభ్యత్వరుసుం చెల్లించాలి. గ్రామ సంఘాలు వసూలుచేసిన చందా మొత్తంలో మూడో భాగాన్ని మద్రాసు మహాజనసభకు పంపాలని, ఈ సంఘాలకు సంబంధించిన ఒక విస్తృత ప్రణాళికను చర్చించాడు. దేశక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ గ్రామసంఘాలు చేపట్టాలని ఒక కార్యాచరణను ఊహించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ అంతటికీ ఒక విశాల ప్రాతిపదికమీద, మద్రాసు మహాజనసభకు అనుబంధంగా గ్రామరైతు సంఘాలను ఏర్పాటు చెయ్యాలని అభిలషించాడు. రాజకీయ కార్యాచరణకు ఒక ప్రాతిపదికను ఏర్పరిచాడు.66 రైతుసంఘాల ఏర్పాటును గురించి నరసయ్య ముందుచూపు ఈ వ్యాసంలో వ్యక్తమయింది.

ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రచురిస్తున్న కాలంలో నరసయ్యకు బ్రిటిష్ ప్రభుత్వంపట్ల సదభిప్రాయం ఉంది. ఏవో కొన్ని లోపాలున్నా, మొత్తంమీద దేశప్రజలు ఇంగ్లీషు పాలనలో బాగుపడ్డారనే సంగతి గుర్తుంచుకొని తమసాధక బాధకాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలని ఒక వ్యాసంలో సలహా ఇస్తాడు. ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి, వ్యక్తీకరించడానికి ప్రజాసంఘాల ఏర్పాటు, సభలు సమావేశాలు, మహజరులు, పత్రికలు సరియైన వాహికలని ఆయన విశ్వసించాడు. ఈ నాలుగు అంగాలు చక్కగా అభివృద్ధి చెందితే, ప్రజలు హాయిగా జీవించగలరని భావిస్తాడు. మేధావులు ఈ నాలుగు సాధనాలను విజ్ఞతతో, శ్రద్ధగా వాడుకోవాలని సూచిస్తాడు.67 ఆనాటి దేశ నాయకుల ఆలోచనలకు, నరసయ్య ఆలోచనలకు పెద్దగా అంతరం ఉన్నట్లు అనిపించదు.

వందేమాతరం ఉద్యమం మొదలు కావడంతో దేశరాజకీయాలలో, ప్రజల అభిప్రాయాలలో పెనుమార్పులు సంభవించాయి. ఈ ఉద్యమం ఆరంభమయ్యే నాటికి నరసయ్య పత్రిక నిలిచిపోయింది. ఈ ఉద్యమం గురించి ఆయన ఎట్లా స్పందించాడో నిరూపించడానికి ఆధారాలు లభించలేదుకాని, మిత్రులతో కలిసి, నెల్లూరులో స్వదేశీ స్కూలు స్థాపించడానికి మంతనాలు సాగించినట్లుంది. 1906 ఆగష్టు 8 దినచర్యలో “కొమాండూరు నర్శింహాచార్లు called and we had some talk about our proposed స్వదేశీ School" అని రాసుకొన్నాడు. ఆయన వందేమాతరం ఉద్యమాన్ని ఆమోదించి, ఉద్యమంతో ముందుకు సాగినట్లు సూచనప్రాయంగా దినచర్యలోని ఈ వాక్యంవల్ల తెలుస్తూంది.

జైలు సంస్కరణ - మరణ శిక్షరద్దు

నరసయ్య పత్రికను సమకాలిక పత్రికలకంటె విశిష్టంగా నిలిపిన అంశాలు కొన్ని ఉన్నాయి. 1900-1901 రెండు సంవత్సరాల నేటివ్ న్యూస్‌పేపర్ రిపోర్టులలో ప్రభుత్వ అనువాదకుడు ఆంధ్రభాషా గ్రామవర్తమాని నుంచి అనువదించినన్ని విషయాలు మరే తెలుగు పత్రికనుంచి అనువదించలేదు. ఈ పత్రిక రాతలు ప్రభుత్వ అనువాదకుని దృష్టిని ఆకర్షించినంతగా మరే పత్రిక రాతలు ఆకర్షించలేదు.

నరసయ్య జాతీయ అంతర్జాతీయ సమస్యలను నిశితంగా పరిశీలించినట్లు, అమెరికాలో నల్లవారి విముక్తి పోరాటం నుంచి అనేక విషయాలమీద ఆయన దృష్టి నిలిపి ఆసక్తి కనపరచినట్లు ఆయన అధ్యయనం చేసిన గ్రంథాలవల్ల కూడా తెలుస్తూంది. జైలు సంస్కరణలమీద రాసిన వ్యాసం ఈ అంశాన్ని నిరూపిస్తూంది.

