ఆధునిక రాజ్యాంగ సంస్థలు/ఐదవ ప్రకరణము

ఐదవ ప్రకరణము.

శాసనసభలు

ఈకాలపు శాసనసభలకును పురాతనకాలపు శాసనసభలకును చాలభేదముకలదు. ఇప్పటిసభలయందు ప్రజలు తమంతతామే స్వయముగా సమావేశమగుట లేదు; వానికి తమప్రతినిధుల బంపుచున్నారు. పురాతనకాలమందు, గ్రీసునందును, రోమునందును, పౌరులందరు స్వయముగా తమసభలలో శాసననిర్మాణాది కృత్యములందు పాల్గొనుచుండిరి. ఈకాలపుశాసనసభలు, ప్రతివత్సరము, అనేకనూతనశాసనముల నిర్మించుచునో, అనేక ప్రాతశాసనముల తీసివేయుచునో లేక, మార్పుచేయుచునో శాసననిర్మాణ కార్యమునందు శ్రద్ధజేయుచున్నవి. కాని ఆకాలపుసభలు శాసననిర్మాణమునకు బహుయరుదుగా పూనుకొనుచుండెను. ఇప్పుడు శాసననిర్మాణముజేయుట ప్రతిశాసనసభయొక్కయు, దానిపై యాధారపడు మంత్రివర్గముయొక్కయు ధర్మమని తలంచబడుచుండ, ఆకాలమందు నూతనశాసనముల నిర్మాణమును సూచించువారు ప్రజావిద్రోహులేమోయను సందియము ప్రజలకు కల్గుచుండెను. కనుక, స్వాభివృద్ధినే కోరునాయకులు శాసననిర్మాణకార్యక్రమమును తలపెట్టకుండిరి. ఏథె న్సురాజ్యమందును, రోమన్ ప్రజాస్వామిక రాజ్యమందును, కార్యనిర్వాహకోద్యోగుల నెన్నుకొనుట, "పౌరసభ" యొక్కహక్కును, బాధ్యతయునై యుండెను. అటులనే యిప్పుడును, మంత్రాంగవర్గమువారు శాసనసభవారికి (అమెరికాయందుగాక) బాధ్యులైయున్నారు. కాని ఆకాలపు శాసనసభలకు కార్యనిర్వాహకవర్గముపై ఇప్పుడు సాధ్యమగుచున్నంత, ప్రాపకముకాని, ఆధిపత్యముకాని లభ్యపడెడిదికాదు. కారణము, ఇప్పటి రైల్వే పోస్టు తంతివార్తా సదుపాయము లాకాలమున లేకుండుటయు, వార్తాపత్రికా ప్రచారమప్పుడు లభ్యపడకుండుటయు నైయుండెను.

గ్రీసునందు, ముఖ్యముగా, ఏథెన్సునగరరాజ్యాంగమందు, 'పౌరసభ' లో శాసనమును ప్రతిపాదించి, సభవారిచే నంగీకరింపజేసిన నాయకుని, ఒక సంవత్సరములోపల, రాజ్యవిద్రోహిగానిందించి, న్యాయస్థానమందు విచారణకు దెచ్చుటకు ప్రతిపౌరునకు హక్కుయుండెడిది. కొన్నిరాజ్యములందిట్టి శాసనసంస్కరణముల ప్రతిపాదించునాయకుని కంఠమునకు వుచ్చువేసి, అటునిటు ప్రజలు పట్టుకొనియుండెడువారు. ఆయనసంస్కరణ, పౌరసభవారిచే నంగీకరింపబడుచో, వుచ్చునుండి వెల్వడి, సురక్షితుడై, ప్రజలచే భూషింపబడెడువాడు. అదృష్టముచాలక, వారిసంస్కరణ వీగిపోవుచో, అటునిటునున్న ప్రజలు ఆయుచ్చును బిగలాగి, అప్పటి కప్పుడే, వారిని చంపెడివారు. కనుకనే, శాసననిర్మాణము, గ్రీసునందు దుర్ఘటమైన కార్యమై యుండెను.

రోమునందును ఇటులనే శాసననిర్మాణకులన్న ప్రజలును, పెట్రిషియనులును భయపడుచుండిరి. ఎప్పుడు రాజ్యాంగమును తల్లక్రిందులుచేయు శాసనముల సేనానాయకుడు ప్రతిపాదించి, నిర్మించునోయని వారు జాగ్రత్తపడుచుండిరి. కాననే, శ్రీగ్రాకసు (Gracchus) సోదరులిద్దరిని, శాసనముల నిర్మాణమునందు శ్రద్ధవహించిరను ద్వేషముతో, పెట్రిషియనులు కొందరు దుర్మార్గులగు పౌరులసాయముతో, పట్టపగటివేళ చిత్రవధ కావించియుండిరి.

ఇప్పుడట్లుగాక, శాసననిర్మాణమందు శ్రద్ధగైకొని, జయమందిన నాయకులెల్లయెడల పూజనీయులగుచున్నారు. సహగమనమును మాన్పించిన శ్రీ రాజారామమోహనుడు, విధవావివాహములు శాస్త్రసమ్మతమొనర్చిన శ్రీ విద్యాసాగరుడు, ప్రాధమికవిద్యా శాసనమును నిర్మింప ప్రయత్నించిన శ్రీ గోఖేలు, శారదాచట్ట కారకుడగు శ్రీ హరబిలాసుశారదాగారు, హిందూ దేవాదాయచట్టమును నిర్మించిన పానుగల్లురాజాగారు, మనదేశస్థుల యభివందనములకు పాత్రులగుచున్నారు. దానిపేరుసూచించునటులనే శాసనసభ, శాసనముల నిర్మించుటకుగా యేర్పరుపబడుచున్నది. ఇంగ్లీషువారి రాజ్యాంగపు టాచారముల సరిగాగ్రహించని, అమెరికారాజ్యాంగనిర్మాతలు, పురాతనపు గ్రీసు, రోమను రాజ్యాంగములందలి

శాసనసభా
ధర్మములు.

శాసనసభలనుమాత్రము గమనించి, తమ సమ్మేళనరాజ్యాంగపు, రాష్ట్రీయశాసనసభలకు, శాసననిర్మాణమే ప్రధానమగు ధర్మముగానిర్ణయించిన జాలుననుకొనిరి. శిస్తులు నంగీకరించుచు, ప్రధమమునుండియు, శాసనముల నిర్మించుచుండుట ఆచారమైయుండెను కనుక, అయ్యదికూడ శాసనసభయొక్క సాధారణధర్మములలో నొక్కటిగా పరిగణింపబడుచుండెను. ఇంగ్లాండునం దట్లుగాక, శాసననిర్మాణమేకాక, ప్రభుత్వమును అదుపుఆజ్ఞలందుంచి, మంత్రాంగవర్గమును విమర్శించుట, పెత్తనమందుంచుట, అసంతృప్తికరమగు మంత్రివర్గమును పదభ్రష్టత నొందించుట, పార్లమెంటు తన ధర్మముగా పరిగణించుచున్నది. అమెరికాయందు, కార్యనిర్వాహకవర్గపు టధ్యక్షుడగు ప్రెసిడెంటు ప్రజలచే సరాసరియెన్నుకొనబడి, శాసనసభపై తనయధికారమునకు, పదవికి ఆధారపడియుండడు. ఇంగ్లాండునందట్లుగాక, మంత్రివర్గము, పార్లమెంటునందు, అధిక సంఖ్యాకులకు జెందిన "మెజారిటీపార్టీ" సభ్యులవలన నిర్మింపబడి, మెజారిటీపార్టీవలన నిలబెట్టబడి, మెజారిటీపార్టీకి లోబడి, పార్లమెంటునకంతకు బాధ్యత వహించుచున్నది. కనుక అమెరికాయందు "కాంగ్రెసు" శాసనముల నిర్మించుటతో తన ప్రధాన ధర్మనిర్వహణము జరిగినదని సంతృప్తిబొందుచుండ, ఇంగ్లాండునందు, శాసనముల నిర్మించుటయేకాక, సక్రమమగు, సంతృప్తికరమగు మంత్రివర్గము నేర్పరచి, నిలబెట్టి మంత్రివర్గముచే ఎప్పటికప్పుడు జాతీయావసరముల సమగ్రముగా, సంతృప్తికరముగా దీర్చునట్లు చేయుభాధ్యత, పార్లమెంటుపై కలదు. క్రిందటిశతాబ్దమందంతట నేర్పరచబడిన, రాజ్యాంగవిధానచట్టములందు అమెరికా కాంగ్రెసును అనుకరించుటకుముందు ఇంగ్లీషువారి పార్లమెంటుపద్ధతిని అవలంబించబడినది. ఇందువలన ఈనాటి ప్రజాస్వామిక రాజ్యములందు, అమెరికా రాజ్యాంగము మినహా, ఇంగ్లీషుపద్ధతి ననుసరించియే శాసనసభకు బాధ్యతవహించు మంత్రివర్గములే యేర్పరచబడినవి. అనగా, శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వములే యేర్పరచబడినవి.

II

శాసనసభ తన ధర్మములందెద్దానినైన సంపూర్ణముగా నిర్వర్తించవలయునన్నచో ప్రజలయొక్కయు, వారియభిప్రాయముల యొక్కయు ప్రతిబింబముగా నుపకరించవలయును. ప్రజలయందలి అన్నిసంఘములయొక్క ప్రతినిధులు, కొలదిగనో, గొప్పగనో, ఆసభయందు సభ్యత్వము పొందవలయును. ప్రజాసామాన్యమంతట జాతీయ అవసరములగూర్చి యెట్టియభిప్రాయములు ప్రచారితమైయున్నవో, వానినెల్ల శాసనసభ యందు ప్రకటితమొనర్చుట కవకాశము లుండవలయును. ప్రజాభిప్రాయమును ధర్మసమ్మతముగా, గౌరవప్రదముగా, అందు ప్రతిబింబించవలయును.

కనుకనే యుక్తవయస్సు వచ్చిన ప్రజలందరికి, శాసనసభాసభ్యుల నెన్నుకొను 'వోటు' హక్కు అవసరము. స్త్రీలు పురుషులను భేదము లేకుండా ఎల్లరకు 'వోటు' హక్కు అవసరము. పురుషులకే రాజ్యాంగావసరములు కలవు. స్త్రీలకు లేవని వాదించువారెవ్వరుకలరు ? రాజ్యాంగపు మంచిచెడ్డల వలన పురుషుల కెట్టి సాధకబాధకములు కల్గునో అట్టివే స్త్రీలకును, సమానతీవ్రతతోడనే కల్గుట లేదా ? సంఘనిర్మాణము సౌష్టతనొందకపూర్వము, జనసమూహములు ఒక చోట నుండి మరొక చోటకు తమతమ పశుగణములతో వలసవెళ్లుచుండిన కాలమందు, వివిధసమూహములమధ్య కల్గుచుండు యుద్ధములందు పురుషులే పాల్గొన నర్హులై యుండుటచే రాజ్యాంగమును నిలబెట్టు భారము పురుషులపైననే కలదు. కనుక, స్త్రీలకట్టి రాజ్యాంగవిధానమునందు పెత్తనమిచ్చుట భావ్యముకాదని వాదించుట కొంతవరకు సమంజసమైన కావచ్చునేమోకాని, క్రిందటి యుద్ధపు టనుభవము బొందినపిమ్మట, ఈకాలమందు యుద్ధములు జరుగుచున్నప్పుడు, పురు షుల సహకారము, త్యాగము, సహాయము యుద్ధభూములందెం తగత్యమో, అంతగా స్త్రీలసహకారము దేశమందు, వాణిజ్య, వ్యాపారాది, సాధారణసాంఘిక జీవితమును నడపుట కవసరమని ప్రజలు తెలుసుకొనగల్గిరి. ఇక కరవులు, కాటకములు వచ్చినగాని, మహామారి, మశూచికములు దాపరించినగాని, ఆర్థికసంక్షోభము కల్గినగాని, రాచకీయవిప్లవము తటస్థించినగాని పురుషులతో సమానముగా స్త్రీలును బాధలననుభవింప వలసియుందురు. స్త్రీలను రక్షించుభారము పురుషులు వహించుచున్నారని కొందరు వాదింతురుగాని, వారిమాట సహేతుకముగాదు. మనదేశమందే వివిధ వృత్తులందు, ఫాక్టరీలయందు పురుషులతోబాటు స్త్రీలును సమానముగా జీవితపోషణ చేయుటకు కష్టించుచున్నారు. వ్యవసాయక కూలీలయందును, స్త్రీలు పురుషులతోబాటు కూలినాలిచేసి ప్రాణముల నిలబెట్టుకొనుచున్నారు. ఇకపాశ్చాత్య దేశములగూర్చి వేరుగ చెప్పవలెనా ? అచ్చట స్త్రీలకు, ఆర్థిక ప్రపంచమందును సమాన ప్రతిపత్తికల్గుచున్నది. ఇట్టి పరిస్థితులందైనను, ఫ్రాన్సుదేశస్థులు స్త్రీలకు వోటుహక్కు నివ్వ నిరాకరించుచుండుట ఆశ్చర్యకరమగు విషయమే కాని, న్యాయపద్ధతిమాత్రము కాజాలదు. రాజ్యాంగ నిర్వహణాధికారము బొందుటకు తగిన విద్య, అనుభవము, కార్యకారితనము స్త్రీలకు లేదని కొందరు ఫ్రెంచినాయకులు వాదించుచు న్నారు కాని, ఇప్పటికే వోటుహక్కు బొందియున్న పురుషులలో నధికసంఖ్యాకులకు సంపాదితమైయున్న విద్య, అనుభవము, కార్యనిర్వహణశక్తి, స్త్రీలకుమాత్రము లోపించుచున్నదని చెప్ప సాహసింపలేకున్నారు. కారణమేమమ నిర్బంధ ప్రారంభవిద్య నందరు బొందుచు, వార్తాపత్రికాపఠన మందరు గావించుచు, రాజ్యాంగవ్యవహారముల నెల్లరు గమనించుచున్నంతవరకు స్త్రీ పురుషభేదములు మాత్రము రాచకార్య నిర్వహణమునందు, స్త్రీలకువోటుహక్కు యివ్వరానంత విపరీత తారతమ్యత కల్గించుట దు స్తరము, ధర్మవిరుద్ధము. మనదేశమందును, స్త్రీలకు వోటుహక్కు ప్రసాదించరాదను వారు అరుదగుచున్నారు. ఘోషాపద్ధతిని బొందిన, మహమ్మదీయులు ఈ హక్కు తమస్త్రీలకు ప్రసాదించుటకు అనుమతించుట లేదు కాని, వారి స్త్రీలయందలి నాయకురాండ్రు వారినాయకులు కొందరు వోటుహక్కు యెల్లరకు నొసగబడవలెననుచున్నారు. లోధియను కమిటీ వారిసూచనలప్రకారము స్త్రీలును, పురుషులతోబాటు క్రమకమముగా సంపూర్ణ వోటుహక్కు పొందనగునని తేలుచున్నది.

స్త్రీపురుషులను భేదముల గమనించుట పాడిగాకున్నను, ఆస్థిగలవారు, ఆస్థిలేనివారను తారతమ్యత గమనించుటగత్యమని కొందరు వాదించుచుండిరి. ఆస్థిగలవారన్న, ఎంతయాస్థిపరులను ప్రశ్న బయలుదేరును. ఇంగ్లాండునందు క్రీ. శ. 1832 వరకు, 10 పొన్లు భూమిశిస్తు చెల్లించువారే వోటుహక్కు పొందకల్గిరి. పిమ్మట 1867 సంవత్సరమునందు 12 పౌన్లు శిస్తుచెల్లించు వారందరకి వోటుహక్కు ప్రసాదించబడెను. తుదకు 1884 నందు, ఆస్థికల్గియుండుట, శిస్తులచెల్లించుట యనుభేదముల గమనించుట మాని, యుక్త వయస్కులగు పురుషులందరికి, వోటుహక్కు యివ్వబడెను. మనదేశమందుగూడ, 1919 ఆక్టుప్రకారము, పదిరూపాయల లాండురెవిన్యూ చెల్లించువారు కౌన్సిలునకు, ఏబదిరూపాయల భూమిశిస్తు చెల్లించువారు అస్సెంబ్లీకి, వోటుహక్కు బొందిరి. కాని యిప్పటి లోధియనుకమిటీ సూచనలప్రకారము, మద్రాసులోకలుబోర్డ్సు ఆక్టుప్రకారము, నామమాత్రపు శిస్తుచెల్లించువారు, భూములను మక్తాకు సేద్యముచేయువారుకూడ వోటుహక్కు బొందనగును. అనగా, సంవత్సరమునకు నాల్గణాలశిస్తు చెల్లించువారెల్లరు వోటుహక్కు బొందగల్గుదురు.

ఇట్లు నామమాత్రపు శిస్తుచెల్లించువారు (మనలోకలు బోర్డునందును, ఇంగ్లాండులో 1867 వరకును) వోటుహక్కుబొందుచుండ, మిగిలిన నిర్ధనులగువారెల్లరు, వోటును బొందజాలకుండుట న్యాయమా ? వోటును సంపాదించుకొన గల్గినవారికిని, వోటును బొందజాలనివారికిని, విద్యయందుగాని, అనుభవమందు కాని, రాచకీయవిజ్ఞానమందు కాని, కార్యనిర్వాహణత యందుకాని యేమిభేదము కన్గొనగలము ? ఎందును భేదించని ప్రజలయందు, నామమాత్రపు ఆస్థికల్గి శిస్తు చెల్లింపగల్గు శక్తినిబట్టి కొందరిని వేరుజేసి, వారికే వోటుహక్కు నిచ్చుట న్యాయమా ? మనదేశమునే దృష్టాంతముగ గైకొనుచో, విద్యావిహీనులు, వోటు లేనివారియందెట్లుకలదో, వోటరులందును కలదు. రాచకీయానుభవరహితులు, ఇరుపక్షములందును కొల్లలుగాగలరు. ఇరుపక్షములకును, రాజకీయాధికారము, దానివలనకల్గులాభ మేమాత్రమైన యుండుచో, అవసరమైయున్నది. రాజ్యాంగ వ్యవహారముల వలనకల్గుసాధక భాధకములవలన, వోటరులవలెనే, వోటులేనివారును, లాభనష్టముల బొందవలసియుండును. జాతీయగౌరవరక్షణార్థమై, ఇరుపక్షములును ధనప్రాణముల ధారవోయవలసి యున్నారు. జాతీయజీవనము సిరిసంపదలు, సుఖసంతోషప్రదముగా నుండవలయునన్న, బీదలు, ధనికులెల్లరు తమతమ శక్తికొలది, స్వార్ధత్యాగము చేసి, రాజ్యాంగసేవ చేయవలసియున్నది. ఇట్టి పరిస్థితులందు, తుట్టతుదిదగు, ప్రాధమికమగు, రాజ్యాంగహక్కు, వోటుహక్కులు, ప్రజలలో ధనికులకు, శిస్తుచెల్లించువారికి మాత్రమొసంగి, మిగిలినవారికి నిరాకరించుట న్యాయమా ? కనుకనే నెహ్రూకమిటీవారు స్త్రీపురుషభేదము మాని, ధనికులు, నిర్ధనికులను భేదముల మాని యుక్తవయస్కులగు ప్రజలెల్లరకు వోటు హక్కు ప్రసాధించుట ధర్మమని వాదించిరి. వోటర్ల జాబితాల తయారుచేయుటలోను, ఎన్నికలజరపుటలోను, ఖర్చు, కష్టము హెచ్చగునని వారికి తెలియకపోలేదు. కాని ప్రజాస్వామికరాజ్యము ప్రజలయభివృద్ధికై జరుపబడవలయునన్న ఇంతమాత్రము ఖర్చునకు, కష్టమునకు తయారై యుండవలెనని వారు సంతృప్తికరమగు సమాధానమిచ్చిరి.

స్త్రీపురుషభేదములను, ధనికులు నిర్ధనికు లనుభేదముల గమనించకున్నను, చదువుకున్నవారు, చదువులేనివారను భేదమైన కల్పించి, చదువుకున్న వారికే వోటుహక్కు నిచ్చుట యుక్తమని కొందరు వాదించుచున్నారు. శ్రీజాను స్టూవర్టుమిల్లుగారు, చదువుకున్నవారందరి కొక్కొక్కరికి, ఒక్కొక్కవోటునిచ్చి, విద్యాధికులైన ప్రతివారికి మరొక్క వోటునిచ్చుట మంచిదనికూడ వాదించిరి. శ్రీ లార్డు బీకన్సుఫీల్డుగారు, తమ రాజ్యాంగ సంస్కరణపు బిల్లునందు, ఇటులనే విద్యాధికులైనవారికి హెచ్చువోటులు బొందు అర్హత నేర్పరచ బ్రయత్నించిరి. లోధియనుకమిటీవారును శ్రీ అనిబిసెంటమ్మ గారి కామనువెల్తుకమిటీవారును, తదితరుల మధ్య, ఆస్థియున్నందులకే వోటుల పంచియిడినను, విద్యావంతులైన వారికిమాత్రము వోటుల నివ్వవలయునని సూచించిరి. కాని, ఏవిధముగ జూచినను, మనదేశమందు అల్పసంఖ్యాకులే చదువరులైయుండుటవలనను, వోటరులం దధికసం ఖ్యాకులు విద్యావిహీనులైయుండుటవలనను, విద్యావంతులకే ఓటులనిమ్మనుచో ఇప్పటికే వోటుహక్కుబొందినవారు, వోటులేనివారగుట తటస్థించును. అటులగాక, శిస్తుచెల్లించువారికే వోటులనిచ్చుచు, చదువుకొన్నవారికికూడ వోటుహక్కు నివ్వమనుచో, ఇప్పటికంటె మరికొందరికి వోటుహక్కురావచ్చును. ఈ విధమగు భేదముల ననేకము కల్పించుచు, ప్రజలలో కొందరికి వోటు లేకుండా జేయుటకు బదులు అందరికి వోటునిచ్చి, ఎల్లరకు చదువుటకు వ్రాయుటకు శక్తికల్గు సదుపాయముల కల్గించుట రాజ్యాంగములకు పాడిగదా !

రాజకీయాధికారములను దేశోపయోగకరముగా, ప్రజోపయోగకరముగా నుపయోగింప వలసియున్నది కనుక, వోటరులందరు చదువరులై రాచకీయానుభవముబొందినవారైయుండుట లాభకరము. కాని, చదువరులైన వారందరికి రాచకీయానుభవము కల్గుటలేదుగదా ! వోటుబొంది, ఎన్నికలందు పాల్గొని, రాచకీయవ్యవహారముల గమనించుచున్ననే, రాచకీయానుభవము కలుగగలదు. కనుక, చదువరులు కాకున్నను, మనప్రజలు వోటుహక్కుబొంది, రాచకీయానుభవము పొందుట కవకాశము సంపాదించుకొందురు. నిర్భంధ ప్రారంభవిద్య, వయోజనవిద్యావిధానముల రాజ్యాంహమేర్పరచుచో కొలదికాలముననే ఎల్లరు చదువరులగుట సుకరము. అంతియేకాని, ఎల్లరు చదువరులైననే వోటుహక్కు ప్రసా దించబడునని వాదించుట భావ్యముకాదు. మరియు చదువరులైనవారికే వోటుహక్కు యివ్వబడునని యేర్పాటుచేయుచో ప్రభుత్వోద్యోగులకు, వారిపై యధికారము వహించుమంత్రులకు ఎవ్వరికి వోటునివ్వవచ్చును, ఎవ్వరి కది యివ్వరా దను విచక్షణాధికారము కల్గును. ఇందువలన అనేక యిబ్బందులు కల్గుట అసాధారణముకాదు. అమెరికాలోని దక్షిణరాష్ట్రములందు విద్యావంతులైన వారికే వోటు నివ్వవలె నను నియమముండుటవలన, తెల్లవారు, నీగ్రోజాతివారిలో ననేకులకు, అన్యాయముగా వోటుహక్కు నివ్వనిరాకరింపకల్గుచున్నారు. రాచకీయానుభవ మంతగా లేని మనదేశమం దింకా నెన్నియో యిబ్బందులుకల్గును. ఇట్టికష్టములు కలుగకుండుటకై అనుభవరీత్యా, రాచకీయవిజ్ఞానము చదువరులు కాని వారికికూడ కల్గుననినమ్మి, బాల్కనురాష్ట్రములందును, ఇటలీ, స్పెయినుదేశములందును నిర్బంధప్రారంభవిద్యావిధానము యీమధ్యనే యేర్పరచబడినను, వోటరులలో అనేకు లిప్పటికిని చదువురానివారున్నను, ప్రజలెల్లరికి వోటుహక్కు ప్రసాదించబడినది.

చదివినవారైనను, చదువని వారైనను ఎల్లరకు రాజ్యాంగవ్యవహారములవలన కల్గు అవసరములు అనుభవనీయమగును. ప్రజలందరకు, తమప్రభుత్వ మెటులనడుపదగునో విచారించుట కవకాశ మగత్యము. వారెల్లరికి, తమకు రాజ్యాంగము వలన యెట్టిలాభములు కలుగవలయునో, దైవసం ఘటనమువలన కల్గు కష్టము లెట్లునివారణ కావలయునో ఆలోచించుటకు, సూచించుటకు హక్కు అవసరము. ప్రజలకు తమవ్యక్తిగతజీవితమందు, సాంఘికవ్యవహారములందు కల్గుచుండు అనుభవమును రాజ్యాంగోపయోగముకై తమ ప్రతినిధులద్వారా అనుదినము ఎల్లవిషయములందును తెలియజేయకల్గు యవకాశ మవసరము. "రాజునకు ప్రజ శరీరమన్నట్లు" రాజ్యమునకు ప్రజలు శరీరము కనుక, ప్రజలయందెల్లశాఖలు, సంఘములు, రాజ్యాంగమున కుపకరించవలయునన్న, వారెల్లరియనుభవముల, ఆలోచనల, రాజ్యాంగవిధానము సక్రమమగుమార్గమున తమ ప్రభుత్వమునకు తెలియునట్లు తమప్రభుత్వముపై యాధిక్యతవహించునట్లు చేయవలసియున్నది. కనుకనే ప్రజాస్వామిక మనుభవించుచున్న, సకలదేశములందును ప్రజలెల్లరికి వోటుహక్కు ప్రసాదించబడుచున్నది. వోటరులెల్లరు తమప్రతినిధులద్వారా తమతమ యనుభవమును, తమకష్టనిష్టూములను, తమకోరికలను ప్రభుత్వమునకు తెలియపరచి, తమకు సుముఖమగు ప్రభుత్వము నేర్పరచుకొను యవకాశము కల్గియుందురు.

III

ప్రజలెల్లరు యుక్తవయస్కు లగుటతోడనే, వోటుహక్కు పొందినంతమాత్రమున వారిప్రతినిధు లెట్లెన్నుకొనబడుట యను ప్రశ్న మనల నెదుర్కొనును. పురాతన కాలమందు మనదేశపు పంచాయతులందును, గ్రీసుదేశమున ఎథె న్సునగర రాజ్యమున 'కౌన్సిలు' సభ్యుల యెన్నికలందును, లాటరీ పద్ధతిపై ప్రజాప్రతినిధు లెన్నుకొనబడుచుండెడివారు. అనగా, అభ్యర్థులుగా నుండదలచినవారి లేక పౌరులెల్లరిపేరులను కొన్ని కాగితములమీద వ్రాసి, వానినన్నిటి ముడిచి ఒక బుట్టయందు వేసి, బాగా తిరగత్రిప్పి, పిమ్మట కండ్లకు గంతకట్టుకొనిన బాలకుని చేతనో, మరెవ్వరిచేతనైనగాని, ఎంతమంది సభ్యులగత్యమో అన్ని కాగితముల తీయించెడివారు. ఆకాగితములపై ఎవ్వరెవ్వరి నామములు లిఖింపబడెనో వారిని సభ్యులుగా ప్రకటించెడివారు. ఇందువలన ఈపౌరులు నన్ను బలపరచిరి గాన నావారు, వారు నన్నెదిరించి నాప్రత్యర్థికి తమవోటుని నిచ్చిరిగనుక వారు పెరవారు, విరోధులను విభేదములు కల్గుటకు తావుండెడిదికాదు. మరియు దైవానుగ్రహముపై ఎన్నికఫలితము లాధారపడియుండెను. గనుక, ప్రతిపౌరునకు సబ్యత్వము బొందుటకు ఎప్పుడో యొకప్పుడు అవకాశము కల్గుటకు వీలుండెను. ఇందువలన పార్టీలేర్పడుటకు అవకాశము లేదాయెను. ప్రజలెల్లరు, ఒక కుటుంబీకులమనియు సోదరసోదరీలమనియు బావించి ఐక్యభావముతో పంచాయితీపేరు ప్రతిష్టలు వృద్ధిబొంది గ్రామసౌభాగ్యాభివృద్ధి పొందుటకై కృషిచేయుటకు వీలుండెను. 'ఈలాటరీ' పద్ధతి ఇప్పటికి ముఖ్యమగు అన్ని యెన్నికలందును అన్ని దేశములందును విడనాడ బడినను ఇంగ్లాండు, మనదేశము, బ్రిటిషు ఆధినివేశములందు శాసనసభలలో సభ్యుల బిల్లులు తీర్మాన ములు ప్రవేశపెట్టుటకుముందు, వేనిని ముందు ప్రవేశపెట్టనగునో తీర్మానించుట కుపయోగింపబడుచున్నది.

లాటరీపద్ధతి మానినపిమ్మట, ప్రజలు, తమప్రతినిధులను, ఈయాధునికయుగమందు ఇంగ్లాండునందు ప్రధమమున, పిమ్మట ఇతరదేశములందు, అధికసంఖ్యాకులగుప్రజ లేయభ్యర్థిని బలపరతురో, ఆతడు ఎన్నుకొనబడుపద్ధతి యమలులోనికివచ్చినది. దీనినే "మెజారటీ" పైఎన్నిక జరుపుటందురు. ఈమార్గముద్వారా, ప్రతిఒక్కసభ్యనియోజకవర్గము నుండియు, అభ్యర్థులుగానిలబడినవారిలో నెవ్వరిని ఎన్నుకొనుటో స్థిరపరచుట సాధ్యపడుచున్నది. ప్రజలెల్లరికి, తమకు నచ్చిన యభ్యర్థుల నెన్నుకొనుట కధికారమేకాక యవకాశము కల్గుచున్నది. కనుక ఏయభ్యర్థికి, వానితరపున నిలబడువారికి, అదృష్టముపట్టిన, ఆయభ్యర్థి సభ్యుడుగా నెన్నుకొనబడుటయు, ఆతనికి వోటుచేసినవారు సఫలీకృతమనీరధులగుటయు సాధ్యమగుచుండును. వోడిపోయిన అభ్యర్థులు, వారిని బలపరచినవోటరులు, తాము దురదృష్టవంతులమని విచారించి, సంతృప్తిపొందుచుండెడివారు. కాని, కాలక్రమేణ ప్రజలందెచ్చుమంది, ఏరెండో మూడో రాచకీయముఠాలకు లేక పార్టీలకు చెందియుండి, ప్రజలందధిక సంఖ్యాకుల ప్రాపకము పొందుటకై పోటీపడుచున్నకొలది, కొన్నినియోజక వర్గములందు, దేశమందలికొన్ని ప్రాంత్యములందే, ఒకేపార్టీ వారు, మెజారిటీ సంపాదించుకొని, తమయభ్యర్థులనే జయప్రదుల జేయించుకొను యర్హతబొందుచుండుట, ఇంగ్లాండు నందేకాక ప్రజాస్వామికము బొందిన అన్నిదేశములందును, తటస్థించుటచే ఈ 'మెజారిటీ' పరిపాలనయెడ ప్రజలు, నాయకులు, రాచకీయజ్ఞులు సంశయాకులితమానను లగుచున్నారు.

ప్రతినియోజకవర్గమునందును, మెజారిటీ వోటరులే తమ అభ్యర్థిని జయప్రదముగా జేయగల్గుటవలన, రాచకీయపుపార్టీలు స్థిరతగా యేర్పడినపిమ్మట, అనేకనియోజకవర్గములం దనేకమారు లొకేపార్టీకి జెందిన అభ్యర్థులే ఎన్నుకొనబడుచుండుటచే, ఆనియోజకవర్గములందలి మైనారిటీ వోటరులకు, ప్రజాప్రతినిధిసభయందు ప్రాతినిధ్యత కలుగుట దుస్తరమగుచున్నది. దేశమమ్ందంతట నిట్లు, మైనారిటీలకు ప్రాతినిధ్యత లేకపోవుటవలన, వారికధికమగు అన్యాయము కల్గుచున్నదని శ్రీథామసు హేరు, జాన్ స్టూఆర్టుమిల్లుగారలు, క్రిందటిశతాబ్దమందు వాధించిరి. అధికసంఖ్యాకులగు వోటరులే, ప్రజాస్వామికమును నడపు అధికారముబొందుట న్యాయముకాదనియు, "మెజారిటీ పాలనాసూత్రము"ను కొంతవరకు అరికట్టుట అగత్యమనియు, "మైనారిటీ" యందుండు వారికికూడ, తమకిష్టమగు ప్రతినిధుల, ప్రజాప్రతినిధిసభకు పంపుకొను యవకాశము కల్గించుట మేలనియు, వారును ఈకాలపు రాచకీయజ్ఞు లనేకులును వాదించుచున్నారు.
పైన యుదహరింపబడిన లెఖ్ఖలబట్టి, ఇంగ్లాండునందలి వివిధరాచకీయపక్షములు, తమకు దేశమందుగల పలుకుబడికి తగినట్లు, పార్లమెంటులో ప్రాతినిధ్యము పొందలేదనియు, ఒక్కొక్కయెన్నికయం దొక్కొక్కపార్టీవారు, అత్యమితమగు ప్రాముఖ్యతను పార్లమెంటునందు పొందుచుందురనియు, ప్రజలయందు ఆప్రాముఖ్యతకు తగిన పలుకుబడి, ఆపార్టీవారికి లభ్యముగాకుండుట సత్యమనియు తెలియనగును. క్రీ. శ. 1924 సంవత్సరమందు జినోలైఫ్ లెఖ్ఖను, డెయిలీ మెయిల్ పత్రికాధిపతులు సృష్టించి, లేబరుపార్టీవారు రషియను ప్రభుత్వమునకు, బ్రిటిషురాజ్యాంగమును లోపరచ బోవుచున్నారని అసత్యప్రచారముజేసిరి. అంత, ప్రతినియోజకవర్గమందును, అధిక సంఖ్యాకులగువోటరులు కన్సర్వేటివుపార్టీ వారికి తమ వోటులనొసంగి, కన్సర్వేటివు అభ్యర్థులను జయప్రదులజేసిరి. మరికొన్నినియోజకవర్గములందు, లిబరలు, లేబరుపార్టీల అభ్యర్థులుకూడ నిలబడుటచే, అల్పసంఖ్యాకమగు వోట్లతోడనే, కన్సర్వేటివులు జయమందిరి. ఈవిధముగా లిబరలు, లేబరుపార్టీలకు, మొత్తముమీదహెచ్చువోటులు, దేశమం దంతట వచ్చినను, ఎన్నికఫలితములందు మాత్రము వానికి 176 స్థానములు చేకూరగా కన్సర్వేటివులకు 382 స్థానములు సంప్రాప్తించెను. ఇదేవిధముగా 1931 సంవత్సరమునందును శ్రీఫిలిప్సుస్నోడనుగారుపెట్టిన ఆర్థికసంక్షోభభయముచేత, ప్రజలెల్లరు కంగారుపడిపోయి "జాతీయప్రభుత్వము"ను బలపరుప పత్రికలచేతను, కన్సర్వేటివుపార్టీచేతను, రాచకీయనాయకులచేతను ప్రోద్బలపరచబడుటచే కన్సర్వేటివు పార్టీవారిని ఎల్ల నియోజకవర్గములందును ప్రజలు బలపరచిరి. తన్మూలమున "జాతీయ ప్రభుత్వపు" అభ్యర్థులందరికి సంపాదితమైన వోటులలోసగమువంతు, లేబరుపార్టీ, లాయడుజార్జిగారి లిబరలు పార్టీలవారికి వచ్చినను, కన్సర్వేటివుపార్టీవారికి 472 స్థానములు, జాతీయ లేబరుకు 13 స్థానములు, జాతీయలిబరలుపార్టీకి 35 స్థానములు, అనగా 520 స్థానములు జాతీయప్రభుత్వమునకును, లేబరుపార్టీకి 52 స్థానములు, లిబరలుపార్టీకి 37 స్థానములు, మిగతావారితో కలిసి, ప్రత్యర్థికక్షిలన్నిటికి కలిసి 95 స్థానములు మాత్రములభ్యమయ్యెను. పైలెఖ్కలనుబట్టి, ఏకసభ్య నియోజకవర్గము లుండునంతవరకు, వానినుండి వచ్చుసభ్యులు, సాధారణమెజారిటీసూత్రప్రకారము యెన్నుకొనబడువరకు , లక్షలకొలది వోటరులకు, తమకు నచ్చినపార్టీవారి అభ్యర్థుల నెన్నుకొనుయవకాశము కలుగకపోగా అనేకమారులు తలవనితలంపుగా ప్రజాబాహుళ్యమునకు అయిష్టము, ఆశ్చర్యమే కల్గించునట్లు ఏయొక్కపార్టీవారో మితిమించిన ప్రాతినిధ్యమును సంపాదించుకొని బాధ్యతాయుతసూత్ర ప్రభావమును వమ్ముజేయుట కల్గుచుండునని తేలుచున్నది.

ఇట్టి విపరీతపర్యవసానముల కల్గించు ఏకసభ్యనియోజకవర్గములకు బదులు, సమిష్టిసభ్యనియోజకవర్గముల నేర్ప రచి "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రములద్వారా సభ్యులనెన్నుకొనుచో, అన్నిపక్షములప్రతినిధులు, ప్రజాప్రతినిధిసభయందు తమతమ ప్రాపకమునకు తగినట్లు సభ్యత జెందగలరని, అనేక రాచకీయజ్ఞులు తలంచుచున్నారు. సంఘమునందలి వివిధమతస్థులు, వివిధ అంతస్థులప్రజలు, వివిధభాషా ఆచార సాంప్రదాయములు కలవారు, వోటుహక్కు బొంది తమతమ ప్రతినిధులనెన్నుకొనుహక్కు లొందుటెట్లగత్యమో, అటులనేవివిధరాచకీయ ప్రణాళికలందు అభిమానముకల్గి వివిధరాచకీయపార్టీలకు జెందినవారికికూడ తమప్రతినిధుల నెన్నుకొనుహక్కు కల్గుటయేకాక, తమసంఖ్యలకు తగినట్లు, తమప్రాపకమునకు తగినట్లు సభ్యతబొందు టగత్యము. ఎన్నటికిని తామెల్లరు మైనారిటీయందే యుండి, తమాభ్యర్థిని జయప్రదుని చేయజాలమనునిరాశబొందిన మైనారిటీ, ఎన్నికలయందు నమ్మకము కల్గియుండజాలదు. కొన్ని నియోజకములందు పలుమారు ఒకేపార్టీకిచెందినవారెన్నుకొనబడుచు, మైనారటీపార్టీవారి కవకాశమే కలుగకుండుచో "మెజారిటీ"వారి నిరంకుశత హెచ్చుటయు, మైనారిటీవారికి ఆత్మవిశ్వాసము తగ్గి, స్వరక్షణశక్తి సన్నగిల్లుటయు తటస్థించును.

కాని, ఇంగ్లీషురాచకీయజ్ఞులనేకులు, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యమన్న విరోధులై యున్నారు. శ్రీ బేజిహటులాయడుజార్జి, రామ్సేమాక్డువాల్డు, మున్నగురాజకీయనాయ కులు, శ్రీహారల్డులాస్కి మున్నగు రాచకీయజ్ఞులు, ఈపద్ధతి తిరస్కరించుచున్నారు. ఏకసభ్యనియోజకవర్గములుండుచో, సభ్యులు మెజారిటీవోటుపై, ఎన్నుకొనబడుచో, ఏరెండొ, మూడో ముఖ్యమగు రాచకీయపార్టీలే, రాజకీయరంగమున ప్రాముఖ్యత బొందుననియు, బాధ్యతాయుత ప్రభుత్వము, రెండు మూడు బలిష్టమగు రాచకీయపార్టీలుండి, అందొక్కటి, ప్రజాప్రతినిధి సభయందు, మెజారిటీసభ్యుల కల్గియున్ననే, జయప్రదముగా, శుభప్రదముగా నడుపబడుననియు వారు తలంచుచున్నారు. అమెరికాయందును, ఇంగ్లాండునందును, ఏకసభ్య నియోజకవర్గములందు మెజారిటీసూత్రముప్రకారము ఎన్నికల ఫలితములు నిర్ణయింపబడుటవలన, ప్రధానమైన రాచకీయపార్టీలు, రెండుగాను, మూడుగాను నుండుచున్నవి. అమెరికాయందు రిపబ్లికను, డెమోక్రాటికు పార్టీలే ప్రమూఖ్యత వహించియున్నవి. వ్యవసాయకులపార్టీ స్థాపించబడినను, వృద్ధిబొందజాలకున్నది. అటులనే, ఇంగ్లాండునందును, కన్సర్వేటివు, లేబరుపార్టీలు ప్రాముఖ్యస్థానము నాక్రమించుటయు, లిబరలుపార్టీ సాధారణస్థానము బొందుటయు జూడనగును. ఇటుల ప్రధానమగు రెండుపార్టీలు చిరకాలము ప్రాముఖ్యత వహించుటకు ప్రధానకారణము ఏకసభ్య నియోజకవర్గములు, మెజారిటీసూత్రమని చెప్పకతప్పదు. వివిధరాచకీయ బృందములకు మారు, ప్రధానమగురాచకీయ పార్టీలు రెండే యుండుటవలన, ఎప్పుడును ఏయొక్కపార్టీయో పెత్తనమందుండి, మంత్రివర్గమునేర్పరచుచు, రెండు వత్సరములనుండి నాల్గు, లేక ఐదు వత్సరములవరకు, రాజ్యాధికారమును నడపుచుండుటయు, అందువలన, ఏదేనొక రాచకీయప్రణాళికను అమలుపరచుట కవకాశము కల్గుటయు సాధ్యమగుచున్నది. సమిష్టినియోజకవర్గములేర్పడి, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము అమలుపరచబడుచో, ఫ్రాన్సు, జర్మనీదేశములయందువలె అనేకములగు రాచకీయ బృందములు ప్రాముఖ్యతబొందుటయు, ప్రజాప్రతినిధిసభయందె యొక్కటి లేక రెండు రాచకీయబృందములకును మెజారిటీ సంపాద్యము కాకుండుటయు, అందువలన రెండుమూడు వత్సరములవరకు పెత్తనమందుండు మంత్రివర్గము నేర్పరుపవీలుకాకుండుటయు అనుభవైక వేద్యము. ఇందువలన, ఆదేశమునందు, ఏరాచకీయప్రణాళికనైనను, శ్రద్ధతో, ఓపికతో, పట్టుదలతో అమలునందు బెట్టుట కవకాశము కలుగుటలేదు. ఇట్టి యిబ్బందులు ఈపద్ధతినే అవలంబించుచో ఇంగ్లాండు, అమెరికాలయందును కల్గునుగనుక ఆదేశముల రాచకీయజ్ఞులు 'ప్రపోర్షనల్‌' ప్రాతినిద్యమును నిరసించుచున్నారు.