డార్టుమూర్‌జైలు (Dartmoore prison) లో ఖైదీలు 1400 ఎకరాలు సాగుచేసి, పంటలు పండిస్తున్నారని, అటువంటి సంస్కరణలు భారతదేశం జైళ్ళలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నరసయ్య ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాడు. జీవితఖైదు విధించి, ద్వీపాంతర వాసశిక్ష అమలుచేయడంకన్నా, విశాలమైన బీళ్ళలో జైళ్ళు ఏర్పాటుచేసి, ఖైదీలచేత వ్యవసాయం చేయించి, ఆధునిక కృషి విధానాలను వాడుకలోనికి తేవాలని సలహా ఇస్తాడు.68

నరసయ్య మరణశిక్షను వ్యతిరేకించాడు. “హిందువులు అహింసావాదులు. సమస్త సుగుణాలలో అహింస ఉత్కృష్టమైనదని భావిస్తారు” అని మరణశిక్ష రద్దుకు కారణాలు చూపుతాడు. "ప్రభుత్వం ఉరిశిక్ష అమలుచేసి ప్రాణంతీయగలదుకాని, మరణించిన వ్యక్తిని బ్రతికించలేదు. ఆలోచనాపరులెవరూ మరణశిక్షను ఆమోదించరు" అంటాడు. మరణశిక్షకు బదులు "కఠిన కారాగార శిక్ష, ద్వీపాంతరవాస శిక్ష విధిస్తే చాలని” ఈ వ్యాసంలో ప్రతిపాదిస్తాడు.69 నూటఅయిదేళ్ళక్రితం, ఒక చిన్న స్థానిక పత్రికలో మరణశిక్ష రద్దుపరచమని ప్రభుత్వాన్ని అర్ధించడాన్ని బట్టి నరసయ్య ఎంత గొప్ప మానవతావాదో బోధపడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సానుభూతితో అర్ధంచేసుకొని, వారిపక్షాన నిలబడడంలో ఆయన ఎవరికీ తీసిపోడు.

సాహిత్య విషయాలు

దేశభాషా పత్రికలమీద నివేదికలు సమర్పించిన ప్రభుత్వ అనువాదకులు పత్రికలలోని రాజకీయ అంశాలను స్పృశించారుకాని సాహిత్య విషయాల జోలికి పోలేదు. ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య లేఖలు ప్రచురించబడినట్లు కొన్ని నిదర్శనాలు కనిపించాయి. తన ప్రతాపరుద్రీయ నాటకాన్ని ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో సమీక్షించినదెవరో తెలుసుకోవాలనే కుతూహలంతో వేదం వేంకటరాయశాస్త్రి మిత్రుడు పూండ్ల రామకృష్ణయ్యకు లేఖ రాశాడు. అందుకు రామకృష్ణయ్య రాసిన సమాధానం.70

నెల్లూరు

28-5-1900

ఆర్యా, నమస్కారములు

తాము తేది 23 వ్రాసిన జాబుకు జవాబు. దంపూరు నరసయ్యగారికి పుస్తకము నేనిచ్చినాను. వారు నిక్కము నాయందు విశ్వాసముంచినారు. ప్రతాపరుద్రీయమును గురించి వారే వ్రాసినారు. ఉండూరు పత్రికగాన మన పక్షము వారెవరైన వ్రాసినచో ప్రకటించెదరు.

ఇట్లు, విధేయుడు

పూండ్ల రామకృష్ణయ్య

దీంతో వ్యావహారిక భాషలో రచించబడ్డ కన్యాశుల్క నాటకాన్ని, పరిమితంగా వ్యావహారిక భాషను పాత్రోచితభాష పేరుతో ప్రవేశపెట్టిన ప్రతాపరుద్రీయాన్ని నరసయ్య సమీక్ష చేసినట్లయింది.

సూర్యాలోకం, ఆంధ్రభాషా గ్రామవర్తమాని కంటె ఒక సంవత్సరం ముందు పుట్టింది. మొదట వేదం వేంకటరాయశాస్త్రి మిత్రబృందం ఈ పత్రికను ప్రోత్సహించింది. నరసయ్య ప్రతాపరుద్రీయం మీద రాసిన సమీక్షను సూర్యాలోకంలో పునర్ముద్రణ అయ్యేట్లు చూడమని వేంకటరాయశాస్త్రిని కోరుతూ "..... అది సూర్యాలోకమువారికి వచ్చియున్నది. దానిని సూర్యాలోకములో మరల ముద్రింపవలయునని వారితో చెప్పవలయును....” అని పూండ్ల రామకృష్ణయ్య జాబు రాశాడు.71 సూర్యాలోకం రెండేళ్ళు పూర్తిచేసుకొనేప్పటికి, ఆ పత్రిక యాజమాన్యానికి, వేదంవర్గానికి బెడిసింది. వేంకటరాయశాస్త్రి శాకుంతలానువాదం మీద విమర్శవ్యాసాలు ఆ పత్రికలో వచ్చాయి. వాటికి సమాధానాలు రాసి కాచుకోవలసిన అగత్యం వేదం వర్గానికి కలిగింది. అందుకు ఒక పత్రిక అవసరమైంది. వేంకటరాయశాస్త్రి శిష్యుడు గునుపాటి ఏనాదిరెడ్డి ఆయనకు రాసిన ఒక ఉత్తరంలో “సూర్యాలోకము సమాధానము ప్రకటించదు గాబట్టి, గ్రామవర్తమానిలో విషయము ప్రకటించుటకు నిశ్చయించుకొని యున్నాడను” అని తెలియజేశాడు.72