కాని, వారు ఏక సభ్యనియోజకవర్గములవలన కల్గుచున్న ఆపదను గమనించుట లేదు. యుద్ధానంతరము, శ్రీలాయడుజార్జిగారికిని, క్రీ. శ. 1931 యందు శ్రీరామ్సేమాక్డునాల్డు గారికిని, అపారమగు, అనవసరమగు, మితిమించిన మెజారిటీని దెచ్చిపెట్టి సార్థకతగా, కార్యసానుకూల్యముగా ప్రభుత్వచర్యల విమర్శించి, దేశసేవచేయలేనట్టి బలహీనపుస్థితికి, మైనారిటీనిబెట్టినది ఏకసభ్యనియోజకవర్గముగదా ? అప్పుడు శ్రీలాయడుజార్జిగారుగాని, ఇప్పుడు శ్రీరామ్సేమాక్డునాల్డుగారు గాని, అట్టి "మెజారిటీ"లు లేకుండానే రాజ్యపాలనము చేయకల్గెడివారు. కాని మితిమించినమెజారిటీలు వారికి సంపాద్యములైనంతమాత్రమున ఆప్రధానమంత్రులకు, తమకార్యనిర్వహణము కష్టతరమే యైనదికాని సులభసాధ్యముమాత్రము కాలేదు. బలిష్టమగు మైనారిటీపార్టీ పార్లమెంటునందున్నచో, ప్రజాభిప్రాయము వారివైపునకు సుముఖ మగునేమో. యనుభయము కల్పించి ప్రధానామాత్యుడు తన పార్టీవారిచే కొన్నిసంస్కరణముల నొప్పించగలడు. కాని, మైనారిటీ మరీబలహీనమైన మెజారిటీ పార్టీవారు నిర్భయముతో నిరంకుశముగా చేయరాని కార్యములజేసి, అవసరమగుకార్యముల నుదాసీనతతో లక్ష్యింపక ప్రజాబాహుళ్యపుక్షేమమును మరచుటయు, ప్రధానమంత్రియొక్క సలహాలను నిర్లక్ష్యపరచుటయు అనుభవనీయమై యున్నది. కనుకనే, ఇట్టి మెజారిటీపార్టీవారి నిరంకుశత నియోజకవర్గములందేకాక ప్రజాప్రతినిధి సభయందు, సాగుచుండుటవలన దేశారిష్టము కల్గును. "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము ప్రకారము, వివిధ రాచకీయబృందములు బయలుదేరినను మంత్రివర్గములు బృందములసమ్మేళనములద్వారానే ఏర్పరచుటకు వీలున్నను, ఇట్టి సమ్మేళనములపై యాధారపడుమంత్రివర్గములు దీర్ఘకాలము జీవించకున్నను, రాజ్యాంగమునకుమాత్రము భంగముకలుగదు; మెజారిటీవారి నిరంకుశత్వము సాగదు. ప్రజలస్వాతంత్ర్యము రక్షింపబడును. జర్మనీయందు క్రిందటి పన్నెండువత్సరములం దీవివిధబృందసమ్మేళనముల మంత్రివర్గము లేర్పడక, ఇంగ్లాండునందువలె, మెజారిటీపార్టీ వారి మంత్రివర్గములు పెత్తనమునకు వచ్చినట్లైన, ఇప్పటికెప్పుడో, విప్లవము గల్గి, అటుబోల్షివిజయమోకాని లేక, ఇటునిరంకుశరాజ్యపాలనమో యేర్పరచబడెడిదియే ! తుద "కీప్రపోర్షనల్" ప్రాతినిధ్యపద్ధతిద్వారాకూడ నాజీపార్టీ వారు అపారమగు ప్రాముఖ్యత పొందగల్గుచుండ, ఇక ఏకసభ్యనియోజకవర్గములుండుచో, ఇంకెంత సులభముగా, త్వరితముగా, నాజీపార్టీవా రిదివరకర్ మంత్రివర్గముల స్థాపించియుందురో ?

క్రీ. శ. 1932 సంవత్సరం జూలైమాసమందు, జరిగిన "ర్రెష్‌టాగ్" యెన్నికలందు, ప్రజానాయకులు ఎంతోహడావడిపొందిరి. స్త్రీలు, పురుషులు "నాజీ" పార్టీతరపున అత్యమితముగా ప్రచారమొనర్చిరి. ధనికులు, భూస్వాములు, వార్తాపత్రికలు, విద్యావంతులందరు, పట్టుపట్టి 'నాజీ' పార్టీ తర పున, ఆపార్టీనాయకులగు శ్రీఅడోల్ఫు హిట్లరుగారి పేరున వోటరులను ప్రబోధించిరి. ఎన్నికలవివాదములవలన పదిమంది చనిపోవుటయు, వందమంది గాయపడుటయు తటస్థించెను. క్రీ. శ. 1931 సంవత్సరమందెట్లు ఇంగ్లాండునందు, "జాతీయ మంత్రివర్గపు" రాచకీయపక్షములు, ప్రజలనందరిని జాతిపేర దేశముపేర తమకే వోటులనివ్వమని ప్రబోధించిరో, అటులనే నాజీపార్టీ వారును, తమకు, తమజాతిగౌరవసార్ధకతకై, ఆర్ధికమోక్షముకై, వోటరులెల్లరు తమవోటులనిమ్మని ఉత్సాహపరచిరి. ఇంగ్లాండునందు, కన్సర్వేటీవు పార్టీవారు 606 సభ్యులలో రమారమి 582 సభ్యులను పొందిరి. కాని నాజీపార్టీ వారు అంత ఎక్కువమంది సభ్యులను సంపాదించలేదు. ఇందులకు కారణము ఇంగ్లాండునందు, ఏకసభ్యనియోజకవర్గము లేయుండి, మెజారిటీసూత్రమునకే ప్రాముఖ్యత యివ్వబడుటయు, జర్మనీయందు, సమిష్టి సభ్యనియోజకవర్గము లేర్పరచబడి "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపుటేర్పాటులుండుటయే ! ఇంగ్లాండునందు యేర్పడిన నిరంకుశాధికారము పొందకల్గిన "జాతీయప్రభుత్వము", ఇంగ్లీషుప్రజల సాధారణరాచకీయమనో వృత్తులననుసరించి, బాధ్యతకల్గి ప్రవర్తించుటకు బ్రయత్నించుచున్నది. కనుక, ఇంతవరకు ఏవిధమగు విపరీతపర్యవసానములు కలుగ లేదు. కాని, బాధ్యతాయుతప్రభుత్వసంస్థల యందంతగా విశ్వాసములేక రిపబ్లికన్న అంత అభిమానము జూపెట్టక సాధారణప్రజల రాచకీయహక్కులన్న జాగ్రత్తపడని "నాజీపార్టీ"వారు ఇంగ్లీషువారి ఎన్నికపద్ధతులప్రకారము, ఎన్నికలు జరిగించినట్లయినచో అత్యధికమగు మెజారిటీని సంపాదించుకొని రైష్‌టాగ్ నందుజేరి ఆసభయొక్క ప్రజాప్రాతినిధ్యస్వరూపమునే మార్చివేసి, దానిని నేతిబీరకాయవతు, ఇటలీలో శ్రీముస్సోలీనిగారు ఆదేశపుపార్లమెంటును జేసినట్లు "రైష్‌టాగ్"ను నామసూత్రావశిష్టమొనర్చి, ప్రజాస్వామికము నంతమొందించి రిపబ్లికునే సాంతముజేసి, నిరంకుశాధికారమును దెచ్చిపెట్టకుందురా ? "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపద్ధతివలననే జర్మనీయం దీనాడు (2-8-32) నాజీపార్టీవారు మంత్రివర్గమునేర్పరచ లేకున్నారు. ఆపద్ధతివలననే, ప్రజలచే తాత్కాలికముగా అసాదరణచేయబడుచున్న మిగతాపార్టీలు తమతమసభ్యత్వములను తమతరపునయున్నవోటరుల సంఖ్యననుసరించి సంపాదించుకొనకల్గినారు.

ఈ "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము అమలునందు బెట్టుచో, ఏయొక్క రాచకీయపార్టీకిని, సంపూర్ణమగు మెజారిటీ లభ్యపడదని, జర్మనీదేశపు 1932 ఎన్నికలు ఋజువుచేయుచున్నవి. అచ్చట "నాజీ" పార్టీవారికి 228 సోషలిస్టులకు 132 కమ్యూనిస్టులకు 87 మధ్యపార్టీకి 76 జాతీయవాదులకు 36 తదితరులకు 41 స్థానములు లభ్యమయ్యెను. మంత్రివర్గము నేర్పరచి, "రైష్‌టాగ్" యొక్కయనుమతిపై రాజ్యాం ము నడుపవలెనన్న మంత్రివర్గమును 310 సభ్యులు బలపరచవలయును. ఇంతబలము సంపాదించుకొనవలెనన్న, 'నాజీ' పార్టీవారు మధ్యపార్టీవారు, జాతీయవాదులతో సమ్మేళన మేర్పరచుకొనవలసియున్నది. అనగా మూడుప్రధానమగు పార్టీలుచేరినగాని, మంత్రివర్గము నేర్పరచుటకు వీలులేదు. "నాజీలు" కాక, జాతీయవాదులు (36) మంత్రివర్గము నేర్పరుప దలంచుచో, తదితరబృందములు (41) మధ్యపార్టీ (76) సోషలిస్టుల (132) సంపూర్ణసహకారమును బొందవలసియున్నది.

కనుక నాజీపార్టీ వారి మంత్రివర్గము కాని, జాతీయవాదుల మంత్రివర్గముకాని, తమతమపార్టీ ప్రణాళికలననుసరించి రాజ్యాంగము నడుప ప్రయత్నించుటకు వీలులేదు. ఇందువలన రాజ్యాంగపు ప్రధానధర్మములకు, సూత్రములకుమాత్రము భంగముకలుగకుండును. పెత్తనమందున్న మంత్రివర్గము ఏయొక్క రాచకీయపక్షమునకు సంపూర్ణమగు రాచకీయకార్య ప్రణాళికను అంగీకరించి, పార్టీకనుకూలమగు కార్యకలాపమును సాగించుటకు సాధ్యముకాకపోవచ్చును. కాని, మంత్రివర్గమందుజేరు వివిధరాచకీయపక్షములకు సమ్మతమగు కార్యక్రమమునుమాత్రము అమలుపరచవచ్చును. అట్టి మంత్రివర్గపుచర్యలు, ప్రతిపక్షీయునకుగూడ, అత్యంతముగ విరుద్ధములై యుండజాలవు గనుక, రాజ్యాంగపు మూలసూత్రము లకుమాత్రము భంగముకల్గుట దుస్తరమగుచుండును. కాననే ఇంగ్లాండు, అమెరికా దేశములందు, మెజారిటీసూత్రపు ప్రభావమువలన కల్గువిపరీతపరిస్థితులగాంచినవారు, బలహీనమగు తాత్కాలికమగు మంత్రివర్గమునకైన యోర్చి, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రమునే బలపరచుచున్నారు.

'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నవలంభించిన దేశములందు, పార్టీలకు హెచ్చుప్రాముఖ్యత కల్గునని శ్రీబేజిహోటు మున్నగు ఇంగ్లీషురాచకీయజ్ఞులు వాదించియుండిరి. కాని, ఆపద్ధతిని అవలంబించని, ఇంగ్లాండు, అమెరికాదేశములందె రాచకీయపక్షములు అత్యంతప్రాముఖ్యతవహించియుండుటయు, రాచకీయపక్షములకు చెందనిఅభ్యర్థులు జయప్రదులగుటకు దుస్సాధ్యమగుటయు తటస్థించుచున్నప్పుడు, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యపద్ధతి నవలంబించిన దేశములందు, రాచకీయపక్షములు ప్రాముఖ్యతబొందుటలో నాశ్చర్యమేమి ? ఈకాలపు ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదముకావలెనన్న ప్రజాప్రతినిధిసభ ప్రజలయభిప్రాయమును సంతృప్తికరముగా ప్రతిఫలింపజేయవలయునన్నను, మంత్రివర్గమును అదుపుఆజ్ఞలందుంచవలయునన్నను, రాచకీయపార్టీ లేర్పరచబడి, సౌష్టవముజెందుట గత్యమగుచున్నది కాన, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నంగీకరించుటవలన, సాధారణ మెజారిటీపద్ధతిని బొందినప్పటికంటె, హెచ్చుయిబ్బందేమియు కలుగజాలదు.

ఏకసభ్యనియోజకవర్గములందు, సాధారణమెజారిటీసూత్రము ననుసరించి, ఎన్నికలజరుపుచో, ప్రతివోటరునకును తానెవ్వరికి వోటునిచ్చుచున్నాడో ఆతడు పిమ్మట ఎన్నుకొనబడెనో, లేదో తెలుసుకొనుట సులభమనియు, ప్రపోర్షనల్ ప్రాతినిధ్యసూత్రప్రకారము జరుగు ఎన్నికలం దనేకసభ్యత్వములకై నిలబడు అభ్యర్ధులందరిలో ఎవ్వరినెన్నుకొనవలెనో తెలియక తమకిష్టులగువారు ఎన్నుకొనబడెదరో లేదోయని సంశయబాధను వోతరులుబొందెదరని కొందరు వాదించుచున్నారు. ఏకసభ్యనియోజకవర్గములందు నిలబడినవారిలో తమకిష్టమైన అభ్యర్థికి తమవోట్లు నిచ్చుట వోటరులకు సులభసాధ్యమే ! కాని, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రప్రకారమైనను, సమిష్టినియోజకవర్గమందును (దానికి నల్గురుసభ్యత్వము లివ్వబడిననుకొందము) నిలబడిన అభ్యర్ధులలో ఎన్నిసభ్యత్వము లానియోజకవర్గమున కివ్వబడినవో, అన్ని అభ్యర్థులకు, వోటరులు తమవోట్లను వారివారి అవసరముల ననుసరించి యిచ్చుటకుమాత్రము విశేషకష్టమేమియు నుండదు. కాని ఇప్పుడు మన రాష్ట్రమందువలె ఒక జిల్లాకునాల్గు సభ్యత్వములున్న ప్రతివోతరును, తన నాల్గువోట్లును, తన కిష్టులగు నల్గురు అభ్యర్ధులకిచ్చుట ఆచారమైయున్నది. 'ప్రపో ర్షనల్" ప్రాతినిధ్యమం దట్లుకాక, ప్రతివోటరును తనకత్యంత ప్రీతికరమగుఅభ్యర్థి యెవ్వరో వారికి మొదటిరకపువోటునిచ్చి అతనికంటె తక్కుసహితుడగు రెండవఅభ్యర్థికి, రెండవరకపువోటునిచ్చి, మూడవరకమైనను ఆదరణపాత్రుడైన అభ్యర్థికి మూడవరకపువోటునిచ్చి, తుదివాడైనను, తనకంగీకృతమైన అభ్యర్థికి నాల్గవరకపువోటు నిచ్చుటకే అధికారము కలదు. అనగా, ఆతని యభిప్రాయమం దీ నల్గురు అభ్యర్థులు సమానులై యుండుటకుమారు ఒకరికంటెనొక్కరు అధికులుగా య్ందురు. ఆతనికి అత్యుత్తమమైనవోటు ఒక్కటే యుండును కాని, వివిధరక్ములైన మూడువోటులు గూడ ప్రసాదించబడును.

అట్టివోటరునకు, అత్యంతప్రీతికరమై యున్న అభ్యర్ధియే తప్పక జయప్రదుడు కావలెనని తలంపుకల్గి, ఇతరస్థానములగూర్చి అంతయాతురతలేనిచో, తన ప్రధానమగువోటును ఒక్కరికే యిచ్చి, మిగిలినవోటుల నుపయోగించకపోవచ్చును. అనగా, ప్రతివోటరునకు, ఈపద్ధతివలన తనకిష్టులగు అభ్యర్ధులందు, వారివారి ఆధిక్యతల ననుసరించి నాల్గు అంతస్థులుగా నేర్పరచి వారివారి యోగ్యతల ననుసరించి వారికి తన వేరువేరురకములగువోట్లను ప్రసాదించు యవకాశము కల్గుచున్నది. ఈవిధముగా తనవోట్లను ఎవ్వరెవ్వరి కెట్లెట్లు యివ్వవలయునో నిర్ణయించుకొనుట కేవోటరునకును కష్టము కాజాలదు. స్థానములు ఖాళీగాయున్నవో, అందరి నేరి వారిలో, ప్రతి వోటరునకు ప్రప్రధములెవ్వరో, రెండవవా రెవ్వరో అని సూచించుట కష్టతరమైనపనిగాదు.

విద్యావిహీనులగు వోటరులకు, ఇట్టితారతమ్యముల గమనించుట దుర్ఘటమని కొందరు తలంచవచ్చును. గాని, ఇప్పుడెట్లు, ప్రతివోటరును తనకిష్టులగు అభ్యర్థులనామముల, పోలింగుఆఫీసరునకు తెల్పుచున్నాడో, అటులనే తనకు యిష్టులగు అభ్యర్థులను, వరుసవారిగా తెల్పుటకూడ కష్టమైనను సాధ్యమే ? కాని, లోధియనుకమిటీవారు సూచించినట్లు, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్కరంగుపోలింగుపెట్టె నమర్చియుంచి అట్టిపెట్టలయందు, వోటరులు, తమయిష్టానుసారము, తమవోటింగు కాగితముల వేయవచ్చును. ఆపద్ధతి, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రమునకు జతజేర్చుటకు వీలులేదు. గనుక వోటరులందరు చదువను వ్రాయను నేర్చువరకు, మనదేశమం దీ "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపుపద్ధతిని ప్రచారమునకుదెచ్చుట లాభకరముకాజాలదు.

ఈ 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రానుసారము ఎన్నికలజరుపుచో, చదువను వ్రాయనునేర్చిన వోటరులకు సాధారణముగా, హెచ్చుయిబ్బంది కలుగకపోయినను, కాలక్రమేణ వివిధరాచకీయపార్టీలు, తమతమ యభ్యర్థుల జాబితాలను తయారుచేసి, వోటరుల సమక్షమందు, ఎన్నికలసమయమున పెట్టుటచే ఆయాజాబితాలలో నుదహరింపబడిన అభ్యర్థులందనేకులనామములు తమకు తెలియకున్నను, తమతమ పార్టీలప్రతిష్టనునిల్పుటకై, వోటరులు జాబితాలవారిగా తమవోటుల నివ్వవలసివచ్చుచున్నది. జర్మనీ, ఒకప్పుడు ఫ్రాన్సునందు కొన్ని అమెరికారాష్ట్రములందు, చెకోస్లావాకియా, స్విట్జర్లాండు దేశములందు, ఒక్కొక్కపార్టీ తనజాబితాల యందు, ఆయానియోజకవర్గముల కొసంగబడు సభ్యత్వము లెన్నియున్నవో అందరే అభ్యర్థులనామములనే కాక, మరికొందరి నామములగూడ జేర్చుచుండును. తన్మూలమున, వోటరునకు, తనపార్టీ అభ్యర్థులం దెవ్వరు ఎట్లెట్లు వచ్చిరో ఆవిధముగా తనసమ్మతిని తెల్పుట కవకాశ మొసంగబడుచున్నది.

ఈవిధముగా, ఎన్నికలు జరిగినపిమ్మట, పోలింగు ఆఫీసరులు పోలింగుపెట్టెలను, 'రిటర్నింగు ఆఫీసరు' వద్దపెట్టగా ఆతడు వోటులను లెక్కించప్రారంభించును. మొదటివోటులబొందిన అభ్యర్థులలో ఎవ్వరికి అత్యథికవోటులువచ్చెనో వారివోట్లు "సభ్యత్వమునకు వలయువోట్లు (Quota)"కు మించుచో వారిని సభ్యులుగా ప్రకటించుచు అట్టిసభ్యులకు తమప్రధమవోటుల నిచ్చినవోటరులు తమ రెండవరకపువోటుల మరికొందరికి యిచ్చియున్నారుగదా ? "సభ్యత్వమునకు వలయువోట్లను" సంపాదించుకొనలేని అభ్యర్థులమధ్య ఎవ్వ రెవ్వరికట్టి రెండవరకపువోటు లివ్వబడెనో పంచియిడి, వారిలో నెవ్వరు "సభ్యత్వమునకు వలయువోట్లను" సంపాదించగలరో వారిని జయప్రదులుగా నిర్ణయించవచ్చును. అప్పటికిని, కొన్నిస్థానములు ఖాళీగాయుండుచో, సభ్యులుగా నిర్ణయింపబడిన వారికాగితములపై, వోటరులమూడవరకపువోటు లెవ్వరికివ్వబడెనో, కన్గొని వానిని మిగిలియున్న అభ్యర్థులకుకల్పి వారిలో తగినవారిని జయప్రదులుగా ప్రకటింతురు.

నాల్గుసభ్యత్వము లున్నవనుకొందము. మొత్తము, ఎన్నికలందు పాల్గొన్నవోటర్లు 16000 అనుకొందము. కాని ఒక్కొక్కసభ్యత్వమునకు 4000 వోట్లు అవసరమగును. నిలబడినవారిలో, ప్రధమ అభ్యర్థికి 5000 వోట్లువచ్చినవి కనుక, ఆతడు సభ్యుడుగా ప్రకటింపబడును.

అతనికి ప్రధవోటులనిచ్చిన ఐదువేలమందిలో, రెండువేలమంది, మూడువేలు ప్రధమవోటుల బొందిన ఒకఅభ్యర్థికిమరొక రెండువేలమంది రెండువేలఏడువందల ప్రధమవోటూబొందిన అభ్యర్థికి యిచ్చిరనుకొందము. అంతనీరెండవ మూడవ అభ్యర్థులు ఒక్కొక్కరు నాల్గువేలకు మించినవోట్లను బొందుదురు కాన, సభ్యులుగా పరిగణింపబడుదురు. నాల్గవస్థానమున కికనొక్క రగత్యము. మిగిలియున్న అభ్యర్థులలో, అధికవోట్లను (1500 ప్రధమరకపువోట్లు, 2000 రెండవరకపు వోట్లు) బొందినవానికి, జయమందినసభ్యులకు వోట్లనిచ్చినవారి మూడవరకపువోట్లు ఆరువందలు వచ్చియుండుచో, నాల్గవ అభ్యర్ధియు ఎన్నుకొనబడును. మిగిలిన అభ్యర్ధులెల్లరు, అపజయలుగా ప్రకటింపబడుదురు.

అనగా, ప్రధమసభ్యునకు 5000 మొదటిరకపువోట్లు.

రెండవసభ్యునకు 3000 ప్ర + 2000 (రెం)

మూడవసభ్యుడు 2000 ప్ర + 2000 (రెం)

నాల్గవసభ్యుడు 1500 ప్ర _ 2000 (రెం) + 600 (మూ)


ఈవిధముగా, ఒక్కొక్క అభ్యర్ధికి లభ్యమగు వివిధరకపువోటుల లెక్కించి, జయప్రదులగు వారినామముల, రిటర్నింగుఆఫీసరులు ప్రకటింతురు. ఈలెక్కవేయుట, ఆయాఫీసరుల ధర్మముకనుక, వోటరులకు వానిమర్మముల తెలుసుకొన నగత్యము లేదు. కాని, ఈపద్ధతి జయప్రదముగా సాగవలెనన్న, నమ్మకస్థులగు, న్యాయపాలకులగు రిటర్నింగు ఆఫీసరు లగత్యము. సాధారణమెజారిటీసూత్రము అమలునందున్నప్పుడే, అనేకరిటర్నింగుఆఫీసరులు, మనదేశమందు, దురన్యాయముల జరుపుచుండ 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నమలుపరచుటలో నింకెంతకష్టము కల్గింతురో ? యూరపుఖండమందు మొత్తముమీద, సివిలుసర్వీసువారు, మనదేశమందుకంటె హెచ్చునమ్మకస్థులుగా నున్నారు. కాన, ఈపద్ధతివలన ఆదేశస్థులకంతగా ఆపదకలుగ జాలదు. ఇంతవరకు, సమిష్టినియోజకవర్గములందు "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము నమలులో పెట్టుటవలన కల్గు సాధకబాధకములగూర్చి విచారించితిమి. మనదేశమునకీసూత్రము నిప్పట్లో లాభదాయకము గాదని తలంచితిమి. కాని, ఏకసభ్యనియోజకవర్గములద్వారా సంభవించుయిబ్బందులు మాత్రమట్లే కల్గుచుండ నూరకుండుట భావ్యముకాదు. ఆ యిబ్బందులతగ్గించి, మైనారిటీ ప్రజలకు, కొంతవరకైన తమ తమ ప్రతినిధుల నెన్నుకొనుయోగ్యత కల్గించుటగత్యము. మైనారీటీవారి కిట్టిసదుపాయమును కల్గించుటకు, సమిష్టినియోజకవర్గము కొంతవరకు సహాయపడును. క్రీ. శ. 1929 నుండి, కౌన్సిలుయెన్నికలందు మనరాష్ట్రమున మనకు కలిగినయనుభవమునుబట్టి, రాచకీయపార్టీ లింకను బలిష్టపడలేదుగనుక, సమిష్టినియోజకవర్గములందు , వివిధరాచకీయపార్టీలకు వివిధసంఘములకు జెందిన అభ్యర్థులు జయప్రదులగుటకు కొంతయవకాశము కలదని రూఢియగుచున్నది. కనుక ఏక సభ్యనియోజకవర్గములకంటె సమిష్టినియోజక వర్గములే ఏర్పరుపదగును.

IV

స్త్రీపురుషభేదముల పాటింపక, ధనికులు బీద లను భేదముల జూపెట్టక, యుక్తవయస్కులగు ప్రజలెల్లరికి వోటుహక్కుయిచ్చుట కొప్పుకొని, మెజారిటీవారి నిరంకుశత్వమును తగ్గించుటకై మైనారిటీవారికి తగుప్రాతినిధ్యముకల్గించుటకై, సమిష్టినియోజకవర్గముల నేర్పరచి, వోటరులెల్లరు చదువరులగుటతోడనే, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నమలులో బెట్టుటకు తగుఏర్పాటులు చేసినపిమ్మట, ప్రజలందరియొక్క అభిప్రాయములకు, కోరికలకు, అనుభవములకు, శాసనసభ సంతృప్తికరమగు ప్రతిబింబముకాజాలదా ? పాశ్చాత్యదేశస్థులం దనేకులు అట్టిపరిస్థితులందు, శాసనసభ ప్రజలయొక్క స్వరూపమును సంతృప్తికరముగనే ప్రతిబింబించునని సమాధాన మిచ్చుచున్నారు. కాని, సమిష్టివాదులు, సాంఘికవాదులుమాత్రము, ప్రస్తుతపు ఆర్థికస్థితిగతులందు, దుర్మార్గమగు భాగ్యవిభజనపద్ధతి అమలునందున్నంతకాలము, అనేకులు బీదలై అల్పసంఖ్యాకులు ధనికులైనంతకాలము, నిజమగు ప్రాతినిధ్యము, ప్రజాబాహుళ్యమునకు శాసనసభయందు లభ్యపడదని, తమప్రజల అనుభవచారిత్ర్యములవలన జూపెట్టుచున్నారు. కాని, ఈవిపరీతపరిస్థితులకు, ప్రతీకారము, విప్లవమే నని వారు వాదించుచున్నారు. ఇప్పటికప్పుడే, పదునైదువత్సరములక్రితమే, బోల్షివిక్కులు, రషియాయందు, కార్మికులపెత్తనమును, రాజ్యాంగమం దేర్పరచిరి. కాని, దీనికెదురుగా, ఇటలీయందు ధనికులు, భూస్వాములు, తమ నిరంకుశతనేర్పరచి, ప్రజాసామాన్యమునకు రాదగు, ప్రాతినిధ్యమును దిగమ్రింగుచున్నారు. కాన, యింతవరకు, సక్ర మపద్ధతుల ప్రకారము, ఆర్థిక దాస్యమందున్నప్రజల కెట్లు తగుప్రాతినిధ్యము శాసనసభయందు సంపాదించుటో, పాశ్చాత్యరాజకీయజ్ఞులు సూచించలేదు.

మనదేశమునందు అనుభవసిద్ధమగు విపరీతపరిస్థితులబట్టి మన రాజకీయనాయకులనేకులు, 1919 నందే, ప్రత్యేక పాతినిధ్యసూత్రమును నిర్వచించిరి. దేశీయు లాసూత్రమును మొత్తముమీద నొప్పుకొనిరి. అనగా, వివిధసంఘములు, తమ ప్రతినిధులను, తమసంఘాభిప్రాయముల దెల్పి, తమసంఘావసరములదీర్చి తక్కుసంఘహక్కుల రక్షించుటకు తమ సంఘీయుల జనసంఖ్యననుసరించి ప్రజాప్రతినిధిసభకు ఎన్నుకొనుటకు ప్రత్యేకసదుపాయములజేయు టగత్యమని మనదేశపురాచకీయనాయకులు సమ్మతించిరి. కాని, ఈప్రత్యేకప్రాతినిధ్యపుహక్కును ఏవిధముగా ప్రసాదించుట యను విషయముననే, క్రిందటి పదిసంవత్సరములనుండి తీవ్రతరమగువివాదములు హిందూమహమ్మదీయులు సిక్కు క్రైస్తవుల మధ్యకల్గుచున్నవి. కాని, రాచకీయానుభవము లేని ఆర్థిక సంపదలు లేని సాంఘికాభివృద్ధి బొందనివారికి, వారి జనసంఖ్యకు తగినట్లు ప్రత్యేక ప్రాతినిధ్యము కల్గించవలయునని అంగీకరించినట్లే ! అనాధలగు హరిజనులకుకూడ యీప్రత్యేకప్రాతినిధ్యపు హక్కు ప్రసాదించుటకు, హిందూమహాసభతరపున శ్రీ డాక్టరు మూంజీగారొప్పుకున్నారు. కనుక, ఎన్నికలందుధనికు లతో, జమీందారులతో పైకులములవారితో పోటీపడుచో తమఅభ్యర్థులు జయమంద రేమోయనుభయము, హరిజనుల కగత్యములేదు. అటులనే, క్రైస్తవులకుగాని, మహమ్మదీయులకుగాని, తదితర అల్పసంఖ్యాకులగు ప్రజలకుగాని కల్గనవసరములేదు. ఈప్రత్యేకప్రాతినిధ్యము, పాశ్చాత్యదేశములందు అంగీకరింపబడుచో, సోషలిస్టులు, లేబరుపార్టీవారు, అన్నియెడల మెజారిటీలబొంది, మంత్రివర్గముల నేర్పరచనగును. మంత్రివర్గము నేర్పరచువారు, ప్రత్యర్థికక్షియందుండువా రధికముగా, కార్మిక ప్రతినిధులైయుండుట సాధ్యమగును. కనుక, ప్రత్యేకప్రాతినిధ్యసూత్రము దీనులకు, అల్పసంఖ్యాకులకు, బీదలకు, అనాధలకు, లక్షలకొలది ధనవ్యయము కల్గించు ఎన్నికలతోకూడుకొనిన యీనాటిరాచకీయ జీవితమందు, సులభమగుటకు తగురక్షణ కల్గించును. ఇటుల, ఆర్థికముగ, సాంఘికముగనుండు విభేదములకుకూడ శాసనసభలయందు ప్రాతినిధ్యముకల్గించుట, ప్రాతినిధ్యసూత్రములకే విరుద్ధమనుట పొరపాటు. రాచకీయపక్షముల కెట్లు తగుప్రాతినిధ్యము బొందుట కవకాశముల నిచ్చుచుంటిమో, అటులనే, ఈకాలపు ప్రాతినిధ్యపు పద్ధతులందు తదితరులతో పోటీపడి తమకు రాదగు ప్రాతినిధ్యప్రాముఖ్యత బొంద లేని అవిటివారికి, ప్రత్యేక ప్రాతినిధ్యమను యూతను కొంతకాలమువర కొసంగుటలో విపరీతమేమియు నుండజా లదు అయినను యీసూత్రము నాచరణయందిడుటవలన యెట్టిపర్యవసానములు కల్గునో విచారించినకాని, ఎంతకాల మెట్టి అల్పసంఖ్యాకులను, అనాధలగు స్వయంసహాయశక్తిలేని ప్రజలకు, ఈప్రత్యేకప్రాతినిధ్య అవకాశము కల్పింపనగునో తెల్పుటకు వీలులేదు.

క్రిందటి పదివత్సరములనుండి, ప్రత్యేకసాంఘికప్రాతినిధ్యము వివిధసంఘమములకు ప్రసాదించబడినది. ప్రజలయం దధికసంఖ్యాకులగు, బ్రాహ్మణేతరులకు, వారి అసహాయస్థితిని గమనించి, ప్రత్యేకసాంఘికప్రాతినిధ్య మేర్పరచబడెను. మన రాజధానియందు ప్రతిజిల్లాకును, ఒక్కసభ్యత్వమైన బ్రాహ్మణేతరులకు చెందవలెనని, మెస్టనుకమిటీవారు స్థిరీకరించినను, మొత్తముమీద, ఈసూత్రపు యూత బొందకయే బ్రాహ్మణేతరులు మద్రాసు కౌన్సిలునందు, అధికసంఖ్యాకములగు సభ్యత్వముల సంపాదించుకొనగల్గిరి. అటులనే, బొంబాయి రాష్ట్రమందును, బ్రాహ్మణేతరులు తమసంఘమునకు తగిన ప్రాతినిధ్యము, ఏప్రత్యేక ప్రాతినిధ్యసహాయము కోరకయే పొందకల్గిరి. లోధియనుకమిటీవా రీవిషయము గమనించి, మద్రాసుబ్రాహ్మణేతరులకు ప్రత్యేకప్రాతినిధ్య మగత్యములేదని సూచించి, సైమనుకమీషనువా రేమో బొంబాయిబ్రాహ్మణేతరులకు ఇంకా కొంతకాలమువరకు ఈప్రత్యేకహక్కు యుంచుట మేల్గూర్పదను నెపముపై, తామును ఆహక్కును నిల్పుటే మంచిదనిరి. ధనికులు, ప్రాపకముకలవారైనను, అల్పసంఖ్యాకు లనుకారణముపై, అనుభవపరులును, రాజనీతికోవిదు లనునెపముపై, సాధారణయెన్నికలందు అవస్థలుపడలేరనుసాకుపై, మాంటాగ్యూఛెల్‌మ్సుఫర్డుకమిటీ, జమీందారులకు ప్రత్యేకముగా నిర్ణయింపబడిన స్థానములకంటె, ప్రజాబాహుళ్యమున కొసంగబడినస్థానములందే, హెచ్చుస్థానములు సంపాదించుకొనగల్గిరనుకారణముపై, సైమనుకమీషనువారు, జమీందారులకు ప్రత్యేకప్రాతినిధ్యమిచ్చుట, అనగత్యమని సూచించిరి. కాని లోధియనుకమిటీవారు, బ్రిటిషువారి రాజ్యరక్షణకై, జమీందారుల మంచిచేసుకొనుటకై, వారికికూడ ప్రత్యేకప్రాతినిధ్యముంచుట మంచిదని సూచించినారు.

ఇక వర్తకులు, ప్లాంటరులుకూడ, తమకు ప్రత్యేకప్రాతినిధ్యము కావలెననికోరి, 1920 నుండియు ఆహక్కును పొందియున్నారు. ఇప్పటివరకు, ఎల్ల రాచకీయపక్షములవారును, ఈ యిరుబృందములకు, ప్రత్యేకప్రాతినిధ్యమును హెచ్చించుటకుకూడ సమ్మతించుచున్నారని చెప్పనగును. కాని, ఇట్టిబలవంతములు, ధనవంతములు అగు సంఘములకు ప్రత్యేక ప్రాతినిధ్యమిచ్చుటవలన, తదితరప్రజలకు నిస్సారత కల్పించుటయగును గనుకను, తమ్ముతాము రక్షించుకొనశక్తి కల్గియుండుటేకాక, తదితరుల లొంగదీసికొనగల్గుశక్తి కల్గిన యిట్టివారు సంఘకంటకులగుటకు అవకాశము కలదుగాన, అట్టి ప్రత్యేకప్రాతినిధ్యము ప్రజాస్వామికప్రధానసూత్రములకే విరుద్ధమగును. ఈకారణములచేతనే జమీందారులకును ప్రత్యేకప్రాతినిధ్య మొసంగుటవలన, రాజ్యాంగశాంతికే భంగకరమగును. బీదలగువారు సాంఘికముగ దీనులగువారికి వోటుహక్కు నిరాకరించుచో ఎట్టివిపరీతపర్యవసానములు కల్గునో, అట్టి అన్యాయపుపరిస్థితులు, భూస్వాములు, వర్తకులు, ప్లాంటరులకు ప్రత్యేకప్రాతినిధ్య మిచ్చినను సంభవించుట తధ్యము. కాన, ప్రత్యేక ప్రాతినిధ్యము నెవ్వరికైన యిచ్చుట తప్పనిసరి యగుచో, అద్దానిని, తమ్ముతాము రాచకీయముగ రక్షించుకొనలేనివారికే, మితముగా, తాత్కాలికావసరము కల్గినంతవరకు, ప్రసాదించుట యుక్తము.

సిక్కులు, క్రైస్తవులు, యూరపియనులు, మహమ్మదీయులు, హిందువులు, ఏయేరాష్ట్రములం దత్యంతమగు, మైనారిటీలందుందురో, ఆప్రదేశములందు ప్రత్యేక ప్రాతినిధ్య తమ తమ యసహాయతనుబట్టి కోరుచుండుట భావ్యమని, మనదేశపు లిబరలుపక్షపురాచకీయజ్ఞు లెల్లరు తలంచుచున్నారు. గాంధిమహాత్ముడుమాత్రము ఏసంఘీయులకుగూడ ప్రత్యేకప్రాతినిధ్యమే కూడదనియు, ఎల్లసంఘములవారు ప్రజాసామాన్యపు న్యాయపరిశీలనాశక్తి, ధర్మనిరతి, బాధ్యతాయుతనడవడిపై నమ్మకము కల్గియున్ననే ప్రజాస్వామి కము జయప్రదమగును కాన, ఎవ్వరును ప్రత్యేక ప్రాతినిధ్యముకోరి, తదితరులజూచిన తమకుకల్గు అపనమ్మకము, భయము ప్రకటించరాదనియు వాదించుచున్నారు. ప్రత్యేకప్రాతినిధ్యము కోరువారును అట్టి ప్రత్యేకసౌకర్యము కొందరికికల్గించుట ప్రజాస్వామికమందు స్వాభావికమైనకార్యము కాకున్నను, ప్రజలెల్లరు పరస్పరప్రేమవిశ్వాసములతో ఒకరితో నొకరు వ్యవహరించుకొనిన, ప్రజాస్వామికము జయప్రదము గాగలదని యొప్పుకొన్నను, వివిధసంఘములవారు రాచకీయరంగమున తమ్ముతాము రక్షించుకొని సంఘజీవితమునకు, తమ ఆత్మగౌరవమునకు, జనసంఖ్యకు, తగినట్లు సేవజేయగల్గుశక్తి బొందువరకు ప్రత్యేక ప్రాతినిధ్యము అగత్యమని మాత్రము వాదించుచున్నారు. కులభేదములచే చీల్చబడుచు కులాభిమానములచే అంగవిహీనముబొందుచున్న హిందూసంఘమునందే బ్రాహ్మణేతరులు అధికసంఖ్యాకులైనను, బ్రాహ్మణులప్రతిష్టజూచి భయమందుచుండ వివిధమతస్థులు పరస్పరముగా ఆచారఆశయములందు అత్యంతముగా భేదించుచున్నంతకాలము, అల్పసంఖ్యాకులగు మతస్థులకు, ప్రజాస్వామికమందు సాధారణ మెజారిటీలపెత్తనముక్రింద తగురక్షణకల్గునని వీరు విశ్వసించుటలేదు. హిందువులందు మహమ్మదీయులకంటె హెచ్చు విద్యావ్యాపక మున్నదనియు, రాచకీయవిజ్ఞానము కలదనియు ఆత్మవిశ్వాసము, స్వరక్షణశక్తి కలవనియు మహమ్మదీయనాయకులు జూపెట్టుచున్నారు. మరియు బెంగాలు, పంజాబురాష్ట్రములందు హిందూజమీందారులు, ధనికులు, వ్యాపారస్తులన్న, మహమ్మదీయపాటకపుజనమునకు హెచ్చు భయభక్తులు కలవుగాన, వారు తమ మతస్తులకే తమవోటులనిచ్చుటకుమారు హిందువులకొసంగుదురనియు, అందువలన మహమ్మదీయమతస్థులకు తగినంత ప్రాముఖ్యత శాసనసభలయందు కల్గుట దుస్తరమనియు మహమ్మదీయనాయకులు వాదించుచున్నారు. అసహాయులై యుండి, రాచకీయముగ అవిటివారైయున్న మైనారిటీమతస్థులకు, చేయూతను ప్రత్యేక ప్రాతినిధ్యముద్వారా యిచ్చుట మెజారిటీ మతస్థులధర్మమనియు, ప్రజాస్వామికముయొక్క అవసరమనియు, వారు ప్రచార మొనర్చుచున్నారు.

కాని, ప్రజాస్వామికము అందలిప్రజలెల్లరు తా మందరు సోదరప్రాయులమని తలంచి, తమ పరస్పరభేదముల తగ్గించుకొని, పరస్పరసామరస్యమును వృద్ధిపరచుకొని, పరస్పరముగా గౌరవవిశ్వాసముల బొంది, ఒకరితో నొక రోపిక పట్టియుండి అల్ప కారణములచే కోపగించుకొనకుండిననే జయప్రదమగునుకదా! వివిధమతస్థులు ఒకరినొకరు ద్వేషించుకొనుచు, పరస్పరముగా అవిశ్వాసముతో నుండి ప్రత్యేకప్రాతినిధ్యమునుకోరుచో, సంఘైక్యత, సంఘభ్రాతృత్వము వృద్ధిబొం దునా? ప్రజాస్వామికమునకు జీవనప్రాయమగు ప్రజలయందు ప్రజ్వలించవలసిన పరస్పరగౌర వాదరములు, ప్రేమవిశ్వాసములు, ప్రత్యేక ప్రాతినిధ్యమును ప్రసాదించుటవలన వృద్ధిబొందుటకుమారు, సన్నగిల్లవా? స్వరక్షణశక్తిని పొందనివారు ఇతరసంఘములతోబాటు పోటీపడుచు, స్వసంఘోద్ధరణకార్యమునందు నిమగ్నులగుట మేలుకాని, తమయవిటితనమున కెల్లప్పటికి ప్రత్యేకప్రాతినిధ్యమను యూతను చేబూనుచో, స్వరక్షణశక్తిసంపాదన దూరమగుటయు, శాశ్వతపు అవిటితన మేర్పడుటయు అనుభవసిద్ధముగదా?