1901 మే 16 సూర్యాలోకం సంచికలో “విమర్శకులకు సలహా” అనే శీర్షికతో నెల్లూరు నుంచి నాయనశాస్త్రి ఒక సుదీర్చలేఖ రాశాడు. అందులో ఆంధ్రభాషా గ్రామవర్తమాని ప్రస్తావన ఉంది. “నా పత్రికలో వ్రాయబడుతున్న విమర్శనములను చదివితిని. "My mind is principally distracted" అను ప్రొఫెసరు జోన్సు గారి ఇంగ్లీషునకు నామనస్సు ముఖ్యంగా కలవరపడుచున్నది అనెడు అర్థమేకాని, ఆంధ్రభాషా గ్రామవర్తమాని గడచిన మార్చి 7వ తేది పత్రికలో వ్రాయబడిన ప్రకారము మనస్సు రెండు భాగములు అయినదను తాత్పర్యము 'distracted' అను ఇంగ్లీషు పదమునకు లేదు....”

సాహిత్యపరమైన వ్యాసాలేకాక,నాటక ప్రదర్శనలమీద, సమకాలిక పత్రికలమీద ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో సమీక్షలు ప్రచురించ బడినట్లు చెప్పడానికి ఆధారాలున్నాయి. వేదం వేంకటరాయశాస్త్రి శిష్యులు, అభిమానులు ఆంధ్రభాషాభిమాని సమాజాన్ని నెల్లూరులో స్థాపించుకొన్నారు. ఈ సంస్థ కార్యక్రమాలపై పత్రికలలో వెలువడిన సమీక్షలను ఒకచిన్న కరపత్రంగా 1900లో ప్రచురించారు. ఈ సంస్థ ప్రదర్శించిన వేంకటరాయశాస్త్రి శాకుంతల నాటక ప్రదర్శనమీద ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో వచ్చిన సమీక్షలో కొంత భాగాన్ని ఈ కరపత్రంలో చేర్చారు. వ్యావహారిక భాషలో రాయబడిన వ్యాసాన్ని గ్రాంథికభాషలోకి మార్చి శకటరేఫలు, అరసున్నలు చేర్చి పునర్ముద్రించారు. "ఈ నాటకమును తే17ది శనివారము నెల్లూరు ఆంధ్రభాషాభిమాని సమాజమువారు ఆడి, తమవిద్యను చమత్కారమును కనుపఱచినదేగాక నాటకమును చూడవచ్చిన వారి కందటికిని అత్యంతానందము గలుగజేసిరి. శాస్త్రులవారి పాండిత్యము ఈ నాటకము వలనఁ బ్రకాశముగా నెల్లూరి పురవాసులందటికిని విశదమాయెను. ఇట్టి గ్రంథములు వ్రాయువారు పండితులుకాదని చెప్పెడువారు ఎంతమూడులో, ఎంతమూర్ఖులో, ఎంత దుర్వాదపరులో, ఎంత అసూయాపరులో ఊహించవచ్చును .............. మొన్న నాటకమును ప్రదర్శించిన సమాజము మెంబరులందఱు ఒకరిని మించిన వారొకరుగా నుండిరి. అయినను వారిలో దుష్యంతమహారాజు వేషమును ధరించినవారు అందరికంటే మిక్కిలి సమర్థులు. అతడు బాల్యదశలో నింత విద్యానైపుణ్యమును ఈషణ్మాత్రమైన సభాకంపములేక కనపఱచినందులకు మేమును, ఆటచూడవచ్చిన సభ యావన్మందియును చాల సంతసించితిమి.”

నరసయ్య తెలుగులో రాసినదేమి మిగలలేదు. అముద్రిత గ్రంథ చింతామణి పత్రికను ప్రశంసిస్తూ ఆయన ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో 'పేట్రియట్' పేరుతో ఒక సమీక్ష చేశాడు. అందులో రెండువాక్యాలను “ఇతరుల అభిప్రాయములు” అనే శీర్షికతో అముద్రిత గ్రంథ చింతామణి ప్రచురించింది. “పూండ్ల రామకృష్ణయ్యగారి అముద్రిత గ్రంథ చింతామణి దివ్యమైన పత్రిక యనుటకు నేలాటి యాక్షేపణ లేదు. సదరు అయ్యవారు మంచి పరిశోధకులు, బహు పాటుపడువారు.73 అముద్రిత గ్రంథ చింతామణి ఇచ్చిన రెండు వాక్యాలు వాడుక భాషలోనే ఉన్నాయి. 1897లో కన్యాశుల్కభాషను అంతగా స్వాగతించిన వ్యక్తి మూడేళ్ళలో అభిప్రాయాలు మార్చుకొని ఉండడు. గ్రాంథిక భాషావాదులు పత్రికలలో వచ్చిన రిపోర్టులను కూడా వీరగ్రాంథిక భాషలోకి మార్చి ప్రకటించుకొనేవారని భావించవచ్చు.