నిర్ధనికులై, సంఘబలోపేతులుకాజాలక, అసహాయ స్థితియందున్న కార్మికులు, ప్రత్యేక ప్రాతినిధ్యము గోరుచో, కొంతవరకైన సవ్యముగా నుండనోపునేమోకాని, ధనికులు, బీదలచే నిండి నిబిడీకృతమై, సంఘబాహుళ్యమునందు, ముఖ్యాంగములగు వివిధమతస్థులకు ప్రత్యేక ప్రాతినిధ్యము గోరుట న్యాయమా? అవిద్యయందు మున్గితేలుచు, గృహములందె స్వరక్షణశక్తి బొందజాలక, ఆస్థిపాస్థులనుపొందుహక్కుల నింకను సంపాదించుకొనలేక, పురుషులపైననే, తమజీవితాధారమునకై, కాచుకొనియున్న స్త్రీలు, ఎల్లవిధముల పురుషులకంటె యసహాయులై యున్నారు గనుక, తాము పురుషులతోబాటు, సమానరాచకీయానుభవము, విజ్ఞానము, స్వరక్షణశక్తి నొందువరకు, తమకు ప్రత్యేక ప్రాతినిధ్యము నొసంగవలయునని కోరుట కొంతవరకు ధర్మముగా నుండునేమో? ప్రజాస్వామికమునందు, వివిధరకముల ప్రజలచే నిండియుండు సంఘబాహుళ్యపుప్రతిబింబ మననోపు స్త్రీజనసామాన్యమునకు ప్రత్యేకప్రాతినిధ్యము కోరుట సబబుగాదని స్త్రీలే గమనించుటచే, వారినాయకులు, భారతీయమహిళా సంఘముతరపున, 'స్త్రీలకు ప్రత్యేకప్రాతినిధ్యము అగత్యము లేదు' అని లోధియనుకమిటీముందు ఘంటాపథముగా సాక్ష్యమిచ్చిరి. ఇట్టిపరిస్థితులందు, సంఘాంగములగు వివిధమతస్థులకు, జాతీయులకు ప్రత్యేక ప్రాతినిధ్యమొసంగుట న్యాయమా? అవసరమగుచో, పౌరసత్వపు హక్కులందు, వివిధమతస్థులయొక్కయు, జాతీయులయొక్కయు ప్రత్యేక స్వాతంత్ర్యములను, బాల్కనురాష్ట్రములు, జర్మనీదేశముల రాజ్యాంగవిధానపు చట్టములందు జేర్చినట్లు, పేర్కొని, అట్టిస్వాతంత్ర్యముల సముద్ధరణజేయుట రాజ్యాంగపు ధర్మమని నిర్ణయింపవచ్చును.

ఏరాజ్యాంగవిధానమైనను, ఆయాదేశప్రజల యభిప్రాయములు, కోరికలు, అవసరములు ననుసరించియే తన రూపురేఖల బొందుచుండును. సాధారణముగా, సూత్రానుసారము రాజ్యాంగవిధానము సర్వాంగసౌష్టవము కల్గి, సర్వాంగసౌందర్యము బొందుట వాంఛనీయమైనను, అసలే బిడ్డలు లేక గొడ్రాలైయుండుటకుమారు, తల్లి, కురూపియైన బిడ్డనైన యెట్లువాంఛించునో, అటులనే, సంపూర్ణసలక్షణ సమన్వితమగు రాజ్యాంగము ప్రప్రధమముననే సాధ్యముకాక పోయినచో, తాత్కాలికముగా సాధ్యముకాదగు రాజ్యాంగవిధానమును అంగీకరించుట ఆపద్ధర్మ మందురు. కనుకనే, గాంధిమహాత్ముడు, ప్రత్యేకప్రాతినిధ్యమును తీవ్రముగా నిరసించినను, భారతదేశపుస్వాతంత్ర్యసంపాదనార్థమై, మహమ్మదీయుల ప్రత్యేకప్రాతినిధ్యమే, పరమప్రామాణ్యముగా తలంచి పోరుపెట్టుచున్నందువలన, వారి సహకారమునకై ప్రత్యేకప్రాతినిధ్యము ఆయొక్కమతస్థులకుమాత్రము ప్రసాదించుట కొప్పుకొనెను. కాని, ఒక్కమతస్థులకట్టి ప్రత్యేకపుపు హక్కును ప్రసాదించుటకు, మహాత్ముడొప్పుకొనినంతనే, రాజ్యాంగవిధానపు ధర్మసూత్రములనే అవలంబింపగోరువారి కోటగోడలు విచ్ఛిన్నమగుచున్నవి. ఒక్కమతస్థుల కట్టిప్రత్యేకాధికార మొసంగి, మిగిలినవారికివ్వకుండు టెట్లు? క్రైస్తవులు, యూరపియనులు, సిక్కులు, తాము మైనారిటీయందే రాష్ట్రములందున్నారో, ఆప్రదేశములకుగాను హిందువులు, ప్రత్యేకప్రాతినిధ్యమును గోరజొచ్చిరి. మహాత్ముడీ విపరీత విజ్ఞాపనలకు సమ్మతింపకపోవుటచే స్వకపోలకల్పితమగు కోరిక లకు లోనైన మైనారిటీసంఘములు, తాము త్రవ్విన గోతులందు తామే పడిపోయి మైనారిటీ యొడంబడికను జేసికొని, నందకు దాదాపు డెబ్బదిసభ్యత్వములు, ప్రతిశాసనసభయందు, తమకే చెందవలయుననియు, అసౌకర్యముకల్గుటకై పరస్పరముగా సహాయము చేసికొందుమనియు తీర్మానించుకొనిరి. దేశపుటవసరముల మరచి, ధర్మాధర్మముల విచక్షణజేయక, స్వసంఘోద్ధరణయే జాతీయోద్ధరణకంటెను ప్రీతికరమైనదనియు, ప్రాధాన్యమైనదనియు, మైనారిటీ సంఘములు తలంచువరకు, ప్రజాస్వామికమును మనదేశమున ఏర్పరుచుట దుస్సాధ్యమగుటయే కాక, ప్రజాస్వామిక మేర్పడినపిమ్మటకూడ, సుస్థిరముగా నుండుటదుస్తరము.

ఇప్పటి ఆపద్ధర్మము ననుసరించి, రాజ్యాంగవిధానమునకు మూలాధారమగు ధర్మసూత్రము గమనించి, ఎట్టిప్రాతినిధ్య విభజనపద్ధతి సంఘసామరస్యమునకు, ధర్మస్థాపనకు, ప్రజాస్వామిక క్షేమమునకు దోహదము కల్గించును? వివిధ మైనారిటీసంఘములకు, వానియొక్క జనసంఖ్యల ననుసరించి ఎన్నిసభ్యత్వములు, వివిధశాసన సభలయందు రాదగునో లెక్కించి, ఆసభ్యత్వములందు, మూడవవంతువరకు ప్రత్యేక ప్రాతినిధ్యముద్వారా, ఆయాసంఘములకు, కొంతకాలమువరకు (అనగా, సంఘీయులెల్లరు సమానరాజకీయవిజ్ఞానము బొంది, ఆర్థిక స్వాతంత్ర్యత కల్గి, ఆత్మవిశ్వాసము సంపాదించువరకు) అభయ ప్రధానము కల్గించనగును. ఈసూత్రమును స్త్రీలయెడ, నిమ్న జాతులవిషయమందు బ్రిటిషుప్రభుత్వము అంగీకరించుచున్నది. అంతియేకాని, వివిధరాష్ట్రములందు, అమితమగు మైనారిటీయందు, జనసంఖ్యనుబట్టి వివిధమతస్తులుండగా, వారిజనసంఖ్య ననుసరించి రాదగు స్థానములకంటె, హెచ్చుస్థానములు కావలెనని, ఆసంఘముల నాయకులు కోరుటకాని, వానిని మెజారిటీసంఘనాయకు లొసంగుటకాని భావ్యముకాదు. అట్లొసంగుచో, ఎంత"ఆధిక్యసభ్యత" (Weightage Representation) ఏ యేసంఘముల కేయే కారణములకై యివ్వవలెనో, ఎవ్వరైన నిర్ణయించుటెట్లు? అట్టి "యాధిక్యసభ్యత" నిచ్చుటచే, ప్రజాస్వామికము, బాధ్యతాయుత మంత్రివర్గమును, అధిక సంఖ్యాకులగు ప్రజాప్రతినిధులవలన యేర్పరుపవలసిన బాధ్యత నేవిధముగా నిర్వర్తింపకల్గును? అశేషప్రజలచే యెన్నుకొనబడిన ప్రతినిధులలో అధికసంఖ్యాకులు మంత్రివర్గము నేర్పరచుటకుమారు, అల్పసంఖ్యాకులగు ప్రజలచే యెన్నుకొనబడిన ప్రతినిధులు మంత్రివర్గము నేర్పరచుట తటస్థించునుగదా! అట్టివిషమ పరిస్థితులు, అల్పసంఖ్యాకుల రాజ్యాంగమందు కల్గిన నెవ్వరును ఆశ్చర్యపడరుకాని, ప్రజాస్వామికమందు ఏయొక్క ఎన్నికయందొ అట్టివిపరీతపరిస్థితులు, ఎల్లరు ఆశ్చర్యపడుచుండ, కొంతకాలమువరకు జరుగుటకై, అట్టిరాజ్యాంగపు టేర్పాటులను, రాజ్యాంగవిధానపుచట్టమునందే, చేర్చుటెంతయు, అవినీతికరమును, అభాగ్యమును కాదా?

ప్రత్యేక ప్రాతినిధ్య సూత్రమును, తాత్కాలికావసరములకై, అంగీకరించినను, అద్దానిని, ప్రత్యేక సాంఘిక నియోజకవర్గములందా, లేక, సమిష్టినియోజజవర్గములందా అమలునందు పెట్టుట? ఇప్పటివరకు అమలునందున్నవి, ప్రత్యేక సాంఘిక నియోజకవర్గములే - మహమ్మదీయులు, క్రైస్తవులు, సిక్కులు, తమతమ ప్రత్యేకసాంఘిక నియోజకవర్గములద్వారానే, తమప్రతినిధుల నెన్నుకొనుచున్నారు. అనగా, వోటరులందరు మహమ్మదీయులే. ఎన్నుకొనబడు సభ్యుడును మహమ్మదీయుడై యుండును. అటులనే తదితర సంఘములుకూడ, తమనియోజకవర్గముల బొందియున్నవి. ఈనియోజకవర్గములద్వారా యెన్నుకొనబడు సభ్యులు, శాసనసభలయందు తాముచేయు కార్యములకు, ఉపన్యాసములకు, నడచు నడతకు, వివిధమతస్థులు, కులస్థులతోజేరిన సంఘమునకంతకు బాధ్యులై యుండుటకు మారుగా, తమతమ ప్రత్యేకసంఘీయులకు మాత్రమే బాధ్యులై యుండవలెను. కనుక, ప్రత్యేక సాంఘికనియొజకవర్గపు ప్రతిని ధులు, బహుజనసంఘమునకు ద్రోహముచేసినను, పదభ్రష్టులగుట దుర్ఘటము; తమప్రత్యేకమతస్థుల స్వలాభమునకై, ప్రజాసామాన్యపుక్షేమమును సంకుచితపరచుట వారికిసాధ్యమగును; వారిఆలోచనలు, ఆచరణలు, వారివారి మతస్థుల ప్రత్యేకావసరముల ననుసరించియే యుండును. ఇందువలన, ప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యతద్వారా వచ్చు సభ్యులచే, శాసనసభలు నింపబడుటయు, జనసామాన్యపు ప్రతినిధులు, అందుహెచ్చుగాలేకుండుటయు, "ఎవరికివారే, యమునాతీరే" అనుప్రతినిధులు మెజారిటీయందుండుటయు, తన్మూలమున, ప్రజాసామాన్యపు అవసరముల గమనించువారు తగినంత మంది లేకుండుటయు అనుభవసిద్ధమగుచున్నది. ఇట్టిపరిస్థితులందు, ఏ శాసనసభయైన, ప్రజలెల్లరిలాభమునకై, ఉమ్మడి అవసరముల దీర్చుటకై, జాతీయాభివృద్ధి కల్గించుటకై అవసరమున్న, వ్యక్తులయొక్కయు, ప్రత్యేకపు సంఘములయొక్కయు సౌకర్యముల కొంతవరకైన తగ్గించుటకు, ఎటులసాధ్యమగును? ఏశాసనసభయైనను దేశమందలి ప్రజలయొక్క సర్వసాధారణమగు అభిప్రాయముల వెలిపుచ్చుచూ, ప్రజాక్షేమార్థమై అగత్యమగు కార్యముల జేయించ నుత్సాహపడుచుండవలయును. ప్రతిసభ్యుడును, తాను ప్రజాసామాన్యపు టభిప్రాయముల కోరికల ప్రకటింపగలనని చెప్పగల్గు స్థితియందున్ననే, ఆతని యుపన్యాసములయెడ, శాసనసభయు, దానిద్వారా, ప్రజలును గౌరవాదరముల జూపెట్టుట సాధ్యము. అటులగాక, ఇప్పటివలె, ప్రత్యేకసాంఘిక ప్రతినిధులు, శాసనసభయందుండు వరకు "నేను హిందువుడను నాహిందువు లిట్లుతలంచుచున్నారు. నేను మహమ్మదీయుడ. నావారిట్లు భావించుచున్నారు" అని పల్కునంతవరకు, శాసనసభ రౌండుటేబులుగా పరిణమించి, కార్యసాధన కుపయోగపడక, వివిధసంఘప్రతినిధుల ప్రదర్శనరంగమై, ప్రజాసామాన్యపు టభిప్రాయముల ప్రకటింప నసమర్ధత బొంది, వివిధసంఘములమధ్య సామరస్యత కల్గించుటకు మారు, విముఖత కల్గించుట కుపయోగపడును. కనుకనే, మనదేశమందు, ఈప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యసూత్ర మమలుజరుపబడుచుండిన క్రిందటి పన్నెండువత్సరములం దదివరకు కని వినియెరుంగనంతగా, మతవైషమ్యములు బలసి, వివిధమతస్థుల కలహములు, కొట్లాటలధికమగుచున్నవి. వివిధమతనాయకులును ఈసంఘవైపరీత్యములకు ప్రత్యేకసాంఘిక ప్రాతినిధ్యము కారణమని యొప్పుకొనక తప్పుట లేదు.

ఈప్రత్యేక సాంఘిక ప్రాతినిధ్యముద్వారా కల్గు దుర న్యాయముల గమనించియే, నెహ్రూకమిటీవారు, ఏకగ్రీవ ముగా, "సమిష్టినియోజకవర్గములందు ప్రత్యేకప్రాతినిధ్యము" నకు తావు కల్గించుటకు, అంగీకరించిరి. (Reservation of seats in joint Electorates) ఈపద్ధతిప్రకారము, ప్రతి నియోజకవర్గమునకును, మూడు, నాల్గు, లేక, ఐదుగురు సభ్యుల నెన్నుకొనుహక్కు ప్రసాదించబడును; ఆసభ్యులలో, ఒక్కరో, ఇద్దరో, తప్పక, ఆనియోజకవర్గమందలి, మనారిటీ మతస్థులు, లేక, సంఘీయులకు చెందవలెనని నిర్ణయించబడును. మద్రాసు రాజధానియందు, మహమ్మదీయులకు, నిమ్నజాతులకు క్రైస్తవులకు, ఇట్టిప్రత్యేకప్రాతినిధ్య మివ్వబడును. అప్పుడు, హిందూఅభ్యర్థులతోబాటు, అల్పసంఖ్యాకులకుజెందిన అభ్యర్థులును, ఒకేనియోజకవర్గమునందు నిలబడెదరు. ప్రత్యేకింపబడిన ప్రతిసభ్యత్వమునకు, (మహమ్మదీయుల స్థానమనుకొందము) ఇద్దరోముగ్గురో అభ్యర్థులు సామాన్యముగా నిలబడెదరు. వారందరికి, అన్నిమతస్థులు కులస్థులు తమవోటుల నివ్వవలెను. అభ్యర్థులలో (మహమ్మదీయులు) ఎవ్వరు సర్వమతస్థులకును, సర్వజాతీయులకును అనుకూలురో, యిష్టులో, వారు ఆమైనారిటీసంఘమునకు గాను ఎన్నుకొనబడెదరు. ఈవిధముగా, సభ్యులెల్లరు (మెజారిటీ మైనారిటీసంఘముల ప్రతినిధులు) ఎన్నుకొనబడుట వలన, హిందూమతస్థుడగు సభ్యున కెంతహక్కు అవకాశ ము, ప్రజలందరి యభిప్రాయముల ప్రకటించుటకు, ప్రజలతరపున మాట్లాడుటకుగలదో, అంతసావకాశము, మహమ్మదీయుడగు సభ్యునకునుకల్గును. శాసనసభయందలి సభ్యులు ప్రత్యేక మెజారిటీ మైనారిటీసంఘముల ప్రతినిధులుగా మెలంగుటకు మారు ప్రజాసామాన్యపు సభ్యులుగా ప్రవర్తించుటకు అవసరముకల్గుటయే కాక వీలునుకల్గును. మహమ్మదీయుడైన సభ్యుడు హిందువుల న్యాయసమ్మతములగు కోర్కెల బలపరచుటకు వీలుకలదు. ఏలనన, తానుతిరిగి ఎన్నికలయందు అభ్యర్ధిగా నిలబడినప్పుడు, సర్వమతములయెడ న్యాయభావము కల్గియున్నందులకు, ఎల్లరు సంతసించి, తనకేతమవోటుల నిచ్చెదరను అభయముకలదు.

మనప్రజల నేవిధముగనైనను, ప్రజాస్వామికమునకు తగకుండునట్లు చేయుటకే బ్రిటిషువారు ప్రయత్నించుచున్నట్లున్నది! ప్రత్యేక సాంఘికనియోజకవర్గములు తమకువలదని స్త్రీలును నిమ్నజాతులును మొర్రపెట్టుకొన్నను, వారికట్టి 'సాంఘిక నియోజకవర్గములనే' ప్రభుత్వము నిర్ణయించుట మనదౌర్భాగ్యము! జమీందారులకొసంగిన ప్రాతినిధ్యతయందుకూడ 'సంఘప్రాతినిధ్యత' మరువకుండుట అభాగ్యము.
ఇట్టిపద్ధతిప్రకారము ఎన్నుకొనబడిన ఆమైనారిటీ సంఘముల ప్రతినిధులవలన, ఆయాసంఘముల కేమి ప్రత్యేకలాభములు కలుగనగునని కొందరు ప్రశ్నించవచ్చును. ప్రజలందరిక్షేమమును వృద్ధిపరచుటకై శాసనసభ యేర్పరచడినదిగనుక, ప్రతిసభ్యుడును, ప్రజలయందలి యేభాగమునకును యెట్టిఅన్యాయము జరుగకుండ, ప్రభుత్వపుచర్యలవలన ఎల్లరకు శ్రేయమొనగూడునట్లు జాగ్రత్తపడవలెను. ఇంతకుమించి ప్రత్యేకముగా మైనారిటీసంఘములకు వలయులాభమెల్ల తమతమఆచారవ్యవహారములు, సాంఘికమత సాంప్రదాయముల రక్షణపరచుకొనుటకు తగుహక్కుమాత్రమే! అట్టిహక్కుమాత్రమే! అట్టిహక్కును తదితరమతస్థులు, జాతీయులు, సంకుచితపరచకుండ, భంగపరుపకుండ జాగ్రత్తపడుట ఆయామతములకు, జాతులకుజెందిన సభ్యులొనర్చవలసిన కృత్యము. న్యాయరీత్యా, సభ్యుల మతములతో జాతులతో నిమిత్తము లేకుండగనే, అన్ని మతస్థుల జాతులయెడ ధర్మము నెరపుటయే ప్రతిసభ్యుని విధికృత్యమైనను, ఏయేమతస్థులకు సంబంధించిన విషయములు చర్చింపబడునో, ఆమతస్థులగు సభ్యులట్టి చర్యలయందు పాల్గొని తమమతస్వాతంత్ర్యముల గూర్చి పట్టుదల వహించుటలో నష్టములేకపోగా, లాభముచేకూరును. ఎన్నికలజరిపించుటలో వోటరు పోలింగుస్టేషనులకు రాగా, వారిచేత వోట్లను యిప్పించుటకు రెండు విధానములుకలవు. పురాతనకాలమందు (గ్రీసునందును, రోమునందును) పౌరులెల్లరు తమ యామోద వ్యతిరేకముల దెల్పుటకు తగు సమయములందు చేతులెత్తుచుండిరి. అటులనే, ఇంగ్లాండునందును పదు నెనిమిదవశతాబ్దమందు ఎన్నికలుజరుప బడుచుండెను. కాని, అట్లు బహిరంగప్రదేశములందు, వోటరులు బహిరంగముగా తమవోటులనిచ్చు సమయములందు వారిపై దౌర్జన్యముచేయువారు హెచ్చుచుండుటయు, వోటరులెవ్వరెవ్వరికి వోటులనిచ్చిరో తెలుసుకొనిన యభ్యర్థులు, వారిస్నేహితులు, వోటరుల హింసించబూనుకొనుచుండుటయు గలుగుటచే ఆబహిరంగమగు ఎన్నికపద్ధతిమాని, రహస్యపు "బాలెట్టుపెట్టె" పద్ధతిని ఇంగ్లాండునందు మొదలెట్టిరి. ఇప్పటి కాపద్ధతియే ప్రపంచమందంతట ప్రచారమునకు వచ్చెను. ఈపద్ధతిప్రకారము ప్రతివోటరును తన బాలెట్టు కాగితముపై తనకిష్టులగు అభ్యర్థులకు వారిపేరులకుముందుండుగళ్లలో (X) టిక్కుమార్కుబెట్టి, ఆకాగితమును మడచి బాలెట్టు పెట్టెయందు పడ వేయును. ఆవోటరు ఎవ్వరికి తన వోటునిచ్చెనో మరితరులకు తెలియుటకికవీలులేదు. ఇందువలన భూస్వాములు తమ కౌలుదారులపైగాని, రైతులు యజమానులు, తమ కూలివారిపైగాని, దౌర్జన్యముచేయు టకువీలులేదు. ఎవ్వరేమైనయందురేమో యనిగాని దౌర్జన్యముచేసెద రేమోయని కాని భయములేకుండ, వోటరు తనకునచ్చిన అభ్యర్థులకీ పద్ధతిప్రకారము తన వోటులనివ్వవచ్చును. కాని మనదేశమందు, వోటరులలో నధిక సంఖ్యాకులు, విద్యావిహీనులగుటచే "రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతి అంతగా నుపయోగపడుట లేదు. చదువనువ్రాయను నేర్వని, వోటరులు మొత్తముమీద బహిరంగముగనే, తమ వోటులను, వివిధఅభ్యర్థులకిచ్చుట జరుగుచున్నది. కనుక, ఎన్నికలకుముందుగానే విద్యావిహీనులగు వోటరులనుండి, వాగ్దానముల కొందరు అభ్యర్థులుబొంది ఎన్నికల సమయములందు తమకే వోటులనిచ్చిరో లేదో విచారించుట కవకాశముబొందుచున్నారు. తన్మూలమున వోటరుల స్వాతంత్ర్యము మృగ్యమగుటయు, అభ్యర్థులపెత్తనము హెచ్చగుటయు తటస్థించుచున్నది. కాని శ్రీ జానుస్టూఅర్టుమిల్లుగారీ "బహిరంగపుఎన్నికల" పద్ధతినే బలపరచుచుండెడివారు. బహిరంగముగా తనకునచ్చిన అభ్యర్థులెవ్వరో చెప్పజాలని వోటరులు వోటుబొందుట కర్హులుకారనియు, "రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతిప్రకారము, వోటరులు, అభ్యర్థులమోసము చేయకల్గెదరనియు, లంచముల వివిధఅభ్యర్థులనుండియు గైకొనజూతురనియు తలంచెను. కాని, మన గ్రామములందెట్లు ప్రజలు ముఠాదారుల యాధిక్యతకు భయపడుచున్నారో, భూస్వా ములను, ధనాధిక్యులను, జమీందారులను గాంచి, పనివారు, రైతులు ఎట్లు వెరగొందుచున్నారో తలంచుకొన్నయెడల "రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతి యెంతలాభమో కన్గొనవీలగును. ఆర్థిక సాంఘిక స్వాతంత్ర్యముబొందని ప్రజలున్నంత వరకు, వారి రాచకీయ స్వాతంత్ర్యమును, వోటుహక్కుద్వారా ప్రకటించుటకైన, ఈ"రహస్యపుబాలెట్టుపెట్టె" పద్ధతి యగత్యము.

V

ప్రజలతరపున నిలబడదగు అభ్యర్థులెట్టివారైయుండవలెను? వోటుహక్కుపొందినవారెల్లరు అభ్యర్థులుగా నుండుటయే మంచిదనుయభిప్రాయము, ప్రజాస్వామిక దేశములందెల్లెడ ప్రచారితమైయున్నది. జర్మనీయందుమాత్రము, ఇరువదివత్సరముల వయస్సు మించినవారెల్లరును, తదితర ముఖ్యరాజ్యాంగములందు, ఇరువదిరెండువత్సరముల వయస్సు వచ్చినవారెల్లరును, సంవత్సరమున రెండో లేక మూడో మాసములకాలము తమతమ గ్రామములు లేక పట్టణములందు నివసించుచుండినచో, వోటుహక్కు పొందగల్గుచున్నారు. ఫ్రాన్సునందుతప్ప మిగతాఅన్నిప్రజాస్వామిక రాజ్యాంగములందును స్త్రీలకు, పురుషులకు సమానమగు వోటుహక్కుకలదు. వోటుహక్కుపొందలేనివారెల్ల కుష్టులు, పిచ్చివారు, ఘోరకృత్యములకు శిక్షలననుభవించుచున్న వారును మాత్ర మే. కొన్ని దేశములందు (అమెరికా, ఇంగ్లండులందు) ప్రభుత్వపు అనాధశరణాలయములందు పోషణబొందువారికి వోటుహక్కుయివ్వబడుటలేదుగాని, జర్మనీయందివ్వబడుచున్నది. కొన్నిరాజ్యాంగములందు, దివాలాతీసినవారికి వోటుయిచ్చుటలేదుకాని జర్మనీ బాల్కనురాజ్యములం దివ్వబడుచున్నది. ఇంగ్లాండు, అమెరికాదేశములందు సివిలుసర్వీసు యుద్యోగులగు, రక్షణదళముల యుద్యోగులకు వోటుహక్కు యివ్వబడుచున్నది. జర్మనీయందు, అట్టియుద్యోగులు తమవోటును పోస్టుద్వారా పంపుకొను అవకాశముకూడ కలుగ జేయబడుచున్నది. క్రమక్రమముగా, వోటుహక్కు పొందజాలనివారి తరగతులు తగ్గింపబడుటయు వోటుహక్కు బొందగల్గువారి సంఖ్య హెచ్చుచుండుటయు, అన్ని దేశములందును జూడనగును.

ఎట్టివారు వోటుహక్కుబొందజాలరో, వారు అభ్యర్థులుగానుండుటకు వీలులేదు. వోటుహక్కుబొందినను, ప్రభుత్వోద్యోగులైనవారు, ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సుదేశములందు, అభ్యర్థులుగా నిలబడరాదు; జర్మనీయం దట్లుగాక, రక్షకదళములందున్న వారుకూడ, అభ్యర్థులుగా నిలబడవచ్చును. కాని, ప్రభుత్వోద్యోగులు అభ్యర్థులుగా నిలబడుట లాభదాయకముకాదు; పైగా ప్రజాస్వాతంత్ర్యములకు భంగకరమని, ఇంగ్లండుదేశపుచరిత్రయే చెప్పుచున్నది. క్రీ. శ. 1780 వరకు, పార్లమెంటునందు, ప్రభుత్వోద్యోగులుకూడ, సభ్యులుగా నుండిరి. వారెల్లప్పుడు రాజుయొక్క యిష్టానుసారమే వోటుచేయుచు, ఉపన్యసించుచు, ప్రజాప్రతినిధులనెదిరించుచు, ప్రజాప్రాతినిధ్యమును బలహీనతనొందించుచుండిరి. కనుకనే అప్పటినుండి, ప్రభుత్వోద్యోగులెవ్వరును, పార్లమెంటునందు సభ్యులుగా నుండరాదను ఆచారముఆదేశమున అమలులోనికివచ్చెను. ఆసదాచారమే, తదితర దేశములందును అవలంబింపబడినది. మనదేశమందు, "నామినేటెడు సభ్యులు" అందునను, ప్రభుత్వోద్యోగులగు సభ్యులు, అన్ని శాసనసభల యందుండుటవలన, వారెల్లప్పుడు ప్రభుత్వమునే బలపరచచు, ప్రజాప్రతినిధులమాట చెల్లనీయక క్రిందటి పన్నెండువత్సరములందెంత నష్టము కష్టము కల్గించిరో అందరికి తెలిసియే యున్నది. కనుకనే, సైమనుకమీషనువారును రౌండుటేబిలు సభవారును, ప్రభుత్వముచే నియమితులైన వారుకాని, ప్రభుత్వోద్యోగులు కాని, శాసనసభాసభ్యులై యుండరాదని సూచించిరి. ప్రజాప్రతినిధిసభాసభ్యులు, మొగమోటమిలేక, తప్పొనర్చిన, అక్రమముగా ప్రవర్తించు ప్రతియుద్యోగుని, వానిచర్యల విమర్శించుటకు స్వాతంత్ర్య మనుభవించవలయునన్న, ప్రభుత్వోద్యోగులెవ్వరు శాసనసభయందు సభ్యులైయుండరాదు.

VI

ఎన్నికలు, శాసనసభాసభ్యత్వముల కన్నిటికి, ఎప్పుడుజరుగునో, ఒకనెల, రెండు నెలలకు ముందే ప్రకటించుట ప్రభుత్వధర్మము. అమెరికాయందు, ఫ్రాన్సునందును, ఎన్నికలు ఆరుమాసములకు జరుగుననగానే, రాచకీయపక్షములు తగుప్రయత్నముల జేయుటకు వీలు కల్గుచున్నది. జర్మనీ, ఇంగ్లాండునందట్లుగాక, ప్రెసిడెంటుయొక్కయు లేక రాజుయొక్కయు అనుమతిపై, శాసనసభ నంత మొందించుటకు, మంత్రివర్గమున కధికార మున్నదిగనుక, పెత్తనమందున్న మంత్రివర్గము, తనకధికారియగు శాసనసభవారు, తన కననుకూలమై, తనపెత్తనమును సాగనివ్వకున్నప్పుడు, ప్రజాభిప్రాయము తనకే సుముఖమైయున్నదని తోచినప్పుడు, అకస్మాత్తుగా "జనరలు ఎలెక్షను" దెచ్చిపెట్టవచ్చును. మరియు శాసనసభయందు (ఇంగ్లండులో పార్లమెంటు; రైష్‌టాగ్ జర్మనీయందు) తనకున్న ప్రాపకము చాలినంతగా లేకుండుచో, తానుచేయుచున్న పెత్తనము, అమలుజరుపుచున్న కార్యక్రమము ప్రజామోదము బడయుచుండుచో, తిరిగి ఎన్నికలు బెట్టినయెడల, హెచ్చుప్రాపకము శాసనసభయందుకల్గునను నమ్మకము మంత్రివర్గమునకు కల్గుచో, ఎవ్వరికి తెలియకుండగనే, ప్రతిపక్షమువారు, ఎన్నికలకు తయారుకాని, సమయమందు, ప్రజలు ఎన్నికలందెట్లు ప్రవర్తించ నగునో దీర్ఘముగా విచారించుకొనలేని యదనున, "జనరలు ఎలెక్షను"ను మంత్రివర్గము దెచ్చిపెట్టవచ్చును. ఇట్లు, ఇంగ్లండునందలి, మంత్రివర్గములు అనేకమారులు ప్రవర్తించెను. ఇందువలన, రాచకీయకక్షలు, ఎన్నికల నడపుటకు తగిన ధనము జేకూర్చుకొనలేకయు, ప్రచారముచేయుటకు సహాయులు లేకయు బాధనొందుట తటస్థించెను. ప్రజలకు, ఏపక్షమున కెట్లు వోటుచేయనగునో విచారించుకొను యవకాశము కలుగదాయెను. వార్తాపత్రికలకు, ప్రజలకు తగు సలహాల నిచ్చుటకు వీలు కలుగదాయెను. తగినంత ప్రచారము ప్రజలయందు కల్గించుటకు అభ్యర్ధులకు వీలు లేదయ్యెను. మొత్తముమీద, ప్రజాభిప్రాయమును సక్రమముగా, సంతృప్తికరముగా, తెలియపరచగల్గు, ప్రజాప్రతినిధులు అకస్మాత్తుగావచ్చు ఎన్నికలందు, యెన్నుకొనబడజాలరు. కనుక, "జనరలు యెలెక్షనులు" యెప్పుడువచ్చునో ప్రజలకు, ఒకటిరెండు నెలలకు ముందుగానే తెలియజేయుట భావ్యము.

యెన్నికలనడపు "పోలింగుఆఫీసరు"లు బాధ్యతకలవారై, న్యాయవర్తనులైనవారుగా నుండవలెను. ఒక జిల్లావారిని మరొకజిల్లాకు వేయుట, కొంతఖర్చునకు కారణమైనను, ఎన్నికలు సక్రమముగా జరుగుట కుపయోగమేమో విచారించుట భావ్యము. మనదేశమందు అమెరికాయందు వలెనే, స్థానిక స్వపరిపాలనా సంస్థలయొక్క ఎన్నికలలో 1931 సంవత్సరమువర కెన్ని పర్యాయములు బోర్డుల ప్రెసిడెంటులు, మ్యునిసిపలు కౌన్సిళ్ళ చైరుమనులు వివిధ అభ్యర్థులకు సుముఖులగు పోలింగు ఆఫీసరుల నేర్పరిచిరో మనకు తెలిసియే యున్నది. తర్వాత కౌన్సిలు అస్సెంబ్లి యెన్నికలందలి పోలింగు ఆఫీసరులుకూడ వివిధ అభ్యర్థులపరమై విద్యారహితులగు వోటరుల వోటులను 'బాలెట్టు' కాగితముపై వ్రాయునప్పుడెన్నో చోటులందెన్నో మారులు అక్రమములగు పనులు చేయుచున్నారు. ఇట్టి అపకృత్యముల నాపుదల చేయుటకు స్థానికముగానుండు రాచకీయ పార్టీల ప్రతినిధులకు తప్పొప్పులగూర్చి రిపోర్టుచేయుటకు అవకాశము కల్పించుటయు, తప్పొనర్చిన పోలింగు ఆఫీసరుల కఠినశిక్షలకు పాల్జేయుటయు అగత్యము. రిటర్నింగు ఆఫీసరులవిషయమునగూడ నిదే విధముగా జాగ్తత్తపడు టగత్యము.

పాశ్చాత్యదేశములం దెల్లెడల రాచకీయ పార్టీలకు జెందిన అభ్యర్థులుతప్ప తదితర అభ్యర్థులు జయప్రదులగుట దుస్సాధ్యమగుచున్నది, మనదేశమందును కొలది కాలముననె రాచకీయపార్టీలు బలిష్టత నొందనున్నవి. ప్రజామోదము పొందగోరి ప్రజాసేవ చేయ నిచ్చగించు వ్యక్తులు స్వయముగా అభ్యర్థులుగా నలబడుట చాలయరుదగునుగనుక వోటరులందరు తమకగత్యమగు అభ్యర్థులకై రాచకీయ పార్టీలపై ఆధారప డవలసియున్నది. (రాచకీయపార్టీల కార్యక్రమము బాధ్యతలగురించి వేరొకచో విచారింతము.) తమతరపున సమర్థులును సత్కార్యాచరణులునగు ప్రతినిధుల పంపుకొనవలయునన్న తగు యోగ్యతకల్గిన అభ్యర్థులు నిలబడుటవసరము. ప్రజానాయకులందు కొందరినేరి అభ్యర్థులుగా నిలబెట్టి శక్తిపొందు రాచకీయపార్టీలు తమ యీబాధ్యత సంతృప్తికరముగా నిర్వర్తించునట్లు జేయుట రాజ్యాంగముయొక్క ధర్మము. ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీదేశములం దీవిషయమున చాల యశ్రద్ధజూపబడుచున్నది. 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యపు పద్ధతి నవలంబించు జర్మనీ రాజ్యాంగమం దొక్కొక్క నియోజకవర్గమందు పది ఇరువది ముప్పది అభ్యర్థుల నిలబెట్టుటేకాక దేశమందంతట తమతమ పార్టీలకు సంపాదితమైన స్థానములకు తగు సభ్యుల నిర్ణయించు అధికారము రాచకీయ పార్టీలకు కల్గుచున్నను ఆయభ్యర్థుల నెట్లు నియమించవలెనో నిర్ణయించుటకు శాసనముగాని ప్రభుత్వపు నియమముగాని లేకుండుట విచారకరము. అమెరికాయందిట్లు గాక కొన్ని రాష్ట్రములందు ఏయే నియమముల ననుసరించి రాచకీయ పార్టీల నేర్పరచనగునో ఎట్లెట్లు ఆపార్టీలు తమ అభ్యర్థుల నిశ్చయించుట తగునో నిర్ణయించుచు శాసనములు నిర్మింపబడినవి. అటులనే ప్రతి ప్రజాస్వామిక రాజ్యాంగమందును రాచకీయపార్టీలు తమబాధ్యతలను అందు ముఖ్యముగా అభ్యర్థుల నిర్ణయించు బాధ్యతను సక్రమముగా నిర్వర్తించునట్లు చేయుటకు తగు చర్యలను తీసుకొనవలసియున్నది.

ఎన్నిక సమయములందు ప్రచారార్ధమై వివిధ అభ్యర్థులు ఖర్చుపెట్టదగు ధనపు మొత్తమును జాగ్రత్తతో నిర్ణయించు టగత్యము. అ మొత్తము మితి మించియుండరాదు. మన దేశమందట్టి నిర్ణయము లేకుండుట పొరపాటు. సైమనుకమీషనువారు మన దేశపు పరిస్థితుల ననుసరించి ఆమొత్తమును నిర్ణయించవలెనని సూచించిరి. యూరపుఖండపు అమెరికా ప్రజాస్వామికములందు ఈ మొత్తముల పరిమాణము నిర్ణయింపబడుచున్నది.

ఈ యెన్నికలందు ఖర్చు చేయదగు ధనమును అభ్యర్థులు వారి రాచకీయపార్టీలు ఏయేవిధముల ఖర్చుపెట్టనగునో ఏయే విధముల ననుసరింపరాదో ఎలెక్షన్ శాసనమందు వివరింపవలసియున్నది. లేనిచో వోటరులకు, వారి ముఠాదారులకు, లంచము లిడుటకు, లేక వోటరులకు భోజనసదుపాయములు కల్పించుటకు, విందులుచేయుటకు నిషావస్తువుల వారికి అందుబాటులో పెట్టుటకు, వారిని మోటారు కారులందు పోలింగుస్టేషనులకు తెచ్చుటకు, తిరిగి పంపుటకు ఉపయోగింపబడుట సాధ్యమగును. రాజ్యాంగాధికారములో నొకహంశమగు వోటును ప్రజలు అమ్ముట అన్యాయమేకాక స్వవినాశనకరమగును. కనుక ప్రజలకు అభ్యర్ధులనుండి యేలాటి వ్యక్తిగతమగు లాభములు ఎన్నికల సమయములందు కలుగకుండ జేయుట రాజ్యాంగపు ధర్మము. మనదేశమందు అజ్ఞానులగు నిర్ధనులగు ప్రజల నెన్నిరీతుల అభ్యర్థులు లంచములుబెట్టి అస్వతంత్రుల జేయుచున్నారో అనుభవైక వేద్యమే కదా? ఎన్నికలైనపిమ్మట జయప్రదుడగు అభ్యర్థి తన సభ్యత్వమును పలుకుబడి నుపయోగించి వివిధవోటరులకు కొన్ని సదుపాయముల కల్గించుట అంత సంతృప్తికరము కాకపోయినను దుష్కార్యము కాదు. కాని ఎన్నికలందు మాత్రము దుర్నడతలద్వారా వోటరులయొక్క సర్వస్వతంత్రతను ఏవిధముగానైనగాని, ఎంతవరకైనను, సంకుచిత పరచుట కుపయోగించు కార్యముల నన్నిటి బహిష్కరించుట రాజ్యాంగక్షేమమున కవసరము. ఈరక్షణమార్గమును అన్ని రాజ్యాంగములును అవలంబించుచునే యున్నవి.

ఎన్నికలందు ధనికులకుజెందిన రాచకీయపక్షములు అభ్యర్థులనుండికాని, అభిమానులనుండికాని, కావలసినంత ధనమును సంపాదించి అవసరమగు ఖర్చులను నిర్విచారముగా నడపుటకు శక్తికల్గియుండును. కాని బీదజనులచే నడుపబడుచు కార్మీకులకై స్థాపించబడిన లేబరుపార్టీవా రేదేశమందైనను, తమ యభ్యర్థుల సమర్థించుటకు యెన్నికలయందు తగుప్రచారముచేయుటకు ధనాభావముచే యిబ్బందులుపడుచుండుట గమనార్హము. రాజ్యాంగమం దన్ని రాచకీయపక్షములు; అన్ని జనసమూహములు, తమ సక్రమాందోళనము, ఈకాలపు పద్ధతుల ననుసరించిజరుప వలయునన్న, లక్షలకొలదిధనమును, ప్రతివత్సరము తమరాచకీయప్రణాళిక ప్రచారమగుటకు తమ కనుకూలు రగు ప్రజలు సంఖ్యహెచ్చుటకు ఖర్చిడవలసి యున్నది. కాన లేబరుపార్టీవారికి తగుధనముచే కూర్చుకొనుటకు తగుసావకాశమును రాజ్యాంగము కల్గించుట ధర్మము. కాననే, ఇంగ్లాండునందు క్రీ. శ. 1927 ఆక్టుప్రకారము కార్మికులసంఘములగు 'ట్రేడుయూనియను'లకు తమ రాచకీయపార్టీనిధికి శాశ్వతచందాదారులుగా చేరదలచుకొన్నవారి నుండి వార వారము వారిజీతభత్యములనుండి పార్టీ వారు నిర్ణయించుచందాను వసూలుచేసుకొనుహక్కు ప్రసాదించబడినది. ఇంకనంతకుపూర్వము ప్రభుత్వసమ్మతిప్రకారము ట్రేడ్ యూనియనులు తమసభ్యులందరిపై రాచకీయచందానువేసి, వసూలుచేసుకొను యధికారము కల్గియుండుటయు, లేబరుపార్టీకి చందా చెల్లింప నిష్టములేని ట్రేడుయూనియను కార్మికులు ప్రత్యేకముగా తమపేరు లీ చందాదారులజాబితా నుండి తగ్గించుకొనవలసియుండుటయు జరుగుచుండెను. ఇట్టిసదుపాయమును తదితరదేశములుకూడ బీదలగు లేబరుపక్షములకు కల్గించుట, స్వరక్షణకు శాంతిభద్రతకు అవసరము.

ఎన్నికలు జరుగుసమయమందు అన్నిపక్షములవారికి తమతమ అభ్యర్థులగూర్చియు, కార్యప్రణాళికలగురించియు, ప్రజలెల్లరకు సక్రమముగా సంపూర్తిగా తెల్పుటకు సర్వస్వాతంత్ర్యము అవసరము. వివిధరాచకీయపార్టీల కక్షదారుల మధ్య వివాదములు కలుగకుండా వా రొకరొకరిపై దౌర్జన్యముచూపకుండా అన్ని రాచకీయపార్టీలయందు సమానాదరణ జూపుట రాజ్యాంగాధికారమును నడపుప్రభుత్వముయొక్క ధర్మమైయున్నది. యుద్ధానంతరము ఇటలీయందు, ఫ్రాన్సునందు క్రీ. శ. 1932 లో జర్మనీయందు జరిగిన ప్రెసిడెంటు ఎన్నికలు, 'రైష్‌టాగ్‌' ఎన్నికలందు వోటరులు తమలోతాము తీవ్రముగా కొట్లాడుకొని, కొందరిచంపి, అనేకుల గాయపరచి, మరెందరికో ధననష్టము, స్వాతంత్ర్యభంగ మొనర్చుకొనుచుండిరి. అట్టి దురలవాటులు, ప్రజలయందు ప్రబలకుండా తగుశ్రద్ధతీసుకొనుట, రాజ్యాంగపు విధ్యుక్తధర్మము. ఏయేరాచకీయపార్టీల కక్షదారులవలన హెచ్చు అకార్యములు జరుగునో, ఆపార్టీలపై తగు అపరాధముల వేయుట లాభకరము. కాని, జర్మనుదేశపు శ్రీ పెపెనుగారి మంత్రివర్గము జూపినటుల ఏప్రభుత్వమును, ఏయొక్కరాచకీయపుపక్షమందుగాని ప్రత్యేక అభిమానము కన్పరచి, ఆపక్షపు అకృత్యముల గప్పిపెట్టుట రాజ్యాంగపుక్షేమమునకు భంగకరమగును. సక్రమముగా తమతమ అభ్యర్థులు, వారి ప్రచారకులు ప్రవర్తించుకొనుబాధ్యత, ఆయా రాచకీయపార్టీలపై పెట్టవలెను. ఇన్ని జేసినను, ప్రజలు నీతిపరులై వివిధరాచకీయపా ర్టీలప్రచారమును సక్రమముగా సాగనిచ్చుటయు, ప్రతిపక్షులయెడ సహనతజూపుటయు నేర్చుకొననిదే రాజ్యాంగపుక్షేమము భద్రపడజాలదు.

VII

అభ్యర్థులు జయప్రదులై, సభ్యత్వమొందుటకై ఎంత యాతురతకల్గియుందురో అటులనే ప్రజలును తమకు సమర్థులును, యోగ్యులును, సద్గుణులునగు అభ్యర్థులు కావలయునని ఆశించి అట్టి అభ్యర్థులు నిలబడుటకై తగుశ్రద్ధ తీసుకొనవలసి యున్నది. తమకు సేవచేయుటకై తమతరపున రాజ్యపాలన మొనర్చుటకై, తమయవసరములదీర్చుటకై అభ్యర్థులు బయలుదేరుచున్నారని ప్రజలు గ్రహించవలసియున్నది. అట్టి వాంఛనీయులగు యభ్యర్థులను, రాచకీయపార్టీలవారు నిలబెట్టుటకు ప్రజలు తగు చర్యగైకొనవలెను. పార్టీలును, సమర్థులగుపౌరులు, స్వార్థత్యాగులగుపౌరులు, అభ్యర్థులుగా నిలబడుట కుత్సాహపడుటకై తగు సావకాశములు కల్గించవలసియున్నది. సమర్థులగు అభ్యర్థులు కొంత స్వతంత్రాభిప్రాయ ప్రకటనాధికారమును కోరుచుందురు. పార్టీ నియమముల నతి కఠినతరముగాచేయుచో యోగ్యులగువారు అభ్యర్థులుగా నిలబడ నిచ్చగించరు. పార్టీ నిరంకుశత హెచ్చగుచో శక్తివంతులగువారు అభ్యర్థులు కాజూడరు. ఇట్టి యిబ్బందులు అమెరికాయందు కల్గుటవలననే వాస్తవముగా శక్తిమంతులు, యో గ్యులు, స్వాతంత్ర్యేచ్ఛకలవారలు అధికులు రాచకీయజీవితమునందు జొచ్చుటలేదు.

ప్రజాసేవచేయుట కష్టతర మైనకార్యము. పార్టీల యాధిపత్యమునకు లొంగి, ప్రజల అలవాటులు, అభిప్రాయములగూర్చి విచారించి, రాజ్యాంగవ్యవహారనిర్వహణము గూర్చి చదివి, ఆలోచించి, శాసనసభాసభ్యులుగా వెళ్లువారు అనేకవిధములగు త్యాగములు జేసి కష్టములకు లోనగుచున్నారు. ఇక నట్టివారు లేబరుపార్టీకి చెందినవారగుచో, బీదకుటుంబీకులైనచో దివాలాతీయుట కెంతో కాలముపట్టదు. బీదలు, నిర్ధనులు, కార్మికులు, తమ లేబరుపార్టీ, లేక సోషలిస్టుపార్టీ, లేక కమ్యునిస్టుపార్టీ తరపున తమసంఘములకు జెందిన కార్మికులనే ప్రతినిధులుగా పంపకోరుచో వారికి జీవనభృతి కల్పించుట తప్పనిసరియగును. కనుకనే ఇంగ్లాండునందు 1912 సంవత్సరమువరకు లేబరుపార్టీ వారు తమ యూనియనుల ద్వారా తమ 'పార్లమెంటు' సభ్యులకు గౌరవభృతిని చెల్లించుచుండిరి. కాని శ్రీ ఆస్క్యత్తుగారు ప్రధానమంత్రిగా యున్నప్పుడు ప్రజాప్రతినిధులకు జీవనభృతికల్పించుట రాజ్యాంగ ధర్మమని గ్రహించి, ఒక్కొక్క పార్లమెంటుసభ్యునకు సంవత్సరమునకు నాల్గువందలపౌనులు (రు 5200) గౌరవభృతి నేర్పరచెను. తుద కీ గౌరవభృతికూడ గౌరవప్రదముగా కార్మిక నాయకులుకూడ జీవించుటకు చాల దనుసత్యమును, తిండిచా లక పార్లమెంటునందే స్మృతితప్పిపడిపోయిన లేబరుపార్టీ సభ్యులొక్కరు ఋజువుచేసిరి. అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఐరిషుఫ్రీస్టేటు, దక్షిణాఫ్రికా, బాల్కనురాష్ట్రములందును గౌరవభృతిని శాసనసభాసభ్యులకు చెల్లించుటకలదు. మనదేశమందుమాత్రము సభాసమావేశములందు దినభృతికి చాలని భత్యము చెల్లింపబడుచున్నది. ఈ పద్ధతివలన బీదలగుసభ్యులకు అన్యాయమెంతేనికల్గుచున్నది. ఇకముందు లేబరుప్రతినిధులు, నిమ్నజాతుల ప్రతినిధులు గౌరవభృతిలేనిదే ఎటులపని చేయుదురు? న్యాయరీత్యా ప్రతి కౌన్సిలుమెంబరునకు భత్యమునకుతోడు నెలకు రు 250 లు గౌరవభృతిగా చెల్లించు టగత్యము.

VIII

శాసనసభలు గావింపవలసినధర్మములలో ప్రజలకు రాచకీయవిజ్ఞానమును వృద్ధిజేసి, వారికి ప్రభుత్వముయొక్క చర్యల తెలియజెప్పి, ఎప్పటికప్పుడు ప్రభుత్వమువలన కల్గుచుండు మంచిచెడ్డల తెల్పుచుండుట యొక్కటియైయున్నది. ప్రభుత్వమందున్న మంత్రివర్గము, ఏయేరాచకీయకార్యక్రమము ననుసరించుచున్నదో, ఏయేవృద్ధికారకమగు కార్యములజేసి, ఆర్థిక, సాంఘిక, రాచకీయపునర్నిర్మాణ కార్యప్రణాళికను అనుభవమందు బెట్టినదో ప్రజలకు తెలియజెప్పి, మంత్రివర్గము యొక్క చర్యల సమర్థించుచు మెజారిటీయందున్న పార్టీ వారు ప్రజలయందు ప్రచారముచేయుటకు శాసనసభ యుపయోగపడును. దేశమునం దెచ్చటనైనను మంత్రివర్గ పక్షాభిమానులు తమచర్యల సమర్థించుకొనుచు సభల జేయించవచ్చునుకాని, తమప్రత్యర్థులు తమ సమర్థనలకు సమాధానమివ్వగల్గు యవకాశముల కల్పించుట కష్టసాధ్యము. శాసనసభయం దట్లుగాక, మంత్రివర్గపుపక్షము ఎల్లప్పుడు ప్రత్యర్థిపక్షమున కెదురుగా ఆసీనులైయుండుటచే ఒకరుచెప్పిన విషయముల మరొకరు కాదనుటకు అవకాశముకలదు. ఇటులనే ప్రభుత్వమందున్న మంత్రివర్గముద్వారా ఏయేకష్టములు ప్రజలకు కల్గుచున్నవో వివరముగా తెల్పి, ఏయేనష్టదాయకమగు కార్యవిధానమును పొరపాటునగాని, బుద్ధిపూర్వకముగాగాని మంత్రివర్గ మవలంబించినదో జూపెట్టి, తమపక్షపు కార్యక్రమమును అవలంబించినచో, తామే మంత్రివర్గము నేర్పరచినచో, ఎటేట్టు ప్రజాక్షేమాభివృద్ధి కారకముగా ప్రవర్తించెడివారో మైనారిటీయందున్న ప్రతికక్షి వారు జూపెట్టుటకు శాసనసభ యవకాశ మొసంగును. వారి వాదమునకు తగు సమాధానమొసంగి, ప్రభుత్వపుచర్యలగూర్చి పూర్తివివరములదెల్పి ప్రజలకు సంతృప్తికల్గించుటకు మంత్రివర్గపుమెజారిటీకి యదనుకల్గును.


ప్రశ్నలద్వారా, తగు సమాధానముల బొందుచు, ఎప్పటికప్పుడు ప్రభుత్వపుచర్యలగురించి ప్రజలకు తగుసంజా యిషీ తెల్పుటకు శాసనసభ యుపకరించును. ప్రజలయందు ప్రచారితము కాదగు భావములగురించి తీర్మానము నొకటి ప్రవేశపెట్టి, దానిపై కల్గుచర్యలద్వారా శాసనసభయొక్క యభిప్రాయముల ప్రజలకు తెలియజేయనగును. ప్రజలయందు కొందరిచే అత్యంతముగా వాంఛితమగుచుండు సంఘసంస్కరణముల సంబంధించిన బిల్లులను శాసనసభయందు బ్రవేశపెట్టి, తగుచర్యలను వానిపై జరిపి, ప్రజాభిప్రాయమును సుముఖముగానో, విముఖముగానో, ఆయాసంస్కరణలపై, కల్గింప వీలగును. ఈవిధముగా అనుదినము శాసనసభయందు జరుగు చర్యలను, వినుటకు,, వానిగూర్చిచదువుటకు, ప్రజలకు సంపూర్ణస్వాతంత్ర్యముండదగును. కనుక శాసనసభయందు వివిధరాచకీయ కక్షలు తమతమరాచకీయ ప్రణాళికలగురించి చర్చించుచు తమతమ యభిప్రాయముల వెల్లడిచేయుచు, వివిధప్రాంతములందలి, వివిధజన సంఘములందలి యాశయముల ప్రకటించుచు, శాసనసభాసభ్యులు తమధర్మమును నెరపుచుండ దేశమందలి ప్రజలెల్లర కావృత్తాంతములు పత్రికలద్వారా శాసనసభాసభ్యులచేతను, వారి పార్టీలచేతను ప్రకటింపబడు కరపత్రములద్వారా తెలియవచ్చుచుండును. అనగా, దేశీయులెల్లరు ప్రేక్షకులైయుండ శాసనసభయను రంగమందు ప్రజాప్రతినిధులు తమధర్మమును నెరవేర్చుచుందురు. కనుక ప్రభుత్వచర్యల గురించియు మంత్రివర్గపుకార్యక్రమము, భూతకాలపు వర్తనము, వర్తమానకాలపు రాజ్యాంగధోరణి, భవిష్యత్తునకుగల కార్యప్రణాళికలగురించియు, ప్రత్యర్థులయొక్క ఆశయములగూర్చియు, తెలుసుకొనుటకు ప్రజలకుసాధ్యమగుచున్నది.

కాని, మంత్రివర్గము నేర్పరచశక్తి కల్గిన శాసనసభలయొక్క చర్యలగురించియే ప్రజలు సాధారణముగా శ్రద్ధవహించుచుందురు. ఎప్పుడే చర్య పర్యవసానముగా ఏ మంత్రివర్గము పదభ్రష్టతబొందునో, ఏచర్యలద్వారా మంత్రివర్గము బలిష్టతనొందునో లేక, బలహీనతబొందునో తెలుసుకొనుటకు ప్రజలాతురతబడుచుందురు. అమెరికాదేశమందలి, కాంగ్రెసుయొక్క చర్యలను ఇంగ్లాండాదిగాగలదేశముల రాజ్యాంగములందలి సెనేటుసభ వారి చర్చలను ప్రజాసామాన్యమంతగా శ్రద్ధతో గమనించుట లేదు. ఇందులకు కారణము ఆ శాసనసభలందు జరుగుచర్చలయొక్క పర్యవసానముగా ప్రాతమంత్రివర్గము పోవుటకాని, బలహీనతబొందుటకాని, క్రొత్త మంత్రివర్గమువచ్చునట్లు కన్పడుటగాని, లేక వచ్చుటగాని, సాధ్యముకాదు. అమెరికాయందలి ప్రెసిడెంటు ప్రజలచేతనే యెన్నుకొనబడి మంత్రివర్గమును తనంతతానే సెనేటుసభవారి సహకారముతో నేర్పరచుకొనుచున్నారు. ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ ఆదిగాగలదేశములందు, సెనేటునకు మంత్రివర్గముల సృష్టించుటకుగాని, పదభ్రష్టతనొందించుటకుగాని అధికారము లేదాయెను. తుదకు ప్రజాప్రతినిధి సభావృత్తాంతములగురించికూడ ప్రజలు తగినంతశ్రద్ధచేయుట లేదని చెప్పవలసివచ్చుచున్నది. రాచకీయపార్టీలు బలిష్టతజెంది తమతమ రాజ్యాంగ కార్యక్రమ ప్రణాళికలతయారు చేసుకొనుచు తమసభ్యులెట్లు ఏయేచర్చలయం దుపన్యసించ వలయునో తీర్మానించుకొనుట ఇంగ్లాండునం దాచారమగుచున్నది గనుక ప్రజలకు కామన్సుసభయొక్క చర్చలయెడ నానాటికి శ్రద్ధ తగ్గుచున్నది. కాని, వివిధరాచకీయబృందములుగల్గి బృందములసంయోగముచే నిల్పబడు మంత్రివర్గములబొందు ఫ్రాన్సు, జర్మనీదేశములందుమాత్రము ప్రజాప్రతినిధి సభయొక్క చర్చలు ప్రజలదృష్టి నాకర్షింపజాలుచున్నవి. ఇందులకు కారణము వివిధబృందములెప్పుడే విషయములపై ఎఋలెట్లు ప్రవర్తించి వోటుచేయునో, ఎప్పుడేమంత్రివర్గము పడిపోయి క్రొత్తమంత్రివర్గము ఏర్పరచబడునో యనుయాతురత ప్రజలకుకల్గుచుండుటచే శాసనసభా వృత్తాంతములకుత్తరముల జాగ్రత్తగా జరుపుచుందురు. పందొమ్మిదవశతాబ్దమందు ప్రథానరాచకీయజ్ఞు లెల్లరుతమ ముఖ్యోపన్యాసముల ఇంగ్లాండుదేశమందున పార్లమెంటుసమ్ముఖమున యిచ్చెడివారు. ఈశతాబ్దారంభమగుచున్నప్పటినుండి రాచకీయనాయకులు తమ ఉపన్యాసములందెక్కువభాగమును ప్రజల సమక్షమందు బహిరంగసభల యందొసంగుచున్నారు. కనుక, పూర్వము ప్రజలకుండిన గౌరవము పార్లమెంటుచర్యలయందు యిప్పుడు కల్గుట లేదు. ఇతరదేశములందును యిట్లే జరుగుచున్నది.

వార్తాపత్రికలుకూడ వెనుకటివలె ఏదేశమందును శాసనసభావృత్తాంతముల ప్రాముఖ్యతగా సంపూర్తిగా ప్రకటించుటమానినవి. సాధారణప్రజలకు రుచించు ఘోరహత్యలు, కృత్యములు, సముద్రపుటాపదలు, ఆటలుపాటలగురించి ఈకాలపు వార్తాపత్రికలు హెచ్చుశ్రద్ధజేయుచు శాసనసభలందు జరుగు చర్చలగూర్చి క్లుప్తముగా వార్తల దెల్పుచుండుట విచారకరము. ఇంగ్లాండాదిగాగల దేశములందు, శ్రీ లార్డు నార్తుక్లిప్ లార్డుబీపరుబ్రూకు మున్నగు పత్రికాధిపతులు ఇంగ్లాండునందు, శ్రీవాట్ట్సుగారు అమెరికాయందు తమపత్రికలద్వారా రాజ్యాంగవిధానపు కార్యక్రమమును మార్చగల్గునంతవరకు రాచకీయమందు శ్రద్ధవహించుచు, శాసనసభావృత్తాంతముల ప్రచురించుచునేయుండిరి.

ఇంగ్లాండునందు 1760 ప్రాంతమున పార్లమెంటునందొసంగబడిన యుపన్యాసముల ప్రకటించినందులకు శ్రీనిల్క్సుగారిపత్రికలపై ప్రభుత్వము నిరంకుశవిధానమునడుప బ్రయత్నించెను. కాని, పత్రికాస్వాతంత్ర్యమునుకోరు నాయకులే జయమందుటయు, పార్లమెంటుసభా వృత్తాంతముల ప్రకటించు స్వాతంత్ర్యము పత్రికలకు ఆచారణానుగతముగా సంప్రాప్తించుటయు జరిగెను. ఇప్పటికన్ని ప్రజాస్వామిక రా జ్యములందును శాసనసభలవృత్తాంతముల సంపూర్ణముగా ప్రకటించుహక్కు పత్రికలకుకల్గినది. మనదేశమందు 1932 సంవత్సరారంభమున ఇండియాగవర్నమెంటువారు ఈహక్కును తగ్గింపజూచిరి. కాని ఆపనినాగ లేదు. ఈహక్కుపత్రికలకు, ప్రజలకు ఉన్ననే శాసనసభలు ప్రజలయెడ తమధర్మమునెరపగలవు. మంత్రివర్గములకు, ప్రతికక్షలకు ఈహక్కు ఉపయోగకరము.

ఈలోటులదీర్చుటకు శాసనసభాసభ్యులు వారిరాచకీయపార్టీలు వివిధనియోజకవర్గములందు సభలజేసియు, కరపత్రముల ప్రచారముజేసియు, తమతమ చర్యలగూర్చిప్రజలకు తెలుప బ్రయత్నించుచున్నారుకాని, ప్రతిపక్షుల సమ్ముఖము దిట్టి ప్రచారముచేయలేకున్నారు. అందువలన, ప్రజలకు, శాసనసభలచర్యలగూర్చి చదువుటవలన కల్గు యుక్తాయుక్త విచక్షణజ్ఞానము బొందుటకవకాశములేకున్నది.

అమెరికాయందలి ముఖ్యమగుపట్టణములందు "పౌరసభలు" యేర్పరచబడుచున్నవి. వానియందు, ఇరుపక్షములవారు ప్రజలనలజడిపరచుచున్న రాచకీయసమస్యలను సక్రమముగా అన్నివైపులనుండియు చర్చించుచుందురు. ఈ "పౌరసభలు" బహిరంగముగా జరుపబడును. కనుక, ప్రజలెల్లరు వానిచర్చలందు పాల్గొనుటకు ఆచర్చలందొసంగబడు యుపన్యాసముల వినుటకు అవకాశముకల్గును. ఇట్టి "పౌరులసభ లను" ప్రతిదేశమందును ప్రతిపట్టణమందు నేర్పరచి ఎల్లప్పుడు ప్రజలయందాందోళన కల్పించుచుండు సమస్యలచర్చించుటద్వారా ప్రజలకు రాచకీయవిజ్ఞానము కల్గించుటయేకాక వారికి యుక్తాయుక్తవిచక్షణ జ్ఞానముకల్గించి ఇట్టిసభలకు మాతృకలగు శాసనసభలపై, ప్రజలకు శ్రద్ధకల్గించనగును.

ప్రజలు రాజకీయవ్యవహారములను గురించి తగుభోగట్టాతెలుసుకొననిదే, ఏరాచకీయపార్టీ వారెంతవరకు తమవిధికృత్యమును నెరవేర్చిరో, ఏమంత్రివర్గమెట్లు ఏయేవిషయములందు ప్రవర్తించినదో గ్రహింపజాలరు. రాచకీయసమాచారముల నెరుంగనిప్రజలు, ఎన్నికలందు సక్రమముగా ఎటుల తమవోటుహక్కు నుపయోగించకలరు? కనుక ప్రజలకు రాచకీయవిజ్ఞానమును కల్గించి, ప్రభుత్వపుచర్యలగురించి తగినట్లు తెలియజెప్పుటకు, శాసనసభ యుపయోగపడవలెను. ఇందులకు వివిధరాచకీయపార్టీలు తోడ్పడుటవసరము. వార్తాపత్రికలు శాసనసభలచర్యలను సంపూర్ణముగా ప్రకటించవలెను. "పౌరసభల" ద్వారా, అన్నియెడల ప్రజలకు మంచిచెడ్డలు తెలియునట్లు వివిధరాచకీయపార్టీలు ప్రయత్నించవలెను.

IX

శాసనసభలకు బాధ్యతవహించు మంత్రివర్గములబొందిన ప్రజాస్వామిక రాజ్యాంగము లన్నిటియందును, ప్రజానా యకులను తయారుచేసి, ప్రజలకువారి శాసనసభానాయకులయొక్క పరిచయము కల్గించుటకు శాసనసభలుప యోగపడవలెను. తమనాయకు లెవ్వరుకానగునో, ఏనాయకులెంతెంతవారో, ఎవరెట్టివారో, కన్గొనుటకు ప్రజాసామాన్యము పూర్తిగా పార్టీలపైయాధారపడియుండుటకు మారు శాసనసభలపై యాధారపడుట లాభకరము. పార్టీ నాయకులకు స్వతంత్రాపేక్ష లేక, ప్రత్యేకవ్యక్తిత్వములేక తమమాటలకులొంగువారె ప్రియులగుదురు. శాసనసభకట్లుగాక ఎవ్వరువక్తలో ఎవ్వరుసమయానుకూలముగ చమత్కారముగ, ప్రజానురంజకముగా, ప్రశ్నలువేయుటకు, సమాధానముచెప్పుటకు వాదప్రతివాదముల జేయుటకు ప్రజలహక్కులకై శ్రద్ధవహించుటకు సమర్ధులో ఉత్సాహపరులో వారిష్టులగుదురు కనుక అట్టిస్వతంత్రేచ్ఛకల్గి స్వతంత్రవాదులై ప్రజాక్షేమాభిలాషులైన సమర్థులగు నాయకుల సూచించుటకు, తయారుచేయుటకు, శాసనసభలే సమర్థతకల్గియున్నవి. కొన్ని వత్సరములకొలది శాసనసభలయందు సభ్యులుగానుండి సభవారిమెప్పును బొందకల్గిననాయకులు వారివారి రాచకీయపార్టీలయందును ప్రాముఖ్యత సంపాదించుకొనగలరు. అట్టి ప్రముఖులనుండియే ప్రతిపార్టీయు తననాయకుల నేరుకొనును. మెజారిటీయందుండుపార్టీ మంత్రివర్గమునందు అట్టి ప్రముఖులలో కొందరికి స్థానములనొసంగుచుండును కనుక మంత్రులగువారు, ప్రజాసామాన్యము నకు అందుముఖ్యముగా శాసనసభలకు చాలాకాలమునుండి తెలిసినవారై యుందురు. జర్మని, ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికాలందిట్లు శాసనసభలు ప్రజానాయకుల పక్షనాయకుల మంత్రిత్వము బొందనర్హులగువారిని తయారుచేయుచున్నవి.

శాసనసభలయొక్క నాయకులు, వక్తలు, జయప్రదమగు మంత్రులగుట సాధ్యమాయని విచారించనగత్యములేదు. మంత్రులు తమకు యేర్పరచబడిన డిపార్టుమెంటులను సివిలుసర్వీసువారివలె నడపుటకాక ఆడిపార్టుమెంటులద్వారా, ఏ యేఫలితముల నెట్లెట్లు ఎంతవరకు ప్రజలకు కల్గించవలయునో, ఎప్పటికప్పుడు తెల్పుచూ సివిలుసర్వీసు యుద్యోగులాయాఫలితముల కల్గించుటకు శ్రద్ధచేయునట్లు చూచుచున్న చాలును. ప్రజలయభిప్రాయములు తమపార్టీద్వారా శాసనసభద్వారా ఎట్లుప్రకటింపబడెనో ఆయభిప్రాయములు సఫలతబొందుటకై వివిధడిపార్టుమెంటులు కృషిచేయుటకు శాసనసభానాయకులుపయోగ పడుదురని, బాధ్యతాయుత ప్రభుత్వములచర్యలు తెల్పుచున్నవి. ఏయేడిపార్టుమెంటుల నెట్టి నియమములననుసరించి నడుపవలెనో నిర్ణయించుట వీరిపనికాదు. ఆపనికి సివిలుసర్విసువారుకలరు.

ఇంగ్లాండునందును, జర్మనీయందును, అప్పుడప్పుడు పార్లమెంటునందుగాక వ్యాపారములందు విశ్వవిద్యాలయము లందు పేరుబొందిన నాయకులమంత్రులుగా నియమించుట జరిగెనుగాని ఆప్రయత్నములన్నియు అపజయమునే కూర్చెను. ఇందులకు కారణము మంత్రులుగా నుండదగువారు తమకుస్వాధీనపరచబడిన డిపార్టుమెంటుల సివిలుసర్విసు యుద్యోగులవలె నడపుటకాక ప్రజాభిప్రాయముననుసరించి తగులాభముల నాడిపార్టుమెంటులద్వారా కల్గించవలెను. అందులకు పార్లమెంటునాయకులె సమర్థులు. ఆమంత్రులు తమకుశాసనసభవారొసంగు సందేశముననుసరించి డిపార్టుమెంటును నడపించుటయే కాక అనుభవరీత్యా తమకు తోచినమార్పులను పార్టీయొక్కయు, శాసనసభయొక్కయు, కార్యప్రణాళికలయందు మార్పులచేయింపగల్గు శక్తికలవారై యుండవలెను. ఇందులకు శాసనసభానాయకులే తగినవారు.

శాసనసభలద్వారా తప్ప తమ్ము ఇకముందు ఎవ్వరు పాలింపబోవుచున్నారో ప్రజలు తెలుసుకొనుట దుర్లభము. మంత్రివర్గమందున్న పార్టీతమకిష్టముకానిచో ప్రత్యర్థిపక్షీయుల నాయకులెవ్వరో ప్రజల కెరుకపడుటకు శాసనసభలుపయోగపడును. కానిచో ఇటలీయందు ముస్సోలీనీగారు పోయినపిమ్మట మరల నెవ్వరు నాయకులన్న, ఇటాలియనులెట్లు సమాధాన విరహితులగుచున్నారో అటులనే ఎల్ల దేశములవారును, ఏమితోచక యుందురు. అమెరికాయందువలె ఎల్లరకు తెలియనివ్యక్తులు ప్రెసిడెంటుపదవికి అభ్యర్థులగునట్లు, ఇంగ్లం డునందు మంత్రులపదవికి ఆసపడుటపొసగదు. ఇంగ్లాండాదిగాగలదేశములందు మంత్రివర్గమునందు జేరదగువారెవ్వరో శాసనసభలే తేల్చుచుండును.

ప్రజలయవసరముల దీర్చుటకు ప్రజాభిప్రాయముననుసరించి తమకుతోచినరీతి కొంతకాలము ఒకపక్షమును మరి కొంతకాలము మరొకపక్షమును మంత్రివర్గము నేర్పరచుట కధికారిగా జేయుట శాసనసభవారి ధర్మమైయున్నదిగదా! పెత్తనమందున్న మంత్రివర్గము అసంతృప్తికరముగా నుండుచో, దానిపిమ్మటవచ్చుమంత్రివర్గము సంతృప్తికరముగా నుండవలెనన్న దానిని నిర్మించురాచకీయపార్టీ వారియొక్క కార్యప్రణాళికను పరీక్షించి దానినాయకుల బాగుగానెరుంగుట, శాసనసభయొక్కధర్మము. వివిధపక్షముల ప్రవర్తనమును వాని నాయకుల శక్తియుక్తులను జాగ్రత్తమై శాసనసభ పరీక్షించుచుండును. ఈయత్యవసరమగు పరీక్షను ప్రజలు తమంతతామే చేయజాలరు. వారికికావలయునదెల్ల పెత్తనమందున్న మంత్రివర్గము సంతృప్తికరముగా, శోభాయమానముగా రాజ్యముచేయుటయే! వారి యామోదమునకై వివిధరాచకీయపక్షములు తమనాయకులను జూపెట్టుటకు తమరాజ్యాంగప్రణాళికల ప్రకటించుటకు శాసనసభలు, ప్రదర్శనశాలలు. ఆపక్షములు తమసభ్యులకు వారివారి సత్తాలను జూపెట్టి ప్రజాసేవచేయుటయందు అనుభవము బొందుటకు శాసన సభలు గొప్పరాచకార్యపు విద్యాలయములు. వివిధమంత్రివర్గములకువలయు సభ్యులతయారుచేసి జాతీయావసరముల దీర్చుటకు నాయకుల సదా సమకూర్చుటకు శాసనసభలు నాయకాగారములు.

X

అమెరికాయందు తప్ప, మిగతా బాధ్యతాయుతమంత్రివర్గముల బొందియున్న ప్రజాస్వామిక రాజ్యాంగములందు శాసనసభలే, ప్రభుత్వకార్యనిర్వహణమునకు, అవసరమగు ధనమును, ప్రతివత్సరము, ప్రజలనుండి రాబట్టుటకు, శిస్తుల వేయుచుండును. మనదేశమందు, ఆదిమ కాలమందె, పండినపంటలో ఆరవభాగమును రైతులనుండి, రాజు రాబట్టుకొనవచ్చునని ధర్మశాస్త్రములందు నిర్ణయింపబడెను. అటులనే, శాశ్వతముగా, చైనాదేశమందును, ప్రభునకు ప్రజలు చెల్లింపదగు శిస్తులను, శ్రీకన్ఫ్యూషస్ గారికి పూర్వమే సిద్ధాంతీకరింపబడెను. ఇందువలన, ప్రభుత్వముజేయుచుండిన రాజులీదేశములందు ప్రతివత్సరము, శిస్తుల వేయుటకై ప్రజల పిలువనంపి, వారియంగీకారమును బొందనవసరము లేకుండెను. కాననె, వివిధరాజులు, అనేకమారులు, ఆదేశములందు రాజ్యాధికారమును, నిరంకుశముగా, నడపగల్గిరి.

ఇంగ్లాండునందిట్లుకాక, ప్రథమమునుండియు, భూస్వాముల సమ్మతిపైననె, రాజు శిస్తుల వేయుట కధికారము బొందియుండెను. నిరంకుశముగా శిస్తులవేయబూనిన శ్రీజాను ప్రభువు "టనాజమో" అను ప్రజాస్వత్వపు పట్టమును ప్రసాదించవలసివచ్చెను. శ్రీప్రధమఛార్లెసుగారు ఉరిదీయబడిరి. తుదకు 1688 సంవత్సరమందు అంగీకరింపబడిన, ప్రజాస్వాతంత్ర్యముల చట్టముప్రకారము, ప్రజలే తమప్రతినిధిసభద్వారా ఏయేశిస్తుల చెల్లింపసమ్మతింతురో, ఆశిస్తులనే ప్రభుత్వము వసూలుచేయదగుననిరి. ప్రభుత్వమునకు వలయు ధనమును, శిస్తులద్వారా, ప్రజలు చెల్లించుటెట్లో, నాల్గు, ఐదు, పదివత్సరముల కొకమారుగాక, ప్రతివత్సరమును కామన్సు సభవారు నిర్ణయించవలెనని సిద్ధాంతీకరించిరి. ప్రభుత్వము దేశమందు శాంతినెలకొల్పి, విదేశములయొక్క దౌర్జన్యము లేకుండజేయుట కగత్యమగు, రక్షణదళముల నేవిధముగా పరిపాలింపదగునో నిర్ణయించు శాసనమును, ప్రతివత్సరము కామన్సుసభవారు అంగీకరించవలసివచ్చెను. ఇందువలన, ప్రజాప్రతినిధిసభవారి యనుమతిపై, ప్రభుత్వము, రక్షకదళముల సౌష్టతకు, దినఖర్చులకు ఆధారపడవలసివచ్చెను. ఏమంత్రివర్గము, కామన్సుసభవారికయిష్టమో, అద్దానిని, రాజు మార్చువరకు, తిరిగి కామన్సుసభవారి కిష్టమగు మరొక మంత్రివర్గము నేర్పరచువరకు, బడ్జెట్టుశాసనము, రక్షణదళములశాసనమును, ఆసభవారంగీకరింప నిరాకరింతురు. కనుక, ఆసభవారిపై యాధారపడి, ఆదానికి సమ్మతమగు మంత్రివర్గమే ప్రభుత్వమును నడపుట ఆచారమయ్యెను. ఇవ్విధముగ బాధ్యతాయుత ప్రభుత్వము, ఇంగ్లండునందేర్పడెను.

అమెరికా సంయుక్తరాష్ట్రములుకూడ, ఇంగ్లండుయొక్క ఆధిపత్యమునుండి విడివడి, స్వాతంత్ర్యయుద్ధముచేసి, తుదకు, స్వాతంత్ర్యముబొంది, నూతనరాజ్యాంగము నేర్పరచుటకు ప్రధానకారణము, అమెరికను ప్రజల యంగీకారము లేకనే, బ్రిటిషువారిపార్లమెంటు వారిపై శిస్తుల వేయుటయే! ఇంగ్లాండునందు ప్రజల కిష్టములేని శిస్తుల ప్రభువెట్లువేయుటకు వీలులేదో, అటులనే తమకిష్టములేని శిస్తులను తమపై వేయుటకు, బ్రిటిషు పార్లమెంటున కధికారము లేదని అమెరికనులు వాదించిరి. బ్రిటిషుప్రజల యనుమతిగొనుటకై, సమావేశపరచెనో, అటులనె, తమసమాధానము బొందుటకై, తమకు, పార్లమెంటునందు ప్రాతినిధ్య మివ్వవలసినదని అమెరికనులు కోరిరి. తుదకు అమెరికాసంయుక్త రాష్ట్రసమ్మేళన రాజ్యాంగ మేర్పడినపిమ్మట, ప్రభుత్వమును నడపు ప్రెసిడెంటుగారికి, అవసరమగు ధనమును ఇచ్చుశక్తి "కాంగ్రెసు" వారి కొసంగబడినది. కాన ప్రజాస్వామిక రాజ్యాంగము లన్నిటియందును, ప్రభుత్వాదాయమునకు, ప్రభుత్వములన్నియు శాసనసభలపై యాధారపడియుండును. కాని బాధ్యతాయుత మంత్రివర్గముల కల్గిన రాజ్యాంగములందు, ప్రభుత్వము, తానెట్లు ప్రజలధనమును ఖర్చిడుచున్నదో, ప్రజల ప్రతినిధులకు, ఎల్లప్పుడు సమాధానము చెప్పుచుండవలయును. అమెరికాయందు తప్ప తదితర రాజ్యాంగములందు, ప్రభుత్వపు అనుదినచర్యలగురించి పరీక్షించి, విచారించుటకు, తప్పొప్పుల విమర్శించుటకు, అవసరమగు మార్పుల సూచించుటకు, శాసనసభలకు అధికారము కల్గుచున్నది. ధనమిచ్చువారు, దానిని ఖర్చిడువారిపై పెత్తనముజేయుట భావ్యమే కదా! ఇతరుల ధనమును ప్రభుత్వము హెచ్చించుట కధికారమిచ్చు శాసనసభలు ఆధనము నెట్లు ప్రభుత్వ ముపయోగించుచున్నదో, జాగ్రత్తగా విచారించుచుండుట వానిధర్మమైయున్నది.

ప్రతిమంత్రివర్గమును, తనకు అవసరమగు ధనము, ఏయేకార్య నిర్వాహణమునకై, ఎంతెంత గావలయునో సూచించుచు, బడ్జెట్టును తయారుచేసి, శాసనసభలయొక్క ఆమోదమునకై ప్రచురించవలసియున్నది. శాసనసభలకట్టి బడ్జెట్టుల సవిస్తరముగా విచారించి, తగుమార్పుల కల్గించుట కధికారము కలదు. పైగా అట్లు బడ్జెట్టును భద్రముగా విమర్శించుట, శాసనసభల ధర్మమునై యున్నది.

ప్రభుత్వము, బడ్జెట్టుద్వారా, శాసనసభవారు తన ఖర్చులకై యొసంగిన ధనము నెట్లు ఖర్చిడుచున్నాదో శాసనసభలకు చూపెట్టుటవసరము. ప్రభుత్వపు వ్యయలెఖ్కల పరీక్షించుటకు, "పబ్లికు అక్కౌంట్సు కమిటీ"ని ప్రతిశాసనసభయు నిర్మించుచున్నది. ఈకమిటీవారు, ప్రభుత్వము తన కొసంగబడిన ధనమును సక్రమముగా, సవ్యముగా ఖర్చిడుచుండెనా లేదాయని పరీక్షించి తమనివేదికను శాసనసభలకు సమర్పించవలసియున్నది.

ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఖర్చిడుచుండు ధనమును ఏయేగ్రాంటులనుండి ఏయేపనులకు బొక్కసమునుండి తీసుకొనుచున్నదో విచారించి, బడ్జెట్టుఆక్టు ననుసరించియే ప్రభుత్వము సమిష్టిధనము నుపయోగించునట్లు చేయుటకు "ఆడిటరుజనరలు" అను యుద్యోగి నేర్పరచవలయును. సమిష్టి ధనమునుండి ఎప్పటికప్పుడు ప్రభుత్వపు వివిధడిపార్టుమెంటులు కోరు ధనమును బడ్జెట్టుఆక్టు ననుసరించియే చెల్లింపబడునట్లు జూచుట యీ యుద్యోగునిధర్మము. ఈయుద్యోగి ప్రతివత్సరము క్రిందటివత్సరపు ప్రభుత్వపు ఖర్చులనుగురించి, తనకు తోచిన విమర్శనలజేర్చి ఒకనివేదికను శాసనసభవారి ముందుచర్చనీయార్థమై పెట్టవలెను. కనుక ఈతడు ఒకమారు తనపదవి బొందినపిమ్మట తనయుద్యోగ కాలాంతమువరకు ప్రభుత్వమునుండి స్వతంత్రత బొందియుండి యుండవలెను. కానిచో ప్రభుత్వచర్యల విమర్శింపజాలడుగదా?

ఈవిధముగ తాను ప్రజలతరపున ప్రభుత్వమున కొసంగిన ధనమును ప్రభుత్వము సక్రమముగా ఖర్చిడునట్లు చూచుట కధికారము పొందుటవలన, ప్రభుత్వమెల్లప్పుడు తనకు బాధ్యతకల్గియుండునట్లు చేయుట శాసనసభలకు సాధ్యమగుచున్నది. ఈదినములందు ప్రభుత్వము అన్నిదేశములందును, ప్రజల ఆర్థిక సాంఘికాభివృద్ధి కొరకైకూడ, అపారమగు ధనమును వెచ్చించుచున్నది. ప్రజల జీవితమునందనేక సమయములం దనేక వ్యవహారములలో, ప్రభుత్వపు జోక్యము కల్గుచున్నది గాన, ఆప్రభుత్వమును నడపు శాసనసభ ప్రజల జీవితమం దత్యంత ప్రాధాన్యత వహించుచున్నది. రాచకీయపక్షపు లేక బృందముల ఏమంత్రివర్గము నిలుపవలెనో అను విషయము, ఆయారాచకీయపక్షములయొక్క బడ్జెట్టు కార్యప్రణాళికలపై ఆధారపడియుండును. ఇంగ్లండునందు హెచ్చుశిస్తుల చెల్లింపనిష్టపడనిచో ప్రజలు కన్సర్వేటివు పార్టీవారిని బలపరచి, కన్సర్వేటివు మంత్రివర్గమును తెచ్చుకొందురు. కాని ప్రభుత్వపు కార్యభారము హెచ్చుచేసి బీదసాదలకు హెచ్చుప్రభుత్వసహాయము కల్గించుటకుగా హెచ్చుశిస్తుల వేయుటకు ప్రజలిష్టపడుచో, లేబరుపార్టీ జయమందుటయు లేబరుమంత్రివర్గము ఏర్పరుపబడుటయు జరుగును. కనుక శాసనసభలయందెప్పుడెప్పు డిట్టియభిప్రాయములు, ప్రభుత్వపుధర్మముల గురించి ప్రచురమైయుండునో ఆయభిప్రాయముల కనుకూలమగు మంత్రివర్గములే స్థాపించబడుచుండును. ప్రభుత్వముల నడపునది మంత్రివర్గములు. మంత్రివర్గములకు, ప్రభుత్వాధికారముల నడపుటకు ధనమగత్యము. ధనమును శిస్తులద్వారా ఇవ్వగల్గునది శాసనసభలు. కనుక ధనాధిపత్యముబొందిన శాసనసభలకు, ధనాభావముకల్గిన మంత్రివర్గము లొంగియుండుట సహజమే! ఈశతాబ్దారంభమునుండియు ప్రభుత్వపు సాధారణఖర్చులకే గాక, బీదసాదలు, అనాధలు, అబలులు, మున్నగువారి రక్షణార్థమై వారిజీవితము శుభప్రదముగా నొనర్చుటకై ధనికులపై శిస్తులవేసి వసూలైనధనమును ఖర్చిడుట మేలను భావము ప్రచారితమైనది. ఏకొలదిమందియో కోటీశ్వరులై యుండ, ప్రజలెల్లరు నిర్ధయులైయుండుట క్షేమకరము గాదుగాన, ధనికుల నుండి కొంతధనమును శిస్తులరూపకముగా గైకొని, బీదలపై ఖర్చిడుట ప్రభుత్వధర్మమని తలపబడుచున్నది. బీదలు శిస్తుల చెల్లింపజాలరుగాన అసలే తినుటకు లేని వారిమీద శిస్తులువేయుట కూడదు. గనుక శిస్తులభారము ధనికులపైననే మోపుట శుభమని ఎల్లరియభిప్రాయము. కనుకనే ధనికులపై బడు ఆదాయపుపన్నులు హెచ్చగుట, బీదలపైబడు ఉప్పు, కాఫీ, పంచదార, పొగాకు శిస్తులు తగ్గుచుండుట జూచుచున్నాము. ఎంతవరకు శాసనసభలు ప్రజలయందీవిషయమున సంతృప్తికల్గించుచుండునో అంతవరకు ప్రజాస్వామికము సురక్షితమవును.


___________________